| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 83 |
| Pages | 9 |
| Read Time | 13 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తసప్తతితమః సర్గః
భార్యాసమేతు లైన పుత్రులతో దశరథుడు అయోధ్యలో ప్రవేశించుట. శత్రుఘ్న సమేతుడై భరతుడు మేనమామ యింటికి వెళ్లుట. శ్రీరాముని సద్గుణములు చూచి ప్రజ లెల్లరు సంతోషించుట. సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము.
మూ. గతే రామే ప్రశాన్తాత్మా రామో దాశరథిర్ధనుః,
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే సపాయకమ్. 1
ప్ర. అ. రామే = రాముడు, గతే = వెళ్లినవా డగుచుండగా, ప్రశాన్తాత్మా = కోపము తొలగుటచే శాంత మైన చిత్తము కలవాడై, దాశరథిః = దశరథకుమారు డైన, రామః = రాముడు, ససాయకమ్ = బాణములతోకూడిన, ధనుః = ధనుస్సును, అప్రమేయాయ = కొలవశక్యము కాని వాడగు, వరుణాయ = వరుణునకు, హస్తే = హస్తమునందు, దదౌ = ఇచ్చెను.
తా. పరశురాముడు వెళ్లిన పిమ్మట రాముడు ఆ ధనుస్సును, బాణమును, అప్రమేయప్రభావశాలి యగు వరుణునకు ఇచ్చివేసెను.
మూ. అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖాన్ ఋషీన్,
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునన్దనః. 2
ప్ర. అ. తతః = పిమ్మట, రఘునన్దనః = రఘువంశీయులను ఆనందింపచేయు, రామః = రాముడు, వసిష్ఠప్రముఖాన్ = వసిష్ఠుడు మొదలైన, ఋషీన్ = ఋషులను, అభివాద్య = నమస్కరించి, విహ్వలమ్ = వ్యాకులు డైన, పితరమ్ = తండ్రిని, దృష్ట్వా = చూచి, ప్రోవాచ = పలికెను.
తా. పిమ్మట రాముడు, వసిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి, వ్యాకులుడై యున్న తండ్రిని జూచి ఇట్లనెను.
మూ. జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురఙ్గిణీ,
అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పాలితా. 3
ప్ర. అ. జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన, రామః = రాముడు, గతః = వెళ్లినాడు. నాథేన = ప్రభువైన, త్వయా = నీచేత, పాలితా = పాలింపబడిన, చతురఙ్గిణీ = చతురంగములు గల, సేనా = సేన, అయోధ్యాభిముఖీ = అయోధ్యకు అభిముఖమైనదై, ప్రయాతు = వెళ్లుగాక.
తా. పరశురాముడు వెళ్లిపోయినాడు. నీ సంరక్షణలో నున్న చతురంగ బలము అయోధ్యాభిముఖముగ పయనించుగాక.
మూ. సన్దిశస్వ మహారాజ సేనాం త్వచ్ఛాసనే స్థితామ్,
శాసనం కాఙ్క్షతే సేనా చాతకాళిర్జలం యథా. 4
ప్ర. అ. మహారాజ = మహారాజా!, త్వచ్ఛాసనే = నీ ఆజ్ఞయందు, స్థితామ్ = ఉన్న, సేనామ్ = సేనను, సన్దిశస్వ = ఆజ్ఞాపింపుము. చాతకాళిః = చాతకముల పంక్తి, జలం యథా = జలమును వలె, సేనా = సేన, శాసనమ్ = నీ ఆజ్ఞను, కాఙ్క్షతే = కోరుచున్నది.
తా. మహారాజా! నీ ఆజ్ఞ ననుసరించు సైన్యమును ఆజ్ఞాపింపుము. చాతకముల పంక్తి జలమును కోరి నట్లు సేన నీ శాసనమును కోరుచున్నది.
