Chapter_76

Back
Book Balakandamu
Chapter No 82
Pages 6
Read Time 10 Minutes

Chapter_76

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షట్సప్తతితమః సర్గః

శ్రీరాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టి, అమోఘ మైన బాణముతో పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకొనిన పుణ్యలోకములను కొట్టివేయుట. పరశురాముడు తిరిగి మహేంద్రపర్వతము చేరుట.

మూ. శ్రుత్వా తజ్జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా,

గౌరవాద్యన్త్రితకథః పితూ రామమథాబ్రవీత్. 1

ప్ర. అ. తదా = అప్పుడు, దాశరథిః = రాముడు, జామదగ్న్యస్య = పరశురామునియొక్క, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, పితుః = తండ్రియొక్క, గౌరవాత్ = గౌరవమువలన, యన్త్రితకథః = తగ్గింపబడిన సంభాషణము కలవాడై, అథ = పిమ్మట, రామమ్ = పరశురాముని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. అపుడు రాముడు పరశురాముని మాటలు విని, తండ్రి దగ్గర నుండుటచే ఆయనపై నున్న గౌరవభావముచే, అధికముగ మాటలాడక ఇట్లనెను.

మూ. శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ,

అనురున్ధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్. 2

ప్ర. అ. భార్గవ = ఓ పరశురామా!, యత్ = ఏ, కర్మ = కర్మను, కృతవాన్ అసి = చేసితివో, దానిని, శ్రుతవాన్ అస్మి = విని యుంటిని. బ్రహ్మన్ = బ్రాహ్మణా!, పితుః = తండ్రికి, ఆనృణ్యమ్ = ఋణము తీర్చివేయుటను, ఆస్థితమ్ = పొందిన నిన్ను, అనురున్ధ్యామహే = మెచ్చుకొనుచున్నాము.

తా. పరశురామా! నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మమును నిర్వహించి ఆనృణ్యమును పొందిన నిన్ను అభినందించు చున్నాము.

మూ. వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ,

అవజానాసి మే తేజః పశ్య మేఽద్య పరాక్రమమ్. 3

ప్ర. అ. భార్గవ = పరశురామా! వీర్యహీనమివ = పరాక్రమము లేనివానిని వలెను, క్షత్రధర్మేణ = క్షత్రియధర్మముచేత, అశక్తమివ = సామర్థ్యము లేనివానిని వలె, అవజానాసి = నన్ను అవమానము చేయుచున్నావు. అద్య = ఇప్పుడు, మే = నాయొక్క, తేజః = తేజస్సును, పరాక్రమమ్ = పరాక్రమమును, పశ్య = చూడుము.

తా. పరశురామా! నన్ను, పరాక్రమము లేనివానిని వలె, క్షత్రియధర్మానుసారము ప్రవర్తింప సామర్థ్యము లేనివానిని వలె, అవమానించుచున్నావు. ఇపుడు నా తేజస్సును, పరాక్రమమును చూడుము.

మూ. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్,

శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః. 4

ప్ర. అ. లఘుపరాక్రమః = శీఘ్ర మైన పరాక్రమము గల, రాఘవః = రాముడు, క్రుద్ధః = కోపించినవాడై, ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, భార్గవస్య = పరశురామునియొక్క, హస్తాత్ = హస్తమునుండి, శరాసనమ్ = ధనుస్సును, శరం చ = బాణమును, ప్రతిజగ్రాహ = తీసికొనెను.

తా. శీఘ్ర మైన పరాక్రమము గల రాముడు కోపముతో ఇట్లు పలికి పరశురాముని చేతిలోనుండి ధనుస్సును, బాణమును తీసికొనెను.

మూ. ఆరోప్య స ధనూ రామశ్శరం సజ్యం చకార హ,

జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధోఽబ్రవీద్వచః. 5

ప్ర. అ. సః = ఆ, రామః = రాముడు, ధనుః = ధనుస్సును, ఆరోప్య = ఎక్కుపెట్టి, శరమ్ = బాణమును, సజ్యమ్ = నారితో కూడినదానినిగా, చకార = చేసెను. రామః = రాముడు, తతః = పిమ్మట, క్రుద్ధః = కోపించినవాడై, జామదగ్న్యమ్ = జమదగ్నికుమారుడైన, రామమ్ = రాముని గూర్చి, వచః = వాక్యమును అబ్రవీత్ = పలికెను.

