End_Matter

Back
Book Balakandamu
Chapter No 84
Pages 11
Read Time 13 Minutes

End_Matter

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అనుబంధము

కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యావిశేషాలు

1

కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా,

అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః.

కైకేయ్యె చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్,

ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమం,

అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః,

ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్.

బాల. 16 స. 27-29

పాయసవిభాగమునుగూర్చి చెప్పు పై శ్లోకాల భావమును వ్యాఖ్యాతలు వివిధరీతుల తెలిపియున్నారు.

1. మహేశ్వరతీర్థ గోవిందరాజుల వ్యాఖ్యప్రకారము - దశరథుడు పాయసములో సగము కౌసల్యకును, నాల్గవపాలు సుమిత్రకును, ఎనిమిదవపాలు కైకేయికిని, మఱల మిగిలిన యెనిమిదవ పాలు సుమిత్రకును ఇచ్చెను. ఈ వ్యాఖ్య శ్లోకాక్షరానుగుణముగా ఉన్నది.

2. మునిభావ ప్రకాశికాకారుల వ్యాఖ్య మాత్రము మఱియొక విధముగా ఉన్నది. తదా
= అప్పుడు
, పుత్రార్థకారణాత్ = పుత్ర ప్రయోజనము నిమిత్తము, నరపతిః = దశరథమహారాజు, కౌసల్యాయై = కౌసల్యకొరకు, పాయసార్ధమ్ = పాయసము యొక్క సగమును, దదౌ = ఇచ్చెను. నరాధిపః = రాజు, సుమిత్రాయై చాపి = సుమిత్రకొఱకును, శేషస్య (అధ్యాహారము) = కౌసల్య కివ్వగా మిగిలిన సగముయొక్క అర్ధాత్ = సగమును, (ఎనిమిదవ భాగమును), దదౌ = ఇచ్చెను. కైకేయ్యె చ = కైకేయికొరకును, అవశిష్టార్ధమ్ = కౌసల్యకీయగా మిగిలిన సగములో సుమిత్ర కిచ్చుటకు రెండు భాగములు చేసిన సగము పోగా సగమును, అనగా నాల్గవ భాగమును, దదౌ
= ఇచ్చెను. మహీపతిః = దశరథుడు
, అనుచిన్త్య = ఆలోచించి, పునరేవ = మరల, సుమిత్రాయై
= సుమిత్రకు
, అమృతోపమమ్ = అమృతముతో సమాన మైన, పాయసస్య = పాయసముయొక్క, అవశిష్టార్ధం చ = పూర్వము సుమిత్ర కిచ్చుటకై రెండు భాగములు చేసిన నాల్గవ భాగములో అపుడు సుమిత్ర కివ్వగా మిగిలిన సగమును, (అనగా రెండవ ఎనిమిదవ భాగమును) ప్రదదౌ
= ఇచ్చెను. మిగిలినది పూర్వము వలెనే.

ఈ అర్థము ప్రకారము - కౌసల్యకు సగము, సుమిత్రకు సగములోని సగములో సగము, అనగా ఎనిమిదవ భాగమును, సుమిత్రకై విభజించిన నాల్గవ పాలుగాక మిగిలిన నాల్గవపాలును కైకేయికిని ఇచ్చెను. పూర్వమొక నాల్గవ పాలు విభజించి అందు సగము సుమిత్ర కియ్యగా మిగిలిన సగమును (రెండవదగు ఎనిమిదవ భాగమును) మరల సుమిత్రకే ఇచ్చెను. అనగా కౌసల్యకు పాయసములోని సగము, కైకేయికి నాల్గవపాలు, సుమిత్రకు రెండు ఎనిమిదవ పాళ్లు లభించెను.

3. పురాణాంతరములతో విరోధము లేకుండుటకై మరొక అర్థము కూడ చెప్పబడినది-కౌసల్యకు నాల్గవపాలును, సుమిత్రకు నాల్గవపాలును, కైకేయికి నాల్గవపాలును, మిగిలిన నాల్గవపాలు మరల సుమిత్రకును ఇచ్చెను.

దశరథుడు పాయసమును రెండు సమభాగములుగ చేసి కౌసల్యా కైకేయిల కీయగా వారు తమ తమ భాగములనుండి సగమును సుమిత్ర కిచ్చినట్లు అధ్యాత్మ రామాయణములో ఉన్నది. దీనిని పట్టియే పై మూడవ వ్యాఖ్యానము చేయబడినది. అయితే దశరథుడే సుమిత్ర కిచ్చినట్లు ఈ రామాయణములో ఉండగా కౌసల్యా కైకేయు లిచ్చినట్లు అధ్యాత్మరామాయణములో ఉన్నది గాన గ్రంథవిరోధము ఉండనే ఉన్నది.