మూ. రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతమ్,
బాహుభ్యాం సంపరిష్యజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్. 5
గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ. 6
ప్ర. అ. రాజా = రాజైన, దశరథః = దశరథుడు, రామస్య = రామునియొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సుతమ్ = కుమారు డైన, రాఘవమ్ = రాముని, బాహుభ్యామ్ = బాహువులచేత, సంపరిష్యజ్వ = కౌగలించుకొని, మూర్ధ్ని = తలపై, ఆఘ్రాయ చ = వాసనచూచి (ఆనందించెను). రామః = రాముడు, గతః ఇతి = వెళ్లెను అని, శ్రుత్వా = విని, హృష్టః = హర్షించినవాడై, ప్రముదితః = చాల ఆనందించినవాడై, నృపః = రాజు, తదా = అప్పుడు, పుత్రమ్ = పుత్రుని, ఆత్మానమేవ చ = తనను, పునః = మరల, జాతమ్ = పుట్టినవానినిగా, మేనే = తలచెను.
తా. దశరథమహారాజు రాముని వచనము విని ఆతనిని బాహువులతో కౌగలించుకొని, శిరస్సుపై మూర్కొనెను. పరశురాముడు వెళ్లిపోయె నని విన్న రాజు ఆనందభరితుడై తనను, తన కుమారులను కూడ మరల పుట్టినట్లుగా భావించెను.
మూ. చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్,
పతాకాధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్టనినాదితామ్. 7
సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్,
రాజప్రవేశసుముఖైః పౌరైర్మఙ్గలవాదిభిః, 8
సమ్పూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైస్సమలఙ్కృతామ్.
ప్ర. అ. రాజా = దశరథుడు, తామ్ = ఆ, సేనామ్ = సేనను, చోదయామాస = ప్రేరేపించెను. పతాకాధ్వజినీమ్ = చిన్నవి పెద్దవి అయిన జండాలు కలదియు, రమ్యామ్ = సుందర మైనదియు, తూర్యోద్ఘుష్టనినాదితామ్ = తూర్యముల మ్రోతచే ప్రతిధ్వనించినదియు, సిక్తరాజపథామ్ = తడపబడిన రాజమార్గములు కలదియు, ప్రకీర్ణకు సుమోత్కరామ్ = చిమ్మబడిన పుష్పసముదాయము గలదియు, రాజప్రవేశ సుముఖైః = రాజుయొక్క ప్రవేశముచే సంతసించిన, మఙ్గలవాదిభిః = మంగళధ్వనులు చేయుచున్న, పౌరైః = పౌరులతో, సంపూర్ణామ్ = నిండినదియు, జనౌఘైః = జనులసముదాయములచే, సమలంకృతామ్ = అలంకరింపబడిన, పురీమ్ = అయోధ్యాపురిని, ఆశు = శీఘ్రముగా, జగామ = వెళ్లెను.
తా. పిదప దశరథుడు సైన్యమును ముందుగా నడచుటకై ఆజ్ఞాపించెను. ప్రయాణము చేసి శీఘ్రముగా అయోధ్యాపురి చేరెను. ఆ పట్టణము చిన్న జండాలతోడను, పెద్ద జండాలతోడను రమ్యమై తూర్యనాదములతో ప్రతిధ్వనించుచుండెను. రాజమార్గములను జలముతో తడిపి పుష్పములు చల్లి పౌరు లందరును రాజప్రవేశము చూచుటకై ఆనందముతో ఎదురుచూచుచుండిరి. మంగళవాద్యములను మ్రోగించు చుండిరి.
మూ. పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః,
పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః, 9
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః.
ప్ర. అ. పౌరైః = పౌరులచేతను, పురవాసిభిః = పురమునందు నివసించుచున్న, ద్విజైః చ = బ్రాహ్మణులచేతను, దూరమ్ = దూరమునుండి, ప్రత్యుద్గతః = ఎదుర్కొన బడినవాడును, శ్రీమద్భిః = శోభాయుక్తు లైన, పుత్రైః = పుత్రులచేత, అనుగతః = అనుసరింప బడినవాడును, శ్రీమాన్ = శోభాయుక్తుడును, మహాయశాః = గొప్ప యశస్సు కలవాడును అగు, రాజా = రాజు, పునః = మరల, హిమవత్సదృశమ్ = హిమవత్పర్వతముతో సమాన మైన, గృహమ్ = గృహమును, ప్రవివేశ = ప్రవేశించెను.
తా. శ్రీమంతుడును, మహాయశస్వియ అగు ఆ దశరథుని శ్రీమంతులగు పుత్రులు అనుసరించి వెళ్లిరి. పౌరులును, పురమునందలి బ్రాహ్మణులును దూరమునుండి ఎదురు వచ్చి స్వాగతము చెప్పిరి. ఈ విధముగ అయోధ్యానగరమును ప్రవేశించి అతడు హిమవత్పర్వతముతో సమానమైన గృహమును ప్రవేశించెను.
