| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 79 |
| Pages | 10 |
| Read Time | 15 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ త్రిసప్తతితమః సర్గః
శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నుల వివాహము.
మూ. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్,
తస్మింస్తు దివసే శూరో యుధాజిత్సముపేయివాన్. 1
ప్ర. అ. రాజా = దశరథుడు, యస్మిన్ = ఏ, దివసే = దివసమునందు, ఉత్తమమ్ = ఉత్తమమైన, గోదానమ్ = గోదానవ్రతమును, చక్రే = చేసెనో, తస్మిన్ తు = ఆ, దివసే = దివసమునందు, శూరః = శూరు డైన, యుధాజిత్ = యుధాజిత్తు, సముపేయివాన్ = వచ్చెను.
తా. దశరథమహారాజు కుమారులకు గోదానవ్రతము జరిపించిన దివసముననే భరతుని మేనమామ యగు యుధాజిత్తు వచ్చెను.
మూ. పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః,
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్. 2
ప్ర. అ. కేకయరాజస్య = కేకయరాజుయొక్క, పుత్రః = పుత్రుడును, సాక్షాత్ = సాక్షాత్తుగ, భరతమాతులః = భరతుని మేనమామయు నైన ఆ యుధాజిత్తు, రాజానమ్ = రాజును, దృష్ట్వా = చూచి, కుశలమ్ = కుశలమును, పృష్ట్వా చ = అడిగి, రాజానమ్ = రాజును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. కేకయరాజకుమారుడును, సాక్షాత్తు భరతుని మేనమామయు అగు ఆ యుధాజిత్తు రాజును చూచి, కుశలప్రశ్న మడిగి ఇట్లు పలికెను.
మూ. కేకయాధిపతీ రాజా స్నేహాత్కుశలమబ్రవీత్,
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్రత్యనామయమ్. 3
ప్ర. అ. కేకయాధిపతిః = కేకయదేశప్రభువైన, రాజా = రాజు, స్నేహాత్ = స్నేహమువలన, కుశలమ్ = కుశలమును, అబ్రవీత్ = పలికెను. యేషామ్ = ఎవరియొక్క, కుశలకామః = కుశలమునందు కోరిక కలవాడవుగ, అసి = అయి ఉన్నవో, తేషామ్ = వారందరికిని, సంప్రతి = ఇప్పుడు, అనామయమ్ = ఆరోగ్యము.
తా. కేకయదేశప్రభు వైన మా తండ్రి స్నేహపూర్వకముగ నిన్ను కుశలప్రశ్న చేసినారు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరును ఇపుడు ఆరోగ్యముగ నున్నారు.
మూ. స్వస్రీయం మమ రాజేన్ద్ర ద్రష్టుకామో మహీపతిః,
తదర్థముపయాతోఽహమయోధ్యాం రఘునన్దన. 4
ప్ర. అ. రఘునన్దన = రఘువంశానందకరుడ వగు, రాజేన్ద్ర = మహారాజా!, మహీపతిః = కేకయరాజు, మమ = నాయొక్క, స్వస్రీయమ్ = మేనల్లుని, ద్రష్టుకామః = చూడ కోరిక గలవాడు, తదర్థమ్ = దాని(ఆ పని)కొరకు, అహమ్ = నేను, అయోధ్యామ్ = అయోధ్యా పట్టణమును గూర్చి, ఉపయాతః = వెళ్లితిని.
తా. మహారాజా! మా తండ్రి మా మేనల్లుని చూడవలె నని కోరుటచే అందుకొరకై నేను అయోధ్యానగరమునకు వెళ్లి యుంటిని.
మూ. శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్,
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే, 5
త్వరయాభ్యుపయాతోఽహం ద్రష్టుకామః స్వసుః సుతమ్.
ప్ర. అ. మహీపతే = రాజా!, తవ = నీయొక్క, ఆత్మజాన్ = కుమారులను, వివాహార్థమ్ = వివాహముకొరకై, త్వయా సహ = నీతో కూడ, మిథిలామ్ = మిథిలను గూర్చి, ఉపయాతాన్ = చేరినవారినిగా, అయోధ్యాయామ్ = అయోధ్యలో, శ్రుత్వా = విని, అహమ్ = నేను, స్వసుః = సోదరియొక్క, సుతమ్ = కుమారుని, ద్రష్టుకామః = చూచుటకు కోరిక గలవాడనై, త్వరయా = తొందరతో, అభ్యుపయాతః = వచ్చినాను.
