Chapter_211-220

Back
Book Shanthi Parvam-II
Chapter No 12
Pages 93
Read Time 102 Minutes

Chapter_211-220

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

చతుర్విధాని భూతాని స్థావరాణి చరాణి చ,

అవ్యక్త ప్రభవాన్యాహు రవ్యక్త నిధనాని చ,

అవ్యక్త లక్షణం విద్యా దవ్యక్తిత్మాత్మకం మనః. 1

నాలుగు విధములైన భూతములు, స్థావరములు, జంగమములు అవ్యక్తము నుండి పుట్టినవని, అవ్యక్తమునందే లయము పొందునవని చెప్పుదురు. మనస్సు అవ్యక్త లక్షణమని, అవ్యక్తాత్మాత్మకమని తెలియనగును.

యథా శ్వత్థ కణీకాయా మన్తర్భూతో మహాద్రుమః,

నిష్పన్నో దృశ్యతే వ్యక్త మవ్యక్తా త్సంభవ స్తథా. 2

మఱ్ఱివిత్తనమునందు మహావృక్షము లోలోపల ఉండి వెలుపలికి వచ్చినపుడు స్పష్టముగా కానవచ్చుచున్నది. అట్లే అవ్యక్తమునుండి పుట్టుక అనునది కన్పట్టుట.

అభిద్రవత్యయస్కాన్త మయో నిశ్చేతనం యథా,

స్వభావహేతుజా భావా యద్వ దన్యదపీదృశమ్. 3

చేతనములేని యినుపముక్క అయస్కాంతము వైపు ఒక్క పెట్టున పోవుచున్నది. అట్లే స్వభావము కారణముగా ఏర్పడు భావములు, అటువంటిదే యగు అవిద్య మొదలగునది పరువున వచ్చి చేరుచున్నవి.

తద్వ దవ్యక్తజా భావాః కర్తుః కారణలక్షణాః,

అచేతనా శ్చేతయితుః కారణా దభిసంహితాః. 4

అవిద్యవలన ఏర్పడిన భావములు అచేతనములైనవి కర్తయగు చైతన్యకారకుని కారణలక్షణములై కట్టకట్టుకొని జీవునిలో నుండును.

న భూ ర్న ఖం ద్యౌర్భూతాని నర్షయో న సురాసురాః,

నాన్యదాసీ దృతే జీవ మాపేదు ర్న చ సంహతమ్. 5

భూమి, ఇంద్రియము, ఆకాశము, తక్కిన భూతములు, ప్రాణములు, శమము, కామము మొదలగు భావములు జీవుడు లేక లేవు. జీవుని వెంటనంటియు నుండలేదు.

పూర్వం నిత్యం సర్వగతం మనోహేతు మలక్షణమ్,

అజ్ఞాన కర్మనిర్దిష్ట మేత త్కారణలక్షణమ్. 6

అనాది, నిత్యము, సర్వగతము, మనస్సు హేతువుగా గలది, నిర్వచింపనలవి కానిది, అజ్ఞానకర్మముగా నిర్దిష్టమైనది అగునిది దీనికి కారణ లక్షణము.

తత్కారణై ర్హి సంయుక్తం కార్యసంగ్రహకారకమ్,

యేనైత ద్వర్తతే చక్ర మనాదినిధనం మహత్. 7

అది యిట్టి కారణములతో కూడినట్టిది. కర్మము యొక్క సంగ్రహమును చేయించునది. ఆ సంగ్రహముతో ఆది, అంతములు లేని గొప్పదియగు ఈ చక్రము తిరుగుచున్నది.

అవ్యక్తనాభం వ్యక్తారం వికార పరిమణ్డలమ్,

క్షేత్రజ్ఞాధిష్ఠితం చక్రం స్నిగ్ధాక్షం వర్తతే ధ్రువమ్. 8

అవ్యక్తమనెడునాభి, వ్యక్తమను ఆకులు, వికారమనెడు గుండ్రని స్వరూపము, స్నేహమనెడు జిడ్డు గల ఇరుసు కల ఈ చక్రము క్షేత్రజ్ఞుడు ఎక్కియుండగా ఎల్లవేళల తిరుగుచున్నది.

స్నిగ్ధత్వాత్తిలవత్పర్వం చక్రేఽస్మిన్ పీడ్యతే జగత్,

తిలపీడై రివాక్రమ్య భోగై రజ్ఞాన సంభవైః. 9

అజ్ఞానము చేత ఏర్పడెడు భోగములు, తెలకులవారివలె ఆక్రమించి త్రిప్పుచుండగా ఈ జగత్తంతయు రాగముకలది యగుటవలన నువ్వుల వలె ఈ చక్రమున నలగగొట్టబడుచున్నది.

కర్మ తత్కురుతే తర్షా దహంకార పరిగ్రహాత్.

కార్యకారణసంయోగే సహేతు రుపపాదితః. 10

ఆ చక్రము ఫలమునందలి దాహమువలనను, అహంకారముపట్టువలనను కర్మమును చేయుచున్నది. కార్యకారణ సంయోగమునందు ఆ కర్మము హేతువుగా సమర్థింపబడుచున్నది.

నాభ్యేతి కారణం కార్యం న కార్యం కారణం తథా,

కార్యవ్యక్తేన కరణే కాలో భవతి హేతుమాన్. 11

కారణము కార్యమును, కార్యము కారణమును ప్రవేశింపవు. అధిష్ఠానమునందు కార్యము అభివ్యక్తమగుటకు కాలము కారణముకలదగుచున్నది.

హేతుయుక్తాః ప్రకృతయో వికారాశ్చ పరస్పరమ్,

అన్యోన్య మభివర్తన్తే పురుషాధిష్ఠితాః సదా. 12

పురుషుడు అధిష్ఠించినవగు హేతువుతో కూడిన ప్రకృతులు, వికారములు పరస్పరము ఒకదాని చుట్టు ఒకటి తిరుగుచుండును.

రాజసై స్తామసై ర్భావై శ్చ్యుతో హేతుబలాన్వితః,

క్షేత్రజ్ఞ మేవానుయాతి పాంసు ర్వాతేరితో యథా. 13

రాజసములు, తామసములు అయిన భావముల చేత పూర్వదేహమునుండి జారిన జీవుడు హేతుబలముతో కూడినవాడై గాలికెగురగొట్టబడిన దుమ్ము కణమువలె క్షేత్రజ్ఞునే అనుసరించి పోవును.

న చ తైః స్పృశ్యతే భావై ర్నతే తేన మహాత్మనా,

సరజస్కోఽరజస్కశ్చ నైవ వాయు ర్భవేద్యథా. 14

అతడు ఆ భావములచేత స్పృశింపబడడు. ఆ మహాత్మునితో అవియు స్పర్శను పొందవు. దుమ్ముకలదియో, లేనిదియో అయిన వాయువునకు దాని స్పర్శ ఉండనే ఉండదు కదా!

తథై తదస్తరం విద్యాత్ సత్వక్షేత్రజ్ఞయో ర్బుధః,

అభ్యాసాత్స తథాయుక్తో న గచ్ఛేత్ప్రకృతిం పునః. 15

తెలివిగలవాడు సత్త్వక్షేత్రజ్ఞులకు గల భేదమును ఆవిధముగా తెలియ వలయును. కాని అభ్యాసమువలన ఆ విధముగా కూడియున్నవాడై మరల ప్రకృతిని పొందడు.

సందేహ మేత ముత్పన్న మచ్ఛినద్ భగవా నృషిః,

తథావార్తాం సమీక్షేత కృతలక్షణ సంమితామ్. 16

ఇట్లు పుట్టుకొని వచ్చిన సందేహమును భగవంతుడగు ఋషి తొలగించి వైచెను. కృతలక్షణ సంమితమగు వార్తను ఆ విధముగా సమీక్షింప వలయును.

బీజా న్న్యగ్న్యుపదగ్ధాని న రోహన్తి యథా పునః,

జ్ఞానదగ్ధై స్తథా క్లేశై ర్నాత్మా సంపద్యతే పునః 17

ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి వార్ష్ణే
యాధ్యాత్మకథనే ఏకాదశాధిక ద్విశతతమోఽధ్యాయః

అగ్నికి వేగిన విత్తనములు మరల మొలకెత్తని విధముగా జ్ఞానముతో కాలిపోయిన క్లేశములతో ఆత్మ మరల తగులము పొందదు.

ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మ కథనము గల రెండువందల పదునొకండవ అధ్యాయము.

ఈ అధ్యాయమున క్లేశముల పుట్టుకకు కారణమైన దానిని వదిలించు కొనుటకును, వాని లయమునకు కారణమైనదానిని గ్రహించుటకును ఉపాయమును వివరించు చున్నారు.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

ప్రవృత్తి లక్షణో ధర్మో యథా సముపలభ్యతే,

తేషాం విజ్ఞాననిష్ఠానా మన్యత్తత్వం న రోచతే. 1

కర్మమునందు నిష్ఠ కలవారికి ప్రవృత్తిని తెలియచేయు ధర్మము లభించెడు విధముగా విజ్ఞానమునందు నిష్ఠ కలవారికి దానికంటె వేరగు తత్త్వము రుచింపదు.

దుర్లభా వేదవిద్వాంసో వేదోక్తేషు వ్యవస్థితాః,

ప్రయోజనం మహత్త్వాత్తు మార్గమిచ్ఛన్తి సంస్తుతమ్. 2

వేదవాక్యములయందు నిష్ఠగలవేదవిద్వాంసులు అంత తేలికగా లభింపరు. బుద్ధిశాలులు మిక్కిలిగా ప్రశంసింపదగిన మార్గమును ప్రయోజనమునందలి భేదము ననుసరించి గొప్పది యగుటవలన అనుసరింపగోరుదురు.

సద్భి రాచరితత్వాత్తు వృత్త మేత దగర్హితమ్,

ఇయం సా బుద్ధి రభ్యేత్య యయా యాతి పరాం గతిమ్. 3

నివృత్తి రూపమైన ఈ నడవడి సత్పురుషులు ఆచరించినదగుటచే నిందింపదగినది కాదు. ఈ ఆ బుద్ధిని పొంది నరుడు పరమగతిని చేరుకొనును.

శరీరవా నుపాదత్తే మోహా త్సర్వాన్ పరిగ్రహాన్,

క్రోధలోభాదిభి ర్భావై ర్యుక్తో రాజసతామసైః 4

శరీరమున అభిమానము కలవాడు రాజసములు, తామసములునైన క్రోధము లోభము మొదలగు భావములతో తగులము కలవాడై విషయము లన్నింటిని కైకొనుచుండును.

నా శుద్ధ మాచరే త్తస్మా దభీప్సన్ దేహయాపనమ్,

కర్మణా వివరం కుర్వన్ న లోకా నాప్నుయా ఞ్ఛుభాన్. 5

దేహమును పోగొట్టు కొనుటను ప్రబలముగా కోరుచు అశుద్ధమగు కర్మము నాచరింపరాదు. కర్మముతో ద్వారమును చేయుచు శుభలోకములను స్వీకరింపరాదు.

లోహయుక్తం యథా హేమ విపక్వం న విరాజతే,

తథాఽపక్వ కషాయాఖ్యం విజ్ఞానం న ప్రకాశతే. 6

లోహముతో కలసియున్న బంగారము పాకమునకు రాక విరాజిల్లదు. అట్లే పక్వము కాని కషాయములు గలవానియందు చేసిన ఉపదేశ రూపమైన విజ్ఞానము ప్రకాశింపదు.

యశ్చాధర్మం చరే ల్లోభా త్కామక్రోధా వనుప్లవన్,

ధర్మ్యం ప్రజ్ఞాన మాక్రమ్య సానుబన్ధో వినశ్యతి. 7

కామక్రోధముల వెంటబడి లోభమువలన అధర్మము నాచరించినచో ధర్మమును విడనాడని మార్గమును చెడగొట్టుకొని, సంబంధము గలవానితో పాటు, నశించును.

శబ్దాదీన్ విషయాం స్తస్మా న్న సంరాగా దయం వ్రజేత్,

క్రోధో హర్షో విషాదశ్చ జాయన్తే హ పరస్పరాత్. 8

అందువలన శబ్దము మొదలగు ఇంద్రియవిషయములను అధికమగు రాగముతో పొందరాదు. దానివలన ఒకదానినుండి ఒకటిగా క్రోధము, హర్షము, విషాదము అనునవి పుట్టుకొనివచ్చును.

పఞ్చభూతాత్మకే దేహే సత్త్వే రాజసతామసే,

క మభిష్టువతే చాయం కం వాఽక్రోశతి కిం వదన్. 9

దేహము అయిదు భూతముల స్వరూపమైనది. అట్టిది కాగా ఇతడు ఏమి పలుకుచు ఎవనిని స్తుతించును? ఎవనిని గూర్చి నిందించును?

స్పర్శ రూపరసాద్యేషు సఙ్గం గచ్ఛన్తి బాలిశాః,

నావగచ్ఛన్తి విజ్ఞానా దాత్మానం పార్థివం గుణమ్. 10

పసితనపు బుద్ధిగలవారు స్పర్శ, రూపము, రసము మొదలగు వానియందు తగులము పొందుదురు. తెలివితక్కువతనముతో దేహమును మట్టిదగు గుణముగా తెలియజాలరు.

మృన్మయం శరణం యద్వ న్మృదైవ పరిలిప్యతే,

పార్థివోఽయం తథా దేహో మృద్వికారాన్న నశ్యతి. 11

మట్టితో కట్టబడిన యింటిని మట్టితోడనే అలుకుదురు. అదే విధముగా మట్టిదైన యీదేహముకూడ మట్టినుండి యేర్పడిన పదార్థముతోడనే నశింపకుండును.

మధు, తైలం, పయః, సర్పి ర్మాంసాని, లవణం, గుడః,

ధాన్యాని ఫల మూలాని మృద్వికారాః సహాంభసా. 12

తేనె, నూనె, పాలు, నేయి, మాంసములు, ఉప్పు, బెల్లము, ధాన్యములు, పండ్లు, దుంపలు - ఇవియన్నియు నీటితోపాటుగా మట్టినుండి యేర్పడినవియే.

యద్వత్కాన్తార మాతిష్ఠ న్నౌత్సుక్యం సమనువ్రజేత్,

గ్రామ్య మాహార మాదద్యా దస్వా ద్వపి హి యాపనమ్. 13

సంన్యాసి అడవి నంటి పెట్టుకొనియుండి రుచి గల పదార్థములపై రాగమును పొందకుండును. బ్రతుకును వెళ్లబుచ్చుచుండును.

తద్వ త్సంసార కాన్తార మాతిష్ఠన్ శ్రమతత్పరః,

యాత్రార్థ మద్యా దాహారం వ్యాధితో భేషజం యథా. 14

అట్లే మోక్షకాంక్ష గలవాడు సంసారమను అడవియందుండి శ్రమయే బ్రదుకుగానైనవాడై, కేవలము దేహయాత్రకొరకు - రోగి మందును తీసికొను విధముగా - అన్నమును తినవలయును.

సత్యశౌచార్జవత్యాగై ర్వర్చసా విక్రమేణ చ

క్షాన్త్యా ధృత్యా చ బుద్ధ్యా చ మనసా తపసైవ చ. 15

భావాన్ సర్వా నుపావృత్తాన్ సమీక్ష్య విషయాత్మకాన్,

శాన్తి మిచ్ఛ న్నదీనాత్మా సంయచ్ఛే దిన్ద్రియాణి చ. 16

సత్యము, శుచిత, ఋజుత్వము, త్యాగము, వర్చస్సు, విక్రమము, ఓరిమి, ధైర్యము, బుద్ధి, మనస్సు, తపస్సు అనువానిచేత విషయములే స్వరూపముగా గల భావములన్నియు వానినుండి మరలినవిగా చూచుకొని శాంతిని కోరుచు ఉదార చిత్తుడై ఇంద్రియములను నిలువరింపవలయును.

సత్త్వేన రజసా చైవ తమసా చైవ మోహితాః,

చక్రవత్పరివర్తనే హ్యజ్ఞానా జ్జన్తవో భృశమ్. 17

సత్త్వము, రజస్సు, తమస్సు అను గుణములతో మోహితులై జంతువులు అజ్ఞానమువలన మిక్కిలిగా చక్రమువలె తిరుగుచుందురు.

తస్మా త్సమ్య క్పరీక్షేత దోషా నజ్ఞానసంభవాన్,

అజ్ఞాన ప్రభవం దుఃఖ మహంకారం పరిత్యజేత్. 18

అందువలన అజ్ఞానపు ముద్దుబిడ్డలగు దోషములను మెలకువగా పరికించు చుండవలయును. అజ్ఞానమువలన పుట్టిన దుఃఖమును, అహంకారమును వదలి వేయవలయును.

మహాభూతా నీన్ద్రియాణి గుణా స్సత్త్వం రజస్తమః,

త్రైలోక్యం సేశ్వరం సర్వ మహంకారే ప్రతిష్ఠితమ్. 19

మహాభూతములు, ఇంద్రియములు, సత్త్వరజస్తమోగుణములు ఈశ్వరునితో పాటు మూడురకముల సముదాయము - ఇదియంతయు అహంకారమున నిలువద్రొక్కుకొనియున్నది.

యథేహ నియతః కాలో దర్శయత్యార్తవాన్ గుణాన్,

తద్వద్భూతే ష్వహంకారం విద్యాత్కర్మ ప్రవర్తకమ్. 20

నియతమగు కాలము ఋతుసంబంధములగు గుణముల నెట్లు చూపునో అదేవిధముగా అహంకారము భూతములయందు కర్మములను ప్రవర్తింప జేయునదిగా తెలిసికొన వలయును.

సంమోహకం తమో విద్యాత్ కృష్ణ మజ్ఞానసంభవమ్,

ప్రీతిదుఃఖనిబద్ధాం శ్చ సమస్తాం స్త్రీ నథో గుణాన్. 21

అజ్ఞానమువలన పుట్టెడు తమస్సు నల్లనిది, సమ్మోహమును కలిగించునది అనియు, ప్రీతి, దుఃఖములకు కట్టువడియుండుట అనునవి అందరిని పట్టియుండెడు గుణములనియు తెలియవలయును.

సత్త్వస్య రజస శ్చైవ తమసశ్చ నిబోధ తాన్,

ప్రసాదో హర్షజా ప్రీతి రసందేహో ధృతిః స్మృతిః. 22

సత్త్వము, రజస్సు, తమస్సు అనువాని గుణములను తెలియుము. ప్రసాదము, హర్షమువలన కలుగు ప్రీతి, సందేహములు లేకుండుట, ధృతి, స్మృతి అనునవి సత్త్వము గుణములు. ఇటుపై చెప్పబోవునవి రజస్తమస్సుల గుణములు.