మూ. ననన్ద సజనో రాజా గృహే కామైః సుపూజితః, 10
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా,
వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః. 11
ప్ర. అ. రాజా = రాజు, గృహే = గృహమునందు, కామైః = భోగ్యవస్తువులచేత, సుపూజితః = బాగుగా పూజింపబడినవాడై, సజనః = కుటుంబబంధుజనులతో కూడినవాడై, ననన్ద = ఆనందించెను. కౌసల్యా చ = కౌసల్యయు, సుమిత్రా చ = సుమిత్రయు, సుమధ్యమా = మంచి నడుము గల, కైకేయీ చ = కైకేయియు, యాః = ఏ, అన్యాః = ఇతరు లైన, రాజయోషితః = రాజస్త్రీలు గలరో వారును, వధూప్రతిగ్రహే = కోడండ్రను గ్రహించుటయందు, యుక్తాః = వ్యగ్రలై, (ననన్దుః = సంతసించిరి).
తా. బాంధవజనులతో కూడిన దశరథమహారాజు సకలభోగ్యవస్తువులచేతను పూజితుడై ఆనందించెను. కౌసల్యా-సుమిత్రా-కైకేయిలును, తదితర రాజస్త్రీలును క్రొత్త కోడండ్రను ప్రతిగ్రహించుటలో వ్యగ్రలై ఆనందించిరి.
మూ. తతస్సీతాం మహాభాగామూర్మిళాం చ యశస్వినీమ్,
కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః. 12
ప్ర. అ. తతః = పిమ్మట, నృపపత్నయః = రాజభార్యలు, మహాభాగామ్ = గొప్ప భాగ్యము గల, సీతామ్ = సీతను, యశస్వినీమ్ = కీర్తి గల, ఊర్మిళాం చ = ఊర్మిళను, ఉభే = ఇద్దరు, కుశధ్వజసుతే = కుశధ్వజుని కుమార్తెలను, జగృహుః = గ్రహించిరి.
తా. అంత రాజభార్యలు మహాభాగ్యవతి యగు సీతను, కీర్తిమంతురాలగు ఊర్మిళను, మాండవీశ్రుతకీర్తులను గ్రహించిరి.
మూ. మఙ్గళాలమ్భనైశ్చాపి శోభితాః క్షౌమవాససః,
దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్. 13
ప్ర. అ. తాః = ఆ, సర్వాః = అందరును, మఙ్గలాలమ్భనైశ్చాపి = మంగళకరము లైన శరీరమునకు పూసికొను ద్రవ్యములచేత, శోభితాః = ప్రకాశింపచేయ బడినవారై, క్షౌమవాససః = పట్టువస్త్రములు ధరించినవారై, ఆశు = శీఘ్రముగా, దేవతాయతనాని = దేవాలయములను, ప్రత్యపూజయన్ = పూజించిరి.
తా. ఆ నూతనవధువు లందరును మంగళకరము లగు వస్తువులను అలదికొని, పట్టు బట్టలు ధరించి గృహదేవతలను పూజించిరి.
మూ. ఆభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా,
స్వం స్వం గృహమథాసాద్య కుబేరభవనోపమమ్, 14
గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్,
రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః. 15
ప్ర. అ. తదా = అప్పుడు, సర్వాః = సమస్త మైన, రాజసుతాః = రాజపుత్రికలు, అభివాద్యాన్ = నమస్కరింపదగిన వారిని, అభివాద్య = నమస్కరించి, అథ = పిదప, కుబేరభవనోపమమ్ = కుబేరభవనముతో సమానమైన, స్వం స్వమ్ = తమ తమ, గృహమ్ = గృహమును, ఆసాద్య = పొంది, గోభిః = గోవులచేతను, ధనైశ్చ = ధనములచేతను, ధాన్యైశ్చ = ధాన్యములచేతను, ద్విజోత్తమాన్ = బ్రాహ్మణశ్రేష్ఠులను, అర్చయిత్వా = పూజించి, రహః = రహస్యమునందు, భర్తృభిః = భర్తలతో, సహితాః = కూడినవారై, ముదితాః = ఆనందించినవారై, రేమిరే = క్రీడించిరి.