తా. రాజా! నీ కుమారులు వివాహముకొరకై నీతో కలిసి మిథిలకు వెళ్లినా రని అయోధ్యలో తెలియగా నేను నాసోదరిపుత్రుని చూచుటకై శీఘ్రముగా ఇచటికి వచ్చినాను.
మూ. అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్,
దృష్ట్వా పరమసత్కారైః పూజార్హం సమపూజయత్. 6
ప్ర. అ. అథ = పిమ్మట, రాజా = రాజైన, దశరథః = దశరథుడు, ఉపస్థితమ్ = వచ్చిన, ప్రియాతిథిమ్ = ప్రియు డైన అతిథిని, దృష్ట్వా = చూచి, పూజార్హమ్ = పూజకు అర్హు డైన ఆతనిని, పరమసత్కారైః = అధికసత్కారములచే, సమపూజయత్ = పూజించెను.
తా. పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియాతిథిని చూచి, పూజార్హుడైన ఆతనిని అధికసత్కారములతో పూజించెను.
మూ. తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః, 7
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్,
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. 8
ప్ర. అ. తతః = పిమ్మట, మహాత్మభిః = మహాత్ము లైన, పుత్రైః సహ = పుత్రులతోకూడ, తామ్ = ఆ, రాత్రిమ్ = రాత్రి, ఉషితః = ఉన్నవాడై, కర్మవిత్ = కర్మల నెరిగిన ఆ దశరథుడు, ప్రభాతే = ప్రాతఃకాలమున, పునః = మరల, ఉత్థాయ = లేచి, కర్మాణి = యథోచితకర్మలను, కృత్వా = చేసిన, తదా = అప్పుడు, ఋషీన్ = ఋషులను, పురస్కృత్య = ముందిడికొని, యజ్ఞవాటమ్ = యజ్ఞవాటమును, ఉపాగమత్ = చేరెను.
తా. కర్మ వేత్త యైన దశరథుడు మహాత్ము లైన పుత్రులతో ఆ రాత్రి గడపి, ప్రాతఃకాలమున లేచి, కర్మ లాచరించి, ఆ ఋషులను ముందిడుకొని యజ్ఞవాటమును చేరెను.
మూ. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః,
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమఙ్గలః. 9
వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి,
పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః. 10
ప్ర. అ. యుక్తే = తగిన, విజయే = విజయమనెడు, ముహూర్తే = ముహూర్తమునందు, సర్వాభరణభూషితైః = సమస్త మైన అలంకారములచే అలంకరింపబడిన, భ్రాతృభిః = సోదరులతో, సహితః = కూడిన, రామః = రాముడు, కృతకౌతుకమఙ్గలః = చేయబడిన తోరముకట్టుట మొదలైన వివాహమంగళములు కలవాడై, వసిష్ఠమ్ = వసిష్ఠుని, అపరామ్ = ఇతరు లైన, మహర్షీనపి = మహర్షులను, పురతః = ముందు, కృత్వా = ఉంచుకొని, పితుః = తండ్రియొక్క, సమీపమ్ = సమీపమును, ఆశ్రిత్య = ఆశ్రయించి, భ్రాతృభిః = సోదరులచే, ఆవృతః = చుట్టుకొనబడిన వాడై, తస్థౌ = ఉండెను.
తా. సర్వాలంకారముచే అలంకృతు లైన సోదరులతో కూడిన రాముడు విజయ మనెడు యుక్త మైన ముహూర్తమునందు తోరముకట్టుట మొదలగు వివాహమంగళములు జరుపుకొని, వసిష్ఠాదిమహర్షులను ముందిడికొని, సోదరసహితుడై తండ్రి వద్దకు చేరెను.
మూ. వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్,
రాజా దశరథో రాజన్ కృతకౌతుకమఙ్గలైః, 11
పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాఙ్క్షతే.
