| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 13 |
| Pages | 73 |
| Read Time | 83 Minutes |
ఏకవింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను
ద్విజాతయో వ్రతోపేతా యదిదం భుఞ్జతే హవిః,
అన్నం బ్రాహ్మణ కామాయ కథ మేతత్ పితామహ. 1
బ్రాహ్మణకామముకొఱకు వ్రతముతో కూడిన ద్విజాతులు హవిస్సు అనెడు అన్నమును తినుచున్నారు. తాతా! ఇది యెట్లు?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అవేదోక్తవ్రతోపేతో భుఞ్జానాః కార్యకారిణః,
వేదోక్తేషు చ భుఞ్జానా వ్రతలుబ్ధా యుధిష్ఠిర. 2
వేదము చెప్పని వ్రతములతో కూడి (మాంసాదులను) తినువారు కామాచారము కలవారు. వేదముచెప్పిన వానిని తినువారు వ్రతఫలముల యందు అనురాగము కలవారు.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను
యదిదం తప ఇత్యాహు రుపవాసం పృథగ్జనాః,
ఏతత్తపో మహారాజ ఉతాహో కిం తపో భవేత్. 3
కొందరు జనులు ఈఉపవాసమను దానినే తపమందురు. మహారాజా! ఇది నిజముగా తపమా? లేక తపమని మరియొకటి కలదా?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
మాసపక్షోపవాసేన మన్యన్తే యత్తపో జనాః,
ఆత్మతంత్రోపఘాతస్తు న తప స్త త్యతాం మతమ్. 4
నెలదినములు, పక్షము దినములు ఉపవాసముతో దేనిని తపస్సుగా జనులు భావింతురో అది ఆత్మవిద్యకు విఘ్నమైనచో తపస్సు కాదని సత్పురుషుల మతము.
త్యాగశ్చ సన్నతి శ్చైవ శిష్యతే తప ఉత్తమమ్,
సదోపవాసీ స భవేద్ బ్రహ్మచారీ సదా భవేత్. 5
త్యాగము, భూతారాధనము అనునవి ఉత్తమమగు తపముగా ప్రసిద్ధి కెక్కును. అట్టివి చేయువాడు సదోపవాసి, సదా బ్రహ్మచారి యగును.
మునిశ్చ స్యాత్సదా విప్రో దైవతం చ సదా భవేత్,
కుటుంబికో ధర్మకామః సదాఽ స్వప్నశ్చ భారత. 6
ధర్మకాముడైన విప్రుడు, ఎల్లవేళల జాగరూకత కలవాడును, సంసారి అయినను సదా ముని, సదా దైవతము అగును.
అమాంసాదీ సదా చ స్యా త్పవిత్రశ్చ సదా భవేత్,
అమృతాదీ సదా చ స్యా ద్దేవతాతిథిపూజకః. 7
ఎన్నడును మాంసము తిననివాడు సదా పవిత్రుడగును. దేవతలను, అతిథులను పూజించువాడు ఎల్లవేళల అమృతమును తినువాడగును.
విఘసాశీ సదా చ స్యా త్సదా చైవాతిథివ్రతః,
శ్రద్దధానః సదా చ స్యా ద్దేవతాద్విజపూజకః. 8
అతిథులయందు ఎల్లవేళల నిష్ఠ కలవాడు విఘసాశీ యగును. దేవతల వలె అతిథులను పూజించువాడు సదా శ్రద్దధాను డగును.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
కథం సదోపవాసీ స్యాద్ బ్రహ్మచారీ కథం భవేత్,
విఘసాశీ కథం చ స్యా త్సదా చైవాతిథి వ్రతః. 9
మనుజుడు సదోపవాసి, సదాబ్రహ్మచారి ఎట్లగును? అతిథులయందు వ్రతము కలవాడు విఘసాశి ఎట్లగును?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
అన్తరా ప్రాతరాశం చ సాయమాశం తథైవ చ,
సదోపవాసీ స భవే ద్యో న భుంక్తేఽ న్తరా పునః. 10
ఉదయభోజనము, సాయంకాలభోజనము అనువానికి నడుమ ఏమియు తిననివాడు సదోపవాసి యగును.
భార్యాం గచ్ఛన్ బ్రహ్మచారీ ఋతౌ భవతి వై ద్విజః,
ఋతవాదీ భవే న్నిత్యం జ్ఞాననిత్య శ్చ యో నరః. 11
సంస్కారము పొందిన యేనరుడు ఋతమునే పలుకుచు జ్ఞానమునందే నిష్ఠకలవాడై ఋతుకాలమున మాత్రమే భార్యను కలియుచు నుండునో అతడు సదా బ్రహ్మచారి యగును.
న భక్షయేద్ వృథా మాంస మమాంసాశీ భవత్యపి,
దాననిత్యః పవిత్రశ్చ అస్వప్నశ్చ దివాఽ స్వపన్. 12
వ్యర్థముగా మాంసము తిననివాడు మాంసము తిననివాడే యగును. దానమునందు శ్రద్ధకలవాడు పవిత్రుడగును. పగలు నిద్రపోనివాడు అస్వప్ను డగును.
భృత్యాతిథిషు యో భుంక్తే భుక్తవత్సు సదా పదా,
అమృతం కేవలం భుంక్తే ఇతి విద్ధి యుధిష్ఠిర. 13
ప్రతిదినము తనపోషణలో నున్నవారు, అతిథులు భుజించిన పిమ్మట భుజించువాడు కేవలము అమృతము తినువాడే యని, యుధిష్ఠిరా! ఎరుగుము.
అభుక్తవత్సు నాశ్నానః సతతం యస్తు వై ద్విజః,
అభోజనేన తేనాస్య జితః స్వర్గో భవత్యుత. 14
అతిథులు మొదలగువారు తినకున్నచో భోజనము చేయకుండు ద్విజుడు, ఆ తినకుండుటతో స్వర్గమును సాధించినవాడే యగును.
దేవతాభ్యః పితృభ్యశ్చ భృత్యేభ్యోఽ తిథిభి స్స హ,
అవశిష్టం తు యోఽశ్నాతి తమాహు ర్విఘసాశినమ్. 15
అతిథులతోపాటు, దేవతలకు, పితృదేవతలకు, భృత్యులకు పెట్టగా మిగిలిన దానిని భుజించువానిని విఘసాశి యందురు.
తేషాం లోకా హ్యపర్యన్తాః సదనే బ్రహ్మణా సహ,
ఉపస్థితా శ్చాప్సరోభిః పరియన్తి దివౌకసః. 16
అట్టివారి లోకములు అంతములేనివి. బ్రహ్మదేవుని సదనమున స్వర్గవాసులై అప్సరసలతోపాటు కూడి యుందురు.
దేవతాభిశ్చ యే సార్ధం పితృభ్య శ్చోపభుఞ్జతే,
రమన్తే పుత్రపౌత్రైశ్చ తేషాం గతి రనుత్తమా. 17
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
అమృతప్రాశ్నికో నామ ఏకవింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
దేవతలతోపాటు పితృదేవతలకు అన్నమిడి తాము తినువారు పుత్రులతో పౌత్రులతో కలిసి ఆనంద మందుదురు. వారికి మిక్కిలి ఉత్తమగతి కలుగును.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున
అమృతప్రాశ్నికమము రెండువందల యిరువది యొకటవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
యదిదం కర్మ లోకేఽ స్మిన్ శుభం వా యది వాశుభమ్, 1
పురుషం యోజయత్యేవ ఫలయోగేన భారత.
కర్తాఽస్తి తస్య పురుష ఉతాహో నేతి సంశయః,
ఏత దిచ్ఛామి తత్త్వేన త్వత్తః శ్రోతుం పితామహ. 2
భారతా! ఈ లోకమున శుభమో, అశుభమో యగుకర్మము పురుషుని ఫలసంబంధముతో కలుపుచునే యున్నది.
అట్టియెడ ఆ కర్మమునకు ఆ పురుషుడు కర్త అగునా? కాడా? అని నాకు సంశయము. దీనికి తత్త్వపూర్వకముగా నీవలన వినగోరుచున్నాను.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
ప్రహ్లాదస్య చ సంవాద మిన్ద్రస్య చ యుధిష్ఠిర! 3
యుధిష్ఠిరా! ఈ విషయమున ఈ ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని - ప్రహ్లాదునికి, ఇంద్రునకు నైన సంవాదమును - ఉదాహరింతురు.
అసక్తం ధూతపాప్మానం కులేజాతం బహుశ్రుతమ్,
అస్తబ్ధ మనహంకారం సత్త్వస్థం సమయే రతమ్. 4
తుల్య నిన్దాస్తుతిం దాన్తం శూన్యాగారనివాసినమ్,
చరాచరాణాం భూతానాం విదితప్రభవా వ్యయమ్. 5
అక్రుధ్యన్త మహృష్యన్త మప్రియేషు ప్రియేషు చ
కాఞ్చనే వాఽథ లోష్ఠే వా ఉభయోః సమదర్శనమ్. 6
ఆత్మని శ్రేయసి జ్ఞానే ధీరం నిశ్చితనిశ్చయమ్,
పరావరజ్ఞం భూతానాం సర్వజ్ఞం సమదర్శనమ్. 7
శక్రః ప్రహ్లాద మాసీన మేకాన్తే సంయతేన్ద్రియమ్,
బుభుత్సమాన స్తత్ప్రజ్ఞా మభిగమ్యేద మబ్రవీత్. 8
తగులములు లేనివాడు, తొలగిన పాపములు కలవాడు, మంచికులమున పుట్టినవాడు, పెక్కు విద్యలు నేర్చినవాడు, ఆలసత లేనివాడు, అహంకారము లేనివాడు, సత్యగుణమున నిష్ఠకలవాడు, సమయమున ప్రీతికలవాడు నిందను స్తుతిని ఒకే విధముగా పరిగణించువాడు, ఇంద్రియములపై అదుపు కలవాడు, జనులసంచారములేని గృహములో నున్నవాడు, చరములు, స్థావరములు అయిన భూతములకు స్రష్టయు, మార్పులేని ఉపాదాన కారణము అయిన పరమాత్మను చక్కగా తెలిసికొన్నవాడు.
అప్రియములందు క్రోధము లేనివాడు, ప్రియములందు పొంగి పోనివాడు, బంగారమునందును, మట్టిబెడ్డయందును సమమును దర్శించువాడు.
ప్రత్యగాత్మయందును, ఆనందరూపమైన జ్ఞానమునందును కుతర్కముల గొడవలేనివాడు, చక్కగా నిశ్చయించుకొన్న నిశ్చయము కలవాడు, పరమును అవరమును స్పష్టముగా తెలిసికొన్నవాడు, సర్వజ్ఞుడు, సమదర్శనుడు - ఇంద్రియములపై చెదరని పట్టు కలవాడు, ఒంటరి ప్రదేశమున కూర్చున్న వాడునగు ప్రహ్లాదుని సమీపించి అతనిప్రజ్ఞను చక్కగా తెలియగోరినవాడై దేవేంద్రుడు ఇట్లు పలికెను.
యైః కశ్చిత్సంమతో లోకే గుణైః స్యాత్పురుషో నృషు,
భవత్యనపగాన్ సర్వాం స్తాన్ గుణాన్ లక్షయామహే. 9
లోకమున ఏ గుణములతో నరులయందు ఒకానొకడు సంమతుడగునో స్థిరములగు ఆ గుణములన్నింటిని నీ యందు చూచుచున్నాము.
అథ తే లక్ష్యతే బుద్ధిః సమా బాలజనై రిహ,
ఆత్మానం మన్యమానః సన్ శ్రేయః కిమిహ మన్యసే. 10
నీ బుద్ధి పసివాండ్రబుద్ధితో సమానమై కానవచ్చుచున్నది. ఆత్మను గూర్చి చక్కగా తెలిసినవాడవై ఏది శ్రేయమని భావించుచున్నావు?
బద్ధః పాశై శ్చ్యుతః స్థానా ద్ద్విషతాం వశ మాగతః,
శ్రియా విహీనః ప్రహ్లాద శోచితవ్యే న శోచసి. 11
పాశములతో బంధింపబడితివి. స్థానమునుండి భ్రష్టుడవైతివి. శత్రువులకు చేజిక్కితివి. సంపద కోల్పోయితివి. అయినను ప్రహ్లాదా! దుఃఖపడవలసినచోట దుఃఖపడకున్నావు.
ప్రజ్ఞాలాభాత్తు దైతేయ ఉతాహో ధృతిమత్తయా,
ప్రహ్లాద సుస్థరూపోఽసి పశ్యన్ వ్యసన మాత్మనః. 12
దైతేయా! ప్రహ్లాదా! ప్రజ్ఞాలాభమువలననా? లేక ధీరత కలుగుటవలననా? నీదైన ఆపదను చూచుచును చెదరని హృదయముతో నున్నాడవు!
ఇతి సంచోదిత స్తేన ధీరో నిశ్చిత నిశ్చయః,
ఉవాచ శ్లక్ష్ణయా వాచా స్వాం ప్రజ్ఞా మనువర్ణయన్. 13
ఇట్లతడు తరిమి అడుగగా ఆ చక్కని నిశ్చయము గల ధీరుడు ప్రియమైన పలుకుతో తన ప్రజ్ఞను అభివర్ణించుచు నిట్లు పలికెను.
ప్రవృత్తించ నివృత్తిం చ భూతానాం యో న బుధ్యతే,
తస్య స్తంభో భవే ద్బాల్యా న్నాస్తి స్తంభోఽ నుపశ్యతః. 14
భూతముల ప్రవృత్తిని నివృత్తిని తెలిసికొననివానికి పసితనమునుండియు మ్రానుపాటు కలుగును. దానిని చక్కగా విడువక చూచువానికి స్తంభము కలుగదు.
స్వభావాత్ సంప్రవర్తనే నివర్తన్తే తథైవ చ,
సర్వే భావా స్తథాఽ భావాః పురుషార్థో న విద్యతే. 15
భావములు మరియు అభావములు అన్నియు స్వభావమువలననే ప్రవర్తించును. మరలిపోవును. అందు పురుష ప్రయత్న మేమియు లేదు.
పురుషార్థస్య చాభావే నాస్తి కశ్చిచ్చ కారకః,
స్వయం న కుర్వత స్తస్య జాతు మానో భవే దిహ. 16
పురుష ప్రయత్నము లేదన్నచో అచట చేయించువాడు ఎవ్వడును లేడు. స్వయముగా చేయనివానికి ఈ దేహాదికమునందు నేను చేయుచున్నాను అను భావము ఒకప్పుడు కలుగును.
యస్తు కర్తార మాత్మానం మన్యతే సాధ్వసాధు వా,
తస్య దోషవతీ ప్రజ్ఞా అతత్త్వజ్ఞేతి మే మతిః. 17
ఎవడు మంచి, చెడు అయిన పనులయందు తన్ను కర్తనుగా భావించునో అట్టివాని ప్రజ్ఞ తత్త్వము ఎరుగనిది, దోషములు కలది అని నా భావన.
యది స్యా త్పురుషః కర్తా శక్రా త్మశ్రేయసే ధ్రువమ్,
ఆరంభా స్తస్య సిద్ధ్యేయు ర్న తు జాతు పరాభవేత్. 18
ఇంద్రా! పురుషుడే తన శ్రేయస్సు కొరకు నిశ్చయముగా కర్త యగునేని అతని పనులన్నియు సిద్ధి పొందవలయును గదా! ఆతడెప్పుడును పరాభవము పొందరాదుకదా!
అనిష్టస్య హి నిర్వృత్తి రనివృత్తిః ప్రియస్య చ,
లక్ష్యతే యతమానానాం పురుషార్థ స్తతః కుతః. 19
ఇష్టము కానిది వచ్చిపడుచున్నది. ప్రియమైనది రాకున్నది. ప్రయత్నము చేయుచున్న వారి కిట్టిది కానవచ్చునపుడు పురుషార్థ మనునది ఎక్కడిది?
అనిష్ట స్యాభినిర్వృత్తి మిష్టసంవృత్తి మేవ చ,
అప్రయత్నేన పశ్యామః కేషాంచి త్త త్స్వ భావతః. 20
కొందరి విషయమున వారి ప్రయత్నము లేకుండగనే అనిష్టము వచ్చి పడుటయు, ఇష్టము మూసికొను పోవుటయు, స్వభావము వలననే కలుగుటను చూచుచున్నాము.
ప్రతిరూపతరాః కేచిద్ దృశ్యన్తే బుద్ధిమత్తరాః,
విరూపేభ్యోఽ ల్పబుద్ధిభ్యో లిప్సమానా ధనాగమమ్. 21
కొందరు మిక్కిలి బుద్దివిశేషము కలవారు వారి బుద్ధికి విరుద్ధ స్థితికలవారై, విరూపులు, అల్పబుద్ధులునగు వారివలన ధనము రాకడను కోరుచు కన్పట్టు చున్నారు.
స్వభావ ప్రేరితాః సర్వే నివిశన్తే గుణా యదా,
శుభా శుభా స్తదా తత్ర కస్య కిం మానకారణమ్. 22
గుణములన్నియు స్వభావము పురికొల్పగా శుభములు, అశుభములునై చొచ్చుకొని పోవునపుడు అందు దేని కేది అభిమాన కారణము?
స్వభావా దేవ తత్సర్వ మితి మే నిశ్చితా మతిః,
ఆత్మ ప్రతిష్ఠా ప్రజ్ఞా వా మమ నాస్తి తతోఽన్యథా. 23
అది యంతయు స్వభావమువలననే అగుచున్నదని నా నిశ్చయము పొందిన బుద్ధి. ఆత్మప్రతిష్ఠయో, ప్రజ్ఞయో, దానికంటె మరియొక విధమో నాకు లేదు.
కర్మజం త్విహ మన్యన్తే ఫలయోగం శుభాశుభమ్,
కర్మణాం విషయం కృత్స్న మహం వక్ష్యామి తచ్ఛృణు. 24
కొందరు శుభము, అశుభము అగు ఫలముల యోగము ఇచట కర్మములవలస పుట్టినదని భావింతురు. కర్మముల విషయమును మొత్తమును నేను చెప్పెదను. వినుము.
యథా వేదయతే కశ్చి దోదనం వాయసో హ్యదన్,
ఏవం సర్వాణి కర్మాణి స్వభావస్యైవ లక్షణమ్. 25
ఒకకాకి అన్నమును తినుచు తక్కిన అన్నింటికి తెలుపును. అట్లే కర్మము లన్నియు స్వభావమునకే లక్షణమగును.
వికారా నేవ యో వేద న వేద ప్రకృతిం పరామ్,
తస్య స్తంభో భవే ద్బాల్యా న్నాస్తి స్తంభోఽ నుపశ్యతః. 26
వికారములను మాత్రమే యెరిగినవాడు పరయగు ప్రకృతిని ఎరుగడు. బాల్యమువలన అట్టివానికి స్తంభము కలుగును. చక్కగా పరికించువానికి స్తంభము కలుగదు.
