| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 6 |
| Pages | 48 |
| Read Time | 55 Minutes |
151
ఏకపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను
ఏవముక్తః ప్రత్యువాచ తం మునిం జనమేజయః,
గర్హ్యం భవాన్ గర్హయతే నిన్ద్యం నిన్దతి మాం పునః. 1
ఇట్లు ఆముని పలుకగా జనమేజయు డాతనితో నిట్లనెను. తమరు ఏవగించు కొనదగినవానిని ఏవగించుకొనుచున్నారు. తిట్టవలసిన వానిని తిట్టుచున్నారు.
ధిక్కార్యం మాం ధిక్కురుతే తస్మాత్త్వాహం ప్రసాదయే,
సర్వం హీదం దుష్కృతం మే జ్వలామ్యగ్నా వివాహితః,
స్వకర్మాణ్యభిసంధాయ నాభినన్దతి మే మనః. 2
ఛీ కొట్టవలసిన వానినే ఛీకొట్టుచున్నారు. అందువలన మీ ప్రసన్నతను కోరుచున్నాను. ఈనాపాపము నంతటిని భావించియే నిప్పులలో పడ్డవానివలె కాలిపోవుచున్నాను. నా మనస్సే నన్ను మెచ్చకున్నది.
ప్రాప్య ఘోరం భయం నూనం మయా వైవస్వతా దపి. 3
యముడు పెట్టు యాతనల ననుభవించి కాని నాయీ దుఃఖము తొలగదు.
తత్తు శల్య మనిర్హృత్య కథం శక్ష్యామి జీవితుమ్,
సర్వం మన్యుం వినీయ త్వ మభి మాం వద శౌనక. 4
ఆ ముంటిని పెకలింపక నేనెట్లు బ్రదుకగలను. నాయందలి కోపము నంతటిని తొలగించుకొని ఓయి శౌనక! నాతో మాటాడుడు.
మహా నాసం బ్రాహ్మణానాం భూయో వక్ష్యామి సాంప్రతమ్,
అస్తు శేషం కులస్యాస్య మా పరాభూ దిదం కులమ్. 5
నేను బ్రాహ్మణుల యెడ గొప్ప భక్తుడనై యుంటిని. అది యంతయు పిదప చెప్పుదును. ఈ కులము మిగులు నిలుచుగాక! ఇది నశింపకుండుగాక!
నహి నో బ్రహ్మశస్తానాం శేషం భవితు మర్హతి,
స్తుతీ రలభమానానాం సంవిదం వేద నిశ్చయాన్. 6
మా కులము బ్రాహ్మణులు హింసింపగా మిగిలినది కారాదు. మావలన స్తుతులు పొందని వారి ఐకమత్యమును పొందవలయును. వేదమునందు నిశ్చయ జ్ఞానముగల మీకు మరల విన్నవించుకొందును.
నిర్విద్యమాన స్త్వాత్మానం భూయో వక్ష్యామి శాశ్వతమ్,
భూయ శ్చైవాభిరక్షన్తు నిర్ధనా న్నిర్జనా ఇవ. 7
మరియొక గతిలేని నేను నన్ను గూర్చి మరల మరల విన్నవించుకొందును. యోగులు దీనులను వలె తమరు నన్ను కాపాడవలయును.
న హ్యయజ్ఞా అముం లోకం ప్రాప్నువన్తి కథంచన,
ఆపాతాన్ ప్రతితిష్ఠన్తి పులిన్దశబరా ఇవ. 8
యజ్ఞములు లేనివారు ఏవిధముగను ఈలోకమును పొందజాలరు. పుళిందులు,
శబరులు మున్నగు మ్లేచ్ఛజాతులవలె నరకములందు నిలుకడగా నుందురు.
అవిజ్ఞా యైవ మే ప్రజ్ఞాం బాలస్యేవ స పణ్డితః,
బ్రహ్మన్ పితేవ పుత్రస్య ప్రీతిమాన్ భవ శౌనక. 9
బ్రాహ్మణోత్తమా! నాలోనున్న ప్రజ్ఞ నెరుగక నాదోషమునే చూచువాడు పండితుడే యగును. కాని పసివాడనగు నాయందు పుత్రుని యందు తండ్రివలె ఓ శౌనకా! మీరు ప్రీతికలవారు కావలయును.
శౌనక ఉవాచ - శౌనకు డిట్లనెను.
కి మాశ్చర్యం తతః ప్రాజ్ఞో బ్రహ్మ కుర్యా దసాంప్రతమ్,
ఇతి వై పణ్డితో భూత్వా భూతానాం నానుకుప్యతే. 10
కోపించిన బ్రాహ్మణజాతి కాని పనిని చేయుటలో ఆశ్చర్య మేమున్నది? అని యెరిగి ప్రజ్ఞకలవాడు పండితుడై ప్రాణుల విషయమున కోపతాపములు లేనివాడగును.
ప్రజ్ఞాప్రాసాద మారుహ్య అశోచ్యః శోచతే జనాన్,
జగతీస్థానివాద్రిస్థః ప్రజ్ఞయా ప్రతిపత్స్యతి, 11
దైన్యములేనివాడు ప్రజ్ఞయను ప్రాసాదము నెక్కి జనులను గూర్చి శోకించుచుండును. కొండకొమ్మున నున్నవాడు నేలబారు మనుజులను వలె ప్రజ్ఞతో పరిశీలించును.
న చోపలభ్యతే తేన న చాశ్చర్యాణి కుర్వతే,
నిర్విణ్ణాత్మా పరోక్షో వా ధిక్కృతః పూర్వసాధుషు. 12
సజ్జనులయందు ప్రీతిబుద్ధిలేనివాడు, వారిదృష్టినుండి తొలగినవాడు, వారిచే చీకొట్టించుకొన్నవాడునగు మానవునకు ప్రజ్ఞ కలుగదు. ఇతరులు ఆతని విషయమున ఆశ్చర్యములను కూడ చేయరు.
విదితం భవతో వీర్యం మాహాత్మ్యం వేద ఆగమే,
కురుష్వేహ యథా శాన్తి బ్రహ్మా శరణ మస్తు తే. 13
నీకు బ్రాహ్మణుల శక్తి తెలిసివచ్చినది. ఆగమమునందలి, వేదమునందలి మాహాత్మ్యము కూడ తెలిసి వచ్చినది. శాంతిని విడనాడక నీవు సత్కార్యములు చేయుము. బ్రాహ్మణుడు నీకు శరణ మగుగాక!
తద్వై పారత్రికం తాత బ్రాహ్మణానా మకుప్యతామ్,
అథవా తప్యసే పాపే ధర్మ మేవానుపశ్య వై. 14
కోపింపని బ్రాహ్మణుల విషయమున నీవు ఏమి చేయుదువో అదియే నీకు పరలోక సంబంధఫలముగా నగుగాక! లేదో, పాపమునందే కుమిలి పోయెదవు. ధర్మమునే పరికింపుము.
జనమేజయ ఉవాచ - జనమేజయు డిట్లనెను.
అనుతప్యే చ పాపేన నచ ధర్మం విలోపయే,
బుభూషుం భజమానం చ ప్రీతిమాన్ భవ శౌనక. 15
పాపముతో కుమిలిపోవుచున్నాను. ధర్మమునకు లోపమును రానీయను. శ్రేయస్సు పొందగోరినవాడను, నిన్ను సేవించువాడను అగు నాయందు ప్రీతికలవాడ వగుము.
శౌనక ఉవాచ - శౌనకు డిట్లనెను.
ఛిత్వా దంభం చ మానం చ ప్రీతి మిచ్ఛామి తే నృప,
సర్వభూతహితం తిష్ఠ ధర్మం చైవ ప్రతిస్మరన్, 16
బెట్టును, పట్టుదలను తెగగోసి, ఓరాజా! నీకు ప్రీతిని చేయగోరుదును. ధర్మమునే వదలక తలచుచు సర్వభూతముల హితము నాచరింపుము.
నభయా న్న చ కార్పణ్యా న్నలోభా త్త్వా ముపాహ్వయే,
తాం మే దైవీం గిరం సత్యాం శృణు త్వాం బ్రాహ్మణైః సహ. 17
భయమువలననో, జాలివలననో, లోభమువలననో నిన్ను శిష్యునిగా గ్రహించుటలేదు. నాయీ దివ్యము, సత్యమునగు వాక్కును బ్రాహ్మణులతోపాటు వినుము.
సోఽహం న కేనచి చ్చార్థీ త్వాంచ ధర్మాదుపాహ్వయే,
క్రోశతాం సర్వభూతానాం హాహా ధిగితి జల్పతామ్. 18
నేనెవ్వరి ప్రార్థనతోడను నిన్ను స్వీకరించుట లేదు. అయ్యో! అయ్యో! ఛీ! ఛీ! అని అందరు ఆక్రోశించుచున్నను కేవలము ధర్మమువలన మాత్రమే స్వీకరించుచున్నాను.
వక్ష్యన్తి మామధర్మజ్ఞం త్యక్ష్యన్తి సుహృదో జనాః,
తా వాచః సుహృదః శ్రుత్వా సంజ్వరిష్యన్తి మే భృశమ్. 19
నన్ను ధర్మమెరుగనివాడని నా మిత్రజనులు పలుకుదురు. నన్ను వెలివేయుదురు. నాయీమాటలు విని ఆ చెలికాండ్రందరు ఉడుకెక్కిపోవుదురు.
కేచిదేవ మహాప్రాజ్ఞాః ప్రతిజ్ఞాస్యన్తి తత్త్వతః,
జానీహి మత్కృతం తాత బ్రాహ్మణాన్ ప్రతి భారత. 20
గొప్ప ప్రజ్ఞగల కొందరు మాత్రమే నాపనిని తత్త్వపూర్వకముగా తెలిసికొందురు. బ్రాహ్మణులను గూర్చి నాపనియెట్టిదో నీవు చక్కగా తెలిసికొనుము.
యథా తే మత్కృతే క్షేమం లభన్తే తే తథా కురు
ప్రతిజానీహి చాద్రోహం బ్రాహ్మణానాం నరాధిప. 21
వారందరు నానిమిత్తముగా నీవలన ఎట్లు క్షేమమును పొందుదురో అట్లు ఆచరింపుము. బ్రాహ్మణులకు ద్రోహము చేయను అని ప్రతిజ్ఞ చేయుము.
జనమేజయ ఉవాచ - జనమేజయు డిట్లనెను.
నైవ వాచా నమనసా పునర్జాతు నకర్మణా,
ద్రోగ్ధాస్మి బ్రాహ్మణాన్ విప్ర చరణా వపి తే స్పృశే. 22
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
ఇన్ద్రోత పారిక్షితీయే ఏక పఞ్చాశ దధిక శతతమోఽధ్యాయః
ఓయి విప్రుడా! మాటతో, మనసుతో, చేష్టతో ఎన్నటికిని బ్రాహ్మణులయెడ ద్రోహము చేయను. నీపాదములంటి ఒట్టుపెట్టుకొనుచున్నాను.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున ఇంద్రోత పారిక్షితీయ వృత్తాంతము గల నూటయేబది యొకటవ అధ్యాయము
శౌనక ఉవాచ - శౌనకు డిట్లనెను.
తస్మా త్తేఽహం ప్రవక్ష్యామి ధర్మ మావృత చేతసే,
శ్రీమాన్ మహాబల స్తుష్టః స్వయం ధర్మ మవేక్షసే. 1
విద్యావంతుడను, గొప్పగుండెదిటవు కలవాడను, తుష్టికలవాడను కనుక నేను మోహముపైకొన్న చిత్తముగల నీకు ధర్మమును గట్టిగా ఉపదేశించెదను. నీవు స్వయముగా ధర్మమును పరికింపుము.
పురస్తా ద్దారుణో భూత్వా సుచిత్రతరమేవ తత్,
అనుగృహ్ణాతి భూతాని స్వేన వృత్తేన పార్థివః. 2
ముందు మహాక్రూరుడై యుండి పిదప తన నడవడితో రాజు ప్రాణులను అనుగ్రహించుచున్నాడు. ఇది మిక్కిలి చిత్రమైన విషయము.
కృత్స్నం నూనం స దహతి ఇతి లోకో వ్యవస్యతి,
యత్రం త్వం తాదృశో భూత్వా ధర్మమేవానుపశ్యసి. 3
ఇతడు తప్పక సర్వమును కాల్చివేయును అని లోకము నిశ్చయించుకొనును.
కాని నీవు అట్టివాడవై యుండి ధర్మమునే వదలక పరికించుచున్నావు.
హిత్వా తు సుచిరం భక్ష్యం భోజ్యాంశ్చ తప ఆస్థితః,
ఇత్యేత దభిభూతానా మద్భుతం జనమేజయ. 4
పెద్దకాలము తిండిని, భోగములను వదలి వైచి తపమున కుదురుకొంటివి. అధర్మముతో చెడిపోయినవారి విషయమున, ఓజనమేజయా! ఇది అద్భుతము.
యోఽదుర్లభో భవేద్దాతా కృపణో వా తపోధనః,
అనాశ్చర్యం తదిత్యాహు ర్నాతిదూరేణ వర్తతే. 5
సంపన్నుడై యుండి దాతయగుటయు, దీనుడై తపోధనుడగుటయు ననునది ఆశ్చర్యము కాదని విజ్ఞులందురు. అట్లగుట వారిస్థితికి దగ్గరగా నుండు విషయము.
ఏత దేవ హి కార్పణ్యం సమగ్ర మసమీక్షితమ్,
యచ్చేత్సమీక్షయైవ స్యా ద్భవేత్తస్మిం స్తతోగుణః. 6
అనాలోచితముగా ఈ దీనత యంతయు నేర్పడినదైనచో, చక్కగా ఆలోచించుకొనుటచేత దానియందు గుణ మేర్పడును.
యజ్ఞో, దానం, దయా, వేదాః, సత్యం చ పృథివీపతే,
పఞ్చైతాని పవిత్రాణి షష్ఠం సుచరితం తపః. 7
యజ్ఞము, దానము, దయ, వేదములు, సత్యము అను అయిదును పవిత్రములైనవి. ఆరవది చక్కగా ఆచరించిన తపస్సు.
త దేవ రాజ్ఞాం పరమం పవిత్రం జనమేజయ,
తేన సమ్యగ్గృహీతేన శ్రేయాంసం ధర్మ మాప్స్యసి. 8
జనమేజయా! అదియే రాజులకు పరమ పవిత్రమైనది. చక్కగా చేపట్టిన దానిచేత శ్రేయమైన ధర్మమును పొందెదవు.
పుణ్యదేశాభిగమనం పవిత్రం పరమం స్మృతమ్,
అత్రా ప్యుదాహరన్తీమాం గాఢాం గీథాం యయాతినా. 9
పుణ్యదేశములను దర్శించుటయు మిక్కిలి పవిత్రమైనదిగా లెక్కకెక్కినది. ఈ విషయమునందును యయాతి పాడిన గాథను చెప్పుకొనుచుందురు.
యో మర్త్యః ప్రతిపద్యేత ఆయు ర్జీవిత మాత్మనః,
యజ్ఞ మేకాన్తతః కృత్వా తత్సంన్యస్య తపశ్చరేత్. 10
ఏమనుజుడు తన ఆయువే జీవితమని నిశ్చయించుకొనునో అతడు గొప్పయత్నముతో యజ్ఞము నొనరించి దానిని సన్యసించి తపము నాచరింపవలయును.
పుణ్య మాహుః కురుక్షేత్రం కురుక్షేత్రా త్సరస్వతీమ్,
సరస్వత్యాశ్చ తీర్థాని తీర్థేభ్యశ్చ పృథూదకమ్. 11
కురుక్షేత్రము పుణ్యమైనది. కురుక్షేత్రము కంటె సరస్వతి పుణ్యమైనది. సరస్వతి కంటె తీర్థములు పవిత్రమైనవి. తీర్థములకంటె గొప్పజలములు కలవి మేలైనవి.
యత్రావగాహ్య పీత్వా చ నైనం శ్వోమరణం తపేత్,
మహాసరః పుష్కరాణి ప్రభాసోత్తరమానసే. 12
ప్రభాసమునకు ఉత్తరముగా నున్న మానసమునందలి మహాసరస్సునందును, పుష్కరములందును స్నానమాడియు, నీరుత్రావియు నరుడు రేపే మరణమగుటయను పాతకమున కాలిపోవడు.
కాలోదకం చ గన్తాసి లబ్దాయు ర్జీవితే పునః,
సరస్వతీ దృషద్వత్యోః సంగమో మానసః సరః. 13
జీవితమున ఆయువు లభించినవాడవైనచో కాలోదకతీర్థమున కరిగెదవు. అట్లే సరస్వతీ దృషద్వతీనదుల సంగమము మానస సరస్సు.
స్వాధ్యాయశీలః స్థానేషు సర్వేష్వేవ ముపస్పృశేత్,
వేదము నధ్యయనము చేయు శీలము కలవాడు ఈ ఆ స్థానము లన్నింటియందును స్నానమాచరింప వలయును.
త్యాగధర్మః పవిత్రాణాం సంన్యాసం మను రబ్రవీత్. 14
పవిత్రములైన వానిలో త్యాగమనెడు ధర్మము మిక్కిలి మేలైనదనియు, సన్యాసము దానికంటె మిన్న అనియు మనువు చెప్పెను.
అత్రా ప్యుదాహరన్తీమా గాథాః సత్యవతా కృతాః,
ఇందును సత్యవంతుడు చేసిన గాథలను చెప్పుకొందురు.
యథా కుమారః సత్యో వై నైవ పుణ్యో న పాపకృత్. 15
న హ్యస్తి సర్వభూతేషు దుఃఖ మస్మిన్ కుతఃసుఖమ్,
ఏవం ప్రకృతి భూతానాం సర్వసంసర్గయాయినామ్. 16
త్యజతాం జీవితం శ్రేయో నివృత్తే పుణ్యపాపకే.
పసివాడు, రాగద్వేషములు లేనివాడు, పుణ్యముగాని, పాపముగాని చేయనివాడు ఎట్లు ఏకరూపముగా నుండునో అట్లే ఉండవలయును. అట్టివానికి సర్వభూతముల యందును, దుఃఖములేదు, సుఖమెక్కడిది? నశించిన సర్వపాపములు గల బ్రహ్మ స్వరూపులగు వారికి, త్యాగగుణము కలవారికి పుణ్యపాపములు మరలిపోగా అట్టి జీవితము మేలైనదగును.
యత్త్వేవ రాజ్ఞో జ్యాయిష్ఠం కార్యాణాం తద్బ్రవీమి తే. 17
రాజు చేయవలసిన వానిలో అన్నింటికంటె మిన్న అయిన దానిని చెప్పెదను.
బలేన సంవిభాగైశ్చ జయ స్వర్గం జనేశ్వర,
యస్యైవ బలమోజశ్చ స ధర్మస్య ప్రభు ర్నరః. 18
ఓ జనపాలకా! బలముతోడను, దానముల తోడను స్వర్గమును సాధింపుము. బలము, ఓజస్సు కల నరుడే ధర్మమునకు ప్రభువగును.
బ్రాహ్మణార్థం సుఖార్థం హి త్వం పాహి వసుధాం నృప,
యథై వైతాన్ పురాక్షేప్సీ స్తథై వైతాన్ ప్రసాదయ. 19
బ్రహ్మజ్ఞానులకొరకును, సుఖముకొరకును రాజా! నీవు భూమిని పాలింపుము. మునుపు నీవెట్లు వారిని ఆక్షేపించితివో (త్రోసి పుచ్చితివో) ఇప్పుడట్లు వారిని ప్రసన్నులను చేసికొనుము.
