Chapter_75

Back
Book Balakandamu
Chapter No 81
Pages 7
Read Time 11 Minutes

Chapter_75

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ పఞ్చసప్తతితమః సర్గః

దశరథుని మాటలను లక్ష్యము చేయక పరశురాముడు శ్రీరామునితో ‘‘నీ వీ వైష్ణవధనుస్సు పై బాణసంధానము చేయుము’’ అని పలుకుట.

మూ. రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్,

ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్. 1

ప్ర. అ. దాశరథే = దశరథకుమారుడవైన, రామ = రామా!, రామ = రామా! తే = నీయొక్క, వీర్యమ్ = పరాక్రమము, అద్భుతమ్ = అద్భుతమైనదిగా, శ్రూయతే = వినబడుచున్నది. ధనుషః = ధనుస్సుయొక్క, భేదనం చైవ = భేదనము కూడ, నిఖిలేన = పూర్తిగా, మయా = నాచేత, శ్రుతమ్ = వినబడినది.

తా. రామా! రామా! నీ పరాక్రమము అత్యద్భుత మైన దని వినుచున్నాము. శివధనుర్భంగ మును గూర్చి గూడ పూర్తిగ విని యున్నాము.

మూ. తదద్భుతమచిన్త్యం చ భేదనం ధనుషస్త్వయా,

తచ్ఛ్రుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభమ్. 2

ప్ర. అ. త్వయా = నీచేత, ధనుషః = ధనుస్సుయొక్క, తత్ = ఆ, భేదనమ్ = విరచుట, అద్భుతమ్ = ఆశ్చర్యకర మైనది. అచిన్త్యం చ = ఊహింప శక్యము కానిది. తత్ = దానిని, శ్రుత్వా = విని, అహమ్ = నేను, అపరమ్ = మరియొక, శుభమ్ = శుభమైన, ధనుః = ధనుస్సును, గృహ్య = గ్రహించి, అనుప్రాప్తః = వచ్చినాను.

తా. నీవు శివుని విల్లు విరచుట చాల ఆశ్చర్యకర మైనది, ఊహింపరానిది. ఆ వార్త విని నేను మరొక శుభ మైన విల్లు తీసికొని వచ్చినాను.

మూ. తదిదం ఘోరసంకాశం జామదగ్న్యం మహద్ధనుః,

పూరయస్వ శరైణైవ స్వబలం దర్శయస్వ చ. 3

ప్ర. అ. ఘోరసంకాశమ్ = భయంకరముగా నున్నదియు, జామదగ్న్యమ్ = జమదగ్ని వలన వచ్చినదియు అగు, తత్ = ఆ, ఇదమ్ = ఈ, మహత్ = గొప్ప, ధనుః = ధనుస్సును, శరేణైవ = బాణముచే, పూరయస్వ = పూరింపుము. స్వబలమ్ = నీ బలమును, దర్శయస్వ చ = చూపుము.

తా. ఘోర మైనదియు, జమదగ్ని ద్వారా లభించినదియు అగు అట్టి ఈ మహాధనుస్సును, ఎక్కుపెట్టి, బాణముచే పూరించి, నీ బలమును చూపుము.

మూ. తదహం తే బలం దృష్ట్వా ధనుషోఽస్య ప్రపూరణే,

ద్వన్ద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యస్య రాఘవ. 4

ప్ర. అ. రాఘవ = రామా!, తత్ = అప్పుడు, అహమ్ = నేను, అస్య = ఈ, ధనుషః = ధనుస్సుయొక్క, ప్రపూరణే = పూరించుటయందు, తే = నీయొక్క, బలమ్ = బలమును, దృష్ట్వా = చూచి, వీర్యశ్లాఘ్యస్య = పరాక్రమముచే శ్లాఘింప దగిన నీకు, ద్వన్ద్వయుద్ధమ్ = ద్వంద్వ యుద్ధమును, ప్రదాస్యామి = ఇవ్వగలను.

తా. రామా! ఈ ధనుస్సును పూరించినచో అపుడు నీ బలమును చూచి, వీర్యముచే శ్లాఘింప దగిన నీతో ద్వంద్వయుద్ధము చేయగలను.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా,

విషణ్ణవదనో దీనః ప్రాఞ్జలిర్వాక్యమబ్రవీత్. 5

ప్ర. అ. తదా = అప్పుడు, రాజా దశరథః = దశరథమహారాజు, తస్య = అతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, విషణ్ణవదనః = దిగులుపాటు చెందిన ముఖము కలవాడై, దీనః = దీనుడై, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. అపుడు, దశరథమహారాజు అతని మాటలు విని, వాడిపోయిన ముఖముతో దీనుడై, చేతులు జోడించి ఇట్లు పలికెను.