ప్ర. అ. భగవాన్ = పూజ్యు డైన, వసిష్ఠః = వసిష్ఠుడు, వైదేహమ్ = జనకుని, ఏత్య = సమీపించి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. రాజన్ = రాజా!, నరవరశ్రేష్ఠ = నరవరులలో శ్రేష్ఠుడా! రాజా = రాజైన, దశరథః = దశరథుడు, కృతకౌతుక మఙ్గలైః = చేయబడినకౌతుకమంగళము గల, పుత్రైః = పుత్రులతో, దాతారమ్ = కన్యాదాత వైన నిన్ను, అభికాఙ్క్షతే = ఎదురుచూచుచున్నాడు.
తా. వసిష్ఠమహాముని జనకుని వద్దకు వెళ్లి ఇట్లు చెప్పెను. నరోత్తములలో ఉత్తముడ వైన జనకమహారాజా! దశరథమహారాజు కుమారుల కౌతుక మంగళము పూర్తిచేసి కన్యాదాత వైన నీకొరకు ఎదురుచూచుచున్నాడు.
మూ. దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవన్తి హి,
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్. 12
ప్ర. అ. సర్వార్థాః = అన్ని పనులును, దాతృప్రతిగ్రహీతృభ్యామ్ = దాతద్వారా ప్రతిగ్రహీత ద్వారా, ప్రభవన్తి హి = జరుగుచున్నవి కదా. ఉత్తమమ్ = ఉత్తమ మైన, వైవాహ్యమ్ = వివాహకృత్యమును, కృత్వా = చేసి, స్వధర్మమ్ = స్వధర్మమును, ప్రతిపద్యస్వ = నిర్వహించుము.
తా. ఇట్టి పనులు దాత, ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగును. ఉత్తమమైన వివాహమును చేసి స్వధర్మము నాచరించుము.
మూ. ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా,
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్. 13
ప్ర. అ. మహాత్మనా = మహాత్ముడైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఇతి = ఇట్లు, ఉక్తః = పలుకబడినవాడును, పరమోదారః = గొప్ప ఔదార్యము కలవాడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, పరమధర్మవిత్ = గొప్ప ధర్మవేత్తయు అగు ఆ జనకుడు, వాక్యమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. పరమౌదార్యవంతుడును, మహాతేజఃశాలియు, పరమధర్మవేత్తయు అగు జనకుడు వసిష్ఠుని మాటలు విని ఇట్లు పలికెను.
మూ. కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే,
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ. 14
ప్ర. అ. మే = నాయొక్క, ప్రతిహారః = ద్వారపాలకుడు, కః = ఎవ్వడు, స్థితః = ఉన్నాడు? కస్య = ఎవనియొక్క, ఆజ్ఞా = అనుజ్ఞ, సంప్రతీక్ష్యతే = ఎదురుచూడబడుచున్నది ? స్వగృహే = స్వగృహమునందు, కః = ఏమి, విచారః = ఆలోచన, అస్తి = ఉన్నది. ఇదమ్ = ఈ, రాజ్యమ్ = రాజ్యము, తవ యథా = నీరాజ్యమువంటిదే.
తా. ద్వారమువద్ద అడ్డగించు ద్వారపాలకుడు ఎవ్వ డైన ఉన్నాడా ? లోనికి ఏల రాకూడదు? ఎవరి ఆజ్ఞకై ఎదురుజూచుచున్నారు ? స్వగృహములో సంకోచ మెందుకు? ఈ రాజ్యము కూడ నీ రాజ్యమువంటిదే.
మూ. కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతాః,
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేరివార్చిషః. 15
ప్ర. అ. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా!, మమ = నాయొక్క, కన్యాః = కన్యలు, కృతకౌతుకసర్వస్వాః = చేయబడిన పరిపూర్ణకౌతుకమంగళము గలవారై, దీప్తాః = ప్రకాశించుచున్న, వహ్నేః = అగ్నియొక్క, అర్చిషః ఇవ = జ్వాలలు వలె, వేదిమూలమ్ = వేదిసమీపమును, ఉపాశ్రితాః = ఆశ్రయించి ఉన్నారు.
తా. వసిష్ఠమునీన్ర్దా! పూర్తిగా కౌతుకమంగళములు చేసికొనిన నా కన్యలు, ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదిక సమీపము చేరి యున్నారు.