స్వభావభావినో భావాన్ సర్వానేవేహ నిశ్చయాత్,
బుద్ధ్యమానస్య దర్పో వా మానో వా కిం కరిష్యతి. 27
సర్వభావములను స్వభావమువలననే కలుగునవిగా నిశ్చయమును పొంది తెలిసి కొనువానికి దర్పముగాని అహంకారముగాని ఏమి చేయును?
వేదధర్మవిధిం కృత్స్నం భూతానాం చాప్యనిత్యతామ్,
తస్మా చ్ఛక్ర నశోచామి సర్వం హ్యే వేద మన్తవత్. 28
ధర్మములవిధి నంతటిని, భూతముల అనిత్యతను చక్కగా తెలిసినవాడను కనుక, శక్రా! నేను శోకింపను. ఇది యంతయు అంతము కలదియే కదా!
నిర్మమో నిరహంకారో నిరాశీ ర్ముక్తబన్ధనః,
స్వస్థోఽ వ్యపేతః పశ్యామి భూతానాం ప్రభవాప్యయౌ. 29
మమకారము, అహంకారము, ఆశలు లేనివాడను, వదలి పోయిన బంధములు కలవాడను, స్వస్థుడను, స్వరూపమునుండి తొలగనివాడను అగు నేను భూతముల ఉత్పత్తి నాశముల స్థానమగు పరబ్రహ్మమును చూచుచుందును.
కృతప్రజ్ఞస్య దాన్తస్య వితృష్ణస్య నిరాశిషః,
నాయాసో విద్యతే శక్ర పశ్యతో లోక మవ్యయమ్. 30
ఇంద్రా! ప్రజ్ఞను కూడగట్టుకొన్నవాడు, ఇంద్రియములపై అదుపు కలవాడు, ఏ దాహములు లేనివాడు, ఆశలు తొలగిపోయినవాడునై అవ్యయమగులోకమును దర్శించువానికి ఆయాసము ఉండదు.
ప్రకృతౌ చ వికారే చ న మే ప్రీతి ర్న చ ద్విషే,
ద్వేష్టారం చ న పశ్యామి యో మా మద్య మమాయతే. 31
ప్రకృతియందును, వికారమునందును నాకు ప్రీతిలేదు. నేను ద్వేషింపను ద్వేషించువాడు గాని, నన్ను నావాడుగా తలచువాడుగాని నేడు నాకు కానరాడు.
నోర్ధ్వం నా వాఙ్న తిర్యక్చ న క్వచి చ్ఛక్ర కామయే,
నహి జ్ఞేయే న విజ్ఞానే న జ్ఞానే కర్మ విద్యతే. 32
పై నున్న స్వర్గమును గాని, క్రిందనున్న పాతాళమును గాని, నడుమనున్న మర్త్యలోకమును గాని, ఏ కాలమున గాని శక్రా! నేను కోరను, జ్ఞేయమునందుగాని, విజ్ఞానమునందుగాని నాకు కర్మము లేదనుట లేదు. జ్ఞానమునందు మాత్రమే లేదు.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
యే నైషా లభ్యతే ప్రజ్ఞా యేన శాన్తి రవాప్యతే,
ప్రబ్రూహి త ముపాయం మే సమ్యక్ ప్రహ్లాద పృచ్ఛతః. 33
ప్రహ్లాదా! ఈ ప్రజ్ఞ దేనిచేత నలవడునో, శాంతి దేనిచేత కలుగునో ఆ ఉపాయమును అడుగుచున్ననాకు చక్కగా బోధింపుము.
ప్రహ్లాద ఉవాచ - ప్రహ్లాదు డిట్లు చెప్పెను.
ఆర్జవే నాప్రమాదేన ప్రసాదే నాత్మవత్తయా,
వృద్ధశుశ్రూషయా శక్ర పురుషో లభతే మహత్. 34
కపటస్వభావము లేకుండుట, ప్రమాదపడకుండుట, ప్రసాదము, ఇంద్రియములను గెలుచుట, వృద్ధులనుండి తత్త్వమును వినగోరుట - అనువానిచేత, ఇంద్రా! పురుషుడు మోక్షమును పొందును.
స్వభావా ల్లభతే ప్రజ్ఞాం శాన్తి మేతి స్వభావతః,
స్వభావా దేవ తత్సర్వం యత్కించి దనుపశ్యసి. 35
స్వభావమువలననే ప్రజ్ఞను నరుడు పొందును. స్వభావమువలననే శాంతిని అందుకొనును. నీవు దేనిని వదలక చూచుచున్నావో దానినంతటిని స్వభావము వలననే పొందెదవు.
ఇత్యుక్తో దైత్యపతినా శక్రో విస్మయ మాగమత్,
ప్రీతిమాంశ్చ తదా రాజం స్తద్వాక్యం ప్రత్యపూజయత్. 36
రాక్షసరా జిట్లు చెప్పగా దేవేంద్రుడు విస్మయము పొందెను. మిక్కిలి ప్రీతి కలవాడై రాజా! ఆతని ఆవాక్యమును ఎంతగానో ప్రశంసించెను.
స తదాఽ భ్యర్చ్య దైత్యేన్ద్రం త్రైలోక్యపతి రీశ్వరః,
అసురేన్ద్ర ముపామన్త్య్ర జగామ స్వం నివేశనమ్. 37
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
శక్రప్రహ్లాద సంవాదో నామ ద్వావింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
అప్పుడు మూడులోకముల అధిపతి, ఈశ్వరుడు నగు దేవేంద్రుడు ఆరాక్షసరాజును పూజించి, సెలవు గైకొని తన స్థానమున కరిగెను.
ఇది మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున శక్రప్రహ్లాద
సంవాదము గల రెండువందల యిరువది రెండవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
యయా బుద్ధ్యా మహీపాలో భ్రష్టశ్రీ ర్విచరే న్మహీమ్,
కాలదణ్డ వినిష్పిష్ట స్తన్మే బ్రూహి పితామహ. 1
సంపద కోల్పోయిన రాజు, కాలదండము నుగ్గు నుగ్గుగా చేయగా ఏ బుద్ధి నాశ్రయించి భూమియందు తిరుగవలయునో తాతా! దానిని నా కుపదేశింపుము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
వాసవస్య చ సంవాదం బలే ర్వైరోచనస్య చ. 2
ఇందును ప్రాతకాలపు ఈ ఇతిహాసమును చెప్పుచుందురు. ఇది యింద్రునకును, విరోచనుని కుమారుడగు బలికిని నయిన సంవాదము.
పితామహ ముపాగమ్య ప్రణిపత్య కృతాఞ్జలిః,
సర్వా నేవాసురాన్ జిత్వా బలిం పప్రచ్ఛ వాసవః. 3
రాక్షసుల నందరిని గెలిచి బ్రహ్మదేవుని కడకరిగి ప్రణమిల్లి చేతులు మోడ్చి దేవేంద్రుడు బలిని గూర్చి యిట్లు ప్రశ్నించెను.
యస్యస్మ దదతో విత్తం న కదాచన హీయతే,
తం బలిం నాధిగచ్ఛామి బ్రహ్మ న్నాచక్ష్వ మే బలిమ్. 4
ఎందరి కెంత ధనమిచ్చినను తరుగువోని ధనము గల ఆ బలిని గూర్చి తెలియరాదు. తాతా! బలిని గూర్చి నాకు చెప్పుము.
స వాయు ర్వరుణ శ్చైవ స రవిః స చ చన్ద్రమాః,
సోఽ గ్ని స్తపతి భూతాని జలం చ స భవత్యుత. 5
అతడే వాయువు, అతడే వరుణుడు. అతడే రవి. అతడే చంద్రుడు. అతడే అగ్నియై భూతములను కాల్చుచుండును. అతడే జలమును అగును.
తం బలిం నాధిగచ్ఛామి బ్రహ్మ న్నాచక్ష్య మే బలిమ్,
స ఏవ హ్యస్తమయతే స స్మ విద్యోతతే దిశః. 6
ఆ బలిని కనుగొనకున్నాను. ఓ బ్రహ్మా! ఆ బలిని గూర్చి నాకు చెప్పుము. అతడే అస్తమించునట. అతడే దిక్కులను వెలుగొందజేయునట.
స వర్షతి స్మ వర్షాణి యథాకాల మతన్ద్రితః,
తం బలిం నాధిగచ్చామి బ్రహ్మ న్నాచక్ష్య మే బలిమ్. 7
అతడే కాలమున కనుగుణముగా ఏ నిద్దురమత్తుతనము లేనివాడై వర్షములు కురియునట. ఓ బ్రహ్మదేవా! ఆ బలి తెలియరాకున్నాడు. అతనిని గూర్చి నాకు తెలియజెప్పుము.
బ్రహ్మోవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.
నైత త్తే సాధు మఘవన్ యదేన మనుపృచ్ఛసి,
పృష్టస్తు నానృతం బ్రూయా త్తస్మా ద్వక్ష్యామి తే బలిమ్. 8
ఇంద్రా! నీవు అడుగుచున్నది సరియగు విషయము కాదు. అయినను అడిగినపుడు అబద్ధము చెప్పరాదు. అందువలన నీకు బలిని గూర్చి చెప్పెదను.
ఉష్ట్రేషు యది వా గోషు ఖరే ష్వశ్వేషు వా పునః,
వరిష్ఠో భవితా జన్తుః శూన్యాగారే శచీపతే. 9
శచీపతీ! ఒంటెలయందో, ఎద్దులయందో, గాడిదలయందో, గుఱ్ఱములయందో, ఎవ్వరులేని పాడు కొంపలో మేలైన జంతువుగా ఆ బలి పుట్టియుండును.
శక్ర ఉవాచ - శక్రు డిట్లనెను
యది స్మ బలినా బ్రహ్మన్ శూన్యాగారే సమేయివాన్,
హన్యా మేనం న వా హన్యాం తద్ర్బహ్మ న్ననుశాధి మామ్. 10
బ్రహ్మదేవా! ఎవ్వరులేని స్థానమున ఆ బలితో నేను పోరుదునేని అతనిని చంపుదునా? వలదా? నన్ను ఆదేశింపుము.
బ్రహ్మో వాచ - బ్రహ్మ యిట్లు పలికెను.
మా స్మ శక్ర బలిం హింసే ర్న బలి ర్వధ మర్హతి,
న్యాయస్తు శక్ర ప్రష్టవ్య స్త్వయా వాసవ కామ్యయా. 11
ఇంద్రా! నీవు బలిని హింసింపరాదు. బలి వధింపరానివాడు. నీవు ఇచ్చవడి అతనిని న్యాయమును గూర్చి అడుగవలయును.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు పలికెను.
ఏవ ముక్తో భగవతా మహేన్ద్రః పృథివీం తదా,
చచా రైరావతస్కన్ధ మధిరుహ్య శ్రియా వృతః. 12
బ్రహ్మ యిట్లు పలుకగా మహేంద్రుడు ఐరావతము మూపు నెక్కి సంపద వెల్లివిరియుచుండగా భూమిపై తిరుగాడ జొచ్చెను.
తతో దదర్శ స బలిం ఖరవేషేణ సంవృతమ్,
యథాఽఽ ఖ్యాతం భగవతా శూన్యాగారకృతాలయమ్. 13
అంత గాడిద వేషముతో గుట్టుగా నున్నవాడును, బ్రహ్మచెప్పిన విధముగా పాడుబడ్డ కొంపను నివాసముగా చేసికొన్నవాడును నగు బలిని గాంచెను.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లు పలికెను.
ఖరయోని మనుప్రాప్త స్తుషభక్షోఽ సి దానవ,
ఇయం తే యోని రధమా శోచస్యాహో న శోచసి. 14
దానవా! గాడిద కడుపున పుట్టి ఊకను తినువాడవైతివి. ఈ నీపుట్టినతావు అధమమైనది. దీనికై ఏడ్తువా? ఏడువవా?
అదృష్టం బత పశ్యామి ద్విషతాం వశ మాగతమ్,
శ్రియావిహీనం మిత్రైశ్చ భ్రష్టవీర్య పరాక్రమమ్. 15
ఆహా! అదృష్టము! శత్రువులచేతికి చిక్కినవానిని, సంపదలు పోయినవానిని, మిత్రములను కోల్పోయినవానిని సత్తువ, పరాక్రమము జారీపోయినవానిని నిన్ను చూచుచున్నాను.
యత్తద్యాన సహస్రై స్త్వంజ్ఞాతిభిః పరివారితః,
లోకాన్ ప్రతాపయన్ సర్వాన్ యాస్యస్మానవితర్కయన్. 16
వేలకొలది వాహనములతో చుట్టపక్కములతో కూడినవాడవై, లోకములన్నింటికి ఉడుకు పుట్టించుచు, మమ్ములను పట్టించుకొనక తిరిగెడువాడవు.
త్వన్ముఖా శ్చైవ దైతేయా వ్యతిష్ఠం స్తవ శాసనే,
అకృష్టపచ్యా చ మహీ తవైశ్వర్యే బభూవ హ. 17
దైతేయులకు నీవే మొనగాడవు. వారందరు నీ ఆజ్ఞలో నిలబడియుందురు. ప్రభుత్వమున భూమి దున్నకయే పండునదిగా నుండెడిది.
ఇదం చ తేఽ ద్య వ్యసనం శోచస్యాహో న శోచసి,
యదాఽఽ తిష్ఠః సముద్రస్య పూర్వకూలే విలేలిహన్
జ్ఞాతీన్ విభజతో విత్తం తదాసీ త్తే మనః కథమ్. 18
ఇప్పుడిదిగో నీకు కష్టము వచ్చిపడినది. దుఃఖింతువా? దుఃఖింపవా? మునుపు సముద్రపు తూర్పుగట్టున నీజ్ఞాతులకు ధనము పంచియిచ్చునపుడు నీమనస్సెట్టు లుండెడిది?
యత్తే సహస్రసమితా ననృతు ర్దేవయోషితః,
బహూని వర్షపూగాని విహారే దీప్యతః శ్రియా. 19
సర్వాః పుష్కరమాలిన్యః సర్వాః కాఞ్చనసప్రభాః,
కథ మద్య తదా చైవ మనస్తే దానవేశ్వర. 20
నీవు సంపదతో వెలిగిపోవుచు పెక్కేండ్లు విహరించునపుడు వేలకొలది దేవకాంతలు పద్మమాలలు తాల్చి బంగారువన్నెతో వెలిగిపోవుచు నీకడ నాట్యములు చేయుచుండెడివారు. ఇప్పుడు, అప్పుడు నీమన సెట్లుండును?
ఛత్రం తవాసీ త్సుమహ త్సౌవర్ణం రత్నభూషితమ్,
ననృతు స్తత్ర గన్ధర్వాః షట్ సహస్రాణి సప్తధా. 21
నీ గొడుగు చాల పెద్దది. సువర్ణముతో చేసినట్టిది. రత్నములు పొదిగినట్టిది. అందారువేలమంది గంధర్వులు ఏడు విధములుగా నృత్యమొనర్చెడివారు.
యూప స్తవాసీ త్సుమహాన్ యజతః సర్వకాఞ్చనః,
యత్రాదదః సహస్రాణి అయుతానాం గవాం దశ. 22
అనన్తరం సహస్రేణ తదాఽఽ సీ ద్దైత్య కా మతిః 23
నీవు యజ్ఞములు చేయుచుండగా నీకు చాల పెద్దది యగు యూపముండెడిది. అది నిలువెల్ల బంగారమే అయినట్టిది. అచట నీవు పదిలక్షల గోవులను దాన మిచ్చితివి. తరువాత మరియు వేయి గోవుల నిచ్చితివి. అప్పటి నీబుద్ధి ఎట్లుండెడిది?
యదా చ పృథివీం సర్వాం యజమానోఽ ను పర్యగాః
శమ్యాక్షేపేణ విధినా తదాసీత్కిం ను తే హృది. 24
యజ్ఞములు చేయుచు నీవు భూమి నంతటిని శమ్యాక్షేపమనేడు విధితో పరిహరించి తిరిగితివి. అప్పుడు నీహృదయమున ఏభావము ఉండెడిది?
న తే పశ్యామి భృంగారం నచ్ఛత్రం వ్యజనే న చ,
బ్రహ్మదత్తాం చ తే మాలాం న పశ్యా మ్యసురాధిప! 25
ఓయి రాక్షసరాజా! ఆ బంగారు పాత్రయు, ఆ ఛత్రము, ఆ వింజామరలు, బ్రహ్మప్రసాదించిన మాలయు నాకిపుడు కానరాకున్నవి.
బలి రువాచ - బలి యిట్లనెను.
న త్వం పశ్యసి భృంగారం న చ్ఛత్రం వ్యజనే న చ,
బ్రహ్మదత్తాం చ మే మాలాం న త్వం ద్రక్ష్యసి వాసవ. 26
ఓయి వాసవా! నా భృంగారమును, ఛత్రమును, చామరములను బ్రహ్మ యొసగిన మాలను నీవిపుడు చూడకున్నావు.
గుహాయాం నిహితాని త్వం మమ రత్నాని పృచ్ఛసి,
యదా మే భవితా కాల స్తదా త్వం తాని ద్రక్ష్యసి. 27
గుహయందు దాచియుంచిన నారత్నములను గూర్చి నీవు అడుగుచున్నావు. నాకు కాలము కలిసివచ్చినపుడు వానిని నీవు కనుగొందువు.
నత్వేదనురూపం తే యశసో వా కులస్య చ,
సమృద్ధార్థోఽ సమృద్ధార్థం యన్మాం కత్థితు మిచ్చసి. 28
ఇది నీకు, నీ కీర్తికి, నీకులమునకు తగినది కాదు. లప్పలుగా సంపదలుగల నీవు అవి లేని నన్ను దెప్పగోరుచున్నావు.
న హి దుఃఖేషు శోచన్తే న ప్రహృష్యన్తి చర్థిషు,
కృతప్రజ్ఞా జ్ఞానతృప్తాః క్షాన్తాః సన్తో మనీషిణః. 29
ప్రజ్ఞ పాకమునకు వచ్చిన వారు, జ్ఞానముచేత తృప్తినందువారు, సహనము గలవారు నగు బుద్ధిమంతులు దుఃఖసందర్భములలో ఏడువరు. సంపదలున్నపుడు పొంగిపోరు.
త్వం తు ప్రాకృతయా బుద్ధ్యా పురందర వికత్థసే,
యదాఽ హ మివ భావీ స్యా స్తదా నైవం వధిష్యసి. 30
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
బలివానవసంవాదో నామ త్రయోవింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
నీవు వివేకము లేని బుద్ధితో ఓయి పురందరా! గొప్పలు చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు నేనెట్లున్నానో అట్లయినపుడు ఇట్లు వాగవు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున
బలివాసవ సంవాదమను రెండువందల యిరువది మూడవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
పున రేవ తు తం శక్రః ప్రహస న్నిద మబ్రవీత్,
నిఃశ్వసస్తం యథా నాగం ప్రవ్యాహారాయ భారత. 1
ఆ యింద్రుడు వెక్కిరింపు నవ్వు నవ్వుచు పామువలె బుస కొట్టుచున్న ఆ బలిని దెప్పి పొడుచుటకై మరల నిట్లనెను.
