| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 4 |
| Pages | 76 |
| Read Time | 91 Minutes |
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరుడు పలికెను.
క్షీణస్య దీర్ఘసూత్రస్య సానుక్రోశస్య బన్ధుషు,
పరిశఙ్కిత వృత్తస్య శ్రుతమన్త్రస్య భారత. 1
విభక్త పురరాష్ట్రస్య నిర్ద్రవ్య నిచయస్య చ,
అసంభావిత మిత్రస్య భిన్నామాత్యస్య సర్వశః. 2
పరచక్రాభిజాతస్య దుర్బలస్య బలీయసా,
ఆపన్న చేతసో బ్రూహి కిం కార్య మవశిష్యతే. 3
తాతా! క్షీణుడు, అలసుడు, బంధువుల విషయమున చేతకానివాడు, ఎందును శంకలు కలవాడు, వెల్లడి అయిన మంత్రము గలవాడు, పగవారు కొల్లగొట్టిన పట్టణము, రాష్ట్రము గలవాడు, అర్థబలము లేనివాడు, మన్నించెడు చెలికాండ్రు లేనివాడు, శత్రువులకు అన్ని విధముల వశమైన మంత్రులు కలవాడు, శత్రుసేనల దాడిలో చిక్కుకొన్నవాడు, బలములేనివాడు, తనకంటె మిన్నయగు బలముగల వానిచేత ఆపద నొందిన బుద్ధిగలవాడు అగు రాజునకు చేయదగినది ఏమి మిగిలియున్నదో నాకు చెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
బాహ్య శ్చే ద్విజిగీషుః స్యాద్ధర్మార్థ కుశలః శుచిః,
జవేన సంధిం కుర్వీత పూర్వ భుక్తాన్ విమోచయేత్. 4
దండెత్తి వచ్చినరాజుగెలువ గోరినవాడు, ధర్మ మార్గమున అర్థమును సాధించు నేర్పుగలవాడు, పవిత్రుడు అయినచో వెనువెంటనే సంధి చేసి కొనవలయును. తన పూర్వు లనుభవించిన గ్రామాదులను విడిపించుకొన వలయును.
యో ధర్మ విజిగీషుః స్యా ద్బలవాన్ పాపనిశ్చయః
ఆత్మనః సన్నిరోధేన సంధిం తేనాపి రోచయేత్. 5
అతడు అధర్మమార్గమున గెలువగోరినవాడు, బలవంతుడు, పాపనిశ్చయములు గలవాడును అయినచో కొంత భూభాగము నిచ్చియు అతనితో సంధినే కోరవలయును.
అపాస్య రాజధానీం వా తరే ద్ద్రవ్యేణ చాపదమ్,
తద్భావయుక్తో ద్రవ్యాణి జీవన్ పున రుపార్జయేత్. 6
రాజధానిని వదలి వైచియో, ఉన్నధనమంతయు నిచ్చి వైచియో ఆపదను దాటవలయును. రాజభావమును హృదయమున పదిలపరచుకొన్నవాడై బ్రదుకుచు మరల ధనమును సాధించుకొనవచ్చును.
యాస్తు కోశ బలత్యాగా చ్ఛ క్యా స్తరితు మాపదః,
కస్తత్రాధిక మాత్మానం సంత్యజే దర్థధర్మవిత్. 7
ఆపదలు కోశమును, బలమును వదలుటచేత దాటశక్యమైనవి అయినచో, అర్థ ధర్మముల తత్వ మెరిగినవాడెవ్వడును అచట మిన్నయగు బ్రదుకును బలి పెట్టడు.
అవరోధాన్ జుగుప్సేత కా సపత్నధనే దయా,
నత్వేవాత్మా ప్రదాతవ్యః శక్యే సతి కథఞ్చన. 8
అంతఃపురము నైనను ఏవగించుకొనవలయును. అది శత్రు ధనమైనచో దానియందు దయ ఎక్కడిది? ఏమైనను శక్తి యున్నంత వరకు తన్ను మాత్రము ఎన్నటికిని అర్పణ చేసి కొనరాదు.
యుధిష్ఠిర ఉవాచ- ధర్మరా జిట్లు పలికెను.
ఆభ్యంతరే ప్రకుపితే బాహ్యే చోపనిపీడితే,
క్షీణే కోశే శ్రుతే మంత్రే కింకార్య మవశిష్యతే. 9
లోపలి వారు పెద్దగా కోపించి యున్నయెడల, వెలుపలి ధనము పీడనొంది యున్న యెడల, కోశము క్షీణించి మంత్రము బట్టబయలైనచో చేయదగు కార్యమేమి?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
క్షిప్రం వా సన్ధి కామః స్యాత్ క్షిప్రం వా తీక్ష్ణ విక్రమః,
తదాపనయనం క్షిప్ర మేతావ త్సాంపరాయికమ్. 10
అట్టివాడు వెనువెంటనే సంధిని కోరువాడైన కావలయును. లేదా తెగించి విక్రమము చూపవలయును. శత్రువును రూపుమాపుటయో పరలోక క్రియలు పొందుటయో వెంటనే యగును.
అనురక్తేన చేష్టేన హృష్టేన జగతీపతిః,
అల్పేనాపి హి సైన్యేన మహీం జయతి భూమిపః. 11
అనురాగము కలది, తనకు ఇష్టమైనది, రాజు విషయమున సంతోషము పొందినదిఅగు చిరు సైన్యముతోకూడ రాజు భూమిని గెలుచును.
హతో వా దివ మారోహే ద్ధత్వా వా క్షితి మావసేత్,
యుద్ధే హి సంత్యజన్ ప్రాణాన్ శక్ర స్యైతి సలోకతామ్. 12
చచ్చినచో స్వర్గ మెక్కును. చంపినచో భూమిని పొందును. యుద్ధమున ప్రాణములు వదలుచు దేవేంద్రునికి సమానమగు లోకము పడయును.
సర్వ లోకాగమం కృత్వా మృదుత్వం గన్తు మేవ చ,
విశ్వాసా ద్వినయం కుర్యా ద్విశ్వసే చ్చా ప్యు పాయతః. 13
సర్వలోకమున ప్రసిద్ధమగు ఉపాయము నవలంబించి మెత్తదనము పొంద వలయును. విశ్వాసముతో వినయమును, ఉపాయముతో విశ్వాసమును అవలంబింపవలయును.
అపచిక్రమిషుః క్షిప్రం సామ్నా వా పరిసాన్త్వయన్,
విలంఘయిత్వా మన్త్రేణ తతః స్వయ ముపక్రమేత్. 14
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
ఏకత్రింశ దధిక శతతమోఽధ్యాయః
కొంత కాలము ప్రక్కకు తొలగగోరిన వాడగుచు, సామముతో శత్రువును వశము చేసికొనుచు, దేశమునుండి బయటకు వెడలి మంత్ర బలముతో మరల గెలువ నుంకింపవలయును.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
నూట ముప్పది యొకటవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
హీనే పరమకే ధర్మే సర్వలోకాభి సంహితే,
సర్వస్మిన్ దస్యుసాద్భూతే పృథివ్యా ముపజీవనే. 1
కేనస్విద్ బ్రాహ్మణో జీవే జ్జఘన్యే కాల ఆగతే,
అసన్త్యజన్ పుత్ర పౌత్రా ననుక్రోశా త్పితామహ. 2
తాతా! లోకమంతయు మిక్కిలిగా మన్నింపదగు ధర్మము నశింపగా, భూమియందు బ్రదుకు అంతయు దొంగల పాలు కాగా చేటు కాలము రాగా, జాలి వలన కొడుకులను, మనుమలను విడనాడజాలని బ్రాహ్మణుడు ఎట్లు బ్రదుక వలయును?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
విజ్ఞానబల మాస్థాయ జీవితవ్యం తథాగతే,
సర్వం సాధ్వర్థ మే వేద మసాధ్వర్థం న కిఞ్చన. 3
అట్టి స్థితి కలిగినపుడు విజ్ఞానబలము నూతగాగొని జీవింపవలయును. తన ధనాదిక మంతటిని సాధువుల కొరకే యగునట్లు, దుష్టులకు కాని యట్లు, బ్రదుక వలయును.
అసాధుభ్యోఽర్థమాదాయ సాధుభ్యో యః ప్రయచ్ఛతి,
ఆత్మానం సంక్రమం కృత్వా కృచ్ఛ్రధర్మవిదేవ సః. 4
చెడ్డవారినుండి ధనము గ్రహించి మంచివారి కొసగునతడు తన్ను ధనాగమన మార్గముగా చేసికొనువాడు కష్ట కాలపు ధర్మము నెరిగిన వాడే యగుచున్నాడు.
ఆకాంక్ష న్నాత్మనో రాజ్యం రాజ్యే స్థితి మకోపయన్,
అదత్త మేవాదదీత దాతు ర్విత్తం మమేతి చ. 5
తన రాజ్యమును పొందగోరుచు, రాజ్యమున స్థితిని ఉద్వేగ పరుపక, పాలకుని ధనము నాదే యను భావముతో ఇతరుడొసగని ధనమును కూడ గ్రహింపనగును.
విజ్ఞాన బల పూతో యో వర్తతే నిన్దితేష్వపి,
వృత్తి విజ్ఞానవాన్ ధీరః కస్తం వా వక్తు మర్హతి. 6
విజ్ఞానబలముచేత పవిత్రుడు, వృత్తుల విజ్ఞానము గొప్పగా కలవాడు ధీరుడు అగు వాడు నిందింపదగిన పనుల యందు ప్రవర్తించినను అతని నెవ్వడు నిందింపగలడు? అట్టివానిని పడవేయరాదను దానికి ఎక్కడను ప్రమాణము కానరాదు.
యేషాం బలకృతా వృత్తి స్తేషా మన్యా న రోచతే,
తేజసాఽభి ప్రవర్తన్తే బలవన్తో యుధిష్ఠిర. 7
యుధిష్ఠిరా! బలము నుపయోగించి బ్రదుకువారికి మఱి యొక పద్ధతి రుచింపదు. బలవంతులు తేజస్సుతోడనే అంతట ప్రవర్తింతురు.
య దైవ ప్రాకృతం శాస్త్ర మవిశేషేణ వర్తతే,
త దైవ మభ్యసే దేవం మేధావీ వాప్యథోత్తరమ్. 8
సామాన్య శాస్త్రమునే, విశేషములేకుండ, సిద్ధించు నపుడు, రాజు పాటింప వలయును. మేధావి అయిన రాజు మాత్రము దాని కంటె విశిష్టమైన దానిని ఆచరింపవలయును.
ఋత్వి క్పురోహితాచార్యాన్ సత్కృతా నభిసత్కృతాన్
న బ్రాహ్మణాన్ ఘాతయీత దోషాన్ ప్రాప్నోతి ఘాతయన్ 9
మిక్కిలి మన్ననగొన్న ఋత్విక్కులను, పురోహితులను, ఆచార్యులను దెబ్బ గొట్టరాదు. దాని వలన దోషము కలుగును.
ఏతత్ప్రమాణం లోకస్య చక్షు రేత త్సనాతనమ్,
తత్ప్రమాణోఽవగాహేత తేన తత్సాధ్వసాధు వా. 10
ఇది లోకమునకు ప్రమాణము. ఇది సనాతనమగు నేత్రము. అది మంచి దైనను చెడ్డ దైనను రాజు ఆ ప్రమాణమునే మన్నింపవలయును.
బహవో గ్రామవాస్తవ్యా రోషాద్భూయుః పరస్పరమ్,
న తేషాం వచనా ద్రాజా సత్కుర్యాత్ ఘాతయీత వా. 11
గ్రామ వాసులు పెక్కండ్రు ఒకరిపై నొకరు రోషముతో చాడీలు చెప్పుచుందురు. వారి మాటలను బట్టి రాజు మన్నించుటయో, చంపించుటయో చేయరాదు.
న వాచ్యః పరివాదోఽయం న శ్రోతవ్యః కథంచన,
కర్ణా వధా పిధాతవ్యౌ ప్రస్థేయం చాన్యతో భవేత్. 12
ఋత్విక్కులు మొదలగు వారిని నిందింపరాదు. ఎవ్వరైన పలికినను వినరాదు. చెవులు మూసికొనవలయును. లేదా అచటినుండి ఆవలకు వెడలిపోవలయును.
అసతాం శీల మేత ద్వై పరివాదోఽథ పై శునమ్,
గుణానా మేవ వక్తారః సన్తః సత్సు నరాధిప. 13
రాజా! ఇతరుల ను నిందించుట, నిందలను, కొండెములు చెప్పుట అనునది దుష్టుల శీలము, మంచివారి విషయమున మంచివారు గుణములనే పలుకు వారగుదురు.
యథా సమధురౌ దమ్యౌ సుదాన్తౌ సాధు వాహినౌ,
ధుర ముద్యమ్య వహత స్తథా వర్తేత వై పునః. 14
చక్కని శిక్షణ కలవియు, చక్కగా బరువు మోయునవియు సమముగా కాడిని తాల్చునవియు నగు ఎద్దులు కాడి నెత్తుకొని బండిని మోయు విధమున రాజు ఋత్విక్కులు మొదలగు వారితో ప్రవర్తింపవలయును.
యథా యథాస్య బహవః సహాయాః స్యు స్తథా పరే,
ఆచార మేవ మన్యన్తే గరీయో ధర్మలక్షణమ్. 15
మఱికొందరు పెక్కండ్రు సహాయు లేర్పడునట్లు రాజు మెలగవలయు నందురు. ఆచారమే అన్నింటికంటె మించిన ధర్మలక్షణముగా భావింతురు.
అపరే నైవ మిచ్ఛన్తి యే శఙ్ఖ లిఖిత ప్రియాః,
మాత్సర్యా దథవా లోభాన్న బ్రూయుర్వాక్య మీదృశమ్. 16
శంఖ లిఖిత ప్రియులు కొందరు మాత్సర్యము వలననో లోభమువలననో దీనిని గూడ ఇష్టపడరు. ఇట్టి వాక్యమును పలుకరు.
ఆర్షమప్యత్ర పశ్యన్తి వికర్మస్థస్య పాతనమ్
న తాదృక్ సదృశం కిఞ్చిత్ప్రమాణం దృశ్యతే క్వచిత్. 17
చెడు పనియందున్న వానిని కూలనేయుట ఆర్షమైనదిగా కూడ చూతురు. అట్టి దానికి సదృశమైన ప్రమాణము ఎందును కొంచెమేని కానవచ్చుటలేదు.
దేవతాశ్చ వికర్మస్థం పాతయన్తి నరాధమమ్ ।
వ్యాజేన విన్దన్ విత్తం హి ధర్మా త్స పరిహీయతే. 18
పాడుపనియందు ప్రవర్తించు నీచమానవుని దేవతలు కూడ కూల ద్రోయుదురు. నెపముతో ధనము పొందువాడు ధర్మము నుండి జారి పోవును.
సర్వతః సత్కృతః సద్భి ర్భూతి ప్రవరకారణైః
హృదయే నాభ్యనుజ్ఞాతో యో ధర్మ స్తం వ్యవస్యతి. 19
భూతిప్రవణకారణులైన సత్పురుషులు అన్ని విధముల సత్కరించునది హృదయము అంగీకరించునది అగు ధర్మమును కూడ ధర్మముగా నిర్ణయింతురు.
య శ్చతుర్గుణ సంపన్నం ధర్మం బ్రూయాత్ స ధర్మవిత్
అహేరిన హి ధర్మస్య పదం దుఃఖం గవేషితుమ్. 20
నాలుగు గుణాల సంపద గల ధర్మమును గూర్చి చెప్పెడువాడు ధర్మమెరిగిన వాడగును. ధర్మముయొక్క పదమును, పాము పాదమును వెదకుట వలె చాల కష్టమైన పని.
యదా మృగస్య విద్ధస్య పద మేకపదం నయేత్,
లక్షే ద్రుధిరలేపేన తథా ధర్మపదం నయేత్. 21
దెబ్బతిన్న మృగము తావును, పదముల గుర్తుల ద్వారా, రక్తపు మరకల ద్వారా గుర్తించి యితరులను పొందించు విధమున ధర్మపదమును తాను గుర్తించి ఇతరుల చేత గుర్తింపజేయవలయును.
యథా సద్భి ర్వినీతేన యథా గన్తవ్య మిత్యుత
రాజర్షీణాం వృత్త మేత దేవం గచ్ఛ యుధిష్ఠిర! 22
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
ద్వాత్రింశదధిక శతతమోఽధ్యాయః
సత్పురుషులు నేర్పిన విధానముతో నడువవలసిన తీరును చక్కగా తెలిసికొని యుధిష్ఠిరా! ఈ రాజర్షుల మార్గమున నడువుము.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
నూట ముప్పది రెండవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
స్వరాష్ట్రా త్పరరాష్ట్రా చ్చ కోశం సంజనయే న్నృపః,
కోశాద్ధి ధర్మః కౌన్తేయ రాజ్యమూలం చ వర్ధతే 1
ధర్మరాజా! రాజు తనరాష్ట్రమునుండియు, పరరాష్ట్రము నుండియు కోశమును వృద్ధి పొందింపవలయును. కుంతీతనయా! కోశము వలననే ధర్మమును, రాజ్యపు కుదురును వృద్ధి పొందును.
తస్మా త్సంజనయే త్కోశం సత్కృత్య పరిపాలయేత్
పరిపాల్యాను తనుయా దేష ధర్మః సనాతనః 2
కనుక కోశమును సమకూర్చుకొనవలయును. చక్కగా సాధించి సంరక్షింప వలయును. సంరక్షించి మెలకువతో అనుగ్రహింపవలయును. ఇది సనాతనమైన ధర్మము.
న కోశః శుద్ధశౌచేన న నృశంసేన జాతుచిత్,
మధ్యమం పదమాస్థాయ కోశసంగ్రహణం చరేత్. 3
కేవలము మచ్చ లేని స్వభావముతోడను, లేదా క్రూరస్వభావముతోడను ఎన్నటికిని కోశమును కూర్పరాదు. మధ్య మార్గము నవలంబించి ధనాగారమును కూర్పవలయును.
అబలస్య కుతః కోశో హ్యకోశస్య కుతో బలమ్,
అబలస్య కుతో రాజ్య మరాజ్ఞః శ్రీ ర్భవే త్కుతః. 4
బలములేనికి వానికి ధనసంపద ఎక్కడిది? ధనసంపద లేనివానికి బల మెక్కడిది? బలహీనునకు రాజ్య మెక్కడిది? రాజుకాని వానికి సంపద ఎట్లు కలుగును?
ఉచ్చై ర్వృత్తేః శ్రియో హాని ర్యథైవ మరణం తథా,
తస్మాత్ కోశం బలం మిత్ర మథ రాజా వివర్ధయేత్. 5
గొప్ప స్థితి కలవానికి సంపద పోవుట చావు వంటిది. కావున రాజు ధనసంపదను, సేనను, మిత్రులను పెంపొందించు కొనవలయును.
హీన కోశం హి రాజాన మవజానన్తి మానవాః
న చాస్యాల్పేన తుష్యన్తి కార్య మప్యుత్సహన్తి చ. 6
కోశము తరుగువడిన రాజును మానవులు సరకుగొనరు. అతని కొంచెము పాటి ధనముతో తృప్తిపడరు. అతని పనియెడల ఉత్సాహము చూపరు.
శ్రియో హి కారణా ద్రాజా సత్క్రియాం లభతే పరామ్,
సాఽస్య గూహతి పాపాని వాసో గుహ్యమివ స్త్రియాః. 7
సంపద కారణముగానే రాజు మిక్కిలి మన్ననను పొందుచున్నాడు. స్త్రీమానమును వస్త్రము కాపాడినట్లు అది అతని పాపములను కప్పిపుచ్చును.
బుద్ధి మస్యానుతప్యన్తే పురా విప్రకృతా నరాః,
శాలావృకా ఇవాజస్రం జిఘాంసు మేవ విన్దతి. 8.
మునుపు అపకారము పొందిన నరులు, రాజు సమృద్ధిని చూచి, కుళ్లిపోవు చుందురు. ఎల్లవేళల తోడేళ్లవలె పొంచియుండి చంపుటకే దరిజేరుదురు.
ఈదృశస్య కుతో రాజ్ఞః సుఖం భవతి భారత,
ఉద్యచ్ఛేదేవ న నమే దుద్యమో హ్యేవ పౌరుషమ్. 9
ఇట్టిరాజునకు, భారతా! సుఖమెట్లు కలుగును? కావున రాజు ఉన్నతస్థితికే అరుగవలయును. లొంగిపోరాదు. ఉద్యమమే పౌరుషము.
అప్యపర్వణి భజ్యేత న నమేతేహ కస్యచిత్,
అప్యరణ్యం సమాశ్రిత్య చరే న్మృగగణైః సహ. 10
కణుపులేని తావునందైనను విరువనే వలయును. ఎట్టివానికిని వంగిపోరాదు. సాధ్యముకానిచో అడవి నాశ్రయించి మృగముల మందతోనైన కలిసి తిరుగనగును.
నత్వే వోజ్ఘితమర్యాదై ర్ధస్యుభిః సహిత శ్చరేత్,
దస్యూనాం సులభా సేనా రౌద్రకర్మసు భారత. 11
హద్దులుమీరిన దొంగబుద్ధులుగలవారితో కలిసి తిరుగనే రాదు. రౌద్ర కర్మముల యందు అడవులలోని క్రూరాత్ములతో కూడ సేనను తేలికగా సమకూర్చు కొనవచ్చును.
ఏకాన్తతో హ్యమర్యాదా త్సర్వోఽప్యుద్విజతే జనః,
దస్యవోఽప్యభిశంకన్తే నిరనుక్రోశకారిణః. 12
పట్టువిడుపులు లేని అమర్యాదవలన ప్రతినరుడు ఉద్వేగము పొందును. దయలేని వాని విషయమున దస్యులు కూడ శంకతోడనే వర్తింతురు.
స్థాపయే దేవ మర్యాదాం జనచిత్త ప్రసాదినీమ్,
అల్పేఽప్యర్థే చ మర్యాదా లోకే భవతి పూజితా. 13
జనుల హృదయములను ప్రసన్నపరచు మర్యాదను రాజు నిలుపనే వలయును. చిన్న విషయమునందును మర్యాద లోకమున మన్నింపదగినదగును.
నాయం లోకోఽస్తి నపర ఇతి వ్యవసితో జనః,
నాలం గన్తుం హి విశ్వాసం నాస్తికే భయశఙ్కితే. 14
ఇహములేదు, పరములేదు అని నిశ్చయమునకు వచ్చిన జనుడు, భయముతో శంకగల నాస్తికునియందు విశ్వాసమును పొందజాలడు.
యదా సద్భిః పరాదాన మహింసా దస్యుభిః కృతా,
అనురజ్యన్తి భూతాని సమర్యాదేషు దస్యుషు. 15
మంచివారగు శత్రువులు ఇతరుల ధనము గ్రహించినను అది అహింసయే యగును. మర్యాదగల శత్రువులయందు జనులు అనురాగము పొందుదురు.
అయుధ్యమానస్య వధో దారామర్షః కృతఘ్నతా,
బ్రహ్మవిత్తస్య చాదానం నిఃశేషకరణం తథా. 16
స్త్రియా మోషః పతిస్థానం దస్యుష్వేతద్విగర్హితమ్,
సంశ్లేషం చ పరస్త్రీభి ర్దస్యు రేతాని వర్జయేత్. 17
యుద్ధము చేయనివానిని వధించుట, వారి భార్యల నవమానించుట, కృతఘ్నత, బ్రహ్మజ్ఞానిధనమును గుంజుకొనుట, సర్వస్వమును దొంగిలించుట, కన్యను దొంగిలించుట, గ్రామాధికారి స్థానము నాక్రమించుట - అనునవి శత్రువుల విషయమునను నిందింపదగినవి. పరులస్త్రీలను కలియుట అనువీనిని విడనాడవలయును.
అభిసందధతే యేచ విశ్వాసాయాస్య మానవాః,
అశేష మేవోపలభ్య కుర్వన్తీతి వినిశ్చయః. 18
పగవాని విశ్వాసముకొరకు వంచన చేయువారు, సర్వమును పొంది, వానికిని అట్టిస్థితినే కలుగజేయుదురని నిర్ణయము.
తస్మా త్సశేషం కర్తవ్యం స్వాధీన మపి దస్యుభిః,
న బలస్థోఽహ మస్మీతి నృశంసాని సమాచరేత్. 19
కావున శత్రువులు వశముచేసికొన్నదానిని కొంత మిగులు కలుగునట్లే వశము చేసికొనవలయును. బల పక్షమున నున్నవాడనని క్రూరకర్మములు చేయరాదు.
సశేషకారిణ స్తత్ర శేషం పశ్యన్తి సర్వశః,
నిఃశేష కారిణో నిత్యం నిఃశేషకరణా దృయమ్. 20
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః
పరులకు మిగులునట్లు చేయువానియెడల జనులును వానికి మిగులునట్లే చూతురు. నిలువుదోపిడి చేయువానికి, ఆదోపిడివలననే భయము కలుగును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
నూటముప్పదిమూడవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
అత్ర ధర్మానువచనం కీర్తయన్తి పురా విదః,
ప్రత్యక్షా వేవ ధర్మార్థౌ క్షత్రియస్య విజానతః. 1
ఇచట పురాణవేత్తలు ఒక ధర్మపుమాటను ప్రశంసించుచుందురు. చక్కని యెరుకగల క్షత్రియునకు ధర్మార్థములు ప్రత్యక్షములే యగును.
తత్ర నవ్యవధాతవ్యం పరోక్షా ధర్మయాపనా,
అధర్మో ధర్మ ఇత్యేత ద్యథా వృకపదం తథా. 2
ధర్మవిషయమున వ్యవధానము చేయరాదు. ధర్మపు ఉపదేశము పరోక్షమైనది. ధర్మమా? అధర్మమా అను విచారణ తోడేలు కాలిగుర్తు వంటిది.
ధర్మాధర్మఫలే జాతు దదర్శేహ న కశ్చన,
బుభూషేద్బల మేవైత త్సర్వం బలవతో వశే. 3
ఎవ్వడును ధర్మపు, అధర్మపుఫలమును ఇహలోకమున ఎప్పుడును చూచి యుండలేదు. కనుక బలమునే ఆశ్రయింపవలయును. సర్వమును బలవంతుని వశమునందే యుండును.
శ్రియో బల మమాత్యాంశ్చ బలవానిహ విన్దతి,
యో హ్యనాఢ్యః స పతిత స్తదుచ్ఛిష్టం యదల్పకమ్. 4
సంపదలు బలమును, బలవంతుడు అమాత్యులను పొందును. ధనసంపద లేనివాడే పతితుడు. ఏ కొంచెమైనను అతనిది ఎంగిలిమెతుకే.
బహ్వపథ్యం బలవతి నఞ్చికి త్క్రియతే భయాత్,
ఉభౌ సత్యాధికారస్థౌ త్రాయేతే మహతో భయాత్. 5
బలవంతునియందు హితముకానిది పెద్దగానున్నను లోకము భయము వలన వానికేమియు కీడుచేయదు. సత్యపు అధికారమున నున్న ఆరెండును- బలధర్మములు రెండును - మహాభయము నుండి రక్షించును.
అతి ధర్మా ద్బలం మన్యే బలాద్ధర్మః ప్రవర్తతే,
బలే ప్రతిష్ఠితో ధర్మో ధరణ్యామివ జంగమమ్. 6
ధర్మముకంటె బలమే మిన్న యని తలంతును. బలమువలననే ధర్మము ప్రవర్తిల్లును. భూమియందు జంగమము వలె బలమునందే ధర్మము నిలుకడ పొందియున్నది.
ధూమో వాయో రివవశే బలం ధర్మోఽను వర్తతే,
అనీశ్వరో బలే ధర్మో ద్రుమే వల్లీవ సంశ్రితా. 7
గాలివాటముగా తిరుగు పొగవలె ధర్మము బలము ననుసరించి నడచుచుండును. బలమునందు సమర్థముకాని ధర్మము, చెట్టును తీగవలె ఆశ్రయించి యున్నది.
వశే బలవతాం ధర్మః సుఖం భోగవతా మివ,
నాస్త్యసాధ్యం బలవతాం సర్వం బలవతాం శుచి. 8
భోగవంతుల వశమున సుఖమున్నట్లు బలవంతుల వశమున ధర్మ ముండును. బలవంతులకు అసాధ్యమైనది లేదు. బలవంతుల సర్వము పవిత్రమే.
దురాచారః క్షీణబలః పరిత్రాణం న గచ్ఛతి,
అథ తస్మా దుద్విజతే సర్వో లోకో వృకా దివ. 9
బలము పోయిన దురాచారుడు పరిరక్షణను పొందడు. లోకమంతయు, తోడేలువలన వలె, వానివలన గగ్గోలు పడును.
అపధ్వస్తో హ్యవమతో దుఃఖం జీవతి జీవితమ్,
జీవితం యదపక్రుష్టం యథైవ మరణం తథా. 10
ఐశ్వర్యమునుండి జారినవాడు అవమానములపాలై దుఃఖమైన బ్రదుకు బ్రదుకును. నిందలపాలైన బ్రదుకు చావువంటిది.
యదేవ మాహుః పాపేన చారిత్రేణ వివర్జితః,
సుభృశం తాప్య తేనైవ వాక్ఛల్యేన పరిక్షతః. 11
పాపపు నడవడిచేత బంధువులు వదలివేయుదురు. దానినే లోకులు మాటిమాటికి పలుకుచుందురు. ఆ పలుకుములుకుతోడనే వాడు తాపముపొంది కుళ్లబొడువ బడినవాడగును.