మూ. సజ్జోఽహం త్వత్ప్రతీక్షోఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః,
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలమ్బతే. 16
ప్ర. అ. సజ్జః = సిద్ధముగానున్న, అహమ్ = నేను, అస్యామ్ = ఈ, వేద్యామ్ = వేదియందు, ప్రతిష్ఠితః = ఉన్నవాడనై, త్వత్ప్రతీక్షః = నిన్ను ఎదురుచూచుచు, అస్మి = ఉన్నాను. రాజా = రాజు, అవిఘ్నమ్ = విఘ్నములు లేకుండా, కురుతామ్ = చేయుగాక. కిమర్థమ్ = ఎందుకు, అవలమ్బతే = ఆలస్యము చేయుచున్నాడు.
తా. నేను సిద్ధుడనై వేదిదగ్గర ఉండి మిమ్ములను ఎదురుజూచుచున్నాను. దశరథ మహారాజు విఘ్నము లేవియు లేకుండ కార్యము జరుపుగాక. ఆలస్యమెందులకు?
మూ. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా,
ప్రవేశయామాస సుతాన్ సర్వానృషిగణానపి. 17
ప్ర. అ. తదా = అప్పుడు, దశరథః = దశరథుడు, జనకేన = జనకునిచేత, ఉక్తమ్ = పలుకబడిన, తత్ = ఆ, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, సుతాన్ = కుమారులను, సర్వాన్ = సమస్తమైన, ఋషిగణానపి = ఋషిగణములను కూడ, ప్రవేశయామాస = లోనికి ప్రవేశపెట్టెను.
తా. దశరథు డప్పుడు జనకుని వాక్యము విని, కుమారులను, సకల ఋషులను కూడ లోనికి తీసికొని వెళ్ళెను.
మూ. తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్, 18
కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక,
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. 19
ప్ర. అ. తతః = పిమ్మట, విదేహానాం రాజా = విదేహదేశరాజు, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. ధార్మిక = ధర్మము నాచరించువాడా్ఙ విభో = సమర్థుడా! ఋషే = వసిష్ఠమహర్షీ! ఋషిభిః సహ = ఋషులతో కూడ కలిసి, లోకరామస్య = లోకమనోహరు డైన, రామస్య = రామునియొక్క, వైవాహికీమ్ = వివాహ సంబంధ మైన, క్రియామ్ = క్రియను, కారయస్వ = చేయించుము.
తా. పిమ్మట జనకుడు వసిష్ఠునితో నిట్లు పలికెను. ధార్మికుడ నైన వసిష్ఠ మహామునీ! ఇతర ఋషుల సహాయముతో, లోకాభిరాము డైన రాముని వివాహ క్రియను జరిపింపుము.
మూ. తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః,
విశ్వామిత్రం పురస్కృత్య శతానన్దం చ ధార్మికమ్, 20
ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః,
అలఞ్చకార తాం వేదిం గన్ధపుష్పైః సమన్తతః. 21
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుమ్భైశ్చ సాఙ్కురైః,
అఙ్కురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః. 22
శఙ్ఖపాత్రై స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః,
లాజపూర్ణైశ్చ పాత్రీభిరక్షతైరభిసంస్కృతైః. 23
ప్ర. అ. భగవాన్ = పూజ్యుడును, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును అగు, వసిష్ఠః ఋషిః = వసిష్ఠమహర్షి, జనకమ్ = జనకునిగూర్చి, తథా ఇతి = అట్లే అని, ఉక్త్వా = పలికి, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, ధార్మికమ్ = ధార్మికుడైన, శతానన్దం చ = శతానందుని, పురస్కృత్య = ముందు ఉంచుకొని, ప్రపామధ్యే = పందిరి మధ్యయందు, విధివత్ = యథాశాస్త్రముగా, వేదిమ్ = వేదిని, కృత్వా = చేసి, గన్ధపుష్పైః = సుగంధపుష్పములతోడను, సువర్ణపాలికాభిశ్చ = బంగారు పాలికలతోడను, సాఙ్కురైః = అంకురములతో కూడిన, ఛిద్రకుమ్భైశ్చ = రంధ్రములు గల కుంభములతోడను, అఙ్కురాఢ్యైః = అంకురములతో నిండిన, శరావైశ్చ = మూకుళ్లతోడను, సధూపకైః = ధూపముతో కూడిన, ధూపపాత్రైః = ధూపపాత్రల తోడను, శఙ్ఖపాత్రైః = శంఖాకారములైన పాత్రలతోడను, స్రువైః = హోమసాధనములగు స్రువములను పాత్రలతోడను, స్రుగ్భిః = హోమసాధనము లగు స్రుక్కు లను పాత్రలతోడను, అర్ఘ్యాభిపూరితైః = అర్ఘ్యోదకముచే నింపబడిన, పాత్రైః = పాత్రలచేతను, లాజపూర్ణైః = పేలాలతో నిండిన, పాత్రీభిః = పాత్రలచేతను, అభిసంస్కృతైః = సంస్కరింపబడిన, అక్షతైః = అక్షతలచేతను, తామ్ = ఆ, వేదిమ్ = వేదిని, సమన్తతః = నలుమూలల, అలఞ్చకార = అలంకరించెను.
