Chapter_74

Back
Book Balakandamu
Chapter No 80
Pages 6
Read Time 9 Minutes

Chapter_74

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ చతుఃసప్తతితమః సర్గః

విశ్వామిత్రుడు తన యాశ్రమమునకు వెళ్లిపోవుట. జనకుడు కన్యలకొరకు అత్యధికముగ అరణము నిచ్చుట. దశరథుడు సేనాసమేతుడై తన నగరమున కేగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట.

మూ. అథ రాత్య్రాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః,

ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తరపర్వతమ్. 1

ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్.

ప్ర. అ. అథ = పిమ్మట, రాత్య్రామ్ = రాత్రి, వ్యతీతాయాం సత్యామ్ = గడచిన దగుచుండగా, సః = ఆ, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, రాఘవాన్ = రఘువంశోద్భవు లైన, కుమారాన్ చ = రాజకుమారులను, ఆశీర్భిః = ఆశీర్వాదములచేత, పూరయిత్వా = నింపి, తౌ = ఆ, రాజానౌ = రాజులను, ఆపృష్ట్వా = అడిగి, ఉత్తరపర్వతమ్ = ఉత్తరపర్వతమునుగూర్చి, జగామ = వెళ్లెను.

తా. రాత్రి గడచిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేకాశీర్వాదముల నిచ్చి, జనకదశరథమహారాజులవద్ద సెలవు గైకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయెను.

మూ. విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపమ్,

ఆపృష్ట్వాథ జగామాశు రాజా దశరథః పురీమ్. 2

ప్ర. అ. విశ్వామిత్రే = విశ్వామిత్రుడు, గతే = వెళ్లినవా డగుచుండగా, అథ = పిమ్మట, రాజా = ప్రజారంజకు డైన, దశరథః రాజా = దశరథమహారాజు, మిథిలాధిపమ్ = మిథిలాధిపతి యైన, వైదేహమ్ = జనకమహారాజును, ఆపృష్ట్వా = అడిగి, ఆశు = శీఘ్రముగా, పురీమ్ = పట్టణమునుగూర్చి, జగామ = వెళ్లెను.

తా. విశ్వామిత్రుడు వెళ్లిన పిమ్మట దశరథమహారాజు జనకమహారాజు వద్ద సెలవు గైకొని శీఘ్రముగ అయోధ్యకు బయలుదేరెను.

మూ. గచ్ఛన్తం తం తు రాజానమన్వగచ్ఛన్నరాధిపః,

అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు. 3

ప్ర. అ. నరాధిపః = జనకమహారాజు, గచ్ఛన్తమ్ = వెళ్లుచున్న, తమ్ = ఆ, రాజానమ్ = దశరథమహారాజును, అన్వగచ్ఛత్ = అనుసరించి వెళ్లెను. అథ = పిమ్మట, విదేహానాం రాజా = జనకమహారాజు, బహు = అత్యధిక మైన, కన్యాధనమ్ = కన్యాధనమును, దదౌ = ఇచ్చెను.

తా. జనకమహారాజు ప్రయాణమై వెళ్లుచున్న దశరథమహారాజును అనుసరించి వెళ్లి సాగనంపెను. ఆతడు తన కుమార్తెలకు అరణముగా ఆత్యధిక మగు ధనము నిచ్చెను.

