| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 3 |
| Pages | 56 |
| Read Time | 69 Minutes |
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
అయం పితామహే నోక్తో రాజధర్మః సనాతనః, 1
ఈశ్వరశ్చ మహాదణ్డో దణ్డే సర్వం ప్రతిష్ఠితమ్. 2
తాత సనాతనమగు ఈ రాజధర్మమును వివరించి చెప్పెను. గొప్పదియగు దండమే ప్రభువు. దండమున సర్వము నెలకొనియున్నది.
దేవతానా మృషీణాం చ పితౄణాం చ మహాత్మనామ్,
యక్షరక్షః పిశాచానాం సాధ్యానాం చ విశేషతః. 2
సర్వేషాం ప్రాణినాం లోకే తిర్యగ్యోని నివాసినామ్,
సర్వవ్యాపీ మహాతేజా దణ్డః శ్రేయా నితి ప్రభో. 3
ఇత్యేవ ముక్తం భవతా దణ్డే వై సచరాచరమ్,
పశ్యతా లోకమాసక్తం ససురాసురమానుషమ్. 4
దేవతలు, ఋషులు, మహాత్ములగు పితృదేవతలు, యక్షులు, రక్షస్సులు, పిశాచులు, విశేషించి సాధ్యులు, లోకమునందలి పశువుల పక్షుల కడుపుల నున్నవి యగు ప్రాణులు - ఈ అన్నింటియందు గొప్ప తేజము కలదియు, శ్రేయస్సును కూర్చునదియునగు దండము వ్యాపించి యున్నదని నీవు చెప్పితివి. చరములు, అచరములు, దేవతలు, రాక్షసులు, మనుష్యులు అనువారితో కూడిన లోకమంతయు దండమున తగులుకొనియుండుటను దర్శించి నీవు పలికితివి.
ఏత దిచ్ఛా మ్యహం జ్ఞాతుం తత్త్యేన భరతర్షభ,
కో దణ్డః కీదృశో దణ్డః కింరూపః కింపరాయణః. 5
కిమాత్మకః కథంభూతః కథంమూర్తిః కథంప్రభో,
జాగర్తి చ కథం దణ్డః ప్రజా స్వవహితాత్మకః. 6
దీనితో పాటు రెండధ్యాయములతో దండస్వరూపమును వివరించు చున్నారు.
కశ్చ పూర్వాపర మిదం జాగర్తిప్రతిపాలయన్,
కశ్చ విజ్ఞాయతే పూర్వం కో వరో దణ్డసంహితః.
కిం సంస్థశ్చ భవేద్దణ్డః కా వాఽస్య గతి రుచ్యతే. 7
భరతవరేణ్యా! నేను దీనిని మూలముట్టుగా తెలియగోరుచున్నాను. దండ మననేది? ఎటువంటిది? దానిరూప మేమి? దాని పరమలక్ష్యమేమి? దాని ఆత్మ ఎట్టిది? అది యెట్టిదై యున్నది? దాని ఆకార మెట్టిది? మెలకువకల స్వరూపముతో అది ప్రజలయందు ఎట్లు మేల్కొనియుండును? ముందు వెనుకలలో దీనిని మెలకువతో రక్షించుచు ఎవడు జాగరూకతతో నుండును? ఇది మొదట ఎవనికి తెలియవచ్చినది? దండ మను పేరుగల శ్రేష్ఠమైన దేది? అది దేనియందు చక్కగా నెలకొనియుండును? దీని గతిగా దేనిని చెప్పదురు?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
శృణు కౌరవ్య యో దణ్డో వ్యవహారో యథా చ సః,
యస్మిన్ హి సర్వ మాయత్తం సదణ్డ ఇహ కేవలః. 8
కురువరా! దండమనగా నేమియో వ్యవహార మన నేమియో, దేనియందు సర్వము కూడుకొని యున్నదో, కేవలమగు దండ మెట్టిదియో వినుము.
ధర్మ సంఖ్యా మహారాజ వ్యవహార ఇతీష్యతే,
తస్య లోపః కథం న స్యా ల్లోకే ష్వవహితాత్మనః
ఇత్యేవం వ్యవహారస్య వ్యవహారత్వ మిష్యతే. 9
ధర్మమును ప్రకాశింపజేయుటయే, మహారాజా! వ్యవహార మనబడును. లోకములందు ఎల్లవేళల జాగరూకతతోనుండు దానికి లోపము రాకుండవలయును. ఆ విధముగా వ్యవహారమునకు వ్యవహారత్వము ఏర్పడును.
అపి చైతత్పురా రాజ న్మనునా ప్రోక్త మాదితః. 10
సుప్రణీతేన దణ్డేన ప్రియాప్రియ సమాత్మనా
ప్రజా రక్షతి యః సమ్య గ్ధర్మ ఏవ స కేవలః. 11
ప్రియులు, అప్రియులు అనువారియందు సమబుద్ధి కలిగి చక్కగా నిర్వహించిన దండముతో ప్రజలను రక్షించెడు రాజు కేవలము ధర్మమే యగును అని రాజా! మొదటికాలమున మనువు వక్కాణించెను.
యథోక్త మేత ద్వచనం ప్రాగేవ మనునా పురా,
యన్మయోక్తం మనుష్యేన్ద్ర బ్రహ్మణో వచనం మహత్. 12
ఇప్పుడు నేను పలికిన యీపలుకు ప్రజాపతి మొదట పలికిన దొడ్డవాక్కు. దానినే మనువు మునుపు పలికెను.
ప్రాగిదం వచనం ప్రోక్త మతః ప్రాగ్వచనం విదుః,
వ్యవహారస్య చాఖ్యానా ద్వ్యవహార ఇహోచ్యతే. 13
ముందు పలికిన మాట కనుక దీనిని ‘ప్రాగ్వచనము’గా చెప్పుచుందురు. ఇది వ్యవహారమును తెలియజేయుచున్న కారణమున ఇక్కడ దీనికి వ్యవహారమను పేరు కలిగినది.
దణ్డే త్రివర్గః సతతం సుప్రణీతే ప్రవర్తతే,
దైవం హి పరమో దణ్డో రూపతో ఽగ్ని రివోత్థితః, 14
చక్కగా నిర్వహించిన దండమునందు ఎల్లవేళల ధర్మము, అర్థము, కామము అను వాని సముదాయము నడచుచుండును. పరమమైనదండము, రూపముతో వెలువడిన అగ్నివలె, ఏర్పడిన దైవమే.
నీలోత్పలదళశ్యామ శ్చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః,
అష్టపా న్నై కనయనః శంకుకర్ణో ర్ధ్వరోమవాన్. 15
దండ పురుషుడు నల్లని కలువ రేకులవలె శ్యామ వర్ణము కలవాడు. నాలుగు కోరలు, నాలుగు భుజములు, ఎనిమిది పాదములు, పెక్కుకన్నులు, శంకువు వంటి చెవులు, పైకి లేచి నిలిచిన రోమములు కలవాడు.
జటీ ద్విజిహ్వ స్తామ్రాస్యో మృగరాజ తనుచ్ఛదః,
ఏతద్రూపం బిభర్త్యుగ్రం దణ్డో నిత్యం దురాధరః. 16
జడలు, రెండునాలుకలు, ఎఱ్ఱని మొగము, సింహము చర్మపుకవచము కలిగి యిట్టి ఉగ్రరూపమును దండపురుషుడు ఎల్లవేళల ధరించును. అత డెవ్వరికిని లొంగనివాడు.
అసిర్ధను ర్గదా శక్తి స్త్రి శూలం ముద్గరః శరః,
ముసలం పరశు శ్చక్రం పాశం దణ్డ ర్ష్టితోమరాః. 17
సర్వప్రహరణీయాని సన్తి యానీహ కానిచిత్,
దణ్డ ఏవ స సర్వాత్మా లోకే చరతి మూర్తిమాన్. 18
కత్తి, విల్లు, గద, శక్తి, త్రిశూలము, ముద్గరము, అమ్ము, రోకలి, గొడ్డలి, చక్రము, పాశము, దండము, ఈటె, తోమరము మొదలైన కొట్టుటకు యోగ్యములైన ఆయుధము లెన్నికలవో అన్నియు ఆ దండపురుషునివి. అత డీ విధముగా సర్వాత్ముడై మూర్తిదాల్చిన వాడై లోకమున తిరుగాడుచుండును.
భిన్దంశ్ఛిన్దన్ రుజన్ కృన్తన్ దారయన్ పాటయం స్తథా,
ఘాతయ న్నభిధావంశ్చ దణ్డ ఏవ చరత్యుత. 19
పగులగొట్టుచు, ముక్కలు చేయుచు, బాధ కలిగించుచు, చీల్చివేయుచు, నిలువుగాకోసివేయుచు, చంపుచు, పరువులు పెట్టుచు దండమే లోకమున తిరుగుచున్నది.
అసి ర్విశసనో ధర్మ స్తీ క్ష్ణవర్మా దురాధరః,
శ్రీ గర్భో విజయః శాస్తా వ్యవహారః సనాతనః. 20
శాస్త్రం బ్రాహ్మణమన్త్రాశ్చ శాస్తా ప్రాగ్వదతాంవరః,
ధర్మపాలో ఽక్షరో దేవః సత్యగో నిత్యగోఽగ్రజః. 21
అసంగో రుద్రతనయో మను ర్జ్యేష్ఠః శివంకరః,
నామా న్యేతాని దణ్డస్య కీర్తితాని యుధిష్ఠిర. 22
యుధిష్ఠిరా! అసి, విశసనము, ధర్మము, తీక్ష్ణవర్మ, దురాధరము, శ్రీగర్భము, విజయము, శాస్త, వ్యవహారము, సనాతనము,శాస్త్రము, బ్రాహ్మణమంత్రములు, శాస్త, ప్రాగ్వదతాంవరము, ధర్మపాలము, అక్షరము, దేవుడు, సత్యగము, నిత్యగము, అగ్రజము, అసంగము, రుద్ర తనయుడు, మనువు, జ్యేష్ఠుడు, శివంకరము అను ఈ నామములు దండమునకు చెప్పబడినవి.
దణ్డో హి భగవాన్ విష్ణు ర్దణ్డోనారాయణః ప్రభుః,
శశ్వద్రూపం మహద్భిభ్రన్ మహాన్ పురుష ఉచ్యతే.. 23
దండమనగా భగవంతుడగు విష్ణువు. దండము ప్రభువగు నారాయణుడే. పెక్కువిధములైన రూపములను తాల్చు మహాపురుషుడు.
తథోక్తా బ్రహ్మకన్యేతి లక్ష్మీ ర్వృత్తిః సరస్వతీ,
దణ్డనీతి ర్జగద్ధాత్రీ దణ్డో హి బహువిగ్రహః. 24
అట్లే బ్రహ్మకన్య, లక్ష్మి, వృత్తి, సరస్వతి, దండనీతి, జగద్ధాత్రి అనియు దండపత్ని నామములు. దండపురుషుడు పెక్కువిగ్రహములు (రూపములు) కలవాడు.
అర్థానర్థౌ సుఖం దుఃఖం ధర్మాధర్మౌ బలాబలే,
దౌర్భాగ్యం భాగధేయం చ పుణ్యా పుణ్యే గుణాగుణౌ. 25
కామాకామా వృతు ర్మాసఃశర్వరీ దివసః క్షణః,
అప్రమాదః ప్రమాదశ్చ హర్షక్రోధౌ శమో దమః. 26
అర్థము, అనర్థము, సుఖము, దుఃఖము, ధర్మము, అధర్మము, బలము, బలహీనత, దౌర్భాగ్యము, సౌభాగ్యము, పుణ్యము, పాపము, గుణము, అవగుణము, కామము, అకామము, ఋతువు, మాసము, రాత్రి, పగలు, క్షణము, జాగరూకత, ప్రమాదము, హర్షము,క్రోధము, శమము, దమము - ఇవన్నియు దండము యొక్క రూపములు.
దైవం పురుషకారశ్చ మోక్షామోక్షే భయాభయే,
హింసాహింసే తపోయజ్ఞః సంయమోఽథ విషావిషమ్. 27
అదృష్టము, మానవప్రయత్నము, మోక్షము, బంధము, భయము, భయము లేకుండుట, హింస, అహింస, తపస్సు, యజ్ఞము, సంయమము, విషము, విషముకానిది - ఇవన్నియు దండము యొక్క బహురూపములు.
అన్తశ్చాదిశ్చమధ్యంచ కృత్యానాం చ ప్రపఞ్చనమ్,
మదః ప్రమాదో దర్పశ్చ దంభో ధైర్యం నయానయౌ. 28
ఆయా కార్యముల మొదలు, తుది మధ్యములు, వాని విస్తృతి, మదము - ప్రమాదము, దర్పము, మిడిసిపాటు, ధైర్యము, నీతి అవినీతులు - ఇవన్నియు దండ స్వరూపములు.
అశక్తిః శక్తి రిత్యేవం మానస్తంభౌ వ్యయావ్యయౌ,
వినయశ్చ విసర్గశ్చ కాలాకాలౌ చ భారత. 29
చచ్చుదనము, శక్తి, అభిమానము, పొగరు, వ్యయము, పొదుపరితనము, వినయము, సృష్టి, కాలము, అకాలము-ఇవన్నియు దండముయొక్క బహు రూపములు.
అనృతం జ్ఞానితా సత్యం శ్రద్ధాశ్రద్ధే తథైవ చ,
క్లీబతా వ్యవసాయశ్చ లాభాలాభౌ జయాజయౌ. 30
అనృతము, జ్ఞానము, సత్యము, శ్రద్ధ, అశ్రద్ధ, సోమరితనము, ప్రయత్నము (కృషి) లాభము, నష్టము, గెలుపు-ఓటమి-ఇవియన్నియు దండపు బహురూపములు.
తీక్ణతా మృదుతా మృత్యు రాగమానాగమౌ తథా,
విరోధ శ్చావిరోధశ్చ కార్యాకార్యే బలాబలే. 31
వాడిమి, మెత్తదనము, మృత్యువు, రాకడ పోకడ, విరోధము-అవిరోధము, కార్యము - అకార్యము; బలము-బలములేకుండుట - ఇవి యన్నియు దండపు బహురూపములు.
అసూయా చానసూయాచ ధర్మాధర్మౌ తథైవ చ
అపత్రపానపత్రపే హ్రీశ్చ సంపద్విపత్పదమ్. 32
అసూయ-అసూయలేకుండుట, ధర్మము-అధర్మము, సిగ్గు-సిగ్గు లేకుండుట, పాపపు పనులకు సంకోచించుట, సంపద, విపత్తు - ఇవియన్నియు దండపు బహురూపములు.
తేజః కర్మాణి పాణ్డిత్యం వాక్శక్తి స్తత్వబుద్ధితా
ఏవం దణ్ణస్య కౌరవ్య లోకేఽస్మిన్ బహురూపతా. 33
తేజస్సు, కర్మములు, పాండిత్యము, పలుకులపస, సత్వబుద్ధిగలిగియుండుట-ఇట్లు ఈ లోకమున దండపు పెక్కురూపముల స్థితి కానవచ్చును.
న స్యాద్యదీహ దణ్డోవై ప్రమథేయు: పరస్పరమ్
భయాద్దణ్డస్య నాన్యో౭న్యం ఘ్నన్తి చైవ యుధిష్ఠిర. 34
దండమిచట లేకున్నచో జనులొకరి నొకరు నలిపివేసికొందురు. యుధిష్ఠిరా! దండపు భయము వలన ఒకరినొకరు చంపుకొనకున్నారు.
దణ్డేన రక్షమాణా హి రాజన్నహరహః ప్రజాః,
రాజానం వర్ధయన్తీహ తస్మాద్దణ్డః పరాయణమ్. 35
రాజా! దండముతో రక్షింపబడుచున్న ప్రజలు రాజును పెంపొందింతురు. అందువలన దండమే పరమగతి.
వ్యవస్థాపయతి క్షిప్ర మిమం లోకం నరేశ్వర,
సత్యే వ్యవస్థితో ధర్మో బ్రాహ్మణే ష్వవతిష్ఠతే. 36
దండము, ఓ నరేశ్వరా! ఈలోకమును పట్టినిలుపును. ధర్మము సత్యమునందు గట్టిగా నిలిచియున్నది. బ్రహ్మజ్ఞాన సంపన్నులయందు నెలకొనియున్నది.
ధర్మయుక్తా ద్విజశ్రేష్ఠా దేవయుక్తా భవన్తి చ
బభూవ యజ్ఞో దేవేభ్యో యజ్ఞః ప్రీణాతి దేవతాః. 37
ధర్మముతో కూడిన బ్రాహ్మణ ప్రవరులు దేవతలతో కూడిన వారగుదురు. యజ్ఞము దేవతలవలన ఏర్పడినది. యజ్ఞము దేవతలను ప్రీతిపరచును.
ప్రీతాశ్చ దేవతా నిత్య మిన్ద్రే పరివదన్త్యపి
అన్నం దదాతి శక్ర శ్చాప్యనుగృష్ణా న్నిమాః ప్రజాః. 38
దేవతలు ప్రీతినందినవారై ఇంద్రునియందు ప్రశంసలు కురిపింతురు. ఇంద్రుడును ఈ ప్రజల నందరను అనుగ్రహించుచు అన్నమునొసగును.
ప్రాణాశ్చ సర్వభూతానాం నిత్య మన్నే ప్రతిష్ఠితాః,
తస్మాత్ర్పజాః ప్రతిష్ఠన్తో దణ్డో జాగర్తి తాసు చ. 39
సకలప్రాణులప్రాణములును ఎల్లవేళల అన్నమునందు నెలకొనియున్నవి. దానివలననే ప్రజలు స్థిరతను పొందుచున్నారు. దండము వారియందు మేలుకొనియుండును.
ఏవం ప్రయోజన శ్చైవ దణ్డః క్షత్రియతాం గతః,
రక్షన్ ప్రజాః స జాగర్తి నిత్యం స్వవహితోఽక్షరః. 40
ఇట్టి ప్రయోజనము గల దండము నిత్యము ఏమరుపాటు, జారుపాటు లేనిదై ప్రజలను రక్షించుచు క్షత్రియత్వమును పొంది మేలుకొనియున్నది.
ఈశ్వరః పురుషః ప్రాణః సత్యం చిత్తం ప్రజాపతిః,
భూతాత్మా జీవ ఇత్యేవం నామభిః ప్రోచ్యతే ఽష్టభిః. 41
ఈశ్వరుడు, పురుషుడు, ప్రాణము, సత్త్వము, చిత్తము, ప్రజాపతి, భూతాత్మ, జీవుడు - అను ఎనిమిది పేర్లతో నిది చెప్పబడుచున్నది.
అదద ద్దణ్డ మేవాస్మై ధృత మైశ్వర్య మేవ చ,
బలేన యశ్చ సంయుక్తః సదా పంచవిధాత్మకః. 42
బలముతో కూడి అయిదువిధములగు స్వరూపములతో నుండురాజునకు పరమేశ్వరుడే దండమును, ఐశ్వర్యమును ఒసగెను.
కులం బహుధనామాత్యాః ప్రజ్ఞా ప్రోక్తా బలాని తు,
ఆహార్య మష్ట కైర్ద్రవ్యై ర్బల మన్య ద్యుధిష్ఠిర. 43
కులము, గొప్పధనముగల అమాత్యులు, ప్రజ్ఞ, బలములు, ఎనిమిదివిధములగు ద్రవ్యములతో కూడిన మఱియొకబలమును రాజు సమకూర్చుకొనవలయును.
హస్తినోఽశ్వా రథాః పత్తి ర్నావో విష్టి స్తథైవ చ,
దైశికా శ్చావికా శ్చైవ తదష్టాంగం బలం స్మృతమ్. 44
ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బంటులు, నావలు, వెట్టివారు, ఆయాప్రాంతముల సేనలు, గొఱ్ఱెలనుండి ఏర్పడిన గొంగళి మొదలగు సాధనములు
ఇది ఎనిమిది అంగముల బలమని తలంతురు.
అథ వాఙ్గస్య యుక్తస్య రథినో హస్తియాయినః,
అశ్వారోహాః పదాతాశ్చ మన్త్రిణో రసదాశ్చ యే. 45
భిక్షుకాః ప్రాడ్వివాకాశ్చ మౌహూర్తా దైవచిన్తకాః,
కోశో మిత్రాణి ధాన్యం చ సర్వోపకరణాని చ. 46
సప్త ప్రకృతి చాష్టాంగం శరీర మిహ యద్విదుః,
రాజ్యస్య దణ్డ మేవాఙ్గం దణ్డః ప్రభవ ఏవ చ. 47
మరియు, ఈ అంగముతో కూడినరాజునకు, రథములవారు, ఏనుగు సైనికులు, గుఱ్ఱములవారు, కాల్బలమువారు, మంత్రులు, వైద్యులు, భిక్షుకులు (సన్యాసులు) ప్రాడ్వివాకులు, జ్యోతిషశాస్త్రపండితులు, దైవచింతకులు (పురోహితులు) ధనాగారము, మిత్రములు, ధాన్యము, ఇతరములగు సాధనములన్నియును, ఏడువిధములగు ప్రకృతులు, ఎనిమిది అంగములు శరీరమని తెలియవలయును. కనుక రాజ్యమునకు దండమే అంగము. దండమే సర్వసాధకము.
ఈశ్వరేణ ప్రయత్నేన కారణాత్ క్షత్రియస్య చ,
దణ్డో దత్తః సమానాత్మా దణ్డో హీదం సనాతనమ్. 48
ఈశ్వరుడు ప్రయత్నముతో ఒక ప్రత్యేక ప్రయోజనమును సంభావించి తనతో సమానమగు స్వరూపముగల దండమును క్షత్రియున కొసగెను. కనుక ఈ దండము సనాతనమైనది.
రాజ్ఞాం పూజ్యతమో నాన్యో యథా ధర్మః ప్రదర్శితః
బ్రహ్మణా లోకరక్షార్థం స్వధర్మ స్థాపనాయ చ. 49
ఇట్లు ప్రదర్శించిన విధానమును బట్టి రాజులకు మిక్కిలి మన్నింపదగినది మరియొకటి లేదు. ఈదండమును బ్రహ్మ లోకములరక్షణ కొరకు, తమతమ ధర్మములు దృఢముగా నిలిచి యుండుటకొరకు నిర్మించెను.
భర్తృ ప్రత్యయ ఉత్పన్నో వ్యవహార స్తథాపరః,
బ్రహ్మణా లోకరక్షార్థం స్వధర్మ స్థాపనాయ చ. 50
వాది ప్రతివాదులవలన ఉత్పన్నమైన వ్యవహారము ఒకరిహితముతో కూడినదై ఒకనికి జయము కలిగించున దగును.
వ్యవహారస్తు వేదాత్మా వేదప్రత్యయ ఉచ్యతే,
మౌలశ్చ నరశార్దూల శాస్త్రోక్త శ్చ తథాపరః. 51
వ్యవహారము వేదాత్మకమైనచో దండము వేదమే ప్రమాణముగా గలది యగును. కులాచార ప్రయుక్తమైనచో శాస్త్రోక్తమైన దండమే చేయదగినది.
ఉక్తో యశ్చాపి దణ్డోఽసౌ భర్తృప్రత్యయ లక్షణః,
జ్ఞేయో నః స నరేన్ద్రస్థో దణ్డః ప్రత్యయ ఏవ చ. 52
భర్తృప్రత్యయలక్షణమైన దండమని చెప్పినదేది కలదో అది రాజునందున్నదిగా మనము తెలిసికొనవలయును. (క్షత్రియులు దండమును, న్యాయనిర్ణయమును రెంటిని తెలిసికొనవలయునని భావము)
దణ్డ ప్రత్యయ దృష్టోఽపి వ్యవహారాత్మకః స్మృతః,
వ్యవహారః స్మృతోయశ్చ స వేద విషయాత్మకః. 53
వ్యవహారసంబంధమైన దండ ప్రత్యయముకూడ వేదవిషయాత్మకమే.