అత్రైత దాహు రాచార్యాః పాపస్య పరిమోక్షణే,
త్రయీం విద్యా మవేక్షేత తథోపాసీత వై ద్విజాన్. 12
ధర్మాచార్యులు ఈ విషయమునందే పాపమునుండి విడివడుటకు ఇట్లు చెప్పుదురు. "త్రయీ విద్యను పరిశీలింపవలయును. ద్విజులను ఉపాసింప వలయును.”
ప్రసాదయే చ్చక్షుషా చ వాచా చాప్యథ కర్మణా,
మహామనా శ్చాపి భవే ద్వివహేచ్చ మహాకులే. 13
కంటితో, పలుకుతో, పనితో లోకము ప్రసన్నతను సాధింపవలయును. దొడ్డబుద్ధి కలవాడు కావలయును. గొప్పకులమున సంబంధము పొందవలయును.
ఇత్యస్మీతి వదే దేవం పరేషాం కీర్తయే ద్గుణాన్
జపే దుదకశీలః స్యాత్ పేశలో నాతిజల్పకః. 14
నేనిట్టివాడనని పలుకుచుండవలయును. పరుల గుణములను కొనియాడు చుండవలయును. స్నానములు చేయుచు జపము చేయుచుండవలయును. మెత్తనివాడు కావలయును. వాగుడు తగ్గింపవలయును.
బ్రహ్మక్షత్రం సంప్రవిశే ద్బహు కృత్వా సుదుష్కరమ్,
ఉచ్యమానో హి లోకేన బహుకృత్త దచిన్తయన్. 15
ఇతరులకు చేయశక్యముకాని మంచి కార్యము పెద్దగా చేసి బ్రహ్మక్షత్రియ కులములలో ప్రవేశము పొందవలయును. లోకము కొనియాడుచున్నను దానిని మదిలో పట్టించుకొనక ఇంకను సత్కార్యములు పెక్కులు చేయుచుండ వలయును.
అపాపో హ్యేవ మాచారః క్షిప్రం బహుమతో భవేత్,
సుఖం చ చిత్రం భుంజీత కృతే నైకేన గోపయేత్. 16
ఇట్లు ఆచరించువాడై పాపము పోగొట్టుకొని శీఘ్రముగా లోకము మన్నన పొందువాడగును. చక్కని సుఖము పొందును. తాను చేసిన ఒక్కదానిచేతనే తన్ను కాపాడుకొనును. (తనకర్మమే తన్ను సంరక్షించునని భావము.)
లోకే చ లభతే పూజాం పరత్రేహ మహత్ఫలమ్, 17
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః
లోకమున గొప్పమన్ననను పొందును. ఇహమునను పరమునందును మహాఫలము పొందును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
నూట ముప్పదినాలుగవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
యథా దస్యుః సమర్యాదః ప్రేత్యభావే న నశ్యతి. 1
మర్యాదకల దొంగయు మరణము పొందినపుడు ఎట్లు నశింపకుండునో అను విషయమున ఈ ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుచుందురు.
ప్రహర్తా మతిమాన్ శూరః శ్రుతవాన్ సునృశంసవాన్,
రక్ష న్నాశ్రమిణాం ధర్మం బ్రహ్మణ్యో గురుపూజకః. 2
నిషాద్యాం క్షత్రియా జ్జాతః క్షత్రధర్మాను పాలకః,
కాయవ్యో నామ నైషాది ర్దస్యుత్వా త్సిద్ధి మాప్తవాన్. 3
పోటుగాడు, బుద్ధిమంతుడు, శూరుడు, పాండిత్యము కలవాడు, మిక్కిలి క్రూరుల నాయకుడు, ఆయా ఆశ్రమములయందున్న వారి ధర్మములను రక్షించు చుండువాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, గురువులను పూజించువాడు, క్షత్రియుని వలన నిషాదియందు పుట్టినవాడు, క్షత్రధర్మమును చక్కగా పాలించువాడునగు కాయవ్యుడను నిషాదజాతివాడు దస్యుడయ్యును సిద్ధిపొందిన వాడాయెను.
అరణ్యే సాయం పూర్వాహ్ణే మృగయూథ ప్రకోపితా,
విధిజ్ఞో మృగజాతీనాం నైషాదానాం చ కోవిదః. 4
అరణ్యమునందు ఉదయసాయంకాలములయందు మృగముల మందలను రెచ్చగొట్టుచుండును. మృగజాతుల తీరుతెన్నులన్నియు తెలిసినవాడు. ఆటవికుల స్వభావములను చక్కగా తెలిసిన పండితుడు.
సర్వకాల ప్రదేశజ్ఞః పారియాత్రచరః సదా,
ధర్మజ్ఞః సర్వభూతానా మమోఘేషు ర్దృఢాయుధః. 5
సర్వకాలములను, దేశములను ఎరిగినవాడు. ఎల్లప్పుడు పారియాత్రమను పర్వతముపై తిరుగుచుండువాడు. అన్ని భూతముల ధర్మముల జ్ఞానము కలవాడు. తిరుగులేని బాణము, మొక్కవోని ఆయుధములు కలవాడు.
అప్యనేకశతాం సేనా మేక ఏవ జిగాయ సః,
వందలకొలదిగాగల సేన నైనను ఒక్కడై గెలిచెను.
స వృద్ధా వంధబధిరౌ మహారణ్యేఽభ్యపూజయత్. 6
మధుమాంసై ర్మూలఫలై రన్నై రుచ్చావచై రపి,
సత్కృత్య భోజయామాస మాన్యా న్పరిచచార చ. 7
అతడు గ్రుడ్డిచెవిటివారగు ముదుసలి తలిదండ్రులను పెద్ద అడవిలో పూజించు చుండెను. తేనె, మాంసము, దుంపలు, పండ్లు, గొప్పగొప్ప భోజనములు మొదలగు వానితో వారిని ఆదరించుచుండెను. అట్లే పూజింపదగిన వారిని సేవించుచుండెను.
ఆరణ్యకాన్ ప్రవ్రజితాన్ బ్రాహ్మణాన్ పరిపూజయన్,
అపి తేభ్యో మృగాన్ హత్వా నినాయ సతతం వనే. 8
అడవిలోని జనులను, సన్యాసులను, బ్రహ్మజ్ఞానులను గొప్పగా గౌరవించుచు అవసరమైనచో వారికొరకు మృగములను చంపి తెచ్చుచుండును.
యేఽస్మాన్న ప్రతిగృహ్ణన్తి దస్యుభోజన శంకయా,
తేషా మాసజ్య గేహేషు కల్య ఏవ స గచ్ఛతి. 9
ఎవరైన ఇది దొంగతిండి అని శంకించి తననుండి గ్రహింపకుందురేని వారికి వారియిండ్ల యందే తగుభోజనము లేర్పాటుచేసి ప్రొద్దుననే వెళ్లి పోయెడివాడు.
బహూని చ సహస్రాణి గ్రామణిత్వేఽ భివవ్రిరే,
నిర్మర్యాదాని దస్యూనాం నిరనుక్రోశ వర్తినామ్. 10
దయాదాక్షిణ్యములు హద్దుపద్దులు లేని దొంగలు పెక్కువేలమంది ఆతనిని తమనాయకునిగా ఎన్నుకొనిరి.
దస్యవ ఊచుః - దస్యు లిట్లనిరి
ముహూర్తదేశకాలజ్ఞః ప్రాజ్ఞః శూరో దృఢవ్రతః,
గ్రామణీ ర్భవ నో ముఖ్యః సర్వేషా మపి సంగతః, 11
ముహూర్తములు, దేశములు, కాలములు చక్కగా తెలిసినవాడవు, గొప్ప తెలివిగలవాడవు, పోటుగాడవు, చెదరని వ్రతనిష్ఠ కలవాడవు అగునీవు మాకు ముఖ్య నాయకుడవు కమ్ము.
యథాయథా వక్ష్యసి నః కరిష్యామ స్తథా తథా,
పాలయాస్మాన్ యథాన్యాయం యథామాతా యథా పితా. 12
నీవెట్లెట్లు చెప్పిన మేమట్లట్లు చేయుదుము. పాడితప్పక మమ్ము తల్లివలె తండ్రివలె పాలింపుము.
కాయవ్య ఉవాచ - కాయవ్యు డిట్లనెను.
మావధీ స్త్రిం స్త్రియం భీరుం మా శిశుం మా తపస్వినమ్,
నాయుధ్యమానో హన్తవ్యో నచగ్రాహ్యా బలాత్ స్త్రియః. 13
నీవు స్త్రీని, భయపడినవానిని, పసివానిని, తాపసిని, చంపరాదు. నీతో పోరనివానిని చంపరాదు. బలవంతముగ స్త్రీలను పట్టుకొనరాదు.
సర్వథా స్త్రీ న హన్తవ్యా సర్వసత్త్వేషు కేనచిత్,
నిత్యంతు బ్రాహ్మణే స్వస్తి యోద్ధవ్యం చ తదర్థతః. 14
ఎట్టిపరిస్థితులయందును సమస్తప్రాణులయందు మనలో నెవ్వడును స్త్రీని చంపరాదు. ప్రతిదినము బ్రాహ్మణవిషయమున శుభమునే భావింపవలయును. వారికై పోరాడవలయును.
సత్యం చ నాపి హర్తవ్యం సారవిఘ్నం చ మా కృథాః,
పూజ్యన్తో యత్ర దేవాశ్చ పితరోఽతిథయ స్తథా. 15
వారి సత్యమును చెడగొట్టరాదు. వారికి సంబంధించిన వివాహాది కార్యమును పాడుచేయరాదు. వారిని మన్నించుట యనగా దేవతలను, పితృదేవతలను, అతిథులను మన్నించుటయే.
సర్వభూతే ష్వపి చ వై బ్రాహ్మణో మోక్ష మర్హతి,
కార్యా చోపచితి స్తేషాం సర్వస్వేనాపి యా భవేత్. 16
సర్వప్రాణి కోటియందును బ్రహ్మజ్ఞాన సంపన్నుడు మోక్షమునకు తగును. తన సొమ్మంతయు వెచ్చించియైనను బ్రాహ్మణునకు వృద్ధి కలిగింపవలయును.
యస్య హ్యేతే సంప్రరుష్టా మన్త్రయన్తి పరాభవమ్,
న తస్య త్రిషు లోకేషు త్రాతా భవతి కశ్చన. 17
వారు ఎవని విషయమున మిక్కిలి కోపము పొంది పరాభవమును భావింతురో అట్టివానిని రక్షించువాడు ముల్లోకములందును ఒక్కడును లేడు.
యో బ్రాహ్మణాన్ పరివదే ద్వినాశం చాపి రోచయేత్,
సూర్యోదయ ఇవ ధ్వాన్తే ధ్రువం తస్య పరాభవః. 18
బ్రాహ్మణులను నిందించువాడు, వారి వినాశమును ఇష్టపడువాడు సూర్యోదయమున చీకటి వలె తప్పక పరాభవ మొందును.
ఇహైవ ఫల మాసీనః ప్రత్యాకాంక్షేత సర్వశః,
యే యే నో న ప్రదాస్యన్తి తాంస్తాం స్తేనాభియాస్యసి. 19
మనుజుడు ఇక్కడనే కూర్చుండి అన్నివైపులనుండియు ఫలమును పొందగోర వలయును. ఎవరెవరు మనకు ఈయరో వారిని వారిని దానితో ఎదుర్కొన వలయును.
శిష్ట్యర్థం విహితో దణ్డో న వృద్ధ్యర్థం వినిశ్చయః,
యే చ శిష్టాన్ ప్రబాధన్తేదణ్డ స్తేషాం వధః స్మృతః 20
దుష్టులను శిక్షించుటకొఱకే దండమును ఏర్పరచిరి. కానీ తాను వృద్ధిపొందుటకు కాదు. ఇది నిశ్చయము. కావున శిష్టులను బాధించువారికి వధయే దండము.
యే చ రాష్ట్రోపరోధేన వృద్ధిం కుర్వన్తి కేచన,
తదైవ తేఽను మార్యన్తే కుణపే కృమయో యథా. 21
ఎవరు దేశమువృద్ధిని అడ్డుకొని తమ వృద్ధిని చేసికొనుచుందురో అట్టివారు అప్పటికప్పుడు పీనుగు మీది పురుగులవలె చంపబడుదురు.
యే పున ర్ధర్మశాస్త్రేణ వర్తేర న్నిహ దస్యవః,
అపి తే దస్యవో భూత్వా క్షిప్రం సిద్ధి మవాప్నుయుః. 22
ధర్మశాస్త్రమును బట్టి ప్రవర్తించు దొంగలు, దొంగలైనను వెనువెంటనే సిద్ధి పొందుదురు.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.
తే సర్వ మే వానుచక్రుః కాయవ్యస్యాను శాసనమ్,
వృద్ధిం చ లేభిరే సర్వే పాపేభ్య శ్చాప్యుపారమన్. 23
ఆ దొంగలందరు కాయవ్యుని ఆదేశమును చక్కగా పాటించిరి. అందరు పాపములనుండి విరమించి వృద్ధి పొందిరి.
కాయవ్యః కర్మణా తేన మహతీం సిద్ధి మాప్తవాన్,
సాధూనా మాచరన్ క్షేమం దస్యూ న్పాపా న్నివర్తయన్. 24
కాయవ్యుడు అట్టిపనితో సాధువులకు క్షేమము కూర్చుచు, దొంగలను పాపమునుండి మరలించుచు గొప్పసిద్ధి పొందెను.
ఇదం కాయవ్యచరితం యో నిత్య మనుచిన్తయేత్,
నారణ్యేభ్యో హి భూతేభ్యో భయం ప్రాప్నోతి కిఞ్చన. 25
ఈ కాయవ్య చరితమును ప్రతిదినము భావించువానికి అరణ్యమునకు చెందిన క్రూర మృగాదులవలన ఏ కొంచెము భయము కలుగదు.
న భయం తస్య భూతేభ్యః సర్వేభ్యశ్చైవ భారత,
నాసతో విద్యతే రాజన్ సహ్యరణ్యేషు గోపతిః. 26
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి కాయవ్యచరితే పంచత్రింశదధికశతతమోఽధ్యాయః
భారతా! దుష్టుడైనను అట్టివానికి సర్వభూతములనుండియు భయము కలుగదు. వాడు అడవులయందు ఆబోతువంటివాడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
కాయవ్యచరితము గల నూట ముప్పది అయిదవ అధ్యాయము
భీష్మ ఉవాచ- భీష్ము డిట్లు పలికెను.
అత్ర గాథా బ్రహ్మ గీతాః కీర్తయన్తి పురావిదః,
యేన మార్గేణ రాజా వై కోశం సంజనయ త్యుత. 1
రాజు ఏ మార్గమున కోశమును పుట్టించునో తెలియజేయు బ్రహ్మ చెప్పిన గాథలను ఇచట పురాణవేత్తలు చెప్పచుందురు.
న ధనం యజ్ఞ శీలానాం హార్యం దేవస్వమేవ వా,
దస్యూనాం నిష్క్రియాణాం చ క్షత్రియో హర్తు మర్హతి. 2
యజ్ఞముచేయు శీలముకలవారి ధనమును, దేవతలసొమ్మును రాజు కొల్లగొట్టరాదు. దొంగలు, పని పాటలు లేనివారు అగువారి సొమ్మును క్షత్రియుడు హరింపదగును.
ఇమాః ప్రజాః క్షత్రియాణాం రాజ్యభోగాశ్చ భారత,
ధనం హి క్షత్రియ స్యైవ ద్వితీయస్య న విద్యతే. 3
ఈ ప్రజలు, రాజ్యభోగములు అన్నియు క్షత్రియులవే. ధనము క్షత్రియునిదే. రెండవవానికి లేదు.
తదస్య స్యా ద్బలార్థం వా ధనం యజ్ఞార్థ మేవ చ,
అభోగ్యా శ్శౌషధీ శ్ఛిత్వా భోగ్యా ఏవ పచన్త్యుత. 4
అతనికి ఆ ధనము బలముకొరకో, యజ్ఞముకొరకో మాత్రమే కావలయును. అనుభవమునకు పనికిరాని ఓషధులను కోసివైచి తిండి గుడ్డలకు పనికి వచ్చు వస్తువులనే జనులు పండించుకొందురు గదా!
యో వై న దేవా న్న పితౄ న్న మర్త్యాన్ హవిషార్చతి,
అనర్థకం ధనం తత్ర ప్రాహు ర్ధర్మవిదో జనాః. 5
దేవతలను, పితృదేవతలను, మనుజులను హవిస్సుతో పూజింపనివానికడ నున్న ధనము పనికి మాలినదని ధర్మమెరిగిన జనులు చెప్పుదురు.
హరేత ద్రవిణం రాజన్ ధార్మికః పృథివీపతిః,
తతః ప్రీణయతే లోకం న శోకం తద్విధం నృపః. 6
ధర్మముగా వర్తించు రాజు ధనమును సాధింపవలయును. దానితో లోకమును తృప్తి పరచును. శోకమును కాదు.
అసాధుభ్యోఽర్థ మాదాయ సాధుభ్యోయః ప్రయచ్ఛతి,
ఆత్మానం సంక్రమం కృత్వా కృత్స్నధర్మవిదేవ సః. 7
చెడువారినుండి ధనములను గొని సత్పురుషుల కొసగు రాజు తన్నొక ఆనకట్టవలె చేసికొని సమగ్రమగు ధర్మమెరిగిన వాడగును.
తథా తథా జయే ల్లోకాన్ శక్త్యా చైవ యథా యథా,
ఉద్భిజ్జా జంతవో యద్వ చ్ఛుక్ల జీవా యథా యథా. 8
ఆకుజెముడుతో బ్రదుకు చీమలవంటి జంతువులవలె మెల్లమెల్లగా తన శక్తినంతయు నుపయోగించి లోకములను జయింపవలయును. (అవి మెల్ల మెల్లగా ఎంత దూరమైనను పోవుచునే యుండును. అట్లే మనుజుడు దీక్ష విడువక లోకముల నన్నింటిని సాధింపవలయునని భావము.)
అనిమిత్తా త్సంభవన్తి తథాఽయజ్ఞః ప్రజాయతే. 9
ఉద్భిజ్జములెట్లు నిమిత్తము లేకయే పుట్టుచుండునో, యజ్ఞవిరోధి కూడ అట్లే పుట్టుచుండును.
యథైవ దంశమశకం యథా చాణ్డ పిపీలికమ్,
సైవ వృత్తి రయజ్ఞేషు యథా ధర్మో విధీయతే. 10
ఈగలు, దోమలు, చీమలు మొదలగు వానియందు వలెనే యజ్ఞవిరోధులయందు ప్రవర్తింపవలయును. దాని వలన ధర్మము నెలకొనును.
యథా హ్య కస్మా ద్భవతి భూమౌ పాంసువిలోలితః,
తథైవేహ భవేద్ధర్మః సూక్ష్మః సూక్ష్మతర స్తథా. 11
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
షట్త్రింశదధికశతతమోఽధ్యాయః
నేలపై దుమ్ము ఏ విధముగా అకస్మాత్తుగా ఏర్పడునో అట్లే ఇచ్చట కూడ సూక్ష్మము, మరింత సూక్ష్మముగా ధర్మ మేర్పడును.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున
నూటముప్పదియారవ అధ్యాయము.
భీష్మ ఉవాచ- భీష్ము డిట్లు పలికెను.
అనాగతవిధాతా చ ప్రత్యుత్పన్నమతి శ్చ యః,
ద్వావేవ సుఖ మేధేతే దీర్ఘసూత్రీ వినశ్యతి. 1
భవిష్యత్తు నెఱిగి ముందుజాగ్రత్తపడువాడు, అప్పటికప్పుడు ఉపాయము నూహింపగలవాడు- ఈ యిద్దరే సుఖమును పెంపొందించుకొందురు. దీర్ఘ సూత్రి చెడి పోవును.
అత్రైవ చేద మవ్యగ్రం శృణు ష్వాఖ్యాన ముత్తమమ్,
దీర్ఘం సూత్ర ముపాశ్రిత్య కార్యా కార్య వినిశ్చయే. 2
కార్యమును, అకార్యమును నిర్ణయించుటయందు మిక్కిలి ఆలస్యమునకు సంబంధించిన ఒక ఉత్తమమగు కథ కలదు. ఏకాగ్రబుద్ధితో దానిని వినుము.
నాతిగాధే జలాధారే సుహృదః కుశలా స్త్రయః,
ప్రభూతమత్స్యే కౌన్తేయ బభూవుః సహచారిణః. 3
పుష్కలముగా చేపలు కలదియు, ఎక్కువలోతు లేనిదియునగు ఒక జలాశయమునందు చక్కనినేర్పుకలవియు, స్నేహము కలవియునగు మూడు చేపలు కలిసి జీవించుచున్నవి.
తత్రైకో దీర్ఘకాలజ్ఞ ఉత్పన్న ప్రతిభోఽపరః,
దీర్ఘసూత్ర శ్చ తత్రైక స్త్రయాణాం సహచారిణామ్. 4
ఆ మూడు సహచరులలో ఒకటి మిక్కిలి ముందు చూపు కలది. మఱి యొకటి సమయమునకు తగిన తెలివితేటలు కలది. ఇంకొకటి తెగని ఆలోచన కలది.
కదాచిత్తం జలస్థాయం మత్స్యబన్ధః సమస్తతః,
నిస్రావయామాసు రథో నిమ్నేషు వివిధై ర్ముఖైః. 5
ఒకసారి ఆ మడుగులో బెస్తవా రన్ని వైపులనుండి ప్రవేశించి పల్లపుగుంటలలో పలుపద్ధతులతో నీటిని తొలగించుచుండిరి.
ప్రక్షీయమాణం తం దృష్ట్వా జలస్థాయం భయాగమే,
అబ్రవీ ద్దీర్ఘదర్శీ తు తావుభౌ సుహృదౌ తదా. 6
తరిగిపోవుచున్న నీరుగల ఆ మడుగును చూచి భయము కలుగగా దీర్ఘదర్శి ఆ యిద్దరు చెలిమికాండ్రతో ఇట్లు పలికెను.
ఇయ మాప త్సముత్పన్నా సర్వేషాం సలిలౌకసామ్,
శీఘ్ర మన్యత్ర గచ్ఛామః పన్థా యావ న్న దుష్యతి. 7
నీటిలో నివసించు అందరికి, ఇదిగో, ఆపద దాపురించినది. దారి చెడకముందే మరొక తావునకు పోదము.
అనాగత మనర్థం హి సునయై ర్యః ప్రబాధయేత్,
స న సంశయ మాప్నోతి రోచతాం భో వ్రజామహే. 8
రానున్న కీడును నీతి మార్గములతో తొలగించు కొనువాడు సంశయము పొందడు. కనుక పోదము. మీరు కూడ (నాతోరచ్చుటకు) ఇష్టపడుడు.
దీర్ఘసూత్ర స్తు య స్తత్ర సోఽబ్రవీ త్సమ్యగుచ్యతే,
నతు కార్యా త్వరా తావ దితి మే నిశ్చితా మతిః. 9
వారిలో దీర్ఘసూత్ర మిట్లనెను. నీవన్నది మంచిమాట. తొందర పనికిరాదని నా నిశ్చితమైన బుద్ధి.
అథ సంప్రతిపత్తిజ్ఞః ప్రాబ్రవీ ద్దీర్ఘ దర్శినమ్,
ప్రాప్తే కాలే న మే కిఞ్చి న్న్యాయతః పరిహాస్యతే, 10
అప్పుడు ప్రాప్తకాలజ్ఞమను రెండవ చేప దీర్ఘదర్శితో ఇట్లనెను. కాలము దాపురించినపుడు న్యాయము ననుసరించి ఏదియు తొలగి పోదని నా అభిప్రాయము.
ఏవం శ్రుత్వా నిరాక్రమ్య దీర్ఘదర్శీ మహామతిః,
జగామ స్రోతసా తేన గంభీరం సలిలాశయమ్. 11
దొడ్డబుద్ధి గల దీర్ఘదర్శి ఇది విని ఆ ఉన్న కొద్ది పాటి నీటి మార్గమున ఆ మడువు వెడలి మిక్కిలి లోతుగల మరియొక పెద్ద నీటితావున కరిగెను.
తతః ప్రస్రుతతోయం తం ప్రసమీక్ష్య జలాశయమ్,
బబన్ధు ర్వివిధై ర్యోగై ర్మత్స్యాన్మత్స్యోపజీవినః. 12
అంత నీరు తొలగిపోయిన ఆ మడువును గాంచి చేపలవారు పెక్కు ఉపాయములతో చేపలను పట్టుకొనిరి.
విలోడ్యమానే తస్మింస్తు స్రుతతోయే జలాశయే,
అగచ్ఛ ద్బన్దనం తత్ర దీర్ఘసూత్రః సహాపరైః. 13
ఆ జలాశయము చెదరగొట్టబడి తొలగిన నీరుకలది కాగా, దీర్ఘసూత్రము మఱికొన్ని చేపలతో పాటు బంధనమున చిక్కెను.
ఉద్యానే క్రియమాణే తు మత్స్యానాం తత్ర రజ్జుభిః,
ప్రవిశ్యానర్త మేతేషాం స్థితః సంప్రతిపత్తిమాన్. 14
త్రాళ్లతో చేపలను కట్టివేయుచుండగా ప్రాప్తకాలజ్ఞమను రెండవచేప సందు చూచుకొని తోరణము నందు చిక్కినట్లు నిలిచియుండెను.
గృహ్యమేవ తదుద్యానం గృహీత్వా తం తథైవ సః,
సర్వానేవ చ తాం స్తత్ర తే విదు ర్గ్రథితా నితి. 15
త్రాటికి కట్టివేసిన చేపలన్నియు చిక్కియే యున్నవని జాలరు లనుకొనిరి. ఆ చేప త్రాటిని నోట కరచుకొని పట్టుబడినట్లే నిలిచియుండెను.
తతః ప్రక్షాళ్యమానేషు మత్స్యేషు విపులే జలే,
ముక్త్వా రజ్జుం ప్రముక్తోఽసౌ శీఘ్రం సంప్రతిపత్తిమాన్. 16
ఎక్కువ నీరుగల కొలనులో చేపలను జాడించుచుండగా అప్పటికి పుట్టిన తెలివిగల ఆ రెండవ చేప త్రాటిని వదలి వేగముగా నీటిలోనికి చేరుకొనెను.
దీర్ఘసూత్రస్తు మన్దాత్మా హీనబుద్ధి రచేతనః,
మరణం ప్రాప్తవాన్ మూఢో యథైవోపహతేన్ద్రియః. 17
బుద్ధిలేనిదీర్ఘసూత్రము కదలికలేనిదై తెలివికలుగనిదై, ఇంద్రియముల పట్టులేనివానివలె, చావు పొందెను.
ఏవం ప్రాప్తతమం కాలం యో మోహా న్నావబుధ్యతే,
స వినశ్యతి వై క్షిప్రం దీర్ఘసూత్రో యథా ఝషః. 18
ఇట్లు మించివచ్చెడు కాలమును తెలివితక్కువ తనముతో తెలియజాలని వాడు దీర్ఘ సూత్రమను చేపవలె వెనువెంటనే నశించును.
ఆదౌ న కురుతే శ్రేయః కుశలోఽస్మీతి యః పుమాన్,
స సంశయ మవాప్నోతి యథా సంప్రతిపత్తిమాన్. 19
నాకేమిలే యని మొదటనే మేలైన పని చేసికొననివాడు ప్రాప్తకాలజ్ఞుని వలె ప్రాణసంశయము పొందును.
అనాగత విధాతా చ ప్రత్యుత్పన్నమతిశ్చ యః,
ద్వావేవ సుఖ మేధేతే దీర్ఘసూత్రో వినశ్యతి. 20
ముందే జాగ్రత్తపడువాడు, సమయమునకు తగిన బుద్ధిని ప్రయోగింప గలవాడు అను నిద్దరే సుఖముతో వృద్ధినొందెదరు. తెగని ఆలోచన కలవాడు చెడిపోవును.
కాష్ఠా కలా ముహూర్తా శ్చ దివా రాత్రి స్తథా లవాః,
మాసాః పక్షాః షడృతవః కల్పః సంవత్సరా స్తథా. 21
పృథివీ దేశ ఇత్యుక్తః కాలః సచ న దృశ్యతే,
అభిప్రీతార్థ సిద్ధ్యర్ధం ధ్యాయతే యచ్చ తత్తథా. 22
కాష్ఠలు, కళలు, ముహూర్తములు, పగలు, రాత్రి, లవములు, నెలలు, పక్షములు, ఆరు ఋతువులు, కల్పము, సంవత్సరములు, దేశము అనబడు నేలయు, ఆ కాలమును మానవునకు కానరావు. కోరినది నెరవేరుటకు దానిని మానవుడు ధ్యానించును.
ఏతౌ ధర్మార్థ శాస్త్రేషు మోక్ష శాస్త్రేషు చర్షిభిః,
ప్రధానా వితి నిర్దిష్టౌ కామే చాభి మతౌ నృణామ్. 23
ధర్మము, అర్థము, మోక్షము అనువాని శాస్త్రములందును, కామ శాస్త్రమునందును ఋషులు ఈ యిద్దరినే నరులలో ప్రధానులుగా తలంతురు.
పరీక్ష్యకారీ యుక్తశ్చ స సమ్య గుపపాదయేత్,
దేశకాలా వభిప్రేతౌ తాభ్యాం ఫల మవాప్నుయాత్. 24
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మపర్వణి
శాకులోపాఖ్యానే సప్త త్రింశదధిక శతతమోఽధ్యాయః.
చక్కగా ఆలోచించి ఏకాగ్రబుద్ధితో దీర్ఘదర్శి దేశకాలములను వశమునకు తెచ్చుకొనును. వానివలన ఫలమును సాధించును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున శాకులోపాఖ్యానమున నూటముప్పది ఏడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.