కామక్రోధౌ ప్రమాదశ్చ లోభమోహౌ భయం క్లమః,

విషాదశోకా వరతి ర్మానదర్పా వనార్యతా. 23

కామక్రోధములు, ప్రమాదము, లోభమోహములు, భయము. అలసత అనునవి రాజసములగు గుణములు, విషాదము, శోకము, దేనియందును ప్రీతిలేకుండుట, మానము, దర్పము, నీచత్వము అనునవి తమస్సు గుణములు.

దోషాణా మేవ మాదీనాం పరీక్ష్య గురులాఘవమ్,

విమృశే దాత్మ సంస్థాన మేకైక మనుసంతతమ్. 24

ఇవి మొదలుగా గల గుణములు హెచ్చుతగ్గులను పరిశీలించి తనలోని వీని నొక్కొక్కదానిని ఎల్లవేళల విమర్శించి చూచుకొనవలయును.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

కే దోషా మనసా త్యక్తాః కే బుద్ధ్యా శిథిలీకృతాః,

కే పునః పున రాయాన్తి కే మోహా దఫలా ఇవ. 25

మనస్సుతో (పూర్వము ముముక్షువులు) త్యజించిన దోషములేవి. బుద్ధితో సడలించుకొనినవి ఏవి? మరల మరల వచ్చిపడునవి యేవి? మోహమువలన, వచ్చిపడినను పనికిమాలిన వంటివి ఏవి?

కేషాం బలాబలం బుద్ధ్యా హేతుభి ర్విమృశే ద్భుధః,

ఏష మే సంశయ స్తాత తన్మే బ్రూహి పితామహ. 26

వేని బలమును, బలములేనితనమును బుద్ధిమంతుడు హేతువులతో విమర్శింపవలయును? తాతా! ఇది నా సంశయము. దానిని గూర్చి నీవు చెప్పుము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

దోషై ర్మూలా దవచ్ఛిన్నై ర్విశుద్ధాత్మా విముచ్యతే,

వినాశయతి సంభూత మయస్మయ మథో యథా. 27

మొదలంట కోసివేసిన దోషబలముతో విశుద్ధమగు ఆత్మ కలవాడు విడుదల పొందును. మరల పుట్టిన దోషమును, ఇనుపసంకెలవలె, నశింపజేయును. ఆవిధముగా ధ్యానముతో సంస్కారము పొందిన బుద్ధి తామసములగు దోషములతో పాటు నశించును.

రాజసం తామసం చైవ శుద్ధాత్మక మకల్మషమ్,

తత్సర్వం దేహినాం బీజం సత్య మాత్మవతః సమమ్. 28

తస్మా దాత్మవతా వర్ణ్యం రజశ్చ తమ ఏవ చ,

రాజసము, తామసము, కల్మషములులేని శుద్ధస్వరూపము గల సత్త్వము - ఇది యంతయు దేహులకు బీజము. ఆత్మవంతునకు మాత్రము సత్త్వము సమము. అందువలన ఆత్మవంతుడు రజస్సును, తమస్సును విడనాడవలయును.

రజస్తమోభ్యాం నిర్ముక్తం సత్త్వం నిర్మలతా మియాత్. 29

రజస్సు, తమస్సు అనువానిని పూర్తిగా వదలివైచిన సత్యము నిర్మలతను పొందును.

అథవా మన్త్రవద్ బ్రూయు రాత్మాదానాయ దుష్కృతమ్,

స వై హేతు రనాదానే శుద్ధ ధర్మానుపాలనే. 30

కొందరు బుద్ధిని వశము చేసికొనుటకైన మంత్రముతో కూడిన కర్మమును చెడుపనిగా చెప్పుదురు. శుద్ధమగు ధర్మమును విడువక పాలించుటయందును, వైరాగ్యమునందును అదియే కారణమగును.

రజసాఽధర్మయుక్తాని కార్యాణ్యపి సమాప్నుతే,

అర్థయుక్తాని చాత్యర్థం కామాన్ సర్వాంశ్చ సేవతే. 31

రజోగుణముతో అధర్మముతో కూడిన అర్థయుక్తములైన కార్యములను కూడ పొందుచున్నాడు. మిక్కిలిగా కామములన్నింటిని సేవించుచున్నాడు.

తమసా లోభయుక్తాని క్రోధజాని చ సేవతే,

హింసావిహారాభిరత స్తన్ద్రీనిద్రా సమన్వితః. 32

హింసతో కూడిన తిరుగుళ్లు మరిగి, కునుకుపాటు, నిద్ర అనువానితో కూడినవాడై లోభముతో, క్రోధమువలన పుట్టిన కార్యములను తమస్సుచేత సేవించు చున్నాడు.

సత్త్వస్థ: సాత్త్వికాన్ భావాన్ శుద్ధాన్ పశ్యతి సంశ్రితః,

స దేహీ విమలః శ్రీమాన్ శ్రద్ధావిద్యాసమన్వితః. 33

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణే
యాధ్యాత్మకథనే ద్వాదశాధికశతతమోఽధ్యాయః

శ్రద్ధతో విద్యతో కూడియున్నవాడు, సత్యమున నిష్ఠ కలవాడును, దోషములు లేనివాడు, శ్రీమంతుడు అయి సాత్త్వికములు, శుద్ధములు అగు భావములను

చూచుచుండును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనముగల రెండువందల పన్నెండవ అధ్యాయము

వెనుకటి అధ్యాయము చివరి శ్లోకములను మూడింటిని వ్యాఖ్యానించుటకై ఈ అధ్యాయమును ప్రారంభించుచున్నారు.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

రజసా సాధ్యతే మోహ స్తమసా భరతర్షభ,

క్రోధ లోభౌ భయం దర్ప ఏతేషాం సాదనా చ్ఛుచిః . 1

భరతశ్రేష్ఠా! రజస్సు తమస్సులు మోహమును తెచ్చిపెట్టును. దానివలన క్రోధము, లోభము, భయము, మిడిసిపాటు అనునవియు కలుగును. వీనిని రూపుమాపుటవలన మనుజుడు శుచి యగును.

పరమం పరమాత్మానం దేవ మక్షయ మవ్యయమ్,

విష్ణు మవ్యక్త సంస్థానం విదు స్తం దేవసత్తమమ్. 2

పరముడు, పరమాత్మ, దేవుడు, అక్షయుడు, అవ్యయుడు, అవ్యక్తమున ఉనికి కలవాడు నగు దేవశ్రేష్ఠుని ప్రాచీనులు తెలిసికొనిరి.

తస్య మాయాపినద్ధాఙ్గా నష్టజ్ఞానా విచేతసః,

మానవా జ్ఞానసంమోహా త్తతః క్రోధం ప్రయాన్తి వై. 3

ఆతనిమాయ క్రమ్ముకొన్న అంగములు కలవారు, జ్ఞానము నశించినవారు, వివేకములేనివారు నగు మానవులు జ్ఞానసంమోహమువలన క్రోధము బారిని పడుచున్నారు.

క్రోధా త్కామ మవాప్యాథ లోభమోహౌ చ మానవాః,

మానదర్పా వహంకార మహంకారా త్తతః క్రియాః. 4

క్రియాభిః స్నేహసంబంధాత్ స్నేహా చ్ఛోక మనన్తరమ్,

సుఖ దుఃఖ క్రియారంభా జ్జన్మ జ్జన్మకృతక్షణాః. 5

జన్మతో గర్భవాసం తు శుక్రశోణితసంభవమ్,

పురీష మూత్ర విక్లేదం శోణితప్రభవావిలమ్. 6

మానవులు క్రోధముతో కామమును పొంది పిదప లోభమోహములను, మానదర్పములను, అహంకారమును, దానివలన క్రియలను, క్రియలతో స్నేహ సంబంధము, స్నేహమువలన శోకము పొంది, సుఖదుఃఖముల క్రియారంభముగల జన్మమువలన జననమరణముల స్వీకారములు కలవారగుచున్నారు. జన్మము వలన శుక్రశోణితములతో ఏర్పడిన గర్భవాసము, మలమూత్రములలో మునిగి తేలుట, రక్తముతో ఏర్పడు చీకాకును గలుగుచున్నవి.

తృష్ణాభిభూత స్తై ర్బద్ధ స్తానేవాభిపరిప్లవన్,

సంసారతంత్రవాహిన్య స్తత్ర బుద్ద్యేత యోషితః. 7

పేరాసలు పైకొన్నవాడు, క్రోధాదులకు కట్టుబడిన వాడునై, వానిని దాటగోరు వాడగుచు మొట్టమొదట సంసారతంత్ర వాహినులగు స్త్రీలను గూర్చి తెలియవలయును.

ప్రకృత్యాః క్షేత్రభూతా స్తా నరాః క్షేత్రజ్ఞ లక్షణాః,

తస్మా దేవావిశేషేణ నరోఽతీయా ద్విశేషతః. 8

స్త్రీలు ప్రకృతికి క్షేత్రముగా నయినవారు. నరులు క్షేత్రజ్ఞుని లక్షణములు కలవారు. అందువలననే సామాన్యముగను, విశేషముగను వీరిని దాటిపోవలయును.

కృత్యా హ్యేతా ఘోరరూపా మోహయ న్త్యవిచక్షణాన్,

రజస్యన్తర్హితా మూర్తి రిన్ద్రియాణాం సనాతనీ. 9

వీరు ఘోరరూపలగు కృత్యలు, వివేకములేనివారలను మోహపెట్టుదురు. సనాతనియగు ఇంద్రియముల మూర్తి రజస్సునందు దాగియున్నది.

తస్మా త్తదాత్మకా ద్రాగా ద్బీజా జ్జాయన్తి జన్తవః,

స్వదేహజా నస్వసంజ్ఞాన్ యద్వదఙ్గా త్కృమీం స్త్యతేజ్. 10

అందువలన స్త్రీప్రధానముగాగల రాగమనెడు విత్తనమునుండి జంతువులు పుట్టుచున్నవి. తనదేహము నందే పుట్టి, తనవి కానివిగా నుండెడు పురుగులను ఏ విధముగా త్యజింతుమో, తనవియనుకొనెడునవి, నిజమునకు తనవికానివి అయిన సంతానరూపములగు కృములను కూడ వదలివేయవలయును.

శుక్రతో రసత శ్చైవ దేహా జ్జాయన్తి జన్తవః.

స్వభావాత్ కర్మయోగా ద్వా తా నుపేక్షేత బుద్ధిమాన్, 11

శుక్రమువలన సంతానము, స్వేదజలమువలన సూక్ష్మక్రిములును దేహమునుండి స్వభావమువలననో, కర్మయోగమువలననో పుట్టుచున్నవి. బుద్ధిమంతుడు వానిని ఉపేక్షింపవలయును. (మమకారమును పెంచుకొనరాదని భావము)

రజస్తమసి పర్యస్తం సత్త్వం చ రజసి స్థితమ్,

జ్ఞానాధిష్ఠాన మవ్యక్తం బుద్ధ్యహంకార లక్షణమ్. 12

సత్త్వము రజస్సునందు నెలకొనియున్నది. రజస్సు తమస్సులో కలిసి పోయినది. జ్ఞానమునకు అధిష్ఠానమైన అవ్యక్తము బుద్ధి, అహంకారములతో తెలియవచ్చునది అగును.

తద్బీజం దేహినా మాహు స్తద్బీజం జీవసంజ్ఞితమ్,

కర్మణా కాలయుక్తేన సంసారపరివర్తనమ్. 13

అది దేహులకు బీజమైన జీవమను పేరుగలది అని చెప్పుదురు. కాలముతో కూడిన కర్మముతో సంసారపరివర్తనము ఏర్పడుచున్నది.

రమత్యయం యథా స్వప్నే మనసా దేహవా నివ,

కర్మగర్భై ర్గుణై ర్దేహీ గర్భే తదుపలభ్యతే. 14

ఈ జీవుడు స్వప్నమునందు మనస్సుతో దేహము కలవానివలె రమించుచున్నాడు. అట్లే కర్మము గర్భముగా గల గుణములతో ఈజీవుడు తల్లి గర్భమున దానిని పొందుచున్నాడు.

కర్మణా బీజభూతేన చోద్యతే యద్యదిన్ద్రియమ్,

జాయతే తదహంకారా ద్రాగయుక్తేన చేతసా. 15

విత్తనమువంటి దగు కర్మముతో ఏయే యింద్రియము ప్రచోదన పొందునో అహంకారము వలన రాగముతోకూడిన చేతస్సుతో అది అది పుట్టుకొనివచ్చును.

శబ్దరాగా చ్ఛ్రోత్రమస్య జాయతే భావితాత్మనః,

రూపరాగా త్తథా చక్షు ర్ఘ్రాణం గన్దచికీర్షయా. 16

స్పర్శనే త్వ క్తథా వాయుః ప్రాణాపాన వ్యపాశ్రయః,

వ్యానోదానౌ సమానశ్చ పఞ్చధా దేహయాపనమ్. 17

దానికి శబ్దమునందలి రాగమువలన చెవి, రూపరాగమువలన కన్ను, గంధమును కూర్చుకొనుకోరికతో ముక్కు, స్పర్శనమునందలి యిచ్ఛవలనచర్మము, దేహయాత్రను నిర్వహించునట్టి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను అయిదు విధములైన వాయువు ఏర్పడుచున్నవి.

సఞ్జాతై ర్జాయతే గాత్రైః కర్మజై ర్వర్ష్మణా వృతః,

దుఃఖాద్యనై ర్థుఃఖమధ్యె ర్నరః శారీరమానసైః. 18

ఇట్లు చక్కగా ఏర్పడినవి, కర్మమువలన పుట్టినవి యగు చెవి మున్నగు అంగములతో రూపొందిన నరుడు చర్మముతో కప్పబడినవాడై పుట్టుచున్నాడు. శరీరసంబంధములు, మనస్సంబంధములు, దుఃఖములు ఆది, అంతములలో, నడుమను గలిగినట్టి ఆ యవయవములతో పుట్టుచున్నాడు.

దుఃఖం విద్యా దుపాదానా దభిమానా చ్చ వర్ధతే,

త్యాగా త్తేభ్యో నిరోధః స్యాన్నిరోధజ్ఞో విముచ్యతే. 19

దుఃఖము ఉపాదానమువలన కలిగినదని తెలియదగును. అభిమానముచే వృద్ధి పొందును. దేహత్యాగము వలనను పెంపొందును. అందువలన వానినుండి నిరోధము చేయవలయును. నిరోధము నెరిగినవాడు ముక్తి పొందును.

ఇన్ద్రియాణాం రజస్యేవ ప్రళయప్రభవా వుభౌ,

పరీక్ష్య సంచరే ద్విద్వాన్ యథావ చ్ఛాస్త్ర చక్షుషా. 20

ఇంద్రియముల వినాశము, ఉత్పత్తి అను రెండును రజస్సునందే యగును. విద్వాంసుడు చక్కగా శాస్త్రమను కంటితో పరికించి, అది చూపినట్లు మెలగ వలయును.

జ్ఞానేన్ద్రియాణీ న్ద్రియార్థా న్నోపసర్ప న్త్యతర్షులమ్,

హీనైశ్చ కరణై ర్దేహీ న దేహం పున రర్హతి. 21

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి వార్ష్ణే
యాధ్యాత్మకథనే త్రయోదశాధికద్విశతతమోఽధ్యాయః

తృష్ణలేనివానిని, ఇంద్రియార్థములపై వ్యాపించినను జ్ఞానేంద్రియములు సమీపింపజాలవు. క్షీణించిన యింద్రియములతో దేహి మరల దేహమును పొందడు.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనముగల రెండువందల పదుమూడవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లనెను.

అత్రోపాయం ప్రవక్ష్యామి యథావ చ్ఛాస్త్రచక్షుషా,

తత్త్వజ్ఞానా చ్చరన్ రాజన్ ప్రాప్నుయాత్ పరమాం గతిమ్. 1

రాజా! శాస్త్రమను కంటితో దర్శించి ఇందు ఉపాయమును జెప్పెదను. తత్త్వజ్ఞానమును పొంది మెలగుచు పరమగతిని పొందవలయును.

సర్వేషా మేవ భూతానాం పురుషః శ్రేష్ఠ ఉచ్యతే,

పురుషేభ్యో ద్విజా నాహుర్ద్విజేభ్యో మన్త్రదర్శినః. 2

సర్వభూతాత్మభూతాస్తే సర్వజ్ఞాః సర్వదర్శినః,

బ్రాహ్మణా వేదశాస్త్రజ్ఞా స్తత్త్వార్థ గతనిశ్చయాః. 3

భూతములన్నింటిలో మానవుడు శ్రేష్ఠుడు. మానవులలో సంస్కారమును పొందినవారు ఉత్తములు. వారిలో మన్త్రములను దర్శించినవారు ఇంకను గొప్పవారు. అట్టివారు సర్వభూతముల ఆత్మయు తమ ఆత్మయే అయినవారు సర్వజ్ఞులు, సర్వమును దర్శించువారు వేదశాస్త్రముల తత్త్వము నెరిగినవారు. తత్వము అర్థమునకు సంబంధించి నిశ్చయము పొందినవారు బ్రహ్మజ్ఞాన సంపన్నులు.

నేత్రహీనో యథా హ్యేకః కృచ్ఛ్రాణి లభతేఽధ్వని,

జ్ఞానహీన స్తథా లోకే తస్మాద్ జ్ఞానవిదోఽధికాః. 4

కన్నులు లేనివాడు దారిలో పడరానిపాట్లు పడును. అట్లే లోకమున జ్ఞానము లేనివాడును. అందువలన జ్ఞానము నెరిగిన వారు గొప్పవారు

తాం స్తా నుపాసతే ధర్మాన్ ధర్మకామా యథాగమమ్,

నత్వేషా మర్థసామాన్య మన్తరేణ గుణా నిమాన్. 5

ధర్మమును కోరువారు శాస్త్రముల ననుసరించి ఆయా ధర్మములను ఉపాసింతురు. ఈగుణములు లేక వీరికి ఫలసామ్యము కలుగదు.

వాగ్దేహమనసాం శౌచం క్షమా సత్యం ధృతిః స్మృతిః,

సర్వధర్మేషు ధర్మజ్ఞా జ్ఞాపయన్తి గుణా ఞ్ఛుభాన్. 6

వాక్కు, దేహము, మనస్సు అనువాని శౌచము, ఓర్పు, సత్యము, ధృతి, స్మృతి అనునవి ధర్మము లన్నింటియందును శుభములగు గుణములని ధర్మతత్వ మెరిగినవారు తెలియజెప్పుదురు.

యదిదం బ్రహ్మణో రూపం బ్రహ్మచర్య మితి స్మృతమ్,

పరం తత్సర్వ ధర్మేభ్య స్తేన యాన్తి పరాం గతిమ్. 7

బ్రహ్మము రూపమే యనదగు బ్రహ్మచర్యమను ధర్మమేది కలదో అది సర్వధర్మములకంటెను మిన్న అయినది. దానితో నరులు పరమగతి కరుగుదురు.