దశరథుడు వసిష్ఠ ఋశ్యశృంగుల ఆజ్ఞప్రకారము పాయసమును కౌసల్యా కైకేయీల కిచ్చినట్లు అధ్యాత్మరామాయణములో ఉన్నది. తమ భర్త అభిప్రాయమునకు విరుద్ధముగా వారు (తాము మాత్రమే భుజింపక) సుమిత్రకు కూడ ఎట్లు ఇచ్చినారు అని ప్రశ్న. దీనికి సమాధానముగా - ఆ మునులు త్రికాలద్రష్టలుగాన సుమిత్రాగర్భమున లక్ష్మణశత్రుఘ్ను లుదయించవలసియున్నదని తెలిసి ఆమెకు కూడ పాయస మీయవలెనని దశరథునకు చెప్పియే ఉందురు. ఈ విషయ మెరిగినవా రగుటచే కౌసల్యా కైకేయిలు సుమిత్రకు కూడ ఇచ్చినారని మన మూహించుకొనవలెనని ఒక వ్యాఖ్యాత.

మరొక వ్యాఖ్య :- దశరథుడు మొదట కౌసల్యకు పాయసములో సగము తీసి ఇచ్చెను. మరల ఆ ఇచ్చిన పాయసమునే రెండు భాగములు చేసి ఒక భాగము సుమిత్ర కిచ్చి, రెండవ భాగము కౌసల్య కిచ్చెను. అనగా కౌసల్యాసుమిత్రలకు రెండు నాల్గవభాగములు ముట్టినవి. మిగిలిన సగమును కైకేయి కిచ్చెను. సుమిత్ర కిద్దరు కుమారులు పుట్ట దగియుండుట నెరిగిన మునుల ప్రేరణచే మరల ఆ సగమును రెండు భాగములు చేసి ఒక భాగము మాత్రమే కైకేయి కిచ్చి మిగిలినది సుమిత్ర కిచ్చెను. అనగా కైకేయితోబాటు మరల సుమిత్రకు మరొక నాల్గవ భాగము లభించెను.

ఈ శ్లోకాల కీ అర్థము లెట్టు వచ్చునో ఆ వ్యాఖ్యాతలకే తెలియవలెను. శ్రీమద్రామాయణము ఆదికావ్యము. వైదికవాఙ్మయము తప్ప ఇతర వాఙ్మయమంతయు దీని తరువాతనే వచ్చినది. వాటిలో చెప్పిన విషయాలతో విరోధము వచ్చునని రామాయణ శ్లోకాలకు ఇలాంటి అర్థాలు కల్పించుట ఎంతవరకు సమంజసమో సహృదయులే ప్రమాణము. ఈ చివరి వ్యాఖ్యానము ప్రకారము పాయసము నాలుగులాళ్లకును నలుగురు పుత్రులు పుట్టిరి అని చెప్పినట్లయినది. అనగా విష్ణువు అంశ నలుగురిలోను సమమైన పాళ్లలోనే ఉన్నదని చెప్పవలసి ఉన్నది. ఇలా చెప్పిన పక్షాన -

‘‘కౌసల్యాఽజనయద్రామం సర్వలక్షణసంయుతమ్

విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనమ్

భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః

సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వెః సముదితో గుణైః,

ఆథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ

వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ.’’

అని అష్టాదశసర్గలో చెప్పనున్నదానితో విరోధము వచ్చును. ‘‘కౌసల్యా యై నరపతిః’’ ఇత్యాది (27 - 29) శ్లోకాల సృష్టార్థానికి కూడ దీనితో విరోధము వచ్చుచున్నది. దానిని పట్టి రాముడు విష్ణువు యొక్క అర్ధభాగము, లక్ష్మణుడు చతుర్థభాగము, భరతుడు అష్టమభాగము, శత్రుఘ్నుడు కూడ అష్టమభాగము కావలెను. ఈ శ్లోకాలలో రాముడు అర్ధభాగమనీ, భరతుడు చతుర్థాంశమనీ, లక్ష్మణశత్రుఘ్నులు అర్ధరూపులనీ చెప్పబడినది. అందుచేత మహేశ్వరతీర్థ గోవిందరాజులు ‘‘విష్ణోః చతుర్భాగ’’ అనుదానికి విష్ణువు యొక్క ఎనిమిదవభాగమనీ, ‘‘విష్ణోః అర్ధసమన్వితాః’’ అనుదానికి విష్ణువుయొక్క అంశతో కూడినవారనీ అర్థం చెప్పినారు. చతుర్భాగఃఅనుదానికి అష్టమభాగమనే అర్థము ఎట్లు లభించినదో తెలియదు.

విష్ణ్వంశ పాయసాంశాలని పట్టి ఉండునని ఎచటను చెప్పలేదు గాన ఈ శ్లోకాలకును పాయసవిభాగశ్లోకాలకును విరోధము లేదని ఒక సమాధానము.

పాయసవిభాగశ్లోకాలలో ఉన్న అర్ధశబ్దానికి సగము అనే అర్థము గ్రహించక అంశము, భాగము అను అర్థమును మాత్రమే (అంతటను) గ్రహించినటో ఈ ప్రయాస ఏదియు ఉండదని నా అభిప్రాయము.