మూ. గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః,

కమ్బలానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యమ్బరాణి చ, 4

హస్త్యశ్పరథపాదాతం దివ్యరూపం స్వలంకృతమ్,

దదౌ కన్యాపితా తాసాం దాసీదాసమనుత్తమమ్. 5

ప్ర. అ. కన్యాపితా = కన్యల తండ్రి యైన, మిథిలేశ్వరః = జనకమహారాజు, గవామ్ = గోవులయొక్క, బహూని = అనేకములైన, శతసహస్రాణి = లక్షలను, ముఖ్యానామ్ = ముఖ్యములైన, కమ్బలానామ్ = కంబళ్ల యొక్క లక్షలను, క్షౌమకోట్యమ్బరాణి చ = కోట్లకొలది పట్టువస్త్రములను, హస్త్యశ్వరథపాదాతమ్ = ఏనుగులను, గుఱ్ఱములను, రథములను, కాలిబంటులను, దివ్యరూపమ్ = దివ్య మైన రూపము గలదియు, స్వలంకృతమ్ = బాగుగా అలంకరింపబడినదియు, అనుత్తమమ్ = శ్రేష్ఠ మైనదియు అగు, దాసీదాసమ్ = దాసీదాసజనమును, తాసామ్ = వారికి, దదౌ = ఇచ్చెను.

తా. ఆ మిథిలేశ్వరుడు లక్షల కొలది ఆవులను, శ్రేష్ఠ మైన కంబళీలను, కోట్ల కొలది పట్టువస్త్రములను, ఏనుగులు, అశ్వములు, రథములు, కాలిబంటులును గల చతురంగసైన్యమును, మంచి సౌందర్యము కలవారును బాగుగా అలంకరించుకొన్న వారును, శ్రేష్ఠులును అగు దాసీదాసులను కుమార్తెలకు అరణముగా పంపెను.

మూ. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ,

దదౌ పరమసంహృష్టః కన్యాధన మనుత్తమమ్. 6

ప్ర. అ. పరమసంహృష్టః = మిక్కిలి సంతసించినవాడై, హిరణ్యస్యః = వెండియొక్కయు, సువర్ణస్య = బంగారముయొక్కయు, ముక్తానామ్ = ముత్యములయొక్కయు, విద్రుమస్య = పగడములయొక్కయు, అనుత్తమమ్ = శ్రేష్ఠమైన, కన్యాధనమ్ = కన్యాధనమును, దదౌ = ఇచ్చెను.

తా. ఆతడు చాల సంతసించిన వాడై, వెండి, బంగారము, ముత్యములు, పగడములు, వీటి రూపములో నున్న అత్యధిక మగు కన్యాధనమును ఇచ్చెను.

మూ. దత్త్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివమ్,

ప్రవివేశ స్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః. 7

ప్ర. అ. మిథిలేశ్వరః = మిథిలాధిపతియైన, రాజా = జనకమహారాజు, బహు = అత్యధికమైన, ధనమ్ = ధనమును, దత్వా = ఇచ్చి, పార్థివమ్ = దశరథమహారాజును, సమనుజ్ఞాప్య = అనుజ్ఞ ఇచ్చువానినిగా చేసి, స్వనిలయమ్ = తన నివాస మైన, మిథిలామ్ = మిథిలా నగరమును, ప్రవివేశ = ప్రవేశించెను.

తా. మిథిలాధిపతి యైన జనకమహారాజు కుమార్తెలకు అత్యధిక మైన ధనము నిచ్చి, దశరథమహారాజు వద్ద అనుజ్ఞ గైకొని తన నివాసస్థాన మగు మిథిలాపురిని ప్రవేశించెను.

మూ. రాజా ప్యయోధ్యాధిపతిః సహ పుత్రైర్మహాత్మభిః,

ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః. 8

ప్ర. అ. అయోధ్యాధిపతిః = అయోధ్యాధిపతియైన, రాజాపి = దశరథమహారాజు కూడ, మహాత్మభిః = మహాత్ములైన, పుత్రైః సహ = పుత్రులతో కూడ, సర్వాన్ = సమస్త మైన, ఋషీన్ = ఋషులను, పురస్కృత్య = ఎదుట ఉంచుకొని, సబలానుగః = సైన్యముతోడను అనుచరులతోడను కూడినవాడై, జగామ = వెళ్లెను.

తా. దశరథమహారాజు, మహాత్ము లైన కుమారులతో కూడ, ఋషులందరిని ముందు ఉంచుకొని, సైన్యమును, అనుచరులును వెంట రాగా, వెళ్లెను.