లిఙ్గ సంయోగహీనం యచ్ఛబ్ద స్పర్శ వివర్జితమ్,

శ్రోత్రేణ శ్రవణం చైవ చక్షుషా చైవ దర్శనమ్. 8

వాక్సంభాషా ప్రవృత్తం యత్తన్మనః పరివర్జితమ్,

బుద్ధ్యా చాధ్యవసీయేత బ్రహ్మచర్య మకల్మషమ్. 9

లింగముతో సంయోగము లేనిది, శబ్ద స్పర్శములను వదలివైచినది, చెవితో వినుటను, కంటితో చూచుటను, వాక్కుతో పలుకుట అను ప్రవృత్తిని, భావించుట అను మనస్సు వ్యాపారమును అను వీనిని పూర్తిగా వదలివైచినది అగు కల్మషములు లేని బ్రహ్మచర్యమును బుద్ధితో నిశ్చయించు కొనవలయును.

సమ్యగ్వృత్తి ర్బ్రహ్మలోకం ప్రాప్నుయా న్మధ్యమః సురాన్,

ద్విజాగ్ర్యో జాయతే విద్వాన్ కన్యసీం వృత్తి మాస్థితః. 10

ఈబ్రహ్మచర్యమును చక్కగా నిర్వహించువాడు బ్రహ్మలోకమునకు - మోక్షమునకు - అరుగును. మధ్యముడు దేవతలను చేరుకొనును. ఇంకను తక్కువ వృత్తి నవలంబించువాడు తత్త్వమెరిగిన ద్విజశ్రేష్ఠుడుగా పుట్టును.

సుదుష్కరం బ్రహ్మచర్య ముపాయం తత్ర మే శృణు,

సుప్రదీప్త ముదీర్ణం చ నిగృహ్ణీయా ద్ద్విజో రజః. 11

ఈ బ్రహ్మచర్యము మిక్కిలి దుష్కరమైనది. అందు ఉపాయమును చెప్పెదను వినుము. పుట్టి పెరుగుచుండెడు రజస్సును ద్విజుడు అణచివేయవలయును.

యోషితాం న కథా శ్రావ్యా న నిరీక్ష్యా నిరంబరాః,

కథఞ్చి ద్దర్శనా దాసాం దుర్బలానాం విశే ద్రజః. 12

స్త్రీలకు సంబంధించిన మాటయు వినదగినది కాదు. వస్త్రములేని వారి నెన్నడును చూడరాదు. వారి దర్శనమువలన దుర్బలులకు ఎట్లైనను రాగము చొరబారును.

రాగోత్పన్న శ్చరేత్ కృచ్ఛ్రం మహార్తిః ప్రవిశే దపః,

మగ్నః స్వప్నే చ మనసా త్రి ర్జపే దఘమర్షణమ్. 13

రాగము పుట్టినవాడు కృచ్ఛ్రము నాచరింపవలయును. గొప్ప ఆర్తి కలవాడై కలలో మనస్సుతో జారినవాడు నీటిలో మునిగి మూడుసారులు అఘమర్షణమును జపింపవలయును.

పాప్మానం నిర్దహే దేవ మన్తర్భూత రజోమయమ్,

జ్ఞానయుక్తేన మనసా సంతతేన విచక్షణః. 14

లోలోపల ఉన్నరాగముతో కూడిన ఇట్టి పాపమును జ్ఞానముతో కూడిన ఎగతెగని మనస్సుతో వివేకము కలవాడై కాల్చివేయవలయును.

కుణపామేధ్య సంయుక్తం యద్వ దచ్ఛిన్న బంధనమ్,

తద్వద్దేహగతం విద్యా దాత్మానం దేహబన్ధనమ్. 15

అమేధ్యముతో కూడిన ప్రేగుల సముదాయము దేహమున తెగనిబంధముతో నుండునట్లు దేహము నందున్న ఆత్మ దేహమున కట్టుబడియున్నదని తెలియ వలయును.

వాత పిత్త కఫాద్రక్తం త్వఙ్మాంసం స్నాయు మస్థి చ,

మజ్జాం దేహం శిరాజాలై స్తర్పయన్తి రసా నృణామ్. 16

పెక్కువిధములగు రసములు వాతము, పిత్తము, కఫము అనువానివలన నేర్పడు రక్తమును, చర్మమును, మాంసమును, స్నాయువును, అస్థిని, మజ్జను - మొత్తము దేహమును శిరల సముదాయములతో తృప్తి పరచుచుండును.

దశ విద్యా ద్ధమన్యోఽత్ర పఞ్చేన్ద్రియగుణావహాః,

యాభిః సూక్ష్మాః ప్రతాయన్తే ధమన్యోఽ న్యాః సహస్రశః. 17

అయిదు ఇంద్రియగుణములను ప్రసారము చేయునట్టి పదిధమనులు ఇందు కలవు. వానినుండి వేలకొలది ఇతరధమనులు అల్లిబిల్లిగా అల్లుకొని దేహమున వ్యాపించి యున్నవి.

ఏవ మేతాః శిరా నద్యో రసోదా దేహ సాగరమ్,

తర్పయన్తి యథాకాల మాపగా ఇవ సాగరమ్. 18

ఇట్లీ శిరలనెడు నదులు రసమనెడు నీరు కలవియై దేహమనెడు సాగరమును కాలానుసారముగా, నదులు సముద్రమును వలె, తృప్తిపరచుచున్నవి.

మధ్యే చ హృదయస్యైకా శిరా తత్ర మనోవహా,

శుక్రం సంకల్పజం నౄణాం సర్వగాత్రై ర్విముఞ్చతి. 19

హృదయము నడుమ మనోవహ యనెడు ఒక శిర కలదు. అది సంకల్పము వలన పుట్టెడు శుక్రమును నరుల అవయములన్నింటినుండి గ్రహించి వదలుచుండును.

సర్వగాత్ర ప్రతాయిన్యస్త స్యా హ్యనుగతా శిరాః,

నేత్రయోః ప్రతిపద్యన్తే వహన్య స్తైజసం గుణమ్. 20

ఆ మనోవహయనెడు శిరను అనుసరించి అన్ని అవయవములకు వ్యాపించి యున్న శిరలు కలవు. అగ్ని సంబంధమగు గుణమును మోసికొనిపోవు శిరలు కనులయందు చేరుకొనుచున్నవి.

పయస్య న్తర్హితం సర్పి ర్యద్వ న్నిర్మథ్యతే ఖజైః,

శుక్రం నిర్మథ్యతే తద్వద్దేహ సంకల్పజైః ఖజైః. 21

పాలలో కనబడకుండ నున్న నేతిని (వెన్నను) కవ్వములు చిలికి పైకి తెచ్చు విధమున, దేహమునందలి సంకల్పములవలన ఏర్పడు భావములనెడు కవ్వములు శుక్రమును చిలుకును.

స్వప్నేఽప్యేవం యథాఽభ్యేతి మనఃసంకల్పజం రజః,

శుక్రం సంకల్పజం దేహాత్ సృజత్యస్య మనోవహా. 22

కలయందు సంకల్పమువలన పుట్టిన రజస్సు మనస్సును చేరుకొనును. అట్టివాని దేహమునుండి మనోవహయనునాడి సంకల్పమువలన కలిగెడు శుక్రమును వెలుపలికి వదలును.

మహర్షి ర్భగవా నత్రి ర్వేద తచ్ఛుక్ర సంభవమ్,

త్రిబీజ మిన్ద్రదైవత్యం తస్మా దిన్ద్రియ ముచ్యతే, 23

మహర్షి అత్రి భగవానుడు ఆ శుక్రము పుట్టుకను ఎరిగినవాడు. అది మూడు బీజములు గలది, ఇంద్రుడు దేవతగా గలది అనియును ఎరిగెను. అందువలన దానిని ఇంద్రియమందురు.

యేవై శుక్రగతిం విద్యు ర్భూతసంకరకారికామ్,

విరాగా దగ్ధదోషా స్తే నాప్నుయు ర్దేహసంభవమ్. 24

భూతములలో సంకరమును చేయునట్టి శుక్రగతిని చక్కగా తెలిసినవారు రాగము విడనాడినవారు, కాలిపోయిన దోషములు కలవారునై మరల దేహ మేర్పడుటను పొందరు.

గుణానాం సామ్య మాగమ్య మనసైవ మనోవహమ్,

దేహకర్మా నుదన్ ప్రాణా నంతకాలే విముచ్యతే. 25

దేహమాత్రమునకై కర్మములను చేయువాడు మనస్సుతోడనే గుణ సామ్యమును సాధించి మనోవహము వైపు అంతకాలమున ప్రాణములను ప్రేరణ చేయుచు విడుదల పొందును.

భవితా మనసో జ్ఞానం మన ఏవ ప్రజాయతే,

జ్యోతిష్మ ద్విరజో నిత్యం మన్త్రసిద్ధం మహాత్మనామ్. 26

మనస్సంబంధి జ్ఞానము కలుగును. మహాత్ముల మంత్రసిద్ధము, జ్యోతి ష్మంతము, విరజము, నిత్యము అగు మనస్సే అయి పుట్టును.

తస్మాత్తదభిఘాతాయ కర్మ కుర్యా దకల్మషమ్,

రజ స్తమశ్చ హిత్వేహ యథేష్టాం గతి మాప్నుయాత్. 27

అందువలన ఆ మనస్సు లయమగుటకు అకల్మషమగు కర్మమును చేయవలయును. రజస్తమస్సులను ఇక్కడనే వదలివైచి మోక్షమును పొందును.

తరుణాధిగతం జ్ఞానం జరాదుర్బలతాం గతమ్,

విపక్వబుద్ధిః కాలేన ఆదత్తే మానసం బలమ్. 28

మంచి వయస్సులో పొందిన జ్ఞానము ముసలితనముతో బలము తరిగినది అగును. చక్కగా పాకమునకు వచ్చిన బుద్ధిగలవాడు కాలముమీద మానసమైన బలమును సంహరించును.

సుదుర్గ మివ పన్థాన మతీత్య గుణబంధనమ్,

యథా పశ్యేత్తథా దోషా నతీత్యామృత మశ్నుతే. 29

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణేయాధ్యాత్మకథనే చతుర్దశాధికద్విశతతమోఽధ్యాయః

ఇది మిక్కిలిగా కష్టసాధ్యమైన మార్గము. దీనిని దాటి దేహాదులు బంధనమును సాధకుడు పోగొట్టుకొనును. దోషములను మొదలంట పరిశీలించి చూచి వానిని దాటుకొని అమృతము ననుభవించును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనముగల రెండువందల పదునాలుగవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

దురన్తే ష్విన్ద్రియార్థేషు సక్తాః సీదన్తి జన్తవః,

య త్వసక్తా మహాత్మాన స్తే యాన్తి పరమాం గతిమ్. 1

దురంతములగు ఇంద్రియవిషయములందు తగులుకొనిన జంతువులు నశించిపోవుదురు. అట్టి తగులము లేనివారు పరమగతి కరుగుదురు.

జన్మమృత్యు జరాదుఃఖై ర్వ్యాధిభిర్మానసక్లమైః,

దృష్ట్వైవ సంతతం లోకం ఘటేన్మోక్షాయ బుద్ధిమాన్. 2

పుట్టుక, చావు, ముసలితనము అను దుఃఖములతో, పెనురోగములతో, మనస్సునకు చెందిన క్లేశములతో వ్యాప్తమైయున్న లోకమును చూచి బుద్ధిమంతుడు మోక్షమునకు ప్రయత్నింపవలయును.

వాఙ్మనోభ్యాం శరీరేణ శుచిః స్యా దనహంకృతః,

ప్రశాన్తో జ్ఞానవాన్ భిక్షు ర్నిరపేక్ష శ్చరేత్సుఖమ్. 3

వాక్కుతో, మనస్సుతో, దేహముతో పరిశుద్ధుడై అహంకారములేనివాడై, ప్రశాంతుడై, జ్ఞానము కలవాడై, ఏ అపేక్షలును లేనివాడై సంన్యాసియై సుఖముగా తిరుగుచుండవలయును.

అథవా మనసః సఙ్గం పశ్యే ద్భూతానుకంపయా

తత్రాప్యుపేక్షాం కుర్వీత జ్ఞాత్వా కర్మఫలం జగత్. 4

భూతములపై జాలితో కూడ మనస్సుతగులమును పరిశీలింపవలయును. జగత్తు కర్మమే ఫలముగా గలది యని గుర్తించి అందును ఉపేక్షనే వహింపవలయును.

యత్కృతం స్యాచ్ఛుభం కర్మ పాపం వా యది వాశ్నుతే,

తస్మా చ్ఛుభాని కర్మాణి కుర్యా ద్వా బుద్ధికర్మభిః. 5

ఏ పనిని చేసి శుభఫలమును పొందునో, దేనిని చేసి పాపము ననుభవించునో దానిని చక్కగా పరిశీలించి శుభములగు కర్మములనే బుద్ధి కర్మములతో చేయవలయును.

అహింసా సత్యవచనం సర్వభూతేషు చార్జవమ్,

క్షమా చై వా ప్రమాదశ్చ యస్యైతే స సుఖీ భవేత్ 6

అహింస, సత్యవచనము, ప్రాణులన్నిటియందును సమబుద్ధితో నుండుట, ఓర్పు, పొరపాటు పడకుండుట- ఇవి ఎవనికుండునో వాడు సుఖవంతుడగును.

తస్మా త్సమాహితం బుద్ద్యా మనో భూతేషు ధారయేత్,

యశ్చైవం పరమం ధర్మం సర్వభూత సుఖావహమ్. 7

అందువలన బుద్ధితో నిశ్చలతను పొందిన మనస్సును సర్వభూతములయందును నిలుపవలయును. అట్టివాడు సర్వభూతములకు సుఖమును కూర్చెడు ఈ పరమధర్మమును చేయువాడగును.

దుఃఖా న్నిస్సరణం వేద సర్వజ్ఞః స సుఖీ భవేత్,

తస్మాత్ సమాహితం బుద్ధ్యా మనో భూతేషు ధారయేత్, 8

దుఃఖమునుండి బయటపడుట తెలిసినవాడు సర్వజ్ఞుడు. అట్టివాడు సుఖవంతుడగును. అందువలన బుద్ధితో నిశ్చలతను పొందిన మనస్సును సర్వభూతములయందును నిలుపవలయును.

నాపధ్యాయే న్న స్పృహయే న్నా బద్ధం చిన్తయే దసత్,

అథామోఘప్రయత్నేన మనో జ్ఞానే నివేశయేత్. 9

తప్పుడు ఆలోచనలు చేయరాదు. అబద్ధమునందు ఆశలు పెట్టుకొనరాదు. అసత్తును గూర్చి భావింపరాదు. వ్యర్థము కాని ప్రయత్నముతో మనస్సును జ్ఞానమునందు పట్టి నిలుపవలయును. వాక్కు చేతను, మొక్కవోని ప్రయాస చేతను మనోజ్ఞమగు జ్ఞానము ప్రవర్తించును.

వివక్షతా చ సద్వాక్యం ధర్మం సూక్ష్మ మపేక్షతా,

సత్యాం వాచ మహింస్రాంచ వదే దనపవాదినీమ్. 10

సూక్ష్మమగు ధర్మమును పరిశీలించువాడు, సద్వాక్యమును పలుకగోరు వాడునునగు సాధకుడు సత్యము, హింసలేనిది, అపవాదములు లేనిది యగుపలుకును పలుకవలయును.

కల్కాపేతా మపరుషా మనృశంసా మపైశునామ్,

ఈదృ గల్పం చ వక్తవ్య మవిక్షిప్తేన చేతసా. 11

క్రూరత లేనిది, పరుషము కానిది, పాపము కానిది అయిన వాక్కును, తక్కువగా చెదరుపాటులేని చిత్తముతో పలుక వలయును.

వాక్ప్రబద్ధో హి సంసారో విరాగా ద్వ్యాహరే ద్యది,

బుద్ధ్యాప్యను గృహీతేన మనసా కర్మతామసమ్. 12

ఈ సంసారము వాక్కుతో కట్టుబడినట్టిది. తామసమైన కర్మము కూడ బుద్ధితో అనుగ్రహింపబడిన మనస్సుతో, రాగములేనితనమువలన ప్రకటించినచో నశించును.

రజోభూతై ర్హి కరణైః కర్మణి ప్రతిపద్యతే,

స దుఃఖం ప్రాప లోకేఽస్మి న్నరకా యోపపద్యతే,

తస్మా న్మనోవాక్ఛరీరై రాచరే ద్ధైర్య మాత్మనః, 13

మలినములైన ఇంద్రియములతో కర్మమునందు ప్రవర్తించునేని అట్టివాడు ఈ లోకమున దుఃఖమును పొంది పిదప నరకమునకు గురియగును. అందువలన మనస్సుతో, మాటతో, చేష్టలతో, ధీరభావమును నిండుగా కూర్చుకొనవలయును.

ప్రకీర్ణమేషభారం హి యద్వద్ధార్యేత దస్యుభిః,

ప్రతిలోమాం దిశం బుద్ధ్వా సంసార మబుధా స్తథా. 14

తమేవ చ యథా దస్యుః క్షిప్త్వా గచ్ఛే చ్చివాం దిశమ్,

తథా రజస్తమః కర్మా ణ్యుత్స్పజ్య ప్రాప్నుయాచ్ఛుభమ్. 15

దొంగలు మాంసపు మోపును మోసికొనిపోవునట్లు వివేకములేనివారు సంసారభారమును మోయుచుందురు. ఆ దొంగలే అది తమకు అనుకూలము కాని దిక్కని గుర్తించి ఆ బరువును విసరివైచి శుభయైన దిక్కున కరుగుదురు. అదే విధముగా రజస్తమోగుణముల కర్మములను వదలివైచి శుభమును పొందవలయును.

నిఃసందిగ్ధ మనీహో వై ముక్తః సర్వపరిగ్రహైః,

వివిక్తచారీ లఘ్వాశీ తపస్వీ నియతేన్ద్రియః. 16

జ్ఞానదగ్ధ పరిక్లేశః ప్రయోగరతి రాత్మవాన్,

నిష్ప్రచారేణ మనసా పరం తదధిగచ్ఛతి. 17

చేష్టలు లేనివాడు పరిగ్రహములన్నింటిచేత విడువబడినవాడు, ఏకాంతమున తిరుగువాడు, అల్పముగా భుజించువాడు, తపస్వి, ఇంద్రియముల నదుపున పెట్టుకున్నవాడు, జ్ఞానము కాల్చివేసిన సర్వకష్టములు కలవాడు, యోగమార్గమున ప్రీతికలవాడు, ఆత్మవంతుడు, తిరుగుళ్లు మరగని మనస్సుతో ఆ పరమును చేరుకొనును.

ధృతిమా నాత్మవాన్ బుద్ధిం నిగృహ్ణీయా దసంశయమ్,

మనోబుద్ధ్యా నిగృహ్ణీయా ద్విషయా న్మనసాఽఽత్మనః. 18

ధృతి కలవాడు, బుద్ధి కలవాడు బుద్ధిని తప్పనిసరిగా నిలువరింప వలయును. బుద్ధితో మనస్సును, మనస్సుతో ఆత్మవిషయములను పట్టియుంచవలయును.