యశ్చ వేదప్రసూతాత్మా స ధర్మో గుణదర్శనః,
ధర్మప్రత్యయ ఉద్దిష్టో యథాధర్మం కృతాత్మభిః. 54
వేదము మూలకారణముగా పుట్టిన ధర్మమును గుణములను బట్టి చూడనగును పుణ్యాత్ములా చరించు ధర్మమును బట్టియే విశ్వాసమును పొందదగును. (పుణ్యాత్ములు ప్రవర్తించు విధానమును బట్టి అట్టి ధర్మవిషయమున విశ్వాసము పొందదగునని భావము)
వ్యవహారః ప్రజాగోప్తా బ్రహ్మదిష్టో యుధిష్ఠిర
త్రీన్ ధారయతి లోకాన్ వై సత్యాత్మా భూతివర్ధనః. 55
ఓయి యుధిష్ఠిరా! వ్యవహారమను దానిని బ్రహ్మ ఏర్పరచెను. సత్యమే ఆత్మగా గలది. ఐశ్వర్యమును పెంపొందించునది. ప్రజలను సంరక్షించునది.
యశ్చ దణ్డః సదృష్టో నో వ్యవహారః సనాతనః,
వ్యవహారశ్చ దృష్టో యః సవేద ఇతి నిశ్చితమ్. 56
దండమని మేము దర్శించిన ఆ సనాతనమగు వ్యవహారము వేదమే యని నిశ్చయము.
యశ్చ వేదః సవై ధర్మో యశ్చ ధర్మః ససత్పథః,
బ్రహ్మా పితామహః పూర్వం బభూవాథ ప్రజాపతి:. 57
ఏది వేదమో అదియే ధర్మము. ఏది ధర్మమో అదియే మంచి మార్గము. బ్రహ్మమొదట పితామహుడు తరువాత ప్రజాపతి ఆయెను.
లోకానాం స హి సర్వేషాం ససురాసురరక్షసామ్,
సమనుష్యోరగవతాం కర్తా చైవ సభూతకృత్. 58
దేవతలు, అసురులు, రక్కసులు, మనుష్యులు, సర్పములు మొదలగునవి కల లోకములన్నింటికి ఆతడే కర్త. అతడు భూతములను చేసినవాడు.
తతోఽన్యో వ్యవహారో ఽయం భర్తృ ప్రత్యయలక్షణః,
తస్మాదిద మథోవాచ వ్యవహార నిదర్శనమ్. 59
భర్తృప్రత్యయలక్షణముగల ఈ వ్యవహారము అంతకంటె వేరైనది. అందువలన వ్యవహారనిదర్శనమైన యీ మాట నాతడు పలికెను.
మాతా పితా చ భ్రాతా చ భార్యా చైవ పురోహితః,
నాదణ్డ్యో విద్యతే రాజ్ఞో యో స్వధర్మేణ తిష్ఠతి. 60
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి దణ్ణస్వరూపాదికథనే ఏకవింశత్యధిక శతతమోధ్యాఽయః.
తనధర్మమునందు స్థిరముగా నున్న రాజునకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భార్య, పురోహితుడు - వీరిలో ఎవరైన కానీ దండింపరానివాడు లేడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజ ధర్మానుశాసనపర్వమున దండస్వరూపము మున్నగు వానిని తెలియజెప్పెడు
నూటయిరువది యొకటవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అత్రా ప్యుదాహర న్తీమ మితిహాసం పురాతనమ్,
అఙ్గేషు రాజా ద్యుతిమాన్ వసుహోమ ఇతి శ్రుతః. 1
ఇందును ఒక ప్రాతకాలపునాటి ఇతిహాసమును చెప్పుకొనుచుందురు. అంగ దేశములందు గొప్ప తేజశ్శాలి యగు రాజు వసుహోముడు ఉండెడివాడు.
స రాజా ధర్మవి న్నిత్యం సహ పత్న్యా మహాతపాః,
ముఞ్జాపృష్ఠం జగామాథ పితృదేవర్షి పూజితమ్. 2
ధర్మమును చక్కగా నెరిగినవాడు, గొప్ప తపశ్శాలి అయిన ఆరాజు పితరులు, దేవతలు, ఋషులు మన్నించెడు ముంజపృష్ఠమను క్షేత్రమునకు పత్నితోపాటుగా అరిగెను.
తత్ర శృఙ్గే హిమవతో మేరౌ కనక పర్వతే,
యత్ర ముజ్ఞావటే రామో జటాహరణ మాదిశత్. 3
తదాప్రభృతి రాజేన్ద్ర ఋషిభిః సంశితవ్రతైః,
ముఞ్జపృష్ఠ ఇతిప్రోక్తః సదేశో రుద్రసేవితః. 4
స తత్ర బహుభి ర్యుక్త స్తదా శ్రుతిమయై ర్గుణైః,
బ్రాహ్మణా నా మనుమతో దేవర్షి సదృశోఽభవత్. 5
అదిమొదలుకొని తీవ్రమైన వ్రతములు గల ఋషులు రుద్రుడు సేవించిన ఆ ప్రదేశమును ముంజపృష్ఠ మని పలుక జొచ్చిరి. బంగారుకొండ మేరువునందు మంచుకొండ శిఖరమున రాముడు జడలను ముడుచుటను ఆదేశించిన స్థానము ముంజవటమున వేదములు ప్రశంసించిన గుణములు పెక్కింటితో కూడిన ఆమహారాజు బ్రాహ్మణులు అనుమతింపగా దేవర్షి సదృశుడాయెను.
తం కదాచి దహీనాత్మా సఖా శక్రస్య మానితా,
అభ్యగచ్ఛ న్మహీపాలో మాంధాతా శత్రు కర్శనః. 6
అంతనొకప్పుడు దొడ్డబుద్ధిగలవాడు, ఇంద్రునిచెలికాడు, అభిమానము గలవాడు, శత్రువులను నలిపివేయువాడు నగు మాంధాత యను మహారాజు అతనికడ కరుదెంచెను.
సోఽ పసృత్య తు మాన్ధాతా వసుహోమం నరాధిపమ్,
దృష్ట్వా ప్రకృష్టతపసం వినతోఽ గ్రే ఽ భ్యతిష్ఠత. 7
ఆ మాంధాత గొప్పతపస్సు కలవాడగు వసుహోమమహారాజును సమీపించి వినయముతో అతనిముందు నిలిచియుండెను.
వసుహోమోఽపి రాజ్ఞో వై పాద్య మర్ఘ్యం న్యవేదయత్,
సప్తాఙ్గస్య తు రాజ్యస్య పప్రచ్ఛ కుశలావ్యయే. 8
వసుహోముడును ఆరాజునకు పాద్యము, అర్ఘ్యమును సమర్పించెను. ఏడుఅంగములుగల రాజ్యముయొక్క కుశలమును, మంచిస్థితిని గూర్చి ప్రశ్నించెను.
సద్భి రాచరితం పూర్వం యథావ దనుయాయినమ్,
అపృచ్ఛ ద్వసుహోమ స్తం రాజన్ కిం కరవాణి తే. 9
ఉత్తమపురుషులు మున్ను ఆచరించెడు ధర్మమును చక్కగా అనుసరించెడు ఆరాజును వసుహోముడు, రాజా! నీకు నేనేమి చేయుదును? అని యడిగెను.
సో ఽ బ్రవీత్పరమప్రీతో మాన్దాతా రాజసత్తమమ్,
వసుహోమం మహాప్రాజ్ఞ మాసీనం కురునన్దన. 10
మిక్కిలి ప్రీతి నందిన మాంధాత రాజశ్రేష్ఠుడు, మహాబుద్ధిశాలి అచట కూర్చున్నవాడు అయిన వసుహోమునితో పలికెను.
మాంధాతోవాచ - మాంధాత ఇట్లనెను.
బృహస్పతే ర్మతం రాజ న్నధీతం సకలం త్వయా,
తథైవౌశనసం శాస్త్రం విజ్ఞాతం తే నరోత్తమ. 11
రాజా! నీవు బృహస్పతిమతము నంతటిని అధ్యయనము చేసితివి. అట్లే శుక్రుడు చెప్పిన శాస్త్రమును కూడ చక్కగా ఎరిగితివి.
తదహం జ్ఞాతు మిచ్ఛామి దణ్డ ఉత్పద్యతే కథమ్,
కిం చాస్య పూర్వం జాగర్తి కింవా పరమ ముచ్యతే. 12
అందువలన నేను తెలియగోరుచున్నాను. దండ మెట్లు పుట్టినది? దానికి ముందు ఏది మేల్కొని యున్నది? అమలులోనున్నది? పరమమైనదిగా దేనిని చెప్పుదురు?
కథం క్షత్రియసంస్థశ్చ దణ్డః సంప్రత్యవస్థితః,
బ్రూహి మే సుమహాప్రాజ్ఞ దదామ్యాచార్య వేతనమ్. 13
అది క్షత్రియునియందెట్లు నెలకొన్నది? ఇప్పుడు దాని స్థితియేమి? మేధావీ! నాకు తెలుపుము. నీకు గురుదక్షిణ యిచ్చుకొందును.
వసుహోమ ఉవాచ - వసుహోము డిట్లు చెప్పెను.
శృణు రాజన్ యథా దణ్డః సంభూతో లోకసంగ్రహః,
ప్రజావినయ రక్షార్థం ధర్మస్యాత్మా సనాతనః. 14
ప్రజలయందు వినయమును రక్షించుట కొరకు లోకములను కాపాడునట్టిదై ధర్మము యొక్క ఆత్మ, సనాతనము అయిన దండమెట్లు పుట్టినదో చెప్పెదను. వినుము.
బ్రహ్మా యియక్షు ర్భగవాన్ సర్వలోక పితామహః,
ఋత్విజం నాత్మన స్తుల్యం దదర్శేతి హ నఃశ్రుతమ్. 15
లోకములన్నింటికి తాతయగు బ్రహ్మ యజ్ఞము చేయగోరినవాడై తనకు సాటియైన ఋత్విజుని కనుగొనలేకపోయెనని మేము వినియుంటిమి.
స గర్భం శిరసా దేవో బహు వర్షాణ్యధారయత్,
పూర్ణే వర్షసహస్రే తు స గర్భః క్షువతోఽ పతత్. 16
ఆ దేవుడు పెక్కేండ్లు తలలో గర్భమును ధరించెను. వేయిఏండ్లు నిండిన తరువాత ఆతడు తుమ్మగా ఆ గర్భము క్రిందపడెను.
స క్షుపో నామ సంభూతః ప్రజాపతి రరిందమ,
ఋత్విగాసీ న్మహారాజ యజ్ఞే తస్య మహాత్మనః. 17
ఆతడు క్షుపుడను పేరుతో ప్రజాపతియై పుట్టెను. ఆ మహాత్ముని యజ్ఞమున ఋత్విజు డాయెను.
తస్మిన్ ప్రవృత్తే సత్రే తు బ్రహ్మణః పార్థివర్షభ,
దృష్టరూపప్రభావత్వా ద్దణ్డః సోఽన్తర్హితోఽభవత్. 18
బ్రహ్మదియగు ఆ సత్రయాగము సాగుచుండగా కానవచ్చెడురూపముయొక్క ప్రభావమువలన దండపురుషుడు అంతర్హితు డాయెను.
తస్మిన్నంతర్హితే చాపి ప్రజానాం సంకరో ఽభవత్,
నైవ కార్యం నవా కార్యం భోజ్యాభోజ్యం న విద్యతే. 19
అతడు కనుమరుగు కాగా ప్రజలలో సంకర మేర్పడెను. చేయదగినదేదో, తగనిదేదో, తినదగినదేదియో, కానిదేదియో తెలియకుండెను.
పేయాపేయే కుత స్సిద్ధి ర్హింసంతి చ పరస్పరమ్,
గమ్యాగమ్యం తదా నాసీ త్స్వం పరస్వం చ వై సమమ్. 20
త్రావదగినది, త్రావరానిది అనువాని ఏర్పాటు ఎక్కడ? ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. స్త్రీలవిషయమున గమ్య, అగమ్య అను విచారణ లేకుండెను. తనసొమ్ము, పరులసొమ్ము ఒక్కటియే ఆయెను.
పరస్పరం విలుంపన్తి సారమేయా యథామిషమ్,
అబలాన్ బలినో ఘ్నన్తి నిర్మర్యాద మవర్తత. 21
కుక్కలు మాంసమునకు వలె, ఒకరినొకరు పీకికొని తినుచుండిరి. బలవంతులు బలహీనులను చంపివైచిరి. మర్యాదలు లేకపోయెను.
తతః పితామహో విష్ణుం భగవన్తం సనాతనమ్,
సంపూజ్య వరదం దేవం మహాదేవ మథాబ్రవీత్. 22
అంత పితామహుడు (బ్రహ్మ) సనాతనుడు, భగవంతుడు, వరదుడు, సర్వవ్యాపి అయిన మహాదేవుని పూజించి యిట్లు పలికెను.
అత్ర త్వమనుకంపాం వై కర్తు మర్హసి కేశవ,
సంకరో న భవే దత్ర యథా తద్వై విధీయతామ్. 23
కేశవా! నీవిచట దయచూడవలయును. సంకర మెట్లు కాకుండునో యట్లు నీవు చేయవలయును.
తతః స భగవాన్ ధ్యాత్వా చిరం శూలవరాయుధః,
ఆత్మాన మాత్మనా దణ్ణం ససృజే దేవసత్తమః. 24
అంత శూలమనెడు శ్రేష్ఠమగు మహాయుధమును ధరించిన ఆ భగవానుడు పెద్ద కాలము ధ్యానించి తన్ను తానుగా డండమును సృజించెను.
తస్మాచ్చ ధర్మచరణా న్నీతి ర్దేవీ సరస్వతీ,
ససృజే దణ్ణనీతిం సా త్రిషు లోకేషు విశ్రుతా. 25
అట్లే ధర్మము నాచరించు స్వరూపముతో సరస్వతీదేవి దండనీతిని సృజించెను.
ఆ దండనీతి మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కెను.
భూయః స భగవాన్ ధ్యాత్వా చిరం శూల వరాయుధః,
తస్య తస్య నికాయస్య చకా రైకైక మీశ్వరమ్. 26
శూలమనుశ్రేష్ఠమగు ఆయుధముగల ఆభగవంతుడు మరియు ధ్యానించి ఒక్కొక్క సముదాయమున కొక్కొక్క ప్రభువును నిర్మించెను.
దేవానా మీశ్వరం చక్రే దేవం దశశతేక్షణమ్,
యమం వైవస్వతం చాపి పితౄణా మకరోత్ప్రభుమ్. 27
దేవతలందరకు వేయికన్నులదేవుని - ఇంద్రుని - ప్రభువుగా చేసెను. సూర్యకుమారుడగు యముని పితృదేవతలకు ప్రభువు నొనర్చెను.
ధనానాం రాక్షసానాం చ కుబేర మపి చేశ్వరమ్,
పర్వతానాం పతిం మేరుం సరితాం చ మహోదధిమ్. 28
ధనములకు, రాక్షసులకు ఈశ్వరునిగా కుబేరుని నియమించెను. పర్వతములకు పతిగా మేరువును, నదులకు ప్రభువుగా మహాసముద్రమును ఏర్పరచెను.
అపాం రాజ్యే సురాణాం చ విదధే వరుణం ప్రభుమ్,
మృత్యుం ప్రాణేశ్వర మథో తేజసాం చ హుతాశనమ్. 29
జలముల రాజ్యమునను, సురలకును వరుణుని ప్రభువు గావించెను. ప్రాణములకు ఈశ్వరునిగా మృత్యువును, తేజస్సులకు అగ్నిని నియమించెను.
రుద్రాణా మపి చేశానం గోప్తారం విదధే ప్రభుమ్,
మహాత్మానం మహాదేవం విశాలాక్షం సనాతనమ్. 30
మహాత్ముడు, మహాదేవుడు, విశాలాక్షుడు, సనాతనుడు అయిన ఈశానుని రుద్రులకు రక్షకుడగు ప్రభువుగా చేసెను.
వసిష్ఠ విూశం విప్రాణాం వసూనాం జాతవేదసమ్,
తేజసాం భాస్కరం చక్రే నక్షత్రాణాం నిశాకరమ్. 31
విప్రుల కీశ్వరునిగా వసిష్ఠుని, వసువులకు అగ్నిని, గ్రహగణములకు భాస్కరుని, నక్షత్రములకు చంద్రుని ప్రభువులనుగా చేసెను.
వీరుధా మంశుమన్తం చ భూతానాం చ ప్రభుం వరమ్,
కుమారం ద్వాదశభుజం స్కన్దం రాజాన మాదిశత్. 32
ఓషధీలతలకు సూర్యుని, భూతములకు పండ్రెండు చేతులుగల కుమార స్వామియనుస్కందుని రాజుగా ఆదేశించెను.
కాలం సర్వేశ మకరో త్సంహార వినయాత్మకమ్,
మృత్యో శ్చతుర్విభాగస్య దుఃఖస్య చ సుఖస్య చ. 33
నాలుగు విభాగములుగల మృత్యువునకు, దుఃఖమునకు, సుఖమునకు ప్రభువుగా సంహారము, పెంపుదల అనువానిస్వరూపముగల కాలుని ఏర్పరచెను.
ఈశ్వరః సర్వదేవస్తు రాజరాజో నరాధిపః,
సర్వేషా మేవ రుద్రాణాం శూలపాణి రితి శ్రుతిః. 34
ఈశ్వరుడు, సర్వదేవుడు, రాజరాజు, నరాధిపుడు, అయిన శూలపాణి రుద్రులందరకు ప్రభువని వేదము చెప్పుచున్నది.
తమేనం బ్రహ్మణః పుత్ర మనుజాతం క్షుపం దదౌ,
ప్రజానా మధిపం శ్రేష్ఠం సర్వధర్మభృతా మపి. 35
ఆ బ్రహ్మననుసరించి పుట్టిన కుమారుడు క్షుపుడుండెనే ఆతనిని అన్నిధర్మములను అవలంబించెడు ప్రజలకు శ్రేష్ఠుడైన ప్రభువుగా నొసగెను.
మహాదేవ స్తత స్తస్మిన్ వృత్తే యజ్ఞే యథావిధి,
దణ్డం ధర్మస్య గోప్తారం విష్ణవే సత్కృతం దదౌ. 36
ఆ యజ్ఞము యథావిధిగ ముగిసిన పిదప మహాదేవుడు ధర్మమునకు రక్షకమైన దండమును - సత్కరింపబడినదానిని - విష్ణువున కొసగెను.
విష్ణు రఙ్గిరసే ప్రాదా దఙ్గిరా మునిసత్తమః,
ప్రాదా దిన్ద్రమరీచిభ్యాం మరీచి ర్భృగవే దదౌ. 37
విష్ణువు అంగిరసున కొసగెను. మునులలో శ్రేష్ఠుడగు అంగిరుడు ఇంద్రమరీచులకు సమర్పించెను. మరీచి భృగువున కొసగెను.
భృగు ర్దదా వృషిభ్యస్తు దణ్డం ధర్మసమాహితమ్,
ఋషయో లోకపాలేభ్యో లోకపాలాః క్షుపాయ చ. 38
భృగువు ఋషులకు, ఋషులు లోకపాలురకు, లోకపాలురు క్షుపునకు ధర్మముతో చక్కగా కూడిన దండము నొసగిరి.
క్షుపస్తు మనవే ప్రాదా దాదిత్యతనయాయ చ,
పుత్రేభ్యః శ్రాద్ధ దేవస్తు సూక్ష్మ ధర్మార్థ కారణాత్. 39
క్షుపుడు ఆదిత్యునికుమారుడగు మనువునకు అందించెను. సూక్ష్మములగు ధర్మముల ప్రయోజనము కారణముగా శ్రాద్ధదేవుడు దానిని పుత్రుల కొసగెను.
విభజ్య దణ్డః కర్తవ్యో ధర్మేణ న యదృచ్ఛయా,
దుష్టానాం నిగ్రహో దణ్డో హిరణ్యం బాహ్యతః క్రియా. 40
ధర్మముతో చక్కగా విభజించి దండమును విధింపవలయును. ఇష్టమువచ్చినట్లు కాదు. దండము దుష్టులను అణచుటకొరకు మాత్రమే. హిరణ్యము (బంగారము) వెలుపలి వ్యవహారము.
వ్యంగత్వం చ శరీరస్య వధో నాల్పస్య కారణాత్,
శరీరపీడా స్తా స్తాశ్చ దేహత్యాగో వివాసనమ్. 41
(శిక్షలోభాగముగా) శరీరమున అంగములను తొలగించుటయు, వధము, ఆయాశరీరపీడలు, దేహమును వదలించుట, దేశమునుండి వెడలనడచుట అనునవి చిన్న కారణమునకై కారాదు.
తం దదౌ సూర్యపుత్రస్తు మనుర్వై రక్షణార్థకమ్,
ఆనుపూర్వ్యాచ్చ దణ్డోఽ యం ప్రజా జాగర్తి పాలయన్. 42
సూర్యుని కుమారుడగు మనువు (వైవస్వతుడు) దానిని రక్షణకొరకుగా ఒసగెను. ఈ విధముగా ఈదండము క్రమముగా ప్రజలను పాలించుచు మేల్కొని యున్నది. (అప్రమత్తముగానున్నది)
ఇన్ద్రో జాగర్తి భగవా నింద్రా దగ్ని ర్విభావసుః,
అగ్నే ర్జాగర్తి వరుణో వరుణాచ్చ ప్రజాపతిః. 43
భగవంతుడగు ఇంద్రుడు ఈదండవిషయమున మెలకువతో నుండును. ఇంద్రునివలన అగ్ని, అగ్నివలన వరుణుడు, వరుణుని వలన ప్రజాపతి మెలకువగా నుండిరి.
ప్రజాపతే స్తతో ధర్మో జాగర్తి వినయాత్మకః,
ధర్మాచ్చ బ్రహ్మణః పుత్రో వ్యవసాయః సనాతనః. 44
ప్రజాపతివలన వినయస్వరూపుడగు ధర్ముడు, ధర్మునివలన బ్రహ్మపుత్రుడు సనాతనుడునగు వ్యవసాయుడు దండమును అప్రమత్తులై నిలిపిరి.
వ్యవసాయా త్తత స్తేజో జాగర్తి పరిపాలయత్,
ఓషధ్య స్తేజస స్తస్మా దోషధీభ్యశ్చ పర్వతాః. 45
వ్యవసాయము వలన తేజస్సు, తేజస్సు వలన ఓషధులు, ఓషధులవలన పర్వతములు జాగృతి కలిగియున్నవి.
పర్వతేభ్య శ్చ జాగర్తి రసో రసగుణాత్తథా,
జాగర్తి నిరృతి ర్దేవీ జ్యోతీంషి నిరృతే రపి 46
పర్వతములవలన రసము, రసగుణములవలన నిరృతియను దేవి, ఆమెవలన జ్యోతులు వెలయుచున్నవి.
వేదాః ప్రతిష్ఠా జ్యోతిర్భ్య స్తతో హయశిరాః ప్రభుః,
బ్రహ్మా పితామహా స్తస్మా జ్జాగర్తి ప్రభు రవ్యయః. 47
జ్యోతిస్సులవలన వేదములు, వానినుండి హయగ్రీవుడు, అతనినుండి తాతయగు బ్రహ్మయు అవ్యయుడై వెలయుచున్నాడు.
పితామహా న్మహాదేవో జాగర్తి భగవాన్ శివః,
విశ్వదేవాః శివాచ్చాపి విశ్వేభ్యశ్చ తథర్షయః. 48
బ్రహ్మవలన మహాదేవుడగు శివుడు, శివునివలన విశ్వదేవతలు, వారినుండి ఋషులు మెలకువ నందిరి.
ఋషిభ్యో భగవాన్ సోమః సోమాద్దేవాః సనాతనాః,
దేవేభ్యో బ్రాహ్మణా ల్లోకే జాగ్రతీత్యుపధారయ. 49
ఋషులవలన భగవంతుడగు సోముడు, సోమునివలన సనాతనులగు దేవతలు, దేవతలవలన లోకమున బ్రాహ్మణులు దండవిషయమున జాగరూకులై యున్నారని తెలిసికొనుము.