అపి విక్రమమాణోఽపి త్యజమానోఽప్యనేకధా,
ఆత్మనో దర్శనా ద్విప్రా న్న హన్తాస్మీతి మార్గయ,
ఘటమానః స్వకార్యేషు కురు నిఃశ్రేయసం పరమ్. 20
వారు నీపై దుడుకుగా వచ్చినను, నిన్ను వదలివైచినను విప్రులను బాధింపను, నావలెనే చూచుకొందునని నిశ్చయముగా భావింపుము. వారి పనులయందు కలసిమెలసి ప్రవర్తించుచు అత్యధికమగు మేలు నాచరింపుము.
హి మాగ్ని ఘోర సదృశో రాజా భవతి కశ్చన,
లాంగలావనికల్పో వా భవేదన్యః పరంతప. 21
రాజన్నవాడు హిమాగ్నులవలె ఘోరమైనవాడు, నాగలిపిడుగుల వంటివాడును కావలయును.
న విశేషేణ గన్తవ్య మవిచ్ఛిన్నేన వా పునః,
న జాతు నాహ మస్మీతి సుప్రసక్త మసాధుషు. 22
దుష్టుల విషయమున, ఇతడు పండితుడనియో, నాకిష్టుడనియో, బ్రాహ్మణుడనియో తలచి వారిని చేరరాదు. ఎన్నటికిని నేను ఉండనివాడను కాను అనుకొనుచు ప్రవర్తింపవలయును.
వి కర్మణా తప్యమానః పాపా ద్విపరిముచ్యతే,
వైత త్కార్యం పునరితి ద్వితీయా త్పరిముచ్యతే. 23
కరిష్యే ధర్మ మేవేతి తృతీయా త్పరిముచ్యతే,
శుచి స్తీర్థా న్యనుచరన్ బహుత్వా త్పరిముచ్యతే. 24
ఒక్కమారు చేసిన పాడుపనిని గూర్చి పశ్చాత్తాపము పొందువాడు పాపమునుండి విడుదల పొందును. మరల ఈ పనిచేయరాదు అని నిశ్చయించుకొని రెండవ మారు చేసిన పాపమునుండి విముక్తుడగును. ధర్మమే చేయుదునను నిశ్చయముతో మూడవమారు చేసిన పాపమునుండి విడివడును. పవిత్రుడై తీర్థములను సేవించుచు పెక్కుమారులు చేసిన పాపమునుండి ముక్తుడగును.
కల్యాణ మనుకర్తవ్యం పురుషేణ బుభూషతా,
యే సుగన్ధీని సేవన్తే తథాగన్ధా భవన్తి తే. 25
యే దుర్గన్ధీ ని సేవన్తే తథా గన్ధా భవన్తి తే,
తపశ్చర్యాపరః సద్యః పాపా ద్వి పరిముచ్యతే. 26
మేలుకోరు పురుషుడు శుభకార్యములనే వదలక చేయుచుండవలయును. సువాసనలను సేవించువారు అట్టిగంధములు కలవారే యగుదురు. కుళ్లు కంపులందు తిరుగువారు అట్టి కంపులవారే యగుదురు. తపశ్చర్యయందు శ్రద్ధ కలవాడు అప్పటికప్పుడు పాపమునుండి ముక్తుడగును.
సంవత్సర ముపాస్యాగ్ని మభిశస్తః ప్రముచ్యతే,
త్రీణి వర్షా ణ్యుపాస్యాగ్నిం భ్రూణహా విప్రముచ్యతే. 27
పరస్త్రీగమనాది దోషములు చేసి నింద పొందినవాడు ఒకయేడు అగ్నినుపాసించి ముక్తుడగును. గర్భహత్యలు చేసినవాడు మూడేండ్లకాలము అగ్నినుపాసించి పాపమును పోగొట్టుకొనును.
మహాసరః పుష్కరాణి ప్రభాసోత్తర మానసే,
అభ్యేత్య యోజనశతం భ్రూణహా విప్రముచ్యతే. 28
గర్భమునందలి బిడ్డలను చంపువాడు ప్రభాసమునకు ఉత్తరమున నున్న మానస సరస్సునందు, నూరు యోజనములు నడచివెళ్లి పుష్కరతీర్థములను సేవించినచో పాపమును పరిహరించుకొనును.
యావతః ప్రాణినో హన్యా త్తజ్జాతీయాంస్తు తావతః,
ప్రమీయమానా నున్మోచ్య ప్రాణిహా విప్రముచ్యతే. 29
ప్రాణులెందరిని చంపునో అన్నిసంఖ్యల అట్టివారిని చంపబడుచున్నవారిని (చావనున్న వారిని) తప్పించి ఆపాపమునుండి విముక్తి పొందును.
అపి చాప్సు నిమజ్జేత జపంస్త్రి రఘమర్షణమ్,
యథాశ్వమేధావభృథ స్తథా తన్మను రబ్రవీత్. 30
మరియు అఘమర్షణ మంత్రములను జపించుచు నీట మునిగియుండవలయును. అశ్వమేధయాగమున అవభృథ స్నానమెట్టిదో అది యట్టిదని మనువు చెప్పెను.
తత్ క్షిప్రం నుదతే పాపం సత్కారం లభతే తథా,
అపి చైనం ప్రసీదన్తి భూతాని జడమూకవత్. 31
అది వెనువెంటనే పాపమును తొలగించును. మరియు నట్టివాడు సత్కారమును పొందును. మరియు నతని విషయమున ప్రాణులు జడులయందు, మూగవారియందువలె ప్రసన్నులగుదురు.
బృహస్పతిం దేవగురుం సురాసురాః
సర్వే సమేత్యాభ్యనుయుజ్య రాజన్,
ధర్మ్యం ఫలం వేత్త ఫలం మహర్షే
తథైవ తస్మిన్నరకే పారలోక్యే. 32
దేవతలు, దానవులు దేవగురువైన బృహస్పతిని పరమగౌరవముతో సమీపించి, ఓ మహర్షీ! ధర్మమువలన కలిగెడు ఫలమును నీవెరుగుదువా? మరియు పరలోక సంబంధమైన నరకమునందు ఫలమును కూడ ఎరుగుదువా? అని ప్రశ్నించిరి.
ఉభే తు యస్య సదృశే భవేతాం
కిం స్వి త్తయో స్తత్ర జయోఽథ న స్యాత్,
ఆచక్ష్వ నః పుణ్యఫలం మహర్షే
కథం పాపం నుదతే ధర్మశీల. 33
ఎవనికి రెండును సమానములే యగునో, ఎవనికి రెంటి యందును ఒకే విధమగు జయము కలుగునో లేదా కలుగదో ఓ మహర్షీ! మాకు ఆపుణ్యఫలమును గూర్చి చెప్పుము. ధర్మశీలుడు పాపమునెట్లు పోగొట్టుకొనునో దానిని కూడ చెప్పుము.
బృహస్పతి రువాచ - బృహస్పతి యిట్లు పలికెను.
కృత్వాపాపం పూర్వ మబుద్ధి పూర్వం
పుణ్యాని చేత్కురుతే బుద్ధి పూర్వమ్,
స తత్పాపం నుదతే కర్మశీలీ
వాసో యథా మలినం క్షారయుక్తమ్. 34
బుద్ధి పూర్వకముగా కాక పాపమొకదానిని చేసి బుద్ధిపూర్వకముగా పెక్కు పుణ్యములు చేసినచో అట్టి కర్మశీలి, మకిలిపట్టిన వస్త్రమువలె, ఆపాపమును తొలగించుకొనును.
పాపం కృత్వాభిమన్యేత నాహ మస్తీతి పూరుషః,
తచ్చికీర్షతి కల్యాణం శ్రద్దధానో ఽనసూయక:. 35
పురుషుడు (తెలియక) పాపము చేసియు నేను కాదు అని తలచినచో, శ్రద్ధకలవాడు, అసూయలేనివాడునై శుభమును చేయగోరును.
ఛిద్రాణి వివృతాన్యేవ సాధూనాం చా వృణోతి యః,
యః పాపం పురుషః కృత్వా కల్యాణ మభిపద్యతే. 36
సాధుజనుల దోషములు తెలియకవచ్చునవే అయినను కప్పిపుచ్చువాడును శుభమును చేయగోరును. అట్టి పురుషుడు పాపము చేసియు శుభమునే పొందును.
యథాదిత్యః ప్రాత రుద్య స్తమః సర్వం వ్యపోహతి,
కల్యాణ మాచరన్నేవం సర్వపాపం వ్యపోహతి. 37
సూర్యుడు ప్రాతఃకాలమున ఉదయించుచు చీకటుల మొత్తమును తొలగించునట్లు శుభమునాచరించువాడు సర్వపాపమును తొలగించుకొనును.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
ఏవ ముక్త్వా తు రాజాన మిన్ద్రోతో జనమేజయమ్,
యాజయామాస విధివ ద్వాజిమేధేన శౌనకః. 38
ఇట్లు శౌనకసగోత్రుడగు ఇంద్రోతుడు పలికి విధిపూర్వకముగా ఆతనితో
అశ్వమేధయాగము చేయించెను.
తతః స రాజా వ్యపనీతకల్మషః
శ్రేయోవృత్తః ప్రజ్వలితాగ్నిరూపవాన్,
వివేశ రాజ్యం స్వమమిత్రకర్షణో
యథా దినం పూర్ణవపు ర్నిశాకరః. 39
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
ఇన్ద్రోత పారిక్షితీయే ద్విపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
అంత నారాజు తొలగిన పాపము కలవాడై శ్రేయస్సునొసగు నడవడితో, వెలుగొందుచున్న అగ్నివంటి రూపము కలవాడై, శత్రువులను నలిపి వేయువాడై, నిండుబింబముగల చంద్రుడు ఆకాశమును చేరినట్లు, తన రాజ్యమును చేరుకొనెను.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున ఇంద్రోతపారిక్షితీయముగల నూటయేబది రెండవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
కచ్చి త్పితామహే నాసీ చ్ఛ్రుతం వా దృష్ట మేవ చ,
కచ్చి న్మర్త్యో మృతో రాజన్ పునరుజ్జీవితోఽభవత్, 1
తాత ఎన్నడైన విని గాని చూచి గానీ యుండుట సంభవించెనా? చనిపోయిన మనుజుడు ఎందైన తిరిగి బ్రతికెనా?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
శృణు పార్థ యథావృత్త మితిహాసం పురాతనమ్,
గృధ్ర జంబుకసంవాదం యో వృత్తో నైమిశే పురా. 2
పార్థా! మునుపు నైమిశమున జరిగిన గ్రద్ద నక్కల సంవాదమను ప్రాతకాలపు ఇతిహాసమును ఉన్నదున్నట్లు చెప్పెదను. వినుము.
కస్య చి ద్రాహ్మణ స్యాసీ ద్దుఃఖలబ్ధః సుతో మృతః,
బాల ఏవ విశాలాక్షో బాలగ్రహ నిపీడితః. 3
ఒకానొక బాపనికి లేకలేక పుట్టిన కొడుకు, పెద్దకన్నులవాడు, పసివాడు, బాలగ్రహము పీడింపగా మరణించెను.
దుఃఖితాః కేచిదాదాయ బాల మప్రాప్తయౌవనమ్,
కుల సర్వస్వభూతం వై రుదన్తః శోక విహ్వలాః. 4
బాలం మృతం గృహీత్వాఽథ శ్మశానాభిముఖాః స్థితాః,
అఙ్కే నైవ చ సంక్రమ్య రురుదు ర్భృశదుఃఖితాః. 5
పసితనము గడువనివాడు, కులమునకు సర్వస్వము అయినవాడు, చనిపోయినవాడు నగు బాలుని ఒడిలో నిడుకొని శోకము కుదిలించి వేయగా గుండెలు బాదుకొనుచు కొందరు వల్లకాటివైపు పోవుచు ఏడ్చుచుండిరి.
శోచన్త స్తస్య పూర్వోక్తాన్ భాషితాం శ్చాసకృత్పునః,
తం బాలం భూతలే క్షిప్య ప్రతిగన్తుం న శక్నుయుః. 6
వాని వెనుకటి పలుకులను మాటిమాటికి చెప్పుకొనుచు ఆ బాలుని నేలపై నిడి తిరిగి పోవుటకు వారు చాలరైరి.
తేషాం రుదితశబ్దేన గృధ్రోఽభ్యేత్య వచోఽ బ్రవీత్,
ఏకాత్మజ మిమం లోకే త్యక్త్యా గచ్ఛత మాచిరమ్. 7
వారి ఏడుపుల నాదము విని ఒక గ్రద్ద అచటకు వచ్చి పాపము! ఒక్క కొడుకు! వీనిని వదలిపొండు. ఆలసింపకుడు - అని పలికెను.
ఇహ పుంసాం సహస్రాణి స్త్రీ సహస్రాణి చైవ హ,
సమానీతాని కాలేన హిత్వా వై యాన్తి బాన్ధవాః. 8
ఇచట వేలకొలది మగవారిని, వేలకొలదిగా ఆడువారిని, కాలము మూడినవారిని, తీసికొనివచ్చి బంధువులు వదలి వెళ్లిపోయిరి.
సంపశ్యత జగత్సర్వం సుఖదుఃఖై రధిష్ఠితమ్,
సంయోగో విప్రయోగశ్చ పర్యాయేణోపలభ్యతే. 9
లోకమంతటిని చూడుడు. సుఖదుఃఖములతో నిండియున్నది. కలయిక, ఎడబాటు అనునవి ఒక మారది, ఒకమారిదిగా వచ్చుచుండును.
గృహీత్వా యే చ గచ్ఛన్తి యేన యాన్తి చ తాన్ మృతాన్,
తేఽప్యాయుషః ప్రమాణేన స్వేన గచ్ఛన్తి జన్తవః. 10
ఎవరైన వారిని తీసికొని పోయినవారును, ఆమరణించినవారి వెంటబడి పోవనివారును తమ ఆయువు ప్రమాణమును బట్టి పోవుచునే ఉన్నారు.
అలం స్థిత్వా శ్మశానేఽస్మిన్ గృధ్రగోమాయు సంకులే,
కఙ్కాల బహులే రౌద్రే సర్వప్రాణి భయంకరే. 11
గ్రద్దలు, నక్కలు పెల్లుగా నున్నదియు, పుఱ్ఱెలు ఎక్కువగా కలదియు, ప్రాణులందరికి వెరపు పుట్టించునదియు, భయంకరమైనదియు నగు ఈ వల్లకాటిలో మీరుండవలదు.
న పున ర్జీవితః కశ్చి త్కాల ధర్మ ముపాగతః,
ప్రియో వా యది వా ద్వేష్యః ప్రాణినాం గతి రీదృశీ. 12
కాలధర్మము పొందినవాడెవ్వడును, వాడు ప్రియుడైనను, ద్వేషింపదగినవాడైనను మరల బ్రదికినవాడు లేడు. ప్రాణులగతి యిటువంటిది.
సర్వేణ ఖలు మర్తవ్యం మర్త్యలోకే ప్రసూయతా,
కృతాన్త విహితే మార్గే మృతం కో జీవయిష్యతి. 13
మర్త్యలోకమున పుట్టిన ప్రత్యివక్తియు చావవలసినదే. యము డేర్పరచిన మార్గమున చచ్చిన వానిని బ్రదికించువాడెవ్వడు?
కర్మాన్త విరతే లోకే అస్తం గచ్ఛతి భాస్కరే,
గమ్యతాం స్వ మధిష్ఠానం సుతస్నేహం విసృజ్య వై. 14
లోకము తమపనులు ముగించుకొనియున్నది. సూర్యుడు అస్తమించుచున్నాడు. కొడుకునందలి స్నేహమును వదలివైచి మీమీ ఇండ్లకు అరుగుడు.
తతో గృధ్ర వచః శ్రుత్వా ప్రాక్రోశన్త స్తదా నృప,
బాన్ధవా స్తేఽభ్యగచ్ఛన్త పుత్ర ముత్సృజ్య భూతలే. 15
అంత ఆ గ్రద్ద పలుకులు విని బందుగులు మరొక్క మారు గొల్లుమని పుత్రుని భూమిపై నిడి బయలుదేరిరి.
వినిశ్చిత్యాథ చ తదా విక్రోశన్త స్తతస్తతః,
మృతమిత్యేవ గచ్ఛన్తో నిరాశా స్తస్య దర్శనే. 16
చనిపోయినవాడే అని నిర్ణయించుకొని గుండెలో కుమిలిపోవుచున్నవారు, మరల వానిని చూతుమన్న ఆశ లేనివారై వారు పోవ నుంకించిరి.
నిశ్చితార్థాశ్చ తే సర్వే సంత్యజన్తః స్వమాత్మజమ్,
నిరాశా జీవితే తస్య మార్గ మావృత్య ధిష్ఠితాః. 17
వారందరు ఒక నిర్ణయమునకు వచ్చి తమబాలుని వదలివేయువారై, మరల అతని బ్రదుకున ఆశలేనివారై, యింటి దారి పట్టజొచ్చిరి.
ధ్వాంక్షపక్షసవర్ణస్తు బిలా న్ని సృత్య జంబుక:,
గచ్ఛమానాన్ స్మ తానాహ నిర్ఘృణాః ఖలు మానుషాః. 18
కాకి రెక్కల వంటి, రంగుగల ఒక నక్క బొరియనుండి వెలువడి, తిరిగి పోవుచున్న వారితో 'ఆహా! మనుజులెంత దయలేనివారు!' అని పలికెను.
ఆదిత్యోఽయం స్థితో మూఢాః స్నేహం కురుత మాభయమ్,
బహురూపో ముహూర్త శ్చ జీవత్య పి కదాచన. 19
'ఇంకను సూర్యుడు నిలిచియే యున్నాడు. మూఢులారా! మీ ప్రేమను వెళ్లబోసికొనుడు. భయపడకుడు. ఏమో! ముహూర్తము ఎన్నియో రూపములు కలది. మీ బాలు డొకప్పుడు బ్రదికినను బ్రదుకవచ్చును.
యూయం భూమౌ వినిక్షిప్య పుత్రస్నేహ వినాకృతాః,
శ్మశానే సుత ముత్సృజ్య కస్మా ద్గచ్ఛత నిర్ఘృణాః. 20
కొడుకు ప్రేమను విడనాడి మీరు బాలుని నేలపై నిడి వల్లకాటిలో వదలి వైచి దయలేనివారై ఎట్లు పోవుచున్నారు?
న వోఽస్త్యస్మిన్ సుతే స్నేహో బాలే మధురభాషిణి,
యస్య భాషితమాత్రేణ ప్రసాద మధిగచ్ఛత. 21
పసివాడు, తీయనిపలుకులవాడు, కొడుకు నగు నితనియందు మీకు మక్కువ లేదా? వాడు పలికినంత మాత్రమున ఉప్పొంగిపోయెదరు కదా!
తే పశ్యత సుతస్నేహో యాదృశః పశుపక్షిణామ్,
న తేషాం ధారయిత్వా తాన్ కశ్చి దస్తి ఫలాగమః. 22
చతుష్పా త్పక్షికీటానాం ప్రాణినాం స్నేహ సఙ్గినామ్,
పరలోక గతిస్థానాం మునియజ్ఞక్రియా మివ. 23
ఆ పశువులకు, ఆ పక్షులకు బిడ్డలమీది వాత్సల్య మెంతటిదో చూడుడు. మృగములు, పక్షులు, పురుగులు, స్నేహపుతగులము గల ప్రాణులు మొదలగునవి పరలోక గతులయందు బుద్ధిపెట్టినవారికి మునుల యజ్ఞక్రియను పోలిన ఫలము రాకవంటిది, బిడ్డలను పెంచుటవలన కలుగునా? (ఫలము కలుగకపోయినను పశుపక్ష్యాదులు పిల్లలయందు చెడని మమకారము కలిగియుండెను కదా - అని భావము)
తేషాం పుత్రాభిరామాణా మిహలోకే పరత్ర చ,
న గుణో దృశ్యతే కశ్చి త్ప్రజాః సంధారయన్తి చ. 24
పుత్రులను చూచి మురిసిపోవు వారికందరికి ఈలోకమున గానీ, పరలోకమున గానీ ఏ ఒక్కలాభము కానరాకున్నది. అయినను వారు బిడ్డలను పెంచుచునే యున్నారు.
