chapter_171-_180

Back
Book Shanthi Parvam-II
Chapter No 8
Pages 72
Read Time 83 Minutes

chapter_171-_180

ఏకసప్తత్యధిక శతతమోఽధ్యాయః

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

తతః స విదితో రాజ్ఞః ప్రవిశ్య గృహ ముత్తమమ్,

పూజితో రాక్షసేన్ద్రేణ నిషసాదాసనోత్తమే. 1

అంత నాతడు రాజునకు తెలియ వచ్చినవాడై మేలైన అతని భవనమున ప్రవేశించి రాజు మన్ననలను గొని శ్రేష్ఠమగు ఆసనమున కూర్చుండెను.

పృష్టశ్చ గోత్రచరణం ప్వాధ్యాయం బ్రహ్మచారికమ్,

న తత్ర వ్యాజహారాన్యద్ గోత్రమాత్రా దృతే ద్విజః. 2

అంత రక్కసుడు గోత్రమును,వేదశాఖను, స్యాధ్యాయమును, బ్రహ్మ చర్యపాలనను గూర్చి అడుగగా బాపడు గోత్రమును మాత్రము చెప్పి మరియేమియు పలుకకుండెను.

బ్రహ్మవర్చస హీనస్య స్వాధ్యాయోపరతస్య చ,

గోత్రమాత్ర విదో రాజా నివాసం సమపృచ్ఛత. 3

మొగమున బ్రహ్మవర్చస్సు కానరానివాడు, వేదపఠనము మానినవాడు, గోత్రము మాత్రము తెలిసినవాడునగు ఆ బాపనిని రాజు నివాసమును గూర్చి మెల్లగా ప్రశ్నించెను.

రాక్షస ఉవాచ - రాక్షసు డిట్లనెను.

క్వతే నివాసః కల్యాణ కింగోత్రా బ్రాహ్మణీ చ తే,

తత్త్వం బ్రూహి న భీః కార్యా విశ్వసస్వ యథాసుఖమ్. 4

నాయనా! నీ నెలవేది? ఆ నీ బ్రాహ్మణి ఏ గోత్రమునకు చెందినది. ఉన్నదున్నట్లు చెప్పుము.భయము వలదు.నమ్ముము. సుఖముగా చెప్పుము.

గౌతమ ఉవాచ - గౌతము డిట్లనెను.

మధ్యదేశ ప్రసూతోఽహం వాసో మే శబరాలయే,

శూద్రా పునర్భూ ర్భార్యా మే సత్య మేత ద్బ్రవీమి తే. 5

అయ్యా!నేను మధ్యదేశమున పుట్టినవాడను. శబరుల పల్లెయందు నా నివాసము. శూద్రయు, మగడు విడచినదియునగు పడతి నా పెండ్లము. ఇదిగో నేను సత్యమే పలుకుచున్నాను.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.

తతో రాజా విమమృశే కథం కార్య మిదం భవేత్,

కధం వా సుకృతం మే స్యా దితి బుద్ధ్యా న్వచిన్తయత్. 6

అంత రాజిట్లు విచారింపజొచ్చెను; ఈ పని చేయుటెట్లు? నాకు పుణ్యమెట్లు

కలుగును?

అయం వై జన్మనా విప్ర: సుహృత్తస్య మహాత్మనః,

సంప్రేషిత శ్చ తేనాయం కాశ్యపేన మమాంతికమ్. 7

ఈతడు పుట్టుక చేత మాత్రమే బాపడు. మహాత్ముడగు ఆయనకు మిత్రుడు. కాశ్యపుడు ఆతనిని నా కడకు పంపెను.

తస్య ప్రియం కరిష్యామి సహి మామాశ్రితః సదా,

భ్రాతా మే బాన్ధవ శ్చాసౌ సఖా చ హృదయంగమః. 8

అతనికి ప్రియము చేయవలయును. అతడు ఎల్లప్పుడు నన్నంటి పెట్టుకొని యుండువాడు. నాకు అన్న, చుట్టము, చెలికాడు, ఆత్మీయుడు.

కార్తిక్యా మద్య భోక్తారః సహస్రం మే ద్విజోత్తమాః,

తత్రాఽయ మపి భోక్తా చ దేయ మస్మై చ మే ధనమ్. 9

ఈ దినము కార్తిక పూర్ణిమ. నా యింట వేయి మంది ఉత్తమ బ్రాహ్మణులు భుజింతురు. అందు ఇతడు కూడ భుజించును. ఇతనికిని నేను ధనము నొసగదగును.

సచాద్య దివసః పుణ్యో హ్యతిథి శ్చాయ మాగతః,

సంకల్పితం చైవ ధనం కిం విచార్య మతః పరమ్. 10

ఇది మిక్కిలి పుణ్యదినము. ఈతడతిథియై వచ్చెను. ధనమిత్తునని నేను సంకల్పించితిని. ఇంక విచారింపవలసిన దేమి కలదు?

తతః సహస్రం విప్రాణాం విదుషాం సమలంకృతమ్,

స్నాతానా మను సంప్రాప్తం సుమహత్ క్షౌమవాససామ్. 11

అంత విద్వాంసులైన విప్రులు వేయిమంది చక్కగా స్నానములు చేసికొని అలంకరించుకొని, పట్టుబట్టలు కట్టుకొని అచటకు వచ్చిరి.

తా నాగతాన్ ద్విజశ్రేష్ఠాన్ విరూపాక్షో విశామ్పతే,

యథార్హం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా. 12

రాజా! అంత నా విరూపాక్షుడు అట్లు వచ్చిన ఆ సంస్కారవంతుల నందరను వారివారికి తగిన విధముగా శాస్త్రము చెప్పిన తీరున ఆదరించి స్వీకరించెను.

బృస్య స్తే షాం తు సంన్యస్తా రాక్షసేన్ద్రస్య శాసనాత్,

భూమౌ వరకుశాః స్తీర్ణాః ప్రేష్యై ర్భరత సత్తమాః. 13

రాక్షసరాజు ఆజ్ఞమేరకు సేవకులు వారికందరికి నేలపై మంచి దర్భలతో అల్లిన ఆసనములను పరచిరి.

తాసు తే పూజితా రాజ్ఞా నిషణ్ణా ద్విజసత్తమాః,

తిలదర్భోదకే నాథ అర్చితా విధివ ద్ద్విజాః. 14

రాజు మన్ననలను స్వీకరించి ఆ బ్రాహ్మణశ్రేష్ఠులందరు ఆ ఆసనములపై కూర్చుండిరి. ఆ రాజు వారి నందరిని విధిననుసరించి నూవులతో, దర్భలతో జలములతో పూజించెను.

విశ్వేదేవాః సపితరః సాగ్నయ శ్చోపకల్పితాః,

విలిప్తాః పుష్పవన్త శ్చ సుప్రచారాః సుపూజితాః.

వ్యరాజన్త మహారాజ నక్షత్ర పతయో యథా. 15

పితృదేవతలతో, అగ్నులతో కూడిన విశ్వేదేవులను వారిపై ఆవాహన చేసెను. మంచిగందములు పూసెను.పూవులతో పూజించెను.మిక్కిలి భక్తిశ్రద్ధలతో ఆరాధించెను. వారందరు ఆ పూజతో చంద్రులవలె విరాజిల్లిరి.

తతో జాంబూనదీః పాత్రీ ర్వజ్రాంకా విమలాః శుభాః,

వరాన్న పూర్ణా విప్రేభ్యః ప్రాదా న్మధు ఘృత ప్లుతాః. 16

పిదప ఆతడు వజ్రములు పొదిగినట్టివి, స్వచ్ఛమైనవి, శుభమైనవి, మేలుజాతి భోజనపదార్థములతో నిండియున్నట్టివి, తేనెతో, నేతితో మునిగి తేలుచున్నట్టివి యగు బంగారు పాత్రలను ఆ విప్రులకు భక్తితో సమర్పించెను.

తస్య నిత్యం సదాషాఢ్యాం మాఘ్యాం చ బహవో ద్విజాః,

ఈప్సితం భోజనవరం లభన్తే సత్కృతం సదా. 17

అతని యింట ప్రతి సంవత్సరము ఆషాఢ, మాఘమాసముల పూర్ణిమనాడు పెక్కండ్రు బ్రాహ్మణులు కోరిన మేలు భోజనమును మన్ననతో కొనుచుందురు.

విశేషతస్తు కార్తిక్యాం ద్విజేభ్యఃసంప్రయచ్ఛతి,

శరద్వ్యపాయే రత్నాని పౌర్ణమాస్యా మితి శ్రుతిః. 18

విశేషముగా కార్తిక పూర్ణిమనాడు బ్రహ్మజ్ఞానులకు ఒసగుచుండును. శరదృతువు ముగియు సందర్భమున పూర్ణిమనాడు రత్నములను, బంగారమును,వెండిని,మణులను,ముత్యములను దానమిచ్చునని లోకము చెప్పుకొనుచుండును.

సువర్ణం రజతం చైవ మణీ నథ చ మౌక్తికాన్, 19

వజ్రాన్ మహాధనాం శ్చైవ వైదూర్యాజిన రాంకవాన్,

రత్నరాశీన్ వినిక్షిప్య దక్షిణార్థే స భారత. 20

భారతా! అతడు వజ్రములను, మహాధనములను, వైదూర్యములను, జింక చర్మములను, ఉన్నిశాలువలను, రత్నారాశులను దక్షిణలుగా విశేషముగా ఇచ్చుచుండును.

తతః ప్రాహ ద్విజ శ్రేష్ఠాన్ విరూపాక్షో మహాబలః,

గృహ్ణీత రత్నా న్యేతాని యథోత్సాహం యథేష్టతః. 21

మహాబలముగల విరూపాక్షుడు ఆ విప్రవరేణ్యులతో ఇట్లు పలికెను. మీ ఉత్సాహము కొలది యీ రత్నములన్నింటిని మీ యిష్టము వచ్చిన దేశములకు కొనిపొండు.

యేషు యేషు చ భాణ్డేషు భుక్తం వో ద్విజసత్తమాః,

తాన్యే వాదాయ గచ్చధ్వం స్వవేశ్మా నీతి భారత. 22

బ్రాహ్మణ ప్రవరులారా! ఏ యే పాత్రలలో భుజించితిరో వాని నన్నింటిని తీసికొని మీ మీ గృహముల కరుగుడు.

ఇత్యుక్త వచనే తస్మిన్ రాక్షసేన్ద్రే మహాత్మని,

యథేష్టం తాని రత్నాని జగృహు ర్ర్బాహ్మణర్హభాః. 23

మహాత్ముడగు ఆ రాక్షసేంద్రుడట్లు పలుకగా బ్రాహ్మణ శ్రేష్ఠులందరు ఇచ్చ వచ్చినట్లు ఆ రత్నములను కైకొనిరి.

తతో మహార్హా స్తే సర్వే రత్నై రభ్యర్చితాః శుభైః,

బ్రాహ్మణా మృష్టవసనాః సుప్రీతాః స్మ తతోఽభవన్. 24

అంత ఆ బ్రాహ్మణులందరు గొప్ప యోగ్యతలు కలవారు తృప్తి తీరునట్లు వస్త్రములు తాల్చిన వారై మేలైన రత్నములతో పూజలందుకొన్న వారై నిండుగా తృప్తి నందిరి.

తత స్తాన్ రాక్షసేన్ద్రశ్చ ద్విజా నాహ పున ర్వచః,

నానాదేశా గతాన్ రాజన్ రాక్షసాన్ ప్రతిషిధ్య వై. 25

అంత ఆ రాక్షసేంద్రుడు రాక్షసులను నిలువరించి వేరు వేరు దేశములనుండి వచ్చిన ఆ బ్రాహ్మణులందరితో ఇట్లు పలికెను.

అద్యైకం దివసం విప్రా న వోఽస్తీహ భయం క్వచిత్,

రాక్షసేభ్యః ప్రమోదధ్వ మిష్టతో యాత మా చిరమ్. 26

విప్రులారా! ఈ ఒకనాడు మీకు రాక్షసులవలన ఎందును భయము లేదు. ఇష్టము వచ్చినట్లు ఆనందమందుడు. ఆలసింపక బయలుదేరుడు.

తతః ప్రదుద్రువుః సర్వే విప్రసంఘాః సమన్తతః,

గౌతమోఽపి సువర్ణస్య భార మాదాయ సత్వరః. 27

కృచ్ఛ్రా త్సముద్ధరన్ భారం న్యగ్రోధం సముపాగమత్,

న్యషీదచ్చ పరిశ్రాన్తః క్లాన్తశ్చ క్షుధితశ్చ సః. 28

అంత ఆ విప్రుల సంఘములన్నియు అన్ని వైపులకు పరువులు తీసినవి. గౌతముడును వడివడిగా ఆ సువర్ణభారమును గైకొని మిక్కిలి కష్టముతో ఆ మూటను పైకెత్తికొనుచు రావిచెట్టుకడకు చేరుకొనెను. అలసతతో,శ్రమతో ఆకలితో అచ్చట కూలబడెను.

తత స్త మభ్యగా ద్రాజన్ రాజధర్మా ఖగోత్తమః,

స్వాగతే నాభినందం శ్చ గౌతమం మిత్ర వత్సలః. 29

అంత పక్షిశ్రేష్ఠుడగు రాజధర్ముడాతని కడ కరుదెంచెను.మిత్ర ప్రేమ కలవాడై గౌతముని స్వాగత వచనములతో అభినందించెను.

తస్య పక్షాగ్ర విక్షేపైః క్లమం వ్యపనయ త్ఖగః,

పూజాం చాప్యకరో ద్ధీమాన్ భోజనం చాప్యకల్పయత్. 30

రెక్కలతుదల విసరుటలతో ఆతని శ్రమను పోగొట్టెను. దొడ్డబుద్ధితో గౌరవించెను. చక్కని భోజనమును కూడ ఏర్పరచెను.

సభుక్తవాన్ సువిశ్రాన్తో గౌతమోఽ చిన్తయ త్తదా,

హాటక స్యాభిరూపస్య భారోఽయం సుమహాన్మయా. 31

గృహీతో లోభమోహాభ్యాం దూరం చ గమనం మమ,

న చాస్తి పథి భోక్తవ్యం ప్రాణ సంధారణం మమ. 32

భోజనము ముగించి చక్కగా విశ్రాంతి తీసికొని ఆ గౌతముడు ఇట్లు తలపోసెను. లోభమోహములతో మోయరాని బంగారమును తెచ్చుకొంటిని. పోవలసినది మిక్కిలి దూరము. దారిలో ప్రాణములు నిలుపుకొనుటకై తినుటకు ఏమియు లేదు.

కిం కృత్వా ధారయేయం వై ప్రాణా నిత్యభ్యచిన్తయత్,

తతః స పథి భోక్తవ్యం ప్రేక్షమాణో న కిఞ్చన. 33

ఏమి చేసి ప్రాణములను నిలుపుకొనవలయునబ్బా!అని ఆలోచించెను. పిదప దారిలో తినుటకు అతని కేమియు కాన రాలేదు.

కృతఘ్నః పురుష వ్యాఘ్ర మన సేద మచిన్తయత్,

అయం బకపతిః పార్మ్వే మాంసరాశిః స్థితో మహాన్.

ఇమం హత్వా గృహీత్వా చ యాస్యేఽహం సమభిద్రుతమ్. 34

ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
కృత ఘ్నోపాఖ్యానే ఏకసప్తత్యధిక శతతమోఽధ్యాయః

పురుషవరేణ్యా! ఆ కృతఘ్నుడిట్లు తలపోసెను. ఈ కొంగ రేడు ప్రక్కనే యున్న పెద్ద మాంసపు ప్రోవు. వీనిని చంపి కైకొని ఒక్క పరుగున నేను పోయెదను.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మపర్వమున
కృతఘ్నోపాఖ్యానమున నూటడెబ్బదియొకటవ అధ్యాయము.

171

కృతఘ్నుని కథ

171

ద్విసప్తత్యధిక శతతమోఽధ్యాయః

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పేను.

అథ తత్ర మహార్చిష్మా ననలో వాతసారథిః,

తస్యావిదూరే రక్షార్థం ఖగేన్ద్రేణ కృతోఽభవత్. 1

అంత ఆ పక్షి రాజు కొంచెము దూరమున రక్ష కొరకు గొప్ప జ్వాలలు గల అగ్నిని ఏర్పరచియుండెను.

స చాపి పార్మ్వే సుష్వాప నిఃశ్వస్తో బకరాట్ తదా,

కృతఘ్నస్తు స దుష్టాత్మా తం జిఘాంసు రథాగ్రతః. 2

కొంగల రాజగు రాజ ధర్ముడును నమ్మకముతో ఆ అగ్నికి ప్రక్కభాగమున పరుండెను.కృతఘ్నుడు, దుష్టబుద్ధియగు ఆ గౌతముడు దానిని చంపగోరి ఎదురుగా నిలిచియుండెను.

తతోఽలాతేన దీప్తేన నిఃశ్వస్తం నిజఘాన తమ్,

నిహత్య చ ముదా యుక్తః సోఽను బన్ధం న దృష్టవాన్. 3

మండుచున్న కొరవితో నమ్మియుండి నిద్రించుచున్న అతనిని చంపివైచెను. చంపి సంతసించుచుండెను. కాని వెంటనంటి వచ్చు పాపమును చూడడాయెను.

సతం విపక్షరోమాణం కృత్వా గ్నా వపచ త్తదా,

తం గృహీత్వా సువర్ణం చ యయౌ ద్రుతతరం ద్విజః. 4

అతడా పక్షిరాజు ఈకలు పెరికి అగ్నిలో వండెను. ఆ మాంసపు ముద్దను, బంగారమును కైకొని వడివడిగా నరుగజొచ్చెను.

తతోఽన్యస్మిన్ గతే చాహ్ని విరూపాక్షోఽబ్రవీత్సుతమ్,

న ప్రేక్షే రాజధర్మాణ మద్య పుత్ర ఖగోత్తమమ్. 5

అంతట ఒక రోజు గడువగా విరూపాక్షుడు కొడుకుతో నిట్లనెను: కొడుకా! నేడు పక్షిరాజు రాజధర్ముడు కానరాడు.

స పూర్వసంధ్యాం బ్రహ్మాణం వన్దితుం యాతి సర్వదా,

మాం వా దృష్ట్వా కదాచి త్స న గచ్ఛతి గృహం ఖగః. 6

అతడు ప్రతిదినము ఉదయసంధ్యలో బ్రహ్మదేవునకు మ్రొక్కుటకై యరుగును. నన్నుచూడక ఎన్నడును ఆ పక్షిరాజు ఇంటి కేగడు.

ఉభే ద్విరాత్రి సంధ్యే వై నాభ్యగా త్స మమాలయమ్,

తస్మా న్న శుద్ధ్యతే భావో మమ స జ్ఞాయతాం సుహృత్. 7

అతడు నా యింటికి రాక రెండురాత్రుల సంధ్యలు గడచినవి. అందువలన నా మనస్సు సరిగా లేదు. నీవు పోయి నా మిత్రుని గూర్చి తెలిసికొని రమ్ము.

స్వాధ్యాయేన వియుక్తో హి బ్రహ్మవర్చస వర్జితః,

తద్ర్వత స్తత్ర మే శంకా హన్యాత్తం స ద్విజాధమః. 8

చదువు చట్టుబండలు లేనివాడు,మొగమున బ్రహ్మతేజస్సు మచ్చునకైన లేనివాడు,హింసించుశీలముకలవాడు నగు నీచబ్రాహ్మణుడు అతనిని చంపియుండునని నా శంక.

దురాచారశ్చ దుర్బుద్ధి రిఙ్గితై ర్లక్షితో మయా,

నిష్కృపో దారుణాకారో దుష్టో దస్యురివాధమః. 9

వాడు దురాచారుడు,దుష్టబుద్ధి అని మొగము కదలికను బట్టి గ్రహించితిని.జాలిలేనివాడు, దారుణమైన ఆకారము, దొంగచూపులుకల నీచుడు.

గౌతమః స గత స్తత్ర తేనోద్విగ్నం మనో మమ,

పుత్ర శీఘ్ర మితో గత్వా రాజధర్మ నివేశనమ్. 10

జ్ఞాయతాం స విశుద్ధాత్మా యది జీవతి మా చిరమ్,

స ఏవ ముక్త స్త్వరితో రక్షోభిః సహితో యయౌ. 11

ఈ గౌతముడందేగెను. అందువలన నా మనస్సు కళవళపడుచున్నది.కొడుకా! త్వరగా రాజధర్ముని నెలవున కరిగి ఆ విశుద్ధాత్ముడు బ్రతికి యుండెనేమో తెలిసికొనుము. ఆలసింపకు. తండ్రి యిట్లు పలుకగా అతడు వడివడిగా రక్షస్సులతో పాటు అచటి కరిగెను.

న్యగ్రోధం తత్ర చాపశ్యత్ కఙ్కాలం రాజధర్మణః,

స రుదన్నగమ త్పుత్రో రాక్షసేన్ద్రస్య ధీమతః.

త్వరమాణః పరం శక్త్యా గౌతమగ్రహణాయ వై. 12

మఱ్ఱి చెట్టు కడ కరిగి రాజధర్ముని ఎముకలప్రోవును గాంచెను. ఏడ్చుచు రాక్షసేంద్రుని పుత్రుడు శక్తినంతటిని కూడదీసికొని గౌతముని పట్టుకొనుటకై త్వరత్వరగా బయలుదేరెను.

తతోఽవిదూరే జగృహు ర్గౌతమం రాక్షసా స్తదా.

రాజధర్మ శరీరం చ పక్షాస్థి చరణోజ్ఝితమ్, 13

తమాదాయాథ రక్షాంసి ద్రుతం మేరువ్రజం యయుః. 14

కొద్దిదూరములో రాక్షసు లాగౌతముని పట్టుకొనిరి. కాళ్లు, రెక్కలు లేని రాజధర్ముని శరీరమును, అతనిని పట్టుకొని వడివడిగా వారు మేరు వ్రజమునకు వెడలిరి.

