Chapter_181-190_

Back
Book Shanthi Parvam-II
Chapter No 9
Pages 56
Read Time 68 Minutes

Chapter_181-190_

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

యద్యస్తి దత్త మిష్టం వా తప స్తప్తం తథైవ చ,

గురూణాం వాఽపి శుశ్రూషా తన్మే బ్రూహి పితామహ! 1

తాతా! దత్తము, ఇష్టము, తపస్సు, గురుశుశ్రూష అనునవి ఉన్నయెడల వానిని గూర్చి నాకు తెలుపుము.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

ఆత్మ నా నర్థయుక్తేన పాపే నివిశతే మనః,

స్వకర్మకలుషం కృత్వా కృచ్ఛ్రే లోకే విధీయతే. 2

అనర్థములతో కూడిన బుద్ధి మనస్సును పాపమున ముంచివేయును. అప్పుడు నరుడు పాపపు పని చేసి ఘోరమగు నరకమున పడిపోవును.

దుర్భిక్షాదేవ దుర్భిక్షం క్లేశా త్కేశం భయాద్భయమ్,

మృతేభ్యః ప్రమృతం యాన్తి దరిద్రాః పాపకారిణః. 3

పాపములు చేయు దరిద్రులు కరవునుండి కరవునకు, కష్టమునుండి కష్టమునకు, భయమునుండి భయమునకు, చావులనుండి చావులకు పోవుచుందురు.

ఉత్సవా దుత్సవం యాన్తి స్వర్గా త్స్వర్గం సుఖాత్సుఖమ్,

శ్రద్దధానాశ్చ దాన్తాశ్చ ధనాఢ్యాః శుభకారిణః. 4

శుభమైన కర్మములు చేయువారు శ్రద్ధ, నిగ్రహము కలవారై ధనము పెల్లుగా కలవారై ఒక వేడుక నుండి మరొక పండుగకు, స్వర్గమునుండి స్వర్గమునకు, సుఖము నుండి సుఖమునకు ఏగుచుందురు.

వ్యాలకుఞ్జర దుర్గేషు సర్పచోరభయేషు చ,

హస్తావాపేన గచ్ఛన్తి నాస్తికాః కిమతః పరమ్ . 5

నాస్తికులు అడవి యేనుగుల చెరలలో పాముల దొంగలభయము గల తావులలో చేతులకు సంకెళ్లు కలవారై పోవుచుందురు.

ప్రియదేవాతిథేయాశ్చ వదాన్యాః ప్రియసాధవః,

క్షేమ్య మాత్మవతాం మార్గ మాస్థితా హస్తదక్షిణమ్. 6

దేవతలయందు ప్రియభావన కలవారును, అతిథుల యందు హితబుద్ధి కలవారును, దానములు చేయువారును, సాధువులయందిష్టము కలవారును మనస్సును గెలిచిన యోగుల క్షేమమార్గమున, దానము మొదలగు కర్మములచేత అనుకూలమగు మార్గమున నెలకొందురు.

పులాకా ఇవ ధాన్యేషు పుత్తికా ఇవ పక్షిషు,

తద్విధాస్తే మనుష్యాణాం యేషాం ధర్మో న కారణమ్. 7

మనుష్యులలో ఎవరికి ధర్మము కారణము కాదో వారు ధాన్యములయందు పొల్లువంటివారు, పక్షులలో దోమలవంటివారు.

సుశీఘ్ర మపి ధావన్తం విధాన మనుధావతి,

శేతే సహ శయానేన యేన యేన యథాకృతమ్. 8

పూర్వకర్మము మిక్కిలి వడిగా పరువెత్తువాని వెంట పరువెత్తును. పరున్నవానితో పాటు పరుండును. ఏయే పనితో వాడు ప్రవర్తించునో ఆ పనితోడనే అంటిపెట్టి కొని యుండును.

ఉపతిష్ఠతి తిష్ఠన్తం గచ్ఛన్త మనుగచ్ఛతి,

కరోతి కుర్వతః కర్మ చ్ఛాయే వాను విధీయతే. 9

నిలుచున్న వానికడ నిలిచియుండును. పోవువాని వెంటబడిపోవును. కర్మము చేయువాని ననుసరించి చేయుచుండును. నీడవలె వెంటనంటి యుండును.

యేన యేన యథా యద్యత్ పురా కర్మ సమీహితమ్,

తత్త దేకతరో భుఙ్త్కే నిత్యం విహిత మాత్మనా. 10

ఎవ్వడెవ్వడు చేసికొన్న పూర్వ కర్మము ఏది ఏది ఏ విధముగా కలదో దానిని దానిని ఆతడతడు తనకు తానై తప్పనిసరిగా అనుభవించును.

స్వకర్మఫల నిక్షేపం విధాన పరిరక్షితమ్,

భూత గ్రామమిమం కాలః సమన్తా త్పరికర్షతి. 11

తన కర్మఫలము ఒక దాచుకొనిన ముల్లె. అదృష్టము దానిని కాపాడుచుండును. కాలము దానిని భద్రముగా మరల ప్రాణుల సముదాయమునకు చేర్చుచుండును.

అచోద్యమానాని యథా పుష్పాణి చ ఫలాని చ,

స్వం కాలం నాతివర్తన్తే తథా కర్మ పురాకృతమ్. 12

ఎవ్వరును పురికొల్పకయే పూవులు పండ్లు తమ కాలమును మించిపోవక వెలువడునో పూర్వకర్మము కూడ అట్లే కాలమును తప్పింపదు.

సంమాన శ్చావమాన శ్చ లాభాలాభౌ క్షయోదయౌ,

ప్రవృత్తా వినివర్తన్తే విధానాన్తే పునః పునః. 13

సంమానము - అవమానము, లాభము - నష్టము, తరుగుదల - పెరుగుదల అనునవి మరల మరల అదృష్టవశమున ఏర్పడుచుండును, మరలు చుండును.

ఆత్మనా విహితం దుఃఖ మాత్మనా విహితం సుఖమ్,

గర్భశయ్యా ముపాదాయ భుజ్యతే పౌర్వదైహికమ్. 14

పూర్వదేహమున తానే చేసిన కర్మ రూపమున దుఃఖము, సుఖమును తల్లికడుపు అనెడు శయ్యను పట్టుకొని అనుభవమునకు వచ్చును. (కర్మ ఫలము అనుభవమునకు వచ్చుట తల్లి కడుపునందున్నపుడే ప్రారంభమగునని భావము).

బాలో యువా చ వృద్ధశ్చ యత్కరోతి శుభాశుభమ్,

తస్యాం తస్యా మవస్థాయాం తత్ఫలం ప్రతిపద్యతే. 15

బాలుడు, యువకుడు, వృద్ధుడుగా నరుడు ఏయే మంచి చెడు పనులను చేయునో వాని ఫలమును ఆయాదశలలో తిరిగి అనుభవించును.

యధా ధేను సహస్రేషు వత్సో విన్దతి మాతరమ్,

తథా పూర్వకృతం కర్మ కర్తార మనుగచ్ఛతి. 16

వేల కొలది ఆవులలో తన తల్లియేదో గుర్తించి దూడ దానిని చేరు కొనునట్లు, పూర్వ జన్మమున చేసిన కర్మము కర్తను చేరుకొనును.

సమున్న మగ్రతో వస్త్రం పశ్చా చ్ఛుధ్యతి కర్మణా,

ఉపవాసైః ప్రతప్తానాం దీర్ఘం సుఖ మనన్తకమ్. 17

ముందు తడిసిన వస్త్రము ఉదుకుట అను పనితో పిదప శుద్ధినందును. అట్లే విషయములను త్యజించుటలతో పుటము పెట్టబడిన వారికి అంతము లేని దీర్ఘమైన సుఖము కలుగును.

దీర్ఘ కాలేన తపసా సేవితేన తపోవనే,

ధర్మనిర్ధూత పాపానాం సంపద్యన్తే మనోరథాః. 18

తపోవనమున పెద్దకాలము చేసిన తపస్సుచేత కలిగిన ధర్మముచేత తుక్కు దూగరగా కొట్టి వేయబడిన పాపములు కలవారి కోరికలు చక్కగా నెరవేరును.

శకునానా మివాకాశే మత్స్యానా మివ చోదకే,

పదం యథా న దృశ్యేత తథా జ్ఞానవిదాం గతిః. 19

ఆకాశమున పక్షులయు, నీటిలో చేపలయు కాలు (కాలిగుర్తు) కానరాని విధమున జ్ఞాన మెరిగిన వారి గతియు తెలియరాదు.

అల మన్యై రుపాలంభైః కీర్తితైశ్చ వ్యతిక్రమైః,

పేశలం చానురూపం చ కర్తవ్యం హిత మాత్మనః. 20

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
ఏకాశీత్యధిక శతతమోఽధ్యాయః

మరియు ఆక్షేపవాక్యములు, కొనియాడుటలు, అపరాధములు చాలును. నేర్పుతో అనురూపముగా తనకు హితమైన దానిని చేయవలయును.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున
నూటయెనుబది యొకటవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.

కుతః సృష్ట మిదం విశ్వం జగత్ స్థావరజంగమమ్,

ప్రళయే చ క మభ్యేతి తన్మే బ్రూహి పితామహ. 1

తాతా! ఈ సమస్తమగు స్థావర జంగమరూపమైన జగత్తు ఎటనుండి యేర్పడినది? ప్రళయమున దేనిలో చేరుచున్నది? దీనిని నాకు తెలుపుము.

ససాగరః సగగనః సశైలః సబలాహకః,

సభూమిః సాగ్నిపవనో లోకో ఽయం కేన నిర్మితః. 2

సముద్రములతో, ఆకాశముతో, కొండలతో, మేఘములతో, భూమితో, నిప్పుతో, గాలితో కూడిన ఈ లోకము నెవరు నిర్మించిరి?

కథం సృష్టాని భూతాని కథం వర్ణ విభక్తయః,

శౌచాశౌచం కథం తేషాం ధర్మాధర్మవిధిః కథమ్. 3

ఈ భూతములన్నియును ఎట్లు సృజింపబడినవి? దీని వర్ణవిభాగములు ఎట్లు కలిగినవి? శౌచము, అశౌచము వానికెట్లు ఏర్పడినది? ధర్మము, అధర్మము అను తీరు ఎట్లు కలిగినది?

కీదృశో జీవతాం జీవః క్వ వా గచ్ఛన్తి యే మృతాః,

అస్మాల్లోకా దముం లోకం సర్వం శంసతు నో భవాన్. 4

బ్రతికియున్నవారి జీవము ఎట్టిది? అమృతులగు వారెందు బోవుదురు? ఈ లోకమును వదలి ఆ లోకమును పొందుట ఎట్లు జరుగుచున్నది? ఇది యంతయు తాము మాకు దయతో చెప్పవలయును.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

భృగుణాఽభిహితం శాస్త్రం భరద్వాజాయ పృచ్చతే. 5

ఇందును ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుచుందురు. భరద్వాజు డడుగగా భృగువు ఈ శాస్త్రమును వివరించెను.

కైలాసశిఖరే దృష్ట్వా దీప్యమానం మహౌజసమ్,

భృగుం మహర్షి మాసీనం భరద్వాజోఽన్వపృచ్ఛత. 6

గొప్ప తేజస్సుతో వెలుగొందుచు కైలాసశిఖరమున కూర్చున్న మహర్షి భృగువును చూచి భరద్వాజు డిట్లు ప్రశ్న చేసెను.

ససాగరః సగగనః సశైలః సబలాహకః,

సభూమిః సాగ్నిపవనో లోకోఽయం కేన నిర్మితః. 7

సముద్రములు, ఆకాశము, కొండలు, మేఘములు, భూమి, నిప్పు, గాలి అనువానితోడి ఈ లోకము నెవరు నిర్మించిరి?

కథం సృష్టాని భూతాని కథం వర్ణ విభక్తయః,

శౌచాశౌచం కథం తేషాం ధర్మాధర్మ విధిః కథమ్. 8

భూతములు ఎట్లు సృజింపబడినవి? వాని వర్ణముల విభాగము లెట్లు కలిగినవి? వాని శుద్ధి, అశుద్ధు లెట్లేర్పడినవి? ధర్మము, అధర్మముల విధానము ఎట్లు కలిగినది?

కీదృశో జీవతాం జీవః క్వవా గచ్ఛన్తి యేఽమృతాః,

పరలోక మిమం చాపి సర్వం శంసితు మర్హసి. 9

జీవించి యున్నవారి జీవ మెటువంటిది? అమృతులైన వా రెచటి కరుగుదురు? పరలోకమెట్టిది? ఈ లోక మెట్టిది? ఇది యంతయు నాకు తెలియ జెప్పుము.

ఏవం స భగవాన్ పృష్టో భరద్వాజేన సంశయమ్,

బ్రహ్మర్షి ర్బ్రహ్మసంకాశః సర్వం తస్మై తతోఽబ్రవీత్. 10

ఇట్లు భరద్వాజుడు తన సంశయము నడుగగా బ్రహ్మర్షియు బ్రహ్మవంటి వాడును అగు భృగువు అతనికి సర్వము నిట్లు చెప్పెను.

భృగు రువాచ - భృగు విట్లు పలికెను.

మానసో నామ యః పూర్వో విశ్రుతో వై మహర్షిభిః,

అనాదినిధనో దేవ స్తథాఽభేద్యోఽజరామరః. 11

మునుపు మహర్షులకు వినవచ్చిన మానసుడను పేరు గల దేవుడు కలఁడు. అతనికి ఉత్పత్తియు, వినాశమును లేవు. అతని నెవ్వడు భేదింపజాలడు. ముదిమియు, చావును లేనివాడు.

అవ్యక్త ఇతి విఖ్యాతః శాశ్వతోఽథాక్షయోఽవ్యయః,

యతః సృష్టాని భూతాని జాయన్తే చ మ్రియన్తి చ. 12

అవ్యక్తమని ప్రసిద్ధి కలదియు, శాశ్వతము, అక్షయము, అవ్యయమునైనది. దీని నుండియే భూతములన్నియు నేర్పడి పుట్టుచున్నవి, చచ్చుచున్నవి.

సోఽసృజ త్ప్రథమం దేవో మహాన్తం నామ నామతః,

మహాన్ ససర్జాహంకారం స చాపి భగవా నథ. 13

ఆ మానసుడను దేవుడు మొదట మహత్తును సృజించెను. మహత్తు అను భగవంతుడు అహంకారమును సృజించెను.

