| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 5 |
| Pages | 43 |
| Read Time | 52 Minutes |
ఏకచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను.
హీనే పరమకే ధర్మే సర్వలోకాభిలంఘితే,
అధర్మే ధర్మతాం నీతే ధర్మే చాధర్మతాం గతే. 1
మర్యాదాసు వినష్టాసు క్షుభితే ధర్మనిశ్చయే,
రాజభిః పీడితే లోకే పరై ర్వాఽపి విశాంపతే. 2
సర్వాశ్రయేషు మూఢేషు కర్మ సూపహతేషు చ,
కామాల్లో భాచ్చ మోహాచ్చ భయం పశ్యత్సు భారత. 3
అవిశ్వస్తేషు సర్వేషు నిత్యం భీతేషు పార్థివ,
నికృత్యా హన్యమానేషు వంచయత్సు పరస్పరమ్. 4
సంప్రదీప్తేషు దేశేషు బ్రాహ్మణే చాతిపీడితే,
అవర్షతి చ పర్జన్యే మిథో భేదే సముత్థితే. 5
సర్వస్మి న్దస్యుసాద్భూతే పృథివ్యా ముపజీవనే,
కేనస్వి ద్బ్రాహ్మణో జీవే జ్జఘన్యే కాల ఆగతే. 6
మిక్కిలి ఉత్తమమైన ధర్మము జనులందరు ఆచరింపక పోవుటవలన నశింపగా, అధర్మము ధర్మముగా, ధర్మము అధర్మముగా భావనకు రాగా, మర్యాదలన్నియు మాసిపోగా, ధర్మనిశ్చయము కలతనొందగా, రాజులో, పరరాజులో లోకములను పీడించుచుండగా, మూఢులు అన్నింటిని క్రమ్ముకొని యుండగా, సత్కర్మములు చచ్చిపోగా, కామము, లోభము, మోహము అనువానివలన జనులు భయమునే పరికించుచుండగా, జనులందరు ఒకరియెడ ఒకరికి నమ్మకము లేనివారై దిగులుపడుచుండగా, వంచనతో ఒకరినొకరు మోసగించుకొనుచు చంపుకొనుచుండగా, దేశములన్నియు భయంకరముగా కాలిపోవుచుండగా బ్రహ్మజ్ఞానసంపన్నుడు మిక్కిలి పీడ నొందగా, వానదేవుడు వర్షమును కురిపింపకుండగా, ఒకరికొకరికి పగలు ఎగయుచుండగా, భూమిపై బ్రదుకు అంతయు క్రూరాత్ముల వశమైపోగా, పాడుకాలము రాగా ధర్మమును పాటించువాడు దేనితో బ్రదుకు వెళ్లబుచ్చవలయును?
అతితిక్షు: పుత్రపౌత్రా ననుక్రోశా న్నరాధిప,
కథ మాపత్సు వర్తేత తన్మే బ్రూహి పితామహ. 7
జాలివలన కొడుకులను, మనుమలను వదలిపోజాలక నరుడు ఇట్టి యాపదల యందెట్లు మెలగవలయునో, తాతా! నాకు చెప్పుము.
కథం చ రాజా వర్తేత లోకే కలుషతాం గతే,
కథ మర్థాచ్చ ధర్మాచ్చ న హీయేత పరంతప. 8
లోకమంతయు ఇట్లు కలుషితమైన సమయమున రాజెట్లు ప్రవర్తింపవలయును? అర్థము, ధర్మము అనువాని నుండి చెడకుండుటెట్లు?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
రాజమూలా మహాబాహో యోగక్షేమ సువృష్టయః,
ప్రజాసు వ్యాధయ శ్చైవ మరణం చ భయాని చ. 9
ఓయి మహాబాహూ! ప్రజల యోగము, క్షేమము, మంచివానలు, రోగములు, చావు, భయములు ఈ అన్నియును రాజును బట్టియే కలుగును.
కృతం త్రేతాం ద్వాపరంచ కలిశ్చ భరతర్షభ,
రాజమూలా ఇతి మతి ర్మమ నాస్త్యత్ర సంశయః. 10
కృతము, త్రేత, ద్వాపరము, కలి - ఇవి అన్నియు రాజును బట్టియే ఏర్పడునని నా భావము. ఇందు సంశయము లేదు.
తస్మిం స్త్వభ్యాగతే కాలే ప్రజానాం దోషకారకే,
విజ్ఞానబల మాస్థాయ జీవితవ్యం భవేత్తదా. 11
ప్రజలకు కీడు కలిగించు అట్టి కాలము దాపురింపగా విజ్ఞాన బలమును ఆశ్రయించి బ్రదుకవలయును.
అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
విశ్వామిత్రస్య సంవాదం చాణ్డాలస్య చ పక్కణే. 12
ఇందును ప్రాతకాలపునాటి ఇతిహాసమును - చండాలుని అంగణమునందు విశ్వామిత్రునకును, చండాలునకును జరిగిన సంవాదమును - చెప్పుకొనుచుందురు.
త్రేతాద్వాపరయోః సన్ధౌ తదా దైవవిధి క్రమాత్,
అనావృష్టి రభూ ద్ఘోరా లోకే ద్వాదశవార్షికీ. 13
అది త్రేతాద్వాపరముల నడుమ కాలము. అప్పుడు దైవవశమున పండ్రెండేండ్ల భయంకరమగు అనావృష్టి కలిగెను.
ప్రజానా మతివృద్ధానాం యుగాన్తే సముపస్థితే,
త్రేతా విమోక్షసమయే ద్వాపరప్రతిపాదనే. 14
మిక్కిలి ముదిమిగల ప్రజల ఆయువు చెల్లు కాలము దాపురించినది. త్రేత విడుదల పొందుచున్నది. ద్వాపరము రానున్నది.
నవవర్ష సహస్రాక్షః ప్రతిలోమోఽభవ ద్గురుః,
జగామ దక్షిణం మార్గం సోమో వ్యావృత్తలక్షణః 15
బృహస్పతి తొమ్మిది సంవత్సరముల ఇంద్రుడు కలవాడై ప్రతిలోముడాయెను. చంద్రుడు వక్రమైన నడకతో దక్షిణమార్గమున అరిగెను.
నావశ్యాయోఽపి తత్రా భూ త్కుత ఏవాభ్రజాతయః,
నద్య: సంక్షిప్తతోయౌఘాః కిఞ్చి దన్తర్గతా స్తతః. 16
కొంచెము తేమ కూడ అందు లేదు. ఇంక మేఘము లెక్కడివి? నదులు ఇంకిన నీరు కలవియై భూమిలోనికి చొచ్చుకొని పోయినవి.
సరాంసి సరితశ్చైవ కూపాః ప్రస్రవణాని చ,
హతత్విషో నలక్ష్యన్తే నిసర్గా ద్దైవకారితాత్. 17
కొలనులు, నదులు, బావులు, వాగులు కళాకాంతులు లేనివై, ఆ దైవమేర్పరచిన స్థితి వలన, కానరాకున్నవి.
ఉపశుష్కజలస్థాయా వినివృత్త సభా ప్రపా,
నివృత్తయజ్ఞ స్వాధ్యాయా నిర్వషట్కారమంగళా. 18
ఉచ్ఛిన్నకృషిగోరక్షా నివృత్తవిపణాపణా,
నివృత్తయూపసంభారా విప్రనష్టమహోత్సవా. 19
అస్థి సంచయ సంకీర్ణా మహాభూతరవాకులా,
శూన్యభూయిష్ఠనగరా దగ్ధగ్రామనివేశనా. 20
క్వచిద్ఘోరైః క్వచిచ్ఛస్త్రైః క్వచిద్రాజభి రాతురైః,
పరస్పర భయా చ్చైవ శూన్యభూయిష్ఠ నిర్జనా. 21
గతదైవతసంస్థానా వృద్ధలోక నిరాకృతా,
గోజావిమహిషీహీనా పరస్పరపరాహతా. 22
హతవిప్రా హతారక్షా ప్రణష్టౌషధి సఞ్చయా,
సర్వభూతతరుప్రాయా బభూవ వసుధా తదా. 23
భూమి వట్టిపోయిన నీటిగుంటలు కలది ఆయెను. జనులు చలివేంద్రములనుండి మరలి పోయిరి. యజ్ఞములు, వేదముల చదువులు, వషట్కారముల మంగళములు కానరావు. వ్యవసాయము, గోపాలనము నశించినది. అంగళ్లయందు కొనుటయు అమ్ముటయు లేవు. యజ్ఞములందు పశువులు, కట్టు కొయ్యలు కనబడవు. వేడుకలు మచ్చునకైనను లేవు. ఎముకల ప్రోవులు చెల్లాచెదరై పడి యున్నవి. పెనుభూతములు గొంతెత్తి అరచుచున్నవి. నగరములలో జనముల అలికిడి లేదు. గ్రామములందలి కొంపలన్నియు కాలిపోయినవి. కొన్ని యెడల ఘోరములతో, కొన్ని యెడల ఆయుధములతో, కొన్నియెడల దిక్కుతోచని రాజులతో, ఒకరివలన ఒకరు భయమంది జనులందరు వీళ్లు వదలి పోయిరి. దేవాలయములు పాడుబడినవి. పెద్దలను మన్నించువారు లేరు. ఆవులు, మేకలు, గొఱ్ఱెలు, ఎనుములు కానరాకున్నవి. ఉన్న కొలదిమందియు ఒకరినొకరు కొట్టుకొని చచ్చుచున్నారు. విద్యావంతులను, రక్షకభటులను చంపివేయుచున్నారు. మందు మాకులు మొత్తముగా రూపుమాసి పోయినవి. అంతయు శ్మశాన వృక్షము వలె నైపోయినది.
తస్మిన్ ప్రతిభయే కాలే క్షతే ధర్మే యుధిష్ఠిర,
బభూవుః క్షుధితా మర్త్యాః ఖాదమానా: పరస్పరమ్. 24
నాయనా! యుధిష్ఠిరా! అట్టి మహాభయంకరకాలమున ధర్మము రూపుమాసిపోగా ఆకలిగొన్న మానవులు ఒకరినొకరు మ్రింగువారైరి.
ఋషయో నియమాం స్త్యక్త్వా పరిత్యజ్యాగ్ని దేవతాః,
ఆశ్రమాన్ సంపరిత్యజ్య పర్యధావ న్నిత స్తతః. 25
ఋషులును నియమములను, అగ్నిదేవతలను, ఆశ్రమములను వదలివైచి దిక్కుతోచక చెల్లాచెదరైరి.
విశ్వామిత్రోఽథ భగవా న్మహర్షి రనికేతనః,
క్షుధాపరిగతో ధీమాన్ సమన్తా త్పర్యధావత. 26
మహానుభావుడగు విశ్వామిత్రమహర్షి నిలువనీడలేనివాడై ఆకలినిలువెల్ల క్రమ్ముకొనగా దిక్కుమాలి త్రిమ్మరసాగెను.
త్యక్త్యా దారాంశ్చ పుత్రాంశ్చ కస్మింశ్చ జనసంపది,
భక్ష్యాభక్ష్య సమో భూత్వా నిరగ్ని రనికేతనః 27
భార్యను, పుత్రులను ఒకానొక జనుల గుంపు కడ వదలి ఆతడు ఆగ్నిహోత్రముల అర్చనము, కొంపయు లేనివాడై తినదగినది తగనిది అనువానియందు సమభావము కలవాడై యుండెను.
స కదాచిత్పరిపతన్ శ్వపచానాం నివేశనమ్,
హింస్రాణాం ప్రాణిఘాతానా మాససాద వనే క్వచిత్. 28
క్రూరచిత్తులై ప్రాణిహింసచేయు చండాలుర వసతికి ఒకనాడు ఆతడు చేరుకొనెను.
విభిన్న కలశాకీర్ణం శ్వచర్మచ్ఛేదనాయుతమ్,
వరాహఖరభగ్నాస్థి కపాలఘట సంకులమ్. 29
మృతచైలపరిస్తీర్ణం నిర్మాల్యకృత భూషణమ్,
సర్పనిర్మోకమాలాభిః కృతచిహ్నకుటీ మఠమ్. 30
కుక్కుటారావబహులం గర్దభ ధ్వనినాదితమ్,
ఉద్ఘోషద్భిః ఖరై ర్వాక్యైః కలహద్భిః పరస్పరమ్. 31
ఉలూకపక్షిధ్వనిభి ర్దేవతాయతనై ర్వృతమ్,
లోహఘణ్టా పరిష్కారం శ్వయూథ పరివారితమ్. 32
అది పగిలిన కుండపెంకులతో, చిరిగిన కుక్కతోళ్లతో, పందుల, గాడిదల పగిలిన పుఱ్ఱెలతో ఎముకలతో చిందరవందరగా నుండెను. శవములతో, గుడ్డపీలికలతో, రూపుమాసిన మాలలతో, పాముకుబుసములతో కొంపలన్నియు నిండియున్నవి. కోడికూతలతో, గాడిదల అరపులతో, కాఱుకూతలతో ఒకరితో నొకరు పోరాడుచున్న జనములతో నిండియున్నది. దేవాలయములలో గ్రుడ్లగూబల రొదలు పిక్కటిల్లియున్నవి. లోహపుఘంటలు, కుక్కల మందలు అందు నిండుగా నున్నవి.
తత్ప్రవిశ్య క్షుధావిష్టో విశ్వామిత్రో మహానృషిః,
ఆహారాన్వేషణే యుక్తః పరం యత్నం సమాస్థితః. 33
అట్టి గూడెమున ప్రవేశించి మహర్షి విశ్వామిత్రుడు ఆకలి పైకొనగా తిండికొరకు మిక్కిలి ప్రయత్నముతో వెదకుచుండెను.
నచ క్వచిదవిన్దత్స భిక్షమాణోఽపి కౌశికః,
మాంస మన్నం ఫలం మూల మన్యద్వా తత్ర కిఞ్చన. 34
విశ్వామిత్రుడు ఎంతగా బిచ్చమెత్తినను ఆతనికి ఇంత మాంసమో, అన్నమో, పండో, దుంపయో మరియొకటియో దొరకదాయెను.
అహో కృచ్ఛ్రం మయా ప్రాప్త మితి నిశ్చిత్య కౌశికః,
పపాత భూమౌ దౌర్బల్యా త్తస్మింశ్చాణ్డాల పక్కణే. 35
అయ్యో! ఎంతటి కష్టము నాకు దాపురించినది! అనుకొనుచు ఆ కౌశికుడు సత్తువలేని కారణమున ఆ చండాలుని అంగడిలో నేలఁగూలెను.
స చిన్తయామాస మునిః కింను మే సుకృతం భవేత్,
కథం వృథా న మృత్యుః స్యా దితి పార్థివసత్తమ. 36
ఆ ముని అయ్యో! నా పుణ్యమెట్టిదియో కదా! కూడు లేక నాకు చావెట్లు సంభవింపకుండును? అని తలపోయుచుండెను.
స దదర్శ శ్వమాంసస్య కుతన్త్రీం వితతాం మునిః,
చాణ్డాలస్య గృహే రాజన్ సద్యః శస్త్రహతస్య వై. 37
అప్పుడతడు ఆ చండాలుని గృహమున అప్పుడే ఆయుధముతో చచ్చిన కుక్క మాంసము గల పొడవైన కట్టెను గాంచెను.
స చిన్తయామాస తదా స్తైన్యం కార్య మితో మయా,
న హీదానీ ముపాయో మే విద్యతే ప్రాణధారణే. 38
అప్పు డత డిట్లు తలపోసెను. ఇప్పుడు దీని నుండి నేను దొంగిలింప వలయును. ప్రాణములు నిలుపుకొనుటకు ఇపుడు మరియొక ఉపాయము లేదు.
ఆపత్సు విహితం స్తైన్యం విశిష్టం చ మహీయసః,
విప్రేణ ప్రాణరక్షార్థం కర్తవ్య మితి నిశ్చయః. 39
ముఖ్యముగా ఎంత గొప్పవ్యక్తి కైనను ఆపదలయందు దొంగతనము విహితమే. విప్రుడు ప్రాణరక్షణ కొరకు చేయదగుననియే నిర్ణయము.
హీనా దాదేయ మాదౌ స్యాత్సమానా త్తదనంతరమ్,
అసంభవే వాఽఽదదీత విశిష్టా దపి ధార్మికాత్. 40
మొదట తక్కువ వాని నుండి గ్రహింపదగును. పిదప సమానుని నుండి కొనవలయును. అదియు ఏర్పడనిచోట విశిష్టుడగు ధార్మికుని నుండియైనను తీసికొనవలయును.