అపశ్యతాం ప్రియాన్ పుత్రాన్ తేషాం శోకో న తిష్ఠతి,
న చ పుష్ణన్తి సంవృద్ధా స్తే మాతాపితరౌ క్వచిత్. 25
వారు పెరిగి ముసలివారైన తరువాత తలిదండ్రులను పోషింపరు. అట్టి కొడుకులు కలవారికి కూడ ప్రియపుత్రులు కానరానిచో శోకము కట్టలు త్రెంచుకొని వచ్చును.
మానుషాణాం కుతః స్నేహో యేషాం శోకో భవిష్యతి,
ఇమం కులకరం పుత్రం త్యక్త్యా క్వను గమిష్యథ. 26
నిజముగా పెనుదుఃఖము కలుగవలసిన మనుష్యులలో ఆ దుఃఖ మేడ బోయినది? కులము నుద్ధరించు ఈ కొడుకును వదలి మీరెందు బోయెదరు?
చిరం ముఞ్చత బాష్పం చ చిరం స్నేహేన పశ్యత,
ఏవం విధాని హీష్టాని దుస్త్యజాని విశేషతః. 27
చాల సేపు కన్నీళ్లు కార్చుడు. పెద్దకాలము ప్రేమతో కొడుకును చూచుకొనుడు. ఈ విధములైన ఇష్టవస్తువులను ఒక్కమారుగా వదలివేయుట సాధ్యము కాదు కదా!
క్షీణ స్యార్థాభియుక్తస్య శ్మశానాభిముఖస్య చ,
బాన్ధవా యత్ర తిష్ఠన్తి తత్రాన్యో నాధితిష్ఠతి. 28
చిక్కిశల్యమయిన వానికి, ధనము కలవానికి, కాటికి కాళ్లు చాచుకొని యున్నవానికి చుట్టములే దగ్గర నిలుతురు కాని మరియెవ్వడును ఇతరుడు నిలువడు.
సర్వస్య దయితాః ప్రాణాః సర్వః స్నేహం చ విన్దతి,
తిర్యగ్యోని ష్వపి సతాం స్నేహం పశ్యత యాదృశమ్. 29
అందరకు ప్రాణములు ప్రియములే. అందరకు స్నేహము లభించును. పశువులు, పక్షులు మొదలగు వానియందును మంచివారి కెంత ప్రేమ యుండునో చూడుడు.
త్యక్త్యా కథం గచ్ఛథేమం పద్మలోలాయతాక్షికమ్,
యథా నవోద్వాహకృతం స్నానమాల్య విభూషితమ్. 30
ఆ కన్నులు పద్మములవలె ముద్దుగా కదలాడుచున్నవి. కొత్త పెండ్లికొడుకు స్నానమాడి మాలలు ధరించినట్లు కళకళలాడుచున్నాడు. ఇట్టివానిని వదలి ఎట్లు పోయెదరు?
జంబుకస్య వచః శ్రుత్వా కృపణం పరిదేవతః,
న్యవర్తన్త తదా సర్వే శవార్థం తేస్మ మానుషాః. 31
నక్క మాట విని జాలిగా ఏడ్చుచున్న వారందరు శవము కడకు మరలి వచ్చిరి.
గృధ్ర ఉవాచ - గ్రద్ద యిట్లు పలికెను.
అహో బత నృశంసేన జంబుకే నాల్పమేధసా,
క్షుద్రేణోక్తా హీనసత్త్వా మానుషాః కిం నివర్తథ. 32
అయ్యో! పాపము! దయలేనిది, తెలివితక్కువది, క్షుద్రమైనది అగు గుంట నక్క మాటకు గుండెదిటవు కోల్పోయిన మానవులారా! మీరు వెను దిరుగుదురా?
పఞ్చభూతపరిత్యక్తం శూన్యం కాష్ఠత్వ మాగతమ్,
కస్మా చ్ఛోచథ తిష్ఠన్త మాత్మానం కిం న శోచథ. 33
అయిదు భూతములు వదలి పోయినది, ఏమియు లేనిది, కట్టెస్థితికి వచ్చినది అగు ఈ శవమును గూర్చి మీ రేల ఏడ్తురు? నిలిచి యున్న మీ ఆత్మను గూర్చి విచారింపరేల?
తప: కురుత వై తీవ్రం ముచ్యధ్వం యేన కిల్బిషాత్,
తపసా లభ్యతే సర్వం విలాపః కిం కరిష్యతి? 34
తీవ్రమైన తపమొనరింపుడు. దానితో పాపమునుండి విడివడుదురు. తపస్సుతో దేనినైనను పొందనగును. ఏడుపేమి చేయును?
అనిష్టాని చ భాగ్యాని జాతాని సహ మూర్తినా,
యేన గచ్ఛతి బాలోఽయం దత్వా శోక మనన్తకమ్. 35
దేహముతోడనే భాగ్యములు కలుగుచుండును. ఇష్టములు కాని దుర దృష్టములుకూడ పుట్టుచుండును. మనకు అంతు లేని శోకమును కలిగించి దానితో (ఆ దేహముతో) ఈ పసివాడు వెడలి పోయెను.
ధనం, గావః, సువర్ణం చ మణిరత్న మథాఽపి చ,
అపత్యం చ తపోమూలం తపో యోగాచ్చ లభ్యతే. 36
ధనము, ఆవులు, బంగారు, మణులు, రత్నములు, సంతానము ఈ యన్నింటికీ తపస్సే కుదురు. తపస్సు యోగమువలననే లభించును.
యథా కృతా చ భూతేషు ప్రాప్యతే సుఖదుఃఖితా,
గృహీత్వా జాయతే జన్తు ర్దుఃఖాని చ సుఖాని చ. 37
భూతములు కర్మముననుసరించి సుఖదుఃఖానుభవమును పొందును. జంతువు (ప్రాణి) వానిని కైకొనియే పుట్టును. సుఖదుఃఖముల ననుభవించును.
న కర్మణా పితుః పుత్రః పితా వా పుత్రకర్మణా,
మార్గేణాన్యేవ గచ్ఛన్తి బద్ధాః సుకృతదుష్కృతైః. 38
కొడుకు తండ్రి కర్మముతోగాని, తండ్రి కొడుకుకర్మముతో గాని బద్ధులు కారు. మరియొక మార్గముతో పుణ్యపాపములకు చిక్కినవారై పోవుచుందురు.
ధర్మం చరత యత్నేన న చాధర్మే మనః కృథాః,
వర్తధ్వం చ యథాకాలం దైవతేషు ద్విజేషు చ. 39
పనివడి ధర్మమాచరింపుడు. అధర్మమునందు మనసుపెట్టకుడు. దేవతల విషయమునందును, బ్రాహ్మణుల విషయమునను కాలము ననుసరించి ప్రవర్తింపుడు.
శోకం త్యజత దైన్యం చ సుతస్నేహా న్నివర్తత,
త్యజ్యతా మయ మాకాశే తతః శీఘ్రం నివర్తత. 40
శోకమును వదలుడు. జాలిని విడనాడుడు. కొడుకు మీది ప్రేమనుండి మరలుడు. వీనిని ఈ వట్టినేలపై వదలివేయుడు. వడివడిగా తిరిగిపొండు.
యత్కరోతి శుభం కర్మ తథా కర్మ సుదారుణమ్,
తత్ కర్తైవ సమశ్నాతి బాన్ధవానాం కి మత్ర హ. 41
జీవుడు శుభకర్మమునో, పరమఘోరమగు కర్మమునో ఆచరించునేని దానిఫలమును కర్తయే పొందును. బంధువుల కిందు పనియేమి?
ఇహ త్యక్త్యా న తిష్ఠన్తి బాన్ధవా బాన్ధవం ప్రియమ్,
స్నేహ ముత్సృజ్య గచ్ఛన్తి బాష్పపూర్ణావిలేక్షణాః. 42
బందుగులు ప్రియమైన బంధువును ఇక్కడ వదలివేయుదురు. నిలువరు. కన్నీటితో కలతనొందిన కన్నులు కలవారై స్నేహమును వదలి వెళ్లిపోవుదురు.
ప్రాజ్ఞో వా యది వా మూర్ఖః సధనో నిర్ధనోఽపి వా,
సర్వః కాలవశం యాతి శుభాశుభ సమన్వితః. 43
తెలివిగలవాడో, మూర్ఖుడో, ధనవంతుడో, దరిద్రుడో ఎల్లవాడును కాలము పిడికిలికి చిక్కి పుణ్యపాపములతో కూడినవాడై వెడలిపోవును.
కిం కరిష్యథ శోచిత్వా మృతం కి మనుశోచథ,
సర్వస్య హి ప్రభుః కాలో ధర్మతః సమదర్శనః. 44
ఏడ్చి ఏమి సాధింతురు? చచ్చినవానిని గురించి ఏల ఏడ్తురు. అందరికిని కాలమే ప్రభువు. ధర్మమునుబట్టి అది అందరియందును ఒకే విధమగు చూపుకలది యగును.
యౌవనస్థాంశ్ఛ బాలాంశ్చ వృద్ధాన్ గర్భగతా నపి,
సర్వా నావిశతే మృత్యురేవం భూతమిదం జగత్. 45
మంచి వయసుననున్న వారిని, పసివారిని, ముసలివారిని, తల్లి కడుపున నున్నవారిని అందరిని మృత్యువు ఆక్రమించును. జగత్తు ఇటువంటిది!
జంబుక ఉవాచ - నక్క యిట్లనెను.
అహో మన్దీకృతః స్నేహః గృధ్రోణేహాల్పబుద్ధినా,
పుత్రస్నేహాభిభూతానాం యుష్మాకం శోచతాం భృశమ్. 46
అయ్యో! ఈ తెలివితక్కువ గ్రద్ద, పుత్రస్నేహమున దెబ్బతిని పెల్లు ఏడ్చుచున్న మీ మమకారము నెంత హీనపరచెను!
సమైః సమ్యక్ర్పయుక్తైశ్చ వచనైః ప్రత్యయోత్తరైః,
యద్గచ్ఛతి జనశ్చాయం స్నేహ ముత్సృజ్య దుస్త్యజమ్. 47
సమముగా కన్పట్టునవి, చక్కగా ప్రయోగింపబడినవి, నమ్మకము పుట్టించునవి యగు ఈ గ్రద్ద పలుకులతో ఈ జనము వదల శక్యముగాని స్నేహమును వదలి వెళ్లిపోవుచున్నది.
అహో పుత్రవియోగేన మృతశూన్యోప సేవనాత్,
క్రోశతాం సుభృశం దుఃఖం వివత్సానాం గవామివ. 48
అద్య శోకం విజానామి మానుషాణాం మహీతలే,
స్నేహం హి కారణం కృత్వా మమాప్యశ్రూణ్యథా పతన్. 49
మరణించిన కొడుకు ఎడబాటుచేత, దూడలుపోయినఆవులవలె, పెద్దగా గుండెలదరునట్లేడ్చుచున్న మానవుల శోకమెట్టిదో నేనెరుగుదును. అట్టి స్నేహము కారణముగా నాకును కన్నీళ్లు జాలువారుచున్నవి.
యత్నో హి సతతం కార్య స్తతో దైవేన సిద్ధ్యతి,
దైవం పురుషకారశ్చ కృతానే వోపపద్యతే. 50
మానవు డెల్లవేళల, ప్రయత్నము చేయవలయును. ఫలము దైవమును బట్టి సిద్ధించును. దైవము, మానవప్రయత్నము రెండును కాలమునుబట్టి ఫలితమునకు వచ్చును.
అనిర్వేదః సదా కార్యో నిర్వేదాద్ధి కుతః సుఖమ్,
ప్రయత్నాత్ ప్రాప్యతే హ్యర్థః కస్మా ద్గచ్ఛథ నిర్దయమ్. 51
మానవుడు ఎన్నడును ఆశ వదలినవాడు కారాదు. ఆశను వదలినచో సుఖమెక్కడిది? ప్రయత్నముతో ప్రయోజనము కలుగును. జాలివదలి యేల పోవుదురు?
ఆత్మమాంసోపవృత్తం చ శరీరార్ధమయీం తనుమ్,
పితౄణాం వంశకర్తారం వనే త్యక్త్వా క్వ యాస్యథ. 52
మీ మాంసముతో ఏర్పడినది, మీ శరీరముతో సగమైనట్టిది, పితృదేవతలకు, వంశము నుద్ధరించునది యగు ఈ బాలుని తనువును ఈ కాటిలో వదలివైచి ఎందు పోయెదరు?
అథవా స్తంగతే సూర్యే సన్ధ్యాకాల ఉపస్థితే,
తతో నేష్యథ వా పుత్ర మిహస్థా వా భవిష్యథ. 53
లేదా సూర్యుడస్తమించినపుడు, సంధ్యాకాలము వచ్చినపుడు మీ కొడుకును కొనిపొండు. లేదా మీరును ఇందే నిలువుడు.
గృధ్ర ఉవాచ - గ్రద్ద యిట్లనెను.
అద్య వర్షసహస్రం మే సాగ్రం జాతస్య మానుషాః,
న చ పశ్యామి జీవన్తం మృతం స్త్రీపుం నపుంసకమ్. 54
నేను పుట్టి వేయి యేండ్లు నిండుగా నయినది. మానవులారా! చచ్చినది ఆడుదియో, మగవాడో, నపుంసకుడో మరల బ్రదికివచ్చుటను నేను చూడలేదు.
మృతా గర్భేషు జాయన్తే జాతమాత్రా మ్రియన్తి చ,
చంక్రమన్తో మ్రియన్తే చ యౌవనస్థా స్తథా పరే. 55
కొందరు గర్భములందే చచ్చి వెలువడుదురు. మఱికొందరు పుట్టినవెంటనే చత్తురు. కొందరు గంతులు వైచుచు చనిపోవుదురు. మరికొందరు నడివయస్సున మరణింతురు.
అనిత్యా నీహ భాగ్యాని చతుష్పా త్పక్షిణా మపి,
జంగమానాం నగానాం వాఽప్యాయు రగ్రేఽ వతిష్ఠతే. 56
పశువులకుగాని, పక్షులకు గాని, జంగమములకు గానీ, స్థావరములకు గానీ భాగ్యములు ఒక్క విధముగా నుండునవి కావు. ఆయువు ముందు నిలిచియుండును. (ఆయువు స్వశక్తి చేత నిలుపుకొన గలిగినది కాదని తాత్పర్యము).
ఇష్టదారవియుక్తాశ్చ పుత్రశోకాన్వితా స్తథా,
దహ్యమానాః స్మ శోకేన గృహం గచ్ఛన్తి నిత్యశః. 57
ప్రియమైన భార్యను కోల్పోయినవారు, కొడుకుల దుఃఖముతో కూడినవారు నగు ఎందరో జనులు ప్రతిదినము శోకముతో కాలిపోవుచు కొంపల కరుగు చున్నారు.
అనిష్టానాం సహస్రాణి తథేష్టానాం శతాని చ,
ఉత్సృజ్యేహ ప్రయాతా వై బాన్ధవా భృశదుఃఖితాః. 58
ఇష్టులుకాని వారిని వేలకొలదిగా, ఇష్టులైన వారిని వందలకొలదిగా ఇచట వదలివైచి బంధువులు శోకముతో గుండెలు బాదుకొనుచు పోవుచుందురు.
త్యజ్యతా మేష నిస్తేజాః శూన్యః కాష్ఠత్వ మాగతః,
అన్యదేహ విషక్తం హి శావం కాష్ఠత్వ మాగతమ్. 59
మొగమున కళలేదు. శూన్యుడు. కొయ్యబారిన వాడు నగు నీబాలుని వదలివేయుడు. ఈ శవములో నున్న జీవుడు, దేహమును కట్టెగా మార్చి, మరియొక దేహమున ఈ పాటికి చిక్కుకొని యుండునుగదా!
త్యక్తజీవస్య చైవాస్య కస్మా ద్ధిత్వా న గచ్ఛత,
నిరర్థకో హ్యయం స్నేహో నిష్ఫలశ్చ పరిశ్రమః. 60
ప్రాణములు పోయిన యీ కట్టెను విడచి మీరేల పోకున్నారు? ఈ స్నేహము పనికిమాలినది. ఈ పాటు ఫలములేనిది.
చక్షుర్భ్యాం న చ కర్ణాభ్యాం సంశృణోతి సమీక్షతే,
కస్మాదేనం సముత్సృజ్య నగృహాన్ గచ్ఛతా శు వై. 61
ఇది కన్నులతో చూడదు. చెవులతో వినదు. ఇట్టి దీనిని (శవమును) వదలివైచి మీరిండ్లకేల పోకున్నారు?
మోక్షధర్మాశ్రితై ర్వాక్యై ర్హేతుమద్భిః సునిష్ఠురైః,
మయోక్తా గచ్ఛత క్షిప్రం స్వం స్వమేవ నివేశనమ్. 62
మోక్షధర్మముల నాశ్రయించినవియు, హేతువులు కలవియు, మిక్కిలి నిష్ఠురములైనవియు నగు వాక్యములను నేను పలికితిని. వెనువెంటనే మీమీ గృహములకు పాండు.
ప్రజ్ఞావిజ్ఞాన యుక్తేన బుద్ధిసంజ్ఞా ప్రదాయినా,
వచనం శ్రావితా నూనం మానుషాః సంన్యవర్తత. 63
ఎంతో తెలివితో విజ్ఞానముతో కూడినదానను, బుద్ధికి వికాసమును ప్రసాదించుదానను అగు నేను మంచిమాటను మీకు వినిపించితిని. నిక్కము. నరులారా! మరలుడు.
శోకో ద్విగుణతాం యాతి దృష్ట్వా స్మృత్వా చ చేష్టితమ్,
ఇత్యేత ద్వచనం శ్రుత్వా సన్నివృత్తాస్తు మానుషాః.
అపశ్య త్తత్తదా సుప్తం ద్రుత మాగత్య జంబుకః. 64
మీ దుఃఖము, ఈబాలుని చూచుచున్న కొలదియు, వానిచేష్టను తలపోసిన కొలదియు రెట్టింపగును - అని పలుకగా ఆ నరులు మరలబోయిరి. ఇంతలో నిద్రించుచున్నట్లున్న ఆ బాలుని చూచి వడివడిగా వచ్చి నక్క యిట్లనెను.
జంబుక ఉవాచ - నక్క యిట్లు పలికెను.
ఇమం కనక వర్ణాభం భూషణైః సమలంకృతమ్,
గృధ్రవాక్యా త్కథం పుత్రం త్యక్షధ్వం పితృ పిండదమ్. 65
బంగరువన్నెతో మిలమిలలాడుచున్నవాడు, ఆభరణములతో వెలిగి పోవుచున్నవాడు, పితృదేవతలకు పిండము నొసగవలసినవాడునగు బాలుని ఈ గ్రద్దమాటలు విని ఎట్లు వదలివేయుదురు.
న స్నేహస్య విచ్ఛేదో విలాపరుదితస్య చ,
మృతస్యాస్య పరిత్యాగా త్తాపో వై భవితా ధ్రువమ్. 66
ఇన్నాళ్లు ఏడ్చెనో, మొత్తుకొనెనో ఇప్పుడు చనిపోయిన వీనిని మీరు వదలివైచినచో మీ అనురాగము విరిగిపోదు. పిమ్మట మీకు దుఃఖము కలుగక మానదు.