తా. అపుడు, ఆ రాజపుత్రికలు నమస్కరింపదగిన పెద్ద లందరికిని నమస్కరించి, కుబేర భవనముతో సమాన మైన తమ తమ గృహమును పొంది, గోవులను, ధనధాన్యములను దానము చేసి బ్రాహ్మణోత్తములను సంతృప్తిపరచి, రహస్యమున భర్తలతో కలసి ఆనందముతో క్రీడించిరి.
మూ. కుమారాశ్చ మహాత్మానో వీర్యేణాప్రతిమా భువి,
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః, 16
శుశ్రూషమాణాః పితరం వర్తయన్తి నరర్షభాః.
ప్ర. అ. మహాత్మానః = మహాత్ములును, వీర్యేణ = పరాక్రమముచేత, భువి = భూమియందు, అప్రతిమాః = సాటి లేనివారును, కృతదారాః = వివాహము చేసి కొన్నవారును, కృతాస్త్రాశ్చ = అస్త్రములందు నేర్పుగలవారును, సధనాః = ధనముతో కూడినవారును, ససుహృజ్జనాః = స్నేహితులతో కూడినవారును, నరర్షభాః = మనుష్యులలో శ్రేష్ఠులును అగు, కుమారాః = కుమారులు, పితరమ్ = తండ్రిని, శుశ్రూషమాణాః = శుశ్రూషచేయుచు, వర్తయన్తి = అనుసరించు చుండిరి.
తా. మహాత్ములును, పరాక్రమముచే భూలోకమున సాటి లేనివారును, అస్త్రములందు సమర్థులును, ధనము, మిత్రులు మొదలగు వాటితో కూడినవారును, నరశ్రేష్ఠులును అగు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు వివాహము చేసికొని తండ్రికి శుశ్రూష చేయు అతని ఆజ్ఞను పాటించుచు ఉండిరి.
మూ. కస్య చిత్త్వథ కాలస్య రాజా దశరథః సుతమ్,
భరతం కైకయీపుత్రమబ్రవీద్రఘునన్దనః. 17
ప్ర. అ. అథ = పిమ్మట, కస్యచిత్కాలస్య = కొంత కాలమునకు, రఘునన్దనః = రఘువంశీయులకు ఆనందకరు డైన, రాజా = రాజైన, దశరథః = దశరథుడు, కైకయీపుత్రమ్ = కైకయీపుత్రు డైన, సుతమ్ = కుమారు డైన, భరతమ్ = భరతుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. తరువాత కొంత కాలమునకు దశరథమహారాజు కైకయూపుత్రుడైన భరతునితో ఇట్లనెను.
మూ. అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక,
త్వాం నేతుమాగతో వీరో యుధాజిన్మాతులస్తవ. 18
ప్ర. అ. పుత్రక = కుమారా!, త్వామ్ = నిన్ను, నేతుమ్ = తీసికొని వెళ్లుటకు, ఆగతః = వచ్చినవాడును, కేకయరాజస్య = కేకయదేశరాజు యొక్క, పుత్రః = పుత్రుడును, వీరః = వీరుడును, తవ = నీయొక్క, మాతులః = మేనమామయు అగు, అయమ్ = ఈ, యుధాజిత్ = యుధాజిత్తు, వసతి = ఉన్నాడు.
తా. కుమారా! కేకయరాజు పుత్రుడును, నీ మేనమామయు అగు ఈ యుధాజిత్తు, నిన్ను తీసికొని వెళ్లుటకై వచ్చి యున్నాడు.
మూ. ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా,
ఋషిమధ్యే తు తస్య త్వం ప్రీతిం కర్తుమిహార్హసి. 19
ప్ర. అ. ధర్మజ్ఞ = ధర్మము నెరిగినవాడా! అహమ్ = నేను, తేన = అతనిచేత, మిథిలాయామ్ = మిథిలలో, ఋషిమధ్యే = ఋషుల మధ్యయందు, తథా = అట్లు, ప్రార్థితః = ప్రార్థింపబడితిని. త్వమ్ = నీవు, తస్య = అతనికి, ప్రీతిమ్ = ఆనందమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగియున్నావు.