మన ప్రాంతములో ఉన్న రామాయణం దాక్షిణాత్యపాఠము. దీనికి ఉత్తర దేశపాఠము మరొక్కటి ఉన్నది. దీనిలో కూడా కొంచెము భేదాలతో ఈశాన్య ప్రాంత పాఠమనియు, వాయవ్య ప్రాంతపాఠమనియు రెండు పాఠములున్నవి. ఈశాన్య ప్రాంత పాఠానికి ప్రాచ్యపాఠమని కూడ పేరు. దీనిని 1843-67 సంవత్సరాలలో, గార్రెసియో అను ఇటలీ దేశ పండితుడు పదకొండు సంపుటాలలో ప్రచురించెను. ఈతడు ఇటలీలోని టూరిన్ విశ్వవిద్యాలయంలో సంస్కత ప్రొఫెసర్గా ఉండెను. వీటిలో ఏడు సంపుటాలు మూలము నాలుగు సంపుటాలు ఇటాలియన్ భాషలోనికి అనువాదము. ఈ సంపుటాలను 1981 లో మరల మద్రాసు నుండి ప్రచురించుట జరిగినది. దానిలో ఈ ఘట్టాలలో ఉన్న పాఠాలు చూచినచో ఈ వ్యాఖ్యాభేదాలన్నియు అనావశ్యములని తోచక మానదు. అయితే మా పాఠమే సరియైన పాఠము అనే వాదం ఉండనే ఉంటుంది. అచట శ్లోకములు ఈ విధముగా ఉన్నవి.

‘‘పుత్రీయం పాయసం దేవి ప్రాశేదం హితమాత్మనః

ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యె హవిషోఽర్ధం నరాధిపః

స్వయమేవ సమం కృత్వా భాగం భాగచతుష్టయమ్

అర్ధాదర్ధం దదౌ చాపి కైకేయ్యె స నరాధిపః

చతుర్భాగం ద్విధా కృత్వా సుమిత్రాయై దదౌ తదా

ప్రదదౌ చావశిష్టం తత్ పాయసం దేవనిర్మితమ్

అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ నరాధిపః.’’

(ఆదికాండ 15వ సర్గ 21-23 శ్లోకాలు)

పుత్రుల నిచ్చు ఈ పాయసమును భక్షింపు మని చెప్పి అతడు సమముగా సగము అగునట్లు గను, మొత్తము నాలుగుభాగములు అగునట్లుగను స్వయముగనే విభజించి కౌసల్యకు సగము భాగమును ఇచ్చెను (అనగా కౌసల్యకు సగము పాయసము లభించినది). సగములో సగము కైకేయి కిచ్చెను (ఆమెకు నాల్గవవంతు లభించినది.) మిగిలిన నాల్గవవంతును రెండు భాగములు చేసి ఒక భాగము సుమిత్ర కిచ్చెను. మరల ఆలోచించి రెండవభాగము కూడ సుమిత్రకే ఇచ్చెను (ఆమెకు రెండు ఎనిమిదవ భాగములు లభించినవి).

రామాదుల ఉత్పత్తిని వర్ణించు ఘట్టములో కూడ పాఠము వేరుగా నున్నది. అది పాయసభాగాలకు అనుగుణముగా ఉన్నది.

జన్మతేజోగుణజ్యేష్ఠం పుత్రమప్రతిమౌజసమ్,

కౌసల్యాజనయద్రామం విష్ణుతుల్యపరాక్రమమ్,

కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా

యథాధిపేన దేవానామదితి ర్వజ్రపాణినా

భవాయ స హి లోకానాం రావణస్య వధాయ చ.

విష్ణోర్వీర్యార్ధతో జజ్ఞే రామో రాజీవలోచనః

తేజోవీర్యాధికః శూరః శ్రీమాన్ గుణగణాకరః

బభూవానవరశ్చెవ శక్రాద్విష్ణోశ్చ పౌరుషే.

తథాలక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ

దృఢభక్తిమహోత్సాహౌ రామస్యావరజౌ గుణైః

తావప్యాస్తాం చతుర్భాగౌ విష్ణోః సంపిణ్డితావుభౌ

ఏక ఏక చతుర్భాగాదపరస్మాదజాయత

భరతో నామ కైకేయ్యాః పుత్రః సత్యపరాక్రమః

(ఆదికాండము. 15వ సర్గ. శ్లో. 10-16)

ఇచట రాముడు అర్ధభాగమనియు, లక్ష్మణశత్రుఘ్ను లిరువురును కలిసి ఒక చతుర్థభాగమనియు, భరతుడు మరొకచతుర్థభాగమనియు స్పష్యముగా చెప్పబడినది. ఇది పాయసభాగాలకు కూడ అనుగుణముగా ఉన్నది.

2

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే,

ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికమ్.

(బా. కా. 23 స. 2 శ్లో.)

విశేషార్థములు :- మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకొలుప వచ్చి రాముని అచింత్యాద్భుతరూపము చూడగనే ఆశ్చర్యపడి, తాను వచ్చిన పని మరచి ‘‘నిన్ను గన్న తల్లి ఎంత ధన్యాత్మురాలో కదా’’ అని చెప్పుచున్నాడు. రామ = సర్వోత్తమసౌందర్యవంతుడగు ఓ రామా! కౌసల్యా = సర్వేశ్వరుడ వైన నిన్ను గన్న కౌసల్య, సుప్రజాః = నీవు కొడుకుగా పుట్టుట వలన మంచి కొడుకుగలది. లేదా మాతృశుశ్రూష చక్కగా చేయు నీచేత కౌసల్య సత్పుత్రవతి అయినది.