తా. వసిష్ఠమహర్షి ‘‘అటులనే చేసెదను’’ అని జనకునకు చెప్పి, విశ్వామిత్ర శతానందులను ముందిడుకొని, మండపము మధ్య యథాశాస్త్రముగ అగ్ని వేదికను నిర్మించెను. దాని చుట్టును, గంధపుష్పములు, బంగారుపాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్లు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారము లైన పాత్రలు, స్రుక్కులు, స్రువములు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు, ఉంచి అలంకరించెను.
మూ. ధర్భైః సమైః సమాస్తీర్య విధివన్మన్త్రపూర్వకమ్,
అగ్నిమాదాయ వేద్యాం తు విధిమన్త్రపురస్కృతమ్, 24
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః.
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, భగవాన్ = పూజ్యుడైన, వసిష్ఠః ఋషిః = వసిష్ఠ మహర్షి, సమైః = సమప్రమాణము గల, దర్భైః = దర్భలతో, విధివత్ = యథాశాస్త్రముగా, మన్త్రపురస్కృతమ్ = మంత్రపూర్వకముగా, సమాస్తీర్య = కప్పి, విధిమన్త్రపురస్కతమ్ = యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా, వేద్యామ్ = వేదియందు, అగ్నిమ్ = అగ్నిని, ఆదాయ = గ్రహించి (ఉంచి), అగ్నౌ = అగ్నియందు, జుహావ = హోమము చేసెను.
తా. మహాతేజశ్శాలియు పూజ్యుడును అగు వసిష్ఠుడు వేది చుట్టు, యథాశాస్త్రముగను, మంత్రపూర్వకముగను, సమములైన దర్భలను పరిచి యథాశాస్త్రముగా, మంత్రపూర్వకముగా వేదియందు అగ్ని ఉంచి, అగ్నిలో హోమము చేసెను.
శ్రీ సీతారామ వివాహ ఘట్టః
మూ. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్, 25
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా,
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానన్దవర్ధనమ్. 26
ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రాజైన, జనకః = జనకుడు, సర్వాభరణ భూషితామ్ = సమస్త మైన ఆభరణములచే అలంకరింపబడిన, సీతామ్ = సీతను, ఆనీయ = తీసికొని వచ్చి, అగ్నేః = అగ్నికి, సమక్షమ్ = ఎదుట, రాఘవాభిముఖే = రామునకు అభిముఖముగా, సంస్థాప్య = నిలబెట్టి, తదా = అప్పుడు, కౌసల్యానన్దవర్ధనమ్ = కౌసల్యయొక్క ఆనందమును వృద్ధి పొందించు రాముని గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. పిమ్మట జనకమహారాజు, సర్వాభరణభూషితురా లగు సీతను తీసికొని వచ్చి, అగ్ని సమక్షమున, రామునకు ఎదురుగా నిలబెట్టి, కౌసల్యానందవర్ధను డగు ఆ రామునితో ఇట్లనెను.