మూ. క్షత్రరోషాత్ప్రశాన్తస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః,

బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి. 6

ప్ర. అ. క్షత్రరోషాత్ = క్షత్రియులపై రోషమునుండి, ప్రశాన్తః = శాంతించినవాడవును, బ్రాహ్మణః = బ్రాహ్మణుడవును, మహాయశాః = గొప్ప కీర్తి కలవాడవును అగు, త్వమ్ = నీవు, బాలానామ్ = బాలు రైన, మమ = నాయొక్క, పుత్రాణామ్ = పుత్రులకు, అభయమ్ = అభయమును, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. గొప్ప యశస్సు కలవాడవు, బ్రాహ్మణుడవు అయిన నీవు క్షత్రియులపై ఉన్న కోపము తొలగి శాంతుడవుగా ఉన్నావు కదా? ఇపుడు బాలు రైన నా కుమారులకు అభయ మిమ్ము.

మూ. భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయవ్రతశాలినామ్,

సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి. 7

ప్ర. అ. స్వాధ్యాయవ్రతశాలినామ్ = వేదాధ్యయనముచేతను ఇతరవ్రతములచేతను ప్రకాశించుచున్న, భార్గవాణామ్ = భృగువంశీయుల, కులే = కులమునందు, జాతః = పుట్టితివి. సహస్రాక్షే = దేవేంద్రునియందు, ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞచేసి, శస్త్రమ్ = ఆయుధమును, నిక్షిప్తవాన్ అసి = విడిచిపెట్టితివి.

తా. నీవు స్వాధ్యాయమునందును, తదితరవ్రతములందును ఆసక్తు లైన భృగు వంశీయుల కులమునందు పుట్టినావు. దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడచితివి.

మూ. స త్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసున్ధరామ్,

దత్వా వనముపాగమ్య మహేన్ద్రకృతకేతనః. 8

ప్ర. అ. సః = అట్టి, త్వమ్ = నీవు, ధర్మపరః = ధర్మపరుడవు, భూత్వా = అయి, కాశ్యపాయ = కాశ్యపునకు, వసున్ధరామ్ = భూమిని, దత్వా = ఇచ్చి, వనమ్ = వనమును,ఉపాగమ్య = పొంది, మహేన్ద్రకృతకేతనః = మహేంద్రపర్వతముపై చేయబడిన నివాసము కలవాడవు.

తా. నీవు ధర్మపరుడవై, భూమి నంతను కాశ్యపునకు దానము చేసి, వనము చేరి, మహేంద్రపర్వతముపై నివాస మేర్పరచుకున్నావు.

మూ. మమ సర్వవినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే,

న చైకస్మిన్ హతే రామే సర్వే జీవామహే వయమ్. 9

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ!, త్వమ్ = నీవు, మమ = నాయొక్క, సర్వవినాశాయ = సర్వవినాశమునకు, సంప్రాప్తః = వచ్చినావు. ఏకస్మిన్ = ఒక, రామే = రాముడు, హతే = చంపబడినవా డగుచుండగా, వయమ్ = మేము, సర్వే = అందరము, న జీవామహే = జీవించము.

తా. మహామునీ! ఈనాడు నీవు మా అందరి వినాశార్థమై వచ్చితివి. ఒక్క రాముడు మరణించినను మే మందరము మరణింతుము కదా?

మూ. బ్రువత్యేవం దశరథే జామదగ్న్యః ప్రతాపవాన్,

అనాదృత్యైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత. 10

ప్ర. అ. దశరథే = దశరథుడు, ఏవమ్ = ఇట్లు, బ్రువతి = చెప్పుచుండగా, ప్రతాపవాన్ = ప్రతాపము గల, జామదగ్న్యః = పరశురాముడు, తద్వాక్యమ్ = ఆతని వాక్యమును, అనాదృత్యైవ = ఆదరించకయే, రామమేవ = రాముని గూర్చియే, అభ్యభాషత = పలికెను.