లేదా రాముని అమేయ స్వరూపమును చూచి విశ్వామిత్రుడు మనస్సులో ఈ విధముగ వితర్కించుకొనుచున్నాడు. కౌసల్యా = ఇట్టి రాముని కన్న కౌసల్యాదేవి, సుప్రజాః = మంచి సంతానము కలది. (ఈ అర్థమున ‘‘రామ’’ అనునది తరువాతి వాక్యమున అన్వయించును). రాముడు కుమారుడుగా పుట్టుటచే మంచి కుమారుడు కలిగి యుండుట కౌసల్యకు దశరథునకును సమానమే అయినను ‘‘పితుః శతగుణం మాతా (తండ్రి కంటె తల్లి నూరింతలు)’’ అని స్మతిలో చెప్పుటచే కౌసల్యాదేవి మాత్రము మంచి కొడుకుగలది అని ఇక్కడ వర్ణింపబడినది.

కౌసల్యాదశరథులకు చాల అంతరమున్నది. విశ్వామిత్రుడు ‘‘అహం వేద్మి మహాత్మానమ్’’ ఇత్యాదివిధముల ఎంతగా చెప్పినను దశరథుడు రాముని విశ్వామిత్రున కిచ్చుటకు సంశయించెను. కౌసల్య స్త్రీయైనను, దశరథుని కన్న రెండింతలు పుత్రవాత్సల్యము కలదైనను ఎంత మాత్రమును సందేహించలేదు. అందుచే కౌసల్య పేరు చెప్పబడినది. రామ = రాముడా్ఙ పూర్వా సన్ధ్యా ప్రవర్తతే = తూర్పు దిక్కునందు కలుగు సంధ్య ప్రవర్తించుచున్నది. నీవు కౌసల్యకు చేసినట్లు ఈ సంధ్యకు కూడ ఉపచారము చేయవలెను. లేదా - ఇంక సూర్యు డుదయింపనున్నాడు. సూర్యునకు వలె నీకును ఇంక శత్రువులను చంప సమయము వచ్చినది. లేదా - పూర్వా సన్ధ్యా ప్రవర్తతే
= అంధకారము పోయినది. తెల్లవారవచ్చినది. నా అజ్ఞానము నశించినది. భగవంతుడవైన నీ దర్శనము కలిగినది. ఉత్తిష్ఠః = లెమ్ము
, నీ నిద్రాకాలలక్ష్మిని (నీవు నిద్రించు సమయమున ఉండు లక్ష్మిని) చూచితిని. ఇక ప్రబోధలక్ష్మిని చూడగోరుచున్నాను. నరశార్దూలః = పురుషశ్రేష్ఠుడా! నరశ్రేష్ఠుడవు కావున ‘‘యద్యదాచరతి శ్రేష్ఠసత్తదేవేతరో జనః’’ అన్నట్లు నీవును సంధ్యను ఉపాసింపవలసినదే కదా ? లేదా - నీవు ఆశ్రితులను రక్షింపవలెను. దుష్టులను శిక్షింపవలెను. నీకు నిద్రించుట కవకాశమెక్కడిది?

దైవమ్ ఆహ్నికం-కర్తవ్యమ్- దైవమ్ = దేవునిచే, అనగా సర్వేశ్వరునిచే ఏర్పరుపబడిన, అహ్నికమ్ = నిత్యకర్మము, కర్తవ్యమ్ = చేయదగినది. లేదా - ఇచట దేవ’ ‘శబ్దమునకు’ ‘నీవుఅని అర్థము. దైవమ్ = నీచే ఏర్పరుపబడిన, ఆహ్నికమ్ కర్తవ్యమ్ = నీ వేర్పరచిన నియమమును నీవే అనుష్ఠింపక పోరాదు కదా అని భావము.

లేదా నేను నీచే ఆజ్ఞాపింపబడిన భగత్పూజనరూప మైన నిత్యకర్మము చేయవలెను కదా. దానిని ప్రతిగ్రహించుటకు లెమ్ము అని భావము. ఇట్లు ఇంకను అనేకార్థములు బుద్ధిమంతు లూహించు కొనవలెను అని గోవిందరాజులు.

‘‘కౌసల్యా సుప్రజాః’’ అను పదమునకు ‘‘కౌసల్యయొక్క సుపుత్రుడా! ’’ అని అర్థము చెప్పి సంబోధన ప్రథమా విభక్తిగా గ్రహించుటకు వీలులేదు. అపుడు అది ‘‘కౌసల్యా సుప్రజాః’’ అని కావలెను. అందుచేత ‘‘కౌసల్యా = కౌసల్య, సుప్రజాః = మంచి సంతానము కలది’’ ఇత్యాది విధముల అర్థములు కల్పించవలసి వచ్చినది. వాస్తవమున దీనిని ఆర్షప్రయోగముగ గ్రహించి సంబోధన ప్రథమా విభక్తిగా అంగీకరించవచ్చును. పాణినీయ విరుద్ధము లైన ఎన్నో ప్రయోగాలు వాల్మీకిరామాయణంలో ఉన్నవి. ప్రాచ్యపాఠంలో ఈ శ్లోకము పూర్తిగా భిన్నముగా ఉన్నది.