రాజ్ఞశ్చ దర్శయామాసుః శరీరం రాజధర్మణః,

కృతఘ్నం పరుషం తం చ గౌతమం పాపకారిణమ్. 15

రాజధర్ముని శరీరమును, కృతఘ్నుడు,కఠినుడు,పాపాత్ముడు నగు గౌతముని రాజునకు చూపించిరి.

రురోద రాజా తం దృష్ట్వా సామాత్యః స పురోహితః,

ఆర్తనాదశ్చ సుమహా నభూత్తస్య నివేశనే. 16

ఆ రాజధర్ముని చూచి మంత్రులతో, పురోహితునితో కూడిన రాజు విలపించెను. రాజు భవనమున పెద్ద ఆర్తనాదము చెలరేగెను.

స స్త్రీ కుమారం చ పురం బభూవాస్వస్థమానసమ్,

అథాబ్రవీ న్నృపః పుత్రం పాపోఽయం వధ్యతా మితి. 17

ఆడువారు,పిల్లలతో పాటుగ ఊరంతయు వికలమైన మనస్సు కలదాయెను.అంత రాజు కొడుకుతో ఈ పాపాత్ముని చంపివేయుమని పలికెను.

అస్య మాంసై రిమే సర్వే విహరన్తు యథేష్టతః,

పాపాచారఃపాపకర్మా పాపాత్మా పాపసాధనః. 18

హన్తవ్యోఽయం మమ మతి ర్భవద్భి రితి రాక్షసాః,

ఇత్యుక్తా రాక్షసేన్ద్రేణ రాక్షసా ఘోరవిక్రమాః.

నైచ్ఛన్త తం భక్షయితుం పాపకర్మాణ మిత్యుత. 19

వీని మాంసములతో వీరందరు ఇష్టము వచ్చినట్లు విహరింతురుగాక! పాపాచారుడు, పాపకర్ముడు, పాపాత్ముడు, పాపసాధనుడు అగు వీనిని రాక్షసులారా! మీరు చంపివేయవలయునని నా భావన. అని రాక్షసేంద్రుడు పలుకగా ఘోరమైన పరాక్రమము గల ఆ రాక్షసులు ఆ పాపకర్ముని తినుట కిష్టపడకుండిరి.

దస్యూనాం దీయతా మేష సాధ్వద్య పురుషాధమః,

ఇత్యూచు స్తే మహారాజ రాక్షసేన్ద్రం నిశాచరాః. 20

ఈ నీచమానవుని దోపిడికాండ్రకు అప్పగింపుడు అని ఆ రాక్షసులు రాక్షసరాజుతో పలికిరి.

శిరోభిఃప్రణతాః సర్వే వ్యాహరన్ రాక్షసాధిపమ్,

న దాతు మర్హసి త్వం నో భక్షణాయాస్య కిల్బిషమ్. 21

ఏవ మస్త్వితి తానాహ రాక్షసేన్ద్రో నిశాచరాన్. 22

తలలతో మ్రొక్కి ఆ రాక్షసులందరు రాక్షసరాజుతో అయ్యా! ఈ పాపమును తినుటకు నీవు మాకు అప్పగింపవలదు. అని పలికిరి. అంత రాక్షసేంద్రుడు రక్కసులతో సరే అట్లే యనెను.

దస్యూనాం దీయతా మేష కృతఘ్నోఽద్యైవ రాక్షసాః,

ఇత్యుక్తా రాక్షసా స్తేన శూల పట్టిశ పాణయః. 23

కృత్వా తం ఖణ్డశః పాపం దస్యుభ్యః ప్రదదు స్తదా.

ఈ కృతఘ్నుని ఇప్పటికిప్పుడు దస్యులకు అప్పగింపుడని పలుకగా రాక్షసులు శూలములు, పట్టిసములు చేతులందు తాల్చి ఆ పాపాత్ముని ముక్కలు ముక్కలుగా నరికి దోపిడికాండ్రకు ఒసగిరి.

దస్యవ శ్చాపి నైచ్ఛన్త త మత్తుం పాపకారిణమ్,

క్రవ్యాదా అపి రాజేన్ద్ర కృతఘ్నం నోపభుఞ్జతే. 24

దొంగ మూకలును ఆ పాపాత్ముని తినుట కిష్టపడరైరి. చివరకు క్రూరమృగములు కూడ ఆ కృతఘ్నుని తినకుండెను.

బ్రహ్మఘ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా,

నిష్కృతి ర్విహితా రాజన్ కృతఘ్నే నాస్తి నిష్కృతిః. 25

బ్రహ్మఘ్నుడు, మద్యము త్రావువాడు,దొంగ, వ్రతభంగము చేసిన వాడు అనువారి విషయమున ప్రాయశ్చిత్తము కలదు. కాని కృతఘ్నుని విషయమున పరిహారము లేదు.

మిత్రద్రోహీ కృతఘ్న శ్చ నృశంస శ్చ నరాధమః.

క్రవ్యా దైఃకృమిభి శ్చైవ న భుజ్యన్తే హి తాదృశాః. 26

ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
కృతఘ్నోపాఖ్యానే ద్విసప్తత్యధిక శతతమోఽధ్యాయః

మిత్రద్రోహము చేసినవాడు, కృతఘ్నుడు, క్రూరుడు, ఇంకను అట్టివారిని క్రూరమృగములు, పురుగులు కూడ తినవు.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున
కృత ఘ్నోపాఖ్యానమున నూటడెబ్బది రెండవ అధ్యాయము.

172

కృతఘ్నుని కథ

172

త్రిసప్తస్యధిక శతతమోఽధ్యాయః

173

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

తత శ్చితాం బక పతేః కారయామాస రాక్షసః,

రత్నై ర్గన్ధైశ్చ బహుభి ర్వస్త్రై శ్చ సమలంకృతమ్. 1

అంత రాక్షసరాజు రత్నములతో, గంధములతో, పెక్కు విధములగు వస్త్రములతో అలకరింపబడిన చితిని కొంగరేని కొరకు ఏర్పాటు చేయించెను.

తతః ప్రజ్వాల్య నృపతి ర్బకరాజం ప్రతాపవాన్,

ప్రేతకార్యాణి విధివద్ రాక్షసేన్ద్ర శ్చకార హ. 2

ప్రతాపవంతుడగు రాక్షసరాజు చితిని మండించి బక రాజునకు ప్రేత కార్యములను యథావిధిగ నొనరించెను.

తస్మిన్ కాలే చ సురభి ర్దేవీ దాక్షాయణీ శుభా,

ఉపరిష్టా త్తత స్త స్య సా బభూవ పయస్వినీ. 3

ఆ సమయమున దక్షపుత్రిక దేవి కామధేనువు పైనుండి అతని పై పాలవానను కురిపించెను.

తస్యా వక్త్రా చ్చ్యుతఃఫేనః క్షీరమిశ్ర స్తదాఽనఘ,

సోఽ పతద్వై తత స్త స్యాం చితాయాం రాజధర్మణః. 4

ఆమె నోటినుండి జారిన పాలుకలిసిన నురుగు అప్పుడు రాజధర్ముని చితిపై పడెను.

తతః సంజీవిత స్తేన బకరాజ స్తదాఽనఘ,

ఉత్పత్య చ సమీయాయ విరూపాక్షం బకాధిపః. 5

దాని వలన మరల బ్రతికిన కొంగరేడు పైకెగిరి విరూపాక్షుని కడకు వచ్చెను.

తతోఽభ్యయా ద్దేవరాజో విరూపాక్షపురం తదా,

ప్రాహ చేదం విరూపాక్షం దిష్ట్యా సంజీవిత స్త్వయా. 6

అంత దేవరాజు విరూపాక్షపురమునకు చేరుకొని అతనితో నిట్లనెను. బకరాజు అదృష్టవశమున తిరిగి బ్రతికినవాడాయెను.

శ్రావయామాస చేన్ద్ర స్తం విరూపాక్షం పురాతనమ్,

యథా శాపః పురా దత్తో బ్రహ్మణా రాజధర్మణః. 7

ఇంద్రుడు విరూపాక్షునకు మునుపు బ్రహ్మ రాజధర్మున కిచ్చిన శాపమును గూర్చి వినిపించెను.

యదా బకపతీ రాజన్ బ్రహ్మాణం నోపసర్పతి,

తతో రోషా దిదం ప్రాహ ఖగేన్ద్రాయ పితామహః. 8

రాజా! ఒకనాడు పక్షిరాజు బ్రహ్మకడ కరుగకుండెను. అప్పడు పితామహుడు రోషముతో పక్షి రాజున కిట్లనెను.

యస్మా న్మూఢో మమ సభాం నాగతోఽ సౌ బకాధమః,

తస్మా ద్వధం స దుష్టాత్మా న చిరా త్సమవాప్స్యతి. 9

ఆ బకాధముడు మూఢుడై నా సభకు రాని కారణమున ఆ దురాత్ముడు త్వరలోనే వధమును పొందును.

తదయం తస్య వచనా న్నిహతో గౌతమేన వై,

తేనైవామృతసిక్తశ్చ పునఃసంజీవితో బకః. 10

అంత ఆ మాటవలన ఇతడు గౌతమునిచేత హతుడాయెను. అందువలననే అమృతముతో తడిసి మరల సంజీవితు డాయెను.

రాజధర్మా బకః ప్రాహ ప్రణిపత్య పురన్దరమ్,

యది తేఽనుగ్రహకృతా మయి బుద్ధిఃసురేశ్వర.

సఖాయం మే సుదయితం గౌతమం జీవయేత్యుత. 11

రాజధర్ముడు ఇంద్రునకు మోకరిల్లి,దేవరాజా! నీకు నాయందు దయగలబుద్ధి యున్నచో నాకు మిక్కిలి ప్రియుడైన గౌతముని బ్రదికింపుమని పలికెను.

తస్య వాక్యం సమాదాయ వాసవః పురుషర్షభ,

సిక్త్వాఽమృతేన తం విప్రం గౌతమం జీవయత్తదా. 12

అతని మాటను మన్నించి దేవేంద్రుడు అమృతమును చిలికించి ఆ విప్రుని గౌతముని బ్రతికించెను.

సభాణ్డో పస్కరం రాజం స్తమాసాద్య బకాధిపః.

సంపరిషజ్య సుహృదం ప్రీత్యా పరమయా యుతః 13

బకరాజు బంగారు నగలతో కూడిన అతనిని కలిసికొని బిగియార కౌగిలించుకొని మిక్కిలి ప్రీతినందిన వాడాయెను.

అథ తం పాపకర్మాణం రాజధర్మా బకాధిపః,

విసర్జయిత్వా సధనం ప్రవివేశ స్వమాలయమ్. 14

కొంగలరాజు రాజ ధర్ముడు పాపకర్ముడగు ఆ గౌతముని ధనముతో పాటు పంపివైచి తన యింటికి చేరుకొనెను.

యథోచితం చ స బకో యయౌ బ్రహ్మసద స్తథా.

బ్రహ్మా చైనం మహాత్మాన మాతిథ్యే నాభ్య పూజయత్. 15

తగిన తీరున ఆ పక్షిరాజుబ్రహ్మసభకరిగెను. బ్రహ్మయు ఆ మహాత్ముని అతిథి మర్యాదలతో ఆదరించెను.

గౌతమ శ్చాపి సంప్రాప్య పున స్తం శబరాలయమ్,

శూద్రాయాం జనయామాస పుత్రాన్ దుష్కృత కారిణః. 16

గౌతముడును శబరుల యింటికి మరల నరిగి ఆ శూద్ర స్త్రీ యందు పాపకారులగు పుత్రులను పొందెను.

శాపశ్చ సుమహాంస్తస్య దత్తఃసురగణై స్తదా,

కుక్షౌ పునర్భ్వాః పాపోఽయం జనయిత్వా చిరా త్సుతాన్. 17

నిరయం ప్రాప్స్యతి మహత్ కృతఘ్నోఽయ మితి ప్రభో.

దేవతలు అతనికి పెద్ద శాపము నిచ్చిరి. ఈ పాపాత్ముడు కృతఘ్నుడు మారుమనువు పెండ్లము కడుపున పిల్లలను కని పెద్దదియగు నరకమును పొందును.

ఏతత్ర్పాహ పురా సర్వం నారదో మమ భారత, 18

సంస్మృత్య చాపి సుమహ దాఖ్యానం భరతర్షభ.

మయాఽపి భవతే సర్వం యథావదనువర్ణితమ్. 19

భారతా! దీనినంతటిని మునుపు నాకు నారదుడు చెప్పెను. ఆ పెద్దకథను గుర్తుకు తెచ్చుకొని నీకు ఉన్నదున్నట్లు నేను చెప్పితిని.

కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతః సుఖమ్,

అశ్రద్ధేయః కృతఘ్నో హి కృతఘ్నే నాస్తి నిష్కృతిః. 20

కృతఘ్నునకు యశస్సెక్కడిది? స్థానమెక్కడిది? సుఖమెక్కడిది? కృతఘ్నుడు నమ్మరానివాడు. కృతఘ్నుని విషయమున ప్రాయశ్చిత్తము లేదు.

మిత్ర ద్రోహో న కర్తవ్యః పురుషేణ విశేషతః,

మిత్రధ్ను ఙ్నరకం ఘోర మనన్తం ప్రతిపద్యతే. 21

నరుడు విశేషించి మిత్ర ద్రోహము చేయరాదు. మిత్రద్రోహము చేసినవాడు ఘోరమైన, అంతులేని నరకమును పొందును.

కృతజ్ఞేన సదా భావ్యం మిత్ర కామేన చైవ హ,

మిత్రాచ్చ లభతే సర్వం మిత్రా త్పూజాం లభేత చ. 22

మనుజుడు తాను కృతజ్ఞుడగుటను ఎల్లవేళల భావింపవలయును. మిత్రకాముడు కావలయును.(మిత్రుల కోరికలను తీర్చువాడు) మిత్రునివలన సర్వము లభించును. మిత్రునివలన మన్నన లభించును.

మిత్రాద్ భోగాంశ్చ భుఞ్జీత మిత్రేణాపత్సు ముచ్యతే,

సత్కారై రుత్తమై ర్మిత్రం పూజయీత విచక్షణః. 23

మిత్రునివలన మనుజుడు భోగముల ననుభవించును. మిత్రునిచేత ఆపదలనుండి విడివడును.గొప్పవియగు సత్కారములతో వివేకవంతుడు మిత్రుని పూజింపవలయును.

పరిత్యాజ్యో బుధైః పాపః కృతఘ్నో నిరపత్రపః,

మిత్రద్రోహీ కులాఙ్గారః పాపకర్మా నరాధమః. 24

తెలివిగలవారు పాపుడు, కృతఘ్నుడు, సిగ్గులేనివాడు,మిత్రులకు ద్రోహము చేయువాడు, కులమును కాల్చివేయువాడు, పాపకర్ముడు నగు నరాధముని వరిత్యజింప వలయును.

ఏష ధర్మభృతాం శ్రేష్ఠ ప్రోక్తఃపాపో మయా తవ,

మిత్రద్రోహీ కృతఘ్నో వై కిం భూయః శ్రోతు మిచ్ఛసి. 25

ధర్మమును పాటించు వారిలో శ్రేష్ఠుడవగు ఓ ధర్మరాజా! ఇట్లు నేను నీకు మిత్రులకు ద్రోహము చేయువాడు, కృతఘ్నుడు, అగు పాపాత్ముని గూర్చి వివరించి చెప్పితిని. నీ వింకను దేనిని వినగోరుచున్నావు?

వైశంపాయన ఉవాచ - వైశంపాయను డిట్లు చెప్పెను.

ఏతచ్ఛ్రుత్వా తదా వాక్యం భీష్మేణోక్తం మహాత్మనా,

యుధిష్ఠిరః ప్రీత మనా బభూవ జనమేజయ. 26

ఇతి శ్రీ మహా భారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి
కృతఘ్నోపాఖ్యానే త్రిసప్తత్యధిక శతతమోఽధ్యాయః

మహాత్ముడగు భీష్ముడు చెప్పిన దీనిని విని జనమేజయా! యుధిష్ఠిరుడు ప్రీతి పొందిన వాడాయెను.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున
కృత ఘ్నోపాఖ్యానమున నూట డెబ్బది మూడవ అధ్యాయము.

సమాప్త మాపద్ధర్మ పర్వ

ఆపద్ధర్మ పర్వము ముగిసెను.

ఓమ్ తత్సత్.

కృతఘ్నుని కథ

173

శ్రీ మహాభారతమ్ - శాన్తిపర్వ
శ్రీ మహాభారతము - శాంతిపర్వము
మోక్షధర్మపర్వ - మోక్షధర్మపర్వము

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్,

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్.

తరణిముకుర నేత్రోత్తేజనాభాం శరీర

ప్రతికృతి మనుమాయీ భూమ్ని చవ్ద్రాన్తరాభః,

స్థిరదృ గణు మసఙ్గం యం నయ త్యన్యథాత్వం

తదభయ మమృతం సత్ర్పత్య గీడే గవేన్ద్రమ్.

కణభక్ష మక్షచరణం జైమినికపిలౌ పతఞ్జలిం చ నుమః,

శ్రీమద్వ్యాసవచోఽమ్బుధి నయసీకర వర్షిణో ముదిరావ్.

సర్వవిద్యేశతా మావి శ్చికీర్షూ పూర్వపూరుషౌ

శ్రీనారాయణ ధీరేశ రూపౌ హరిహరౌ నుమః

బహూన్ సమాహృత్య విభిన్నదేశ్యాన్ కోశా న్వినిశ్చిత్య చ పాఠ మగ్ర్యమ్,

ప్రాచాం గురూణా మమసృత్య వాచం వ్యాకుర్మహే భారతమోక్షధర్మాన్.

ఉత్తావేష్విహ కోశవిగ్రహబలం పద్యేషు నైవాశ్రితం

గమ్బీరేషు న సేతవో న విహితాః కూటా న నప్ఫోటితాః,

నచ్ఛిన్నా న తమశ్చరాననతతి ర్భక్తా న నాహ్లాదితా

నో దీవాశ్చ విభీషణా వ విహితాః శ్రీలక్ష్మణార్యాశ్రితైః.

కర్తవ్య మేన కర్మేహ జానతా మిత్రకర్శన,

అకర్మాణో హి జీవన్తి స్థావరా వేతరే జనాః.

యావద్గోస్తనపానాచ్చ యావచ్ఛాయోపసేవవాత్,

ప్రాణినః కర్మణా వృత్తి మాప్నువన్తి నరర్షభ.

చతుస్సప్తత్యధికశతతమోఽధ్యాయః

174

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

ధర్మాః పితామహే నోక్తా రాజధర్మా శ్రితాః శుభాః,

ధర్మ మాశ్రమిణాం శ్రేష్ఠం వక్తు మర్హసి పార్థివ. 1

రాజా! రాజధర్మముల నాశ్రయించిన శుభములైన ధర్మములను తాత మాకు ఇంతవరకు బోధించెను. అన్ని ఆశ్రమములవారికి మిక్కిలి మేలు గూర్చు ధర్మము నిప్పుడు చెప్పదగును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.

సర్వత్ర విహితో ధర్మః సత్య ప్రేత్య తపః ఫలమ్,

బహుద్వారస్య ధర్మస్య నేహాస్తి విఫలా క్రియా. 2

అన్ని యెడలను ధర్మము విధింపబడియున్నది. సత్తు అను వస్తువు విషయమున తపస్సుఫలము మరణింపక ముందే కలుగుచున్నది. పెక్కు ద్వారములు కల ధర్మమునకు సంబంధించిన క్రియ ఇచ్చట విఫలమైనది లేదు.

యస్మిన్ యస్మింస్తు విషయే యో యో యాతి వినిశ్చయమ్,

తమే వాభిజానాతి నాన్యం భరతసత్తమ . 3

ఎవడెవడు దేని దేనియందు స్పష్టమైన నిశ్చయమును పొందునో అతడు దానినే ఎరుగును. ఇతరమును కాదు.

యథా యథా చ పర్యేతి లోక తన్త్ర మసారవత్,

తథా తథా విరాగోఽత్ర జాయతే నాత్ర సంశయః . 4

ఈ లోక వ్యవహారమును ఎట్లెట్లు సారము లేనిదిగా సాధకుడు చక్కగా భావించునో అట్లట్లు అతనికి దానియందు వైరాగ్యము పుట్టును. ఇందు సంశయము లేదు.

ఏవం వ్యవసితే లోకే బహుదోషే యుధిష్ఠిర,

ఆత్మ మోక్ష నిమిత్తం వై యతేత మతిమా న్నరః . 5

యుధిష్ఠిరా! పెక్కు దోషములు గల ఈ లోకము ఇట్టిదని నిశ్చయము కలుగగా బుద్ధిగల నరుడు తన మోక్షము కొరకు తప్పక ప్రయత్నింప వలయును.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

నష్టే ధనే వా దారే వా పుత్రే పితరి వా మృతే,

యయా బుద్ధ్యా నుదేచ్ఛోకం తన్మే బ్రూహి పితామహ. 6

తాతా! ధనమో, పెండ్లమో చేజారిపోగా, తండ్రియో, కొడుకో చావగా మానవుడు ఏ బుద్ధితో శోకమును తొలగించుకొనవలయునో నాకు తెలుపుము.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

నష్టే ధనే వా దారే వా పుత్రే పితరి వా మృతే,

అహో దుఃఖ మితి ధ్యాయన్ శోక స్యాపచితిం చరేత్ . 7

ధనమో, పెండ్లమో చేజారిపోయినపుడు, కొడుకో, తండ్రియో చనిపోయి నపుడు అయ్యో! ఎంతటిది యీ దుఃఖము అని భావించుచు శోకమును ఎండ గట్టుకొనవలయును.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

యథా సేనజితం విప్రః కశ్చి దేత్యా బ్రవీత్ సుహృత్ . 8

ఈ విషయమునందును ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని ఉదాహరింతురు. చెలికాడయిన విప్రుడొకడు దరిజేరి సేనజితునితో పలికిన కథ అది.