తా. ఓ ధర్మజ్ఞుడా! మిథిలలో, ఋషుల సమక్షమున అతడు నన్నా విధముగ ప్రార్థించినాడు. అతనికి ఆనందమును కలిగించుము.
మూ. శ్రుత్వా దశరథస్యైతద్భరతః కైకయీసుతః, 20
అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణమ్,
గమనాయాభిచక్రాయ శత్రుఘ్నసహితస్తదా. 21
ప్ర. అ. కైకయీసుతః = కైకయీకుమారుడైన, భరతః = భరతుడు, ధశరథస్య = దశరథుని యొక్క, ఏతత్ = ఈ వాక్యమును, శ్రుత్వా = విని, గురుమ్ = తండ్రిని, రామమ్ = రాముని, అభివాద్య = నమస్కరించి, లక్ష్మణమ్ = లక్ష్మణుని, పరిష్వజ్య చ = కౌగలించుకొని, తదా = అప్పుడు, శత్రుఘ్నసహితః = శత్రుఘ్నసమేతుడై, గమనాయ = వెళ్లుటకు, ఉపచక్రామ = ఉపక్రమించెను.
తా. భరతుడు దశరథుని మాటలు విని, తండ్రికిని, రామునకును అభివాదనము చేసి, లక్ష్మణుని కౌగలించుకొని, శత్రుఘ్నసమేతుడై ప్రయాణ మాయెను.
మూ. ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణమ్,
మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శత్రుఘ్నసహితో యయౌ. 22
ప్ర. అ. శూరః = శూరుడును, నరశ్రేష్ఠః = నరులలో శ్రేష్ఠుడును అగు భరతుడు, పితరమ్ = తండ్రిని, అక్లిష్టకారిణమ్ = శ్రమపడకుండ పనులుచేయు, రామమ్ = రాముని, మాతౄశ్చాపి = తల్లులను, ఆపృచ్ఛ్య = అడిగి, శత్రుఘ్నసహితః = శత్రుఘ్నసహితుడై, యయౌ = వెళ్లెను.
తా. శూరుడును, నరశ్రేష్ఠుడును అగు భరతుడు తండ్రివద్దను, అనాయాసముగ పనులు చేయు రాముని వద్దను, తల్లులవద్దను సెలవు గైకొని, శత్రుఘ్నసహితుడై వెళ్లెను.
మూ. గతే తు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః,
పితరం దేవసఙ్కాశం పూజయామాసతుస్తదా. 23
ప్ర. అ. తదా = అప్పుడు, భరతే = భరతుజు, గతే = వెళ్లినవాడగుచుండగా, రామః = రాముడును, మహాబలః = గొప్ప బలము గల, లక్ష్మణశ్చ = లక్ష్మణుడును, దేవసఙ్కాశమ్ = దేవతలతో సమాను డైన, పితరమ్ = తండ్రిని, పూజయామాసతుః = సేవించిరి.
తా. భరతుడు వెళ్లిన పిమ్మట, రాముడును మహాబలశాలి యగు లక్ష్మణుడును, దేవసమాను డైన తండ్రికి సేవ యొనర్చుచుండిరి.
మూ. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః,
చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ. 24
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ముడై, రామః = రాముడు, పితుః = తండ్రియొక్క, ఆజ్ఞామ్ = ఆజ్ఞను, పురస్కృత్య = పురస్కరించుకొని, ప్రియాణి = ప్రియమైనవియు, హితాని చ = సుఖమును సంపాదించునవియు అగు, పౌరకార్యాణి = పౌరులకార్యములను, సర్వశః = అన్నియు, చకార = చేసెను.
తా. ధర్మాత్ము డైన రాముడు తండ్రి యాజ్ఞ ననుసరించి, పౌరులకు ప్రియములును, లాభకరములును అగు కార్యముల నన్నింటిని చేసెను.
మూ. మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయన్త్రితః,
గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత. 25
ప్ర. అ. పరమయన్త్రితః = మిక్కిలి నియమబద్ధుడై, మాతృభ్యః = తల్లులకు, మాతృకార్యాణి = తల్లులకు చేయవలసిన కృత్యములను, కృత్వా = చేసి, గురూణామ్ = పూజ్యులైనవారికి, గురుకార్యాణి = గురువులకు చేయవలసిన కార్యములను, కాలే కాలే = ఆ యా కాలమునందు, అన్వవైక్షత = పరిశీలించు చుండెను.