శక్ర ఉవాచ - శక్రు డిట్లనెను
యత్తద్యానసహస్రేణ జ్ఞాతిభిః పరివారితః,
లోకాన్ ప్రతాపయన్ సర్వాన్ యాస్యస్మా నవితర్కయన్. 2
వేయి వాహనములు, చుట్టపక్కములు చుట్టుకొని రాగా లోకముల నన్నింటిని మండించుచు మమ్ము లెక్కగొనక తిరిగెడి వాడవు.
దృష్ట్వా సుకృపణాం చేమా మవస్థా మాత్మనో బలే,
జ్ఞాతి మిత్ర పరిత్యక్తః శోచస్యాహో న శోచసి? 3
మిక్కిలి జాలిగొలిపెడు నీ యీ అవస్థను కనుగొని బలీ, బంధు మిత్రులు వదలిపోగా నీవు దుఃఖింతువా? దుఃఖింపవా?
ప్రీతిం ప్రాప్యాతులాం పూర్వం లోకాం శ్చాత్మవశే స్థితాన్,
వినిపాత మిమం బాహ్యం శోచస్యాహో న శోచసి? 4
వెనుక నీకు వశమై యున్న లోకముల నన్నింటిని చూచి సాటిలేని ప్రీతిని పొంది యిప్పటి యీ వెలుపలిదైన వినాశనమును గాంచి శోకింతువా? శోకింపవా?
బలి రువాచ - బలి యిట్లనెను.
అనిత్య ముపలక్ష్యేహ కాల పర్యాయ ధర్మతః,
తస్మాచ్ఛక్ర న శోచామి సర్వం హ్యే వేద మన్తవత్. 5
శక్రా! కాలము మారుట అను ధర్మము ననుసరించి సర్వమును అనిత్య మైనదిగా పరికించి నేను శోకింపను. ఇది అంతయు అంతము కలిగినదే.
అన్తవన్త ఇమే దేహా భూతానాం చ సురాధిప!
తేన శక్ర న శోచామి నాపరాధా దిదం మమ. 6
ప్రాణుల యీ దేహము లన్నియు నాశము కలవియే. అందువలన ఓ యింద్రా ! ఇది నా దోషమువలన నైనది కాదు కనుక నేను దుఃఖింపను.
జీవితం చ శరీరం చ జాత్యైవ సహ జాయతే,
ఉభే సహ వివర్ధతే ఉభే సహ వినశ్యతః 7
జీవితము శరీరము స్వభావముచేత కలిసియే ఏర్పడుచున్నవి. రెండును కలిసియే పెరుగుచున్నవి. రెండును కలిసియే నశించుచున్నవి.
నహీదృశ మహంభావ మవశః ప్రాప్య కేవలమ్,
యదేవ మభిజానామి కా వ్యథా మే విజానతః. 8
నేనిట్టి భావమును కేవలము అవశుడవై పొందినవాడనుకాను. దీనిని చక్కగా తెలిసికొనియున్నాను. ఆట్లు తెలిసిన నాకు వ్యథ యెట్టిది?
భూతానాం నిధనం నిష్ఠా స్రోతసా మివ సాగరః,
నైతత్సమ్య గ్విజానన్తో నరా ముహ్యన్తి వజ్రధ్రుక్. 9
నదులకు సముద్రమువలె ప్రాణులకు మరణము తుదిగతి. ఇది యంతయు చక్కగా నెరుగనినరులు, ఓ వజ్రపాణీ! మోహపడుదురు.
యేత్వేవం నాభిజానన్తి రజోమోహ పరాయణాః,
తే కృచ్ఛ్రం ప్రాప్య సీదన్తి బుద్ధి ర్యేషాం ప్రణశ్యతి. 10
రజస్సు మోహము అనునవియే తుదిగతిగా గలవారు, దీనిని చక్కగా తెలియజాలనివారై, బుద్ధి నశింపగా పరమ కష్టమును పొంది నశింతురు.
బుద్ధిలాభాత్తు పురుషః సర్వం తుదతి కిల్బిషమ్,
విపాప్మా లభతే సత్త్వం సత్త్వస్థః సంప్రసీదతి. 11
బుద్ధిలాభమువలన పురుషుడు పాపము నంతటిని పారద్రోలును. పాపము లేనివాడు సత్త్వ గుణమును పొందును. సత్త్వమున నిలుకడ కలవాడు మిక్కిలి ప్రసన్ను డగును.
తతస్తు యే నివర్తనే జాయన్తే వా పునః పునః,
కృపణాః పరితప్యన్తే తై రర్థై రభిచోదితాః. 12
ఆ సత్త్వమునుండి మరలి పోయెడివారు మరల మరల పుట్టుచుందురు. దీనులై ఆ అర్థములు పురికొల్పుచుండగా కుమిలి పోవుచుందురు.
అర్థసిద్ధి మనర్థం చ జీవితం మరణం తథా,
సుఖదుఃఖ ఫలే చైవ న ద్వేష్మి న చ కామయే. 13
అర్థసిద్ధిని అనర్థమును, జీవితమును మరణమును, సుఖదుఃఖరూపములైన ఫలములను ద్వేషింపను, కామింపను.
హతం హన్తి హతో హ్యేవ యో నరో హన్తి కఞ్చన,
ఉభౌ తౌ న విజానీతో యశ్చ హన్తి హతశ్చ యః 14
ఎవ్వడేని నరుడు చంపినచో చచ్చినదానినే చంపును. చంపినవాడును చచ్చినవాడే యగును. ఆ యిద్దరును - చంపినవాడును చచ్చినవాడును - తెలివిమాలినవారే.
హత్వా జిత్వా చ మఘవన్ యః కశ్చి త్పురుషాయతే,
అకర్తా హ్యేవ భవతి కర్తా హ్యేవ కరోతి తత్. 15
ఇంద్రా! చంపువాడు, గెలుచువాడునై ఎవ్వడు గాని పురుషుని వలె నగువాడు అకర్తయే యగును. కర్తయే దానిని చేయును.
కో లోకస్య కురుతే వినాశ ప్రభవా వుభౌ,
కృతం హి తత్కృతే నైవ కర్తా తస్యాపి చాపరః. 16
లోకమునకు సృష్టివినాశములను ఎవ్వడు చేయుచున్నాడు? మనస్సే దానిని చేసినది. దానికిని కర్త మరియొకడు.
పృథివీ జ్యోతిరాకాశ మాపో వాయుశ్చ పశ్చిమః.
ఏతద్యోనీని భూతాని తత్ర కా పరిదేవనా. 17
భూమి, అగ్ని, ఆకాశము, నీరు, గాలి ఇవి పుట్టుక స్థానములైనవి భూతములు. అందు దుఃఖ మన నెట్టిది?
మహావిద్యోఽ ల్పవిద్యశ్చ బలవాన్ దుర్బలశ్చ యః
దర్శనీయో విరూపశ్చ సుభగో దుర్భగశ్చ యః 18
సర్వకాలః సమాదత్తే గంభీర: స్వేన తేజసా,
తస్మిన్ కాలవశం ప్రాప్తే కా వ్యథా మే విజానతః. 19
గొప్ప విద్యకలవాడు, కొంచెముపాటి విద్యకలవాడు, బలవంతుడు దుర్బలుడు, రూపవంతుడు విరూపుడు, సంపన్నుడు దరిద్రుడు ఇది యంతయు గంభీరమైన కాలము తన తేజస్సుతో ఏర్పరచుచున్నది. అట్లాది యంతయు కాలమునకు వశముకాగా అది తెలిసికొన్న నాకు వ్యథ ఎక్కడిది?
దగ్ధమే వాను దహతి హత మేవానుహన్యతే,
నశ్యతే నష్ట మేవాగ్రే లబ్ధవ్యం లభతే నరః. 20
మున్నే కాలిపోయిన దానిని కాల్చును. చచ్చిన వానినే చంపును. మున్ను నశించినదే నశించును. తాను పొందవలసినదానినే మానవుడు పొందును.
నాస్తి ద్వీపః కుతః పారో నావారః సంప్రదృశ్యతే,
నాన్తమస్య ప్రపశ్యామి విధే ర్దివ్యస్య చిన్తయన్. 21
ఈ కాలము మహాసముద్రము. ఇందు ద్వీపము లేదు. ఇంక ఒడ్డెక్కడ? ఆవలి ఒడ్డు కనుచూపు మేరలో లేదు. దీనికి అంతము ఎంత చింతించినను కనబడదు. ఇది దివ్యమైన విధాత స్వరూపము.
యది మే పశ్యతః కాలో భూతాని న వినాశయేత్,
స్యాన్మే హర్షశ్చ దర్పశ్చ క్రోధ శ్చైవ శచీపతే. 22
నేను చూచుచుండగా కాలము భూతములను నశింపజేయకుండునేని నాకు అప్పుడు హర్షము, దర్పము, క్రోధము మొదలగునవి కలుగవలయును.
తుషభక్షం తు మాం జ్ఞాత్వా ప్రవివిక్తజనే గృహే,
బిభ్రతం గార్దభం రూప మాగత్య పరిగర్హసే. 23
ఏ ఒక్క మానవుడును తిరుగాడని కొంపలో గాడిదరూపమును తాల్చి ఊకదినుచున్న నన్నెరిగి వచ్చి వెక్కిరించుచున్నావు (నిందించుచున్నావు).
ఇచ్ఛన్నహం వికుర్యాం హి రూపాణి బహుధాఽఽ త్మనః,
విభీషణాని యానీక్ష్య పలాయేథా స్త్వమేవ మే. 24
నేను కోరికోరి పెక్కువిధములగు భయము గొల్పురూపములను పెద్దగా చేసితినేని నీవు నానుండి తోకముడిచి యుండెడివాడవు.
కాలః సర్వం సమాదత్తే కాలః సర్వం ప్రయచ్ఛతి,
కాలేన విహితం సర్వం మాకృథాః శక్ర పౌరుషమ్. 25
కాలమే సర్వమును పట్టుకొనును. కాలమే సర్వమును ఒసగును. అంతయు కాలము చేసినదే. ఇంద్రా! పౌరుషము చూపకుము.
పురా సర్వం ప్రవ్యథితం మయి క్రుద్ధే పురందర,
అవైమి త్వస్య లోకస్య ధర్మం శక్ర సనాతనమ్. 26
త్వమప్యేవ మవేక్షస్వ మాఽఽ త్మనా విస్మయం గమః,
ప్రభవశ్చ ప్రభావశ్చ నాత్మసంస్థః కదాచన. 27
వెనుక నేను క్రోధము తాల్పగా లోకమంతయు కుమిలిపోయినది. ఇంద్రా! సనాతనమై ఈ లోకపు ధర్మమును నేనెరుగుదును. నీవును దీనిని మెలకువతో పరికింపుము. నీ యిప్పటి స్థితిని చూచి ఆశ్చర్యపడకుము. ప్రభవము, ప్రభావము అనునవి ఎన్నడును తన అధీనములోనివి కావు.
కౌమారమేవ తే చిత్తం తథై వాద్య యథాపురా,
సమవేక్షస్య మఘవన్ బుద్ధిం విన్దస్వ నైష్ఠికీమ్. 28
నీ చిత్తము మును పెట్లో ఇప్పుడును అట్లే పిల్లతనపు తీరులో నున్నది. గొప్ప యజ్ఞములు చేసినవాడవు, నిష్ఠతో నిండిన బుద్ధిని, చక్కగా పరికించి, పొందుము.
దేవా మనుష్యాః పితరో గన్ధర్వోరగరాక్షసాః,
ఆసన్ సర్వే మమ వశే తత్సర్వం వేత్థ వాసవ. 29
దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు. ఈ అందరు మునుపు నా చెప్పు చేతలలో నుండిరి. వాసవా! ఇది యంతయు నీ వెరుగుదువు.
నమస్తస్యై దిశేఽ ప్యస్తు యస్యాం వైరోచనో బలిః,
ఇతి మామభ్యపద్యన్త బుద్ధిమాత్సర్య మోహితాః. 30
విరోచనుని కుమారుడు ఉన్న ఆ దిక్కునకు కూడ నమస్కారము - అని బుద్ధిమాత్సర్య మోహితులై జనులు నన్ను పూజించెడివారు.
నాహం తదనుశోచామి నాత్మభ్రంశం శచీపతే,
ఏవం మే నిశ్చితా బుద్ధిః శాస్తు స్తిష్ఠా మ్యహం వశే. 31
నేను దానిని గూర్చి బాధపడను. నేనా భ్రష్టతను గూర్చి విచారింపను. ఇది నా నిశ్చితమగు బుద్ధి. ఈశ్వరుని వశమున నేను స్థిరముగా నుందును.
దృశ్యతే హి కులే జాతో దర్శనీయః ప్రతాపవాన్,
దుఖం జీవన్ సహామాత్యో భవితవ్యం హి తత్తథా. 32
మంచి కులమున పుట్టి అందచందములు ప్రతాపము కలవాడై, గొప్ప మంత్రులు కలవాడును, దుఃఖముతో బ్రదుకు వెళ్లబుచ్చుచు కన్పట్టుచున్నాడు. అట్లు జరుగవలసి యున్నది.
దౌష్కులేయ స్తథా మూఢో దుర్జనః శక్ర దృశ్యతే,
సుఖం జీవన్ సహామాత్యో భవితవ్యం హి తత్తథా. 33
పాడుకులమున పుట్టి మూఢుడు, దుర్జనుడు నైనవాడు తన వారందరితోపాటు సుఖముగా బ్రదుకుచు కానవచ్చుచున్నాడు. భవితవ్యము అటువంటిది.
కల్యాణీ రూప సంపన్నా దుర్భగా శక్ర దృశ్యతే,
అలక్షణా విరూపా చ సుభగా దృశ్యతే పరా. 34
శుభలక్షణములు రూపసంపద గల ఒక యువతి దౌర్భాగ్యముతో కానవచ్చుచున్నది. ఏ లక్షణములు లేనిదియు వికారరూపము గలదియు నగు మరియొకతె సౌభాగ్యముతో అలరారుచు కన్పట్టుచున్నది.
నైత దస్మత్కృతం శక్ర నైతచ్ఛక్ర త్వయా కృతమ్,
యత్త్వ మేవం గతో వజ్రిన్ యచ్చాప్యేవం గతా వయమ్. 35
ఓయి వజ్రీ! నీవిట్లుగానుండుటకును, మేమిట్లగుటకును, అది నీవు చేసినదికాదు. ఇది నేను చేసినది కాదు.
న కర్మ భవితాప్యేతత్ కృతం మమ శతక్రతో,
ఋద్ధి ర్వాఽ ప్యథవా నర్ధిః పర్యాయకృత మేవ తత్. 36
ఓయి శతక్రతూ! ఇది నేను చేసిన కర్మము కాదు. సంపదయో అది లేకుండుటయో కాలక్రమమున జరుగునదియే.
పశ్యామి త్వాం విరాజన్తం దేవరాజ మవస్థితమ్,
శ్రీమన్తం ద్యుతిమన్తం చ గర్జమానం మమోపరి. 37
గొప్పగా విరాజిల్లుచున్నావు. దేవరాజవై నిలువ ద్రొక్కుకొనియున్నావు. సంపదతో, తేజస్సుతో వెలిగిపోవుచున్నావు. నాపై గర్జించుచున్నావు. అట్టి నిన్ను చూచుచున్నాను.
ఏవం నైవ న చేత్కాలో మా మాక్రమ్య స్థితోభవేత్,
పాతయేయ మహం త్యాద్య స వజ్రమపి ముష్టినా. 38
ఈ విధముగా కాలము నన్ను లోగొని యుండక పోయినచో ఈ నాడు వజ్రహస్తుడవై యున్నవాడవైనను నిన్ను పిడికిలితో కూల్చి యుండెడి వాడను.
న తు విక్రమకాలోఽయం శాన్తికాలోఽయ మాగతః,
కాలః స్థాపయతే సర్వం కాలః పచతి వై తథా. 39
ఇది నేను విక్రమించు కాలము కాదు. శాంతికాలము వచ్చినది. సర్వమును కాలమే నిలువరించును. అట్లే కాలమే పంటకు తెచ్చును.
మాం చే దభ్యాగతః కాలో దానవేశ్వర పూజితమ్,
గర్జన్తం ప్రతపన్తం చ క మన్యం నాగమిష్యతి. 40
దానవేశ్వరుల పూజలందుకొన్నవాడను, గర్జించుచు, అందరిని కాల్చివేయువాడను నగు నన్నే కాలము ఆక్రమించిన దన్నచో ఇంక ఎవనిని లోగొనదు?
ద్వాదశానాం తు భవతా మాదిత్యానాం మహాత్మనామ్,
తేజాం స్యేకేన సర్వేషాం దేవరాజ ధృతాని మే. 41
మహాత్ములు పన్నిద్దరునైన మీ ఆదిత్యులందరి తేజస్సులను నేనొక్కడను తాల్చితిని.
అహ మేవోద్వహామ్యాపో విసృజామి చ వాసవ,
తపామి చైవ త్రైలోక్యం విద్యోతామ్యహ మేవ చ. 42
నేనే జలములను తాల్చెదను. వదలెదను. మూడు లోకములను ఉడికింతును. నేనే గొప్ప తేజస్సుతో వెలిగిపోయెదను.
సంరక్షామి విలుంపామి దదామ్యహ మథాదదే,
సంయచ్ఛామి నియచ్ఛామి లోకేషు ప్రభు రీశ్వరః 43
లోకములన్నిటియందు ప్రభువనై ఈశ్వరుడనై కాపాడుదును. రూపుమాపుదును. ఇత్తును పుచ్చుకొందును. వదలుదును. పట్టుకొందును.
తదద్య వినివృత్తం మే ప్రభుత్వ మమరాధిప,
కాలసైన్యావగాఢస్య సర్వం న ప్రతిభాతి మే. 44
అమరాధిపతీ! ఆ నా ప్రభుత్వ మిప్పుడు తిరుగబడి కాలసైన్యము గట్టిగా పీడించెడు నాకిప్పు డేమియు భాసింపకున్నది.
నాహం కర్తా న చైవ త్వం నాన్యః కర్తా శచీపతే,
పర్యాయేణ హి భుజ్యన్తే లోకాః శక్ర యదృచ్ఛయా. 45
ఓయీ! శచీపతీ! శక్రా! నేనుగాని నీవుగాని మఱియొకడుగాని కర్తలము గాము. కాలముచేత ఎవని ప్రయత్నము లేక లోకములు అనుభవింప బడుచున్నవి.