మూ. గచ్ఛన్తం తం నరవ్యాఘ్రం సర్షిసంఘం సరాఘవమ్,

ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరన్త తతస్తతః. 9

ప్ర. అ. సర్షిసంఘమ్ = ఋషిసముదాయముతో కూడినట్టియు, సరాఘవమ్ = రామ లక్ష్మణభరతశత్రుఘ్నులతో కూడిన, నరవ్యాఘ్రమ్ = నరశ్రేష్ఠు డైన, తమ్ = ఆ దశరథుని గూర్చి, తతస్తతః = అచ్చటచ్చట, ఘోరాః = భయంకర మైన, పక్షిణః = పక్షులు, వాచః = వాక్కులను, వ్యాహరన్తి స్మ = పలికెను.

తా. ఆ దశరథుడు, రామలక్ష్మణభరతశత్రుఘ్నసమేతుడై, ఋషులతో కూడ ప్రయాణము చేయుచుండగా, అక్కడక్కడ భయంకరములైన పక్షులు ధ్వనులు చేయ నారంభించినవి.

మూ. భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్ఛన్తి స్మ ప్రదక్షిణమ్.

తాన్ దృష్ట్వా రాజశార్దూలో వసిష్ఠం పర్యపృచ్ఛత, 10

ప్ర. అ. భౌమాః = భూమికి సంబంధించిన, సర్వే = సమస్తమైన, మృగాః = మృగములు, ప్రదక్షిణమ్ = ప్రదక్షిణముగా, గచ్ఛన్తి స్మ = వెళ్ళినవి. తాన్ = వాటిని, దృష్ట్వా = చూచి, రాజశార్దూలః = రాజశ్రేష్ఠుడు, వసిష్ఠమ్ = వసిష్ఠుని, పర్యపృచ్ఛత = అడిగెను.

తా. భూమిపై నున్న మృగములు ప్రదక్షిణముగా వెళ్లినవి. దీని నంతయు చూచి దశరథమహారాజు వసిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను.

మూ. అసౌమ్యాః పక్షిణో ఘోరాః మృగాశ్చాపి ప్రదక్షిణాః

కిమిదం హృదయోత్కమ్పి మనో మమ విషీదతి. 11

ప్ర. అ. ఘోరాః = భయంకరమైన, పక్షిణః = పక్షులు, అసౌమ్యాః = ప్రతికూలముగా నున్నవి. మృగాశ్చాపి = మృగములు, ప్రదక్షిణాః = ప్రదక్షిణములుగా ఉన్నవి. హృదయోత్కమ్పి = హృదయమును కంపింపచేయు, ఇదమ్ = ఇది, కిమ్ = ఏమిటి ? మమ = నాయొక్క, మనః = మనస్సు, విషీదతి = క్రుంగిపోవుచున్నది.

తా. ఘోరము లైన పక్షులు ప్రతికూలముగా నున్నవి. మృగములు ప్రదక్షిణముగా సంచరించుచు అనుకూలముగా ఉన్నవి. హృదయమును కంపింపచేయు ఇది యంతయు ఏమిటి? నా మనస్సు విషాదము చెందుచున్నది.

మూ. రాజ్ఞో దశరథస్యైతచ్ఛ్రుత్వా వాక్యం మహానృషిః,

ఉవాచ మధురాం వాణీం శ్రూయతామస్య యత్ ఫలమ్. 12

ప్ర. అ. మహానృషిః = ఆ వసిష్ఠమహర్షి, రాజ్ఞః = రాజైన, దశరథస్య = దశరథునియొక్క, ఏతత్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, మధురామ్ = మధురమైన, వాణీమ్ = వాక్కును, ఉవాచ = పలికెను. అస్య = దీనికి, యత్ = ఏది, ఫలమ్ = ఫలమో, శ్రూయతామ్ = వినబడుగాక.

తా. దశరథమహారాజు మాటలు విని వసిష్ఠమహర్షి మధుర మైన వాక్యము పలికెను. దీని ఫల మేదియో చెప్పెదను వినుము.