పుత్రశోకాభిసంతప్తం రాజానం శోక విహ్వలమ్,

విషణ్ణ మనసం దృష్ట్వా విప్రో వచన మబ్రవీత్. 9

ఆ రాజు కొడుకు మరణింపగా దుఃఖముతో కుమిలిపోవుచుండెను. ఇంద్రియములు పట్టు తప్పినవాడాయెను. మనస్సు మొద్దుబారి పోయెను. ఆ దశలో విప్రు డాతనితో నిట్లనెను.

కిం ను ముహ్యసి మూఢ స్త్వం శోచ్యః కి మనుశోచసి,

యదా త్వామపి శోచన్తః శోచ్యా యాస్యన్తి తాం గతిమ్. 10

ఓరి తెలివిలేనివాడా! మోహపడెద వేల? నిన్ను గూర్చి నీవేడువ వలసి యుండగా ఎవనిని గూర్చియో కుమిలిపోయెద వేల? నిన్ను గూర్చి ఏడ్చు వారందరు శోకింపదగిన వారే, ఆ గతినే చేరుకొందురు.

త్వం చైవాహం చ యే చాన్యే త్వాముపాసన్తి పార్థివ,

సర్వే తత్ర గమిష్యామో యత ఏవాగతా వయమ్ . 11

నీవును, నేనును, ఇంకను నిన్ను భక్తితో కొలిచియున్నవారందరును, ఓ రాజా! ఎందుండి మనము వచ్చితిమో అందు బోవలసిన వారమే.

సేనజి దువాచ - సేనజిత్తిట్లనెను.

కా బుద్ధిః కిం తపో విప్ర కః సమాధి స్తపోధన,

కిం జ్ఞానం కిం శ్రుతం చైవ యత్ర్పాప్య న విషీదసి. 12

ఓ తపోధనా! బుద్ధి ఏది? తపమనగా నేమి? సమాధి అనగా నెట్టిది? జ్ఞానమనగా నేమి? శ్రుత మననేమి? దీనిని పొంది కదా నరుడు క్రుంగిపోకుండును?

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణు డిట్లు పలికెను.

పశ్య భూతాని దుఃఖేన వ్యతిషిక్తాని సర్వశః,

ఉత్తమాధమమధ్యాని తేషు తేష్విహ కర్మసు. 13

ఆయా కర్మములందు చిక్కుకొని ఉత్తమ, మధ్యమ, అధమ ప్రాణులన్నియు అన్నివైపుల దుఃఖము నిలువెల్ల పైకొనగా ఉండుటను గమనింపుము.

ఆత్మాపి చాయం న మమ సర్వా వా పృథివీ మమ,

యథా మమ తథాఽన్యేషా మితి చిన్త్య న మే వ్యథా

ఏతాం బుద్ధి మహం ప్రాప్య న ప్రహృష్యే నచ వ్యథే . 14

ఈ ఆత్మయు నాది కాదు. సమస్తమైన భూమియు నాది కాదు. అది నాది అనుట యెట్లో అట్లే ఇతరులదియు నగునని భావించినపుడు నాకు దుఃఖము కలుగదు. ఇట్టి బుద్ధిని పొంది నేను పొంగి పోవను. క్రుంగిపోవను.

యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహోదధౌ,

సమేత్య చ వ్యపేతాయాం తద్వ ద్భూత సమాగమః. 15

పెద్ద కడలిలో కట్టెయు కట్టెయు కలియుచుండును. మరల విడిపోవుచుండును. భూతముల కలయిక అటువంటిదియే.

ఏవం పుత్రాశ్చ పౌత్రాశ్చ జ్ఞాతయో బాన్ధవాస్తథా |

తేషాం స్నేహో న కర్తవ్యో విప్రయోగో ధ్రువో హి తైః || 16

కొడుకులు, మనుమలు, ఒక కుదుటివారు, చుట్టములు ఇట్టివారే. వారి యెడల స్నేహము చేయరాదు. ఏల యనగా వారితో ఎడబాటు తప్పనిది కదా!

అదర్శనా దాపతితః పున శ్చాదర్శనం గతః,

న త్వా ఽ సౌ వేద నత్వం తం కః సన్ కిమనుశోచసి . 17

నీ పుత్రుడు అదర్శనము నుండి వచ్చిపడెను. మరల అదర్శనమునందే చేరుకొనెను. అతడు నిన్నెరుగడు. నీ వాతనినెరుగవు. కనుక అతడెవ్వడు? ఆతనిని గూర్చి నీవు ఎందుకేడ్తువు?

తృష్ణార్తి ప్రభవం దుఃఖం దుఃఖార్తి ప్రభవం సుఖమ్,

సుఖాత్ సంజాయతే దుఃఖం దుఃఖ మేవం పునః పునః. 18

దుఃఖము ఆశల పీడవలన పుట్టునట్టిది. సుఖము దుఃఖము నశింపగా కలుగునట్టిది. సుఖము వలన దుఃఖము, దుఃఖము వలన సుఖము మరల మరల కలుగుచుండును.

సుఖ స్యానన్తరం దుఃఖం దుఃఖ స్యానన్తరం సుఖమ్,

సుఖ దుఃఖే మనుష్యాణాం చక్ర వత్పరి వర్తతః . 19

సుఖము వెనుక దుఃఖము, దుఃఖము వెనుక సుఖము కలుగుచుండును. ఇట్లు మనుష్యులకు సుఖదుఃఖములు చక్రము వలె తిరుగుచుండును.

సుఖాత్త్వం దుఃఖ మాపన్నః పున రాపత్స్యసే సుఖమ్,

న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖమ్ . 20

నీవు సుఖమునుండి దుఃఖము పొందితివి. మరల సుఖమును కూడ పొందెదవు. నిత్యమగు దుఃఖము, నిత్యమగు సుఖము కలుగదు.

శరీర మేవాయతనం సుఖస్య దుఃఖస్య చాప్యాయతనం శరీరమ్,

యద్య చ్ఛ రీరేణ కరోతి కర్మ తేనైవ దేహీ సముపాశ్నుతే తత్ . 21

శరీరమే సుఖమునకు ఆశ్రయము. శరీరమే దుఃఖమునకును స్థానము. దేనివలన శరీరముతో ఏ కర్మమును జీవుడు చేయునో దానితోడనే ఆ ఫలము ననుభవించును.

జీవితం చ శరీరేణ తేనైవ సహ జాయతే,

ఉభే సహ వివర్తేతే ఉభే సహ వినశ్యతః . 22

ఆ శరీరముతో కూడియే జీవితము ఏర్పడుచున్నది. శరీరజీవితములు రెండును కలిసియే కదలాడుచున్నవి. కలిసియే నశించుచున్నవి.

స్నేహ పాశై ర్భహువిధై రావిష్ట విషయా జనాః,

అకృతార్థాశ్చ సీదన్తే జలైః సైకత సేతవః . 23

పెక్కు తీరులైన స్నేహ పాశములతో చిత్తమున గూడు కట్టుకొన్న విషయములు గల జనులు, ఇసుక కట్టలు నీటితో తుడిచిపెట్టుకొని పోయినట్లు, కృతార్థత పొందకయే నశించుచున్నారు.

స్నేహేన తిల వత్సర్వం సర్గ చక్రే నిపీడ్యతే,

తిలపీడై రివాక్రమ్య క్లేశై రజ్ఞాన సంభవైః . 24

నూనెకొఱకు నువ్వులు వలె ఈ సృష్టి చక్రమున సర్వమును నలిగిపోవు చున్నది. అజ్ఞానము వలన పుట్టిన కష్టములన్నియు తెలకల వారి నొక్కుల వంటివి.

సఞ్చినో త్యశుభం కర్మ కలత్రాపేక్షయా నరః,

ఏకః క్లేశా నవాప్నోతి పరత్రేహ చ మానవః . 25

భార్యకొరకు నరుడు పాడు కర్మమును కూడబెట్టుకొనును. అతడొక్కడే ఇందును అందును క్లేశములను పొందుచుండును.

పుత్రదార కుటుంబేషు ప్రసక్తాః సర్వమానవాః,

శోకపఙ్కార్ణవే మగ్నా జీర్ణా వనగజా ఇవ . 26

కొడుకులు, భార్య, కుటుంబము అనువానియందు తగులముగల మానవులందరు శోకమనెడు బురదగల సముద్రమున కూరుకొనిపోయి అడవియేనుగుల వలె నశించుచున్నారు.

పుత్రనాశే విత్తనాశే జ్ఞాతి సంబంధినా మపి,

ప్రాప్యతే సుమహద్దుఃఖం దావాగ్ని ప్రతిమం విభో,

దైవాయత్త మిదం సర్వం సుఖదుఃఖే భవాభవౌ. 27

కొడుకులు, ధనము, చుట్టములు పోయినపుడును దావాగ్ని వంటి పెనుదుఃఖము కలుగుచున్నది. సుఖదుఃఖములు కలిమిలేములు - ఇవి యన్నియు దైవమునకు వశమైనట్టివి.

అసుహృత్ససుహృచ్చాపి సశత్రు ర్మిత్రవా నపి,

సప్రజ్ఞః ప్రజ్ఞయా హీనో దైవేన లభతే సుఖమ్. 28

సుహృత్తులు లేనివాడో, కలవాడో, శత్రువులు కలవాడో, మిత్రములు కలవాడో, ప్రజ్ఞకలవాడో, లేనివాడో దైవము వలననే సుఖము పొందును.

నాలం సుఖాయ సుహృదో నాలం దుఃఖాయ శత్రవః,

న చ ప్రజ్ఞాఽల మర్థానాం న సుఖానా మలం ధనమ్. 29

చెలికాండ్రు సుఖము నొసగుటకు సమర్థులు కారు. పగవారు దుఃఖము నొసగజాలరు. ప్రజ్ఞ ధనముల నొసగజాలదు. ధనము సుఖములకు కారణము కాదు.

న బుద్ధి ర్ధనలాభాయ న జాడ్య మసమృద్ధయే,

లోక పర్యాయ వృత్తాన్తం ప్రాజ్ఞో జానాతి నేతరః. 30

తెలివి ధనము రాకడకు కారణము కాదు. మూఢత ధనముల పోకడలకు కారణము కాదు. తత్త్య మెరిగినవాడు లోకపు నిర్మాణమునందలి సిద్ధాంతము నెరుగును. ఇతరు డెరుగడు.

బుద్ధిమన్తం చ శూరం చ మూఢం భీరుం జడం కవిమ్,

దుర్బలం బలవన్తం చ భాగినం భజతే సుఖమ్ . 31

బుద్ధిమంతుడు, శూరుడు, మందబుద్ధి, భీరువు, అలసుడు, మేధావి, బలములేని వాడు, కలవాడు ఎవడైన కానిమ్ము, దైవానుగ్రహము కలవానినే సుఖము చేరుకొనును.

ధేనువత్సస్య గోపస్య స్వామిన స్తస్కరస్య చ,

పయః పిబతి యస్తస్యా ధేను స్త స్యేతి నిశ్చయః . 32

ఆవుదూడ, గోపాలుడు, గోవులస్వామి, దొంగ అనువారిలో పాలు త్రావు వాడెవడో ఆవు అతనిదే అని నిర్ణయము.

యే చ మూఢతమా లోకే యే చ బుద్ధేః పరంగతాః

తే నరాః సుఖ మేధన్తే క్లిశ్య త్యన్తరితో జనః . 33

మూఢత తుది మెట్టున నున్నవారు, బుద్ధి అంతమును చేరుకొన్నవారు నగు నరులు సుఖమును పొందుచున్నారు. నడుమనున్నవాడు నలిగి పోవుచున్నాడు.

అన్యేషు రేమిరే ధీరా న తే మధ్యేషు రేమిరే

అన్త్య ప్రాప్తిం సుఖా మాహు ర్దుఃఖ మన్తర మన్యయోః. 34

ధీరులు చిట్టచివరి స్థితులయందు రమింతురు. నడుమ నున్నవానియందు రమింపరు. చిట్టచివరి స్థితిని పొందుటయే సుఖమందురు. నడుమ నుండుట దుఃఖము.

యే చ బుద్ది సుఖం ప్రాప్తా ద్వన్ద్వాతీతా విమత్సరాః,

తాన్నై వార్థా న చానర్థాః వ్యథయన్తి కదాచన. 35

బుద్ధి సుఖమును పొందినవారు, ద్వంద్వములను లెక్కచేయనివారు, ఇతరుల యందు మాత్సర్యము లేనివారు నగు జనులను అర్థములు గాని, అనర్థములు గాని ఎన్నటికిని దుఃఖ పెట్టవు.

అథ యే బుద్ధి మప్రాప్తా వ్యతిక్రాన్తాశ్చ మూఢతామ్,

తేఽతివేలం ప్రహృష్యన్తి సన్తాప ముపయాన్తి చ. 36

ఆ పరమసుఖమును పొందనివారును, మూఢతను నిలువెల్ల నిలుపు కొన్నవారును మేరమీరి పొంగిపోవుదురు. మేరలు మీరిన దుఃఖమును పొందుదురు.

నిత్యం ప్రముదితా మూఢా దివి దేవగణా ఇవ,

అవలేపేన మహతా పరిభూత్యా విచేతసః. 37

మూఢులు గొప్ప గర్వముచేతను, ఇతరుల పరాభవము చేతను, వివేకము కోల్పోయిన వారై స్వర్గమునందలి దేవతల గణముల వలె ఎల్లవేళల పొంగిపోవుచుందురు.

సుఖం దుఃఖాన్త మాలక్ష్య దుఃఖం దాక్ష్యం సుఖోదయమ్,

భూతి స్త్వేవం శ్రియా సార్ధం దక్షే వసతి నాలసే. 38

సుఖము దుఃఖమే అంతముగా గలది. దుఃఖము సుఖము పుట్టుకకు కారణమైనది అని గుర్తించి దక్షతను సాధింపవలయును. ఈ విధముగా శ్రీ తోడి భూతి దక్షునియందు నివసించును. అలసుని యందు కాదు.

సుఖం వా యది వా దుఃఖం ప్రియం వా యది వాప్రియమ్,

ప్రాప్తం ప్రాప్త ముపాసీత హృదయే నాపరాజితః. 39

సుఖమో, దుఃఖమో, ప్రియమో, అప్రియమో లభించినది లభించినట్లు, హృదయమున కళవళపడక, అనుభవింపవలయును.

శోక స్థాన సహస్రాణి భయస్థాన శతాని చ,

దివసే దివసే మూఢ మావిశన్తి న పణ్డితమ్. 40

వేలకొలది శోకస్థానములు, వందలకొలది భయస్థానములు ప్రతిదినము మూఢుని పైకొనును. పండితుని కాదు.

బుద్ధిమన్తం కృతప్రజ్ఞం శుశ్రూషు మనసూయకమ్,

దాన్తం జితేన్ద్రియం చాపి శోకో న స్పృశతే నరమ్. 41

బుద్ధిమంతుడు, ప్రజ్ఞకలవాడు, పెద్దలను జ్ఞానముకొరకు సేవించువాడు, అసూయ లేనివాడు, మనస్సుపై, ఇంద్రియములపై అదుపు కలవాడు నగు నరుని ఎన్నటికిని శోకము స్పృశింపదు.

ఏతాం బుద్ధిం సమాస్థాయ గుప్త చిత్త శ్చరే ద్బుధః,

ఉదయాస్తమయజ్ఞం హీ న శోకః స్రష్టు మర్హతి . 42

ఇట్టి బుద్ధిని చక్కగా నిలుపుకొని చిత్తమును రక్షించుకొనువాడై పండితుడు మెలగవలయును. ఉదయాస్తమయములను చక్కగా నెరిగినవానిని శోకము తాకజాలదు.

యన్నిమిత్తం భవే చ్ఛోక స్తాపో వా దుఃఖమేవ చ,

ఆయాసో వా యతో మూల మే కాఙ్గ మపి తత్త్యజేత్ . 43

శోకము, తాపము, దుఃఖము అనునవి ఏది కారణముగా కలుగునో ఆయాసమునకు మూలమేదియో అది దేహమున ఒక అంగమైనను విడువనే వలయును.

కిఞ్చి దేవ మమత్వేన యదా భవతి కల్పితమ్,

త దేవ పరితాపార్థం సర్వం సంపద్యతే తథా . 44

ఏ కొంచెమైనను నాది అను భావముతో కల్పింపబడునేని అదియే సర్వమైన పరితాప కారణమగు వస్తువుగా ఏర్పడును.

యద్యత్త్యజతి కామానాం తత్సుఖస్యాభిపూర్యతే,

కామానుసారీ పురుషః కామా నను వినశ్యతి. 45

కామములలో దేని దేనిని విడచునో అది సుఖముగా నింపునది యగును. కామముల వెంటబడు నరుడు కామములతో పాటే నశించును.

యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్,

తృష్ణా క్షయ సుఖస్యైతే నార్హతః షోడశీం కలామ్. 46

లోకమునందలి కామ సుఖము, దేవలోకమునందలి మహాసుఖము అనునవి ఆశను చంపుకొనుటవలన కలుగు సుఖము యొక్క పదునారవ కళకు కూడ పోలవు.

పూర్వదేహకృతం కర్మ శుభం వా యది వాఽ శుభమ్,

ప్రాజ్ఞం మూఢం తథా శూరం భజతే యాదృశం కృతమ్. 47

వాడు తెలివి కలవాడో, మూఢుడో లేక శూరుడో పూర్వజన్మమున చేసిన కర్మము అది శుభమో, అశుభమో వానిని తప్పక కట్టికుడుపును.

ఏవ మేవ కిలైతాని ప్రియాణ్యేవాప్రియాణి చ ,

జీవేషు పరివర్తన్తే దుఃఖాని చ సుఖాని చ . 48

ఈ విధముగా ఇట్టివే కదా ప్రియములు, అప్రియములు అయినవి జీవులయందు దుఃఖములు, సుఖములుగా మార్పుచెందుచున్నవి.

ఏతాం బుద్ధిం సమాస్థాయ సుఖ మాస్తే గుణాన్వితః,

సర్వాన్ కామాన్ జుగుప్సేత కామాన్ కుర్వీత పృష్ఠతః. 49

ఇట్టి బుద్ధిని నెలకొల్పుకొని గుణములతో కూడిన వ్యక్తి సుఖముగా నుండును. కామముల నన్నింటిని ఏవగించుకొనవలయును. కామములను వెనుకకు నెట్టి వేయవలయును.

వృత్త ఏష హృది ప్రౌఢో మృత్యు రేష మనోభవః,

క్రోధో నామ శరీరస్థో దేహినాం ప్రోచ్యతే బుధైః. 50

మనస్సున పుట్టెడు ఈ కామము, అది నెరవేరనిచో కలుగు క్రోధము అను నివి రెండును ప్రాణుల శరీరమున నిత్యము తిరుగాడు మృత్యువులని పండితులు చెప్పుదురు.

యదా సంహరతే కామాన్ కూర్మోఽజ్గానీవ సర్వశః

తదాఽఽత్మ జ్యోతి రాత్మాయ మాత్మన్యేవ ప్రపశ్యతి 51

కామముల నన్నింటిని అన్నివైపులనుండియు, తాబేలు అవయవములనువలె, వెనుకకు గుంజుకొనినప్పుడు ఆ నరుడు ఆత్మస్వరూపుడై ఆత్మయందే ఆత్మ జ్యోతిని చక్కగా దర్శించును.

న బిభేతి యదా చాయం యదా చాస్మా న్న బిభ్యతి,

యదా నేచ్ఛతి నద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా . 52

అతడు దేనివలనను భయపడనియప్పుడు, అతనివలన ఎవ్వరు భయపడ కుండునపుడు, ఒకదానిని కోరుట, ద్వేషించుట అను స్థితులు లేనియప్పుడు అతడు బ్రహ్మమే యగును.

ఉభే సత్యానృతే త్యక్త్వా శోకానన్దౌ భయాభయే,

ప్రియాప్రియే పరిత్యజ్య ప్రశాన్తాత్మా భవిష్యతి . 53

సత్యమును అనృతమును, శోకమును, ఆనందమును, భయమును, అభయమును, ప్రియమును, అప్రియమును వదలివైచి అతడు ప్రశాంతాత్ముడగును.

యదా న కురుతే ధీరః సర్వ భూతేషు పాపకమ్,

కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా . 54

ధీరుడైన నరుడు కర్మముతో, భావనతో, మాటతో సర్వభూతములయందును హింసను చేయకుండునపుడు అతడు బ్రహ్మముగా నగును.

యా దుస్త్యజా దుర్మతిభి ర్యా న జీర్యతి జీర్యతః,

యో సౌ ప్రాణాన్తికో రోగ స్తాం తృష్ణాం త్యజతః సుఖమ్. 55

దుష్టబుద్ధులు వదలజాలనిది, నరుడు చిక్కి కృశించిపోవుచున్నను కృశింపనిది, ప్రాణము తీయుటయే తుదిగాగలది అగు రోగము తృష్ణ - ఆశ అనుదానిని వదలినవానికే సుఖము.

అత్ర పింగలయా గీతా గాథాః శ్రూయన్తి పార్థివ,

యథా సా కృచ్ఛ్ర కాలేఽపి లేభే ధర్మం సనాతనమ్ . 56

రాజా! ఆ విషయమున పింగళ పాడిన గాథలు వినవచ్చుచున్నవి. ఆయమ అతి కష్టకాలమునందును సనాతనమగు ధర్మమును పొందినది.