మాస మాసార్ధవేశ్మాన మహోరాత్రాభిసంవృతమ్,
ఋతుద్వారం వాయుముఖ మాయుర్వేదవిదో జనాః. 46
నెలలు పక్షములు, అనునవి అధిష్ఠానముగా గలది, పగళ్లు రాత్రులు అనువానితో కప్పబడినది. ఋతువులే ద్వారములుగాగలది, వాయువు ముఖముగాగలది యగుదానిని కాలముగా ఆయుర్వేదము నెరిగిన జనులు తెలిసికొందురు.
అహుః సర్వ మిదం చిన్త్యం జనాః కేచిన్మనీషయా,
అస్యాః పఞ్చైవ చిన్తాయాః పర్యేష్యామి చ పఞ్చధా. 47
ఇది యంతయు కాలమను పేరుగల బ్రహ్మమనియు దీనినే ధ్యానింప వలయుననియు కొందరు జనులు బుద్ధివిశేషముతో చెప్పుదురు. ఈ చింతనకు అయిదే విషయములనియు, అయిదు విధములని నేను చక్కగా తెలిసికొను చున్నాను.
గంభీరం గహనం బ్రహ్మ మహత్తోయార్ణవం యథా,
అనాదినిధనం చాహు రక్షరం క్షర మేవ చ. 48
బ్రహ్మము గంభీరము, చొరరానిది, గొప్ప నీటి సముదాయ రూపమైన సముద్రము వంటిది. ఆదియు అంతము లేనిది, అక్షరము, క్షరము అయినదని చెప్పుదురు.
సత్త్యేషు లింగ మావిశ్య నిర్లిఙ్గ మపి తత్స్వయమ్,
మన్యన్తే ధ్రువ మేవైనం యే జనా స్తత్త్వదర్శినః 49
అది స్వయముగా లింగములు లేని దైనను సత్త్వములయందు చొచ్చుకొనిపోయి లింగమై కన్పట్టును. తత్త్వమును దర్శించినవారు దానిని ధ్రువమైనదనియే తలతురు.
భూతానాం తు విపర్యాసం కురుతే భగవా నితి,
న హ్యేతావ ద్భవే ద్గమ్యం న యస్మా త్ప్రభవే త్పునః. 50
భగవంతుడు భూతములకు సంబంధించిన విపర్యాసమును చేయు నన్నంత మాత్రమున అదియే గమ్యము కాదు. దీనివలన మరల ఏదియు నేర్పడదో అది ఆత్మ స్వరూపము.
గతిం హి సర్వభూతానా మగత్వా క్వ గమిష్యతి,
యో ధావతా న హాతవ్య స్తిష్ఠ న్నపి న హీయతే. 51
సర్వ భూతములకు గతియైన దానిని పొందక నరుడెక్కడి కరుగును? అది పరువెత్తువానికి వదలదగినది కాదు. నిలిచియుండియు విడువబడదు.
తమిన్ద్రియాణి సర్వాణి నానుపశ్యన్తి పఞ్చధా,
ఆహు శ్చైనం కేచి దగ్నిం కేచి దాహుః ప్రజాపతిమ్. 52
ఆ ఆత్మను ఇంద్రియములన్నియు నైదు ప్రకారములతోడను చూడజాలవు. దానిని కొందరు అగ్ని అందురు. మరికొందరు ప్రజాపతి యందురు.
ఋతూన్ మాసార్ధమాసాంశ్చ దివసాంశ్చ క్షణాం స్తథా,
పూర్వాహ్ణ మపరాహ్ణం చ మధ్యాహ్న మపి చాపరే. 53
ముహూర్త మపి చైవాహు రేకం సన్త మనేకధా,
తం కాల మితి జానీహి యస్య సర్వ మిదం వశే. 54
ఋతువులు, నెలలు, పక్షములు, దినములు, పూర్వాహ్ణము, అపరాహ్ణము, మధ్యాహ్నము, ముహూర్తము అని ఒక్కటిగా నున్న దానిని పెక్కు విధములుగా దానిని చెప్పుదురు. దానిని కాలమని ఎరుగుము. అంతయు దానికి వశమే అయి ఉన్నది.
బహూ నీన్ద్ర సహస్రాణి సమతీతాని వాస వ,
బల వీర్యోపపన్నాని యథైవ త్వం శచీపతే. 55
ఓ శచీపతీ! ఇప్పుడు నీవెట్లో అట్లే బలము, వీర్యము కలిగిన వేలకొలది యింద్రులు మున్నును కడచిపోయిరి.
త్వా మప్యతిబలం శక్ర దేవరాజం బలోత్కటమ్,
ప్రాప్తే కాలే మహావీర్యః కాలః సంశమయిష్యతి. 56
అతిబలుడవు, దేవరాజవు, పిక్కటిల్లిన బలము కలవాడవు నగు నిన్ను కూడ కాలము దాపురించినపుడు మహాశక్తి సంపన్నుడగు కాలుడు ఆణచివేయును.
య ఇదం సర్వ మాదత్తే తస్మా చ్ఛక్ర స్థిరో భవ
మయా త్వయా చ పూర్వైశ్చ నచ శక్యోఽతి వర్తితుమ్. 57
ఆ కాలుడు సర్వమును మ్రింగి వేయును. అందువలన శక్రా! నిలుకడ పొందుము. నేను, నీవు, మన పూర్వులును ఎవ్వరును దానిని మించిపోయిన వారు లేరు.
యా మేతాం ప్రాప్య జానీషే రాజ్యశ్రియ మనుత్తమామ్,
స్థితా మయీతి తన్మిథ్యా నైషా హ్యేకత్ర తిష్ఠతి. 58
చాలా గొప్పదియగు ఈ రాజ్యసంపదను పొంది ఈమె నాయందు నిలిచియున్నది అని నీవు భావించుచున్నావు. అది దబ్బర. ఈమె ఒక్కచోట నిలిచి యుండునది కాదు.
స్థితా హీన్ద్ర సహస్రేషు త్వద్విశిష్టతమే ష్వియమ్,
మాం చ లోలా పరిత్యజ్య త్వామగా ద్విబుధాధిప. 59
ఈమె మునుపు నీతలదన్నిన వేలకొలది యింద్రులకడ నుండినది. చంచలయై నన్ను వదలి వైచి ఇప్పుడు నిన్ను చేరుకొనెను.
మై వం శక్ర పునః కార్షీః శాన్తో భవితు మర్హతి,
త్వా మప్యేవం విధం జ్ఞాత్వా క్షిప్ర మన్యం గమిష్యతి. 60
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి బలివావనసంవాదే
చతుర్వింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
మరల ఇట్లు చేయకుము. నీవు శాంతుడవు కావలయును. నిన్నును ఇట్టివానినిగనే యెరిగి వడివడిగా మరియొకనికడ కరుగును.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్ష ధర్మపర్వమున బలివాసవ
సంవాదముగల రెండు వందల యిరువది నాలుగవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
శతక్రతు రథాపశ్య ద్బలే ర్దీప్తాం మహాత్మనః,
స్వరూపిణీం శరీరాద్ధి నిష్క్రమన్తీం తదా శ్రియమ్. 1
అంత దేవేంద్రుడు మహాత్ముడగు బలి శరీరమునుండి రూపముకైకొని వెలువడుచున్న లక్ష్మిని దర్శించెను.
తాం దృష్ట్వా ప్రభయా దీప్తాం భగవాన్ పాకశాసనః.
విస్మయోత్ఫుల్లనయనో బలిం పప్రచ్ఛ వాసవః. 2
కాంతితో వెలిగిపోవుచున్న ఆ లక్ష్మిని చూచి భగవంతుడగు పాకశాసనుడు విస్మయముతో విప్పారిన కనులు కలవాడై బలి నిట్లు ప్రశ్నించెను.
శక్ర ఉవాచ - శక్రు డిట్లు పలికెను.
బలే కేయ మపక్రాన్తా రోచమానా శిఖణ్డినీ,
త్వత్తః స్థితా స కేయూరా దీప్యమానా స్వతేజసా. 3
బలీ! ఇంతవరకు నీలోనుండి కేయూరములతో కూడినది, తన తేజస్సుతో ప్రకాశించుచున్నది, శిరోమణి కలదియై వెలుపలికి వచ్చిన యీమె ఎవరు?
బలి రువాచ - బలి యిట్లనెను.
న హీమామాసురీం వేద్మి న దైవీం న చ మానుషీమ్,
త్వ మేనాం పృచ్ఛ వా మా వా యథేష్టం కురు వాసవ. 4
ఓయి వాసవా! ఈమె రాక్షస వనిత కాదు. దేవకాంత కాదు. మనుష్యస్త్రీ కాదు. ఈమె ఎవరో నేనెఱుగను. నీవే ఆమె నడుగు. లేదా మాను. నీ యిష్టము వచ్చినట్లు చేయుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
కా త్వం బలే రపక్రాన్తా రోచమానా శిఖణ్డినీ,
అజానతో మమాచక్ష్వ నామధేయం శుచిస్మితే. 5
చక్కని నవ్వు మొగము గల భామా! శిరోభూషణముతో వెలిగిపోవుచు బలినుండి వెలుపలికి వచ్చిన నీవెవరో తెలియనినాకు తెలియజెప్పుము. నీ పేరేమి?
కా త్వం తిష్ఠసి మా మేవం దీప్యమానా స్వతేజసా,
హిత్వా దైత్యవరం సుభ్రు తన్మమాచక్ష్య పృచ్ఛతః. 6
నీ దగు తేజస్సుతో ప్రకాశించుచు రాక్షసశ్రేష్ఠుని వదలి నా ఎదుట నిలిచితివి. నీ వెవరో అడుగుచున్న నాకు చెప్పుము.
శ్రీ రువాచ - శ్రీ యిట్లు పలికెను.
న మాం విరోచనో వేద నా యం వైరోచనో బలిః,
ఆహు ర్మాం దుఃసహేత్యేవం విధిత్సేతి చ మాం విదుః. 7
నన్ను విరోచను డెరుగడు. విరోచనుని కుమారుడు ఈ బలియు నెఱుగడు. నన్ను దుస్సహ అందురు. విధిత్స అనియు నన్నెరుగుదురు. (విధిత్య – కోరిక)
భూతి ర్లక్ష్మీతి మా మహుః శ్రీ రిత్యేవం చ వాసవ,
త్వం మాం శక్ర న జానీషే సర్వే దేవా న మాం విదుః. 8
భూతి, లక్ష్మి శ్రీమొదలగు విధముగా నన్ను వ్యవహరింతురు. వాసవా! శక్రా! నీవును నన్నెఱుగవా. దేవతలందరును నన్నెరుగరు.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
కి మిదం త్వం మమకృతే ఉతాహో బలినః కృతే,
దుః సహే విజహాస్యేనం చిరసంవాసినీ సతీ. 9
ఓ దుస్సహా! ఈతనికడ పెద్దకాలమున్నదానవు. నీవు నాకొఱకా లేక బలికొఱకా, ఈతనిని వదలుచున్నావు?
శ్రీ రువాచ - శ్రీ యిట్లు పలికెను.
నో ధాతా న విధాతా మాం విదధాతి కథఞ్చన,
కాలస్తు శక్ర పర్యాగాన్మైనం శక్రావమన్యథాః. 10
ఓయి ఇంద్రా! ధాతగాని విధాతగాని ఎన్నడును నన్ను ఆజ్ఞాపింపరు. కాలమే అన్నింటిని నడపించును. కాలము నవమానింపకుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
కథం త్వయా బలి స్త్యక్తః కిమర్థం వా శిఖణ్డిని,
కథం చ మాం నజహ్యాస్త్వం తన్మే బ్రూహి శుచిస్మితే. 11
ఓ శిఖండిని! ఓ శుచిస్మితా! నీవు బలి నేల వదలితివి. నన్నేల వదలకుంటివి. దానిని నాకు తెలియజెప్పుము.
శ్రీ రువాచ - శ్రీ యిట్లు పలికెను.
సత్యే స్థితాఽస్మి దానే చ వ్రతే తపసి చైవ హి,
పరాక్రమే చ ధర్మేచ పరాచీన స్తతో బలిః. 12
నేను సత్యము, దానము, వ్రతము, తపస్సు, పరాక్రమము, ధర్మము అనువానియందు నిలిచియుండుదానను. బలి వీనినుండి పరాఙ్ముఖుడాయెను.
బ్రహ్మణ్యోఽ యం పురాభూత్వా సత్యవాదీ జితేన్ద్రియః,
అభ్యసూయద్ బ్రాహ్మణానా ముచ్ఛిష్ట శ్చాస్పృశద్ ఘృతమ్. 13
పూర్వమితడు వేదనిష్ఠ కలవాడై సత్యమునే పలుకువాడు జితేంద్రియుడునై యుండెను. పిదప బ్రాహ్మణులయెడ అసూయ వహించెను. వారలు వదలివేయగా నేతిని తాకెను.
యజ్ఞశీలః పదా భూత్వా మా మేవ యజతే స్వయమ్,
ప్రోవాచ లోకా న్మూఢాత్మా కాలేనోపనిపీడితః 14
ఇత డెల్లప్పుడు యజ్ఞశీలుడు నన్నే స్వయముగా పూజించుచుండెడివాడు. కాలము నెత్తినణపగా మూఢాత్ముడై లోకులను తూలనాడ మొదలిడెను.
అపాకృతా తతః శక్ర త్వయి వత్స్యామి వాసవ,
అప్రమత్తేన ధార్యాస్మి తపసా విక్రమేణ చ. 15
అందువలన, ఇంద్రా! ఈతనినుండి తొలగివచ్చితిని. వాసవా! నీకడనుందును. నన్ను చాల మెలకువతో తపస్సుతో, పరాక్రమముతో భరింపవలయును సుమా!
శక్ర ఉవాచ - ఇంద్రు డనెను.
నాస్తి దేవమనుష్యేషు సర్వభూతేషు వా పుమాన్,
యస్త్వా మేకో విపాహేతుం శక్నుయాత్కమలాలయే. 16
ఓ కమలాలయా! దేవతలయందుగాని, మనుజులయందుగాని, సర్వ భూతములయందుగాని,ఒక్క పురుషుడు నిన్ను వదలక ధరింపగలవాడు లేడా?
శ్రీ రువాచ - లక్ష్మి యిట్లనెను.
నైవ దేవో న గన్దర్వో నాసురో న చ రాక్షసః,
యో మామేకో విషహితుం శక్తః కశ్చిత్పురన్దర. 17
దేవుడు కానిమ్ము. గంధర్వుడు కానిమ్ము, అసురుడు కానిమ్ము రాక్షసుడు కానిమ్ము నన్ను చక్కగా సహించు శక్తి కలవా డొక్కడును లేడు.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
తిష్ఠేథా మయి నిత్యం త్వం యథా తద్ర్బూహి మే శుభే,
తత్కరిష్యామి తే వాక్య మృతం తద్వక్తు మర్హసి. 18
ఓ మంచిదానా! నీవు విడువక నాయందు ఎట్లు నిలుతువో చెప్పుము. సత్యమగు ఆ వాక్యమును పలుకుము. నేను దానిని చేయుదును.
శ్రీ రువాచ - లక్ష్మి యిట్లు పలికెను.
స్థాస్యామి నిత్యం దేవేన్ద్ర యథా త్వయి నిబోధ తత్,
విధినా వేదదృష్టేన చతుర్థా విభజస్వ మామ్. 19
దేవేంద్రా! నేను నీకడ విడువక యెట్లుందునో దానిని తెలిసికొనుము. వేదము దర్శించిన విధితో నన్ను నాలుగు భాగములుగా విభజింపుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లు పలికెను.
అహం వై త్వాం నిధాస్యామి యథాశక్తి యథాబలమ్,
నతు మేఽ తిక్రమః స్యాద్వై సదా లక్ష్మి తవాన్తికే. 20
నా శక్తి కొలది, నా బలము కొలది, లక్ష్మీ! నిన్ను నేను నిలుపుకొందును. నీకడ ఎల్లవేళల నాకు హద్దుమిరుట కలుగకుండుగాక!
భూమి రేవ మనుష్యేషు ధారిణీ భూతభావినీ,
సా తే పాదం తితిక్షేత సమర్థా హీతి మేమతిః 21
మనుష్యులకు సంబంధించి భూతముల నెల్ల చల్లగా చూచుచు ధరించునదియైన భూమియే నీ యొక భాగమును సహింపగలదు. దాని కామె సమర్థ యని నా భావము.
శ్రీ రువాచ - లక్ష్మి యిట్లు పలికెను.
ఏష మే నిహితః పాదో యోఽయం భూమౌ ప్రతిష్ఠితః
ద్వితీయం శక్ర పాదం మే తస్మా త్సునిహితం కురు. 22
ఇదిగో నా ఒక పాదమును భూమియందు చక్కగా నిలుచునట్లు ఉంచితిని. ఇంద్రా! నా రెండవ పాదమును భద్రముగా ఎచటనో నిలుపుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
ఆప ఏవ మనుష్యేషు ద్రవన్త్యః పరిచారిణీః,
తాస్తే పాదం తితిక్షన్తా మలమాప స్తితిక్షితుమ్. 23
మనుష్యుల విషయమున జలములు ప్రవహించుచు వారిని సేవించుచుండును. అవి నీ రెండవ పాదమును సహించుగాక! అట్లు సహించు శక్తి జలములకు కలదు.
శ్రీ రువాచ - లక్ష్మి యిట్లనెను.
ఏష మే నిహితః పాదో యోఽయ మప్సు ప్రతిష్ఠితః,
తృతీయం శక్ర పాదం మే తస్మా త్సునిహితం కురు. 24
శక్రా! ఇదిగో నా రెండవ పాదమును భద్రముగా నీటియందుంచితిని. మూడవ పాదమును చక్కగా నిలుపుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
యస్మిన్ వేదాశ్చ యజ్ఞాశ్చ యస్మిన్ దేవాః ప్రతిష్ఠితాః,
తృతీయం పాద మగ్నిస్తే సుధృతం ధారయిష్యతి. 25
వేదములు, యజ్ఞములు, దేవతలు స్థిరముగా నిలిచియుండెడు అగ్ని నీ మూడవ పాదమును చెదరకుండ పట్టుకొనును.
ఏష మే నిహితః పాదో యోఽయ మగ్నౌ ప్రతిష్ఠితః,
చతుర్థం శక్ర పాదం మే తస్మాత్సునిహితం కురు. 26
ఇదిగో నా మూడవపాదమును అగ్నియందు భద్రముగా నిలిపితిని. ఇంద్రా! నా నాలుగవ పాదమును చక్కగా నిలుపుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
యే వై సన్తో మనుష్యేషు బ్రహ్మణ్యాః సత్యవాదినః,
తేతే పాదం తితిక్షన్తా మలం సన్త స్తితిక్షితుమ్. 27
మనుష్యులలో బ్రహ్మనిష్ఠ కలవారు. సత్యమునే పలుకువారు నగు సత్పురుషులు నీ నాలుగవ పాదమును సహింతురు గాక! వారికట్లు తాల్చెడు సమర్థత కలదు.