బ్రాహ్మణేభ్యశ్చ రాజన్యా లోకాన్ రక్షన్తి ధర్మతః,
స్థావరం జఙ్గమం చైవ క్షత్రియేభ్యః సనాతనమ్. 50
బ్రాహ్మణులవలన రాజన్యులు మెలకువ కలవారై లోకములను ధర్మముతో కాపాడుచున్నారు. క్షత్రియులవలన స్థావరము, జంగమము అయిన దెల్ల చక్కగా నిలద్రొక్కుకొనియున్నది.
ప్రజా జాగర్తి లోకేఽస్మిన్ దణ్డో జాగర్తి తాసు చ,
సర్వం సంక్షిపతే దణ్డం పితామహసమప్రభః. 51
ఈలోకమున ప్రజయు, వారియందు దండమును మెలకువతో నిలిచియున్నవి. బ్రహ్మతోసాటియగు కాంతి కలదియై దండము సర్వమును ఒక్కత్రాటికి తెచ్చుచున్నది.
జాగర్తి కాలః పూర్వంచ మధ్యే చాన్తే చ భారత,
ఈశ్వరః సర్వలోకస్య మహాదేవః ప్రజాపతిః. 52
కాలము మొదట, నడుమ, తుదిని మెలకువతో నున్నది. అదియే సర్వలోకమునకు ఈశ్వరుడు, మహాదేవుడు, ప్రజాపతి.
దేవదేవః శివః సర్వో జాగర్తి సతతం ప్రభుః,
కపర్దీ శంకరో రుద్రః శివః స్థాణు రుమాపతిః.
ఇత్యేష దజ్ఞో విఖ్యాత ఆదౌ మధ్యే తథావరే, 53
దేవదేవుడు, శివుడు, సర్వుడు ఎల్లకాలములలో ప్రభువై మెలకువతో నున్నాడు. కపర్ది, శంకరుడు, రుద్రుడు, శివుడు, స్థాణువు, ఉమాపతి అను పేర్లతో దండపురుషుడే ఆదిమధ్యాంతములయందు ప్రసిద్ధుడై యున్నాడు.
భూమిపాలో యథాన్యాయం వర్తేతానేన ధర్మవిత్. 54
భూమిపాలుడు ధర్మమెరిగినవాడై ఈదండముతో న్యాయము తప్పక మెలగవలయును.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
ఇతీదం వసుహోమస్య శృణుయా ద్యో మతం నరః,
శ్రుత్వా సమ్యక్ప్రవర్తేత సర్వాన్ కామా నవాప్నుయాత్. 55
ఇట్లీవసుహోముని మతమును విన్ననరుడు విని చక్కగా ప్రవర్తింపవలయును . అట్టివాడు కోరికలన్నింటిని పొందును.
ఇతి తే సర్వమాఖ్యాతం యో దణ్డో మనుజర్షభ,
నియన్తా సర్వలోకస్య ధర్మక్రాన్తస్య భారత. 56
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మాను శాసనపర్వణి దణ్డోత్పత్త్యుపాఖ్యానే ద్వావింశాధిక శతతమోఽధ్యాయః
మనుజాధిపా! భారతా! దండమననేమో అది ధర్మమాక్రమించిన లోకము లన్నింటిని ఎట్లు హద్దులలో నిలుపుచున్నదో సర్వమును నీకు తెలిపితిని.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మాను శాసనపర్వమున దణ్డోత్పత్తి ఉపాఖ్యానముగల నూటయిరువది రెండవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లు పలికెను.
తాత ధర్మార్థకామానాం శ్రోతు మిచ్ఛామి నిశ్చయమ్,
లోకయాత్రా హి కార్త్స్యేన తిష్ఠే త్కేషు ప్రతిష్ఠితా. 1
తాతా! లోకయాత్ర యంతయు మొత్తముగా వేనియందు పాదుకొనియున్నదో అట్టి ధర్మార్థకామముల నిశ్చయమును వినగోరుచున్నాను.
ధర్మార్థకామాః కింమూలా స్త్రయాణాం ప్రభవశ్చ కః,
అన్యోన్యం చానుషజ్జన్తే వర్త న్తే చ పృథక్పృథక్. 2
ధర్మము, అర్థము, కామము అనువానిమూలమేది? ఆమూడును ఎటనుండి పుట్టినవి? వానిలో ఒక దానితో ఒక దానికి గల సంబంధమేమి? వేరువేరుగా ఎట్లు ప్రవర్తించుచున్నవి.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను
యదా తే స్యుః సుమనసో లోకే ధర్మార్థ నిశ్చయే,
కాలప్రభవసంస్థాసు సజ్జన్తే చ త్రయ స్తదా. 3
ధర్మపూర్వకమైన అర్థనిశ్చయమునందు మానవులు మంచిబుద్ధి కలవారైనపుడు, కాలము, ప్రభవము, సంస్థ అనువానియందు అవి ఒకదానితో ఒకటి కూడియుండును.
ధర్మమూల: సదైవార్థ: కామో ఽర్థ ఫల ముచ్యతే,
సంకల్పమూలా స్తే సర్వే సుకల్పో విషయాత్మకః. 4
ఎల్లప్పుడును అర్థము ధర్మమే మూలముగా కలది. కామము అర్థము యొక్క ఫలము. అవియన్నియు సంకల్ప మూలములు. సంకల్పము విషయరూపమైనది.
విషయాశ్చైవ కార్త్స్న్యేన సర్వ ఆహారసిద్ధయే,
మూల మేతత్త్రివర్గస్య నివృత్తి ర్మోక్ష ఇష్యతే. 5
విషయములన్నియు మొత్తముగా ఆహారసిద్ధి కొరకే. ఇది త్రివర్గమునకు మూలము. నివృత్తియే మోక్షము.
ధర్మా చ్ఛరీరసంగుప్తి ర్ధర్మార్థం చార్థ ఉచ్యతే,
కామో రతిఫల శ్చాత్ర సర్వే తే చ రజస్వలాః. 6
ధర్మమువలన శరీరసంరక్షణము అగును. ధర్మముకొరకు అర్థము అని చెప్పుదురు. కామము రతియే ఫలముగాగలది. అవియన్నియు రజస్సే ప్రధానముగా కలవి.
సంనికృష్టాం శ్చరే దేతా న్న చైతా న్మనసా త్యజేత్
విముక్త స్తపసా సర్వాన్ ధర్మాదీన్ కామనైష్ఠికాన్. 7
మిక్కిలి దగ్గరగానున్న వీని నాచరింపవలయును. వీనిని మనస్సుచేతను విడువరాదు. తపస్సుచేత ధర్మము, అర్థము, కామము అను వాని నన్నింటిని విడువవలయును.
శ్రేష్ఠే బుద్ధి స్త్రివర్గస్య యదయం ప్రాప్నుయాన్నర:
కర్మణా బుద్ధి పూర్వేణ భవత్యర్థో న వా పునః. 8
త్రివర్గమునందలి బుద్ధినిష్ఠను శ్రేష్ఠమగు మోక్షమునందు నిలిపినచో నరుడు దానిని పొందును. బుద్ధిపూర్వకమైన కర్మముచేత అర్థము కలుగునో కలుగదో చెప్పజాలము.
అర్థార్థ మన్య ద్భవతి విపరీత మథాపరమ్,
అనర్థార్థ మవాపార్థ మన్య త్రా ద్యోపకారకమ్,
బుద్ధ్యా బుద్ధి రిహార్థే న తదజ్ఞాననికృష్టయా. 9
అర్థముకొరకైనది మరియొకటి కలదు. అనర్థమును కలిగించునదియు మరియొకటి కలదు. అర్థమును పొందియు లోకము అనర్థమునకే యగుచున్నది. కనుక మొదటిదగు ధర్మమునకు ఉపకారకమైనది యితరమే యగును. ఈ విషయమున అజ్ఞానముగుంజివైచిన బుద్ధితో బుద్ధిహీనుడు ధర్మార్థముల ఫలమును పొందజాలడు.
అపధ్యానమలో ధర్మో మలో ఽ ర్థస్య నిగూహనమ్,
సంప్రమోదమలః కామో భూయః స్వగుణవర్జితః 10
ధర్మము అపధ్యానమే మలముగా గలది. దాచి ఉంచుటయే అర్థపుమలము. సంప్రమోదమే మలముగా గలదికామము. ఇట్టి అగుణములను వదలినదియే గొప్ప ఫలము నొసగునది.
అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
కామన్దకస్య సంవాద మాఙ్గరిష్ఠస్య చోభయోః. 11
ఈ విషయమునందు ప్రాతకాలపునాటి యితిహాసమును ఉదాహరింతురు. అది కామందకుడు, ఆంగరిష్ఠుడు అనువారి సంవాదము.
కామన్ద మృషి మాసీన మభివాద్య నరాధిపః,
ఆఙ్గరిష్ణో ఽథ పప్రచ్ఛ కృత్వా సమయ పర్యయమ్. 12
ఆంగరిష్ఠుడను మహారాజు, కూర్చుండి యున్న కామంద ఋషికి అభివాదముచేసి, మర్యాదను పాటింపక, యిట్లు అడిగెను.
యః పాపం కురుతే రాజా కామ మోహ బలాత్కృతః,
ప్రత్యాసన్నస్య తస్యర్షే కిం స్యా త్పాప ప్రణాశనమ్. 13
రాజు కామమోహముల ఒత్తిడికి లోనై పాపము చేసెనేని ఋషీ! పశ్చాత్తాపము పొందిన అతనికి పాపము నశించు మార్గమేది?
అధర్మం ధర్మ ఇతి చ యో ఽజ్ఞానా దాచరే న్నరః,
తం చాపి ప్రథితం లోకే కథం రాజా నివర్తయేత్. 14
అజ్ఞానమువలన నరుడు ధర్మమనుకొని అధర్మము నాచరించును. అదియు లోకమున వెల్లడి అయినది. రాజు దానినెట్లు మరలింప వలయును?
కామందక ఉవాచ- కామందకు డిట్లు పలికెను.
యో ధర్మార్థే పరిత్యజ్య కామ మేవానువర్తతే,
సధర్మార్థ పరిత్యాగా త్ర్ప జ్ఞానాశ మిహార్ఛతి. 15
ధర్మార్థములను వదలివైచి కామమునే పట్టి వ్రేలువాడు,ధర్మార్థముల పరిత్యాగము వలన ప్రజ్ఞానాశమును పొందును.
ప్రజ్ఞానాశాత్మకో మోహ స్తథా ధర్మార్థ నాశకః,
తస్మా న్నాస్తికతా చైవ దురాచారశ్చ జాయతే. 16
మోహము ప్రజ్ఞను నశింపజేయు నట్టిది. అది ధర్మమును, అర్థమును నశింపజేయునట్టిదియు నగును. దానివలన నాస్తికత ఏర్పడును. దురాచారము పుట్టును.
దురాచారాన్ యదా రాజా ప్రదుష్టా న్న నియచ్ఛతి,
తస్మా దుద్విజతే లోకః సర్పా ద్వేశ్మ గతా దివ. 17
మిక్కిలి దుష్టములైన దురాచారములను రాజు నిలువరింపనిచో లోకము అట్టి వానివలన, ఇంటిలో దూరిన పాము వలన వలె, బెదరిపోవుచుండును.
తం ప్రజా నానువర్తన్తే బ్రాహ్మణా నచ సాధవః,
తతః సంశయ మాప్నోతి తథా వధ్యత్వ మేతి చ. 18
అట్టి రాజును ప్రజలు అనుసరింపరు. సాధువులైన బ్రాహ్మణులును అతనిని మన్నింపరు. దానివలన అతని బ్రదుకు సంశయము పాలగును. అట్లతడు వధ్యతను పొందును.
అపధ్వస్త స్త్యవమతో దుఃఖం జీవిత మృచ్ఛతి,
జీవేచ్చ యదపధ్వ స్తస్తచ్ఛుద్ధం మరణం భవేత్. 19
సర్వమును కోల్పోయి, అవమానములు పొంది అతడు దుఃఖమైన జీవితము కలవాడగును. సర్వనాశనము పొంది అతడు బ్రదికి యున్నను అది శుద్ధమైన మరణమే యగును.
అత్రైత దాహు రాచార్యాః పాపస్య పరిగర్హణమ్,
సేవితవ్యా త్రయీవిద్యా సత్కారో బ్రాహ్మణేషు చ. 20
ఈ పాపమునకు పరిహారముగా ఆచార్యులు వేదవిద్యను సేవించుట, బ్రాహ్మణులయందు సత్కారము అను వానిని చెప్పుదురు.
మహామనా భవేద్ధర్మే వివహేచ్చ మహాకులే,
బ్రాహ్మణాం శ్చాపి సేవేత క్షమాయుక్తా న్మనస్వినః 21
ధర్మమునందు దొడ్డబుద్ధికలవాడు కావలయును. గొప్ప ఓరిమితో కూడిన అభిమానధనులగు బ్రాహ్మణులను సేవింప వలయును.
జపే దుదకశీలః స్యా త్సతతం సుఖ మాస్థితః.
ధర్మాన్వితాన్ సంప్రవిశేద్ బహిః కృత్వేహ దుష్కృతీన్. 22
నీటిని మాత్రము పుచ్చుకొనుచు ఎల్లవేళల సుఖముగా కూర్చుండి జపించు చుండవలయును. ధర్మముతో కూడిన వారిని కలియుచుండవలయును. పాపపు పనులు చేయువారిని వెలుపలికి గెంటివేయవలయును.
ప్రసాదయే న్మధురయా వాచా వాఽ ప్యథ కర్మణా,
తవాస్మీతి వదే న్నిత్యం పరేషాం కీర్తయన్ గుణాన్. 23
తీయని మాటతోడనో, మంచి పనితోడనో వారిని ప్రసన్నులను చేసికొనవలయును. నేనునీవాడనని నిత్యము పలుకుచుండవలయును. ఇతరుల గుణములను కొనియాడు చుండవలయును.
అపాపో హ్యేవ మాచారః క్షిప్రం బహుమతో భవేత్,
పాపాన్య పి హి కృచ్ఛ్రాణి శమయే న్నాత్ర సంశయః. 24
ఇట్టి ఆచారములు కలవాడు వెను వెంటనే పాపములు తొలగినవాడగును. అతి కష్టములగు పాపములను కూడ ఇది అణగార్చును. ఇందు సందియములేదు.
గురవో హి పరం ధర్మం యం బ్రూయు స్తం తథా కురు,
గురూణాం హి ప్రసాదా ద్వై శ్రేయః పర మవాప్స్యసి. 25
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసన పర్వణి కామందాంగరిష్ఠ సంవాదే త్రయోవింశాధిక శతతమోఽధ్యాయః
పరమధర్మము నుపదేశించు గురువులు చెప్పెడుదానిని చేయుము. గురువుల ప్రసాదమువలన పరమ శ్రేయమును పొందెదవు.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున రాజ ధర్మానుశాసన పర్వమున కామందాంగరిష్ఠ సంవాదము గల నూట యిరువది మూడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ-యుధిష్ఠిరు డిట్లు పలికెను.
ఇమే జనా నరశ్రేష్ఠ ప్రశంసన్తి సదా భువి,
ధర్మస్య శీల మేవాదౌ తతో మే సంశయో మహాన్. 1
నరవరా! ఎల్లవేళల ఈ భూమిలో ఈ జనులు ధర్మమునకు కారణముగా శీలమునే మొట్ట మొదట కొనియాడుదురు. దానివలన నాకొక పెద్ద సంశయము కలుగుచున్నది.
యది తచ్ఛక్య మస్మాభి ర్జ్ఞాతుం ధర్మభృతాం వర,
శ్రోతు మిచ్ఛామి తత్సర్వం యథై తదుపలభ్యతే. 2
ధర్మమును కాపాడువారిలో శ్రేష్ఠుడా ! అందినంతవరకు దానిని అంతటిని వినగోరుచున్నాను. మేము తెలియగలుగు వారమైనచో తెలుపుము.
కథం తత్రాప్యతే శీలం శ్రోతు మిచ్ఛామి భారత!
కిం లక్షణం చ తత్రోక్తం బ్రూహి మే వదతాంవర! 3
భారతా! వాగ్విశారదా! ఆ శీలమును పొందు టెట్లో వినగోరుచున్నాను. దాని లక్షణ మేమని చెప్పిరో నాకు చెప్పుము.
భీష్మ ఉవాచ- భీష్ము డిట్లు పలికెను.
పురా దుర్యోధనేనేహ ధృతరాష్ట్రాయ మానద,
ఆఖ్యాతం తప్యమానేన శ్రియం దృష్ట్వా తథాగతామ్. 4
ఆ విధముగా వచ్చిపడిన నీ సంపదను గాంచి కుములుచున్న దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను.
ఇంద్రప్రస్థే మహారాజ తవ సభ్రాతృకస్య హ,
సభాయాం చాహ వచనం తత్సర్వం శృణు భారత. 5
తమ్ములతో కూడిన నీ ధనము నంతటిని ఇంద్రప్రస్థమున చూచినప్పటి మాట. అది యంతయు వినుము.
భవత స్తాం సభాం దృష్ట్వా సమృద్ధిం చాప్యనుత్తమామ్,
దుర్యోధన స్తదాసీనః సర్వం పిత్రే న్యవేదయత్. 6
నీ ఆ సభను, మిక్కిలి గొప్పదియగు సమృద్ధిని చూచి దుర్యోధనుడు కూలబడి తండ్రి కంతయు నివేదించెను.
శ్రుత్వా హి ధృతరాష్ట్రస్య దుర్యోధన వచస్తదా,
అబ్రవీత్ కర్ణసహితం దుర్యోధన మిదం వచః. 7
దుర్యోధనుని పలుకు విని ధృతరాష్ట్రుడు కర్ణునితో కూడిన దుర్యోధనునితో ఇట్లు పలికెను.
ధృతరాష్ట్ర ఉవాచ- ధృతరాష్ట్రు డిట్లనెను.
కిమర్థం తప్యసే పుత్ర శ్రోతు మిచ్ఛామి తత్త్వతః,
శ్రుత్వా త్వా మనునేష్యామి యది సమ్యగ్భవిష్యతి. 8
కొడుకా ! ఏల కుమిలి పోయెదవు. ఉన్నదున్నట్లు వినగోరుదును. విని, అంతయు సరిగా నున్నచో, నిన్ను అనునయించెదను.
త్వయా చ మహ దైశ్వర్యం ప్రాప్తం పరపురంజయ!
కింకరా భ్రాతరః సర్వే మిత్ర సంబంధినః సదా. 9
శత్రుపురములను గెలిచిన నీవు కూడ దొడ్డ సంపదను పొందితివి. తమ్ములు, చెలికాండ్రు, చుట్టములు అందరు ఎల్లవేళల నీకు కింకరులై యున్నారు.
ఆచ్ఛాదయసి ప్రావారా నశ్నాసి పిశితౌదనమ్,
ఆజానేయా వహన్త్య శ్వాః కేనాసి హరిణః కృశః. 10
వెలగల వస్త్రములను కట్టుచున్నావు. మాంసభోజనము తినుచున్నావు. మేలుజాతి గుఱ్ఱములు నీరథమును మోయుచున్నవి. ఏ కారణముగా పాలిపోయి చిక్కిపోయితివి?
దుర్యోధన ఉవాచ - దుర్యోధను డిట్లనెను.
దశ తాని సహస్రాణి స్నాతకానాం మహాత్మనామ్,
భుఞ్జతే రుక్మపాత్రీభి ర్యుధిష్ఠిర నివేశనే. 11
యుధిష్ఠిరుని యింట చక్కని విద్యావంతులయిన మహాత్ములు పదివేలమంది ప్రతిదినము బంగారు పాత్రలలో భుజించుచున్నారు.
దృష్ట్వా చ తాం సభాం దివ్యాం దివ్యపుష్పఫలాన్వితామ్,
అశ్వాం స్తిత్తిర కల్మాషాన్ వస్త్రాణి వివిధాని చ. 12
దృష్ట్వా తాం పాణ్డవేయానా మృద్ధిం వైశ్రవణీం శుభామ్,
అమిత్రాణాం సుమహతీ మనుశోచామి భారత. 13
మనకు పగవారైన పాండవుల స్వర్గలోకపు పూలతో పండ్లతో కలకలలాడుచున్న ఆదివ్యసభను, తిత్తిరిపక్షులవన్నెలవంటి వన్నెచిన్నెలుగల ఆ గుఱ్ఱములను, వింతవింత వస్త్రములను, కుబేరుని తలదన్నిన ఆ మేలైన గొప్ప సంపదను గాంచి ఏడ్చుచున్నాను.
ధృతరాష్ట్ర ఉవాచ - ధృతరాష్ట్రు డిట్లనెను.
యదీచ్ఛసి శ్రియం తాత యాదృశీ సా యుధిష్ఠిరే,
విశిష్టాం వా నరవ్యాఘ్ర శీలవాన్ భవ పుత్రక! 14
నాయనా! కొడుకా! యుధిష్ఠిరుని యందున్నదానివంటిదో, దాని తలదన్నినదో యగు సంపదను కోరుదువేని నీవు శీలవంతుడవు కమ్ము.
శీలేన హి త్రయో లోకాః శక్యా జేతుం న సంశయః,
న హి కిఞ్చి దసాధ్యం వై లోకే శీలవతాం భవేత్. 15
శీలముతో మూడులోకములను గెలువనగును. సంశయము లేదు. లోకమున శీలవంతులకు అసాధ్యమైనది ఏ కొంచెమును లేదు.
ఏకరాత్రేణ మాన్ధాతా త్య్రహేణ జనమేజయః,
సప్తరాత్రేణ నాభాగః పృథివీం ప్రతిపేదిరే. 16
ఒక్కరాత్రిలో మాంధాతయు, మూడు దినములలో జనమేజయుడును, ఏడురాత్రులలో నాభాగుడును భూమిని చేజిక్కించుకొనిరి.
ఏతే హి పార్థివాః సర్వే శీలవన్తో దయాన్వితాః,
అత స్తేషాం గుణక్రీతా వసుధా స్వయ మాగతా. 17
ఈ మహారాజులందరు దయగలవారు, శీలము పండించుకొన్నవారు. అందువలననే వారి గుణముల కమ్ముడు వోయిన వసుధ తనకు తానై వారికి వశమాయెను.
దుర్యోధన ఉవాచ - దుర్యోధను డిట్లు పలికెను.
కథం తత్ ప్రాప్యతే శీలం శ్రోతు మిచ్ఛామి భారత!
యేన శీలేన తైః ప్రాప్తా క్షిప్ర మేవ వసుంధరా. 18
ఏ శీలముతో ఆ మహారాజులు అంత శీఘ్రముగా వసుంధరను చేజిక్కించుకొనిరో భారతా! ఆ శీలమును సాధించు టెట్లో వినగోరుదును.
ధృతరాష్ట్ర ఉవాచ - ధృతరాష్ట్రు డిట్లు పలికెను.
అత్రా ప్యుదాహర న్హీమ మితిహాసం పురాతనమ్,
నారదేన పురా ప్రోక్తం శీల మాశ్రిత్య భారత! 19
ఈ విషయమున ఈ ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుకొనుచుందురు. శీలమును గూర్చి మునుపు నారదుడు దీనిని వక్కాణించెను.
ప్రహ్లాదేన హృతం రాజ్యం మహేన్ద్రస్య మహాత్మనః,
శీల మాశ్రిత్య దైత్యేన త్రైలోక్యం చ వశే కృతమ్. 20
మహాత్ముడగు మహేంద్రుని రాజ్యమును ప్రహ్లాదుడు కొల్లగొట్టెను. ఆ దైత్యుడు శీలముతో మూడు లోకములను వశము చేసికొనెను.
తతో బృహస్పతిం శక్రః ప్రాఞ్జలి: సముపస్థితః,
తమువాచ మహాప్రాజ్ఞః శ్రేయ ఇచ్ఛామి వేదితుమ్. 21
అంత ఇంద్రుడు బృహస్పతికడ కరిగి దోసిలొగ్గి నాకు మేలైనది తెలియగోరుచున్నానని పలికెను.