శ్రూయతే శంబుకే శూద్రే, హతే బ్రాహ్మణ దారకః,
జీవితో ధర్మ మాసాద్య రామాత్సత్య పరాక్రమాత్. 67
సత్య పరాక్రముడగు రాముడు ధర్మమును కైకొనుట వలన శంబుకుడను శూద్రుడు చావగా బ్రాహ్మణబాలకుడు మరల బ్రతికె నని వినవచ్చుచున్నది.
తథా శ్వేతస్య రాజర్షే ర్బాలో దిష్టాంత మాగతః,
శ్వేతేన ధర్మనిష్ఠేన మృతః సంజీవితః పునః. 68
అట్లే శ్వేతుడను రాజర్షి కుమారుడు మరణింపగా ధర్మనిష్ఠ గల శ్వేతుడాతనిని మరల బ్రతికించెనట.
తథా కశ్చి ల్లభే త్సిద్ధో మునిర్వా దేవతాఽపి వా,
కృపణానా మనుక్రోశం కుర్యా ద్వో రుదతా మిహ. 69
అట్లే ఒక సిద్ధుడో, మునియో, దేవతయో ఏడ్చుచున్న దీనులగు మీ యెడల జాలి చూపునేమో!
ఇత్యుక్తా స్తే న్యవర్తన్త శోకార్తాః పుత్రవత్సలాః,
అఙ్కే శిరః సమాధాయ రురుదు ర్బహు విస్తరమ్.
తేషాం రుదితశబ్దేన గృధ్రో ఽభ్యేత్య వచోఽబ్రవీత్. 70
అని నక్క యిట్లు పలుకగా పుత్రునియందు ప్రేమకలవారు, శోకము పై కొన్న వారు నై బాలుని తలను ఒడిలో నిడుకొని పెద్దగా ఏడువజొచ్చిరి. వారి ఏడుపు సవ్వడి విన్న గ్రద్ద మరల సమీపించి యిట్లు పలికెను.
గృధ్ర ఉవాచ - గ్రద్ద పలికెను
అశ్రు పాత పరిక్లిన్నః పాణి స్పర్శ ప్రపీడితః
ధర్మరాజ ప్రయోగాచ్చ దీర్ఘనిద్రాం ప్రవేశితః. 71
కన్నీళ్ళు మొత్తముగా తడిపి వైవగా మీ చేతుల తాకిడికి నలిగి పోయిన ఈ బాలుడు ధర్మరాజు ప్రయోగము వలన దీర్ఘనిద్రను చొచ్చి యున్నాడు.
తపసాపి హి సంయుక్తా ధనవన్తో మహాధియః,
సర్వే మృత్యువశం యాన్తి తదిదం ప్రేత పత్తనమ్. 72
గొప్పతపస్సుతో కూడియున్నవారు, మహాధనవంతులు, గొప్పబుద్ధి విశేషము కలవారు అందరును, ఇదిగో, ప్రేతముల పత్తనమునకు పోవుచునే యున్నారు.
బాలవృద్ధ సహస్రాణి సదా సంత్యజ్య బాన్ధవాః,
దినాని చైవ రాత్రీ శ్చ దుఃఖం తిష్ఠన్తి భూతలే. 73
చుట్టపక్కములు బాలురను ముదుసలులను వదలివైచి దినములు రాత్రులు ఏడ్పులతో భూతలమున నిలిచియే యున్నారు.
అలం నిర్బన్ధ మాగత్య శోకస్య పరిధారణే,
అప్రత్యయం కుతో హ్యస్య పున రద్యేహ జీవితమ్. 74
పట్టుదలకు పోయి శోకమును గట్టిగా పట్టుకొనుట యిక చాలును. నేడు వీడు తిరిగి బ్రదుకుట నమ్మరానిది. అది యెట్లు జరుగును?
మృత స్యోసృష్ట దేహస్య పున ర్దేహో న విద్యతే,
నైవ మూర్తి ప్రదానేన జంబుకస్య శతై రపి. 75
చచ్చి దేహము వదలిన వానికి మరల దేహము కలుగనే కలుగదు. నక్క వందమాట లాడి తన దేహ మొసగినను నూరేండ్ల కయినను ఈ బాలుని బ్రదికింపజాలదు.
శక్యం జీవయితుం హ్యేష బాలో వర్షశతైరపి
అథ రుద్రః కుమారో వా బ్రహ్మ వా విష్ణు రేవ చ.
వరమ స్మై ప్రయచ్ఛేయు స్తతో జీవే దయం శిశుః 76
ఒక వేళ రుద్రుడో, కుమార స్వామియో, బ్రహ్మయో, విష్ణువో యితనికి వరమిత్తు రేని ఈ శిశువు బ్రదుకును.
నైవ బాష్ప విమోక్షేణ న వా శ్వాసకృతేన చ.
న దీర్ఘ రుదితే నాయం పున ర్జీవం గమిష్యతి. 77
కన్నీళ్లు క్రుమ్మరించినను, నోటితో గాలి ఊదినను, పెద్దకాలము ఏడ్చినను ఈ బాలుడు మరల జీవము పొందడు
అహం చ క్రోష్టుక శ్చైవ యూయం యే చాస్య బాన్ధవాః
ధర్మాధర్మౌ గృహీత్వేహ సర్వే వర్తామహేఽధ్వని. 78
నేనును, ఈ నక్కయు వీని బందుగులగు మీరును ధర్మాధర్మములను చేపట్టి ఇచట ఈ మార్గమున ప్రవర్తింపవలయును.
అప్రియం పరుషం చాపి పరద్రోహం పరస్త్రియమ్,
అధర్మ మనృతం చైవ దూరా త్ప్రాజ్ఞో వివర్జయేత్. 79
అప్రియమైనదానిని, పరుషమును, పరద్రోహమును, పరస్త్రీని, అధర్మమును, అబద్ధమును బుద్ధిమంతుడు దూరముగా వదలివేయవలయును.
ధర్మం సత్యం శ్రుతం న్యాయ్యం మహతీం ప్రాణినాం దయామ్, 80
అజిహ్మత్వ మశాఠ్యం చ యత్నతః పరిమార్గత
ధర్మమును, సత్యమును, శాస్త్రమును, న్యాయము తప్పనిదానిని, ప్రాణుల యెడల గొప్పదియగు దయను, వంకరలు లేనితనమును, మొండితనము లేకుండుటను ప్రయత్నముతో వెదకికొనవలయును.
మాతరం పితరం వాపి బాన్ధవాన్ సుహృద స్తథా,
జీవతో యే న పశ్యన్తి తేషాం ధర్మ విపర్యయః. 81
బ్రదికియున్న తల్లిని, తండ్రిని, బంధువులను, మిత్రములను ఎవరు సరిగా చూడరో వారికి ధర్మము తలక్రిందులగును.
యో న పశ్యతి చక్షుర్భ్యాం నేఙ్గతే చ కథంచన,
తస్య నిష్ఠావసానాన్తే రుదన్తః కిం కరిష్యథ. 82
కన్నులతో చూడనివాడు, ఎన్నటికిని మెదలని వాడు అయినవాని చావు సమయమున ఏడ్చుచు మీరు ఏమి చేయగలరు?
ఇత్యుక్తా స్తే సుతం త్యక్త్వా భూమౌ శోకపరిప్లుతాః,
దహ్యమానాః సుతస్నేహా త్ప్రయయు ర్బాన్ధవా గృహమ్. 83
అని గ్రద్ద యిట్లు పలుకగా కుమారుని నేలపై విడిచి శోకము నిలువెల్ల నిండినవారు, పుత్రప్రేమతో కాలిపోవుచున్న వారునై బంధువులు ఇంటికి బయలుదేరిరి.
జంబుక ఉవాచ - నక్క యిట్లనెను.
దారుణో మర్త్యలోకోఽయం సర్వప్రాణివినాశనః,
ఇష్టబన్ధువియోగశ్చ తథేహాల్పం చ జీవితమ్. 84
ఈ మనుజుల లోకము దారుణమైనది. ప్రాణులన్నింటి వినాశము కలది. ఇష్టులైన చుట్టముల ఎడబాటు కలిగినట్టిది. బ్రదుకేమో మిక్కిలి తక్కువ యయినది.
బహ్వలీక మసత్యం చాప్యతి వాదా ప్రియంవదమ్,
ఇమం ప్రేక్ష్య పునర్భావం దుఃఖశోక వివర్ధనమ్. 85
ఎన్నికపటములు! ఎన్ని అబద్ధములు! ఎన్ని పెద్ద మాటలు! ఎన్ని అప్రియవాక్యములు. ఈ యన్నింటిని చూచుచుండగా దుఃఖశోకములు పెరిగిపోవుచున్నవి.
న మే మానుషలోకోఽయం ముహూర్త మపి రోచతే,
అహా ధి గ్గృధ్రవాక్యేన యథై వాబుద్ధయ స్తథా. 86
కథం గచ్ఛత నిః స్నేహాః సుతస్నేహం విసృజ్య చ,
ప్రదీప్తాః పుత్రశోకేన సన్నివర్తత మానుషాః. 87
ఈ మనుష్యలోకము నాకు కొంచెము సేపు కూడ నచ్చలేదు. అయ్యో! ఒక గ్రద్దమాటకు బుద్ధిచెడి, ప్రేమను చంపుకొని, సుతస్నేహమును వదలి వైచి ఎట్లు పోవుచున్నారు? మనుష్యులారా! పుత్రశోకము మిమ్ములను కాల్చివేయుట లేదా? మరలుడు.
శ్రుత్వా గృధ్రస్య వచనం పాప స్యేహా కృతాత్మనః,
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖ స్యానన్తరం సుఖమ్
సుఖదుఃఖావృతే లోకే నేహా స్త్యేక మనన్తరమ్. 88
పాపములే చేయునది, బుద్ధివికాసము లేనిది యయిన యీ గ్రద్ద మాట విని మీరు పోవుటయా? లోకమున సుఖము వెనుక దుఃఖము, దుఃఖము వెనుక సుఖము కలుగుచునే యుండును. సుఖదుఃఖములు క్రమ్మివైచిన యీలోకమున ఏదో ఒక్కటియే యుండుట అసంభవము.
ఇమం క్షితితలే త్యక్త్వా బాలం రూప సమన్వితమ్, 89
కులశోభాకరం మూఢాః పుత్రం త్యక్త్వా క్వ యాస్యథ
రూపయౌవన సంపన్నం ద్యోతమాన మివ శ్రియా. 90
చక్కనిరూపము, నిండు యౌవనము కలిగి అందచందములతో వెలిగి పోవుచున్నవాడు, కులమునకు వెలుగునిచ్చువాడు, బాలుడు, విశేషించి కన్నకొడుకు అయిన వీనిని నేలమీద పారవైచి ఎందుబోయెదరు?
జీవన్త మేవ పశ్యామి మనసా నాత్ర సంశయః,
వినాశో నాస్య నహి వై సుఖం ప్రాప్స్యథ మానుషాః. 91
నాకేమో వీడు బ్రదికియున్నట్లే కన్పట్టుచున్నాడు. సంశయము లేదు. వీనికి వినాశము లేదు, లేనే లేదు. మానవులారా! సుఖము పొందుడు.
పుత్రశోకాభితప్తానాం మృతానా మద్య వః క్షమమ్,
సుఖ సంభావనం కృత్వా ధారయిత్వా సుఖం స్వయమ్
త్యక్త్వా గమిష్యథ క్వాద్య సముత్సృ జ్యాల్పబుద్ధివత్. 92
పుత్రశోకముతో కాలిపోయి చచ్చినవారివలె నున్న మీకు వానిని పట్టుకొని సుఖమును భావించుట తగిన పని. ఏదో కొంత సుఖము స్వయముగా మీరు పొందుదురు. బుద్ధితక్కువవారివలె వదలి ఎందు పోయెదరు?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను
తథా ధర్మ విరోధేన ప్రియమిథ్యాభిధాయినా,
శ్మశానవాసినా నిత్యం రాత్రిం మృగయతా నృప. 93
తతో మధ్యస్థతాం నీతా వచనై రమృతోపమైః,
జంబుకేన స్వకార్యార్థం బాన్ధవా స్తత్ర ధిష్ఠితాః. 94
అట్లు ధర్మమునకు విరుద్ధమైనది, ప్రియమైన తప్పుడు కూతలు కూయు చున్నట్టిది, ప్రతిదినము రాత్రిపూట వల్లకాటిలో నుండి శవములను వెదుకునది అయిన నక్క తనపనికిగా అమృతము వంటిమాటలు పలికి వారిని ఊగులాటలో నిలుపగా వారందు నిలిచిపోయిరి.
గృధ్ర ఉవాచ - గ్రద్ద యిట్లనెను.
అయం ప్రేత సమాకీర్లో యక్షరాక్షస సేవితః,
దారుణః కాననోద్దేశః కౌశికై రభినాదితః. 95
భీమః సుఘోరశ్చ తథా నీలమేఘ సమప్రభః,
అస్మిన్ శవం పరిత్యజ్య ప్రేతకార్యాణ్యుపాసత. 96
ఇది అడవికొంప. ఎందుచూచినను శవములే నిండియున్నవి. యక్షులు, రాక్షసులు ఇందు తిరుగుచుందురు. దారుణమైనది. అవిగో గుడ్లగూబలు వెగటుగా కూయుచున్నవి. భయంకరముగానున్నది. మిక్కిలి ఘోరముగా నున్నది. నల్లని మబ్బు వంటి కాంతి వ్యాపించుచున్నది. ఇందు శవమును వదలివైచి ప్రేత కార్యము లందు దృష్టి పెట్టుడు.
భానుర్యావ త్ర్పయాత్యస్తం యావచ్చ విమలా దిశః,
తావదేనం పరిత్యజ్య ప్రేతకార్యా ణ్యుపాసత. 97
సూర్యుడు కనుమరుగయ్యెడు లోపల, దిక్కులు కాంతులు కలిగియున్నపుడే వీనిని ఇందు వదలివైచి అపర కర్మములను శ్రద్ధతో చేయుడు.
నదన్తి పరుషం శ్యేనాః శివాః క్రోశన్తి దారుణమ్,
మృగేన్ద్రాః ప్రతినన్దన్తి రవి రస్తం చ గచ్ఛతి. 98
గ్రద్దలు చెవులు పగులునట్లరచుచున్నవి. నక్కలు దారుణముగా ఊళలు పెట్టుచున్నవి. సింహములు, అవిగో, ఉత్సాహముతో గంతులు వైచుచున్నవి. సూర్యుడును అస్తమించుచున్నాడు.
చితాధూమేన నీలేన సంరజ్యన్తే చ పాదపాః,
శ్మశానే చ నిరాహారాః ప్రతినర్దన్తి దేవతాః. 99
పాడెల కాఱు పొగతో చెట్లన్నియు నల్లబడిపోయినవి. శ్మశానమునందలి దెయ్యములు తిండి లేక అల్లాడుచున్నవి.
సర్వే వికృతదేహా శ్చాప్యస్మిన్ దేశే సుదారుణే,
యుష్మాన్ ప్రధర్షయిష్యన్తి వికృతా మాంసభోజినః. 100
అవి యన్నియు వికారపు దేహములతో ఈ వెరపు గొల్పు దేశమున వికృతములై ఎఱచి తిండి కలవాటుపడినవై మిమ్ములను బెదరగొట్టుచున్నవి.
క్రూర శ్చాయం వనోద్దేశో భయ మద్య భవిష్యతి,
త్యజ్యతాం కాష్ఠభూతోఽయం మృష్యతాం జాంబుకం వచః. 101
ఈ అడవినేలక్రూరమైనది. ఇందు భయము ఇప్పుడు కలుగును. కట్టెవలె నైన వీనిని వదలివేయుడు. నక్కమాటను పట్టించుకొనకుడు.
యది జమ్బుకవాక్యాని నిష్ఫలా న్యనృతాని చ,
శ్రోష్యథ భ్రష్టవిజ్ఞానా స్తతః సర్వే వినఙ్క్ష్యథ. 102
పనికిమాలినవి, అబద్ధములు అయిన ఈ నక్కమాటలు విందురేని తెలివిచచ్చిన మీరందరు నశించి పోయెదరు.
జంబుక ఉవాచ - నక్క యిట్లనెను.
స్థీయతాం నేహ భేతవ్యం యావత్తపతి భాస్కరః,
తావ దస్మిన్ సుతే స్నేహా దనిర్వేదేన వర్తత. 103
ఉండుడు. ఇక్కడ భయపడనక్కరలేదు. సూర్యుడింకను వెలుగుచునే యున్నాడు. అంతవరకు కొడుకు మీదిప్రేమతో, దిగులులేక, నిలువుడు.
స్వైరం రుదన్తో విశ్రబ్ధా శ్చిరం స్నేహేన పశ్యత,
స్థీయతాం యావ దాదిత్యః కించ క్రవ్యాదభాషితైః. 104
యది గృధ్రస్య వాక్యాని తీవ్రాణి రభసాని చ,
గృహ్ణీత మోహితాత్మానః సుతో వో న భవిష్యతి. 105
యథేచ్ఛగా ఏడ్చుకొనుడు. నమ్మకముతో ప్రేమతో కొడుకును చూచు కొనుడు. సూర్యుడున్నంతవరకు నిలువుడు. మాంసముతినెడు ఈ గ్రద్ద మాటలకేమిలెండు! ఈ గ్రద్ద కాఱుకూతలను పట్టుకొని మీరు మదిని చెడగొట్టు కొన్నచో మీ కొడుకు మీకు దక్కడు.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
గృధ్రోఽస్త మిత్యాహ గతో గతో నేతి చ జంబుకః,
మృతస్య తం పరిజన మూచతు స్తౌ క్షుధాన్వితౌ. 106
గ్రద్ద చచ్చెనని, నక్క చావలేదని ఆ చచ్చిన బాలుని బంధువులతో, ఆకలికొన్నవై, పలుకజొచ్చినవి.
స్వకార్యఽద్ధకక్షౌ తౌ రాజన్ గృధ్రోఽథ జంబుకః,
క్షుత్పిపాసాపరిశ్రాన్తౌ శాస్త్ర మాలమ్బ్య జల్పతః. 107
తమ పబ్బము గడపుకొనుటకై ఆగ్రద్దయు నక్కయు ఆకలిదప్పుల కలమటించినవై శాస్త్రములను పట్టుకొని వాగుచుండెను.
తయో ర్విజ్ఞానవిదుషో ర్ద్వయో ర్మృగపతత్రిణోః,
వాక్యై రమృతకల్పై స్తైః ప్రతిష్ఠన్తి వ్రజన్తి చ. 108
విజ్ఞానమున పాండిత్యముగల ఆ పశువును, పక్షియు పలికెడు అమృతము వంటి పలుకులతో వారు నిలువలేక, వెళ్లలేక ఊగులాడి పోవుచుండిరి.
శోకదైన్యసమావిష్టా రుదన్త స్తస్థిరే తదా,
స్వకార్యకుశలాభ్యాం తే సంభ్రామ్యన్తే హ నైపుణాత్. 109
శోకదైన్యములు నిలువెల్ల క్రమ్ముకొనగా ఏడ్చుచు వారందరు నిలిచిరి. తమపనిని సాధించుకొను నేర్పుగల ఆ రెంటితో వారు గుడుసుళ్లు పడిపోయిరి.
తథా తయో ర్వివదతో ర్విజ్ఞాన విదుషో ర్ద్వయోః,
బాన్ధవానాం స్థితానాం చాప్యుపాతిష్ఠత శఙ్కరః. 110
అట్లు తెలివితేటలలో ఆరితేరిన ఆ రెండును వాదించుకొనుచుండగా చుట్టములు దిక్కుతోచక నిలిచియుండగా వారిముందు శంకరభగవానుడు సాక్షాత్కరించెను.