సర్వత్ర బుద్ధిః కథితా శ్రేష్ఠా తే భరతర్షభ,
అనాగతా తథోత్పన్నా దీర్ఘసూత్రా వినాశినీ. 1
తదిచ్ఛామి తదా శ్రోతుం బుద్ధిం తే భరతర్ష భ,
యథా రాజా న ముహ్యేత శత్రుభిః పరివారితః. 2
ధర్మార్థ కుశలో రాజా ధర్మశాస్త్ర విశారదః,
పృచ్ఛామి త్వాం కురుశ్రేష్ఠ తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 3
భరతవరేణ్యా! కురుశ్రేష్ఠా! ముందు జాగ్రత్త కలదియు, అప్పటికైన తెలివి కలదియు అగు బుద్ధి మిక్కిలి మేలైనదనియు, తెగని గుంజాటనగలబుద్ధి నాశము కలిగించునదనియు నీవు చెప్పితివి. శత్రువులు చుట్టుముట్టినపుడు, ధర్మమునందును, అర్థమునందును నేర్పుకలవాడు, ధర్మార్థ శాస్త్రములలో ఆరి తేరిన వాడు నగు రాజు ఏ బుద్ధి నాశ్రయించినచో తెలివి తప్పకుండునో దానిని నీవు వక్కాణింపుము.
శత్రుభి ర్బహుభి ర్గ్రస్తో యథా వర్తేత పార్థివః,
ఏత దిచ్ఛా మ్యహం శ్రోతుం సర్వ మేవ యథావిధి. 4
పెక్కండ్రు పగవారికి చిక్కిన రాజు ఎట్లు మెలగవలయును? దీని నంతయు నున్నదున్నట్లు నేను వినగోరుదును.
విషమస్థం హి రాజానం శత్రవః పరిపన్థినః,
బహవోఽ ప్యేక ముద్ధర్తుం యతన్తే పూర్వతాపితాః. 5
మున్ను ఒకనివలన వెట్టపొందిన పెక్కండ్రు బంధింపగల శత్రువులు మంచి స్థితిలో లేని ఆ రాజును పెకలించి వేయుటకు ప్రయత్నింతురు.
సర్వత్ర ప్రార్థ్యమానేన దుర్బలేన మహాబలైః,
ఏ కే నై వాసహాయేన శక్యం స్థాతుం భవే త్కథమ్. 6
గొప్ప బలముకల అనేకులు కూల్చి వేయుటకు కోరుచుండగా, బలము తరిగి, తోడు లేక ఒక్కడై యున్న రాజు ఎట్లు నిలుకడ పొందగలడు?
కథం మిత్ర మరిం చాపి విన్దతే భరతర్షభ,
చేష్టితవ్యం కథం చాత్ర శత్రో ర్మిత్రస్య చాన్తరే. 7
భరతవరా! అట్టివాడు మిత్రు నెట్లు పొందును? అతనికి పగవాడెట్లు ఏర్పడును? శత్రువు, మిత్రుడు అనువారి నడుమ ఆత డెట్లు మెలగవలయును?
ప్రజ్ఞాతలక్షణే మిత్రే తథై వామిత్రతాం గతే,
కథం తు పురుషః కుర్యాత్ కృత్వా కిం వా సుఖీ భవేత్ 8
చక్కగా ఎరిగిన లక్షణములుకల మిత్రుడు స్పష్టముగా అట్లే పగవానితనమును పొందినచో ఆ మానవు డేమి చేయవలయును? ఏమి చేసి సుఖము కల వాడగును?
విగ్రహం కేన వా కుర్యాత్ సంధిం వా కేన యోజయేత్,
కథం వా శత్రుమధ్యస్థో వర్తేత బలవా నపి. 9
ఎవనితో విరోధము పెట్టుకొనవలయును? ఎవనితో సంధి చేయవలయును? బలవంతుడై యుండియు శత్రువుల నడుమనున్నవాడు ఎట్లు ప్రవర్తింపవలయును?
ఏతద్వై సర్వ కృత్యానాం పరం కృత్యం పరంతప,
నైతస్య కశ్చి ద్వక్తాస్తి శ్రోతా వాపి సుదుర్లభః.
ఋతే శాన్తనవా ద్భీష్మాత్ సత్యసంధా జ్జితేన్ద్రియాత్, 10
ఓయిశత్రుసంహారకుడా! ఇదియే కర్తవ్యము లన్నింటిలో పరమకర్తవ్యము. దీనిని చక్కగా వివరించి చెప్పగలవాడు, శంతనుకుమారుడు, సత్యసంధుడు, ఇంద్రియములను గెలిచిన వాడు అగు భీష్ముడు కాక, మరి యొకడు లేడు. చెప్పినను వినువాడును దొరకుట కష్టము. కావున దానిని చక్కగా పరిశీలించి అది యంతయు నాకు చెప్పుము.
తదన్విష్య మహాభాగ సర్వ మేత ద్బ్రవీహి మే. 11
కావున చక్కగా పరిశీలించి అది యంతయు నాకు తెలియ జెప్పము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
త్వ ద్యుక్తోఽయ మనుప్రశ్నో యుధిష్ఠిర సుఖోదయః,
శృణు మే పుత్ర కార్త్స్న్యేన గృహ్య మాపత్సు భారత, 12
నాయనా! యుధిష్ఠిరా! నీ వడిగిన యీ ప్రశ్న సుఖమునకు మూలమైనది. ఆపదలయందు గ్రహింపదగినదానినిగూర్చి పూర్తిగా చెప్పెదను వినుము.
అమిత్రో మిత్రతాం యాతి మిత్రం చాపి ప్రదుష్యతి,
సామర్థ్యయోగా త్కార్యాణా మనిత్యా వై సదా గతిః 13
ఆయా పనుల సామర్థ్యసంబంధమువలన శత్రువు మిత్రు డగును. మిత్రుడును చెడ్డవాడగును. ఈ శత్రు మిత్రుల గతి నిలుకడ లేనిది.
తస్మా ద్విశ్వసితవ్యం చ విగ్రహం చ సమాచరేత్,
దేశం కాలం చ విజ్ఞాయ కార్యాకార్య వినిశ్చయే. 14
దేశమును, కాలమును, కార్యమును, అకార్యమును చక్కగా తెలిసికొని నిర్ణయించి విశ్వాస ముంచవలయును. లేదా వైరము పొందవలయును.
సంధాతవ్యం బుధై ర్నిత్యం వ్యవస్య చ హితార్థిభిః,
అమిత్రై రపి సంధేయం ప్రాణా రక్ష్యా హి భారత. 15
చక్కగా నిర్ణయించుకొని మేలుకోరువారితోడను, పండితులతోడను, వారు పగవారైనను, కలయికనే కోరవలయును. ప్రాణములు రక్షించుకొనదగినవి కదా!
యో హ్య మిత్రై ర్నరో నిత్యం న సందధ్యా దపణ్డితః,
న సోఽర్థం ప్రాప్నుయా త్కిఞ్చిత్ ఫలాన్యపి చ భారత. 16
భారతా! తెలివిమాలినవాడై యోగ్యులగు పగవారితో సంధి చేసికొనని మానవుడు ఏ ప్రయోజనమును, ఎట్టి ఫలములను పొందడు.
యస్త్వమిత్రేణ సందధ్యా న్మిత్రేణ చ విరుధ్యతే,
అర్థయుక్తిం సమాలోక్య సుమహ ద్విన్దతే ఫలమ్. 17
ప్రయోజనము సమకూడుటను చక్కగా పరికించి పగవానితో సంధి చేసికొనువాడు, మిత్రునితో పగ పెట్టుకొనువాడు గొప్ప ఫలమును పోందును.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
మార్జారస్య చ సంవాదం న్యగ్రోధే మూషికస్య చ. 18
ఈ విషయమున మట్టి చెట్టు మీద పిల్లికి, ఎలుకకు జరిగిన సంవాదమను నొక ప్రాతకథను ఉదాహరింతురు.
వనే మహతి కస్మింశ్చి న్న్యగ్రోధః సుమహా నభూత్,
లతాజాల పరిచ్ఛిన్నో నానాద్విజగణాన్వితః. 19
ఒకానొక పేరడవియందు పెక్కు తీగలల్లుకొనినది, అనేకవిధములగు పక్షుల గుంపులతో కూడినదియు నగు పెద్ద మఱ్ఱిమాను ఉండెడిది.
స్కస్ధవాన్మేఘసంకాశః శీతచ్ఛాయో మనోరమః,
అరణ్య మభితో జాతః సతు వ్యాళ మృగా కులః. 20
గొప్ప కొమ్మలు కలదియై మేఘమో అన్నట్లు ఉండెను. చల్లని నీడ కలది యై మనసున కింపుగా నుండెను. అది అడవి నన్ని వైపుల నాక్రమించి పాములు, మృగములతో గజిబిజిగా నుండెను.
తస్య మూలం సమాశ్రిత్య కృత్వా శతముఖం బిలమ్,
వసతి స్మ మహాప్రాజ్ఞః పలితో నామ మూషికః. 21
దాని మొదలును ఆశ్రయించి నూరు ముఖములు గల కలుగు నేర్పరచుకొని గొప్ప తెలివి కల పలితమను ఎలుక నివసించుచుండెడిది.
శాఖాం తస్య సమాశ్రిత్య వసతి స్మ సుఖం పురా,
లోమశో నామ మార్జారః పక్షి సంఘాత ఖాదకః. 22
అంతకు మునుపే ఆ మఱ్ఱి కొమ్మను ఆశ్రయించి లోమశమను పిల్లి పక్షి గుంపులను భక్షించుచు సుఖముగా నివసించుచుండెను.
తత్ర చాగత్య చాణ్డాలో హ్యరణ్యే కృతకేతనః,
ప్రయోజయతి చోన్మాథం నిత్య మస్తంగతే రవౌ. 23
అడవిలో ఇల్లు కట్టుకొన్న ఒక చండాలుడు ప్రతిదినము అచటికి వచ్చి సూర్యు డస్తమించిన పిదప బోను పెట్టుచుండెను.
తత్ర స్నాయుమయాన్ పాశాన్ యథావ త్సంవిధాయ సః,
గృహం గత్వా సుఖం శేతే ప్రభాతా మేతి శర్వరీమ్. 24
అచట సన్నని నరముల పాశములను, నేర్పుగా కూర్చి యింటి కరిగి సుఖముగా అతడు నిద్రించు చుండెను. తెల్లవారినంతనే వచ్చుచుండెను.
తత్ర స్మ నిత్యం బధ్యత్తే నక్తం బహువిధా మృగాః
కదాచి దత్ర మార్జార స్త్వప్రమత్తో వ్యబధ్యత. 25
ఆ బోనులయందు ప్రతిదినము పెక్కువిధముల మృగములు తగుల్కొనుచుండెడివి. ఒకనాడు ఆపిల్లి మెలకువ కలది యయ్యు, బోనునందు చిక్కుకొనెను.
తస్మిన్ బద్దే మహాప్రాణే శత్రౌ నిత్యాతతాయిని,
తం కాలం పలితో జ్ఞాత్వా ప్రచచార సునిర్భయః. 26
గొప్ప బలముగలదియు, తనకు ప్రాణ సంకటమైనదియు అగు ఆ శత్రువు బోనునందు చిక్కుకొనగా పలితము ఏ మాత్రము భయములేనిదై, ఆ సమయమున, తిరుగజొచ్చెను.
తేనానుచరతా తస్మిన్ వనే విశ్వస్తచారిణా,
భక్ష్యం మృగయమాణేన చిరాద్దృష్టం తదామిషమ్. 27
ఆ అడవిలో నమ్మకముతో తిరుగుచున్న ఆ ఎలుక తిండిని వెదకుచున్నదై ఆ బోనుపై వున్న ఎరను చాలసేపటికి చూచెను.
స తమున్మాథ మారుహ్య తదామిష మభక్షయత్.
తస్యోపరి సపత్నస్య బద్ధస్య మనసా హసన్, 28
బోనులో చిక్కిన శత్రువును లెక్క చేయక మనస్సులో సంతోషించుచు ఆ ఎలుక ఆ బోను నెక్కి ఆ ఎరను తినసాగెను.
ఆమిషే తు ప్రసక్తః స కదాచి దవలోకయన్. 29
అపశ్య దపరం ఘోర మాత్మనః శత్రు మాగతమ్,
శరప్రసూన సంకాశం మహీ వివర శాయినమ్. 30
నకులం హరిణం నామ చపలం తామ్రలోచనమ్,
తేన మూషిక గన్ధేన త్వరమాణ ముపాగతమ్. 31
ఒకప్పుడు ఆ ఎలుక ఈ తిండిపై మనసు పెట్టినదై అటు నిటు చూచుచు మరి యొక భయంకరమైన శత్రువు రాగా చూచెను. అది రెల్లు పూవు వలె నున్నదియు, బొరియలో నిద్రించునదియు, అటు నిటు కదలుచున్నదియు, ఎఱుపెక్కిన కనులు కలదియు అగు ‘హరిణ’ మను ముంగిస. అది ఎలుక వాసనతో ఒక్క పెట్టున వచ్చి పడెను.
భక్ష్యార్థం సంలిహానం తం భూమావూర్ధ్వముఖం స్థితమ్,
శాఖాగత మరిం చాన్య మపశ్య త్కోట రాలయమ్. 32
ఆ ముంగిస భూమిపై మోము పై కెత్తి నిలిచి ఎలుకను తినుటకై నాలుక చాచుచుండెను. మరియు కొమ్మపై తొఱ్ఱలో దానికి మరి యొక శత్రువు కాన వచ్చెను.
ఉలూకం చంద్రకం నామ తీక్ష్ణ తుణ్డం క్షపాచరమ్,
గత స్స విషయం తత్ర నకులోలూకయో స్తథా. 33
అది చంద్రకమను గూబ. దాని ముక్కు చాల వాడిగా నుండెను. అది రాత్రిపూట సంచరించుచుండును. ఇట్లా ఎలుక ముంగిస గూబల బారి బడెను.
అథా స్యా సీ దియం చిన్తా తత్ప్రాప్య సుమహద్భయమ్,
ఆపద్యస్యాం సుకష్టాయాం మరణే ప్రత్యుపస్థితే. 34
సమన్తా ద్భయ ఉత్పన్నే కథం కార్యం హితైషిణా,
మిక్కిలి కష్టమైన ఈ ఆపదలో, చావు దాపురింపగా, అన్ని వైపుల నుండి భయము పుట్టగా హితము కోరువాడేమి చేయును? అను చింత దానికి కలిగెను.
స తథా సర్వతో రుద్ధః సర్వత్ర భయదర్శనః. 35
అభవ ద్భయసంతప్త శ్చక్రే చ పరమాం మతిమ్,
శత్రుగణము అన్నివైపుల చుట్టుముట్టుకొనినది. ఎటు చూచినను భయమే గోచరించుచున్నది. భయముతో తపించి పోవుచున్నది. అట్టి ఆ ఎలుక గొప్ప ఊహ చేసెను.
ఆపద్వినాశభూయిష్ఠం గతైః కార్యం హి జీవితమ్. 36
సమన్తా త్సంశయా త్సై షా తస్మా దాప దుపస్థితా,
ఆపదలను పొందిన వారు బ్రదుకును, ఆపత్తును నశింపచేయు మేలైన పని కలదానినిగా చేయవలయును. అన్ని వైపుల నుండి సంశయమే యగుటవలన నాకు పెద్ద ఆపద దాపురించినది.
గతం మాం సహసా భూమిం నకులో భక్షయిష్యతి. 37
భూమికి చేరుకొన్నంతనే ముంగిస నన్ను తిని వేయును.
ఉలూక శ్చేహ తిష్ఠన్తం మార్జారః పాశ సంక్షయాత్,
ఇక్కడనే యున్నచో గూబ తినును. పాశము త్రెంపుకొన్నచో పిల్లి మ్రింగును.
న త్వేవాస్మ ద్విధః ప్రాజ్ఞః సంమోహం గన్తు మర్హతి. 38
నావంటి తెలివి గలవాడు దిక్కు తోచని స్థితిని పొందరాదు.
కరిష్యే జీవితే యత్నం యావద్యుక్త్యా ప్రతి గ్రహాత్. 39
ఉన్నంతలో ఉపాయము చేత బ్రదుకునందు ప్రయత్నము గావింతును.
నహి బుద్ధ్యాన్వితః ప్రాజ్ఞో నీతిశాస్త్రవిశారదః,
నిమజ్జ త్యాపదం ప్రాప్య మహతీం దారుణా మపి. 40
బుద్ధియు ప్రజ్ఞయు కలనీతిశాస్త్రపండితుడు, ఎంత గొప్ప ఘోరమైన ఆపదను పొందియు క్రుంగిపోవడు.
న త్వ న్యా మిహ మార్జారా ద్గతిం పశ్యామి సాంప్రతమ్,
విషమస్థో హ్యయం శత్రుః కృత్యం చాస్య మహన్మయా. 41
ప్రస్తుతమిచట పిల్లికంటె నాకు మరియొకగతి కానరాదు. ఇదియు సంకటమున నున్నది. నాకు శత్రువు. నావలన దీనికి కాగల పనికూడ గొప్పది.
జీవితార్థీ కథం త్వద్య శత్రుభిః ప్రార్థిత స్త్రిభిః,
తస్మా దేన మహం శత్రుం మార్జారం సంశ్రయామి వై. 42
ముగ్గురు పగవారు పొంచి చూచుచున్న నేను బ్రదుక గోరువాడ నెట్లు కాగలను? కనుక శత్రువైనను ఈ పిల్లిని నే నాశ్రయింతును.
నీతిశాస్త్రం సమాశ్రిత్య హిత మస్యోపవర్ణయే,
యేనేమం శత్రు సంఘాతం మతి పూర్వేణ వఞ్చయే. 43
నీతిశాస్త్రము నాశ్రయించి దీనికి హితమును చక్కగా ఉపదేశింతును. దానితో ఈ శత్రువుల మూకను బుద్ధిబలముతో మోసగింతును.
అయ మత్యంత శత్రు ర్మే వైషమ్యం పరమం గతః,
మూఢో గ్రాహయితుం స్వార్థం సంగత్యా యది శక్యతే.
కదాచి ద్వ్యసనం ప్రాప్య సన్ధిం కుర్యా న్మయా సహ, 44
ఇది నాకు పుట్టుశత్రువు. గొప్ప విషమదశను పొందియున్నది. తన ప్రయోజనమును పట్టించుకొనుటకు సాధ్యమైనచో ఒకవేళ కష్టదశను పొందియున్నది కనుక నాతో సంధి చేయవచ్చును.
బలినా సన్నికృష్టస్య శత్రో రపి పరిగ్రహః. 45
కార్య ఇత్యాహు రాచార్యా విషమే జీవితార్థినా,
విషమదశలో బ్రదుకు కోరెడు బలవంతుడు కూడ దగ్గరగా నున్న శత్రువును చేపట్టుటయే కార్యమని ఆచార్యులు చెప్పదురు.
శ్రేష్ఠో హి పణ్ణితః శత్రు ర్న చ మిత్ర మపణ్డితః. 46
పండితుడైన పగవాడు శ్రేష్ఠుడు. పండితుడు కాని మిత్రుడట్టి వాడు కాడు.
మమ త్వమిత్రే మార్జారే జీవితం సంప్రతిష్ఠితమ్,
హన్తా స్మై సంప్రవక్ష్యామి హేతు మాత్మాభిరక్షణే. 47
అయ్యో ! నా బ్రదుకు ఇప్పుడు శత్రువైన పిల్లియందు నిలిచియున్నది. కనుక తన్ను తాను కాపాడుకొనుట యందలి హేతువును నమ్మబలుకుదును.
అపీదానీ మయం శత్రుః సంగత్యా పణ్డితో భవేత్,
ఒకవేళ ఇప్పుడు ఈ శత్రువు నా కలయికచే తెలివిగలది కావచ్చును.
ఏవం విచిన్తయామాస మూషికః శత్రు చేష్టితమ్. 48
ఎలుక ఈ విధముగా శత్రువు చేష్టను గూర్చి ఆలోచించెను.
తతోఽర్థగతి తత్త్వజ్ఞః సంధివిగ్రహ కాలవిత్,
సాన్త్వ పూర్వ మిదం వాక్యం మార్జారం మూషికోఽబ్రవీత్. 49
అంత ప్రయోజనస్థితితత్త్యము నెరిగినదియు, సంధి విగ్రహముల కాలము తెలిసినదియు నగు నెలుక మంచిమాటలతో పిల్లితో నిట్లనెను.
సౌహృదే నాభిభాషే త్వం కచ్చి న్మార్జార జీవసి,
జీవితం హి తవేచ్ఛామి శ్రేయః సాధారణం హి నౌ. 50
మార్జాలమా! మంచి మనసుతో నిన్నడుగుచున్నాను. బాగుగానున్నావా? నీ బ్రదుకునే నేను కోరుదును. మన యిరువురకు శ్రేయస్సు సమానమైనది.
న తే సౌమ్య భయం కార్యం జీవిష్యసి యథాసుఖమ్,
అహం త్వా ముద్ధరిష్యామి యది మాం న జిఘాంససి. 51
మంచిదానా! నీవు భయపడకుము. సుఖముగా బ్రదుకుదువు. నన్ను నీవు చంపగోరకున్నచో నిన్ను నేను ఉద్ధరింతును.
అస్తి కశ్చి దుపాయోఽత్ర దుష్కరః ప్రతిభాతి మే,
యేన శక్య స్త్వయా మోక్షః ప్రాప్తుం శ్రేయ స్తథా మయా. 52
ఇందు కొంచెము కష్టమైనను నాకొక ఉపాయము తోచుచున్నది. దానితో నీవు విడుదల పొందెదవు. నేను మేలు పొందెదను.
మయా ప్యుపాయో దృష్టోఽయం విచార్య మతి మాత్మనః,
ఆత్మార్థం చ త్వదర్థం చ శ్రేయః సాధారణం హి నౌ. 53
నేను నా బుద్ధి నుపయోగించి ఒక ఉపాయమును కనుగొంటిని. అది నాకును నీకును మేలైనది. మేలు అనునది యిప్పుడు మన యిరువురకు సాధారణము కదా!
ఇదం హి నకులోలూకం పాపబుద్ధ్యా భిసంస్థితమ్,
న ధర్షయతి మార్జార తవ మే స్వస్తి సాంప్రతమ్. 54
ఇదిగో ఈ ముంగిసయు, గూబయు పాప బుద్ధితో పొంచియున్నవి. నిన్ను చూచి, ఓ పిల్లీ! నన్ను బెదరింపకున్నవి. దాని చేత నా కిప్పుడు మేలైనది.
కూజం శ్చపల నేత్రోఽ యం కౌశికో మాం నిరీక్షతే,
నగ శాఖా గ్రగః పాప స్త స్యా హం భృశముద్విజే. 55
ఈ పాపి గూబ గ్రుడ్లు త్రిప్పుచున్నదై కూత లిడుచు చెట్టు కొమ్మ పై నుండి నన్ను చూచుచున్నది. దానితో నేను వణకి పోవుచున్నాను.
సతాం సాప్తపదం మైత్రం స సఖా మేఽసి పణ్ణితః,
సాంవాస్యకం కరిష్యామి నాస్తి మే భయ మద్య వై. 56
మంచి వారితో చెలిమి ఏడు మాటలతో ఏర్పడునది. అట్టి పండితుడవైన నీవు నాకు చెలివైతివి. నీతో కలిసి బ్రదుకుదును. నాకీ నాడు భయము లేదు.
నహి శక్తేఽసి మార్జార పాశం ఛేత్తుం మయా వినా,
అహం ఛేత్స్యామి పాశాంస్తే యది మాం త్వం న హింససి. 57
పిల్లీ ! నీవు నేను లేక ఈ పాశమును త్రెంపుకొనజాలవు. నీవు నన్ను హింసింప కున్నచో నీ పాశములను నేను త్రెంపుదును.
త్వ మాశ్రితో ద్రుమస్యాగ్రం మూలం త్వహ ముపాశ్రితః,
చిరోషితా వుభా వావాం వృక్షేఽస్మిన్ విదితం చ తే. 58
నీవు చెట్టు పైభాగము నాశ్రయించితివి. నేను దీని క్రింది భాగము నాశ్రయించితిని. మన యిరువురము ఈ చెట్టునందు పెద్ద కాలమునుండి నివసించుచున్నాము. ఇది నీవు ఎరిగిన విషయమే.
యస్మి న్నాశ్వాసతే కశ్చి ద్యశ్చ నాశ్వసితి క్వచిత్,
న తౌ ధీరాః ప్రశంసంతి నిత్య ముద్విగ్నమానసౌ. 59
ఎవని యందు ఒకడు నమ్మకము పొందడో, ఎవడు ఎందును ఊరట కలిగింపడో అట్టి బెదరు గుండె కలయిరువురను ధీరులు మెచ్చుకొనరు.
తస్మా ద్వివర్ధతాం ప్రీతి ర్నిత్యం సంగత మస్తు నౌ,
కాలాతీత మిహార్థం తు న ప్రశంసంతి పణ్డితాః. 60
కనుక మన యిరువురకు ఎల్లప్పుడు ప్రీతి పెంపొందుగాక. మనకు చెలిమి కలుగుగాక! కాలము మించి పోయిన ప్రయోజనమును బుద్ధిమంతులు మేలనరు.
అర్థయుక్తి మిమాం తత్ర యథా భూతాం నిశామయ,
తవ జీవిత మిచ్ఛామి త్వం మమేచ్ఛసి జీవితమ్. 61
ఈదశలోఉన్న ప్రయోజనసంగతిని చెప్పెదను, వినుము. నేను నీ బ్రదుకును కోరుచున్నాను. నీవు నా బ్రదుకును కోరుచున్నావు.
కశ్చి త్తరతి కాష్ఠేన సుగంభీరాం మహానదీమ్,
స తారయతి తత్కాష్ఠం సచ కాష్ఠేన తార్యతే. 62
మిక్కిలి లోతైన మహానదిని ఒకడొక కట్టెతో దాటుచున్నాడు. అత డా కట్టెను కూడ ఒడ్డునకు చేర్చుచున్నాడు. ఆ కట్టెతో తాను గట్టెక్కుచున్నాడు.
ఈదృశో నౌ సమాయోగో భవిష్యతి సువిస్తరః,
అహం త్వా తారయిష్యామి మాం చ త్వం తారయిష్యసి. 63
మన కలయిక యిటువంటిదై చక్కగా పెంపొందునది కాగలదు. నేను నిన్ను గట్టెక్కింతును. నీవు నన్నుద్ధరింతువు.
ఏవ ముక్త్యాతు పలిత స్తమర్థ ముభయో ర్హితమ్,
హేతుమద్గ్రహణీయం చ కాలాపేక్షీ న్యవేక్ష్య చ 64
కాలస్థితిని గమనించినదైన పలితము (ఎలుక) ఇరువురకు మేలైనది, యుక్తితో కూడినది, గ్రహింపదగినది అగు మాటను చక్కగా ఆలోచించి పలికినది.
అథ సువ్యాహృతం శ్రుత్వా తస్య శత్రో ర్విచక్షణః,
హేతుమ ద్గ్రహణీయార్థం మార్జారో వాక్య మబ్రవీత్. 65
అంత వివేకము గల ఆ పిల్లి శత్రువగు ఎలుక చక్కగా పలికిన యుక్తిమంతము, గ్రహింపదగినది యగు ఆ వాక్యమును విని పలుక జొచ్చెను.
బుద్ధిమాన్ వాక్య సంపన్న స్త ద్వాక్య మనువర్ణయన్,
స్వామవస్థాం సమీక్ష్యాథ సా మ్నైవ ప్రత్య పూజయత్. 66
పిల్లియు బుద్ధికలది. పలుకు నేర్పుకలది. ఎలుక పలుకులను మెచ్చుకొనుచు, తన అవస్థను పరిశీలించి మంచితనముతోడనే దానిని మన్నించెను.
తత స్తీక్ష్ణాగ్ర దశనో మణి వైదూర్య లోచనః,
మూషికం మన్ద ముద్వీక్ష మార్జారో లోమశోఽబ్రవీత్. 67
అంత మిక్కిలి వాడి అయిన కొనలు గల దంతములు కలదియు, మణుల వంటి వైడూర్యముల వంటి కన్నులు గలదియుఅగు పిల్లి లోమశము ఎలుకను తల పై కెత్తి చూచి ఇట్లనెను.
నన్దామి సౌమ్య భద్రం తే యో మాం జీవితు మిచ్ఛసి,
శ్రేయశ్చ యది జానీషే క్రియతాం మా విచారయ. 68
మంచిదానా! నేను బ్రదుక గోరుచున్నాను. నిన్ను మెచ్చుకొందును. నీకు మేలగు గాక! నా మేలు ఎట్లు కలుగునో ఎరుగుదువేని ఆచరింపుము. విచారింపకుము.
అహం హి భృశ మాపన్న స్త్వ మాపన్నతరో మమ,
ద్వయో రాపన్నయోః సన్ధిః క్రియతాం మా చిరాయ చ. 69
నేను మిక్కిలి ఆపదలో నున్నదానను. నీ వంత కంటే ఆపద నొందియున్నావు. ఆపదలో నున్న యిరువురకు సంధి యగును. కనుక ఆలసింపక పనిచేయుము.
విధాస్యే ప్రాప్తకాలం యత్కార్యం సిద్ధికరం విభో,
మయి కృచ్ఛ్రా ద్వినిర్ముక్తే న వినంక్ష్యతి తే కృతమ్. 70
సమయము వచ్చినపుడు నీకు సిద్ధిని కూర్చు పనిని నేనును చేయుదును. నేనీ కష్టమునుండి గట్టెక్కినచో నీవు చేసిన పని చెడి పోదు.