నిగృహీతేన్ద్రియ స్యాస్య కుర్వాణస్య మనో వశే,

దేవతా స్తత్ప్రకాశన్తే హృష్టా యాన్తి తమీశ్వరమ్. 19

ఇంద్రియములను పట్టుకొన్నవాడును, మనస్సును వశమందుంచు కొన్నవాడును నగు నతనికి దేవతలు ప్రకాశింతురు. ఆనందమందినవారై ఈశ్వరుడగు నాతనిని చేరుకొందురు.

తాభిః సుయుక్తమనసో బ్రహ్మ తత్సంప్రకాశతే,

శనై శ్చాపగతే సత్త్వే బ్రహ్మభూయాయ కల్పతే. 20

వానితో కూడియున్న మనస్సు కలవానికి ఆ బ్రహ్మము చక్కగా ప్రకాశించును. మెల్లగా ఆ బుద్ధియు తొలగిపోయినపుడు బ్రహ్మభావమునకు యోగ్యుడగును.

అథవా న ప్రవర్తేత యోగతన్త్రై రుపక్రమేత్,

యేన తస్త్రయత స్తన్త్రం వృత్తిః స్యా త్త త్త దాచరేత్. 21

ఒకవేళ ఆ విధముగా ప్రవర్తింపజాలకున్నచో, యోగతంత్రములతో సాధనను ప్రారంభింపవలయును. తంత్రము ననుష్ఠించువాడు ఏయేరూపముతో వృత్తిని పొందునో దానిదాని నాచరింపవలయును.

కణకుల్మాష పిణ్యాక శాక యావక సక్తవః,

తథా మూలఫలం భైక్ష్యం పర్యాయేణోపయోజయేత్. 22

కణము, కుల్మాషము, పిండి, కూరలు, గంజి, పేలపిండి, దుంపలు, పండ్లు, భిక్షాన్నము అనువానిని ఒకటి విడిచి ఒకటి ఉపయోగించుచుండవలయును.

ఆహార నియమం చైవ దేశే కాలే చ సాత్తికమ్,

తత్పరీక్ష్యానువర్తేత తత్ప్రవృత్త్యనుపూర్వకమ్. 23

ఉచితమగు దేశమున, తగు సమయమున సాత్త్వికమగు ఆహారమును నియమ పూర్వకముగా తీసికొనవలయును. అదియును చక్కగా పరీక్షించి, సంన్యాసి ప్రవృత్తికి తగిన విధమైనదానినే స్వీకరించుచుండవలయును.

ప్రవృత్తం నోపరున్ధేత శనై రగ్ని మివేన్ధయేత్,

జ్ఞానాన్వితం తథా జ్ఞాన మర్కవత్సంప్రకాశతే. 24

మొదలిడిన కర్మము యోగమున అంతరాయమును కల్పింపరాదు. మెల్లగా జ్ఞానముతో కూడిన కర్మమును అగ్నివలె పెంపొందింపవలయును. అట్లు చేయుచున్నవానికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించుచుండును.

జ్ఞానాధిష్ఠాన మజ్ఞానం త్రీన్ లోకా నధితిష్ఠతి,

విజ్ఞానానుగతం జ్ఞాన మజ్ఞానే నాపకృష్యతే. 25

జ్ఞానముపై ఆధారపడియుండెడు అజ్ఞానము మూడులోకములను ఆవరించియున్నది. బుద్ధి ననుసరించు జ్ఞానము అజ్ఞానముచేత క్రిందికి గుంజివేయబడును.

పృథక్త్వాత్ సంప్రయోగాచ్చ నాసూయు ర్వేద శాశ్వతమ్.

స తయో రపవర్గజ్ఞో వీతరాగో విముచ్యతే. 26

వేరుగానుండిన దగుటవలనను, కలసియుండుటవలనను అసూయ గలవాడు. శాశ్వతమైన ఆ బ్రహ్మతత్వము నెరుగడు. ఆ రెండింటి అపవర్గముల నెరిగినవాడు రాగము నశించినవాడై బంధమునుండి విడివడును.

వయోతీతో జరామృత్యూ జిత్వా బ్రహ్మ సనాతనమ్,

అమృతం తదవాప్నోతి యత్తదక్షర మవ్యయమ్. 27

ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణే యాధ్యాత్మకథనే
పంచదశాధికద్విశతతమోఽధ్యాయః

వయస్సు పరిగణింపనివాడు, ముదిమిని, మృత్యువును గెలిచినవాడు, సనాతనము, అమృతము, అక్షరము, అవ్యయమునగు బ్రహ్మమును పొందును.

ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున వార్ష్ణే యాధ్యాత్మ కథనముగల రెండువందల పదునైదవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

నిష్కల్మషం బ్రహ్మచర్య మిచ్ఛతా చరితుం సదా,

నిద్రా సర్వాత్మనా త్యాజ్యా స్వప్నదోషా నవేక్షతా. 1

ఎట్టి దోషములు లేని బ్రహ్మచర్యమును ఎల్లవేళలు పాటింప గోరు వాడు, కలలయందలి దోషములను గమనించువాడై, నిండు బుద్ధితో నిద్రను వదలవలయును.

స్వప్నే హి రజసా దేహీ తమసా చాభిభూయతే,

దేహాన్తర మివాపన్న శ్చరత్యపగతస్పృహః. 2

ఏలయన స్వప్నమునందు దేహిని రజస్సును, తమస్సును పైకొనును. అట్టివాడు, మరియొక దేహమును పొందినవానివలె, స్పృహ లేనివాడై మెలగు చుండును.

జ్ఞానాభ్యాసా జ్జాగరణం జిజ్ఞాసార్థ మనన్తరమ్,

విజ్ఞానాభినివేశాత్తు స జాగర్త్యనిశం సదా. 3

జ్ఞానాభ్యాసమువలనను, జిజ్ఞాస కొరకును జాగరణము అవసరము. విజ్ఞానము నందలి పట్టుదల వలన అతడు రాత్రింబవళ్లు మేలుకొనియే యుండును.

అత్రాహ కోన్వయం భావః స్వప్నే విషయవానివ,

ప్రలీనై రిన్ద్రియై ర్దేహీ వర్తతే దేహవానివ. 4

ఇందు ఈభావమేమై యుండును? అని ఒకడు అడుగవచ్చును. స్వప్నమునందు దేహి విషయములు కలవానివలె, పూర్తిగా లయము పొందిన ఇంద్రియములతో దేహము కలవానివలె మెలగును.

అత్రోచ్యతే యథాహ్యేత ద్వేద యోగేశ్వరో హరిః,

తథైత దుపపన్నార్థం వర్ణయన్తి మహర్షయః. 5

యోగేశ్వరుడగు హరి దీని నెట్టెరిగెనో దానిని ఈ విషయమున చెప్పుచున్నాను. ఈ చక్కగా సరిపడు అర్థమును మహర్షులు వర్ణింతురు.

ఇన్ద్రియాణాం శ్రమాత్ స్వప్న మాహుః సర్వగతం బుధాః,

మనస స్త్వప్రలీనత్వా త్తత్తదాహు ర్నిదర్శనమ్. 6

బుధులు సర్వగతమగు స్వప్నమును ఇంద్రియముల శ్రమమువలన మనస్సు ప్రలీనము కాకుండుట వలననైనదిగా చెప్పుదురు. దానికి ఆయా నిదర్శనమును కూడ చెప్పుదురు.

కార్యేవ్యాసక్త మనసః సంకల్పో జాగ్రతో హ్యపి,

యద్వన్మనో రథైశ్వర్యం స్వప్నే తద్వన్మనో గతమ్. 7

మెలకువలో నున్నవాడు ఒక పనియందు లగ్నమైన మనస్సు కలవాడైనను అతనికి కోరికల ఐశ్వర్యము నెడల సంకల్పము కలుగుచుండును. అట్లే మనసు నందున్న మనోరథముల ఐశ్వర్యము స్వప్నమున కానవచ్చును.

సంసారాణా మసంఖ్యానాం కామాత్మా తదవాప్నుయాత్,

మనస్యన్తర్హితం సర్వం స వేదోత్తమపూరుషః. 8

విషయములయందు కోరికలుగల చిత్తము కలవాడు లెక్కపెట్టలేని సంసారముల స్వప్నాదుల ఐశ్వర్యమును పొందును. మనస్సు మూతపెట్టి ఉంచిన ఆ సర్వమును ఉత్తమ పురుషుడగు అతడు ఎరుగును.

గుణానా మపి యద్యేత త్కర్మణా చాప్యుపస్థితమ్,

తత్త చ్ఛంసన్తి భూతాని మనో యద్భావితం యథా. 9

గుణములనడుమ ఏది ఏది కర్మముతో ఏర్పడి యున్నదో, మరియు ఏది కర్మముతో భావితమై మనస్సుగా నున్నదో దాని దానిని భూతములు స్వప్నమున చెప్పుచుండును.

తతః సముపసర్పన్తి గుణా రాజసతామసాః,

సాత్త్వికా వా యథాయోగ మానన్తర్య ఫలోదయమ్. 10

అటు పైరాజసతామసభావములో సాత్త్వికములో యథాయోగముగా వెనువెంటనే సుఖాదులు కలుగు విధముగా అతనిని చేరుకొనును.

తతః పశ్యన్త్యసంబుద్ధ్యా వాతపిత్త కఫోత్తరాన్,

రజస్తమోగతై ర్భావై స్తద ప్యాహు ర్దురత్యయమ్. 11

అంత అజ్ఞానమువలన వాతము, పిత్తము, కఫము అనునవి ప్రధానముగా గల దేహములను రజస్తమోగతములగు భావములతో చూచెదరు. అదియు అంత సులభముగా నశించునది కాదు.

ప్రసన్నై రిన్ద్రియై ర్యద్య త్సంకల్పయతి మానసమ్,

తత్తత్స్వప్నేఽప్యుపగతే మనో హృష్య న్నిర్నీక్షతే. 12

ప్రసన్నములగు ఇంద్రియములతో మనస్సు దేనిని దేనిని సంకల్పించునో అది అది కలయందు కానరాగా మనసు ఆనందపడుచు చూచుచుండును.

వ్యాపకం సర్వభూతేషు వర్తతేఽప్రతిఘం మనః,

ఆత్మ ప్రభావాత్తం విద్యాత్ సర్వాహ్యాత్మని దేవతాః. 13

మనస్సు సర్వభూతములయందును ఏ ఆటంకములు లేనిదై వ్యాపించి యుండునది. ఆత్మప్రభావమువలన ఆ ఆత్మను ఎరుగవలయును. దేవతలన్నియు ఆత్మయందున్నవియే కదా!

మనస్యన్తర్హితం ద్వారం దేహ మాస్థాయ మానుషమ్,

యద్యత్సదసదవ్యక్తం స్వపిత్యస్మిన్నిదర్శనమ్,

సర్వభూతా త్మభూతస్థం తమధ్యాత్మగుణం విదుః. 14

ద్వారమైన స్థూలదేహమును మనస్సునందు దాగియుండినదానిని గ్రహించి అవ్యక్తమునందు నిద్రించును.

సదసదాత్మకము, అవ్యక్తము, నిదర్శనము, సర్వభూతములకు ఆత్మభూతమైన దానియందుండునది ఆగు దానిని అధ్యాత్మ గుణముగా తత్త్వవేత్త లెరుగుదురు.

లిప్సేత మనసా యశ్చ సంకల్పా దైశ్వరం గుణమ్,

ఆత్మప్రసాదం తం విద్యా త్సర్వా హ్యాత్మని దేవతాః. 15

ఎవడు మనస్సుతో, సంకల్పమువలన ఈశ్వరసంబంధమగు గుణమును పొందగోరునో అట్టివానిని ఆత్మప్రసాదస్వరూపునిగా తెలియవలయును. ఏలయన ఆత్మయందే సర్వదేవతలు ఉండును.

ఏవం హి తపసా యుక్త మర్కవత్తమసః పరమ్,

త్రైలోక్యప్రకృతి ర్దేహీ తమసోఽమహేశ్వరః. 16

ఇట్లు తపస్సుతో కూడి మనస్సు సూర్యునివలె చీకటికి ఆవలనున్నట్టిది. దేహి మూడులోకముల సముదాయము ప్రకృతిగా గలవాడై తమస్సు నశించిన వెనుక మహేశ్వరుడగును.

తపో హ్యధిష్ఠితం దేవై స్తపోఘ్న మసురై స్తమః,

ఏతద్దేవాసురై ర్గుప్తం తదాహు ర్జ్ఞా నలక్షణమ్. 17

దేవతలు తపస్సునంటి పెట్టుకొనియుండిరి. అసురులు తపస్సును పాడు చేయు తమస్సు నాశ్రయించిరి. ఇట్టిది దేవాసురులకు కానరానిదై యుండినది. దానినే జ్ఞానలక్షణముగా చెప్పుదురు.

సత్త్వం రజ స్తమ శ్చేతి దేవా సుర గుణాన్ విదుః,

సత్త్వం దేవగుణం విద్యా దితరా వాసురౌ గుణా. 18

సత్త్వము, రజస్సు, తమస్సు అనునవి దేవతల, అసురుల గుణములు. సత్త్వము దేవగుణమనియు, తక్కిన రెండును అసురగుణములనియు తెలియవలయును.

బ్రహ్మ తత్పరమం జ్ఞాన మమృతం జ్యోతి రక్షరమ్,

యే విదు ర్భావితాత్మాన స్తే యాన్తి పరమాం గతిమ్. 19

బ్రహ్మము వానికంటె మిన్న అయినది. అదియే జ్ఞానము, అమృతము, జ్యోతి, అక్షరము. భావితాత్ములై దాని నెరిగినవారు పరమగతి కరుగుదురు.

హేతు మచ్ఛక్య మాఖ్యాతు మేతావజ్జ్ఞా నచక్షుషా,

ప్రత్యాహారేణ వా శక్య మక్షరం బ్రహ్మ వేదితుమ్. 20

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
వార్ష్ణేయాధ్యాత్మకథనే షోడశాధిక ద్విశతతమోఽధ్యాయః

జ్ఞానమే కన్నుగానయినవాడు బ్రహ్మమును గురించి యింతమాత్రము హేతుపూర్వకముగా చెప్పగలుగును. అక్షరమగు బ్రహ్మమును ప్రత్యాహారముతో తెలియుటకు సాధ్యమగును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనమున రెండువందల పదునారవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

న స వేద పరం బ్రహ్మ యో న వేద చతుష్టయమ్,

వ్యక్తావ్యక్తం చ యత్తత్త్వం సంప్రోక్తం పరమర్షిణా. 1

పరమర్షి చక్కగా బోధించిన వ్యక్తావ్యక్త తత్త్వమగు పరబ్రహ్మమును, నాలుగింటి సముదాయము నెఱుగనివాడు ఎరుగజాలడు.

వ్యక్తం మృత్యుముఖం విద్యా దవ్యక్త మమృతం పదమ్,

ప్రవృత్తిలక్షణం ధర్మ మృషి ర్నారాయణోఽబ్రవీత్. 2

వ్యక్తము మృత్యుముఖమనియు, అవ్యక్తము అమృతపదమనియు తెలియదగును. ప్రవృత్తిలక్షణమగు ధర్మమును నారాయణ స్వరూపమగు వేదము పలికినది.

తత్రైవావసితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్,

నివృత్తిలక్షణం ధర్మ మవ్యక్తం బ్రహ్మ శాశ్వతమ్. 3

చరము, అచరములతో కూడిన మూడులోకముల సముదాయమంతయు అందే కట్టుబడియున్నది. నివృత్తి లక్షణమగు ధర్మము అవ్యక్తము, శాశ్వతము నగు బ్రహ్మమే.

ప్రవృత్తిలక్షణం ధర్మం ప్రజాపతి రథాబ్రవీత్,

ప్రవృత్తిః పునరావృత్తి ర్నివృత్తిః పరమాగతిః. 4

ప్రవృత్తి లక్షణమగు ధర్మమును ప్రజాపతి ఉపదేశించెను. ప్రవృత్తి మరల రాకడ కలిగినట్టిది. నివృత్తి పరమమైన గతి.

తాం గతిం పరమా మేతి నివృత్తి పరమో మునిః,

జ్ఞానతత్త్వపరో నిత్యం శుభాశుభనిదర్శకః. 5

శుభమును, అశుభమును నిశ్చయముగా చూడగోరినవాడగుచు, జ్ఞానతత్త్వమున మునిగితేలెడువాడు, నివృత్తియందు మిక్కిలి శ్రద్ద కలవాడును అగు ముని ఆ పరమగతిని పొందును.

తదేవ మేతౌ విజ్ఞేయా వవ్యక్తపురుషా వుభౌ,

అవ్యక్తపురుషాభ్యాం తు యత్స్యా దన్య న్మహత్తరమ్. 6

ఆ తత్త్వవిచారమున ఈవిధముగా అవ్యక్తము, పురుషుడు అనునీయిరువురు చక్కగా తెలియవలసినవారు. ఈ అవ్యక్తపురుషులకంటె వేరుగానున్నది మహత్తరము.

తం విశేష మవేక్షేత విశేషేణ విచక్షణః,

అనాద్యన్తా వుభా వేతా వలిఙ్గౌ చాప్యుభా వపి. 7

వివేకవంతుడు ఆ విశేషమును విశేషదృష్టితో చూడవలయును. ఈరెండును, ఆది అంతములు లేనివి. రెండును అలింగములు.

ఉభౌ నిత్యా వవిచలౌ మహద్భ్యశ్చ మహత్తరౌ,

సామాన్య మేత దుభయో రేవం హ్యన్యద్విశేషణమ్. 8

ఈ రెండును నిత్యములు, సుస్థిరమైనవి, మహత్తులకంటెను మహత్తరములు. ఇది ఈ రెంటికి సామాన్యలక్షణము. మరియొకటి విశేషణము ఈ విధమైనట్టిది.

ప్రకృత్యా సర్గధర్మిణ్యా తథా త్రిగుణధర్మయా,

విపరీత మతో విద్యాత్ క్షేత్రజ్ఞస్య స్వలక్షణమ్. 9

సృజించుట ధర్మముగా గలదియు, మూడు గుణములు ధర్మములుగా గలదియునగు ప్రకృతితో క్షేత్రజ్ఞుని స్వలక్షణము విపరీతమైనదని తెలియదగును.

ప్రకృతేశ్చ వికారాణాం ద్రష్టార మగుణాన్వితమ్,

అగ్రాహ్యౌ పురుషా వేతా వలిఙ్గత్వా దసంహతౌ. 10

ప్రకృతివికారములను దర్శించువానినిగా గుణములతో కూడియుండని వానినిగా పురుషుని తెలిసికొనవలయును. ఇక ఈ పురుషులు (క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడు అనువారు) గ్రహింపజాలనివారు. తెలియదగు లక్షణములు లేనివారగుటవలన కూడియుండువారు కారు.