మూ. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీచ్ఛ చైనాంభద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. 27
ప్ర. అ. మమ = నాయొక్క, సుతా = కుమార్తెయు, తవ = నీయొక్క, సహధర్మచరీ = (ఇటుపై) కూడా ఉండి ధర్మము నాచరించు నదియు అగు, సీతా = సీత, ఇయమ్ = ఇదిగో. ఏనామ్ = ఈమెను, ప్రతీచ్ఛ చ = అంగీకరింపుము. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక. పాణిమ్ = ఈమె హస్తమును, పాణినా = హస్తముతో, గృహ్ణీష్వ = గ్రహింపుము.
తా. ‘‘ఇదిగో నా కుమార్తె యైన సీత, ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము.’’
మూ. పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా,
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా. 28
ప్ర. అ. మహాభాగా = గొప్ప భాగ్యము గల ఈమె, పతివ్రతా = పతివ్రతయై, సదా = ఎల్లప్పుడును, ఛాయేవ = నీడ వలె, అనుగతా = నిన్ను అనుసరించియుండును. ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, రాజా = రాజు, తదా = అప్పుడు, మన్త్రపూతమ్ = మంత్రముచే పవిత్రము చేయబడిన, జలమ్ = జలమును, ప్రాక్షిపత్ = విడచెను.
తా. ‘‘మహాభాగ్యవంతురా లగు ఈమె పతివ్రతయై నీడ వలె సర్వదా నిన్ను అనుసరించి యుండగలదు’’. జనకమహారాజు ఇట్లు పలికి, మంత్రపూతమైన జలము వదలెను.
మూ. సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా,
దేవదున్దుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్. 29
ప్ర. అ. తదా = అప్పుడు, సాధు సాధు ఇతి = బాగు బాగు అని, వదతామ్ = పలుకుచున్న, ఋషీణామ్ = ఋషులయొక్కయు, దేవానామ్ = దేవతలయొక్కయు ధ్వనియు, దేవదున్దుభినిర్ఘోషః = దేవదుందుభుల ధ్వనియు, మహాన్ = గొప్ప, పుష్పవర్షః = పుష్ప వర్షమును, అభూత్ = ఆయెను.
తా. ఆ సమయమున దేవతలును ఋషులను ‘‘బాగు బాగు’’ అని పలికిరి. దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసినది.
మూ. ఏవం దత్త్వా తదా సీతాం మన్త్రోదకపురస్కృతామ్,
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. 30
ప్ర. అ. తదా = అప్పుడు, జనకః రాజా = జనకమహారాజు, మన్త్రోదకపురస్కృతామ్ = మంత్రోదకముచే పురస్కృతురాలగు, సీతామ్ = సీతను, దత్వా = ఇచ్చి, హర్షేణ = సంతోషముచేత, అభిపరిప్లుతః = నిండిన వాడై, అబ్రవీత్ = పలికెను.
తా. జనకమహారాజు మంత్రోదకపూర్వకముగా సీతను ఇచ్చిన పిమ్మట ఆనందముతో నిండిన వాడై ఇట్లు పలికెను.
మూ. లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాముద్యతాం మయా,
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః. 31
ప్ర. అ. లక్ష్మణ = లక్ష్మణా! ఆగచ్ఛ = రమ్ము. మయా = నాచేత, ఉద్యతామ్ = ఇవ్వ నిశ్చయింపబడిన, ఊర్మిళామ్ = ఊర్మిళను, ప్రతీచ్ఛ = అంగీకరించుము, పాణిమ్ = హస్తమును, పాణినా = హస్తముతో, గృహ్ణీష్వ = గ్రహింపుము, కాలస్య = కాలముయొక్క, పర్యయః = గడచిపోవుట, మా భూత్ = కాకుండుగాక.
తా. ‘‘లక్ష్మణా! రమ్ము. నీకు క్షేమ మగుగాక. నే నిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము. ఈమె హస్తమును హస్తముతో గ్రహింపుము. ఆలస్యము చేయకుము.’’
మూ. తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత,
గృహాణ పాణిం మాణ్డవ్యాః పాణినా రఘునన్దన. 32
ప్ర. అ. జనకః = జనకుడు, తమ్ = ఆ లక్ష్మణుని గూర్చి, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, భరతం చ = భరతుని గూర్చి కూడ, అభ్యభాషత = పలికెను, రఘునన్దన = భరతా!, పాణినా = హస్తముచేత, మాణ్డవ్యాః = మాండవియొక్క, పాణిమ్ = హస్తమును, గృహాణ = గ్రహింపుము.