శ్రీ రువాచ - లక్ష్మి యిట్లు పలికెను.
ఏష మే నిహితః పాదో యోఽయం సత్సు ప్రతిష్ఠితః,
ఏవం హి నిహితాం శక్ర భూతేషు పరిధత్స్వ మామ్. 28
ఇదిగో సజ్జనులయందు నా పాదమును నెలకొనునట్లు ఉంచితిని. ఇట్లు భూతములయందు నెలకొనియున్న నన్ను చక్కగా భరింపుము.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
భూతానా మిహ యో వై త్వాం మయా వినిహితాం సతీమ్,
ఉపహన్యాత్ స మే ధృష్య స్తథా శృణ్వన్తు మే వచః. 29
ఇట్లు ఆయా భూతములలో నేను నిల్పిన నిన్ను ఎవ్వడైన చెడగొట్టు నేని నేను వాని నణచివైచెదను. అందరు ఆ నా మాటను శ్రద్ధగా వినవలయును.
తత స్త్యక్తః శ్రియా రాజా దైత్యానాం బలి రబ్రవీత్ 30
అంత లక్ష్మి వదలించిన దైత్యరాజు బలి యిట్లు పలికెను.
బలి రువాచ - బలి యిట్లనెను.
యావత్పురస్తాత్ ప్రతపే త్తావద్వై దక్షిణాం దిశమ్,
పశ్చిమాం తావ దేవాపి తథోదీచీం దివాకరః
తథా మధ్యందినే సూర్యో నా స్తమేతి యదా తదా,
పున ర్దేవాసురం యుద్ధం భావి జేతాఽస్మి వ స్తదా. 31
సూర్యుడు తూర్పున ఎంతకాలము తపించునో అంతకాలము దక్షిణదిక్కునను పశ్చిమమునను, ఉత్తరమునను తపించును. అట్లు దినము నడిమి భాగమున ఆస్తమింపకుండునపుడు మరల దేవాసురయుద్ధము జరుగును. అప్పుడు నేను మిమ్ములను జయించెదను.
సర్వలోకాన్ యదాదిత్య ఏకస్థః స్థాపయిష్యతి,
తదా దేవాసురే యుద్ధే జేతాఽహం త్వాం శతక్రతో. 32
ఓయి శతక్రతూ! సూర్యుడు ఒక్క చోట నిలిచి సర్వ లోకములను తపింప జేయునపుడు జరిగెడు దేవాసుర యుద్ధమున నేను నిన్ను గెలిచెదను.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
బ్రహ్మణాఽస్మి సమాదిష్టో న హన్తవ్యో భవానితి,
తేన తేఽహం బలే వజ్రం న విముఞ్చామి మూర్ధని. 33
ఓయి బలీ ! బ్రహ్మ నీవు చంపదగనివాడవని నన్ను ఆదేశించెను. అందువలన నీ నెత్తిపై నా వజ్రమును పడవేయకున్నాను.
యథేష్టం గచ్ఛ దైత్యేన స్వస్తి తేఽస్తు మహాసుర,
ఆదిత్యో నైవ తపితా కదాచిన్మధ్యతః స్థితః. 34
రాక్షసరాజా! ఇచటకు వచ్చిన విధమున పొమ్ము. మహాసురా! నీకు స్వస్తియగుగాక! నడిమి భాగమున నుండి సూర్యుడెన్నటికిని లోకములను తపింప జేయడు.
స్థాపితో హ్యస్య సమయః పూర్వమేవ స్వయంభువా,
అజస్రం పరియాత్యేష సత్యేనావతపన్ ప్రజాః. 35
మొదటనే స్వయంభువగు బ్రహ్మ ఇతనికి కట్టుబాటు ఏర్పరచెను. అందువలన ఇతడు సత్యమునకు కట్టువడి ప్రజలను తపింప జేయుచు ఎల్లవేళల తిరుగుచునే యుండును.
అయనం తస్య షణ్మాసా నుత్తరం దక్షిణం తథా,
యేన సంయాతి లోకేషు శీతోష్ణే విసృజన్ రవిః. 36
అతనికి ఆరేసి మాసములు ఉత్తరదక్షిణదిక్కులలో గమనము. అందుచేత లోకములందు చల్లదనమును, వేడిని కలుగ జేయుచు రవి తిరుగుచుండును.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
ఏవ ముక్తస్తు దైత్యేన్ద్రో బలి రిన్ద్రేణ భారత,
జగామ దక్షిణా మాశా ముదీచీం తాం పురందరః. 37
ఇంద్రు డిట్లు పలుకగా రాక్షస రాజగు బలి దక్షిణ దిక్కున కరిగెను. ఇంద్రుడు ఉత్తర దిక్కున కేగెను.
ఇత్యేత ద్బలినా గీత మనహంకార సంజ్ఞితమ్,
వాక్యం శ్రుత్వా సహస్రాక్షః ఖమేవారురుహే తదా. 38
ఇతి శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి
శ్రీ సన్నిధానోనామ పఞ్చవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
అనహంకారమను పేరుగల బలిచేసిన గీతమును విని సహస్రాక్షుడగు ఇంద్రుడు అప్పుడు ఆకాశమునే అధిరోహించెను.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మపర్వమున
శ్రీ సన్నిధానమను రెండువందల యిరువదియైదవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
అత్రైవోదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
శతక్రతోశ్చ సంవాదం నముచే శ్చ యుధిష్ఠిర. 1
యుధిష్ఠిరా! ఈ సందర్భముననే ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని చెప్పుచుందురు. అది యింద్ర నముచి సంవాద రూపమైనది.
శ్రియా విహీన మాసీన మక్షోభ్య మివ సాగరమ్,
భవాభవజ్ఞం భూతానా మిత్యువాచ పురందరః. 2
సంపద లేనివాడు, కలతపాటు లేని సముద్రమువలె నున్నవాడు, భూతముల ఉత్పత్తి ప్రళయములను చక్కగా నెఱిగినవాడు నగు నముచిని చూచి పురందరు డిట్లనెను.
బద్ధః పాశై శ్చ్యుతః స్థానా ద్ద్విషతాం వశమాగతః,
శ్రియా విహీనో నముచే శోచస్యాహో న శోచసి. 3
త్రాళ్లతో బంధింపబడితివి. స్థానమునుండి తొలగితివి. శత్రువులకు చేజిక్కితివి. సంపద కోల్పడితివి. నముచీ! దుఃఖింతువా? దుఃఖింపకుందువా?
నముచి రువాచ - నముచి పలికెను.
అనివార్యేణ శోకేన శరీరం చోపతప్యతే,
అమిత్రాశ్చ ప్రహృష్యన్తి శోకే నాస్తి సహాయతా. 4
తప్పింప నలవికాని శోకముతో శరీరము కాలిపోవును. శత్రువులు సంతోషముతో పొంగిపోవుదురు. ఈ శోకమున సహాయత లేకున్నది.
తస్మాచ్ఛక్ర న శోచామి సర్వం హ్యే వేద మంతవత్,
సంతాపాద్ భ్రశ్యతే రూపం సంతాపాద్ భ్రశ్యతే శ్రియః
సంతాపాద్ భ్రశ్యతే చాయు ర్ధర్మశ్చైవ సురేశ్వర. 5
అందువలన ఓ ఇంద్రా! నేను శోకింపను. ఇది యంతయు అంతము కలదియే కదా! సంతాపము వలన రూపము తరిగిపోవును. సంతాపము వలన నరుడు సంపదలనుండి దూరమగును. సంతాపమువలన ఆయువు క్షీణించును. ధర్మము నశించును.
వినీయ ఖలు తద్దుఃఖ మాగతం వైమనస్యజమ్.
ధ్యాతవ్యం మనసా హృద్యం కల్యాణం సంవిజానతా 6
వైమనస్యమువలన వచ్చిపడెడు ఆ దుఃఖమును త్రోసివైచి వివేకము కలవాడు మనస్సుతో హృద్యమగు శుభమును ధ్యానింపవలయును.
యదా యదా హి పురుషః కల్యాణే కురుతే మనః,
తదా తస్య ప్రసిద్ధ్యన్తి సర్వార్థా నాత్ర సంశయః. 7
పురుషుడు శుభమునందు మనస్సు పెట్టునపుడెల్ల అతని ప్రయోజనము లన్నియు నెరవేరును. ఇందు సంశయము లేదు.
ఏకః శాస్తా న ద్వితీయోఽస్తి శాస్తా
గర్భేశయానం పురుషం శాస్తి శాస్తా
తేనాను యుక్తః ప్రవణాదివోదకం
యథా నియుక్తోఽస్మి తథా వహామి. 8
శాసించువాడు ఒక్కడే. రెండవవాడు లేడు. తల్లి గర్భమున నున్నపుడే పురుషుని ఆ శాసకుడు శాసించును. అతడు శాసింపగా, పల్లమునకు పారు నీరువలె, అతని ఆజ్ఞకు లోబడినవాడనై ప్రవర్తించుచుందును.
భవాభవౌ త్వభిజానన్ గరీయో
జ్ఞానాచ్ఛ్రేయో నతు తద్వై కరోమి
ఆశాసు ధర్మ్యాసు పరాసు కుర్వన్
యథా నియుక్తోఽస్మి తథా వహామి 9
బంధమేదియో, మోక్షమేదియో తెలిసియు అందు మేలైనదానిని జ్ఞానమువలన తెలిసికొనియు దానిని చేయకున్నాను. ధర్మము తప్పనివియు, విరుద్ధమైనవియునగు ఆశలు కారణముగా ఆయాకార్యములు చేయుచు ఆ శాసకు డెట్లు త్రిప్పునో అట్లు తిరుగుచున్నాను.
యథా యథాఽస్య ప్రాప్తవ్యం ప్రాప్నోత్యేవ తథా తథా,
భవితవ్యం యథా యచ్చ భవత్యేవ తథా తథా. 10
మనుజుడు పొందవలసినది ఆయా విధములుగా తప్పక పొందును. భవితవ్య మెట్టిదో ఏదో అది యట్లే జరుగుచుండును.
యత్ర యత్రైవ సంయుక్తో ధాత్రా గర్భే పునః పునః,
తత్ర తత్రైవ వసతి న యత్ర స్వయ మిచ్ఛతి. 11
బ్రహ్మదేవుడు ఏ యే గర్భమునందు సంబంధము కల్పించునో అందందు జీవుడు నివసించును. తానై కోరు కొన్నచోట కాదు.
భావో యోఽయ మనుప్రాప్తో భవితవ్య మిదం మమ,
ఇతి యస్య సదా భావో న స ముహ్యేత్ కదాచన. 12
ఏ భావము ఇప్పుడు వచ్చిపడినదో అది నా భవితవ్యము (తప్పక జరుగవలసినట్టిది) అను భావము ఎల్లవేళల ఎవనికి కలుగునో వాడు మోహపడడు.
పర్యాయై ర్హన్యమానానా మభియోక్తా న విద్యతే,
దుఃఖ మేతత్తు యద్ద్వేష్టా కర్తాఽహ మితి మన్యతే. 13
కాలమహిమవలన వచ్చిపడెడు సుఖదుఃఖములకు కారణమైన వాడొకడు లేడు. వీనిని ద్వేషించువాడు, నేను కర్త నని భావించువాడును పొందునది దుఃఖము మాత్రమే.
ఋషీంశ్చ దేవాంశ్చ మహాసురాంశ్చ
త్రైవిద్యవృద్ధాం శ్చ వనే మునీంశ్చ,
కాన్నాపదో నోపనమన్తి లోకే
పరావరజ్ఞాస్తు న సంభ్రమన్తి. 14
ఋషులు దేవతలు, గొప్ప రాక్షసులు, వేదవిద్యలలో తలపండినవారు, అడవిలో నుండెడు మునులు - వీరిలో ఎవరిని ఆపదలు లోకమున ఆక్రమింపవు? సదసద్జ్ఞానము గలవారు మాత్రము వీని విషయమున బెదరిపోవరు.
న పణ్డితః క్రుధ్యతి నాభిపద్యతే,
నా చాపి సంసీదతి న ప్రహృష్యతి,
న చార్థ కృచ్ఛ్రవ్యసనేషు శోచతే,
స్థితః ప్రకృత్యా హిమవా నివాచలః. 15
జ్ఞానసంపద కలవాడు దేనియందును క్రోధము వహింపడు. తగులము పొందడు. క్రుంగిపోడు, పొంగిపోడు. ప్రయోజనములకు సంబంధించిన మహా కష్టములయందు శోకింపడు. తన స్వభావముతో హిమవత్పర్వతము వలె స్థిరముగా నిలిచియుండును.
యమర్థసిద్ధిః పరమా న మోహయే
త్తథైవ కాలే వ్యసనం న మోహయేత్,
సుఖం చ దుఃఖం చ తథైవ మధ్యమం
నిషేవతే యః స ధురంధరో నరః. 16
ఎంత గొప్పదియగు అర్థసిద్ధియు అతనిని మోహపెట్ట జాలదు. అట్లే కాలము కారణముగా వచ్చిన కష్టము కూడ అతనిపై ప్రభావము చూపదు. సుఖమును, దుఃఖమును, ఈ రెండును లేని స్థితిని ఎవ్వడు వికారములు లేకుండ సేవించునో అట్టి నరుడు ధురంధరుడు.
యాం యామస్థాం పురుషోఽధిగచ్ఛే-
త్తస్యాం రమేతాపరితప్యమానః,
ఏవం ప్రవృద్ధం ప్రణుదన్మనోజం
సంతాపయామాస కరం శరీరాత్. 17
పురుషు డేయే అవస్థను పొందునో దానియందే ఏ మాత్రము పరితాపము పొందక సంతోషపడవలయును. శరీరముననుండి మిక్కిలి సంతాపము కలిగించునది బాగుగా బలిసినదియునగు మానస దుఃఖమును త్రోసి వేయుచుండవలయును.
న తత్సదః సత్పరిషత్సభా చ సా
ప్రాప్య యాం న కురుతే సదా భయమ్,
ధర్మతత్త్వ మవగాహ్య బుద్ధిమాన్
యోఽభ్యుపైతి స ధురంధరః పుమాన్. 18
దేనిని పొంది మానవుడు భయము నందక తిరుగాడునో అది సభ కాదు. ధర్మతత్త్వమును లోతుగా పరిశీలించి ఏ బుద్ధిమంతుడు దానిని చేరుకొనునో అతడే ధురంధరుడు.
ప్రాజ్ఞస్య కర్మాణి దురన్వయాని
న వై ప్రాజ్ఞో ముహ్యతి మోహకాలే,
స్థానా చ్చ్యుత శ్చేన్న ముమోహ చోత్తమ-
స్తావ త్కృచ్ఛా మాపదం ప్రాప్య వృద్ధః. 19
ప్రజ్ఞ కలవాని పనులు అందరకు అర్థమగునవి కావు. ప్రాజ్ఞుడు మోహము పొందవలసిన సమయమునందును మోహపడడు. ఎంత ఘోరమైన ఆపదను పొందియు, స్థానము నుండి తొలగినవాడైనను, వృద్ధుడైనను ఉత్తముడు మోహమునందడు.
న మన్త్ర బల వీర్యేణ ప్రజ్ఞయా పౌరుషేణ చ,
న శీలేన న వృత్తేన తథా నైవార్థ సంపదా,
అలభ్యం లభతే మర్త్య స్తత్ర కా పరిదేవనా. 20
మంత్రబలము శక్తితోగాని, ప్రజ్ఞచేతగాని, శీలముచేతగాని పౌరుషముచేతగాని నడవడిచేతగాని అర్థ సంపదచేతగాని నరుడు అలభ్యమును అందుకొనజాలడు. ఇంక అందు ఏడుపేల?
యదేవ మనుజాతస్య ధాతారో విదధుః పురా,
తదేవానుచరిష్యామి కిం మే మృత్యుః కరిష్యతి. 21
పుట్టినవానికి సృష్టికర్తలు పూర్వము ఏది ఏర్పరచియున్నారో నేను దానినే అనుసరించి తిరుగుదును. ఇంక నన్ను మృత్యువేమి చేయగలదు?
లబ్ధవ్యాన్యేవ లభతే గన్తవ్యాన్యేవ గచ్ఛతి,
ప్రాప్తవ్యాన్యేవ చాప్నోతి దుఃఖాని చ సుఖాని చ. 22
మనుజుడు పొందవలసి యున్నవానినే పొందును. చేరుకొనవలసిన తావులనే చేరుకొనును. అవి దుఃఖములో సుఖములో రావలసినవి తప్పక వచ్చును.
ఏత ద్విదిత్వా కార్త్స్న్యేన యో న ముహ్యతి మానవః,
కుశలీ సర్వదుఃఖేషు స వై సర్వధనో నరః. 23
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
శక్రనముచి పంచాదో నామ షడ్వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
దీనిని మూలముట్టుగా తెలిసికొని మోహమందని నరుడు సర్వదుఃఖము లయందును కుశలియై యుండును. అతడే సర్వమైన ధనములు కలవాడు.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్ష ధర్మ పర్వమున శక్రనముచి
సంవాదము గల రెండువందల యిరువది యారవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.
మగ్నస్య వ్యసనే కృచ్ఛ్రే కిం శ్రేయః పురుషస్య హి,
బన్దునాశే మహీపాల రాజ్యనాశేఽథ వా పునః 1
బంధువులందరు వదలిపోగా, రాజ్యము చేజారిపోగా మిక్కిలి ఘోర మగు కష్టమున మునిగిన పురుషునకు శ్రేయమైనదేది?
త్వం హి నః పరమో వక్తా లోకేఽస్మిన్ భరతర్షభ.
ఏతద్భవన్తం పృచ్ఛామి తన్మే త్వం వక్తు మర్హసి 2
భరతవరేణ్యా! నీవు ఈలోకమున మాకుపరమవక్తవు. దీనిని గూర్చి నిన్నడుగుచున్నాను. నీవు నాకు చెప్పవలయును.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లనెను.
పుత్రదారైః సుఖై శ్చైవ వియుక్తస్య ధనేన వా,
మగ్నస్య వ్యసనే కృచ్ర్ఛే ధృతిః శ్రేయస్కరీ నృప. 3
సంతానము, ధర్మపత్ని, సుఖములు, ధనము అనువానిని పోగొట్టుకొని చాల ఘోరమగు కష్టమున మునిగియున్న వానికి ధైర్యము మేలొనర్చునది.
ధైర్యేణ యుక్తం సతతం శరీరం న విశీర్యతే,
విశోకతా సుఖం ధత్తే ధత్తే చారోగ్య ముత్తమమ్. 4
ఎల్లప్పుడు ధైర్యముతో కూడియుండువానికి శరీరము కృశించి పోదు. శోకము లేకుండుట సుఖమును కూర్చును. మేలైన ఆరోగ్యమును కూడ కూర్చును.