తా. దశరథు డీ విధముగ మాటలాడుచుండగా ప్రతాపవంతు డైన పరశురాముడు, ఆతని మాటలు లెక్కచేయకుండగనే, రామునితో మాత్రమే ఇట్లు పలికెను.

మూ. ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే,

దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా. 11

ప్ర. అ. ఇమే = ఈ, ద్వే = రెండు, ధనుషీ = ధనుస్సులు, శ్రేష్ఠే = శ్రేష్ఠ మైనవి. దివ్యే = స్వర్గమున పుట్టినవి. లోకాభివిశ్రుతే = లోకములలో ప్రసిద్ధ మైనవి. దృఢే = దృఢమైనవి. బలవతీ = బలము కలవి. ముఖ్యే = ప్రధాన మైనవి. విశ్వకర్మణా = విశ్వకర్మచేత, సుకృతే = బాగుగా నిర్మింపబడినవి.

తా. ఈ రెండు ధనుస్సులును శ్రేష్ఠ మైనవి. దేవలోకమునకు సంబంధించినవి. లోకములలో ప్రసిద్ధిపొందినవి. దృఢమైనవి. బలము గలవి. ప్రధాన మైనవి. విశ్వకర్మ వీటిని బాగుగ నిర్మించెను.

మూ. అతిసృష్టం సురైరేకం త్య్రమ్బకాయ యుయుత్సవే,

త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్థ్స యత్త్వయా. 12

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన, కాకుత్థ్స = రామా!, యత్ = ఏ ధనుస్సు, త్వయా = నీచేత, భగ్నమ్ = విరుగకొట్టబడినదో, అది, యుయుత్సవే = యుద్ధము కోరుచున్న, త్య్రమ్బకాయ = ఈశ్వరునకు, సురైః = దేవతలచేత, అతిసృష్టమ్ = ఇవ్వబడిన, త్రిపురఘ్నమ్ = త్రిపురములను నశింపచేసిన, ఏకమ్ = (ఆ రెండింటిలో) ఒకధనస్సు.

తా. నరశ్రేష్ఠుడ వైన రామా! వాటిలో ఒక ధనుస్సును దేవతలు యుద్ధము చేయ గోరుచున్న ఈశ్వరునకు ఇచ్చిరి. త్రిపురవినాశక మగు దానినే నీవు విరచితివి.

మూ. ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైః,

తదిదం వైష్ణవం రామ ధనుః పరమభాస్వరమ్,

సమానసారం కాకుత్స్థ రౌద్రేణ ధనుషా త్విదమ్. 13

ప్ర. అ. దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యముకాని, ఇదమ్ = ఈ, ద్వితీయమ్ = రెండవ ధనుస్సు, సురోత్తమైః = సురోత్తములచేత, విష్ణోః = విష్ణువునకు, దత్తమ్ = ఇవ్వబడినది. కాకుత్థ్స = కకుత్థ్సవంశమునందు పుట్టిన, రామ = రామా!, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించు చున్న, తత్ = ఆ, ఇదమ్ = ఇది, వైష్ణవమ్ = విష్ణుసంబంధ మైన, ధనుః = ధనుస్సు. ఇదమ్ = ఇది, రౌద్రేణ ధనుషా = శివధనుస్సుతో, సమానసారమ్ = సమాన మైన సారము గలది.

తా. ఎదిరింప రాని ఈ రెండవ ధనుస్సును దేవతలు విష్ణువున కిచ్చినారు. రామా! అట్టి ఈ మిక్కిలి ప్రకాశించుచున్న ధనుస్సు విష్ణువునకు సంబంధించినది. ఇది శివధనుస్సుతో సమాన మైన సారము గలది.

మూ. తదా తు దేవతాః సర్వాః పృచ్ఛన్తి స్మ పితామహమ్,

శితికణ్ఠస్య విష్ణోశ్చ బలాబలనిరీక్షయా. 14

ప్ర. అ. తదా = అప్పుడు, సర్వాః = సమస్త మైన, దేవతాః = దేవతలు, శితికణ్ఠస్య = శివునియొక్కయు, విష్ణోః చ = విష్ణువుయొక్కయు, బలాబలనిరీక్షయా = బలాబలముల పరీక్షచేత, పితామహమ్ = బ్రహ్మదేవుని, పృచ్ఛన్తి స్మ = ప్రశ్నించిరి.