తతో బృహస్పతి స్తస్మై జ్ఞానం నైఃశ్రేయసం పరమ్,
కథయామాస భగవాన్ దేవేంద్రాయ కురూద్వహ. 22
అంత భగవంతుడగు బృహస్పతి దేవేంద్రునకు మోక్ష సంబంధమైన ఉత్కృష్టమైన జ్ఞానమును బోధించెను.
ఏతావ చ్ఛ్రేయ ఇత్యేవ బృహస్పతి రభాషత,
ఇన్ద్రస్తు భూయః పప్రచ్ఛ కో విశేషో భవే దితి. 23
బృహస్పతి యింతకంటెను మేలైనది కలదని పలికెను. అప్పు డింద్రుడు ఆ విశేషమేమి యగునో యని యడిగెను.
బృహస్పతి రువాచ - బృహస్పతి యిట్లు పలికెను.
విశేషోఽస్తి మహాం స్తాత భార్గవస్య మహాత్మనః,
అత్రాగమయ భద్రం తే భూయ ఏవ సురర్షభ. 24
బాబూ! గొప్ప విశేషము కలదు. అది మహాత్ముడగు శుక్రాచార్యునకు సంబంధించినది. దేవరాజా! నీకు మేలగుగాక! ఆ మహానుభావునివలన ఆ జ్ఞానమును పొందుము.
ఆత్మన స్తు తతః శ్రేయో భార్గవాత్ సుమహాతపాః,
జ్ఞాన మాగమయత్ ప్రీత్యా పునః స పరమద్యుతిః. 25
అంత గొప్పతపస్సు, శ్రేష్ఠమగు ముఖకాంతి గల ఆ దేవేంద్రుడు భృగువంశమువాడగు శుక్రునివలన ఆగొప్ప శ్రేయస్సును పొందెను.
తేనాపి సమనుజ్ఞాతో భార్గవేణ మహాత్మనా,
శ్రేయోఽస్తీతి పున ర్భూయః శుక్ర మాహ శతక్రతుః. 26
మహాత్ముడగు శుక్రాచార్యుడు బోధింపగా ఇంద్రుడు ఇంతకంటెను మేలైనది కలదా? అని శుక్రు నడిగెను.
భార్గవ స్త్వాహ సర్వజ్ఞః ప్రహ్లాదస్య మహాత్మనః,
జ్ఞానమస్తి విశేషే ణే త్యుక్తో హృష్టశ్చ సోఽభవత్. 27
అప్పుడన్నియు నెరిగిన భార్గవుడు మహాత్ముడగు ప్రహ్లాదుని కడ విశేషముగా జ్ఞానము కలదని పలికెను. దానితో ఆతడానంద మందెను.
స తతో బ్రాహ్మణో భూత్వా ప్రహ్లాదం పాకశాసనః,
గత్వా ప్రోవాచ మేధావీ శ్రేయ ఇచ్ఛామి వేదితుమ్. 28
అంత తెలివిగల పాకశాసనుడు బ్రాహ్మణరూపము ధరించి ప్రహ్లాదునికడ కరిగి శ్రేయము నెరుగగోరుచున్నానని పలికెను.
ప్రహ్లాద స్త్వబ్రవీద్ విప్రం క్షణో నాస్తి ద్విజర్షభ,
త్రైలోక్యరాజ్య సక్తస్య తతో నోపదిశామి తే. 29
ప్రహ్లాదు డిట్లనెను. ఓయి! బ్రాహ్మణ శ్రేష్ఠా! మూడులోకముల రాజ్యముతో తగులము కలనాకు తీరిక లేదు. అందువలన నేను నీ కుపదేశింపను.
బ్రాహ్మణ స్త్వబ్రవీద్ రాజన్ యస్మిన్ కాలే క్షణో భవేత్,
తదో పాదేష్టు మిచ్ఛామి యదా చర్య మనుత్తమమ్. 30
అంత బ్రాహ్మణు డిట్లనెను; రాజా! నీ కెప్పుడు తీరిక దొరకునో అప్పుడే శ్రేష్ఠమగు ఆచరింపదగిన దానిని ఉపదేశింపుము. నేను వినగోరుదును.
తతః ప్రీతో ఽభవద్ రాజా ప్రహ్లాదో బ్రహ్మవాదినః,
తథేత్యుక్త్యా శుభే కాలే జ్ఞాన తత్త్వం దదౌ తదా. 31
అంత ఆ రాజు ప్రహ్లాదుడు ఆ బ్రాహ్మణుని మాటకు ప్రీతుడాయెను. అట్లే అని పలికి శుభమైన కాలమున ఆతనికి జ్ఞానతత్త్వమును ప్రసాదించెను.
బ్రాహ్మణో ఽపి యథాన్యాయం గురు వృత్తి మనుత్తమామ్,
చకార సర్వభావేన యదస్య మనసేప్సితమ్. 32
బ్రాహ్మణుడు తగిన విధముగా అతడు మనసున కోరినదానికి తగువిధముగా మనసంతయు నిలిపి మిక్కిలి శ్రేష్ఠమగు సేవను చేసెను.
పృష్టశ్చ తేన బహుశః ప్రాప్తం కథ మనుత్తమమ్,
త్రైలోక్య రాజ్యం ధర్మజ్ఞ కారణం తద్ బ్రవీహి మే,
ప్రహ్లాదోఽపి మహారాజ బ్రాహ్మణం వాక్య మబ్రవీత్. 33
ధర్మజ్ఞా ! నీవు మూడు లోకముల రాజ్యము నెట్లు పొందితివి? ఆ కారణమును నాకు చెప్పుమని పలుమారులు అడిగెను. ప్రహ్లాదుడును బ్రాహ్మణునితో ఇట్లు పలికెను.
ప్రహ్లాద ఉవాచ - ప్రహ్లాదు డిట్లు పలికెను.
నా సూయామి ద్విజాన్ విప్ర రాజాస్మీతి కదాచన,
కావ్యాని వదతాం తేషాం సంయచ్ఛామి వహామి చ. 34
విప్రా! నేను ఏలిక నని విప్రుల యెడ నెన్నటికి అసూయ పొందను. శుక్రుడుపదేశించిన నీతులను వారు ఉపదేశించుచుండగా వానిని మిక్కిలి శ్రద్ధతో వినుచుందును. వానిని హృదయమున పట్టుకొని యుందును.
తే విశ్రద్ధాః ప్రభాషన్తో సంయచ్ఛన్తి చ మాం సదా,
తే మాం కావ్యపథే యుక్తం శుశ్రూషు మనసూయకమ్. 35
ధర్మాత్మానం జితక్రోధం నియతం సంయతేన్ద్రియమ్,
సమాసిఞ్చన్తి శాస్తారః క్షౌద్రం మధ్వివ మక్షికాః. 36
వారు నాయందు విశ్వాసము కలవారై అసూయలేనివాడను, వినుకోరిక కలవాడను, శుక్ర నీతి మార్గమున మనసుపెట్టిన వాడను అగు నన్ను నియమ పూర్వకముగా బోధించిరి. ధర్మాత్ముడను, క్రోధమును అదుపున నుంచుకొనినవాడను, ఇంద్రియములపై పట్టు గలవాడను, నియమముల ననుసరించి నడచుకొనువాడను అగు నన్ను ఆ గురువులు, తేనెటీగలు తేనెతోవలె, నన్ను నిలువెల్ల స్నానమాడించిరి.
సోఽహం వాగగ్రవిద్యానాం రసానా మవలేహితా,
స్వజాత్యా నధితిష్ఠామి నక్షత్రాణీవ చన్ద్రమాః.. 37
నేనును వాక్కుల చివర విద్యలుగలవారు ప్రసాదించినరసములను జుఱ్ఱినవాడనై నా జాతివారినందరిని, చంద్రుడు నక్షత్రములను వలె, మించి పోయితిని.
ఏతత్ పృథివ్యా మమృత మేత చ్చక్షు రనుత్తమమ్,
యద్ బ్రాహ్మణ ముఖే కావ్య మేత చ్ఛ్రుత్వా ప్రవర్తతే. 38
ఇది భూమియందు అమృతము. ఇది మిక్కిలి శ్రేష్ఠమగు కన్ను. బ్రాహ్మణుని ముఖమున ప్రసరించిన శుక్రనీతి. రాజు దీనిని విని అట్లు ప్రవర్తింపవలయును.
ఏతావచ్ఛ్రేయ ఇత్యాహ ప్రహ్లాదో బ్రహ్మవాదినమ్,
శుశ్రూషిత స్తేన తదా దైత్యేన్ద్రో వాక్య మబ్రవీత్. 39
ఆ బ్రాహ్మణుడట్లు సేవింపగా ప్రహ్లాదుడు ఇంతమాత్రమే శ్రేయమైనదని పలికెను. పిమ్మట రాక్షసరాజు ఇట్లు పలికెను.
యథావద్ గుణవృత్త్యా తే ప్రీతోఽస్మి ద్విజసత్తమ,
వరం వృణీష్వ భద్రం తే ప్రదాతాస్మి న సంశయః. 40
ఓయి ద్విజసత్తమా! నీ గుణములతో కూడిన నడవడితో ప్రీతి నందితిని. వరము కోరుకొమ్ము. నీకు మేలగుగాక! ఇత్తును. సంశయము లేదు.
కృత మిత్యేవ దైత్యేన్ద్ర మువాచ సచ వై ద్విజః,
ప్రహ్లాద స్త్వబ్రవీత్ ప్రీతో గృహ్యతాం వర ఇత్యుత. 41
సరియే యని ఆ బాపడు రాక్షసరాజుతో ననెను. ప్రహ్లాదుడు ప్రీతుడై వరము కొనుమని పలికెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు పలికెను.
యది రాజన్ ప్రసన్న స్త్వం మమ చేదిచ్ఛసి ప్రియమ్,
భవతః శీల మిచ్ఛామి ప్రాప్తు మేష వరో మమ. 42
రాజా! నాకు ప్రసన్నుడవైనచో నాకు ప్రియము కోరుదువేని నీ(నుండి) శీలమును పొందగోరుచున్నాను. ఈ వరము నా కనుగ్రహింపుము.
తతః ప్రీతస్తు దైత్యేన్ద్రో భయ మస్యాభవ న్మహత్,
వరే ప్రదిష్టే విప్రేణ నాల్పతేజాయ మిత్యుత. 43
అంత దైత్యపతి ప్రీతుడయ్యు అతనికి పెనుభయము కలిగెను. వరము నొసగినచో ఆవిప్రుడు మహాతేజస్సు కలవాడగును కదా! అని భయపడెను.
ఏవ మస్త్వితి సప్రాహ ప్రహ్లాదో విస్మితస్తదా,
ఉపాకృత్య తు విప్రాయ వరం దుః ఖాన్వితోఽభవత్. 44
అట్లే యగుగాక అని యతడు పలికెను. ప్రహ్లాదుడంత అచ్చెరువందెను. విప్రునకు వరమొసగి మిక్కిలి వ్యథకలవాడాయెను.
దత్తే వరే గతే విప్రే చిన్తా ఽసీ న్మహతీ తదా,
ప్రహ్లాదస్య మహారాజ నిశ్చయం న చ జగ్మివాన్. 45
వరమొసగగా విప్రుడు వెళ్లిన పిదప ప్రహ్లాదునకు, మహారాజా! మహాదుఃఖము కలిగెను. ఒక నిర్ణయమునకు రాజాలకుండెను.
తస్య చిన్తయత స్తావ చ్ఛాయాభూతం మహాద్యుతి,
తేజో విగ్రహవత్ తాత శరీర మజహాత్ తదా. 46
అట్లతడు విచారించుచుండగా గొప్ప కాంతులుగల, మూర్తినొందిన ఒక వెలుగు అతని దేహమును వదలి వైచెను.
త మపృచ్ఛన్ మహాకాయం ప్రహ్లాదః కో భవా నితి,
ప్రత్యాహ తం తు శీలోఽ స్మి త్యక్తో గచ్ఛామ్యహం త్వయా. 47
ప్రహ్లాదుడు ఆ పెనుదేహముగల ఆతనిని నీవెవరవు అని యడిగెను. అతడు నేను శీలమను. నీవు నన్ను విడిచివైవగా పోవుచున్నాను అని బదులు పలికెను.
తస్మిన్ ద్విజోత్తమే రాజన్ వత్స్యా మ్యహ మనిన్దితే,
యోఽసౌ శిష్యత్వ మాగమ్య త్వయి నిత్యం సమాహితః. 48
నీయందు శిష్యత్వమును పొంది నిచ్చలు శ్రద్ధకలవాడై యుండెనే, ఏ చెడుగుణములు లేని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని యందు నేను, రాజా, నివసింతును.
ఇత్యుక్త్యా న్తర్హితం తద్ వై శక్రం చాన్వావిశత్ ప్రభో,
తస్మిం స్తేజసి యాతే తు తాదృగ్ రూప స్తతో ఽపరః. 49
శరీరాన్నిఃసృత స్తస్య కో భవా నితి చాబ్రవీత్,
ధర్మం ప్రహ్లాద మాం విద్ధి యత్రా సౌ ద్విజ సత్తమః. 50
తత్ర యాస్యామి దైత్యేన్ద్ర యతః శీలం తతో హ్యహమ్,
ఇట్లు పలికి ఆ శీలము ఇంద్రునిలోనికి ప్రవేశించెను. ఆ తేజస్సు అట్లు వెడలగా అట్టి రూపమే గల మఱి యొకటి అతని శరీరమునుండి వెలువడెను. ప్రహ్లాదుడు నీవెవరని యడుగగా ప్రహ్లాదా! నన్ను ధర్మమునుగా ఎరుగుము. ఆ బ్రాహ్మణ ప్రవరు డెందుండెనో నేను నందే పోయెదను. ఏలయన శీలమెందుండునో నేనందుందును.
తతోఽపరో మహారాజ ప్రజ్వల న్నివ తేజసా,
శరీరా న్నిఃసృత స్తస్య ప్రహ్లాదస్య మహాత్మనః 51
మహారాజా! పిదప తేజస్సుతో వెలిగిపోవుచున్న మరియొక స్వరూపము మహాత్ముడగు ప్రహ్లాదుని శరీరమునుండి వెలువడెను.
కో భవా నితి పృష్టశ్చ తమాహ స మహాద్యుతిః,
సత్యం విద్ధ్య సురేన్ద్రాద్య ప్రయాస్యే ధర్మ మన్వహమ్. 52
గొప్పతేజశ్శాలి యగు ప్రహ్లాదుడు నీ వెవరవని యడిగెను. అంత నది అసురేంద్రా! నన్ను సత్యముగా నెరుగుము. ధర్మము వెంబడినే నేనును పోయెదను - అని పలికెను.
తస్మి న్ననుగతే సత్యే మహాన్ వై పురుషో ఽపరః. 53
నిశ్చక్రామ తతస్త స్మాత్ పృష్ట శ్చాహ మహాబలః,
వృత్తం ప్రహ్లాద మాం విద్ధి యతః సత్యం తతో హ్యహమ్. 54
ఆ సత్యమట్లు ధర్మము వెంటనంటి పోగా మరియొక మహాపురుషుడు అతనినుండి వెలువడెను. అడుగగా ఆ మహాబలుడు ప్రహ్లాదా! నేను వృత్తమను. సత్యమెందుండునో నేనందుందును అని పలికెను. (వృత్తము - మంచినడవడి)
తస్మిన్ గతే మహాశబ్దః శరీరాత్ తస్య నిర్యయౌ,
పృష్ట శ్చాహ బలం విద్ధి యతో వృత్త మహం తతః. 55
అది వెడలిపోగా ప్రహ్లాదుని శరీరమునుండి ఒక పెను నాదము వెలుపలికి వచ్చెను. అడుగగా ‘నేను బలమను. వృత్త మెట నుండునో నేనట నుందు’నని అది బదులు పలికెను.
ఇత్యుక్త్యా ప్రయయౌ తత్ర యతో వృత్తం నరాధిప,
తతః ప్రభామయీ దేవీ శరీరాత్ తస్య నిర్యయౌ. 56
తామపృచ్ఛత్ స దైత్యేన్ద్రః సా శ్రీ రి త్యేన మబ్రవీత్,
ఉషితాస్మి స్వయం వీర త్వయి సత్యపరాక్రమ. 57
త్వయా త్యక్తా గమిష్యామి బలం హ్యనుగతా హ్యహమ్.
అని పలికి అది వృత్త మున్నచోటికి వెడలిపోయెను. పిదప గొప్ప కాంతులను విరజిమ్ము ఒక దేవి ఆతనిశరీరమునుండి బయటికి వచ్చెను. దైత్యరాజు ఆమెను అడిగెను. నేను లక్ష్మీదేవి నని యామె బదులు పలికెను. వీరుడా! సత్య పరాక్రముడా! నాకు నేనై యిన్ని నాళ్లు నీ యందు నెలకొని యుంటిని. నీవు విడువగా ఇప్పుడు నేను బలము వెనుదగిలి వెడలుచున్నాను అని పలికెను.
తతో భయం ప్రాదు రాసీత్ ప్రహ్లాదస్య మహాత్మనః.
అపృచ్ఛత్ స తతో భూయః క్వ యాసి కమలాలయే, 58
త్వం హి సత్యవ్రతా దేవీ లోకస్య పరమేశ్వరీ,
కశ్చాసౌ బ్రాహ్మణశ్రేష్ఠ స్తత్వ మిచ్ఛామి వేదితుమ్. 59
అంత మహాత్ముడగు ప్రహ్లాదునకు భయము పైకొనెను. ఇట్లడిగెను- ‘ఓ కమలాలయా! ఎందు బోయెదవు? నీవు సత్యమునందు నిష్ఠ కలదానవు. లోకమునకు పరమేశ్వరివి. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడెవడు? నిజము నెరుగ గోరుచున్నాను.’
శ్రీ రువాచ - శ్రీ యిట్లు పలికెను.
స శక్రో బ్రహ్మచారీ య స్త్వత్త శ్చై వో పశిక్షితః,
త్రైలోక్యే తే యదైశ్వర్యం తత్ తేనాపహృతం విభో. 60
దొరా! ఆ బ్రహ్మచారి ఇంద్రుడు. ఆతనికి నీవు విద్య నేర్పితివి. మూడులోకములందు గల నీ ఐశ్వర్యము నాతడు కొల్లగొట్టెను.
శీలేన హి త్రయో లోకా స్వయా ధర్మజ్ఞ నిర్జితాః,
తద్విజ్ఞాయ సురేన్ద్రేణ తవ శీలం హృతం ప్రభో. 61
ధర్మజ్ఞుడా! నీవు శీలముతో మూడు లోకములను గెలుచుకొంటివి. అది యెరిగి, ప్రభూ! దేవేంద్రుడు నీ శీలమును దోచుకొనెను.
ధర్మః సత్యం తథా వృత్తం బలం చైవ తథా ఽప్యహమ్,
శీలమూలా మహాప్రాజ్ఞ సదా నాస్త్యత్ర సంశయః. 62
గొప్ప ప్రజ్ఞగల ఓ రాజా! ధర్మము, సత్యము, మంచి నడవడి, బలము అట్లే నేనును శీలము కుదురుగా గలవారము. ఇందు సంశయము లేదు.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
ఏవ ముక్త్యా గతా శ్రీస్తు తే చ సర్వే యుధిష్ఠిర,
దుర్యోధనస్తు పితరం భూయ ఏవాబ్రవీద్ వచః. 63
ఇట్లు పలికి లక్ష్మియు, ఆ యన్నియును వెడలి పోయినవి. దుర్యోధనుడు తండ్రితో మరియు నిట్లు పలికెను.
శీలస్య తత్త్య మిచ్ఛామి వేత్తుం కౌరవనన్దన,
ప్రాప్యతే చ యథా శీలం తం చోపాయం వదస్వ మే. 64
కౌరవనందనా! శీలముతత్త్వము నెరుగ గోరుదును. శీలము నెట్లు పొందనగును? దానికి ఉపాయమేమి? దానిని నాకు చెప్పుము.
ధృతరాష్ట్ర ఉవాచ - ధృతరాష్ట్రు డిట్లు చెప్పెను.
సోపాయం పూర్వ ముద్దిష్టం ప్రహ్లాదేన మహాత్మనా,
సంక్షేపేణ తు శీలస్య శృణు ప్రాప్తిం నరేశ్వర. 65
మహాత్ముడగు ప్రహ్లాదుడు ఉపాయముతో శీలస్వరూపమును మున్నే వివరించెను. ఇప్పుడు దానిపొందెడు దానిని గూర్చి చెప్పెదను రాజా! వినుము.
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా,
అనుగ్రహశ్చ దానం చ శీల మేతత్ ప్రశస్యతే. 66
చేష్టతో, మనసుతో, మాటతో అన్నిప్రాణుల యెడ ద్రోహము తలపెట్టకుండుట, అనుగ్రహము, దానము - ఇది శీలమని ప్రశస్తి కెక్కినది.
య దన్యేషాం హితం న స్యా దాత్మనః కర్మ పౌరుషమ్,
అపత్రపేత వా యేన న తత్ కుర్యాత్ కథంచన. 67
తన పౌరుషమైన కర్మము ఇతరులకు హితముకానిది యైనచో దానిని, తాను సిగ్గుపడవలసినదానిని ఎన్నటికిని చేయరాదు.
తత్తు కర్మ తథా కుర్యాద్ యేన శ్లాఘ్యేత సంసది,
శీలం సమాసే నైతత్ తే కథితం కురుసత్తమ. 68
ఏ పనినైనను సమాజమునందు కొనియాడు విధముగా చేయవలయును. సంక్షేపముగా శీలమును గూర్చి నీకు చెప్పితిని.
యద్యప్యశీలా నృపతే ప్రాప్నువన్తి శ్రియం క్వచిత్,
న భుఞ్జతే చిరం తాత సమూలాశ్చ న సన్తి తే. 69
ఒకవేళ రాజా! శీలములేనివారు సంపదను పొందినను దానిని పెద్దకాలము అనుభవింపరు. నాయనా! అట్టి వారు కుదుళ్లతోపాటు కూలిపోవుదురు.
ఏతద్ విదిత్వా తత్త్యేన శీలవాన్ భవ పుత్రక!
యదీచ్ఛసి శ్రియం తాత సువిశిష్టాం యుధిష్ఠిరాత్. 70
ఇది మూలముట్టుగా తెలిసికొని ఓయి కుమారా! యుధిష్ఠిరుని నుండి మిక్కిలి విశిష్టమగు సంపదను కోరుదువేని శీలవంతుడ వగుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.
ఏతత్ కథితవాన్ పుత్రే ధృతరాష్ట్రో నరాధిపః,
ఏతత్ కురుష్వ కౌన్తేయ తతః ప్రాప్స్యసి తత్ ఫలమ్. 71
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి శీలవర్ణనం నామ చతుర్వింశత్యధిక శతతమోఽధ్యాయః
రాజైన ధృతరాష్ట్రుడు పుత్రున కిది చెప్పెను. కుంతీకుమారా! దీనిని నీవాచరింపుము. దానివలన దాని ఫలమును పొందెదవు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మానుశాసనపర్వమున శీలవర్ణనము గల నూటయిరువది నాలుగవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
శీలం ప్రధానం పురుషే కథితం తే పితామహ!,
కథం త్వాశా సముత్పన్నా యా చాశా తద్ వదస్వ మే. 1
తాతా! పురుషునియందు శీలము ప్రధానమని చెప్పితివి సరియే. ఆశ యనునది ఎట్లు పుట్టినది? దేనిని ఆశయందురు? దానిని నాకు తెలియజెప్పుము.
సంశయో మే మహానేష సముత్పన్నః పితామహ,
ఛేత్తా చ తస్య నాన్యోఽస్తి త్వత్తః పురుషర్షభః, 2
తాతా! నాకీ పెద్దసంశయము పొడమినది. పురుష వరేణ్యా! దీనిని తీర్చువాడు నీకంటె మరియొకడు లేడు.