న్యస్తమానోఽ స్మి భక్తో ఽస్మి శిష్య స్త్వద్ధితకృత్తథా,
నిదేశవశవర్తీ చ భవన్తం శరణం గతః. 71
నేను నా బింకమును వదలివైచినదానను. భక్తి కలదానను. శాసింపదగిన దానను. నీ మేలు చేయుదానను. నీ ఆజ్ఞకు లోబడి ప్రవర్తించు దానను. నిన్ను శరణము పొందిన దానను.
ఇత్యేవ ముక్తః పలితో మార్జారం వశ మాగతమ్,
వాక్యం హిత మువా చేద మభినీతార్థ మర్థవిత్. 72
పిల్లి తన వశమునకు వచ్చి యిట్లు పలుకగా పలితము అర్థజ్ఞానము కలదియై చక్కగా కూర్చిన ప్రయోజనము గల వాక్యము నిట్లు పలికెను.
ఉదారం యద్భవా నాహ నైతచ్చిత్రం భవద్విధే,
విహితో యస్తు మార్గో మే హితార్థం శృణు తన్మమ. 73
నీవు పలికినది ఉదారముగా నున్నది. ఇది నీ వంటి వానియందు చిత్రమైనది కాదు. నీ మేలుకొరకు నేను కూర్చిన మార్గమును చెప్పెదను వినుము.
అహం త్వాను ప్రవేక్ష్యామి నకులాన్మే మహద్భయమ్,
త్రాయస్వ భో మావధీ స్త్యం శక్తోఽస్మి తవ రక్షణే. 74
నేను నీ దగ్గరకు చేరుకొందును. ఈ ముంగిసవలన నాకు పెనుభయము కలుగుచున్నది. నన్ను కాపాడుము. చంపకుము. నేను నిన్ను రక్షింపజాలుదును.
ఉలూకా చ్చైవ మాం రక్ష క్షుద్రః ప్రార్థయతే హి మామ్,
అహం ఛేత్స్యామి తే పాశాన్ సఖే సత్యేన తే శపే. 75
ఈ నీచమైన గుడ్లగూబయు నన్ను తినగోరుచున్నది. దానినుండియు నన్ను కాపాడుము. నేను ఉరులను కొరికి వేయుదును. మిత్రమా! సత్యము మీద ఒట్టు.
తద్వచః సంగతం శ్రుత్వా లోమశో యుక్త మర్థవిత్,
హర్హా దుద్వీక్ష్య పలితం స్వాగతే నాభ్యపూజయత్. 76
వివేకముగల లోమశము చక్కగా అతుకుచున్న ఆ యోగ్యమగు మాట విని సంతసముతో పలితమును చూచి స్వాగతముతో మన్నించెను.
తం సంపూజ్యాథ పలితం మార్జారః సౌహృదే స్థితః,
స విచిన్త్యాబ్రవీ ద్ధీరః ప్రీత స్త్వరిత ఏవ చ. 77
అంత చెలిమి యందు గట్టిగా నిలిచి యున్న పిల్లి చక్కగా విచారించి ధీరము, ప్రీతము, త్వర గలదియునై ఆ పలితమును మెచ్చుకొని యిట్లు పలికెను.
శీఘ్ర మాగచ్ఛ భద్రం తే త్వం మే ప్రాణసమః సఖా,
తవప్రాజ్ఞ ప్రసాదాద్ధి ప్రాయః ప్రాప్స్యామి జీవితమ్. 78
వడిగా రమ్ము, నీకు మేలగును. నీవు ప్రాణములతో సమమైన మిత్రమవు. తెలివిగల ఓ పలితమా! నీ అనుగ్రహము వలన నేను నిశ్చయముగా జీవితమును పొందెదను.
యద్య దేవం గతే నాథ శక్యం కర్తుం మయా తవ,
తదాజ్ఞాపయ కర్తాస్మి సంధి రేవాస్తు నౌ సఖే. 79
అటు పై విడుదల పొందిన నేను నీ వేది ఆజ్ఞాపించినను చేసెదను. మనకు సంధియే యగుగాక!
అస్మాత్తు సంకటాన్ముక్తః సమిత్రగణ బాన్ధవః,
సర్వకార్యాణి కర్తాహం ప్రియాణి చ హితాని చ. 80
ఈ సంకటము నుండి బయట పడిన నేను నా మిత్రములతో చుట్టములతో కూడి నీకు ప్రియములు, హితములునైన అన్ని పనులను చేసెదను.
ముక్తశ్చ వ్యసనా దస్మా త్యౌమ్యాహ మపి నామ తే,
ప్రీతి ముత్పాదయేయం చ ప్రీతి కర్తుశ్చ సత్క్రియామ్. 81
మంచిదానా! నేనీ కష్టమునుండి గట్టెక్కి నాకు ప్రీతి కలిగించిన నీకు ప్రీతిని కలుగజేయుదును. నీకు సత్క్రియ నాచరింతును.
ప్రత్యుపకుర్వన్ బహ్వపి న భాతి పూర్వోపకారిణా తుల్యః,
ఏకః కరోతి హి కృతే నిష్కారణ మేవ కురుతేఽన్యః. 82
పెద్దపెట్టున చేసినదానికి తగిన ఉపకారము చేయువాడైనను, ముందుమేలు చేసినవానితో సమానుడుగా కన్పట్టడు. ఒకడు ఒక ప్రయోజనమునకై పనిచేయును. మఱియొకడు నిష్కారణముగనే పనిచేయును.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
గ్రాహయిత్వా తు తం స్వార్థం మార్జారం మూషిక స్తథా,
ప్రవివేశ తు విశ్రమ్య క్రోడ మస్య కృతాగసః. 83
ఇట్లు ఎలుక పిల్లిని స్వప్రయోజనమును పొందించి నమ్మకముతో అది తనకు కీడు చేయు జాతి అయినను దాని ఒడిలోనికి చేరుకొనెను.
ఏవ మాశ్వాసితో విద్వాన్ మార్జారేణ స మూషికః,
మార్జారోరసి విస్రబ్ధః సుష్వాప పితృమాతృవత్. 84
పిల్లి యిట్లు ఊరడింపగా తెలివిగల ఆ ఎలుక పిల్లి రొమ్ముపై తల్లిదండ్రులకడవలె నమ్మకముతో నిదురించెను.
లీనం తు తస్య గాత్రేషు మార్జారస్య చ మూషికమ్,
దృష్ట్వా తౌ నకులోలూకౌ నిరాశౌ ప్రత్యపద్యతామ్. 85
ఆ పిల్లి దేహములో అంటుకొనిపోయిఉన్న ఆఎలుకను చూచి ముంగియు, గూబయు ఆశవదలుకొన్నవాయెను.
తథైవ తౌ సుసంత్రస్తౌ దృఢమాగతతంద్రితౌ,
దృష్ట్వా తయోః పరాం ప్రీతిం విస్మయం పరమం గతౌ. 86
అట్లే ఆరెండును మిక్కిలి భయపడినవియు, గట్టిగా వచ్చిన కునికిపాటు కలవియు నాయెను. మరియు ఆపిల్లి ఎలుకల గొప్ప ప్రీతిని గాంచి పరమాశ్చర్యమును పొందెను.
బలినౌ మతిమన్తౌ చ సువృత్తౌ చాప్యుపాసితౌ,
అశక్తౌతు నయా త్తస్మా త్సంప్రధర్షయితుం బలాత్. 87
బలము గలవి, బుద్ధికలవి, మంచినడకకలవి, దగ్గరగా నున్నవియునగు నారెండును నీతిబలమువలన తమదేహబలముతో ఎలుకను లోగొన జాలకపోయెను.
కార్యార్థం కృతసన్ధీ తౌ దృష్ట్వా మార్జారమూషికౌ,
ఉలూకనకులౌ తూర్ణం జగ్మతు స్తౌ స్వ మాలయమ్. 88
ఒక ప్రయోజనముకొరకు సంధి చేసికొనిన ఆ పిల్లి యెలుకలను చూచి గూబ ముంగిసలు తమ నివాసమునకు త్వరగా వెళ్లిపోయెను.
లీనః స తస్య గాత్రేషు పలితో దేశకాలవిత్,
చిచ్ఛేద పాశా న్నృపతే కాలాపేక్షీ శనైః శనైః. 89
ఆ పిల్లి అవయవములలో కలిసిపోయినట్లున్న ఆ పలితము దేశకాలముల తత్త్వమెరిగినది, కాలముకొఱకు చూచుచున్నదియునై మెల్లమెల్లగా ఆ వల త్రాళ్లను కొరుకసాగెను.
అథ బన్ధపరిక్లిష్టో మార్జారో వీక్ష్య మూషికమ్,
ఛిన్దన్తం వై తదా పాశా నత్వరస్తం త్వరాన్వితః. 90
తమత్వరన్తం పలితం పాశానాం ఛేదనే తథా,
సంచోదయితు మారేభే మార్జారో మూషికం తథా, 91
అంత బంధనమున నలిగిపోయిన పిల్లి త్వరతో కూడినదియై తొందరపడక మెల్లగా త్రాళ్లను కొరుకుచున్న పలితమును తొందరపెట్టసాగెను.
కిం సౌమ్య నాతిత్వరసే కిం కృతార్థో ఽవమన్యసే,
ఛిన్ది పాశా నమిత్రఘ్న పురా శ్వపచ ఏతి చ. 92
ఓ మంచిదానా! త్వరపడకున్నావేమి? నీ పని తీరినదని నన్ను చులకన చేయుచున్నావా? ఆ చండాలుడు రాకముందే త్రాళ్లను కొరికివేయుము.
ఇత్యుక్త స్త్వరతా తేన మతిమాన్ పలితో ఽబ్రవీత్,
మార్జార మకృతప్రజ్ఞం పథ్య మాత్మహితం వచః. 93
అట్లు పిల్లి తొందరపెట్టుచు పలుకగా బుద్ధిగల పలితము తెలివితక్కువ పిల్లితో తనకు మేలైన హితవాక్యము నిట్లు పలికెను.
తూష్ణీం భవ నతే సౌమ్య త్వరా కార్యా న సంభ్రమః,
వయ మేవాత్ర కాలజ్ఞా నకాలః పరిహాస్యతే. 94
మార్జాలమా! ఊరకుండు. తొందరపనికిరాదు. కంగారుపడకుము. మనమే యిచట కాలము నెరిగిన వారము. కాలము మించిపోలేదు.
అకాలే కృత్య మారబ్ధం కర్తు ర్నార్థాయ కల్పతే,
తదేవ కాల ఆరబ్ధం మహతే ఽర్థాయ కల్పతే. 95
కానికాలమున మొదలిడినపని కర్తకు ప్రయోజనమును కల్పింపదు. తగుకాలమున మొదలిడిన పనియే గొప్ప ప్రయోజనమును కూర్చును.
అకాలే విప్రముక్తా న్మే త్వత్త ఏవ భయం భవేత్,
తస్మాత్ కాలం ప్రతీక్షస్వ కిమితి త్వరసే సఖే. 96
అకాలమున విడుదల పొందిన నీవలననే నాకు భయము కలుగవచ్చును. కావున కాలమునకై వేచి యుండుము. నన్నేల తొందర పెట్టెదవు?
యదా పశ్యామి చాణ్డాల మాయాన్తం శస్త్రపాణినమ్,
తత శ్ఛేత్స్యామి తే పాశాన్ ప్రాప్తే సాధారణే భయే. 97
మన యిరువురకు భయము సాధారణమై కలిగినపుడు ఆయుధము చేపట్టి వచ్చుచున్న చండాలుని చూచినంతనే, మన యిరువురకు ఒకేవిధమగు భయము సంప్రాప్తమైనపుడు, నీపాశములను కొరికివేయుదును.
తస్మిన్ కాలే ప్రముక్త స్త్వం తరు మేవాధిరోక్ష్యసే,
న హి తే జీవితా దన్య త్కించిత్కృత్యం భవిష్యతి. 98
ఆ కాలమున నీవు విడుదలపొందినచో వెంటనే చెట్టునే ఎక్కెదవు. అపుడు నీకు ప్రాణము దక్కించుకొనుటకంటె మరియొక కార్యము కలుగదు.
తతో భవత్యపక్రాన్తే త్రస్తే భీతే చ లోమశ,
అహం బిలం ప్రవేక్ష్యామి భవాన్ శాఖాం భజిష్యతి. 99
లోమశమా! భయముతో గుండె దిగులుతో నున్న నీవు తొలగిపోయినంతనే నేను బొరియలోని కరుగుదును. నీవు కొమ్మకు చేరుకొందువు.
ఏవ ముక్తస్తు మార్జారో మూషికే ణాత్మనో హితమ్,
వచనం వాక్య తత్త్వజ్ఞో జీవితార్థీ మహామతిః. 100
తన మేలు కోరిన పలిత మిట్లు పలుకగా బ్రదుక గోరినదియు దొడ్డ బుద్ధి గలదియు మాటల సారము తెలిసినదియునగు పిల్లి యిట్లు పలికెను.
అథాత్మకృత్యే త్వరితః సమ్యక్ ప్రశ్రిత మాచరన్,
ఉవాచ లోమశో వాక్యం మూషికం చిరకారిణమ్. 101
అంత లోమశము తన పనియందు తొందర పొందినదై నమ్మకము పుట్టించుచు జాగు చేయుచున్న ఎలుకతో ఇట్లనెను.
న హ్యేవం మిత్ర కార్యాణి ప్రీత్యా కుర్వన్తి సాధవః,
యథా త్వం మోక్షితః కృచ్ఛ్రా త్త్వరమాణేన వై మయా. 102
తథా హి త్వరమాణేన త్వయా కార్యం హితం మమ,
యత్నం కురు మహాప్రాజ్ఞ యథా రక్షాఽవయో ర్భవేత్. 103
మిత్రుల పనులను ప్రీతిగల సాధువులు ఈ విధముగా చేయరు. నేను వడివడిగా నిన్ను కష్టమునుండి విడిపించితిని గదా! అట్లే నీవును నాకు మేలైన పనిని వేగముగా చేయవలయును. దొడ్డబుద్ధిగలదానా! మన యిరువురకు రక్ష యగు విధమున ప్రయత్నింపుము.
అథవా పూర్వ వైరం త్వం స్మరన్ కాలం జిహీర్షసి,
పశ్య దుష్కృత కర్మ స్త్వం వ్యక్త మాయుః క్షయం తవ. 104
అట్లు కాక మునుపటి పగను తలచుచు నీవు కాలము గడుపగోరుచున్నావా? అట్లు నీవు చెడు కర్మము కలవాడవైనచో, చూడు, ఇప్పటికే నీ యాయువు తరిగి పోయెడిది.
యది కిఞ్చి న్మయా జ్ఞానాత్ పురస్తా ద్దుష్కృతం కృతమ్,
న తన్మనసి కర్తవ్యం క్షామయే త్వాం ప్రసీద మే. 105
నేనొకవేళ నీ యెదుట బుద్ధి లేక ఏదైన పాడుపని చేసి యున్నచో దానిని మనసున పెట్టుకొనకుము. నిన్నును నేనట్లే క్షమింతును. నా యందు ప్రసన్నుడవగుము.
త మేవంవాదినం ప్రాజ్ఞః శాస్త్రబుద్ధి సమన్వితః,
ఉవాచేదం వచః శ్రేష్ఠం మార్జారం మూషిక స్తదా. 106
గొప్ప తెలివికలదియు, శాస్త్రబుద్ధితో కూడినదియునగు ఎలుక ఆ విధముగా పలుకుచున్న పిల్లితో మేలైన ఈ పలుకు పలికెను.
శ్రుతం మే తవ మార్జార స్వమర్థం పరిగృణతః,
మమాపి త్వం విజానాసి స్వమర్థం పరిగృణతః 107
మార్జాలమా! స్వప్రయోజమునే పట్టివ్రేలుచున్న నీ మాట వింటిని. నేనును నా ప్రయోజనమునే పట్టుకొనియుంటినని నీ వెరుగుదువు.
యన్మిత్రం భీతవత్సాధ్యం యన్మిత్రం భయ సంహితమ్,
సురక్షితవ్యం తత్కార్యం పాణిః సర్పముఖాదిన. 108
భయపడినది వలె ఉండి సాధింపదగిన మిత్రమును, నిజముగా భయముతో కూడిన మిత్రమును అగు దాని కార్యమును పామునోటి నుండి చేతిని వలె సంరక్షించుకొనదగును.
కృత్వా బలవతా సన్ధి మాత్మానం యో న రక్షతి,
అపథ్య మిన తద్భుక్తం తస్య నార్థాయ కల్పతే. 109
బలవంతునితో సంధి చేసికొని తన్ను తాను రక్షించుకొననివాడు, అపథ్యము తిన్నవానివలె, ప్రయోజనము పొందడు.
న కశ్చి త్కస్యచిన్మిత్రం న కశ్చిత్కస్యచి త్సుహృత్,
అర్థతస్తు నిబధ్యన్తే మిత్రాణి రిపవ స్తథా. 110
ఎవ్వనికి ఎవ్వడు మిత్రుడు కాడు. ఎవ్వనికిని ఎవ్వడు సుహృత్తు కాడు. మిత్రులో శత్రువులో ప్రయోజనమును బట్టియే ఏర్పడుదురు.
అర్థై రర్థా నిబధ్యన్తే గజై ర్వనగజా ఇవ,
నచ కశ్చిత్కృతే కార్యే కర్తారం సమవేక్షతే. 111
ప్రయోజనములతోడనే ప్రయోజనములు కట్టువడును. ఏనుగులతోడనే అడవి ఏనుగులను పట్టుకొందురు కదా! పని ముగిసిన పిదప ఎవ్వడును మేలు చేసినవానిని పట్టించుకొనడు.
తస్మాత్ సర్వాణి కార్యాణి సావశేషాణి కారయేత్,
తస్మిన్ కాలేఽపి చ భవాన్ దివాకీర్తి భయార్దితః. 112
మమ నగ్రహణే శక్తః పలాయన పరాయణః,
కనుక పనులన్నింటిని మిగులు ఉండునట్లే చేయవలయును. ఆ సమయమున (చండాలుడు వచ్చు సమయమున) నీవు ఆతని భయముతో పీడ నొందియుందువు. నన్ను పట్టుకొను శక్తి నీకు కలుగదు. పారిపోవుటయే పరమ లక్ష్యముగా నున్నదాన వగుదువు
ఛిన్నం తు తన్తుబాహుళ్యం తన్తు రేకోఽవశేషితః. 113
ఛేత్స్యా మ్యహం తమ ప్యాశు నిర్వృతో భవ లోమశ,
పెక్కు త్రాళ్ల నిప్పటికే త్రెంచి వైచితిని. ఇంక ఒక్కటి మాత్రమే మిగిలియున్నది. దానిని కూడ తొందరగనే కొరికెదను. లోమశమా! సుఖివి కమ్ము.
తయోః సంవదతో రేవం తథై వాపన్నయో ర్ద్వయోః. 114
క్షయం జగామ సా రాత్రి ర్లోమశం త్వావిశ ద్భయమ్,
అట్లు ఆపద పొందిన ఆ రెండును సంభాషించుకొనుచుండగా రాత్రి గడచిపోయెను. లోమశమునకు భయము పై కొనెను.
తతః ప్రభాత సమయే వికృతః కృష్ణపింగళః. 115
స్థూలస్ఫిగ్వికృతో రూక్షః శ్వయూధ పరివారితః,
శంకుకర్ణో మహావక్త్రో మలినో ఘోరదర్శనః. 116
పరిఘో నామ చాండాలః శస్త్రపాణి రదృశ్యత,
అంత తెలవారు సమయమున వికారరూపుడు, నల్లని గోరోజనము వంటి వన్నె కలవాడు, లావైన పిఱుదులతో రోత పుట్టించువాడు, క్రూరుడు, కుక్కల గుంపు చుట్టుముట్టినవాడు, మేకుల వంటి చెవులు గలవాడు, వెడల్పయిన నోరు కలవాడు, మలినుడు, ఘోరమైన దర్శనము కలవాడునగు పరిఘుడను చండాలుడు ఆయుధము చేత ధరించి కానవచ్చెను.
తం దృష్ట్వా యమదూతాభం మార్జార స్త్ర స్త చేతనః.
ఉవాచ వచనం భీతః కి మిదానీం కరిష్యసి, 117
యముని దూతయో యన్నట్లున్న వానిని చూచి నిలువెల్ల వణకు పుట్టిన పిల్లి ఇప్పుడేమి చేయుదువని (ఎలుకతో) పలికెను.
అథ తావపి సంత్రస్తౌ తం దృష్ట్వా ఘోరసంకులమ్. 118
క్షణేన నకులోలూకౌ నైరాశ్య ముపజగ్మతుః,
అంత ఆ ముంగియు గూబయును ఆ భయంకరమగు గందరగోళమును చూచి మిక్కిలి భయపడి నిరాశ పొందెను. (ఇంతకు మునుపు తమ నెలవులకు పోయినట్లు చెప్పిరి. ఈ శ్లోకమును బట్టి ఆ నెలవులు ఆ చెట్టునందే కలవని ఊహింపదగును)
బలినౌ మతిమన్తౌ చ సంఘాతే చాప్యుపాగతౌ. 119
అశక్తే సునయాత్తస్మా త్సంప్రధర్షయితుం బలాత్,
ఆ రెండును బలముకలవి, బుద్ధికలవి, కూడియున్నవి. అయినను గొప్ప నీతిబలమువలన బలముతో దానిని దెబ్బగొట్టుటకు అసమర్థములైనవి.
కార్యార్థౌ కృతసన్ధానౌ దృష్ట్వా మార్జార మూషికౌ. 120
ఉలూకనకులౌ తత్ర జగ్మతుః స్వంస్వమాలయమ్,
ప్రయోజనము కొరకు సంధి చేసికొనిన ఆ పిల్లి ఎలుకలను చూచి ముంగి గూబలు తన తన నెలవులకు అరిగినవి.
తత శ్చిచ్ఛేద తం పాశం మార్జారస్య చ మూషికః. 121
అంత ఆ ఎలుక పిల్లి పాశమును త్రెంచి వేసెను.
విప్రముక్తోఽథ మార్జార స్తమే వాభ్యపత ద్ద్రుమమ్,
స తస్మాత్సంభ్రమావర్తా న్ముక్తో ఘోరేణ శత్రుణా. 122
విడుదల పొందిన పిల్లి ఒక్క దూకున చెట్టు పైకి చేరుకొనెను. ఆ విధముగా అది తన ఘోరశత్రువు చేత ఆ గుండె గుబులనెడు సుడి నుండి విడివడెను.
బిలం వివేశ పలితః శాఖాం లేభే స లోమశః,
ఉన్మాథ మప్యథాదాయ చాణ్డాలో వీక్ష్య సర్వశః. 123
విహతాశః క్షణే నాస్తే తస్మాద్దేశా దపాక్రమత్,
జగామ స స్వభవనం చాణ్డాలో భరతర్షభ. 124
పలితము బొరియలోని కరిగెను. లోమశము తన కొమ్మ నందుకొనెను. చండాలుడు దిక్కులు చూచుచు, ఆశ నశింపగా ఒక్క క్షణ మచట నిలిచి వలను కైకొని అట నుండి తొలగెను. తన యింటి కరిగెను.
తత స్త స్మా ద్భయాన్ముక్తో దుర్లభం ప్రాప్య జీవితమ్,
బిలస్థం పాదపాగ్రస్థః పలితం లోమశోఽబ్రవీత్. 125
అంత చెట్టు మీద నున్న లోమశము ఆ భయమునుండి విముక్తి పొంది పొందరాని బ్రదుకును పొంది బొరియలో నున్న పలితముతో నిట్లనెను.
అకృత్వా సంవిదం కాఞ్చి త్సహసా సమవప్లుతః,
కృతజ్ఞం కృతకర్మాణం కచ్చి న్మాం నాభిశంకసే. 126
నాతో ఒక్క మాట కూడ పలుకక ఒక్క గంతున పోయితివి. నీవు, కృతజ్ఞత కలదానను, నీకు మేలు చేసిన దానను అగు నన్ను శంకించుట లేదు కదా!
గత్వా చ మమ విశ్వాసం దత్వా చ మమ జీవితమ్,
మిత్రోపభోగసమయే కిం మాం త్వం నోపసర్పసి. 127
నా విశ్వాసము పొంది, నాకు బ్రదుకు ప్రసాదించి మిత్రమా! సుఖ మనుభవించు వేళ నాకడ కేల రాకున్నావు?
కృత్వా హి పూర్వం మిత్రాణి యః పశ్చా న్నాను తిష్ఠతి,
న స మిత్రాణి లభతే కృచ్ఛ్రా స్వాపత్సు దుర్మతిః. 128
ముందు మైత్రిని నెరపి తరువాత దానిని కొనసాగింపని దుష్టబుద్ధి ఘోరమైన ఆపదలయందు మిత్రులను పొందజాలడు.
సత్కృతోఽహం త్వయా మిత్ర సామర్థ్యా దాత్మనః సఖే,
స మాం మిత్రత్వ మాపన్న ముపభోక్తుం త్వ మర్హసి. 129
మిత్రమా! నీ సమర్థతతో నాకు మేలొనర్చితివి. కనుక మైత్రిని పొందిన నన్ను కలిసి సుఖ మనుభవింపదగుదువు.
యాని మే సన్తి మిత్రాణి యే చ సంబంధి బాంధవాః,
సర్వే త్వాం పూజయిష్యన్తి శిష్యా గురు మివ ప్రియమ్. 130
నా మిత్రములు, చుట్ట పక్కములు అన్నియు నిన్ను, శిష్యులు ప్రియమైన గురువును వలె, మన్నింతురు.
అహం చ పూజయిష్యే త్వాం సమిత్రగణ బాన్ధవమ్,
జీవితస్య ప్రదాతారం కృతజ్ఞః కో న పూజయేత్. 131
నేనును నిన్ను నీవారందరితోపాటు మన్నింతును. బ్రదుకునిచ్చిన వానిని కృతజ్ఞు డెవడు పూజింపకుండును?
ఈశ్వరో మే భవా నస్తు స్వశరీర గృహస్య చ,
అర్థినాం చైవ సర్వేషా మనుశాస్తా చ మే భవ. 132
నీవు నా దేహమునకు, ఇంటికి, నా సంపదలకు సర్వమునకు ఏలికవు కమ్ము. నాకు మంచి చెడులను ఉపదేశించుదానవు కమ్ము.
అమాత్యోఽపి భవ ప్రాజ్ఞ పితేవేహ ప్రశాధి మామ్,
న తేఽస్తి భయ మస్మత్తో జీవితే నాత్మనః శపే. 133
ప్రజ్ఞకలదానా! నాకు మంత్రివి కూడ అగుము. తండ్రివలె నన్ను శాసింపుము. నీకు నావలన భయము లేదు. నా జీవితముపై ఒట్టు పెట్టెదను.
బుద్ధ్యా త్వముశనా సాక్షా ద్బలేనాధికృతా వయమ్,
త్వం మన్త్రబలయుక్తో హి దత్వా జీవిత మద్య మే. 134
నీవు బుద్ధితో సాక్షాత్తు శుక్రాచార్యుడవు. మేము బలముతో అధికులము. నా కిపుడు బ్రదుకు నిచ్చితివి. గొప్ప మంత్రశక్తి కలదానవు.
ఏవ ముక్తః పరాం శాన్తిం మార్జారేణ స మూషికః,
ఉవాచ పరమన్త్రజ్ఞః శ్లక్ష్ణమాత్మహితం వచః. 135
ఇట్లు పిల్లి గొప్ప శాంతి వచనములు పలుకగా ఎలుక పరుని మంత్రపు లోతుల నెరిగినది కనుక తనకు మేలైన సూక్ష్మమగు పలుకు నిట్లు పలికెను.
యద్భవా నాహ తత్సర్వం మయా తే లోమశ శ్రుతమ్,
మమాపి తావద్బ్రువతః శృణు యత్ప్రతిభాతి మే. 136
లోమశమా! నీవు పలికినదంతయు నేను వింటిని. నాకు తోచిన దొకటి చెప్పుదును వినుము.
వేదితవ్యాని మిత్రాణి విజ్ఞేయా శ్చాపి శత్రవః,
ఏతత్ సుసూక్ష్మం లోకేఽస్మిన్ దృశ్యతే ప్రాజ్ఞ సంమతమ్. 137
మిత్రములను చక్కగా తెలిసికొనవలయును. అట్లే శత్రువులను కూడ బాగుగా ఎఱుంగవలయును. ఈ లోకమున ఇది ప్రజ్ఞావంతులకు సమ్మతమైన పరమ సూక్ష్మాంశము.
శత్రురూపా హి సుహృదో మిత్రరూపాశ్చ శత్రవః,
సన్ధితాస్తేఽవ బుద్ధ్యన్తే కామక్రోధ వశంగతాః. 138
శత్రు రూపమున మిత్రములు, మిత్రరూపమున శత్రువులు ఉందురు. కామమునకు, క్రోధమునకు వశమైన అట్టి వారు కలిసియున్నను తెలియ రాకుందురు.
నాస్తి జాతు రిపు ర్నామ మిత్రం నామ న విద్యతే,
సామర్థ్యయోగా జ్జాయన్తే మిత్రాణి రిపవ స్తథా. 139
శత్రువని ఒకడుండడు. అట్లే మిత్రమనియు సహజముగా ఒకడుండడు. సమాన ప్రయోజన సంబంధము చేత మిత్రులు, శత్రువులు ఏర్పడుచుందురు.