దేవ్యా ప్రణోదితో దేవః కారుణ్యార్ద్రీ కృతేక్షణః,
తత స్తానాహ మనుజాన్ వరదో ఽస్మీతి శఙ్కరః. 111
దేవి పురికొలుపగా దేవుడు జాలితో చెమ్మగిల్లిన కన్నులు కలవాడై ఆ మనుజులతో మీకు వరమిత్తునని పలికెను.
తే ప్రత్యూచు రిదం వాక్యం దుఃఖితాః ప్రణతాః స్థితాః,
ఏకపుత్రవిహీనానాం సర్వేషాం జీవితార్థినామ్. 112
పుత్రస్య నో జీవదానా జ్జీవితుం దాతు మర్హసి.
వారందరు దుఃఖముతో కుమిలి పోవుచున్నవారై దండప్రణామము కావించి నిలిచి, ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయెను. మేమందరము వానిబ్రదుకే కోరుచున్నాము. మా పసివానికి ప్రాణములు పోసి బ్రదుకునిమ్మని ప్రార్థించిరి.
ఏవ ముక్తః స భగవాన్ వారిపూర్ణేన చక్షుషా,
జీవితం స్మ కుమారాయ ప్రాదా ద్వర్షశతాని వై. 113
వారిట్లు పలుకగా నాభగవానుడు జాలితో చెమ్మగిల్లిన కనులతో ఆ కుమారునకు నూరేండ్ల బ్రదుకు ననుగ్రహించెను.
తథా గోమాయు గృధ్రాభ్యాం ప్రాదదత్ క్షుద్వినాశనమ్.
వరం పినాకీ భగవాన్ సర్వభూతహితే రతః. 114
ప్రాణులన్నింటి మేలునందు ప్రీతిగల ఆ భగవానుడు శివుడు నక్కకు గ్రద్దకు ఆకలి లేకుండునట్లు వరమొసగెను.
తతః ప్రణమ్య తే దేవం ప్రాయో హర్షసమన్వితాః,
కృతకృత్యాః సుఖం హృష్టాః ప్రాతిష్ఠన్త తదా విభో. 115
అంత వారందఱు దేవునకు మరల మరల మ్రొక్కులిడి ఆనందమందినవారై తీరిన కోరికలతో అటునుండి వెడలిపోయిరి.
అనిర్వేదేన దీర్ఘేణ నిశ్చయేన ధ్రువేణ చ,
దేవేదేవ ప్రసాదాచ్చ క్షిప్రం ఫల మవాప్యతే. 116
మిక్కుటమైన నిస్పృహలేనితనముచేతను, స్థిరమైన నిశ్చయముచేతను, దేవదేవుని అనుగ్రహమువలనను జీవి శీఘ్రముగా ఫలమును పొందును.
పశ్య దైవస్య సంయోగం బాన్ధవానాం చ నిశ్చయమ్,
కృపణానాం తు రుదతాం కృత మశ్రుప్రమార్జనమ్. 117
చూడు! దైవఘటన! బంధువుల నిర్ణయము జాలిగా ఏడ్చుచున్న వారి కన్నీటిని తుడిచివైచినవి.
పశ్య చాల్పేన కాలేన నిశ్చయాన్వేషణేన చ,
ప్రసాదం శఙ్కరా త్ప్రాప్య దుఃఖితాః సుఖ మాప్నువన్. 118
చూడు! కొంచెముపాటి కాలములో నమ్మకము సడలని అన్వేషణతో శంకరుని అనుగ్రహము పొంది దుఃఖితులు సుఖమును పొందిరి.
తే విస్మితాః ప్రహృష్టాశ్చ పుత్రసంజీవనాత్ పునః,
బభూవు ర్భరతశ్రేష్ఠ ప్రసాదా చ్ఛఙ్కరస్య వై. 119
వారు విస్మయమందిరి. శంకరుని ప్రసాదమువలన కొడుకు తిరిగి బ్రదుకుట వలన ఆనందముతో పొంగిపోయిరి.
తత స్తే త్వరితా రాజం స్త్యక్త్యా శోకం శిశూద్భవమ్,
వివిశుః పుత్ర మాదాయ నగరం హృష్టమానసాః. 120
అంతవారు పిల్లవానివలన కలిగిన శోకమును విడనాడి ఆనందముతో పొంగులెత్తిన హృదయములతో పుత్రుని తీసికొని వేగముగా నగరమున కరిగిరి.
ఏషా బుద్ధిః సమస్తానాం చాతుర్వర్ణ్యేన దర్శితా. 121
ధర్మార్థమోక్ష సంయుక్త మితిహాస మిమం శృణు.
శ్రుత్వా మనుష్యః సతత మిహాముత్ర ప్రమోదతే. 122
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి గృధ్రగోమాయు సంవాదే కుమార
సంజీవనే త్రిపఞ్చాధిక శతతమోఽధ్యాయః
నాలుగు వర్ణములలో ఎల్లవారికి ఈ బుద్ధిని ఈ కథ తెలియజేయున్నది. ఈ ఇతిహాసము ధర్మము, అర్థము, మోక్షము అనువానితో కూడినది. దీనిని శ్రద్ధతో ఆలకింపుము. దీనిని విన్నమనుష్యుడు ఇహలోక పరలోకములందు ఎల్లప్పుడు ప్రమోదమందును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున గృధ్రగోమాయు సంవాదమున కుమార సంజీవనము గల నూట ఏబదిమూడవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - ధర్మరాజిట్ల చెను.
బలినః ప్రత్యమిత్రస్య నిత్య మాసన్నవర్తినః,
ఉపకారాపకారాభ్యాం సమర్థ స్యోద్యతస్య చ. 1
మోహా ద్వికత్థనా మాత్రై రసారోఽల్పబలో లఘుః,
వాగ్భిరప్రతిరూపాభి రభిద్రుహ్య పితామహ. 2
ఆత్మనో బల మాస్థాయ కథం వర్తేత మానవః,
ఆగచ్ఛతోఽతి క్రుద్ధస్య తస్యోద్ధరణ కామ్యయా. 3
తాతా! బలవంతుడగు శత్రువు, ఎల్లవేళల సమీపముననే తిరుగుచున్నాడు. ఉపకారముగాని అపకారము గాని చేయుటకు సమర్థుడు. సిద్ధపడియున్నవాడు. అట్టి వానికి సారములేనివాడు, బలము తక్కువవాడు, చిన్నవాడు, అవివేకముతో తన్నుతాను పొగడుకొను సాటిలేని మాటలతో కవ్వించి ద్రోహము చేసెను. అట్టివాడు తన్ను పెకలించి వేయుకోరికతో తీవ్రకోపముతో పగవాడు వచ్చుచుండగా తన బలమును ఆధారముగా గొని యెట్లు ప్రవర్తింపవలయును?
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
సంవాదం భరతశ్రేష్ఠ శాల్మలేః పవనస్య చ. 4
భరతశ్రేష్ఠా! ఈ విషయమున ప్రాతకాలపు ఈ ఇతిహాసమును చెప్పు కొనుచుందురు. ఇది శాల్మలి చెట్టునకు పవనునకు నయిన సంవాదము.
హిమవన్తం సమాసాద్య మహా నాసీ ద్వనస్పతిః,
వర్షపూగాభిసంవృద్ధః శాఖీ స్కన్ధీ పలాశవాన్. 5
హిమవత్పర్వతము కడ గొప్ప వృక్ష మొకటి యుండెడిది. పెక్కేండ్లు చక్కగా పెరిగినట్టిది. పెనుకొమ్మలతో ఆకులతో గుబురుగా పెరిగినట్టిది.
తత్ర స్మ మత్తమాతఙ్గా ఘర్మార్తాః శ్రమకర్మితాః,
విశ్రామ్యన్తి మహాబాహో తథాన్యా మృగజాతయః. 6
దానిక్రింద మదించిన యేనుగులు వేడిమికి పీడనొందినవై శ్రమచేత కృశించినవై విశ్రమించుచుండెడివి. అట్లే యితరమృగములు కూడ దానిక్రింద సేదదీరుచుండెడివి.
నల్వమాత్ర పరీణాహో ఘనచ్చాయో వనస్పతిః,
సారికాశుక సంజుష్టః పుష్పవాన్ ఫలవానపి. 7
నాలుగువందల బారలవైశాల్యము కలిగి, గొప్పనీడతో, గోరువంకలు చిలుకలు కలనాదము చేయుచుండగా పుష్పములతో, పండ్లతో ఆ చెట్టు విరాజిల్లుచుండెను.
సార్థికా వణిజ శ్చాపి తాపసాశ్చ వనౌకసః,
వసన్తి తత్ర మార్గస్థాః సురమ్యే నగసత్తమే. 8
వర్తకుల గుంపులు, అడవిలో నుండు తాపసులు, ఇతరులగు బాటసారులు మిక్కిలి అందమైన ఆచెట్టు నీడలో బస చేయుచుందురు.
తస్య తా విపులాః శాఖా దృష్ట్వా స్కన్ధం చ సర్వశః,
అభిగమ్యాబ్రవీ దేనం నారదో భరతర్షభ. 9
భరతవరేణ్యా! దాని విశాలములైన కొమ్మలను, పెద్ద స్కంధమును (మొదలు) చూచి ఒకనాడు నారదుడు దానితో నిట్లనెను.
అహో ను రమణీయ స్త్య మహో చాసి మనోహరః,
ప్రియామహే త్వయా నిత్యం తరుప్రవర శాల్మలే. 10
ఆహా! ఏమి నీ అందము! ఎంతో మనోహరముగ నున్నావు. ఓ వృక్షరాజమా! శాల్మలీ! మేము నీవలన ప్రీతులమగుచున్నాము. (శాల్మలి - బూరుగు చెట్టు).
సదైవ శకునా స్తాత మృగా శ్చాథ తథా గజాః,
వసన్తి తవ సందృష్టా మనోహర మనోహరాః. 11
తాతా! ఎన్నో పక్షులు, మృగములు, అట్లే ఏనుగులు అత్యంత మనోహరములై నీకడ నిలుచుచు కానవచ్చుచున్నవి.
తవ శాఖా మహాశాఖ స్కంధాంశ్చ విపులాం స్తథా,
న వై ప్రభగ్నాన్ పశ్యామి మారుతేన కథఞ్చన. 12
ఓయి వృక్షరాజమా! నీపెను కొమ్మలు, కొమ్మలనడుమనున్న విశాలమగు భాగములు ఒక్కనాటికి గాలికి విరుగనిపై కన్పట్టుచున్నవి.
కిం ను తే పవన స్తాత ప్రీతిమా నథవా సుహృత్,
త్వాం రక్షతి సదా యేన వనేఽత్ర పవనో ధ్రువమ్. 13
నీకేమి వాయుదేవుడు, తాతా!, ప్రీతి కలవాడా? మిత్రమా? ఎల్లప్పుడు ఈవనమున చెక్కుచెదరకుండ నిన్ను కాపాడుచున్నాడు!
భగవాన్ పవనః స్థానాద్ వృక్షా నుచ్చావచానపి,
పర్వతానాం చ శిఖరా ణ్యాచాలయతి వేగవాన్. 14
వాయుదేవుడు ఎంత గొప్ప చెట్లనైనను, కడకు కొండకొమ్ములను కూడ తన వేగముతో కుదుళ్ల నుండి కదిలించి కుదిలించి వేయుచుండును.
శోషయత్యేవ పాతాళం వహన్ గన్ధవహః శుచిః,
సరాంసి సరితశ్చైవ సాగరాంశ్చ తథైవ చ. 15
పాతాళము దాక వీచుచు ఆ వాయుదేవుడు పవిత్రుడై సరస్సులను, నదులను కడకు సముద్రములను గూడ ఇంకించి వేయుచుండును.
సంరక్షతి త్వాం పవనః సఖిత్వేన న సంశయః,
తస్మాత్త్వం బహుశాఖోఽపి పర్ణవాన్ పుష్పవా నపి. 16
వాయువు నీయందు చెలిమి కలవాడగుటచేతనే నిన్ను సంరక్షించుచున్నాడు. అందువలననే నీవు పెక్కు ఆకులతో, పండ్లతో అలరారుచున్నావు.
ఇదం చ రమణీయం తే ప్రతిభాతి వనస్పతే,
యది మే విహగా స్తాత రమన్తే ముదితా స్త్వయి. 17
ఓ వనస్పతీ! ఇదియు చాల రమణీయముగా నీయందు కానవచ్చుచున్నది. నీయందు పక్షులు మురిసిపోవుచు క్రీడించుచున్నవి.
ఏషాం పృథక్ సమస్తానాం శ్రూయతే మధురస్వరః,
పుష్పసంమోదనే కాలే వాశతాం సుమనోహరమ్. 18
పుష్పములు వికసించు కాలమున మనోహరముగా కూయు ఈ అన్నింటి కలనాదము ప్రత్యేకముగా వినవచ్చుచున్నది.
తథేమే గర్జితా నాగాః స్వయూథకులశోభితాః,
ఘర్మార్తా స్త్వాం సమాసాద్య సుఖం విన్దన్తి శాల్మలే. 19
అట్లే ఎండకు తాళలేక నిన్ను చేరుకొని తమమందలతో అలరారుచున్నవైన ఏనుగులు ఘీంకారములు చేయుచు ఓ శాల్మలీ! సుఖముగా నున్నవి.
తథైవ మృగజాతీభి రన్యాభి రభిశోభసే,
తథా సర్వాధివాసైశ్చ శోభసే మేరువద్ద్రుమ. 20
అట్లే వేరు జాతుల మృగములతో, తక్కిన పశువులకు పక్షులకు నెలవులైన స్థానములతో నీవు మేరువువలె విరాజిల్లుచున్నావు.
బ్రాహ్మణైశ్చ తపఃసిద్ధై స్తాపసైః శ్రమణై స్తథా,
త్రివిష్టపసమం మన్యే తవాయతన మేవ హి. 21
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
పవన శాల్మలిసంవాదే చతుష్పఞ్చాశదధిక శత తమోఽధ్యాయః
బ్రాహ్మణులతో, తపస్సున సిద్ధిపొందిన తాపసులతో, సన్యాసులతో నీ స్థానము స్వర్గమా యనిపించుచున్నది.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున పవనశాల్మలి సంవాదమున నూటఏబది నాలుగవ అధ్యాయము
నారద ఉవాచ - నారదుడిట్లు పలికెను.
బన్ధుత్వా దథవా సఖ్యా చ్ఛాల్మలే నాత్ర సంశయః,
పాలయత్యేవ సతతం భీమః సర్వత్రగోఽనిలః. 1
ఓ బూరుగు చెట్టూ! చుట్టరికమో చెలిమియో యుండవలయును. సందియము లేదు. కావుననే అంతట సంచరించు ఆభయంకరమగు వాయువు నిన్నెల్లవేళల రక్షించుచునే యున్నాడు.
న్యగ్భావం పరమం వాయోః శాల్మలే త్వముపాగతః,
తవాహ మస్మీతి సదా యేన రక్షతి మారుతః. 2
గాలికి, శాల్మలీ! తిరస్కారభావము మెండు. నీవు వెళ్లి నేను నీవాడనని యుంటి వనుకొందును. అందువలననే మారుతము నిన్ను కాపాడుచున్నది.
న తం పశ్యామ్యహం వృక్షం పర్వతం వేశ్మ చేదృశమ్,
యం న వాయుబలా ద్భగ్నం పృథివ్యామితి మే మతిః. 3
చెట్టుగాని, కొండగాని, కొంపగాని గాలి బలమునకు విరిగిపోనిది నాకు ఈ భూమిపై కానరాదు.
త్వం పునః కారణై ర్నూనం రక్ష్యసే శాల్మలే యథా,
వాయునా సపరీవార స్తేన తిష్ఠ త్యసంశయమ్. 4
నీవు మాత్రము ఏవో కారణములతో వాయువు రక్షణ నందుచున్నావు. కావుననే నీపరివారమువారందరితోపాటు స్థిరముగా నున్నావు. సంశయము లేదు.
శాల్మలి రువాచ - బూరుగు చెట్టిట్లనెను.
న మే వాయుః సఖా బ్రహ్మ న్న బన్ధు ర్నచ మే సుహృత్,
పరమేష్ఠీ తథా నైవ యేన రక్షతి వాఽనిలః. 5
బ్రాహ్మణా! నన్ను రక్షించుటకు నాకు వాయువు చుట్టము కాదు. చెలిమి కాడును కాదు. అట్లే అతడేమియు బ్రహ్మ కాడు.
మమ తేజో బలం భీమం వాయో రపి హి నారద,
కలా మష్టాదశీం ప్రాణై ర్న మే ప్రాప్నోతి మారుతః. 6
నా తేజస్సు, బలము వాయువుకంటెను భయంకరమైనవి. ఆ గాలి నాప్రాణ శక్తులలో పదునెమిదవ కళను కూడ పొందజాలడు.
ఆగచ్ఛ పరుషో వాయు ర్మయా విష్టంభితో బలాత్,
భఞ్జన్ ద్రుమాన్ పర్వతాంశ్చ యచ్చాన్య దపి కిఞ్చన. 7
చెట్లను కూల్చుచు, కొండలను కూలద్రోయుచు, తక్కినవానిని విరుగగొట్టుచు దురుసుగా దూసికొనివచ్చు వాయువు నాబలమువలన బిగిసి కొనిపోయెను.
స మయా బహుశో భగ్నః ప్రభఞ్జ న్వై ప్రభంజనః,
తస్మా న్న బిభ్యే దేవర్షే క్రుద్ధా దపి సమీరణాత్. 8
పెక్కుమారులు ఆ ప్రభంజనుడు నన్ను విరుగగొట్టవలయునని వచ్చి తానే విరిగిపోయెను. అందువలన దేవర్షీ! క్రోధముతో క్రుమ్ముకొనివచ్చెడు గాలికిని నేను భయపడను.
నారద ఉవాచ - నారదు డిట్లు పలికెను.
శాల్మలే విపరీతం తే దర్శనం నాత్ర సంశయః,
నహి వాయో ర్బలేనాస్తి భూతం తుల్యం బలం క్వచిత్. 9
శాల్మలీ! నీ దర్శనము చాల విపరీతమైనది. ఇందు సంశయము లేదు. కానీ వాయువు బలమునకు సాటివచ్చు బలము గల భూతము ఎందును లేదే!
ఇన్ద్రో యమో వైశ్రవణో వరుణశ్చ జలేశ్వరః,
నైతేఽపి తుల్యా మరుతః కిం పున స్త్యం వనస్పతే. 10
ఇంద్రుడు, యముడు, కుబేరుడు, జలములకు ప్రభువు వరుణుడును వాయువునకు తుల్యులు గారు. ఇంక నీ సంగతి చెప్పనేల?
యచ్చ కిఞ్చి దిహ ప్రాణీ చేష్టతే శాల్మలే భువి,
సర్వత్ర భగవాన్ వాయు శ్చేష్టా ప్రాణకరః ప్రభుః. 11
శాల్మలీ! ఈ భూమి పై ఏ ప్రాణిగాని కదలాడుచున్న దన్నచో భగవంతుడగు వాయువే అన్నియెడల చేష్టను, ప్రాణమును ప్రసాదించు ప్రభువు.
ఏష చేష్టయతే సమ్యక్ ప్రాణినః సమ్యగాయతః,
అసమ్యగాయతో భూయ శ్చేష్టతే వికృతం నృషు. 12
ప్రాణులం దీతడు సరిగా కలిసియుండెనా సరిగా కదలించును. సరిగాలేక పోయినచో వికారపు చేష్టలు చేయించును.
సత్వ మేవం విధం వాయుం సర్వసత్త్వభృతాం వరమ్,
న పూజయసి పూజ్యం తం కిమన్యద్బుద్ధిలాఘవాత్. 13
అట్టి యెడల, నీవు ఇట్టి వాయువును, సర్వప్రాణులను భరించువారిలో శ్రేష్ఠుడైనవానిని, అందరకు పూజ్యుడైన వానిని, పూజింపకున్నావు. తెలివి తక్కువ తనము కంటె ఇందు వేరొకటి ఏమున్నది?