సంయోగలక్షణోత్పత్తిః కర్మణా గృహ్యతే యథా,

కరణైః కర్మనిర్వృత్తిః కర్తా యద్యద్విచేష్టతే,

కీర్త్యతే శబ్దసంజ్ఞాభిః కోఽహ మేషోఽప్యసా వితి. 11

సంయోగము, లక్షణము, ఉత్పత్తి కలవాడు, కర్మముతో గ్రహింపబడును. కరణములతో కర్మము దేనివలన ఉత్పన్నమగునో అదియే కర్త. అదియే వేరువేరు విధములుగా చేష్టలు చేయించుచుండును. నేనెవరు? అదియేమి? మొదలగు విధములుగా శబ్దసంజ్ఞలతో దానిని వ్యవహరించుచుందురు.

ఉష్ణీషవాన్ యథా వస్త్రై స్త్రిభి ర్భవతి సంవృతః,

సంవృతోఽయం తథా దేహీ సత్త్వ రాజసతామసైః. 12

తలపాగచుట్టుకొన్నవాడు ముప్పేట వస్త్రముతో కప్పబడినట్లు, దేహి మూడింటితో - సత్తము, రజస్సు, తమస్సు - అనువానితో కప్పబడియున్నాడు.

తస్మాచ్చతుష్టయం వేద్య మేతై ర్హేతుభి రావృతమ్,

యథా సంజ్ఞో హ్యయం సమ్య గన్తకాలే న ముహ్యతి. 13

ఈ కారణములతో కప్పబడినదగు నాల్గింటి సముదాయము కూడ తెలియ దగినది. చెప్పిన విధముగా జ్ఞానము నతిక్రమింపనివాడు అంతకాలమున మోహపడడు.

శ్రియం దివ్యా మభిప్రేప్సు ర్వర్ష్మవాన్ మనసా శుచిః,

శారీరై ర్నియమై రుగ్రై శ్చరే న్నిష్కల్మషం తపః. 14

ఈ దివ్యసంపదను చక్కగా పొందగోరిన దేహవంతుడు మనస్సుతో పరిశుద్ధుడై ఉగ్రములైన శరీరసంబంధములగు నియమములతో నిష్కల్మషమైన తపము నాచరింపవలయును.

త్రైలోక్యం తపసా వ్యాప్త మన్తర్భూతేన భాస్వతా,

సూర్యశ్చ చన్ద్రమా శ్చైవ భాసత స్తపసా దివి. 15

లోపలనుండి వెలుగొందు తపస్సుతో మూడు లోకముల సముదాయము వ్యాప్తమై యున్నది. ఆకాశమున సూర్యుడు, చంద్రుడును తపస్సుచేతనే భాసించుచున్నారు.

ప్రకాశ స్తపసో జ్ఞానం లోకే సంశబ్దితం తపః,

రజ స్తమోఘ్నం యత్కర్మ తపప స్తత్ స్వలక్షణమ్. 16

తపస్సు యొక్క ఫలము జ్ఞానమే. అట్టిదానికే లోకమున ‘తపస్సు’ అనిపేరు. రజస్సు, తమస్సు, అనువానిని రూపుమాపు కర్మమేది కలదో అదియే తపస్సు స్వలక్షణము.

బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే,

వాఙ్మనో నియమం సమ్య ఙ్మానసం తప ఉచ్యతే. 17

బ్రహ్మచర్యము, అహింస అనునది శరీరసంబంధమగు తపస్సు. వాక్కును, మనస్సును చక్కగా నియమించుట మానసమగు తపస్సు.

విధిజ్ఞేభ్యో ద్విజాతిభ్యో గ్రాహ్య మన్నం విశిష్యతే,

ఆహారనియమే నాస్య పాప్మా శామ్యతి రాజసః. 18

శాస్త్రవిధులను చక్కగా నెరిగిన ఉత్తమ సంస్కారవంతుల నుండి గ్రహించెడు అన్నము మేలైనది. ఆహారనియమముచేత ఇతని రాజసమగు పాపము అణగారును.

వైమనస్యం చ విషయే యాన్త్యస్య కరణాని చ,

తస్మా తన్మాత్ర మాదద్యా ద్యాదంత్ర ప్రయోజనమ్. 19

ఆట్లు ఆహారము తీసికొనువాని ఇంద్రియములు కూడ విషయమునందు వైరాగ్యమును పొందును. అందువలన ప్రయోజనము ఎంతయో అంతమాత్రమే గ్రహింపవలయును.

అన్తకాలే బలోత్కర్షా చ్ఛనైః కుర్యా దనాతురః,

ఏవం యుక్తేన మనసా జ్ఞానం యదుపపద్యతే. 20

యోగముతో కూడిన మనస్సుతో పొందెడు జ్ఞానమును అంతకాలమున ఏ తొందరలు లేనివాడై మెల్లమెల్లగా బలము నధికముగా నుపయోగించుట వలనను సాధింపవచ్చును.

రజో వర్జ్యోఽప్యయం దేహీ దేహవా ఞ్ఛబ్దవచ్చరేత్,

కార్యై రవ్యాహతమతి ర్వైరాగ్యా త్ప్రకృతా స్థితః. 21

ఈ దేహి రజస్సును వదలివేసినవాడైనను దేహముకలవాడై శబ్దాదులు గల సూక్ష్మశరీరమున తిరుగాడవలయును. కార్యములు నిలువరింపని బుద్ధిగలవాడు వైరాగ్యము వలన ప్రకృతియందు నిలిచినవాడగును.

ఆ దేహా దప్రమాదా చ్చ దేహాన్తా ద్విప్రముచ్యతే,

హేతుయుక్తః సదా సర్గో భూతానాం ప్రలయ స్తథా. 22

దేహము ఉన్నంతవరకు ప్రమాదము లేకుండుట వలన దేహమురాలి పోగా యోగి విప్రముక్తుడగును. హేతువుతో కూడిన సృష్టియు, ప్రళయమును ఎల్లవేళల భూతముల కగును.

పరప్రత్యయసర్గే తు నియతి ర్నానువర్తతే,

భావాన్తప్రభవప్రజ్ఞా ఆసతే యే విపర్యయమ్. 23

పరమైన ప్రత్యయము పుట్టునపుడన్ననో నియతి వెంటనంటిరాదు. తారుమారైన స్థితిని పొందియుండువారు భావముల ఉత్పత్తినాశములయందే ప్రజ్ఞ కలవారగుదురు.

ధృత్యా దేహాన్ ధారయన్తో బుద్ధిసంక్షిప్తచేతసః,

స్థానేభ్యో ధ్వంసమానాశ్చ సూక్ష్మత్త్యా త్తా నుపాసతే. 24

ధృతితో దేహములను ధరించుచు బుద్ధితో కుంచించుకొనిపోయిన చేతస్సు కలవారై స్థానములనుండి జారిపోయినవారగుచు సూక్ష్మమగుటవలన వానిని ఉపాసించుచుందురు.

యథాగమం చ గత్వా వై బుద్ధ్యాత త్రైవ బుద్ధ్యతే,

దేహాన్తం కశ్చి దన్వాస్తే భావితాత్మా నిరాశ్రయమ్. 25

ఆగమము ననుసరించి ఆ యా స్థానమును చేరుకొని అందే పరమమైన స్థితిని తెలిసికొనును. ఆ నిరాశ్రయమైన దేహాంతమును భావితాత్ము డెవడో ఒక్కడు తెలిసికొని అందు నిష్ఠతో నుండును.

యుక్తం ధారణయా సమ్యక్ సతః కేచి దుపాసతే,

అభ్యస్యన్తి పరం దేవం విద్యుత్సంశబ్దితాక్షరమ్. 26

ఒకడు ధారణతో కూడిన ఆత్మను చక్కగా ఉపాసించును. కొందరు సత్పదార్థమును ఉపాసింతురు. మరికొందరు విద్యుత్తు అను పేరుగల అవ్యయమగు పరమైన దేవుని అభ్యసింతురు.

అన్తకాలే హ్యుపాసన్తే తపసా దగ్ధకిల్బిషాః,

సర్వ ఏతే మహాత్మానో గచ్ఛన్తి పరమాం గతిమ్. 27

తపస్సుచేత కాలిపోయిన పాపములు కలవారు అంతకాలమున ఉపాసింతురు. ఈ మహాత్ములందరు పరమగతి కరుగుదురు.

సూక్ష్మం విశేషణం తేషా మవేక్షే చ్ఛాస్త్రచక్షుషా,

దేహాన్తం పరమం విద్యాద్ విముక్త మపరిగ్రహమ్. 28

శాస్త్రమనుకంటితో వాని సూక్ష్మమగు విశేషణమును దేహాంతమే పరమమనుదానిని చక్కగా తెలిసికొనవలయును. విముక్తుడు, పరిగ్రహము లేనివాడు, ధారణయందు లగ్నమైన మనస్సు కలవాడునగు యోగి అంతరిక్షము మొదలగు వానిలో ఒక్కడని తెలియదగును.

అన్తరిక్షా దన్యతరం ధారణాసక్త మానసమ్,

మర్త్యలోకా ద్విముచ్యన్తే విద్యాసంసక్తచేతసః. 29

విద్యయందు గట్టిగా లగ్నమయిన చేతస్సు కలవారు మర్త్యలోకమునుండి విముక్తి పొందెదరు.

బ్రహ్మభూతా విరజస స్తతో యాన్తి పరాం గతిమ్,

ఏవ మేకాయనం ధర్మ మాహు ర్వేదవిదో జనాః. 30

అట్టివారు రజస్సు స్పర్శలేనివారు బ్రహ్మభూతులునై, పరమగతి కరుగుదురు. ఇట్లు వేదము నెరిగిన జనులు ఈ ధర్మమును ఒకేగతి కలదిగా చెప్పుదురు.

యథాజ్ఞాన ముపాసన్తః సర్వే యాన్తి పరాం గతిమ్,

కషాయ వర్జితం జ్ఞానం యేషా ముత్పద్యతేఽచలమ్. 31

జ్ఞానము నుపాసించు వారందరును పరమగతి కరుగుదురు. దోషములేనిది, స్థిరమైనది అగు జ్ఞానము ఎవరికి కలుగునో వారును పరలోకముల కరిగి వారి వారి వైరాగ్య బలమును బట్టి ముక్తి నందుదురు.

భగవన్త మజం దివ్యం విష్ణు మవ్యక్త సంజ్ఞితమ్,

భావేన యాన్తి శుద్ధా యే జ్ఞానతృప్తా నిరాశిషః. 32

భగవంతుడు, అజుడు, దివ్యుడు, విష్ణువు, అవ్యక్తమను వ్యవహారము కలవాడునగు పరమాత్ముని జ్ఞానముతో పరిశుద్ధులై తృప్తినందినవారు, ఆశలు ఏమాత్రము లేనివారునై భావముతో చేరుకొందురు.

జ్ఞాత్వాత్మస్థం హరిం చైవ న నివర్తన్తి తేఽవ్యయాః,

ప్రాప్య తత్పరమం స్థానం మోదన్తేఽక్షర మవ్యయమ్. 33

ఆత్మమునందున్న హరిని చక్కగా తెలిసికొని మరల వెనుకకు మరలనివారు అవ్యయు లగుదురు. అక్షరము, అవ్యయమునగు ఆపరమస్థానమును పొంది ఆనంద మందుదురు.

ఏతావ దేత ద్విజ్ఞాన మేత దస్తి చ నాస్తి చ,

తృష్ణా బద్ధం జగత్సర్వం చక్రవత్పరివర్తతే. 34

ఇది యీ విజ్ఞాన స్వరూపము. ఈ జగత్తు కొందరికి కలదు. కొందరికి లేదు. ఈ సమస్తమగు జగత్తును తృష్ణకు కట్టువడి చక్రమువలె తిరుగుచున్నది.

బిసతన్తు ర్యథైవాయ మన్తస్థః సర్వతో బిసే,

తృష్ణాతన్తు రనాద్యన్త స్తథా దేహగతః సదా. 35

తామరతూడులో దారమనునది దానిలోపల అంతటను వ్యాపించియుండును. అట్లే తుదిమొదలులేని తృష్ణ అనుదారము ఎల్లవేళల దేహమందంతటను వ్యాపించియుండును.

సూచ్యా సూత్రం యథా వస్త్రే సంసారయతి వాయక:,

తద్వత్సంసారసూత్రం హి తృష్ణా సూచ్యా నిబద్ధ్యతే. 36

సాలెవాడు వస్త్రమున సూదితో దారమును అల్లివేయునట్లు తృష్ణ అనెడు సంసారమను సూత్రము అల్లుకొని కట్టువడియున్నది.

వికారం ప్రకృతిం చైవ పురుషం చ సనాతనమ్,

యో యథావ ద్విజానాతి స వితృష్ణో విముచ్యతే. 37

వికారము, ప్రకృతి, సనాతనుడగు పురుషుడు అనువీనిని ఉన్నదున్నట్లుగా తెలిసికొనినవాడు జగత్తునందలి పేరాసను వదలుకొని ముక్తి నందును.

ప్రకాశం భగవా నేత దృష్టి ర్నారాయణోఽమృతమ్,

భూతానా మమకంపార్థం జగాద జగతో గతిః. 38

ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణే యాధ్యాత్మకథనే సప్తదశాధికద్విశతతమోఽధ్యాయః

ఈ మోక్షసాధనమును భగవంతుడు, ఋషి, జగత్తునకు గతియగు నారాయణుడు ప్రాణులయెడల దయతో స్పష్టముగా తెలియజెప్పెను.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్ష ధర్మపర్వమున వార్ష్ణేయాధ్యాత్మకథనముగల రెండువందలపదునేడవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.

కేన వృత్తేన వృత్తజ్ఞ జనకో మిథిలాధిపః,

జగామ మోక్షం మోక్షజ్ఞో భోగా నుత్సృజ్య మానుషాన్. 1

వృత్తజ్ఞా! మిథిలాధిపతి జనకుడు, మోక్షతత్త్వమెరిగినవాడై మానుషములగు భోగములను వదలివైచి, ఏనడవడితో మోక్షమును పొందెను?

భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.

అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,

యేన వృత్తేన ధర్మజ్ఞః స జగామ మహత్సుఖమ్. 2

ఈ విషయమున ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుకొందురు. అది ఆధర్మజ్ఞుడు ఏనడవడితో మహాసుఖమును పొందెనో తెలియజేయును.

జనకో జనదేవస్తు మిథిలాయాం జనాధిపః,

ఔర్ధ్వదైహికధర్మాణా మాసీ ద్యుక్తో విచిన్తనే. 3

జనకవంశమువాడు, మిథిలకు అధిపతి జనదేవుడు దేహమున కావలిదగు బ్రహ్మమును పొందించు ధర్మముల విచారణలో పరమాసక్తి కలవాడై యుండెను.

తస్య స్మ శత మాచార్యా వసన్తి సతతం గృహే,

దర్శయన్తః పృథగ్ధర్మా న్నానాశ్రమనివాసినః. 4

అతనియింట పెక్కుఆశ్రమములయందు నెలకొనియుండు వారు, వేర్వేరు ధర్మములను ప్రదర్శించువారు నూరుగురు ఆచార్యులు ఉండెడివారు.

స తేషాం ప్రేత్య భావే చ ప్రేత్య జాతే వినిశ్చయే,

ఆగమస్థః స భూయిష్ఠ మాత్మతత్త్వే న తుష్యతి. 5

అతడు వారు చెప్పెడు మరణానంతరము స్థితిని గూర్చియు, మరణము తరువాత పుట్టుకను గూర్చియు నిశ్చయమునందు, ఆగమభావములయందు నిలుకడకలవాడు కనుక, మిక్కిలి తృప్తి నందకుండెను.

తత్ర పఞ్చశిఖో నామ కాపిలేయో మహామునిః,

పరిధావ న్మహీం కృత్స్నాం జగామ మిథిలా మథ. 6

అందు కపిలకొడుకు మహాముని పంచశిఖుడనువాడు భూమినంతటిని తిరుగుచు ఒకనాడు మిథిలను చేరుకొనెను.

సర్వ సంన్యాసధర్మాణాం తత్త్వజ్ఞానవినిశ్చయే,

సుపర్యవసితార్థశ్చ నిర్ద్వన్ద్వో నష్టసంశయః. 7

అతడు సన్యాసధర్మములన్నింటి తత్త్వజ్ఞానమును సిద్ధాంతముచేయుటలో చక్కగా నిర్ణయించిన ప్రయోజనము కలవాడు, వికల్పములు లేనివాడు, సంశయములు సమసిపోయినవాడు.

ఋషీణా మాహు రేకం తం యం కామానావృతం నృషు,

శాశ్వతం సుఖ మత్యంత మన్విచ్ఛన్తం సుదుర్లభమ్. 8

అతడు ఋషులలో ఒకడు. కామములు క్రమ్ముకొననివాడు. నరుల యందుమిక్కిలి దుర్లభమైన శాశ్వతసుఖమును నెలకొల్పవలయునను కోరికకలవాడు - అనిచెప్పుకొనుచుందురు.

య మాహుః కపిలం సాంఖ్యాః పరమర్షిం ప్రజాపతిమ్,

స మన్యే తేన రూపేణ విస్మాపయతి హి స్వయమ్. 9

సాంఖ్యులు పరమఋషియని, ప్రజాపతియనియు ప్రశంసించు కపిలుడు ఆతనిరూపముతో స్వయముగా అందరను ఆశ్చర్యపరచుచుండెను.

ఆసురేః ప్రథమం శిష్యం య మాహు శ్చిరజీవినమ్,

పఞ్చస్రోతసి యః సత్ర మాస్తే వర్షసహస్రకమ్. 10

ఆతనిని గూర్చి, ఆసురి మొదటి శిష్యుడనియు, చిరంజీవి యనియు పంచ స్రోతస్సు అను తావునందు వేయియేండ్ల సత్రయాగము చేసె ననియు చెప్పుకొందురు

యత్ర చాసీన మాగమ్య కాపిలం మన్డలం మహత్,

పఞ్చస్రోతసి నిష్ణాతః పఞ్చరాత్ర విశారదః. 11

పఞ్చజ్ఞః పఞ్చకృత్పఞ్చగుణః పఞ్చ శిఖః స్మృతః,

పురుషావస్థ మవ్యక్తం పరమార్థం న్యవేదయత్. 12

ఆతడు కూర్చుండగా కపిలుని మతము ననుసరించువారి పెద్ద సముదాయము వచ్చి సేవించుచుండెడిది. పంచస్రోతస్సులయందు నిష్ణాతుడు. పంచరాత్రవిశారదుడు, పంచతత్త్వముల నెరిగినవాడు, అయిదు కార్యములను చేయువాడు, అయిదుగుణములు కలవాడునగు పంచశిఖుడు వారికి పురుషావస్థము, అవ్యక్తము నగు పరమార్థమును బోధించెను.