తా. రాముడు ధనుస్సును ఎక్కు పెట్టి నారిపై బాణము సంధించి, క్రుద్ధుడై పరశురామునితో ఇట్లనెను.

మూ. బ్రాహ్మణోఽసీతి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ,

తస్మాచ్ఛక్తో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్. 6

ప్ర. అ. రామ = పరశురామా!, బ్రాహ్మణః = బ్రాహ్మణుడవు, అసి = అయి ఉన్నావు, ఇతి = ఈ కారణమువలనను, విశ్వామిత్రకృతేన చ = విశ్వామిత్రుని బట్టియు, మే = నాకు, పూజ్యః = పూజింపదగినవాడవు. తస్మాత్ = ఆ కారణమువలన, తే = నీయొక్క, ప్రాణహరమ్ = ప్రాణములను హరించు, శరమ్ = బాణమును, మోక్తుమ్ = విడచుటకు, న శక్తః = సమర్థుడను కాను.

తా. పరశురామా! నీవు బ్రాహ్మణుడ వగుటచేతను, విశ్వామిత్రునికి నీవు బంధు వగుట చేతను నాకు పూజ్యుడవు. అందుచే ప్రాణములను హరించు ఈ బాణమును నీపై ప్రయోగింపజాలను.

వి. పరశురాముని తండ్రి యైన జమదగ్ని విశ్వామిత్రుని సోదరి యగు సత్యవతి కుమారుడు.

మూ. ఇమాం పాదగతిం రామ తపోబలసమార్జితాన్,

లోకానప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి. 7

ప్ర. అ. రామ = రామా!, తే = నీయొక్క, ఇమామ్ = ఈ, పాదగతిమ్ = పాదగమనమును గాని, తపోబలసమార్జితాన్ = తపోబలముచే సంపాదింపబడిన, అప్రతిమాన్ = సాటి లేని, లోకాన్ వా = లోకములను గాని, హనిష్యామి = కొట్టెదను. యత్ = దేనిని, ఇచ్ఛసి = కోరుచున్నావో అది చెప్పుము.

తా. రామా! నీ పాదగమనశక్తిని గాని, తపోబలముచే నీవు సంపాదించిన సాటి లేని ఉత్తమలోకములను గాని, కొట్టివేసెదను. ఏది ఇష్టమో చెప్పుము.

మూ. న హ్యయం వైష్ణవో దివ్యః శరః పరపురఞ్జయః,

మోఘః పతతి వీర్యేణ బలదర్పవినాశనః. 8

ప్ర. అ. పరపురఞ్జయః = శత్రువుల పురమును జయించునదియు, వీర్యేణ = పరాక్రమముచేత, బలదర్పవినాశనః = బలదర్పములను నశింపచేయునదియు, దివ్యః = స్వర్గమునందు పుట్టినదియు అగు, అయమ్ = ఈ, వైష్ణవః శరః = విష్ణువుయొక్క బాణము, మోఘః = వ్యర్థ మైనదై, న పతతి హి = పడదు కదా.

తా. స్వర్గములో పుట్టినదియు, శత్రుపురములను జయించునదియు, వీర్యముచే బలమును దర్పమును నశింపచేయునదియు అగు ఈ విష్ణుబాణము వ్యర్థ మగుటకు వీలు లేదు.

మూ. వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః,

పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘశః. 9

గన్ధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణకిన్నరాః,

యక్షరాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్. 10

ప్ర. అ. వరాయుధధరమ్ = శ్రేష్ఠమైన ఆ వైష్ణవధనుస్సును ధరించిన, రామమ్ = రాముని, ద్రష్టుమ్ = చూచుటకై, సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, సురాః = దేవతలు, పితామహమ్ = బ్రహ్మదేవుని, పురస్కృత్య = ఎదుట ఉంచుకొని, తత్ర = అచట, సంఘశః = గుంపులు గుంపులుగా, సమేతాః = కూడిరి. గన్దర్వాప్సరసశ్చైవ = గంధర్వులును, అప్సరసలును, సిద్ధచారణకిన్నరాః = సిద్ధులు, చారణులు, కిన్నరులును, యక్షరాక్షసనాగాశ్చ = యక్షులు, రాక్షసులు, నాగులును, తత్ = ఆ, మహత్ = గొప్ప, అద్భుతమ్ = ఆశ్చర్యమును, ద్రష్టుమ్ = చూచుటకు, వచ్చిరి.