సోఽహ మన్త్యావసాయానాం హరా మ్యేనాం ప్రతిగ్రహాత్,
న స్తైన్యదోషం పశ్యామి హరిష్యామి శ్వజాఘనీమ్. 41
అట్టి నేను కడజాతి వారి యీ వస్తువును దొంగిలింతును. బిచ్చమెత్తి పుచ్చుకొనుట కంటె ఈ దొంగతనము మిన్నయగు దోషముగా నేను సంభావింపను. కుక్కపిక్కను దొంగిలింతును.
ఏతాం బుద్ధిం సమాస్థాయ విశ్వామిత్రో మహామునిః,
తస్మిన్ దేశే స సుష్వాప శ్వపచో యత్ర భారత. 42
ఇట్టి బుద్ధిని పొంది విశ్వామిత్రమహాముని ఆ చండాలుడున్న ప్రదేశమున నిదురించెను.
స విగాఢాం నిశాం దృష్ట్వా సుప్తే చాణ్డాలపక్కణే,
శనై రుత్థాయ భగవాన్ ప్రవివేశ కుటీ మతః. 43
అతడు చిమ్మచీకటిని గాంచి ఆచండాల కుటుంబము నిద్రించియుండగా మెల్లగా లేచి గుడిసె లోనికి చొరబారెను.
స సుప్త ఇవ చాణ్డాలః శ్లేష్మా పిహితలోచనః,
పరిభిన్నస్వరో రూక్షః ప్రోవా చాప్రియదర్శనః. 44
నిద్రించుచున్నట్లున్న ఆ చర్మకారుడు పుసులతో మూతవడుచున్న కన్నులు కలవాడు, చించుకొనుగొంతుక కలవాడునై చూడరాని స్వరూపముతో పరుషముగా నిట్లు అరచెను.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లు పలికెను.
కః కుతన్త్రీం ఘట్టయతి సుప్తే చాణ్డాల పక్కణే,
జాగర్మి నాత్ర సుప్తోఽస్మి హతోఽసీతి చ దారుణః. 45
ఎవడురా! చండాల కులమంతయు నిద్రించుచుండగా దండెమును త్రెంచుచున్నాడు? నేను మేల్కొనియే యున్నాను. నిద్రింపలేదు. నీవు చచ్చితివి - అని దారుణుడై పల్కెను.
విశ్వామిత్ర స్తతో భీతః సహసా తమువాచ హ,
తత్ర వ్రీడాకులముఖః సోద్వేగ స్తేన కర్మణా. 46
అంత విశ్వామిత్రుడు వెరగుపడి సంభ్రమముతో సిగ్గుతో కుమిలిపోవుచున్న మొగముతో, కుతకుత లాడుచున్న గుండెతో వానితో నిట్లు పలికెను.
విశ్వామిత్రో ఽహ మాయుష్మ న్నాగతోఽహం బుభుక్షితః,
మా వధీ ర్మమ సద్బుద్ధే యది సమ్యక్ ప్రపశ్యసి. 47
చిరంజీవీ! నేను విశ్వామిత్రుడను. ఆకలిగొని ఇచటకు వచ్చితిని. చల్లనిచూపు చూచి ఓ సద్బుద్దీ! నన్ను చంపకు.
చాణ్డాల స్త ద్వచః శ్రుత్వా మహర్షే ర్భావితాత్మనః,
శయనా దుపసంభ్రాంత ఉద్యయౌ ప్రతి తం తతః. 48
ఆ గోసగి దొడ్డబుద్ధిగల మహర్షి ఆడిన ఆ మాట విని గబగబ పడక నుండి లేచి ఆతనికడ కరుదెంచెను.
స విసృజ్యాశ్రు నేత్రాభ్యాం బహుమానా త్కృతాఞ్జలిః,
ఉవాచ కౌశికం రాత్రౌ బ్రహ్మన్ కిం తే చికీర్షితమ్. 49
కన్నులనుండి నీరు కార్చుచు, మన్ననతో దోసిలిపట్టి ఆతడు విశ్వామిత్రునితో ఆ రాత్రిపూట, బాపనయ్యా! నీవు చేయగోరినదేమి? అని పలికెను.
విశ్వామిత్ర స్తు మాతఙ్గ మువాచ పరిసాన్త్వయన్,
క్షుధితోఽహం గతప్రాణో హరిష్యామి శ్వజాఘనీమ్. 50
అప్పుడు విశామిత్రుడు ఆ మాతంగుని బ్రతిమాలుచు నేను ఆకొంటిని. ప్రాణములు పోయినవే అన్నట్లున్నవి. అందువలన కుక్కపిక్కను దొంగిలింపవలయు ననుకొంటిని.
క్షుధితః కలుషం యాతో నాస్తి హ్రీ రశనార్థినః,
క్షుచ్చ మాం దూషయత్యత్ర హరిష్యామి శ్వజాఘనీమ్. 51
కడుపు కాలుచున్నవాడు ఏ పాపమునకైనను ఒడిగట్టును. అన్నముకొరకు వెంపరలాడు వానికి సిగ్గుండదు. ఆకలి నన్ను చెడగొట్టినది. కుక్క పిక్కను దొంగిలింప నుంటిని.
అవసీదన్తి మే ప్రాణాః శ్రుతి ర్మే నశ్యతి క్షుధా,
దుర్బలో నష్టసంజ్ఞశ్చ భక్ష్యాభక్ష్య వివర్జితః. 52
నా ప్రాణములు కడబట్టుచున్నవి. నా చదువు చచ్చినది. ఆకలి పిక్కటిల్లి యున్నది. సత్తువ లేదు. జ్ఞానము నశించినది. తినదగినది, తినదగనిది అను వివేకము వదలి పోయినది.
సో ఽ ధర్మం బుద్ధ్యమానోఽపి హరిష్యామి శ్వజాఘనీమ్,
అటన్ భైక్ష్యం న విన్దామి యదా యుష్మాక మాలయే. 53
అట్టి నేను తెలిసి తెలిసి కుక్క మాంసమును దొంగిలించుచున్నాను. మీ యిండ్లలో బిచ్చమునకు తిరుగుచు ఏమియు పొందకున్నాను.
తదా బుద్ధిః కృతా పాపే హరిష్యామి శ్వజాఘనీమ్,
అగ్ని ర్ముఖం పురోధాశ్చ దేవానాం శుచిషా డ్విభుః. 54
యథావత్సర్వభు గ్బ్రహ్మా తథా మాం విద్ధి ధర్మతః,
అట్టి స్థితిలో నాకీ కుక్కపిక్కను దొంగిలింపవలయునను బుద్ధి పుట్టినది. అగ్ని దేవతలకు ముఖము. పురోహితుడు. సర్వమును తినువాడైనను శుద్ధములనే సహించును. అట్లే ధర్మముననుసరించి బ్రాహ్మణుడ నగు నన్ను కూడ అట్లే భావింపుము.
త మువాచ స చణ్డాలో మహర్షే శృణు మే వచః. 55
శ్రుత్వా తత్త్వం తథాఽఽతిష్ఠ యథా ధర్మో న హీయతే,
ధర్మం తవాపి విప్రర్షే శృణు యత్తే బ్రవీమ్యహమ్. 56
అంత ఆ చండాలుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. “మహర్షీ! నా మాట విను. విని ఎట్లు ధర్మము చెడదో అట్లాచరింపుము. బ్రహ్మర్షీ ! నీకును ధర్మమైన దానిని చెప్పెదను.”
శృగాలా దధమం శ్వానం ప్రవదన్తి మనీషిణః,
తస్యా ప్యధమ ఉద్దేశః శరీరస్య శ్వజాఘనీ. 57
కుక్కను నక్కకంటె నీచమైనదిగా జ్ఞానసంపన్నులు పేర్కొందురు. దాని శరీరమునందును పిక్క మరియు నీచమైనది.
నేదం సమ్యగ్వ్యవసితం మహర్షే ధర్మగర్హితమ్,
చాణ్డాల స్వస్య హరణ మభక్ష్యస్య విశేషతః. 58
మహర్షీ! ఈ నిర్ణయము సరియైనది కాదు. ధర్మమునకు నింద్యమైనది. చండాలుని సొమ్ము - అందును తినరానిది అగుదానిని హరించుట!
సాధ్వన్య మనుపశ్య త్వ ముపాయం ప్రాణధారణే,
న మాంసలోభా త్తపసో నాశ స్తే స్యా న్మహామునే. 59
కనుక ప్రాణము నిలుపుకొనుటకు నీవు మరియొక ఉపాయమును చూచుకొనుట మేలు. మహామునీ! మాంసలోభమువలన నీ తపస్సునకు నాశము కలుగకుండుగాక!
జానతా విహితం ధర్మం న కార్యో ధర్మసంకరః,
మా స్మ ధర్మం పరిత్యాక్షీ స్త్వం హి ధర్మభృతాం వరః. 60
ధర్మము నెరిగినవాడే ధర్మసంకరమును చేయరాదు గదా! ధర్మమును విడువవలదు. నీవు ధర్మమెరిగిన వారిలో శ్రేష్ఠుడవు.
విశ్వామిత్ర స్తతో రాజ న్నిత్యుక్తో భరతర్షభ,
క్షుధార్తః ప్రత్యువా చేదం పున రేవ మహామునిః, 61
రాజా! అత డిట్లు పలుకగా ఆకలి పైకొన్న విశ్వామిత్రమహాముని ఆతనితో మరల నిట్లు పలికెను.
నిరాహారస్య సుమహా న్మమ కాలో ఽ భిధావతః,
న విద్యతేఽప్యుపాయశ్చ కశ్చి న్మే ప్రాణధారణే. 62
తిండిలేక తిరుగుళ్లుపడుచున్న నాకు పెద్దకాలము గడచినది. ప్రాణములు నిలుపుకొనుటలో ఉపాయము కూడ ఏదియు కానరాదు.
యేన యేన విశేషేణ కర్మణా యేన కేనచిత్,
అభ్యుజ్జీవే త్సాద్యమానః సమర్థో ధర్మమాచరేత్. 63
ఏదో ఒక విశేషముతో ఏదో ఒక కార్యముతో చావ నున్నవాడు బ్రదుక వలయును. పిదప సమర్థుడై ధర్మము నాచరింపవలయును.
ఐన్ద్రో ధర్మః క్షత్రియాణాం బ్రాహ్మణా నా మథాగ్నికః,
బ్రహ్మవహ్ని ర్మమ బలం భక్ష్యామి శమయన్ క్షుధామ్. 64
క్షత్రియులకు పాలనమే ధర్మము. బ్రాహ్మణులకు అగ్నిధర్మమే ధర్మము. వేదమనెడు అగ్నియే నాకు బలము. కనుక ఆకలిని చల్లార్చుచు దీనిని తిందును.
యథా యథా వై జీవేద్ధి తత్కర్తవ్య మహేలయా,
జీవితం మరణా చ్ఛే యో జీవన్ ధర్మ మవాప్నుయాత్. 65
మానవుడు ఎట్లెట్లో బ్రదుకవలయును. సిగ్గుపడక దానిని చేయుటయే కర్తవ్యము. చావుకంటె బ్రదుకుట మేలు. బ్రదికినచో ధర్మమును పొందవచ్చును.
సో ఽహం జీవిత మాకాంక్ష న్నభక్ష్యస్యాపి భక్షణమ్,
వ్యవస్యే బుద్ధిపూర్వం వై తద్భవా ననుమన్యతామ్. 66
అట్టి నేను బ్రదుకు కోరుచు బుద్ధిపూర్వకముగా తినరానిదానిని తినుటకు నిశ్చయించితిని. దానిని నీ వనుమతింపవలయును.
బలవన్తం కరిష్యామి ప్రణోత్స్యా మ్యశుభాని తు,
తపోభి ర్విద్యయా చైవ జ్యోతీంషీవ మహత్తమః. 67
తపస్సులచేత, విద్యచేతను నన్ను నేను బలవంతుని చేసికొందును. వెలుగులు గొప్ప చీకటిని వలె అశుభములను పారద్రోలి వైచెదను.
శ్వపచ ఉవాచ - గోసగి యిట్లు పలికెను.
నైత త్ఖాదన్ ప్రాప్నుతే దీర్ఘ మాయు ర్నైవ ప్రాణా న్నామృతస్యేవ తృప్తిః,
భిక్షా మన్యాం భిక్ష మా తే మనోఽస్తు శ్వభక్షణే శ్వా హ్యభక్ష్యో ద్విజానామ్. 68
దీనిని తిని నీవు దీర్ఘమగు ఆయువు పొందవు. నీ ప్రాణములు దీనితో నిలువవు. అమృతము వలె ఇది నీకు తృప్తి నొసగదు. మఱియొక భిక్ష వేడుము. నీ మనస్సు కుక్కతిండియందు నిలువకుండుగాక! కుక్క బాపనయ్యలకు తినరానిది గదా!
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
న దుర్భిక్షే సులభం మాంస మన్య చ్ఛ్వపాక మన్యే న చ మేఽస్తి విత్తమ్,
క్షుధార్త శ్చాహ మగతి ర్నిరాశః శ్వమాంసే చాస్మిన్ షడ్రసాన్ సాధు మన్యే. 69
కరవు దినములలో నాకు వేరుమాంసము సులభము కాదు. గోసగీ! నాకా ధనము లేదు! ఆకలి ప్రాణములు తీయుచున్నది. మరియొక దిక్కు లేదు. ఆసలు చచ్చినవి. ఈ కుక్క మాంసమునందే ఇప్పుడు ఆరు రుచులను లెస్సగా భావింతును.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లనెను.
పఞ్చ పఞ్చనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రస్య వై విశః,
యథా శాస్త్రం ప్రమాణం తే మా భక్ష్యే మానసం కృథాః. 70
బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు అయిదుగోళ్ల జంతువులు అయిదు మాత్రమే తినదగినవి. నీకు శాస్త్రము ప్రమాణమైనచో తినరాని దానియందు మనసుపెట్టకుము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
అగస్త్యే నాసురో జగ్ధ వాతాపీ: క్షుధితేన వై,
అహ మాపద్గతః క్షుత్తో భక్షయిష్యే శ్వజాఘనీమ్. 71
ఆకలిగొన్న అగస్త్యుడు వాతాపి అను రక్కసుని మ్రింగి వైచెను. నేను ఆకలివలన ఆపద నొందితిని. కుక్కమాంసమును తిందును.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లనెను.
భిక్షా మన్యా మాహరేతి న చ కర్తు మిహార్హసి,
న నూనం కార్య మేతద్వై హర కామం శ్వజాఘనీమ్. 72
మరియొక బిచ్చమును తెచ్చికొనుమని చెప్పుచుండగా నీవా పని చేయనొల్లవు. ఇది నీకు తగని పని. నీ యిష్టము. కుక్కమాంసమును గొనిపొమ్ము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
శిష్టా వై కారణం ధర్మే తద్వృత్త మనువర్తయే,
పరాం మేధ్యాశనా దేనాం భక్ష్యాం మన్యే శ్వజాఘనీమ్. 73
ధర్మవిషయమున శిష్టులు ప్రమాణము. నేనును వారి దారి ననుసరింతును. పవిత్రమగు భోజనముకంటె ఈ కుక్క మాంసమును ఇప్పుడు తినదగిన దానినిగా భావింతును.
శ్వపచ ఉవాచ - శ్వపాకు డిట్లనెను.
అసతా యత్సమాచీర్ణం న చ ధర్మః సనాతనః,
నాకార్య మిహ కార్యం వై మా ఛలేనాశుభం కృథాః. 74
అసజ్జనుడు చేసినది సనాతనమగు ధర్మము కాదు. కూడని పని ఎన్నటికిని కూడని పనియే. నెపముతో పాడుపని చేయకుము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
న పాతకం నావమత మృషిః సన్కర్తు మర్హతి,
సమౌ చ శ్వమృగౌ మన్యే తస్మాద్భోక్ష్యే శ్వజాఘనీమ్. 75
ఋషి పాతకమును, ధర్మము ఒల్లని దానిని చేయడు కదా! ఇచట కుక్క, అచట గొఱ్ఱెపోతు ఒక్కవిధమైనవియే కదా! కనుక కుక్కమాంసమును తిందును.
శ్వపచ ఉవాచ - శ్వపచు డిట్లనెను.
యద్ర్బాహ్మణే కృత మర్థితేన తేనర్షిణా తదవస్థాధికారే,
స వై ధర్మో యత్ర న పాప మస్తి సర్వై రుపాయై ర్గురవో హి రక్ష్యాః. 76
ఆ అగస్త్యుడు బ్రాహ్మణులు ప్రార్థింపగా వారికొరకు, అగతికముగా ఆ జంతువును తినుటను చేసెను. పాపము లేని తావున అది ధర్మమే. ఉపాయము లన్నింటితో గురువులను రక్షించుకొనవలయును గదా!