ఇష్టసత్రేణ సంపృష్టో భూయశ్చ తపసాఽసురిః,

క్షేత్ర క్షేత్రజ్ఞయో ర్వ్యక్తిం బుబుధే దేవదర్శనః. 13

ఆత్మయజ్ఞము కారణముగా ఆదివ్యదృష్టికలఋషి తన గురువు ఆసురిని మరల చక్కగా ప్రశ్నించి క్షేత్రక్షేత్రజ్ఞుల స్పష్టతను గూర్చి చక్కగా తెలిసికొనెను.

యత్తదేకాక్షరం బ్రహ్మ నానారూపం ప్రదృశ్యతే,

ఆసురి ర్మణ్డలే తస్మిన్ ప్రతిపేదే తదవ్యయమ్. 14

బ్రహ్మము ఏకాక్షరము. కాని పెక్కు రూపములతో కానవచ్చుచున్నది. ఆసురి ఆ ఋషిమండలమున ఆ అవ్యయపదము నందినవా డాయెను.

తస్య పఞ్చశిఖః శిష్యో మానుష్యా పయసా భృతః,

బ్రాహ్మణీ కపిలా నామ కాచి దాసీత్కుటుంబినీ. 15

ఆసురికి ఈ పంచశిఖుడు శిష్యుడు. కపిలయను ఒక బ్రాహ్మణి యగు ఇల్లాలు కలదు. ఆమె పాలతో పెరిగినవాడు.

తస్యాః పుత్రత్వ మాగమ్య స్త్రియాః స పిబతి స్తనౌ,

తతః స కాపిలేయత్వం లేభే బుద్ధిం చ నైష్ఠికీమ్. 16

ఆమెకు కొడుకుగా నయి ఆమెస్తనముల పాలుత్రావెను. అందువలన ఆతడు కాపిలేయుడాయెను. నిష్ఠగల బుద్ధినికూడ పొందెను.

ఏతన్మే భగవానాహ కాపిలేయస్య సంభవమ్.

తస్య తత్కాపిలేయత్వం సర్వవిత్త్వ మనుత్తమమ్. 17

ఆతని కపిలకొడుకుతనమును, మిక్కిలి ఉత్తమమగు సర్వజ్ఞతను పుట్టుకను గూర్చి నాకు భగవానుడు (మార్కండేయుడు లేక సనత్కుమారుడు) తెలిపెను.

సామాన్యం జనకం జ్ఞాత్వా ధర్మజ్ఞో జ్ఞాన ముత్తమమ్,

ఉపేత్య శత మాచార్యాన్ మోహయామాస హేతుభిః. 18

జనకుడు ఆచార్యులందరియందును సమానమగు బుద్ధికలవాడని తెలిసికొని ఉత్తమమగు జ్ఞానమును పొందిన ధర్మజ్ఞుడగు పంచశిఖుడు అతనికడ కరుగుదెంచి ఆనూరుగురు ఆచార్యులను చక్కని హేతువులతో మోహపెట్టెను.

జనక స్త్వభిసంరక్తః కాపిలేయాను దర్శనాత్,

ఉత్సృజ్య శత మాచార్యాన్ పృష్ఠతోఽనుజగామ తమ్. 19

కపిలాకుమారుని దర్శనమువలన జనకుడు మిక్కిలిభక్తికలవాడై ఆ నూరుగురు ఆచార్యులను వదలివైచి ఆతని వెనుక బయలుదేరెను.

తస్మై పరమకల్యాయ ప్రణతాయ చ ధర్మతః,

అబ్రవీత్ పరమం మోక్షం యత్తత్సాంఖ్యేఽభిధీయతే. 20

గొప్ప సమర్థత కలవాడు, ధర్మపూర్వకముగా మ్రొక్కినవాడు నగు ఆ జనకునకు సాంఖ్యమున చక్కగా నిరూపితమైన పరమమగు మోక్షధర్మమును బోధించెను.

జాతినిర్వేద ముక్త్వా స కర్మవిర్వేద మబ్రవీత్,

కర్మనిర్వేద ముక్త్వా చ సర్వనిర్వేద మబ్రవీత్. 21

మొదట జాతి నిర్వేదమును చెప్పి, తరువాత కర్మనిర్వేదమును బోధించెను. అటుపై సర్వనిర్వేదమును తెలియజెప్పెను.

యథార్థం ధర్మసంసర్గః కర్మణాం చ ఫలోదయః

తమనాశ్వాసికం మోహం వినాశి చల మధ్రువమ్. 22

ధర్మము ననుష్ఠించుట, కర్మములఫలము పుట్టుట, అనునది దేనికొరకగునో, ఆ నమ్మరానిది, నాశనమగునది, చంచలమైనది, స్థిరముకానిది అగు మోహమును గూర్చి వివరించెను.

దృశ్యమానే వినాశే చ ప్రత్యక్షే లోకసాక్షికే,

ఆగమాత్ పరమస్తీతి బ్రువన్నపి పరాజితః. 23

వినాశము ప్రత్యక్షముగా, లోకులందరు సాక్షులై యుండగా, కన్పట్టుచుండగా, దేహముకంటె వేరుగా పరమైన దొకటి ఆగమప్రమాణమువలన ఉన్నదని చెప్పు చున్నను అతడు ఓడిన వాడే యగును.

అనాత్మా హ్యాత్మనో మృత్యుః క్లేశో మృత్యు ర్జరామయః,

ఆత్మానం మన్యతే మోహా త్తదసమ్యక్ పరం మతమ్. 24

ఆత్మకు చావు అది లేకుండుటయే. క్లేశము, ముసలితనము, రోగము అనునవియే మృత్యువు. మోహమువలన ఆత్మ పరమైనదిగా భావించుచో అది సరియైన భావనకాదు.

అథ చే దేవ మప్యస్తి యల్లోకే నోపపద్యతే,

అజరోఽయ మమృత్యుశ్చ రాజాఽసౌ మన్యతే యథా. 25

ఆ ఆత్మ అనునది ఉండిన యెడల లోకమున కనబడదేమి? రాజు ముదిమి, చావులు లేనివాడు అని ఆశీర్వదించినచో ఆతడట్లే భావించును. అట్లగుచున్నాడా?

అస్తి నాస్తీతి చాప్యేత త్త సి న్నసతి లక్షణే,

కిమధిష్ఠాయ తద్ర్బుయా ల్లోకయాత్రా వినిశ్చయమ్. 26

ఉన్నది, లేదు అను ప్రశ్న కలిగినపుడు ఉన్నదను దానిలక్షణమే లేనియపుడు ఏది ఆధారముగాఁ గొని లోక యాత్ర వినిశ్చయమును చెప్పగలడు?

ప్రత్యక్షం హ్యేతయో ర్మూలం కృతాన్తైతిహ్యయో రపి,

ప్రత్యక్షే ణాగమో భిన్నః కృతాన్తో వాన కిఞ్చన. 27

అనుమానము, ఐతిహ్యము అను ఈ ప్రమాణములకు మూలము ప్రత్యక్షము. ప్రత్యక్షము ఆగమమును త్రోసివైచినచో అనుమానము ప్రమాణము కాజాలదు కదా!

యత్ర యత్రానుమానేఽస్మిన్ కృతం భావయతోఽపి చ,

నాన్యో జీవః శరీరస్య నాస్తికానాం మతే స్థితః. 28

ఏదో ఏదో అనుమానమును పట్టి ఊహలు చేయుట చాలును. నాస్తికుల మతమున నిలిచి చూచినచో శరీరముకంటె జీవుడు వేరుగా లేడు.

రేతోవటకణీకాయాం ఘృతపాకాధివాసనమ్,

జాతిః స్మృతి రయస్కాన్తః సూర్యకాన్తోఽమ్బుభక్షణమ్. 29

రేతస్సు, మఱ్ఱివిత్తనము, నేయి, పాకము, నీటిలో కొంతకాలముంచుట, జాతి, స్మృతి, అయస్కాంతము, సూర్యకాంతము, లోహములు నీరు పీల్చుట అనునవి యిందు ప్రమాణములు.

ప్రేతీభూతేఽత్యయ శ్చైవ దేవతా ద్యుపయాచనమ్,

మృతే కర్మనివృత్తిశ్చ ప్రమాణ మితి నిశ్చయః. 30

దేహము ప్రేతముకాగా చైతన్యము నశించుట, దేవతాదులను ప్రార్థించుట, దేహము మృతిచెందినపుడు కర్మములు తొలగుట అనునవి ఆత్మకలదు అనుటకు ప్రమాణమని నిశ్చయము (సిద్ధాంతము)

నన్వేతే హేతవః సన్తి యే కేచి న్మూర్తి సంస్థితాః,

అమూర్తస్య హి మూర్తేన సామాన్యం నోపపద్యతే. 31

పైని పేర్కొన్న హేతువు లేవి కలవో అవియన్నియు దేహమునంటి పెట్టుకొని యున్నట్టివి. ఆకారములేనిదానికి, కలదానితో సమానత్వము కుదరదు కదా!

అవిద్యా కర్మచేష్టానాం కేచి దాహుః పునర్భవే,

కారణం లోభమోహౌ తు దోషాణాం తు నిషేవణమ్. 32

కొందరు మరుజన్మమున అవిద్య, కర్మ, చేష్టలు అనువానిని కారణములుగా చెప్పుదురు. లోభమోహములు, దోషములను మిక్కిలిగా సేవించుటయు దీనికి కారణమందురు.

అవిద్యాం క్షేత్ర మాహు ర్హికర్మబీజం తథా కృతమ్,

తృష్ణా సంజననం స్నేహ ఏష తేషాం పునర్భవః. 33

అవిద్యను క్షేత్ర మందురు. ఆవిధముగా చేసిన కర్మము బీజము. తృష్ణ దాని పుట్టుకకు కారణమైన జలము. ఇది వాని పురర్జన్మము.

తస్మిన్ గూఢే చ దగ్ధే చ భిన్నే మరణధర్మిణి,

అన్యోఽ స్మా జ్జాయతే దేహ స్త మాహుః సత్య సంక్షయమ్. 34

అది గూఢముగా నున్నపుడును, మరణ ధర్మముకలది కనుక నశించినప్పుడును, దానినుండి మరియొకదేహము పుట్టును. జ్ఞానముచేత కాలిపోయినచో దానిని సత్యసంక్షయమందురు.

యదా స్వరూపత శ్చాన్యో జాతితః శుభతోఽర్థతః

కథ మస్మిన్ స ఇత్యేవం సర్వం వా స్యాదసంహితమ్ 35

స్వరూపమును బట్టి, జాతిని బట్టి, శుభమును బట్టి, అర్థమును బట్టి ఇతరుడైనపుడు ఇతనియందు అతడే అను భావము ఎట్లు? ఇట్లు సర్వము అసంగత మగును.

ఏవం సతి చ కా ప్రీతి ర్దానవిద్యా తపోబలైః,

యదస్యా చరితం కర్మ సర్వ మన్యత్ ప్రపద్యతే. 36

ఇట్లే అయినచో దానము, విద్య, తపస్సు, బలము అనువానితో కలుగు ప్రీతి యెట్టిది? ఏలయన ఇతడాచరించిన కర్మమంతయు మరొకదానిని చేరుకొనును.

అపి హ్యయ మిహై వాన్యైః ప్రాకృతైర్దుఃఖితో భవేత్,

సుఖితో దుఃఖితో వాఽపి దృశ్యా దృశ్యవినిర్ణయః. 37

మరియు ఇతడు ఇక్కడనే పూర్వకృతములగు ఇతరకర్మములతో దుఃఖము కలవాడైనచో, సుఖవంతుడో దుఃఖము కలవాడో అయినచో, అందు దృశ్యా దృశ్య వినిర్ణయము చేయరాదు.

తథా హి ముసలై ర్హన్యుః శరీరం తత్సువర్భవేత్,

పృథ గ్జ్ఞానం యదన్యచ్చ యేనైత న్నోపపద్యతే. 38

అట్లే అయినచో రోకండ్లతో చితుకబాదిన శరీరము కూడ మరల ఏర్పడవలయును. పూర్వజ్ఞానము తోడనే మఱొక జ్ఞానముదయించు ననుటయు సరిపడదు.

ఋతుసంవత్సరౌ తిష్యః శీతోష్ణేఽథ ప్రియాప్రియే,

యథాతీతాని పశ్యన్తి తాదృశః సత్త్వసం క్షయః. 39

ఋతువులు, సంవత్సరములు, కలియుగము, శీతోష్ణములు, ప్రియాప్రియములు కడచిపోయినవి. వానిని జనులు చూచుచున్నారు. సత్త్వ సంక్షయము కూడ అటువంటిదే.

జరయాభిపరీతస్య మృత్యునా చ వినాశినా,

దుర్బలం దుర్బలం పూర్వం గృహస్యేవ వినశ్యతి. 40

ముసలి తనము, నాశమొందించు మృత్యువు ఒడలెల్ల క్రమ్ముకొనగా ఇంటిలో బిగువు సడలిన ఒక్కొక్క భాగము కూలిపోయినట్లు అతడు నశించును.

ఇన్ద్రియాణి మనో వాయుః శోణితం మాంస మస్థి చ,

ఆనుపూర్వ్యా వినశ్యన్తి స్వం ధాతు ముపయాన్తి చ. 41

ఇంద్రియములు, మనస్సు, వాయువు, రక్తము, మాంసము, ఎముక అనునవి ఒకదాని వెంట నొకటి నశించును. తన మూలపదార్థమును చేరుకొనును.

లోకయాత్రా విఘాతశ్చ దాన ధర్మ ఫలాగమే,

తదర్థం వేదశబ్దాశ్చ వ్యవహారాశ్చ లౌకికాః. 42

దానము, ధర్మము అనువాని ఫలితముల రాకయందును లోకయాత్రకు విఘాతము కలుగును. వేదశబ్దములు, లౌకికమైన వ్యవహారములు అన్నియు దానికొరకే కదా!

ఇతి సమ్య జ్మన స్యేతే బహవః సన్తి హేతవః,

ఏత దస్తీద మస్తీతి న కిఞ్చిత్ ప్రతిదృశ్యతే. 43

ఇట్లు మనస్సునందు ఏర్పడు హేతువులు పెక్కులు కలవు. ఇది కలదు, అది కలదు అనుటకు ఏ కొంచెమును కొనరాదు.

తేషాం విమృశతా మేవ తత్త త్సమభిధావతామ్,

క్వచి న్నివిశతే బుద్ధి స్తత్ర జీర్యతి వృక్షవత్. 44

ఆయాభావముల వెంటబడి పరువెత్తుచు విచారము చేయువారికి ఎందో ఒకచోట బుద్ధి చొరబారును. అందు వృక్షము వలె జీర్ణమై పోవును.

ఏవ మర్థై రనర్థైశ్చ దుఃఖితాః సర్వజన్తవః,

ఆగమై రపకృష్యన్తే హస్తిపై ర్హస్తినో యథా. 45

ఇట్లు అర్థములతో, అనర్థములతో ప్రాణులన్నియు దుఃఖము పొందుచున్నవి. మావటివాండ్రు ఏనుగులను వలె ఆగమములు అట్టివారిని పైకి లాగుచున్నవి.

అర్థాం స్తథాఽత్యన్త సుఖావహాంశ్చ

లిప్సన్త ఏతే బహవో విశుష్కాః,

మహత్తరం దుఃఖ మనుప్రపన్నా

హిత్వాఽఽమిషం మృత్యువశం ప్రయాన్తి 46

మిక్కిలి సుఖము కలిగించు అర్థములను పొందగోరుచున్నవారై యీ ఎండిన రక్తమాంసములు గల పెక్కండ్రు మరింత గొప్ప దుఃఖమును పొందినవారగుచు ఎరను వదలి మృత్యువునకు వశమై పోవుచున్నారు.

వినాశినో హ్యధ్రువ జీవితస్య

కిం బన్ధుభి ర్భిన్న పరిగ్రహై శ్చ

విహాయ యో గచ్ఛతి సర్వమేవ

క్షణేన గత్వా న నివర్తతే చ. 47

నశించు స్వభావము కలదియు, నిలుకడలేని జీవితము కలదియు నగు దేహమునకు బంధువులతో, పెక్కు రూపములు గల పరిగ్రహములతో పనియేమి? ఈ అన్నింటిని వదలి వెడలి పోవువాడు క్షణములో నరిగి మరల తిరిగిరాకుండును.

భూ వ్యోమ తోయానల వాయవోఽపి

సదా శరీరం పరిపాలయన్తి

ఇతీద మాలక్ష్య రతిః కుతో భవేద్

వినాశినోఽప్యస్య న శర్మ విద్యతే. 48

భూమి, ఆకాశము, నీరు, అగ్ని, గాలి అనునది ఎల్లవేళల శరీరమును కాపాడుచున్నవి. అయినను నశించు స్వభావము కల దీనికి సుఖము లేకున్నది. ఇట్టి దీనిని పరికించు దానికి శరీరమున ప్రీతి ఎక్కడ నుండి కలుగును?

ఇద మనుపధివాక్య మచ్ఛలం

పరమ నిరామయ మాత్మ సాక్షికమ్

నరపతి రభివీక్ష్య విస్మితః

పున రనుయోక్తు మిదం ప్రచక్రమే. 49

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి పఞ్చశిఖవాక్యే పాషణ్డ ఖణ్డనం నామ అష్టాదశాధిక ద్విశతతమోఽధ్యాయః

ఎట్టి కల్లకపటములు లేనిదియు, స్వచ్ఛమైనదియు ఆరోగ్యకరమైనదియు, ఆత్మయే సాక్షిగా గలదియు నగు నీ వాక్యమును లోతుగా పరిశీలించి రాజు అచ్చెరువు పొందినవాడై మరల ప్రశ్నించుటకు పూనుకొనెను.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్ష ధర్మపర్వమున పంచశిఖువి వాక్యమగు పాషండ ఖండనము ఆను రెండువందల పదునెనిమిదవ అధ్యాయము.

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.

జనకో జనదేవ స్తు జ్ఞపితః పరమర్షిణా,

పున రేవానుపప్రచ్ఛ సాంపరాయే భవాభవౌ. 1

పరమమహర్షి ఇట్లు తత్త్వమును వినిపింపగా జనకుడు జనదేవుడు మరణమున సంసారమోక్షములను గూర్చి మరల ప్రశ్నచేసెను.

జనక ఉవాచ - జనకుడు ఇట్లు పలికెను.

భగవాన్ యది న ప్రేత్య సంజ్ఞా భవతి కస్యచిత్,

ఏవం సతి కిమజ్ఞానం జ్ఞానం వా కిం కరిష్యతి. 2

భగవానుడా! మరణించిన తరువాత ఎవనికిని విశేషవిజ్ఞానము కలుగనిచో అజ్ఞానముగాని జ్ఞానము కాని ఏమి చేయును?