యో యస్మిన్ జీవతి స్వార్థం పశ్యేత్ పీడాం న జీవతి,
స తస్య మిత్రం తావత్ స్యాత్ యావన్న స్యాద్విపర్యయః 140
ఎవడు బ్రదికి యుండగా స్వప్రయోజనము చూచునో, పీడను పొందకుండునో వాడు వానికి, దానికి విరుద్ధము కాకుండునంతవరకు, మిత్రమగును.
నాస్తి మైత్రీ స్థిరా నామ న చ ధ్రువ మసౌహృదమ్,
అర్థయుక్త్యాఽను జాయన్తే మిత్రాణి రిపవ స్తథా. 141
స్థిరమైన మైత్రియు, స్థిరమైన అప్రీతియు నుండవు. ప్రయోజన సంబంధమును బట్టి మిత్రములు, శత్రువులు ఏర్పడుచుందురు.
మిత్రం చ శత్రుతా మేతి కస్మింశ్చిత్కాలపర్యయే,
శత్రు శ్చ మిత్రతా మేతి స్వార్థో హి బలవత్తరః. 142
ఒకానొక కాలపు మార్పుచేత మిత్రుడును శత్రుత్వము పొందును. అట్లే శత్రువును చెలిమిని పొందును. స్వార్థము గదా మిక్కిలి బలము గలది!
యో విశ్వసితి మిత్రేషు న విశ్వసితి శత్రుషు,
అర్థయుక్తి మవిజ్ఞాయ యః ప్రీతౌ కురుతే మనః 143
మిత్రే వా యది వా శత్రౌ తస్యాపి చలితా మతిః,
న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్. 144
కేవలము ప్రీతియందు మనసు పెట్టి ప్రయోజనమును తెలిసికొనక మిత్రులయందు విశ్వాసము నుంచువానికి, శత్రువులందు నమ్మకము పెట్టకుండువానికి కూడ మిత్రునియందుగాని శత్రువు నందు గాని బుద్ధి చలించి పోవును. కనుక నమ్మరాని వాని యందు నమ్మక ముంచరాదు. నమ్మదగిన వానిని మేర మీరి నమ్మరాదు.
విశ్వాసాద్భయ ముత్పన్న మపి మూలాని కృన్తతి,
విశ్వాసము వలన పుట్టెడు భయము మొదళ్లను కూడ త్రుంచి వేయును.
అర్థయుక్త్యా హి జాయన్తే పితా మాతా సుత స్తథా. 145
మాతులా భాగినేయాశ్చ తథా సంబంధి బాన్ధవాః,
తల్లి, తండ్రి, కొడుకు, మేనమామలు, మేనల్లుండ్రు, అట్లే మిగిలిన చుట్టపక్కములు ప్రయోజనమును బట్టియే దగ్గరి వారగుదురు.
పుత్రం హి మాతా పితరౌ త్యజతః పతితం ప్రియమ్. 146
లోకో రక్షతి చాత్మానం పశ్య స్వార్థస్య సారతామ్,
ఇష్టుడైనను పతితుడైన కొడుకును తల్లిదండ్రులు కూడ వదలివేయుచున్నారు. అట్టి వానిని మరియొక జనుడు రక్షించుచున్నాడు. స్వార్థపు సారత ఎట్టిదో చూడు.
సామాన్యా నిష్కృతిః ప్రాజ్ఞ యో మోక్షా త్ప్రత్యనన్తరమ్. 147
ఆపద గడచిన పిదన ప్రాయశ్చిత్తము సామాన్యమే.
కృతం మృగయసే శత్రుం సుఖోపాయ మసంశయమ్,
అస్మి న్నిలయ ఏవ త్వం న్యగ్రోధా దవతారితః. 148
ఈ స్థలము నందే నీవు చెట్టు దిగి వచ్చి సంశయము లేకుండ సుఖమైన ఉపాయము కలుగునట్లుగా శత్రువును వెదకుచుందువు గదా!
పూర్వం నివిష్ట మున్మాథం చపలత్వా న్న బుద్ధవాన్,
ఆత్మన శ్చపలో నాస్తి కుతోఽన్యేషాం భవిష్యతి. 149
మునుపు పన్నిన వలను చపలతవలన ఎరుగకుంటివి. చపలుడు తన విషయమందే స్థైర్యము లేనివాడగును. ఇతరుల విషయమున నెట్లు స్థిరముగా నుండును?
తస్మా త్సర్వాణి కార్యాణి చపలో హన్త్య సంశయమ్,
కనుక బుద్ధి నిలుకడ లేనివాడు పనులన్నింటిని నిస్సంశయముగా పాడు చేయును.
బ్రవీషి మధురం యచ్చ ప్రియో మేఽద్య భవానితి. 150
తన్మిత్ర కారణం సర్వం విస్తరేణా పి మే శృణు,
ఇప్పడు నీవు నాకు ప్రియమైనదానవని తియ్యగా పలుకుచున్నావు. మిత్రమా! దాని కారణమును మరికొంత వివరించి చెప్పుదును వినుము.
కారణా త్ప్రియతా మేతి ద్వేష్యో భవతి కారణాత్. 151
అర్థార్థీ జీవలోకోఽయం న కశ్చిత్ కస్యచిత్ప్రియః,
కారణమువలననే ప్రీతిని పొందును. కారణము వలననే ద్వేషింపదగిన వాడగును. ఈ జీవలోకమంతయు ప్రయోజనమును కోరునదియే. ఎవ్వడు ఎవ్వనికిని సహజముగా ప్రియుడు కాడు.
సఖ్యం సోదర్యయో ర్భ్రాత్రో ర్దంపత్యో ర్వా పరస్పరమ్. 152
ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములకును, ఆలుమగలకును ఒకరియెడ నొకరికుండు సఖ్య మిట్టిదియే.
కస్యచిన్నాభిజానామి ప్రీతిం నిష్కారణా మిహ,
కారణములేని ప్రీతిని ఈ లోకమున నేనెందును చూడజాలకున్నాను.
యద్యపి భ్రాతరః క్రుద్ధా భార్యా వా కారణాన్తరే. 153
స్వభావత స్తే ప్రీయన్తే నేతరః ప్రీయతే జనః,
ఒక వేళ అన్నదమ్ములొకరి యందొకరు కోపము కలవారైనను, వేరొక కారణము చేత భార్య క్రోధము వహించినను స్వభావమువలన వారు మరల ప్రీతి పొందుదురేమో కానీ ఇతర జనుడు ప్రీతి పొందడు.
ప్రియో భవతి దానేన ప్రియవాదేన చాపరః,
మన్త్ర హోమజపై రన్యః కార్యార్థం ప్రీయతే జనః. 154
ఒకడు దానముచేత ప్రియుడగును. మరియొకడు ప్రియమైనమాటలవలన ప్రియుడగును. ఇంకొకడు మంత్రములు హోమములు జపములు అనువానివలన ప్రియుడగును. మనుజుడు ప్రయోజనము వలననే ప్రీతి పొందును.
ఉత్పన్నా కారణే ప్రీతి రాసీన్నౌ కారణాన్తరే. 155
ప్రధ్వస్తే కారణస్థానే సా ప్రీతి ర్వినివర్తతే. 156
మన యిరువురకు ఒక కారణమువలన ప్రీతి ఏర్పడినది. మరియొక కారణము నందు మొదటి కారణ స్థానము నశించినచో ఆ ప్రీతి వెనుదిరుగును.
కిన్తు తత్కారణం మన్యే యేనాహం భవతః ప్రియః,
అన్యత్రాభ్యవహారార్థం తత్రాఽపి చ బుధా వయమ్,
కాలో హేతుం వికురుతే స్వార్థస్త మనువర్తతే. 157
మరియు నేను నీకు ప్రియమైన కారణము, భోజన ప్రయోజనము కంటె ఇతరమైనదని నాకనిపించుచున్నది. మనము అందు కూడ పండితులమే కదా! కాలము కారణమును వికారపరచును. స్వార్థము దాని వెంట బడిపోవుచుండును.
స్వార్థం ప్రాజ్ఞోఽభిజానాతి ప్రాజ్ఞం లోకోఽను వర్తతే,
న త్వీదృశం త్వయా వాచ్యం విదుషి స్వార్థ పండితే. 158
ప్రజ్ఞకలవాడు స్వార్థమును చక్కగా ఎరుగును. ప్రజ్ఞకలవానిని లోకము వెంటనంటును. చక్కగా ఎరిగిన స్వార్థము నందు గొప్ప తెలివిగల వాని విషయమున నీవిట్లు పలుకరాదు.
అకాలే హి సమర్థస్య స్నేహ హేతు రయం తవ,
తస్మా న్నాహం చలే స్వార్థాత్ సుస్థిరః సంధివిగ్రహే. 159
నీవు సమర్థుడవు. అయినను కాలము కలిసి రాక స్నేహము చేసితివి. అది అచట స్నేహకారణము. అందువలన నా ప్రయోజనమున గట్టిగా నిలిచి యుండువాడనై సంధి విగ్రహములందు చలింపను.
అభ్రాణా మివ రూపాణి వికుర్వన్తి క్షణే క్షణే,
అద్యైవ హి రిపు ర్భూత్వా పున రద్యైవ మే సుహృత్. 160
కొందరు మేఘముల రూపముల వలె క్షణక్షణము మారిపోవుచుందురు. నేడే నీవు శత్రువవు. మరల నేడే నాకు మిత్ర మయితివి.
పునశ్చ రిపు రద్యైవ యుక్తీనాం పశ్య చాపలమ్,
ఆసీ న్మైత్రీ తు తావన్నౌ యావ ద్ధేతు రభూత్పురా. 161
మరల ఈనాడే శత్రువ వగుదువు. యుక్తుల చంచలతను పరికింపుము. కారణ మెంతవరకు కలదో అంతవరకు మనకు మునుపు చెలిమి ఏర్పడినది.
సా గతా సహ తే నైవ కాలయుక్తేన హేతునా,
త్వం హి మే జాతితః శత్రుః సామర్థ్యా న్మిత్రతాం గతః. 162
ఆ చెలిమి కాలముతో కూడినదైన ఆ కారణము తోడనే గతించినది. నీవు నాకు జాతి మాత్రమున విరోధివి. ప్రయోజనమువలన మిత్రత్వమును పొందితివి.
తత్కృత్య మభినిర్వర్త్య ప్రకృతిః శత్రుతాం గతా,
ఆ పనిని ముగించుకొనిన పిదప స్వభావము శత్రుత్వమునే పొందునది.
సోఽహమేవ ప్రణీతాని జ్ఞాత్వా శాస్త్రాణి తత్త్వతః.
ప్రవిశేయం కథం పాశం త్వత్కృతే తద్వదస్వ మే, 163
ఈ విధముగా ఏర్పడిన శాస్త్రములను మూలముట్టుగా ఎరిగిన నేను మరల నీ కొరకు పాశములో ఎట్లు చిక్కుదును? అది నాకు చెప్పుము.
త్వద్వీర్యేణ ప్రముక్తాహం మద్వీర్యేణ తథా భవాన్.
అన్యోన్యాను గ్రహే వృత్తే నాస్తి భూయః సమాగమః, 164
నీ శక్తితో నేను విడుదల పొందితిని. నా శక్తితో నీవును అట్లే అయితివి. ఒకరినొకరు దయచూచుట ముగిసిన పిదప మరల కలయిక ఉండదు కదా!
త్వం హి సౌమ్య కృతార్థో ఽద్య నివృత్తార్థా స్తథా వయమ్. 165
న తేఽస్త్యద్య మయా కృత్యం కిఞ్చి దన్యత్ర భక్షణాత్,
మిత్రమా! నీవు ప్రయోజనము పొందితివి. మేమును అట్లే పని తీర్చుకొంటిమి. ఇక నీకు, మ్రింగుట కాక, నాతో నేడు పనియేమియు లేదు.
అహ మన్నం భవాన్ భోక్తా దుర్బలోఽ హం భవాన్ బలీ.
నావయో ర్విద్యతే సన్ధి ర్వియుక్తే విషమే బలే, 166
నేను అన్నమను, నీవు భోక్తవు. నేను బలము లేని దానను. నీవు బలము గలదానవు. విషమమైన బలము విడివడగా మన యిరువురకు సంధి కలుగదు.
సమన్యేఽహం తవ ప్రజ్ఞాం యన్మోక్షాత్ప్రత్యనన్తరమ్.
భక్ష్యం ప్రశంససే నూనం సుఖో పాయేన కర్మణా, 167
నీ యీ తెలివియంతయు విడుదల నొందిన తరువాత ఏర్పడిన దనుకొందును. సుఖమైన ఉపాయము గల పనితో నీవిపుడు తిండిని గూర్చి ఈ మాటలు పలుకుచున్నావు. నిక్కము.
భక్షార్థం హ్యవబద్ధ స్త్వం సముక్తః పీడితః క్షుధా.
శాస్త్రజాం మతి మాస్థాయ నూనం భక్షయితాద్య మామ్, 168
నీవు తిండికొరకే వలలో చిక్కితివి. పిదప విడుదల పొందితివి. ఆకలితో బాధపడుచున్నావు. దానికై శాస్త్ర సంబంధమైన బుద్ధి నాశ్రయించి యిప్పుడు నన్ను మ్రింగి వైచెదవు.
జానామి క్షుధితం తు త్వా మాహార సమయశ్చ తే.
సత్వం మామభిసంధాయ భక్ష్యం మృగయసే పునః, 169
నీవు ఆకొంటివని నేనెరుగుదును. ఇది నీకు భోజనసమయము. కనుక నన్ను వంచించి తిండికై వెదకుచున్నావు.
త్వం చాపి పుత్రదారస్థో యత్సన్ధిం సృజసే మయి,
శుశ్రూషాం యతసే కర్తుం సఖే మమ న తత్క్షమమ్. 170
నీవును ఆలు బిడ్డలు కలదానవు. కనుక నాయందు సంధిని కూర్చుచున్నావు. మిత్రమా! అందువలన నా శుశ్రూషకై యత్నించుచున్నావు. నావిషయమున అది తగదు.
త్వయా మాం సహితం దృష్ట్వా ప్రియా భార్యా సుతాశ్చ తే, 171
కస్మాత్తే మాం న ఖాదేయు ర్హృష్టాః ప్రణయిన స్త్వయి.
నీతో కలసియున్న నన్ను నీ ముద్దుల యిల్లాలును, నీ ప్రియమైన పిల్లలును లొట్టలు వేయుచు ఏల తినకుందురు?
నాహం త్వయా సమేష్యామి వృత్తో హేతుః సమాగమే,
శివం ధ్యాయస్వ మే స్వస్థః సుకృతం స్మరసే యది. 172
నేను నీతో కలియను. కలయిక కారణము గడిచిపోయినది. నా మంచి పనిని స్మరింతువేని సమచిత్తుడవై నాకు శుభమును భావింపుము.
శత్రో రనార్యభూతస్య క్లిష్టస్య క్షుధితస్య చ.
భక్ష్యం మృగయమాణస్య కః ప్రాజ్ఞో విషయం వ్రజేత్, 173
పగవాడు, మంచినడవడిలేనివాడు, కష్టమునందున్నవాడు, ఆకలికొన్నవాడు, తిండిని వెదకుచున్నవాడునగు వాని తావునకు ఏ బుద్ధిమంతుడు వెడలును?
స్వస్తి తేఽస్తు గమిష్యామి దూరా దపి తవోద్విజే.
విశ్వస్తం వా ప్రమత్తం వా ఏత దేవకృతం భవేత్, 174
నీకు మేలగు గాక! నేను పోయెదను. దూరమున ఉండియు నీకు ఉద్వేగము పుట్టింతును. నమ్మియున్నను, పొరబడినను ఇదియే చేయదగిన పనియగును.
బలవ త్సన్నికర్షో హి న కదాచి త్ప్రశస్యతే. 175
బలవంతుని కడ నుండుట ఎన్నటికిని మంచిది కాదు.
నాహం త్వయా సమేష్యామి నివృత్తో భవ లోమశ,
యది త్వం సుకృతం వేత్సి తత్సఖ్య మనుసారయ. 176
నీతో నేను చెలిమి చేయను. లోమశా! తిరిగి పొమ్ము. నా మంచి పనిని గుర్తింతువేని ఆ స్నేహమును అనుసరింపుము.
ప్రశాన్తా దపి మే పాపాత్ భేతవ్యం బలినః సదా,
యది స్వార్థం న తే కార్యం బ్రూహి కిం కరవాణి తే. 177
పాపాత్ముడు బలవంతుడు ప్రశాంతుడై యున్నను వానివలన ఎన్నడు భయపడవలయును. నీకు స్వార్థము లేకున్నచో నేనేమి చేయవలయునో చెప్పుము.
కామం సర్వం ప్రదాస్యామి న త్వాత్మానం కదాచన,
ఆత్మార్థే సంతతి స్త్యాజ్యా రాజ్యం రత్నం ధనాని చ. 178.
నీకు నా సర్వమును పూర్తిగా ఇత్తును. నన్ను మాత్రము ఎన్నటికిని సమర్పించుకొనను. తనకొరకు సంతానమునైనను, రాజ్యమునైనను, రత్నమునైనను, ధనమునైనను విడువవలయును.
అపి సర్వం స్వ ముత్సృజ్య రక్షే దాత్మాన మాత్మనా,
ఐశ్వర్యధనరత్నానాం ప్రత్యమిత్రే నివర్తతామ్. 179
ఐశ్వర్యము, ధనము, రత్నములు అనువాని తన సొమ్ము నంతటిని వదలియైనను తన్ను తాను కాపాడుకొనవలయును. ఓసి విరోధి! మరలి పొమ్ము.
దృష్టా హి పున రావృత్తి ర్జీవతా మితి నః శ్రుతమ్,
న త్వాత్మనః సంప్రదానం ధనరత్న వదిష్యతే. 180
బ్రదికియున్నవారికి పోయినదెల్ల మరల తిరిగి వచ్చుట కానవచ్చుచున్నది. ఇది మేము వినియు నుంటిమి. ధన రత్నముల వలె తన్ను తాను ఇచ్చుకొనుట కోరదగినది కాదు.
ఆత్మా హి సర్వదా రక్ష్యో దారై రపి ధనై రపి,
ఆపదో నోపపద్యన్తే పురుషాణాం స్వదోషజాః,
ఆత్మ రక్షణ తంత్రాణాం సుపరీక్షిత కారిణామ్. 181
భార్యల నిచ్చియైనను, ధనములనిచ్చియైనను తన్నుతాను కాపాడుకొన వలయును. ఆత్మ రక్షణమున నేర్పుగలవారును, అన్నియు చక్కగా పరీక్షించి పనులు చేయువారును అగు పురుషులకు తమ దోషములవలన పుట్టెడు ఆపదలు కలుగవు.
శత్రుం సమ్య గ్విజానన్తి దుర్బలా యే బలీయసమ్,
న తేషాం చాల్యతే బుద్ధిః శాస్త్రార్థకృత నిశ్చయా. 182
బలహీనులైనను బలవంతుడగు శత్రువును గూర్చి చక్కగా తెలిసికొనువారి శాస్త్రముల అర్థములయందు గట్టి నిశ్చయము పొందిన బుద్ధి ఎన్నటికిని కదలింప జాలనిది.
ఇత్యభివ్యక్త మేవం స పలితే నాభి భర్త్సితః. 183
మార్జారో వ్రీడితో భూత్వా మూషికం వాక్య మబ్రవీత్. 184
ఇట్లు ఏ దాపరికము లేకుండ పలితము తెగవేసి పలుకగా సిగ్గుపడిన పిల్లి ఎలుకతో నిట్లనెను.
లోమశ ఉవాచ - పిల్లి యిట్లు పలికెను.
సత్యం శపే త్వయాఽహం వై మిత్రద్రోహో విగర్హితః,
తన్మన్యేఽహం తవ ప్రజ్ఞాం యస్త్వం మమ హితే రతః. 185
సత్యము పై ఒట్టు. నన్ను నీవు మిత్రద్రోహిగా నిందించితివి. అది నీ బుద్ధి విశేషముగా నేను తలంతును. నీవు నా మేలునందు ఆసక్తి కలవాడవు.
ఉక్త వానర్థ తత్త్యేన మయా సంభిన్న దర్శనః,
నతు మామన్యథా సాధో త్వంగ్రహీతు మిహార్హసి. 186
మరియొక భావముగల నీతో నేను ప్రయోజన దృష్టితో మాటాడితిని. నన్ను నీవు వేరు విధముగా గ్రహింపరాదు.
ప్రాణ ప్రదానజం త్వత్తో మయి సౌహృద మాగతమ్,
ధర్మజ్ఞోఽస్మి గుణజ్ఞోఽస్మి కృతజ్ఞ్మో ఽస్మి విశేషతః 187
నీవు ప్రాణమిచ్చుటవలన నాకు మంచి మనసు ఏర్పడినది. నేను ధర్మమెరిగిన దానను. గుణము నెరిగిన దానను. విశేషించి చేసిన మేలు గుర్తించుదానను.
మిత్రేషు వత్సల శ్చాస్మి త్వద్భక్త శ్చ విశేషతః,
తస్మా దేవం పునః సాధో మయ్యాచరితు మర్హసి. 188
చెలుల యందు ప్రేమ గలదానను. విశేషించి నీ యందు భక్తి కలదానను. కనుక ఓ సాధు! నా యందు మరల అట్టి భావమునే నీవు చేయవలయును.
త్వయా హి వాచ్యమానోఽహం జహ్యాం ప్రాణాన్ సబాన్ధవః,
విశ్రంభో హి బుధై ర్దృష్టో మద్విధేషు మనస్విషు 189
నీవు నన్ను నిందింతువేని నేను నా వారందరితో కూడి ప్రాణములు వదలుదును. నా వంటి మంచి మనస్సు కలవారి యందు నమ్మకము పండితులకు కానవచ్చునదియే.
తదేత ద్ధర్మ తత్వజ్ఞ న త్వం శంకితు మర్హసి,
కనుక ధర్మతత్త్వ మెరిగిన నీవు నన్ను శంకింపరాదు.
ఇతి సంస్తూయమానోఽపి మార్జారేణ స మూషికః.
మనసా భావగంభీరో మార్జారం వాక్య మబ్రవీత్, 190
అని పిల్లి యిట్లు కొనియాడుచున్నను ఎలుక మనస్సుతో లోతైన భావము గలదియై పిల్లి కిట్లనెను.
సాధు ర్భవాన్ శ్రుతార్థోఽస్మి ప్రీయే చ నచ విశ్వసే.
సంస్త వై ర్వా ధనౌఘై ర్వా నాహం శక్యః పున స్త్వయా, 191
నీవు మంచిదానవు. నీమాట వింటిని. నీ యందు ప్రీతి నొందెదను. కాని నిన్ను నమ్మ జాలను. ఈ స్తోత్రములు గాని ధన సముదాయములు గాని ఎరచూపి నన్ను నీవు వశపరచుకొనజాలవు.
న హ్యమిత్రే వశం యాన్తి ప్రాజ్ఞా నిష్కారణం సఖే. 192
బుద్ధి కుశలులు శత్రువు విషయమున నిష్కారణముగా వశముకారు.
అస్మి న్నర్థే చ గాథే ద్వే నిబోధోశనసా కృతే,
ఈ విషయమున మునుపు శుక్రుడు చెప్పిన రెండు గాథలు (శ్లోకములు) కలవు. ఎరుగుము.
శత్రు సాధారణే కృత్యే కృత్వా సంధిం బలీయసా,
సమాహిత శ్చరే ద్యుక్త్యా కృతార్థశ్చ న విశ్వసేత్. 193
బలవంతుడు శత్రువుతో సమానమగు కార్యమునందు సంధి చేసికొని ఉపాయముతో జాగరూకుడై మెలగవలయును. ప్రయోజనము పొందినవాడగుచు నమ్మి యుండరాదు.
న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్,
నిత్యం విశ్వాసయే దన్యాన్ పరేషాం తు న విశ్వసేత్. 194
నమ్మరాని వానియందు నమ్మకము నొందరాదు. నమ్మదగిన వాని యందును మేర మీరి నమ్మకముంచరాదు. ఇతరులయందు నమ్మకమును సాధింప వలయును. ఇతరులను మాత్రము నమ్మియుండరాదు.
తస్మా త్సర్వా స్వవస్థాసు రక్షే జీవిత మాత్మనః
ద్రవ్యాణి సంతతి శ్చైవ సర్వం భవతి జీవతః, 195
కనుక అన్ని దశలయందును తన జీవితమును రక్షించుకొనవలయును. ద్రవ్యములు, సంతానము సర్వము బ్రదికి యున్న వానికి ఏర్పడును.
సంక్షేపో నీతి శాస్త్రాణా మవిశ్వాసః పరో మతః,
నృషు తస్మా దవిశ్వాసః పుష్కలం హిత మాత్మనః. 196
అధికమైన అవిశ్వాసము నీతి శాస్త్రముల పరమసారము. కావున నరులయందు అవిశ్వాసము తనకు నిండైన హితము కూర్చునది.
వధ్యస్తే న హి విశ్వస్తాః శత్రుభి ర్దుర్బలా అపి.
విశ్వస్తా స్తేషు వధ్యన్తే బలవన్తోఽపి దుర్బలైః, 197
నమ్మకముంచిన దుర్బలులు కూడ పగవారి చేత వధింప బడరు. బలవంతులు నమ్మకముంచి దుర్బలులకు కూడ వధింపదగిన వారగుదురు.
త్వద్వి ధేభ్యో మయా హ్యాత్మా రక్ష్యో మార్జార సర్వదా.
రక్ష త్వమపి చాత్మానం చాణ్డాలా జ్జాతి కిల్బిషాత్, 198
నీ వంటి వారి వలన, పిల్లీ! నన్ను నేను ఎల్లప్పుడు కాపాడు కొనవలయును. జాతిచేత నే పాపములు చేయు చండాలుని వలన నీవును నిన్ను కాపాడుకొనుము.
సతస్య బ్రువత స్త్వేవం సంత్రాసా జ్ఞాత సాధ్వసః.
శాఖాం హిత్వా జవే నాశు మార్జారః ప్రయయౌ తతః, 199
అది యిట్లు పలుకుచుండగా మహాభయము వలన పుట్టినగుబులుగల పిల్లి కొమ్మను వదలి వేగముగా పారిపోయెను.
తతః శాస్త్రార్థ తత్వజ్ఞో బుద్ధి సామర్థ్య మాత్మనః.
విశ్రావ్య పలితః ప్రాజ్ఞో బిల మన్య జ్జగామ హ, 200
అంత శాస్త్రముల అర్థముల తత్త్వము నెరిగినది యగు పలితము తన బుద్ధి సామర్థ్యమును వినిపించి మరియొక బొరియకు చేరుకొనెను.
ఏవం ప్రజ్ఞావతా బుద్ధ్యా దుర్బలేన మహాబలాః.
ఏకేన బహవోఽమిత్రాః పలితే నాభిసంధితాః, 201
ప్రజ్ఞ కలదియగు పలితము బలము లేనిదియు ఒంటరియునయ్యు బుద్ధి బలముచేత పెక్కండ్రు గొప్పబలము గలవారిని వంచించినది.
అరిణాఽపి సమర్థేన సంధిం కుర్వీత పణ్డితః.
మూషికశ్చ బిడాలశ్చ ముక్తా వన్యోన్య సంశ్రయాత్, 202
పండితుడు సమర్థుడైన శత్రువుతో కూడ సంధి చేయదగును. ఎలుకయు పిల్లియు ఒకరినొకరు ఆశ్రయించి ఆపదనుండి విడుదల పొందిరి.
ఇత్యేవం క్షత్ర ధర్మశ్చ మయా మార్గేషు దర్శితః. 203
ఈ విధముగా క్షత్ర ధర్మమును నేను పలు త్రోవలతో నీకు ప్రదర్శించితిని.
విస్తరేణ మహారాజ సంక్షేప మపి మే శృణు,
మహారాజా! దీనిని చాల విస్తరించి చెప్పితిని. సంక్షేపముగా కూడ చెప్పెదను వినుము.
అన్యోన్య కృతవైరౌ తు చక్రతుః ప్రీతి ముత్తమామ్.
అన్యోన్య మభిసంధాతుం సంబభూవ తయో ర్మతిః, 204
ఒకటిపై నొకటి పగగొన్న ఆ రెండును (ఎలుక, పిల్లి) మిక్కిలి ప్రీతిని పొందినవి. కానీ ఒకదాని నొకటి వంచించుటకు వానికి బుద్ధి పుట్టినది.
తత్ర ప్రాజ్ఞోఽభి సంధత్తే సమ్యగ్ బుద్ధి సమాశ్రయాత్, 205
అభిసంధీయతే ప్రాజ్ఞః ప్రమాదా దపి వా బుధైః.
చక్కగా బుద్ధిశక్తిని ఆశ్రయించుటవలన ప్రజ్ఞ కలవాడు ఇతరుని వంచించును. ప్రజ్ఞ కలవాడు కూడ ప్రమాదము వలన తెలివి గల వారి వంచనకు లోబడుచుండును.
తస్మా దభీతవ ద్భీతో విశ్వస్త వ దవిశ్వసన్.
న హ్యప్రమత్త శ్చలతి చలితో వా వినశ్యతి, 206
అందువలన భయపడియు భయపడనివానివలెను, నమ్మకుండియు నమ్మినవానివలెను ఉండువాడు పొరపాటుపడక స్థిరముగా నుండును. ఊగులాడు వాడైనచో నశించిపోవును.
కాలేన రిపుణా సన్ధిః కాలే మిత్రేణ విగ్రహః,
కార్య ఇత్యేవ సంధిజ్ఞాః ప్రాహు ర్నిత్యం నరాధిప. 207
రాజా! సంధితత్త్యము నెరిగినవారు కాలము ననుసరించి శత్రువుతో సంధిని, మిత్రునితో వైరమును చేయవలయునని నొక్కి చెప్పుదురు.