సంకేతే పింగలా వేశ్యా కాన్తే నాసీ ద్వినా కృతా,

అథ కృచ్ఛ్రగతా శాన్తా బుద్ధి మాస్థాపయ త్తదా. 57

పింగళ అను వేశ్య సంకేత స్థానమున ప్రియుని ఎడబాటు పొందినది. అట్లు తీవ్రదుఃఖము పొందినదై శాంతురాలై బుద్ధిని చెదరకుండ చేసికొనినది.

పిఙ్గ లోవాచ - పింగళ యిట్లనెను..

ఉన్మత్తాఽహ మనున్మత్తం కాన్త మన్వవసం చిరమ్,

అన్తికే రమణం సన్తం నైన మధ్యగమం పురా. 58

నేను పిచ్చి దానను. ఏ వికారములు లేని నా కాంతుని వెంటనంటితిని. నాలోనే రమణు డుండగా పొందలేక పోయితిని.

ఏక స్థూణం నవద్వార మపిధాస్యా మ్యగారకమ్,

కా హి కాన్త మిహాయాన్త మయం కాన్తేతి మంస్యతే . 59

ఒంటి స్తంభము, తొమ్మిది ద్వారములు గల గదిని మూసి వేయుదును. ఇచటికి వచ్చుచున్న కాంతుని ఇతడు నా కాంతుడని తలచు కాంత ఎవ్వరు?

అకామాం కామరూపేణ ధూర్తా నరకరూపిణః,

న పున ర్వఞ్చయిష్యన్తి ప్రతిబుద్ధాఽస్మి జాగృమి. 60

నేనిపుడు కామము లేనిదానను. నరక రూపముగల ధూర్తులు కాముక రూపముతో నన్నింక మోసగింపలేరు. మేల్కొంటిని . జాగరూకతతో ఉందును.

అనర్థో హి భవేదర్థో దైవా త్పూర్వకృతేన వా,

సంబుద్ధాఽహం నిరాకారా నా హ మద్యాజితేన్ద్రియా 61

దైవమువలననో పూర్వ జన్మ పుణ్యమువలననో అనర్థము అర్థముగా నయినది. నేను మేల్కొంటిని. నేను నిరాకారను. ఇప్పుడు నేను ఇంద్రియములను జయింపని దానను కాను.

సుఖం నిరాశః స్వపితి నైరాశ్యం పరమం సుఖమ్,

ఆశా మనాశాం కృత్వాహి సుఖం స్వపితి పిఙ్గలా . 62

ఆశలేనివాడు సుఖముగా నిద్రించును. ఆశ లేకుండుట పరమసుఖము. ఆశను ఆశలేని దానినిజేసి పింగళ సుఖముగా నిద్రించును.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

ఏతై శ్చాన్యైశ్చ విప్రస్య హేతుమద్భిః ప్రభాషితైః,

పర్యవస్థాపితో రాజా సేనజి న్ముముదే సుఖీ . 63

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
బ్రాహ్మణ సేనజిత్సంవాద కథనే చతుః సప్తత్యధిక శతతమోఽధ్యాయః

ఇవియు ఇట్టివియు నగు హేతువులు నిండుగా గల విప్రుని మంచిమాటలతో సేనజిన్మహారాజు కలత తీరి నిలుకడనందెను.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్ష ధర్మ పర్వమున
బ్రాహ్మణ సేనజిత్సంవాద కథనముగల నూటడెబ్బది నాలుగవ అధ్యాయము.

“యదా పఞ్చావతిష్ఠన్తే జ్ఞానాని మనసా సహ,

బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్’’

‘‘విభేద జనకే జ్ఞానే వాశమాత్యన్తికం గతే

ఆత్మనో బ్రహ్మణో భేద మసన్తం కః కరిష్యతి”

బ్రాహ్మణసేనజిత్తుల సంవాదము

174

వెనుకటి అధ్యాయమున ఆశలను జయించిన వాడు మోక్షమును కాంక్షించునని నిరూపించిరి. ఇప్పుడు ఆ విషయమున ఆలస్యము తగదని చెప్పుచున్నారు.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.

అతిక్రామతి కాలేఽస్మిన్ సర్వభూత క్షయావహే,

కిం శ్రేయః ప్రతిపద్యేత తన్మే బ్రూహి పితామహ. 1

ప్రాణులన్నింటి నాశనమునకు మూలకారణమైన ఇట్టి కాలము గడచుచుండగా శ్రేయస్సుగా పొందదగినదేదో, తాతా! నాకు తెలియజెప్పుము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

పితుః పుత్రేణ సంవాదం తం నిబోధ యుధిష్ఠిర. 2

యుధిష్ఠిరా! ఈ విషయమునందును ప్రాతకాలపు ఇతిహాసమును ఉదాహరింతురు. తండ్రి కొడుకుల సంవాదమనెడు దానిని చెప్పెదను. వినుము.

ద్విజాతేః కస్యచిత్ పార్థ స్వాధ్యాయనిరతస్య వై,

బభూవ పుత్రో మేధావీ మేధావీనామ నామతః. 3

వేదముల అధ్యయనమునందు నిండు ఆసక్తి కలవాడగు ఒక బ్రాహ్మణునికి మేధావియను పేరుగల బుద్ధిశాలి యగు కొడుకు ఒకడు ఉండెడివాడు.

సోఽబ్రవీత్ పితరం పుత్రః స్వాధ్యాయకరణే రతమ్,

మోక్ష ధర్మార్థకుశలో లోకతత్త్వవిచక్షణః. 4

మోక్షధర్మముల అర్థములందు నిండైన అవగాహన కలవాడు, లోకతత్వమునందు వివేకము కలవాడు అగు ఆపుత్రుడు వేద అధ్యయనమునందు ఆసక్తికల తండ్రితో ఇట్లు పలికెను.

పుత్ర ఉవాచ - కొడు కిట్లు పలికెను.

ధీరః కింస్వి త్తాత కుర్యా త్ప్రజానన్

క్షిప్రం హ్యాయు ర్భ్రశ్యతే మానవానామ్ ,

పిత స్తదాచక్ష్య యథార్థయోగం

మమానుపూర్వ్యా యేన ధర్మం చరేయమ్. 5

నాయనా! మానవుల ఆయువు వడివడిగా తరిగిపోవుచున్నది. ఇట్టిస్థితిలో చక్కని ఎరుకకల ధీరుడు ఏమిచేయవలయును? దాని యథార్థయోగమును క్రమము తప్పకుండ నాకు తెలియజెప్పుము. దానితో నేను ధర్మము నాచరింపవలయును.

పితోవాచ - తండ్రి యిట్లు చెప్పెను.

వేదా నధీత్య బ్రహ్మచర్యేణ పుత్ర

పుత్రా నిచ్ఛేత్ పావనార్థం పితౄణామ్,

అగ్నీ నాధాయ విధివ చ్చేష్టయజ్ఞో

వనం ప్రవిశ్యాథ ముని ర్బుభూషేత్ . 6

బ్రహ్మచర్యముతో వేదముల నధ్యయనము చేసి, పితృదేవతలను తరింపజేయుటకై పుత్రులను పొందవలయును. శాస్త్రవిధానముననుసరించి అగ్నులను నెలకొల్పుకొని, యజ్ఞముల నొనరించి, తుదికి వనమును చేరుకొని మునిగా నగుటను కోరవలయును.

పుత్ర ఉవాచ - కొడు కిట్లనెను.

ఏవ మభ్యాహతే లోకే సమన్తాత్ పరివారితే,

అమోఘాసు పతన్తీషు కిం ధీర ఇవ భాషసే . 7

లోకమిట్లు చావుదెబ్బలు తినుచుండగా, అన్నివైపుల ముసలితనము క్రమ్ముకొని వచ్చుచుండగా, ఆమోఘములై ఆయువును హరించు రాత్రులు గడచుచుండగా ధీరునివలె పలికెదవేల?

పితోవాచ - తండ్రి యిట్లు పలికెను.

కథ మభ్యాహతో లోకః కేన వా పరివారితః,

అమోఘాః కాః పతన్తీహ కింను భీషయసీవ మామ్ . 8

లోక మెట్లు దెబ్బలుతినుచున్నది? దానిని చుట్టుముట్టిన దేది? అమోఘములై పడుచున్నవేవి? నన్ను బెదరింతు వేల?

పుత్రఉవాచ - కొడు కిట్లు పలికెను.

మృత్యునాఽభ్యాహతో లోకో జరయా పరివారితః

అహోరాత్రాః పతన్త్యేతే నను కస్మా న్న బుధ్యసే . 9

లోకము మృత్యువుచేత చావుదెబ్బలు తినుచున్నది. ముసలితనము దానిని క్రమ్ముకొనుచున్నది. పగళ్లు రాత్రులు వచ్చిపడుచున్నవి. దీనిని నీవెందువలన తెలియకున్నావు?

అమోఘా రాత్రయ శ్చాపి నిత్యమాయాన్తి యాన్తి చ

యదాఽహ మేత జ్జానామి న మృత్యు స్తిష్ఠతీతి హ,

సోఽహం కథం ప్రతీక్షిష్యే జ్ఞానేనాపిహిత శ్చరన్. 10

వ్యర్థముకాని రాత్రులు ప్రతిదినము వచ్చుచున్నవి, పోవుచున్నవి. మృత్యువు (ఎవనికొరకు వేచియుండదని) నిలిచియుండదని ఎరిగిన నేను జ్ఞానముచేత కప్పబడకున్నవాడనై ఎట్లు ఎదురు చూచుచుందును?

రాత్ర్యాం రాత్ర్యాం వ్యతీతాయా మాయు రల్పతరం యదా,

తదైవ వన్ధ్యం దివస మితి విద్యా ద్విచక్షణః . 11

ప్రతిరాత్రియు కడచుచుండగా ఆయువు తరిగిపోవుచున్నది. పగలు నిష్ఫలమగుచున్నది అని వివేకము కలవాడు ఎరుగవలయును.

గాధోదకే మత్స్య ఇవ సుఖం విన్దేత కస్తదా,

అనవాప్తేషు కామేషు మృత్యు రభ్యేతి మానవమ్. 12

కొంచెము పాటి నీరుగల తావున చేపవలె, కోరికలు తీరకుండగనే మృత్యువు మానవుని కడకు వచ్చుచుండగా, సుఖమును పొందు వాడెవడు?

పుష్పాణీవ విచిన్వన్త మన్యత్ర గత మానసమ్,

వృకీవోరణ మాసాద్య మృత్యు రాదాయ గచ్ఛతి . 13

మరియొకచోట మనసుపెట్టి పూవులను కోయుచున్న వ్యక్తిని, తోడేలు మేకపిల్లను వలె, సమీపించి మృత్యువు తీసికొని వెళ్ళిపోవును.

అద్యైవ కురు యచ్ఛ్రేయో మా త్వాం కాలోఽత్యగా దయమ్ ,

అకృతేష్వేవ కార్యేషు మృత్యు ర్వై సంప్రకర్షతి. 14

ఏది మేలో దానిని ఈనాడే చేయుము. కాలము నిన్ను మించిపోకుండుగాక! కార్యములు చేయబడకమున్నే మృత్యువు నిన్ను గుంజుకొని పోవును.

శ్వః కార్య మద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికమ్,

న హి ప్రతీక్షతే మృత్యుః కృతమస్య న వాకృతమ్ . 15

రేపటిపని నీనాడే చేయవలయును. అపరాహ్ణపు పనిని పూర్వాహ్ణ మందే చేయవలయు. వీని పని అయినదో లేదో అని మృత్యువు వేచియుండదు.

కోహి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవిష్యతి,

యువైవ ధర్మశీలః స్యా దనిత్యం ఖలు జీవితమ్,

కృతే ధర్మే భవేత్కీర్తి రిహ ప్రేత్యచ వై సుఖమ్ 16

ఎవని కీనాడు చావువచ్చునో ఎవ డెరుగును? కనుక మంచి వయసున్నపుడే మానవుడు ధర్మశీలుడు కావలయును. బ్రదుకు అనిత్యము కదా! ధర్మము నాచరించినచో కీర్తియు, ఇహపరములందు సుఖమును కలుగును.

మోహేన హి సమావిష్టః పుత్రదారార్థ ముద్యతః,

కృత్వా కార్య మకార్యం వా పుష్టి మేషాం ప్రయచ్ఛతి . 17

మోహము నిలువెల్ల క్రమ్ముకొనగా కొడుకులకొరకు, భార్యకొరకు పూనుకొన్నవాడై కార్యమో, అకార్యమో చేసి వీరికి పుష్టి కలిగించును.

తం పుత్రపశుసంపన్నం వ్యాసక్తమనసం నరమ్,

సుప్తం వ్యాఘ్రో మృగమివ మృత్యు రాదాయ గచ్ఛతి. 18

కొడుకులు, పశువులు పెల్లుగా నున్నవాడు, వానియందు తగులము గల మనస్సు కలవాడునగు నరుని, నిద్రించియున్న లేడిని పెద్దపులివలె, మృత్యువు కొనిపోవును.

సఞ్చి న్వానక మేవైనం కామానా మవితృప్తకమ్,

వ్యాఘ్రః పశు మివాదాయ మృత్యు రాదాయ గచ్ఛతి . 19

కామములను ఆబతో పెంచుకొనుచు, తృప్తి నందని నరుని, పశువును బెబ్బులివలె, మృత్యువు తీసి కొనిపోవును.

ఇదం కృత మిదం కార్య మిద మన్య త్కృతాకృతమ్,

ఏవ మీహా సుఖాసక్తం కృతాన్తః కురుతే వశే . 20

ఈ పనిని చేసితిని. దీనిని చేయవలయును. ఇదిగో ఈ మరియొకటి సగమయినది, అని యిట్లు ఆశలయందు సుఖములయందు తగులముగల నరుని యముడు వశముచేసికొనును.

కృతానాం ఫలమప్రాప్తం కర్మణాం కర్మసంజ్ఞితమ్,

క్షేత్రాపణ గృహాసక్తం మృత్యురాదాయ గచ్ఛతి . 21

చేసిన పనుల ఫలము పొందనివాడు, భూములు, దుకాణములు, కొంపలు అనువాని నంటి పెట్టుకొని యుండువాడు నగునరుని ఏ పనివానినైనను మృత్యువు గుంజుకొని పోవును.

దుర్బలం బలవన్తం చ శూరం భీమం జడం కవిమ్,

అప్రాప్తం సర్వకామార్థాన్ మృత్యు రాదాయ గచ్ఛతి. 22

బక్కచిక్కినవాడు, బలవంతుడు, శూరుడు, భీరువు, బుద్ధిహీనుడు, మేధావి, కోరిన విషయముల ఫలము పొందనివాడు అయిన ఏ నరునైనను మృత్యువు తీసికొని వెళ్ళిపోవును.

మృత్యు ర్జరా చ వ్యాధిశ్చ దుఃఖం చానేక కారణమ్,

అనుషక్తం యదా దేహే కిం స్వస్థ ఇవ తిష్ఠసి . 23

చావు, ముసలితనము, రోగము, పెక్కు కారణములవలన నగు దుఃఖముఅనునవి దేహము నంటిపెట్టుకొని యుండగా ఏ రోగము లేనివాని వలె ఎట్లు ఉన్నావు?

జాత మేవాన్తకోఽన్తాయ జరా చాన్వేతి దేహినమ్,

అనుషక్తా ద్వయే నైతే భావాః స్థావరజంగమాః 24

పుట్టినవెనువెంటనే మృత్యువు, ముసలితనము దేహధారి వెంటనుండి అంతముచేయుటకై తిరుగుచుండును. స్థావరములు జంగమములు అయిన భూతములన్నియు ఈ రెంటితో చుట్టబడియే యున్నవి.

మృత్యో ర్వా ముఖ మేతద్వై యాగ్రామే వసతో రతిః,

దేవానా మేవ వై గోష్ఠో యదరణ్య మితి శ్రుతిః . 25

గ్రామమునందు ఉండువానికి దానియందలి ఆసక్తియే మృత్యువు ముఖము. అరణ్యమే యింద్రియములకు పశుశాల అని శ్రుతి.

నిబన్ధనీ రజ్జు రేషా యాగ్రామే వసతో రతిః

ఛిత్వ్తైతాం సుకృతో యాన్తి నైనాం ఛిన్దన్తి దుష్కృతః . 26

ఈ గ్రామమునందలి తగులమనునది కట్టు త్రాడు. పుణ్యాత్ములు దీనిని త్రెంచి వైచుకొని పోవుదురు. పాపాత్ములు దీనిని త్రెంచుకొనలేరు.

న హింసయతి యో జన్తూన్ మనోవాక్కాయ హేతుభిః ,

జీవితార్థా పనయనైః ప్రాణిభి ర్న స హింస్యతే . 27

మనస్సు మాట చేష్ట అను హేతువులచేత ఏ ప్రాణులను కూడ హింసింపకుండువానిని, బ్రదుకును, ధనములను దోచి వేయు ప్రాణులు కూడ హింసింపవు.

న మృత్యుసేనా మాయాన్తీం జాతు కశ్చిత్ప్రబాధతే,

ఋతే సత్య మసత్త్యాజ్యం సత్యేహ్యమృత మాశ్రితమ్ . . 28

మీదికి వచ్చిపడుచున్న మృత్యువుసేనను ఎవ్వడు ఎన్నడు నిలువరింపజాలడు. ఒక్క సత్యము నిలువరించును. అందువలన అసత్తు. సత్యమునందు అమృతము అంటిపెట్టుకొనియున్నది.

తస్మా త్సత్యవ్రతాచారః సత్యయోగ పరాయణః

సత్యాగమః సదా దాన్తః సత్యే నై వాన్తకం జయేత్ . 29

అందువలన నరుడు సత్యవ్రతాచారుడు, సత్యయోగపరాయణుడు, సత్యమైన ఆగమము కలవాడు, ఎల్లవేళల ఇంద్రియముల అదుపు కలవాడునై, సత్యముచేతనే మృత్యువును జయింపవలయును.

అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితమ్,

మృత్యు రాపద్యతే మోహాత్ సత్యే నాపద్యతేఽమృతమ్ 30

అమృతము, మృత్యువు - రెండును దేహమున నిలువ ద్రొక్కుకొనియున్నవి. మోహము వలన మృత్యువు, సత్యము వలన అమృతము ప్రాప్తించును.

సోఽహం హ్య హింస్రః సత్యార్థీ కామ క్రోధ బహిష్కృ తః,

సమదుఃఖసుఖః క్షేమీ మృత్యుం హాస్యామ్యమర్త్యవత్ . 31

అట్టినేను హింసకుడును కాక, సత్యమును కోరువాడనై, కామక్రోధములను వెలుపలికి నెట్టి వైచి, సుఖదుఃఖములయందు సముడనై, అమర్త్యుని వలె, మృత్యువును వదిలివేయుదును.

శాన్తి యజ్ఞ రతో దాన్తో బ్రహ్మయజ్ఞే స్థితో మునిః,

వాఙ్మనః కార్య యజ్ఞశ్చ భవిష్యామ్యుదగాయనే. 32

దేవయాన మార్గమును చేరుకొనుటకు ప్రీతి కలవాడను, ఇంద్రియముల పై అదుపు గలవాడను, బ్రహ్మ యజ్ఞమునందు నిలుకడగల మునిని, వాక్కు, మనస్సు, కర్మము అను వాని యజ్ఞములు కలవాడను అగుదును.

పశుయఙ్ఞైః కథం హింస్రై ర్మాదృశో యష్టు మర్హతి,

అన్తవద్భి రివ ప్రాజ్ఞః క్షేత్రయఙ్ఞైః పిశాచవత్ . 33

పశువుల యజ్ఞములు హింసతో కూడినవి. క్షేత్రయజ్ఞములు తాత్కాలికములైన ఫలములు కలవి. నావంటి ప్రజ్ఞ కలవాడు పిశాచమువలె ఇట్టి యజ్ఞములెట్లు చేయఁగలడు?

యస్య వాఙ్మనసీ స్యాతాం సమ్యక్ ప్రణిహితే సదా,

తప స్త్యాగశ్చ సత్యం చ సవై సర్వ మవాప్నుయాత్ . 34

ఎవని వాక్కును మనస్సును బ్రహ్మమునందు ఎల్లవేళల సమర్పితములగునో అట్టివాడు తపమును, త్యాగమును, సత్యమును సర్వమును పొందును.

నాస్తి విద్యాసమం చక్షు ర్నాస్తి సత్యసమం తపః,

నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖమ్. 35

విద్యకు సాటివచ్చు కన్నులేదు. సత్యమునకు ఎనయగు తపస్సు లేదు. రాగమున కీడగు దుఃఖము లేదు. త్యాగముతో సమమగు సుఖము లేదు.

ఆత్మన్యే వాత్మనా జాత ఆత్మనిష్ఠోఽప్రజోఽపి వా,

ఆత్మన్యేవ భవిష్యామి న మాం తారయతి ప్రజా . 36

నేను ఆత్మయందు ఆత్మముతో పుట్టిన వాడను. నిష్ఠకలవాడను. సంతానము లేనివాడనై ఆత్మయందే పుట్టుదును.

నైతాదృశం బ్రాహ్మణ స్యాస్తి విత్తం

యథైకతా సమతా సత్యతా చ,

శీలం స్థితి ర్దణ్డనిధాన మార్జవం

తత స్తత శ్చోపరమః క్రియాభ్యః . 37

ఏకత, సమత, సత్యత, శీలము, నిలుకడ, హింసచేయకుండుట, ఆర్జవము, ఆయా పనులనుండి మరలుట అనువానితో సాటియగు ధనము బ్రాహ్మణునకు లేదు.