‘‘కౌసల్యామాతరుత్తిష్ఠ పూర్వాసంధ్యా ఉపాస్యతామ్,

పౌర్వాహ్ణికం విధిం కర్తుం తాత కాలో-యమాగతః’’

(ఆ. కాం. 26. 2)

3

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా.

(బా. కాం. 73.26)

విశేషార్థములు :- 1. ఇయమ్ = ఇదిగో. నీవు పరాక్రమముచేత శివధనస్సు విరచి జయించుకొన్న సీత ఇదిగో. ఈమె రూపసౌందర్యలావణ్యములు చూడుము. సీతా = సీత అనగా నాగటి చాలు, అందుబుట్టినదగుటచే సీత అను పేరు గలది. ఈమె అనుపమ సౌందర్యాదులు కలది మాత్రమే కాదు. నాగటి చాలునందు పుట్టినది. అయోనిజ. అందుచే ఈమెయందు సమస్తసద్గుణములును ఒప్పి ఉండును.

ఇయం సీతా :- ‘‘జనకునివద్ద శివధనస్సు ఉన్నది. దానిని వంచిన వానికి అతడు తన కుమార్తె యైన సీత నిచ్చి పెండ్లి చేయును’’ అని నీవు సిద్ధాశ్రమములో విన్న నాటినుండియు ఏ సీతను చూడవలెనని కుతూహలము చెంది ఉన్నావో ‘‘ఆ సీత ఇదిగో’’ చూడుము.

లేదా - సీత మెరుపు వంటిది గాన సీతను చూడగానే, మెరుపును చూచినట్లు రామున కేమియు కనబడలేదు. ఈ విధముగ సీతాశరీరకాంతిని చూడగనే కండ్లు మిరుమిట్లు గొలిపి సీతాశరీరమును చూడజాల కున్న రాముని జూచి జనకుడు ‘‘ఇయం సీతా’’ ‘‘ఇదిగో సీత’’ అని చెప్పుచున్నాడు.

లేదా - సిద్ధాశ్రమములో సీతను గూర్చి విన్నది మొదలు రాముని మనస్సులో సీతా దర్శన కూతూహలము తీవ్రముగా ఉండుటచే ‘‘ప్రాసాదే సా పథి పథి చ సా పృష్ఠతః సా పురః సా’’ (మేడపైనను ఆమెయే, ప్రతిమార్గమునందును ఆమెయే; వెనుకను ఆమెయే. ముందును ఆమెయే) అని చెప్పినట్లు, విరహిజనులకు భావనావిశేషముచే, అంతటను, ప్రియజనము కనబడుచుండును గాన, అతడు ప్రపంచమంతయు సీతామయముగనే చూచుచుండెను. అందుచే తా నీయ బోవు సీత సరిగా తెలియుటకై జనకుడు ‘‘ఇయం సీతా’’ అని చెప్పుచున్నాడు.

మమ సుతా = నాకూతురు ఈమె సౌందర్యవతియైనను, అయోనిజ యైనను, దుష్టకులనివాసముచే దూషితయను సందేహము వలదు. కర్మఠులమని ప్రసిద్ధి కెక్కిన మాచే పోషింపబడినది కావున జన్మశుద్ధి మాత్రమే కాక కులశుద్ధి కూడ కలిగియున్నది.

లేదా - నా కూతురు, నీ వెట్లు దశరథునకు ప్రియకుమారుడవో అట్లే ఈమెయు నాకు ప్రియపుత్రి. కావున ఈమెయందు స్థిర మైన ప్రేమను ఉంచవలెను. సహధర్మచరీ తవ = నీకు ధర్మపత్ని కాగలదు. ఈమె భోగమునకు మాత్రమే అని తలపకుము, ఈమెతో నీవు ధర్మము లాచరించుచు ఈమెనే ధర్మపత్నిగా చేసికొనుము. అయోనిజత్వ మను జన్మశుద్ధి గల మరొక కన్య లభింపదు. దానితో కులశుద్ధి కూడ ఉన్నది దఞరక దని వేరుగా చెప్పనవసరము లేదు. కావున ఈమెను తప్ప మరెవ్వరిని ధర్మపత్నిగా చేసికొనుట యుక్తము కాదు.

లేదా - తవ సహధర్మచరీ - నీకు సరి యైన ధర్మ మాచరించునది. అనగా నీవు ఎట్లు, ఏ ధర్మము నాచరింతువో ఈమెయును అట్లే ఆ ధర్మమును ఆచరించునది. లోకములో ఒకరు మరియొకరి వలె ఉండదు. ఈమె అట్లు కాదు. లోక విలక్షణముగా సర్వధా నీవలెనే ప్రవర్తించును గాన నీకే ఈమె తగినది. ఈమె తప్ప మరి ఏ వనితయు నీకు పత్ని యగుటకు తగదు.