ఆకాశ మితి విఖ్యాతం సర్వభూత ధరః ప్రభుః,

ఆకాశా దభవద్వారి సలిలా దగ్ని మారుతౌ

అగ్ని మారుత సంయోగా త్తతః సమభవ న్మహీ. 14

సర్వభూతములను ధరించు ప్రభువగు ఆ అహంకారము ఆకాశమని పేరుగన్న దానిని సృజించెను. ఆకాశమునుండి జలము, జలమునుండి అగ్ని వాయువులు, అగ్ని వాయువుల సంయోగమువలన భూమి ఏర్పడెను.

తత స్తేజోమయం దివ్యం పద్మం సృష్టం స్వయంభువా,

తస్మాత్పద్మా త్సమభవ ద్ర్బహ్మ వేదమయో నిధిః. 15

అందునుండి స్వయంభువు తేజోమయము, దివ్యమునగు ఒక పద్మమును సృజించెను. దానినుండి బ్రహ్మ ఏర్పడెను. అతడు వేదమయమైన నిధి.

అహంకార ఇతి ఖ్యాతః సర్వభూతాత్మ భూతకృత్,

బ్రహ్మా వై స మహాతేజా య ఏతే పఞ్చ ధాతవః. 16

సర్వ భూతములు శరీరముగా కలిగి సర్వ భూతములను సృజించు అహంకారమను ప్రసిద్ధిగల తత్త్వము. మరియు ఈ అయిదు ధాతువులును మహాతేజస్సుగల ఆ బ్రహ్మయే.

శైలా స్తస్యార్థి సంజ్ఞాస్తు మేదో మాంసం చ మేదినీ,

సముద్రా స్తస్య రుధిర మాకాశ ముదరం తథా. 17

ఆ అహంకార రూప బ్రహ్మకు కొండలు ఎముకలు భూమి మేదస్సు మాంసము, సముద్రము నెత్తురు, ఆకాశము కడుపు.

పవన శ్చైవ నిఃశ్వాస స్తేజోఽగ్ని ర్నిమ్నగాః శిరాః,

అగ్నీషోమౌతు చన్ద్రార్కౌ నయనే తస్య విశ్రుతే. 18

గాలి ఆతని నిట్టూర్పు, అగ్ని తేజస్సు, నదులు శిరలు. అగ్ని, సోముడు అను దేవతలుగా పిలువబడు సూర్యచంద్రులు అతని కన్నులు.

నభశ్చోర్ధ్వం శిర స్తస్య క్షితిః పాదౌ భుజౌ దిశః,

దుర్విజ్ఞేయో హ్యచిన్త్యాత్మా సిద్ధైరపి న సంశయః. 19

పైనున్న ఆకాశమతని తల. నేల పాదములు, చేతులు దిక్కులు. ఇట్లతడు సిద్ధులకు తెలియనలవికాని వాడు. ఊహింపనలవి కాని ఆత్మ కలవాడు. సంశయము లేదు.

స ఏవ భగవాన్ విష్ణు రనన్త ఇతి విశ్రుతః,

సర్వభూతాత్మ భూతస్థో దుర్విజ్ఞేయో ఽకృతాత్మభిః. 20

ఆ భగవంతుడే విష్ణువు, అనంతుడు అని ప్రసిద్ధి కెక్కెను. అతడు సర్వ భూతములకు ఆత్మవంటి దానియందు అహంకారము నందున్నవాడు. ఆత్మతత్త్వ మెరుగని వారికి తెలియనలవి కాని వాడు.

అహంకారస్య యః స్రష్టా సర్వభూత భవాయ వై,

యతః సమభవ ద్విశ్వం పృష్టో ఽహం యదిహ త్వయా. 21

సర్వభూతముల ఉత్పత్తికొరకు అహంకారమును సృజించిన వానినుండియే ఈ విశ్వమంతయు ఏర్పడినది. నన్ను సృష్టిని గూర్చి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పితిని.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

గగనస్య దిశాం చైవ భూతలస్యా నిలస్య వా,

కాన్యత్ర పరిమాణాని సంశయం ఛిన్ది తత్త్వతః. 22

ఆకాశము, దిక్కులు, భూతలము, గాలి అనువాని పరిమాణములు ఏవి? ఉన్నదున్నట్లు చెప్పి నా సంశయమును పోగొట్టుము.

భృగు రువాచ - భృగు విట్లు పలికెను

అనన్త మేత దాకాశం సిద్ధదైవత సేవితమ్,

రమ్యం నానాశ్రయాకీర్ణం యస్యాన్తో నాధిగమ్యతే. 23

సిద్ధులు, దేవతలు సేవించు ఈ ఆకాశము అనంతము. రమ్యము. ఎన్నింటికో ఆశ్రయమై వ్యాపించి యున్నట్టిది. దీని అంతము తెలియరాదు.

ఊర్ధ్వం గతే రధస్తాత్తు చన్ద్రా దిత్యౌ న దృశ్యతః,

తత్ర దేవాః స్వయం దీప్తా భాస్వరాభాగ్ని వర్చసః. 24

సూర్యరశ్మి గతికి పై భాగమునను, క్రింది భాగమునను చంద్రాదిత్యులు కానరాకున్న అచట దేవతలు తమంతతాము ప్రకాశించుచు, గొప్ప వెలుగులు చిమ్ము అగ్నివంటి తేజస్సు గల వారై యున్నారు.

తే చాప్యన్తం న పశ్యన్తి నభసః ప్రథితౌజసః,

దుర్గమత్వా దనన్తత్వా దితి మే విద్ధి మానద. 25

అట్టి గొప్ప శక్తి గల దేవతలు కూడ ఆకాశము అంతమును, పోనలవి కాని కారణమునను, అనంతమగుటవలనను, చూడజాలకున్నారు.

ఉపరిష్టోపరిష్టాత్తు ప్రజ్వలద్భిః స్వయంప్రభైః,

నిరుద్ధ మేత దాకాశ మప్రమేయం సురైరపి. 26

పైకి, పైకి, తమకాంతులతో వెలుగొందుచున్న దేవతలు కూడ ఈ ఆకాశమును నిలువరించి కొలతలను తెలియజాలకున్నారు.

పృధివ్యన్తే సముద్రాస్తు సముద్రాన్తే తమః స్మృతమ్,

తమసోఽన్తే జలం ప్రాహు ర్జలస్యాన్తేఽగ్ని రేవ చ. 27

భూమికొసను సముద్రములు కలవు. సముద్రముల చివర తమస్సు కలదు. దాని అంతమున జలము కలదు. జలము చివర అగ్నియే కలదు.

రసాతలాన్తే సలిలం జలాన్తే పన్నగాధిపాః,

తదన్తే పునరాకాశ మాకాశాన్తే పునర్జలమ్. 28

రసాతలము చివర జలము, దాని చివర సర్పములు, వాని చివర మరల ఆకాశము, ఆకాశము తుదిని మరల నీరు కలదు.

ఏవ మన్తం భగవతః ప్రమాణం సలిలస్య చ,

అగ్ని మారుతతోయేభ్యో దుర్ఙ్ఞేయం దైవతై రపి. 29

ఇట్లు భగవత్స్వరూపమైన జలమునకు అంతమును, కొలతయు లేవు. అగ్ని, వాయువు, జలముల ఆ అంతమును దేవతలు కూడ తెలిసి కొనజాలరు.

అగ్ని మారుతతోయానాం వర్ణాః క్షితితలస్య చ,

ఆకాశా దవగృహ్యన్తే భిద్యన్తే తత్త్వ దర్శనాత్. 30

అగ్ని, వాయువు, నీరు అనువాని వర్ణములు, భూమి వర్ణము ఆకాశమునుండి తీసికొనబడినవి. తత్త్వదర్శనమువలన వేరగుచున్నవి.

పఠన్తి చైవ మునయః శాస్త్రేషు వివిధేషు చ,

త్రైలోక్య సాగరే చైవ ప్రమాణం విహితం యథా.

అదృశ్యాయ త్వగమ్యాయ కః ప్రమాణ ముదాహరేత్, 31

వేర్వేరు శాస్త్రములలో మునులు మూడు లోకములనెడు సాగరమున కొలతలను చదువుచున్నారు. కానరానిది, చేరరానిది అగు దానికి కొలత నెవడు చెప్పగలడు?

సిద్ధానాం దేవతానాం చ యదా పరిమితా గతిః. 32

తదా గౌణ మనన్తస్య నామానంతేతి విశ్రుతమ్,

నామధేయానురూపస్య మానసస్య మహాత్మనః, 33

సిద్ధులకును దేవతలకును కూడ పరిమితమైన గతియే కలదు. కాని అనంతుడు మహాత్ముడునగు మానసుని గుణమును బట్టియే ఆతనికి అనంతుడను నామము పేరునకు తగినట్లుగా ప్రసిద్ధి కెక్కినది.

యదా తు దివ్యం యద్రూపం హ్రసతే వర్ధతే పునః,

కోఽ న్యస్తద్వేదితుం శక్యో యోఽపి స్యాత్తద్విదోఽపరః 34

ఆతని దివ్యమైన ఆ రూపము తగ్గును, హెచ్చును. అతని వంటి వాడే మరియొకడు ఉన్న గాని అతనిని గూర్చి తెలియగల వాడెవ్వడు?

తతః పుష్కరతః సృష్టః సర్వజ్ఞో మూర్తిమాన్ ప్రభుః,

బ్రహ్మా ధర్మమయః పూర్ణః ప్రజాపతి రనుత్తమః. 35

అటుపై ఆపద్మమునుండి సృజింపబడిన బ్రహ్మ సర్వజ్ఞుడు, మూర్తిమంతుడు, ధర్మమయుడు, పూర్ణుడు, ప్రభువు, సర్వోత్తముడు అయిన ప్రజాపతి ఆయెను.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

పుష్కరా ద్యది సంభూతో జ్యేష్ఠం భవతి పుష్కరమ్,

బ్రహ్మాణం పూర్వజం చాహ భవాన్ సందేహ ఏవ మే. 36

బ్రహ్మ పద్మమునుండి పుట్టినచో పద్మము అతని కంటె జ్యేష్ఠము. మఱి బ్రహ్మను నీవు ముందు పుట్టిన వాడు అంటివి. ఇది నా సందేహము.

భృగు రువాచ - భృగు విట్లనెను.

మానసస్యేహ యా మూర్తి ర్బ్రహ్మత్వం సముపాగతా,

తస్యాసన విధానార్థం పృథివీ పద్మ ముచ్యతే. 37

మానసుని ఆమూర్తియే బ్రహ్మగా నయినది. ఆతనికి ఆసనముగా నుండుటకొరకు భూమినే పద్మము అనుచున్నాము.

కర్ణికాంతస్య పద్మస్య మేరు ర్గగన ముచ్ఛ్రితః,

తస్య మధ్యే స్థితో లోకాన్ సృజతే జగతః ప్రభుః. 38

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
భృగు భరద్వాజ సంవాదే ద్వ్యశీత్యధిక శతతమోఽధ్యాయః.

ఆ పద్మపు దుద్దు (నడిమి భాగమును) ఆకాశమునంటిన మేరుపర్వతము. దాని నడుమ నుండి జగత్ప్రభువు లోకములను సృజించుచున్నాడు.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మ పర్వమున భృగుభరద్వాజ
సంవాదము గల నూట యెనుబది రెండవ అధ్యాయము.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

ప్రజా విసర్గం వివిధం కథం స సృజతే ప్రభుః,

మేరుమధ్యే స్థితో బ్రహ్మా తద్ర్బూహి ద్విజసత్తమ. 1

మేరుమధ్యమున నున్న బ్రహ్మ పెక్కుతీరులు గల ప్రజల సృష్టిని ఎట్లు చేసెను? బ్రాహ్మణోత్తమా! దానిని నాకు తెలియజెప్పుము.

భృగు రువాచ - భృగు విట్లనెను.

ప్రజావిసర్గం వివిధం మానసో మనసాఽసృజత్,

సంరక్షణార్థం భూతానాం సృష్టం ప్రథమతో జలమ్. 2

మానసుడు ప్రజల వివిధమైన సృష్టిని మనస్సుతో చేసెను. భూతముల సంరక్షణ కొరకు మొట్టమొదట జలమును సృష్టించెను.

యత్ప్రాణః సర్వభూతానాం వర్ధన్తే యేన చ ప్రజాః,

పరిత్యక్తాశ్చ నశ్యన్తి తేనేదం సర్వ మావృతమ్. 3

ఏది సర్వభూతములకు ప్రాణమో, దేనితో ప్రజలు వృద్ధి పొందుచున్నారో, ఏది వదలివైచినచో నశించుచున్నారో దానితో ఇదియంతయు ఆవృతమై యున్నది.

పృథివీ పర్వతా మేఘా మూర్తిమన్తశ్చ యే పరే,

సర్వం తద్వారుణం జ్ఞేయ మాప స్తస్తంభిరే యతః. 4

భూమి, పర్వతములు, మేఘములు - ఇంకను ఆకారముగల యితరములు - ఇవియన్నియు వారుణమే అని తెలియదగును. నీరు ముద్దకట్టగా నివి యన్నియు నేర్పడినవి.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు పలికెను.

కథం సలిల ముత్పన్నం కథం చైవాగ్ని మారుతౌ,

కథం వా మేదినీ సృష్టేత్యత్ర మే సంశయో మహాన్ . 5

జలమెట్లు ఏర్పడినది? అగ్ని వాయువులు ఎట్లు రూపొందినవి? భూమి ఏ విధముగా సృజింపబడినది? ఇందు నాకు పెద్ద సంశయము కలదు.

భృగు రువాచ - భృగు విట్లనెను.

బ్రహ్మకల్పే పురా బ్రహ్మన్ బ్రహ్మర్షీణాం సమాగమే,

లోకసంభవసందేహః సముత్పన్నో మహాత్మనామ్. 6

మునుపటి బ్రహ్మకల్పమున, ఓ బ్రాహ్మణా! బ్రహ్మర్షుల సమావేశమున మహాత్ములకు లోకము పుట్టిన దానిని గూర్చిన సందేహము కలిగెను.

తే ఽ తిష్ఠన్ ధ్యాన మాలమ్యృ మౌన మాస్థాయ నిశ్చలాః,

త్యక్తాహారాః పవనపా దివ్యం వర్షశతం ద్విజాః . 7

వారు ధ్యానము నవలంబించి మౌనమును నిలుపుకొని, కదలిక లేనివారు, ఆహారమును వదలినవారు, గాలిని మాత్రమే తీసికొనువారునై నూరుదేవ వత్సరములు నిలిచియుండిరి.

తేషాం బ్రహ్మమయీ వాణీ సర్వేషాం శ్రోత్ర మాగమత్,

దివ్యా సరస్వతీ తత్ర సంబభూవ నభ స్తలాత్. 8

వారందరికి బ్రహ్మమయి యగు వాక్కు చెవులబడెను. దివ్యమగు సరస్వతి ఆకాశతలము నుండి వెలువడెను.