అసార శ్చాపి దుర్మేధాః కేవలం బహు భాషసే,
క్రోధాదిభి రవచ్ఛన్నో మిథ్యా వదసి శాల్మలే. 14
శాల్మలీ! సారమొక్కింతయు లేనిదానవు. బుద్ధిచెడినదానవు. క్రోధము మొదలగునవి తలకెక్కగా కారుకూతలు పెక్కు కూయుచున్నావు.
మమ రోషః సముత్పన్న స్త్వయ్యేవం సంప్రభాషతి,
బ్రవీ మ్యేష స్వయం వాయో స్తవ దుర్భాషితం బహు. 15
నీవిట్లు పలుకుచుండగా నాకు పెనుకోపము పుట్టుకొని వచ్చినది. నేనే స్వయముగా, ఇదిగో, వాయువునకు నీపాడు పలుకులను చెప్పెదను.
చన్దనైః స్యన్దనైః శాలైః సరళై ర్దేవదారుభిః,
వేతసై ర్ధన్వనై శ్చాపి యే చాన్యే బలవత్తరాః.
తై శ్చాపి నైవం దుర్బుద్ధే క్షిప్తో వాయుః కృతాత్మభిః. 16
చందనములు, నెమ్మిచెట్లు, మద్దులు, సరళములు, దేవదారువులు, ప్రబ్బలిచెట్లు, ధన్వములు మొదలైనవి నీకంటె ఎంతో బలముకలవి ఆత్మవివేకము కలిగి నట్టివి యెన్నడును వాయుదేవుని తూలనాడవు.
తేఽపి జానన్తి వాయోశ్చ బల మాత్మాన ఏవ చ,
తస్మాత్తం వై నమస్యన్తి శ్వసనం తరుసత్తమాః. 17
అవి యన్నియు వాయువు బలమెట్టిదియో తమ బలమెట్టిదియో తెలిసినట్టివి. కావుననే ఆ ఉత్తమవృక్షము లన్నియు వాయుదేవునకు మ్రొక్కుచున్నవి.
త్వంతు మోహాన్న జానీషే వాయో ర్బల మనన్తకమ్,
ఏవం తస్మాద్గమిష్యామి సకాశం మాతరిశ్వనః. 18
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
పవనశాల్మలిసంవాదే పఞ్చపఞ్చాధికశతతమోఽధ్యాయః.
ఇక నీవన్ననో అజ్ఞానమువలన అనంతమైన వాయుబలమును తెలియకున్నావు. అందువలన ఇదిగో వాయుదేవునికడ కరుగుదును.
ఇది శ్రీమహాభారతము శాన్తిపర్వమున ఆపద్ధర్మపర్వమున
పవనశాల్మలి సంవాదముగల నూటయేబది యైదవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
ఏవముక్త్వా తు రాజేన్ద్ర శాల్మలిం బ్రహ్మవిత్తమః,
నారదః పవనే సర్వం శాల్మలే ర్వాక్య మబ్రవీత్. 1
రాజేంద్రా! బ్రహ్మజ్ఞానసంపన్నులలో శ్రేష్ఠుడగు నారదుడు బూరుగుచెట్టుతో నిట్లు పలికి, దాని పలుకు నంతటిని వాయుదేవునకు తెలిపెను.
నారద ఉవాచ - నారదు డిట్లు పలికెను.
హిమవత్పృష్ఠతః కశ్చి చ్ఛాల్మలిః పరివారవాన్,
బృహన్మూలో బృహచ్ఛాఖః స త్వాం వాయోఽవమన్యతే. 2
వాయూ! హిమవత్పర్వతము క్రిందిభాగమున ఒక బూరుగుచెట్టు పెద్ద కొమ్మలు, పెద్ద కాండము కలది కలదు. అది నిన్ను అవమానించుచున్నది.
బహు వ్యాక్షేపయుక్తాని త్వా మాహ వచనాని సః,
న యుక్తాని మయా వాయో తాని వక్తుం తవాగ్రతః. 3
ఆ చెట్టు నిన్ను గూర్చి పెక్కు తులువపలుకులు పలికెను. ఆమాటలన్నియు నీముందు నేను చెప్పరానివి.
జానామి త్వా మహం వాయో సర్వప్రాణభృతాం వరమ్,
వరిష్ఠం చ గరిష్ఠం చ క్రోధే వైవస్వతం యథా. 4
నీవు ప్రాణధారులందరిలో శ్రేష్ఠుడవు. వరిష్ఠుడవు. గరిష్ఠుడవు. క్రోధమున యమునివంటి వాడవని యెరుగుదును.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
ఏతత్తు వచనం శ్రుత్వా నారదస్య సమీరణః,
శాల్మలిం తముపాగమ్య క్రుద్ధో వచన మబ్రవీత్. 5
నారదుని యీ మాటవిని సమీరణుడు (వాయువు) ఆ బూరుగు చెట్టుకడకు వచ్చి క్రుద్ధుడై యిట్లు పలికెను.
వాయు రువాచ - వాయు విట్లనెను.
శాల్మలే నారదో గచ్ఛం స్త్వయోక్తో మద్విగర్హణమ్,
అహం వాయుః ప్రభావం తే దర్శయామ్యాత్మనో బలమ్. 6
శాల్మలీ! నారదు డటు పోవుచుండగా నన్నుగూర్చి చెడుమాటలు నీవు పలికితి వట! నా బలమును, నా ప్రభావమును నేను నీకు చూపెదను.
అహం త్వా మభిజానామి విదిత శ్చాసి మే ద్రుమ,
పితామహః ప్రజాసర్గే త్వయి విశ్రాంతవాన్ ప్రభుః. 7
నేను నిన్నెరుగుదును. నన్ను నీవెరిగినవాడవే. ప్రజలను సృష్టించునపుడు బ్రహ్మదేవుడు నీయందు విశ్రాంతి కైకొనెను.
తస్య విశ్రమణా దేవ ప్రసాదో మత్కృత స్తవ,
రక్ష్యసే తేన దుర్బుద్ధే నాత్మవీర్యాద్ ద్రుమాధమ. 8
ఆతడు విశ్రమించిన కారణమువలననే నీయందు నేను అనుగ్రహము చూపితిని. దుర్బుద్ధీ! పాడు చెట్టా! దానిచేత నిన్ను కాపాడుచున్నాను. ఇది నీశక్తివలన కాదు.
యన్మాం త్వ మవజానీషే యథాఽన్యం ప్రాకృతం తథా,
దర్శయా మ్యేష చాత్మానం యథా మాం నావమన్యసే. 9
నన్నవమానించితివి. ఏదో సాధారణ వ్యక్తినిగా నన్ను లెక్క పెట్టకు నీవు. ఇదిగో నా శక్తిని చూపెదను. ఇంక నెప్పుడును నన్ను చులకనగా చూడవు.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
ఏవ ముక్త స్తతః ప్రాహ శాల్మలిః ప్రహసన్నివ,
పవన త్వం చ మే క్రుద్ధో దర్శ యాత్మాన మాత్మనా. 10
వాయు విట్లు పలుకగా శాల్మలి పెద్దగా నవ్వుచు ఇట్లు పలికెను. గాలీ! నా యెడల నీవు క్రుద్ధుడవైతివి. ఏదీ, నిన్ను నీవు చూపుకొనుము.
మయి వై త్యజ్యతాం క్రోధః కిం మే క్రుద్ధః కరిష్యసి,
న తే బిభేమి పవన యద్యపి త్వం స్వయం ప్రభుః. 11
నాయందు క్రోధమును విడనాడుము. అయినను నీ కోపము నన్నేమి చేయగలదు? పవనా ! నీవు స్వయముగా ప్రభుడ వైనను నేను నీకు భయపడను.
బలాధికోఽహం త్వత్తశ్చ న భీః కార్యా మయా తవ,
యే తు బుద్ధ్యా హి బలిన స్తే భవన్తి బలీయసః. 12
నేను నీ కంటె బలమునందు అధికుడను. నీకు నేను భయపడనక్కరలేదు. బుద్ది చేత బలము గలవారు అందరి కంటె మిక్కిలి బలవంతులు.
ప్రాణమాత్ర బలా యే వై నైవ తే బలినో మతాః,
ఇత్యేవ ముక్తః పవనః శ్వ ఇత్యేవా బ్రవీ ద్వచః. 13
దేహబలము మాత్రమే కలవారు నీకు బలవంతులు కారు అని యిట్లు పలుకగా వాయుదేవుడు రేపు అనుచు నిట్లు పలికెను.
దర్శయిష్యామి తే తేజ స్తతో రాత్రి రుపాగమత్,
అథ నిశ్చిత్య మనసా శాల్మలి ర్వాత కారితమ్. 14
“నీకు నా తేజస్సును చూపెదను”. అంత రాత్రి ఏతెంచెను. అంత ఆ శాల్మలి మనస్సులో గాలిచేయు వికారము నంతటిని మనస్సుతో నిర్ణయించుకొనెను.
పశ్య మాన స్తదా త్మాన మసమం మాతరిశ్వనా,
నారదే యన్మయా ప్రోక్తం వచనం ప్రతి తన్మృషా. 15
తన్ను తాను వాయువునకు సాటిరాని దానినిగా చేసికొనుచుండెను. నారదునితో నేను గాలిని గూర్చి పలికిన దంతయు దబ్బర.
అసమర్థో హ్యహం వాయో ర్బలేన బలవాన్ హి సః,
మారుతో బలవా న్నిత్యం యథా వై నారదోఽబ్రవీత్, 16
నేను అసమర్థుడను. వాయువుకంటెను బలమున తక్కువవాడను. అతడు బలవంతుడు కదా! నారదుడు చెప్పినట్లే అతడెల్ల వేళల బలవంతుడు.
అహంతు దుర్భలోఽన్యేభ్యో వృక్షేభ్యో నాత్ర సంశయః,
కింతు బుద్ధ్యా సమో నాస్తి మయా కశ్చి ద్వనస్పతిః, 17
నేను ఇతరవృక్షములకంటెను బలము తక్కువ వాడను, సంశయములేదు. కానీ బుద్ధితో నాకు సాటి రాగల మరొక వృక్ష మేదియు లేదు.
త దహం బుద్ధి మాస్థాయ భయం మోక్ష్యే సమీరణాత్,
యది తాం బుద్ధి మా స్థాయ తిష్ఠేయుః పర్ణినో వనే.
అరిష్టాః స్యుః సదా క్రుద్ధా త్పవనా న్నాత్ర సంశయః, 18
కనుక నేను బుద్ధిబలము నండగా గొని గాలి వలన నగు భయము నుండి విడివడుదును. ఇదే బుద్ధి నవలంబించి యీ వనము నందలి చెట్లన్నియు నిలిచినచో కోపతీవ్రత గల వాయువునుండి కీడు నొందని వగును. ఇందు సందియము లేదు.
తే తు బాలా న జానన్తి యథా వై తాన్ సమీరణః,
సమీరయతి సంక్రుద్ధో యథా జానామ్యహం తథా. 19
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి పవనశాల్మలి సంవాదే
షట్పఞ్చాశదధిక శతతమోఽధ్యాయః.
అవి పాపము పసితనముతో నున్నట్టివి. నాకున్న తెలివి వానికి లేదు. అందువలన వాయువు మిక్కిలి కోపముతో వానిని ఊపి వేయుచున్నాడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున పవనశాల్మలి సంవాదము గల నూటయేబది ఆరవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
తతో నిశ్చిత్య మనసా శాల్మలిః క్షుభిత స్తదా,
శాఖా స్కంధాన్ ప్రశాఖాశ్చ స్వయమేవ వ్యశాతయత్. 1
అంత శాల్మలి మనసులో క్షోభపడినదై ఒక నిశ్చయమునకు వచ్చి కొమ్మలను, మొదళ్లను, పెద్ద కొమ్మలను తనకు తానై నరకివైచెను.
స పరిత్యజ్య శాఖాశ్చ పత్రాణి కుసుమాణి చ,
ప్రభాతే వాయు మాయాన్తం ప్రత్యైక్షత వనస్పతిః. 2
అట్లు కొమ్మలను, ఆకులను పూవులను రాల్చివైచి తెల్లవారిన పిదప రానున్న
వాయువుకొరకు ఎదురు చూచుచుండెను.
తతః క్రుద్ధః శ్వసన్ వాయుః పాతయన్ వై మహాద్రుమాన్,
ఆజగా మాథ తం దేశ మాస్తే యత్ర స శాల్మలిః. 3
అంత తీవ్రకోపముతో రోజుచు వాయువు మహావృక్షములను కూలద్రోయుచు ఆ శాల్మలి ఉన్నతావునకు వచ్చెను.
తం హీనపర్ణం పతితాగ్రశాఖం నిశీర్ణపుష్పం ప్రసమీక్ష్య వాయుః,
ఉవాచ వాక్యం స్మయమాన ఏవం ముదాయుతః శాల్మలి ముగ్రశాఖమ్. 4
ఆకులు డుల్లినది, పై కొమ్మలు కూలినది, రాలినపూవులు కలదియగు ఆ శాల్మలిని పరికించి చూచి ఆనందముతో కూడినవాడై వాయుదేవుడు నవ్వుచు నిట్లు పలికెను.
వాయు రువాచ - వాయు విట్లనెను.
అహ మప్యేవ మేవ త్వాం కుర్వాణః శాల్మలే రుషా,
ఆత్మనా యత్కృతం కృచ్ఛ్రం శాఖానా మపకర్షణమ్. 5
శాల్మలీ! కోపముతో నేనును నిన్నిట్లే చేసి యుండెడివాడను. నీకు నీవై కొమ్మలన్నింటిని తొలగించుకొంటివి.
హీనపుష్పాగ్రశాఖ స్త్వం శీర్ణాంకుర పలాశకః,
ఆత్మ దుర్మన్త్రితే నేహ మద్వీర్యవశగః కృతః. 6
పువ్వులు, చివరికొమ్మలు, మొలకులు, చిగుళ్లు - అన్నియు పోయినవాడవైతివి. ఇది యంతయు పాడు బుద్దికి ఫలము. మొత్తమునకు నీవు నా శక్తికి చిక్కిపోయితివి.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
ఏతచ్ఛుత్వా వచో వాయోః శాల్మలి ర్వ్రీడిత స్తదా,
అతప్యత వచః స్మృత్వా నారదో యత్తదాఽబ్రవీత్. 7
వాయువుమాటను విని శాల్మలి సిగ్గుతో చిమిడిపోయెను. నారదు డప్పుడు పలికిన పలుకులు మదిలో మెదలగా కుమిలిపోయెను.
ఏవం హి రాజశార్దూల దుర్బలః సన్ బలీయసా,
వైర మారభతే బాల స్తప్యతే శాల్మలి ర్యథా. 8
రాజశార్దూలా! ఇట్లు దుర్బలుడు బలవంతునితో పగపెట్టుకొని పిల్లతనపు చేష్టలతో శాల్మలివలె పరితాపమొందును.
తస్మాద్వైరం న కుర్వీత దుర్బలో బలవత్తరైః,
శోచేద్ధి వైరం కుర్వాణో యథా వై శాల్మలి స్తథా. 9
అందువలన దుర్బలుడు బలవంతులతో విరోధము పెట్టుకొనరాదు. వైరము పెట్టుకొని, శాల్మలి వలె, దుఃఖపడవలసి వచ్చును.
న హి వైరం మహాత్మానో వివృణ్వ న్త్యపకారిషు,
శనైఃశనై ర్మహారాజ దర్శయన్తి స్మ తే బలమ్. 10
మహాత్ములు అపకారులయందు వైరమును ప్రకటింపరు. మెల్లమెల్లగా తమ బలమును వారు చూపుదురు.
వైరం న కుర్వీత నరో దుర్బుద్ధి ర్బుద్ధి జీవినా,
బుద్ధి ర్బుద్ధిమతో యాతి తృణేష్వివ హుతాశనః. 11
చెడినబుద్ధి కల నరుడు బుద్ధితో బ్రదుకువానితో వైరము పెట్టుకొనరాదు. బుద్ధిమంతుని తెలివి గడ్డిపరకల యందు నిప్పువలె ప్రసరించును.
న హిబుద్ధ్యా సమం కిఞ్చి ద్విద్యతే పురుషే నృప,
తథా బలేన రాజేన్ద్ర న సమో ఽస్తీహ కశ్చన. 12
రాజా! బుద్ధితో సమమైనది మరియేదియులేదు. అట్లే బలము కలవానితో సమానుడు మరియొక్కడుండడు.
తస్మాత్ క్షమేత బాలాయ జడాన్ధ బధిరాయ చ,
బలాధికాయ రాజేన్ద్ర తద్దృష్టం త్వయి శత్రుహన్. 13
అందువలన బాలుడు, జడుడు, గ్రుడ్డివాడు, చెవిటివాడును తనకంటె బలమున మిన్న అయినచో సహింపవలయును. రాజా! అది నీయందు కన్పట్టినది.
అక్షౌహిణ్యో దశైకా చ సప్త చైవ మహాద్యుతే,
బలేన న సమా రాజ న్నర్జునస్య మహాత్మనః. 14
మహాద్యుతీ! పదునెనిమిది అక్షౌహిణులు మహాత్ముడగు అర్జునుని బలముతో సమానములు కావు.
నిహతాశ్చైవ భగ్నాశ్చ పాణ్డవేన యశస్వినా,
చరతా బల మాస్థాయ పాకశాసనినా మృధే. 15
యశస్వి, ఇంద్రుని కుమారుడు అగు అర్జునుడు బలము నండగా గొని తిరుగుచుండగా ఆ సేనలన్నియు చచ్చినవి, విరిగిపోయినవి.
ఉక్తాశ్చ తే రాజధర్మా ఆపద్ధర్మాశ్చ భారత,
విస్తరేణ మహారాజ కిం భూయః శ్రోతు మిచ్ఛసి. 16
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి
పవనశాల్మలిసంవాదే సప్తపఞ్చాధిక శతతమోఽధ్యాయః
నీకు రాజధర్మములను, ఆపద్ధర్మములను విస్తరముగా ఉపదేశించితిని. మహారాజా! ఇంక నేమి వినగోరుదువు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున పవనశాల్మలి
సంవాదమున నూట యేబది యేడవ అధ్యాయము
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
పాపస్య యదధిష్ఠానం యతః పాపం ప్రవర్తతే,
ఏత దిచ్చా మ్యహం శ్రోతుం తత్త్వేన భరతర్షభ. 1
పాపమునకు కుదురేది? దేనివలన పాపము కొనసాగును? దీనిని మూలముట్టుగా వినగోరుచున్నాను. ఆపదలకు మూలమైన దోషమును గూర్చి చెప్పుట
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
పాపస్య యదధిష్ఠానం తచ్ఛృణుష్వ నరాధిప,
ఏకో లోభో మహాగ్రాహో లోభాత్పాపం ప్రవర్తతే. 2
పాపమునకు మూలాధార మేదియో చెప్పెదను, రాజా! వినుము. లోభమనున దొక్కటి పెద్ద మొసలివంటిది. లోభమువలన పాపము ప్రవర్తించును.(లోభము - అత్యాశ).
అతః పాప మధర్మశ్చ తథా దుఃఖ మనుత్తమమ్,
నికృత్యా మూలమేతద్ధి యేన పాపకృతో జనాః. 3
దానివలననే పాపము, అధర్మము కలుగును. అట్లే గొప్పదుఃఖము కలుగును. ఇది నికృతికి మూలము. దీనితో జనులు పాపములు చేయువారగుచున్నారు.(నికృతి - వంచన)
లోభాత్ క్రోధః ప్రభవతి లోభా త్కామః ప్రవర్తతే,
లోభా న్మోహశ్చ మాయా చ మానస్తంభః పరాసుతా. 4
లోభమువలన క్రోధము పుట్టను. లోభమువలన కామము ప్రవర్తిల్లును. లోభమువలన మోహము, మాయయు కలుగును. మానము బిగిసిపోవుట, ఇతరులకు వశమైన ప్రాణములు కలుగుటయు సంభవించును.