ఆరోగ్యాచ్చ శరీరస్య స పున ర్విన్దతే శ్రియమ్,
యచ్చ ప్రాజ్ఞో నర స్తాత సాత్త్యికీం వృత్తి మా స్థితః
తస్యైశ్వర్యం చ ధైర్యం చ వ్యవసాయశ్చ కర్మసు. 5
శరీరమునకు ఆరోగ్యము కలుగుటవలన అతడు మరల సంపదను పొందును. సత్త్వ గుణముతో కూడిన నడవడిని విడువకుండు ప్రజ్ఞావంతునకు ఐశ్వర్యము, ధైర్యము, పనులయందు కృషిచేయవలయునను బుద్ధియు నేర్పడును.
అత్రైవోదాహార న్తీమ మితిహాసం పురాతనమ్.
బలివాసవ సంవాదం పునరేవ యుధిష్ఠిర. 6
ఈ విషయమునందే ప్రాతకాలపునాటి ఒక ఇతిహాసమును చెప్పుకొందురు. ఇది బలికిని ఇంద్రునకు అయిన మరియొక సంవాదము.
వృత్తే దేవాసురే యుద్ధే దైత్యదానవ సంక్షయే, 7
విష్ణుక్రాస్తేషు లోకేషు దేవరాజే శతక్రతౌ,
ఇజ్యమానేషు దేవేషు చాతుర్వర్ణ్యే వ్యవస్థితే, 8
సమృద్ధమాత్రే త్రైలోక్యే ప్రీతియుక్తే స్వయంభువి,
రుద్రే ర్వసుభి రాదిత్యై రశ్విభ్యా మపి చర్షిభిః, 9
గన్దర్వై ర్భుజగేన్ద్రైశ్చ సిద్ధై శ్చాన్యై ర్వృతః ప్రభుః,
చతుర్దన్తం సుదాన్తం చ వారణేన్ద్రం శ్రియా వృతమ్,
ఆరుహ్యైరావతం శక్ర స్త్రైలోక్య మనుసంయయౌ. 10
దితి కొడుకులు, దనువు పుత్రులు పెక్కండ్రు చచ్చిన దేవదానవుల యుద్ధము జరుగగా లోకము లన్నియు విష్ణువునకు వశమై యుండెను. అప్పుడు దేవతల రాజగు శతక్రతువు, దేవతలు యాగములు చేయుచుండగా నాలుగు వర్ణముల కట్టుబాటు చక్కని స్థితిలో నుండగా, మూడు లోకములును సమృద్ధితో అలరారగా, బ్రహ్మదేవుడు ప్రీతియుక్తుడు కాగా, రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినీ కుమారులు, ఋషులు, గంధర్వులు, నాగులు, సిద్ధులు ఇంకను ఇతరులు చుట్టును చేరి కొలుచుచుండగా నాలుగు దంతములు కలదియు, చక్కని శిక్షణ కలదియు, గొప్పవైభవముతో నలరారునదియు నగు ఐరావతము నెక్కి మూడులోకములను తిరుగాడ జొచ్చెను.
స కదాచి త్సముద్రాన్తే కస్మింశ్చిద్గిరిగహ్వరే
బలిం వైరోచనిం వజ్రీ దదర్శోపససర్ప చ. 11
అత డొకప్పుడు సముద్రము ఒడ్డున ఒకానొక కొండగుహలో విరోచనుని కుమారుడగు బలిని చూచెను. అతనిని సమీపించెను.
త మైరావత మూర్ధస్థం ప్రేక్ష్య దేవగణై ర్వృతమ్,
సురేన్ద్ర మిన్ద్రం దైత్యేన్ద్రో న శుశోచ న వివ్యథే. 12
ఐరావతము మూపున నున్నవాడు, దేవతలగుంపులతో కూడియున్నవాడు నగు దేవేంద్రుని గాంచి రాక్షసరాజు బాధపడలేదు. కుమిలిపోలేదు.
దృష్ట్వా త మవికారస్థం తిష్ఠన్తం నిర్భయం బలిమ్,
అధిరూడో ద్విపశ్రేష్ఠ మిత్యువాచ శతక్రతుః. 13
ఏ వికారములు లేక నిర్భయముగా నిలిచియున్న బలిని చూచి గొప్ప యేనుగు నెక్కియున్న శతక్రతు విట్లు పలికెను.
దైత్య న వ్యథసే శౌర్యా దథ వా వృద్ధసేవయా,
తపసా భావితత్వా ద్వా సర్వథై త త్సుదుష్కరమ్. 14
దైత్యా! వ్యథ నొందకున్నావు. ఇది శౌర్యమువలననా? పెద్దల సేవచేతనా? తపస్సుచేతనా? మనోబలమువలననా? అన్నివిధముల ఇది మిక్కిలి దుష్కరము సుమా!
శత్రుభి ర్వశ మానీతో హీనస్థానా దనుత్తమాత్,
వైరోచనే కి మాశ్రిత్య శోచితవ్యే న శోచసి? 15
శత్రువులకు వశమైతివి. ఏ గొప్పయులేని హీనస్థానమున నుంటివి. వైరోచనీ! దేని నూతగాగొని దుఃఖపడవలసి యుండగా దుఃఖింపకున్నావు?
శ్రైష్ఠ్యం ప్రాప్య స్వజాతీనాం మహాభోగా ననుత్తమాన్,
హృతస్వరత్న రాజ్యస్త్వం బ్రూహి కస్మా న్న శోచసి? 16
నీ జాతివారందరిలో మిక్కిలి శ్రేష్ఠమగు స్థానమును పొందితివి. సర్వోత్తమములగు మహాభోగముల ననుభవించితివి. ఇప్పుడు నీ శ్రేష్ఠములగు సంపదలు, రాజ్యము పోయినవి అయినను నీవే కారణముగా శోకింపకున్నావు? చెప్పు.
ఈశ్వరో హి పురా భూత్వా పితృపైతామహే పదే,
తత్త్వ మద్య హృతం దృష్ట్వా సపత్నైః కిం న శోచసి? 17
మునుపు తండ్రి తాతల వరుసలో వచ్చిన స్థానమున ఈశ్వరుడవై యుండి, శత్రువులు కొల్లగొట్టిన సంపదను చూచుచు ఎట్లు దుఃఖింపకున్నావు?
బద్దశ్చ వారుణైః పాశై ర్వజ్రేణ చ సమాహితః,
హృతదారో హృతధనో బ్రూహి కస్మా న్న శోచసి? 18
వరుణ సంబంధములగు పాశములు నిన్ను కట్టి పడవైచినవి. వజ్రము నిన్ను తలపై మొత్తినది. పెండ్లమును, ధనములను కోల్పోయితివి. అయినను ఏ కారణమున శోకింపకున్నావో చెప్పుము.
నష్టశ్రీ ర్విభవభ్రష్టో యన్న శోచసి దుష్కరమ్,
త్రైలోక్య రాజ్య నాశే హి కోఽన్యో జీవితు ముత్సహేత్. 19
సంపద పోయినది, ప్రభుత్వము కూలినది. అయినను నీవు శోకింపవు. ఇట్లుండుట దుష్కరము. మూడులోకముల రాజ్యము చేజారిపోగా మరి యెవ్వడైన బ్రదుకుటకే ఇష్టపడడే!
ఏతచ్చాన్య చ్చ పరుషం బ్రువన్తం పరిభూయ తమ్,
శ్రుత్వా సుఖ మసంభ్రాన్తో బలి ర్వైరోచనోఽబ్రవీత్ 20
అతనిని చులకన చేయుచు ఇంకను మరికొన్ని పరుషవాక్యములు పలుకగా సుఖముగా విని విరోచనుని కొడుకు బలి ఏ మాత్రము కలవరపాటు లేనివాడై యిట్లు పలికెను.
బలి రువాచ - బలి యిట్లు పలికెను.
నిగృహీతే మయి భృశం శక్ర కిం కత్థితేన తే,
వజ్ర ముద్యమ్య తిష్ఠన్తం పశ్యామి త్వాం పురందర! 21
నేను కట్టుబడి యుంటిని. ఓయి శక్రా! నీకీ పొగరు మాటలేల? పురందరా! వజ్రమును పైకెత్తి నిలిచియున్న నిన్ను చూచుచునేయున్నాను.
అశక్తః పూర్వ మాసీ స్త్వం కథఞ్చి చ్ఛక్తతాం గతః,
కస్త్వదన్య ఇమాం వాచం సుక్రూరాం వక్తుమర్హతి? 22
నీవు పూర్వము అసమర్థుడవై యుంటిని. ఎట్లో పుంజుకొంటివి. నీ కంటె వేరెవ్వడు గాని ఇంత క్రూరమగు మాట పలుకునా?
యస్తు శత్రో ర్వశస్థస్య శక్తోఽపి కురుతే దయామ్,
హస్తప్రాప్తస్య వీరస్య తం చైవ పురుషం విదుః. 23
చేతికి చిక్కి తనకు వశమందున్న వీరుడైన శత్రువు నెడ దయ చూపువానినే వివేకవంతులు పురుషునిగా నెరుగుదురు.
అనిశ్చయో హి యుద్ధేషు ద్వయో ర్వివదమానయోః,
ఏకః ప్రాప్నోతి విజయ మేక శ్చైవ పరాజయమ్. 24
ఇద్దఱు పోరాడుచుండగా యుద్ధములందు జయమో, అపజయమో అనిశ్చయముగా నుండును. ఒకడు విజయము పొందును. మఱియొకడు పరాజయము నందును.
మాచ తేఽభూ త్స్వ భావోఽయ మితి తే దేవపుఙ్గవ,
ఈశ్వరః సర్వభూతానాం విక్రమేణ జితో బలాత్. 25
ఓయి దేవపుంగవా! ఇది నీకు స్వభావము కాకుండు గాక అనుటకే సర్వభూతములకు అధినాయకుడవు నీవు కూడ ఇతరుని పరాక్రమముతో ఓటమి నందితివి.
నైత దస్మత్కృతం శక్ర నైతచ్ఛక్ర కృతం త్వయా,
యస్త్వ మేవం గతో వజ్రిన్ యద్వాఽ ప్యేవం గతా వయమ్. 26
ఇంద్రా! నీ విట్లగుట నీ ఘనకార్యము కాదు. మేమిట్లగుట మేము చేసినది కాదు.
అహ మాసం యదాఽద్య త్వం భవితా త్వం యథా వయమ్,
మాఽవయంస్థా మయా కర్మ దుష్కృతం కృత మిత్యుత. 27
నీవు నేడున్నట్లు నేనును ఒకప్పు డుంటిని. నేనిప్పుడున్నట్లు నీవును ఉందువు. నేనేదో పొడిచి వేసెడు పని చేసితి ననుకొనుచు నన్నవమానింపకుము.
సుఖదుఃఖే హి పురుషః పర్యాయే ణాధిగచ్ఛతి,
పర్యాయేణాసి శక్రత్వం ప్రాప్తః శక్ర న కర్మణా. 28
పురుషుడు సుఖదుఃఖములను ఒకమారదిగా, ఒకమారిదిగా పొందును. నీ ఇంద్రత్వము కూడ కాలమహిమచేతనే లభించునది. నీ నిర్వాకమువలన కాదు.
కాలః కాలే నయతి మాం త్వాం చ కాలో నయ త్యయమ్,
తే నాహం త్వం యథా నాద్య త్వం చాపి న యథా వయమ్. 29
కాలమే కాలమునందు నన్ను నడుపుచున్నది. ఆకాలమే నిన్నును నడపుచున్నది. అందువలన నేను నీవానాడు ఉన్నట్లు లేను. నీవును మేమున్నట్లు లేవు.
న మాతృపితృశుశ్రూషా న చ దైవత పూజనమ్,
నాన్యో గుణ సమాచారః పురుషస్య సుఖావహః. 30
తల్లిదండ్రులను సేవించుట, దేవతల నారాధించుట ఇతరములగు గుణముల సమాచారము పురుషునకు సుఖము కూర్చునది కాదు.
న విద్యా నతపో దానం న మిత్రాణి న బాన్ధవాః,
శక్నువన్తి పరిత్రాతుం నరం కాలేన పీడితమ్. 31
కాలము పట్టి పీడించు నరుని కాపాడుటకు విద్యయో, తపస్సో, దానమో, మిత్రములో, బంధువులో సమర్థులు కారు.
నాగామిన మనర్థం హి ప్రతిఘాత శతై రపి,
శక్నువన్తి ప్రతివ్యోఢు మృతే బుద్ధి బలా న్నరాః. 32
రావలసియున్న అనర్థమును వందల విఘాతములతో నైనను ఎదురొడ్డి నిలుపుదల చేయుటకు, బుద్ధిబలమువలన కాక, నరులు సమర్థులు కారు.
పర్యాయై ర్హన్యమానానాం పరిత్రాతా న విద్యతే,
ఇదం తు దుఃఖం యచ్ఛక్ర కర్తాఽహమితి మన్యసే. 33
కాలమహిమలతో చావు దెబ్బలు తినుచున్నవారికి సర్వ రక్షకుడు లేడు. ఓయి ఇంద్రా! నీవు నేను కర్త నని తలచుచున్నావు. అదియే గొప్ప దుఃఖము.
యది కర్తా భవేత్కర్తా న క్రియేత కదాచన,
యస్మాత్తు క్రియతే కర్తా తస్మా త్కర్తా ప్యనీశ్వరః. 34
కర్త నిజమునకు కర్తయే యగునేని ఆత డెన్నటికిని చేయబడువాడు కారాదు. ఆతడు మరియొకనికి కార్యభూతుడన్నచో అతడు అనీశ్వరుడే యగుచున్నాడు.
కాలేనాహం త్వా మజయం కాలే నాహం జిత స్త్వయా,
గన్తా గతిమతాం కాలః కాలః కలయతి ప్రజాః. 35
కాలప్రభావముచేత మునుపు నిన్ను నేను గెలిచితిని. ఆ కాలప్రభావముచేతనే నీకు ఓడితిని. గతికలవారిని నడిపించునది కాలమే. ప్రజలను కూర్చునదియు కాలమే.
ఇన్ద్ర ప్రాకృతయా బుద్ధ్యా ప్రళయం నా వబుద్ధ్యసే,
కేచిత్త్వా బహు మన్యన్తే శ్రైష్ఠ్యం ప్రాప్తం స్వకర్మణా. 36
ఇంద్రా! వివేకము లేని బుద్ధితో నీవు రానున్న ప్రళయమును ఎరుగకున్నావు. నీవు నీ కర్మముతో శ్రేష్ఠతను పొందినవానినిగా కొందరు గౌరవించుచున్నారు.
కథ మస్మ ద్విధో నామ జానన్ లోక ప్రవృత్తయః,
కాలే నాభ్యాహతః శోచే న్ముహ్యేద్వాఽప్యథ విభ్రమేత్. 37
లోక ప్రవృత్తులను చక్కగా తెలిసికొనుచున్న నావంటివాడు కాలము దెబ్బకొట్టగా, ఎట్లు దుఃఖించును? మోహపడును? గుండె చెదరిన వాడగును?
నిత్యం కాలపరీతస్య మమ వా మద్విధస్య వా,
బుద్ధి ర్వ్యసన మాసాద్య భిన్నా నౌ రివ సీదతి. 38
ఎల్లవేళల కాలముతో నిలువెల్ల చుట్టుకొనబడియున్న నాదియో, నావంటివానిదియో యగుబుద్ధి వ్యసనమును పొంది, పగిలిన నావవలె క్రుంగిపోవునా యేమి?
అహం చ త్వం చ యే చాన్యే భవిష్యన్తి సురాధిపాః,
తే సర్వే శక్ర యాస్యన్తి మార్గ మిన్ద్రశతై ర్గతమ్. 39
నేను, నీవు, ఇంకను పెక్కండ్రు దేవతాధిపులును అందరును శక్ర! ఇంతకుమునుపు వందలకొలదిగా ఇంద్రులు పోయిన మార్గమునందే పోవుదురు. (నశింతురని భావము)
తా మప్యేవం సుదుర్ధర్షం జ్వలన్తం పరయా శ్రియా,
కాలే పరిణతే కాలః కాలయిష్యతి మా మివ. 40
ఇప్పుడు ఎవ్వరికి నణపనలవికాని వానివలె మహాసంపదతో వెలిగి పోవుచున్న నిన్నును చేటుకాలము దాపురించినపుడు కాలము, నన్నువలె లోగొనును.
బహూ నీన్ద్ర సహస్రాణి దైవతానాం యుగే యుగే,
అభ్యతీతాని కాలేన కాలో హి దురతిక్రమః 41
ప్రతియుగములో దేవతలలో వేలకొలది ఇంద్రులు కాలముతో కడచిపోయిరి. కాలము దాటనలవికానిది.
ఇదంతు లబ్ధ్వా సంస్థాన మాత్మానం బహు మన్యసే,
సర్వభూతభవం దేవం బ్రహ్మాణ మివ శాశ్వతమ్. 42
ఇట్టి ఒక ఏర్పాటును పొంది సర్వభూతముల పుట్టుకకు కారణమైన దేవుడు, శాశ్వతుడునగు బ్రహ్మను వలె నిన్ను నీవు గొప్పగా భావించుచున్నావు.
న చేద మచలం స్థాన మనన్తం వాఽపి కస్యచిత్,
త్వం తు బాలిశయా బుద్ధ్యా మమేద మితి మన్యసే. 43
ఇది యేమియు ఎవనికి అచలమైనది, అనంతమైనదియగు స్థానము కాదు. నీవు మాత్రము పిల్లతనపు బుద్ధితో ఇది నాదని తలచుచున్నావు.
అవిశ్వస్తే విశ్వసిహి మన్యసే వాఽధ్రువే ధ్రువమ్,
నిత్యం కాలపరీతాత్మా భవత్యేవం సురేశ్వర! 44
సురేశ్వరా! నమ్మి యుండరానియందు నమ్మియున్నావు. ధ్రువము కాని దాని యందు ధ్రువమను బుద్ధి పెట్టుకొనుచున్నావు. కాలము క్రమ్ముకొనియున్న బుద్ధి కలవాడు ఎల్లవేళల ఇట్లే యగును.
మమేయ మితి మోహాత్త్వం రాజశ్రియ మభీప్ససి,
నేయం తవ న చాస్మాకం న చాన్యేషాం స్థిరా సదా. 45
నీవు మోహమువలన ఈ రాజ్యలక్ష్మిని నీదై యుండ వలయునని కోరుచున్నావు. ఇది స్థిరముగా నీది కాదు. మాదియు కాదు, మరి యితరులదియు కాదు.
అతిక్రమ్య బహూనన్యాంస్త్వయి తావ దియం గతా,
కఞ్చిత్కాల మియం స్థిత్వా త్వయి వాసవ చఞ్చలా. 46
ఎందరినో ఇతరులను అతిక్రమించి ఇప్పుడు నీయందు నిలిచియున్నది. నీయందును కొంతకాలముండి ఓయి వాసవా! కదలి పోవునదియే యగును.