పురా స్తిమిత మాకాశ మనంత మచలోపమమ్,

నష్టచన్ద్రార్కపవనం ప్రసుప్త మివ సంబభౌ. 9

మునుపు అనంతమైన ఆకాశము, పర్వతము వంటిదై చంద్రుడు, సూర్యుడు, వాయువు లేనిదై స్తిమితమై గాఢనిద్ర పొందినది వలె కన్పట్టుచుండెడిది.

తతః సలిల ముత్పన్నం తమసీవాపరం తమః,

తస్మాచ్చ సలిలోత్పీడా దుదతిష్ఠత మారుతః. 10

అంత జలము పుట్టినది. అది చీకటిలో మరియొక చీకటి వంటిది. ఆ సలిలము ఒత్తిడికి వాయువు పైకి వెలువడినది.

యథా భాజన మచ్ఛిద్రం నిఃశబ్ద మివ లక్ష్యతే,

తచ్చాంభసా పూర్యమాణం సశబ్దం కురుతేఽనిలః. 11

చిల్లులు లేని పాత్ర నిశ్శబ్దముగా కన్పట్టును. దానిని నీటితో నింపుచుండగా గాలి దానిని శబ్దము కలదిగా చేయును.

యథా సలిల సంరుద్ధే నభసో ఽనిరన్తరే, 12

భిత్వా ఽర్ణవతలం వాయుః సముత్పతతి ఘోషవాన్.

అవకాశములేని ఆకాశములో నీరు అడ్డుకొనగా వాయువు నీటి పైభాగమును చీల్చుకొని పెద్ద ధ్వని కలదియై వెలుపలికి వచ్చిపడును.

స ఏష చరతే వాయు రర్ణవోత్పీడ సంభవః,

ఆకాశస్థాన మాసాద్య ప్రశాన్తిం నాధిగచ్ఛతి. 13

అట్లు నీటి ఒత్తిడివలన పుట్టిన వాయువు అటునిటు తిరుగుచు ఆకాశస్థానమును పొందియు ప్రశాంత స్థితిని పొందకుండును.

తస్మిన్ వాయ్వంబు సంఘర్షే దీప్తతేజా మహాబలః,

ప్రాదురభూ దూర్వశిఖః కృత్వా నిస్తిమరం నభః. 14

ఆ వాయుజలముల సంఘర్షమునందు గొప్పకాంతులు, గొప్పబలము, పై వైపు శిఖలు గల అగ్ని, ఆకాశమును చీకటి లేనిదిగా చేయుచు, ఆవిర్భవించెను.

అగ్నిః పవన సంయుక్తః ఖం సమాక్షిపతే జలమ్,

సోఽగ్ని ర్మారుత సంయోగా ద్ఘనత్వ ముపపద్యతే. 15

అగ్ని గాలితో కలిసి నీటిని ఆకాశమునకు వడితో విరజిమ్మెను. ఆ అగ్ని వాయు సంయోగమువలన ఘనపదార్థముగా నయ్యెను.

తస్యాకాశం నిపతితః స్నేహ స్తిష్ఠతి యోఽపరః,

స సంఘాతత్వ మాపన్నో భూమిత్వ మనుగచ్ఛతి. 16

ఆ వాయువుతో కూడిన అగ్నియందు ఆకాశ మధ్యమున నేర్పడిన జిడ్డు మరియొక స్వరూపము కలది ఆయెను. ఆ మూడింటి సముదాయరూపమే భూమిగా నయ్యెను.

రసానాం సర్వగన్ధానాం స్నేహానాం ప్రాణినాం తథా,

భూమి ర్యోని రిహ జ్ఞేయా యస్యాం సర్వం ప్రసూయతే. 17

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి భృగుభరద్వాజ సంవాదే మానస
భూతోత్పత్తి కథనే త్ర్యశీత్యధిక శతతమోఽధ్యాయః

ఇట్లేర్పడిన యీ భూమి అన్ని రసములకు, అన్ని గంధములకు, అన్ని ద్రవ పదార్థములకు, అన్ని ప్రాణులకు పుట్టుక స్థానమాయెను. దాని నుండియే సర్వము ఏర్పడెను.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమువ భృగు భరద్వాజ సంవాదమున మానస భూతోత్పత్తి కథనముగల
నూట యెనుబది మూడవ అధ్యాయము.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

త ఏతే ధాతవః పఞ్చ బ్రహ్మ యా నసృజ త్పురా,

ఆవృతా యై రిమే లోకా మహాభూతాభిసంజ్ఞితా: 1

యదాఽసృజత్సహస్రాణి భూతానాం చ మహామతిః

పఞ్చానా మేవ భూతత్వం కథం సముపపద్యతే. 2

పూర్వము బ్రహ్మ అయిదు భూతములను సృజించెను. అవి ఈ లోకములన్నింటిని ఆవరించి యుండెను. వానికి మహాభూతములని పేరు. ఆ మహామతి వేలకొలది భూతములను సృజించి యుండగా ఈ అయిదింటినే భూతము లనుట యెట్లు కుదరును?

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

అమితానాం మహాశబ్దో యాన్తి భూతాని సంభవమ్,

తత స్తేషాం మహాభూత శబ్దోఽయ ముపపద్యతే. 3

అమితమైన వానికే మహా శబ్దము కలుగును. ఏవి యేర్పడినవో అవి భూతములు మాత్రమే. కావున అమితములైన వానికి మహాభూత మను సంజ్ఞ కుదురుచున్నది.

చేష్టా వాయుః ఖ మాకాశ మూష్మాగ్నిః సలిలం ద్రవః,

పృథివీ చాత్ర సంఘాతః శరీరం పాఞ్చభౌతికమ్. 4

చేష్ట వాయువు, రంధ్రము ఆకాశము, వేడి అగ్ని, ద్రవము నీరు, సముదాయము ఇందు భూమి - ఇట్లు శరీరము అయిదు భూతములతో ఏర్పడినదై పాంచభౌతిక మగుచున్నది.

ఇత్యేతైః పఞ్చభి ర్భూతై ర్యుక్తం స్థావరజఙ్గమమ్,

శ్రోత్రం ఘ్రాణం రసః స్పర్శో దృష్టి శ్చేన్ద్రియసంజ్ఞితాః. 5

ఈ అయిదు భూతములతో కూడినది ఈ స్థావర జంగమాత్మక ప్రపంచము. చెవి, ముక్కు, నాలుక, చర్మము, కన్ను అనునవి ఇంద్రియమను పేరు కలిగినట్టివి.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు పలికెను.

పఞ్చభి ర్యది భూతైస్తు యుక్తాః స్థావరజఙ్గమాః,

స్థావరాణాం న దృశ్యన్తేశరీరే పఞ్చ ధాతవః. 6

స్థావరములు (కదలకుండునది) జంగమములును (కదలునవి) ఈ అయిదు భూతములతో కూడియుండునవైనచో స్థావరముల శరీరమునందు అయిదు ధాతువులును కానవచ్చుట లేదే!

అనూష్మణా మచేష్టానాం ఘనానాం చైవ తత్త్వతః,

వృక్షాణాం నోపలభ్యన్తే శరీరే పఞ్చధాతవః. 7

స్వరూపమును బట్టి ఘనములు (ద్రవములు కానివి) అయినను, వేడియు, చేష్టలును లేని చెట్ల శరీరమునందు అయిదు ధాతువులు కానరావు కదా!

న శృణ్వన్తి న పశ్యన్తి నగన్ధ రసవేదినః,

నచ స్పర్శం విజానన్తి తే కథం పాఞ్చభౌతికాః. 8

చెట్లు వినవు, చూడవు, గంధమును రసమును తెలిసి కొనజాలవు. స్పర్శను తెలియవు. అవి పాంచభౌతికము లెట్లగును?

అద్రవత్వా దనగ్నిత్వా దభూమిత్వా దవాయుతః,

ఆకాశ స్యాప్రమేయత్వా ద్వృక్షాణాం నాస్తి భౌతికమ్. 9

ద్రవత్వము లేదు, అగ్నిత్వము లేదు, భూమితనము లేదు, వాయువుతనము లేదు, ఆకాశము అప్రమేయము అగుటవలన వృక్షములకు భూతమయత్వము లేదు.

భృగు రువాచ - భృగు విట్లనెను.

ఘనానా మపి వృక్షాణా మాకాశోఽస్తి న సంశయః,

తేషాం పుష్ప ఫలవ్యక్తి ర్నిత్యం సముపపద్యతే. 10

వృక్షములు ఘన పదార్థ జాతికి చెందిన వనుట నిజమే. వానికి ఆకాశము కలదు. సంశయము లేదు. పుష్పములు, ఫలములు నిత్యము వానినుండి వెలువడు చుండుట ఉన్నదియే కదా!

ఊష్మతో మ్లాయతే వర్ణం త్వక్ ఫలం పుష్ప మేవ చ

మ్లాయతే శీర్యతే చాపి స్పర్శ స్తేనాత్ర విద్యతే. 11

వేడివలన చెట్టురంగు వాడిపోవుచున్నది. చర్మము, ఫలము, పుష్పము కూడ వాడుచున్నది. నశించు చున్నది. కావున అందు స్పర్శయు కలదు.

వాయ్వగ్న్యశనినిర్ఘో షైః ఫలం పుష్పం విశీర్యతే,

శ్రోత్రేణ గృహ్యతే శబ్ద స్తస్మాచ్ఛృణ్వన్తి పాదపాః. 12

వాయువు, అగ్ని, పిడుగు అనువాని ఘోషముల చేత చెట్లనుండి ఫలములు, పూవులు రాలిపోవుచున్నవి. శబ్దమును గ్రహించునది చెవి కదా! కావున నిట్లు చెట్లు కూడ వినుచున్నవి.

వల్లీ వేష్టయతే వృక్షం సర్వత శ్పైవ గచ్ఛతి,

న హ్యదృష్టేశ్చ మార్గోఽస్తి తస్మాత్ పశ్యన్తి పాదపాః. 13

తీగె చెట్టును చుట్టుకొనుచున్నది. అన్ని వైపులకు పోవుచున్నది. చూపు లేనిదానికి దారియుండదు కదా! అందువలన చెట్లు చూచుచున్నవి. (అనగా వానికి చక్షురింద్రియము కలదని తెలియుచున్నది.)

పుణ్యాపుణ్యై స్తథా గన్ధై ర్ధూపైశ్చ వివిధై రపి,

అరోగాః పుష్పితాః సన్తి తస్మాజ్ఞిఘ్రన్తి పాదపాః. 14

మంచిచెడు వాసనలచేతను, వివిధములైన ధూపములచేతను చెట్లు రోగములేనిపై పుష్పించుచున్నవి. అందువలన చెట్లు వాసన చూడగలిగినట్టివి.

పాదైః సలిలపానాచ్చ వ్యాధీనాం చాపి దర్శనాత్,

వ్యాధిప్రతిక్రియత్వాచ్చ విద్యతే రసనం ద్రుమే. 15

వ్రేళ్లతో నీటిని త్రావుచుండుటవలనను, వ్యాధులు కానవచ్చుచుండుటవలనను, వ్యాధులకు చికిత్సలుండుటవలనను చెట్టునందు రసనేంద్రియము (నాలుక) కలదని తెలియుచున్నది.

వక్త్రేణోత్సలనాళేన యథోర్ధ్వం జల మాదదేత్,

తథా పవనసంయుక్తః పాదైః పిబతి పాదపః. 16

కలువతూడుతో ముఖముతో మనుజుడు జలమును లోనికి పీల్చుకొనుచున్నాడు. అట్లే గాలితో కూడినదై వృక్షము పాదములతో (వ్రేళ్లతో) నీటిని త్రావుచున్నది.

సుఖదుఃఖయోశ్చ గ్రహణా చ్ఛిన్నస్య చ విరోహణాత్,

జీవం పశ్యామి వృక్షాణా మచైతన్యం న విద్యతే. 17

చెట్లు సుఖదుఃఖములను గ్రహించుచున్నవి. నరికివేయగా మరల మొలచుచున్నవి. అందువలన చెట్లలో జీవమును చూచుచున్నాను. వానియందు అచేతనత కానరాదు.

తేన తజ్జల మాదత్తం జరయత్యగ్ని మారుతౌ,

ఆహారపరిణామాచ్చ స్నేహో వృద్ధిశ్చ జాయతే. 18

చెట్టు జలమును తీసికొనుచున్నది. అగ్నివాయువులు దానికి ముదిమిని తెచ్చుచున్నవి. ఆహారపు మార్పువలన స్నేహము వృద్ధియు కలుగుచున్నవి. (స్నేహమనగా జిడ్డుగల ద్రవ్యము.)

జఙ్గమానాం చ సర్వేషాం శరీరే పఞ్చ ధాతవః,

ప్రత్యేకశః ప్రభిద్యన్తే యైః శరీరం విచేష్టతే. 19

జంగమములన్నింటి శరీరమునందును వేరువేరుగా అయిదుధాతువులు భిన్నమైన స్థితులు కలవిగా నున్నవి. వానితో శరీరము కదలుచున్నది.

త్వక్ చ మాంసం తథాస్థీని మజ్జా స్నాయుశ్చ పఞ్చమమ్,

ఇత్యేత దిహ సంఘాతం శరీరే పృథివీమయమ్. 20

చర్మము, మాంసము, ఎముకలు, మజ్జ, అయిదవది యగు స్నాయువు - ఈ సముదాయము శరీరమున పృథివీమయము (భూమితత్వముతో నిండినది).

తేజో హ్యగ్ని స్తథా క్రోధ శ్చక్షు రూష్మా తథైవ చ,

అగ్ని ర్జరయతే యచ్చ పఞ్చాగ్నేయాః శరీరిణః. 21

దేహములోపలి అగ్ని, క్రోధము, కన్ను, వేడి, దేహమును కృశింపజేసెడు అగ్ని అను నీ అయిదును శరీరము కలవాని అగ్నివికారములు.

శ్రోత్రం ఘ్రాణం తథాస్యం చ హృదయం కోష్ఠ మేవ చ,

ఆకాశా త్ర్పాణినా మేతే శరీరే పఞ్చ ధాతవః. 22

చెవి, ముక్కు, నోరు, హృదయము, అన్నకోశము అను నీ అయిదును ప్రాణుల శరీరమునందు ఆకాశము వలన ఏర్పడిన అయిదు ధాతువులు.