ఏతజ్జ్ఞాత్వా మహారాజ శాస్త్రార్థ మభిగమ్య చ,
అభియుక్తః ప్రసన్నశ్చ ప్రాగ్భయాద్ భీతవచ్చరేత్. 208
మహారాజా! ఇది ఎరిగి రాజు శాస్త్రతత్వమును చక్కగా పొంది సంపదను పొందగోరుచు ప్రసన్నుడై భయము కలుగకముందే భయము కలవానివలె ప్రవర్తింపవలయును.
భీతవత్సన్నిధిః కార్యః ప్రతిసంధి స్తథైవ చ.
భయా దుత్పద్యతే బుద్ధి రప్రమత్తాభియోగతః, 209
భయము కలవాని వలె బుద్ధిని సిద్ధము చేసికొనవలయును. అట్లే ఇతరులతో కలయికను కూడ పొందవలయును. పొరపాటు లేని మెలకువవలన కలిగెడు భయమువలన ఆపదలు తొలగించుకొను బుద్ధి ఏర్పడును.
న భయం విద్యతే రాజన్ భీత స్యానాగతే భయే.
అభీతస్య చ విశ్రంభాత్ సుమహ జ్జాయతే భయమ్, 210
రాజా! భయము రాకముందే భయపడువానికి ఎన్నడును భయము కలుగదు. ఏమగునులే అని ఏమరి భయములేకుండ ప్రవర్తించువానికి పెను భయము ఉప్పతిల్లును.
అభీ శ్చరతి యో నిత్యం మన్త్రో దేయః కథంచన. 211
అవిజ్ఞానాద్ధి విజ్ఞాతో గచ్ఛే దాస్పద దర్శిషు,
తస్మా దభీతవద్భీతో విశ్వస్తో బహు విశ్వసన్, 212
కార్యాణాం గురుతాం ప్రాప్య నానృతం కిఞ్చి దాచరేత్.
కనుక భీతుడయ్యును భయపడని వానివలె, నమ్మనివాడయ్యు నమ్ముచున్న వానివలె ప్రవర్తించువాడు పనుల భారమును పొందినపుడు కాని దాని నేమాత్రము నాచరింపడు.
ఏవ మేతన్మయా ప్రోక్త మితిహాసం యుధిష్ఠిర,
శ్రుత్వా త్వం సుహృదాం మధ్యే యథావ త్సముపాచర. 213
యుధిష్ఠిరా! నీ కీవిధముగా ఈ ఇతిహాసము నుపదేశించితిని. నీవు దానిని చక్కగా విని మిత్రముల నడుమ తగువిధముగా ఆచరింపుము.
ఉపలభ్య మతిం చాగ్ర్యా మరిమిత్రాన్తరం తథా. 214
సంధి విగ్రహ కాలే చ మోక్షో పాయ స్తథైవ చ,
శత్రు సాధారణే కృత్యే కృత్వా సంధిం బలీయసా. 215
సమాగమే చరే ద్యుక్త్యా కృతార్థో న చ విశ్వసేత్.
మిక్కిలి పదునైన బుద్ధిని సాధించి శత్రు మిత్రముల భేదములను గుర్తించి, సంధి విగ్రహముల కాలమును, ప్రమాదము నుండి బయట పడు ఉపాయమును తెలిసికొని శత్రువునకు సాధారణమగు పనియందు బలవంతునితో సంధిచేసికొని, కలిసిన పిదప ఉపాయముతో మెలగవలయును. ప్రయోజనము పొందినంత మాత్రమున నమ్మియుండరాదు.
అవిరుద్ధాం త్రివర్గేణ నీతి మేతాం మహీపతే, 216
అభ్యుత్తి ష్ఠ శ్రుతా దస్మా ద్భూయః సంరక్షయన్ ప్రజౌః.
ధర్మము, అర్థము, కామము అనువానికి విరుద్ధముకాని ఈ నీతిని మావలన విని మేలుగా ప్రజలను కాపాడుచు వృద్ధి పొందుము.
బ్రాహ్మణై శ్చాపి తే సార్థం యాత్రా భవతు పాణ్డవ,
బ్రాహ్మణా వై పరం శ్రేయో దివి చేహ చ భారత. 217
నాయనా! పాండు కుమారా! బ్రహ్మజ్ఞాన సంపన్నులతో కూడి నీ యాత్ర సాగుగాక! వారే ఇక్కడను, పరమునందును మిక్కిలి మేలు కూర్చువారు.
ఏతే ధర్మస్య వేత్తారః కృతజ్ఞః సతతం ప్రభో,
పూజితాః శుభకర్తారః పూజయే త్తాన్న రాధిప. 218
ప్రభూ! వీరు ధర్మము చక్కగా నెరిగినవారు. ఎల్లప్పుడు కృతజ్ఞులు. మన్నన పొంది శుభమును కూర్చు వారు కనుక, రాజా! వారిని పూజింపుము.
రాజ్యం శ్రేయః పరం రాజన్ యశః కీర్తించ లప్స్య సే, 219
కులస్య సన్తతిం చైవ యథా న్యాయం యథాక్రమమ్. 220
మిక్కిలి మేలు కూర్చు గొప్ప రాజ్యమును, న్యాయమును కీర్తిని కులము చక్కగా సాగుటను, న్యాయము ననుసరించి పొందెదవు. (అన్ని దిక్కులకు వ్యాపించుట యశస్సు లక్షణము, అందరు కొని యాడుట కీర్తి లక్షణము) కులము యొక్క సంతతి యనగా కులము అవిచ్ఛిన్నముగా సాగుట).
ద్వయో రిమం భారత సంధి విగ్రహం
సుభాషితం బుద్ధి విశేష కారకమ్,
యథా త్వవేక్ష్య క్షితిపేన సర్వదా
నిషేవితవ్యం నృప శత్రు మణ్డలే. 221
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
మార్జారమూషిక సంవాదే అష్ట త్రింశదధిక శతతమోఽధ్యాయః
రాజా! బుద్ధి విశేషమును గలిగించునది యగు ఈ సంధి విగ్రహముల రెంటి స్థితిని నీకు చక్కగా పలికితిని. రాజు ఎల్లవేళల దీనిని మెలకువతో పరిశీలించి శత్రువుల సముదాయమున ప్రయోగింపవలయును.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున మార్జారమూషిక సంవాదము గల నూట ముప్పది యెనిమిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను :-
ఉక్తో మన్త్రో మహాబాహో విశ్వాసో నాస్తి శత్రుషు,
కథం హి రాజా వర్తేత యది సర్వత్ర నాశ్వసేత్. 1
మహాబాహూ! విశ్వాసము పగవారియందు ఉంచరాదని మంత్రమును చెప్పితివి. ఎందును నమ్మకము లేనిచో రాజు మెలగుట యెట్లు?
విశ్వాసాద్ధి పరం రాజన్ రాజ్ఞా ముత్పద్యతే భయమ్,
కథం హి నాశ్వసన్ రాజా శత్రూన్ జయతి పార్థివః. 2
రాజా! విశ్వాసమువలన రాజులకు పెనుభయము కలుగును. మఱి విశ్వసింపక రాజు శత్రువుల నెట్లు గెలుచును?
ఏతన్మే సంశయం ఛిన్ధి మతి ర్మే సంప్రముహ్యతి,
అవిశ్వాసకథా మేతా ముపశ్రుత్య పితామహ. 3
తాతా! నాయీ సంశయమును తీర్పుము. ఈ అవిశ్వాసమను మాట విన్న నా బుద్ధి కళవళపడుచున్నది.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
శృణుష్వ రాజన్ యద్వృత్తం బ్రహ్మదత్తనివేశనే,
పూజన్యా సహ సంవాదం బ్రహ్మదత్తస్య భూపతేః. 4
రాజా! బ్రహ్మదత్తుని గృహమున జరిగిన వృత్తాంతమును వినుము. బ్రహ్మదత్తుడను రాజునకు పూజనితో జరిగిన సంవాద మిది.
కాంపిల్యే బ్రహ్మదత్తస్య త్వన్తఃపురనివాసినీ,
పూజనీ నామ శకుని ర్దీర్ఘకాలం సహోషితా. 5
కాంపిల్య నగరమున బ్రహ్మదత్తుని అంతఃపురమున నివసించుచు పూజని యను పక్షి బహుకాలము కలిసియుండెను.
రుతజ్ఞా సర్వభూతానాం యథా వై జీవజీవకః,
సర్వజ్ఞా సర్వతత్త్వజ్ఞా తిర్యగ్యోనిం గతాఽపి సా. 6
అది అన్ని ప్రాణుల పలుకులను ఎఱుగునది. శకునములను చెప్పువాని వంటిది. పక్షియోని యందు పుట్టియున్నను, అన్నింటిని అన్నితత్త్యములను ఎఱిగియున్నది.
అభిప్రజాతా సా తత్ర పుత్ర మేకం సువర్చసమ్,
సమకాలం చ రాజ్ఞోఽపి దేవ్యాం పుత్రో వ్యజాయత. 7
ఆపిచ్చుక మంచి తేజస్సుగల ఒక బిడ్డను కనెను. అదేసమయమున రాజునకు దేవియందు పుత్రుడు కలిగెను.
తయో రర్థం కృతజ్ఞా సా ఖేచరీ పూజనీ సదా,
సముద్రతీరం సాగత్వా ఆజహార ఫలద్వయమ్. 8
గగనమున తిరుగునది యగు ఆ పిచ్చుక కృతజ్ఞురాలై వారిరువురి కొరకు సముద్రపు ఒడ్డున కరిగి రెండు పండ్లను కొనితెచ్చెను.
పుష్ట్యర్థం చ స్వపుత్రస్య రాజపుత్రస్య చైవ హ,
ఫల మేకం సుతాయాదాద్రాజపుత్రస్య చాపరమ్. 9
తనబిడ్డయు, రాజకుమారుడును పుష్టి పొందుటకై ఆ రెండు పండ్లను తెచ్చి ఒకటి తనపిల్లకు, మఱియొకటి రాజకుమారునకు నిచ్చెను.
అమృతాస్వాదసదృశం బలతేజోఽభివర్ధనమ్,
ఆదాయాదాయ సైవాశు తయోః ప్రాదాత్పునః పునః, 10
అమృతపురుచికి సాటియైనదియు, బలమును తేజమును పెంపొందించునదియునగు ఆ పండ్ల జంటను మరలమరల తెచ్చి తెచ్చి ఆపిచ్చుక వారి కిచ్చుచుండెను.
తతోఽగచ్ఛ త్పరాం వృద్ధిం రాజపుత్రః ఫలాశనాత్
రాజపుత్రుడు ఆ పండు తినుటవలన ఎక్కువగా వృద్ధిపొందెను.
తతః స ధాత్ర్యా కక్షేణ ఉహ్యమానో నృపాత్మజః. 11
దదర్శ తం పక్షిసుతం బాల్యాదాగత్యబాలకః,
తతో బాల్యాచ్చ యత్నేన తేనాక్రీడత పక్షిణా. 12
అంత రాచబిడ్డ దాదిచంకలో నెక్కి తిరుగుచు ఆ పక్షిపిల్లను చూచెను. పసితనము వలన ఆ బాలకుడు ఎంతో ముచ్చటపడి దానితో ఆడుకొనుచుండెను.
శూన్యే చ త ముపాదాయ పక్షిణం సమజాతకమ్,
హత్వా తతః స రాజేన్ద్ర ధాత్ర్యా హస్త ముపాగతః. 13
తనయీడు పక్షిపిల్లను ఆబాలకుడు ఒకనాడు ఎవరులేనిచోటునకు కొనిపోయి చంపివైచి దాదిచంక ఎక్కెను.
అథ సా పూజనీ రాజ న్నాగమత్ఫలహారిణీ,
అపశ్య న్నిహతం పుత్రం తేన బాలేన భూతలే. 14
అంత పండ్లు తెచ్చుచున్న పూజని తిరిగి వచ్చెను. ఆబాలుడు చంపగా నేలపై పడియున్న బిడ్డను చూచెను.
బాష్ప పూర్ణముఖీ దీనా దృష్ట్వా తం రుదతీ సుతమ్,
పూజనీ దుఃఖ సంతప్తా రుదతీ వాక్య మబ్రవీత్. 15
ఆ పిల్లను చూచి కన్నులు నీటితో నిండిన ఆదీనురాలు దుఃఖముతో కుమిలిపోవుచు ఇట్లు పలికెను.
క్షత్రియే సంగతం నాస్తి న ప్రీతి ర్న చ సౌహృదమ్,
కారణాత్ సాన్త్వయన్త్యేతే కృతార్థాః సంత్యజన్తి చ. 16
క్షత్రియుని యందు స్నేహము లేదు. ప్రీతిలేదు. మంచి మనసు లేదు. వీరు కారణమును బట్టి లాలింతురు. పనితీర్చుకొని వదలి వైచెదరు.
క్షత్రియేషు న విశ్వాసః కార్యః సర్వాపకారిషు,
అపకృత్యాపి సతతం సాన్వయన్తి నిరర్థకమ్. 17
అన్నివిధముల కీడుచేయు స్వభావముగల క్షత్రియులయందు విశ్వాసము పొందరాదు. వారు అపకారము చేసికూడ పనికిమాలినవిధముగా మంచిమాట లాడుదురు.
అహ మద్య కరోమ్యద్య సదృశీం వైరయాతనామ్,
కృతఘ్నస్య నృశంసస్య భృశం విశ్వాసఘాతినః. 18
కృతఘ్నుడు, క్రూరుడు, మీదుమిక్కిలి నమ్మకమును నాశనము చేసినవాడునగు వీనికి వాని చేష్టకు తగిన యాతనను నేడు చేయుదును.
సహ సంజాత వృద్ధస్య తథైవ సహభోజినః,
శరణాగతస్య చ వధ స్త్రివిధం హ్యేవ పాతకమ్. 19
కలిసి పుట్టి పెరిగినవాడు, కలిసి తినుచున్నవాడు, శరణుకోరివచ్చినవాడు అనువారిని వధించుట మూడు విధములైన పాతకము.
ఇత్యుక్త్యా చరణాభ్యాం తు నేత్రే నృపసుతస్య సా,
భిత్త్వా స్వస్థా తత ఇదం పూజనీ వాక్య మబ్రవీత్. 20
అని పలికి పూజని కాళ్లతో ఆ రాచబిడ్డ కనులను పొడిచి ఉద్వేగము తీర్చుకొని యిట్లు పలికెను.
ఇచ్ఛ యేహ కృతం పాపం సద్యస్తం చోపసర్పతి,
కృతం ప్రతికృతం యేషాం న నశ్యతి శుభాశుభమ్. 21
బుద్ధిపూర్వకముగా చేసిన పాపము వెనువెంటనే చేసిన వానిని చుట్టుకొనును. అపకారము చేసినవారి శుభ, అశుభ కర్మము చేసిన దానికి విరుద్ధముగా నశింపదు.
పాపం కర్మ కృతం కిఞ్చి ద్యది తస్మి న్నదృశ్యతే,
నృపతే తస్య పుత్రేషు పౌత్రేష్వపి చ నప్తృషు. 22
చేసిన పాపకర్మము కొంచెమైనను వానియందు ఫలమును చూపదేని, రాజా! అతని కొడుకులయందో, మనుమలయందో, మునిమనుమలయందో ఆఫలము కానవచ్చును.
బ్రహ్మదత్తః సుతం దృష్ట్వా పూజన్యాహృతలోచనమ్,
కృతే ప్రతికృతం మత్వా పూజనీ మిద మబ్రవీత్. 23
బ్రహ్మదత్తుడు, పూజని పొడిచివైచిన కన్నులు గల కొడుకును చూచి చేసినదానికి సరియైన ప్రతిక్రియ అని తలచి పూజనితో ఇట్లనెను.
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డిట్లు పలికెను.
అస్తి వై కృత మస్మాభి రస్తి ప్రతికృతం త్వయా,
ఉభయం తత్సమీభూతం వస పూజని మాగమః. 24
పూజనీ! మేము చేసిన పాపముకలదు. నీవుదానికి చేసిన ప్రతిక్రియయు కలదు. దానికి దానికి సరిపోయినది. నీవు మాయింటనే ఉండుము. వెళ్లకుము.
పూజ న్యువాచ - పూజని యిట్లనెను.
సకృత్కృతాపరాధస్య తత్రైవ పరిలమ్బతః,
న తద్బుధాః ప్రశంసన్తి శ్రేయ స్తత్రాపసర్పణమ్. 25
ఒకమారు ఒకనికి ద్రోహముచేసి అచటనే పట్టి వ్రేలాడు వానిని పండితులు మేలనరు. ఆటనుండి తొలగి పోవుటయే మంచిది.
సాన్త్వే ప్రయుక్తే సతతం కృతవైరే న విశ్వసేత్,
క్షిప్రం స బధ్యతే మూఢో నహి వైరం ప్రశామ్యతి. 26
అపకారము చేసిన వాని విషయమున ఎన్ని మంచి మాటలాడినను నమ్మియుండరాదు. ఆ మూఢుడు వెనువెంటనే పట్టువడును. పగ అణగదు.
అన్యోన్యకృతవైరాణాం పుత్రపౌత్రం నియచ్ఛతి,
పుత్రపౌత్రవినాశే చ పరలోకం నియచ్ఛతి. 27
ఒకరికొకరు అపకారము చేసికొన్నవారి కొడుకులు, మనుమలు కూడ నశించిపోవుదురు. పుత్రులు పౌత్రులు నశింపగా పరలోకము నాశనమగును.
సర్వేషాం కృతవైరాణా మవిశ్వాసః సుఖోదయః,
ఏకాన్తతో నవిశ్వాసః కార్యో విశ్వాసఘాతకైః. 28
అపకారము చేసినవారి అందరికిని నమ్మకము లేకుండుటయే సుఖము కలిగించునది. నమ్మకమునాశనముచేసినవారితో ఒకే రూపమగు విశ్వాసమును చేయనేరాదు.
న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్,
విశ్వాసా ద్భయముత్పన్న మపి మూలం నికృన్తతి.
విశ్వాసములేనివానియందు విశ్వాసము ఉంచుకొనరాదు. నమ్మదగినవానియందు కూడ మేరమీరి నమ్మకముంచరాదు. నమ్మకమువలన పుట్టిన భయము మూలమునే తెగగోయును.
కామం విశ్వాసయే దన్యాన్ పరేషాం నచ విశ్వసేత్. 29
ఇతరులను గట్టిగా నమ్మింపవలయును. ఇతరులను తాను నమ్మి యుండరాదు.
మాతా పితా బాన్ధవానాం వరిష్ఠా
భార్యా జరా బీజమాత్రం తు పుత్రః,
భ్రాతా శత్రుః క్లిన్నపాణి ర్వయస్య
ఆత్మా హ్యేకః సుఖ దుఃఖస్య భోక్తా. 30
తల్లియు తండ్రియు బంధువులలో అందరికంటే మిన్నవారు. అంతమాత్రమే. భార్యయే ముదిమి. కొడుకు విత్తనము మాత్రమే. సోదరుడు శత్రువు. చెలిమికాడు తడి చేతులవాడు. తన సుఖదుఃఖములను అనుభవించునది తాను ఒక్కడు మాత్రమే.
అన్యోన్యకృతవైరాణాం న సంధి రుపపద్యతే,
స చ హేతు రతిక్రాన్తో యదర్థ మహ మావసన్. 31
ఒకరికొకరు కీడు చేసికొన్నవారికి చెలిమి కుదరదు. మనయిరువురకు నేనిచట ఎందుకు ఉండవలయునో ఆహేతువు చెల్లిపోయినది.
పూజిత స్యార్థ మానాభ్యాం జన్తోః పూర్వాపకారిణః,
మనో భవత్యవిశ్వస్తం కర్మ త్రాసయతేఽబలాన్. 32
మునుపు అపకారము పొందిన జీవి పిదప సొమ్ములతో, మన్ననలతో గౌరవము పొందినప్పటికిని వాని మనస్సు నమ్మకములేనిదే యగును. వానిచేష్ట బలములేనివారిని వణకించి వేయును.
పూర్వం సంమాననా యత్ర పశ్చాచ్చైవ విమాననా,
జహ్యా త్తత్సత్త్వవాన్ స్థానం శత్రోః సమ్మానితోఽపి సన్. 33
మొదట సమ్మానము పిదప అవమానము పొందినవాడు సమర్థుడైనచో, శత్రువు తన్ను మన్నించుచున్నను ఆతావును వదలిపోవలయును.
ఉషితాస్మి తవాగారే దీర్ఘకాలం సమర్చితా,
తదిదం వైరముత్పన్నం సుఖ మాశు వ్రజామ్యహమ్. 34
నీయింట పెనుకాలము మన్ననగొనుచు నివసించితిని. ఇదిగో ఇప్పుడు పగ ఏర్పడినది. వెంటనే సుఖముగా వెడలిపోయెదను
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డిట్లనెను.
యఃకృతే ప్రతికుర్యాద్వై న స తత్రాపరాధ్నుయాత్,
అనృణ స్తేన భవతి వస పూజని మాగమః. 35
పూజని! కృతికి ప్రతికృతిచేసినవాడు దోషి కాడు. అందుచేత అప్పుతీరి పోయినది. ఉండు, వెళ్లకు.
పూజన్యువాచ - పూజని యిట్లనెను.
న కృతస్య తు కర్తుశ్చ సఖ్యం సంధీయతే పునః,
హృదయం తత్ర జానాతి కర్తు శ్చైవ కృతస్య చ. 36
అపకారము చేసినవానికి, చేయబడిన వానికి చెలిమి మరల అతుకుకొనదు.ఆయిరువురి హృదయము ఆ అపకారమును నిత్యము స్మరించుచునే యుండును.
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డనెను.
కృతస్య చైవ కర్తుశ్చ సఖ్యం సంధీయతే పునః,
వైరస్యోపశమో దృష్టః పాపం నోపాశ్నుతే పునః. 37
అపకారము పొందిన వానికిని, చేసినవానికిని మరల చెలిమి కలుగును. పగ అడగుట లోకమున కానవచ్చుచున్నది. కనుక అపకారము చేసినవాడు పాపమును పొందడు.
పూజన్యువాచ - పూజని పలికెను.
నాస్తి వైర మతిక్రాప్తం సాన్త్వితోఽస్మీతి నాశ్వసేత్,
విశ్వాసాద్ బద్ధ్యతే లోకే తస్మాచ్ఛ్రేయోఽప్యదర్శనమ్. 38
పగ దాటిపోయినదనుటకు లేదు. అపకారము చేసినవాడు అనునయించెనని ఊరట పొందరాదు. లోకమున విశ్వాసమువలన మానవుడు బంధింపబడును. కావున అపకారము చేసినవానికి మొగము చూపకుండుటయే మేలు.
తరసా యే న శక్యన్తే శస్త్రైః సునిశితై రపి,
సామ్నా తేఽపి నిగృహ్యన్తే గజా ఇవ కరేణుభిః. 39
మిక్కిలి వాడిగల ఆయుధములతో వడిగా అంకెకురాని వ్యక్తులు, మగ ఏనుగులు ఆడ ఏనుగులతో వలె, సామమార్గమున కట్టువడుదురు.
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డిట్లనెను.
సంవాసా జ్జాయతే స్నేహో జీవితాంతకరేష్వపి,
అన్యోన్యస్య చ విశ్వాసః శ్వపచేన శునో యథా. 40
బ్రదుకు నాశనము చేయువారి విషయమునందును కలసియుండుటవలన చెలిమికలుగుచున్నది. ఒకరియెడ నొకరికి నమ్మకము కూడ ఏర్పడుచున్నది. కుక్కకు కుక్కమాంసము తినువానితో చెలిమి, నమ్మకము కలుగుచున్నది కదా!
అన్యోన్యకృతవైరాణాం సంవాసా న్మృదుతాం గతమ్,
నైవ తిష్ఠతి తద్వైరం పుష్కరస్థ మివోదకమ్. 41
ఒకరి కొకరుకీడుచేసికొన్నవారికిని సహవాసమువలన మెత్తదనముపొందిన పగ, తామరాకు నందలి నీటిబొట్టువలె, కలకాలము నిలువదు.
పూజ న్యువాచ - పూజని అనెను.
వైరం పఞ్చసముత్థానం తచ్చ బుధ్యన్తి పణ్డితాః,
స్త్రీకృతం వాస్తుజం వాగ్జం ససాపత్నాపరాధజమ్. 42
పగ అయిదువిధములుగా పుట్టుకొని వచ్చునని పండితులు ఎరుగుదురు. స్త్రీకృతము, వాస్తుకృతము, వాక్కులతో ఏర్పడినది, సహజవైరము, అపరాధము వలన కలిగెడిది - అని ఆ అయిదు విధములు.
తత్ర దాతా నహన్తవ్యః క్షత్రియేణ విశేషతః,
ప్రకాశం వాఽప్రకాశంవా బుద్ధ్వా దోషబలాబలమ్. 43
విశేషించి క్షత్రియుడు దాతను దోషమునందలి బలాబలములను చక్కగా తెలిసికొని ప్రకాశముగనో, చాటుగనో చంపరాదు.
కృతవైరే న విశ్వాసః కార్యస్త్విహ సుహృద్యపి,
ఛన్నం సంతిష్ఠతే వైరం గూఢోఽగ్ని రివ దారుషు. 44
పగగొన్న మిత్రునియందును విశ్వాసము పెట్టుకొనరాదు. కట్టెలయందు కానరాకుండ అగ్నియున్నట్లు పగ పైకి కానరాకుండ నిలిచియే యుండును.
న విత్తేన న పారుష్యై ర్న చ సాన్త్వేన వాశ్రితైః,
కోపాగ్నిః శామ్యతే రాజం స్తోయాగ్ని రివ సాగరే. 45
ధనముతో గాని, కఠినపద్ధతులతో గాని, అనునయముతో గాని, ఆశ్రితులతో గానీ, రాజా! కోపము చల్లారదు. సముద్రమున బడబాగ్నివలె అది నిలిచియే యుండును.
న హి వైరాగ్ని రుద్భూతః కర్మ చాప్యరాధజమ్,
శామ్య త్యదగ్ధ్వా నృపతే వినా హ్యేకతరక్షయాత్. 46
పుట్టిన పగ అనెడు అగ్ని కాల్చివేయక ఆరిపోదు. అపరాధమువలన పుట్టిన కర్మము ఇరువురిలో ఒకనినాశనము లేకుండగను అణగిపోవును.
సత్కృతస్యార్థమానాభ్యా మనుపూర్వాపకారిణః,
నాదేయోఽమిత్రవిశ్వాసః కర్మత్రాసయతేఽబలావ్. 47
ధనగౌరవములచేత మన్నింపబడినవాడు, పూర్వము అపకారము చేసినవాడు అగు వ్యక్తిని గూర్చి శత్రువన్న నమ్మకమును కలుగనీరాదు. ఆపని బలహీనులను భయపెట్టును.
నైవాపకార్యే కస్మింశ్చిదహం త్వయి తథా భవాన్,
ఉషితాఽస్మి గృహేఽహం తే నేదానీం విశ్వసామ్యహమ్. 48
మనమిరువురము ఒకరికొకరు కీడు చేసికొనక పూర్వము నేను నీయందు నీవు నాయందును విశ్వాసము కల్గియుండుటవలన నేను నీయింటియందు నివసించితిని. ఇప్పుడు నిన్నట్లు విశ్వసింపను.
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డనెను.
కాలేన క్రియతే కార్యం తథైవ వివిధాః క్రియాః,
కాలేనైతే ప్రవర్తన్తే కః కస్యేహాపరాధ్యతి. 49
కాలమే అన్నిపనులను చేయుచుండును. అట్లే వేర్వేరు పనులు కాలముతోడనే నడచుచున్నవి. ఇక ఒక డొకనికి కీడుచేయుట యెట్లు సంభవించును?
తుల్యం చోభే ప్రవర్తేతే మరణం జన్మ చైవ హ,
కార్యతే చైవ కాలేన తన్నిమిత్తం న జీవతి. 50
చావుపుట్టుకలు రెండును సమానముగా సంభవించుచుండును. కాలముచేతనే జీవుడు ఏర్పడుచున్నాడు. కాలము కారణముగనే మరల మరణించుచున్నాడు.
బధ్యన్తే యుగపత్కేచి దేకైకస్య నచాపరే,
కాలో దహతి భూతాని సంప్రాప్యాగ్ని రివేన్ధనమ్. 51
కొందఱు ఒక్కుమ్మడిగా చచ్చుచున్నారు. ఒకని చావున కొకరు కారణము కారు. భూతము లన్నింటిని అగ్ని కట్టగానైన కట్టెలను కాల్చినవిధముగా కాలము సర్వభూతములను కాల్చివేయును.
నాహం ప్రమాణం నైవ త్వ మన్యోన్యం కారణం శుభే,
కాలో నిత్య ముపాదత్తే సుఖం దుఃఖం చ దేహినామ్. 52
మంచిదానా! నేనుగాని, నీవుగాని ఒకరికొకరికి ప్రమాణము, కారణము కాము. దేహధారులకు సుఖమునో, దుఃఖమునో కాలమే ఎల్లప్పుడు కూర్చుచుండును.
ఏవం వసేహ సస్నేహా యథాకామ మహింసితా,
యత్కృతం తత్తు మే క్షాన్తం త్వం చ వై క్షమ పూజని. 53
కనుక నీవు మునుపటి స్నేహములో ఇచ్చవచ్చినట్లు, ఏ హింసను బొందక ఇందే నివసింపుము. జరిగిన దానిని క్షమించితిని. నీవును అట్లే క్షమింపుము.
పూజ న్యువాచ - పూజని యిట్లనెను.