కిం తే ధనై ర్బాన్ధవై ర్వాఽపి కిం తే

కిం తే దారై ర్బ్రాహ్మణ యో మరిష్యసి,

ఆత్మాన మన్విచ్ఛ గుహాం ప్రవిష్టం

పితామహా స్తే క్వగతాః పితా చ . 38

బ్రాహ్మణా! నీకు ధనములతో, చుట్ట పక్కములతో, భార్యతో ప్రయోజనమేమి? నీవు మరణింతువు కదా! బుద్ధియనుగుహలో ప్రవేశించిన బ్రహ్మమును పొందుము. నీ తాతముత్తాతలు, తండ్రి ఎందు బోయిరి?

భీష్మఉవాచ - భీష్ము డిట్లనెను.

పుత్రస్యైత ద్వచః శ్రుత్వా యథాఽ కార్షీత్పితా నృప,

తథా త్వమపి వర్తస్వ సత్యధర్మపరాయణః . 39

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్ష ధర్మపర్వణి పితాపుత్ర సంవాద కథనే
పఞ్చ సప్తత్యధిక శతతమోఽధ్యాయః

కొడుకు చెప్పిన యీమాట విని తండ్రి యేమి చేసెనో, రాజా! నీవును సత్యధర్మ పరాయణుడవై అట్లే ప్రవర్తింపుము.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున పితాపుత్ర
సంవాదకథనము గల నూటడెబ్బదియైదవ అధ్యాయము.

యువకుడుగా ఉన్నపుడే మోక్షముకొరకు యత్నింపవలయునని వెనుకటి అధ్యాయకథ తెలుపుచున్నది. యజ్ఞములు మొదలగునవి భంగ్యంతరముగా మోక్షమునకు సాధనములు. యజ్ఞములు ధనసాధ్యములు. మఱి ధనము లేనివారికి మోక్షము దుర్లభమగును కదా! అని భావించుచు ధర్మరాజు అడుగుచున్నాడు. యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను

ధనిన శ్చాధనా యే చ వర్తయన్తే స్వతన్త్రిణః,

సుఖ దుఃఖాగమ స్తేషాం కః కథం వా పితామహ. 1

తాతా! ధనవంతులు, ధనములేని వారు స్వతంత్రతతో ప్రవర్తించుచున్నారు. వారికి సుఖ దుఃఖముల రాకడ ఏవిధమైనది? ఎట్లు కలుగుచున్నది

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

శంపాకేనేహ ముక్తేన గీతం శాన్తిగతేన చ . 2

అబ్రవీ న్మాం పురా కశ్చి ద్ర్బాహ్మణ స్త్యాగ మాశ్రితః,

క్లిశ్యమానః కుదారేణ కుచైలేన ఋభుక్షయా . 3

ఈవిషయమునందు ప్రాతకాలపు ఈ ఇతిహాసమును చెప్పుకొందురు. ఇది శాంతిపొందినవాడు ముక్తుడు అగు శంపాకుడు పాడినది, చినుగు గుడ్డలవాడు, చెడిన పెండ్లము కలవాడు, ఆకలితో నలిగిపోవుచున్నవాడు, అయినను త్యాగము నాశ్రయించినవాడు నగు ఒక బ్రాహ్మణుడు ఈగీతమును నాకు మునుపు చెప్పెను.

ఉత్పన్న మిహ లోకే వై జన్మప్రభృతి మానవమ్,

వివిధా న్యుపవర్తన్తే దుఃఖాని చ సుఖాని చ . 4

ఈలోకమున మానవుని, పుట్టిన నాటినుండియే పెక్కువిధములగు దుఃఖములును, సుఖములును వెంటనంటి తిరుగుచున్నవి.

తయో రేకతరే మార్గే యదేన మభిసన్నయేత్

న సుఖం ప్రాప్య సంహృష్యే న్నా సుఖం ప్రాప్య సంజ్వరేత్ . 5

ఆరెంటిలో నొకదానియందు (దైవము) వీనిని పడవేసినచో సుఖమును పొంది పొంగి పోరాదు. దుఃఖమును పొంది ఉడికి ( కుమిలి) పోరాదు.

న వై చరసి యచ్ఛ్రేయ ఆత్మనో వా యదీశిషే,

అకామాత్మాపి హి సదా ధుర ముద్యమ్య చైవ హ . 6

నీవు సహజముగా అకామాత్ముడవైనను బరువు నెత్తిని వేసికొని ఏది శ్రేయమో దాని వైపు తిరుగకున్నావు. దీనికి కారణము నీ చిత్తమునకు నీవు ప్రభువవు కాకపోవుటయే.

అకిఞ్చనః పరిపతన్ సుఖ మాస్వాదయిష్యసి

అకిఞ్చనః సుఖం శేతే సముత్తిష్ఠతి చైవ హ. 7

ఏమియు లేనివాడవై అంతట తిరుగుచు సుఖము నాస్వాదింతువు. దరిద్రుడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును.

ఆకిఞ్చన్యం సుఖం లోకే పథ్యం శివ మనామయమ్,

అనమిత్ర పథో హ్యేష దుర్లభః సులభో మతః . 8

లేమి లోకమున సుఖమైనది. పథ్యమైనది. మంగళమైనది. ఏ ఆటంకములు లేనిది. శత్రువులు లేని మార్గమిది. సులభమును దుర్లభము నైనది.

అకిఞ్చనస్య శుద్ధస్య ఉపపన్నస్య సర్వతః,

అవేక్షమాణ స్త్రీన్ లోకా న్న తుల్య మిహ లక్షయేత్ . 9

మచ్చలేని దరిద్రుడు, వైరాగ్యము నిండుగా కలవాడు అయిన వానికి సాటివచ్చు వానిని మూడు లోకములను వెదకినను చూడకున్నాను.

ఆకిఞ్చన్యం చ రాజ్యం చ తులయా సమతోలయన్ ,

అత్యరిచ్యత దారిద్య్రం రాజ్యాదపి గుణాధికమ్ . 10

లేమిని, రాజ్యమును త్రాసుతో తూచిరి. గుణములు ఎక్కువగా గల దరిద్రతయే రాజ్యముకంటె మించి పోయినది.

ఆకిఞ్చన్యే చ రాజ్యే చ విశేషః సుమహా నయమ్,

నిత్యోద్విగ్నో హి ధనవాన్ మృత్యో రాస్యగతో యథా . 11

దరిద్రత, రాజ్యము - ఈ రెంటిలో విశేషము చాల గొప్పది. ధనవంతుడు మృత్యువు నోట చిక్కిన వానివలె ఎల్లవేళల గుబులుపడుచుండును.

నైవా స్యా గ్ని ర్న చారిష్టో న మృత్యు ర్న చ దస్యవః,

ప్రభవన్తి ధనత్యాగా ద్విముక్తస్య నిరాశిషః . 12

ధనమును వదలి వేయుటవలన అన్ని బంధములనుండి విడివడినవాడై ఆశలులేని వాని విషయమున అగ్ని, కీడు, మృత్యువు, దొంగలు ఏమి చేయుటకును సమర్థులు కారు.

తం వై సదా కామచర మనుపస్తీర్ణశాయినమ్,

బాహూపధానం శామ్యన్తం ప్రశంసన్తి దివౌకసః. 13

ఇచ్చ వచ్చినట్లు తిరుగువాడు, వట్టినేలపై పడుకొనువాడు, చేయియే తలగడగా కలవాడు, శమగుణముతో నుండువాడు నగు నతనిని దేవలోకవాసులును మెచ్చుకొందురు.

ధనవాన్ క్రోధలోభాభ్యా మావిష్టో నష్టచేతనః,

తిర్యగీక్షః శుష్కముఖః పాపకో భ్రుకుటీముఖః. 14

నిర్దశ న్నధరోష్ఠం చ క్రుద్ధో దారుణ భాషితా

కస్త మిచ్ఛేత్ పరిద్రష్టుం దాతు మిచ్ఛతి చేన్మహీమ్ . 15

ధనవంతుడు క్రోధశోకములు నిలువెల్ల క్రమ్ముకొనగా, బుద్ధి నశించినవాడై, అడ్డచూపులు చూచుచు, తడి యారిన నోరు, మురకటించిన ముఖము కలవాడై పాపకార్యములు చేయుచుండును. క్రింది పెదవిని కొరుకుచు, తీవ్రకోపముతో భూమినంతటిని ఇచ్చినను మండిపడుచు కారుకూతలు కూయుచుండును. వాని మొగము చూచుట కెవడు కోరును?

శ్రియా హ్యభీక్ష్ణం సంవాసో మోహయత్య విచక్షణమ్,

సా తస్య చిత్తం హరతి శారదాభ్ర మివానిలః . 16

సంపద నంటిపెట్టుకొని అదియే పనిగ నుండుట వివేకములేని వానిని మోహపెట్టును. సంపద, శరత్కాల మేఘమును వాయువువలె, అతని చిత్తమును గుంజుకొని పోవును.

అథైనం రూపమానశ్చ ధనమానశ్చ విన్దతి,

అభిజాతోఽస్మి సిద్ధోఽస్మి నాస్మి కేవలమానుషః. 17

అటుపై అతనిని రూపగర్వము, ధనగర్వము పై కొనును. గొప్పకులమున పుట్టినవాడను. అన్నియు నెరవేరినవాడను. కేవలము మానవుడను కాను. (అనుకొనును).

ఇత్యేభిః కారణై స్తస్య త్రిభి శ్చిత్తం ప్రమాద్యతి,

సంప్రసక్తమనా భోగాన్ విసృజ్య పితృసంచితాన్,

పరిక్షీణః పరస్వానా మాదానం సాధు మన్యతే . 18

ఈ మూడు కారణముల చేత వాని హృదయము తికమక పడుచుండును. భోగములపై తగులుకొన్న మనస్సు కలవాడై తాతతండ్రులు కూడబెట్టిన ధనములను వెచ్చపరచి, వట్టి పోయినవాడై పరులసొమ్ములను కైకొనుట (దొంగతనము చేయుట) మంచిదిగా తలపోయును.

త మతిక్రాన్త మర్యాద మాదదానం తతస్తతః,

ప్రతిషేధన్తి రాజానో లుబ్ధా మృగమివేషుభిః. 19

అట్లు హద్దుపద్దులులేకుండ ఆయాతావులందు ధనమును కొల్లగొట్టువానిని, వేటగాండ్రు మృగమును బాణములతో వలె, దండింతురు.

ఏవ మేతాని దుఃఖాని తాని తానీహ మానవమ్ ,

వివిధాన్యుపపద్యస్తే గాత్ర సంస్పర్శజాన్యపి . 20

ఇట్టి మానవుని పెక్కు విధములగు దుఃఖములు కాల్పులు, గాయములు మున్నగునవి చేరుకొని బాధించుచుండును.

తేషాం పరమదుఃఖానాం బుద్ధ్యా భైషజ్యమాచరేత్,

లోకధర్మ మవజ్ఞాయ ధ్రువాణా మధ్రువైః సహ . 21

తస్పనిసరియగు ఆ పరమదుఃఖములకు పెక్కుకాలము నిలిచి యుండని దేహము మున్నగువానితో పాటు లోకధర్మమగు పుత్రేషణ మొదలగు దానిని చీకొట్టి, జ్ఞానముతో తగిన ప్రతీకారము చేయవలయును.

నాత్యక్త్వా సుఖ మాప్నోతి నాత్యక్త్వా విన్దతే పరమ్

నాత్యక్త్వా చాభయః శేతే త్యక్త్వా సర్వం సుఖీ భవ. 22

త్యాగము చేయక నరుడు సుఖము పొందడు. త్యాగము చేయక పరమును పొందడు. త్యాగము చేయక గుండె మీద చేయివైచుకొని నిద్ర పోజాలడు. కావున సర్వమును త్యజించి సుఖవంతుడవు కమ్ము.

ఇత్యేత ద్ధాస్తిన పురే బ్రాహ్మణే నోపవర్ణితమ్,

శంపాకేన పురా మహ్యం తస్మా త్త్యాగః పరో మతః . 23

ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి
శంపాక గీతాయాం షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః

ఈ విధముగా హస్తినాపురమునందు శంపాకుడను బ్రహ్మజ్ఞాని మునుపు నాకు ఉపదేశించెను. అందు వలన త్యాగము అన్నింటికంటె మించినది.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున శంపాకగీత గల
నూటడెబ్బదియారవ అధ్యాయము

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

ఈహమానః సమారంభాన్యది నాసాదయే ద్ధనమ్,

ధనతృష్ణాభి భూతశ్చ కిం కుర్వన్ సుఖ మాప్నుయాత్ . 1

కొన్ని తప్పనిసరి పనులను చేయగోరుచున్నవాడై ధనమును పొందజాలక, ధనముపై ఆశతో దెబ్బతిన్న హృదయము కలవాడు ఏమి చేసి సుఖమును పొందును?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

సర్వసామ్య మనాయాసం సత్యవాక్యం చ భారత,

నిర్వేద శ్చావిధిత్సా చ యస్య స్యా త్స సుఖీ నరః . 2

అన్ని విషయములందును సమభావము, దేనికిని ఆయాసపడుకుండుట, సత్యవాక్యము, వైరాగ్యము, పనులయందు కోరిక లేకుండుట అను లక్షణములు

గల నరుడు సుఖవంతుడగును.

ఏతాన్యేవ పదాన్యాహుః పఞ్చ వృద్ధాః ప్రశాన్తయే,

ఏష స్వర్గశ్చ ధర్మశ్చ సుఖం చానుత్తమం మతమ్ . 3

ఈ అయిదు పదములే మోక్షమునకై ఆశ్రయింపదగినవని వృద్ధులు చెప్పుదురు. ఇది స్వర్గము, ధర్మము, మిక్కిలి శ్రేష్ఠమగు సుఖము.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

నిర్వేదా న్మంకినా గీతం తన్నిబోధ యుధిష్ఠిర . 4

ఈ విషయమున ప్రాతకాలపు ఇతిహాసమును ఉదాహరింతురు. ఇది మంకి నిర్వేదముతో పాడినది. యుధిష్ఠిరా! దానిని తెలిసికొనుము.

ఈహమానో ధనం మంకి ర్భగ్నేహశ్చ పునఃపున,

కేనచిద్ధన శేషేణ క్రీతవాన్ దమ్యగోయుగమ్ 5

ధనము సంపాదింపగోరి మంకియనువాడు, మాటిమాటికి కోరికలు చెడిపోవుచుండగా, ఏదో కొంచెము మిగిలిన ధనముతో రెండు గిత్తలను కొనెను.

సుసంబద్ధౌతు తౌ దమ్యౌ దమనాయాభినిఃసృతౌ,

ఆసీన ముష్ర్టం మధ్యేన సహసైవాన్వధావతామ్ 6

ఆ రెంటిని కాడికి కట్టి బండి లాగుట నేర్పుటకై తోలికొని వెళ్లుచుండగా దారి నడుమ ఒక ఒంటె నిలిచి యుండగా అప్పుడవి పరువెత్తి దానిపై బడెను.

తయోః సంప్రాప్తయో రుష్ట్రః స్కన్ధదేశ మమర్షణః,

ఉత్థాయోత్క్షిప్యతౌ దమ్యౌ ప్రససార మహాజవః . 7

అవి రెండును తన మెడపై పడగా తట్టుకొనలేని ఆ ఒంటె లేచి వానిని పైకెత్తుకొని గొప్పవేగముతో గుంజుకొని పోయెను.

హ్రియమాణా తు తౌ దమ్యౌ తేనోష్ట్రేణ ప్రమాథినా,

మ్రియమాణా చ సంప్రేక్ష్య మంకి స్తత్రా బ్రవీ దిదమ్. 8

పొగరెక్కిన ఆ ఒంటె ఆ రెంటిని మెడ కిరువైపుల వేసికొని గుంజుకొని పోవుచుండగా చావబోవనున్న వానిని చూచి మంకి యిట్లు పలికెను.

న చైవావిహితం శక్యం దక్షేణాపీహితుం ధనమ్,

యుక్తేన శ్రద్ధయా సమ్య గీహాం సమనుతిష్ఠతా . 9

ఎంత సమర్థుడైన వానికిని, శ్రద్ధకలవానికిని, చక్కగా పనిని చేయువానికిని దైవము సరిగా నెలకొల్పని పనిని చేయుటకు సాధ్యము కాదు.

కృతస్య పూర్వం చానర్థై ర్యుక్తస్యాప్యనుతిష్ఠతః,

బుద్ధిని ఇమం పశ్యత సంగత్యా మమ దైవ ముపప్లవమ్ . 10

నేను ధనమునకై చేయవలసిన దంతయు చేసితిని. కుదురుకొల్పుకొంటిని. ఇప్పుడు శ్రద్ధతో పనిచేయుచున్నాను. కాని చూడుడు. నా ఈ గిత్తల తగులము చేత దైవికముగా కీడు వచ్చిపడినది.

ఉద్యమ్యోద్యమ్య మే దమ్యౌ విషమేణైవ గచ్ఛతః,

ఉత్క్షిప్య కాకతాళీయ ముత్ఫథేనైవ ధావతః. 11

ఈ నారెండు గిత్తలును పడుచు లేచుచు ఎగుడు దిగుళ్లుగా పోవుచున్నవి. ఆ ఒంటె దైవఘటనవలన దారితెన్నులు లేక వీనిని ఎగవేసికొని పోవుచున్నది.

మణీ వో ష్ట్రస్య లంబేతే ప్రియౌ వత్సతరౌ మమ,

శుద్ధం హి దైవమేవేదం హఠేనై వాస్తి పౌరుషమ్ . 12

నా ముద్దారు లేగదూడలు ఆ ఒంటెపై అటునిటు మణుల వలె వ్రేలాడుచున్నవి. దైవమే ఏ దోషము లేనిది. మొండితనముతో మాత్రమే పురుష ప్రయత్నము ఉన్నట్లు కానవచ్చును.

యది వాప్యుపపద్యేత పౌరుషం నామ కర్హిచిత్,

అన్విష్యమాణం తదపి దైవ మేవావతిష్ఠతే . 13

ఒకవేళ పురుషప్రయత్నమే ఫలమునకు వచ్చినప్పటికి అదియును వెదకి కొనుచు దైవమునే అంటిపెట్టు కొనియుండును.

తస్మా న్నిర్వేద ఏవేహ గన్తవ్యః సుఖ మిచ్ఛతా,

సుఖం స్వపితి నిర్విణ్ణో నిరాశ శ్చార్థ సాధనే . 14

అందువలన సుఖమును కోరు వ్యక్తి వైరాగ్యమునే పొందవలయును. అర్థసాధనమునందు ఆశలులేనివాడు, వైరాగ్యము కలవాడు సుఖముగా నిద్రించును.

అహో సమ్యక్ శుకే నోక్తం సర్వతః పరిముచ్యతా,

ప్రతిష్ఠతా మహారణ్యం జనకస్య నివేశనాత్. 15

జనకుని భవనమునుండి కారడవులకు బయలుదేరినవాడు, అన్నింటిని వదలివేసినవాడు అగు శుకుడు ఎంత చక్కగా పలికెను!

యః కామా నాప్నుయాత్ సర్వాన్ యశ్చైతాన్ కేవలాం స్త్యజేత్,

ప్రాపణాత్ సర్వకామానాం పరిత్యాగో విశిష్యతే . 16

కామములన్నింటిని పొందు వాడొకడు. పొందిన కామము లన్నింటిని వదలివైచువాడు మరియొకడు. కోరికలన్నింటిని పొందుటకంటే వానిని మూల ముట్టుగా వదలి వైచుట గొప్పవిషయము.

నాన్తం సర్వవిధిత్సానాం గతపూర్వోఽస్తి కశ్చన,

శరీరే జీవితే చైవ తృష్ణా మన్దస్య వర్ధతే . 17

కోరిక లన్నింటిని తుదిముట్ట పొందిన వాడు మునుపెవ్వడును లేడు. తెలివి తక్కువ వానికి శరీరము నందును బ్రదుకు మీదను ఆశ పెరుగుచుండును.

నివర్తస్వ విధిత్సాభ్యః శామ్య నిర్విద్య కాముక,

అసకృచ్చాసి నికృతో నచ నిర్విద్యసే తతః . 18

ఓరి కాముకా! కోరికల నుండి మరలుము. వైరాగ్యమును పొంది శాంతి నందుము. పెక్కుమారులు మోసమునకు బలియైన వాడవై పిదప వైరాగ్యము పొందజాలవు.

యది నాహం వినాశ్యస్తే యద్యేవం రమసే మయా,

మా మాం యోజయ లోభేన వృథా త్వం విత్తకాముకః . 19

ఓ ధనము కోరు మనస్సా! నేను నీకు నాశనము చేయరానివాడనైనచో, నాతో నీవు ఆడుకొనదలచినచో నాకు వ్యర్థముగా లోభముతో తగులము పెట్టకుము.

సఞ్చితం సఞ్చితం ద్రవ్యం నష్టం తవ పునః పునః,

కదాచిన్మోక్ష్యసే మూఢ ధనేహాం ధనకాముక!. 20

బుద్ధి ఏమాత్రములేని ధనకాంక్షగల ఓ హృదయమా! మాటిమాటికి కూడబెట్టిన నీ ధనమంతయు మరల మరల జారిపోయినది. అట్టి ధనవాంఛనుండి నీ వెప్పటికైన విడుదల పొందుదువా?

అహోను మమ బాలిశ్యం యోఽహం క్రీడనక స్తవ

కిం నైవ జాతు పురుషః పరేషాం ప్రేష్యతా మియాత్ . 21

అయ్యో! నా పిల్లతనము నేమి చెప్పుదును. నీచేతిలో ఒక ఆటబొమ్మ నయితిని. ఇట్టి పురుషుడు ఇతరులకు కట్టుబానిస కాకుండ నెట్లుండగలడు?