శ్లేష్మా పిత్త మథ స్వేదో వసా శోణిత మేవ చ,

ఇత్యాపః పఞ్చధా దేహే భవన్తి ప్రాణినాం సదా. 23

శ్లేష్మము, పిత్తము, స్వేదము, వస, రక్తము అను అయిదును ప్రాణుల దేహమున జలము యొక్క స్వరూపములు.

ప్రాణా త్ప్రణీయతే ప్రాణీ వ్యానా ద్వ్యాయచ్ఛతే తథా,

గచ్ఛత్యపానోఽధ శ్చైవ సమానో హృద్యవస్థితః. 24

ప్రాణి ప్రాణవాయువుతో ఆయా కార్యములను చేయుచున్నాడు. వ్యాన వాయువు వలన బరువులెత్తుట మొదలగు పనులు చేయుచున్నాడు. అపానవాయువు క్రిందిభాగమునుండి వెలువడుచున్నది. (మూత్రాదులను వెలువరించుచున్నది). సమానము హృదయస్థానమున నెలకొనియున్నది.

ఉదానా దుచ్ఛ్వసితి చ ప్రతిభేదాచ్చ భాషతే,

ఇత్యేతే వాయవః పఞ్చ చేష్టయ న్తీహ దేహినమ్ . 25

ఉదానవాయువువలన ఊపిరిపీల్చుచున్నది. (ప్రాణి) స్థానభేదమువలన మాటాడుచున్నాడు (మానవుడు). ఇట్లీ అయిదు వాయువులు దేహము కలవానిని చేష్టలు కలవానినిగా చేయుచున్నవి.

భూమే ర్గన్ధగుణా న్వేత్తి రసం చాద్భ్యః శరీరవాన్,

జ్యోతిషా చక్షుషా రూపం స్పర్శం వేత్తి చ వాహినా. 26

భూతత్త్యముచేత గంధ గుణములను, నీటివలన రసమును, అగ్నితత్త్వము గల కంటితో రూపమును, వాయుతత్త్వము గల చర్మముతో స్పర్శను శరీరము కలవాడు తెలియుచున్నాడు.

గన్ధః స్పర్శో రసో రూపం శబ్దశ్చాత్ర గుణాః స్మృతాః

తస్య గన్ధస్య వక్ష్యామి విస్తరాభిహితాన్ గుణాన్. 27

గంధము, స్పర్శ, రసము, రూపము, శబ్దము అనునవి యిచట గుణములుగా స్మరింపబడినవి. ఆ గంధపు పెక్కు విధములగు గుణములను, పెద్దలు చెప్పువానిని, చెప్పెదను.

ఇష్టశ్చానిష్ట గన్ధశ్చ మధురః కటు రేవ చ,

నిర్హారీ సంహతః స్నిగ్ధో రూక్షో విశద ఏవ చ.

ఏవం నవవిధో జ్ఞేయః పార్థివో గన్ధ విస్తరః. 28

ఇష్టము, అనిష్టము, మధురము, కటువు, ఆమోదము, సంహతము, స్నిగ్ధము, రూక్షము, విశదము - అని పృథివికి సంబంధించిన గంధముల వ్యాప్తి తొమ్మిది విధములుగా నుండును.

జ్యోతిః పశ్యతి చక్షుర్భ్యాం స్పర్శం వేత్తి చ వాయునా,

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసశ్చాపి గుణాః స్మృతాః. 29

కన్నులతో నరుడు జ్యోతిని చూచును. వాయువు చేత స్పర్శను తెలిసికొనును. శబ్దము, స్పర్శము, రూపము, రసము అనునవి వాయువు గుణములు.

రసజ్ఞానం తు వక్ష్యామి తన్మే నిగదతః శృణు,

రసో బహువిధః ప్రోక్త ఋషిభిః ప్రథితాత్మభిః 30

రసజ్ఞానమును గూర్చి చెప్పెదను. దానిని నా వలన వినుము. మంచి భావన గల ఋషులు రసమును పెక్కు విధములుగా చెప్పియున్నారు.

మధురో లవణ స్తిక్తః కషాయోఽమ్లః కటు స్తథా,

ఏష షడ్విధవిస్తారో రసో వారిమయః స్మృతః. 31

తీపి, ఉప్పు, ఒగరు, చేదు, పులుపు, కారము అని రసము ఆరు విధములుగా విస్తరించినది. రసము వారి మయము - (జలమునకు సంబంధించినది).

శబ్దః స్పర్శశ్చ రూపం చ త్రిగుణం జ్యోతి రుచ్యతే, 32

శబ్దము, స్పర్శ, రూపము అని అగ్ని మూడు గుణములు కలది యని చెప్పబడును.

జ్యోతిః పశ్యతి రూపాణి రూపం చ బహుధా స్మృతమ్,

హ్రస్వో దీర్ఘ స్తథా స్థూల శ్చతురస్రోఽణు వృత్తవాన్. 33

చక్షురింద్రియము రూపములను చూచును. రూపము కూడ పెక్కు విధములు. పొట్టి, పొడుగు, లావు, చతురస్రము, గుండ్రము మొదలగునది.

శుక్లః కృష్ణ స్తథా రక్తః పీతో నీలారుణా స్తథా,

కఠిన శ్చిక్కణః శ్లక్ష్ణః పిచ్ఛిలో మృదు దారుణః. 34

తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, నీలారుణము, కఠినము, చిక్కణము, శ్లక్షము, పిచ్ఛిలము, మృదువు, దారుణము.

ఏవం షోడశ విస్తారో జ్యోతీరూప గుణః స్మృతః

శబ్దస్పర్శౌ చ విజ్ఞేయౌ ద్విగుణో వాయు రిత్యుత. 35

ఇట్లు జ్యోతికి సంబంధించిన రూప గుణము పదునారు విధములుగా విస్తరించినది. శబ్దము, స్పర్శము అని వాయువునకు రెండు గుణములు.

వాయవ్యస్తు గుణః స్పర్శః స్పర్శశ్చ బహుధా స్మృతః,

ఉష్ణ: శీతః సుఖోదుఃఖః స్నిగ్ధో విశద ఏవ చ. 36

తథా ఖలో మృదూ రూక్షో లఘు ర్గురుత రోఽపి చ

ఏవం ద్వాదశధా స్పర్శో వాయవ్యో గుణ ఉచ్యతే. 37

వాయువునకు చెందిన గుణము స్పర్శ. అదియు పెక్కు విధములుగా నున్నది. వేడి, చల్లదనము, సుఖము, దుఃఖము, స్నిగ్ధము, విశదము, గట్టితనము, మెత్తదనము, రూక్షము, లఘువు, గురువు, గురుతరము - అని స్పర్శ పండ్రెండు విధములుగా చెప్పబడినది.

తత్రైక గుణ మాకాశం శబ్ద ఇత్యేవ తత్స్మృతమ్,

తస్య శబ్దస్య వక్ష్యామి విస్తారం వివిధాత్మకమ్. 38

ఆకాశము ఒక్క గుణము కలది. అది శబ్దము. ఆ శబ్దము విస్తారము పెక్కుతీరులుగా నున్నది. దానిని చెప్పెదను.

షడ్జ ఋషభ గాన్దారౌ మధ్యమో ధైవత స్తథా,

పఞ్చమ శ్చాపి విజ్ఞేయ స్తథా చాపి నిషాదవాన్. 39

షడ్జము, ఋషభము, గాంధారము, మధ్యమము, ధైవతము, పంచమము, నిషాదము - అనునవి శబ్ద భేదములు.

ఏవం సప్తవిధః ప్రోక్తో గుణ ఆకాశసంభవః

ఐశ్వర్యేణ తు సర్వత్ర స్థితోఽపి పటహాదిషు. 40

ఇట్లు ఆకాశమునుండి ఏర్పడిన గుణమును ఏడు విధములుగా చెప్పుదురు. అది అన్ని యెడల వ్యాపించి యున్నను పటహము మొదలగు వాద్యములందు అభివ్యక్తమగును.

మృదంగ భేరీ శంఖానాం స్తనయిత్నో రథస్య చ,

యః కశ్చిచ్ఛ్రూయతే శబ్దః ప్రాణినోఽప్రాణినో ఽపి వా,

ఏతేషా మేవ సర్వేషాం విషయే సంప్రకీర్తితః. 41

మద్దెల, భేరి, శంఖము, పిడుగు, రథము అనువాని నుండి వినవచ్చెడు ఏ విధమైన ధ్వని యైనను ప్రాణికి గాని, ప్రాణము లేని దానికి గాని సంబంధించిన ఈ షడ్జాదులకు చెందినదనియే గుర్తింపవలయును.

ఏవం బహువిధాకారః శబ్ద ఆకాశసంభవః,

ఆకాశజం శబ్ద మాహు రేభి ర్వాయుగుణైః సహ. 42

ఇట్లు ఆకాశమునుండి సంభవించిన శబ్దము వాయుగుణములతో కూడి పెక్కువిధములైనది. ఇట్లు ఆకాశమున పుట్టిన గుణమును శబ్దముగా చెప్పుచున్నారు.

అవ్యాహతై శ్చేతయతి న వేత్తి విషమస్థితైః,

ఆప్యాయ్యన్తే చ తే నిత్యం ధాతవ స్తై స్తు ధాతుభిః 43

ఏ విధమైన అడ్డులు లేని చోట నరుడు శబ్దమును గ్రహించుచున్నాడు. విషమస్థితుల చేత గ్రహింపకున్నాడు. ఈ విధముగా ధాతువులచేత ధాతువులు నిత్యముగా మొదటినుండియు పెంపొందుచున్నవి.

ఆపోఽగ్ని ర్మారుత శ్చైవ నిత్యం జాగ్రతి దేహిషు,

మూల మేతే శరీరస్య వ్యాప్య ప్రాణా నిహ స్థితాః. 44

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
భృగుభరద్వాజ సంవాదే చతురశీత్యధిక శతతమోఽధ్యాయః

జలములు, అగ్ని, వాయువు - ఇవి నిత్యము దేహులయందు మేల్కొని యుండును. ఇవి శరీరమునకు మూలము. ప్రాణములను వ్యాపించి యుండును.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మపర్వమున భృగు భరద్వాజ
సంవాదము గల నూటయెనుబది నాలుగవ అధ్యాయము.

శరీరము, ఇంద్రియములు భౌతికములగుటను గూర్చి చెప్పియున్నారు. జ్ఞానశక్తి క్రియా శక్తియు కల విజ్ఞానము, ప్రాణము అనునవియు భౌతికములే - చిదాత్మకంటె భిన్నములే - అని చెప్పుటకై ఈ అధ్యాయమును ప్రారంభించు చున్నారు.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు అనెను.

పార్థివం ధాతు మాసాద్య శారీర్థేగ్నిః కథం ప్రభో,

అవకాశ విశేషేణ కథం వర్తయతేఽ నిలః. 1

ప్రభూ! అగ్ని పృథివికి సంబంధించిన ధాతువును పొంది శరీర సంబంధమైనదగుట యెట్లు? మరియు వాయువు అవకాశ విశేషముచేత దేహమును ఎట్లు కదిలించు చున్నది?

భృగు రువాచ - భృగు విట్లనెను.

వాయోర్గతి మహం బ్రహ్మన్ కథయిష్యామి తేఽనఘ,

ప్రాణినా మనిలో దేహాన్ యథా చేష్టయతే బలీ. 2

అనఘా! బ్రాహ్మణా! నేను వాయువు గతిని గూర్చి చెప్పెదను. ప్రాణుల దేహములను బలముకలదియై వాయు వెట్లు కదలించుచున్నదో తెలిపెదను.

శ్రితో మూర్ధాన మగ్ని స్తు శరీరం పరిపాలయన్,

ప్రాణో మూర్ధని చాగ్నౌ చ వర్తమానో విచేష్టతే. 3

అగ్ని మూర్ధమును (శిరస్సును) ఆశ్రయించి శరీరమును పరిపాలించుచున్నది. ప్రాణము శిరస్సునందును, అగ్నియందును ఉన్నది యగుచు శరీరమును చేష్టలు కలదిగా చేయుచున్నది.

స జన్తుః సర్వభూతాత్మా పురుషః స సనాతనః,

మనో బుద్ధి రహంకారో భూతాని విషయశ్చ సః. 4

ఆ సనాతనుడు, సర్వభూతాత్ముడు అగు పురుషుడే జీవుడు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూతములు, విషయములు - అన్నియు నతడే.

ఏవం త్విహ స సర్వత్ర ప్రాణేన పరిచాల్యతే,

పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతి ముపాశ్రితః. 5

ఇట్లతడు ఈ దేహమున అన్ని యెడలను ప్రాణముతో అన్ని వైపుల కదలికలను పొందుచున్నాడు. ఆ వెనుక సమానముతో తనతన గతిని ఆశ్రయించి కదలుచున్నాడు.

వస్తిమూలం గుదం చైవ పావకం సముపాశ్రితః

వహన్మూత్రం పురీషం చాప్యపానః పరివర్తతే. 6

అదియే వాయువు మూత్రాశయమును, గుదమును, జఠరాగ్నిని ఆశ్రయించుకొని మూత్రమును, మలమును పట్టుకొని యుండి అపానముగా మారుచున్నది.

ప్రయత్నే కర్మణి బలే య ఏక స్త్రిషు వర్తతే,

ఉదాన ఇతి తం ప్రాహు రధ్యాత్మవిదుషో జనాః. 7

ప్రయత్నము, కర్మము, బలము - అనువాని మూడింటియందును ఏది ఒకటిగా వర్తించునో దానిని అధ్యాత్మ విద్య నెరిగిన వాని నుండి తెలిసికొనిన జనులు ఉదానమని చెప్పుదురు.

సన్ధిష్వపి చ సర్వేషు సన్నివిష్ట స్తథాఽనిలః,

శరీరేషు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే. 8

మానవుల శరీరములందలి సంధులన్నింటియందు సన్నిహితముగా నుండు వాయువును వ్యానము అందురు.

ధాతు ష్వగ్నిషు వితతః సమానేన సమీరితః,

రసాన్ ధాతూంశ్చ దోషాంశ్చ వర్తయ న్నవతిష్ఠతే. 9

చర్మము మున్నగు ధాతువులందును, అగ్నులయందును వ్యాపించి యున్న జఠరాగ్ని సమానవాయువుతో ప్రేరితమై రసములను, ధాతువులను, దోషములను మార్పులను పొందునట్లు చేయుచు నిలిచి యుండును.

అపాన ప్రాణయో ర్మధ్యే ప్రాణాపాన సమాహితః

సమన్విత స్త్వధిష్ఠానం సమ్య క్పచతి పావకః. 10

అపానమునకు ప్రాణమునకు నడుమ, ప్రాణాపానములతో కూడియున్నదియై అధిష్ఠానమును ఆశ్రయించి ఈ అగ్ని (అన్నము మొదలగు దానిని) చక్కగా జీర్ణము చేయుచున్నది.