ఏనాం ప్రతీచ్ఛ చ = ఈ సీతను ప్రతిగ్రహింపుము. కారముచే ధర్మపత్నిగా చేసికొనుము అని అర్థము. ఈమె ఇట్టి లక్షణముకలది గాన, ‘‘నేను నా పరాక్రమముచే జయించుకొంటిని’’ అను సాధారణబుద్ధి యుంచక నేను చెప్పినట్లు ఈమెనే ధర్మపత్నిగా వరింపుము.

తే భద్రమ్ = నీకు మంగళ మగు గాక. ఇట్టి శుభలక్షణములు కలదానిని పెండ్లాడుట వలన నీకు సమస్త మంగళములును ఘటిల్లును. లేదా - దృష్టి దోషము కలుగకుండు గాక.

పాణినాం పాణిం గృహ్ణీష్వ = నీ హస్తముచే ఈమె హస్తమును పట్టుకొనుము. ప్రణయకోపము కలిగిన సందర్భములలో నీ హస్తముతో ఈమె పాదము పట్టుకొనుటయు ఘటిల్లవచ్చును. ఇప్పుడు మాత్రము హస్తమునే పట్టుకొనుము.

లేదా - సిద్ధాశ్రమములో సీతను గూర్చి వినిన నాటి నుండియు రామునకు సీతపై అనురాగము కలిగి యుండుటచేత భావనాబలముచే సీతకు ప్రణయ కోపము కలిగినట్లు తోచి ఆమె పాదమునే పట్టుకొనుట సంభవించు నని తలచి ‘‘పాణిం గృహ్ణీష్వ పాణినా’’ అని చెప్పుచున్నాడు.

2. ఎవ్వరును కదల్పజాలని శివధనస్సును రాముడు అనాయాసముగ విరచుటవలనను ఆతని అప్రమేయ మగు రూపమువలనను, ఆ కాలమునందు కలిగిన సంవిధానవైచిత్య్రము వలనను జనకుడు బ్రహ్మనిష్ఠు డగుట వలనను రాముడు విష్ణుదేవు డనియు, సీత మహాలక్ష్మి యనియు తెలిసికొని, ఈ దేవరహస్యము ఇతరులకు తెలియకుండుటకై, ధ్వనివృత్తిచే సీతారాముల అనాది సంబంధమును సూచించు చున్నాడు - ఇయమ్ = ఇదిగో జగత్సష్ట్యాది కారణభూతుడవును, సాక్షాద్వష్ణుదేవుడవును అగు నీవు రామ రూపమున అవతరించినట్లే లక్ష్మియు సీతా రూపమున అవతరించి ఉన్నది. చూడుము. మీ దాంపత్యము నిత్యమే యైనను మనుష్య ధర్మము ననుసరించి సీతను శీఘ్రముగ పెండ్లియాడుము.

సీతా = నాగటి చాలున పుట్టుటచే అయోనిజ, నీవు దేవకార్యార్థమై కౌసల్యా గర్భమున పుట్టినావు. అట్లు పుట్టుకయే లేనిదై నిన్ను అనుసరించుట కై కేవలము మనుష్యత్వము మాత్ర మవలంబించి, నిన్నే వరించుచు తనకు నీతో నిత్యదాంపత్య మున్నట్లు సూచించుచున్నది.

మమ సుతా - నా కూతురు నా యింటిలో పెరుగుటచే నేను కూతురుగా భావించి నీకిచ్చుచున్నాను.

తవ సహధర్మచరీ - నీకు ధర్మపత్ని. నీవలెనే ధర్మముల నాచరించునది. నీవలెనే ఉండునది. నీ కవినాభూతయై జగత్సష్ట్యాదులందు నీకు సహకరించుచుండునది.

ఏనాం ప్రతీచ్ఛ చ - ఈమెను అంగీకరింపుము. నిత్యపత్నిగా యున్న దైనను ఇపుడు మనుష్యత్వమును అభినయించుటకై అంగీకరింపుము.

తే భద్రమ్ :- నీకు మంగళమగుగాక నీ వెంత మనుష్యుడవై యున్నను, జగదీశ్వరుడ వగు నీకు నిత్యసిద్ధయగు ఈమె నిచ్చెదను అని చెప్పుటకు నేను సాహసించినందులకు మన్నింపవలెను.

పాణినా పాణింగృహ్ణీష్వ :- నీ వెల్లప్పుడును వక్ష స్థలముపై ధరించిన వాడవు. ఇపుడు మనుష్య ధర్మము ననుసరించుటకై హస్తమును పట్టుకొనుము. లేదా - నీ విదివర కెన్నిమారులో ప్రణయకోపకాలమునందు హస్తముచే ఈమె పాదము పట్టుకొని యుందువు. ఇప్పుడు చిరవియోగము కలిగినది గాన విరహిజన సాధారణ మైన ఉత్కంఠచే, ఈమెను అనునయించుటకై పాదములు పట్టెదవేమో. అట్లు చేయకుము. వివాహమునందు మేము చేయునట్లు, ఇప్పుడు మాత్రము, చేయి పట్టుకొనుము.