మూ. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్చ్యు తమ్,

మృగాః ప్రశమయన్త్యేతే సంతాపస్త్యజ్యతామయమ్. 13

ప్ర. అ. పక్షిముఖాత్ = పక్షుల ముఖమునుండి, చ్యుతమ్ = జారిన, (సూచింపబడిన), దివ్యమ్ = దైవకృత మైన, ఉపస్థితమ్ = వచ్చిపడిన, ఘోరమ్ = ఘోరమైన భయమ్ = భయమును, ఏతే = ఈ, మృగాః = మృగములు, ప్రశమయన్తి = శాంతింపచేయుచున్నవి. అయమ్ = ఈ, సన్తాపః = మనస్తాపము, త్యజ్యతామ్ = విడువబడుగాక.

తా. ఆకస్మికముగ దైవకృతమై ఘోర మైన భయము వచ్చిపడనున్నట్లు పక్షులు సూచించుచున్నవి. మృగములు ఆ భయము శాంతింపనున్నట్లు సూచించుచున్నవి. అందుచేత మనస్తాపము పొందకుము.

మూ. తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవ హ,

కమ్పయన్ పృథివీం సర్వాం పాతయంశ్చ ద్రుమాఞ్ఛుభాన్. 14

ప్ర. అ. తేషాం = వారు, సంవదతామ్ = మాటలాడుచుండగా, తత్ర = అచట, పృథివీమ్ = భూమిని, కమ్పయన్ = కంపింపచేయుచు, శుభాన్ = శుభమైన, ద్రుమాన్ = వృక్షములను, పాతయన్ = పడవేయుచు, వాయుః = వాయువు, ప్రాదుర్బభూవ హ = పుట్టెను.

తా. వారిట్లు మాటలాడుకొనుచుండగా అచట, భూమిని కంపింపచేయుచు, మంగళకరము లైన వృక్షములను పడగొట్టుచు వాయువు బయలుదేరెను.

మూ. తమసా సంవృతః సూర్యః సర్వా న ప్రబభుర్దిశః,

భస్మనా చ వృతం సర్వం సమ్మూఢమివ తద్బలమ్. 15

ప్ర. అ. సూర్యః = సూర్యుడు, తమసా = చీకటిచే, ఆవృతః = ఆవరింపబడెను. సర్వాః = సమస్తమైన, దిశః = దిక్కులు, న ప్రబభుః = ప్రకాశింపలేదు. తత్ = ఆ, సర్వమ్ = సమస్త మైన, బలమ్ = సైన్యము, భస్మనా = దుమ్ముచేత, ఆవృత్తమ్ = కప్పబడినదే, సంమూఢమివ = మూర్ఛనొంది నట్లయినది.

తా. సూర్యుని చీకటి ఆవరించెను. దిక్కు లన్నియు ప్రకాశవిహీనము లయ్యెను. ఆ సైన్య మంతయు బూడిద కప్పగా మూర్ఛపొందినట్లుండెను.

మూ. వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా,

ససంజ్ఞా ఇవ తత్రాసన్ సర్వమన్యద్విచేతనమ్. 16

ప్ర. అ. తదా = అప్పుడు, వసిష్ఠశ్చ = వసిష్ఠుడును, అన్యే = ఇతరులైన, ఋషయశ్చ = ఋషులును, ససుతః = కుమారులతో కూడిన, రాజా చ = రాజును, ససంజ్ఞాః ఇవ = చైతన్య మున్నవారు వలె, ఆసన్ = ఉండిరి. అన్యత్ = ఇతర మైన, సర్వమ్ = అంతయు, విచేతనమ్ = చైతన్యరహిత మైనది.

తా. ఆ సమయమున, వసిష్ఠాదిఋషులు, దశరథుడు, ఆతని కుమారులు వీరు మాత్రమే చైతన్య మున్నట్లు కనబడిరి. మిగిలినవా రందరును విచేతనుల వలె అయిరి.