పితామహాశా మహతీ మమాసీద్ధి సుయోధనే,
ప్రాప్తే యుద్ధే తు తద్ యుక్తం తత్ కర్తాయ మితి ప్రభో!. 3
పితామహా! సుయోధనుని విషయమున నాకు పెద్ద ఆశ యుండెడిది. యుద్ధమనునది వచ్చిపడినచో ఆతడు తగిన పని చేయుననెడిది ఆ ఆశ. (తగినపని - యుద్ధము చేయకముందే అర్ధ రాజ్యము పంచి యిచ్చుట)
సర్వస్యాశా సుమహతీ పురుష స్యోపజాయతే,
తస్యాం విహన్యమానాయాం దుఃఖో మృత్యు ర్న సంశయః. 4
సాధారణముగా ప్రతిమానవునకు మిక్కిలి పెద్దది యగు ఆశ పుట్టుచుండును. అది దెబ్బతిన్నచో దుఃఖము కలుగును. అది చావువంటిది. సంశయము లేదు.
సోఽహం హతాశో దుర్బుద్ధిః కృత స్తేన దురాత్మనా,
ధార్తరాష్ట్రేణ రాజేన్ద్ర పశ్య మన్దాత్మతాం మమ. 5
దురాత్ముడగు ఆదుర్యోధనుడు, ధృతరాష్ట్రునిముద్దుబిడ్డ, నన్ను దెబ్బతిన్న ఆశ కలవానినిగా, బుద్ధిచెడినవానినిగా చేసెను. నా తెలివి తక్కువతన మెట్టిదో చూడు.
ఆశాం మహత్తరాం మన్యే పర్వతా దపి సద్రుమాత్,
ఆకాశా దపి వా రాజ న్నప్రమేయైవ వా పునః. 6
చెట్టుచేమలతో కూడిన పర్వతము కంటెను, ఆకాశము కంటెను, ఆశ మిన్న అయినదని తలతును. కాదు కాదు, అది ఊహల కందనంతటిది.
ఏషా చైవ కురుశ్రేష్ఠ దుర్విచిన్త్యా సుదుర్లభా,
దుర్లభత్వా చ్చ పశ్యామి కిమన్యత్ దుర్లభం తతః. 7
కురుశ్రేష్ఠా! ఇది ఊహలకు మించిపోయినట్టిది. ఎన్నటికీ పొందనలవి కానిది. అట్లు దుర్లభమైన కారణమున దీనిని అలవికానిదానినిగా చూచుచున్నాను. దీనికంటెను దుర్లభమైనది ఏది కలదు?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అత్ర తే వర్తయిష్యామి యుధిష్ఠిర నిబోధ తత్,
ఇతిహాసం సుమిత్రస్య నిర్వృత్త మృషభస్య చ. 8
యుధిష్ఠిరా! సుమిత్రునకు, ఋషభునకు నడుమ జరిగినకథ నొక్కదానిని ఈ విషయమున తెలిపెదను. తెలిసికొనుము.
సుమిత్రో నామ రాజర్షి ర్హైహయో మృగయాం గతః,
ససార స మృగం విద్ధ్వా బాణే నానతపర్వణా. 9
హైహయవంశపురాజు సుమిత్రుడు ఒకనాడు వేట కేగెను. వంపులుగల బాణముతో ఆతడొక లేడిని కొట్టి దాని వెంటబడెను.
స మృగో బాణ మాదాయ యయా వమితవిక్రమః,
స చ రాజా బలాత్ తూర్ణం ససార మృగయూథపమ్. 10
గొప్పపిక్కలబలముగల ఆలేడి బాణముగైకొని పారిపోయెను. ఆరాజు కూడ పట్టుదలతో మృగములమంద కేలికయగు దానిని తరుమజొచ్చెను.
తతో నిమ్నం స్థలం చైవ స మృగో ఽద్రవ దాశుగః,
ముహూర్త మివ రాజేన్ద్ర సమేన స పథాగమత్, 11
వడిగా పరువెత్తు ఆ మృగము ఎత్తుపల్లములలో పరుగులు తీయుచుండెను. రాజేన్ద్ర! ఒక్క ముహూర్తములో అది సమమగు దారిలోనికి చేరుకొనెను.
తతః స రాజా తారుణ్యా దౌరసేన బలేన చ,
ససార బాణాసన భృత్ సఖడ్గోఽసౌ తనుత్రవాన్. 12
ఆ ఏలికయు మంచి వయసున నున్నవాడగుటవలన సహజమైన బలముతో (గుండె దమ్ముతో) వింటిని, ఖడ్గమును ధరించి కవచము తాల్చినవాడై దాని వెంటబడెను.
తతో నదా న్నదీశ్చైవ పల్వలాని వనాని చ,
అతిక్రమ్యాభ్యతిక్రమ్య ససారైకో వనేచర:. 13
అంత ఆ అడవిజంతువు నదములను, నదులను, గుంటలను, అడవులను దాటిదాటి పోవజొచ్చెను.
స తు కామాన్మృగో రాజ న్నాసాద్యాసాద్య తం నృపమ్,
పున రభ్యేతి జవనో జవేన మహతా తతః. 14
ఆ లేడి కావలయునని ఆరాజున కందినట్లే అనిపించి మరల గొప్పవేగముతో ముందుకు పోవుచుండెను.
స తస్య బాణై ర్బహుభిః సమభ్యస్తో వనేచరః,
ప్రక్రీడన్నివ రాజేన్ద్ర పునరభ్యేతి చాన్తికమ్. 15
ఆ అడవిమృగము పెక్కు బాణములు నాటుకొనగా ఆటలాడుచున్నట్లు మరల దగ్గరకు వచ్చుచుండెను.
పునశ్చ జవ మాస్థాయ జవనో మృగయూథపః,
అతీత్యాతీత్య రాజేన్ద్ర పునరభ్యేతి చాన్తికమ్. 16
మరల వేగమందుకొని వడిగల ఆ పరికాడు దాటుకొని దాటుకొనిపోయి మరల దగ్గరకు వచ్చుచుండెను.
తస్య మర్మచ్ఛిదం ఘోరం తీణ చామిత్ర కర్శనః,
సమాదాయ శరం శ్రేష్ఠం కార్ముకే తు తథాసృజత్. 17
అంత పగవారిని పరిమార్చు ఆరాజు ఘోరము, వాడియైనది, ఆయువుపట్టును చీల్చునది యగు ఒక వాడి అమ్మును వింటియందు సంధించెను.
తతో గవ్యూతి మాత్రేణ మృగయూథప యూథపః,
తస్య బాణపథం ముక్త్వా తస్థివాన్ ప్రహసన్నివ. 18
అంత నామృగరాజు గవ్యూతి మేరకు ముందునకు పోయి ఆతని బాణమార్గమును తప్పించుకొని వెక్కిరించుచున్నట్లు నిలిచెను.
తస్మిన్ నిపతితే బాణే భూమౌ జ్వలిత తేజసి,
ప్రవివేశ మహారణ్యం మృగో రాజా ప్యథాద్రవత్. 19
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మాను శాసనపర్వణి ఋషభగీతాసు పఞ్చవింశత్యధిక శతతమోఽధ్యాయః
మంటలు గ్రక్కు ఆతనిబాణము నేలపై వ్రాలగా ఆమృగము పెనుకానలోనికి చొరబారెను. రాజు కూడ దాని వెంట పారజొచ్చెను.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మానుశాసన పర్వమున ఋషభగీతల యందు నూటయిరువది యైదవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడు చెప్పెను.
ప్రవిశ్య స మహారణ్యం తాపసానా మథాశ్రమమ్,
ఆససాద తతో రాజా శ్రాన్తశ్చోపవిశత్ తదా. 1
అంత నా రాజు మహారణ్యమును ప్రవేశించి, తాపసుల ఆశ్రమమును చేరుకొని అలసత నొందినవాడై కూలబడెను.
తం కార్ముకధరం దృష్ట్వా శ్రమార్తం క్షుధితం తదా,
సమేత్య ఋషయ స్తస్మిన్ పూజాం చక్రు ర్యథావిధి. 2
వింటిని చేతపట్టినవాడు, శ్రమతో నలిగియున్నవాడు, ఆకొన్నవాడునగు అతనిని సమీపించి ఋషులు యథావిధిగ ఆతనికి మర్యాదలు చేసిరి.
స పూజా మృషిభి ర్దత్తాం సమ్ప్రగృహ్య నరాధిపః,
అపృచ్ఛత్ తాపసాన్ సర్వాం స్తపసో వృద్ధి ముత్తమామ్. 3
ఆ ఋషులొసగిన పూజను మన్ననతో గ్రహించి ఆరాజు ఆ తాపసుల నందరిని గొప్పదియగు తపస్సు పెంపును గూర్చి ప్రశ్న చేసెను.
తే తస్య రాజ్ఞో వచనం సమ్ప్రగృహ్య తపోధనాః,
ఋషయో రాజశార్దూలం తమపృచ్ఛన్ ప్రయోజనమ్. 4
ఆ తపోధనులు ఆ రాజు మాటను చక్కగా ఆదరించి ఆ రాజశ్రేష్ఠుని రాకకు ప్రయోజనమును గూర్చి అడిగిరి.
కేన భద్ర సుఖార్థేన సంప్రాప్తోఽసి తపోవనమ్,
పదాతి ర్బద్ధనిస్త్రింశో ధన్వీ బాణీ నరేశ్వర. 5
‘ఓయి మంచివాడా! కత్తి కట్టుకొని, విల్లంబులు పట్టుకొని, కాలినడక వాడవై ఏ సుఖమును కోరి ఈ తపోవనమును చేరుకొంటివి.’
ఏత దిచ్ఛామహే శ్రోతుం కుతః ప్రాప్తో ఽసి మానద,
కస్మిన్ కులే తు జాత స్త్వం కిం నామా చాసి బ్రూహి నః. 6
మేము దీనిని వినగోరుచున్నాము. అభిమానవంతుడా! ఎటనుండి వచ్చితివి? ఏ కులమున పుట్టితివి? ఏ పేరివాడవు? మాకు చెప్పుము.
తతః స రాజా సర్వేభ్యోద్విజేభ్యః పురుషర్షభ,
ఆచచక్షే యథాన్యాయం పరిచర్యాం చ భారత. 7
అంత నా రాజు ఆ విప్రవరుల కందరకు ఉన్న దున్నట్లు జరిగినదంతయు వివరించెను. తన త్రిప్పటను గూర్చియు చెప్పెను.
హైహయానాం కులే జాతః సుమిత్రో మిత్రనన్దనః,
చరామి మృగయూథాని నిఘ్నన్ బాణైః సహస్రశః. 8
‘నేను హైహయుల కులమున పుట్టినవాడను. సుమిత్రుడను. మిత్రులకు సంతోషము కూర్చువాడను. లేళ్లమందలను వేలకొలదిగా చంపుచు తిరుగుచున్నాను.’
బలేన మహతా గుప్తః సామాత్యః సావరోధనః,
మృగ స్తు విద్ధో బాణేన మయా సరతి శల్యవాన్. 9
గొప్పసేన నన్ను కాపాడుచున్నది. మంత్రులతో, అంతఃపురకాంతలతో అడవికి వచ్చితిని. ఒక మృగము నా బాణపు దెబ్బ తిని బాణముతోపాటుగా ఇందు తిరుగుచున్నది.
తం ద్రవన్త మనుప్రాప్తో వన మేతద్ యదృచ్ఛయా,
భవత్సకాశం నష్టశ్రీ ర్హతాశః శ్రమకర్శితః. 10
అట్లు పారిపోవుచున్న దాని వెంటబడి అనుకొనకుండ ఈ అడవికి చేరుకొంటిని. మీ సమీపమునకు వచ్చితిని. నా వన్నెచిన్నెలు చెడినవి. ఆశ సడలినది. అలసత పైకొనినది.
కిం ను దుఃఖ మతోఽన్యద్ వై యదహం శ్రమకర్శితః,
భవతా మాశ్రమం ప్రాప్తో హతాశో భ్రష్ట లక్షణః. 11
ఇంతకంటె దుఃఖమే ముండును. అలసత క్రుంగదీయగా మీ ఆశ్రమమునకు చేరుకొంటిని. ఆశ చచ్చినవాడను. వన్నెచిన్నెలు జారినవాడను.
న రాజలక్షణత్యాగో న పురస్య తపోధనాః,
దుఃఖం కరోతి తత్ తీవ్రం యథాఽశా విహతా మమ. 12
తపోధనులారా! రాజలక్షణములను వదలి వేయుటగానీ, పురమును వదలుటగానీ జరుగలేదు. నా ఆశ చచ్చినది. అందువలన నది మిక్కిలి వెతను కలిగించు చున్నది.
హిమవాన్ వా మహాశైలః సముద్రో వా మహోదధిః,
మహత్త్వా న్నాన్వపద్యేతాం నభసో వాస్తరం తథా. 13
ఆశాయా స్తపసిశ్రేష్ఠా స్తథా నాన్త మహం గతః,
భవతాం విదితం సర్వం సర్వజ్ఞా హి తపోధనాః. 14
గొప్ప పర్వతము హిమవంతము గానీ, మహాజలరాశి సముద్రము గానీ, ఆకాశపు నడిమిభాగము గానీ ఆశ గొప్పతనము నందుకొనజాలవు. తాపస వరేణ్యులారా! నేను దాని తుదిని పొందనివాడ నైతిని. మీరు అంతయు నెరిగిన తపోధనులు. మీకంతయు తెలిసియే యుండును.
భవన్తః సుమహాభాగా స్తస్మాత్ పృచ్ఛామి సంశయమ్,
ఆశావాన్ పురుషో యః స్యా దన్తరిక్ష మథా ఽపి వా. 15
కింను జ్యాయస్తరం లోకే మహత్త్వాత్ ప్రతిభాతి వః,
ఏత దిచ్ఛామి తత్వేన శ్రోతుం కిమిహ దుర్లభమ్. 16
మీరు మహానుభావులు. అందువలన నొక సంశయమును మిమ్మడుగుచున్నాను. ఆశ గల మనుజుడు, ఆకాశము - ఈ రెంటిలో ఏది మహత్త్వమున మిన్నగా మీకు కన్పట్టుచున్నది. దీనిని తత్త్యముతో తెలియగోరుచున్నాను. ఇందు దుర్లభమేది?
యది గుహ్యం న వో నిత్యం తదా ప్రబ్రూత మాచిరమ్,
న గుహ్యం శ్రోతు మిచ్ఛామి యుష్మద్భ్యో ద్విజసత్తమాః. 17
ఇది ఎల్లవేళల గుట్టయిన విషయము కానిచో మీరు నాకు తెలియబలుకుడు. బ్రాహ్మణ ప్రవరులారా! మీ నుండి రహస్య, మైనచో, వినగోరను.
భవత్తపోవిఘాతో వా యది స్యాద్ విరమే తతః,
యది వాస్తి కథాయోగో యోఽయం ప్రశ్నో మయేరితః. 18
ఏతత్కారణ సామర్థ్యం శ్రోతు మిచ్ఛామి తత్త్వతః,
భవన్తో హి తపోనిత్యా బ్రూయు రేత త్సమన్వితాః. 19
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి ఋషభగీతాసు షడ్వింశత్యధిక శతతమోఽధ్యాయ:
మీకిది తపస్సును చెడగొట్టునదైనచో నేను అడుగుట మానుకొందును. నేనడిగిన ప్రశ్నకు సంబంధించిన కథాయోగమున్నచో దయచేసి చెప్పుడు. ఈ ఆశకు సంబంధించిన కారణము, సమర్థత అనువానిని వినగోరుచున్నాను. మీ రంతయు కూడుకొని తపస్సునందు నిష్ఠకలవారు కావున దీనిని నాకు తెలియజెప్పుడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మానుశాసనపర్వమున ఋషభగీతల యందు నూటయిరువది ఆరవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
తత స్తేషాం సమస్తానా మృషీణాం మృషిసత్తమః,
ఋషభో నామ విప్రర్షి ర్విస్మయ న్నిద మబ్రవీత్. 1
అంత ఆ ఋషులందరిలో శ్రేష్ఠుడగు ఋషభుడను మహర్షి చిరునవ్వుతో ఇట్లు పలికెను.
పురాహం రాజశార్దూల తీర్థాన్యనుచరన్ ప్రభో,
సమాసాదితవాన్ దివ్యం నరనారాయణాశ్రమమ్. 2
రాజేంద్రా! మునుపు నేను తీర్థములను తిరుగుచు మిక్కిలి గొప్పదగు నరనారాయణుల ఆశ్రమమును చేరుకొంటిని.
యత్ర సా బదరీ రమ్యా హ్రదో వైహాయస స్తథా,
యత్ర చాశ్వశిరా రాజన్ వేదాన్ పఠతి శాశ్వతాన్. 3
రమణీయమగు బదరియు, గగనమున పుట్టిన గంగయు, నిత్యములగు వేదములను చదువుచుండెడు అశ్వశిరుడును ఎందుగలరో ఆ నరనారాయణా శ్రమమున కరిగితిని.
తస్మిన్ సరసి కృత్వా ఽహం విధివత్ తర్పణం పురా,
పితౄణాం దేవతానాం చ తతోఽశ్రమ మియాం తదా. 4
రేమాతే యత్ర తౌ నిత్యం నరనారాయణా వృషీ.
నేను ఆ సరస్సునందు శాస్త్రముననుసరించి పితృదేవతలకు, దేవతలకు తర్పణ మొనరించి, ఆ నరనారాయణ ఋషులు ఆనందముతో విహరించు ఆ ఆశ్రమమునకు చేరుకొంటిని.
అదూరా దాశ్రమం కఞ్చిద్ వాసార్థ మగమం తదా. 5
ఆ సమీపమున నివాసము కొఱకుగా ఒక ఆశ్రమమునకు ఏగితిని.
తత్ర చీరాజినధరం కృశ ముచ్చ మతీవ చ,
అద్రాక్ష మృషి మాయాన్తం తనుం నామ తపోధనమ్. 6
అందు నారబట్టలు, లేడి చర్మము ధరించినవాడు, బక్కచిక్కినవాడు, మిక్కిలి పొడగరి అయిన తనువను తపోధనుడు ఎదురుగా వచ్చుచుండగా చూచితిని.
అన్యై ర్నరై ర్మహాబాహో వపుషా ష్టగుణాన్వితమ్,
కృశతా చాపి రాజర్షే న దృష్టా తాదృశీ క్వచిత్. 7
మహాబాహూ! ఆతడు సాధారణ మానవుల కంటే ఎనిమిది రెట్లు పొడవైనవాడు. ఇక బక్కతనమన్ననో అటువంటిది మరియెచటను నేను చూచి యుండలేదు.
శరీర మపి రాజేన్ద్ర తస్య కానిష్ఠికాసమమ్,
గ్రీవా బాహూ తథా పాదౌ కేశా శ్చాద్భుతదర్శనాః. 8
అతని శరీరము చిటికెన వ్రేలంత సన్నగా నుండెను. మెడ, భుజములు, కాళ్లు, కేశములు అచ్చెరువు గొలుపుచు కన్పట్టెను.
శిరః కాయానురూపం చ కర్ణౌ నేత్రే తథైవ చ,
తస్య వాక్చైవ చేష్టా చ సామాన్యే రాజసత్తమ. 9
ఆతని తలయు, చెవులు, కన్నులు శరీరమునకు తగినట్లున్నవి. పలుకును, చేష్టయు సామాన్యముగా నున్నవి.
దృష్ట్వా ఽహం తం కృశం విప్రం భీతః పరమదుర్మనాః,
పాదౌ తస్యాభివాద్యాథ స్థితః ప్రాఞ్జలి రగ్రతః. 10
ఆ బక్కబాపని చూచి నేను వెఱగందితిని. దిగులు పడిన మనస్సుతో ఆతని పాదములకు మ్రొక్కి చేతులు మోడ్చి ఆతని ముందు నిలిచి యుంటిని.
నివేద్య నామగోత్రే చ పితరం చ నరర్షభ,
ప్రవిష్టే చాసనే తేన శనై రహ ముపావిశమ్. 11
నా నామగోత్రములను, తండ్రిని నివేదించుకొని ఆయన ఆసనమున కూర్చున్న పిదప మెల్లగా నేనును కూర్చుంటిని.
తతః స కథయామాస కథాం ధర్మార్థ సంహితామ్,
ఋషిమధ్యే మహారాజ తనుర్ధర్మభృతాం వరః. 12
అటు పిమ్మట ధర్మమును పాటించు వారిలో శ్రేష్ఠుడగు ఆ తనుమహర్షి ఋషుల నడుమ ధర్మముతో అర్థముతో కూడిన ఒక కథను చెప్పెను.
తస్మిం స్తు కథయత్యేవ రాజా రాజీవలోచనః,
ఉపాయా జ్జవనై రశ్వైః సబలః సావరోధనః. 13
అతడట్లు చెప్పుచుండగా వడిగల గుఱ్ఱములతో సేనలతో అంతఃపురముతో కూడినవాడును, కమలముల వంటి కనులు గలవాడును అగు ఒక రాజట కరుగుదెంచెను.
స్మరన్ పుత్ర మరణ్యే వై నష్టం పరమ దుర్మనాః,
భూరిద్యుమ్న పితా శ్రీ మాన్ వీరద్యుమ్నో మహాయశాః. 14
అరణ్యమున తప్పిపోయిన కొడుకును తలచుకొనుచు మిక్కిలి దిగు లొందిన ఆ వీరద్యుమ్నుడు - భూరిద్యుమ్నుని తండ్రి - గొప్పకీర్తి కలవాడటకు వచ్చెను.
ఇహ ద్రక్ష్యామి తం పుత్రం ద్రక్ష్యామీ హేతి పార్థివః,
ఏవ మాశాహృతో రాజా చరన్ వన మిదం పురా. 15
నా కొడుకు నిక్కడ గాంతును, అక్కడ కాంతు ననుకొనుచు ఆ రాజు ఆశలు త్రిప్పులు పెట్టు చుండగా ఆ అడవిలో తిరుగాడు చుండెను.
దుర్లభః సమయా ద్రష్టుం నూనం పరమధార్మికః,
ఏకః పుత్రో మహారణ్యే నష్ట ఇత్యసకృత్ తదా. 16
గొప్ప ధర్మశాలి యగు నా పుత్రుని నేనింక చూడజాలను. ఒక్క కొడుకు - అడవిలో తప్పి పోయెనని మాటి మాటికి పలుకుచు తిరుగుచుండెను.
దుర్లభః స మయా ద్రష్టు మాశా చ మహతీ మమ, 17
తయా పరీతగాత్రోఽహం ముమూర్షు ర్నాత్ర సంశయః.
అతడింక నాకు దొరకడు. వానిని చూడజాలను. ఆశ ఏమో కడుపొడవైనది. అది చుట్టబెట్టిన దేహము కలనేను మరణింపగోరుదును. ఇందు సందియము లేదు.
ఏతచ్ఛ్రుత్వా తు భగవాం స్తను ర్మునివరోత్తమః,
అవాక్ శిరా ధ్యానపరో ముహూర్త మివ తస్థివాన్. 18
అది విని ముని శ్రేష్ఠులలో శ్రేష్ఠుడగు ఆ తనుభగవానుడు తలవాల్చి ధ్యానమున మునిగినవాడై కొంచెము సేపు ఉండెను.
త మనుధ్యాత మాలక్ష్య రాజా పరమ దుర్మనాః,
ఉవాచ వాక్యం దీనాత్మా మందం మంద మివాసకృత్. 19
అట్లు ధ్యానించు చున్న మునిని గాంచి మిక్కిలిగా దీలుపడిన హృదయము గల ఆ రాజు దీనాత్ముడై మెల్లమెల్లగా పెక్కు మారు లిట్లడిగెను.
దుర్లభం కింను దేవర్షే ఆశాయాశ్చైవ కిం మహత్,
బ్రవీతు భగవా నేతత్ యది గుహ్యం న తే మయి. 20
దేవర్షీ! దుర్లభమైన దేది? ఆశ కంటె గొప్పది యేది? పూజ్యుడా! అది నా విషయమున రహస్యము కానిచో దీనిని నాకు తెలుపుము.
ముని రువాచ- ముని పలికెను.