న పూర్వే నాపరే జాతు కామానా మన్త మాప్నువన్ ,

త్యక్త్యా సర్వసమారంభాన్ ప్రతిబుద్ధోఽస్మి జాగృమి . 22

నా మునుపటి వారుగాని, తరువాతి వారుగాని కోరికల అంతమును పొందలేదు. కావున అన్ని ప్రయత్నములను వదలి వైచి తెలివి తెచ్చుకొంటిని. మేల్కొందును.

నూనం తే హృదయం కామ వజ్ర సారమయం దృఢమ్,

యదనర్థశతావిష్టం శతధా న విదీర్యతే . 23

కామమా! నీ గుండె తప్పనిసరిగా వజ్రసారమయమై యుండును. ఎందుకనగా వందలకొలది అనర్థములు నిన్ను చుట్టుముట్టి యున్నను అది నూరుముక్కలుగా పగిలిపోకున్నది.

జానామి కామ త్వాం చైవ యచ్చ కిఞ్చిత్ ప్రియం తవ ,

తవాహం ప్రియ మన్విచ్ఛ న్నాత్మన్యుపలభే సుఖమ్ . 24

కామమా! నిన్ను, నీకు ప్రియమైన దానిని నేనెరుగుదును. నీకు ప్రియమైన దానిని వెదకి కొనుచు ఆత్మయందు సుఖమును సాధింతును.

జానామి కామ తే మూలం సంకల్పా త్కిల జాయసే,

న త్వాం సంకల్పయిష్యామి సమూలో నభవిష్యసి. 25

కామమా! నీకుదురేమో నాకు తెలిసి పోయినది. సంకల్పమువలన గదా నీవు పుట్టునది. నిన్ను నేను తలపునకు రానీయను. నీవు కూకటివ్రేళ్లతో చచ్చిపోయెదవు.

ఈహా ధనస్య న సుఖా లబ్ధ్వా చిన్తా చ భూయసీ,

లబ్ధనాశే యథా మృత్యు ర్లబ్ధం భవతి వా న వా . 26

ధనకాంక్ష సుఖమైనది కాదు. పొందినను చింత పెరిగిపోవును. దొరకునో లేదో తెలియదు. కాని దొరకినది పోయినచో అది చచ్చినచావు అగును.

పరిత్యాగే న లభతే తతో దుఃఖతరం ను కిమ్,

న చ తుష్యతి లబ్ధేన భూయ ఏవం చ మార్గతి . 27

దేహము కుదువబెట్టినను అది లభింపదు. అంతకు మించిన దుఃఖ మేముండును? దొరకని దానితో నరుడు తుష్టి నందడు. ఇంకను వెంపరలాడుచునే యుండును.

అనుతర్షుల ఏ వార్థః స్వాదు గాఙ్గ మివోదకమ్,

మద్విలాపన మేతత్తు ప్రతిబుద్ధోఽస్మి సంత్యజ . 28

తీయని గంగాజలము వలె ధనము దాహమును పెంచునదియే యగును. ఇది నన్ను రూపుమాపుటకే యయినది. నేను మేల్కొంటిని. ఓకామమా! నన్ను వదలి పొమ్ము.

య ఇమం మామకం దేహం భూతగ్రామః సమాశ్రితః,

స యాత్వితో యథాకామం వసతాం వా యథాసుఖమ్ . 29

నాదైన దేహమును అంటి పెట్టుకానియున్న భూతముల మంద ఇష్టమువచ్చినట్లు ఇటనుండి పోవుగాక! ఉన్నచో సుఖముగా నుండుగాక!

న యుష్మా స్విహ మే ప్రీతిః కామలోభానుసారిషు,

తస్మా దుత్సృజ్య కామాన్వై సత్యమేవాశ్రయా మ్యహమ్ . 30

కామము, లోభము మొదలగువాని వెంటబడు మీయందు నాకు ప్రీతి లేదు. అందువలన నేను కామములను వదలివైచి సత్త్వగుణమునే యాశ్రయించెదను.

సర్వభూతా న్యహం దేహే పశ్యన్ మనసి చాత్మనః,

యోగే బుద్ధిం, శ్రుతే సత్త్వం, మనో బ్రహ్మణి ధారయన్ . 31

విహరిష్యా మ్యనాసక్తః సుఖీ లోకా న్నిరామయః

యథా మాం త్వం పున ర్నైవం దుఃఖేషు ప్రణిధాస్యసి . 32

నేను భూతములన్నింటిని దేహమునందు అందును హృదయమను పద్మమున చూచుట కొరకై బుద్ధిని యోగమునందును, సత్త్వమును శ్రుతమునందును, మనస్సును బ్రహ్మమునందును పట్టి నిలిపి, ఎందును తగులము లేనివాడనై, మరల ఓ కామమా! నీవు నన్ను దుఃఖముల యందు కట్టి పడవేయకుండునట్లు, ఏ జాడ్యములు లేనివాడనగుచు సుఖముగా నుందును.

త్వయా హి మే ప్రణున్నస్య గతిరన్యా న విద్యతే,

తృష్ణాశోక శ్రమాణాం హి త్వం కామ ప్రభవః సదా 33

నీవు నుగ్గు నుగ్గుగా కొట్టిన నాకు వేరుగతి లేదు. ఓ కామమా! ఆశ, దుఃఖము, శ్రమ అనువానికి నీవు ముద్దారు తల్లివి కదా!

ధననాశేఽధికం దుఃఖం మన్యే సర్వ మహత్తరమ్

జ్ఞాతయో హ్యవమన్యన్తే మిత్రాణి చ ధనాచ్చ్యుతమ్ . 34

ధనము పోగానగు దుఃఖము అన్నింటికంటె మిన్న యని తలతును. జ్ఞాతులు, మిత్రములు ధనము కోల్పోయిన వానిని అవమానింతురు.

అవజ్ఞాన సహస్రైస్తు దోషాః కష్టతరా ధనే,

ధనే సుఖకలా యా తు సాఽపి దుఃఖై ర్విధీయతే. 35

ధనమునందు వేలకొలది అవమానములతో పాటు భయంకరములగు దోషములు పెక్కుకలవు. ధనమునందు గల కొద్దిపాటి సుఖము కూడ దుఃఖముల తోనే కూడియున్నది.

ధన మస్యేతి పురుషం పురో నిఘ్నన్తి దస్యవః,

క్లిశ్యన్తి వివిధై రణ్డై ర్నిత్య ముద్వేజయన్తి చ . 36

ధనమున్న పురుషుని దొంగలు అందరి యెదుట కుళ్లబొడిచెదరు. పెక్కువిధములగు హింసలతో వారిని బాధింతురు. ఉద్వేగము కలిగింతురు.

అర్థ లోలుపతా దుఃఖ మితి బుద్ధం చిరాన్మయా,

యద్య దాలంబసే కామ తత్త దేవానురుధ్యసే . 37

ధనము కొరకు వెంపరలాడుటయే దుఃఖమని ఎట్టకేలకు తెలిసికొంటిని. కామమా! నీవు దేని దేనిని పట్టి వ్రేలుదువో నన్ను దానివైపు త్రిప్పుచుందువు.

అతత్త్వజ్ఞోఽ సి బాలశ్చ దుస్తోషోఽపూరణోఽనలః,

నైవ త్వం వేత్థ సులభం నైవ త్వం వేత్థ దుర్లభమ్ . 38

నీవు తత్త్వమెరుగనిదానవు. పసితనమున నున్నదానవు. నిన్ను మెప్పించుట ఎవరికిని సాధ్యము కాదు. నిన్ను నిందింప నలవి కాదు. నీవు నిప్పు వంటిదానవు. ‘చాలు’ననవు. నీవు సులభముగా తెలియరావు. నిన్నెరుగుట అతి కష్టము.

పాతాల ఇవ దుష్పూరో మాం దుఃఖై ర్యోక్తు మిచ్ఛసి,

నాహమద్య సమావేష్టుం శక్యః కామ పున స్త్వయా . 39

పాతాళ మంత లోతుగల నిన్ను నింపుట ఎవ్వరికిని సాధ్యము కాదు. నన్ను దుఃఖములలో ముంప గోరుచున్నావు. ఇప్పుడు నన్ను, కామమా! అట్లు దుః ఖములలో ముంచి యెత్తుట నీచేత కాదు.

నిర్వేద మహ మాసాద్య ద్రవ్యనాశా దృదృచ్ఛయా,

నిర్వృత్తిం పరమాం ప్రాప్య నాద్య కామాన్ విచిన్తయే. 40

అనుకొనకుండ ధనము కోల్పోయిన నేను వైరాగ్యమును చేరుకొని, పరమ సుఖమును పొంది ఇప్పుడిక కామములను గూర్చి తలపోయను.

అతిక్లేశాన్ సహా మీహ నాహం బుద్ధ్యా మ్యబుద్ధిమాన్ ,

నికృతో ధననాశేన శయే సర్వాఙ్గ విజ్వరః . 41

ఇంతకు మునుపు పెక్కు కష్టములను సహించి యుంటిని. బుద్ధిలేనివాడనై తెలివినొందకున్నాను. ధనమునశించుటవలన నిలువెల్ల పైకొన్న జ్వరము పోయిన వాడనై సుఖముగా నిద్రింతును.

పరిత్యజామి కామ త్వాం హిత్వా సర్వమనో గతిః

నత్వం మయా పునః కామ వత్స్యసే న చ రంస్యసే . 42

కామమా! మనస్సు వర్తనల నన్నింటిని ఊడబెఱికి నిన్ను పూర్తిగా వదలివైచితిని. మరల నీవు నాతో కలిసి ఉండవు. ఆడుకొనవు.

క్షమిష్యే క్షిపమాణానాం న హింసిష్యే విహింసతః,

ద్వేష్యయుక్తః ప్రియం వక్ష్యా మ్యనాదృత్య తదప్రియమ్ . 43

నన్ను ధిక్కరించుచున్న వానిని క్షమింతును. నన్ను హింసించుచున్న వానిని హింసింపను. వారు కావించిన అప్రియమును లెక్కగొనక ద్వేషింపదగిన వారితో కూడియుండువాడనై ప్రియమునే పలుకుదును.

తృప్తః స్వస్థేన్ద్రియో నిత్యం యథా లబ్దేన వర్తయన్,

న సకామం కరిష్యామి త్వామహం శత్రు మాత్మనః . 44

తృప్తి కలవాడనై, చక్కగా నిలిచియున్న ఇంద్రియములు గలవాడనై దొరికిన దానితో బ్రదుకుచు ఓ కామమా! నాకు పగవాడవగు నిన్ను కోరిక నెరవేరని దానినిగా చేయిదును.

నిర్వేదం నిర్వృతిం తృప్తిం శాస్త్రం సత్యం దమం క్షమామ్ ,

సర్వభూతదయాం చైవ విద్ధి మాం సముపాగతమ్ . 45

వైరాగ్యము, సుఖము, తృప్తి, శాంతి, సత్యము, దమము, సహనము, సర్వభూతముల యందు దయ అను వానిని పొందినవానినిగా నన్ను తెలిసికొనుము.

తస్మాత్ కామశ్చ లోభశ్చ తృష్ణా కార్పణ్య మేవ చ,

త్యజన్తు మాం ప్రతిష్ఠన్తం సత్త్వస్థో హ్యస్మి సాంప్రతమ్ . 46

అందువలన కామము, లోభము, ఆశ, దీనత, అనునవి మోక్షమునకై బయలుదేరిన నన్ను వదలివైచుగాక! ఇప్పుడు నేను సత్త్వ గుణమున స్థిరముగా నిలిచియుంటిని.

ప్రహాయ కామం లోభం చ సుఖం ప్రాప్తోఽస్మి సాంప్రతమ్ ,

నాద్య లోభవశం ప్రాప్తో దుఃఖం ప్రాప్స్యా మ్యనాత్మవాన్ . 47

కామమును లోభమును వదలివైచి ఇప్పుడు నేను సుఖమును పొందితిని. ఈనాడు లోభమునకు చేజిక్కి ఆత్మహీనుడనై దుఃఖమును పొందను.

యద్య త్త్యజతి కామానాం తత్సుఖస్యాభిపూర్యతే,

కామస్య వశగో నిత్యం దుఃఖమేవ ప్రపద్యతే . 48

నరుడు కామములలో దేనిని దేనిని వదలి వైచునో యదియెల్ల అతనికి సుఖమును నింపును. కామమునకు వశమైన వాడు ఎల్లవేళల దుఃఖమునే పొందును.

కామానుబన్ధం నుదతే యత్కిఞ్చిత్ పురుషో రజః,

కామక్రోధోద్భవం దుఃఖ మహ్రీ రరతి రేవ చ . 49

నరుడు కామముల వెంటనంటు రజస్సును ఏకొంచెమైనను త్రోసివేయనే వలయును. కామక్రోధములవలన దుఃఖము, సిగ్గులేకుండుట, ప్రీతిపుట్టకుండుట అనునవి సిద్ధించును.

ఏష బ్రహ్మప్రతిషోఽహం గ్రీష్మే శీత మివ హ్రదమ్,

శామ్యామి పరినిర్వామి సుఖం మా మేతి కేవలమ్ . 50

మండుటెండలో చల్లని కొలనులో దిగిన వానివలె ఇదిగో నేను బ్రహ్మమునందు స్థిరముగా నిలిచినవాడ నైతిని. శమము పొందితిని. విడివడితిని. కేవలమగు సుఖము నాకు లభించినది.

యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్,

తృష్ణాక్షయసుఖ స్యైతే నార్హతః షోడశీం కలామ్ . 51

లోకమున కామములవలన కలుగు సుఖమును, దేవలోకములలో లభించు దొడ్డ సుఖమును, ఆశ విడనాడుటవలన కలిగెడు సుఖము యొక్క పదునారవ కళకును సాటిరావు.

ఆత్మనా సప్తమం కామం హత్వా శత్రు మివోత్తమమ్,

ప్రాప్యావధ్యం బ్రహ్మపురం రాజేవ స్యామహం సుఖీ . 52

స్థూలదేహముతో పాటు ఏడవదైన కామమును, గొప్పశత్రువును వలె వధించి, వధింపనలవి కాని బ్రహ్మపురమును చేరుకొని నేను రాజువలె సుఖము కలవాడ నగుదును.

ఏతాం బుద్ధిం సమాస్థాయ మఙ్కి ర్నిర్వేద మాగతః,

సర్వాన్ కామాన్ పరిత్యజ్య ప్రాప్య బ్రహ్మ మహత్సుఖమ్ . 53

ఇట్టి బుద్ధిని కుదురుకొల్పుకొని మంకి వైరాగ్యమును పొంది, కామములన్నింటితో తెగతెంపులు చేసికొని బ్రహ్మరూపమగు మహాసుఖమును అందుకొనెను.

దమ్య నాశకృతే మఙ్కి రమృతత్వం కిలాగమత్,

అచ్ఛిన త్కామమూలం స తేన ప్రాప మహత్సుఖమ్ . 54

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
మఙ్కి గీతాయాం సప్తసప్తత్యధికశ తతమోఽధ్యాయః

గిత్తదూడలు నశించిన కారణముగా మంకి అమృతత్వమును చేరుకొనెను. కామము కూకటివ్రేళ్లను కోసివైచెను. దానితో అతడు పరమ సుఖమును పొందెను.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున మంకిగీత గల నూటడెబ్బది యేడవ అధ్యాయము.

మంకివలె వైరాగ్యమునే పొందవలయును. దానిచేతనే యోగక్షేమముల సిద్ధి యగునని దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నారు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

అత్రా ప్యుదాహర న్తీమ మితిహాసం పురాతనమ్,

గీతం విదేహరాజేన జనకేన ప్రశామ్యతా. 1

ఇందును ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని ఉదాహరింతురు. ఇంద్రియముల మిడిసిపాటు లేని విదేహరాజు జనకుడు దీనిని పాడెను.

అనన్త మివ మే విత్తం యస్య మే నాస్తి కిఞ్చన,

మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహతి కిఞ్చన . 2

నాకు అంతులేని ధనమున్నది. అయినను నాది ఏ కొంచెమును లేదు. మిథిల తగులబడి పోవుచుండగా నాకు కాలిపోయినది ఏ కొంచెమును లేదు.

అత్రైవోదాహర న్తీమం బోధ్యస్య పదసఞ్చయమ్,

నిర్వేదం ప్రతివిన్యస్తం తం నిబోధ యుధిష్ఠిర . 3

ఇచటనే బోధ్యుడను వాని పదముల సముదాయమును ఉదాహరింతురు. అందు నిర్వేదము చక్కగా నిలుపబడినది. యుధిష్ఠిరా! దానిని తెలియుము.

బోధ్యం శాన్త మృషిం రాజా నాహుషః పర్యపృచ్ఛతః,

నిర్వేదా చ్ఛాన్తి మాపన్నం శాస్త్రప్రజ్ఞాన తర్పితమ్. 4

వైరాగ్యమువలన శాంతిపొందినవాడు, శాస్త్రములందలి గొప్పజ్ఞానముచేత తృప్తినందినవాడు, శాంతుడునగు బోధ్యుడను ఋషిని నహుషునికుమారుడు ఇట్లు పృచ్ఛచేసెను.

ఉపదేశం మహాప్రాజ్ఞ శమ స్యోపదిశస్వ మే,

కాం బుద్ధిం సమనుధ్యాయ శాన్త శ్చరసి నిర్వృతః. 5

మహా ప్రజ్ఞగల ఓఋషీ ! శాంతిని పొందు విధానమును గూర్చి నాకు ఉపదేశింపుము. నీవు ఏబుద్ధిని స్థిరముగా నిలుపుకొని శాంతుడవు, సుఖము పొందినవాడవు అయి తిరుగుచున్నావు?

బోధ్య ఉవాచ – బోధ్యు డిట్లు పలికెను.

ఉపదేశేన వర్తామి నానుశాస్మీహ కంచన,

లక్షణం తస్య వక్ష్యే ఽహం తత్స్వయం పరిమృశ్యతామ్. 6

నాకెవరో చేసిన ఉపదేశముతో నేను తిరుగుచున్నాను. నేనెవనికి ఉపదేశింపను. ఆఉపదేశము లక్షణమును చెప్పెదను. నీయంత నీవే దానిని పరామర్శించుకొనుము.

పిఙ్గలా కురరః సర్పః సారఙ్గాన్వేషణం వనే,

ఇషుకారః కుమారీ చ షడేతే గురవో మమ 7

పింగళ, లకుముకి పిట్ట, పాము, అడవిలో తిరుగు తుమ్మెద, బాణములు చేయువాడు, కుమారి అను నీ ఆరుగురు నాకు గురువులు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.

ఆశా బలవతీ రాజ న్నైరాశ్యం పరమం సుఖమ్,

ఆశాం నిరాశాం కృత్వా తు సుఖం స్వపితి పిఙ్గలా. 8

రాజా ! యుధిష్ఠిరా! ఆశ పెనుబలము కలది. సుఖము. ఆశను నిరాశచేసికొని పింగళ సుఖముగా నిద్రించును.

సామిషం కురరం దృష్ట్వా వధ్యమానం నిరామిషైః,

ఆమిషస్య పరిత్యాగాత్ కురరః సుఖమేధతే. 9

మాంసపుముక్క నోట కరచుకొన్న లకుముకిని చూచి మాంసము దొరకని పిట్టలు చంపబూనినవి. అది చూచిన ఒక లకుముకి నోటనున్న మాంసమును వదలివైచి సుఖముగా నున్నది.

గృహారంభో హి దుఃఖాయ న సుఖాయ కదాచన,

సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖ మేధతే. 10

ఇల్లు కట్టుకొనుట దుఃఖమునకే యగును. ఎన్నటికిని సుఖమునకు కాదు. పాము, చీమలు పెట్టిన పుట్టను చేరుకొని, సుఖముతో మెలగుచున్నది.

సుఖం జీవన్తి మునయో భైక్ష్యవృత్తిం సమాశ్రితాః,

అద్రోహేణైవ భూతానాం సారఙ్గా ఇవ పక్షిణః. 11

మునులు బిచ్చమెత్తుకొను బ్రదుకుతెరువును ఆశ్రయించి సుఖముగా బ్రదుకుచున్నారు. ఏ ప్రాణులకును కీడు చేయకున్నారు. వారు తుమ్మెదల వంటివారు.

ఇషుకారో నరః కశ్చి దిషా వాసక్త మానసః,

సమీపేనాపి గచ్ఛన్తం రాజానం నావబుద్ధవాన్. 12

ఒకానొక బాణకారుడు (కమ్మరి) బాణమునందే తగులుకొన్న మనస్సు కలవాడై చాల దగ్గరగా పోవుచున్న రాజును కూడ గుర్తింపకుండెను.

బహూనాం కలహో నిత్యం ద్వయోః సంకథనం ధ్రువమ్ ,

ఏకాకీ విచరిష్యామి కుమారీ శంఖకో యథా. 13

ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి బోధ్యగీతాయాం
అష్టసప్తత్యధిక శతతమోఽధ్యాయః

పెక్కండ్రకు తప్పక కయ్యమగును. ఇద్దరైనచో ఉబుసుపోకమాటలు తప్పవు. కావున కుమారి శంఖకము వలె ఒంటరివాడనై మెలగుదును.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున బోధ్యగీతగల
నూటడెబ్బది యెనిమిదవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.

కేన వృత్తేన వృత్తజ్ఞ వీతశోక శ్చరే న్మహీమ్,

కిఞ్చ కుర్వ న్నరో లోకే ప్రాప్నోతి గతి ముత్తరామ్ . 1

తాతా ! నీకు అన్ని విధములైన నడవడులును తెలియును. నరుడు ఏ నడవడితో శోకముపోయినవాడయి భూమిపై తిరుగవలయును? లోకమున నతడు ఏమిచేసి ఉత్తమగతి నందుకొనును?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజగరస్య చ . 2

ఈ విషయమున ఈ ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుచుందురు. ఇది ప్రహ్లాదునకు ఆజగరమునికి నైన సంవాదము.