తా. రాముడు నియమములను పూర్తిగ పాటించుచు, తల్లులకు చేయవలసిన కార్యములను చేయుచు, ఆయా కాలములందు పూజ్యులకు చేయవలసిన కార్యములను పర్యవేక్షించుచుండెను.
మూ. ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తథా,
రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః. 26
ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, రామస్య = రామునియొక్క, శీలవృత్తేన = శీలముచేతను, నడవడిక చేతను, దశరథః = దశరథుడు, ప్రీతః = సంతసించెను. బ్రాహ్మణాః = బ్రాహ్మణులును, తథా = మరియు, నైగమాః = నగర వాసులును, సర్వే = సమస్త మైన, విషయవాసినః = దేశమునందు నివసించువారును (సంతసించిరి).
తా. రాముని ఈ శీలమును, నడవడికను చూచి దశరథుడు చాల సంతసించెను. బ్రాహ్మణులును, నాగరికులును, రాజ్యములో అందరును సంతసించిరి.
మూ. తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః,
స్వయమ్భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. 27
ప్ర. అ. లోకే = లోకమునందు, అతియశాః = గొప్ప కీర్తి కలవాడును, సత్యపరాక్రమః = సత్య మైన పరాక్రమము కలవాడును, గుణవత్తరః = అధికముగ గుణవంతుడును అగు, రామః = రాముడు, తేషామ్ = ఆ దేశవాసులకు, భూతానామ్ = ప్రాణులకు, స్వయమ్భూః ఇవ = బ్రహ్మ వలె, బభూవ = ఆయెను.
తా. లోకమునందు గొప్ప కీర్తి గలవాడును, సత్య మైన పరాక్రమము కలవాడును, ఎక్కువ గుణములు కలవాడును అగు రాముడు రాజ్యములోని వారి కందరికిని ప్రాణులకు బ్రహ్మదేవు డెట్లో అట్లుండెను.
మూ. రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్,
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః. 28
ప్ర. అ. మనస్వీ = మంచిమనస్సు గల, రామస్తు = రాము డైతే, తద్గతః = ఆ సీతనే పొందినవాడై, తస్యాః = ఆమెయొక్క, హృది = హృదయమునందు, నిత్యమ్ = ఎల్లప్పుడును, సమర్పితః = ఉంచబడినవాడై, సీతయా సార్ధమ్ = సీతతో కూడ, బహూన్ = అనేక మైన, ఋతూన్ = ఋతువులను, విజహార = విహరించెను.
తా. ఉత్తమ మైన మనస్సు గల రాముడు సీతయందే మనస్సు నిలిపెను. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనెను. ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలకాలము) విహరించిరి.
మూ. ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి,
గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత. 29
ప్ర. అ. సీతా = సీత, పితృకృతాః = తండ్రిచేత చేయబడిన, దారాః ఇతి = భార్య అగుటచే, రామస్య = రామునకు, ప్రియా = ప్రీతిపాత్రురా లాయెను. గుణాత్ = సద్గుణములవలనను, రూపగుణా చ్చాపి = సౌందర్య మనెడు గుణము వలనను, ప్రీతిః = ప్రేమ, భూయః = ఇంకను, అభ్యవర్ధత = పెరిగెను.
తా. తండ్రి అంగీకరించిన సంబంధ మగుటచే రామునకు సీతపై ప్రేమ గలిగెను. ఆమె యొక్క సద్గుణములచేతను, లోకోత్తరసౌందర్యముచేతను అతని ప్రేమ ఇంకను వృద్ధి చెందెను.
మూ. తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే,
అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. 30
ప్ర. అ. భర్తా = భర్త యైన రాముడు, తస్యాః = ఆమెయొక్క, హృదయే = హృదయమునందు, ద్విగుణమ్ = రెండు రెట్లు, పరివర్తతే = తిరుగు చుండెను. హృదయమ్ = హృదయము, అన్తర్జాతమ్ అపి = తన లోపల పుట్టిన భావమును కూడా, హృదా = హృదయముతో, వ్యక్తమ్ = స్పష్టముగా, ఆఖ్యాతి = చెప్పుచుండెను.
తా. సీత హృదయములో భర్త యైన రాముడు రెండింతలుగా మసలుచుండెను. లోలోపల నున్న భావమును గూడ ఒకరి హృదయము, మరొకరి హృదయముతో చెప్పుచుండెడిది.