ఆస్యం హి పాయు పర్యన్త మన్తే స్యాద్గుద సంజ్ఞితమ్,

స్రోత స్త స్మా త్ప్రజాయన్తి సర్వస్రోతాంసి దేహినామ్. 11

నోరు మొదలుకొని పాయువు చివరగా గల భాగమునకు గుద మని పేరు. ఆ వాహిక నుండి దేహము కలవారి వాహికలన్నియు నేర్పడుచున్నవి.

ప్రాణానాం సన్నిపాతాచ్చ సన్నిపాతః ప్రజాయతే,

ఊష్మా చాగ్ని రితి జ్ఞేయోయోఽ న్నం పచతి దేహినామ్. 12

ప్రాణములన్నియు ఈ నాడులలోపల కదలాడుచుండుటచేత, జఠరాగ్ని కూడ వానితో కలయిక పొందుచున్నది. ఆ అగ్నియే శరీరపు వేడి యని తెలియదగును. ఆదియే దేహుల అన్నమును జీర్ణము చేయుచున్నది.

అగ్ని వేగవహః ప్రాణో గుదాన్తే ప్రతిహన్యతే,

స ఊర్ధ్వ మాగమ్య పునః సముత్క్షిపతి పావకమ్. 13

అగ్నివేగము చేత ముందుకు సాగెడు ప్రాణము గుదము చివర అడ్డు కొనబడును. అది మరల పైకి వచ్చి అగ్నిని పైకి ఎగసనద్రోయును.

పక్వాశయ స్త్వధో నాభ్యా మూర్ధ్వ మామాశయః స్థితః,

నాభిమధ్యే శరీరస్య సర్వే ప్రాణాశ్చ సంస్థితాః. 14

నాభికి క్రిందిభాగమున పక్వాశయము (జీర్ణాశయము) పై భాగమున ఆమాశయము ఉన్నవి. ఆ విధముగా శరీరమున బొడ్డునకు నడుమ ప్రాణము లన్నియు నెలకొనియున్నవి.

ప్రస్థితా హృదయా త్సర్వే తిర్యగూర్ధ్వ మధ స్తథా,

వహ న్త్య న్న రసా న్నాడ్యో దశప్రాణ ప్రచోదితాః. 15

హృదయమునుండి బయలుదేరి అడ్డముగా నిలువుగా వ్యాపించుచు, పది ప్రాణములతో ప్రచోదన పొందుచున్నవై నాడులు అన్నరసమును దేహమున కంతటికిని చేర్చుచున్నవి.

ఏష మార్గోఽథ యోగానాం యేన గచ్ఛన్తి తత్పదమ్,

జితక్లమాః సమా ధీరా మూర్ధ న్యాత్మాన మాదధన్. 16

ఇది యోగుల మార్గము. దీనితో సహస్రారపదమును పొందుదురు. అలసతను జయించి సములై ధీరులై శిరస్సున ఆత్మను నిలుపుకొనుచుందురు.

ఏవం సర్వేషు విహితః ప్రాణాపానేషు దేహినామ్,

తస్మిన్ సమిధ్యతే నిత్య మగ్నిః స్థాల్యా మివాహితః. 17

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
పఞ్చాశీత్యధిక శతతమోఽధ్యాయః

దేహధారులు సర్వప్రచారములు, ప్రాణాదులు నిమిత్తభూతములు కాగా చేయబడినది యోగము. అది చేయబడగా అందు, పాత్రయందు ఏర్పరచిన అగ్నివలె, నిత్యమగు బ్రహ్మము, చక్కగా ప్రకాశించును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
నూటయెనుబదియైదవ అధ్యాయము.

నిత్యమ్ సమిధ్యతేఅని జీవుని ఉపాధిరహితమైన రూపము ప్రకాశించునని వెనుకటి అధ్యాయమున చెప్పియున్నారు. దానిని లోకాయతిక మతము ననుసరించి ఆక్షేపించుచున్నారు.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

యది ప్రాణయతే వాయు ర్వాయురేవ విచేష్టతే,

శ్వసిత్యాభాషతే చైవ తస్మాజ్జీవో నిరర్థకః. 1

వాయువే ప్రాణము కలుగునట్లు చేసెనేని, వాయువే దేహమున చేష్టలను కలిగించునేని, ఊపిరాడుట, పలుకుట అన్నియు వాయువే నిర్వహించినచో జీవము నిరర్థకమగును కదా!

యదూష్మభావ ఆగ్నేయో వహ్నినా పచ్యతే యది,

అగ్ని ర్జరయతే చైతత్ తస్మా జ్జీవో నిరర్థకః. 2

అగ్ని గుణమగు వేడిమి లోపలి జఠరాగ్నిచేత స్పష్టముగా నేర్పడి అన్నమును జీర్ణము చేయునేని, అప్పుడు జీవుడు పనికిమాలినవాడగును గదా!

జన్తోః ప్రమీయమాణస్య జీవో నైవోపలభ్యతే,

వాయు రేవ జహాత్యేన మూష్మభావశ్చ నశ్యతి. 3

చనిపోవుచున్న ప్రాణికి జీవము లేనే లేకున్నది. వాయువే దానిని వదలిపోవు చున్నది. వేడిమియు నశించుచున్నది.

యది వాయుమయో జీవః సంశ్లేషో యది వాయునా,

వాయు మణ్డలవద్ దృశ్యో గచ్ఛేత్సహ మరుద్గణైః. 4

జీవుడు వాయుమయుడైనచో, వాయువుతో సంశ్లేషము పొందునేని సుడిగాలివలె కన్పట్టుచున్నవాడై వాయుగణములతో పాటు వెళ్లవలయును.

సంశ్లేషో యది వాతేన యది తస్మాత్ప్రణశ్యతి,

మహార్ణవవిముక్తత్వా దన్యత్సలిల భాజనమ్. 5

జీవుడు వాయువుతో కలయికను పొంది దాని వలన నశించునేని మహా సముద్రమున విడువబడినవాడై మరియొక ఓడవంటివాడు కావలయును.

కూపే వా సలిలం దద్యాత్ ప్రదీపం వా హుతాశనే,

క్షిప్రం ప్రవిశ్య నశ్యేత యథా నశ్యత్యసౌ తథా. 6

నూతిలో నీటిని వదలినచో, అగ్నియందు దీపము నుంచినచో అవి ప్రవేశించిన వెంటనే నశించును. అట్లే ఈ జీవుడును నశించును.

పఞ్చధారణకే హ్యస్మిన్ శరీరే జీవితం కుతః,

తేషా మన్యతరాభావా చ్చతుర్ణాం నాస్తి సంశయః. 7

అయిదింటితో ధారణము కలిగిన ఈ శరీరమున జీవుడనువాడు ఎక్కడనుండి కలుగును? వానిలో ఏదైన ఒక్కటి నశించినచో తక్కినవియు నశించుచున్నవి. ఇందు సంశయము లేదు.

నశ్యన్త్యాపో హ్యనాహారాద్ వాయు రుచ్ఛ్వాస నిగ్రహాత్,

నశ్యతే కోష్ఠ భేదాత్ ఖ మగ్ని ర్నశ్యత్యభోజనాత్. 8

ఆహారము లేని కారణమున శరీరములోని జలము తరిగిపోవును. ఊపిరిని బిగపట్టుటవలన వాయువు నశించును. కోష్ఠమును నిరోధించుటవలన ఆకాశము నశించును. భోజనము తీసికొననిచో అగ్ని మందగించును.

వ్యాధి వర్ణ పరిక్లేశై ర్మేదినీ చైవ శీర్యతే,

పీడితేఽన్యతరే హ్యేషాం సంఘాతో యాతి పఞ్చధా. 9

వ్యాధులు, వాపు, దేహబాధలు అనువానివలన పృథివీతత్త్వము చివికి పోవును. వీనిలో ఏదైన ఒకటి పీడనొందగా సముదాయము అయిదు ముక్కలుగా నైపోవును.

తస్మిన్ పఞ్చత్వ మాపన్నే జీవః కి మనుధావతి,

కిం వేదయతి వా జీవః కిం శృణోతి బ్రవీతి చ. 10

అట్లది అయిదుగా అయి పోగా జీవుడు దేని వెంటపడును? దేనిని తెలుపును? దేనిని వినును? దేనిని పలుకును?

ఏషా గౌః పరలోకస్థం తారయిష్యతి మామితి,

యో దత్వా మ్రియతే జన్తుః సా గౌః కం తారయిష్యతి. 11

ఈ ఆవు పరలోకమున నున్ననన్ను తరింప జేయును అని దానమొసగి ప్రాణి చనిపోయెను. ఆ గోవు ఎవనిని తరింపజేయును?

గౌశ్చ ప్రతి గ్రహీతా చ దాతా చైవ సమం యదా,

ఇహైవ విలయం యాన్తి కుత స్తేషాం సమాగమః 12

ఆవు, దానము పుచ్చుకొన్నవాడు, ఇచ్చిన వాడును ఒకే తీరున ఇందే నశించుచుండగా వారికి మరల కలయిక ఎక్కడ?

విహగై రుపభుక్తస్య శైలాగ్రా త్పతితస్య చ,

అగ్నినా చోపభుక్తస్య కుతః సంజీవనం పునః . 13

పక్షులు కొరికి తినివేయబడిన వానికి, కొండ కొమ్మునుండి జారి పడిన వానికి, అగ్నికి ఆహుతి అయినవానికి మరల బ్రదుకుట యెక్కడిది?

ఛిన్నస్య యది వృక్షస్య న మూలం ప్రతిరోహతి,

బీజాన్యస్య ప్రవర్తన్తే మృతః కః పునరేష్యతి. 14

నరికివైచిన చెట్టు మొదలు మరల మొలకెత్తదు. దాని విత్తనములు మొలకెత్తును. చచ్చిన వాడెవడు మరల జీవించును?

బీజమాత్రం పురా సృష్టం యదేతత్ పరివర్తతే

మృతామృతాః ప్రణశ్యన్తి బీజా ద్బీజం ప్రవర్తతే. 15

ఇది శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి జీవస్వరూపాక్షేపే షడశీత్యధికశతతమోఽధ్యాయః

విత్తనము మునుపు ఏర్పడియున్నది. అది చెట్టుగా మార్పు నొందును. చచ్చిన వారు చచ్చినవారే అయి పూర్తిగా నశించుచున్నారు. విత్తనము వలన విత్తనము ఏర్పడును.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మపర్వమున జీవ స్వరూపము నాక్షేపించుట అనునంశము గల నూటయెనుబది యారవ అధ్యాయము.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

న ప్రణాశోఽస్తి జీవస్య దత్తస్య చ కృతస్య చ,

యాతి దేహాన్తరం ప్రాణీ శరీరం తు విశీర్యతే. 1

జీవునకు పూర్తి నాశనము లేదు. ఇట్లే ఇచ్చినదానికి, చేసినదానికిని నాశము లేదు. ప్రాణి మరియొక దేహమును చేరుకొనుచున్నాడు. శరీరము మాత్రము నశించును.

న శరీరాశ్రితో జీవ స్తస్మిన్నష్టే ప్రణశ్యతి,

సమిధా మివ దగ్ధానాం యథాగ్ని ర్దృశ్యతే తథా. 2

శరీరము నాశ్రయించుకొనియున్న జీవుడు, శరీరము నశింపగా నశింపడు. కాలిపోయిన కట్టెలలో అగ్ని కన్పడునట్లుగా కానరాకుండును.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

అగ్నే ర్యథా తథా తస్య యది నాశో న విద్యతే

ఇన్ధనస్యోపయోగార్తే సచాగ్ని ర్నోపలభ్యతే. 3

అగ్నికి వలె జీవునకు నాశము లేదందువేని కట్టెల ఉపయోగము ముగిసిన వెనుక అగ్ని లభింపదు గదా!

నశ్యతీత్యేవ జానామి శాన్త మగ్ని మనిన్ధనమ్,

గతి ర్యస్య ప్రమాణం వా సంస్థానం వా న విద్యతే. 4

కట్టెలు లేక ఆరిపోయిన అగ్ని నశించినదనియే నేను తెలియుచున్నాను. ఉన్నదనుటకు గతికాని, ప్రమాణము కాని, స్థితి కాని లేదు.

భృగు రువాచ - భృగు విట్లు పలికెను

సమిధా ముపయోగాన్తే యథాగ్ని ర్నోపలభ్యతే,

ఆకాశానుగతత్వాద్ధి దుర్గ్రాహ్యో హి నిరాశ్రయః. 5

కట్టెలు కాలిపోయిన పిదప అగ్ని దొరకక పోవుట నిజమే. కాని అది ఆశ్రయము లేనిది కావున ఆకాశమును అంటి యుండుటవలన (సూక్ష్మ రూపమును పొందియుండుటవలన) పట్టుకొనుటకు - ఉన్నదని తెలిసికొనుటకు - శక్యము కానిదగును.

తథా శరీరసంత్యాగే జీవో హ్యాకాశవత్ స్థితః,

న గృహ్యతే తు సూక్ష్మత్వా ద్యథా జ్యోతి ర్న సంశయః. 6

అట్లే శరీరమును వదలిన తరువాత జీవుడు ఆకాశమువలె నిలిచియుండును. సూక్ష్మత్వమువలన, జ్యోతివలె గ్రహింపబడడు. సంశయము లేదు.

ప్రాణాన్ ధారయతే హ్యగ్నిః సజీవ ఉపధార్యతామ్,

వాయుసంధారణో హ్యగ్ని ర్నశ్య త్యుచ్ఛ్వాస నిగ్రహాత్. 7

అగ్నియే ప్రాణములను పట్టి నిలుపుచు జీవుడని తెలియవలయును. వాయువువలన నిలిచియుండెడు అగ్ని ఉచ్ఛ్వాసమును బిగబట్టుటవలన నశించుచున్నది - కనబడకున్నది.

తస్మిన్నష్టే శరీరాగ్నౌ తతో దేహ మచేతనమ్,

పతితం యాతి భూమిత్వ మయనం తస్య హి క్షితిః. 8

ఆ శరీరాగ్ని నశింపగా దేహము అచేతనమగును. పడిపోయినదై భూమిత్వమును పొందును. దానికి భూమియే అయనము.

జంగమానాం హి సర్వేషాం స్థావరాణాం తథైవ చ,

ఆకాశం పవనోఽన్వేతి జ్యోతి స్త మనుగచ్ఛతి,

తేషాం త్రయాణా మేకత్వాద్ ద్వయం భూమౌ ప్రతిష్ఠితమ్. 9

సర్వములైన జంగమములయు, స్థావరములయు ఆకాశమును గాలి అనుసరించును. అగ్ని దాని ననుసరించును. ఆ మూడును ఒక్కటి యగుటవలన ఆ రెండును భూమిలో నిలిచియుండును.