యది కాలః ప్రమాణం తే న వైరం కస్యచి ద్భవేత్,
కస్మాత్యపచితిం యాన్తి బాంధవా బాంధవై ర్హతైః. 54
నీకు కాలమే ప్రమాణమైనచో ఎవ్వనికిని పగయే కలుగరాదు. అట్లయినచో బందుగులను పోగొట్టుకొన్నబంధువులు ఏల నష్టమును పొందుచున్నారు?
కస్మా ద్దేవాసురాః పూర్వ మన్యోన్య మభిజఘ్నిరే,
యది కాలేన నిర్యాణం సుఖం దుఃఖం భవాభవౌ. 55
కాలముచేతనే చావు,సుఖము, దుఃఖము, పుట్టుక అనునవి కలుగునేని దేవతలు, దానవులు ఒకరినొకరు ఏల చంపుకొనిరి?
భిషజో భైషజం కర్తుం కస్మా దిచ్ఛన్తి రోగిణః,
యది కాలేన పచ్యన్తే భైషజైః కిం ప్రయోజనమ్?. 56
వైద్యులు వైద్యము చేయవలయునని రోగులు ఏల కోరుదురు? కాలమే వారిని పక్వము చేయుచుండగా చికిత్సతో ప్రయోజనమేమి?
ప్రలాపః సుమహాన్ కస్మాత్ క్రియతే శోకమూర్ఛితైః
యది కాలః ప్రమాణం కస్మాద్ధర్మోఽస్తి కర్తృషు. 57
శోకముతో విలవిల తన్నుకొనుచు కొందరు ఏల తెగవాగుచున్నారు? కాలమే అంతటికిని ప్రమాణమైనచో ఇక కర్తలయందు ధర్మమునకు తావెక్కడిది?
తవ పుత్రో మమాపత్యం హతవాన్ స హతో మయా,
అనన్తరం త్వయాఽహం చ హన్తవ్యా హి నరాధిప. 58
రాజా! నీకొడుకు నాబిడ్డను చంపెను. అతనిని నేను కొట్టితిని. పిదప నీవు నన్ను చంపవలయును. అంతేకదా!
అహం హి పుత్రశోకేన కృతపాపా తవాత్మజే,
యథా త్వయా ప్రహర్తవ్యం తథా తత్త్వంచ మే శృణు. 59
నేను పుత్రశోకముచేత నీకొడుకునందు పాపము చేసిన దానను. నీవు నన్నెట్లు కొట్టవలయునో దాని తత్త్వమును చెప్పెదను వినుము.
భక్షార్థం క్రీడనార్థంచ నరా వాఞ్ఛన్తి పక్షిణః,
తృతీయో నాస్తి సంయోగో వధబంధాదృతే క్షమః 60
తినుటకో,ఆడుకొనుటకో నరులు పక్షులను కోరుదురు. చంపుట, పంజరమున నిలుపుట అనునవి కాక తగిన మూడవ సంయోగము లేదు.
వధబన్ధభయా దేతే మోక్షతన్త్ర ముపాశ్రితాః,
మరణోత్పాతజం దుఃఖం ప్రాహు ర్వేదవిదో జనాః. 61
చావు, బంధము అనువానిభయమువలన ఈ పక్షులును విముక్తితంత్రమునే ఆశ్రయించుచుండును. వేదములనెరిగిన జనులు మరణము, ఉత్పాతము (పెనుకీడు) అను వానివలన పుట్టు దానినే దుఃఖమని అభివర్ణింతురు.
సర్వస్య దయితాః ప్రాణాః సర్వస్య దయితాః సుతాః,
దుఃఖా దుద్విజతే సర్వః సర్వస్య సుఖ మిప్సితమ్. 62
ఎల్లవారికి ప్రాణములు మిక్కిలి ప్రియమైనవి. బిడ్డలు మిక్కిలి ప్రియమైనవారు. ఎల్లవాడును దుఃఖము వలన ఉద్వేగముపొందును. ప్రతివ్యక్తియు పొందగోరునది సుఖమే.
దుఃఖం జరా బ్రహ్మదత్త దుఃఖ మర్థ విపర్యయః,
దుఃఖం చానిష్ట సంవాసో దుఃఖ మిష్టవియోజనమ్. 63
బ్రహ్మదత్తా! ముసలితనము దుఃఖము, ధనము ఎగుడు దిగుడులగుట దుఃఖము. అనిష్టులతో కలిసి నివసించుట దుఃఖము. ఇష్టులతో ఎడబాటు కలుగుట దుఃఖము.
వధబన్ధకృతం దుఃఖం స్త్రీకృతం సహజం తథా,
దుఃఖం సుతేన సతతం జనా న్విపరివర్తతే. 64
చంపుట, బంధించుట అనువానివలన కలిగెడు దుఃఖము, స్త్రీలవలన కలిగెడు దుఃఖము, సహజ దుఃఖము సుతుడు కారణముగా ఏర్పడెడు దుఃఖము జనులను మార్చివైచును.
న దుఃఖం పరదుఃఖే వై కేచి దాహు రబుద్ధయః,
యో దుఃఖం నాభిజానాతి స జల్పతి మహాజనే. 65
బుద్ధిలేనివారు కొందరు పరుడు దుఃఖము పొందగా అది ఇతరునకు దుఃఖము కాదని పలుకుచుందురు. దుఃఖమునుగూర్చి చక్కగా ఎరుగనివాడు మహాజనుల విషయమున నిట్లు వాగుచుండును.
యస్తు శోచతి దుఃఖార్తః సకథం వక్తు ముత్సహేత్,
రసజ్ఞః సర్వదుఃఖస్య యథాత్మని తథాఽ పరే. 66
దుఃఖమును పొంది విలపించువాడు పలుకుట కెట్లు ఉత్సహించును? అన్నిదుఃఖముల సారమెరిగినవాడు తన విషయమున నెట్లో పరుని విషయమునందును అట్లే ప్రవర్తించును.
యత్కృతం తే మయా రాజం స్త్వయా చ మమ యత్కృతమ్,
న తద్వర్షశతైః శక్యం వ్యపోహితు మరిందమ. 67
శత్రుమర్దనుడా! నేను నీకు, నీవు నాకు చేసినదానిని వందల యేండ్లకైనను తొలగించుటకు సాధ్యము కాదు.
ఆవయోః కృత మన్యోన్యం పునస్సంధి ర్న విద్యతే,
స్మృత్వా స్మృత్వా హి తే పుత్రం నవం వైరం భవిష్యతి. 68
మనలో మనకు మైత్రి ఇక చాలును. తిరిగి సంధి కలుగదు. నీకొడుకును తలచినప్పుడెల్ల పగ క్రొత్తక్రొత్తగా రూపొందుచుండును.
వైర మన్తిక మాసాద్య యః ప్రీతిం కర్తు మిచ్ఛతి,
మృన్మయస్యేవ భగ్నస్య యథా సన్ధి ర్న విద్యతే. 69
పొంచిఉన్నపగను పెట్టుకొని ప్రీతిని ఎవ్వడు పొందును? పగిలిన మట్టి పాత్రకువలె మరల కూర్పు కలుగదు.
నిశ్చయః స్వార్థశాస్త్రేషు విశ్వాస శ్చాసుఖోదయః,
ఉశనా చైవగాథే ద్వే ప్రహ్లాదాయాబ్రవీ త్పురా. 70
స్వార్థ శాస్త్రములయందు విశ్వాసము సుఖమును పుట్టించునది కాదనుట నిశ్చయము. శుక్రాచార్యుడు ఈ విషయమున ప్రహ్లాదునకు రెండు గాథలు మునుపు పలికెను.
యే వైరిణః శ్రద్దధతే సత్యే సత్యేతరేఽపివా,
బధ్యస్తే శ్రద్దధానాస్తు మధు శుష్కతృణై ర్యథా. 71
అది సత్యమో, అసత్యమో - శత్రుని అట్టివాక్యమును నమ్మువారు, ఎండుగడ్డి పరకలలో తేనెను నమ్మువారివలె, చిక్కుల పాలగుదురు.
న హి వైరాణి శామ్యన్తి కులే దుఃఖగతాని చ,
ఆఖ్యాతారశ్చ విద్యన్తే కులే వై ధ్రియతే పుమాన్. 72
కులమున దుఃఖమువలన ఏర్పడు పగలు అణగిపోవు. హితమును బోధించువారు ఎందరో ఉందురు. కాని మనుజుడు పట్టు విడువడు.
ఉపగృహ్య తు వైరాణి సాన్త్వయన్తి నరాధిప,
అథైనం ప్రతిపింషన్తి పూర్ణం ఘట మివాశ్మని. 73
పగలను పట్టుకొనివ్రేలాడి మంచిమాటలు చెప్పుచుందురు. తుదికి నిండుకుండను రాతిపైవేసి పగులగొట్టినట్లు నుగ్గు చేయుదురు.
సదా న విశ్వసే ద్రాజా పాపం కృత్వేహ కస్యచిత్,
అపకృత్య పరేషాం హి విశ్వాసా ద్దుఃఖ మశ్నుతే. 74
రాజు ఒకనికి ద్రోహముచేసి నమ్మియుండరాదు. పరులకపకారమొనరించి నమ్మియున్న కారణమున తుదికి దుఃఖమునే పొందును.
బ్రహ్మదత్త ఉవాచ - బ్రహ్మదత్తు డిట్లనెను.
నా విశ్వాసా ద్విన్దతేఽర్థా నీహతే చాపి కిఞ్చన,
భయాత్వేకతరా న్నిత్యం మృతకల్పా భవన్తి చ. 75
నమ్మకములేకుండుట వలన నరు డేఅర్థమును పొందజాలడు. దేనిని కోరను చాలడు. ఏదో ఒక భయమువలన నరులు ఎల్లవేళల చచ్చిన వానితో సమానులగుదురు.
పూజ న్యువాచ - పూజని పలికెను.
యస్యేహ వ్రణినౌ పాదౌ పద్భ్యాం చ పరిసర్పతి,
ఖన్యేతే తస్య తౌ పాదౌ సుగుప్తమిహ ధావతః. 76
పుండ్లుపడిన కాళ్లుకలవాడు ఆ కాళ్లతోనే ముందుకు పోవుచుండును. ఆతడెంత గూఢముగా పరువెత్తినను ఆపాదములే మరింతగా గాయములు పొందుచుండును.
నేత్రాభ్యాం సరుజాభ్యాం యః ప్రతివాత ముదీక్షతే,
తస్య వాయురుజాత్యర్థం నేత్రయో ర్భవతి ధ్రువమ్. 77
రోగము పొందిన కన్నులతో గాలికెదురుగా నిలిచి యుండు వానికి గాలి రోగము మరింతగా కన్నులకేర్పడును. నిక్కము.
దుష్టం పన్థాన మాసాద్య యో మోహా దుపపద్యతే,
ఆత్మనో బల మజ్ఞాయ తదన్తం తస్య జీవితమ్. 78
చెడుదారిని బట్టి మోహమువలన దానినే అంటిపెట్టుకొని యుండువాడు తన బలము తెలిసికొన జాలక బ్రదుకునకు చేటు తెచ్చుకొనును.
యస్తు వర్ష మవిజ్ఞాయ క్షేత్రం కర్షతి కర్షకః,
హీనః పురుషకారేణ సస్యం నైవాశ్నుతే తతః. 79
వర్షము రాకడను గుర్తింపక పొలము దున్ను సేద్యగాడు పురుషకారము లేనివాడై పంటను పొందజాలడు.
యస్తు తిక్తం కషాయం వా స్వాదు వా మధురం హితమ్,
ఆహారం కురుతే నిత్యం సోఽమృతత్వాయ కల్పతే. 80
చేదో, ఘాటో, రుచికరమో, మధురమో అయినప్పటికిని హితమైన ఆహారమును కూర్చుకొనువాడు సుఖమునకు పాత్రమగును.
పథ్యం ముక్త్వాతు యో మోహా ద్దుష్ట మశ్నాతి భోజనమ్,
పరిణామ మవిజ్ఞాయ తదన్తం తస్య జీవితమ్. 81
పథ్యమైన ఆహారమును వదలివైచి ఒడలెరుగక పిదప ఏమగునో తెలియక చెడు కూడు తినువానికి అదే బ్రదుకు తుది ఘట్టము.
దైవం పురుషకారశ్చ స్థితా వన్యోన్య సంశ్రయాత్,
ఉదారాణాం తు సత్కర్మ దైవం క్లీబా ఉపాసతే. 82
దైవము, పురుషకారము ఒకదానినొకటి ఆశ్రయించి నిలుచునవి. గొప్పవారు సత్కర్మము నాచరింతురు. (పురుషకారమునే ఆశ్రయింతురని భావము) నపుంసకులు దైవమును సేవించుచుందురు. (ఇచట దైవమనగా అదృష్టము అని భావము).
కర్మ చాత్మహితం కార్యం తీక్ష్ణం వా యది వా మృదు,
గ్రస్యతే ఽకర్మశీలస్తు సదానర్థై రకిఞ్చనః. 83
అది పదునైనదో, మెత్తనిదో తనకు హితమైన కర్మమునే నరుడు ఆచరింపవలయును. సోమరియగు దరిద్రుడు ఎల్లవేళల అనర్థములకే బలియగును.
తస్మాత్ సర్వం వ్యపోహ్యార్థం కార్య ఏవ పరాక్రమః,
సర్వస్వ మపి సంత్యజ్య కార్యమాత్మహితం నరైః. 84
అందువలన సర్వమగు అర్థమును ప్రక్కకు త్రోసివైచి పరాక్రమమునే మానవుడు చేయవలయును. మానవులు సర్వమగు సొమ్మును వదలియైనను తనకు మేలైనదాని నాచరింపవలయును.
విద్యా శౌర్యం చ దాక్ష్యం చ బలం ధైర్యం చ పఞ్చమమ్,
మిత్రాణి సహజాన్యాహు ర్వర్తయన్తీహ తై ర్బుధాః. 85
విద్య, పరాక్రమము, సమర్థత, బలము, అయిదవదియగు ధైర్యము - ఇవి మానవులకు సహజ మిత్రములు. వివేకము కలవారు వీనితో మెలగుదురు.
నివేశనం చ కుప్యం చ క్షేత్రం భార్యా సుహృజ్జనః,
ఏతాన్యుపహితా న్యాహుః సర్వత్ర లభతే పుమాన్. 86
ఇల్లు, ధనధాన్యములు, పొలము, పెండ్లము, చెలికాండ్రు - వీనిని ఉపమిత్రములందురు. పురుషుడు వీనిని ఎందైనను పొందగలడు.
సర్వత్ర రమతే ప్రాజ్ఞః సర్వత్ర చ విరాజతే,
న విభీషయతే కశ్చిద్ భీషితో న బిభేతి చ. 87
ప్రజ్ఞకలవాడు అన్నియెడల చక్కగా విహరించును. అన్నియెడల విరాజిల్లును. ఎవ్వడు అతనిని భయపెట్టడు. ఇతరుడు భయపెట్టినను ఇతడు భయపడడు.
నిత్యం బుద్ధిమతో ఽప్యర్థః స్వల్పకోఽపి వివర్ధతే,
దాక్ష్యే ణాకుర్వతః కర్మ సంయమా త్ప్రతితిష్ఠతి. 88
బుద్ధిమంతుని సొమ్ము కొంచెము పాటిదైనను ఎల్లవేళల పెంపొందుచునే యుండును. ఆతడు పనిచేయకున్నను అతని సమర్థతవలన అది పెరుగుచుండును. సంయమమువలనదానికి భంగములేని స్థితి కలుగును.
గృహస్నేహావబద్ధానాం నరాణా మల్పమేధసామ్,
కుస్త్రీ ఖాదతి మాంసాని మాఘమాం సేగ వా ఇవ. 89
తెలివితక్కువ దద్దమ్మలై యింటివలపునకు కట్టువడిన మనుజుల మాంసములను, ఎండ్రిని తనపిల్లలే చంపువిధముగా, దుష్టవనిత తినివేయును.
గృహం క్షేత్రాణి మిత్రాణి స్వదేశ ఇతి చాపరే,
ఇత్యేవ మవసీదన్తి నరా బుద్ధివిపర్యయే. 90
బుద్ధి తారుమారయినపుడు నాయిల్లు, నాపొలములు, నామిత్రములు, నాదేశము అనుకొనుచు కొందరు చెడిపోవుదురు.
ఉత్పతే తృహజా ద్దేశా ద్వ్యాధిదుర్భిక్ష పీడితాత్,
అన్యత్ర వస్తుం గచ్ఛేద్వా వసేద్వా నిత్యమానితః. 91
తనదేశము వ్యాధులతో కరవు కాటకములతో పీడనొందినపుడు దానిని వదలి మరియొకచోట వసించుటకు లేచిపోవలయును. లేదా మన్నన చెడకుండ అందే నివసింపవలయును.
తస్మా దన్యత్ర యాస్యామి వస్తుం నాహ మహోత్సహే,
కృత మేత దనార్యం మే తవ పుత్రే చ పార్థివ. 92
కావున రాజా! నేను మరొక చోటి కరుగుదును. ఇందుండ నొల్లను. పైగా నేను నీకొడుకు విషయమున నికృష్టమగు పని చేసితిని.
కుభార్యాం చ కుపుత్రంచ కురాజానం కుసౌహృదమ్,
కుసంబంధం కుదేశం చ దూరతః పరివర్జయేత్. 93
చెడిపెయగు పెండ్లమును, చెడిన కొడుకును, చెడ్డరాజును, చెడ్డ మిత్రుని, చెడ్డ చుట్టమును, పాడుదేశమును దూరముగా వదలివేయవలయును.
కుపుత్రే నాస్తి విశ్వాసః కుభార్యాయాం కుతో రతిః,
కురాజ్యే నిర్వృతి ర్నాస్తి కుదేశే నాస్తి జీవికా. 94
చెడ్డ కొడుకునందు విశ్వాసము, చెడిన ఆలియందు సంసారసుఖము, చెడ్డ రాజ్యమున సుఖము, చెడ్డదేశమున బ్రదుకుతెరువు లేవు.
కుమిత్రే సంగతి ర్నాస్తి నిత్యమస్థిరసౌహృదే,
అవమానః కుసంబంధే భవత్యర్థ విపర్యయే. 95
ఊగులాడుమైత్రిగల చెడుమిత్రమునందు కలయిక యుండదు. ధనవిషయమున ఎగుడు దిగుళ్లు కలిగినప్పుడు బంధువు చెడ్డవాడయినచో అవమానము కలుగును.
సా భార్యా యాప్రియం బ్రూతే స పుత్రో యత్ర నిర్వృతిః,
తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశో యత్ర జీవ్యతే. 96
ప్రియము పలుకునదియే యిల్లాలు. సుఖమెందు కలుగునో వాడే పుత్రుడు. నమ్మకముండుతావే మిత్రము. బ్రదుకు తెరువు ఎందు లభించునో అదియే దేశము.
యత్ర నాస్తి బలాత్కారః స రాజా తీవ్రశాసనః,
భీరేవ నాస్తి సంబంధో దరిద్రం యో బుభూషతే. 97
రాజు తీవ్రశాసనుడైనను బలాత్కారము చేయకుండునేని అచట నరునకు భయమే యుండదు. ఏరాజు దరిద్రునే పాలింపగోరునో అచట మరియొక చుట్టమే ఉండడు.
భార్యా దేశోఽథ మిత్రాణి పుత్ర సంబంధి బాంధవాః,
ఏతే సర్వే గుణవతి ధర్మనేత్రే మహీపతౌ. 98
రాజు గుణవంతుడు, ధర్మమును చక్కగా నడపువాడు అయినప్పుడే భార్య, దేశము, మిత్రులు, పుత్రులు, చుట్టములు, పక్కములు అనుమాటలు చెల్లును.
అధర్మజ్ఞస్య విలయం ప్రజా గచ్ఛన్తి నిగ్రహాత్,
రాజా మూలం త్రివర్గస్య స్వప్రమత్తోఽను పాలయేత్. 99
ధర్మమెరుగని రాజు ప్రజలు నిగ్రహమువలన విలయమును పొందుదురు. రాజు ధర్మము, అర్థము, కామము అను మూడింటి సముదాయమునకు మూలము. దానిని మిక్కిలి జాగరూకతతో పాలింపవలయును.
బలిషడ్భాగ ముద్దృత్య బలిం సముపయోజయేత్,
న రక్షతి ప్రజాః సమ్యగ్ యః స పార్థివతస్కరః. 100
ఆరవభాగమును కప్పముగా గొని దానిని చక్కగా అనుభవింపవలయును. అది గ్రహించియు ప్రజలను చక్కగా రక్షింపకున్నచో ఆతడు రాజు రూపమున నున్న దొంగ.
దత్త్వాభయం యః స్వయమేవ రాజా
న తత్ప్రమాణం కురుతేఽర్థలోభాత్,
స సర్వలోకా దుపలభ్య పాపం
సోఽధర్మబుద్ధి ర్నిరయం ప్రయాతి. 101
తనంతతాను అభయమొసగి రాజు అర్థలోభమువలన దానిని మన్నింప కుండునేని అట్టి అధర్మబుద్ధి లోకమంతటి నుండి నిందను పొంది వినాశమందును.
దత్త్వాభయం స్వయం రాజా ప్రమాణం కురుతే యది,
స సర్వసుఖకృజ్జ్ఞేయః ప్రజా ధర్మేణ పాలయన్. 102
తనకుతాను అభయ మొసగి రాజు దానిని చెడకుండ చూచునేని ఆతడు ప్రజలను ధర్మముతో పాలించుచు సుఖమును కూర్చువాడను ప్రతిష్ఠ పొందును.
మాతా పితా గురు ర్గోప్తా వహ్ని ర్వైశ్రవణో యమః,
సప్త రాజ్ఞో గుణా నేతాన్మను రాహ ప్రజాపతిః. 103
తల్లి, తండ్రి, గురువు, రక్షకుడు, అగ్ని, కుబేరుడు, యముడు - రాజునందీ యేడుగురి లక్షణములుండవలయునని ప్రజాపతి యగు మనువు పలికెను.
పితా హి రాజా రాష్ట్రస్య ప్రజానాం యోఽనుకంపనః,
తస్మిన్మిథ్యావినీతో హి తిర్యగ్గచ్ఛతి మానవః. 104
ప్రజలయెడ దయగలవాడైన రాజు రాష్ట్రమునకు తండ్రి. ఆవిషయమున వంచనను నేర్చినవాడు మానవుడైనను పశువువలె ప్రవర్తించును.
సంభావయతి మాతేవ దీన మప్యుపపద్యతే,
దహత్యగ్ని రివానిష్టా న్యమయ న్నసతో యమః. 105
రాజు తల్లివలె దీనుని మన్నించును. సంరక్షించును. అనిష్టులను అగ్నివలె కాల్చివేయును. చెడువారిని అదుపున పెట్టుటలో యముడగును.
ఇష్టేషు విసృజన్నర్థాన్కుబేర ఇవ కామదః,
గురు ర్ధర్మోపదేశేన గోప్తా చ పరిపాలయన్. 106
ఇష్టులయందు కుబేరునివలె కోరినవి యిచ్చువాడై అర్థములను క్రుమ్మరించును. ధర్మమునుపదేశించుటచేత గురువగును. సంరక్షించుచు గోప్త (కాపాడువాడు) అగును.
యస్తు రఞ్జయతే రాజా పౌరజానపదాన్ గుణైః,
న తస్య భ్రమతే రాజ్యం స్వయం ధర్మానుపాలనాత్. 107
పురజనులను, పల్లెలవారిని తనగుణములచేత రంజించెడు రాజు రాజ్యము చెదరదు. స్వయముగా ధర్మమును కాపాడుట ఇందు కారణము.
స్వయం సముపజానన్ హి పౌరజానపదార్చనమ్,
స సుఖం ప్రేక్షతే రాజా ఇహలోకే పరత్ర చ. 108
రాజ్యమునందలి పౌరులను జానపదులను సేవించుట నెరిగినరాజు ఈలోకమునందును, పరలోకమునందును సుఖమును గాంచును.
నిత్యోద్విగ్నాః ప్రజా యస్య కరభారప్రపీడితాః,
అనర్థై ర్విప్రలుప్యన్తే స గచ్ఛతి పరాభవమ్. 109
పన్నులబరువుతో క్రుంగిపోయిన ప్రజలు అనర్థములతో ముక్కలు చెక్కలుగా చెడిపోవుదురు. అట్టిరాజు పరాభవమును పొందును.
ప్రజా యస్య వివర్ధన్తో సరసీవ మహోత్పలమ్,
స సర్వఫలభాగ్రాజా స్వర్గలోకే మహీయతే. 110
కొలనియందు కలువతీగవలె ఎవనిరాజ్యమున ప్రజలు పెంపొందుదురో అట్టిరాజుసర్వఫలములను పొందువాడగును. స్వర్గలోకమున ప్రతిష్ఠగాంచును.
బలినా విగ్రహో రాజ న్న కదాచిత్ప్రశస్యతే,
బలినా విగ్రహో యస్య కుతో రాజ్యం కుతః సుఖమ్. 111
బలవంతునితోడి పగ, రాజా! ఎన్నటికిని మేలుకాదు. బలవంతునితో పగగొన్న రాజునకు రాజ్యమెక్కడ? సుఖమెక్కడ?
భీష్మ ఉవాచ - భీష్ముడు పలికెను.
సైవ ముక్త్యా శకునికా బ్రహ్మదత్తం నరాధిపమ్,
రాజానం సమనుజ్ఞాప్య జగా మాభీప్సితాం దిశమ్. 112
ఆ పక్షి బ్రహ్మదత్తునితో ఇట్లు పలికి ఆతనిని ఒప్పించి తన యిచ్చ వచ్చిన చోటి కరిగెను.
ఏతత్తే బ్రహ్మదత్తస్య పూజన్యా సహ భాషితమ్,
మ యోక్తం నృపతిశ్రేష్ఠ కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి. 113
ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మపర్వణి
బ్రహ్మదత్త పూజన్యోః సంవాదే ఏకోనచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
రాజా! బ్రహ్మదత్తునికి పూజనితో జరిగిన సంవాదమును నీకు వినిపించితిని. ఇంకను ఏమి వినగోరుదువు?
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున బ్రహ్మదత్త పూజనుల సంవాదముగల నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరాజిట్లనెను.
యుగక్షయా త్పరిక్షీణే ధర్మే లోకే చ భారత,
దస్యుభిః పీడ్యమానే చ కథం స్థేయం పితామహ. 1
తాతా! యుగము ముగియుటవలన లోకమున ధర్మము మిక్కిలి తరిగిపోగా క్రూరాత్ములు పీడించుచుండగా మానవు డెట్లు నిలువవలయును?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
అత్ర తే వర్తయిష్యామి నీతి మాపత్సు భారత,
ఉత్సృజ్యాపి ఘృణాం కాలే యథా వర్తేత భూమిపః, 2
భారతా! రాజు తగు సమయమున దయను వదలియు ఎట్లు నడవవలయునో అట్టి ఆపదలయందలి నీతిని నీకు తెలిపెదను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
భారద్వాజస్య సంవాదం రాజ్ఞః శత్రుంజయస్య చ. 3
ఇందును ఒక ప్రాతకాలపు కథను ఉదాహరింతురు. అది భారద్వాజునకు, శత్రుంజయుడను రాజునకు జరిగిన సంవాదము.
రాజా శత్రుంజయో నామ సౌవీరేషు మహారథః,
భారద్వాజ ముపాగమ్య పప్రచ్ఛార్థ వినిశ్చయమ్. 4
సౌవీరదేశములయందు మహారథుడగు శత్రుంజయుడను రాజు భారద్వాజుని కడ కరిగి ఒక అర్థనిర్ణయమును గూర్చి అడిగెను.
అలబ్ధస్య కథం లిప్సా లబ్ధం కేన వివర్ధతే,
వర్ధితం పాల్యతే కేన పాలితం ప్రణయేత్కథమ్. 5
లభింపని దానిని పొందుటెట్లు? లభించినది ఎట్లు పెంపొందును? పెరిగిన దానిని దేనిచేత రక్షించుకొనవలయును? రక్షించిన దానిని ఎట్లు వెచ్చింపవలయును?
తస్మై వినిశ్చితార్థాయ పరిపృష్టోఽర్థనిశ్చయమ్,
ఉవాచ బ్రాహ్మణో వాక్య మిదం హేతు మదుత్తమమ్. 6
ఇట్లు అర్థనిర్ణయమును గూర్చి రాజడుగగా, చక్కగా నిశ్చయము పొందిన విషయము గల ఆ రాజునకు ఆ బ్రాహ్మణుడు హేతువుతో కూడిన ఉత్తమమగు వాక్యము నిట్లు పలికెను.
నిత్య ముద్యతదణ్డః స్యా న్నిత్యం వివృతపౌరుషః,
అచ్ఛిద్ర శ్ఛిద్రదర్శీ చ పరేషాం వివరానుగః. 7
రాజు ఎల్లవేళల సిద్ధముగానున్న దండోపాయము కలవాడు, అందరకు తెలిసెడు పౌరుషము కలవాడు, ఏ దోషములు లేనివాడు, ఇతరుల దోషములను చూడగలవాడు, ఆ దోషములను బట్టి శిక్షించుటకు ప్రవర్తింపగలవాడును కావలయును.
నిత్యముద్యతదణ్డస్య భృశ ముద్విజతే నరః,
తస్మాత్ సర్వాణి భూతాని దణ్డే నైవ ప్రసాధయేత్. 8
ఎల్లప్పుడు సిద్ధముగానుండు శిక్ష కలవానియెడ నరుడు మిక్కిలి భయపడుచుండును. కావున సర్వభూతములను దండముతోడనే చక్క దిద్దవలయును.