తా. జనకుడు లక్ష్మణునితో ఇట్లు పలికి పిదప భరతునితో ఇట్లనెను. ‘‘భరతా! మాండవి హస్తమును హస్తముతో పట్టుకొనుము.’’
మూ. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః,
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా. 33
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, జనకేశ్వరః = జనకమహారాజు, శత్రుఘ్నం చాపి = శత్రుఘ్నుని గూర్చి కూడ, అబ్రవీత్ = పలికెను. మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా!, పాణినా = హస్తముతో, శ్రుతకీర్త్యాః = శ్రుతకీర్తియొక్క, పాణిమ్ = హస్తమును, గృహ్ణీష్వ = గ్రహింపుము.
తా. ధర్మాత్ము డైన జనకమహారాజు శత్రుఘ్నునితో కూడ ఇట్లనెను. ‘‘ఓ మహాబాహూ! శ్రుతకీర్తి హస్తమును హస్తముతో పట్టుకొనుము.’’
మూ. సర్వే భవన్తః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః,
పత్నీభిస్సన్తు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యయః. 34
ప్ర. అ. కాకుత్థ్సాః = ఓ రామలక్ష్మణభరతశత్రుఘ్నులారా! భవన్తః = మీరు, సర్వే = అందరును, సౌమ్యాః చ = సౌమ్యస్వభావము కలవారు. సర్వే = మీరందరును, సుచరితవ్రతాః = మంచి నడవడిక నియమము కలవారు. పత్నీభిః = భార్యలతో, (సహితాః = కూడినవారు), సన్తు = అగుదురుగాక, కాలస్య = కాలముయొక్క, పర్యయః = కడచిపోవుట, మాభూత్ = కాకుండుగాక.
తా. ‘‘ఓ రామలక్ష్మణభరతశత్రుఘ్నులారా! మీరందరును సౌమ్యులు. అందరును మంచినడవడిక, నియమములు కలవారు. భార్యలను స్వీకరింపుడు. ఆలస్యము చేయవద్దు.’’
మూ. జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరాస్పృశన్,
చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః. 35
ప్ర. అ. తే = ఆ, చత్వారః = నలుగురును, జనకస్య = జనకునియొక్క, వచః = వచనమును, శ్రుత్వా = విని, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, మతే = మతము నందు, స్థితాః = ఉన్న వారై, పాణిభిః = హస్తములతో, చతసృణామ్ = ఆ నలుగురి కన్యలయొక్క, పాణీన్ = హస్తములను, ఆస్పృశన్ = స్పశించిరి.
తా. జనకుని వాక్యము విని ఆ నలుగురు రాజకుమారులును, వసిష్ఠుని అనుమతి పొంది, తమ హస్తములతో ఆ నలుగురి కన్యల హస్తములను గ్రహించిరి.
మూ. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ,
ఋషీంశ్చైవ మహాత్మానస్సభార్యా రఘుసత్తమాః, 36
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్.
ప్ర. అ. మహాత్మానః = మహాత్ము లైన, రఘుసత్తమాః = ఆ రఘువంశశ్రేష్ఠులు, సభార్యాః = భార్యలతో కూడినవారై, అగ్నిమ్ = అగ్నిని, వేదిమ్ = వేదిని, రాజానమేవ చ = జనకమహారాజును, ఋషీంశ్చైవ = ఋషీశ్వరులను, ప్రదక్షిణీకృత్య = ప్రదక్షిణము చేసి, యథోక్తేన = చెప్పిన ప్రకారము, విధిపూర్వకమ్ = శాస్త్రపూర్వకముగా, వివాహమ్ = వివాహమును, చక్రుః = చేసిరి.
తా. మహాత్ములైన ఆ రఘువంశకుమారులు, భార్యాసమేతులై, అగ్నికిని, వేదికిని, జనకమహారాజునకును, ఋషులకును, ప్రదక్షిణము చేసి, వసిష్ఠాదులు చెప్పిన విధమున, యథావిధిగ వివాహము చేసికొనిరి.