మహర్షి ర్భగవాంస్తేన పూర్వ మాసీద్ విమానితః,
బాలిశాం బుద్ధి మాస్థాయ మన్దభాగ్యతయా ఽఽత్మనః. 21
ఆ నీ కుమారుడు తన దురదృష్టము వలన, పిల్లతనపు బుద్ధి నవలంబించి మునుపొక పూజ్యుడగు మహర్షి నవమానించెను.
అర్ధయన్ కలశం రాజన్ కాఞ్చనం వల్కలాని చ,
అవజ్ఞా పూర్వ కేనాపి న సంపాదితవాం స్తతః.
నిర్విణ్ణః సతు విప్రర్షి ర్నిరాశః సమపద్యత. 22
రాజా! ఆ మహర్షి బంగారు కలశమును, మంచి వస్త్రములను కోరెను. నీ కొడుకువలన అవమానము పొందెను. కాని వానిని పొందలేక పోయెను. వెలతెలపోయిన ఆ బ్రహ్మర్షి నిరాశుడాయెను.
ఏవ ముక్తోఽభి వాద్యాథ తమృషిం లోక పూజితమ్,
శ్రాన్తోఽ వసీదద్ ధర్మాత్మా యథా త్వం నరసత్తమ. 23
ఇట్లు లోకములు మన్నించు ఆ ఋషికి ప్రణమిల్లి ధర్మాత్ముడగు ఆ వీరద్యుమ్నుడు నీ వలెనే అలసత నొందినవాడై కూలబడెను.
అర్ఘ్యం తతః సమానీయ పాద్యం చైవ మహానృషిః,
ఆరణ్యేనైవ విధినా రాజ్ఞే సర్వం న్యవేదయత్. 24
అంత నా మహర్షి అర్ఘ్యమును పాద్యమును తెప్పించి అరణ్యమునందలి పద్ధతినే యనుసరించి ఆ రాజునకు నివేదించెను.
తతస్తే మునయః సర్వే పరివార్య నరర్షభమ్,
ఉపావిశన్ నరవ్యాఘ్ర సప్తర్షయ ఇవ ధ్రువమ్. 25
అంత నా మునులందరు, సప్తర్షులు ధ్రువుని వలె, అతనిని చుట్టుకొని కూర్చుండిరి.
అప్పచ్ఛం శ్చైవ తం తత్ర రాజాన మపరాజితమ్,
ప్రయోజన మిదం సర్వ మాశ్రమస్య నివేశనే. 26
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసన పర్వణి ఋషభగీతాసు సప్తవింశత్యధిక శతతమోఽధ్యాయః
అంత ఓటమియెఱుగని ఆ రాజును ఆశ్రమమును ప్రవేశించుటయందలి ప్రయోజనమును గూర్చి ప్రశ్నించిరి.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున రాజధర్మానుశాసనపర్వమున ఋషభగీతల యందు నూట యిరువది యేడవ అధ్యాయము.
రాజోవాచ - రాజిట్లు పలికెను.
వీరద్యుమ్న ఇతి ఖ్యాతో రాజాహం దిక్షు విశ్రుతః,
భూరిద్యుమ్నం సుతం నష్ట మన్వేష్టుం వన మాగతః. 1
అన్ని దిక్కులలో ప్రశస్తి గల నేను వీరద్యుమ్నుడను నరపతిని. తప్పిపోయిన నా కుమారుడు భూరిద్యుమ్నుని వెదకుటకై యీ వనమునకు వచ్చితిని.
ఏకః పుత్రః స విప్రాగ్ర్య బాల ఏవ చ మే ఽనఘ,
న దృశ్యతే వనే చాస్మింస్త మన్వేష్టుం చరా మ్యహమ్. 2
నా కొక్కడే కొడుకు, పసివాడు, ఈ అడవిలో కానరాకుండెను. వానిని వెదకుటకై తిరుగుచున్నాను.
ఋషభ ఉవాచ - ఋషభు డిట్లనెను.
ఇత్యేవ ముక్తే వచనే రాజ్ఞా ముని రథోముఖః,
తూష్ణీ మేవాభవత్తత్ర న చ ప్రత్యుక్తవాన్ నృపమ్. 3
రాజిట్లు పలుకగా తలవంచుకొనియున్న ముని ఊరకయే యుండెను. రాజునకు బదులు చెప్పకుండెను.
స హి తేన పురా విప్రో రాజ్ఞా నాత్యర్థమానితః,
ఆశాకృత శ్చ రాజేంద్ర తపో దీర్ఘం సమాశ్రితః. 4
ప్రతిగ్రహ మహం రాజ్ఞాం న కరిష్యే కథఞ్చన,
అన్యేషాం చైవ వర్ణానా మితి కృత్వా ధియం తదా. 5
మునుపు ఈరాజు ఆవిప్రుని మన్నింపకుండెను. అతని ఆశ దెబ్బ తినెను. అందువలన పెద్ద కాలమాతడు తపము చేసెను. నేనిక ఎన్నటికిని రాజుల నుండి ఏమియు గ్రహింపను. అట్లే ఇతర వర్ణముల వారి నుండియు పుచ్చుకొనను అని నిశ్చయించుకొనియుండెను.
ఆశా హి పురుషం బాల ముత్థాపయతి తస్థుషీ,
తామహం వ్యపనేష్యామి ఇతి కృత్వా వ్యవస్థితః,
వీరద్యుమ్న స్తు తం భూయః పప్రచ్ఛ మునిసత్తమమ్. 6
గుండెలో నిలిచి యున్న ఆశ మూర్ఖుడగు పురుషుని కూడ లేపి పరువెత్తించును. నేను దానిని తొలగించి వైచెదను. అని నిర్ణయించుకొని యుండెను.
వీరద్యుమ్నుడు మరల ఆ ముని శ్రేష్ఠు నిట్లు ప్రశ్నించెను.
రాజోవాచ - రాజు పలికెను.
ఆశాయాః కిం కృశత్వం చ కిం చేహ భువి దుర్లభమ్,
బ్రవీతు భగవా నేతత్ త్వం హి ధర్మార్థదర్శివాన్. 7
పూజ్యుడు నాకీ విషయము చెప్పవలయును. నీవు ధర్మ, అర్థముల తత్త్వమును పరికించినవాడవు. ఆశ అను దాని కృశత్వమనగా నేమి? ఈ భూమియందు దుర్లభమైన దేది?
తతః సంస్మృత్య తత్ సర్వం స్మారయిష్య న్నివాబ్రవీత్.
రాజానం భగవాన్ విప్ర స్తతః కృశతను స్తదా. 8
అంత దానినంతటిని గుర్తు తెచ్చుకొనుచు గుర్తుకు తెచ్చుచున్నవానివలె ఆ రాజుతో పూజ్యుడగు ఆ విప్రుడు కృశతను విట్లనెను.
ఋషి రువాచ - ఋషి యిట్లు పలికెను.
కృశత్వేన సమం రాజ న్నాశాయా విద్యతే నృప,
తస్యా వై దుర్లభత్వాచ్చ ప్రార్థితాః పార్థివా మయా. 9
రాజా! ఆశ గలవాని బక్కతనమునకు సమానమైనది మరియొకటి లేదు. దాని దుర్లభత్వము వలననే నేను రాజులను దేబిరించవలసి వచ్చినది.
రాజో వాచ - రాజు పలికెను.
కృశా కృశే మయా బ్రహ్మన్ గృహీతే వచనాత్ తవ,
దుర్లభత్వం చ తస్యైవ వేదవాక్యమివ ద్విజ. 10
నీ పలుకునుబట్టి విప్రవరా! చిక్కి పోయినది, చిక్కిపోవనిది అను వానిని నేను గ్రహించితిని. ఆశకు విషయమైన దుర్లభత్వమును కూడ వేదవాక్యమువలె గ్రహించితిని.
సంశయ స్తు మహాప్రాజ్ఞ సంజాతో హృదయే మమ,
తన్మునే మమ తత్వేన వక్తు మర్హసి పృచ్ఛతః. 11
మహామేధావీ! ఒక సంశయము మాత్రము నా హృదయమున పొటమరించినది. దానిని మూలముట్టుగా, ఓ మునీ! అడుగుచున్న, నాకు చెప్పవలయును.
త్వత్తః కృశతరం కిన్ను బ్రవీతు భగవా నిదమ్,
యది గుహ్యం నతే కిఞ్చిద్ విద్యతే ముని సత్తమ. 12
అది దాచరాని విషయమైనచో మాన్యుడు తన కంటెను కృశించిన దేదియో నాకు తెలియ జెప్పవలయును (తన కంటెను-మీ కంటెను)
కృశ ఉవాచ - కృశు డిట్లు పలికెను.
దుర్లభోఽ ప్యథవా నాస్తి యో ఽర్థీ ధృతి మవాప్నుయాత్,
స దుర్లభతర స్తాత యోఽర్థినం నావమన్యతే. 13
ధైర్యమును పుంజుకొనగల అర్థి దుర్లభుడు, కాదా, లేడనియే చెప్పవచ్చును. వానిని మించి దుర్లభమైనవాడు కోరెడు వానిని అవమానింపనివాడు.
సత్కృత్య నోపకురుతే పరం శక్త్యా యథార్హతః,
యా సక్తా సర్వభూతేషు సాఽశా కృశతరీ మయా. 14
తన శక్తి మేరకు యోగ్యునకు మన్ననతో ఉపకారము చేయక, పైగా సర్వ భూతములయందు తగులు కొన్న ఆశ ఏది కలదో అది నా కంటెను బక్కచిక్కినది.
కృతఘ్నేషు చ యా సక్తా నృశంసే ష్వబలేషు చ,
అపకారిషు చాసక్తా సాఽఽశా కృశతరీ మయా. 15
కృతఘ్నులయందు, క్రూరులయందు, దుర్బలులయందు, కీడు చేసిన వారియందు తగులుకొనెడు ఆశ నా కంటెను హీనమైనది. (బక్కనైనది)
ఏకపుత్రః పితా పుత్రే నష్టే వా ప్రోషితే ఽపి వా,
ప్రవృత్తిం యో న జానాతి సా ఽఽశా కృశతరీ మయా. 16
ఒకే ఒక్క కొడుకు గల తండ్రి ఆ కొడుకు పోగా, లేదా పరదేశముల కేగగా వాని సమాచారము తెలియకున్నాడు. ఆ ఆశ నా కంటెను బక్కనైనది.
ప్రసవే చైవ నారీణాం వృద్ధానాం పుత్రకారితా,
తథా నరేన్ద్ర ధనినాం సా ఽఽశా కృశతరీ మయా. 17
వయసు మళ్లిన స్త్రీలకు కొడుకులు పుట్టవలయుననెడు ఆశయు, ధనవంతుల ఆశయు నా కంటె మిక్కిలి చిక్కినట్టిది.
ప్రదాన కాంక్షిణీనాం చ కన్యానాం వయసి స్థితే,
శ్రుత్వా కథా స్తథాయుక్తాః సాఽశా కృశతరీ మయా. 18
వయసుననుండి తమ్ము వరులకు దానమీగోరెడు కన్యలు దానికి సంబంధించిన కథలను వినెడునప్పటి ఆశ నా కంటెను మిక్కిలి కృశమైనది.
ఏత చ్ఛ్రుత్వా తతో రాజన్ రాజా సావరోధనః,
సంస్పృశ్య పాదౌ శిరసా నిపపాత ద్విజర్షభమ్. 19
రాజా! ఇది విని ఆ రాజు తన అంతఃపురము వారితో పాటు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని పాదములను శిరస్సుతో తాకి నేలపై వ్రాలెను.
రాజో వాచ - రాజిట్లు పలికెను.
ప్రసాదయే త్వాం భగవన్ పుత్రే ణేచ్ఛామి సంగమమ్,
య దేత దుక్తం భవతా సంప్రతి ద్విజసత్తమ,
సత్య మేత న్న సందేహో యదేతద్ వ్యాహృతం త్వయా. 20
పూజ్యుడా! నిన్ను బ్రతిమాలు కొందును. నా కొడుకుతో కలయికను కోరుచున్నాను. నీ విప్పడు పలికిన దంతయు సత్యమే సందేహము లేదు. నీవన్నది నిజమే.
తతః ప్రహస్య భగవాం స్తను ర్ధర్మభృతాం వరః,
పుత్ర మస్యానయన్ క్షిప్రం తపసా చ శ్రుతేన చ. 21
ధర్మమును ధరించు వారిలో శ్రేష్ఠుడు, పూజ్యుడునగు ఆ తనుమహర్షి పెద్దగా నవ్వి తన తపశ్శక్తి చేతను, పాండిత్య బలము చేతను శీఘ్రముగా ఆతని పుత్రుని రావించెను.
స సమానీయ తత్పుత్త్రం తముపాలభ్య పార్థివమ్,
ఆత్మానం దర్శయామాస ధర్మం ధర్మభృతాం వరః. 22
అతడట్లు అతని కుమారుని రప్పించి ఆ రాజును మందలించి ఆ ధర్మవంతులలో శ్రేష్ఠుడగు తనువు ధర్మస్వరూపమైన తన్ను చూపెను.
స దర్శయిత్వా చాత్మానం దివ్య మద్భుతదర్శనమ్,
విపాప్మా విగతక్రోధ శ్చచార వన మస్తకాత్. 23
అద్భుతమైన దర్శనముగల తన స్వరూపమును ఆతనికి చూపి ఆ మహర్షి పాపములేనివాడు, క్రోధము విడచినవాడునై సమీపమున నున్న అడవిలోని కరిగెను.
ఏత ద్దృష్టం మయా రాజం స్తథా చ వచనం శ్రుతమ్,
ఆశా మపనయ స్వాశు తతః కృశతరీ మిమామ్. 24
నరపాలా! నేను దీనిని చూచితిని. ఆ మాటను వింటిని. కనుక దాని కంటెను మిక్కిలి హీనమైన ఆశను తొలగించుకొనుము. (లేడి మీద ఆశ కొడుకు మీది ఆశ కంటె మరియు నీచమైనది కదా)
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
స తథోక్త స్తదా రాజన్ ఋషభేణ మహాత్మనా,
సుమిత్రోఽ పనయత్ క్షిప్ర మాశాం కృశతరీం తతః. 25
ఆ ఋషభు డట్లు చెప్పగా మహాత్ముని ఆ మాట విన్న సుమిత్రుడు వెనువెంటనే దానికంటె మిన్నయగు మృగముపైని ఆశను విడనాడెను.
ఏవం త్వమపి కౌన్తేయ శ్రుత్వా వాణీ మిమాం మమ,
స్థిరో భవ మహారాజ హిమవానివ పర్వతః. 26
కుంతీ కుమారా! ఈ నా పవిత్రమైన పలుకును విని నీవును హిమవత్పర్వతము వలె స్థిరుడవు కమ్ము.
త్వం హి ప్రష్టా చ శ్రోతా చ కృచ్ఛ్రే ష్వనుగతేష్విహ,
శ్రుత్వా మమ మహారాజ న సంతప్తు మిహార్హసి. 27
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి ఋషభగీతాసు అష్టావింశత్యధిక శతతమో ఽధ్యాయః
కష్టములొక దాని వెంట నొకటి వచ్చి పడుచుండగా నీవు పరిష్కారములను అడుగుచున్నావు. వినుచున్నావు. కనుక నానుండి సమాధానములను విని మహారాజా! నీవు కుమిలి పోరాదు.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున రాజధర్మాను శాసనపర్వమున ఋషభగీతల యందు నూట యిరువది యెనిమిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరుడు పలికెను.
నామృతస్యేవ పర్యాప్తి ర్మ మాస్తి బ్రువతి త్వయి,
యథా హి స్వాత్మవృత్తిస్థ స్తథా తృప్తోఽస్మి భారత. 1
భారతా! నీవు ఉపదేశించుచుండగా అమృతము త్రావిన వానికి వలె నాకు చాలు ననిపించుట లేదు. ఆత్మపదార్థమున నెలకొనియున్న వానివలె నేను మిక్కిలి తృప్తి పొందుచున్నాను.
తస్మాత్ కథయ భూయ స్త్వం ధర్మమేవ పితామహ,
న హి తృప్తి మహం యామి పిబన్ ధర్మామృతం హితే. 2
అందువలన, తాతా! ఇంకను నాకు ధర్మమును గూర్చియే తెలుపుచుండుము. నీ! ధర్మామృతమును విన్న నేను నిండైన తృప్తిని పొందకున్నాను.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
గౌతమస్య చ సంవాదం యమస్య చ మహాత్మనః. 3
ఇందును ప్రాతకాలపునాటి ఒక ఇతిహాసమును చెప్పుకొనుచుందురు. అది మహాత్ముడగు యమునికి, గౌతమునకు నడుమనైన సంవాదము.
పారియాత్రం గిరిం ప్రాప్య గౌతమ స్యాశ్రమో మహాన్,
ఉవాస గౌతమో యం చ కాలం తమపి మే శృణు. 4
పారియాత్రమను పర్వతము వరకు సాగి గౌతముని పెద్ద ఆశ్రమము కలదు. అందు గౌతముడు నివసించుచుండెను. ఆ కాలమును కూడ చెప్పెదను వినుము.
షష్టిం వర్షసహస్రాణి సో ఽతప్యద్ గౌతమ స్తపః,
త ముగ్రతపసం యుక్తం భావితం సుమహామునిమ్. 5
ఉపయాతో నరవ్యాఘ్ర లోకపాలో యమ స్తదా,
తమపశ్యత్ సుతపస మృషిం వై గౌతమం తదా. 6
ఆ గౌతముడు అరువది వేల యేండ్లు తపస్సు గావించెను. గొప్ప తపస్సుతో పవిత్రుడైన ఆ మహాముని కడకు లోకపాలుడగుయము డరుదెంచెను. గొప్పతపస్సుతో వెలిగిపోవుచున్న ఆ ఋషిని గాంచెను.
స తం విదిత్వా బ్రహ్మర్షి ర్యమ మాగత మోజసా,
ప్రాఞ్జలింః ప్రయతో భూత్వా ఉపవిష్ట స్తపోధనః. 7
ఆ బ్రహ్మర్షి అతని ముఖకాంతిని బట్టి వచ్చిన వాడు యముడని తెలిసికొని చేతులు మోడ్చి చెదరని మనస్సుతో కూర్చుండెను.
తం ధర్మరాజో దృష్ట్వైవ సత్కృత్యైవ ద్విజర్షభమ్,
న్యమన్త్రయత ధర్మేణ క్రియతాం కిమితి బ్రువన్. 8
అంత నా ధర్మరా జాతని గాంచినంతనే సత్కరించి ధర్మము ననుసరించి నేను మీకేమి చేయుదును అని పలికెను. అతనిని సుముఖుని చేసికొనెను.
గౌతమ ఉవాచ - గౌతము డిట్లు పలికెను.
మాతాపితృభ్యా మానృణ్యం కిం కృత్వా సమవాప్నుయాత్,
కథం చ లోకా నాప్నోతి పురుషో దుర్లభాన్ శుచీన్. 9
మానవుడు తలిదండ్రుల ఋణమును తీర్చుకొనుట కేమి చేసి ఆ ఫలము పొందును? తేలికగా లభించనివి, పరిశుద్ధములైనవి యగు లోకముల నెట్లు పొందును?
యమ ఉవాచ - యము డిట్లనెను.
తపః శౌచవతా నిత్యం సత్యధర్మరతేన చ,
మాతాపిత్రో రహరహః పూజనం కార్య మఞ్జసా. 10
తపస్సు, శౌచము కలవాడు, ఎల్లవేళల సత్యధర్మములయందు ప్రీతి కలవాడును అగు నరుడు ప్రతిదినము శ్రద్ధతో తలిదండ్రుల పూజనము చేయవలయును.
అశ్వమేధైశ్చ యష్టవ్యం బహుభిః స్వాప్తదక్షిణైః,
తేన లోకా నవాప్నోతి పురుషోఽద్భుత దర్శనాన్. 11
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి రాజధర్మాను శాసనపర్వణి యమగౌతమ సంవాదే ఏకోనత్రింశ దధిక శతతమోఽధ్యాయః:
చక్కగా కూర్చిన దక్షిణలు గల పెక్కు అశ్వమేధయాగముల నాచరింప వలయును. దానివలన నరుడు అద్భుతదర్శనము గల లోకములను పొందును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మాను శాసనపర్వమున యమగౌతమసంవాదము గల నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
మిత్రైః ప్రహీయమాణస్య బహ్వమిత్రస్య కా గతిః,
రాజ్ఞః సంక్షీణకోశస్య బలహీనస్య భారత. 1
భారతా! మిత్రులు తరిగిపోయినవాడు, శత్రువులు పెరిగిపోయినవాడు, కోశము వట్టిపోయినవాడు, బలములేని వాడు (బలము - సేన) నగు రాజునకు గతి యేమి?
దుష్టామాత్య సహాయస్య చ్యుతమన్త్రస్య సర్వతః,
రాజ్యాత్ ప్రచ్యవమానస్య గతి మగ్ర్యా మపశ్యతః. 2
దుష్టులగు మంత్రులు, సహాయులు కలవాడు, అన్నివైపుల నుండియు జారిపోయిన రాజ్యరహస్యములు కలవాడు, రాజ్యము నుండి జారిపోయినవాడు, మేలైనగతి కానరాక కొట్టుమిట్టాడెడు వాడునగు రాజేమి చేయవలయును?
పరచక్రాభియాతస్య పరరాష్ట్రాణి మృద్నతః,
విగ్రహే వర్తమానస్య దుర్బలస్య బలీయసా. 3
అసంవిహితరాష్ట్రస్య దేశకాలా వజానతః,
అప్రాప్యం చ భవేత్ సాన్త్వం భేదో వాప్యతి పీడనాత్,
జీవితం త్వర్థహేతు ర్వా తత్ర కిం సుకృతం భవేత్. 4
పగవాని రాజ్యముపై దండెత్తి పోవుచున్నవాడు, పరుల రాష్ట్రములను దువ్వుచున్నవాడు బలవంతునితో వైరమున తిరుగుచున్న దుర్బలుడు, రాజ్యమునకు రక్షణ చేయలేనివాడు, దేశకాలముల నెరుగనివాడును అగు రాజునకు సామము పొందరానిదగును. మిక్కిలి పీడ నొందినవాడగుటచే భేదమును సాధ్యముకాదు. అట్టి యెడ జీవితము ప్రయోజనకరమగునా? అయినను దానివలన కలుగు పుణ్యమెట్టిది?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
గుహ్యం ధర్మజ మా ప్రాక్షీ రతీవ భరతర్షభ,
అపృష్టం నోత్సహే వక్తుం ధర్మ మేతం యుధిష్ఠిర. 5
భరతవరేణ్యా! మిక్కిలి రహస్యమైన దానిని నన్ను నీవు అడిగితివి. అడుగక ఈ ధర్మమును చెప్పుటకు నేను ఉబలాటపడను.
ధర్మో హ్యణీయాన్ వచనాద్ బుద్ధిశ్చ భరతర్షభ,
శ్రుత్వోపాస్య సదాచారైః సాధు ర్భవతి స క్వచిత్. 6
ధర్మరాజా! ధర్మము మిక్కిలి సూక్ష్మమైనది. శాస్త్రముల వచనమువలన అది తెలియవచ్చును. సదాచారములచేతను, విని, ఉపాసించుటచేతను ఎక్కడనో ఒక్కచోట ఒక్క మానవుడు సాధువగుచున్నాడు.
కర్మణా బుద్ధిపూర్వేణ భవత్యాఢ్యో న వా పునః,
తాదృశోఽయ మనుప్రశ్నః సంవ్యవస్య స్వయా ధియా. 7
బుద్ధి మున్నుగాగల కర్మముతో అది గొప్పగుణములు కలది యగునా? కాదా? అనుప్రశ్నకు నీదయిన బుద్ధితో నిర్ణయము చేసికొనవలయును.
ఉపాయం ధర్మబహులం యాత్రార్థం శృణు భారత,
నా హ మేతాదృశం ధర్మం బుభూషే ధర్మకారణాత్, 8
అట్టి కష్ట పరిస్థితులలో జీవనయాత్ర కొరకు ధర్మములు పెక్కుగాగల ఉపాయమును చెప్పెదను. వినుము. కానీ ధర్మము కారణముగా నేనిట్టి (ఆపదలకు సంబంధించిన) ధర్మమును అనుభవింపగోరను.