తా. శ్రేష్ఠ మైన విష్ణుధనుస్సును ధరించి రాముని చూచుటకై బ్రహ్మాది దేవతలును, ఋషులును గుంపులు గుంపులుగా అచటికి వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు కూడ ఆ అద్భుతమును చూచుటకై వచ్చిరి.

మూ. జడీకృతే తదా లోకే రామే వరధనుర్ధరే,

నిర్వీర్యో జామదగ్న్యోఽసౌ రామో రామముదీక్షత. 11

ప్ర. అ. తదా = అప్పుడు, రామే = రాముడు, వరధనుర్ధరే = శ్రేష్ఠ మైన ధనుస్సును ధరించినవా డగుచుండగా, లోకే = లోకము, జడీకృతే = జడముగ చేయబడిన దగుచుండగా, అసౌ = ఈ, జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన, రామః = పరశురాముడు, నిర్వీర్యః = తొలగిన శక్తి గలవాడై, రామమ్ = రాముని, ఉదైక్షత = చూచెను.

తా. రాముడు ఆ శ్రేష్ఠ మైన ధనుస్సును ఎక్కుపెట్టగానే పరశురాముడు నిర్వీర్యు డయ్యెను. లోక మంతయు స్తంభించిపోయెను. అపు డా పరశురాముడు రాముని సాశ్చర్యముగ చూచెను.

మూ. తేజోభిహతవీర్యత్వాజ్జామదగ్న్యో జడీకృతః,

రామం కమలపత్రాక్షం మన్దం మన్దమువాచ హ. 12

ప్ర. అ. తేజోభిహతవీర్యత్వాత్ = రాముని తేజస్సుచే అణచివేయబడిన పరాక్రమము కలవాడగుటచే, జడీకృతః = జడుడుగా చేయబడిన, జామదగ్న్యః = పరశురాముడు, కమలపత్రాక్షమ్ = కమలపత్రములంటి నేత్రములు గల, రామమ్ = రాముని గూర్చి, మన్దం మన్దమ్ = మెల్లమెల్లగా, ఉవాచ హ = పలికెను.

తా. రాముని తేజస్సుచే పరాక్రమము అణగి పోయి జడు డైన పరశురాముడు పద్మ పత్రాక్షు డైన రామునితో మెల్లమెల్లగా ఇట్లు పలికెను.

మూ. కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసున్ధరా,

విషయే మే న వస్తవ్యమితి మాం కాశ్యపోఽబ్రవీత్. 13

ప్ర. అ. పూర్వమ్ = పూర్వము, వసున్ధరా = భూమి, యదా = ఎప్పుడు, మయా = నాచేత, కాశ్యపాయ = కాశ్యపునకు, దత్తా = ఇవ్వబడినదో, అప్పుడు, మే = నాయొక్క, విషయే = దేశమునందు, న వన్తవ్యమ్ = నివసించకూడదు. ఇతి = అని, మామ్ = నన్ను గూర్చి, కాశ్యపః = కాశ్యపుడు, అబ్రవీత్ = పలికెను.

తా. నేను పూర్వ మీ భూమి నంతను కాశ్యపున కిచ్చినపుడు - ‘‘నీవు నా దేశములో నివసింపగూడదు’’ అని కాశ్యపుడు నన్నాదేశించెను.

మూ. సోఽహం గురువచః కుర్వన్ పృథివ్యాం న వసే నిశామ్,

కృతా ప్రతిజ్ఞా కాకుత్థ్స కృతా భూః కాశ్యపస్య హి. 14

ప్ర. అ. సః = అట్టి, అహమ్ = నేను, గురువచః = నా గురు వైన కాశ్యపుని వచనమును, కుర్వన్ = చేయుచు, పృథివ్యామ్ = భూమియందు, నిశామ్ = రాత్రి, నవసే = వసించను, కాకుత్థ్స = రామా! ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ, కృతా = చేయబడినది. భూః = ఈ భూమి యంతయు, కాశ్యపస్య = కాశ్యపునిదిగా, కృతా హి = చేయబడినది కదా ?

తా. రామా! ఈ భూమిని కాశ్యపునకు దానము చేసి, ఆయన కోరిన విధమున ఇచట నివసించ నని ప్రతిజ్ఞచేసితిని. గురు వైన ఆ కాశ్యపుని మాట ననుసరించి నేను రాత్రి ఈ భూమిపై నివసించను.