అక్షమా హ్రీపరిత్యాగః శ్రీనాశో ధర్మసంక్షయః,
అభిధ్యాఽప్రఖ్యతా చైవ సర్వం లోభా త్ప్రవర్తతే. 5
ఓర్పులేకుండుట, సిగ్గువదలివేయుట, సంపద నశించుట, ధర్మము నీరుకారి పోవుట, చింత, అపకీర్తి ఇవి యన్నియు లోభమువలన ప్రవర్తిల్లును.
అత్యాగ శ్చాతిహర్షశ్చ వికర్మసు చ యాః క్రియాః,
కులవిద్యామదశ్చైవ రూపైశ్వర్యమద స్తథా. 6
దానమీకుండుట, మిక్కిలిగా ఉప్పొంగిపోవుట, విరుద్ధ కర్మములందు పనులుచేయుట, కులమదము, విద్యామదము, రూపమదము, అధికారమువలని మదము....
సర్వభూతేష్వభిద్రోహః సర్వభూతే ష్వసత్కృతిః,
సర్వభూతే ష్వవిశ్వాసః సర్వభూతే ష్వనార్జవమ్. 7
సర్వభూతములయందును ద్రోహబుద్ధి, మన్నింపకుండుట, నమ్మకము లేకుండుట, ఋజుప్రవర్తన లేకుండుట.
హరణం పరవిత్తానాం పరదారాభిమర్శనమ్,
వాగ్వేగో మనసో వేగో నిన్దావేగ స్తథైవ చ. 8
పరులసొమ్ములను కొల్లగొట్టుట, పరులభార్యలను ముట్టుట, వాక్కులలో, మనస్సులో, నిందించుటలో తొందరపడుట.
ఉపస్థోదరయో ర్వేగో మృత్యువేగశ్చ దారుణః,
ఈర్ష్యావేగశ్చ బలవాన్ మిథ్యావేగశ్చ దుర్జయః. 9
శరీర సుఖమునకు, పొట్టనింపుకొనుటకు తొందరపడుట, చచ్చుటకును త్వరపడుట, బలవంతమైన ఈర్ష్యావేగము, వశము చేసికొనరాని పనికిమాలిన వేగము....
రసవేగశ్చ దుర్వార్యః శ్రోత్రవేగశ్చ దుఃసహః,
కుత్సా వికత్థా మాత్సర్యం పాపం దుష్కరకారితా. 10
వారింపనలవికాని రుచులకై, సహింపనలవి కాని శబ్దములను వినుటకై త్వరపడుట, నిందించుట, పొగడుకొనుట, మచ్చరించుట, పాపము, చేయరానిపనులను చేయు స్వభావము....
సాహసానాం చ సర్వేషాం మకార్యాణాం క్రియా స్తథా,
సాహసముతో కూడిన అకార్యములగు పనులన్నింటిని చేయుట అనునివి యన్నియు లోభమువలన నేర్పడు లక్షణములు.
జాతౌ బాల్యే చ కామారే యౌవనే చాపి మానవాః,
న సంత్యజన్త్యాత్మకర్మ యో న జీర్యతి జీర్యతః. 11
పుట్టుకలో, పసితనములో, కౌమారములో, యౌవనములో మానవులు తమదగు కర్మమును విడిచిపెట్టరు. ఆలోభము ఎంత చచ్చుచున్నను చావనిది.
యో న పూరయితుం శక్యో లోభః ప్రాప్త్యా కురూద్వహ,
నిత్యం గంభీరతోయాభి రాపగాభి రివోదధిః. 12
ఎంత లభించినను ఆ లోభమును నింపుటకు సాధ్యము కాదు. ఎంతో లోతుగా నున్ననీరు గల నదులతో సముద్రమువలె నది నింపరానిది.
న ప్రహృష్యతి యో లోభైః కామై ర్యశ్చ న తృప్యతి,
యో న దేవై ర్న గన్ధర్వై ర్నాసురై ర్న మహోరగైః. 13
జ్ఞాయతే నృప తత్త్వేన సర్వభూతగణైస్తథా,
స లోభః సహ మోహేన విజేతవ్యో జితాత్మనా. 14
ఎన్ని ఆశలు పెట్టినను అది సంతసింపదు. ఎన్ని కోరికలచేతను అది తృప్తి నందదు. దీనితత్త్వమును దేవతలు, గంధర్వులు, రాక్షసులు, మహాసర్పములు - అవి యివి యననేల సర్వభూతగణములు తెలియజాలవు. అట్టి లోభమును మోహముతోపాటు మనస్సును గెలిచినవాడు గెలువవలయును.
దంభో ద్రోహశ్చ నిన్దా చ పైశున్యం మత్సర స్తథా,
భవన్త్యేతాని కౌరవ్య లుబ్ధానా మకృతాత్మనామ్. 15
మనస్సును పట్టుకొనజాలని లుబ్ధులకు దంభము, ద్రోహము, నింద, పిసినిగొట్టుతనము, మత్సరము అనునవి కలుగుచుండును.
సుమహాన్త్యపి శాస్త్రాణి ధారయన్తి బహుశ్రుతాః,
ఛేత్తారః సంశయానాం చ క్లిశ్యన్తీ హాల్పబుద్ధయః. 16
గొప్పగొప్ప శాస్త్రములను ధారణ చేయుదురు. పెక్కు గ్రంధములు చదువుచుందురు. పరుల సంశయములను తీర్తురు. కాని బుద్ధితక్కువతనముతో నలిగిపోవుదురు.
ద్వేషక్రోధ ప్రసక్తాశ్చ శిష్టాచార బహిష్కృతాః, 17
అన్తఃక్రూరా వాఙ్మధురాః కూపాశ్ఛన్నా స్తృణై రివ.
ధర్మవైతంసికాః క్షుద్రా ముష్ణన్తి ధ్వజినో జగత్. 18
ద్వేషము, క్రోధములయందు తగుల్కొన్నవారు, శిష్టమైన ఆచారములు గలవారిచేత వెలివేయబడినవారు, లోపల క్రూరులు, మాటలో తీయదనము గలవారు, గడ్డి అల్లుకొన్న నూతుల వంటివారు, ధర్మము పేరున ఇతరులను వంచించువారు, ధర్మములను వక్కాణించువారు నగు క్షుద్రులు లోకమును కొల్లగొట్టుదురు.
కుర్వతో చ బహూన్ మార్గాంస్తాన్ హేతుబల మాశ్రితాః,
సతాం మార్గాన్ విలుమ్పన్తి లోభజ్ఞానే ష్వవస్థితాః. 19
లోభపు తెలివులయందు నెలకొనియున్నవారు హేతువుల బలమును ఆశ్రయించినవారై పెక్కుదారులను చేసికొనుచు సత్పురుషుల మార్గములను కోసివేయుచుందురు.
ధర్మస్య హ్రియమాణస్య లోభగ్రస్తై ర్దురాత్మభిః,
యా యా విక్రియతే సంస్థా తతః సాఽపి ప్రపద్యతే. 20
లోభమునకు వశులైన దురాత్ములు ధర్మమును హరించుచుండగా ఏయే ఏర్పాటు వికారము నందుచుండునో అది అంతయు మంచిదిగా ప్రశస్తి కెక్కును.
దర్పః క్రోధో మదః స్వప్నో హర్షః శోకోఽతిమానితా,
ఏత ఏవ హి కౌరవ్య దృశ్యన్తే లుబ్ధబుద్ధిషు. 21
పొగరు, కోపము, మదము, నిద్ర, హర్షము, శోకము, తన్నుతానధికునిగా భావించుట - కౌరవ్యా! లుబ్ధబుద్ధులయందు ఇవియే కన్పట్టుచుండును.
ఏతా నశిష్టాన్ బుద్ధ్యస్వ నిత్యం లోభసమన్వితాన్,
శిష్టాం స్తు పరిపృచ్చేథా యాన్ వక్ష్యామి శుచివ్రతాన్. 22
ఎల్లప్పుడు లోభగుణముతో కూడినవారిని అశిష్టులనుగా తెలియుము. ఇక శిష్టులెవ్వరని అడుగుము. శుచివ్రతులైన వారిని గూర్చి చెప్పెదను.
యే ష్వావృత్తిభయం నాస్తి పరలోభయం న చ,
నామిషేషు ప్రసంగోఽస్తి న ప్రియేష్వప్రియేషు చ. 23
మరల మరల జన్మము లెత్తుదుమను భయము, ఏ పాడుపరలోకము కలుగునో యను భయమువారికి ఉండదు. ఆకర్షించు వస్తువులయందు తగులము ఉండదు. ప్రియములు, అప్రియములు అనువానియందు లంపట ముండదు.
శిష్టాచారః ప్రియో యేషు దమో యేషు ప్రతిష్ఠితః,
సుఖం దుఃఖం సమం యేషాం సత్యం యేషాం పరాయణమ్. 24
శిష్టమైన ఆచారము వారికి ప్రియముగా నుండును. ఇంద్రియనిగ్రహము స్థిరముగా నుండును. వారికి సుఖము, దుఃఖము సమముగా నుండును. వారికి సత్యమే పరాయణము.
దాతారో న గ్రహీతారో దయావన్త స్తథైవ చ,
పితృదేవాతిథేయాశ్చ నిత్యోద్యుక్తా స్తథైవ చ. 25
ఇచ్చువారే కాని పుచ్చుకొనువారు కారు. దయావంతులు. పితరులయెడ, దైవతములయెడ, అతిథులయెడ భక్తితో మెలగువారు. ఎల్లప్పుడు పనులయందు శ్రద్ధ కలిగియుందురు.
సర్వోపకారిణో వీరాః సర్వధర్మాను పాలకాః,
సర్వభూతహితాశ్చైవ సర్వదేయాశ్చ భారత!. 26
భారతా! వారు అందరకు ఉపకారము చేయువారు. వీరులు. ధర్మములన్నింటిని చక్కగా పాలించువారు. భూతములన్నింటియెడల మేలుకోరువారు. తమకున్న సర్వమును దానము చేయగలవారు.
న తే చాలయితుం శక్యా ధర్మవ్యాపారకారిణః,
న తేషాం భిద్యతే వృత్తం యత్పురా సాధుభిః కృతమ్. 27
ధర్మమును నిర్వహించునప్పుడు వారి నెవ్వరును కదిలింపజాలరు. మునుపటి సజ్జనులు ప్రవర్తించిన విధముగల వారినడవడిని ఎవ్వరు మార్పజాలరు.
న త్రాసినో న చపలా న రౌద్రాః సత్పథే స్థితాః,
తే సేవ్యాః సాధుభి ర్నిత్యం యేష్వహింసా ప్రతిష్ఠితా. 28
భయపడువారు కారు. చపలచిత్తులు కారు. ఇతరులను ఉద్వేగపరచువారు కారు. అహింసను స్థిరముగా నెలకొల్పుకొని సజ్జనులతో సేవింపబడుచుందురు.
కామక్రోధవ్యపేతా యే నిర్మమా నిరహంకృతాః,
సువ్రతాః స్థిరమర్యాదా స్తా నుపాస్వ చ పృచ్ఛ చ. 29
కామక్రోధములు తొలగినవారు. మమకారము, అహంకారము లేనివారు. శ్రేష్ఠమగు వ్రతములు కలవారు. స్థిరమైన మర్యాదలు కలవారు. అట్టివారిని ఉపాసింపుము. ధర్మమును గూర్చి వారి నడుగుచుండుము.
న ధనార్థం యశోఽర్థం వా ధర్మస్తేషాం యుధిష్ఠిర,
అవశ్యం కార్య ఇత్యేవ శరీరస్య క్రియా స్తథా. 30
వారికి ధర్మము ధనము కొరకో యశస్సుకొరకో కాదు, శరీరము పనులైన అన్నము తినుట మొదలగువానివలె ధర్మము తప్పక చేయదగినదని మాత్రమే వారి భావన.
న భయం క్రోధచాపల్యే నశోక స్తేషు విద్యతే,
న ధర్మధ్వజిన శ్చైవ న గుహ్యం కశ్చి దాస్థితాః. 31
భయము, క్రోధము, చపలత, శోకము వారియందు మచ్చునకైనను కానరావు. ధర్మమును దంభముకొరకు పాటించువారు కారు. వారిలో దాచుకొనదగినది ఏమియు నుండదు.
యేష్వలోభ స్తథా మోహో యే చ సత్యార్జవే స్థితాః,
తేషు కౌన్తేయ రజ్యేథా యేషాం న భ్రశ్యతే పునః. 32
ఎవరియందు లోభము, మోహము అనునవి మచ్చునకైన నుండవో, ఎవరియందు సత్యము, కపటము లేనితనము నిండుగా నుండునో అట్టివారి యందు అనురాగము కలవాడవగుము. వారిలో జారుపాటు ఉండదు.
యే న హృష్యన్తి లాభేషు నాలాభేషు వ్యథన్తి చ,
నిర్మమా నిరహంకారాః సత్త్వస్థాః సమదర్శినః. 33
లాభములయందు పొంగిపోరు. నష్టములయందు క్రుంగిపోరు. అహంకార మమకారములు లేనివారు. సత్వగుణమున నిలుకడ కలవారు. సమమును దర్శించువారు. అట్టివారు శిష్టులు.
లాభాలాభౌ సుఖదుఃఖే చ తాత ప్రియాప్రియే మరణం జీవితం చ,
సమాని యేషాం స్థిరవిక్రమాణాం బుభుత్సతాం సత్వపథే స్థితానామ్. 34
స్థిరమైన విక్రమము గలవారు, మంచిని మాత్రమే పొందగోరువారు, సత్వ మార్గమునందు స్థిరముగా నిలిచియుండువారు నగు అట్టి శిష్టులకు, లాభాలాభములు, సుఖదుఃఖములు, ప్రియాప్రియములు, చావు బ్రదుకులు సమానములు.
ధర్మప్రియాం స్తా న్సుమహానుభావాన్ దాన్తోఽప్రమత్తశ్చ సమర్చయేథాః
దైవాన్ సర్వే గుణవన్తో భవన్తి శుభాశుభే వాక్ప్రలాపా స్తథాన్యే.35
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
ఆపన్మూల భూతదోషకథనే అష్టపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
మంచివాడా! ధర్మప్రియులు, మహానుభావులు దైవస్వరూపులు నగు నట్టివారిని ఇంద్రియనిగ్రహము కలవాడవై పొరపాటులు లేనివాడవై చక్కగా పూజింపుము. అప్పుడు వాక్ప్రసంగములన్నియు గుణవంతములగును. మూఢులను సేవించినచో వాక్ప్రలాపములన్నియు అశుభము కొరకే యగును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున ఆపదలకు మూలభూతమైన దోషములను వివరించెడు నూటయేబది యెనిమిదవ అధ్యాయము
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
అనర్ధానా మధిష్ఠాన ముక్తో లోభః పితామహ,
అజ్ఞాన మపి వై తాత శ్రోతు మిచ్ఛామి తత్త్వతః. 1
తాతా! కీడులన్నింటికి మూలకందము లోభమని చెప్పితిరి. అజ్ఞానమును గూర్చియు మూలముట్టుగ వినగోరుచున్నాను.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
కరోతి పాపం యోఽజ్ఞానా న్నాత్మనో వేత్తి చ క్షయమ్,
ప్రద్వేష్టి సాధువృత్తాం శ్చ స లోక స్యైతి వాచ్యతామ్. 2
ఒకడు అజ్ఞానమువలన పాపము చేయును. దానివలన నగు తన వినాశము నెరుగడు. మంచి నడవడి గలవారిని మిక్కిలిగా ద్వేషించుచుండును. అట్టివాడు లోకము నిందను పొందును.
అజ్ఞానా న్నిరయం యాతి తథాఽజ్ఞానేన దుర్గతిమ్,
అజ్ఞానా త్ల్కేశ మాప్నోతి యథాఽపత్సు నిమజ్జతి. 3
అజ్ఞానమువలన నరకమున కరుగును. అజ్ఞానముచేత దుర్గతి నందును. అజ్ఞానమువలన కష్టమును పొందును. క్రమముగా ఆపదలయందు మునిగిపోవును.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
అజ్ఞానస్య ప్రవృత్తిం చ స్థానం వృద్ధి క్షయోదయౌ,
మూలం యోగం గతిం కాలం కారణం హేతు మేవ చ. 4
శ్రోతు మిచ్ఛామి తత్త్యేన యథావదిహ పార్థివ,
అజ్ఞాన ప్రసవం హీదం య ద్దుఃఖ ముపలభ్యతే. 5
అజ్ఞానము యొక్క ప్రవృత్తి, స్థానము, పెరుగుదల,తరుగుదల, పుట్టుక, మూలము, యోగము, గతి, కాలము, కారణము, హేతువు - అనువానిని గూర్చి తత్త్వముతో వినగోరుచున్నాను. నరునకు కలిగెడు దుఃఖ మంతయు ఈ అజ్ఞానపు ముద్దు బిడ్డయే కదా.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
రాగో ద్వేష స్తథా మోహో హర్షః శోకోఽభిమానితా,
కామః క్రోధశ్చ దర్పశ్చ తన్ద్రీ చాలస్య మేవ చ. 6
ఇచ్ఛా ద్వేష స్తథా తాపః పర వృద్ధ్యుపతాపితా,
అజ్ఞాన మేత న్నిర్దిష్టం పాపానాం చైవ యాః క్రియాః. 7
రాగము, ద్వేషము, మోహము, పొంగిపోవుట, క్రుంగిపోవుట, నేనింతవాడ ననుకొనుట, కామము, క్రోధము, గర్వము, నిద్ర, అలసత, కోరిక, మంచిని ద్వేషించుట, కుమిలిపోవుచుండుట, ఇతరుల అభివృద్ధిని చూచి క్రుళ్లుకొనుట - ఇది యంతయు అజ్ఞానము. అట్లే పాపులు చేయు పనులును అజ్ఞానమే.
ఏతస్య వా ప్రవృత్తేశ్చ వృద్ధ్యాదీన్ యాంశ్చ పృచ్ఛసి,
విస్తరేణ మహారాజ శృణు తచ్చ విశేషతః. 8
దీని ప్రవృత్తిని, వృద్ధి మొదలగు వానిని నీవడిగితివి. మహారాజా! వానిని వివరించి విశేషముగా చెప్పెదను వినుము.
ఉభా వేతౌ సమఫలౌ సమదోషౌ చ భారత,
అజ్ఞానం చాతిలోభ శ్చాప్యేకం జానీహి పార్థివ. 9
ఈ అజ్ఞానము, ఆ అతిలోభము రెండును సమమైన ఫలములు, సమమైన దోషములు కలిగినట్టివి. ఆ రెండును ఒక్కటియే యని ఎరుగుము.
లోభ ప్రభవ మజ్ఞానం వృద్ధం భూయః ప్రవర్ధతే,
స్థానే స్థానే భవేత్ క్షీణ ముపైతి వివిధాం గతిమ్. 10
అజ్ఞానము లోభము కారణముగా పుట్టునది. లోభము పెరుగగా నిదియు మరింత పెరుగును. లోభముండు తావే దీనికిని స్థానము. లోభము క్షీణింపగా ఇదియు క్షీణమగును. లోభము పుట్టగా నిదియు పెక్కుగతులను పొందించుటకై ఉదయించును.
మూలం లోభస్య మోహో వై కాలాత్మగతి రేవ చ,
భిన్నే భిన్నే తథా లోభే కారణం కాల ఏవ చ. 11
లోభమునకు మూలము మోహమే. కాలాత్మతయే దీని గతి. లోభము విరిగినది ముక్కలైనది కాగా అందు కారణము కాలమే.