మూ. తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః 17

దదర్శ భీమసఙ్కాశం జటామణ్డలధారిణమ్.

భార్గవం జామదగ్న్యం తం రాజరాజవిమర్దినమ్, 18

కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుఃసహమ్,

జ్వలన్తమివ తేజోభిర్దుర్నిరీక్ష్యం పృథగ్జనైః, 19

స్కన్ధే చాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్,

ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్. 20

ప్ర. అ. తస్మిన్ = ఆ, ఘోరే = భయంకర మైన, తమసి = అంధకారమునందు, భస్మచ్ఛన్నేవ = భస్మముచేత కప్పబడినది వలె ఉన్న, సా = ఆ, చమూః = సేన, భీమసఙ్కాశమ్ = భయంకరుడుగా ఉన్నవాడును, జటామణ్డలధారిణమ్ = జటామండలమును ధరించినవాడును, రాజరాజవిమర్దినమ్ = రాజుల రాజులను గూడ నశింపచేసినవాడును, కైలాసమివ= కైలాసపర్వతము వలె, దుర్ధర్షమ్ = ఎదిరింపశక్యము కానివాడును. కాలాగ్నిమివ = ప్రళయ కాలాగ్ని వలె, దుస్సహమ్ = ఎదిరింపశక్యకానివాడను, తేజోభిః = తేజస్సులచేత, జ్వలన్తమివ = ప్రజ్వరిల్లుచున్నవాడును, పృథగ్జనైః = సామాన్యులచేత, దుర్నిరీక్ష్యమ్ = చూడశక్యముకానివాడును, పరశుమ్ = గండ్ర గొడ్డలిని, స్కన్ధే = భుజమునందు, ఆసజ్య = తగుల్చుకొని, విద్యుద్గణోపమమ్ = మెరపుల గుంపుతో సమానమైన, ధనుః = ధనుస్సును, శరముఖ్యమ్ = శ్రేష్ఠ మైన శరమును, ప్రగృహ్య = గ్రహించి, త్రిపురఘ్నమ్ = త్రిపురధ్వంసము చేసిన, శివం యథా = శివుడు వలె ఉన్న, తమ్ = ఆ, భార్గవమ్ = భృగువంశసంజాతుడైన, జామదగ్న్యమ్ = పరశురాముని, దదర్శ = చూచెను.

తా. ఆ ఘోర మైన అంధకారములో, బూడిద కప్పినట్లున్న ఆ సైన్యము, జటామండలమును ధరించినవాడును, భయంకరుడును, రాజులను సంహరించినవాడును అగు పరశురాముని చూచెను. ఆతడు కైలాసము వలె ఎదిరింప శక్యము కానివాడై, ప్రళయ కాలాగ్ని వలె సహింప శక్యముకానివాడై యుండెను. తేజస్సులచే మండుచున్నట్లున్న ఆతనిని సామాన్యజనులు చూడజాలకుండిరి. గండ్రగొడ్డలిని బుజముపై వ్రేలాడదీసికొని, మెరపుల గుంపు వంటి ధనుస్సును, శ్రేష్ఠ మైన శరమును చేతులలో ధరించి త్రిపురసంహారము చేయు శివుడు వలె నుండెను.

మూ. తం దృష్ట్వా భీమసంకాశం జ్వలన్తమివ పావకమ్,

వసిష్ఠప్రముఖా విప్రా జపహోమపరాయణాః, 21

సంగతా మునయః సర్వే సంజజల్పురథో మిథః.

ప్ర. అ. భీమసంకాశమ్ = భయంకరుడును, జ్వలన్తమ్ = ప్రజ్వలించుచున్న, పావకమ్ ఇవ = అగ్ని వలె ఉన్న, తమ్ = ఆతనిని, దృష్ట్వా = చూచి, జపహోమపరాయణాః = జపమునందును హోమమునందును ఆసక్తి గలవారును, విప్రాః = బ్రాహ్మణులును అయిన, వసిష్ఠప్రముఖాః = వసిష్ఠుడు మొద లైన, సర్వే = సమస్త మైన, మునయః = మునులు, సంగతాః = కలిసినవారై, అథో = పిమ్మట, మిథః = పరస్పరము, సంజజల్పుః = మాటలాడుకొనిరి.