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
మిత్రం చ మే బ్రాహ్మణస్యాయ మాత్మా ప్రియశ్చమే పూజ్యతమశ్చ లోకే,
తం ధర్తుకామోఽహ మిమాం జిహీర్షే నృశంసానా మీదృశానాం న బిభ్యే. 77
నేను బ్రాహ్మణుడను. నాకీ దేహము మిత్రము. మిక్కిలి ప్రియమైనది. దీనిని ఈ లోకమున నేను మిక్కిలిగా మన్నింపవలయును. దానిని కాపాడుట కొరకై, ఈ కుక్క మాంసమును గొనిపోవనున్నాను. ఇట్టి క్రూర కర్మములకు నేను భయపడను.
శ్వపచ ఉవాచ - శ్వపచు డిట్లనెను.
కామం నరా జీవితం సంత్యజన్తి న చాభక్ష్యే క్వచిత్ కుర్వన్తి బుద్ధిమ్,
సర్వాన్ కామాన్ ప్రాప్నువన్తీ హ విద్వన్ ప్రియస్వ కామం సహితః క్షుధైవ. 78
నరులు బ్రదుకునైన విడుతురు. కాని తినరాని తిండియందు బుద్ధిపెట్టరు. ఓ తెలివిగలవాడా! అట్లు వారు కామము లన్నింటిని పొందుదురు. కనుక నీవు ఆకలి తోడనే కోరికను నింపుకొనుము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లు పలికెను.
స్థానే భవేత్సయశః ప్రేత్యభావే నిఃసంశయః కర్మణాం వై వినాశః,
అహం పున ర్ర్వత నిత్యః శమాత్మా మూలం రక్ష్యం భక్షయిష్యా మ్యభక్ష్యమ్. 79
ఆ కోరిక మరణము కలిగినచో కీర్తిదాయకము కాగలదనుట యుక్తమే. కానీ కర్మములు నశించుట తప్పక కలుగునది కదా! నేనన్ననో వ్రతములయందు నిష్ఠ కలవాడను. శాంతమగు ఆత్మకలవాడను. మూలమును రక్షించుకొనవలయును గదా! అందువలన తినరానిదైనను దీనిని తిందును.
బుద్ధ్యాత్మకే వ్యక్త మస్తీతి పుణ్యం మోహాత్మకే యత్ర యథా శ్వభక్ష్యే,
యద్య ప్యేత త్సంశయాత్మా చరామి నాహం భవిష్యామి యథా త్వమేవ. 80
బుద్ధిరూపముతో ఆలోచింపగా ఇచట పుణ్యము కలదనుట స్పష్టము. మోహబుద్ధితో విచారింపగా కుక్కమాంసమును తినుట నీవు చెప్పినట్లే యగును. అయినను సంశయాత్ముడనై దీనిని తిందును. అంతమాత్రమున నేను నీవంటివాడను కాను.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లు పలికెను.
గోపనీయ మిదం దుఃఖ మితి మే నిశ్చితా మతిః,
దుష్కృతో బ్రాహ్మణః సత్రం యస్త్వామహ ముపాలభే. 81
ఈ కుక్కమాంసపు తిండి అనెడి పాపము గుట్టుగా ఉంచదగినదని నా నిశ్చితమైన బుద్ధి. కనుక నేను చెడ్డవాడను, బ్రాహ్మణేతరుడను అయినను, వంచన చేయువాడనగుదునన్న భయముతో నిన్ను మందలించుచున్నాను.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లు పలికెను.
పిబన్త్యేవోదకం గావో మణ్డూకేషు రువత్స్వపి,
న తేఽధికారో ధర్మేఽస్తి మా భూ రాత్మప్రశంసకః. 82
కప్పలు అరచుచున్నను ఆవులు నీరు త్రావుచునే యుండును. నీకు ధర్మమున అధికారము లేదు. ఆత్మస్తుతి చేసికొనువాడవు కాకుము.
శ్వపచ ఉవాచ - శ్వపచు డిట్లు పలికెను.
సుహృ ద్భూత్వాఽనుశాసే త్వాం కృపా హి త్వయి మే ద్విజ,
య దిదం శ్రేయ ఆధత్స్వ మాలోభా త్పాతకం కృథాః. 83
బాపనయ్యా! నీవు చెలికాడవని నీకు ఉపదేశము చేయుచున్నాను. నీ యందు నాకు జాలి కలదు కదా! ఇది నీకు మేలే అయినచో కానిమ్ము. కానీ లోభముతో పాతకము చేయకుము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.
సుహృన్మే త్వం సుఖేప్సు శ్చే దాపదో మాం సముద్ధర,
జానేఽహం ధర్మతోఽత్మానం శౌనీ ముత్సృజ జాఘనీమ్. 84
నీవు నాకు మిత్రమ వైనచో, నా సుఖము కోరువాడవగుదువేని నన్నుద్ధరింపుము. ధర్మవిషయమున నన్ను నేనెరుగుదును. ఈ కుక్కపిక్కను వదలుము.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లనెను.
నైవోత్సహే భవతో దాతు మేతాం నోపేక్షితుం హ్రియమాణం స్వమన్నమ్,
ఉభౌ స్యావ: పాపలోకావలిప్తౌ దాతా చాహం బ్రాహ్మణ స్వం ప్రతీచ్ఛన్. 85
దీనిని నీకు దాన మొసగ నొల్లను. నా అన్నమును దొంగిలించుచుండగా చూచుచు ఊరకుండను ఒల్లను. ఇచ్చెడు నేనును, పుచ్చుకొనెడు బ్రాహ్మణుడవు నీవును ఇరువురము పాపలోకముల కరుగువారము. పాపమంటినవారము నగుదుము.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు. డిట్లనెను.
అద్యాహ మేతద్వృజినం కర్మ కృత్వా జీవం శ్చరిష్యామి మహాపవిత్రమ్,
స పూతాత్మా ధర్మ మేవాభిపత్స్యే యదేతయో ర్గురు తద్వై బ్రవీహి. 86
ఈనాడు నేను ఈ పాడుపని చేసి బ్రదికియున్నచో మహాపవిత్రముగా మార్పునొందగలను. లేదు, పవిత్రమగు దేహము గలవాడనై ధర్మమునే పొందగలను. ఈరెంటిలో ఏది గొప్పదియో నీవు చెప్పుము.
శ్వపచ ఉవాచ - శ్వపచు డిట్లనెను.
ఆత్మైవ సాక్షీ కులధర్మకృత్యే త్వమేవ జానాసి యదత్ర దుష్కృతమ్,
యో హ్యాద్రియా ద్భక్ష్యమితి శ్వమాంసం మన్యే న తస్యాస్తి వివర్జనీయమ్. 87
కులధర్మపు కృత్యమున తనకు తానే సాక్షి. ఇందు పాపమేదో నీవే ఎరుగుదువు. కుక్కమాంసమును తినదగినదానినిగా ఆదరించువానికి వదలదగినది ఏదియు నుండదని నేను తలంతును.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రు డిట్లనెను.
ఉపాదానే ఖాదనే చాస్తి దోషః కార్యాత్యయే నిత్య మత్రాపవాదః,
యస్మిన్ హింసా నానృతం వాచ్యలేశో భక్ష్యక్రియా యత్ర న తద్గరీయః. 88
గ్రహించుట, తినుటయందు, అవును, దోషము కలదు. కానీ ప్రాణములు పోవు సమయమున దీనికి నిత్యముగా అపవాదము కలదు. హింసయు, తప్పుడు మాటయు లేనిచోట కొంచెముపాటి నింద ఉండును. అట్టిపట్టున తినరానిది తినుట పెద్దదోషము కాదు.
శ్వపచ ఉవాచ - శ్వపచు డిట్లనెను.
యద్యేష హేతు స్తవ ఖాదనే స్యా న్న తే వేదః కారణం నార్యధర్మః,
తస్మాద్ భక్ష్యే భక్షణే వా ద్విజేన్ద్ర దోషం న పశ్యామి యథేద మత్ర. 89
నీకు తిండియందు ఇదియే కారణమైనచో, వేదము, ఆర్యధర్మము అనునవి ప్రమాణములు కావన్నమాట! అందువలన తినదగినది, తినరానిది అనువాని విషయమున ఇచట నీ చెప్పెడు దానిని బట్టి దోషము నాకు కానరాదు.
విశ్వామిత్ర ఉవాచ - విశ్వామిత్రుడిట్లు పలికెను.
నైవాతిపాపం భక్షమాణస్య దృష్టం సురాం తు పీత్వా పతతీతి శబ్దః,
అన్యోన్యకార్యాణి యథా తథైవ న పాపమాత్రేణ కృతం హినస్తి. 90
తినరానిదానిని తిన్నవానికి పెద్దపాపము కలుగుట కానరాదు. కాని మద్యము త్రావువాడు భ్రష్టుడగునని శాస్త్రము చెప్పుచున్నది. అట్లే మిథునకార్యములును. కొంచెముపాటి పాపముచేత పుణ్యము చెడిపోవును.
శ్వపచ ఉవాచ - చండాలు డిట్లు పలికెను.
అస్థానతో హీనతః కుత్సితాద్వా తద్విద్వాంసం బాధతే సాధు వృత్తమ్,
శ్వానం పున ర్యో లభతేఽభిషఙ్గా త్తేనాపి దణ్డః సహితవ్య ఏవ. 91
అయోగ్యమగు తావునుండి, హీనునివలన, కుత్సితునివలన లభించునది మంచినడవడి గల విద్వాంసుని తప్పక బాధించును. దురాగ్రహముతో (చెడ్డ పట్టుదలతో) కుక్కను కైవసము చేసి కొనువాడు దానివలన నగు దండమును కూడ సహింపనే వలయును.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
ఏవ ముక్త్యా నివవృతే మాతఙ్గః కౌశికం తదా,
విశ్వామిత్రో జహారైవ కృతబుద్ధి: శ్వజాఘనీమ్. 92
ఇట్లు పలికి ఆ చండాలుడు మరలి పోయెను. విశ్వామిత్రుడు నిశ్చయము చేసికొని ఆ కుక్క మాంసమును కైకొనెను.
తతో జగ్రాహ సశ్వాఙ్గం జీవితార్థీ మహామునిః,
సదార స్తా ము పాహృత్య వనే భోక్తు మియేష సః. 93
అంతట బ్రదుకు కోరిన ఆ మహాముని ఆ కుక్క అంగమును గ్రహించెను. దానిని కొనిపోయి వనమున భార్యతోపాటు తినగోరెను.
అథాస్య బుద్ధి రభవ ద్విధినాహం శ్వజాఘనీమ్,
భక్షయామి యథాకామం పూర్వం సంతర్ప్య దేవతాః. 94
అంత నతనికి ఈ కుక్కపిక్కను విధిపూర్వకముగా ముందు దేవతలకు తర్పణము చేసి పిదప కోరినట్లు తిందును - అనుబుద్ధి పుట్టెను.
తతోఽగ్ని ముపసంహృత్య బ్రాహ్మేణ విధినా మునిః,
ఐన్ద్రాగ్నేయేన విధినా చరుం శ్రపయత స్వయమ్. 95
అంత నతడు అగ్నిని ఏర్పరచుకొని వేదోక్త పద్ధతి ప్రకారము ఇంద్రునకు, అగ్నికి సమర్పించు విధానముతో స్వయముగా చరువును వండెను (చరువు హోమము చేయుటకు వండెడు అన్నము మొదలగునది)
తతః సమారభ త్కర్మ దైవం పిత్య్రం చ భారత,
ఆహూయ దేవా నిన్ద్రాదీన్ భాగం భాగం విధిక్రమాత్. 96
అంత నతడు దైవకార్యమును, పితృకార్యమును ప్రారంభించెను. ఇంద్రుడు మొదలగువారిని మంత్రములతో పిలిచి విధి ననుసరించి భాగములను సమర్పించెను.
ఏతస్మిన్నేవ కాలే తు ప్రవవర్ష స వాసవః,
సఞ్జీవయన్ ప్రజాః సర్వా జనయామాస చౌషధీః. 97
అదే సమయమున దేవేంద్రుడు పెనువాన కురిపించెను. ప్రజలను చక్కగా బ్రదుకునట్లు చేయుచు ఓషధులను పుట్టించెను.
విశ్వామిత్రోఽపి భగవాం స్తపసా దగ్ధ కిల్బిషః,
కాలేన మహతా సిద్ధి మవాప పరమాద్భుతామ్. 98
పూజ్యుడగు విశ్వామిత్రుడును తపస్సుచేత కాలిపోయిన పాపములు గలవాడై పెద్ద కాలమునకు పరమాద్భుతమగు సిద్ధిని పొందెను.
స సంహృత్య చ తత్కర్మ అనాస్వాద్య చ తద్ధవిః,
తోషయామాస దేవాంశ్చ పితౄంశ్చ ద్విజసత్తమః. 99
ఆ విప్రవరేణ్యు డావిధముగా ఆ కర్మమును కూర్చుకొని ఆ హవిస్సును ఆస్వాదింపక దేవతలను, పితృదేవతలను తృప్తిపరచెను.
ఏవం విద్వా నదీనాత్మా వ్యసనస్థో జిజీవిషుః,
సర్వోపాయై రుపాయజ్ఞో దీన మాత్మాన ముద్ధరేత్. 100
ఎరుక కలవాడు, దిగులు పొందనివాడు, బ్రదుకగోరువాడు ఉపాయముల నెరిగినవాడు అగు పురుషుడు ఈవిధముగా కష్టసమయములందు దీనుడగు తన్నుద్ధరించుకొనవలయును.
ఏతాం బుద్ధిం సమాస్థాయ జీవితవ్యం సదా భవేత్,
జీవన్ పుణ్య మవాప్నోతి పురుషో భద్ర మశ్నుతే. 101
ఇట్టి బుద్ధిని కుదురుకొల్పుకొని పురుషుడు బ్రదుకగోరవలయును. బ్రదికియుండిన పుణ్యములు పడయవచ్చును. శుభమును పొందును.
తస్మాత్ కౌన్తేయ విదుషా ధర్మాధర్మ వినిశ్చయే,
బుద్ధి మాస్థాయ లోకేఽస్మిన్ వర్తితవ్యం కృతాత్మనా. 102
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
విశ్వామిత్ర శ్వపచసంవాదే ఏకచత్వారింశదధిక శతతమోఽధ్యాయ:
కుంతీకుమారా! ధర్మమేది, అధర్మమేది అని నిశ్చయించునపుడు విద్వాంసుడు బుద్ధిని ఉపయోగించి కృతకృత్యుడై ఈలోకమున ప్రవర్తింపవలయును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున విశ్వామిత్ర శ్వపచ సంవాదము గల నూట నలుబది యొకటవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
యది ఘోరం సముద్దిష్ట మశ్రద్ధేయ మివానృతమ్,
అస్తి స్విద్దస్యుమర్యాదా యామహం పరివర్జయే. 1
సంముహ్యామి విషీదామి ధర్మో మే శిథిలీకృతః,
ఉద్యమం నాధిగచ్ఛామి కదాచిత్ పరిసాన్త్వయన్. 2
తాతా! నాకు విహితమే అయినను ఘోరమయినది, మనసున ఆదరింపరానిది, అసత్యము వంటిది అగు క్రూరుల మర్యాద ఏదైన గలదా? నేను అట్టిదానిని విడచివేయవలయును గదా!
నాకు గందరగోళముగా నున్నది. దుఃఖము నన్ను ముంచియెత్తుచున్నది. నా ధర్మము పట్టుతప్పి సడలిపోయినది. ఏది చేయవలయునో తోచకున్నది. నన్ను నేనెంత సంబాళించుకొన్నను మనసు నిలువకున్నది.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
నైతచ్ఛ్రుత్వాగమా దేవ తవ ధర్మానుశాసనమ్,
ప్రజ్ఞా సమవిహారోఽయం కవిభిః సంభృతం మధు. 3
ధర్మము యొక్క అనుశాసనము కేవలము శాస్త్రము వలననే ఏర్పడదు. అది ప్రజ్ఞకు ఈడైన విహారము. కవులు కూడబెట్టిన తేనె.
బహ్వ్యః ప్రతివిధాతవ్యాః ప్రజ్ఞా రాజ్ఞా తత స్తతః,
నైకశాఖేన ధర్మేణ యత్రైషా సంప్రవర్తతే. 4
ఒక భాగము మాత్రమే గల ధర్మముతో బుద్ధి ప్రవర్తింపకున్నపుడు రాజు అందందు ఎన్నో ప్రజ్ఞలను కూర్చుకొని ప్రవర్తింపవలయును.