వి. తండ్రి అంగీకరించి చేసిన సంబంధ మగుటచేతను, ఆమెకు గల రూపసద్గుణా దులచేతను రామునకు సీతపై గాఢానురాగము కలుగగా, సీతకు మాత్రము అట్టి బాహ్యనిమిత్తములతో పనిలేకుండగ, భర్త యను ఒక్క కారణముచేతనే రామునిపై రెట్టింపు ప్రేమ యుండెడిది. ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదనగా వారిరువురును నోటితో కాక హృదయములతోడనే మాటలాడు కొనెడు వారు. ఒకరి హృదయములో నున్న భావము నొకరు అనాయాసముగ గ్రహించి తదనుగుణముగ ప్రవర్తించుచుండెడివారు.
మూ. తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా,
దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ. 31
ప్ర. అ. రూపే = రూపమునందు, దేవతాభిః = దేవతలతో, సమా = సమానురాలును, రూపిణీ = (సీతా) రూపముదాల్చిన, శ్రీరివ = లక్ష్మివలె నున్నదియు, లేదా, శ్రీరివ = లక్ష్మివలె, రూపిణీ = సౌందర్యముగలదియు, మైథిలీ = మిథిలానగరమున జనించినదియు, జనకాత్మజా = జనకుని కుమార్తెయు అగు, సీతా = సీత, భూయః = ఇంకను, విశేషేణ = విశేషముచేత, తస్య = ఆ రామునియొక్క, (హృదయే పరివర్తతే = హృదయములో తిరుగుచుండెను).
తా. సౌందర్యమున దేవతాస్త్రీ వలె నున్నదియు, లక్ష్మి వలె అపూర్వ సౌందర్యము గలదియు, (ఆ రూపము దాల్చిన లక్ష్మి వలె నున్నదియు), మిథిలానగరసంజాతయు, జనకుని కుమార్తెయు అగు సీత రాముని హృదయములో ఇంకను ఎక్కువగ మసలుచుండెను.
వి. సీతపై రామున కున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ సీతకు రామునిపై ఉండెను. రామునిపై సీత కున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ రామునకు సీతపై ఉండెను. వారి ప్రేమను కొలచుటకుగాని, ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమయో చెప్పుటకు గాని సాధన మేదియు లేదని భావము.
మూ. తయా స రాజర్షిసుతోఽభిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా,
అతీవ రామః శుశుభే ముదాన్వితో
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః. 32
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తసప్తతితమః సర్గః బాలకాణ్డః సమాప్తః
ప్ర. అ. రాజర్షిసుతః = రాజర్షి యైన దశరథుని కుమారుడైన, సః = ఆ, రామః = రాముడు, అభిరామయా = మనోహరురా లగు, తయా = ఆ, ఉత్తమరాజకన్యయా = ఉత్తముడైన జనకమహారాజుయొక్క కన్య యైన సీతతో, సమేయివాన్ = కలిసినవాడై, శ్రియా = లక్ష్మితో కూడిన, అమరేశ్వరః = దేవతాప్రభువైన, విభుః = సమర్థు డైన, విష్ణుః ఇవ = విష్ణువు వలె, ముదా = ఆనందముతో, అన్వితః = కూడినవాడై, శుశుభే = ప్రకాశించెను.
తా. దశరథమహారాజపుత్రు డైన రాముడు జనకమహారాజపుత్రియు, మనోహరురాలును అగు సీతతో కలిసినవాడై, ఆనందించుచు, లక్ష్మితో గూడిన, అమరాధీశ్వరు డైన మహావిష్ణువు వలె ప్రకాశించెను.
పుల్లెల శ్రీ రామచంద్రుడు రచించిన ‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బదిఏడవ సర్గ సమాప్తము.
యత్కృపాలేశసంసర్గాద్వ్యాఖ్యేయం రచితా మయా,
తస్యైవ జానకీజానేః పదయోరియమర్ప్యతే.
దేవతానుగ్రహః పిత్రోస్తపశ్చాచార్యసత్కృపా,
కర్తాస్మద్గ్రన్థజాతస్య కరణం కేవలం వయమ్.
శ్రీః శ్రీః శ్రీః
61
62
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
74
75
76
77