దుఃఖాదాన ఇహహ్యేష స్యాత్ తు పశ్చాత్ క్షయోపమః,
అభిగమ్యమతీనాం హి సర్వాసా మేవ నిశ్చయః. 9
ఆపదలలో ప్రజలను కష్టపెట్టి ధనమును రాబట్టుట తరువాత రాజునకు చావువంటిదగును. ఇది ఆదరించదగిన బుద్ధి గల వారందరి నిశ్చయము.
యథా యథా హి పురుషో నిత్యం శాస్త్ర మవేక్షతే,
తథా తథా విజానాతి విజ్ఞాన మథ రోచతే. 10
పురుషు డెట్లెట్లు ప్రతిదినము శాస్త్రమును పరికించుచుండునో అట్లట్లు చక్కగా విజ్ఞానమును తెలిసికొనును. క్రమముగా దాని యందు రుచియు ఆతనికి కల్గును.
అవిజ్ఞానా దయోగో హి పురుష స్యోపజాయతే,
విజ్ఞానా దపి యోగశ్చ యోగో భూతికరః పరః. 11
విజ్ఞానము లేని కారణమున మనుజునకు ఉపాయము తోచకుండుట కలుగును. విజ్ఞానమువలన యోగము సిద్ధించును. యోగము సంపదను కలిగించునది యగును.
అశంకమానో వచన మనసూయు రిదం శృణు,
రాజ్ఞః కోశక్షయా దేవ జాయతే బలసంక్షయః. 12
నీవు ఏమాత్రము నా మాటను శంకింపక, దానియందు అసూయలేని వాడవై వినుము. రాజునకు కోశము నశించుటవలననే బలము తరిగిపోవుట సంభవించును.
కోశం చ జనయేద్ రాజా నిర్జలేభ్యో యథా జలమ్,
కాలం ప్రాప్యానుగృహ్ణీయా దేష ధర్మః సనాతనః,
ఉపాయ ధర్మం ప్రాప్యేమం పూర్వై రాచరితం జనైః. 13
జలము లేనివాని నుండి జలమును పొందినట్లు రాజు కోశమును పుట్టింప వలయును. తగుకాలమును పొంది ప్రజలను మరల అనుగ్రహింపవలయును. ఇది సనాతనమగు ధర్మము. వెనుకటి రాజులు కూడ ఈ ఉపాయ ధర్మమును ఆచరించి యున్నారు.
అన్యో ధర్మః సమర్థానా మాపత్స్వన్యచ్చ భారత,
ప్రాక్కోశాత్ ప్రాప్యతే ధర్మో వృత్తి ర్ధర్మాద్ గరీయసీ. 14
ధర్మరాజా! సమర్థులగు వారి ధర్మమొకటి. ఆపదలయందు ధర్మము వేరొకటి. కోశము లేకపోయినను ధర్మమును సాధింపవచ్చును. వృత్తియనునది ధర్మము కంటె మిన్న యయినది.
ధర్మం ప్రాప్య న్యాయవృత్తిం నబలీయాన్ న విన్దతి,
యస్మాద్ బలస్యోపపత్తి రేకాన్తేన న విద్యతే. 15
తస్మా దాపత్స్వధర్మోఽపి శ్రూయతే ధర్మలక్షణః,
అధర్మో జాయతే తస్మి న్నితి వై కవయో విదుః. 16
బలము లేనివాడు ధర్మమునే పట్టి వ్రేలాడి మేలైన బ్రదుకు తెరువును పొందజాలడు. ప్రయత్నమువలననే బలము సిద్ధించునను నియమమేదియు లేదు. కనుక ఆపదలయందు అధర్మము కూడ కర్తవ్యమే యగునని వినవచ్చుచున్నది. కాని అట్టిదానియందలి అధర్మలక్షణమువలన అధర్మమే కలుగునని మేధావులు భావింతురు.
అనంతరం క్షత్రియస్య తత్ర కిం విచికిత్స్యతే,
యథాస్య ధర్మో న గ్లాయే న్నేయా చ్ఛత్రువశం యథా,
తత్ కర్తవ్య మిహే త్యాహు ర్నాత్మాన మవసాదయేత్. 17
ఆపద గడచిన తరువాత ఆ అధర్మరూపమైన దానిని తొలగించుకొనుటకు క్షత్రియుడేమి చేయవలయునో విచారింప బడుచున్నది. ధర్మమెట్లు నశింప కుండునో, తానెట్లు శత్రువుచేత చిక్కకుండునో అది కర్తవ్యమని తెలిసినవారు చెప్పుదురు. తన్ను తాను నశింపజేసికొనరాదు.
సర్వాత్మనైవ ధర్మస్య న పరస్య న చాత్మనః,
సర్వోపాయై రుజ్జిహీర్షే దాత్మాన మితి నిశ్చయః. 18
ఎట్టి పరిస్థితులందును సర్వవిధముల పరుని ధర్మమును గాని, తన ధర్మమును గాని ఉద్ధరింపదలపరాదు. తన్ను తాను ఉద్ధరించుకొనుటకే ప్రయత్నింప వలయునని నా నిశ్చయము.
తత్ర ధర్మవిదాం తాత నిశ్చయో ధర్మనైపుణమ్,
ఉద్యమో నైపుణం క్షాత్రే బాహువీర్యా దితి శ్రుతిః. 19
అందు ధర్మవేత్తల నిర్ణయము ధర్మమును నేర్పుతో పాటించుటయే. క్షత్రియుల విషయమున భుజముల శక్తి కంటె ప్రయత్నమే నేర్పైనదని వేదము చెప్పుచున్నది.
క్షత్రియో వృత్తిసంరోధే కస్య నాదాతు మర్హతి,
అన్యత్ర తాపస స్వాచ్చ బ్రాహ్మణస్వాచ్చ భారత! 20
భారతా! తన బ్రదుకుదారికి అడ్డు ఏర్పడినపుడు క్షత్రియుడు తాపసుల సొమ్ముకంటెను, బ్రహ్మజ్ఞానుల సొమ్ముకంటెను ఇతరమైన ఎవని సొమ్మును గ్రహింపరాదు? (ఎవని సొమ్మునైనను గ్రహింపవచ్చునని భావము)
యథా వై బ్రాహ్మణః సీద న్నయాజ్యమపి యాజయేత్,
అభోజ్యాన్నాని చాశ్నీయాత్ తథేదం నాత్ర సంశయః. 21
బ్రాహ్మణుడు వేరు దిక్కులేక నాశనము పొందు దశలో యజ్ఞము చేయరానిచోట కూడ యజ్ఞముచేయించును. తినరాని కూడులను తినును. ఇదియు అటువంటిదే. ఇందు సంశయము లేదు.
పీడితస్య కిమద్వార ముత్పథో విధృతస్య చ,
అద్వారతః ప్రద్రవతి యదా భవతి పీడితః. 22
పీడితుడైన వానికి ద్వారము కాని దేది? బంధితునకు వెలువడు దారి యేముండును? కనుక తప్పుడు మార్గముననైనను తప్పించుకొని పారిపోవును.
యస్య కోశబలగ్లాన్యా సర్వలోకపరాభవః,
భైక్ష్యచర్యా న విహితా న చ విట్ఛూద్రజీవికా. 23
కోశము వట్టిపోయి, బలము తరిగిపోయి సర్వలోకము నుండియు పరాభవము పొందు క్షత్రియునకు బిచ్చమెత్తుకొనుటయో, వైశ్యవృత్తి గాని శూద్ర వృత్తిగాని చేపట్టుటయో శాస్త్రము చెప్పిన మార్గము కాదు.
స్వధర్మానన్తరా వృత్తి ర్జాత్యా ననుపజీవతః,
జహతః ప్రథమం కల్ప మనుకల్పేత జీవనమ్. 24
తన జాతివారికడ ముష్టియెత్తుకొని బ్రదుకరాని వానికి, తన ధర్మమగు విజయముతో ధనము నార్జించుటకు మిక్కిలి దగ్గరగానున్న (మరియొక) వృత్తి విహితమగును. మొదటిదారి వదలిన వానికి ఏదో ఒక బ్రదుకుబాట ఏర్పడవలయును కదా!
ఆపద్గతేన ధర్మాణా మన్యాయే నోపజీవనమ్,
అపి హ్యేతద్ బ్రాహ్మణేషు దృష్టం వృత్తిపరిక్షయే. 25
ఆపదనొందినవాడు ధర్మములకు విరుద్ధమైన విధానముతో కూడ, బ్రతుకు తెరువును చూచుకొనవలయును. బ్రదుకు తెరువు పాడైనపుడు ఇట్టి విధము బ్రాహ్మణుల యందును కాన వచ్చుచున్నది.
క్షత్రియే సంశయః కస్మా దిత్యేవం నిశ్చితం సదా,
ఆదదీత విశిష్టేభ్యో నావసీదేత్ కథఞ్చన. 26
క్షత్రియుడును ఆపదలయందు విశిష్టులనుండి ధనమును గ్రహింపవచ్చును. ఏవిధముగను నశించిపోరాదు. ఇందులో సంశయమేల? ఇది ఎన్నటికిని నిశ్చయమే.
హన్తారం రక్షితారం చ ప్రజానాం క్షత్రియం విదుః,
తస్మాత్ సంరక్షతా కార్య మాదానం క్షత్రబంధునా. 27
ప్రజలను కొల్లగొట్టువాడు, రక్షకుడును క్షత్రియుడే యని మేధావులు భావింతురు. కావున రక్షించుచున్న క్షత్ర బంధువు ధనమును గ్రహించుట చేయదగిన పనియే యగును.
అన్యత్ర రాజన్ హింసాయా వృత్తి ర్నేహాస్తి కస్యచిత్,
అప్యరణ్యసముత్థస్య ఏకస్య చరతో మునేః. 28
అడవిలోనే ఒంటరిగా బ్రదుకుచు తిరిగెడు మునికి కూడ ఇట్టి స్థితిలో హింసకంటె వేరైన వృత్తి మరియొకటి కానరాదు.
న శఙ్ఖలిఖితాం వృత్తిం శక్య మాస్థాయ జీవితుమ్,
విశేషతః కురుశ్రేష్ఠ ప్రజాపాలన మీప్సయా. 29
శంఖలిఖితయగు వృత్తిని పట్టుకొని బ్రదుకుట శక్యము కాని పని. విశేషించి, కురుశ్రేష్ఠా! ఉబలాటముతో ప్రజాపాలన చేయువానికి మరియు అసాధ్యము.
పరస్పరం హి సంరక్షా రాజ్ఞా రాష్ట్రేణ చాపది,
నిత్యమేవ హి కర్తవ్యా ఏష ధర్మః సనాతనః 30
రాజు, రాష్ట్రము - ఒకరినొకరు ఆపదయందు రక్షించుకొనుట ఎల్లవేళల కర్తవ్యము. ఇది సనాతనమగు ధర్మము.
రాజా రాష్ట్రం యథాఽపత్సు ద్రవ్యౌఘై రపి రక్షతి,
రాష్ట్రేణ రాజా వ్యసనే రక్షితవ్యస్తథా భవేత్. 31
ఆపదలలో రాజు ధనప్రవాహములతో రాష్ట్రము నెట్లు రక్షించునో, కష్ట సమయమున రాజును కూడ రాష్ట్రము అట్లే రక్షింపవలయును.
కోశం దణ్డం బలం మిత్రం యదన్య దపి సఞ్చితమ్,
న కుర్వీతాన్తరం రాష్ట్రే రాజా పరిగతః క్షుధా. 32
ఆకలిపైకొన్న రాజు కోశమును, దండమును, మిత్రమును, మరియేదిగాని కూడబెట్టిన దానిని రాష్ట్రమునకు దూరమైనదిగా చేసికొనరాదు. (కాపాడుకొన వలయునని తాత్పర్యము)
బీజం భక్తేన సంపాద్య మితి ధర్మవిదో విదుః,
అత్రైత చ్ఛమ్బర స్యాహు ర్మహామాయస్య దర్శనమ్. 33
ధర్మమెరిగినవారు బీజమును అన్నముతో సంపాదింపవలయునని యెరుగుదురు. ఇది పెనుమాయలు గల శంబరుని దర్శనముగా ఉదాహరింతురు.
ధిక్ తస్య జీవితం రాజ్ఞో రాష్ట్రం యస్యావసీదతి,
అవృత్త్యా ఽన్యమనుష్యోఽపి యో వైదేశిక ఇత్యపి. 34
ఆ రాజు రాష్ట్రమును, ఇతర జనుడును విదేశములకు చెందిన వాడైనను బ్రతుకు మార్గములేక నశింతురేని ఛీ! ఆ రాజు బ్రతుకు ఎంత నికృష్టము!
రాజ్ఞః కోశబలం మూలం కోశమూలం పునర్బలమ్,
తన్మూలం సర్వధర్మాణాం ధర్మమూలాః పునః ప్రజాః. 35
రాజునకు కోశము బలము కుదురు. కోశము మూలమే మరల ఆతని బలము. అది సర్వధర్మములకు మూలము. ప్రజలకు ధర్మమే మూలము.
నాన్యానపీడయిత్వేహ కోశః శక్యః కుతో బలమ్,
తదర్థం పీడయిత్వా చ దోషం ప్రాప్తుం న సోఽర్హతి. 36
ఇతరులను ఇబ్బంది పెట్టక కోశమును కూర్చుకొనుట సాధ్యము కాదు. ఇంక బలమును సాధించుట యెక్కడ? దానికొరకు ప్రజలను పీడించి యాతడు దోషమును
పొందడు.
అకార్య మపి యజ్ఞార్థం క్రియతే యజ్ఞ కర్మసు,
ఏతస్మాత్ కారణా ద్రాజా న దోషం ప్రాప్తు మర్హతి. 37
యజ్ఞ కర్మములయందు, యజ్ఞముకొరకు కాని పనులను కూడ చేయుచుందురు. ఈ కారణమువలన రాజు దోషమును పొందరాదు. (తప్పు చేసినవాడు కాడని తాత్పర్యము)
అర్థార్థ మన్యద్ భవతి విపరీత మథాపరమ్,
అనర్థార్థ మథాప్యన్యత్ తత్ సర్వం హ్యర్థ కారణమ్,
ఏవం బుద్ధ్యా సంప్రపశ్యే న్మేధావీ కార్యనిశ్చయమ్. 38
ఒక పని ఆపదలో అర్థముకొఱకు అగును. మరియొకటి దానికి విరుద్ధమైనది అనర్థము కొరకగును. ఇంకను ఒకటి అనర్థము కొరకయినదియు అంతయు అర్థము కొరకగుటయు సంభవించును. దీనినంతటిని బుద్ధితో మెలకువతో విచారించి తెలివి కలవాడు కార్యమును నిర్ణయించుకొనవలయును.
యజ్ఞార్థ మన్యద్ భవతి యజ్ఞోఽ న్యార్థస్తథా పరః,
యజ్ఞ స్యార్థార్థ మేవాన్యత్ తత్ సర్వం యజ్ఞ సాధనమ్. 39
యజ్ఞము కొఱకు ఒకటి యగును. యజ్ఞము మరియొక దానికొఱకగును. యజ్ఞము కొరకైన దాని కొఱకు మఱియొకటి యగును. అదియంతయు యజ్ఞ సాధన మగును.
ఉపమా మత్ర వక్ష్యామి ధర్మతత్త్వప్రకాశినీమ్,
యూపం ఛిన్దన్తి యజ్ఞార్థం తత్ర యే పరిపన్ధినః. 40
ధర్మ తత్త్వమును ప్రకాశింపజేయు ఉపమ నిందు చెప్పెదను. యజ్ఞము కొఱకైన యూపమును అందు శత్రువులైన వారు ముక్కలు చేయుదురు.
ద్రుమాః కేచన సామన్తా ధ్రువం ఛిన్దన్తి తానపి,
తే చాఽపి నిపతన్తోఽన్యా న్నిఘ్నన్త్యేవ వనస్పతీన్. 41
కొందరు శత్రువులైన సామంతులనెడు వృక్షములు తప్పనిసరిగా ఇతర వృక్షములను కూడ కొట్టివైచెదరు. ఆ చెట్లు కూడ పడిపోవుచు ప్రక్కనున్న చెట్లను కూల్చివేయును.
ఏవం కోశస్య మహతో యే నరాః పరిపన్థినః,
తా నహత్వా నపశ్యామి సిద్ధి మత్ర పరంతప. 42
ఈవిధముగా గొప్పకోశమునకు కొందరు పగవారగుదురు. వారిని చంపివేయక ఇందు సిద్ధి నాకు కానరాదు.
ధనేన జయతే లోకా వుభౌ పర మిమం తథా,
సత్యం చ ధర్మవచనం యథా నాస్త్యధన స్తథా. 43
ధనముచేత ఇహపరలోకములను రెండింటిని సాధింతురు. అధనుడు లేనట్టివాడే అను ధర్మవచనము సత్యము.
సర్వోపాయై రాదదీత ధనం యజ్ఞప్రయోజనమ్,
న తుల్యదోషః స్యాదేవం కార్యాకార్యేషు భారత. 44
యజ్ఞము ప్రయోజనముగాగలధర్మమును అన్ని యుపాయములచేతను సాధింపవలయును. కాని కార్యము అకార్యము అనువానియందు ఈవిధముగా సమానమగు దోషము ఉండదు.
నైతౌ సంభవతౌ రాజన్ కథంచిదపి పార్థివ,
న హ్యరణ్యేషు పశ్యామి ధనవృద్ధా నహం క్వచిత్. 45
రాజా! ఈరెండును (ధన సంపాదన, త్యాగము అనునవి రెండును) ఒక్కనియందే ఎన్నటికిని సంభవింపవు. అడవులలో ధనవృద్ధులను నేనెందును చూడను.
యదిదం దృశ్యతే విత్తం పృథివ్యా మిహ కిఞ్చన,
మమేదం స్యా న్మమేదం స్యా దిత్యేవం కాంక్షతే జనః. 46
ఈ భూమి పై ఏ కొంచెము ధనము కానవచ్చినను, ఇది నాది, ఇది నాది అని జనుడు దానిని కోరుచుండును.
న చ రాజ్యసమో ధర్మః కశ్చిదస్తి పరంతప,
ధర్మః సంశబ్దితో రాజ్ఞా మాపదర్థ మతో ఽన్యథా. 47
రాజులకు రాజ్యముతో సమానమగు ధర్మము మరియొకటి లేదు. ఆపద సమయములందు ధర్మము కంటె వేరయిన విధానము కూడ ధర్మమనియే చక్కగా చెప్పబడినది.
దానేన కర్మణా చాన్యే తపసాఽన్యే తపస్వినః,
బుద్ధ్యాదాక్ష్యేణ చైవాన్యే విన్దన్తి ధనసఞ్చయాన్. 48
కొందరు దానముచేతను, కొందరు యజ్ఞము మొదలగు కర్మముచేతను, కొందరు తపస్వులు తపస్సుచేతను, మఱికొందఱు అన్నిటికి చాలిన బుద్ధిచేతను ధనపుప్రోవులను పొందుచుందురు.
అధనం దుర్బలం ప్రాహు ర్ధనేన బలవాన్ భవేత్,
సర్వం ధనవతా ప్రాప్యం సర్వం తరతి కోశవాన్. 49
ధనము లేనివాడే దుర్బలుడని యందురు. ధనము తోడనే బలవంతుడగును. ధనము గలవాడన్నింటిని పొందును. కోశము నిండుగా నున్నవాడు అన్ని ఆపదలను దాటును.
కోశేన ధర్మః కామశ్చ పరలోక స్తథా హ్యయమ్,
తం చ ధర్మేణ లిప్సేత నాధర్మేణ కదాచన. 50
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మాను శాసనపర్వణి
త్రింశదధిక శతతమోఽధ్యాయః
కోశము వలన ధర్మము, కామము, ఇహపరలోకములు సిద్దించును. అదియు ధర్మము తోడనే పొందగోరవలయును. అధర్మముతో ఎన్నటికిని పొందగోరరాదు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున రాజధర్మానుశాసనపర్వమున నూటముప్పదియవ అధ్యాయము.
సమాప్తం రాజధర్మానుశాసన పర్వ
రాజధర్మాను శాసనపర్వము ముగిసినది
ఏకవింశత్యధిక శతత మోఽధ్యాయః
121
దండ కథనము
121
9. ధర్మసంఖ్యా - ధర్మమును చక్కగా ప్రకాశింపజేయుటయే దండము. దానికే మరియొకపేరు వ్యవహారము. దానిని నిర్వచించుచున్నారు. శ్రద్ధగలబుద్ధిగలరాజు ఆధర్మమునకు లోపము రాకుండునట్లు చూచుకొనుటయే వ్యవహారము. వి+అవహారః - వ్యవహారము. నీచమార్గమున ఇతరుల సొమ్మును హరించుటను అవహారమందురు. అది లేకపోవుటయే వ్యవహారము.
11. ప్రజలను రక్షించునది కావున వ్యవహారమే ధర్మపదముచే చెప్పబడునది అని తెలుపుచున్నారు.
12. మనువు బ్రహ్మ పలికినదానినే తనముఖమునుండి వెలువరించె నని తాత్పర్యము.
13. పైని చెప్పినమాట వలన దండమే ధర్మశబ్దముతో, వ్యవహారశబ్దముతో చెప్పబడునని తాత్పర్యము.
14. దండములోపలి రూపము అగ్నివలె చూచువానికి సంతాపమును కలుగజేయునట్టిదై యుండునని భావము
15,16. ఈ రెంటిలో దండపురుషుని బాహ్యమగురూపమును వర్ణించుచున్నారు. దండపు అధిష్ఠాన దేవత యొక్క ఈ ధ్యానాదికము అజ్ఞానమువలన దండింపరానివారిని దండించుటవలన కలిగిన దోషమును నివారించుటకు దండకర్తలగు అమాత్యాదులు ధ్యానింపవలసిన దనుభావముతో కూడినది. ఒకవేళ లౌకికములగు దండధర్మ వ్యవహారాంగములను ఇచట ఉత్ప్రేక్షించుచు న్నారనుకొన్నచో అప్పుడు వ్యాఖ్యాన మిట్లుండును.
దండము సంహరించు రూపము కలదగుటచే రౌద్రము. రుద్రుడు నీలలోహితుడు. అందు “అగ్నిరివోత్థితః” అనుచోట లోహిత వర్ణమును - ఎరుపురంగును చెప్పియున్నారు. నీల వర్ణమును నీలోత్పలశ్యామ శబ్దముతో చెప్పుచున్నారు.
రాజు దండ్యుని ద్వేషించును, ఆతని ధనమున ఆశపడును. కావున విధింపబడెడు దండమునకు మాలిన్యము, రాగము ఏర్పడును. ఆవిధముగా దండరూపము నీలలోహితము.
దండ పురుషునకు నాలుగుకోరలు. ప్రాణులవధసాధనములు నాలుగు. కొందరు మానభంగముచేత, కొందరు ధనమును దొంగిలించుటచేత, కొందరు అంగములను వికలము చేయుటచేతను, కొందరు ప్రాణములు తీయుటచేతను వధకు యోగ్యు లగుదురు. అందువలన అవియే దండపురుషుని నాలుగు కోరలు.
నాలుగు భుజములు. అర్థమును గ్రహించు పద్ధతులు నాలుగు. ఒకటి ప్రజలవలన సామంతుల వలన పన్నుల రూపమున గ్రహించుట. అబద్ధమాడువారి నుండి అడుగు దాని కంటె రెట్టింపుగా గ్రహించుట రెండు. అబద్ధమాడు ప్రతివాదినుండి దానికి సమానమగు ధనము గ్రహించుట మూడవది. ధనవంతుడగు పిసిని గొట్టునుండి సొమ్ము మొత్తమును గ్రహించుట - ఇవి నాలుగును దండపురుషుని భుజములు.