బుద్ధి సఞ్జననో ధర్మ ఆచారశ్చ సతాం సదా,
జ్ఞేయో భవతి కౌరవ్య సదాతద్విద్ధి మే వచః. 5
సత్పురుషులకు ధర్మము, ఆచారము అనునవి ఎల్లవేళల బుద్ధినుండి పుట్టునవి, తెలియదగిన దానిని కౌరవ రాజా! నా మాట నుండి చక్కగా తెలిసికొనుము.
బుద్ధి శ్రేష్ఠా హి రాజాన శ్చరన్తి విజయైషిణః,
ధర్మః ప్రతివిధాతవ్యో బుద్ధ్యా రాజ్ఞా తతస్తతః. 6
బుద్ధిచేత శ్రేష్ఠులైనరాజులు విజయమున వాంఛలు గలవారై చరింతురు. రాజు అందందు విషయములను చక్కగా గ్రహించి బుద్ధితో ధర్మము చక్క దిద్దుకొనవలయును.
నైకశాఖేన ధర్మేణ రాజ్ఞా ధర్మో విధీయతే,
దుర్బలస్య కుతః ప్రజ్ఞా పురస్తా దనుపాహృతా. 7
పెక్కు శాఖలు గల ధర్మముతో రాజునకు ధర్మము విధింపబడుచున్నది. మొదట చక్కగా అలవడని ప్రజ్ఞ దుర్బలునకు ఎట్లు నిలుచును?
అద్వైధజ్ఞః పథి ద్వైధే సంశయం ప్రాప్తు మర్హతి,
బుద్ధిద్వైధం వేదితవ్యం పురస్తా దేవ భారత. 8
రెండు మార్గములు చక్కగా తెలియనివాడు, రెండు విధములు ఒక్కమారుగా ఏర్పడినప్పుడు సంకటమును పొందును. కనుక ముందుగనే బుద్ధిలో రెండు పరిష్కారములను తెలిసికొనియుండవలయును.
పార్శ్వతః కరణం ప్రాజ్ఞో విష్టంభిత్వా ప్రకారయేత్,
జన స్తచ్చరితం ధర్మం విజానా త్యన్యథాఽ న్యథా. 9
తరువాత చేయదగినదానిని బుద్ధిగలవాడు ముందే నిశ్చయించి చేయవలయును. అత డాచరించిన ఆ ధర్మమును జనము వేరువేరుగా సంభావించును.
అమిథ్యాజ్ఞానినః కేచి న్మిథ్యా విజ్ఞానినః పరే,
తద్వై యథా యథం బుద్ధ్వా జ్ఞాన మాదదతే సతామ్. 10
కొందరు నిజమైన జ్ఞానము కలవారు. కొందరు జ్ఞానమున్న వారివలె కానవచ్చెడివారు. అట్టిదానిని ఉన్నదున్నట్లుగా గుర్తించి సజ్జనుల సమ్మతమైన జ్ఞానమును బుద్ధిమంతుడు గ్రహించును.
పరిముష్ణన్తి శాస్త్రాణి ధర్మస్య పరిసన్ధినః,
వైషమ్య మర్థవిద్యానాం నిరర్థాః ఖ్యాపయన్తి తే. 11
ధర్మమునకు శత్రువులైనవారు శాస్త్రములను చెడుదారులు పట్టింతురు. పనికి మాలిన వారై అర్థ విద్యలకు వైషమ్యమును వక్కాణించుచుందురు.
ఆ జిజీవిషవో విద్యాం యశః కామౌ సమన్తతః,
తే సర్వే నృప పాపిష్ఠా ధర్మస్య పరిపన్థినః. 12
విద్యను, కీర్తిని, కామమును ఎల్లయెడల అంటి పెట్టుకొని నిండుజీవనము పొందగోరు వారందరు రాజా! పాపిష్ఠులు, ధర్మమునకు పగవారు.
అపక్వమతయో మన్దా న జానన్తి యథాతథమ్,
యథా హ్యశాస్త్ర కుశలాః సర్వత్రా యుక్తి నిష్ఠితాః. 13
పండని బుద్ధి కలవారు, మందులు అయినవారు శాస్త్రములందు నేర్పులేనివారు, ఎల్లయెడల యుక్తి శూన్యతయందు పాతుకొని పోయినవారు వలె ఉండవలసిన స్థితిని ఎరుగరు.
పరిముష్ణన్తి శాస్త్రాణి శాస్త్ర దోషానుదర్శినః,
విజ్ఞాత మర్థం విద్యానాం స సమ్య గితి వర్తతే. 14
శాస్త్రముల దోషములనే విడువక చూచు స్వభావము కలవారు శాస్త్రములను దుర్వ్యాఖ్యానములు చేయుదురు. విద్యలకు గల చక్కగా తెలిసిన అర్థమును సరిగా లేదని పలుకుదురు.
నిన్దయా పరవిద్యానాం స్వవిద్యాం ఖ్యాపయన్తి చ,
వాగస్త్రా వాక్ఛరీభూతా దుగ్ధవిద్యాఫలా ఇవ. 15
తాన్ విద్యావణిజో విద్ధి రాక్షసా నివ భారత,
వ్యాజేన సద్భి ర్విహితో ధర్మస్తే పరిహాస్యతి. 16
పరవిద్యల నిందతో తమ విద్యను పొగడుకొనుచుందురు. వారికి వాక్కులే అస్త్రములు, వాక్కులే ములుకులైనవారు. విద్యాఫలము నంతటిని పిండుకొన్నామన్నట్లు ప్రవర్తింతురు. వారు రక్కసుల వంటివారని, విద్యలతో వర్తకము చేయువారని ఎరుగుము. సత్పురుషు లేర్పరచిన నీ ధర్మము నెపముతో చేసినదని వెక్కిరింతురు.
న ధర్మ వచనం వాచా నైవ బుద్ద్యేతి నః శ్రుతమ్,
ఇతి బార్హస్పతం జ్ఞానం ప్రోవాచ మఘవా స్వయమ్. 17
ధర్మవచనము కేవలము మాటకో కేవలము బుద్ధికో అందునది కాదని మేము వినియుంటి మనుట బృహస్పతి జ్ఞానమని దేవేంద్రుడు స్వయముగా పలికెను.
న త్వేవ వచనం కించి దనిమిత్తా దిహోచ్యతే,
సువినీతేన శాస్త్రేణ న వ్యవస్యంత్యథాఽపరే. 18
నిమిత్తము లేకుండ ఏవచనము ఇచట పలుక బడదు. కాని కొందరు శాస్త్రము చక్కగా నీతియుక్తమైనను దాని యందు నిశ్చయమును పొందరు.
లోకయాత్రా మిహైకే తు ధర్మం ప్రాహు ర్మనీషిణః,
సముద్దిష్టం సతాం ధర్మం స్వయ మూహేత పణ్డితః. 19
కొందరు బుద్ధిమంతులు ఇహలోకమున లోకయాత్రనే ధర్మముగా వక్కాణింతురు. కావున సజ్జనులు భావించెడు ధర్మమును పండితుడు స్వయముగా ఊహించుకొన వలయును.
అమర్షా చ్ఛాస్త్రసమ్మోహా దవిజ్ఞానాచ్చ భారత,
శాస్త్రం ప్రాజ్ఞస్య వదతః సమూహే యాత్యదర్శనమ్. 20
బుద్ధిమంతుడు శాస్త్రమును గూర్చి పలుకునపుడు కోపమువలననో, శాస్త్రము తెలియని కారణముననో, బుద్ధికుశలత లేని కారణముననో అది సభయందు తెలియరాని దశకు చేరుకొనును.
ఆగతాగమయా బుద్ధ్యా వచనేన ప్రశస్యతే,
అజ్ఞానాద్ జ్ఞాన హేతుత్వా ద్వచనం సాధు మన్యతే, 21
వేదజ్ఞానముతో కూడిన బుద్ధిచేత పలికినమాటచేత శాస్త్రము ప్రశంస పొందుచున్నది. తెలియని దశలో జ్ఞానము కలుగుటకు కారణమైనది కావున శాస్త్ర వచనమును, ఇతరుడు, మంచిదిగా తలచుచున్నాడు.
అనయా హతమే వేద మితి శాస్త్ర మపార్థకమ్,
దైతేయా నుశనా ప్రాహ సంశయచ్ఛేదనం పురా. 22
ఈ బుద్ధి చేత ఈ శాస్త్రము చచ్చినదని కొందరు శాస్త్రమును వ్యర్థమైనదిగా భావింతురు. ఇట్టి విషయములలో సంశయమును కొట్టివైచు వాక్యమును శుక్రాచార్యుడు రాక్షసులకు బోధించెను.
జ్ఞాన మప్యపదిశ్యం హి యథా నాస్తి తథైవ తత్,
తం తథా ఛిన్నమూలేన సన్నోదయితు మీర్హసి. 23
రెండు అంచులను తాకుచుండెడు జ్ఞానము, లేనిదెట్లో అట్లే వ్యర్థము. (రెండు అంచులను తాకుట అనగా - నిశ్చయ భావము లేకుండ ఊగులాడు చుండుట - అది జ్ఞానస్వరూపము కాదని తాత్పర్యము.) అట్టి సంశయమును మొదలంట పెకలించి వైచి నీవు దూరము చేసికోవలయును.
అనవ్యవహితం యో వా నేదం వాక్య ముపాశ్నుతే,
ఉగ్రాయైవ హి సృష్టోఽసి కర్మణే న త్వ మిక్షసే. 24
అయుక్తమగు ఇట్టి వాక్యమును నీవు గాని అంగీకరింపవేని అది సరియైనది కాదు. నీవు ఉగ్రమైన కర్మమునకే సృజింపఁబడితివి. దానిని నీవు చక్కగా చూడకున్నావు.
అఙ్గ మామన్వవేక్షస్వ రాజన్యాయ బుభూషతే,
యథా ప్రముచ్యతే త్వన్యో యదర్థం న ప్రమోదతే. 25
అంగమా! ఐశ్వర్యము పొందగోరు రాజ సమూహముకొరకు అది యెట్లు విడుదల పొందుచున్నదో, ఇతరమైన లోకము దేనికొరకు ఆనందమందకుండునో ఆవిధముగా నన్ను పరికింపుము.
అజోఽశ్వః క్షత్ర మిత్యేతత్ సదృశం బ్రహ్మణా కృతమ్,
తస్మాదభీక్ష్ణం భూతానాం యాత్రా కాచిత్ప్రసిద్ధ్యతి. 26
మేక, గుఱ్ఱము, క్షత్రజాతి ఈ మూడింటిని బ్రహ్మ ఒకే విధముగా సృజించెను. దానివలన ప్రాణుల జీవయాత్ర ఒకటి చక్కగా సాగుచున్నది.
యస్త్యవధ్యవధే దోషః సవధ్యస్యావధే స్మృతః,
సా చైవ ఖలు మర్యాదా యామయం పరివర్జయేత్. 27
వధింపదగనివానిని వధించుట ఎట్టి తప్పో, వధింపదగిన వానిని వధింపకుండుటయు అట్టి తప్పే. క్షత్రియుడు అట్టిదానిని పూర్తిగా వదలుటయే మర్యాద.
తస్మాత్తీక్ష్ణః ప్రజా రాజా స్వధర్మే స్థాపయే త్తతః,
అన్యోన్యం భక్షయన్తో హి ప్రచరేయు ర్వృకా ఇవ. 28
కనుక రాజు తీవ్రస్వభావము కలవాడై ప్రజలను వారి వారి ధర్మములందు కుదురుకొనునట్లు చేయవలయును. లేనిచో ప్రజలు తోడేళ్లవలె ఒకరినొకరు మ్రింగుచు తిరుగుచుందురు.
యస్య దస్యుగణా రాష్ట్రే ధ్వాంక్షా మత్స్యాన్ జలా దివ,
విహరన్తి పరస్వాని సవై క్షత్రియ పాంసనః. 29
ఎవని రాష్ట్రమున దొంగమూకలు, నీటినుండి కొక్కెరలు చేపలను వలె, ఇతరుల సొమ్ములను కొల్లగొట్టుకొని పోవుదురో అట్టి రాజు క్షత్రియజాతిని మైలపరచు వాడగును.
కులీనాన్ సచివాన్ కృత్వా వేదవిద్యా సమన్వితాన్,
ప్రశాధి పృథివీం రాజన్ ప్రజా ధర్మేణ పాలయన్. 30
వేదవిద్యలు చక్కగా జీర్ణించుకొన్న సత్కులమున పుట్టినవారిని మంత్రులనుగా చేసికొని రాజా! ప్రజలను ధర్మమార్గముతో పాలించుచు ఈ భూమి నేలుము.
విహీనం కర్మణా న్యాయం యః ప్రగృహ్ణాతి భూమిపః,
ఉపాయ స్యావిశేషజ్ఞం తద్వై క్షత్రం నపుంసకమ్. 31
తన విధిని నిర్వర్తింపక అన్యాయముగా ప్రజలనుండి పన్నులను రాజు రాబట్టునేని ఉపాయముల విశేషముల నెరుగని ఆతని క్షత్రియకులము మగతనము లేనిది.
నైవోగ్రం నైవ చానుగ్రం ధర్మేణేహ ప్రశస్యతే,
ఉభయం నవ్యతిక్రమే దుగ్రో భూత్వా మృదు ర్భవ. 32
దండము అతిక్రూరముగా నుండరాదు. మరియు తేలికగా నుండరాదు. ధర్మమార్గమున నుండునది కొనియాడబడును. రెంటిని మేరమీరరాదు. తీవ్రుడవయి మెత్తనివాడవు కమ్ము.
కష్టః క్షత్రియధర్మోఽయం సౌహృదం త్వయి మే స్థితమ్,
ఉగ్రకర్మణి సృష్టోఽసి తస్మాద్రాజ్యం ప్రశాధి వై. 33
ఈ క్షత్రియ ధర్మము మిక్కిలి కష్టమైనది. నాకు నీయందు చెలిమి కలదు. నీవు ఉగ్రకర్మము నిమిత్తముగా సృజింపబడితివి. అందువలన రాజ్యమును శాసింపుము.
అశిష్ట నిగ్రహో నిత్యం శిష్టస్య పరిపాలనమ్,
ఏవం శుక్రోఽబ్రవీద్ధీమా నాపత్సు భరతర్షభ. 34
భరతవరేణ్యా! దుష్టులను నిగ్రహించుట, శిష్టుని కాపాడుట అనునది ఆపదలయందును కర్తవ్యమని బుద్ధిశాలియగు శుక్రుడు వాక్రుచ్చెను.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మజు డిట్లు పలికెను.
అస్తి చేదిహ మర్యాదా యామన్యో నాభిలంఘయేత్,
పృచ్ఛామి త్వాం సతాం శ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ. 35
ఇతరుడు దాట శక్యము కాని మర్యాద యేదైన నుండెనేని, సజ్జనవరేణ్యా! నిన్నడుగుచున్నాను. తాతా! దానిని నాకు చెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
బ్రాహ్మణానేవ సేవేత విద్యావృద్ధాం స్తపస్వినః,
శ్రుతిచారిత్ర వృత్తాఢ్యాన్ పవిత్రం హ్యేత దుత్తమమ్. 36
విద్యను పండించుకొన్నవారు, తపస్వులు, విద్యచేతను, ప్రవర్తనచేతను, శీలము చేతను అందరి మన్నన పొందినవారు నగు బ్రహ్మఙ్ఞానసంపన్నులను సేవింపవలయును. ఇది ఉత్తమము, పవిత్రము.
యా దేవతాసు వృత్తి స్తే సాఽస్తు విప్రేషు నిత్యదా,
క్రుద్ధైర్హి విప్రైః కర్మాణి కృతాని బహుధా నృప. 37
నీవు దేవతల యందెట్లు మెలగుదువో విద్యావంతులగువిప్రులయందట్లు ఎల్లవేళల మెలగవలయును. కోపించిన విప్రులు పెక్కు ఘోర కార్యములను చేసి యున్నారు.
ప్రీత్యా యశో భవే న్ముఖ్య మప్రీత్యా పరమం భయమ్,
ప్రీత్యా హ్యమృతవ ద్విప్రాః క్రుద్ధా శ్చైవ విషం యథా. 38
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
ద్విచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
వారి ప్రీతిచేత మేలైన యశస్సు కలుగును. అప్రీతిచేత పరమ భయము సంభవించును. ప్రీతితో విప్రులు అమృతము వంటివా రగదురు. క్రుద్ధులై విషము వంటి వారగుదురు.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున
నూట నలుబది రెండవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద,
శరణం పాల్యమానస్య యో ధర్మస్తం బ్రవీహి మే. 1
తాతా! మహాప్రజ్ఞాశాలీ! సర్వశాస్త్రములలో ఆరితేరిన మహానుభావా! శరణు కోరి వచ్చిన వానిని రక్షించువాని ధర్మమేదియో నాకు తెలుపుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
మహాన్ ధర్మో మహారాజ శరణాగత పాలనే, 2
అర్హః ప్రష్టుం భవాం శ్చైవ ప్రశ్నం భరతసత్తమ.