గౌర్నిపాన మివోత్సృజ్య పున రన్యం గమిష్యతి,
రాజలోకా హ్యతిక్రాన్తా యాన్న సంఖ్యాతు ముత్సహే. 47
ఆవు ఒక నీటి పడియను వదలి మరియొక దానిని చేరుకొనునట్లు ఈ రాజ్యసంపదయు, మరియొకనిని చేరుకొనును. రాజుల సముదాయ మెంతయో మునుపు కడచి పోయినది. దానిని నేను లెక్కించుటకును ఉత్సహింపను.
త్వత్తో బహుతరా శ్చాన్యే భవిష్యన్తి పురందర! 47
పురందరా! నీ తరువాత కూడ ఎందరో ఇతరులు ఇంద్రులగుదురు.
స వృక్షౌ షధి రత్నేయం సహసత్త్వవనాకరా,
తా నిదానీం న పశ్యామి యై ర్భుక్తేయం పురా మహీ. 48
వృక్షములు, ఓషధులు, రత్నములతో కూడినది, మహాప్రాణులు గల సముద్రములతో అడవులతో కూడినదియు నగు నీ భూమిని ఎవ్వరెవ్వరు పాలించిరో వారు నాకిప్పుడు కానరారు.
పృథు రైలో మయో భీమో నరకః శంబర స్తథా. 49
అశ్వగ్రీవః పులోమా చ స్వర్భాను రమితధ్వజః,
ప్రహ్లాదో నముచి ర్దక్షో విప్రచిత్తి ర్విరోచనః. 50
హ్రీని షేవః సుహోత్రశ్చ భూరిహా పుష్పవాన్ వృషః,
సత్యేషు రృషభో బాహుః కపిలాశ్వో విరూపకః. 51
బాణః కార్తస్వరో వహ్ని ర్విశ్వదంష్ట్రోఽథ నైరృతిః,
సంకోచోఽథ వరీతాక్షో వరాహాశ్వో రుచిప్రభః 52
విశ్వజిత్ప్రతిరూపశ్చ వృషాణ్డో విష్కరో మధుః
హిరణ్య కశిపు శ్చైవ కైటభ శ్చైవ దానవః. 53
దైతేయా దానవాశ్చైవ సర్వే తే నైరృతైః సహ,
ఏతే చాన్యే చ బహవః పూర్వే పూర్వతరాశ్చ యే. 54
దైత్యేన్ద్రా దానవేన్ద్రాశ్చ యాంశ్చాన్యా ననుశుశ్రుమ,
బహవః పూర్వ దైత్యేన్ద్రాఃసంత్యజ్య పృథివీం గతాః. 55
పృథువు, ఇలుడు, మయుడు, భీముడు, నరకుడు, శంబరుడు, అశ్వగ్రీవుడు, పులోముడు, కొలవనలవికాని ధ్వజము కలస్వర్భానువు, ప్రహ్లాదుడు, నముచి, దక్షుడు, విప్రచిత్తి, విరోచనుడు, హ్రీనిషేవుడు, సుహోత్రుడు, భూరిహుడు, పుష్పవంతుడు, వృషుడు, సత్యేషువు, ఋషభుడు, బాహువు, కపిలాశ్వుడు, విరూపకుడు, బాణుడు, కార్తస్వరుడు, వహ్ని, విశ్వదంష్ట్రుడు, నైరృతి సంకోచుడు, వరీతాక్షుడు, వరాహాశ్వుడు, రుచిప్రభుడు, విశ్వజిత్తు, ప్రతిరూపుడు, వృషాదుడు, విష్కరుడు, మధువు, హిరణ్యకశిపుడు, దనువు పుత్రుడగు కైటభుడు - ఈ దితికుమారులు దనుపుత్రులు, నిరృతి తనయులతోపాటుగా ఇంకను పెక్కండ్రు పూర్వకాలమువారు, వారికి వెనుకటివారు రాక్షసేంద్రులై, దానవేంద్రులై యుండిరి. ఇంకను ఎందరిని గూర్చియో వినియుంటిమి. ఆపూర్వదైత్యులు పెక్కండ్రు ఈ భూమిని వదలి వెళ్లిపోయిరి.
కాలే నాభ్యాహతాః సర్వే కాలో హి బలవత్తరః,
కాలము చావగొట్టగా ఈ అందరు వెడలిపోయిరి. కాలము బలవత్తరమైనది.
సర్వైః క్రతుశతై రిష్టం న త్వమేకః శతక్రతుః. 56
నూరు యజ్ఞములను అందరు ఆచరించిరి. నీవొక్కడవే శతక్రతుడవు కావు.
సర్వే ధర్మపరా శ్చాసన్ సర్వే సతతపత్రిణః,
అన్తరిక్షచరా స్సర్వే సర్వేఽభిముఖయోధినః 57
ఈ అందరు ధర్మపరులే అందరు ఎల్లప్పుడు సత్రయాగములు చేసినవారే. అందరు గగనమున తిరిగినవారే. అందరు మహాయోధులతో పోరినవారే.
సర్వే సంహననోపేతాః సర్వే పరిఘబాహవః,
సర్వే మాయాశతధరాః సర్వే తే కామరూపిణః. 58
అందరు గొప్ప దేహదార్డ్యము కలవారు. అందరు పరిఘలవంటి బాహువులు కలవారు. అందరు నూర్ల కొలది మాయలు తాల్చువారు. ఆ అందరు కోరిన రూపములు ధరించువారు.
సర్వే సమర మాసాద్య నశ్రూయత్తే పరాజితాః,
సర్వే సత్యవ్రతపరాః సర్వే కామవిహారిణః. 59
ఈ యందరును యుద్ధమును పొంది ఓడినవారుగా వినబడనివారు. అందరు సత్యవ్రతమున నిష్ఠ కలవారు. అందరు ఇష్టము వచ్చిన విహారములు కలవారు.
సర్వే వేదవ్రతపరాః సర్వే చైవ బహుశ్రుతాః,
సర్వే సంమత మైశ్వర్య మీశ్వరాః ప్రతిపేదిరే. 60
అందరు వేదవ్రతములయందు నిష్ఠ కలవారు. అందరు గొప్ప శాస్త్ర జ్ఞానము కలవారు. అందరు సర్వ సామర్థ్యము కలవారై కోరిన ఐశ్వర్యమును పొందిరి.
న చైశ్వర్యమద స్తేషాం భూతపూర్వో మహాత్మనామ్,
సర్వే యథార్థదాతారః సర్వే విగతమత్సరాః. 61
మహాత్ములగువారిలో ఎవ్వరికిని ఐశ్వర్య మదము లేదు. అందరు సముచితముగా దానములు చేసినవారు. మత్సరభావము లేనివారు.
సర్వే సర్వేషు భూతేషు యథావత్ప్రతిపేదిరే,
సర్వే దాక్షాయణీ పుత్రాః ప్రాజాపత్యా మహాబలాః. 62
అందరు అన్ని భూతములయందును యోగ్యత ననుసరించి మన్ననలు పొందినవారు. వారందరు దాక్షాయణి పుత్రులు, ప్రాజాపత్యులు, మహాబలులు.
జ్వలన్తః ప్రతపంతశ్చ కాలేన ప్రతిసంహృతాః,
అందరు ప్రతాపముతో వెలిగి పోయినవారు. కాలము ననుసరించి మరలిపోయినవారు.
త్వం చైవేమాం యదా భుక్త్వా పృథివీం త్యక్షసే పునః;
న శక్ష్యసి తదా శక్ర నియన్తం శోకమాత్మనః. 63
నీవు కూడ ఈ భూమిని అనుభవించి వదలివైచునపుడు కలుగు నీ శోకమును నిలువరించుకొనజాలవు.
ముఞ్చేచ్ఛాం కామభోగేషు ముఞ్చేమం శ్రీభవం మదమ్,
ఏవం స్వరాజ్యనాశే త్వం శోకం సంప్రసహిష్యసి. 64
కామభోగముల పైని కోరికను విడనాడుము. సంపదవలన పుట్టిన మదమును వదలి పెట్టుము. అప్పుడు నీదగురాజ్యము నశించినపుడు శోకమును అదుపున పెట్టుకొన గలుగుదువు.
శోకకాలే శుచో మా త్వం హర్షకాలే చ మాహృషః,
అతీతానాగతే హిత్వా ప్రత్యుత్పన్నేన వర్తయ. 65
శోకకాలమున శోకింపకు. హర్షకాలమున పొంగిపోవకుము. కడచిన దానిని, రాబోవు దానిని పట్టించుకొనక అప్పటికున్న దానితో మెలగుము.
మాం చే దభ్యాగతః కాలః సదా యుక్త మతన్ద్రితః,
క్షమస్వ న చిరా దిన్ద్ర త్వా మ ప్యుగమిష్యతి. 66
ఎల్లవేళల కార్యదీక్షలో నుండు నన్నును మెలకువ కలదియగు కాలము పైకొన్న దన్నచో ఇంద్రా! సహింపుము. అచిరకాలముననే నిన్నును చేరుకొనును.
త్రాసయన్నివ దేవేన్ద్ర వాగ్భి స్తక్షసి మామిహ,
సంయతే మయి నూనం త్వ మాత్మానం బహుమన్యసే. 67
దేవేన్ద్రా! నన్ను బెదరించుచు ఇచట మాటలతో కోసివేయుచున్నావు. నేను బంధింపబడియుండగా నీవు నిన్ను గొప్పవాడనని భావించుచున్నావు.
కాలః ప్రథమ మాయాన్మా పశ్చాత్త్వా మనుధావతి.
తేన గర్జసి దేవేన్ద్ర పూర్వం కాలహతే మయి. 68
కాలము మొదట నాకడకు వచ్చినది. తరువాత నీపై పరువున వచ్చును. దేవేంద్రా! మొదట కాలము దెబ్బతిన్న నాయందు కారులు కూయుచున్నావు.
కో హి స్థాతు మలం లోకే మమ క్రుద్ధస్య సంయుగే, 69
కాలస్తు బలవాన్ ప్రాప్త స్తేన తిష్ఠసి వాసన.
యత్త ద్వర్ష సహస్రాన్తం పూర్ణం భవితు మర్హతి. 70
యుద్ధమున నేను క్రోధము తాల్చినచో నాయందు నిలువగలవాడెవ్వడు. కాలము మిక్కిలి బలముగలదియై నాకు దాపురించినది. అందుచేత నీవు నాయెదుట నిలిచియున్నావు. ఆ వేయి సంవత్సరముల కాలము నిండనిమ్ము.
యథామే సర్వగాత్రాణి న సుస్థాని మహౌజసః,
అహ మైన్ద్రా చ్చ్యుతః స్థానా త్త్వ మిన్ద్రః ప్రకృతో దివి. 71
పిక్కటిల్లిన సత్తువ గల నా అవయవములన్నియు ప్రకృతమునకు పసచెడియున్నవి. నేను ఇంద్రస్థానమునుండి జారితిని. నీవు దివియందు ఇప్పటికి ఇంద్రుడ వయితివి.
సుచిత్రే జీవలోకేఽస్మి న్నుపాస్యః కాల పర్యయాత్,
కిం హి కృత్వా త్వ మిన్ద్రోఽద్య కిం వా కృత్వా వయం చ్యుతాః. 72
మిక్కిలి చిత్రమైన ఈ జీవలోకమున కాలము మారుటవలన నీవు ఉపాస్యుడ వయితివి. ఏమి చేసి నీవింద్రుడ వైతివి? ఏమి చేసి మేము అచటినుండి భ్రష్టులమైతిమి?
కాలః కర్తా వికర్తా చ సర్వ మన్య దకారణమ్.
నాశం వినాశ మైశ్వర్యం సుఖం దుఃఖం భవాభవౌ. 73
నాశము, వినాశము, ఐశ్వర్యము, సుఖము, దుఃఖము, బంధము మోక్షము ఈ అన్నింటికి కాలమే కర్త. విపరీతముగా చేయునదియు అదియే. తక్కిన దేదియు కారణము కాదు.
విద్వాన్ ప్రాప్యైవ మత్యర్థం న ప్రహృష్యే న్న చ వ్యథేత్,
త్వ మేవ హీన్ద్ర వేత్థాస్మాన్ వేదాఽహం త్వాం చ వాసవ. 74
ఎంత గొప్ప ప్రయోజనమును పొందియు తత్త్వ మెరిగిన వాడు పొంగిపోవడు. అట్లే దాని నాశమునందు క్రుంగియు పోవడు. ఇంద్రా! నీవు మమ్ముల నెరుగుదువు. నేనును నిన్నెరుగుదును.
కిం కత్థసే మా కిం చ త్వం కాలేన నిరపత్రప,
త్వ మేవ హి పురా వేత్థ యత్తదా పౌరుషం మమ,
సమరేషు చ విక్రాన్తం పర్యాప్తం తన్నిదర్శనమ్. 75
సిగ్గులేనివాడా! కాలమహిమచేత వృద్ధినందిన నీవిపుడు నన్ను నిందింతువేల? నా పౌరుష మెట్టిదో మునుపు యుద్ధములలో పరాక్రమము చూపిననాడు నీవెరుగుదువు. నేనపుడు సమర్థుడనగుటయే కాలవిషయమున నిదర్శనము.
ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ సాధ్యాశ్చ వసుభిః సహ,
మయా వినిర్జితాః పూర్వే మరుతశ్చ శచీపతే, 76
శచీపతీ! ఆదిత్యులు, రుద్రులు, సాధ్యులు, వసువులతోపాటు మరుత్తులు మునుపు నాకు ఓడినవారే.
త్వమేవ శక్ర జానాసి దేవాసుర సమాగమే,
సమేతా విబుధా భగ్నా స్తరసా సమరే మయా. 77
శక్రా! మునుపు దేవదానవుల యుద్ధమున దేవత లందరు కూడుకొని ఒక్కపెట్టున నా చేత చావుదెబ్బ తినిరి. అది నీవే యెరుగుదువు.
పర్వతా శ్చాసకృత్ క్షిప్తాః సవనాః సవనౌకసః,
సటంకశిఖరా భగ్నాః సమరే మూర్ధ్ని తే మయా. 78
అడవులతో, అడవిజంతువులతో కలసిన కొండలను నీపై విసరితిని. కొనలుతేరిన శిఖరములు గల ఆ కొండలను నీనెత్తిపై పగులగొట్టితిని.
కిం న శక్యం మయా కర్తుం కాలో హి దురతిక్రమః. 79
కాలము దాటనలవి కానిదై యున్నది కాని నేను చేయలేనిదేమి కలదు.
న హి త్వాం నోత్సహే హనుం స వజ్ర మపి ముష్టినా,
నతు విక్రమ కాలోఽయం క్షమా కాలోఽయ మాగతః. 80
వజ్రముచేత బట్టిన నిన్నును పిడికిలితో కొట్టుటకు నాకిపుడు ఉత్సాహము లేదు. ఇది పరాక్రమమునకు కాలము కాదు. ఓర్చి యుండవలసిన కాలము వచ్చిపడినది.
తేన త్వాం మర్షయే శక్ర దుర్మర్షణతర స్త్వయా,
తం మాం పరిణతే కాలే పరీతం కాలవహ్నినా,
నియతం కాలపాశేన బద్ధం శక్ర వికత్థసే. 81
నన్ను నీవేమియు చేయజాలని వాడవైనను నేను నిన్ను సహించుచున్నాను. కాలము పండగా కాలమనెడు అగ్ని కాల్చివేయగా, కాలపాశము నన్ను బంధింపగా నీవు పొగరు కూతలు కూయుచున్నావు.
అయం స పురుషః శ్యామో లోకస్య దురతిక్రమః.
బద్ధ్వా తిష్ఠతి మాం రౌద్రః పశుం రశనయా యథా. 82
ఈ నల్లని పురుషుడు (కాలపురుషుడు) లోకమునకు దాట నలవి కానివాడు. రౌద్రుడు. నన్ను పశువును త్రాటిచేతను వలె బంధించి నిలిచి యున్నాడు.
లాభాలాభౌ సుఖం దుఃఖం కామక్రోధౌ భవాభవౌ,
వధ బన్ధ ప్రమోక్షం చ సర్వం కాలేన లభ్యతే. 83
లాభము - నష్టము, సుఖము-దుఃఖము, కామము - క్రోధము, సంపద - లేమి, చావు, బంధము- మోక్షము అనునది యంతయు కాలము చేతనే కలుగును.
నాహం కర్తాన కర్తా త్వం కర్తా యస్తు సదా ప్రభుః,
సోఽయం పచతి కాలో మాం వృక్షే ఫల మివాగతమ్. 84
నేనును నీవును కర్తలము కాము. కర్తయైనవాడు ఎల్లవేళల ప్రభువై యుండవలయును. వృక్షమునందు ఏర్పడిన ఫలమువలె కాలము నిన్ను పాకమునకు తెచ్చుచున్నది.
యాన్యేవ పురుషః కుర్వన్ సుఖైః కాలేన యుజ్యతే,
పున స్తాన్యేవ కుర్వాణో దుఃఖైః కాలేన యుజ్యతే. 85
పురుషుడు కాలచోదనతో వేనిని చేయుచు సుఖములతో కూడియుండునో వానినే చేయుచు కాలముచేత దుఃఖములతో కూడి యుండును.
నచ కాలేన కాలజ్ఞః స్పృష్టః శోచితు మర్హతి. 86
కాలతత్త్వ మెరిగినవాడు కాలము మూడినపుడు దుఃఖ పడరాదు.
తేన శక్ర న శోచామి నాస్తి లోకే సహాయతా,
యధాహి శోచతః శోకో వ్యసనం నాపకర్షతి. 87
అందుచేత శక్రా! నేను శోకింపను. శోకించినచో కలుగు తోడ్పాటును లేదు. ఏడ్చువాని శోకము కష్టమును తొలగింపదు.
సామర్థ్యం శోచతో నాస్తీత్యతోఽహం నాద్య శోచిమి.
ఏడ్చువానికి సామర్థ్య మేమియు నుండదని ఎరిగి నేను ఈ నాడు దుఃఖింపను.
ఏవముక్తః సహస్రాక్షో భగవాన్ పాకశాసనః
ప్రతి సంహృత్య సంరంభ మిత్యువాచ శతక్రతుః 88
బలి యిట్లు పలుకగా వేయికన్నుల భగవానుడు, పాకశాసనుడు, శతక్రతువు పొగరును తగ్గించుకొని ఇట్లు పలికెను
స వజ్ర ముద్యతం బాహుం దృష్ట్వా పాశాంశ్చ వారుణాన్,
కస్యేహ నవ్యథే ద్భుద్ధి ర్మృత్యో రపి జిఘాంసతః
సా తేన వ్యథతే బుద్ధి రచలా తత్త్వ దర్శినీ. 89
వజ్రముతోపాటు లేచిన చేతిని, వరుణుని వగు పాశములను చూచి ఎవని బుద్ధి వ్యథచెందదు? చంపుటయే శీలమగు మృత్యువునకు వ్యథ కలుగును. కాని
తత్త్వమును దర్శించునది యగు నీ బుద్ధి మాత్రము నిశ్చలయై యున్నది.