ఏవం దణ్డం ప్రశంసన్తి పణ్డితా స్తత్వదర్శినః,
తస్మాచ్చతుష్టయే తస్మిన్ ప్రధానో దణ్డ ఉచ్యతే. 9
తత్వమును దర్శించు పండితులు ఈవిధముగా దండమును కొనియాడుదురు. అందువలన సామ, దాన, భేద, దండములను ఆ ఉపాయసముదాయములో దండమే ప్రధానమని చెప్పుదురు.
ఛిన్నమూలే త్వధిష్ఠానే సర్వేషాం జీవనం హతమ్,
కథం హి శాఖా స్తిష్ఠేయు శ్ఛిన్నమూలే వనస్పతౌ. 10
మొదలు తెగిన ఆధారమునందు ఎల్లరకు బ్రదుకు చచ్చినదే యగును. మొదలు నరికిన చెట్టు నందు కొమ్మలెట్లు నిలుచును?
మూల మేవాదిత శ్ఛిన్ద్యా త్పరపక్షస్య పండితః,
తతః సహాయాన్ పక్షం చ మూల మేవానుసాధయేత్. 11
తెలివి గలవాడు శత్రుపక్షము మూలమును మొదలంట తెగ నరుకవలయును. పిదప సహాయులను, శత్రువువైపువారిని ఆ మార్గముననే సాధింపవలయును.
సుమన్త్రితం సువిక్రాన్తం సుయుద్ధం సుపలాయితమ్,
ఆపదాస్పదకాలే తు కుర్వీత న విచారయేత్. 12
చక్కని ఆలోచన, యోగ్యమగు తీరున విక్రమించుట, మేలైన పోరు, మంచిగా తప్పుకొని పోవుట అనువానిని ఆపద కలుగు కాలమున చేయవలయును. విచారింపరాదు.
వాఙ్మాత్రేణ వినీతః స్యా ద్ధృదయేన యథా క్షురః,
శ్లక్ష్ణ పూర్వాభిభాషీ చ కామక్రోధౌ వివర్జయేత్. 13
రాజు మాటలతో వినయవంతుడు, హృదయముతో కత్తి వంటివాడు, స్పష్టముగా ముందు మాటాడువాడు, కామ క్రోధములను విడనాడువాడును కావలయును.
సపత్నసహితే కార్యే కృత్వా సన్ధిం న విశ్వసేత్,
అపక్రామే త్తతః శీఘ్రం కృతకార్యో విచక్షణ:. 14
శత్రువులతో కూడిన కార్యమునందు సంధి చేసికొని నమ్మి యుండరాదు. వివేకముతో కార్యము సాధించిన పిమ్మట వెంటనే దాని నుండి తొలగిపోవలయును.
శత్రుం చ మిత్రరూపేణ సాన్త్వేనైవాభిసాన్త్వయేత్,
నిత్యశ శ్చోద్విజే త్తస్మా ద్గృహా త్సర్పయుతా దివ. 15
శత్రువును కూడ మిత్రుని వలెనే బుజ్జగించుచుండవలయును. కాని ఎల్లవేళల వానివలన, పామున్న యింటివలన వలె, భయపడుచునే యుండవలయును.
యథా బుద్ధిః పరిభవే త్తమతీతేన సాన్త్వయేత్,
అనాగతేన దుష్ప్రజ్ఞం ప్రత్యుత్పన్నేన పణ్డితమ్. 16
తన బుద్ధి సన్నగిల్లినపుడు శత్రువును కడచినదానితో బుజ్జగింపవలయును. చెడిన ప్రజ్ఞ గలవానిని రానున్నదానితో, పండితుడైన వానిని తత్కాలవిషయముతో లాలింపవలయును.
అఞ్జలిం శపథం సాన్త్వం ప్రణమ్య శిరసా వదేత్,
అశ్రుప్రమార్జనం చైవ కర్తవ్యం భూతి మిచ్ఛతా. 17
సంపదను కోరువాడు సమయమునకు తగినట్లుగా దోసిలిపట్టుట, ఒట్టులు పెట్టుకొనుట, తలవంచి నమస్కరించుట, కన్నీళ్లు తుడుచుట మొదలగునవియు చేయవలయును.
వహే దమిత్రం స్కన్ధేన యావత్కాలస్య పర్యయః,
ప్రాప్తకాలంతు విజ్ఞాయ భిన్ద్యాద్ఘట మివాశ్మని. 18
పగవానిని సమయము కలసి రానిచో బుజముపై పెట్టుకొని మోయవలయును. కలసి వచ్చుటను తెలిసికొని, కుండను రాతిపై వేసి పగులగొట్టినట్లు, కొట్టవలయును.
ముహూర్త మపి రాజేన్ద్ర తిన్దుకాలాతవజ్జ్వలేత్,
న తుషాగ్ని రివానర్చి ర్ధూమాయేత చిరం నరః. 19
రాజేంద్రా! నరుడు ఒక్క ముహూర్తకాలమైనను తిందుకపు కొఱకంచువలె వెలిగిపోవలయును. అంతేకాని మంటలు లేని ఊకనిప్పు వలె పొగచూరి పోరాదు.
నానార్థికోఽర్థసంబన్దం కృతఘ్నేన సమాచరేత్,
అర్థీతు శక్యతే భోక్తుం కృతకార్యోఽవమన్యతే,
తస్మాత్ సర్వాణి కార్యాణి సావశేషాణి కారయేత్. 20
పెక్కు ప్రయోజనములు పొందగోరువాడు కృతఘ్నునితో ధనసంబంధమును పెట్టుకొనరాదు. కృతఘ్నుడు పని యున్నంతవరకు తినజాలును. పని ముగిసినంత అవమానించును. కనుక కృతఘ్నుని పనులన్నింటిని మిగులు ఉండునట్లే చేయవలయును.
కోకిలస్య వరాహస్య మేరోః శూన్యస్య వేశ్మనః,
నటస్య భక్తిమిత్రస్య యచ్ఛ్రేయ స్తత్సమాచరేత్. 21
కోకిల, పంది, మేరువు, శూన్యమైన గృహము, నటుడు, భక్తిగల మిత్రుడు - వీరికి, ఏది ఏది మేలుగూర్చునో రాజు దాని దానిని చక్కగా ఆచరింపవలయును.
ఉత్థాయోత్థాయ గచ్ఛేత నిత్యయుక్తో రిపో ర్గృహాన్,
కుశలం చాస్య పృచ్ఛేత యద్యప్యకుశలం భవేత్. 22
మిక్కిలి జాగరూకత కలవాడై ప్రయత్నముతో శత్రువు నింటికి వెళ్లవలయును. తనకు కుశలము కాకున్నను ఆతనిని కుశలమడుగుచుండవలయును.
నాలసాః ప్రాప్నువన్త్య ర్థా న్నక్లీబా నాభిమానినః,
న చ లోకరవాద్భీతా నవై శశ్వత్ప్రతీక్షిణః. 23
సోమరులు, నపుంసకులు, అభిమానము కలవారు, లోకనిందలకు భయపడువారు, ఎల్లప్పుడు దేనినో ఎదురుచూచుచుండువారు ధనములను పొందజాలరు.
నాత్మచ్ఛిద్రం రిపుర్విద్యా ద్విద్యా చ్ఛిద్రం పరస్య తు,
గూహే త్కూర్మ ఇవాఙ్గాని రక్షే ద్వివర మాత్మనః. 24
తన లోపములను పగవా డెరుగరాదు. పరుని లోపమును తాను తెలిసికొన వలయును. తాబేటి వలె తన అంగములను దాచుకొనవలయును. తన దోషమును వెలికి తెలియకుండ రక్షించుకొనవలయును.
బక వచ్చిన్తయే దర్థాన్ సింహవచ్చ పరాక్రమేత్,
వృకవచ్చాస్యలుంపేత శరవచ్చ వినిష్పతేత్. 25
కొంగ వలె అర్థములను సంభావింపవలయును. సింహము వలె పరాక్రమింప వలయును. తోడేలువలె కొరుకుకొని తినవలయును. బాణమువలె పగవానిపై పడవలయును.
పాన మక్షా స్తథా నార్యో మృగయా గీతవాదితమ్,
ఏతాని యుక్త్యా సేవేత ప్రసంగో హ్యత్ర దోషవాన్. 26
త్రాగుట, జూదము, స్త్రీలు, వేట, సంగీతము - వీనిని ఉపాయముతో సేవింపవలయును. వీనియందు తగులుకొనుట దోషము.
కుర్యాత్తృణమయం చాపం శయీత మృగశాయికామ్,
అన్ధః స్యా దన్ధవేళాయాం బాధిర్యమపి సంశ్రయేత్. 27
గడ్డిపరకలతో బాణము చేయవలయును. మృగముల వలె నిద్రింపవలయును. కనుగానని సమయమున గ్రుడ్డివలె మెలగవలయును. చెవిటితనమును కూడ ఆశ్రయింపవలయును.
దేశకాలౌ సమాసాద్య విక్రమేత విచక్షణః,
దేశకాల వ్యతీతో హి విక్రమో నిష్ఫలో భవేత్. 28
వివేకముకల రాజు దేశకాలముల అనుకూలత ఉన్నపుడు పరాక్రమింప వలయును. కాని తావున, కాని కాలమున విక్రమించినచో ఫలముండదు.
కాలాకాలౌ సంప్రధార్య బలాబల మథాత్మనః,
పరస్పరం బలం జ్ఞాత్వా తత్రాత్మానం నియోజయేత్. 29
కాలమేదో, అకాలమేదో చక్కగా నిర్ణయించుకొని తన బలమును, బలములేనితనమును, ఎదుటివాని బలాబలములను నిగ్గుతేల్చుకొని ప్రవర్తింపవలయును.
దణ్డేనోపనతం శత్రుం యో రాజా న నియచ్ఛతి,
స మృత్యు ముపగృహ్ణాతి గర్భ మశ్వతరీ యథా. 30
దండోపాయముతో వచ్చిన శత్రువును నిలువరింపజాలని రాజు కంచరగాడిద గర్భమును వలె మృత్యువునే కైకొనును.
సుపుష్పితః స్యాదఫలః ఫలవాన్ స్యా ద్దురారుహః,
ఆమః స్యాత్పక్వ సంకాశో నచ శీర్యేత కస్యచిత్. 31
నిలువెల్ల పూచియు ఫలింపనిది, పండ్లు కలది అయ్యు ఎక్కరానిది, పచ్చిగానుండియు పండిన దానివలె నుండునదియు నగు చెట్టువలె రాజు మెలగవలయును. ఎవనికిని లొంగిపోయి నాశనమొందరాదు.
ఆశాం కాలవతీం కుర్యా త్తాంచ విఘ్నేన యోజయేత్,
విఘ్నం నిమిత్తతో బ్రూయా న్నిమిత్తం చాపి హేతుతః. 32
కాలమునకు యోగ్యమైన ఆశను పెట్టుకొనవలయును. దానిని విఘ్నముతో కలుపవలయును. విఘ్నమును నిమిత్తమునుబట్టి పలుకవలయును. నిమిత్తమును హేతువుతో అనుసంధింపవలయును.
భీతవత్సంవిధాతవ్యం యావద్భయ మనాగతమ్,
ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్య మభీతవత్. 33
భయము రాకుండునంతవరకు భయపడినవానివలె మెలగవలయును. వచ్చిన భయమును గాంచి భీతియెరుగని వానివలె చావగొట్టవలయును.
న సంశయ మనారుహ్య నరో భద్రాణి పశ్యతి,
సంశయం పున రారుహ్య యది జీవతి పశ్యతి. 34
నరుడు సంశయమును పొందక భద్రములను కాంచడు. సంశయమును పొంది బ్రదికినచో భద్రములను తప్పక పొందును.
అనాగతం విజానీయా ద్యచ్ఛే ద్భయ ముపస్థితమ్, .
పునర్వృద్ధి భయాత్కిఞ్చి దనివృత్తం నిశామయేత్. 35
భయము రాక మునుపే వచ్చినట్లు భావింపవలయును. వచ్చినపుడు దానిని నిలువరింపవలయును. మరల పెరుగునను భయమువలన అది తిరిగిరాదన్నట్లు మెలగవలయును.
ప్రత్యుపస్థితకాలస్య సుఖస్య పరివర్జనమ్,
అనాగత సుఖాశా చ నైవ బుద్ధిమతాం నయః. 36
చేతికందిన సుఖమును వదలుకొనుట, రానిదానికై అంగలార్చుట బుద్ధిమంతుల నీతి కానే కాదు.
యోఽరిణా సహ సంధాయ సుఖం స్వపితి విశ్వసన్,
సవృక్షాగ్రే ప్రసుప్తో వా పతితః ప్రతిబుద్ధ్యతే. 37
పగవానితో సంధి చేసికొని నమ్మకముతో సుఖముగా నిద్రించువాడు చెట్టు చిటారుకొమ్మపై నిద్రించువాని వలె పతనము చెందినపుడే తెలివి పొందును. (ప్రమాదము తప్పదని భావము)
కర్మణా యేన తేనైవ మృదునా దారుణేన చ,
ఉద్ధరే ద్దీన మాత్మానం సమర్థో ధర్మమాచరేత్. 38
అది మెత్తనిదో, గట్టిదో - యోగ్యమగు కర్మము తోడనే దీనుడైన తన్ను ఉద్ధరించు కొనవలయును. సమర్థుడై ధర్మము నాచరింపవలయును.
యే సపత్నాః సపత్నానాం సర్వాంస్తానుపసేవయేత్,
ఆత్మన శ్చాపి బోద్ధవ్యా శ్చారా వినిహతాః పరైః. 39
తన శత్రువుల శత్రువుల నందరిని కూడగట్టుకొనవలయును. పగవారికి లొంగిన తన చారులను చక్కగా గుర్తింపవలయును.
చారస్త్వవిదితః కార్య ఆత్మనోఽథ పరస్య చ,
పాషణ్డాం స్తాపసాదీంశ్చ పరరాష్ట్రే ప్రవేశయేత్. 40
తన చారుడు పగవానికి ఎరుగరాకుండ చేయవలయును. పాషండులు, తాపసాదులు అయిన చారులను శత్రు రాష్ట్రమున ప్రవేశపెట్టవలయును.
ఉద్యానేషు విహారేషు ప్రపా స్వావసథేషు చ,
పానాగారే ప్రవేశేషు తీర్థేషు చ సభాసు చ. 41
ధర్మాభిచారిణః పాపా శ్చారా లోకస్య కణ్టకాః,
సమాగచ్ఛన్తి తాన్ బుద్ధ్వా నియచ్చే చ్ఛమయీత వా. 42
తోటలలో, విహార స్థలములలో, చలివేంద్రములలో, సత్రములలో, పానశాలలలో, ప్రవేశద్వారములలో, తీర్థములలో, సభలలో ధర్మద్రోహము చేయువారు, పాపులు, దొంగలు, లోకకంటకులు చేరుచుందురు. వారిని చక్కగా కనిపట్టి లొంగదీసికొనవలయును. అణచివేయవలయును.
న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్,
విశ్వాసాద్భయ మభ్యేతి నాపరీక్ష్య చ విశ్వసేత్. 43
నమ్మరాని వానియందు నమ్మకముంచరాదు. నమ్మదగినవాని యందు ఎక్కువ విశ్వాసము పెట్టరాదు. విశ్వాసమువలన భయమును పొందును. పరీక్షింపక విశ్వసింపరాదు.
విశ్వాసయిత్వా తు పరం తత్త్వభూతేన హేతునా,
అథాస్య ప్రహరేత్కాలే కించిద్విచలితే పదే. 44
చక్కని నమ్మదగిన కారణముతో శత్రువును నమ్మించి, తగు కాలమున తప్పటడుగు వేసినపుడు దెబ్బకొట్టవలయును.
అశంక్య మపి శంకేత నిత్యం శంకేత శంకితాత్,
భయం హ్యశంకితా జ్జాతం సుమూల మపి కృన్తతి. 45
శంకింపరానివాని నైనను శంకింపవలయును. శంకింపబడినవానిని ఎల్లప్పుడు శంకించుచుండవలయును. శంకింపబడనివానివలన కలిగెడు భయము గట్టి మూలమును కూడ త్రెంపివేయును.
అవధానేన మౌనేన కాషాయేణ జటాజినైః,
విశ్వాసయిత్వా ద్వేష్టార మవలుమ్పే ద్యథా వృకః. 46
ఏకాగ్రతతో, మౌనముతో, కాషాయవస్త్రముతో, జడలు, తోలుచీరలు మున్నగువానితో పగవానిని నమ్మించి తోడేలు వలె పీకుకొని తినవలయును. (సర్వనాశనము చేయవలయునని భావము.)
పుత్రో వా యది వా భ్రాతా పితా వా యది వా సుహృత్,
అర్థస్య విఘ్నం కుర్వాణా హన్తవ్యా భూతి మిచ్ఛతా. 47
కొడుకు, సోదరుడు, తండ్రి, మిత్రము - వీరైనను తన ప్రయోజనమునకు విఘ్నము చేయువారైనచో, వృద్ధిని కోరువాడు, నాశనమే చేయవలయును.
గురోరప్యవలిప్తస్య కార్యాకార్య మజానతః,
ఉత్పథం ప్రతిపన్నస్య దణ్డో భవతి శాసనమ్. 48
పొగరెక్కి, కార్యాకార్యము లెరుగక చెడుదారిని బట్టిన గురువు నైనను దండించుటయే కర్తవ్యము.
అభ్యుత్థానాభివాదాభ్యాం సంప్రదానేన కేనచిత్,
ప్రతిపుష్పఫలాఘాతీ తీక్ష్ణతుణ్డ ఇవ ద్విజః. 49
రాజు ఎదురేగి ప్రీతి చూపుట, అభివాదనము చేయుట, ఏదేని వస్తువును దాన మిచ్చుట మున్నగు వానితో పగవాని ప్రతిపుష్పమును, ప్రతిఫలమును, వాడిముక్కు గల పక్షివలె, నాశనము చేయవలయును.
నాచ్ఛిత్వా పరమర్మాణి నాకృత్వా కర్మ దారుణమ్,
నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహతీం శ్రియమ్. 50
ఇతరుల ఆయువుపట్టులను తెగగోయక, దారుణమగు పనిచేయక, బెస్తవానివలె చంపక ఎవడును గొప్ప సంపదను పొందడు.
నాస్తి జాత్యారిపుర్నామ మిత్రం వా ఽ పి న విద్యతే,
సామర్థ్యయోగా జ్జాయన్తే మిత్రాణి రిపవస్తథా. 51
జాతితో పగవాడు ఉండడు. అట్లే మిత్రమును ఉండడు. సామర్థ్యయోగము వలన మిత్రులు, శత్రువులు ఏర్పడుచుందురు.
అమిత్రం నైవ ముఞ్చేత వదన్తం కరుణాన్యపి,
దుఃఖం తత్ర న కర్తవ్యం హన్యా త్పూర్వాపకారిణమ్. 52
మునుపు అపకారము చేసిన శత్రువును ఎన్ని దీనాలాపములు పలికినను వదలిపెట్టరాదు. చంపనేవలయును. అందు దుఃఖము పొందరాదు.
సంగ్రహానుగ్రహే యత్నః సదా కార్యోఽనసూయతా,
నిగ్రహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతి మిచ్ఛతా. 53
అసూయ లేనివాడై రాజు సంగ్రహమునందు అనుగ్రహము నందు ఎల్లవేళల యత్నము చేయవలయును. అట్లే సంపదకోరువాడై ప్రయత్నపడి నిగ్రహమును కూడ పాటింపవలయును.
ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహృత్యైవ ప్రియోత్తరమ్,
అసినాపి శిరశ్ఛిత్వా శోచేత చ రుదేత చ. 54
దెబ్బకొట్టబోవుచు ప్రియమును పలుకవలయును. కొట్టియు ప్రియమైన ఉత్తరమునే పలుకవలయును. కత్తితో తలకోసియు శోకింపవలయును. ఏడువవలయును.
నిమన్త్రయీత సాన్త్వేన సంమానేన తితిక్షయా,
లోకారాధన మిత్యేతత్కర్తవ్యం భూతిమిచ్ఛతా. 55
సామముతో, సంమానముతో, సహనముతో జనులను లోబరచుకొనవలయును. సంపదను కోరువాడు ఈవిధముగా లోకారాధన మాచరింపవలయును.
న శుష్కవైరం కుర్వీత బాహుభ్యాం న నదీం తరేత్,
అనర్థక మనాయుష్యం గోవిషాణస్య భక్షణమ్,
దన్తాశ్చ పరిమృజ్యన్తే రసశ్చాపి న లభ్యతే. 56
పనికిమాలినపగ పెట్టుకొనరాదు. చేతులతో నదిని దాటరాదు. అది అనర్థమును కలిగించును. ఆయువును త్రుంచి వేయును. గోవు కొమ్ము నమలినచో పండ్లు విరుగును. రుచి కలుగదు కదా!
త్రివర్గ స్త్రివిధా పీడా అనుబన్ధా స్తథైవ చ,
అనుబన్ధం తథా జ్ఞాత్వా పీడాం చ పరివర్జయేత్. 57
త్రివర్గమునకు త్రివిధమైన పీడ కలదు. వాని ఫలములకును అట్లే. ఫలమును చక్కగా ఎరిగి, పీడను పూర్తిగా వదలివేయవలయును.
ఋణశేష మగ్నిశేషం శత్రుశేషం తథైవ చ,
పునః పునః ప్రవర్ధన్తే తస్మాచ్ఛేషం న ధారయేత్. 58
మిగులు గల అప్పు, మిగులు గల నిప్పు మిగిలియున్న పగవారు పెరిగిపోవుచుండును. కావున మిగులును ఉంచరాదు.
వర్ధమాన మృణం తిష్ఠే త్పరిభూతాశ్చ శత్రవః,
జనయన్తి భయం తీవ్రం వ్యాధయ శ్చాప్యుపేక్షితాః. 59
పెరుగుచున్న అప్పును నిలువరింపవలయును.ఆవిధముగా శత్రువులు పరాభవింపవలయును. వ్యాధులును ఉపేక్ష చేసినచో తీవ్రమైన భయమును పుట్టించును.
నాసమ్యక్ కృతకారీ స్యాదప్రమత్తః సదా భవేత్,
కణ్టకోఽపి హి దుశ్ఛిన్నో వికారం కురుతే చిరమ్. 60
ఏ కార్యమునైనను సరికాని విధమున చేయవలదు. ఎల్లప్పుడు ప్రమాదము లేనివాడు కావలయును. ముల్లైనను సరిగా పెరికివేయనిచో త్వరలోనే వికారమును కలిగించును.
వధేన చ మనుష్యాణాం మార్గాణాం దూషణేన చ,
అగారాణాం వినాశైశ్చ పరరాష్ట్రం వినాశయేత్. 61
మనుష్యులను చంపుట, మార్గములను పాడుపెట్టుట, ధాన్యపు గిడ్డంగులు మొదలగువానిని నాశనము చేయుట మున్నగువానితో శత్రువు రాష్ట్రమును పాడుచేయవలయును.
గృధ్రదృష్టి ర్బకాలీనః శ్వచేష్టః సింహవిక్రమః,
అనుద్విగ్నః కాకశంకీ భుజఙ్గచరితం చరేత్. 62
గ్రద్ధచూపు, కొంగనిలుకడ, కుక్క చేష్ట, సింహపు విక్రమము, కాకి శంక, పామునడవడి కలవాడై తొందరపాటుతనము లేనివాడై రాజు మెలగవలయును.
శూర మఞ్జలిపాతేన భీరుం భేదేన భేదయేత్,
లుబ్ధ మర్థ ప్రదానేన సమం తుల్యేన విగ్రహః. 63
శూరుని దోసిలొగ్గి, భీరువును భేదోపాయముతో, ఆసగొట్టువానిని ధనమిచ్చి, సముని సమమైన పోరుతో విరువవలయును.
శ్రేణీముఖ్యోపజాపేషు వల్లభానునయేషు చ,
అమాత్యాన్ పరిరక్షేత భేదసంఘాతయో రపి. 64
శ్రేణీముఖ్యుల భేదమునందు, ఇష్టులైనవారి అనునయములందును భేదమునందును, కలసికట్టుతనమునందును మంత్రులను రక్షించుకొన వలయును.
మృదు రిత్యవజానన్తి తీక్ష్ణ ఇత్యుద్విజన్తి చ
తీక్ష్ణకాలే భవేత్తీక్ష్ణో మృదుకాలే మృదు ర్భవేత్. 65
మెత్తనివాడని తేలికగా చూచెదరు. కరుకుగా నున్నచో వెక్కస పడుదురు. కావున రాజు కరుకుగా నుండవలసిన వేళ కరుకుగా నుండవలయును. మెత్తగా నుండవలసిన సమయమున మృదువుగా నుండవలయును.
మృదునైవ మృదుం ఛిన్ది మృదునా హన్తి దారుణమ్,
నాసాధ్యం మృదునా కిఞ్చిత్త స్మా త్తీక్ష్ణతరోమృదుః. 66
మెత్తనివానిని మెత్తదనముచేతనే కోసివేయుము. క్రూరుని కూడ మెత్తదనముతో ఒకడు దెబ్బకొట్టును. మృదువైనవానికి అసాధ్య మేదియు లేదు. కావున రాజు మిక్కిలి తీవ్రుడును, మెత్తనివాడును కావలయును.
కాలే మృదు ర్యో భవతి కాలే భవతి దారుణః,
ప్రసాధయతి కృత్యాని శత్రుం చాప్యధితిష్ఠతి. 67
కాలమునకు తగినట్లుగా మెత్తనివాడు, కఠినుడు అయినరాజు కార్యములను చక్కగా సాధించుకొనును. శత్రువును లొంగదీసికొనును.
పణ్డితేన విరుద్ధః సన్ దూరస్థోఽస్మీతి నాశ్వసేత్,
దీర్ఘౌ బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః. 68
తెలివిగలవానితో పగబెట్టుకొని దూరముగా నుండెను లెమ్మని ఊరట పొందరాదు. బుద్ధిమంతుని బాహువులు మిక్కిలి పొడవైనవి. బాధనొందిన ఆతడు వానితో బాధపెట్టగలఁడు.
న తత్తరే ద్యస్య నపారముత్తరే న్నతద్ధరే ద్యత్పున రాహరేత్ పరః,
న తత్ఖనే ద్యస్య న మూలముద్ధరే న్నతం హన్యా ద్యస్య శిరో న పాలయేత్. 69
దేని ఆవలి ఒడ్డును చేరుకొనజాలమో దానిని దాటుటకు ప్రయత్నింపరాదు. పగవాడు మరల పొందగలదానిని హరింపరాదు. దేనిని మొదలంట పెరికి వేయజాలమో దానిని త్రవ్వుటకు పూనుకొనరాదు. ఎవని తలను నేల గూల్పజాలమో అట్టివానిని దెబ్బకొట్టరాదు.
ఇతీదముక్తం వృజినాభిసంహితం న చైతదేవం పురుషః సమాచరేత్,
పరప్రయుక్తేన కథం విభావయే దతో మయోక్తం భవతో హితార్థినా. 70
ఇట్లు దీనిని నీకు ఆపద కలిగిన వేళకొరకై చెప్పితిని. సాధారణముగా నరుడు దీనిని ఆచరింపరాదు. పగవాడు ప్రయోగించినచో దీనిని భావింపక తప్పదు గదా అని నీ హితమును కోరువాడనై దీనిని నీకు చెప్పితిని.
యథావదుక్తం వచనం హితార్థినా నిశమ్య విప్రేణ సువీరరాష్ట్రపః,
తథాఽ కరో ద్వాక్య మదీనచేతనః శ్రియం చ దీప్తాం బుభుజే సబాన్ధవః. 71
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
కణికోపదేశే చత్వారింశ దధిక శతతమోఽధ్యాయః
తన మేలుకోరి ఆ విప్రుడు సువీరరాజునకు చెప్పిన వాక్యమును విని చెదరని హృదయము కలవాడై ఆతడు దానిని చక్కగా ఆచరించెను. మెరిసిపోయెడు సంపదను చుట్టములతో పాటు అనుభవించెను.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున
కణికోపదేశము గల నూటనలువదియవ అధ్యాయము.
గోపాలనారాయణ లక్ష్మణార్యాన్
ధీరేశ గంగాధర నీలకంఠాన్
చింతామణిం సాంబశివంచ నత్వా
వివృణ్మ ఆపద్గత రాజధర్మాన్
ఏకత్రింశదధిక శతతమోఽధ్యాయః
131
ఆపద్ధర్మ పర్వము ప్రారంభము
131
ద్వాత్రింశదధిక శతతమోఽధ్యాయః
132
రాజర్షి వృత్తాన్తః
132
త్రయస్త్రింశదధిక శతతమోఽధ్యాయః
133
కోశమును కూర్చుకొనుట
133
చతుస్త్రింశదథిక శతతమోఽధ్యాయః
134
సేన గొప్పతనము
134
పంచత్రింశదధిక శతతమోఽధ్యాయః
135
కాయవ్యుని చరితము
135
షట్త్రింశదధిక శతతమోఽధ్యాయః
136
కోశమును కూర్చుకొనుట
136
సప్తత్రింశదధిక శతతమోఽధ్యాయః
137
శాకులో పాఖ్యానము
బెస్తవానికథ
137
అష్టత్రింశదధిక శతతమోఽధ్యాయః
138
పిల్లిఎలుకల సంవాదము
138
ఏకోనచత్వారింశదధిక శతతమోఽధ్యాయః.
139
బ్రహ్మదత్తపూజనీ సంవాదము
139
చత్వారింశదధిక శతతమోఽధ్యాయః
కృషి ర్వణిక్ పథో దుర్గం సేతుః కుఞ్జరబన్దనమ్,
ఖాన్యాకార కరాదానం సఞ్చయార్థాష్టకం మతమ్.
140
కణికుని ఉపదేశము
140