మూ. కాకుత్థ్సెశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు,
పుష్పవృష్టిర్మహత్యాసీదన్తరిక్షాత్సుభాస్వరా. 37
ప్ర. అ. కాకుత్స్థైః = రామలక్ష్మణభరతశత్రుఘ్నులచేత, లలితేషు = సుందరము లైన, పాణిషు = హస్తములు, గృహీతేషు సత్సు = గ్రహింపబడిన వగుచుండగా, అన్తరిక్షాత్ = ఆకాశమునుండి, సుభాస్వరా = చాల ప్రకాశించుచున్న, మహతీ = గొప్ప, పుష్పవృష్టిః = పుష్పవృష్టి, ఆసీత్ = ఆయెను.
తా. రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీతా-ఊర్మిళా-మాండవీ-శ్రుతకీర్తుల సుకుమారములైన హస్తములు గ్రహించగనే ఆకాశమునుండి, మిక్కిలి ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి పడినది.
మూ. దివ్యదున్దుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిస్వనైః, 38
ననృతుశ్చాప్సరఃసంఘా గన్ధర్వాశ్చ జగుః కలమ్,
వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. 39
ప్ర. అ. రఘుముఖ్యానామ్ = రాఘవుల, వివాహే = వివాహమునందు, దివ్యదున్దుభి నిర్ఘోషైః = దివ్య మైన దుందుభిధ్వనులతోడను, గీతవాదిత్రనిస్వనైః = గీతవాద్య ధ్వనులతోడను, అప్సరఃసంఘాః = అప్సరఃసంఘములు, ననృతుః = నాట్యముచేసినవి. గన్ధర్వాశ్చ = గంధర్వులుకూడ, కలమ్ = మధురముగా, జగుః = పాడిరి, తత్ = అది, అద్భుతమ్ = ఆశ్చర్యకరముగ, అదృశ్యత = చూడబడెను.
తా. రాఘవుల వివాహసమయమున స్వర్గమునందు దుందుభులు మ్రోగినవి. గీత మంగళవాద్యధ్వనులతో అప్సరసలు నాట్యము చేసిరి. గంధర్వులు మధురముగా గానము చేసిరి. ఇది అంతయు ఆశ్చర్యకరముగా కనబడెను.
మూ. ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే,
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహౌజసః. 40
ప్ర. అ. ఈదృశే = ఇట్టి, తూర్యోద్ఘుష్టనినాదితే = నృత్తగీతవాద్యాదుల ధ్వనిచే కలిగిన శబ్దము, వర్తమానే = జరుగుచుండగా, మహౌజసః = గొప్ప తేజస్సు గల, తే = ఆ సోదరులు, త్రిః = మూడు పర్యాయములు, అగ్నిమ్ = అగ్నిని, పరిక్రమ్య = ప్రదక్షిణముచేసి, భార్యాః = భార్యలను, ఊహుః = వివాహమాడిరి.
తా. ఈ విధముగ తూర్యాదిధ్వని ప్రవర్తిల్లుచుండగా ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మూడు పర్యాయములు అగ్నిప్రదక్షిణము చేసి, భార్యలను వివాహ మాడిరి.
మూ. అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునన్దనాః,
రాజాప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాన్ధవః. 41
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిసప్తతితమః సర్గః
ప్ర. అ. అథ = పిమ్మట, తే = ఆ, రఘునన్దనాః = రాఘవులు, సభార్యాః = భార్యలతో కూడిన వారై, ఉపకార్యామ్ = విడిదిని గూర్చి, జగ్ముః = వెళ్లిరి. రాజాపి = రాజు కూడ, సర్షిసంఘః = ఋషిసంఘముతో కూడినవాడై, సబాన్ధవః = బంధువులతో కూడిన వాడై, పశ్యన్ = చూచుచు, అనుయయౌ = అనుసరించి వెళ్లెను.
తా. పిమ్మట రామలక్ష్మణభరతశత్రుఘ్నులు భార్యలతో గూడి తమ విడిదికి వెళ్లిరి. ఋషులతోను, బంధువులతోను కూడిన దశరథుడు కూడ భార్యాసమేతులైన పుత్రులను చూచుకొనుచు వెనుకనే వెళ్లెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బదిమూడవ సర్గ సమాప్తము.