తా. అపుడు దేవత లందరును శివవిష్ణువుల బలాబలములను తెలిసికొన గోరి బ్రహ్మను అడిగిరి.

మూ. అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః,

విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః. 15

ప్ర. అ. సత్యవతామ్ = సత్యవంతులలో, వరః = శ్రేష్ఠుడైన, పితామహః = బ్రహ్మదేవుడు, దేవతానామ్ = దేవతలయొక్క, అభిప్రాయమ్ = అభిప్రాయమును, విజ్ఞాయ = తెలిసికొని, తయోః = వారిరువురకును, విరోధమ్ = విరోధమును, జనయామాస = పుట్టించెను.

తా. సత్యవంతులలో గొప్పవా డగు బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయము తెలిసికొని వారిద్దరికిని విరోధము కల్పించెను.

మూ. విరోధే చ మహద్యుద్ధమభవద్రోమహర్షణమ్,

శితికణ్ఠస్య విష్ణోశ్చ పరస్పరజిగీషుణోః. 16

ప్ర. అ. విరోధే = విరోధము కలుగగా, పరస్పరజిగీషుణోః = ఒండొరులను జయింప గోరిన, శితికణ్ఠస్య = శివునకు, విష్ణోశ్చ = విష్ణువునకును, రోమహర్షణమ్ = రోమాంచమును కలిగించు, మహత్ = గొప్ప, యుద్ధం = యుద్ధము, అభవత్ = ఆయెను.

తా. విరోధము కలుగగా, పరస్పరము జయించ వలె నని కోరుచున్న శివునకును విష్ణువునకును గొప్ప భయంకర మగు యుద్ధము జరిగెను.

మూ. తదా తు జృమ్భితం శైవం ధనుర్భీమపరాక్రమమ్,

హుంకారేణ మహాదేవః స్తంభితోఽథ త్రిలోచనః. 17

ప్ర. అ. తదా = అప్పుడు, హుంకారేణ = విష్ణువు హుంఅని అనుటచే, భీమపరాక్రమమ్ = భయంకర మైన పరాక్రమము గల, శైవం ధనుః = శివధనుస్సు, జృమ్భితమ్ = ఆవులించినది. ఆనగా జడమై పోయినది. అథ = పిమ్మట, త్రిలోచనః = మూడు నేత్రముల గల, మహాదేవః = ఈశ్వరుడు, స్తమ్భితః = స్తంభింపచేయబడినాడు.

తా. అపుడు విష్ణువు హుంకారము చేయగా భయంకర మైన పరాక్రమము గల ఆ శివధనుస్సు జడ మైపోయినది. త్రిలోచనుడు కూడ కదలలేక పోయెను.

మూ. దేవైస్తదా సమాగమ్య సర్షిసం ఘైః సచారణైః,

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ. 18

ప్ర. అ. తదా = అపుడు, సర్షిసంఘైః = ఋషిసంఘములతో కూడిన, సచారణైః = చారణులతో కూడిన, దేవైః = దేవతలచేత, తత్ర = అచట, సమాగమ్య = వచ్చి, యాచితౌ = ప్రార్థింపబడినవారై, తౌ = ఆ, సురోత్తమౌ = దేవతాశ్రేష్ఠులు, ప్రశమమ్ = శాంతిని, జగ్మతుః = పొందిరి.

తా. అపుడు దేవతలు, ఋషులు, చారణులు వచ్చి ప్రార్థింపగా ఆ దేవతా శ్రేష్ఠు లిరువును శాంతించిరి.

మూ. జృమ్భితం తద్ధనుర్దష్ట్వా శైవం విష్ణుపరాక్రమైః,

అధికం మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తథా. 19

ప్ర. అ. విష్ణుపరాక్రమైః = విష్ణువుయొక్క పరాక్రమముచేత, జృమ్భితమ్ = నిర్వీర్యముగ చేయబడిన, తత్ = ఆ, శైవమ్ = శివుని సంబంధ మైన, ధనుః = ధనుస్సును, దృష్ట్వా = చూచి, తదా = అప్పుడు, సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, దేవాః = దేవతలు, విష్ణుమ్ = విష్ణువును, అధికమ్ = గొప్పవానినిగా, మేనిరే = తలచిరి.

తా. విష్ణుపరాక్రమముచే ఆ శివధనుస్సు జడ మైపోవుట జూచి దేవతలును, ఋషి గణములును, విష్ణువే అధికు డని తెలిసికొనిరి.