మహారాజా! శరణు కోరి వచ్చిన వానిని కాపాడుటలో గొప్ప ధర్మము కలదు. భరతోత్తమా! ఇట్టి ప్రశ్న నడుగుటకు నీవే తగుదువు!
శిబి ప్రభృతయో రాజన్ రాజానః శరణాగతాన్,
పరిపాల్య మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. 3
రాజా! శిబి మొదలయిన మహాత్ములగు రాజులు శరణు కోరి వచ్చినవారిని కాపాడి పరమసిద్ధిని పొందిరి.
శ్రూయతే చ కపోతేన శత్రుః శరణ మాగతః,
పూజిత శ్చ యథాన్యాయం స్వైశ్చ మాంసై ర్నిమన్త్రితః. 4
తన్ను శరణుకోరి వచ్చిన పగవానిని పావురము తగువిధముగా మన్నించి తన మాంసములనే భుజింపుమని ప్రార్థించిన కథ వినవచ్చుచున్నది.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
కథం కపోతేన పురా శత్రుః శరణ మాగతః,
స్వమాంసం భోజితః కాంచ గతిం లేభే స భారత. 5
పావురమును పగవాడెట్లు శరణు కోరెను? ఆ పావుర మెట్లు తన మాంసమును వానికి తినఁబెట్టెను. అది ఏ గతి పొందెను?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
శృణు రాజన్ కథాం దివ్యాం సర్వపాప ప్రణాశినీమ్,
నృపతే ర్ముచుకున్దస్య కథితాం భార్గవేణ వై. 6
రాజా! ఈ కథ దివ్యమైనది. అన్ని పాపములను పూర్తిగా నాశనము చేయునట్టిది. దీనిని మునుపు భార్గవుడు ముచుకుందుడను రాజునకు చెప్పెను. దీనిని వినుము.
ఇమ మర్థం పురా పార్థ ముచుకుందో నరాధిపః,
భార్గవం పరిపప్రచ్ఛ ప్రణతః పురుషర్షభ. 7
మునుపు ముచుకుందుడను ఱేడు భార్గవునికి మ్రొక్కి ఈ విషయమును గూర్చి చక్కగా ప్రశ్నించెను.
తస్మై శుశ్రూషమాణాయ భార్గవోఽకథయ త్కథామ్,
ఇమాం యథా కపోతేన సిద్ధిః ప్రాప్తా నరాధిప! 8
చక్కగా సేవ చేయుచున్న ఆ రాజునకు పావురమునకు సిద్ధి ఎట్లు కలిగెనో చెప్పెడు ఈ కథను భార్గవుడు చెప్పెను.
ముని రువాచ - ముని పలికెను.
ధర్మనిశ్చయ సంయుక్తాం కామార్థ సహితాం కథామ్,
శృణుష్వావహితో రాజన్ గదతో మే మహాభుజ! 9
మహాభుజుడా! రాజా! ఈ కథ ధర్మపు నిశ్చయముతో కూడినది. కామము, అర్థము అను పురుషార్థములతో కూడినది. చెప్పెదను. చెదరని మనస్సుతో వినుము.
కశ్చిత్ క్షుద్రసమాచారః పృథివ్యాం కాలసంమితః,
విచచార మహారణ్యే ఘోరః శకునిలుబ్ధకః. 10
ఒక పెద్ద ఆడవిలోనికృష్టమైనప్రవృత్తి కలవాడు, భూతలమున యమునికి సాటియైనవాడు, క్రూరుడు నగు ఒక పిట్టలను పట్టువాడు తిరుగు చుండెడివాడు.
కాకోల ఇవ కృష్ణాంగో రక్తాక్షః కాలసంమితః,
దీర్ఘజంఘో హ్రస్వపాదో మహావక్త్రో మహాహనుః 11
అతడు కాకి వలె నల్లని దేహము కలవాడు, ఎఱ్ఱకన్నులు కలవాడు, పొడవైన పిక్కలు, పొట్టికాళ్లు, అతడు చేట మొగము, పెద్దబుగ్గలు కలవాడునై యముని పోలియుండెను.
నైవ తస్య సుహృత్ కశ్చి న్న సంబన్ధీన బాన్ధవాః,
స హి తైః సంపరిత్యక్త స్తేన రౌద్రేణ కర్మణా. 12
వాని కొక్క చెలికాడు లేడు. చుట్టము లేడు. బంధువులు లేరు. వారందరు అతని రౌద్రకర్మముచేత నాతనిని వెలివేసిరి.
నరః పాపసమాచార స్త్యక్తవ్యో దూరతో బుధైః,
ఆత్మానం యోఽభిసంధత్తే సోఽన్యస్య స్యాత్కథం హితః. 13
పాపమైన నడవడికల నరుని తెలివిగలవారు దూరముగా వదలి వేయవలయును. తన్ను తాను చెఱుచు కొనువాడు ఇతరునకు హితుడెట్లగును?
యే నృశంసా దురాత్మానః ప్రాణిప్రాణహరా నరాః,
ఉద్వేజనీయా భూతానాం వ్యాలా ఇవ భవన్తి తే. 14
క్రూరులు, దుష్టాత్ములు, ప్రాణుల ప్రాణములను హరించువారు నగు నరులు పాముల వలె సర్వభూతములకు ఉద్వేగము కలిగించు వారగుదురు.
స వై క్షారక మాదాయ ద్విజాన్ హత్వా వనే సదా,
చకార విక్రయం తేషాం పతఙ్గానాం జనాధిప. 15
వాడొక వలను చేతపట్టి అడవిలో ఎల్లవేళల పక్షులను చంపుచు వాని నమ్ముచు నుండెడివాడు.
ఏవం తు వర్తమానస్య తస్య వృత్తిం దురాత్మనః,
అగమ త్సుమహాన్ కాలో న చాధర్మ మబుధ్యత. 16
ఇట్లు ఆ వృత్తినే ఆ దురాత్ముడు కొనసాగించుచుండగా పెద్దకాలము గడచెను. కాని అతడు తన అధర్మమును తెలియకుండెను.
తస్య భార్యాసహాయస్య రమమాణస్య శాశ్వతమ్,
దైవయోగవిమూఢస్య నాన్యా వృత్తి రరోచత.. 17
పెండ్లముతో కూడి ఎల్లవేళల అట్లే కాలము గడుపుచు దైనయోగముచే వివేకము కలుగని ఆతనికి మరియొక బ్రదుకు తెరువు రుచింపకుండెను.
తతః కదాచి త్తస్యాథ వనస్థస్య సమన్తతః,
పాతయన్నివ వృక్షాం స్తాన్ సుమహాన్ వాతసంభ్రమః. 18
కొంతకాలమునకు అడవిలో అతడు తిరుగుచుండగా అన్నివైపుల చెట్లను పెకలించి వేయునా అన్నట్టి పెనుగాలి సంభవించెను.
మేఘసంకుల మాకాశం విద్యున్మండల మండితమ్,
సంఛన్నస్తు ముహూర్తేన నౌసార్థై రివ సాగరః. 19
ఆకసము మేఘములతో నిండిపోయెను. మెరపులు గుదులు గుదులుగా వెలిగిపోవుచుండెను. ఒక్క క్షణములో సముద్రమంతయు నావల గుంపులతో వలె మేఘములతో క్రమ్ముకొని పోయెను.
వారిధారాసమూహేన సంప్రవిష్టః శతక్రతుః,
క్షణేన పూరయామాస సలిలేన వసుంధరామ్. 20
దేవేంద్రుడు నీటి ధారల సమూహముతో నిలువెల్లనిండినవాడై భూమిని ఒక్క పెట్టున ముంచియెత్తెను.
తతో ధారాకులే కాలే సంభ్రమ న్నష్ట చేతనః,
శీతార్త స్తద్వనం సర్వ మాకులేనాన్త రాత్మనా. 21
ఆ సమయమంతయు జలధారలతో నిండిపోగా ఆతడు తెలివి మాలి కలత చెందిన మనస్సుతో చలికి గజగజలాడుచు వనమంతయు తిరిగెను.
నైవ నిమ్నం స్థలం వాపి సోఽవిన్దత విహఙ్గహా,
పూరితో హి జలౌఘేన తస్య మార్గో వనస్య చ. 22
ఆ పిట్టల గొట్టు వానికి నీరులేని నేలయే దొరకలేదు. ఆ అడవి దారియంతయు నీటి వంకలతో నిండిపోయెను.
పక్షిణో వర్ష వేగేన హతా లీనా స్తదా ఽభవన్,
మృగసింహ వరాహాశ్చ స్థల మాశ్రిత్య శేరతే. 23
వాని తాకిడికి పిట్టలన్నియు చచ్చి నీళ్లలో కలిసి పోయినవి. లేళ్లు, సింహములు, అడవి పందులు దొరికిన కొంచెము తావులో పడియున్నవి.
మహతా వాతవర్షేణ త్రాసితా స్తే వనౌకసః,
భయార్తా శ్చ క్షుధార్తాశ్చ బభ్రముః సహితా వనే. 24
అడవులే నెలవుగా గలవారందరు (అన్నియు) పెనుగాలి వాననలన భయపడి పోయిరి. వెరపు, ఆకలి మిక్కిలి పీడింపగా అందరు(అన్నియు) మూకలు మూకలై తిరుగ సాగిరి. (సాగెను)
సతు శీతహతై ర్గాత్రై ర్న జగామ న తస్థివాన్,
దదర్శ పతితాం భూమౌ కపోతీం శీతవిహ్వలామ్. 25
ఆ కిరాతుడు చలికి నుగ్గు నుగ్గైన అవయవములతో పోజాలక, నిలువలేక ఉండెను. నేలపై చలికి గజగజలాడుచు పడియున్న ఒక ఆడు పావురమును గాంచెను.
దృష్ట్వా ఽఽర్తోఽపి హి పాపాత్మా స తాం పఞ్జ రకే ఽక్షిపత్,
స్వయం దుఃఖాభిభూతోఽపి దుఃఖ మే వాకరో త్పరే. 26
చూచి, స్వయముగా బాధ నొందిన వాడయ్యు ఆ పాపాత్ముడు దానిని బుట్టలోనికి పడవైచెను. తనకు తాను దుఃఖముతో కుమిలి పోవుచున్నను ప్రక్కనున్న దానికి దుఃఖమునే కలిగించెను.
పాపాత్మా పాపకారిత్వా త్పాపమేవ చకార సః,
సోఽపశ్య త్తరుషణ్డేషు మేఘ నీల వనస్పతిమ్. 27
ఆ పాపాత్ముడు పాపములే చేయువాడు కనుక పాపమే ఆచరించెను. ఆ చెట్ల గుబురులో మబ్బువలె నల్లగానున్న ఒక చెట్టును గాంచెను.
సేవ్యమానం విహఙ్గౌఘై శ్ఛాయావాస ఫలార్థిభిః,
ధాత్రా పరోపకారాయ స సాధు రివ నిర్మితః. 28
నీడ, గూడు, కూడు కోరెడు పక్షుల గుంపులు దానిని ఆశ్రయించి యున్నవి. బ్రహ్మ పరోపకారము కొరకే ఈ మంచిదానిని నిర్మించెనా అన్నట్టున్నది.
అథాభవత్ క్షణే నైవ వియ ద్విమలతారకమ్,
మహత్సర ఇవోత్ఫుల్లం కుముద చ్ఛురితోదకమ్ 29
పిదప కొద్దిసేపటికే మిలమిలలాడు తారకలతో ఆకాశము కలువలు నిండుగా క్రమ్మిన వికసించిన పెద్ద సరస్సు వలె విరాజిల్లినది.
తారాఢ్యం కుముదాకార మాకాశం నిర్మలం బహు,
ఘనై ర్ముక్తం నభో దృష్ట్వా లుబ్ధకః శీతవిహ్వలః 30
దిశో విలోకయామాస విగాఢాం ప్రేక్ష్య శర్వరీమ్,
దూరతో మే నివాసశ్చ అస్మాద్దేశాదితి ప్రభో. 31
చుక్కలతో ప్రకాశించునది, కలువల ఆకారము కలది, మబ్బులు తొలగి నిర్మలమైనది అగు ఆకాశమును చూచి చలికి వణకి పోవుచున్న ఆ బోయ దిక్కులను గాంచెను. చిమ్మచీకటితో నున్న రాత్రిని గాంచి నా నివాస మీ తావునకు మిక్కిలి దూరముగానున్నదని తలంచెను.
కృతబుద్ధి ర్ద్రుమే తస్మి న్వస్తుం తాం రజనీం తతః,
సాఞ్జలిం ప్రణతిం కృత్వా వాక్యమాహ వనస్పతిమ్. 32
ఆ రాత్రికి ఆ చెట్టుపై నిలిచియుండుటకు నిశ్చయించెను. దోసి లొగ్గి మ్రొక్కి ఆ చెట్టును గూర్చి ఇట్లనెను.
శరణం యామి యాన్యస్మిన్ దైవతాని వనస్పతౌ,
ఈ చెట్టుపై నున్న దేవతలను శరణు పొందెదను.
స శిలాయాం శిరః కృత్వా పర్ణా న్యాస్తీర్య భూతలే,
దుఃఖేన మహతావిష్ట స్తతః సుష్వాప పక్షిహా. 33
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
కపోతలుబ్దక సంవాదోపక్రమే త్రిచత్వారింశదధిక శతతమోఽధ్యాయః.
ఇట్లని ఆ పిట్టల గొట్టువాడు చెట్టు క్రింద నేలపై ఆకులను పరచుకొని రాతిపై తలను బెట్టి పెను దుఃఖముతో కూడిన వాడై నిదురించెను.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున కపోతలుబ్ధక సంవాద ప్రారంభముగల నూట నలుబది మూడవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అథ వృక్షస్య శాఖాయాం విహఙ్గః ససుహృజ్జనః,
దీర్ఘకాలోషితో రాజం స్తత్ర చిత్ర తనూరుహః. 1
రాజా! ఆ చెట్టు నీడలో చెలిమికాండ్రతో పాటు ఒక పక్షి చూడముచ్చట అయిన రెక్కలు గలది పెక్కు కాలముగా కాపురముండెను.
తస్య కల్యగతా భార్యా చరితుం నాభ్యవర్తత,
ప్రాప్తాం చ రజనీం దృష్ట్వా స పక్షీ పర్యతప్యత. 2
ప్రొద్దు పొడుపున మేతకై వెడలిన దాని పెంటి తిరిగి రాలేదు. చీకటి పడగా చూచి ఆ పక్షి విలవిలలాడుచుండెను.
వాతవర్షం మహచ్చాసీ న్న చాగచ్ఛతి మే ప్రియా,
కిం ను తత్కారణం యేన సాఽద్యాపి న నివర్తతే. 3
పెద్ద గాలివాన వచ్చినది. నాప్రియ తిరిగిరాలేదు. ఇంతవరకు మరలకుండుటకు కారణమేమో?
అపి స్వస్తి, భవేత్తస్యాః ప్రియాయా మమ కాననే.
తథా విరహితం హీదం శూన్య మద్య గృహం మమ, 4
అడవిలో నా ప్రియురాలికి ఏమియు కాలేదు కదా! అది లేని యీ నా యిల్లు ఇప్పుడు శూన్యమై పోయినది.
పుత్ర పౌత్ర వధూ భృత్యై రాకీర్ణ మపి సర్వతః,
భార్యా హీనం గృహస్థస్య శూన్య మేవ గృహం భవేత్. 5
బిడ్డలు, మనుమలు, కోడండ్రు, సేవకులు మున్నగువారితో అంతట సందడిగా నున్నను పెండ్లము లేని గృహస్థుని యిల్లు శూన్యమే అగును.
న గృహం గృహ మిత్యాహుః గృహిణీ గృహ ముచ్యతే,
గృహం తు గృహిణీహీన మరణ్య సదృశం మతమ్. 6
ఇల్లు ఇల్లు కాదు. ఇల్లాలే ఇల్లు అందురు. ఇల్లాలు లేని యిల్లు అడవి వంటిది.
యది సా రక్తనేత్రాన్తా చిత్రాఙ్గీ మధురస్వరా,
అద్య నాయాతి మే కాన్తా న కార్యం జీవితేన మే. 7
కనుకొలకులలో ఎఱ్ఱని జీరలు, చిత్రమైన దేహము, తీయని స్వరము గల నా కాంత రాకున్నచో నాకింక బ్రదుకుతో పనిలేదు.