యత్ర ఖం తత్ర పవన స్తత్రాగ్ని ర్యత్ర మారుతః,

అమూర్తయ స్తే విజ్ఞేయా మూర్తిమన్తః శరీరిణామ్. 10

ఎక్కడ ఆకాశ ముండునో అక్కడ వాయు వుండును. ఎచట వాయు వుండునో అక్కడ అగ్ని యుండును. ఆ మూడును మూర్తి - ఆకారము - లేనివి అని తెలియదగును. శరీరము కలవానియందు అవి మూర్తి కలవి యగును.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు పలికెను.

యద్యగ్నిమారుతౌ భూమిః ఖ మాప శ్చ శరీరిషు,

జీవః కింలక్షణ స్తత్రే త్యేతదాచక్ష్య మేఽనఘ. 11

అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, జలములు శరీరములు కలవారి యందున్నచో అందు ఏలక్షణములు కలవాడు జీవుడు? పుణ్యాత్మా! ఈ విషయమును నాకు తెలియజెప్పుము.

పఞ్చాత్మకే పఞ్చరతౌ పఞ్చ విజ్ఞాన చేతనే,

శరీరే ప్రాణినాం జీవం వేత్తు మిచ్ఛామి యాదృశమ్. 12

అయిదు భూతములుగా నయినది, అయిదు విషయములయందు ప్రీతి కలది, అయిదు జ్ఞానసాధనములు, అయిదు జ్ఞానములు కలది అయిన ప్రాణుల శరీరమునందు జీవమనగా నెట్టిదియో తెలియగోరుచున్నాను.

మాంసశోణిత సంఘాతే మేదః స్నా య్వస్థిసంచయే,

భిద్యమానే శరీరే తు జీవో నైవోపలభ్యతే. 13

మాంసము, రక్తముల సముదాయము, మేదస్సు, నరములు, ఎముకల గూడు అయి పగిలిపోవు శరీరమునందు జీవుడను వాడు దొరకనే దొరకడు.

యద్యజీవం శరీరం తు పఞ్చభూత సమన్వితమ్,

శారీరే మానసే దుఃఖే కస్తాం వేదయతే రుజమ్. 14

శరీరము చేతన లేనిది, అయిదు భూతములతో కూడినది అయినచో శరీరమునకు, మనస్సునకు సంబంధించిన దుఃఖము కలిగినపుడు ఆరోగమును తెలుపు వాడెవ్వడు?

శృణోతి కథితం జీవః కర్ణాభ్యాం న శృణోతి తత్,

మహర్షే మనసి వ్యగ్రే తస్మా జ్జీవో నిరర్థకః. 15

మహర్షీ! జీవుడు, ఇతరులు చెప్పినదానిని చెవులతో వినుచున్నాడు. మనస్సు చెదరి యున్నపుడు వినకున్నాడు. అందువలన జీవుడు ప్రయోజనము లేనివాడే కదా!

సర్వం పశ్యతి యద్దృశ్యం మనో యుక్తేన చక్షుషా,

మనసి వ్యాకులే చక్షుః పశ్య న్న పి న పశ్యతి. 16

మనస్సుతో కూడిన కంటితో చూడదగిన దానిని సర్వమును చూచుచున్నాడు. కాని మనసు వ్యాకులము కాగా కన్ను చూచుచును చూడదు.

న పశ్యతి న చాఘ్రాతి న శృణోతి న భాషతే,

నచ స్పర్శరసౌ వేత్తి నిద్రా వశగతః పునః. 17

నిద్రకు వశమైనవాడు చూడడు, వాసన యెరుగడు, వినడు, పలుకడు, స్పర్శను, రసమును తెలియజాలడు కదా!

హృష్యతి క్రుద్ధ్యతే కోఽ త్ర శోచ త్యుద్విజతే చ కః,

ఇచ్ఛతి ధ్యాయతి ద్వేష్టి వాచ మీరయతే చ కః. 18

సంతోషపడును, కోపగించును, ఏడ్చును, కళవళ పడును, ఇష్టపడును, ధ్యానించును, ద్వేషించును, పలుకులను వెలువరించును. ఈ పనులన్నియు చేయునది ఎవరు?

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

నపఞ్చ సాధారణ మత్ర కిఞ్చి చ్ఛరీరకో వహతే ఽన్తరాత్మా,

స వేత్తి గంధాంశ్చ రసాన్ శ్రుతీశ్చ స్పర్శంచ రూపంచ గుణాంశ్చ యేఽన్యే. 19

ఇందు పంచ సాధారణమనునది యే మాత్రమును లేదు. శరీరమునందున్న అంతరాత్మయే వహించుచున్నది. గంధములను, రసములను, శబ్దములను, స్పర్శను, రూపమును, గుణములను ఇంకను వేరుగా ఏవి కలవో వాని నన్నింటిని అదియే తెలియుచున్నది.

పఞ్చాత్మకే పఞ్చగుణ ప్రదర్శి

స సర్వగాత్రానుగతోఽన్త రాత్మా,

స వేత్తి దుఃఖాని సుఖాని చాత్ర

తద్విప్రయోగాత్తు న వేత్తి దేహః. 20

అయిదు అయిదుగా ఉన్న శరీరమునందు అయిదు గుణములు గల మనస్సును దర్శించునదియు, అన్ని అంగములను వ్యాపించి యున్నదియు అగు అంతరాత్మ దుఃఖములను, సుఖములను తెలిసికొనుచున్నది. ఆ అంతరాత్మతో కలిగెడు వియోగమువలన దేహము సుఖాదులను తెలియకున్నది.

యదా న రూపం న స్పర్శో నోష్మభావశ్చ పావకే,

తదా శాన్తే శరీరాగ్నౌ దేహత్యాగేన నశ్యతి. 21

అగ్నియందు రూపము, స్పర్శ, వేడిమి అనునవి లేక శరీరాగ్ని అణగి పోయినపుడు దేహమును వదలుట చేత దేహము నశించుచున్నది.

ఆపోమయ మిదం సర్వ మాపోమూర్తిః శరీరిణామ్,

తత్రాత్మా మానసో బ్రహ్మ సర్వభూతేషు లోకకృత్. 22

ఈ సర్వమును జలమయమే, శరీరులకు జలములే మూర్తి. అందున్న మానసుడగు బ్రహ్మ సర్వభూతముల యందును లోకములను చేయువాడు.

ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్తః సంయుక్తః ప్రాకృతై ర్గుణైః,

తై రేవ తు వినిర్ముక్తః పరమాత్మే త్యుదాహృతః. 23

ఆత్మ ప్రాకృత గుణములతో కూడియుండువాడై క్షేత్రజ్ఞు డనబడును. ఆ గుణములను వదలివేసిన ఆ ఆత్మయే పరమాత్మ అని చెప్పబడును.

ఆత్మానం తం విజానీహి సర్వలోక హితాత్మకమ్,

తస్మిన్ యః సంశ్రితో దేహే హ్యబ్బిన్దు రివ పుష్కరే. 24

సర్వలోకములకు హితము చేయుదానినే ఆత్మగా తెలిసికొనుము. ఆ దేహమున, పద్మపత్రమున నీటి బిందువు వలె, అది ఆశ్రయించి యుండును.

క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం లోక హితాత్మకమ్,

తమో రజశ్చ సత్త్వం చ విద్ధి జీవగుణా నిమాన్. 25

నిత్యము లోకహితమే స్వరూపముగా నైన దానిని క్షేత్రజ్ఞునిగా ఎరుగుము. మరియు తమస్సు, రజస్సు, సత్యము అనునవి జీవ గుణములనియు తెలిసి కొనుము.

సచేతనం జీవగుణం వదన్తి

స చేష్టతే చేష్టయతే చ సర్వమ్,

అతః పరం క్షేత్ర విదో వదన్తి

ప్రావర్తయ ద్యో భువనాని సప్త. 26

జీవగుణమును సచేతనమని చెప్పుదురు. అదియే కదలుచున్నది, సర్వమును కదలించుచున్నది. క్షేత్రము నెరిగిన వారు (ఈ ఏడు భువనములను ప్రవర్తింప జేసెడు దానిని) దానికంటె వేరైనదిగా, పరమమైనదిగా చెప్పుదురు.

న జీవనాశోఽస్తి హి దేహభేదే

మిథ్యైతదాహు ర్మృత ఇత్యబుద్ధాః,

జీవస్తు దేహాన్తరితః ప్రయాతి

దశార్ధ తైవాస్య శరీరభేదః. 27

దేహము భేదించునపుడు నిజమునకు జీవనాశము లేదు. తత్త్వము తెలియనివారు చచ్చెనని అబద్ధము పలుకుచున్నారు. జీవుడు మరియొక దేహములోని కరుగుచున్నాడు. అయిదగుటయే జీవునకు శరీరభేదము.

ఏవం సర్వేషు భూతేషు గూఢ శ్చరతి సంవృతః,

దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా తత్త్వదర్శిభిః. 28

ఇట్లు సర్వభూతములయందును ఆత్మ గూఢముగా, సంవృతుడై తిరుగుచుండును. తత్త్వమును దర్శించినవారు సూక్ష్మమైన, ఏకాగ్రమైన బుద్ధితో దర్శింతురు.

తం పూర్వాపరరాత్రేషు యుఞ్జానః సతతం బుధః,

లఘ్వాహారో విశుద్ధాత్మా పశ్యత్యాత్మాన మాత్మని. 29

బుధుడు పూర్వాపరరాత్రులయందు మనస్సును ఎల్లవేళల నిలకడగా నుంచుకొని, మితమైన ఆహారము, విశుద్ధమైన మనస్సు గలవాడై ఆత్మయందే ఆ ఆత్మను దర్శించును.

చిత్తస్య హి ప్రసాదేన హిత్వా కర్మ శుభాశుభమ్, 30

ప్రసన్నాత్మా ఽఽత్మని స్థిత్వా సుఖ మానన్త్య మశ్నుతే.

చిత్తము ప్రసన్నము కాగా శుభాశుభ కర్మములను వదలి వైచి ప్రసన్న మగు బుద్ధి కలవాడై ఆత్మయందే ఉండి నరుడు అనంతమైన సుఖము ననుభవించును.

మానసోఽగ్నిః శరీరేషు జీవ ఇత్యభిధీయతే,

సృష్టిః ప్రజాపతే రేషా భూతాధ్యాత్మ వినిశ్చయే. 31

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి భృగు భరద్వాజ సంవాదే జీవ
రూపనిరూపణే సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః

శరీరములయందు మానసమైన అగ్నియే జీవుడని చెప్పబడును. ఇది అధ్యాత్మ వినిశ్చయము నందు ఏర్పడిన ప్రజాపతి సృష్టి.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున
భృగు భరద్వాజ సంవాదమున జీవ రూప నిరూపణము
గల నూట యెనుబది ఏడవ అధ్యాయము

భూతములనెట్లు సృజించెను అను దానికి ఉత్తరమును చెప్పి కథం వర్ణ విభూతయః" - వర్ణముల విభాగము లెట్లేర్పడినవి అనుదానికి ఉత్తరము చెప్పు చున్నారు.

భృగు రువాచ - భృగు విట్లు పలికెను.

అసృజద్ బ్రాహ్మణా నేవ పూర్వం బ్రహ్మ ప్రజాపతీన్,

ఆత్మతేజోఽభి నిర్వృత్తాన్ భాస్కరాగ్ని సమప్రభాన్. 1

మొదట బ్రహ్మ తన తేజస్సు నుండి వెలువడిన వారును, సూర్యాగ్నులతో సమానమగు కాంతి కలవారును అగు బ్రహ్మనిష్ఠులగు ప్రజాపతులనే సృజించెను.

తతః సత్యం చ ధర్మం చ తపో బ్రహ్మ చ శాశ్వతమ్,

ఆచారం చైవ శౌచం చ సర్గాయ విదధే ప్రభుః 2

అటుపైని సత్యము, ధర్మము, తపము, శాశ్వతమగు బ్రహ్మము, ఆచారము, శౌచము అను వానిని సృష్టికొరకు ప్రభువు ఏర్పరచెను.

దేవదానవ గన్దర్వా దైత్యాసురమహోరగాః,

యక్ష రాక్షసనాగాశ్చ పిశాచా మనుజా స్తథా, 3

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమ,

యే చాన్యే భూతసంఘానాం వర్ణాం స్తాంశ్చాపి నిర్మమే. 4

దేవతలు, దానవులు, గంధర్వులు, దైత్యులు, అసురులు, మహా సర్పములు, యక్షులు, రాక్షసులు, నాగులు, పిశాచములు, మనుజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరియు గల భూత సంఘముల వర్ణములు - ఈ అన్నింటిని నిర్మించెను.

బ్రాహ్మణానాం సితో వర్ణః క్షత్రియాణాం చ లోహితః

వైశ్యానాం పీతకో వర్ణః శూద్రాణా మసిత స్తథా. 5

బ్రాహ్మణులకు తెలుపు, క్షత్రియులకు ఎరుపు, వైశ్యులకు పసుపు, శూద్రులకు నలుపు అనునవి వర్ణములు.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లనెను.

చాతుర్వర్ణ్యస్య వర్ణేన యది వర్ణో విభిద్యతే,

సర్వేషాం ఖలు వర్ణానాం దృశ్యతే వర్ణ సంకరః. 6

నాలుగు వర్గముల వారికి వర్ణముతో వర్ణము భేదించునేని అన్ని వర్ణములయందును వర్ణ సంకరము కానవచ్చుచున్నది కదా!

కామః క్రోధో భయం లోభః శోక శ్చిన్తా క్షుధా శ్రమః,

సర్వేషాం నః ప్రభవతి కస్మాద్వర్ణో విభిద్యతే. 7

కామము, క్రోధము, భయము, లోభము, శోకము, చింత, ఆకలి, శ్రమ అనునవి మన కందరకు కలుగుచున్నవి. ఇక దేనివలన వర్ణము వేరగుచున్నది?

స్వేద మూత్ర పురీషాణి శ్లేష్మా పిత్తం స శోణితమ్,

తనుః క్షరతి సర్వేషాం కస్మాద్వర్ణో విభజ్యతే. 8

చెమట, మూత్రము, మలము, కఫము, పిత్తము, రక్తముతో పాటు తక్కిన ధాతువులు అందరకు సమానమే. అందరి దేహము నాశనమగుచున్నది. ఇక దేనివలన వర్ణము వేరువేరుగా నగుచున్నది?