చరన్తం బ్రాహ్మణం కఞ్చి త్కల్పచిత్త మనామయమ్ ,

పప్రచ్ఛ రాజా ప్రహ్లాదో బుద్ధిమాన్ బుద్ధిసంమతమ్ . 3

చెదరని చిత్తము కలవాడు, ఏమానస వికారములు లేనివాడు బుద్ధి కిష్టమయిన వాడునయి తిరుగుచున్న ఒక బ్రాహ్మణుని బుద్ధిమంతుడగు ప్రహ్లాదమహారాజు ఇట్లు అడిగెను.

ప్రహ్లాద ఉవాచ - ప్రహ్లాదు డిట్లనెను.

స్వస్థః శక్తో మృదు ర్దాన్తో నిర్విధిత్సోఽ నసూయకః,

సువాక్ ప్రగల్భో మేధావీ ప్రాజ్ఞ శ్చరసి బాలవత్ . 4

అలజడిలేనివాడవు, శక్తికలవాడవు, మెత్తనివాడవు, జితేంద్రియుడవు, పనులకై ప్రాకులాడనివాడవు, అసూయ లేనివాడవు, చక్కని వాక్కులు కలవాడవు, ప్రతిభ కలవాడవు, తెలివికలవాడవు, తత్త్వమెరిగినవాడవు నగు నీవు బాలునివలె తిరుగుచున్నావు.

నైవ ప్రార్థయసే లాభం నాలాభేష్వనుశోచసి,

నిత్యతృప్త ఇవ బ్రహ్మ న్న కిఞ్చిదివ మన్యసే. 5

లాభమును కోరవు. నష్టములయందు దుఃఖపడవు. బ్రాహ్మణుడా! నిత్య తృప్తునివలె ఏమియు భావింపవు.

స్రోతసా హ్రియమాణేషు ప్రజాసు విమనా ఇవ,

ధర్మకామార్థ కార్యేషు కూటస్థ ఇవ లక్ష్యసే . 6

ధర్మకామార్థముల కార్యములందు ప్రజలందరు ప్రవాహవేగముతో కొట్టుకొనిపోవుచుండగా మనస్సు లేనివాలె, కూటస్థుని వలె కన్పట్టుచున్నావు.

నానుతిష్ఠసి ధర్మార్థౌన కామే చాపి వర్తసే,

ఇన్ద్రియార్థా ననాదృత్య ముక్త శ్చరసి సాక్షివత్ . 7

ధర్మార్థములను ఆచరింపవు. కామమునందు మెలగవు. ఇంద్రియ విషయములను అనాదరించి ముక్తుడవై సాక్షివలె తిరుగుచున్నావు.

కా ను ప్రజ్ఞా శ్రుతం వా కిం వృత్తిర్వా కాను తే మునే,

క్షిప్ర మాచక్ష్వ మే బ్రహ్మన్ శ్రేయో య దిహ మన్యసే . 8

ఈ నీప్రజ్ఞ ఎట్టిది? నీవు నేర్చిన శాస్త్రమేది? నీ ప్రవృత్తి ఎట్టిది? ఓ మునీ! ఓ బ్రహ్మజ్ఞానీ! నాకేది శ్రేయమో, ఇచట మేలు కోరితివేని, వెనువెంటనే చెప్పుము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అనుయుక్తః స మేధావీ లోకధర్మ విధానవిత్,

ఉవాచ శ్లక్ష్ణయా వాచా ప్రహ్లాద మనపార్థయా . 9

ప్రహ్లాదు డిట్లడుగగా ఆమేధావి, లోకధర్మ విధానమును చక్కగా ఎరిగిన వాడు మెత్తనిది, అపార్థములు లేనిది అగు వాక్కుతో ప్రహ్లాదునితో ఇట్లు పలికెను.

పశ్య ప్రహ్లాద భూతానా ముత్పత్తి మనిమిత్తతః,

హ్రాసం వృద్ధిం వినాశం చ న ప్రహృష్యే న చ వ్యథే . 10

చూడు నాయనా! ప్రహ్లాదా! ప్రాణుల ఉత్పత్తి, తరుగుదల, పెరుగుదల, వినాశము అనునవి అనిమిత్తముగా జరుగుటను గమనింపుము. దానిని గూర్చి నేను ఆనందింపను. వ్యథ చెందను.

స్వభావా దేవ సందృశ్యా వర్తమానాః ప్రవృత్తయః,

స్వభావ నిరతాః సర్వాః పరితుష్యే న్న కేనచిత్. 11

అప్పటి అప్పటి ప్రవృత్తులన్నియు స్వభావమువలననే అగుచున్నవిగా చూడదగినవి. అందువలన ఎవ్వడును దేనిచేతను సంతోషపడరాదు.

పశ్య ప్రహ్లాద సంయోగాన్ విప్రయోగ పరాయణాన్,

సంచయాంశ్చ వినాశాన్తా న్న క్వచి ద్విదధే మనః . 12

ప్రహ్లాదా! కలయికలన్నియు ఎడబాటే తుది గతిగా కలవనియు, కూడబెట్టిన వన్నియు నాశమే ముగింపుగాగలవనియు పరికింపుము. అందువలన నేను ఎందును మనస్సు నిలుపను.

అన్తవన్తి చ భూతాని గుణయుక్తాని పశ్యతః,

ఉత్పత్తినిధనజ్ఞస్య కిం కార్య మవశిష్యతే . 13

ఆయాగుణములతో కూడిన భూతములన్నియు, పరిశీలించువానికి,ఉత్పత్తివినాశములు ఎరిగినవానికి, అంతము కలవియే యగుచున్నవి. ఇంక మిగిలిన కార్యమేమున్నది?

జలజానా మపి హ్యన్తం పర్యాయేణోపలక్షయే,

మహతా మపి కాయానాం సూక్ష్మాణాం చ మహోదధౌ . 14

మహాసముద్రమునందు నీటబుట్టిన గొప్పదేహములకును, సూక్ష్మదేహములకును పర్యాయముగా నాశము కానవచ్చుచున్నది.

జఙ్గమస్థావరాణాం చ భూతానా మసురాధిప,

పార్థివానా మపి వ్యక్తం మృత్యుం పశ్యామి సర్వశః . 15

రాక్షసరాజా! కదలునవి, స్థిరముగా నుండునవి యగు భూతములకు, భూమిపై నుండు వాని కన్నింటికి మృత్యువు తప్పదని నేను అన్నివిధముల చూచుచున్నాను.

అన్తరిక్షచరాణాం చ దానవోత్తమ పక్షిణామ్,

ఉత్తిష్ఠతే యథాకాలం మృత్యు ర్బలవతా మపి . 16

దానవశ్రేష్ఠుడా! ఆకాశమున తిరుగు పక్షులకును, ఎంత బలము కలవానికిని, కాలము ననుసరించి మృత్యువు నిలిచియే యున్నది.

దివి సంచరమాణాని హ్రస్వాని చ మహాన్తి చ,

జ్యోతీంష్యపి యథాకాలం పతమానాని లక్షయే . 17

గగనమున తిరిగెడు నక్షత్రములు, చిన్నవి, పెద్దవి కూడ కాలముననుసరించి రాలిపోవుచుండగా చూచుచున్నాను.

ఇతి భూతాని సంపశ్య న్ననుషక్తాని మృత్యునా,

సర్వసామాన్యగో విద్వాన్ కృతకృత్యః సుఖం స్వపే. 18

ఇట్లు మృత్యువు కోరలలో చిక్కుకొన్న భూతములను పరికించుచు సర్వసామాన్యమును పొందినవాడను, తత్త్వమెరిగినవాడను, అన్నింటిని చక్కబెట్టుకొన్నవాడనునై సుఖముగా నిద్రించుచున్నాను.

సుమహాన్త మపి గ్రాసం గ్రసే లబ్ధం యదృచ్ఛయా,

శయే పున రభుఞ్జానో దివసాని బహూన్యపి . 19

ప్రయత్నములేక సమకూడిన తిండి ఎంత ఎక్కువ అయినను తిందును. పెక్కుదినములు ఏమియు తినకయే పడియుందును.

ఆశయన్త్యపి మా మన్నం పున ర్బహుగుణం బహు,

పున రల్పం పున స్తోకం పున ర్నై వోపపద్యతే . 20

పెక్కుగుణములు గల ఎక్కువ అన్నమును నాకు పెట్టుచుందురు. ఒక్కొక్క మారు కొంచెము, మరియొక మారు చాలకొంచెము అన్నము నిత్తురు. కొన్నియెడల ఏ మాత్రమును దొరకదు.

కణం కదాచిత్ ఖాదామి పిణ్యాకమపి చ గ్రసే,

భక్షయే శాలిమాంసాని భక్షాం శ్చోచ్చావచాన్ పునః . 21

ఒకప్పు డొక మెతుకు మాత్రమే తిందును. మరియొకప్పుడు తెలకపిండి ముక్కను భుజింతును. ఒక్కొక్కప్పుడు మంచి వరిఅన్నమును మాంసములను తినుచుందును. ఇంకొక వేళ మిక్కిలి శ్రేష్ఠములగు గారెలు, బూరెలు మున్నగు వానిని తిందును.

శయే కదాచి త్పర్యఙ్కే భూమా వపి పునఃశయే,

ప్రాసాదే చాపి మే శయ్యా కదాచి దుపపద్యతే . 22

ఒకప్పుడు మేలైన పాన్పుపై పవ్వళింతును. మరల వట్టినేలపై పడుకొందును. ఒక్కొక్కప్పుడు గొప్ప భవనమునందును నాకు శయ్య ఏర్పడును.

ధారయామి చ చీరాణి శాణక్షౌమాజినాని చ,

మహార్హాణి చ వాసాంసి ధారయామ్యహ మేకదా. 23

నారబట్టలను, ముతకబట్టలను, తోళ్లను కూడ కట్టుదును. ఒక్కొక్కప్పుడు మిక్కిలి వెలగల చీనాంబరములను కూడ ధరింతును.

న సన్నిపతితం ధర్మ్య ముపభోగం యదృచ్ఛయా,

ప్రత్యాచక్షే న చాప్యేన మనురుద్ధ్యే సుదుర్లభమ్. 24

ప్రయత్నము లేకయే వచ్చిపడునది, ధర్మమునకు విరుద్ధము కానిది యగు పదార్థమును కాదని త్రోసి వేయను. లభింపని వస్తువు కొరకు వెంపరలాడను.

అచల మనిధనం శివం విశోకం

శుచి మతులం విదుషాం మతే ప్రవిష్టమ్,

అనభిమత మసేవితం విమూఢై

ర్వ్రత మిద మాజగరం శుచి శ్చరామి. 25

సుస్థిరమైనది, నాశనము లేనిది, శుభమైనది, శోకములేనిది, శుద్ధమైనది, సాటిలేనిది, జ్ఞానసంపన్నుల మతమునందు ప్రవేశించినది, ఏ కొంచెము వివేకము లేని వారికి ఇష్టము కానిది, వారు సేవింపనిది అగు ఈ ఆజగరవ్రతమును శుద్ధుడనై ఆచరించు చుందును.

అచలితమతి రచ్యుతః స్వధర్మాత్

పరిమిత సంసరణః పరావరజ్ఞః ,

విగతభయకషాయలోభమోహో

వ్రత మిద మాజగరం శుచి శ్చరామి. 26

పట్టువదలని బుద్ధికలవాడను, నాదగు ధర్మమునుండి జారుపాటులేనివాడను, హద్దు లెరిగిన ప్రవృత్తులు కలవాడను, కడచినదానిని, రానున్నదానిని చక్కగా ఎరిగినవాడను, భయము, రాగద్వేషములు, లోభము, మోహము అనువానిని పోనాడినవాడను, పవిత్రుడను అయి ఈ ఆజగరవ్రతము నాచరించుచుందును.

అనియత ఫలభక్ష్యభోజ్యపేయం

విధిపరిణామ విభక్త దేశకాలమ్ ,

హృదయసుఖ మసేవితం కదర్యై

ర్వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 27

కూడబెట్టబడనిఫలములు, భక్ష్యములు, భోజ్యములు, పానీయములు కలదియు, విధియొక్క పరిణామముచేత ఏర్పరుపబడిన దేశకాలములు కలదియు,హృదయమునకు సుఖమైనదియు, విషయములకై పడిచచ్చువారు సేవింప జాలనిదియు అగు ఈ ఆజగర వ్రతమును పవిత్రుడనై ఆచరింతును.

ఇద మిదమితి తృష్ణయాభిభూతం

జన మనవాప్తధనం విషీదమానమ్,

నిపుణ మనునిశమ్య తత్త్వబుద్ధ్యా

వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 28

నాకిది కావలయును, ఇది కావలయును అని ఆశతో చావు దెబ్బలు తినుచు, ధనమును పొందజాలక క్రుళ్లి క్రుళ్లి ఏడ్చుచున్న జనమును తత్త్వబుద్ధితో నేర్పుతో పరిశీలించి పరిశుద్ధుడనై ఈ ఆజగరవ్రతమును చేయుచుందును.

బహువిధ మనుదృశ్య చార్థహేతోః

కృపణ మిహార్య మనార్య మాశ్రయన్తమ్,

ఉపశమరుచి రాత్మవాన్ ప్రశాన్తో

వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 29

ధనము కొరకు నీచుడు, లోభియునగు స్వామిని అంటిపెట్టుకొన్న పెక్కు విధములగు జనులను పరికించి, వైరాగ్యమునందు రుచి కలవాడనై, మనస్సును జయించిన వాడనై, ప్రశాంతుడనై, శుచినై ఈ ఆజగరవ్రతమును ఆచరించు చున్నాను.

సుఖమసుఖ మలాభ మర్థలాభం

రతి మరతిం మరణం చ జీవితం చ,

విధినియత మవేక్ష్య తత్త్వతోఽహం

వ్రతమిద మాజగరం శుచిశ్చరామి. 30

సుఖము - దుఃఖము, నష్టము - ధనలాభము, ప్రీతి - అప్రీతి, చావు - బ్రదుకు అనునిట్టి వన్నియు విధి, ముందే ఏర్పరచినవి అని తత్వమును బట్టి కనిపట్టిన నేను పరిశుద్ధుడనై ఈ ఆజగరవ్రతమును ఆచరించుచున్నాను.

అపగతభయరాగ మోహదర్పో

ధృతి మతిబుద్ధి సమన్వితః ప్రశాన్తః,

ఉపగత ఫలభోగినో నిశమ్య

వ్రత మిద మాజగరం శుచి శ్చరామి. 31

భయము, రాగము, మోహము, గర్వము అనునవి తొలగిపోగా, ధృతి, మతి, బుద్ధి అనువానితో కూడినవాడనై, ప్రశాంతుడనై, దరికివచ్చిన ఫలమే అనుభవించు సర్పములను గూర్చి చక్కగా విని ఈ ఆజగరవ్రతమును నేను ఆచరించుచున్నాను.

అనియత శయనాసనః ప్రకృత్యా

దమనియమవ్రత సత్యశౌచయుక్తః,

అపగతఫలసంచయః ప్రహృష్టో

వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 32

ప్రత్యేకముగా ఏర్పరచుకొనని శయనము, ఆసనము కలవాడనై, సహజముగా ఏర్పడిన నిగ్రహము, నియమములు, వ్రతములు, సత్యము, పరిశుద్ధత అనువానితో కూడినవాడనై, ఫలములను కూడ బెట్టుపనిని తొలగించుకొన్న వాడనై పరమానందము కలవాడనై ఈ ఆజగరవ్రతము నాచరించుచున్నాను.

అపగత మసుఖార్థ మీహనార్థై

రుపగతబుద్ధి రవేక్ష్య చాత్మసంస్థమ్,

తృషిత మనియతం మనో నియన్తుం

వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 33

కోరికల విషయములచేత దుఃఖము కొరకే ఆత్మకు పెడమొగము వెట్టి యున్నదియు, దప్పిగొన్నట్టిదియు, ఒకతీరు తెన్నులు లేనిదియు నగు మనస్సును, ఆత్మయందే పరిసమాప్తికలదియగునట్లు పట్టి నిలుపుటకై పొందిన వివేకము కలవాడనై ఈ ఆజగరవ్రతమును శుచినై ఆచరించుచున్నాడను.

నహృదయ మనురుధ్య వాఙ్మనో వా

ప్రియసుఖ దుర్లభతా మనిత్యతాం చ,

తదుభయ ముపలక్షయ న్నివాహం

వ్రతమిద మాజగరం శుచి శ్చరామి. 34

హృదయమును, మాటను, మనస్సును లెక్కగొనక ప్రియసుఖములు దుర్లభములగుటను, అనిత్యములగుటను - ఈ రెంటిని గమనించుచున్న వానివలె నేను శుచినై ఈ ఆజగర వ్రతమును ఆచరించుచున్నాను.

బహు కథిత మిదం హి బుద్ధిమద్భిః

కవిభి రపి ప్రథయద్భి రాత్మకీర్తిమ్,

ఇదమిద మితి తత్ర తత్ర హన్త

స్వపరమతై ర్గహనం ప్రతర్కయద్భిః. 35

బుద్ధిమంతులు, మేధావులు, ఆత్మకీర్తిని వెల్లడించుకొనువారునగు పెక్కండ్రు, తమ భావములతో ఇతరుల భావములతో గొప్పగా తర్కించుచున్నవారు ఇది, ఇది అని అందందు దీనిని గూర్చి చెప్పియున్నారు.

తదిద మనునిశమ్య విప్రపాతం

పృథగభిపన్న మహాబుధై ర్మనుష్యైః,

అనవసిత మనన్తదోష పారం

నృషు విహరామి వినీతదోషతృష్ణః. 36

సరియగు జ్ఞానములేని నరులు ఆత్మకంటె వేరుగా తలపోసెడు ఈ జగత్తు మహాఘోరమైన పాతము కలదిగా ఆలోచించి, ఇది అవసానము లేనిదని, నాశము దోషము, పారము లేనిదని నిశ్చయించుకొని దోషములను, దాహములను కట్టడి చేసికొన్న వాడనై నరులయందు తిరుగుచుందును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

అజగరచరితం వ్రతం మహాత్మా

య ఇహ నరోఽనుచరే ద్వినీతరాగః,

అపగతభయలోభమోహ మన్యుః

స ఖలు సుఖీ విచరే దిమం విహారమ్. 37

ఇతి శ్రీమహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి
అజగర ప్రహ్లాద సంవాదే ఏకోనాశీత్యధిక శతతమోఽధ్యాయః

మహాత్ముడు, రాగము మొదలగువానిపై అదుపుకలవాడు, భయము, లోభము, మోహము, కోపము అను వానిని తుడిచివైచినవాడు నగునరుడు ఈ అజగర వ్రతరూపమైన ఆటయందు ప్రవర్తించునేని సుఖవంతుడగును.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున
అజగర ప్రహ్లాద సంవాదముగల నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

“యఃపరస్య న పాపాని చిన్తయత్యాత్మనోయథా

తస్య పాపాగమ స్తాత హేత్వాభావా న్న విద్యతే”

“మన ఏవ మనుష్యాణాం కారణం బన్ధమోక్షయోః

బన్ధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతమ్”.

పఞ్చసప్తత్యధిక శతతమోఽధ్యాయః

175

తండ్రి కొడుకుల సంవాదము

175

షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః

176

శంపాక గీత

176

సప్త సప్తత్యధిక శతతమోఽధ్యాయః

177

మంకి గీత

177

అష్టసప్తధికశతతమోఽధ్యాయః

178

బోధ్య గీత

178

ఏకోనాశీత్యధిక శతతమోఽధ్యాయః

179

అజగరప్రహ్లాదసంవాదః

179

అశీత్యధిక శతతమోఽధ్యాయః

యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.

బాన్ధవాః కర్మ విత్తం వా ప్రజ్ఞా వేహ పితామహ,

నరస్య కా ప్రతిష్ఠా స్యా దేతత్పృష్టో వదస్వ మే. 1

తాతా! చుట్టములా, కర్మమా, ధనమా, ప్రజ్ఞయా, నరునకు ప్రతిష్ఠ కలిగించున దేది? నాకు చెప్పవా.

భీష్మ ఉవాచ - భీష్ముడు ఇట్లు చెప్పెను.

ప్రజ్ఞా ప్రతిష్ఠా భూతానాం ప్రజ్ఞా లాభః పరో మతః,

ప్రజ్ఞా నిఃశ్రేయసీ లోకే ప్రజ్ఞా స్వర్గో మతః సతామ్. 2

ప్రజ్ఞయే ప్రాణులన్నింటికి మూలమైన కుదురు. ప్రజ్ఞయే పరమలాభము. ప్రజ్ఞ లోకమున శ్రేయమును కలిగించునది. ఉత్తములకు ప్రజ్ఞయే స్వర్గము.

ప్రజ్ఞయా ప్రాపితార్థో హి బలి రైశ్వర్యసంక్షయే,

ప్రహ్లాదో నముచి ర్మంకి స్తస్యాః కిం విద్యతే పరమ్. 3

ఐశ్వర్యము అడుగంటినపుడు ప్రజ్ఞ చేతనే బలి, ప్రహ్లాదుడు, నముచి, మంకి అనువారు ఐశ్వర్యమును పొందిరి. దానిని మించినది మరియొకటి యేమున్నది?

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

ఇన్ద్రకాశ్యప సంవాదం తన్నిబోధ యుధిష్ఠిర. 4

ఇందును ప్రాతకాలపు ఇతిహాస మొక దానిని చెప్పుకొనుచుందురు. అది ఇంద్ర కాశ్యప సంవాదము. యుధిష్ఠిరా! దాని నెఱుగుము.