న భుంక్తే మయ్యభుక్తే యా నా స్నాతే స్నాతి సువ్రతా,
నా తిష్ఠ త్యుపతిష్ఠేత శేతే చ శయితే మయి. 8
ఆసువ్రత నేను తిననిచో తినదు. నేను నీరాడనిచో నీరాడదు. నేను నిలువనిచో నిలువదు. నేను నిద్రించినపుడే నిద్రించును.
హృష్టే భవతి సా హృష్టా దుఃఖితే మయి దుఃఖితా,
ప్రోషితే దీనవదనా క్రుద్ధే చ ప్రియవాదినీ. 9
నేను ఆనందముతో పొంగిపోయినచో ఆమెయు పొంగిపోయెడిది. దుఃఖముతో క్రుంగినచో క్రుంగెడిది. వేరుతావుల కరిగినచో ఆమె మొగమున కళా కాంతులుండెడివి కావు. నేను కోపించినచో ఆమె ప్రియముగా పలుకుచుండెడిది.
పతివ్రతా పతిగతిః పతిప్రియహితే రతా,
యస్య స్యాత్తాదృశీ భార్యా ధన్యః స పురుషో భువి. 10
ఆమె మగనియందు వ్రతము కలది. పతియే గతియైనది. పతికి ప్రియమును హితమును కూర్చుటయే ఆనందముగా భావించెడిది. అట్టి భార్య కలవాడే కదా భువిలో ధన్యుడు!
సా హి శ్రాన్తం క్షుధార్తంచ జానీతే మాం తపస్వినీ,
అనురక్తా స్థిరా చైవ భక్తా స్నిగ్ధా యశస్వినీ. 11
ఆ తపస్విని నేను అలసినచో ఆ కొన్నచో వెంటనే గుర్తించెడిది. నా యందు అనురాగము కలది. స్థిరమైన మనస్సు కలది. భక్తురాలు, చెలిమి కలది. కీర్తి శాలిని.
వృక్షమూలేఽపి దయితా యస్య తిష్ఠతి తద్గృహమ్,
ప్రాసాదోఽపి తయా హీనః కాన్తార ఇతి నిశ్చితమ్. 12
ప్రియురాలు చెట్టుక్రింద ఉన్నను అదియే గృహస్థునకు గృహము. ఆమెలేని పెద్ద భవనము కూడ అడవియే అని నిశ్చయము.
ధర్మార్థ కామమూలేషు భార్యా పుంసః సహాయినీ,
విదేశగమనే చాస్య సైవ విశ్వాసకారికా. 13
ధర్మము,అర్థము, కామము అనువాని కుదుళ్ల యందు భార్యయే మగవానికి తోడు నీడ, విదేశములకు పోవునపు డతనికి ఆమె యే గుండెదిటవు కలిగించునట్టిది.
భార్యా హి పరమో హ్యర్థః పురుష స్యేహ పఠ్యతే,
అసహాయస్య లోకేఽస్మింల్లోక యాత్రా సహాయినీ. 14
పురుషునకు భార్యయే పరమ ధనమని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ లోకమున తోడు లేని వానికి లోక యాత్రలో తోడగునది భార్యయే.
తథా రోగాభిభూతస్య నిత్యం కృచ్ఛ్రగతస్య చ,
నాస్తి భార్యాసమం కిఞ్చి న్నరస్యార్తస్య భేషజమ్. 15
రోగము పై కొన్నవానికి కష్టములలో చిక్కుకొన్న వానికి భార్యకు సాటివచ్చు ఔషధము మరియొకటి లేదు.
నాస్తి భార్యాసమో బన్ధు ర్నాస్తి భార్యాసమా గతిః,
నాస్తి భార్యాసమో లోకే సహాయో ధర్మసఙ్గ్రహే. 16
భార్యకు ఈడగుచుట్టము లేదు. భార్యతో సాటివచ్చు గతి మరి యొకటిలేదు. ధర్మమును కూర్చుకొనుటలో లోకమున భార్యకు సాటి వచ్చు సహాయుడు లేడు.
యస్య భార్యా గృహే నాస్తి సాధ్వీచ ప్రియవాదినీ,
అరణ్యం తేన గన్తవ్యం యథారణ్యం తథాగృహమ్. 17
ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
భార్యా ప్రశంసాయాం చతుశ్చత్వారింశదధిక శతతమోఽధ్యాయః
ఇంట మంచి స్వభావము కలదియు, తీయని మాటలు పలుకునదియునగు భార్య లేనివాడు అడవికి పోవలయును. అట్టివానికి అడవి యెట్టిదో ఇల్లును అట్టిదియే.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున భార్య ప్రశంస గల నూట నలుబది నాలుగవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడు చెప్పెను.
ఏవం విలపత స్తస్య శ్రుత్వా తు కరుణం వచః,
గృహీతా శకునిఘ్నేన కపోతీ వాక్య మబ్రవీత్. 1
ఇట్లు మిక్కిలి దీనముగా విలవిలలాడుచున్న ఆ పక్షి పలుకును విని, పిట్టలను పొట్టను పెట్టుకొను ఆ కిరాతునికి చిక్కిన ఆడ పావురము ఇట్లు పలికెను.
కపోత్యువాచ - కపోతి పలికెను.
అహోఽతీవ సుభాగ్యాహం యస్యా మే దయితః పతిః,
అసతో వా సతో వాఽపి గుణా నేవం ప్రభాషతే. 2
ఆహా! నా సౌభాగ్యమెంత గొప్పది! నాప్రియుడు ఉన్నవో, లేవో గాని నాగుణములనిట్లు కొనియాడుచున్నాడు!
న సా స్త్రీ హ్యభిమన్తవ్యా యస్యాం భర్తా న తుష్యతి,
తుష్టే భర్తరి నారీణాం తుష్టాః స్యు స్సర్వదేవతాః. 3
భార్యవిషయమున భర్త తుష్టినందని వాడైనచో ఆ స్త్రీ మన్నింపదగినది కాదు. స్త్రీల విషయమున భర్త తుష్టుడైనచో సర్వదేవతలును తుష్టులగుదురు.
అగ్నిసాక్షిక మిత్యేవ భర్తా వై దైవతం పరమ్,
దావాగ్నినేవ నిర్దగ్ధా సపుష్పస్తబకా లతా
భస్మీభవతి సా నారీ యస్యా భర్తా న తుష్యతి. 4
అగ్నిసాక్షిగాగల పరదైవము భార్యకు భర్తయే. ఏ స్త్రీ విషయమున భర్త సంతోషింపడో ఆ యింతి కారుచిచ్చుమాడ్చిన పూగుత్తులుగల లతవలె మాడి బూడిద యగును.
ఇతి సఞ్చిన్త్య దుఃఖార్తా భర్తారం దుఃఖితం తదా,
కపోతీ లుబ్ధకేనాపి గృహీతా వాక్య మబ్రవీత్. 5
ఇట్లు తలపోసి దుఃఖపీడితయై, పిట్టలవానికి పట్టుపడినదైనను, ఆఆడుపావురము విలపించుచున్న పతితో ఇట్లు పలికెను.
హన్త వక్ష్యామి తే శ్రేయః శ్రుత్వా తు కురు తత్తథా,
శరణాగత సంత్రాతా భవ కాన్త విశేషతః . 6
అయ్యా! నీకు మేలగు మాట చెప్పెదను. దానిని విని అట్లు చేయుము. మనోహరా! మీదుమిక్కిలి శరణుకోరినవానిని సంరక్షించువాడ వగుము.
ఏష శాకునికః శేతే తవ వాసం సమాశ్రితః,
శీతార్తశ్చ క్షుధార్తశ్చ పూజా మస్మై సమాచర 7
ఈ పిట్టలవాడు నీయింటికి చేరుకొని నిద్రించుచున్నాడు. చలికి ఆకలికి బాధపడుచున్నాడు. అతనికి మన్నన చేయుము.
యో హి కశ్చి ద్ద్విజం హన్యాత్ గాం చ లోకస్య మాతరమ్,
శరణాగతం చ యో హన్యాత్ తుల్యం తేషాంచ పాతకమ్. 8
ద్విజుని, గోవును, తల్లిని, శరణుకోరినవానిని హింసించువారి పాతకము సమానము.
అస్మాకం విహితా వృత్తిః కాపోతీ జ్ఞాతి ధర్మతః,
సా న్యాయ్యాత్మవతా నిత్యం త్వద్విధే నానువర్తితుమ్. 9
మనకు కాపోతివృత్తి కులధర్మముగా నిర్ణయింపబడినది. మనోధర్మమెరిగిన నీవంటివాడు దానిని ఎల్లప్పుడు పాటించుట న్యాయసమ్మతము (కాపోతీ వృత్తి - అనగా కపోతములకు - పావురములకు సంబంధించినది - అనగా ఇతరులకు ఆహారమగుట - అని తాత్పర్యముగా గ్రహింపనగును)
యస్తు ధర్మం యథాశక్తి గృహస్థో హ్యనువర్తతే,
స ప్రేత్య లభతే లోకా నక్షయా నితి శుశ్రుమ. 10
గృహస్థుడు తన ధర్మమును శక్తివంచనలేక పాటించునేని అతడు మరణించిన పిదప క్షయము పొందని పుణ్యలోకములను పొందునని విందుము.
సత్వం సంతానవా నద్య పుత్రవానసి చ ద్విజ,
తత్ స్వదేహే దయాం త్యక్త్వా ధర్మార్థౌ పరిగృహ్య చ
పూజా మస్మై ప్రయుంక్ష్వ త్వం ప్రీయేతాస్య మనో యథా. 11
నీవు పిల్లలు కలవాడవు, కొడుకులును గలవాడవు. కనుక నీదేహమున దయను వదలివైచి ధర్మమును, అర్థమును చక్కగా కైకొని ఈతని మనస్సెట్లు తృప్తి నందునో అట్లు పూజింపుము.
శరీరే మా చ సంతాపం కుర్వీథా స్త్వం విహఙ్గమ,
శరీరయాత్రా కృత్యర్థ మన్యాన్ దారా నుపైష్యసి. 12
శరీరవిషయమున నీవు సంతాపము చేయవలదు. శరీరయాత్ర సాగుటకు వేరు భార్యలను పొందెదవు (నేను చచ్చుచున్నందులకు శోకింపవలదని భావము)
ఇతి సా శకునీ వాక్యం పఞ్జరస్థా తపస్వినీ,
అతిదుఃఖాన్వితా ప్రోక్వై భర్తారం సముదైక్షత. 13
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
కపోతం ప్రతి కపోతీవాక్యే పఞ్చ చత్వారింశ దధిక శతతమోఽధ్యాయః
పంజరమునందున్న ఆ దీనురాలు ఆడుపక్షి మిక్కిలి దుఃఖము పైకొనగా భర్తతో ఇట్లు పలికి, ఆతనిని చూచుచుండెను.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున కపోతముతో కపోతి పలికిన వాక్యముగల నూట నలుబదియైదవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడు చెప్పెను.
స పత్న్యా వచనం శ్రుత్వా ధర్మయుక్తి సమన్వితమ్,
హర్షేణ మహతా యుక్తో వాక్యం వ్యాకులలోచనః. 1
ధర్మముతో, యుక్తితోకూడిన పత్ని పలుకు విని ఆ పావురము మిక్కిలి సంతోషముతో కూడినదై కన్నుల కలవరపాటు కలది యాయెను.
తం వై శాకునికం దృష్ట్వా విధిదృష్టేన కర్మణా,
స పక్షీ పూజయామాస యత్నాత్తం పక్షిజీవినమ్. 2
ఆ పిట్టలవానిని చూచి ఆ పక్షి ధర్మము చూపిన కర్మముతో ప్రయత్నపడి ఆ పక్షి జీవిని పూజించెను.
ఉవాచ స్వాగతం తేఽద్య బ్రూహి కిం కరవాణి తే,
సంతాపశ్చ న కర్తవ్యః స్వగృహే వర్తతే భవాన్. 3
ఇట్లు పలికెను. అయ్యా! మీకు స్వాగతము. చెప్పుడు. మీకేమి చేయుదును? సంతాపము పొందవలదు. తమరు మీయింట నున్నట్లు భావింపుడు.
తద్ర్బవీతు భవాన్ క్షిప్రం కింకరోమి కి మిచ్ఛసి,
ప్రణయేన బ్రవీమి త్వాం త్వం హి నః శరణాగతః. 4
తమరు త్వరగా చెప్పుడు. నేనేమి చేయుదును? మీరేమి కోరుదురు? ప్రేమతో పలుకుచున్నాను. మీరు మా యింటికి విచ్చేసిన వారు.
అరా వప్యుచితం కార్య మాతిథ్యం గృహ మాగతే,
ఛేత్తు మప్యాగతే ఛాయాం నోపసంహరతే ద్రుమః. 5
ఇంటికివచ్చినపుడు పగవానికైనను అతిథి మర్యాద చేయుటమే ఉచితమగు పని. చెట్టు, తెగనరకుటకు వచ్చిన వానికిని నీడను లాగివేయదు కదా!
శరణాగతస్య కర్తవ్యమాతిథ్యం హి ప్రయత్నతః,
పఞ్చ యజ్ఞ ప్రవృత్తేన గృహస్థేన విశేషతః. 6
శరణుకోరి వచ్చినవానికి గృహస్థుడు సర్వప్రయత్నముతో ఆతిథ్యమును చేయవలయును. అందును విశేషించి అయిదుయజ్ఞములను చేయు గృహస్థున కిది మరియు ధర్మము.
పఞ్చ యజ్ఞాంస్తు యో మోహా న్న కరోతి గృహాశ్రమే,
తస్య నాయం న చ పరో లోకో భవతి ధర్మతః. 7
మోహమువలన గృహస్థాశ్రమమున నున్నవాడు పంచయజ్ఞములను చేయడేని వానికి ఈ లోకములేదు. పరలోకమును లేదు. ఇది ధర్మనిర్ణయము.
తద్ర్బూహి మా సువిశ్రబ్ధో యత్త్వం వాచా వదిష్యసి,
తత్కరిష్యా మ్యహం సర్వం మా త్వం శోకే మనఃకృథాః.8
ఏమియు సంకోచింపక నాకు చెప్పుము. నీవు నోరు విప్పి యేది పలుకుదువో నేను దాని నంతటిని చేయుదును. నీవు శోకమున మనసు పెట్టకుము.
తస్య తద్వచనం శ్రుత్వా శకునే ర్లుబ్ధకోఽబ్రవీత్,
బాధతే ఖలు మే శీతం సంత్రాణం హి విధీయతామ్. 9
ఆ బోయ ఆపక్షిమాట విని, నన్ను చలి పీడించుచున్నది. దానినుండి రక్షణ కల్పింపవలయును.
ఏవ ముక్త స్తతః పక్షీ పర్ణా న్యాస్తీర్య భూతలే,
యథాశక్త్యా హి పర్ణేన జ్వలనార్థం ద్రుతం యయౌ. 10
అతడట్లు పలుకగా పక్షి నేలపై ఆకులను పేర్చి శక్తికి తగినట్లుగా ఆకుతో మండించుటకై వేగముగా నరిగెను.
స గత్వా ఙ్గార కర్మాన్తం గృహీత్వాగ్ని మథాఽగమత్,
తతః శుష్కేషు పర్ణేషు పావకం సోఽప్యదీపయత్. 11
ఆపక్షి కమ్మరి యింటి కరిగి నిప్పును తెచ్చెను. ఎండిన ఆకుల యందుంచి దానిని మండించెను.
స సందీప్తం మహత్ కృత్వా తమాహ శరణాగతమ్,
ప్రతాపయ సువిశ్రబ్ధః స్వగాత్రా ణ్యకుతోభయః. 12
అది మంటను పెద్దగా చేసి ఆ శరణుకోరినవానితో, నమ్మకముతో నీ శరీరాంగములను ఏ భయమును లేక వెచ్చచేసికొనుము.
స తథోక్త స్త థేత్యు క్త్యా లుబ్ధో గాత్రా ణ్యతాపయత్,
అగ్నిం ప్రత్యాగతప్రాణ స్తతః ప్రాహ విహఙ్గమమ్. 13
అట్లు పలుకగా ఆబోయ అట్లే యని ఒడలి భాగములను కాచుకొనెను. ప్రాణములు తిరిగి రాగా ఆ పక్షితో ఇట్లు పలికెను.
హర్షేణ మహతావిష్టో వాక్యం వ్యాకులలోచనః,
తథేమం శకునిం దృష్ట్వా విధిదృష్టేన కర్మణా.