సర్వ ముచ్ఛేదనిష్ఠం స్యా త్పశ్య చైత ద్ద్విజోత్తమ,

అప్రమత్తః ప్రమత్తో వా కిం విశేషం కరిష్యతి. 3

సర్వము ఆత్మనాశమే ముగింపుగా గలది యగుచో, ఓయి ద్విజోత్తమా! ఇది అంతయు పరికింపుము. ప్రమత్తుడో, అప్రమత్తుడో చేయగల విశేష మెట్టిది?

అసంసర్గో హి భూతేషు సంసర్గో వా వినాశిషు,

కస్మై క్రియేత కల్పేత నిశ్చయః కోఽత్ర తత్త్వతః. 4

భూతములయందు సంసర్గములేదు. నశించువానియందు సంసర్గము కలదు - అన్నచో మానవుడు దేనికై తత్త్వపూర్వకముగా ఏ నిశ్చయము చేసికొనవలయును? చేసికొని ఏమి సాధింపవలయును?

భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.

తమసా హి ప్రతిచ్ఛన్నం విభ్రాన్త మివ చాతురమ్,

పునః ప్రశమయన్ వాక్యైః కవిః పఞ్చశిఖోఽబ్రవీత్. 5

నిలువెల్ల చీకటి క్రమ్ముకొన్నవాడు, దిక్కుతోచక కొట్టుమిట్టాడుచున్నవాడు వలెనున్న రాజును తన వాక్యములతో శాంతింపజేయుచు కవియగు పంచశిఖు డిట్లు పలికెను.

ఉచ్ఛేదనిష్ఠా నేహాస్తి భావనిష్ఠా న విద్యతే,

అయం హ్యపి సమాహారః శరీరేన్ద్రియ చేతసామ్,

వర్తతే పృథ గన్యోన్య మప్యపాశ్రిత్య కర్మసు. 6

ఇందు ఉచ్ఛేదనిష్ఠ లేనేలేదు. భావనిష్ఠయు లేదు. శరీరము, ఇంద్రియములు, మనస్సు అను ఈ సముదాయము కర్మములయందు ఒకదాని నొకటి అంటి పెట్టుకొని వేరువేరుగా ప్రవర్తించును.

ధాతవః పఞ్చభూతేషు ఖం వాయు ర్జ్యోతిషో ధరా,

తే స్వభావేన తిష్ఠన్తి వియుజ్యన్తే స్వభావతః. 7

అయిదు భూతముల సముదాయమగు ప్రాణులయందు ధాతువులైన ఆకాశము, వాయువు, అగ్ని, భూమి మొదలగునవి స్వభావముతో కలిసియుండును. స్వభావముతో విడివడి పోవును.

ఆకాశో వాయు రూష్మా చ స్నేహో యశ్చాపి పార్థివః,

ఏష పఞ్చసమాహారః శరీర మపి నైకధా. 8

ఆకాశము, వాయువు, వేడి, జిడ్డు, మట్టిపదార్థము అనునైదింటి సముదాయము ఈ దేహము ఈ శరీరముకూడ పెక్కు విధములైనది.

జ్ఞాన మూష్మా చ వాయుశ్చ త్రివిధః కార్యసంగ్రహః,

ఇన్ద్రియా ణీన్ద్రియార్థాశ్చ స్వభావ శ్చేతనా మనః

ప్రాణాపానౌ వికారశ్చ ధాతవ శ్చాత్ర నిఃసృతాః. 9

జ్ఞానము, జఠరాగ్ని, వాయువు ఈమూడును కార్యములు సంగ్రహము. వీనినుండి ఇంద్రియములు, ఇంద్రియార్థములు, చేతన, మనస్సు, ప్రాణాపానములు, ధాతువులును వెలువడును.

శ్రవణం, స్పర్శనం, జిహ్వా, దృష్టి, ర్నాసా, తథైవ చ,

ఇన్ద్రియాణీతి పఞ్చైతే చిత్తపూర్వం గతా గుణాః 10

వినుట, తాకుట, రుచీపొందుట, చూచుట, మూర్కొనుట - ఈ కార్యములను చేయు అయిదును ఇంద్రియములు. ఇవి చిత్తపూర్వమును పొందిన గుణములు.

తత్ర విజ్ఞాన సంయుక్తా త్రివిధా చేతనా ధ్రువా,

సుఖదుఃఖేతి యా మాహు రదుఃఖా మసుఖేతి చ. 11

అందు విజ్ఞానముతో కూడిన చేతన స్థిరముగానుండునది మూడు విధములుగా నుండును. సుఖము, దుఃఖము, సుఖ దుఖఃములు లేకుండుట అని ఆమూడు విధములు.

శబ్దః స్పర్శం చ రూపం చ రసో గన్ధశ్చ మూర్తయః,

ఏతే హ్యామరణాత్ పఞ్చ షడ్గుణా జ్ఞానసిద్ధయే. 12

శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, మూర్తులు ఇవియైదును మరణము చెందువరకును జ్ఞానసిద్ధి కొరకు ఉపయోగపడు ఆరుగుణములు.

తేషు కర్మవిసర్గశ్చ సర్వతత్త్వార్థ నిశ్చయః,

త మాహుః పరమం శుక్రం బుద్ధి రిత్యవ్యయం మహత్. 13

వానియందు కర్మవిసర్గము సర్వతత్త్వార్థమును నిశ్చయించునది. అట్టి పరమమగు బీజమును బుద్ధి యని, అవ్యయమనియు, మహత్తు అనియు నందురు.

ఇమం గుణసమాహార మాత్మభావేన పశ్యతః,

అసమ్య గ్దర్శనై ర్దుఃఖ మనన్తం నోపశామ్యతి. 14

ఈ గుణసముదాయమును ఆత్మభావముతో చూచువానికి సరికాని దర్శనములచేత అనంతమగు దుఃఖము అణగారకుండును.

అనాత్మని చ యద్దృష్టం తేనాహం న మమేత్యపి,

వర్తతే కిమధిష్ఠానా త్ప్రసక్తా దుఃఖసన్తతిః. 15

కానవచ్చున దేదియో అది అనాత్మ. అందువలన నేను, నాది అనుభావములు ప్రవర్తింపవు. ఇక ఏది ఆధారముగా దుఃఖసముదాయము ఏర్పడును?

అత్ర సమ్యగ్వధో నామ త్యాగశాస్త్ర మనుత్తమమ్,

శృణు యత్తవ మోక్షాయ భాష్యమాణం భవిష్యతి. 16

ఇందు సమ్యగ్వధమను మిక్కిలి శ్రేష్ఠమగు త్యాగశాస్త్రము కలదు. అది నీకు చెప్పుచున్నాను. అది నీమోక్షమునకు సాధనము.

త్యాగ ఏవ హి సర్వేషాం యుక్తానా మపి కర్మణామ్,

నిత్యం మిథ్యావినీతానాం క్లేశో దుఃఖవహో మతః. 17

మోక్షమున ఎల్లవేళల సంబంధము కలవారికి సర్వకర్మముల త్యాగమే నిత్యముగా సమ్మతమైనది. మిథ్యా వినీతులకు దుఃఖమున కాస్పదమగు క్లేశమే మతము.

ద్రవ్యత్యాగే తు కర్మాణి భోగత్యాగే వ్రతాన్యపి,

సుఖత్యాగే తపో యోగం సర్వత్యాగే సమాపనా. 18

ద్రవ్యత్యాగముకొరకు కర్మములను, భోగత్యాగముకొరకు వ్రతములను, సుఖత్యాగముకొరకు తపస్సును సర్వత్యాగముకొరకు యోగమును విధించిరి. అది అన్నింటికి సమాప్తి

తస్య మార్గోఽయ మద్వైధః సర్వత్యాగస్య దర్శితః,

విప్రహాణాయ దుఃఖస్య దుర్గతి స్త్వన్యథా భవేత్. 19

ఆ సర్వత్యాగమునకు ఈ చెప్పబోవు ఆద్వైధమను మార్గమును ప్రదర్శించిరి. అది దుఃఖము సమూలముగా నశించుటకు మార్గము. అది లేనిచో దుర్గతి కలుగును.

పఞ్చ జ్ఞానేన్ద్రియా ణ్యుక్త్వా మనఃషష్ఠాని చేతసి,

బలషష్ఠాని వక్ష్యామి పఞ్చ కర్మేన్ద్రియాణి తు. 20

ఆయిదుజ్ఞానేంద్రియములు మనస్సుతోపాటు ఆరై బుద్ధియందున్నవి. అయిదు కర్మేంద్రియములను బలము ఆరవదిగా కలిగిన వానిని - చెప్పెదను.

హస్తౌ కర్మేన్ద్రియం జ్ఞేయ మథ పాదౌ గతీన్ద్రియమ్,

ప్రజనానన్దయోః శేఫో నిసర్గే పాయు రిన్ద్రియమ్. 21

వాక్చ శబ్దవిశేషార్థ మితి పఞ్చాన్వితం విదుః,

ఏవ మేకాదశైతాని బుద్ధ్యాఽఽశు విసృజే న్మనః. 22

చేతులు కర్మముచేయు ఇంద్రియములు, కాళ్లు గతికి సంబంధించిన ఇంద్రియ ములు, సంతానము పొందుటకు ఆనందమునకు చెందినది గుహ్యేంద్రియము. మలమును విసర్జించునది పాయువు (ఆసనము) అను ఇంద్రియము.

వాక్కు శబ్ద విశేషము కొరకైన ఇంద్రియము. ఈ అయిదింటితో కూడినది మనస్సు. ఇవి యిట్లు పదునొకండు. వీనిని బుద్ధితోపాటు మనస్సును శీఘ్రముగా విడువవలయును.

కర్ణౌ శబ్దశ్చ చిత్తం చ త్రయః శ్రవణ సంగ్రహే,

తథా స్పర్మే తథా రూపే త థైవ రసగన్ధయోః. 23

చెవులు, శబ్దము, చిత్తము అను నీమూడును శ్రవణ సంగ్రహమున పనిచేయునట్టివి. అట్లే స్పర్శ, రూపము, రసము, గంధము అనువాని విషయము నందును తెలియదగును.

ఏవం పఞ్చత్రికా హ్యేతే గుణా స్తదుపలబ్ధయే,

యేనాయం త్రివిధో భావః పర్యాయాత్సముపస్థితః. 24

ఇట్లివి అయిదు త్రికములు. ఈ గుణములు శబ్దాదుల జ్ఞానమును వ్యక్తము చేయుటకు ఉపకరించునవి. దీనితో త్రివిధమగు భావము పర్యాయముగా ఏర్పడియున్నది.

సాత్త్వికో రాజస శ్చాపి తామస శ్చాపి తే త్రయః,

త్రివిధా వేదనా యేషు ప్రపూతాః సర్వసాధనాః. 25

సాత్త్వికములు, రాజసములు, తామసములు అని అవి మూడు. వీనియందు మూడు విధములగు వేదనలు పుట్టుచున్నవి. అవి సర్వసాధనములు.

ప్రహర్షః ప్రీతి రానన్దః సుఖం సంశాంతచిత్తతా,

అకుతశ్చిత్కుతశ్చిద్వా చిన్తితః సాత్త్వికో గుణః. 26

ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, సంశాంత చిత్తత ఇది యంతయు సాత్త్వికమగు గుణము. ఇది ఎందుండి వచ్చెనో తెలియకయు, తెలిసియు భావింపబడును.

అతుష్టిః పరితాపశ్చ శోకో లోభ స్తథాఽక్షమః,

లిఙ్గాని రజస స్తాని దృశ్యన్తే హేత్వహేతుతః. 27

అసంతుష్టి, పరితాపము, శోకము, లోభము, అసహనము అనునవి సకారణ ముగా, అకారణముగా ఏర్పడునవియై రజస్సు లింగములు కానవచ్చుచున్నవి.

అవివేక స్తథా మోహః ప్రమాదః స్వప్నతన్ద్రితా,

కథఞ్చి దపి వర్తన్తే వివిధా స్తామసా గుణాః. 28

అవివేకము, మోహము, ప్రమాదము, నిద్ర, కునుకుపాటు అనునవి పెక్కువిధములైన తామసగుణములును ఎట్లెట్లో కలుగుచుండును.

అత్ర యత్ప్రీతిసంయుక్తం కాయే మనపి వా భవేత్,

వర్తతే సాత్త్వికో భావ ఇత్యపేక్షేత్ర తత్తథా. 29

దేహమునందుగాని, మనస్సునందుగాని ప్రీతితో కూడిన దే దైనగాని సాత్త్విక భావము కలుగును. దాని నావిధముగా మానవుడు అపేక్షింపవలయును.

యత్త్వసంతోషసంయుక్త మప్రీతికర మాత్మనః,

ప్రవృత్తం రజ ఇత్యేవం తత స్తదపి చిన్తయేత్. 30

సంతోషము పొడలేనిది, ఆత్మకు ప్రీతికరము కానిది అగు నేదేని ఏర్పడినచో అది రజస్సుగా తెలిసికొని దానిని కూడ విచారింపవలయును.

అథ యన్మోహ సంయుక్తం కాయే మనపి వా భవేత్,

అప్రతర్క్య మవిజ్ఞేయం తను స్త దుపధారయేత్. 31

కాయమునందుగాని, మనస్సునందు కాని హేతుపూర్వకముగా తర్కింప రానిదియు, ఏమాత్రము తెలియరానిది అగు మోహముతో కూడినదేదైనగాని అది తమోగుణముగా నిర్ణయించుకొనవలయును.

శ్రోత్రం వ్యోమాశ్రితం భూతం శబ్దః శ్రోత్రం సమాశ్రితః,

నోభయం శబ్దవిజ్ఞానే విజ్ఞాన స్యేతరస్య వా. 32

చెవి ఆకాశము నాశ్రయించిన భూతము. శబ్దము చెవి నాశ్రయించియుండును. శబ్దవిజ్ఞానమునందు విజ్ఞానమునకు గాని, ఇతరమునకు గాని ఆ రెండును విషయములు కావు.

ఏవం త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చేతి పఞ్చమీ,

స్పర్శే రూపే రసే గన్ధే తాని చేతో మనశ్చ తత్. 33

ఇట్లే చర్మము, కన్ను, నాలుక, అయిదవదగు ముక్కు స్పర్శ, రూపము, రసము, గంధము అనువాని యందు ప్రవర్తించును. అవి చేతస్సును అది మనస్సును ఆశ్రయించి యుండును.

స్వకర్మ యుగపద్భావో దశ స్వేతేషు తిష్ఠతి,

చిత్త మేకాదశం విద్ధి బుద్ధి ర్ద్వాదశమీ భవేత్. 34

ఈ పదింటియందును తమ తమ కర్మముల యుగ పద్భావమువలన పదునొకండవది యగు చిత్తము నిలిచి యుండును. పండ్రెండవది బుద్ధి యగును.

తేషా మయుగపద్భావ ఉచ్ఛేదో నాస్తి తామసే,

ఆస్థితో యుగపద్భావో వ్యవహారః స లౌకికః. 35

ఆ పండ్రెండింటి యుగపద్భావము లేనియపుడు తామసమగు ఉచ్ఛేదము లేదు. యుగపద్భావము అనునది లౌకికమైన వ్యవహారము. (యుగపద్ధావము - కలసి సంభవించుట)

ఇన్ద్రియాణ్య పి సూక్ష్మాణి దృష్ట్వా పూర్వశ్రుతాగమాత్,

చిన్తయ న్నానుపర్యేతి త్రిభి రేవాన్వితో గుణైః. 36

వెనుకటి శబ్దాదుల ఆగమమువలన జీవుడు సూక్ష్మములగు ఇంద్రియములను భావించుచు మూడు గుణములతో కూడినవాడై అనుసరించి ప్రవర్తించును.

యత్తమోపహతం చిత్త మాశు సంహార మధ్రువమ్,

కరో త్యుపరమం కాయే తదాహు స్తామసం బుధాః. 37

తమస్సుచేత వేటుపడిన చిత్తము స్థిరము కాని శీఘ్రమగు తెగుదలను దేహమున చేయునపుడు దానిని బుధులు తామసముగా చెప్పుదురు.

యద్యదాగమ సంయుక్తం న కృచ్ఛ్ర మనుపశ్యతి,

అథ తత్రా ప్యుపాదత్తే తమో వ్యక్త మివానృతమ్. 38

ఆగమముతో కూడినది, దుఃఖమును ఏ మాత్రము చూడనిది అగు స్థితియందును అవ్యక్తము, అనృతము నగు తమస్సు పైకొనినట్లుండును.

ఏవ మేష ప్రసంఖ్యాతః స్వకర్మ ప్రత్యయో గుణః,

కథంచి ద్వర్తతే సమ్య క్కేషాంచి ద్వా నివర్తతే. 39

ఇట్లీ గుణము తన కర్మమును వెలువరించునదియై ప్రత్యాఖ్యాతమై ఒక విధముగా ప్రవర్తించును. కొందరి విషయమున చక్కగా మరలిపోవును.

ఏత దాహుః సమాహారం క్షేత్ర మధ్యాత్మచిన్తకాః,

స్థితో మనసి యో భావః స వై క్షేత్రజ్ఞ ఉచ్యతే. 40

ఆధ్యాత్మ భావుకులు ఈ సముదాయమును క్షేత్రమని వ్యవహరింతురు. మనసున నిలిచియుండు ఆ భావమును క్షేత్రజ్ఞుడనియు నందురు.

ఏవం సతి క ఉచ్ఛేదః శాశ్వతో వా కథం భవేత్,

స్వభావా ద్వర్తమానేషు సర్వభూతేషు హేతుతః. 41

ఇట్లు సర్వభూతములు హేతువును బట్టి వ్యవహారమున స్వభావమువలన ప్రవర్తించుచుండగా ఉచ్ఛేదమనగా నేమి? అదియు శాశ్వతమగుట యెట్లు?

యథార్ణవగతా నద్యో వ్యక్తీ ర్జహతి నామ చ

నదాశ్చ తా నియచ్చన్తి తాదృశః సత్త్వ సంక్షయః. 42

సముద్రమును చేరుకొన్న నదులు తమ స్వరూపములను, పేరులను వదలివేయును. అట్లే చిన్నవాగులు నదులలో కలిసి నామ రూపములను కోల్పోవును. సత్త్వ సంక్షయ మనగా అటువంటిది.

ఏవం సతి కుతః సంజ్ఞా ప్రేత్యభావే పున ర్భవేత్,

జీవే చ ప్రతిసంయుక్తే గృహ్యమాణే చ సర్వతః. 43

ఉపాధితో కూడియున్న జీవుడు సర్వాత్మనా గ్రహింపబడుచుండగా ఉపాధి లేనియపుడు మరల సంజ్ఞ ఎచటి నుండి కలుగును?