మూ. తదిమాం త్వం గతిం వీర హన్తుం నార్హసి రాఘవ,

మనోజవం గమిష్యామి మహేన్ద్రం పర్వతోత్తమమ్. 15

ప్ర. అ. వీర = వీరుడ వైన, రాఘవ = రామా!, తత్ = ఆ కారణమువలన, త్వమ్ = నీవు, ఇమామ్ = ఈ, గతిమ్ = నడచు శక్తిని, హన్తుమ్ = కొట్టుటకు, నార్హసి = తగవు, మనోజవమ్ = మనోవేగముతో కూడినట్లుగా, మహేన్ద్రమ్ = మహేంద్రమనెడు, పర్వతోత్తమమ్ = పర్వత శ్రేష్ఠమును గూర్చి, గమిష్యామి = వెళ్లగలను.

తా. కావున, పరాక్రమశాలి వగు ఓ రామా! నీవు నా గమనశక్తిని కొట్టవద్దు, మనోవేగముతో మహేంద్రపర్వతమునకు వెళ్లిపోయెదను.

మూ. లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా,

జహి తాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః. 16

ప్ర. అ. రామ = రామా! మయా = నాచేత, అప్రతిమాః = సాటి లేని, లోకాః = లోకములు, తపసా = తపస్సుచేత, నిర్జితాః = జయింపబడినవి. తాన్ = వాటిని, శరముఖ్యేన = ప్రధాన మైన బాణముచేత, జహి = కొట్టుము. కాలస్య = కాలముయొక్క, పర్యయః = కడచిపోవుట, మాభూత్ = కాకుండుగాక.

తా. రామా! నేను తపస్సుచేత జయించిన ఉత్తమలోకములను ఈ బాణముచే కొట్టుము. కాలవిలంబము చేయవద్దు.

మూ. అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్,

ధనుషోఽస్య పరామర్శాత్స్వస్తి తేఽస్తు పరంతప. 17

ప్ర. అ. అస్య = ఈ, ధనుషః = ధనుస్సుయొక్క, పరామర్శాత్ = ఆరోపించుటవలన, త్వామ్ = నిన్ను, అక్షయ్యమ్ = నశింపచేయ శక్యముకాని వాడును, సురేశ్వరమ్ = దేవతలకు అధిపతియు అగు, మధుహన్తారమ్ = మధువును సంహరించిన విష్ణువునుగా, జానామి = తెలిసికొనుచున్నాను, పరంతప = శత్రువులను పీడించువాడా! తే = నీకు, స్వస్తి = క్షేమము, అస్తు = అగుగాక.

తా. ఈ ధనుస్సును ఎక్కుపెట్టుటవలన, నీవు సురేశ్వరుడును, నాశరహితుడును, మధుసంహారియు అగు మహావిష్ణువే అని గ్రహించినాను. ఓ శత్రువినాశకా! నీకు క్షేమ మగుగాక.

మూ. ఏతే సురగణాః సర్వే నిరీక్షన్తే సమాగతాః,

త్వామప్రతిమకర్మాణమప్రతిద్వన్ద్వమాహవే. 18

ప్ర. అ. సమాగతాః = వచ్చిన, ఏతే = ఈ, సర్వే = సమస్తమైన, సురగణాః = సురగణములు, అప్రతిమకర్మాణమ్ = సాటిలేని కర్మ కలవాడవును, ఆహవే = యుద్ధమునందు, అప్రతిద్వన్ద్వమ్ = ఎదురు లేనివాడవును అగు, త్వామ్ = నిన్ను, నిరీక్షన్తే = చూచుచున్నారు.

తా. నీవు చేయు పనులు సాటి లేనివి. యుద్ధములో నిన్ను ఎదిరించువాడు ఎవ్వడును లేడు. అట్టి నిన్ను దేవత లందరును వచ్చి చూచుచున్నారు.

మూ. న చేయం మమ కాకుత్స్థ వ్రీళా భవితుమర్హతి,

త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః. 19

ప్ర. అ. కాకుత్థ్స = రామా!, త్రైలోక్యనాథేన = మూడు లోకములకును ప్రభువైన, త్వయా = నీచేత, అహమ్ = నేను, యత్ = ఎందువలన, విముఖీకృతః = పరాజితుడనైతినో, అందువలన, ఇయమ్ = ఇది, మే = నాకు, వ్రీళా = సిగ్గు, భవితుమ్ = అగుటకు, న అర్హతి = తగదు.

తా. రామా! నేను ముల్లోకములకును, ప్రభు వైన నీ చేతిలో పరాజితుడ నైనాను. అందుచే నాకు సిగ్గు పడవలసిన పని లేదు.