మూ. ధనూ రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః,

దేవరాతస్య రాజర్షేర్దదౌ హస్తే ససాయకమ్. 20

ప్ర. అ. సంక్రుద్ధః = కోపగించిన, మహాయశాః = గొప్ప కీర్తి గల, రుద్రస్తు = రుద్రుడైతే, విదేహేషు = విదేహదేశమునందు, ససాయకమ్ = బాణముతో కూడిన, ధనుః = ధనుస్సును, రాజర్షేః = రాజర్షి యైన, దేవరాతస్య = దేవరాతునియొక్క, హస్తే = హస్తమునందు, దదౌ = ఇచ్చెను.

తా. మహాయశస్సు గల రుద్రుడు కోపించి, బాణసహిత మైన ఆ ధనుస్సును, విదేహదేశములో దేవరాతు డను రాజర్షి చేతికి ఇచ్చివేసెను.

మూ. ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురఞ్జయమ్,

ఋచీకే భార్గవే ప్రాదాద్విష్ణుః స న్యాసముత్తమమ్. 21

ప్ర. అ. రామ = రామా!, సః = ఆ, విష్ణుః = విష్ణువు, పరపురఞ్జయమ్ = పరుల పురములను జయించు, ఇదమ్ = ఈ, వైష్ణవం ధనుః = వైష్ణవధనుస్సును, భార్గవే = భృగువంశమునకు చెందిన, ఋచీకే = ఋచీకునియందు, ఉత్తమమ్ = ఉత్తమ మైన, న్యాసమ్ = న్యాసముగా, ప్రాదాత్ = ఇచ్చెను.

తా. రామా! శత్రుపురవినాశక మగు తన ధనుస్సును, విష్ణువు, భృగువంశమునకు చెందిన ఋచీకుని వద్ద ఉత్తమ మైన, న్యాసమునుగా ఇచ్చెను.

మూ. ఋచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మణః,

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః. 22

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, ఋచీకస్తు = ఋచీకుడు, పుత్రస్య = తన కుమారుడును, అప్రతికర్మణః = సాటి లేని కార్యములు కలవాడును, మహాత్మనః = మహాత్ముడును, మమ = నాయొక్క, పితుః = తండ్రియు అయిన, జమదగ్నేః = జమదగ్నికి, దదౌ = ఇచ్చెను.

తా. మహాతేజఃశాలి యగు ఋచీకుడు, దానిని సాటి లేని కర్మ కలవాడును, మహాత్ముడును, తన కుమారుడును, నా తండ్రియు అగు జమదగ్ని కిచ్చెను.

మూ. న్యస్తశస్త్రే పితరి మే తపోబలసమన్వితే,

అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమాస్థితః. 23

ప్ర. అ. తపోబలసమన్వితే = తపోబలముతో కూడిన, మే = నాయొక్క, పితరి = తండ్రి, న్యస్తశస్త్రే = విడువబడిన ఆయుధములు కలవాడై యుండగా, అర్జునః = కార్తవీర్యార్జునుడు, ప్రాకృతామ్ = ప్రాకృత మైన, బుద్ధిమ్ = బుద్ధిని, ఆస్థితః = అవలంబించినవాడై, మృత్యుమ్ = మరణమును, విదధే = చేసెను.

తా. తపోబలసమన్వితు డగు నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి ఉన్నపుడు కార్తవీర్యార్జునుడు పామరబుద్ధికలవాడై ఆతనిని చంపెను.

మూ. వధమప్రతిరూపం తు పితుః శ్రుత్వా సుదారుణమ్,

క్షత్రముత్సాదయన్రోషాజ్జాతం జాతమనేకశః, 24

పృథివీం చాఖిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే,

యజ్ఞస్యాన్తే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణే, 25

దత్వా మహేన్ద్రనిలయస్తపోబలసమన్వితః.