త స్యా జ్ఞానార్ధి లోభో హి లోభా దజ్ఞాన మేవ చ,
సర్వ దోషా స్తథా లోభా స్త స్మా ల్లోభం వివర్జయేత్. 12
మూఢునకు అజ్ఞానము వలన లోభము కలుగుచున్నది. లోభమువలన అజ్ఞాన మేర్పడుచున్నది. ఆ విధముగా సర్వదోషములు లోభమువలననే కలుగును. అందువలన లోభమును విడచి వేయవలయును.
జనకో యువనాశ్వశ్చ వృషాదర్భిః ప్రసేనజిత్,
లోభక్షయా ద్దివంప్రాప్తా స్తథైవాన్యే నరాధిపాః. 13
జనకుడు, యువనాశ్వుడు, వృషాదర్భి, ప్రసేనజిత్తు, మరియు ఇతరులగు రాజులును లోభము నశించుటవలన స్వర్గమును చేరుకొనిరి.
ప్రత్యక్షం తు కురుశ్రేష్ఠ త్యజ లోభ మిహాత్మనా,
త్య క్త్వా లోభం సుఖం లోకే ప్రేత్య చానుచరిష్యసి. 14
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి అజ్ఞాన మాహాత్మ్యే
ఏకోనషష్ట్యధిక శతతమోఽధ్యాయః
కురుశ్రేష్ఠా! ఆత్మతో ఈ లోభమును వదిలి ఈ లోకమునను, మరణించిన తరువాతను సుఖముగా తిరుగాడగలవు.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున అజ్ఞానమాహాత్మ్యముగల నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
స్వాధ్యాయే కృతయత్నస్య నరస్య చ పితామహ,
ధర్మకామస్య ధర్మాత్మన్ కింను శ్రేయ ఇహోచ్యతే. 1
తాతా! ధర్మాత్మా! స్వాధ్యాయమునందు ప్రయత్నము కలవాడు, ధర్మమున కోరిక కలవాడునగు నరునకు శ్రేయమైనది ఏది?
బహుధా దర్శనే లోకే శ్రేయో యదిహ మన్యసే,
అస్మిన్ లోకే పరే చైవ తన్మే బ్రూహి పితామహ. 2
పెక్కువిధములగు దర్శనములు గల లోకమున ఇందును అందును ఏది శ్రేయమని నీవు తలంతువో దానిని నాకు తెలుపుము.
మహా నయం ధర్మపథో బహుశాఖ శ్చ భారత,
కింస్వి దేవేహ ధర్మాణా మనుశ్రేష్ఠతమం మతమ్. 3
ధర్మము మార్గము చాల గొప్పది. పెక్కు విభాగములు కలది. ఇందు ధర్మములలో మిక్కిలి శ్రేష్ఠమైనదేది?
ధర్మస్య మహతో రాజన్ బహుశాఖస్య తత్త్వతః,
యన్మూలం పరమం తాత తత్సర్వం బ్రూహ్య శేషతః. 4
పెక్కు శాఖలు కలది గొప్పది యగు ధర్మమునకు తత్త్యతః మూలమేదియో, తాతా! దానినంతయు నాకు మిగులు లేకుండ చెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.
హన్త తే కథయిష్యామి యేన శ్రేయో హ్యవాప్స్యసి,
పీత్వా మృత మివ ప్రాజ్ఞో జ్ఞానతృష్తో భవిష్యసి. 5
నాయనా! దేనితో నీవు శ్రేయమును పొందెదవో దానిని నీకు చెప్పెదను. ప్రజ్ఞాశాలివగు నీవు దానిని అమృతమువలె త్రావి జ్ఞానవిషయమున తృప్తి నందిన వాడ వగుదువు.
ధర్మస్య విధయో నైకే యే వై ప్రోక్తా మహర్షిభిః,
స్వంస్వం విజ్ఞాన మాశ్రిత్య దమస్తేషాం పరాయణమ్. 6
వారి వారి విజ్ఞానమును ఆశ్రయించి మహర్షులు చెప్పిన ధర్మము విధులు పెక్కులు గలవు. వానిలో దమము సర్వశ్రేష్ఠమైనది.
దమం నిఃశ్రేయసం ప్రాహు ర్వృద్ధా నిశ్చితదర్శినః,
బ్రాహ్మణస్య విశేషేణ దమో ధర్మః సనాతనః. 7
సందేహములు లేని దర్శనములు గల జ్ఞానవృద్ధులు దమమును పరమశ్రేయమునుగా పలుకుదురు. విశేషించి బ్రాహ్మణునకు దమము సనాతనమైన ధర్మము.
దమా త్తస్య క్రియాసిద్ధి ర్యథావ దుపలభ్యతే,
దమో దానం తథా యజ్ఞా నధీతం చాతివర్తతే. 8
దమమువలన ఆతనికి క్రియలన్నియు నెరవేరుట కలుగుచున్నది. దమము దానమును, యజ్ఞములను, అధ్యయనమును మించినదగును.
దమ స్తేజో వర్ధయతి పవిత్రం చ దమః పరమ్,
విపాప్మా తేజసా యుక్తః పురుషో విన్దతే మహత్. 9
దమము తేజస్సును పెంపొందించును. దమము పరమపవిత్రమైనది. దానిచేత పురుషుడు పాపములు తొలగినవాడై తేజస్సుతో కూడి పరమపదమును
పొందును.
దమేన సదృశం ధర్మం నాన్యం లోకేషు శుశ్రుమ,
దమో హి పరమో లోకే ప్రశస్తః సర్వధర్మిణామ్. 10
దమమునకు సాటి వచ్చు ధర్మమును ఏ లోకములయందును కానము. ధర్మమును పాటించువారికి లోకమున దమము పరమము. ప్రశంసింపదగినది.
ప్రేత్య చాత్ర మనుష్యేన్ద్ర పరమం విన్దతే సుఖమ్,
దమేన హి సమాయుక్తో మహాన్తం ధర్మ మశ్నుతే. 11
రాజేంద్రా! మానవుడు దమముతో ఈ లోకమునందును పరలోకమునందును పరమసుఖమును పొందును. దమముతో కూడినవాడు మహాధర్మము ననుభవించును.
సుఖం దాన్తః ప్రస్వపితి సుఖం చ ప్రతిబుధ్యతే,
సుఖం పర్యేతి లోకాంశ్చ మనశ్చాస్య ప్రసీదతి. 12
దమము కలవాడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. సుఖముగా లోకము లన్నింటియందును విహరించును. అతని మనస్సు ప్రసన్నముగా నుండును.
అదాన్తః పురుషః క్లేశ మభీక్ష్ణం ప్రతిపద్యతే,
అనర్థాంశ్చ బహూ నన్యాన్ ప్రసృజత్యాత్మదోషజాన్. 13
ఇంద్రియనిగ్రహము లేనిపురుషుడు మరల మరల కష్టములు పొందుచుండును. ఆత్మదోషముల వలన నయ్యెడు ఇంకను పెక్కు కీడులను పుట్టించుకొనును.
ఆశ్రమేషు చతుర్ష్వాహు ర్దమ మే వోత్తమం వ్రతమ్,
తస్య లిఙ్గాని వక్ష్యామి యేషాం సముదయో దమః. 14
ఆశ్రమములు నాల్గింటి యందును ప్రవర్తించువారికి దమమే ఉత్తమమైన వ్రతము. దాని గుర్తులను తెలియజేయుదును. వాని సముదాయమే దమము.
క్షమా ధృతి రహింసా చ సమతా సత్య మార్జవమ్,
ఇన్ద్రియాభిజయో దాక్ష్యం మార్దవం హ్రీ రచాపలమ్. 15
అకార్పణ్య మసంరంభః సంతోషః ప్రియవాదితా,
అవిహింసాఽనసూయా చాప్యేషాం సముదయో దమః. 16
ఓర్పు, గుండెదిటవు, అహింస, సమత, సత్యము, తిన్ననినడవడి, ఇంద్రియముల పై అదుపు, పనులయందు సమర్థత, మెత్తదనము, పాడుపనులకు సిగ్గుపడుట, చపలత లేకుండుట, గుండె దిగులు లేకుండుట, తొందరపాటు లేకుండుట, సంతోషము, ప్రియముగా పలుకుట, ఇతరులను నొప్పింప కుండుట, అసూయ లేకుండుట - వీని సముదాయమే దమము.
గురుపూజా చ కౌరవ్య దయా భూతేషు పైశునమ్,
జనవాదం మృషావాదం స్తుతి నిన్దా విసర్జనమ్. 17
కామం క్రోధం చ లోభం చ దర్పం స్తంభం వికత్థనమ్,
రోష మీర్ష్యావమానం చ నైవ దాన్తో నిషేవతే. 18
గురుపూజ, సర్వభూతములయందు దయ అనునవియు దమము లక్షణములు. పిసినిగొట్టుతనము, పుకారులను పుట్టించుట, అబద్ధములాడుట, స్తుతులను నిందలను వదలకుండుట, కామము, క్రోధము, లోభము, గర్వము, మిడిసిపాటు, తన్ను తాను పొగడుకొనుట, రోషము, ఈర్ష్య, అవమానము చేయుట అనువానిని దమము గలవాడెన్నడు దరికి రానీయడు.
అనిన్దితో హ్యకామాత్మా నాల్పేష్వ ర్థ్యనసూయకః,
సముద్రకల్పః స నరో న కథఞ్చన పూర్యతే. 19
ఎట్టి నిందలు లేనివాడు, ఏ కోరికలును ఆత్మ కంటనివాడు, ఇతరుల గుణములను దోషములుగా భావింపనివాడు నగు అట్టి నరుడు సముద్రమువంటివాడై తుచ్ఛ సుఖములను కోరనివాడగును. ఆత్మసుఖము తప్ప అతనిని తృప్తిపరచునది మరియొకటి యుండదు.
అహం త్వయి మమత్వం చ మయి తేషు యథాఽప్యహమ్,
పూర్వసంబంధి సంయోగం నైత ద్దాన్తో నిషేవతే. 20
‘నేను నీ యందు నీవు నా యందును నేను వారియందెట్లో అట్లు మమకారము కలిగియుండవలయును. ఇది మునుపటి సంబంధము వలననైన కూడిక’ అనునట్టి వ్యవహారమును దాంతు డెన్నటికిని మనస్సునకు రానీయడు.
సర్వాగ్రామ్యా స్తథాఽఽరణ్యా యాశ్చ లోకే ప్రవృత్తయః,
నిన్దాం చైవ ప్రశంసా చ యో నాశ్రయతి ముచ్యతే. 21
లోకమునందలి ప్రవృత్తులన్నియు నతనికి గ్రామ్యములుగా, ఆరణ్యములుగా కానవచ్చును (అనాగరములుగా భావించి వానిని సేవింపడని తాత్పర్యము) నిన్దను, ప్రశంసను ఆశ్రయింపనివాడే ముక్తి పొందును.
మైత్రోఽథ శీలసంపన్నః ప్రసన్నాత్మా త్మవిచ్చ యః,
ముక్తస్య వివిధైః సఙ్గ స్తస్య ప్రేత్యఫలం మహత్. 22
మైత్రికలవాడు, శీలసంపన్నుడు, ప్రసన్నమైనహృదయముకలవాడు, ఆత్మతత్త్వమెరిగినవాడు, పెక్కువిధములగు తగులముల నుండి విడివిడినవాడు నగు నతనికి మరణము తరువాత కలుగు ఫలము చాల గొప్పది.
సువృత్తః శీలసంపన్నః ప్రసన్నాత్మా ఽత్మవిద్బుధః,
ప్రాప్యేహ లోకే సత్కారం సుగతిం ప్రతిపద్యతే. 23
మంచి నడవడి, పుష్కలమైన శీలసంపద, ప్రసన్నమగు బుద్ధి, ఆత్మజ్ఞానము కలిగిన యట్టి నరుడు ఈ లోకమున సత్కారము నంది సుగతిని పొందును.
కర్మ యచ్ఛుభ మే వేహ సద్భి రాచరితం చ యత్,
తదేవ జ్ఞానయుక్తస్య మునే ర్వర్త్మ న హీయతే. 24
సత్పురుషులు దేనిని ప్రయత్నపడి ఆచరింతురో ఆ శుభమైన కర్మము జ్ఞానముతో కూడిన మునికి సహజమగు మార్గము. అందు జారుపాటు కలుగదు.
నిష్క్రమ్య వనమాస్థాయ జ్ఞానయుక్తో జితేన్ద్రియః,
కాలాకాంక్షీ చరత్యేవం బ్రహ్మభూయాయ కల్పతే. 25
ఇంటినుండి వెలువడి అడవిని ఆశ్రయించి జ్ఞానముతో కూడినవాడై, ఇంద్రియములను గెలిచినవాడై కాలము నెదురుచూచుచు తిరుగువాడు మోక్షమునకు అర్హత కలవాడగును.
అభయం యస్య భూతేభ్యో భూతానా మభయం యతః,
తస్య దేహా ద్విముక్తస్య భయం నాస్తి కుతశ్చన. 26
ఎవనికి సర్వభూతములవలనను భయము కలుగదో, భూతములకు ఎవనివలన భయము కలుగదో అట్టి దేహభావననుండి విడివడిన వానికి ఏవైపు నుండియు భయము కలుగదు.
అవాచినోతి కర్మాణి న చ సంప్రతినోతి హ,
సమః సర్వేషు భూతేషు మైత్రాయణగతి శ్చరేత్. 27
కర్మములను శుష్కింప చేసికొనును. కుప్పలుగా కూర్చుకొనడు. సర్వభూతముల యందు సముడై అతడు మైత్రాయణ గతితో వర్తించుచుండును.
శకునీనా మివాకాశే జలే వారిచరస్య చ,
యథా గతి ర్న దృశ్యేత తథా తస్య న సంశయః. 28
ఆకాశమున పక్షులయు, నీటిలో చేపలయు గతి యెట్లు తెలియరానిదో జ్ఞానవంతుని గతి యట్టిదే యగును. సంశయము లేదు.
గృహా నుత్సృజ్య యో రాజన్ మోక్ష మేవాభిపద్యతే,
లోకా స్తేజోమయా స్తస్య కల్పన్తే శాశ్వతీః సమాః. 29
సంసారలంపటములను వదలి, రాజా! మోక్షమునే హృదయమున పట్టుకొనువానికి శాశ్వతములగు సంవత్సరములు తేజోమయములగు లోకములు సిద్ధించును.
సంన్యస్య సర్వకర్మాణి సంన్యస్య విధివత్తపః,
సంన్యస్య వివిధా విద్యాః సర్వం సంన్యస్య చైవ హ. 30
కామేశుచి రనావృత్తః ప్రసన్నాత్మాఽఽత్మవిచ్ఛుచిః,
ప్రాప్యేహ లోకే సత్కారం స్వర్గం సమభిపద్యతే. 31
కర్మము లన్నింటిని, విధి పూర్వముగా తపస్సును, పెక్కువిధములగు కూటి విద్యలను, సర్వమును సన్యసించి, కామమునందు పవిత్రుడు, ఎందును కోరినతీరున సంచరించువాడు, ప్రసన్నమైన భావములు గలవాడు, పవిత్రుడునగు ఆత్మ తత్త్వము నెరిగినవాడు ఈ లోకమున సత్కారమును పొంది శాశ్వత సుఖమును పడయును.
యచ్చ పైతామహస్థానం బ్రహ్మరాశి సముద్భవమ్,
గుహాయాం పిహితం నిత్యం త ద్దమే నాభిగమ్యతే. 32
వేదముల రాశి నుండి ఏర్పడిన బ్రహ్మ స్థానము, హృదయగుహలో కప్పబడి నిత్యము వెలుగొందునది అగు తత్వము దమముతో పొందనగును.
జ్ఞానారామస్య బుద్ధస్య సర్వభూతావిరోధినః,
నావృత్తభయ మస్తీహ పరలోకభయం కుతః. 33
జ్ఞానమునకు విహారభూమి, సర్వభూతములయెడ విరోధభావము లేనివాడునగు బుద్ధునకు తిరిగివచ్చుట యనెడు భయ మిందు లేదు. ఇంక పరలోక భయమెక్కడిది?
ఏక ఏవ దమే దోషో ద్వితీయో నోపపద్యతే,
యదేనం క్షమయా యుక్త మశక్తం మన్యతే జనః. 34
దమము విషయమున ఒకే ఒక్క దోషము కలదు. రెండవది దొరకదు. అది యేమనగా సహనముతో కూడియున్న వానిని లోకము అశక్తుడని తలపోయును.
ఏకోఽస్య సుమహాప్రాజ్ఞ దోషః స్యాత్ సుమహాన్ గుణః,
క్షమయా విపులా లోకాః సులభా హి సహిష్ణుతా. 35
ఓయి! మహాప్రాజ్ఞా! ఈ ఒక్కదోషము చాల పెద్దగుణమే యగును. ఓరిమివలననే విపులములైన లోకములు సిద్ధించును. సహనశీలము చాల సులభమైనది కదా!
దాన్తస్య కిమరణ్యేన తథాఽదాన్తస్య భారత,
యత్రైవ నివసే ద్దాన్త స్తదరణ్యం స చాశ్రమః. 36
భారతా! ఇంద్రియనిగ్రహము కలవానికి అడవితో పనియేమి? లేనివానికి అడవితో పనియేమి? దాంతుడు ఎందుండునో అదియే అరణ్యము. అదియే ఆశ్రమము.
వైశమ్పాయన ఉవాచ - వైశంపాయను డిట్లనెను.
ఏతద్భీష్మస్య వచనం శ్రుత్వా రాజా యుధిష్ఠిరః,
అమృతేనేవ సంవృత్తః ప్రహృష్టః సమపద్యత. 37
భీష్ముని యీ పలుకులు విని రాజైన యుధిష్ఠిరుడు అమృతములో మునిగి తేలినవానివలె పరమానందభరితుడాయెను.
పునశ్చ పరిపప్రచ్ఛ భీష్మం ధర్మభృతాం వరమ్,
తతః ప్రీతః స చోవాచ తస్మై సర్వం కురూద్వహః. 38
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
దమకథనే షష్ట్యధిక శతతమోధ్యాయః
ధర్మములను తాల్చువారిలో శ్రేష్ఠుడగు భీష్ముని మరియు పెక్కు ప్రశ్నల నడిగెను. ఆ కురుశ్రేష్ఠుడును ప్రీతినందినవాడై అంతయు బోధించెను.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున దమమును వివరించిన
నూట అరువదవ అధ్యాయము.
ఇంద్రోత పారిక్షితీయ సంవాదము
151
152
ద్విపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
ఇంద్రోత పారిక్షితీయము
152
153
త్రిపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
గ్రద్ద నక్కల సంవాదము
153
చతుష్పఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
154
పవనశాల్మలి సంవాదము
154
పఞ్చపఞ్చాధిక శతతమోఽధ్యాయః
155
పవనశాల్మలి సంవాదము
155
షట్పఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
156
పవనశాల్మలి సంవాదము
156
సప్తపఞ్చాధిక శతతమోఽధ్యాయః
157
పవనశాల్మలి సంవాదము
157
అష్టపఞ్చాశదధిక శతతమోఽధ్యాయః
158
“యేన కేనాప్యుపాయేన యస్య కస్యాపి దేహినః
సంతోషం జనయే త్ప్రాజ్ఞ స్తదేవేశ్వర పూజనమ్”
ఆపదలకు మూలమైన
దోషమును గూర్చి చెప్పుట
158
ఏకోనషష్ట్యధిక శతతమోఽధ్యాయః
159
అజ్ఞానము గొప్పతనము
159
షష్ట్యధిక శతతమోఽధ్యాయః
160
దమమునుగూర్చి చెప్పుట
160