3. ఇయమ్ = ఈ ‘‘ఈమె వీర్యశుల్క. పరాక్రమము చూపి క్రయము చేతవలె కొనబడినది. శివధనువును విరచినందున నాచే జయింపబడినది.’’ అని అలతిగా తలపకుము. మెరుపు వలె మెరయుచున్నది. ‘‘ఇదిగో.’’ చూడుము. నీకును గౌరవింప దగినది. నీవెంతగా గౌరవించినను దానికి తగినది.

సీతా :- నాగటి చాలున పుట్టినది. నీవు మొదలు సమస్త జంతుజాలమును భరించుచున్న సాక్షాద్భూదేవికి కూతురు. కావున నీవిప్పుడవశ్యము ఈవిడ యందు బహుమానముంచవలెను. భార్యగా నున్నపుడు విశేషము అభిమానముంచవలెనని చెప్పనవసరమే లేదు. మరియు, సీతా = ఈమె అయోనిజ. నీవు కౌసల్యకు పుట్టినావు. అందుచే ఈమెకును నీకును చాల అంతరమున్నది. అందుచేత కూడ నీవు ఈమె విషయమున చాల గౌరవబుద్ధి ఉంచవలెను.

మమ సుతా = నా కూతురు. రాజరాజు నైన నేను పెంచినది. కావున నాయందుండు గౌరవమును నీవు ఈమె యందు చూపవలెను.

మమ సుతా = నా కూతురు. నేను బ్రహ్మనిష్ఠుడను. చాల తపస్విని. ఈమెను గౌరవించకున్నచో నాకు కోపము కలుగును. దానిచే నీకు కీడు వాటిల్లును.

తవ సహధర్మచరీ - నీవు ఈమెను అగ్రపత్నిగా ఉంచుకొనవలెను.

ఏనాం ప్రతీచ్ఛ చ - ఈమెను ప్రతిగ్రహింపుము. తే భద్రమ్ - అట్లు మేము చెప్పినట్లు చేసిన నీకు మంగళము కలుగును.

4. ఇయమ్ = ఈ, ఎవ్వరికిని కదిలింప శక్యము కాని శివధనస్సును రెండుగా విరిచి, అసదృశపరాక్రమము చూపి నీవు జయించినది ఈమెనే. నీ పరాక్రమమునకు సరి యైనది కాకున్నను కరుణింపవలెను.

సీతా = నాగటి చాలున పుట్టినది. తల్లి లేనిది. లోకములో తల్లి కాని బిడ్డపై ప్రేమ హెచ్చుగా చేయుదురు. నీవును ఈమె యందు దయయుంచవలెను.

మమ సుతా = నా కూతురు. నేను పెంచినవాడను మాత్రమే. నేను బ్రహ్మనిష్ఠుడను గాన నావలన పెంపుడు సౌఖ్యము ఈమెకు కలిగియుండదు. నేను బ్రహ్మనిష్ఠుడ నగుటచే, నీవు ఈమె నుపేక్షించినను విచారించువారు లేక పోవుటచే అట్లు చేయక, ఈమెపై దృఢమగు ప్రేమ నుంచవలెనని ఇప్పుడే చెప్పుచున్నాను.

తవ సహధర్మచరీ :- నీవు ఈమెను ధర్మపత్నిగా గ్రహించిన చాలును. మేము కర్మఠులము కావున అదియే మాకు ప్రార్థనీయము.

ఏనాం ప్రతీచ్ఛ :- ఈమెను అంగీకరింపుము. చాల గౌరవము గల తలిదండ్రు లివ్వగా గ్రహించుటకు తామే త్వరపడుదురు. ఇట్టి కన్యను గ్రహించుటకు కొంత ప్రార్థించిననే గాని కాదని అర్థము.

తే భద్రమ్ :- నీకు మంగళము అగుగాక. ఇట్టి వారియందు ప్రేమ ఉంచుటవలనను, బ్రహ్మనిష్ఠుల మైన మా మాట వినుట వలనను నీకు మంగళము కలుగును (గోవింద రాజ మహేశ్వర తీర్థులు).

5. (తనిశ్లోకి) ఇయమ్:-ఇదిగో, రూపసౌందర్యములచే నేనే గొప్ప వాడనని అనుకొనకుము. నీవలె సౌందర్యము గల ఈ సీతను చూడుము.

సీతా = నాగటి చాలున పుట్టినది. బంగారు తీగెయు భూమియందే పుట్టును. బంగారు తీగెవంటిది గాన భూమియందు పుట్టినది. ఈ విధముగ అయోనిజగాన ఆభిజాత్యాదు లను గూర్చి విచారింప బనిలేదు.

మమ సుతా = నా కొమార్తె, ఇట్టి దానిని పెంచుటచే నేను ధన్యుడనైతిని.

తవ సహధర్మచరీ :- నీకు ‘‘కూడ ధర్మమాచరించునది’’ ధర్మమాచరించుటకు సహాయురాలు. నీవు చేయు ధర్మములకు సహాయురాలు. నీవు చేయు ధర్మములకు ప్రవర్తకురాలు.