జంగమానా మసంఖ్యేయాః స్థావరాణాం చ జాతయః,

తేషాం వివిధవర్ణానాం కుతో వర్ణ వినిశ్చయః. 9

జంగమములలో, స్థావరములలో లెక్కపెట్టలేనన్ని జాతులు కలవు. వేరువేరు వర్ణములు కలవానికి వర్ణమును నిశ్చయించుట దేనిని బట్టి కలుగును?

భృగు రువాచ - భృగు విట్లు పలికెను.

న విశేషోఽస్తి వర్ణానాం సర్వంబ్రాహ్మ్య మిదం జగత్,

బ్రహ్మణా పూర్వ సృష్టం హి కర్మభి ర్వర్ణతాం గతమ్. 10

నిజమునకు వర్ణములకు విశేషము లేదు. ఈ జగత్తంతయు బ్రాహ్మ్యమే. మొదట బ్రహ్మ సృష్టించినది కదా! కర్మములతో వర్ణతను పొందినది.

కామభోగ ప్రియా స్తీక్ష్ణా క్రోధనాః ప్రియసాహసాః,

త్యక్తస్వధర్మా రక్తాఙ్గా స్తే ద్విజాః క్షత్రతాం గతాః. 11

కామభోగములందు ప్రియులు, తీవ్రస్వభావము కలవారు, క్రోధ మధికముగా నున్నవారు, సాహసములం దిష్టము కలవారు, తమ ధర్మమును వదలినవారు, రక్తాంగులునగు ద్విజులు క్షత్రియత్వమును పొందిరి.

గోభ్యో వృత్తిం సమాస్థాయ పీతాః కృష్యుపజీవినః,

స్వధర్మా న్నానుతిష్ఠన్తి తే ద్విజా వైశ్యతాం గతాః. 12

గోవులవలన బ్రతుకు తెరువును పెట్టుకొని, వ్యవసాయము నవలంబించి బ్రదుకు వారును, స్వధర్మములను ఆచరింపనివారునగు, ద్విజులు పీతవర్ణము కలవారై వైశ్యత్వమును పొందిరి.

హింసానృతప్రియా లుబ్ధాః సర్వకర్మోప జీవినః,

కృష్ణాః శౌచపరిభ్రష్టా స్తే ద్విజాః శూద్రతాం గతాః. 13

హింస, అబద్ధములు అనువానియందు ప్రీతి కలవారు, లుబ్ధులు, అన్నివిధములగు వృత్తులతో బ్రదుకువారు, శౌచమునుండి పరిభ్రష్టులు అగు నల్లని వర్ణము గల ద్విజులు శూద్రత్వమును పొందిరి.

ఇత్యేతైః కర్మభి ర్వ్యస్తా ద్విజా వర్ణాన్తరం గతాః,

ధర్మో యజ్ఞ క్రియా తేషాం నిత్యం న ప్రతిషిధ్యతే. 14

ఇట్లు ఈ కర్మములతో వేరుచేయబడిన ద్విజులు మరియొక వర్ణమును పొందినవారైరి. వారికి ధర్మమైన యజ్ఞక్రియ ఎన్నటికిని నిషేధింపబడలేదు.

ఇత్యేతే చతురో వర్ణా యేషాం బ్రాహ్మీ సరస్వతీ,

విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్త్వజ్ఞానతాం గతాః. 15

ఈ నాలుగు వర్ణములకును వేదమునకు సంబంధించిన సరస్వతిని బ్రహ్మ పూర్వము విధించెను. కాని లోభమువలన వారు అజ్ఞానతను పొందిరి.

బ్రాహ్మణా బ్రహ్మతన్త్రస్థా స్తప స్తేషాం న నశ్యతి,

బ్రహ్మ ధారయతాం నిత్యం వ్రతాని నియమాం స్తథా. 16

బ్రాహ్మణులు బ్రహ్మతంత్రమునందున్నవారు వారి తపస్సు నశింపదు. బ్రహ్మమును పట్టుకొన్నవారికి నిత్యము వ్రతములు, నియమములును చెడవు.

బ్రహ్మ చైవ పరం సృష్టం యే న జానన్తి తేఽద్విజాః,

తేషాం బహు విధా స్త్వన్యా స్తత్ర తత్ర హి జాతయః. 17

సర్వకార్యము పరబ్రహ్మమే అని ఎవరు తెలియరో వారు ద్విజులకన్న వేరైనవారు. వారిలో మరియు పెక్కు విధముల వారు కలరు. వేరువేరు యోనులందు జన్మములను పొందిరి.

పిశాచా రాక్షసాః ప్రేతా వివిధా మ్లేచ్ఛ జాతయః,

ప్రణష్టజ్ఞాన విజ్ఞానాః స్వచ్ఛ న్దాచార చేష్టితాః. 18

పిశాచులు, రాక్షసులు, ప్రేతములు, పెక్కువిధములగు మ్లేచ్ఛజాతులుగా, జ్ఞానవిజ్ఞానములు పూర్తిగా నశించినవారు, ఇచ్చవచ్చిన ఆచారములు, చేష్టలు కలవారుగా అట్టివారు జన్మములను పొందిరి.

ప్రజా బ్రాహ్మణ సంస్కారాః స్వకర్మకృతనిశ్చయాః,

ఋషిభిః స్వేన తపసా సృజ్యన్తే చాపరేఽపరైః. 19

వేదము చెప్పిన సంస్కారమును పొందినవారు, తమ కర్మములందు చెదరని నిశ్చయము కలవారునగు తరువాతి కాలపు ప్రజలను ప్రాచీనఋషులు తమ తపస్సుతో సృజించిరి.

ఆదిదేవ సముద్భూతా బ్రహ్మమూలాక్షయాఽవ్యయా,

సా సృష్టి ర్మానసీ నామ ధర్మ తన్త్ర పరాయణా. 20

ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి భృగుభరద్వాజ సంవాదే వర్ణవిభాగ కథనే అష్టాశీత్యధిక శతతమోఽధ్యాయః

ఈ మానసి అయిన సృష్టి ఆదిదేవుని నుండి ఏర్పడినది. వేదము మూలముగా గలది. అక్షయ, అవ్యయ, ధర్మతంత్రమే పరాయణముగా గలది.

ఇది శ్రీ మహా భారతము శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమున
భృగు భరద్వాజ సంవాదమున వర్ణవిభాగ కథనము గల
నూటయెనుబది ఎనిమిదవ అధ్యాయము.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు పలికెను.

బ్రాహ్మణః కేన భవతి క్షత్రియో వా ద్విజోత్తమ,

వైశ్యః శూద్రశ్చ విప్రర్షే తద్ర్బూహి వదతాంవర. 1

బ్రాహ్మణోత్తమా! పలుకువారిలో శ్రేష్ఠుడా! దేనిచేత బ్రాహ్మణుడగును? దేనిచేత క్షత్రియుడగును, వైశ్యుడు, శూద్రుడు అగుటకు కారణమేమి? దీనిని నాకు తెలియజెప్పుము.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

జాతకర్మాదిభి ర్యస్తు సంస్కారైః సంస్కృతః శుచిః, 2

వేదాధ్యయన సంపన్నః షట్సు కర్మ స్వవస్థితః.
శౌచాచార స్థితః సమ్య గ్విఘసాశీ గురుప్రియః.

నిత్యవ్రతీ సత్యపరః స వై బ్రాహ్మణ ఉచ్యతే. 3

జాతకర్మము మొదలగు సంస్కారములను పొందినవాడు, శుచి, వేదాధ్యయన మను సంపద కలవాడు, ఆరు కర్మములయందు నిలకడగా నుండువాడు, శౌచమునకు, ఆచారములకు కట్టుబడినవాడు, విఘసమును భుజించువాడు, గురువులయందు భక్తి కలవాడు, వదలని వ్రతములు కలవాడు, సత్యమునందు శ్రద్ధ కలవాడును బ్రాహ్మణు డని చెప్పబడును.

సత్యం దాన మథా ద్రోహ ఆనృశంస్యం త్రపా ఘృణా,

తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః. 4

సత్యము, దానము, క్రోధము లేకుండుట, క్రూరత లేకుండుట, సిగ్గు, జాలి, తపస్సు ఎందు కానవచ్చునో అట్టి వ్యక్తి బ్రాహ్మణుడుగా గణింపదగినవాడు.

క్షత్రజం సేవతే కర్మ వేదాధ్యయన సంగతః,

దానాదాన రతి ర్యస్తు స వై క్షత్రియ ఉచ్యతే. 5

క్షత్రజమైన కర్మమును సేవించువాడు, వేదము నధ్యయమును చేయుటయందు శ్రద్ధకలవాడు, ఇచ్చుట పుచ్చుకొనుటలో ప్రీతి కలవాడు నగు వ్యక్తి క్షత్రియుడు.

వణిజ్యా పశురక్షా చ కృష్యాదాన రతిః శుచిః,

వేదాధ్యయన సంపన్నః స వైశ్య ఇతి సంజ్ఞితః. 6

వ్యాపారము, పశువుల రక్షణము, వ్యవసాయము, ధనసంగ్రహణము అను వానియందు ప్రీతి కలవాడు, శుచి, వేదాధ్యయన సంపన్నుడు అగువాడు వైశ్యుడను వ్యవహారము కలవాడు.

సర్వభక్షరతి ర్నిత్యం సర్వకర్మకరోఽశుచిః,

త్యక్తవేద స్త్వనాచారః స వై శూద్ర ఇతి స్మృతః. 7

ఎల్లవేళల, సర్వవిధములగు భోజనములయందు ప్రీతికలవాడు, అన్ని కర్మములను చేయువాడు, అశుచి, వేదమును వదలివైచినవాడు, ఆచారములు పాటింపనివాడు నగు వ్యక్తి శూద్రుడు.

శూద్రే చైత ద్భవే ల్లక్ష్యం ద్విజే తచ్చ న విద్యతే,

న వై శూద్రో భవే చ్ఛూద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః. 8

సత్యము మున్నగు ఏడు ధర్మములును శూద్రునియందు కానవచ్చినచో అతడు శూద్రుడు కాడు, ద్విజునియందు లేనిచో అతడు బ్రాహ్మణుడయ్యు బ్రాహ్మణుడు కాడు.

సర్వోపాయై స్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహః,

ఏత త్పవిత్రం జ్ఞానానాం తథా చైవాత్మ సంయమః 9

వార్యౌ సర్వాత్మనా తౌ హి శ్రేయోఘాతార్థ ముచ్ఛితౌ.

సర్వములగు ఉపాయములతో లోభమును, క్రోధమును ఎండగట్టవలయును. ఇది జ్ఞానములలో పవిత్రమైనది. అట్లే ఆత్మ సంయమనమును కూడ సాధింపవలయును. శ్రేయస్సునకు తూట్లు పెట్టుటకు తల యెత్తెడు ఆ రెంటిని సర్వాత్మనా నిలువరింపవలయును.

నిత్యం క్రోధా చ్ఛ్రియం రక్షే త్తపో రక్షేచ్చ మత్సరాత్,

విద్యాం మానాపమానాభ్యా మాత్మానం తు ప్రమాదతః. 10

క్రోధమువలన సంపదను, మత్సరమునుండి తపస్సును, మానావమానములనుండి విద్యను, ప్రమాదమునుండి ఆత్మను (బుద్ధిని) రక్షించుకొనవలయును.

యస్య సర్వే సమారంభా నిరాశీ ర్బన్దనా ద్విజ,

త్యాగే యస్య హుతం సర్వం స త్యాగీ స చ బుద్ధిమాన్. 11

అతడు చేయు కర్మములన్నియు ఆశల, బంధనములు లేనివైనచో, అతని సర్వము త్యాగమునందు హుతమైనచో అతడు త్యాగి, బుద్ధిమంతుడు.

అహింస్రః సర్వభూతానాం మైత్రాయణగత శ్చరేత్,

పరిగ్రహాన్ పరిత్యజ్య భవే ద్బుద్ధ్యా జితేన్ద్రియః. 12

సర్వభూతములయందును హింసను చేయనివాడు, స్నేహభావమే పరమ లక్ష్యముగా గలవాడు, ప్రతిగ్రహములను వదలి బుద్ధితో ఇంద్రియములను జయించిన వాడునై మెలగవలయును.

అశోకం స్థానమాతిష్ఠే దిహ చాముత్ర చాభయమ్. 13

శోకములేని స్థానమున ఆభిముఖ్యముతో నిలువవలయును. ఇహపరములయందు అభయమును పొందవలయును.

తపో నిత్యేన దాన్తేన మునినా సంయతాత్మనా,

అజితం జేతుకామేన భావ్యం సంగేష్వసంగినా. 14

తపస్సునందు నిలుకడ కలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, ముని, మనస్సును నిలువరింప గలవాడు, జయింపనలవి కాని మనస్సును జయింప గోరువాడు, సంగ విషయములందు సంగము లేనివాడునై మెలగవలయును.

ఇన్ద్రియై ర్గృహ్యతే యద్య త్తత్త ద్వ్యక్త మితి స్థితిః,

అవ్యక్త మితి విజ్ఞేయం లిఙ్గ గ్రాహ్య మతీన్ద్రియమ్. 15

ఏది ఏది యింద్రియములకు దొరకునో అది అది వ్యక్తమనబడును. లింగమై గ్రహింపదగినది, ఇంద్రియముల పరిధికి మించిపోయినది యగు దానిని అవ్యక్తమని

ఎరుగనగును.

అవిస్రంభేన గన్తవ్యం విస్రంభే ధారయే న్మనః,

మనః ప్రాణే నిగృహ్ణీయాత్ ప్రాణం బ్రహ్మణి ధారయేత్. 16

నమ్మకము లేనిచోటికి పోరాదు. నమ్మకము కలవానియందే మనస్సును నిలుపవలయును. మనస్సును ప్రాణమునందు పట్టియుంచవలయును. ప్రాణమును బ్రహ్మమునందు నిలుపవలయును.

నిర్వేదాదేవ నిర్వాణం న చ కిఞ్చి ద్విచిన్తయేత్,

సుఖం వై బ్రాహ్మణో బ్రహ్మ నిర్వేదే నాధిగచ్ఛతి. 17

వైరాగ్యముచేతనే నిర్వాణము కలుగును. మరి దేనిని ఆలోచింపరాదు. బ్రాహ్మణుడు సుఖముగా బ్రహ్మమును నిర్వేదము తోడనే పొందును.