తా. ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె భయంకరముగా ఉన్న ఆతనిని చూచి, జపహోమాది పరాయణులును, శాంతస్వభావులును అగు వసిష్ఠాదిమును లందరును కలిసి, పరస్పరము ఇట్లనుకొనిరి.

మూ. కచ్చిత్పితృవధామర్షీ క్షత్రం నోత్సాదయిష్యతి, 22

పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః,

క్షత్రస్యోద్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితమ్. 23

ప్ర. అ. పితృవధామర్షీ = తండ్రియొక్క వధచేత కోపించినఇతడు, క్షత్రమ్ = క్షత్రియ జాతిని, నోత్సాదయిష్యతి కచ్చిత్ = నశింపచేయడు కదా!, పూర్వమ్ = పూర్వము, క్షత్రవధమ్ = క్షత్రియవధను, కృత్వా = చేసి, గతమన్యుః = పోయిన కోపము గలవాడును, గతజ్వరః = పోయిన మనస్తాపము గలవాడును అయినాడు కదా ? భూయః = మరల, క్షత్రస్య = క్షత్రియజాతి యొక్క, ఉత్సాదనమ్ = వినాశము, అస్య = ఈతనికి, న చికీర్షితంఖలు = చేయ నభిలషింపబడలేదు కదా ?

తా. (కార్తవీర్యార్జునుడు) తండ్రిని చంపుటచే కోపించిన ఇతడు క్షత్రియ జాతిని నశింపచేయడు కదా? పూర్వము క్షత్రియవధ చేసి కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు మరల క్షత్రియవంశవినాశమునకు పూన్కొనునా?

మూ. ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనమ్,

ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్. 24

ప్ర. అ. ఋషయః = ఋషులు, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = తమలో తాము చెప్పుకొని, అర్ఘ్యమ్ = అర్ఘ్యమును, ఆదాయ = గ్రహించి, భీమదర్శనమ్ = భయంకరమైన దర్శనము గల, భార్గవమ్ = పరశురాముని గూర్చి, రామ రామ ఇతి = రామా రామా అని, మధురమ్ = మధుర మైన, వచః = వచనమును, అబ్రువన్ = పలికిరి.

తా. ఋషులు తమతో తా మీ విధముగ మాటలాడుకొని, భయంకరుడుగా కనబడుచున్న ఆ పరశురామునకై అర్ఘ్యము గ్రహించి, ‘‘రామా! రామా!’’ అని మధురముగా పిలచి పూజించిరి.

మూ. ప్రతిగృహ్య తు తాం పూజామృషిదత్తాం ప్రతాపవాన్,

రామం దాశరథిం రామో జామదగ్న్యోఽభ్యభాషత. 25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుఃసప్తతితమః సర్గః

ప్ర. అ. ప్రతాపవాన్ = ప్రతాపము గల, జామదగ్న్యః = జమదగ్ని కుమారు డైన, రామః = పరశురాముడు, ఋషిదత్తామ్ = ఋషులచేత ఇవ్వబడిన, తామ్ = ఆ, పూజామ్ = పూజను, ప్రతిగృహ్య = స్వీకరించి, దాశరథిమ్ = దశరథుని కుమారు డైన, రామమ్ = రాముని గూర్చి, అభ్యభాషత = పలికెను.

తా. ప్రతాపవంతు డైన ఆ పరశురాముడు ఋషులు సమర్పించిన ఆ పూజను స్వీకరించి, దశరథుని కుమారు డగు రామునితో ఇట్లనెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బది నాల్గవ సర్గ సమాప్తము.