దత్త మాహార మిచ్ఛామి త్వయా క్షుద్బాధతే హి మామ్, 14
పెద్ద సంతోషము పైకొనగా గ్రుడ్లు త్రిప్పుకొనుచు, ఆ పక్షిని గాంచి నీవు శాస్త్రముచెప్పిన తీరుగా ఇచ్చెడు ఆహారమును కోరుచున్నాను. నన్ను ఆకలి బాధించుచున్నది - అనెను.
స తద్వచః ప్రతిశ్రుత్య వాక్య మాహ విహఙ్గమః. 15
ఆ పక్షి ఆమాటకు అట్లే యని మాట యిచ్చి యిట్లు పలికెను.
న మేఽస్తి విభవో యేన నాశయేయం క్షుధాం తవ,
ఉత్పన్నేన హి జీవామో వయం నిత్యం వనౌకసః. 16
అయ్యా! నీ ఆకలిని పోకార్చు సంపద నాకు లేదు. మేము అడవియే నివాసముగా గలవారము. దొరకిన దానితో జీవింతుము.
సఞ్చయో నాస్తి చాస్మాకం మునీనా మివ భోజనే,
ఇత్యుక్త్యా తం తదా తత్ర వివర్ణవదనో ఽభవత్. 17
మునులకు వలె మాకును తిండి విషయమున కూడబెట్టిన దేమియు లేదు అని పలికి అది తెల్లమొగము వైచెను.
కథం ను ఖలు కర్తవ్య మితి చిన్తాపర స్తదా,
బభూవ భరతశ్రేష్ఠ గర్హయన్ వృత్తి మాత్మనః. 18
ఇప్పుడు ఏమి చేయుదును అని మనస్సులో కళవళపడెను. తనవృత్తిని నిందించుకొనుచుండెను.
ముహూర్తా ల్లబ్ధ సంజ్ఞస్తు స పక్షీ పక్షిఘాతినమ్,
ఉవాచ తర్పయిష్యే త్వాం ముహూర్తం ప్రతిపాలయ. 19
కొంచెము సేపునకు తెప్పరిల్లి ఆ పక్షి పక్షిహంతతో, ముహూర్తకాలము వేచి యుండుము. నిన్ను తృప్తి పరతునని పలికెను.
ఇత్యుక్త్వా శుష్కపర్ణై స్తు సముజ్జ్వాల్య హుతాశనమ్,
హర్షేణ మహతావిష్టః సపక్షీ వాక్య మబ్రవీత్. 20
ఇట్లు పలికి ఎండుటాకులతో అగ్నిని బాగుగా మండించి గొప్ప ఆనందముతో కూడినదై ఆపక్షి యిట్లు పలికెను.
ఋషీణాం దేవతానాం చ పితౄణాం చ మహాత్మనామ్,
శ్రుతః పూర్వం మయా ధర్మో మహా నతిథి పూజనే. 21
ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, మహాత్ములకు అతిథిపూజనము నందే మహాధర్మమని నేను వినియుంటిని.
కురుష్వానుగ్రహం సౌమ్య సత్య మేతద్ బ్రవీమి తే,
నిశ్చితా ఖలు మే బుద్ధి రతిథిప్రతిపూజనే. 22
మంచివాడా! అనుగ్రహము చేయుము. నిజము పలుకుచున్నాను. అతిథిని చక్కగా పూజించుట యందు నాబుద్ధి నిశ్చయము పొందియున్నది.
తతః కృతప్రతిజ్ఞో వై స పక్షీ ప్రహసన్నివ,
త మగ్నిం త్రిః పరిక్రమ్య ప్రవివేశ మహామతిః. 23
అట్లు ప్రతిజ్ఞ చేసి ఆ పక్షి నవ్వుచు ఆ అగ్నిని మూడుమారులు వలగొని దొడ్డబుద్ధి గలదియై అందు చొచ్చెను.
అగ్నిమధ్యే ప్రవిష్టం తు లుబ్ధో దృష్ట్వాతు పక్షిణమ్,
చిన్తయామాస మనసా కి మిదం వై మయా కృతమ్. 24
అట్లు నిప్పులనడుమ పడిన ఆ పక్షిని చూచి ఆ బోయ అయ్యో! నేనేమి చేసితిని! అని చింతించెను.
అహో మమ నృశంసస్య గర్హితస్య స్వకర్మణా,
అధర్మః సుమహాన్ ఘోరో భవిష్యతి న సంశయః. 25
అయ్యో! క్రూరుడను, నేనుచేసిన పనికి నిందబొందదగినవాడను. ఘోరమైన మహాపాపము నాకు కలుగును. సంశయము లేదు.
ఏవం బహువిధం భూరి విలలాప స లుబ్ధకః,
గర్హయన్ స్వాని కర్మాణి ద్విజం దృష్ట్వా తథాగతమ్. 26
ఇతి శ్రీమహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
కపోతలుబ్ధక సంవాదే షట్చత్వారింశ దధిక శతతమోఽధ్యాయః.
అట్లయిన పక్షిని చూచి తన పనులను నిందించుకొనుచు ఆ బోయ పెక్కుతీరులుగా బోరన ఏడ్చెను.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున కపోతలుబ్ధక సంవాదముగల నూటనలుబది యారవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడు చెప్పెను.
తతః స లుబ్దకః పశ్యన్ క్షుధయాఽపి పరిప్లుతః,
కపోత మగ్నిపతితం వాక్యం పునరువాచ హ. 1
అంత నా కిరాతుడు ఆకలితో చుమ్మలు చుట్టుకొనిపోవుచున్నను అగ్నిలో పడిన పావురమును చూచి మరల ఇట్లు పలికెను.
కి మీదృశం నృశంసేన మయా కృత మబుద్ధినా,
భవిష్యతి హి మే నిత్యం పాతకం కృతజీవినః,
స వినిన్దం స్తథాత్మానం పునః పునరువాచ హ. 2
బుద్ధిలేని క్రూరుడను నేను బ్రతికి యున్నచో ఇట్టి పాపమే ప్రతిదినము నాకు ఘటిల్లును. అని తన్నుదాను నిందించుకొనుచు మరల మరల పలికెను.
అవిశ్వాస్యః సుదుర్బుద్ధిః సదా నికృతి నిశ్చయః,
శుభం కర్మ పరిత్యజ్య సోఽహం శకుని లుబ్ధకః. 3
నేను నమ్మరానివాడను. మిక్కిలి దుష్టమైన బుద్ధికలవాడను, ఎల్లప్పుడు పాపములందే నిశ్చయముకలవాడను. మంచిపనివదలివైచినవాడను, పిట్టలను, పట్టువాడను.
నృశంసస్య మమాద్యాయం ప్రత్యాదేశో న సంశయః,
దత్తః స్వమాంసం దహతా కపోతేన మహాత్మనా. 4
ఇట్టిక్రూరుడనైననాకు దొడ్డ బుద్ధికల పావురము తనమాంసమును కాల్చి యిచ్చి ధిక్కారపూర్వకమైన (చీకొట్టి) ఉపదేశము ఒసగినది.
సోఽహం త్యక్ష్యే ప్రియాన్ ప్రాణాన్ పుత్రాన్ దారాం స్తథైవచ,
ఉపదిష్టో హి మేధర్మః కపోతేన మహాత్మనా. 5
నాకీ గొప్పబుద్ధికల పావురము ధర్మము నుపదేశించినది. అట్టినేను ప్రియములైన ప్రాణములను, పెండ్లమును, కొడుకులను విడిచి వైచెదను.
అద్యప్రభృతి దేహం స్వం సర్వభోగై ర్వివర్జితమ్,
యథా స్వల్పం సరోగ్రీష్మే శోషయిష్యామ్యహం తథా. 6
నేటినుండి భోగము లన్నింటిని వదలివైచిన యీ దేహమును, గ్రీష్మమునందు నీటి పడియనువలె, ఎండకట్టెదను.
క్షుత్పిపాసాతపసహః కృశో ధమని సన్తతః,
ఉపవాసై ర్బహువిధై శ్చరిష్యే పారలౌకికమ్. 7
ఆకలి, దప్పి, ఎండలను సహించు వాడనై బీరనరాలు పైకి కానవచ్చుచుండగా పెక్కు తీరులగు ఉపవాసములతో పరలోకపు సాధనను ఆచరింతును.
అహో దేహప్రదానేన దర్శితా ఽ తిథి పూజనా,
తస్మాద్ధర్మం చరిష్యామి ధర్మో హి పరమా గతిః. 8
తన ఒడలిని దానమిచ్చుటచేత అతిథి పూజ అననేమో ఈ పక్షి నాకు చూపినది. కనుక నిటుపై ధర్మము నాచరింతును. ధర్మముకదా పరమగతి!
దృష్టో ధర్మో హి ధర్మిష్ఠే యాదృశో విహగోత్తమే,
ఏవ ముక్త్యా వినిశ్చిత్య రౌద్రకర్మా స లుబ్దకః
మహా ప్రస్థాన మాశ్రిత్య ప్రయయౌ సంశితవ్రతః. 9
గొప్ప ధర్మమునాచరించిన ఈ పక్షిశ్రేష్ఠమునందు నాకు ధర్మము కానవచ్చినది అనుకొని, నిర్ణయించుకొని ఘోరకృత్యములవాడగు అబోయ తీవ్రమగువ్రతములు కలవాడై మహాప్రస్థానము నాశ్రయించి బయలుదేరెను.
తతో యష్టిం శలాకాం చ క్షారకం పఞ్జరం తథా,
తాంచ బద్ధాం కపోతీం స ప్రముచ్య విససర్జ హ. 10
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
లుబ్ధకోపరతౌ సప్త చత్వారింశ దధిక శతతమో ఽధ్యాయః
అంత నతడు కట్టెను, ఇనుప ఊచను, వలను, పంజరమును, కట్టియుంచిన ఆడు పావురమును వదలి వైచెను.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున బోయని వైరాగ్యముగల నూట నలుబది యేడవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
తతో గతే శాకునికే కపోతీ ప్రాహ దుఃఖితా,
సంస్మృత్య సాచ భర్తారం రుదతీ శోకకర్శితా. 1
అంత పిట్టలవాడట్లు పోగా పెంటి పావురము మగని తలచుకొని కుమిలెడు గుండెతో ఏడుచుచుండెను.
నాహం తే విప్రియం కాన్త కదాచిదపి సంస్మరే,
సర్వాపి విధవా నారీ బహుపుత్రాపి శోచతే. 2
ప్రియుడా! నీకు ప్రియము కానిదానిని నేనెన్నడునుతలపునకును రానీయలేదు. ఎందరు బిడ్డలున్నను ప్రతివిధవయు కుమిలిపోవలసినదే.
శోచ్యా భవతి బంధూనాం పతిహీనా తపస్వినీ,
లాలితాఽహం త్వయా నిత్యం బహుమానాచ్చ పూజితా.
వచనై ర్మధురైః స్నిగ్దై రసంక్లిష్ట మనోహరైః. 3
మగడు లేని దీనురాలు చుట్టములందరికి దుఃఖమును కలిగించునది అగును. నీవు నన్ను నిత్యము మన్ననతో తీయని, చెలిమిగల, కల్లకపటములులేని ముద్దు పలుకులతో లాలించితివి.
కందరేషు చ శైలానాం నదీనాం నిర్ఝరేషు చ,
ద్రుమాగ్రేషు చ రమ్యేషు రమితాఽహం త్వయా సహ. 4
కొండగుహలలో, నదుల సెలయేళ్ళలో, అందమైన చెట్టుల చిటారు కొమ్మలలో నీతో కూడి ఆడుకొంటిని.
ఆకాశగమనే చైవ విహృతాఽహం త్వయా సుఖమ్, 5
రమామి స్మ పురా కాన్త తన్మే నాస్త్యద్య కిఞ్చన.
గగనమున నెగురునపుడు నీతో సుఖముగా విహరించితిని. కాంతుడా! మునుపు ఎంతగనో సుఖమందితిని. ఇప్పుడది యేమియు నాకు లేదు.
మితం దదాతి హి పితా మితం భ్రాతా మితం సుతః,
అమితస్య హి దాతారం భక్తారం కా న పూజయేత్. 6
తండ్రి, అన్నదమ్ములు, కొడుకు ఇచ్చునది చాల మితమైనది. ఇంత అని చెప్పుటకు వీలు లేనట్లుగా ఒసగెడు భర్తను ఏకాంత గౌరవింపదు?
నాస్తి భర్తృ సమో నాథో నాస్తి భర్తృసమం సుఖమ్,
విసృజ్య ధన సర్వస్వం భర్తా వై శరణం స్త్రియాః. 7
భర్తకు సాటి వచ్చు రక్షకుడు లేడు. భర్తకు ఈడైన సుఖములేదు. మొత్తము సొమ్మును విడచివైచినను స్త్రీకి భర్తయే రక్షకు డగును.
న కార్య మిహ మే నాథ జీవితేన త్వయా వినా,
పతి హీనా తు కా నారీ సతీ జీవితు ముత్సహేత్. 8
నాథా! నీవు లేని బ్రదుకుతో నాకిట పనియేమి? మగడులేని పతివ్రత యగు ఇంతి ఎవతె బ్రదుకుట కిష్టపడును?
ఏవం విలప్య బహుధా కరుణం సా సుదుఃఖితా,
పతివ్రతా సంప్రదీప్తం ప్రవివేశ హుతాశనమ్. 9
ఇట్లు పెక్కు విధముల జాలిగా ఆ కపోతి కుమిలి కుమిలి పట్టశక్యము కాని దుఃఖముతో మండుచున్న అగ్నిలో ప్రవేశించెను.
తత శ్చిత్రాఙ్గదధరం భర్తారం సాఽన్వపశ్యత.
విమానస్థం సుకృతిభిః పూజ్యమానం మహాత్మభిః, 10
చిత్ర మాల్యాంబరధరం సర్వాభరణ భూషితమ్.
విమాన శతకోటీభి రావృతం పుణ్యకర్మభిః. 11
అంత ఆ పెంటి పావురము మహాత్ములగు పుణ్యాత్ములతో పూజింపబడు చున్నదియు, చిత్రములగు మాలలు వస్త్రములు తాల్చినదియు, అన్ని విధములగు ఆభరణములు ధరించినదియు, పుణ్యకర్మములుగలవారధివసించిన వందలకోట్ల విమానములతో చుట్టబడినదియు, చిత్రమైన అంగదములను ధరించినదియు నగు తన పతిని కాంచెను.
తతః స్వర్గం గతః పక్షీ విమాన వర మాస్థితః,
కర్మణా పూజిత స్తత్ర రేమే స సహభార్యయా. 12
ఇతి శ్రీమహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
కపోత స్వర్గగమనే అష్టచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
అంత శ్రేష్ఠమగు విమానము నెక్కియున్న ఆ పావురము స్వర్గమున కరిగి తన మహాకార్యమునకు అందు అందరి మన్ననలను గొనుచు భార్యతోపాటు ఆనంద మందెను.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున కపోతములు స్వర్గమున కరుగుట అను వృత్తాంతము గల నూట నలుబది ఎనిమిదవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
విమానస్థౌతు తౌ రాజన్ లుబ్ధకః ఖే దదర్శ హ,
దృష్ట్వా తౌ దంపతీ రాజన్ వ్యచిన్తయత తాం గతిమ్. 1
విమానము నందున్న ఆ పక్షి దంపతులను ఆ బోయవాడు కనుగొనెను. ఆ దంపతులను చూచి వారి గతిని గూర్చి ఇట్లు తలపోసెను.
ఈదృశేనైన తపసా గచ్ఛేయం పరమాం గతిమ్,
ఇతి బుద్ధ్యా వినిశ్చిత్య గమనా యోపచక్రమే. 2
ఇట్టి తపస్సుతోడనే నేనును పరమగతిని పొందెదను. అని బుద్ధితో నిర్ణయించి మహాప్రస్థానమును మొదలుపెట్టెను.
మహాప్రస్థాన మాశ్రిత్య లుబ్ధకః పక్షిజీవకః,
నిశ్చేష్టో మరుదాహారో నిర్మమః స్వర్గకాంక్షయా. 3
పిట్టలను కొట్టి బ్రదుకు ఆ బోయవాడు మహాప్రస్థానమును అవలంబించి చేష్టలుడిగినవాడు, గాలి మాత్రమే ఆహారముగా గలవాడు, మమకారము లేని వాడునై స్వర్గమును పొందు కోరికతో అరుగజొచ్చెను.