ప్ర. అ. రామ = రామా! అప్రతిరూపమ్ = సాటి లేనిదియు, సుదారుణమ్ = చాల దారుణ మైనదియు అగు, పితుః = తండ్రియొక్క, వధమ్ = వధను, శ్రుత్వా = విని, రోషాత్ = కోపమువలన, జాతం జాతమ్ = పుట్టినవానినిపుట్టినట్లుగనే, క్షత్రమ్ = క్షత్రియజాతివానిని, అనేకశః = అనేకవిధములుగ, ఉత్సాదయన్ = నశింపచేయుచున్నవాడనై, అఖిలామ్ = సమస్త మైన, పృథివీమ్ = భూమిని, ప్రాప్య = పొంది, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, అన్తే = అంతమునందు, మహాత్మనే = మహాత్ముడును, పుణ్యకర్మణే = పుణ్యమైన కర్మ గలవాడును అగు, కాశ్యపాయ = కాశ్యపునకు, దత్వా = ఇచ్చి, తపోబలసమన్వితః = తపోబలముతో కూడినవాడనై, మహేన్ద్రనిలయః = మహేంద్రపర్వతమే నివాసముగ కలవాడనైతిని.

తా. చాల దారుణము, క్రౌర్యమున సాటి లేనిదియు అగు నా తండ్రి వధను గూర్చి విన్న నేను రోషముతో అనేకపర్యాయములు క్షత్రియజాతికి చెందిన ప్రతి ఒక్కనిని, పుట్టినవానిని పుట్టినట్లుగనే సంహరించితిని. ఈ భూమి నంతను జయించి, యజ్ఞాంతమునందు మహాత్ముడును, పుణ్యకర్మ కలవాడును అగు కాశ్యపునకు దానము చేసితిని. పిదప తపోబలసమన్వితుడనై, మహేంద్ర పర్వతముపై నివసించుచున్నాను.

మూ. అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల,

శ్రుతవాన్ ధనుషో భేదం తతోఽహం ద్రుతమాగతః. 26

ప్ర. అ. మహాబల = గొప్ప బలము గల, రామ = రామా!, అద్య = ఇపుడు, ఉత్తమవీర్యేణ = గొప్ప పరాక్రమము గల, త్వయా = నీచేత, ధనుషః = ధనుస్సుయొక్క, భేదమ్ = భంగమును, శ్రుతవాన్ = విన్నవాడనై, అహమ్ = నేను, తతః = ఆ కారణమువలన, ద్రుతమ్ = శీఘ్రముగా, అగతః = వచ్చితిని.

తా. మహాబలుడ వగు రామా! ఉత్తమ మైన పరాక్రమము గల నీవు ఇపుడు ధనుస్సు విరచితివి వని శీఘ్రముగా వచ్చినాను.

మూ. తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్,

క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమమ్. 27

ప్ర. అ. రామ = రామా! క్షత్రధర్మమ్ = క్షత్రియధర్మమును, పురస్కత్య = పురస్కరించుకొని, తత్ = ఆ, ఇదమ్ = ఈ, పితృపైతామహమ్ = పితృపితామహక్రమమున వచ్చుచున్న, మహత్ = గొప్ప దైన, ఉత్తమమ్ = శ్రేష్ఠ మైన, వైష్ణవమ్ = విష్ణుసంబంధ మైన, ధనుః = ధనుస్సును, గృహ్ణీష్వ = గ్రహింపుము.

తా. రామా! క్షత్రియధర్మమును మన్నించి, మా పితృపితామహక్రమమున లభించిన దియు, శ్రేష్ఠ మైనదియు అగు అట్టి ఈ విష్ణుధనుస్సును గ్రహింపుము.

మూ. యోజయస్వ ధనుఃశ్రేష్ఠే శరం పరపురఞ్జయమ్,

యది శక్నోషి కాకుత్థ్స ద్వన్ద్వం దాస్యామి తే తతః. 28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చసప్తతితమః సర్గః

ప్ర. అ. కాకుత్థ్స = రామా! ధనుఃశ్రేష్ఠే = శ్రేష్ఠ మైన ఈ ధనుస్సుపై, పరపురఞ్జయమ్ = శత్రుపురములను జయించు, శరమ్ = బాణమును, యోజయస్వ = కూర్చుము. శక్నోషి యది = అట్లు చేయ సమర్థుడ వైనచో, తతః = పిమ్మట, తే = నీకు, ద్వన్ద్వమ్ = ద్వంద్వ యుద్ధమును, దాస్యామి = ఇవ్వగలను.

తా. రామా! శ్రేష్ఠ మైన ఈ ధనుస్సు మీద శత్రువుల పురములను జయించు ఈ శరమును సంధించుము. నీ వట్లు చేయ గలిగినచో నీతో ద్వంద్వయుద్ధము చేయగలను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బదిఐదవ సర్గ సమాప్తము.