ఏనాం ప్రతీచ్ఛ :- నిన్ను వరించియున్న ఈమెను విడిచి పెట్టక ఆదరించి గ్రహింపుము.

భద్రం తే :- నీకు మంగళమగు గాక. ముందు ప్రార్థింపబోవు కార్యము విషయమున అనుకూలుడ వగుము.

పాణినా పాణిం గృహ్ణీష్వ :- హస్తముచే హస్తము పట్టుకొనుము. ఎవ్వరికిని కదిలించుటకు కూడ శక్యము కాని శివధనస్సును లీలగా విరచిన హస్తము కలవాడవు నీవు. సీత హస్తము అతిమృదులము. కావున సరిగా పట్టుకొనుము.

6. (మరికొందరి వ్యాఖ్య) ఇయమ్ = ఈ ; నిన్ను విడువనప్పుడు మాత్రమే ఈమె జీవించియుండగలదు. ‘‘ఆర్తార్తే ముదితే హృష్టా ప్రోషితే మలినా కృశా, మృతే మ్రియేత యా నారీ సా స్త్రీ జ్ఞేయా పతివ్రతా’’ (ఏ స్త్రీ భర్త దుఃఖితుడైనపుడు దుఃఖించునో, సంతుష్టుడైనపుడు సంతోషించునో, అతడు ప్రవాసములో నున్నపుడు మలినయై కృశించునో, మరణించునపుడు మరణించునో ఆమె పతివ్రత) అని చెప్పినట్లు సాధారణపతివ్రతయే భర్తను విడచి యుండజాలనప్పుడు శాస్త్రములలో చెప్పిన సర్వలక్షణములు కలిగి లోకవిలక్షణయై, సర్వోత్తమురాలుగా ఉన్న ఈమె విషయము చెప్పవలెనా ?

ఇయమ్ = ఈ, నీ ఆత్మయనియు, నీ శరీరమనియు, నీ ఛాయయనియు వేదములలో చెప్పబడినది కావున ఈమె నిర్దోషయే. ఒకవేళ దోషమున్నను అది నీదే కదా ? స్వాత్మదోషము కాని, స్వశరీర దోషము కాని, స్వచ్ఛాయా దోషము కాని, తనదే అగును కదా ! నీ వెట్లు నిర్దోషుడవో ఈమెయు అట్లే నిర్దోషురాలు.

సీతా :- నాగటి చాలున పుట్టినది. ‘‘మాతరమఙ్గనాః’’ (స్త్రీలు తల్లిని పోలియుందురు) అని చెప్పినట్లు భూదేవి కుమార్తె అగుటచే ఈమె యందు క్షమాది సద్గుణములన్నియు ఉన్నవని చెప్ప పని లేదు.

మమ సుతా :- నా కుమార్తె, భూమి కుమార్తె యైనను నేను పురాకృత పుణ్యవశముచేత ఈమెను పెంచినవాడ నగుటవలన నీ కిచ్చు చున్నాను.

ఏనాం ప్రతీచ్ఛ చ :- ఇట్టి దానిని అంగీకరింపుము. ఇట్టి దానిని నీవంటి ప్రాజ్ఞులు తామే కోరుదురు. కావున అంగీకరింపుమని చెప్పుటగూడ ఉపచారార్థమే’.

భద్రం తే :- నీకు మంగళమగు గాక. ఈమెయందు ఇట్టి సల్లక్షణము లుండుట నీకే ఫలము. భోగ్యపదార్థము పుష్కలముగా నున్నచో భోక్తకే కదా ఫలము లభించును!

పాణినా పాణిం గృహ్ణీష్వ :- నీ హస్తముచే ఈమె హస్తమును గ్రహింపుము. సీత ముగ్ధ గావున చేయి చాచి నీ చేయి పట్టుకొనజాలదు. కావున నీవే పట్టుకొనుము.

వ్యాఖ్యాతలు ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఊహించి వాల్మీకికి ఆపాదించినారు. వినే వారికి ఓపిక ఉండవలెను గాని వాగ్ధాటి గలవారు ఇంకా ఎన్నెన్నో అర్థాలు చెప్ప వచ్చును. జనకుడు లక్ష్మణుని ఉద్దేశించి కూడ -

‘‘లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళాముద్యతాం మయా,

ప్రతీచ్ఛ పాణి గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః’’

బా. కా. 73. 30

అని చెప్పినాడు. దానికి వ్యాఖ్యాత లీ యర్థాలేవీ చెప్పలేదు. పఠితలు స్వయముగనే ఊహించుకొనగలరని విడిచినారేమో!

ప్రాచ్య పాఠంలో ఈ శ్లోకం (ఇయం సీతా అనునది) మరొక విధంగా ఉన్నది.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,

గృహాణ పాణినా పాణిం త్వమస్యా రఘునన్దన’’

(ఆ. కాం. 75. 19)

ఈ శ్లోకం తరువాత దాక్షిణాత్య పాఠంలో ఉన్న -

‘‘పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా’’

అను వాక్యము ప్రాచ్యపాఠంలో లేదు.



© 2026 Ebook Library