అష్టపాత్ - దండపురుషునకు ఎనిమిది పాదములు. (1) ఆవేదనము (2) భాష (3) సంప్రతిపత్తి
(4) మిథ్యోత్తరము (5) కారణోత్తరము (6) ప్రాఙ్న్యాయము (7) ప్రతిభువు (8) క్రియాఫలసిద్ధి - అనునవి.ఇవి నిమిత్తములుగా దండము ప్రవర్తించును కావున ఇవి పాదములు.
మరియొకవిధముగా వీనికి పాదత్వము కలుగదు.
(1) ఆవేదనమ్ - వాది సభ్యులకడ కరిగి దేవదత్తుడు నాకడ నూరు రూప్యములను ఈ దేశమున ఈ కాలమున ఈసాక్షి ఎదుట తీసికొని తిరిగి యీకున్నాడని చెప్పుట.
(2) భాష -మొదట వ్రాసి యిచ్చిన పత్రమును మరల ప్రతివాదిని పిలిచి అతని యెదుట అతనిచేతనే వ్రాయించుట.
(3) ప్రతివాది నేనీతనికి అప్పుపడితి ననిపలికినపుడు ఎవనికి దండము లేకుండుట సంప్రతిపత్తి రూపమగు సమాధానము.
(4) నేనీతనికి అప్పుపడలేదని పలుకుట మిథ్యోత్తరము.
(5) నేను ఇతనినుండి ధనమును తీసికొంటిని కాని దానిని తిరిగి యిచ్చి వైచితి నని చెప్పుట కారణోత్తరము.
(6) ఈ విషయమున ఇతనితో ఇంతకు మునుపే నేను వివాదపడితిని. నాచేత నితడు ఓడింపబడె ననుట ప్రాఙ్న్యాయోత్తరము.
(7) ప్రతిభువు - పూటకాపు ఈమూడు విధములగు ఉత్తరములందును వాది ప్రతివాదులకు పూటకాపు ఒకడు ఉండవలయును.
(8) నేనీ అభియోగమున ఓడితిని. ఈ ద్రవ్యము నీతని కిత్తు ననుట క్రియ. స్వమతమునకు సాధకములైన సాక్షి, పత్రము, భోగము, శపథము అనువాని ప్రదర్శనము అందు జారిపోకుండినచో జయము. ఈ ఎనిమిది పాదముల తరువాత అపరాధి దండ్యు డగును.
ఈవిషయమున యాజ్ఞవల్క్యుడు ఇట్లనుచున్నాడు.
‘నిహ్నవే భావితో దద్యాత్ ధనం రాజ్ఞే చ తత్సమమ్,
మిథ్యాభియోగీ ద్విగుణ మభియోగార్ధనం వహేత్’
నైకనయనః - నైకాని - పెక్కులు; నయనాని- నయన స్థానీయములు - రాజు; మంత్రి, పురోహితుడు, పరిషత్సభ్యులు మొదలగువారు - ఈ దర్శన సాధనములు కలది;
శంకుకర్ణ: - మిక్కిలి తీక్ష్ణమైన చెవి కలది, ఊర్ధ్వ రోమవాన్ - వికసించిన లక్షణము కలది. ఇది దండపురుష దంష్ట్రాది వివరణము.
16. జటీ - జడలుగలవాడు; అనేక సందేహములతో జటిలమైనది; ద్విజిహ్వః - వాదిప్రతివాదులవాక్యములలోని భేదములవలన రెండు నాల్కల వాడగు నని భావము;
ఇట్లు వ్యవహారరూపముగల దండము రూపమును చెప్పి ధర్ముడను పేరుగల దండము రూపమును చెప్పుచున్నారు. తామ్రాస్యః- తామ్రమనగా అగ్నియే - ఆ హవనీయము మొదలగునది - అదియే ఆస్యము - మొగముగా కలవాడు; మృగరాజ తనుచ్ఛదః -మృగరాజ మనగా నల్లని లేడి, దాని చర్మమే ఒడలికి కప్పుగా కలవాడు. దీని చేత దీక్షా ప్రధానమగు యజ్ఞమును చెప్పినట్లయినది; ఇది యంతయు దానము, ఉపవాసము, హోమము మున్నగువానికి సూచనము.
ఇట్లు దండమునకు ధర్మస్వరూపము సిద్ధించుచున్నది. రాజు దండమును నిర్వహించునపుడు ధర్మము నుపాసించుచున్నాడ నని భావింపవలయునని తాత్పర్యము.
23. దండము ముఖ్య రూపమును ఇందు చెప్పియున్నారు.
24. దణ్డనీతిః - దండముతో కూడిన నీతి.
25. “కింపరాయణమ్” అను ప్రశ్నకు సమాధానముగా అర్థానర్థములవివేకమే.దాని తుదిగతి అని “తస్మాద్దండః పరాయణమ్” అన్నంతవరకు గల గ్రంథభాగముతో చెప్పుచున్నారు.
36. “కిమాత్మకః, కథంభూతః, కథం మూర్తిః” అను మూడు ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నారు. దండములోకపాలునివంటిది, సత్య పక్షపాతము కలది, బ్రాహ్మణమూర్తి స్వరూపమైనది అని తాత్పర్యము.
37,38,39. దండము బ్రాహ్మణమూర్తి అనుదానిని వివరించుచు ‘కథం జాగర్తి’? ఎట్లు మేలుకొనియుండును? అను ప్రశ్నకు సమాధానముగా మూడు శ్లోకములను చెప్పుచున్నారు. బ్రాహ్మణ మూర్తియైన దండము యజ్ఞాదుల ద్వారమున అన్న సృష్టికికారణ మగుచు ప్రాణులను పాలించుచు మేల్కొనియుండునని మూడు శ్లోకములతాత్పర్యము.
40. “కశ్చ పూర్వాపరమిదం జాగర్తి” అను ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు “జ్ఞేయో నఃస నరేన్ద్రస్థో దణ్డః ప్రత్యయ ఏవ చ” అన్న శ్లోకము తుదిగా గల భాగముచేత.
42. అదదత్ - ఇచ్చెను - ఈశ్వరుడని అర్థము; అస్మై - ఇతనికి - రాజునకు; దణ్ణమ్ - దండనీతిని; పంచవిధాత్మకః - అయిదు విధములగు ఆత్మలు కలవాడు - ధర్మము; వ్యవహారము, దండము, ఈశ్వరుడు, జీవుడు అనునవి ఆ అయిదు ఆత్మలు.
43. బహుధనామాత్యాః- బహుధనసహితులగు అమాత్యులు; బలాని, - తేజస్సు, ఓజస్సు అనువానితో కలిపి చెప్పదగిన దేహ, ఇంద్రియ, బుద్ధి సామర్థ్యములు; అష్టకై - ఎనిమిదింటితో - వీనిని తరువాతి శ్లోకమున చెప్పుచున్నారు; ఆహార్యమ్ - సంపాదించుకొనవలసినది; అన్యద్ బలమ్ - కోశమును పెంపొందించుకొనుట అను మఱియొకబలము;
45. అంగస్య - సైన్యముయొక్క; రాజ్యమునకు దండమే అంగము అని ముందు చెప్పుచున్నారు; కనుక ఆ విధముగా సిద్ధముగానున్న సైన్యమునకు రథములు మొదలగునవి శరీరమగునని మూడవశ్లోకముతో (47) అన్వయము. రసదాః- వైద్యులు;
46. ప్రాడ్వివాకాః- ప్రశ్నించువాడు ప్రాట్టు, వివాకః- వివాదపడిన యిద్దరి ప్రవృత్తికారణములను ఎరిగినవాడు - అట్టివాడు ప్రాడ్వివాకుడు; న్యాయాధికారి;
47. సప్త ప్రకృతి - స్వామి, అమాత్యుడు, జనపదము, బలము, సుహృత్తు, కోశము, దుర్గము - అను ఏడు ప్రకృతులుకలది; దణ్ణమ్ - సేన; దండః- డండనీతి;
49. దండము ప్రదర్శితమైనది. దాని స్థాపన కొరకు బ్రాహ్మణులును ఈశ్వరుని చేత నియమింపబడిరి - అని తాత్పర్యము.
50. భర్తృప్రత్యయః - భర్తలనగా ఇచట వివాదము పొందిన వాది ప్రతివాదులు - వారు కారణమైన వ్యవహారము భర్తృప్రత్యయము. వాది ప్రతివాదులతో ఏర్పడిన వ్యవహారమని తాత్పర్యము. భర్తృప్రత్యయ లక్షణమనగా - వారిలో ఒకనివైపు నిర్ధారణ పొందినది లక్షణముగా గలది - అది ఒకని గెలుపునకు కారణమై, సహితము - హితముతో - ఇష్టముతో కూడినది యగును. ఒకని పరాజయమునకు కారణమైనదగును.
ద్వావింశాధిక శతతమోఽధ్యాయః
15. యియక్షుః - యజ్ఞము చేయగోరినవాడు.
16. క్షువతః - తుమ్ముచున్న.
18. దృష్టరూప ప్రధానత్వాత్ - దృష్టమ్ - కానవచ్చిన; రూపం - దీక్షను గ్రహించుట - ప్రధానముగా గలదియగుట వలన - ప్రజలను నియమించువాడు దీక్షలో ప్రవేశించిన కారణముగా - అని తాత్పర్యము - అందువలన అందరిని నియముములోనుంచు దండము కనుమరుగాయెనని భావము.
33. వినయః - వివృద్ధి - పెంపుదల, చతుర్విభాగస్య - నాలుగు విభాగములు కలవాడు - (1) ఆయుధము (2) శత్రువు, (3) యముడు (4) కర్మము అనునవి ఆ నాలుగు విభాగములు లేదా (1) రోగము
(2) అపథ్యాహారము తినవలయుననెడి రాగము (3) యముడు (4) కర్మము అనునవి.
39. శ్రాద్ధదేవుడు - యముడు
40. విభజ్య - వేరుచేసి - న్యాయమేది, న్యాయమువలె కన్నట్టునదేది అని చక్కగా వివేకించి; దుష్టుల నణచుటయే దండము ముఖ్యప్రయోజనము; అపరాధశుల్కముగా బంగారమును గ్రహించుట మొదలగునది లోకులను తప్పుడు పనులను చేయకుండ భయపెట్టుటకే కానీ కోశమును పెంపొందించుటకు కాదని "హిరణ్యం బాహ్యతః క్రియా" అను వాక్యము తెలుపుచున్నది.
122
దండము పుట్టుక
122
త్రయోవింశాధిక శతతమోఽధ్యాయః
2. కింమూలాః - దేనినుద్దేశించి చేయబడును అని అర్థము; ప్రభవః - దేనినుండి పుట్టును అనునర్థమున ప్రభవము - వీనిఉత్పత్తి స్థానమేది అని ప్రశ్నభావము. అన్యోన్యమ్ అనుషజ్జన్తే - అవిమూడును ఒకదానితోనొకటి కూడిమాడియుండుట ఎప్పుడు? - అవి వేరువేరుగా కన్పట్టుట ఎట్లు? - అని యివి నాలుగు ప్రశ్నలు.
3. సుమనసః - మంచి హృదయము కలవారగు మానవులు; లోకే - భూమియందు; ధర్మార్థనిశ్చయే ధర్మపూర్వకమైన అర్థనిశ్చయమునందు; - నేను గర్భాధానవిధి పూర్వకముగా ఋతుకాలమున భార్యను కూడి సుపుత్రుని పొందుదును అన్న ప్రవృత్తి కలిగినపుడు - తే - ధర్మార్థకామములు మూడును; కాలము - ఋతువేళ; ప్రభవము - పుట్టుక! సంస్థా - చక్కగా కర్మము ఏర్పడుట అనునీమూడును కలిగినపుడు - ధర్మార్థ కామములుమూడును కలియును. యోనిసంస్కార రూపమైనది ధర్మము, పుత్రరూపమైనది అర్థము, స్త్రీతో కలియుట అనునది కామము. ఇట్లీ మూడును కలియును.
4. మొదటి రెండు ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నారు - ధర్మమూల:- దివ్యదేవతాది శరీరములను, స్త్రీ మొదలగువారిని పొందుటకై ధర్మము చేయబడుచున్నది. అందువలన దైవముతో కూడిన అర్థము ధర్మమూలము. అర్థము భోగముకొరకు అనునది ప్రసిద్ధము - కనుక అర్థము కామమూలమని ప్రత్యేకించి చెప్పలేదు. కామము అర్థఫలము - కామముమూలము ఇంద్రియప్రీతి అనిభావము - ఈ మూడును సంకల్పము నుండియే పుట్టుచున్నవి - అని యిది రెండవ ప్రశ్నకు సమాధానము. సంకల్పము రూపాదులే విషయముగా - లక్ష్యముగా కలది - రూపాదులు అనుభవముకొరకే అయినవి. కనుక ఇవి యన్నియు సంకల్పమూలములే యని తాత్పర్యము. మోక్షముమాత్రము దీనికి విలక్షణమైనది అది సంకల్పములులేని స్థితి - అని భావము.
6. ఏమి యీ ధర్మార్థకామములను అందరు సేవింపరాదా? అని ఆశంకించి సమాధానము చెప్పుచున్నారు. రజస్వలాః - ఇవి రజస్సు ప్రధానముగా కలవి కనుక సేవింపరాదు. సత్యము ప్రధానము అయినది మాత్రమే సేవింపదగినది.
7. స్వర్గము మున్నగునది వెలుపలిఫలము. కనుక దూరముగా నుండునట్టిది. దానికొరకైన ధర్మాదులన్నియు దూరమైనట్టివి. ఆత్మజ్ఞానరూపమైనఫలము మిక్కిలిదగ్గరగా నున్నట్టిది. దాని కొరకైన ధర్మాదులు దగ్గరగా నుండునట్టివి. కావునవానిని - అనగా ధర్మాదులను దగ్గరగానుండు వానినిగా సేవింపవలయును. ధర్మమును చిత్తశుద్ధి ప్రయోజనముగా, అర్థమును నిష్కామకర్మార్థముగా, కామమును దేహధారణమాత్రము కొరకుగా సేవింపవలయునని తాత్పర్యము. ధర్మాదీన్ - ధర్మము మొదలుగా కలవానిని; కామనైష్ఠికాన్ - కామము అంతమున నున్నవానిని - అనగా ధర్మార్థకామములను అన్నింటిని; మనసాపి - మనస్సుతోనైనను; న త్యజేత్ - విడువరాదు. ఇక స్వరూపముతో విడువరాదని చెప్పనేల? అయినచో వీనిని వదలుట యెట్లు? అనుదానికి సమాధానము చెప్పుచున్నారు. విముక్తః - విచారము చేతనే వానినుండి నరుడు విముక్తుడగును. సంగఫలమును వదలుట ద్వారమున ధర్మాదులను అనుష్ఠింపవలయునని తాత్పర్యము.
8. శ్రేష్ఠే - శ్రేష్ఠమగు మోక్షమునందు - త్రివర్గమునందలి బుద్ధినిష్ఠ శ్రేష్ఠమగుమోక్షమునందే నిలిపినచో, అట్లు నిలిపిన వాడు శ్రేష్ఠమగు మోక్షమును పొందును. దీనియందు కోరికలేనివానికి అది లభించుట సాధ్యము కాదని భావము.
రెండవపాదమున కామ్యధర్మమును నిందించుచున్నారు. ఈ కర్మమువలన ఈ ఫలమును నేను పొందెదను అని బుద్ధి పూర్వకముగా కర్మముచేసినను ఫలము ఒక్కొక్కప్పుడు కలుగును. ఒకొక్కప్పుడు కలుగదు. అనగా అట్టిదానియందు ఫల మనిశ్చితమని భావము.
9. అర్థమే కావలయునన్నచో ధర్మముకంటె వేరైన ఉపాయములును కలవు. ఇతరులను సేవించుట, వ్యవసాయముచేయుట మొదలగునవి. కనుక అర్థము ధర్మముచేత మాత్రమే లభించుననుకొని అర్థము కొరకు ధర్మమును చేయరాదు. అంతేకాదు విపరీతమైన - విరుద్ధమైన ఫలము కూడ దానివలన కలుగుచుండును. కొందరు అర్థము హఠాత్తుగానో, స్వభావమువలననో, దైవమువలననో కలుగునని తలంతురు. కావున దానికొరకు ధర్మముతో పనిలేదనియు భావింతురు. ఇట్లు ధర్మమునకు అర్థము కారణమగుటను కాదని నిరూపించి అర్థమునకు ధర్మము కూడ కారణముకాదని ప్రతిపాదించుచున్నారు. ఎట్లనగా ఒక్కొక్కప్పుడు మానవుడు అర్థమును సంపాదించియు అనర్థమును పొందుచున్నాడు. అది యెట్లనగా ధనము చేత ఒడలెరుగని వాడు అన్ని విధములగు పాపములను చేయుచున్నాడు. కనుక అర్థముచేత ధర్మము కలుగుట నిత్యము కాదు. అంతేకాదు, ఇతర విధముగా ధర్మము కూడ సిద్ధించుచున్నది. ఉపవాసములు, వ్రతములు మున్నగునవి - ఆద్యస్య - మొదటి పురుషార్థమగు ధర్మమునకు; ఉపకారకమ్ - వృద్ధిని పొందించునదియగుచున్నది. ఇహ అర్థే - ఈ విషయమున - ధర్మము వలన అర్థము, అర్థము వలన ధర్మము ఏర్పడునను విషయమున, అజ్ఞాననికృష్టయా - అజ్ఞానము గుంజివైచినబుద్ధితో, గుర్తింపబడిన, అబుద్ధిః - బుద్ధిహీనుడు, తత్ - ఇప్పుడు చెప్పిన రూపము గల ధర్మార్థముల ఫలమును; న ప్రాప్నుయాత్ - పొందడు. రెండు విధములందును ఒకే విధమగు స్థితి లేని కారణమున ఆ ధర్మార్థముల శ్రేష్ఠమగు ఫలము ఏకరూపమైనదని తాత్పర్యము.
10. అపధ్యానము - ఫలమును కోరుకొనుట, నిగూహనము - దానభోగములకు వినియోగింపకుండుట, సంప్రమోదః - ప్రీతి విశేషము, ఆ మూడు పురుషార్థముల సముదాయము; సు + అగుణ వర్జితః మిక్కిలిగా ఈ దోషములులేనిదై, భూయః - మిక్కిలిగానయిన, చిత్తశుద్ధి ద్వారమున బ్రహ్మానందరూపఫలము నొసగునని భావము.
12. సమయ పర్యయమ్ - మర్యాదను పాటింపకుండుట.
13. ప్రత్యాసన్నస్య - పశ్చాత్తాపము పొందినవాని;
15. ఇచట ఆపస్తంబామ్రనిదర్శనమువలన ఈస్థితి ఏర్పడుచున్నది. ఎట్లనగా - మామిడిచెట్టును పండ్లకొరకు నాటుదుము. కాని దానినుండి నీడయు, సువాసనయు కలుగుచున్నవి. అట్లే ధర్మము నాచరించుచుండగా అర్థములు వెన్నంటి పుట్టుచున్నవి. ఈ విధముగా ధర్మము అర్థకామములు లేనిదై లేనిదగుచున్నది. అట్లే అర్థముకూడ కామముతో అవినాభావసంబంధము కలది యగుచున్నది. ఇది అన్నియెడలను ఇట్టిదియే. ఇంక పరిశేషమువలన కామమే ధర్మార్థములను మించి నిలుచుచున్నది. కనుక కామపరత్వమును నిందించుచున్నారు.
20. ఆవిధముగా నిందితులైన వాని కర్తవ్యము నుపదేశించుచున్నారు.
123
కామంద, అంగరిష్ఠుల సంవాదము
123
చతుర్వింశత్యధిక శతతమో ధ్యాయః
124. ఇది శీలాధ్యాయము.
1. ధర్మస్య - ధర్మమునకు కారణమైనదిగా;
17. గుణాక్రీడా - అని ఒకపాఠము - అప్పుడు గుణములతో తృప్తిపడినదై - అనియర్ధము.
22. నైః శ్రేయసమ్ - నిః శ్రేయస్సునకు - మోక్షమునకు - సంబంధించినది;
23. కోవిశేషోభవేత్ - దానికంటె మేలైనది ఏదియగునో అని అడిగెను.
36. క్షౌద్రమ్ - క్షుద్రలనగా తేనెటీగలు - వానితో కూర్చబడినది - క్షౌద్రము - తేనె; తేనెటీగలు తేనెను వలె వారు నన్ను శాస్త్రముతో తడిపివైచిరని తాత్పర్యము.
37. వాగగ్ర విద్యానామ్ - నాలుక చివరనే ఉన్న విద్యలు కలవారు. పుస్తకములందున్న మాత్రమే యున్న విద్యలు కలవారు కారని తాత్పర్యము.
124
శీల వర్ణనము
124
43. అల్పతేజాః + అయమ్ - ఇచట సంధి ఆర్షము.
46. తేజో విగ్రహవత్ - తేజస్సే స్వరూపముగాగల శీలము.
పణ్యవింశత్యధిక శతతమోఽధ్యాయః
3. “తద్ యుక్తం - కర్తాయమితి'' - యుద్ధము లేకయే ఆతడు నాకు అర్ధరాజ్య మొసగుననెడి ఆశ.
6. పర్వతాత్ - అనుటవలన కదల్పశక్యము కానిదనియు, ద్రుమాత్ - అనుటవలన పెద్ద ఎత్తుగానుండునదియే కాని ఫలములను చూపునది కాదనియు భావము.
7. సుదుర్లభా - గెలువశక్యముకానిదని తాత్పర్యము
15. సమభ్యస్తః - కొట్టబడినదై;
18. గవ్యూతిః - రెండు క్రోసుల దూరము.
125
ఋషభగీతలు
125
షడ్వింశత్యధిక శతతమోఽధ్యాయః
126
ఋషభగీతలు
126
12. పురస్య అనుపదముతో రాజ లక్షణ త్యాగః అనుచోటి త్యాగశబ్దమును వికర్షించి అన్వయించు కొనవలయును.
సప్తవింశత్యధిక శతతమోఽధ్యాయః
3. వైహాయసః - విహాయసమనగా ఆకాశము - దానియందు ప్రవహించునది మందాకిని యను ఆకాశగంగ.
21. తేన - ఆ భూరిద్యుమ్నుని చేత - తప్పిపోయిన వీరద్యుమ్నుని కుమారుడు.
25. ముని రాజునకు మర్యాదలు చేసిన తరువాత అక్కడకు చేరియున్నవారు నీవు ఆశ్రమమునకు వచ్చుటలో ప్రయోజనమేమి యని యడిగిరని తాత్పర్యము.
127
ఋషభగీతలు
127
అష్టావింశత్యధిక శతతమోఽధ్యాయః
4. ఆశాకృతః - ఆశతో హింసింపబడినవాడు - కౄహింసాయామ్ అనునది యిట ధాతువు.
128
ఋషభగీతలు
128
9. ఆశాయాః - ఆశ కలవానికి అని అర్థము - వానికి సాటియగునది మరొకటి లేదని తాత్పర్యము. అట్లే కృశత్వముతో సాటియైనదియు మరొకటి లేదని భావము.
10. కృశాకృశే - ఎవడు ఆశకు లోబడునో వాడు కృశుడు. ఎవడు ఆశను గెలుచునో వాడు పుష్టుడు అని తాత్పర్యము, తస్యైవ - ఆ ఆశకు విషయమైన దాని యొక్కయే.
13. దుర్లభమైనదేది? అను రెండవ ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు.
14. ఆదరముతో ఆశపెట్టి అర్థికి మొండిచేయి చూపగా అతనికి కలిగెడు ఆశ ఎట్టిదో అది మిక్కిలి హీనమైనదని భావము.
ఏకోనత్రింశదధిక శతతమోఽధ్యాయః
129
యమ గౌతమ సంవాదము
129
త్రింశదధిక శతతమోఽధ్యాయః
ప్రజాపీడన సంతాపా త్సముద్భూతో హుతాశనః,
రాజ్ఞః ప్రాణాన్ బలం కోశం నాదగ్ధ్వా వినివర్తతే.
“బుభుక్షిత స్త్య్రహం విప్రో ధాన్యమబ్రాహ్మణా ద్ధరేత్”
130
ఆపత్తికాలమున రాజుధర్మము
130