వైశ్యః కశ్చి దృషి సుతం కాశ్యపం సంశితవ్రతమ్,

రథేన పాతయామాస శ్రీమాన్ దృప్త స్తపస్వినమ్. 5

ధనసంపద కలవాడు, పొగరుబోతు అయిన వైశ్యుడొకడు, ఋషికుమారుడు, తపస్వి, వ్రతనిష్ఠ కలవాడునగు కాశ్యపుని రథముతో పడవైచెను.

ఆర్తః స పతితః క్రుద్ధ స్త్యక్త్యా త్మాన మథాబ్రవీత్,

మరిష్యా మ్యధనస్యేహ జీవితార్థో న విద్యతే. 6

ఆ కాశ్యపుడు నేలఁగూలి ఆర్తుడై ధైర్యమును కోల్పోయి కోపము పైకొనగా ఇట్లు పలికెను. నేను చత్తును. ధనము లేనివానికి బ్రదుకువలని ప్రయోజనము లేదు కదా!

తథా ముమూర్షు మాసీన మకూజన్త మచేతసమ్,

ఇన్ద్రః సృగాల రూపేణ బభాషే లుబ్ధ మానసమ్. 7

అట్లు చావగోరి, నోటమాటలేక, మనసు చెదరి కూలబడి యున్న అతని కడకు ఇంద్రుడు నక్క రూపముతో వచ్చి యిట్లు పలికెను.

మనుష్యయోని మిచ్ఛన్తి సర్వభూతాని సర్వశః,

మనుష్యత్వే చ విప్రత్వం సర్వఏవాభినన్దతి. 8

ప్రాణులన్నియు మనుష్యు డగుటను కోరుకొనును. మనుష్యత్వమునందును విప్రత్వమును అందరు మేలందురు.

మనుష్యో బ్రాహ్మణ శ్చాసి శ్రోత్రియశ్చాసి కాశ్యప,

సుదుర్లభ మవాప్యైత న్న దోషాన్మర్తు మర్హసి. 9

మనుష్యుడవు, బ్రాహ్మణుడవు మరియు శ్రోత్రియుడవు. ఇట్టి నీవు కాశ్యపా! మిక్కిలి దుర్లభమైన దీనిని పొంది మూఢత వలన చావరాదు గదా!

సర్వే లాభాః సాభిమానా ఇతి సత్యవతీ శ్రుతిః,

సంతోషణీయరూపోఽసి లోభాద్యదభిమన్యసే. 10

‘లాభములన్నియు అభిమానముతో కూడినవే’ అను వేదవాక్యము సత్యమైనది. సంతోష పెట్టదగిన రూపమును నీవు లోభమువలన అవమానించుచున్నావు.

అహో సిద్ధార్థతా తేషాం యేషాం సన్తీహ పాణయః,

అతీవ స్పృహయే తేషాం యేషాం సన్తీహ పాణయః. 11

ఆహా! చేతులు గలవారి భాగ్యమే భాగ్యము. చేతులు గలవారిని చూచి నేనును అట్లు కావలయునని కోరుకొనుచుందును.

పాణిమద్భ్యః స్పృహాఽస్మాకం యథా తవ ధనస్య వై,

న పాణిలాభా దధికో లాభః కశ్చన విద్యతే. 12

నీకు ధనమందు కోరిక యెట్లో మాకు చేతులు కలవారిని చూచినపుడు చేతులు కావలయునని కోరిక అట్టిదే. చేతులు పొందుట కంటె మించిన లాభము మరియొకటి లేదు.

అపాణిత్వా ద్వయం బ్రహ్మన్ కణ్టకం నోద్ధరామహే,

జన్తూ నుచ్చావచానంగే దశతో న కషామ వా. 13

చేతులు లేని కారణమున, ఓయి బ్రాహ్మణా! మేము ముంటిని తీసివేసి కొనలేము. చిన్న పెద్దజంతువులు మమ్ములను కరచుచుండగా వానిని చంప జాలము.

అథ యేషాం పునః పాణీ దేవదత్తౌ దశాఙ్గుళీ,

ఉద్ధరన్తి కృమీ నఙ్గాద్దశతో నికషన్తి చ. 14

దేవుడిచ్చిన పదివ్రేళ్లు గల రెండు చేతులు గలవారు గ్రుచ్చుకొనుచున్న ముళ్లను దేహమునుండి లాగి వేయగలరు. కరచుచున్న పురుగులను నలిపి వేయుదురు.

వర్షాహిమాతపానాం చ పరిత్రాణాణి కుర్వతే,

చైల మన్నం సుఖం శయ్యాం నివాతం చోపభుఞ్జతే. 15

వాన, మంచు, ఎండ అనువానికి రక్షణలను చేసికొనగలరు. బట్టలను, అన్నమును, పడకల నేర్పరచుకొని సుఖముగా అన్నింటి ననుభవింపగలరు.

అధిష్ఠాయ చ గాం లోకే భుఞ్జతే వాహయన్తి చ,

ఉపాయై ర్బహుభి శ్చైవ వశ్యా నాత్మని కుర్వతే. 16

ఎద్దులు మున్నగు వానినెక్కి లోకమునందలి సుఖముల ననుభవింపగలరు. పెక్కు విధములగు ఉపాయములతో ఎద్దులు మున్నగు వానిని తమ భోగముల కొరకు వశమైన వానినిగా చేసికొందురు.

యేఖల్వజిహ్వాః కృపణా అల్పప్రాణా అపాణయః,

సహన్తే తాని దుఃఖాని దిష్ట్యా త్వం న తథా మునే. 17

నోరులేని, చేతులులేని జాలిగొలుపు నీచజంతువులు ఆ కష్టము లన్నింటిని సహించుచున్నవి. అదృష్టవశమున నీవు అట్టివాడవు కావు.

దిష్ట్యా త్వం న శృగాలో వై న కృమి ర్న చ మూషకః,

న సర్పో నచ మణ్డూకో న చాన్యః పాపయోనిజః. 18

అదృష్టవశమున నీవు నక్కవో, పురుగవో, ఎలుకవో, పామవో, కప్పవో, మరియే యితరమైన పాపపు పుట్టుక కల జంతువవో కాకున్నావు.

ఏతావతాపి లాభేన తోష్టు మర్హసి కాశ్యప,

కింపున ర్యోఽసి సత్త్వానాం సర్వేషాం బ్రాహ్మణోత్తమః. 19

ఈ మాత్రపు లాభముచేత, కాశ్యపా! నీవు సంతోషింప వలయును. అన్ని ప్రాణులలో ఉత్తముడగు బ్రాహ్మణుడవు. ఇంక నేమి కావలయును?

ఇమే మాం కృమయోఽదన్తి యేషా ముద్ధరణాయ వై,

నాస్తి శక్తి రపాణిత్వాత్ పశ్యావస్థా మిమాం మమ. 20

ఈ పురుగులు నన్ను మ్రింగి వేయుచున్నవి. వీనిని పెకలించి వైచుటకు, చేతులులేని కారణమున, నాకు శక్తి లేదు. నాయీ అవస్థను చూడు.

అకార్యమితి చైవేమం నాత్మానం సంత్యజా మ్యహమ్,

నాతః పాపీయసీం యోనిం పతేయ మపరా మితి. 21

ఇది చేయరాని పాడుపని అని శరీరమును విడువజాలకున్నాను. ఇంతకంటెను పాపపు కడుపున పడుదునేమో యనియు నాబెంగ.

మధ్యే వై పాపయోనీనాం శార్గాలీం యా మహం గతః

పాపీయస్యో బహుతరా ఇతోఽ న్యాః పాపయోనయః. 22

పాపపు పుట్టుకలలో నేను పొందిన యీ నక్క జన్మము ఒక మాదిరిది. ఇంతకంటె, కడునీచమైన పుట్టుకలు మరియు పెక్కుకలవు.

జాత్యైవైకే సుఖితరాః సన్త్యన్యే భృశదుఃఖితాః,

నై కాన్తం సుఖ మేవేహ క్వచిత్పశ్యామి కస్యచిత్. 23

కొన్ని ప్రాణులు జాతి మాత్రము చేతనే ఎంతో సుఖముకలవారై యున్నారు. ఇతరులు మిక్కిలి దుఃఖము కలవారగు చున్నారు. ఇందు ఒకే విధమగు సుఖము నెందును, ఎవ్వనికిని, కానకున్నాను.

మనుష్యా హ్యాఢ్యతాం ప్రాప్య రాజ్య మిచ్ఛంత్యనన్తరమ్,

రాజ్యా దేవత్వ మిచ్ఛన్తి దేవతా దిన్ద్రతామపి. 24

మనుష్యులు ముందు గొప్పతనమును పొంది రాజ్యమును కోరుకొందురు. అది దొరికినచో దేవత్వమును వాంఛింతురు. అదియును లభించినచో దేవేంద్ర పదవిని కాంక్షింతురు.

భవేస్త్వం యద్యపి త్వా ఢ్యా న రాజా వచ దైవతమ్,

దేవత్వం ప్రాప్య చేన్ద్రత్వం నైవ తుష్యే స్తథాసతి. 25

నీవు గొప్పవాడవైనను రాజవు, దేవతవు కాజాలవు. ఒకవేళ దేవతవైనను తృప్తి నందజాలవు.

న తృప్తిః ప్రియలాభేఽస్తి తృష్ణా నాద్భ్యః ప్రశామ్యతి,

సంప్రజ్వలతి సా భూయః సమిద్భి రివ పావకః. 26

ప్రియమైనది దొరికిన మాత్రమున తృప్తి కలుగదు. ఆశ నీళ్లతో చల్లారదు. కట్టెలతో అగ్నివలె అది మరింతగా మండుచుండును,

అస్త్యేవ త్వయి శోకోఽపి హర్షశ్చాపి తథా త్వయి,

సుఖదుఃఖే తథా చోభే తత్ర కా పరిదేవనా. 27

నీలో శోకము ఉండనే ఉన్నది. హర్షమును అట్లే యున్నది. అట్లవి రెండును ఉండగా అందు ఏడుపు ఎట్టిది?

పరిచ్ఛిద్యైవ కామానాం సర్వేషాం చైవ కర్మణామ్,

మూలం బుద్ధీన్ద్రియగ్రామం శకున్తా నివ పంజరే 28

న ద్వితీయస్య శిరస శ్ఛేదనం విద్యతే క్వచిత్,

నచ పాణే స్తృతీయస్య యన్నాస్తి న తతో భయమ్. 29

కామములన్నింటికి, కర్మములన్నింటికి మూలమైన బుద్ధిని, ఇంద్రియముల గుంపును, పంజరమున పిట్టలను వలె, పట్టియుంచిన వానికి భయమనునది లేదు. నా రెండవ తల తెగిపోవును, నామూడవచేయి తెగిపడునను భయము ఎట్లు కలుగదో అట్లే యందును భయము కలుగదు.

న ఖల్వప్యరసజ్ఞస్య కామః క్వచన జాయతే,

సంస్పర్శా ద్దర్శనాద్వాపి శ్రవణా ద్వాపి జాయతే. 30

రసమెరుగని వానికి ఎన్నడును కామము కలుగదు కదా! స్పర్శ వలన కానీ, చూచుట వలన కానీ, వినుట వలన గానీ అది కలుగదు.

న త్వం స్మరసి వారుణ్యా లట్వాకానాం చ పక్షిణామ్,

తాభ్యాం చాభ్యధికో భక్ష్యో న కశ్చి ద్విద్యతే క్వచిత్. 31

నీవు కల్లురుచిని, లట్వాకములనెడు పక్షుల మాంసమును స్మరింపవు. వానికంటె మించిన భక్ష్యము మరియొకటి యెందును లభింపదు.

యాని చాన్యాని భూ తేషు భక్ష్యజాతాని కస్యచిత్,

యేషా మభుక్తపూర్వాణి తేషా మస్మృతి రేవ తే. 32

ప్రాణులయందు ఇతరములగు భక్ష్యముల సముదాయములు ఒక్కొక్కనికి ఒక్కొక్క విధముగా నుండును. అవి నీవు మునుపు తిని యుండని కారణముగా నీకు వాని స్మృతి కలుగనే కలుగదు కదా!

అప్రాశన మసంస్పర్శ మసందర్శన మేవ చ,

పురుషస్యైవ నియమో మన్యే శ్రేయో న సంశయః 33

తినకుండుట, తాకకుండుట, చూడకుండుట అను నియమము నరునకు మేలయినది. సంశయము లేదు.

పాణిమన్తో బలవన్తో ధనవన్తో న సంశయః

మనుష్యా మానుషై రేవ దాసత్వ ముపపాదితాః. 34

రెండు చేతులు గలవారే బలవంతులు, వారే ధనవంతులు. సంశయము లేదు. అట్టి మనుష్యులే మనుష్యులను దాసులుగా చేసికొనుచున్నారు.

వధబన్ధ పరిక్లేశైః క్లిశ్యన్తే చ పునః పునః,

తే ఖల్వపి రమన్తే చ మోదన్తే చ హసన్తి చ. 35

చావు దెబ్బలు తినుట, కట్టు బానిసలగుట మొదలగు కష్టములచేత మరల మరల నలగిపోవుచున్నారు. వారే ఒకప్పుడు సంతోషముతో కేరింతలు కొట్టుచు నుందురు.

అపరే బాహుబలినః కృతవిద్యా మనస్వినః,

జుగుప్సితాం చ కృపణాం పాపవృత్తి ముపాసతే. 36

మరికొందరు భుజములబలము కలవారు, విద్యలయందారితేరినవారు, అభిమానవంతులు, ఏవగొలుపు దీనమైన పాపవృత్తిని సేవించుచుందురు.

ఉత్సహన్తే చ తే వృత్తి మన్యా మప్యుప సేవితుమ్,

స్వకర్మణా తు నియతం భవితవ్యం తు తత్తథా. 37

వారు మరియొక వృత్తిని చేపట్టుటకు ఉత్సాహ పడుచుందురు. కాని యిదియంతయు తమకర్మకు కట్టుబడి జరుగవలసినదై జరుగుచుండును.

న పుల్కపో న చాణ్డాల ఆత్మానం త్యక్తు మిచ్ఛతి,

తయా తుష్టః స్వయా యోన్యా మాయాం పశ్యస్వ యాదృశీమ్. 38

పుల్కసుడు కానీ, చండాలుడు కానీ తన పుట్టుకచేతనే తృప్తి పడినవాడై దేహమును విడువనిష్టపడడు. ఈ మాయ యెట్టిదో పరికింపుము.

దృష్ట్వా కుణీన్ పక్షహతాన్ మనుష్యా నామయానినః,

సుసంపూర్ణః స్వయా యోన్యా లబ్దలాభోఽసి కాశ్యప. 39

కుష్ఠురోగము వారిని, పక్షవాతము వచ్చినవారిని, ఇతర రోగములు క్రమ్ము కొనిన వారిని చూచి, నీపుట్టుకతో నిండుగా నున్న నీవు లాభపడినవాడవే కదా! ఓ కాశ్యపా!

యది బ్రాహ్మణ దేహస్తే నిరాతఙ్కో నిరామయః,

అఙ్గాని చ సమగ్రాణి న చ లోకేషు ధిక్కృతః. 40

న కేన చిత్రవాదేన సత్యేనైవాపహారిణా,

ధర్మాయోత్తిష్ఠ విప్రర్షే నాత్మానం త్యక్తు మర్హసి. 41

బ్రాహ్మణా! నీ దేహము ఏ భయము, ఏ రోగము లేనిదైనచో అవయవము లన్నియు నిండుగా నున్నచో, నిన్ను కుంచింపజేయు నిక్కమైన నిందతో లోకము చీకొట్ట కుండునేని ఓ విప్రర్షీ! ధర్మము కొరకు లెమ్ము. దేహమును వదలవలదు.

యది బ్రహ్మన్ శృణోష్యేత చ్ఛ్రద్దధాసి చ మే వచః,

వేదోక్తస్యైవ ధర్మస్య ఫలం ముఖ్య మవాప్స్యసి. 42

బ్రాహ్మణా! ఈ నా మాటను విని, హృదయమున నిలుపు కొందువేని వేదము చెప్పిన ధర్మపు ముఖ్య ఫలమును పొందెదవు.

స్వాధ్యాయ మగ్ని సంస్కార మప్రమ త్తోఽనుపాలయ,

సత్యం దమం చ దానం చ స్పర్ధిష్ఠా మాచ కేనచిత్. 43

వేదపఠనము, అగ్నిసంస్కారము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, దానము అనువానిని మెలకువతో వదలక చేయుచుండుము. ఎవ్వనితోడను పంతము పెట్టుకొనకుము.

యే కేచన స్వధ్యయనాః ప్రాప్తా యజన యాజనమ్,

కథం తే చానుశోచేయు ర్ధ్యాయేయు ర్వా ప్యశోభనమ్. 44

ఇచ్ఛన్తస్తే విహారాయ సుఖం మహ దవాప్నుయుః.

మంచి వేదవిద్యకలవారు, యజ్ఞముచేయుట, చేయించుటలను పొందిన వారును ఎట్లు దుఃఖింతురు? అమంగళములను (చంపుకొనుట వంటి వానిని) ఎట్లు భావింతురు? వారు కోరుకొందురేని ఇచ్చవచ్చిన యజ్ఞములతో విహరించుచు గొప్ప సుఖమును పొందుదురు.

ఉత జాతాః సునక్షత్రే సుతిథౌ సుముహూర్తజాః

యజ్ఞదాన ప్రజేహాయాం యతన్తే శక్తి పూర్వకమ్. 45

మంచి నక్షత్రమునందు, యోగ్యమగుతిధియందు, శుభమైన ముహూర్తమునందు పుట్టిన వారైనచో శక్తి మేరకు యజ్ఞము, దానము సంతానము పొందుట అను పనులయందు ప్రయత్నింతురు.

నక్షత్రే ష్వాసురేష్వన్యే దుస్తిథౌ దుర్ముహూర్తజాః,

సంపతన్త్యాసురీం యోనిం యజ్ఞ ప్రసవ వర్జితాః. 46

రాక్షస నక్షత్రముల యందును, చెడు తిథియందును, చెడ్డ ముహూర్తము నందును పుట్టినవారు పరమ క్రూర లక్షణములు గల జాతుల వారగుదురు. యజ్ఞములు, సంతానము లేనివారగుదురు.

అహ మాసం పణ్డితకో హైతుకో వేదనిన్దకః,

ఆన్వీక్షకీం తర్కవిద్యా మనురక్తో నిరర్థికామ్. 47

నేను కుత్సితుడైన పండితుడను, హేతువాదిని, వేదమును నిందించు వాడను, పనికి మాలిన ఆన్వీక్షకి యగు తర్క విద్యను ప్రేమించువాడను అయి ఉంటిని.

హేతువాదాన్ ప్రవదితా వక్తా సంసత్సు హేతుమత్,

ఆక్రోష్టా చాభివక్తా చ బ్రహ్మ వాక్యేషు చ ద్విజాన్. 48

హేతువాదములను నొక్కి చెప్పుచుండెడివాడను, సాధువుల విషయమునను హేతు పూర్వకముగా వాదించుచుండెడివాడను, వేదవాక్యముల ప్రసంగములలో జ్ఞాన సంపద కలవారిని కారుకూతలు కూయుచు, మేరలు మీరి పలుకుచుండెడి వాడను,

నాస్తికః సర్వశంకీ చ మూర్ఖః పండిత మానికః,

తస్యేయం ఫలనిర్వృత్తిః సృగాలత్వం మమ ద్విజ. 49

నాస్తికుడను, అన్నింటిని శంకించెడి మూర్ఖుడను, నన్ను నేను పండితుడుగా భావించువాడను. అదిగో దాని ఫలముగా నాకీ నక్క పుట్టుక యేర్పడినది.

అపి జాతు తథా తస్మా దహోరాత్ర శతై రపి,

యదహం మానుషీం యోనిం సృగాలః ప్రాప్నుయాం పునః. 50

అట్టి నక్కను నేను కొన్ని వందల దినముల కైనను మరల మనుష్యగర్భమున పుట్టుదునా?

సంతుష్ట శ్చాప్రమత్తశ్చ యజ్ఞదాన తపోరతిః,

జ్ఞేయ జ్ఞాతా భవేయం వై వర్జ్యవర్జయితా తథా. 51

సంతుష్టుడను, ప్రమాదపడనివాడను, యజ్ఞము, దానము, తపస్సు అనువాని యందు ప్రీతి కలవాడను, తెలియదగిన దానిని తెలిసిన వాడను, వదలవలసిన వానిని వదలెడు వాడను కావలయును. (అని నా కోరిక).

తతః స ముని రుత్థాయ కాశ్యప స్తమువాచ హ,

అహో బతాసి కుశలో బుద్ధిమాం శ్చేతి విస్మితః. 52

అంత నాముని కాశ్యపుడు పైకి లేచి ఆహా! నీ వెంత కుశలుడవు! బుద్ధిమంతుడవు! అని ఆశ్చర్యపడి పలికెను.

సమ వైక్షత తం విప్రో జ్ఞానదీర్ఘేణ చక్షుషా,

దదర్శ చైనం దేవానాం దేవ మిన్ద్రం శచీపతిమ్. 53

జ్ఞానము పెల్లుగాగల నేత్రముతో ఆ విప్రుడు ఆతనిని దేవతల దేవుడు, శచీపతి అగు ఇంద్రునిగా తెలిసికొనెను.

తతః సంపూజయామాస కాశ్యపో హరివాహనమ్,

అనుజ్ఞాతస్తు తే నాథ ప్రవివేశ స్వమాలయమ్. 54

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
సృగాలకాశ్యప సంవాదే అశీత్యధికశతతమోఽధ్యాయః

పిదప కాశ్యపుడు ఆ దేవేంద్రుని చక్కగా పూజించెను. ఆత డనుమతింపగా తన యింటిలోనికి ప్రవేశించెను.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమున
సృగాలకాశ్యప సంవాదముగల నూట యెనుబదియవ అధ్యాయము.

180

నక్క, కాశ్యపుడు అనువారి సంవాదము

180