శౌచేన సతతం యుక్తః సదాచార సమన్వితః,

సానుక్రోశశ్చ భూతేషు తద్విజాతిషు లక్షణమ్. 18

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి భృగుభరద్వాజ సంవాదే
వర్ణస్వరూపకథనే ఏకోననవత్యధిక శతతమోఽధ్యాయః

ఎల్లవేళల పరిశుద్ధతతో కూడినవాడై సదాచారసమన్వితుడై సర్వభూతముల యందును దయగలవాడై యుండవలయును. అది బ్రాహ్మణుల యందు లక్షణము.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమునందు
భృగుభరద్వాజ సంవాదమున వర్ణస్వరూపకథనమున
నూటయెనుబది తొమ్మిదవ అధ్యాయము.

భృగు రువాచ - భృగు విట్లు చెప్పెను.

సత్యం బ్రహ్మ తపః సత్యం సత్యం విసృజతే ప్రజాః,

సత్యేన ధార్యతే లోకః స్వర్గం సత్యేన గచ్ఛతి. 1

సత్యమే బ్రహ్మము, సత్యమే తపస్సు, సత్యము ప్రజలను సృజించుచున్నది. సత్యమే లోకమును పట్టి నిలుపుచున్నది. సత్యముచేతనే నరుడు స్వర్గమున కరుగుచున్నాడు.

అనృతం తమసో రూపం తమసా నీయతే హ్యధః,

తమోగ్రస్తా న పశ్యన్తి ప్రకాశం తమసావృతాః. 2

అనృతము తమస్సుయొక్క రూపము. తమస్సు మానవుని క్రిందికి గుంజివైచును. తమస్సు మ్రింగినవారు, తమస్సు క్రమ్ముకొన్నవారును ప్రకాశమును జూడజాలరు.

స్వర్గః ప్రకాశ ఇత్యాహు ర్నరకం తమ ఏవ చ,

సత్యానృతం తదుభయం ప్రాప్యతే జగతీచరైః.. 3

స్వర్గము ప్రకాశమని, నరకము తమము అని చెప్పుదురు. ఆ రెంటి స్వరూపమైనది సత్యానృతము. దానిని జగతియందు తిరుగువారు పొందుదురు.

తత్రాప్యేవం విధా లోకే వృత్తిః సత్యానృతే భవేత్,

ధర్మాధర్మౌ ప్రకాశశ్చ తమోదుఃఖం సుఖం తథా. 4

ఈ లోకమునందును ఇట్టి వృత్తియే కలుగును. సత్యానృతములు, ధర్మాధర్మములు, ప్రకాశతమస్సులు - సుఖదుఃఖములు (అనుతీరున వృత్తి - వర్తనము) కలుగును.

తత్ర యత్సత్యం సధర్మో యోధర్మః స ప్రకాశో యః ప్రకాశ స్తత్సుఖ మితి.

తత్ర యదనృతం సోఽ ధర్మో యోఽధర్మ స్తత్తమః యత్తమస్తద్దుఃఖ మితి. 5

అందు ఏది సత్యమో అది అధర్మము, ఏది ధర్మమో అది ప్రకాశము (స్వర్గము) ఏది ప్రకాశమో అది సుఖము. అందు ఏది అనృతమో అది ధర్మము, ఏది అధర్మమో అది తమస్సు (నరకము) ఏది తమస్సో అది దుఃఖము.

అత్రోచ్యతే - ఇందు చెప్పబడుచున్నది.

శారీరై ర్మానసై ర్దు:ఖైః సుఖై శ్చాప్యసుఖోదయైః,

లోకసృష్టిం ప్రపశ్యన్తో న ముహ్యన్తి విచక్షణాః. 6

శరీర సంబంధములు, మన స్సంబంధములు అగు దుఃఖములచేతను, దుఃఖములనే పుట్టించు సుఖములచేతను, లోకసృష్టిని జాగ్రత్తతో చూచుచున్నవారై వివేకము కలవారు మోహపడరు.

తత్ర దుఃఖ విమోక్షార్థం ప్రయతేత విచక్షణః,

సుఖం హ్యనిత్యం భూతానా మిహ లోకే పరత్ర చ. 7

దుఃఖ విముక్తికొరకు వివేకవంతుడు ప్రయత్నింపవలయును. సంసారము కలవారికి ఈ లోకమునందును పరలోకమునందును సుఖము అనిత్యము.

రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా న భాసతే,

తథా తమోఽభిభూతానాం భూతానాం నశ్యతే సుఖమ్. 8

రాహువు మ్రింగిన చంద్రుని వెన్నెల ప్రకాశింపదు. అట్లే తమస్సు క్రమ్ముకొన్న ప్రాణుల సుఖము నశించును.

తత్రఖలు ద్వివిధం సుఖముచ్యతే శారీరం మానసం చ. ఇహ

ఖల్వముష్మింశ్చ లోకే వస్తు ప్రవృత్తయః సుఖార్ణ మభిధీయన్తే. న హ్యతః

పరం త్రివర్గఫలం విశిష్టతర మస్తి స ఏవ కామ్యో గుణవిశేషో ధర్మార్థ

గుణారంభ స్తద్ధేతు రస్యోత్పత్తిః సుఖప్రయోజనార్థ ఆరంభః. 9

అందు సుఖము రెండువిధములని చెప్పుదురు. శారీరము, మానసము. ఈ లోకమునందును, పరలోకమునందును వస్తువుల ప్రవృత్తులు సుఖముకొరకు అని చెప్పెదరు. దీనికంటె ఇంకను గొప్పది యగు త్రివర్గముల ఫలము లేదు. అదియే కామ్యమగు గుణవిశేషము. ధర్మార్థగుణారంభము. దానికి కారణము సుఖమును పుట్టించుటయే. సుఖప్రయోజనముకొరకే ఆరంభము.

భరద్వాజ ఉవాచ - భరద్వాజు డిట్లు పలికెను.

యదేతద్భవతాభిహితం సుఖానాం పరమా స్థితి రితి న తదుప

గృహ్ణీమో న హ్యేషా మృషీణాం మహతి స్థితానా మప్రాప్య ఏష కామ్యో

గుణవిశేషో న చైన మభిలషన్తి చ. తపసి శ్రూయతే త్రిలోక కృద్ బ్రహ్మా

ప్రభు రేకాకీ తిష్ఠతి. బ్రహ్మచారీ చ న కామసుఖేష్వాత్మాన మవదధాతి.

అపి చ భగవాన్ విశ్వేశ్వర ఉమాపతిః కామ మభివర్తమాన మనఙ్గత్వేన

శమ మనయత్ . తస్మాద్బ్రూమో నతు మహాత్మభి రయం ప్రతిగృహీతో

న త్వేషాం తావద్విశిష్టో గుణ విశేష ఇతి. నైతద్భగవతః ప్రత్యేమి భగవతా

తూక్తం సుఖాన్న పరమస్తీతి. లోకప్రవాదో హి ద్వివిధః ఫలోదయః సుకృతాత్

సుఖ మవాప్యతే దుష్కృతా ద్దుఃఖమితి. 10

తమరు చెప్పినది - సుఖములకు పరమస్థితి కలదను మాటను - మేము గ్రహింపజాలకున్నాము. ఇంకను మహావిషయమున లక్ష్యము పెట్టుకొనియున్న ఈ ఋషుల కిది కామ్యమను గుణవిశేషము పొందదగినది కాదు. దీనిని వారు అభిలషింపరు. వేదమున వినవచ్చుచున్నది - మూడు లోకములను సృజించు ప్రభువగు బ్రహ్మ ఒంటరియై ఉన్నాడు. మరియు భగవంతుడగు విశ్వేశ్వరుడు ఉమాపతి తన పైకి వచ్చుచున్న కాముని దేహములేనివానినిగా అణచివైచెను. అందువలన చెప్పుచుంటిమి. మహాత్ములు దీనిని ప్రతిగ్రహింపరు. అందువలన ఇది వీరికి విశిష్టమైన గుణవిశేషము కాదు. తమరి యీ మాటయు నేను పట్టుకొనజాలకున్నాను. తమరు సుఖముకంటే పరమమైనది లేదని చెప్పిరి. లోకమున ఈ మాట కలదు. ఫలము ఏర్పడుట రెండు విధములైనది. సుకృతమువలన సుఖము లభించుచున్నది. దుష్కృతమువలన దుఃఖము - అని

భృగు రువాచ - భృగు విట్లు పలికెను.

అత్రోచ్యతే - అనృతాతలు తమః ప్రాదుర్భూతం తత స్తమోగ్రస్తా

అధర్మ మేవానువర్తన్తే న ధర్మం క్రోధలోభహింసాఽనృతాదిభి రవచ్చన్నా

న ఖల్వస్మిన్ లోకే నాముత్ర సుఖ మాప్నువన్తి. వివిధ వ్యాధి రుజోపతాపై

రవకీర్యన్తే వధబన్దన పరిక్లేశాదిభిశ్చ క్షుత్రిపాసా శ్రమకృతై రుపతాపై

రుపతప్యక్తే వర్ష వాతాత్యుష్ణాతి శీతకృతైశ్చ ప్రతిభయైః శారీర దుఃఖై

రుపతప్యన్తే బన్ధు ధన వినాశ విప్రయోగ కృతైశ్చ మానసైః శోకై

రభిభూయన్తో జరామృత్యు కృతై శ్చాన్యై రితి. 11

ఇచట చెప్పుచున్నాము. అనృతమువలనగదా తమస్సు పుట్టుకొని వచ్చుట. పిదప తమస్సు పైకొన్న వారు అధర్మమునే చేయుచుందురు. ధర్మము నాచరింపరు. క్రోధము, లోభము, హింస, అన్నతము మొదలగువానిచేత నిలువెల్ల మునిగిన వారై ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖమును పొందరు. వధము, బంధనము, పెను కష్టములు మున్నగునవి వారిని చుట్టుముట్టును. ఆకలిదప్పులు, శరీరశ్రమలు మున్నగు బాధలు వారిని కాల్చివేయుచుండును. వాన, తీవ్రమగు ఎండ, తీవ్రమగు చలి మొదలగు పెను భయములు వారిని పీడించుచుండును. బంధువుల మరణము, ధనము దొంగలపాలగుట మొదలగు ఎడబాటులు కల్గించిన మానసశోకములు వారిని క్రుంగదీయును. ఇంకను ఇట్టివేయగు ముదిమి, చావు మొదలగునవి హింసించుచుండును.

యస్త్యేతైః శారీరమానసై ర్దుఃఖై ర్నసంస్పృశ్యతే స సుఖం వేద,

న చైతే దోషాః స్వర్గే ప్రాదుర్భవన్తి తత్రఖలు భవన్తి. 12

ఎవడు ఈ శారీరమానస దుఃఖముల స్పర్శను పొందడో అతడే సుఖము నెరుగును. ఈ దోషములు స్వర్గమున పుట్టవు. అందుకలుగవు కదా!

సుసుఖః పవనః స్వర్గే గన్ధశ్చ సురభి స్తథా,

క్షుత్పిపాసా శ్రమో నాస్తి న జరా న చ పాపకమ్. 13

మిక్కిలి సుఖమును కలిగించు వాయువు స్వర్గమున నుండును. గంధము చక్కగా నుండును. ఆకలి దప్పుల శ్రమ అందుండదు. ముదిమియు, పాపమును అందు కలుగవు.

నిత్యమేవ సుఖం స్వర్గే సుఖం దుఃఖ మిహాభయమ్,

నరకే దుఃఖ మేవాహుః సుఖం తత్పరమం పదమ్. 14

స్వర్గమున నిత్యమేయగు సుఖముండును. ఈ లోకమున సుఖము, దుః ఖము రెండు నుండును. ఆపరమపదము కేవలము సుఖము.

పృథివీ సర్వభూతానాం జనిత్రీ తద్విధాః స్త్రియః,

పుమాన్ ప్రజాపతి స్తోత్ర శుక్రం తేజోమయం విదుః. 15

అన్ని భూతములకు తల్లి పృథివి, స్త్రీలు అటువంటివారు. అందు పురుషుడు ప్రజాపతి. శుక్రము తేజోమయమని జ్ఞాను లెరుగుదురు.

ఇత్యేతల్లోక నిర్మాణం బ్రహ్మణా విహితం పురా,

ప్రజాః సమనువర్తన్తే స్వైఃస్వైః కర్మభి రావృతాః. 16

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్ష ధర్మపర్వణి
భృగు భరద్వాజ సంవాదే నవత్యధిక శతతమోఽధ్యాయః

బ్రహ్మ పూర్వము చేసినలోక నిర్మాణ మిట్టిది. తమతమ కర్మములతో చుట్టుకొనబడి ప్రజలు దాని ననుసరించుచున్నారు.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమున భృగు భరద్వాజ
సంవాదముగల నూట తొంబదవ అధ్యాయము.

“శరణాగత సంత్రాణాం భూతానా మప్యహింసనమ్,

బహిర్వేదిచ యద్ధానం దత్త మిత్యభిధీయతే”

“అగ్నిహోత్రం తపఃశౌచం వేదానాం చానుశాసనమ్,

ఆతిథ్యం వైశ్వదేవం చ ఇష్ట మిత్యభిధీయతే".

ఏకాశీత్యధిక శతతమోఽధ్యాయః

181

శుభా, అశుభ కర్మముల పరిణామము

181

ద్వ్యశీత్యధిక శతతమోఽధ్యాయః

182

భృగుభరద్వాజుల సంవాదము

182

వీ హార ధూమార్కానలానిలానాం ఖద్యోత విద్యుత్ స్పటికశశీనామ్,

ఏతావి రూపాణి పురస్పరాణి బ్రహ్మణ్యభి వ్యక్తి కరాణి యోగే”

త్రశీత్యధిక శతతమోఽధ్యాయః

183

మానస భూతోత్పత్తి కథనము

183

184

చతురశీత్యధిక శతతమోఽధ్యాయః

భూత స్వభావ కథనము

184

పఞ్చాశీత్యధిక శతతమోఽధ్యాయః

185

భృగుభరద్వాజ సంవాదము

185

షడశీత్యధిక శతతమోఽధ్యాయః

186

జీవస్వరూపా ఆక్షేపము

186

సప్తాశీత్యధిక శతతమోఽధ్యాయః

187

జీవరూప నిరూపణము

187

అష్టాశీత్యధిక శతతమోఽధ్యాయః

188

వర్ణవిభాగమును చెప్పుట

188

సంధ్యా, స్నానం, జపో, హోమో, దేవతానాం చ పూజనమ్,

ఆతిథ్యం, వైశ్వ దేవం చ షట్కర్మాణి దినేదినే.”

ఏకోననవత్యధిక శతతమోఽధ్యాయః

189

వర్ణ స్వరూప కథనము

189

నవత్యధిక శతతమోఽధ్యాయః

190

వర్ణస్వరూపమును చెప్పుట

190

© 2026 Ebook Library