ఇమాం చ యో వేద విమోక్షబుద్ధి

మాత్మాన మన్విచ్ఛతి చాప్రమత్తః

న లిప్యతే కర్మఫలై రనిష్టైః

పత్రం బిసస్యేవ జలేన పిక్తమ్. 44

ఈ విముక్తి బుద్ధిని చక్కగా తెలిసినవాడు పొరపాటు పడనివాడై ఆత్మను క్రమముగా చేరుకొనును. ఇష్టములు కాని కర్మఫలములు, నీటితో తడిసిన తామరాకును వలె అతని నంటవు.

దృఢై ర్హి పాశై ర్భహుభి ర్విముక్తః

ప్రజానిమిత్తై రపి దైవతైశ్చ

యదా హ్యసౌ సుఖదుఃఖే జహాతి

ముక్త స్తదా గ్ర్యాం గతి మేత్యలిఙ్గః. 45

పెక్కు రూపములైన గట్టి పాశములతోడను, ప్రజ నిమిత్తముగా గల దైవతములతోడను విముక్తుడై అతడు సుఖదుఃఖములను వదలి వైచునపుడు ముక్తుడై, లింగములేనివాడై గొప్పదియగు గతికి చేరుకొనును.

శ్రుతి ప్రమాణాగమ మంగళైశ్చ

శేతే జరామృత్యు భయా దభీతః

క్షీణే చ పుణ్యే విగతే చ పాపే

తతో నిమిత్తే చ ఫలే వినష్టే

అలేప మాకాశ మలిఙ్గ మేవ

మాస్థాయ పశ్యన్తి మహత్యసక్తా:. 46

శ్రుతి ప్రమాణములచేతను, ఆగమ మంగళముల చేతను జరామృత్యువుల భయము నుండి తొలగి నిర్భయుడై సుఖముగా నిద్రించును. పుణ్యము నశింపగా, పాపము తొలగిపోగా, నిమిత్తమైన ఫలము వినష్టము కాగా, అంటుసొంటులు లేనిది, లింగము లేనిది అగు ఆకాశమున మహత్తునందు నిలిచియుండి తగులము లేనివారై చూచుచుందురు.

యథోర్ణనాభిః పరివర్తమాన -

స్తన్తుక్షయే తిష్ఠతి పాత్యమానః,

తథా విముక్తః ప్రజహాతి దుఃఖం

విధ్వంసతే లోష్ఠ ఇవాద్రి మృచ్ఛన్. 47

సాలెపురుగు తానే అల్లుకొన్న గూటిలో పడి యుండునట్లు జీవుడు కర్మమయ సంసారమున నిలిచియుండును. దానివలెనే విముక్తుడై కొండను ఢీకొన్న మట్టిముద్ద వలె దుఃఖమును విధ్వంసము చేయును.

యథా రురుః శృఙ్గ మథో పురాణం

హిత్వా త్వచం వా ప్యురగో యథా చ

విహాయ గచ్ఛత్యనవేక్షమాణ -

స్తథా విముక్తో విజహాతి దుఃఖమ్. 48

జింక పాత కొమ్మును, పాము కుబుసమును వదలి వైచునట్లు అతడు కర్మమయ సంసారమును వదలి వైచి తిరిగి చూడక వెడలిపోవును. ఆ విధముగా విముక్తుడై దుఃఖమును వదలివైచును.

ద్రుమం యథా వాఽప్యుదకే పతన్త -

ముత్సృజ్య పక్షీ నిపత త్యసక్తః

తథా హ్యసౌ సుఖదుఃఖే విహాయ

ముక్తః పరార్థ్యాం గతి మే త్యలిఙ్గః. 49

నీటిలో కూలుచున్న చెట్టును వదలివైచి పిట్ట ఏతగులము లేనిదై ఆకాశమున కెగిరిపోయినట్లు ఈతడు సుఖదుఃఖములను వదలివైచి లింగ సంబంధము లేనివాడై శ్రేష్ఠమగు గతి కరుగును.

అపి చ భవతి మైథిలేన గీతం

నగర ముపాహిత మగ్నినాఽభివీక్ష్య,

నఖలు మమ హి దహ్యతేఽత్ర కిఞ్చిత్

స్వయ మిద మాహ కిల స్మ భూమిపాలః 50

మరియు మిథిలా రాజు తన నగరము అగ్నికాహుతి కాగా పరికించి ‘ఇందు నా దేదియు కాలదు’ అని స్వయముగా గానము చేయ దొడగెను.

ఇద మమృత పదం నిశమ్య రాజా

స్వయ మిహ పఞ్చశిఖేన భాష్యమాణమ్,

నిఖిల మభి సమీక్ష్య నిశ్చితార్థః

పరమసుఖీ విజహార వీతశోకః. 51

పంచశిఖుడు ప్రవచించిన ఈ అమృతపదమును స్వయముగా చక్కగా ఆలకించి జనకుడు అంతయు చక్కగా సమన్వయించుకొని నిశ్చయము పొందినవాడై శోకమును వదలివైచి పరమ సుఖియై విహరించెను.

ఇమం హి యః పఠతి మోక్ష నిశ్చయం

మహీపతే సతత మవేక్షతే తథా,

ఉపద్రవా న్నానుభవ త్యదుఃఖితః

ప్రముచ్యతే కపిల మివైత్య మైథిలః. 52

ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్ష ధర్మపర్వణి పఞ్చ శిఖవాక్యం నామ ఏకోనవింశాధిక ద్విశతతమోఽధ్యాయః

ఈ మోక్షనిశ్చయమును చక్కగా అధ్యయనము చేసి ఎల్లవేళల పర్యాలోచన చేయువాడు, కపిలుని పొందిన మైథిలునివలె దుఃఖములేనివాడై ఉపద్రవముల ననుభవింపడు. విముక్తుడగును.

ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్ష ధర్మపర్వమున
పంచశిఖ వాక్యము అనెడు రెండు వందల పందొమ్మిదవ అధ్యాయము.

యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.

కిం కుర్వన్ సుఖ మాప్నోతి కిం కుర్వన్ దుఃఖ మాప్నుయాత్,

కిం కుర్వ న్నిర్భయో లోకే సిద్ధ శ్చరతి భారత. 1

భారతా! నరుడు ఏమి చేసి సుఖము పొందును? ఏమి చేయుచు దుఃఖమును పొందును? ఏమి చేయుచు నిర్భయుడును, సిద్ధుడునై లోకమున సంచరించును? భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను

దమ మేవ ప్రశంసంతి వృద్ధాః శ్రుతిసమాధయః,

సర్వేషామేన వర్ణానాం బ్రాహ్మణస్య విశేషతః. 2

వేదములను దర్శించిన వృద్ధులు అన్ని వర్ణములవారికిని, విశేషించి బ్రాహ్మణునకు, దమమే గొప్పదిగా ప్రశంసించెదరు.

నాదాన్తస్య క్రియాసిద్ధి ర్యథావ దుపపద్యతే,

క్రియా తపశ్చ సత్యం చ దమే సర్వం ప్రతిష్ఠితమ్. 3

దాంతుడుకానివానికి క్రియాసిద్ధి ఎన్నటికిని కలుగదు. క్రియ, తపస్సు, సత్యము - అన్నియును దమమునందే నిలువ ద్రొక్కుకొని యున్నవి.

దమస్తేజో వర్ధయతి పవిత్రం దమ ఉచ్యతే,

విపాస్మా నిర్భయో దాన్తః పురుషో విన్దతే మహత్, 4

దమము తేజస్సును పెంపొందించును. దమమును పవిత్రమైనదిగా చెప్పుదురు. దమముకలపురుషుడు పాపములు లేనివాడు, భయమును వదలినవాడునై మహిమను పొందును.

సుఖం దాన్తః ప్రస్వపితి సుఖం చ ప్రతిబుధ్యతే,

సుఖం లోకే విపర్యేతి మనశ్చాస్య ప్రసీదతి. 5

వెలుపలియింద్రియములపై పట్టుకలవాడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. లోకమున సుఖముగా తిరుగాడును. అతని మనస్సు ప్రసన్నముగా నుండును.

తేజో దమేన ధ్రియతే తత్ర తీక్ష్ణోఽధిగచ్ఛతి,

అమిత్రాం శ్చ బహూ న్నిత్యం పృథగాత్మని పశ్యతి. 6

దమము తేజస్సును పట్టినిలుపును. అందు రాజసస్వభావము కలవాడు పెక్కండ్రు శత్రువులను ఎల్లవేళల మరియొక దేహమునం దున్నట్లు చూచును.

క్రవ్యాద్భ్య ఇవ భూతానా మదాన్తేభ్యః సదా భయమ్,

తేషాం విప్రతిషేధార్థం రాజా సృష్టః స్వయంభువా. 7

దమములేనివారివలన సర్వప్రాణులకును, క్రూరమృగములవలన వలె, ఎల్లప్పుడు భయము కలుగును. వారిని ఆదుపున పెట్టుటకై బ్రహ్మ రాజును సృజించెను.

ఆశ్రమేఘ చ సర్వేషు దమ ఏవ విశిష్యతే,

యచ్చ తేషు ఫలం ధర్మే భూయో దాన్తే తదుచ్యతే. 8

అన్ని ఆశ్రమములందున్నవారికిని దమమే మేలైనది. ఆయా ఆశ్రమములయందు ఫలమేది కలదో అది దాంతుని యందే అధికముగా సిద్ధించునని పెద్దలు చెప్పుదురు.

తేషాం లిఙ్గాని వక్ష్యామి యేషాం సముదయో దమః,

అకార్పణ్య మసంరంభః సంతోషః శ్రద్దధానతా. 9

వేని సముదాయము దమమో వాని లింగములను చెప్పెదను. దీనత లేకుండుట, మొండి పట్టుదల లేకుండుట, సంతోషము, శ్రద్ధకలిగి యుండుట

అక్రోధ ఆర్జవం నిత్యం నాతివాదోఽభిమానితా,

గురుపూజాఽనసూయా చ దయా భూతే ష్వపైశునమ్. 10

క్రోధములేకుండుట, కపటములేకుండుట, తెగవాగుడు లేకుండుట, గర్వము లేకుండుట, గురుపూజ, అసూయ లేకుండుట, భూతములయందు దయ, కొండెములు చెప్పకుండుట -

జనవాద మృషావాద స్తుతినిన్దా వివర్జనమ్,

సాధుకామశ్చ స్పృహయే న్నాయతిం ప్రత్యయేషు చ. 11

జనవాదము, అబద్ధములాడుట, స్తుతి, నింద అనువానిని మొత్తముగా వదలివేయుట, సాధుకాముడై యుండుట, సుఖదుఃఖాదుల అనుభవములందు ఉత్తరకాలమును గూర్చి గాలిమేడలు కట్టకుండుట అనులక్షణములు కలవాడు కావలయును.

అవైరకృత్ సూపచారః సమో నిన్దా ప్రశంసయోః,

సువృత్తః శీలసంపన్నః ప్రసన్నాత్మాఽఽత్మవాన్ ప్రభుః. 12

కయ్యములు పెట్టుకొననివాడు, వంచనలేని ఉపచారములు కలవాడు, నిందయందును, ప్రశంసయందును సముడు, చక్కని నడవడి కలవాడు, శీలమే సంపదగా గలవాడు, ప్రసన్నమైన మనస్సు కలవాడు, ధైర్యము కలవాడు, కామాదులపై అధికారము కలవాడును కావలయును.

ప్రాప్య లోకే చ సత్కారం స్వర్గం వై ప్రేత్య గచ్ఛతి,

దుర్గమం సర్వభూతానాం ప్రాపయ న్మోదతే సుఖీ. 13

ఇట్టివాడు లోకమున సత్కారమును పొంది, మరణము తరువాత స్వర్గమున కరుగును. సర్వభూతములకు పొందనలవికానిదానిని పొందించుచు సుఖవంతుడై ప్రమోద మందును.

సర్వభూతహితే యుక్తో న స్మ యో ద్విషతే జనమ్,

మహాహ్రద ఇవాక్షోభ్యః ప్రజ్ఞాతృప్తః ప్రసీదతి. 14

అట్టివాడు సర్వప్రాణులహితమునందు తగులుకొని యుండును. ఎన్నడు నెవ్వరిని ద్వేషింపడు. అగాధమైన జలనిధివలె క్షోభలేనివాడై, ప్రజ్ఞతో తృప్తినందుచు ప్రసన్నుడై యుండును.

అభయం యస్య భూతేభ్యః సర్వేషా మభయం యతః,

నమస్యః సర్వభూతానాం దాన్తో భవతి బుద్ధిమాన్. 15

అతనికి ఏ ప్రాణివలనను భయ ముండదు. ఏ ప్రాణికిని అతనివలన భయముండదు. సర్వభూతములకు నమస్కరింపదగిన ఆబుద్ధిమంతుడు దాంతుడు.

న హృష్యతి మహత్యర్థే వ్యసనే చ న శోచతి,

స వై పరిమితప్రజ్ఞః స దాన్తో ద్విజ ఉచ్యతే. 16

గొప్పధనము లభింపగా పొంగిపోవడు. కష్టకాలమున క్రుంగిపోవడు. అట్టి తన ప్రజ్ఞ హద్దులను తెలిసిన సంస్కారవంతుని దాంతు డందురు.

కర్మభిః శ్రుతసంపన్నః సద్భిరాచరితః శుచిః,

సదైవ దమసంయుక్త స్తస్య భుంక్తే మహాఫలమ్. 17

తన మంచి పనులచేత కీర్తి సంపదకలవాడగును. పవిత్రుడు, ఎల్లప్పుడు దమముతో కూడియుండును. అట్టివాడు దమము కూర్చెడు మహాఫలమును అనుభవించును.

అనసూయా క్షమా శాన్తిః సంతోష ప్రియవాదితా,

సత్యం దాన మనాయాసో నైష మార్గో దురాత్మనామ్. 18

అసూయలేకుండుట, ఓర్పు, శాంతి, సంతోషము, ప్రియముగా మాటాడుట, సత్యము, దానము, ఆయాసము లేకుండుట అనునీమార్గము పాడుబుద్ధికలవారికి అలవడనిది.

కామక్రోధౌ చ లోభశ్చ పరస్యేర్ష్యావికత్థనా,

దురాత్మునకు కామక్రోధములు, లోభము, ఇతరుల విషయమున ఈర్ష్య, తన్ను తాను పొగడుకొనకుండుట అనునవి గుణములు.

కామక్రోధౌ వశే కృత్వా బ్రహ్మచారీ జితేన్ద్రియః, 19

విక్రమ్య ఘోరే తమసి బ్రాహ్మణః సంశితవ్రతః,

కాలాకాంక్షీ చరే శ్లోకా న్నిరపాయ ఇవాత్మవాన్. 20

ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి
దమప్రశంపాయాం వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః

కావున నరుడు కామక్రోధములను తనవశమున నుంచుకొని బ్రహ్మచారియు, ఇంద్రియములను జయించినవాడును అయి, ఘోరమగు అజ్ఞానమున విక్రమించి, నిశితమైన వ్రతములు చేయుచు, కాలమును ఎదురు చూచుచు, ఏ అపాయములు లేని వానివలె బుద్ధిమంతుడై లోకములందు తిరుగాడవలయును.

ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున దమప్రశంపగల రెండువందల యిరువదియవ అధ్యాయము.

ఏకాదశాధిక ద్విశతతమోఽధ్యాయః

211

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

211

212

ద్వాదశాధిక ద్విశతతమోఽధ్యాయః

ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే

యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

212

213

త్రయోదశాధిక ద్విశతతమోఽ ధ్యాయః

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

213

214

చతుర్దశాధిక ద్విశతతమోఽధ్యాయః

త్ర్యహం ప్రాత స్త్ర్యహం సాయం త్ర్యహ మద్యాదయాచితమ్,

త్ర్యహం పరం చ నాశ్నీయాత్ ప్రాజాపత్యోఽయ ముచ్యతే"

అశ్వత్థ పత్రనాడీవ ద్విసప్తతి శతాధికా

వాడీ మనోవహేత్యుక్తం యోగశాస్త్రవిశారదైః’’

“విగతవాసన మాశు విపాశతా

ముపగతం మన ఆత్మతయోదితమ్,

యదభివాఞ్చతి తద్భవతి క్షణా -

త్సకలశక్తిమయో హి మహేశ్వరః"

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

214

215

పంచదశాధిక ద్విశతతమోఽధ్యాయః

కృపయాఽ పి కృతః సఙ్గః పతనాయైవ యోగినామ్

ఇతి సందర్మయ న్నాహ భరతస్యైణ పోషణమ్’’

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

215

216

షోడశాధిక ద్విశతతమోఽధ్యాయః

“తచ్చిన్తనం తత్కథన మవ్యోన్యం తత్ప్రబోధవమ్,

ఏతదేక పరత్వం చ జ్ఞానాభ్యాసం విదు ర్బధాః’’

సోపాధి ర్నిరుపాధిశ్చ ద్వేధా బ్రహ్మవిదుచ్యతే,

సోపాధికః స్యా త్సర్వాత్మా నిరుపాఖ్యోఽమపాధికః

వార్ష్ణేయాధ్యాత్మకథనము

216

దశ మవ్వంతరాణీవా తిష్ఠన్తీన్ద్రియ చిత్తకాః

భౌతికాస్తు శతం పూర్ణం సహస్రం త్వాభిమానికాః

బౌద్ధా దశసహస్రం తు తిష్ఠన్త్యవ్యక్తచిత్తకాః

పురుషం నిర్గుణం ప్రాస్య కాలపంఖ్యా న విద్యతే ఇతి

"ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః,

మనసస్తు పరా బుద్ధిః బుద్ధే రాత్మామహాన్ పరః,

మహతః పద మవ్యక్త మవ్యక్తా త్పురుషః పరః

పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్ఠా సా పరాగతిః

యేమన్దా స్తేఽమ కంప్యన్తే స విశేష నిరూపణైః

స్థిరీకృతే మన స్యేషాం స గుణబ్రహ్మ చిన్తనాత్,

తదేవావిర్భవేత్ సాక్షా దహేతోపాధి కల్పనమ్.”

సప్తదశాధిక ద్విశతతమోఽధ్యాయః

217

వార్ష్ణే యాధ్యాత్మ కథనము

217

218

అష్టాదశాధిక ద్విశతతమోఽధ్యాయః

‘‘ఆగ్నిహోత్రం త్రయీధర్మ స్త్రి దణ్ణం భస్మకుంఠనమ్,

బుద్ధిపౌరుషహీనావాం జీవికేతి బృహస్పతిః’’

“ఉపయన్నపయన్ ధర్మో వికరోతి హి ధర్మిణమ్”

పంచ శిఖుని వాక్యము *

218

ఏకోనవింశాధిక ద్విశతతమోఽధ్యాయః

‘‘త్యాగ ఏవ హి సర్వేషాం మోక్షసాధన ముత్తమమ్

త్యజతైవ హి తద్జ్ఞేయం త్యక్తుః ప్రత్యక్పరం పదమ్’’

219

పంచ శిఖుని వాక్యము

219

వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః

220

దమమును ప్రశంసించుట

220