మూ. శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత,

శరమోక్షే గమిష్యామి మహేన్ద్రం పర్వతోత్తమమ్. 20

ప్ర. అ. సువ్రత = మంచి వ్రతము గలవాడా!, రామ = రామా! అప్రతిమమ్ = సాటి లేని, శరమ్ = బాణమును, మోక్తుమ్ = విడచుటకు, అర్హసి = తగియున్నావు. శరమోక్షే = బాణము విడచిన పిమ్మట, పర్వతోత్తమమ్ = పర్వతశ్రేష్ఠమైన, మహేన్ర్దమ్ = మహేంద్ర పర్వతమును గూర్చి, గమిష్యామి = వెళ్లగలను.

తా. ఉత్తమ మైన నియమము గల రామా! నీవు బాణమును ప్రయోగింపుము. బాణమును ప్రయోగించిన పిమ్మట నేను మహేంద్రగిరికి వెళ్లెదను.

మూ. తథా బ్రువతి రామే తు జామదగ్న్యే ప్రతాపవాన్,

రామో దాశరథిః శ్రీమాన్ చిక్షేప శరముత్తమమ్. 21

ప్ర. అ. జామదగ్న్యే = జమదగ్నికుమారు డైన, రామే = రాముడు, తథా = అట్లు, బ్రువతి = మాటలాడుచుండగా, ప్రతాపవాన్ = ప్రతాపవంతు డైన, దాశరథిః = దశరథ కుమారు డైన, రామః = రాముడు, ఉత్తమమ్ = ఉత్తమ మైన, శరమ్ = బాణమును, చిక్షేప = ప్రయోగించెను.

తా. పరశురాముని మాటలు విని ప్రతాపవంతు డైన దశరథరాముడు బాణమును ప్రయోగించెను.

మూ. స హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపసార్జితాన్,

జామదగ్న్యో జగామాశు మహేన్ద్రం పర్వతోత్తమమ్. 22

ప్ర. అ. సః = ఆ, జామదగ్న్యః = పరశురాముడు, తపసా = తపస్సుచే, ఆర్జితాన్ = సంపాదింపబడిన, స్వాన్ = తన సంబంధ మైన, లోకాన్ = పుణ్యలోకములను, రామేణ = రామునిచేత, హతాన్ = కొట్టబడిన వాటినిగా, దృశ్య = చూచి, ఆశు = శీఘ్రముగా, పర్వతోత్తమమ్ = పర్వతశ్రేష్ఠ మైన, మహేన్ద్రమ్ = మహేంద్రపర్వతమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. తాను తపస్సుచే సంపాదించిన పుణ్యలోకములను రాముడు కొట్టగా జూచి, పరశురాముడు శీఘ్రముగ మహేంద్రపర్వతమునకు పోయెను.

మూ. తతో వితిమిరాః సర్వా దిశశ్చోపదిశస్తథా,

సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్. 23

ప్ర. అ. తతః = పిమ్మట, సర్వాః = సమస్త మైన, దిశః = దిక్కులును, తథా = మరియు, ఉపదిశః = విదిక్కులును, వితిమిరాః = చీకటి లేనివి అయినవి. సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, సురాః = దేవతలు, ఉదాయుధమ్ = ఎత్తబడిన ఆయుధము గల, రామమ్ = రాముని, ప్రశశంసుః = ప్రశంసించిరి.

తా. అపుడు, దిక్కులును, విదిక్కులును చీకటి తొలగి ప్రకాశించినవి. ఆయుధము ధరించిన ఆ రాముని దేవతలును ఋషులును స్తుతించిరి.

మూ. రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ,

తతః ప్రదక్షిణీకృత్య జగామాత్మగతిం విభుః. 24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్సప్తతితమః సర్గః

ప్ర. అ. ప్రభుః = సమర్థు డైన, జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన, రామః = పరశురాముడు, దాశరథిమ్ = దశరథకుమారు డైన, రామమ్ = రాముని, ప్రశస్య చ = ప్రశంసించి, తతః = పిమ్మట, ప్రదక్షిణీకృత్య = ప్రదక్షిణము చేసి, ఆత్మగతిమ్ = తన మార్గమును, జగామ = పొందెను.

తా. సమర్థు డగు ఆ పరశురాముడు దశరథరాముని స్తుతించి, ప్రదక్షిణము చేసి తన దారిని తాను పోయెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బదిఆరవ సర్గ సమాప్తము.