తతోఽపశ్య త్యు విస్తీర్ణం హృద్యం పద్మాభిభూషితమ్,
నానాపక్షిగణా కీర్ణం సరః శీతజలం శివమ్. 4
అంత నతడు మిక్కిలి విశాలమైనది. మనోహరమైనది. తామరపూవుల శోభకలది, పెక్కుపక్షులగుంపులతో నిండినది, చల్లని నీరు కలది, శుభమైనది అగు ఒక సరస్సును గాంచెను.
పిపాసార్తో ఽపి తద్దృష్ట్వా తృప్తః స్యాన్నాత్ర సంశయః,
ఉపవాసకృశోఽత్యర్థే సతు పార్థివ లుబ్ధకః. 5
దప్పికతో పీడ నొందువాడైనను అతడు దానిని చూచి తృప్తి నందలేదు. తిండిమాని మిక్కిలి చిక్కి పోయెను.
అనవేక్ష్యైవ సంహృష్టః శ్వాపదా ధ్యుషితం వనమ్,
మహాన్తం నిశ్చయం కృత్వా లుబ్ధకః ప్రవివేశ హ. 6
దానివైపు చూడకయే తృప్తిపడి క్రూరమృగములు నివసించు అడవిలోనికి, పెద్ద నిర్ణయము చేసికొని ప్రవేశించెను.
ప్రవిశన్నేవ స వనం నిగృహీతః స కణ్టకైః,
స కణ్టకై ర్విభిన్నాఙ్గో లోహితార్ద్రీకృతచ్ఛవిః. 7
అడవిలో ప్రవేశించుచునే ఆతడు ముళ్ళలో చిక్కుకొనెను. ముళ్ళతో ఒడలు చీరుకొని పోగా రక్తముతో తడిసిన వన్నె కలవాడాయెను.
బభ్రామ తస్మిన్విజనే నానామృగసమాకులే,
తతో ద్రుమాణాం మహతా పవనేన వనే తదా.
ఉదతిష్ఠత సంఘర్షా త్సుమహాన్ హవ్యవాహనః, 8
పెక్కు క్రూరమృగములు చెల్లాచెదరుగా తిరుగుచున్న జనులు లేని అటవిలో తిరుగసాగెను. అంత పెనుగాలితో అడవియందలి చెట్లకు రాపిడి కలుగగా పెద్ద కారుచిచ్చు ఎగిసి పడెను.
తద్వనం వృక్షసంపూర్ణం లతావిటప సంకులమ్,
దదాహ పావకః క్రుద్ధో యుగాన్తాగ్ని సమప్రభః. 9
చెట్లతో నిండినదియు, తీగెలతో కొమ్మలతో చిందర వందర అయినదియు, నగు ఆ అడవిని కోపించిన అగ్నిదేవుడు ప్రళయకాలమందలి అగ్నివంటి కాంతులు కలవాడై కాల్చివైచెను.
స జ్వాలైః పవనోద్ధూతై ర్విస్ఫులింగైః సమన్తతః,
దదాహ తద్వనం ఘోరం మృగపక్షి సమాకులమ్. 10
ఆ అగ్ని గాలి కెగసి అంతట పడిన నిప్పురవ్వలతో మృగములు, పక్షులు చెల్లాచెదరుగా తిరుగుచున్న ఆ ఘోరమైన అడవిని బూడిద చేసెను.
తతః స దేహమోక్షార్థం సంప్రహృష్టేన చేతసా,
అభ్యధావత వర్ధన్తం పావకం లుబ్ధక స్తదా. 11
అంతనతడు దేహమును వదలివైచుటకు మిక్కిలి పొంగిపోవుచున్న హృదయముతో మింటి కెగయుచున్న అగ్ని వైపునకు పరువులు తీసెను.
తత స్తేనాగ్నినా దగ్ధో లుబ్ధకో నష్టకల్మషః,
జగామ పరమాం సిద్ధిం తతో భరతసత్తమ. 12
అంత ఆ అగ్నికి కాలిబూడిద అయిన ఆ బోయవాడు పాపములు పటాపంచలుకాగా పరమసిద్ధిని పొందెను.
తతః స్వర్గస్థ మాత్మాన మ పశ్య ద్విగతజ్వరః,
యక్షగన్ధర్వ సిద్ధానాం మధ్యే భ్రాజన్త మిన్ద్రవత్. 13
అటుపై నశించిన మనోరోగముకలవాడై అతడు యక్షుల, గంధర్వుల, సిద్ధులనడుమ ప్రకాశించుచున్న ఇంద్రునివలె స్వర్గమున నున్న తన్ను చూచుకొనెను.
ఏవం ఖలు కపోతశ్చ కపోతీ చ పతివ్రతా,
లుబ్ధకేన సహ స్వర్గం గతాః పుణ్యేన కర్మణా. 14
ఇట్లా పావురము, పతివ్రతయగు ఆ పెంటి పావురము, ఆ బోయవాడు పుణ్యకర్మము చేత స్వర్గమున కరిగిరి.
యాఽపి చైవం విధా నారీ భర్తార మనువర్తతే,
విరాజతే హి సా క్షిప్రం కపోతీన దివి స్థితా. 15
భర్తను అనుసరించు ఏ స్త్రీయైనను, పెంటి పావురము వలె వెనువెంటనే స్వర్గమున నున్నదియై విరాజిల్లును.
ఏవ మేత త్పురా వృత్తం లుబ్ధకస్య మహాత్మనః,
కపోతస్య చ ధర్మిష్ఠా గతిః పుణ్యేన కర్మణా. 16
ఇది ఇట్లు పూర్వమున జరిగిన విషయము. మహాత్ముడగు బోయవాని యొక్కయు, పావురము యొక్కయు పుణ్యకర్మము చేత నైన ధర్మిష్ఠ యగు గతి యిట్టిది.
యశ్చేదం శృణుయా న్నిత్యం యశ్చేదం పరికీర్తయేత్,
నాశుభం విద్యతే తస్య మనసాఽపి ప్రసాదతః. 17
దీనిని వినువాడును, ఇతరులకు చెప్పెడువాడును ప్రసన్నముగా నుండుటవలన మనస్సు నందును ఎట్టి అశుభమును పొందడు.
యుధిష్ఠిర మహా నేష ధర్మో ధర్మభృతాం వర!
ధర్మమును ధరించువారిలో శ్రేష్ఠుడవగు ఓ యుధిష్ఠిరా! ఇది మహా ధర్మము.
గోఘ్నే ష్వపి భవే దస్మి న్నిష్కృతిః పాపకర్మణః,
న నిష్కృతి ర్భవేత్తస్య యో హన్యా చ్ఛరణాగతమ్. 18
గో హత్యాపాతకములందును పాపాత్మునకు పరిహారము కలదు. కాని శరణు కోరి వచ్చిన వానిని చెఱుచువాని పాపమునకు పరిహారములేదు.
ఇతిహాస మిమం శ్రుత్వా పుణ్యం పాపప్రణాశనమ్,
న దుర్గతి మవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి. 19
ఇతి శ్రీమహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
లుబ్దక స్వర్గగమనే ఏకోనపఞ్చాశ దధిక శతతమోధ్యాయః
పుణ్యము, పాపములను పోకార్చునదియునగు ఈ ఇతిహాసమును వినువాడు దుర్గతిని పొందడు. స్వర్గలోకమున కరుగును.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున బోయవాని స్వర్గగమనముగల నూట నలుబది తొమ్మిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
అబుద్ధి పూర్వం యత్పాపం కుర్యా ద్భరతసత్తమ,
ముచ్యతే స కథం తస్మా దేత త్సర్వం బ్రవీహి మే. 1
భరతసత్తమా! నరుడు తెలియక ఏదేని పాపమును చేసినచో దానినుండి ఎట్లు విడివడును? దీని నంతయు నాకు తెలియఁజెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను
అత్ర తే వర్తయిష్యామి పురాణ మృషిసంస్తుతమ్,
ఇన్ద్రోతః శౌనకో విప్రో యదాహ జనమేజయమ్. 2
ఈ విషయమున ఋషులు ప్రీతిగా చెప్పుకొనెడు ప్రాతకాలపు కథను చెప్పెదను. దీనిని శౌనకగోత్రుడైన విప్రుడు ఇంద్రోతుడు జనమేజయునకు చెప్పెను.
ఆసీద్రాజా మహావీర్యః పారిక్షి జ్జనమేజయః
అబుద్ధిపూర్వా మాగచ్ఛద్ బ్రహ్మహత్యాం మహీపతిః 3
గొప్పశక్తికలవాడు, పరీక్షితుని కుమారుడు నగు జనమేజయుడను మహారాజు తెలియక బ్రహ్మ హత్యా పాతకమును పొందెను.
బ్రాహ్మణాః సర్వ ఏవైతే తత్యజుః సపురోహితాః,
స జగామ వనం రాజా దహ్యమానో దివానిశమ్. 4
పురోహితునితోపాటు బ్రాహ్మణులందరు అతనిని వెలివేసిరి. ఆతడు రాత్రింబవళ్లు కుమిలి పోవుచు అడవుల కరిగెను.
ప్రజాభి స్స పరిత్యక్త శ్చకార కుశలం మహత్,
అతివేలం తప స్తేపే దహ్యమానః సమన్యునా. 5
ప్రజలందరు ఆతనిని వదలివేయగా నతడు దుఃఖముతో కుమిలిపోవుచు అలవికాని తపస్సు చేసెను.
బ్రహ్మహత్యాపనోదార్థ మపృచ్చ ద్ర్బాహ్మణాన్ బహూన్,
పర్యటన్ పృథివీం కృత్స్నాం దేశే దేశే నరాధిపః. 6
బ్రహ్మహత్యను పోగొట్టుకొనుటకై ఆతడు భూమియంతయు త్రిమ్మరుచు ప్రతిదేశమునందును పెక్కండ్రు బ్రాహ్మణులను ఉపాయ మడిగెను.
తత్రేతిహాసం వక్ష్యామి ధర్మస్యాస్యోపబృంహణమ్,
దహ్యమానః పాపకృత్యా జగామ జనమేజయః. 7
నీవడిగిన ఈధర్మమును చక్కగా వివరించు ఆ ఇతిహాసమును నీకిపుడు చెప్పెదను. ఆపాప కార్యముచేత కుమిలిపోవుచున్న ఆజనమేజయుడు అట్లు తిరుగాడజొచ్చెను.
చరిష్యమాణ ఇన్ద్రోతం శౌనకం సంశితవ్రతమ్,
సమాసాద్యోపజగ్రాహ పాదయోః పరిపీడయన్, 8
అట్లు త్రిమ్మరుచు ఆరాజు అతి తీవ్రములగు వ్రతములు కల, శౌనకగోత్రుడగు ఇంద్రోతుడను వానిని దరిజేరి ఆతని పాదములను పట్టుకొనెను.
ఋషి ర్దృష్ట్వా నృపం తత్ర జగర్హే సుభృశం తదా,
కర్తా పాపస్య మహతో భ్రూణహా కి మిహాగతః. 9
అంత నాఋషి ఆరాజుని గాంచి పెల్లుగా తిట్టి పోసెను. ‘మహాపాతకము చేసిన వాడవు. కడుపులు కాల్చువాడవు ఇటకేల వచ్చితివి?’ అనెను.
కిం త్వయాఽస్మాసు కర్తవ్యం మా మాం స్ప్రాక్షీః కథంచన,
గచ్ఛ గచ్ఛ న తే స్థానం ప్రీణాత్యస్మా నితి బ్రువన్. 10
మాతో నీకేమి పని? నన్ను తాకకుము. పో పో! నీవిట నిలుచుట మాకు ప్రీతి నొసగదు.
రుధిరస్యేవ తే గన్ధః శవస్యేవ చ దర్శనమ్,
అశివః శివసఙ్కాశో మృతో జీవ న్నివాటసి. 11
నెత్తురు కంపు కొట్టుచున్నావు. పీనుగువలె కన్నట్టుచున్నావు. శుభము ఏమాత్రములేని వాడవై మంగళస్వరూపముతో నున్న నీవు చచ్చినవాడు బ్రదికి వచ్చినట్లు తిరుగాడుచున్నావు.
బ్రహ్మ మృత్యు రశుద్ధాత్మా పాప మేవానుచిన్తయన్,
ప్రబుద్ధ్యసే ప్రస్వపిషి వర్తసే పరమే సుఖే ॥ 12
బ్రాహ్మణుని చంపిన మలినాత్ముడవు. పాపమును గూర్చియే భావించుచుందువు. మేల్కొందువు. నిద్రింతువు. పరమసుఖమున నున్నవాడవు!
మోఘం తే జీవితం రాజన్ పరిక్లిష్టం చ జీవసి,
పాపాయైవ హి సృష్టోఽసి కర్మణే హ యవీయసే. 13
నీది పాడుబ్రదుకు. మిక్కిలి నలిగి పోవుచు బ్రదుకుచున్నావు. ఇట్టి నీచ కర్మము కొరకే పాపము మూటగట్టుకొనుటకై పుట్టితివి.
బహు కల్యాణ మిచ్ఛన్తి ఈహన్తే పితరః సుతాన్,
తపసా దైవతేజ్యాభి ర్వన్దనేన తితిక్షయా. 14
తల్లితండ్రులు తపస్సుతో, దేవపూజలతో, మ్రొక్కులు చెల్లించుచు, పెక్కుకష్టములకోర్చి, ఏదో పెద్దగా ఒరిగింతురని తలచి, కొడుకులను కోరుకొందురు.
పితృవంశ మిమం పశ్య త్వత్కృతే నరకం గతమ్,
నిరర్థాః సర్వ ఏవైషా మాశాబద్ధా స్త్వదాశయాః. 15
చూడు! ఈ నీ పితృవంశ మంతయు నీవలన నరకమున బడినది. నిన్నుగూర్చి పెట్టుకొన్న వీరి ఆశలబంధములన్నియు పనికి మాలినవై పోయినవి.
యాన్ పూజయన్తో విన్దన్తి స్వర్గమాయు ర్యశః ప్రజాః,
తేషు త్వం సతతం ద్వేష్టా బ్రాహ్మణేషు నిరర్థకః. 16
మనుజులు ఎవరిని పూజించుచు స్వర్గమును, ఆయువును, కీర్తిని, మంచిసంతానమును పొందుదురో అట్టి బ్రహ్మవేత్తలయందు నీవు ఎల్లవేళల ద్వేషము పెట్టుకొని పనికి మాలినవాడవైతివి.
ఇమం లోకం విముచ్య త్వ మవాఙ్మూర్ధా పతిష్యసి |
అశాశ్వతీః శాశ్వతీశ్చ సమాః పాపేన కర్మణా. 17
ఈ పాపకర్మముచేత, నీవీలోకమును వదలి అశాశ్వతములు, శాశ్వతములు నైన వత్సరములు తలక్రిందులుగా పడియుండెదవు.
అర్ధ్యమానో యత్ర గృధ్రైః శితికంఠై రయోముఖై:,
తతశ్చ పునరావృత్తః పాపయోనిం గమిష్యసి. 18
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
ఇన్ద్రోత పారిక్షితీయసంవాదే పఞ్చాశదధిక శతతమోధ్యాయః
గ్రద్దలు, ఇనుప ముక్కులుగల నెమళ్ళు నిన్ను పీకుకొని తినుచుండగా అట్టి నరకము ననుభవింతువు. అటనుండి మరల తిరిగివచ్చి పాపపుజన్మ మెత్తుదువు.
ఇది శ్రీమహాభారతము శాన్తి పర్వమున ఆపద్ధర్మ పర్వమున ఇంద్రోత పారిక్షితీయసంవాద కథగల నూటయేబదియవ అధ్యాయము
“పఞ్చ పఞ్చనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ,
శశకః శల్యకో గోధా కూర్మః ఖడ్గీ తు పఞ్చమః.”
141
విశ్వామిత్ర చండాల సంవాదము
141
ద్విచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
142
ఆపత్కాలమున రాజునకు ధర్మనిశ్చయము
142
త్రిచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
143
పావురము బోయవాడు – వీరిసంవాదము
143
చతుశ్చత్వారింశదధిక శతతమోఽధ్యాయః
144
భార్యను ప్రశంసించుట
144
పఞ్ఞచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
145
పావురము పలుకు
145
షట్చత్వారింశదధిక శతతమోఽధ్యాయః
146
పావురము దేవామును వదలుట
146
సప్తచత్వారింశ దధిక శతతమోఽధ్యాయః
147
పిట్టలవాని వైరాగ్యము
147
అష్టచత్వారింశదధిక శతతమోఽధ్యాయః
148
ఆడుపావురము
స్వర్గమునకు పోవుట
148
ఏకోన పఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
149
పిట్టల స్వర్గమునకరుగుట
149
పఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
150
ఇంద్రోత జనమేజయుల సొంవాదము
150