ధ్రువం న వ్యథసేఽద్య త్వం ధైర్యా త్సత్య పరాక్రమ! 90
ధైర్యమువలన సత్య పరాక్రమా! నీవు నేడు ఏ మాత్రము వ్యథ చెందకున్నావు.
కోహి విశ్వాస మర్థేషు శరీరే వా శరీరభృత్,
కర్తు ముత్సహతే లోకే దృష్ట్వా సంప్రస్థితం జగత్. 91
శరీరధారి యెవ్వడు గాని దినదినము నశించుచున్న జగత్తును గాంచి ధనాదులయందు గాని, దేహమునందుగాని నమ్మకముంచుటకు ఉత్సహించును?
అహ మప్యేన మేవైనం లోకం జానా మ్యశాశ్వతమ్.
కాలాగ్నావాహితం ఘోరే గుహ్యే సతతగే ఽక్షరే 92
నేనును ఈ లోకము శాశ్వతము కానిదనియు, ఘోరము, కానరానిది, ఎల్లప్పుడు కదలాడునది, అక్షరమునగు కాలమనెడు అగ్నియందు త్రోసి వేయబడిన దనియు ఎరుగుదును.
న చాత్ర పరిహారోఽస్తి కాలస్పృష్టస్య కస్యచిత్,
సూక్ష్మాణాం మహతాం చైవ భూతానాం పరిపచ్యతామ్. 93
సూక్ష్మములుగాని, పెద్దవికాని కాలపాశమునకు చిక్కి పాకమున పడెడు ప్రాణులలో కాలము ముట్టిన ఎట్టివానికి తప్పించుకొను దారి యిందు లేదు.
అనీశస్యాప్రమత్తస్య భూతాని పచతః సదా,
అనివృత్తస్య కాలస్య క్షయం ప్రాప్తో న ముచ్యతే. 94
ఆ కాలమున కొక ప్రభువు లేడు. ఏమరుపాటు లేక అది సర్వకాలములలో భూతములను వండి పారవేయును. అది వెనుకకు మరలునది కాదు. అట్టి కాలుని కొంపలో చిక్కిన వానికి ఎన్నటికిని విడుదల ఉండదు.
అప్రమత్తః ప్రమత్తేషు కాలో జాగర్తి దేహిషు.
ప్రయత్నే నాప్యపక్రాన్తో దృష్టపూర్వో న కేనచిత్. 95
ప్రమత్తులగు దేహులయందు అప్రమత్తుడై కాలుడు మేలుకొని యుండును. ఎంత ప్రయత్నముచేతను అందుండి తప్పించుకొన్న వానినెవ్వనిని ఎవ్వడు మునుపు చూచి యుండలేదు.
పురాణః శాశ్వతో ధర్మః సర్వప్రాణభృతాం సమః,
కాలో న పరిహార్యశ్చ న చాస్యాస్తి వ్యతిక్రమః. 96
ప్రాణుధారులందరకును సమము, పురాతనము, శాశ్వతము, ధర్మము నగు కాలము ఎవ్వనికిని తప్పించుకొనరానిది. దానిని దాటుటయు నెట్టి వానికిని సాధ్యమగునది కాదు.
అహోరాత్రాంశ్చ మాసాంశ్చ క్షణాన్ కాష్ఠా లవాన్ కలాః,
సం పీడయతి యః కాలో వృద్ధిం వార్ధు షికో యథా, 97
పగళ్లను, రాత్రులను, నెలలను, క్షణములను, కాష్ఠములను, లవములను, కళలను, వడ్డీ వ్యాపారము చేయువాడు వడ్డీని లెక్కించినట్లు కాలము లెక్కించుచుండును.
ఇద మిద్య కరిష్యామి శ్వః కర్తా స్మీతి వాదినమ్,
కాలో హరతి సంప్రాప్తో నదీ వేగ ఇవ ద్రుమమ్. 98
ఇది నేడు చేయుదును. దీనిని రేపు చేయుదును అని పలుకువానిని కాలము తెలియకుండ దరికి జేరి, నదీవేగము చెట్టునువలె, గుంజుకొని పోవును.
ఇదానీం తావ దేవాసౌ మయా దృష్టః కథం మృతః,
ఇతి కాలేన ప్రియతాం ప్రలాపః శ్రూయతే నృణామ్. 99
ఇంతకుముందే నేను ఈతనిని చూచితిని. ఇంతలో ఎట్లు మరణించెను? అని కాలము ఈడ్చుకొని పోవు నరుల వాగుడు వినవచ్చు చుండును.
నశ్యన్త్యర్థా స్తథా భోగాః స్థాన మైశ్వర్య మేవ చ,
జీవితం జీవలోకప్య కాలే నాగమ్య నీయతే. 100
జీవలోకపు ధనములు, భోగములు, పదవి, ప్రభుత్వము, జీవితము అనువానిని కాలము మెల్లగా చొరబారి లాగుకొని పోవుచున్నది.
ఉచ్ఛాయా వినిపాతాన్తా భావోఽభావః స ఏవ చ,
అనిత్య మధ్రువం సర్వం వ్యవసాయో హి దుష్కరః. 101
పెరుగుట, విరుగుటయే ఫలమైనది. ఉండుటయు, ఊడుటయు నట్టిదియే. సర్వము అనిత్యము, అధ్రువము. కృషి పనికి మాలినదియే యగును.
సా తేన వ్యథతే బుద్ధి రచలా తత్త్వ దర్శినీ 102
అట్టి నీబుద్ధి తత్త్వమును దర్శించినదై వ్యథనందక స్థిరముగా నుండునది.
అహ మాసం పురా చేతి మనసాఽపి న బుధ్యతే,
కాలే నాక్రమ్య లోకేఽస్మిన్ పచ్యమానే బలీయసా. 103
కాలమాక్రమించి లోకమును వండివేయుచుండగా కొంచెము బలమెక్కువగా ఉన్నవాడు నేను పూర్వ మిట్లుంటినని మనస్సున కూడ తెలిసికొనడు.
అజ్యేష్ఠ మకనిష్ఠం చ క్షిప్యమాణో న బుద్ధ్యతే,
ఈర్ష్యాభిమానలోభేషు కామక్రోధభయేషు చ. 104
కాలము పెద్దవాడని, చిన్నవాడని పరిగణింపక ఈర్ష్య, అభిమానము, లోభము, కామము, క్రోధము, భయము ఆనువానియందు విసరివేయుచుండగా తెలిసికొనజాలకున్నాడు.
స్పృహా మోహాభిమానేషు లోకః సక్తో విముహ్యతి,
భవాంస్తు భావతత్త్వజ్ఞో విద్వాన్ జ్ఞాన తపోఽన్వితః. 105
కాలం పశ్యతి సువ్యక్తం పాణా వామలకం యథా,
కాలచారిత్ర తత్త్వజ్ఞః సర్వ శాస్త్ర విశారదః. 106
లోకమేమో ఆశలు, మోహములు, అభిమానములు అను వానియందు తగులు కొని ఒడలు తెలియకున్నది. నీవో, భావమును తత్త్వమును చక్కగా తెలిసినవాడవు, విద్వాంసుడవు, జ్ఞానముతో, తపస్సుతో కూడినవాడవు, కాలము నడవడి తత్త్వమును బాగుగా మనస్సునకు పట్టించుకొన్న వాడవు, సర్వ శాస్త్రములలో ఆరితేరిన వాడవునై చాల స్పష్టముగా కాలమును పరికించుచున్నావు.
వివేచనే కృతాత్మాసి స్పృహణీయో విజానతామ్,
సర్వలోకో హ్యయం మన్యే బుద్ధ్యా పరిగత స్త్వయా. 107
నీవు గుణదోషములను చక్కగా గుర్తించుటలో పండిన ప్రజ్ఞకల వాడవు, తత్త్వ మెరిగిన వారికిని కోరదగిన వాడవు. నీవు బుద్ధి విశేషముతో లోకమంతటిని చుట్టి వచ్చిన వాడవని నేను తలంతును.
విహరన్ సర్వతో ముక్తో న క్వచిత్ పరిషజ్జతే,
రజశ్చ హి తమశ్చ త్వాం స్పృశతే న జితేన్ద్రియమ్. 108
అన్ని యెడల విహరించుచు నీవు ముక్తుడవైతివి. ఎందును తగులము పొందవు. రజస్సుగాని, తమస్సుగాని ఇంద్రియములను జయించిన నిన్ను స్పృశింపవు.
నిప్ప్రీతిం నష్టసంతాప మాత్మానం త్వ ముపాససే,
సుహృదం సర్వభూతానాం నిర్వైరం శాన్తమానసమ్. 109
సర్వ భూతములకు చెలి పగ లేనిది, శాంతమగు మనస్సు కలది, ప్రీతిభావము లేనిది, సంతాపము ఏ మాత్రము లేనిది అగు ఆత్మ పదార్థమును నీవు ఉపాసించుచున్నావు.
దృష్ట్వా మాం మమ సంజాతా త్వయ్యనుక్రోశినీ మతిః
నాహ మేతాదృశం బుద్ధం హన్తు మిచ్ఛామి బన్ధనే. 110
ఇట్టి నిన్ను చూచిన నాకు నీయందు జాలిబుద్ధి పుట్టినది. ఇట్టి జ్ఞాన సంపన్నుని, నిన్ను బంధనముననున్న వానిని నేను చంపగోరను.
ఆనృశంస్యం పరో ధర్మో హ్యనుక్రోశశ్చ మే త్వయి,
మోక్ష్యన్తే వారుణాః పాశా స్తవేమే కాలపర్యయాత్. 111
క్రూరత లేకుండుట పరమధర్మము. మరియు నీయందు నాకు కరుణ ఏర్పడినది. నీయీ వరుణపాశములు కాలము మార్పువలన వీడిపోగలవు.
ప్రజానా మపచారేణ స్వస్తి తేఽస్తు మహాసుర,
యదా శ్వశ్రూం స్నుషాం వృద్ధాం పరిచారేణ యోక్ష్యతే. 112
పుత్రశ్చ పితరం మోహాత్ ప్రేషయిష్యతి కర్మసు,
బ్రాహ్మణైః కారయిష్యన్తి వృషలాః పాదధావవమ్. 113
శూద్రాశ్చ బ్రాహ్మణీం భార్యా ముపయాస్యన్తి నిర్భయాః, 114
వియోనీషు విమోక్ష్యన్తి బీజాని పురుషా యదా.
సంకరం కాంస్య భాండైశ్చ బలిం చైవ కుపాత్రకైః,
చాతుర్వర్ణ్యం యదా కృత్స్న మమర్యాదం భవిష్యతి 115
ఏకైకస్తే తదా పాశః క్రమశః పరిమోక్ష్యతే.
ప్రజలు ఆపచారములు చేసెడు కాలమున నకు స్వస్తి యగును. కోడలు వృద్ధయగు అత్తను పనికి ఉపయోగించునపుడును, కొడుకు తండ్రిని మోహమువలన పనులయందు నియోగించునపుడును, శూద్రులు బ్రాహ్మణులతో పాదములొత్తు పనిని చేయించుకొనునపుడును, బ్రాహ్మణ స్త్రీని భార్యగా చేసికొని శూద్రులు నిర్భయులై విహరించునపుడును, పురుషులు ధర్మవిరుద్ధముగా స్త్రీలయందు బీజములు వదలునపుడును, కంచుపాత్రలతో సంకరము చేయునపుడు, పనికిరాని పాత్రలతో బలులు పెట్టునపుడును, నాలుగు వర్ణములసముదాయము మొత్తముగా హద్దులు మీరినపుడును నీ ఒక్కొక్క పాశము వదలిపోవును.
అస్మత్తస్తే భయం నాస్తి సమయం ప్రతిపాలయ,
సుఖీ భవ నిరాబాధః స్వస్థచేతా నిరామయః. 116
మా వలన నీకు భయము లేదు. సమయమునకై వేచియుండుము. బాధలు లేనివాడవై, స్వస్థమగు చిత్తము కలవాడవై, రోగములు లేనివాడవై సుఖమయుడవు కమ్ము.
త మేవ ముక్త్వా భగవాన్ శతక్రతుః
ప్రతి ప్రయాతో గజరాజ వాహనః,
విజిత్య సర్వా నసురాన్ సురాధిపో
ననన్ద హర్షేణ బభూవ చైకరాట్. 117
అతనితో ఇట్లు పలికి భగవానుడగు శతక్రతువు గజరాజవాహనుడు తన దేశమునకు బయలుదేరెను. తక్కిన రాక్షసుల నందరను గెలిచి దేవరాజు ఆనందముతో పొంగిపోయెను.
మహర్షయ స్తుష్టువు రంజసా చ తం
వృషాకపిం సర్వచరాచరేశ్వరమ్
హిమాూపహో హవ్య మువాహ చాధ్వరే
తథామృతం చార్పిత మీశ్వరోఽపి హి 118
మహర్షులు చరాచరములకు ప్రభువగు పరమేశ్వరుని స్తుతించిరి. అగ్ని మరల యజ్ఞమునందు హవ్యములను మోయుచుండెను. ఈశ్వరుడును అమృతమును కాపాడెను.
ద్విజోత్తమైః సర్వగతై రభిష్టుతో
విదీప్తతేజా గత మన్యు రీశ్వరః,
ప్రశాన్తచేతా ముదితః స్వ మాలయం
త్రివిష్టపం ప్రాప్య ముమోద వాసవః. 119
ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి
బలిసవన సంవాదే సప్తవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
ఉత్తమ ద్విజులు, అన్ని తావులయందును ఉన్నవారు స్తుతులు చేయుచుండగా, మిక్కిలి వెలిగి పోవుచున్న తేజము కలవాడు, దిగులు తీరినవాడు, ప్రభువు, ప్రశాంతచిత్తము కలవాడు, మోదమందినవాడునగు దేవేంద్రుడు తన యాలయమగు స్వర్గమును చేరుకొని యానందమందెను.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున బలివాసవ
సంవాదము గల రెండువందల యిరువది యేడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
పూర్వరూపాణి మే రాజన్ పురుషస్య భవిష్యతః,
పరాభవిష్యత శ్చైవ తన్మే బ్రూహి పితామహ. 1
రాబోవు ప్రాభవములకును, పరాభవములకు కారణములైన పూర్వ రూపములను, రాజా! తాతా! నాకు తెలియజెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి,
భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. 2
రానున్న సంపదలకు, ఆపదలకు సంబంధించిన పూర్వరూపములను మనుజుని మనస్సే తెలియజెప్పును. నీకు మేలగుగాక!
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
శ్రియా శక్రస్య సంవాదం తం నిబోధ యుధిష్ఠిర 3
ఇందు ప్రాతకాలము నాటిదగు ఇతిహాసమును చెప్పుకొందురు. అది లక్ష్మికి, ఇంద్రునకునైన సంవాదము. యుధిష్ఠిరా! దానిని తెలిసికొనుము.
మహత స్తపసో వ్యుష్ట్యా పశ్యన్ లోకే పరావరౌ,
సామాన్య మృషిభి ర్గత్వా బ్రహ్మలోక నివాసిభిః. 4
బ్రహ్మేవామిత దీప్తౌజాః శాన్తపాప్మా మహాతపాః,
విచచార యథాకామం త్రిషు లోకేషు నారదః. 5
గొప్ప తపస్సు సంపదతో ఇహపరలోకములను రెండింటిని దర్శించుచు, బ్రహ్మలోకమున నివసించు ఋషులతో సమానత్వమును పొంది బ్రహ్మవలె మిక్కిలిగా ప్రకాశించు తేజము కలవాడై, శమించిన పాపములు కలవాడు, మహా తపస్వియు నగునారదుడు తన ఇచ్చ ననుసరించి మూడులోకములయందును తిరుగుచుండెను.
కదాచి త్ప్రాత రుత్థాయ పిస్పృక్షుః సలిలం శుచి,
ధ్రువద్వారభవాం గఙ్గాం జగా మావతతార చ. 6
ఒకప్పుడు అతడు వేకువజామున లేచి పవిత్రమగు జలమున స్నానమాడ గోరినవాడై ధ్రువద్వారము కడఁబుట్టిన గంగకడ కరిగి అందు దిగెను.
సహస్రనయన శ్చాపి వజ్రీ శంబరపాకహా,
తస్యా దేవర్షి జుష్టాయా స్తీర మభ్యాజగామ హ. 7
వేయికనులవాడు, వజ్రము తాల్చినవాడు, శంబరుడు పాకుడు అను రాక్షసులను చంపినవాడునగు దేవేంద్రుడు, ఆ దేవర్షి స్నానమాడు ఆ గంగ తీరమునకే వచ్చెను.
తా వాప్లుత్య యతాత్మానౌ కృతజప్యౌ సమాసతః,
నద్యాః పులిన మాసాద్య సూక్ష్మ కాఞ్చన వాలుకమ్. 8
పుణ్యకర్మభి రాఖ్యాతా దేవర్షికథితాః కథాః,
చక్రతు స్తౌ తథాసీనౌ మహర్షికథితా స్తథా. 9
వారిరువురు అందు స్నానమాడి, మనస్సులను కూడ దీసికొని జపకార్యమును ముగించుకొని సన్నని బంగరువన్నె కలయిసుక రేణువులు గలతిన్నెపై కూర్చుండి దేవర్షులు, మహర్షులు చెప్పెడు పుణ్యకర్మములకు చెందిన కథలు చెప్పుకొనుచు కొంతసేపు గడపిరి.
పూర్వవృత్త వ్యపేతాని కథయన్తౌ సమాహితౌ.
చెదరని మనస్సులతో వారిరువురు తమతమ పూర్వవృత్తములను చెప్పుకొను చుండిరి.
అథ భాస్కర ముద్యన్తం రశ్మిజాల పురస్కృతమ్,
పూర్ణమణ్డల మాలోక్య తావుత్థా యోపతస్థతుః. 10
అంత కిరణముల సముదాయము ముందురాగా ఉదయించుచున్న భాస్కరుని నిండు బింబమును చూచి వారిరువురు లేచి సూర్యునారాధించిరి.
అభిత స్తూదయన్తం త మర్క మర్క మివాపరమ్,
ఆకాశే దదృశే జ్యోతి రుద్యతార్చిః సమప్రభమ్. 11
తయోః సమీపం తం ప్రాప్తం ప్రత్యదృశ్యత భారత, 12
ఆట్లుదయించుచున్న సూర్యుని చుట్టును వ్యాపించి మరియొక సూర్యుడో యన్నట్లు కాంతులు విరజిమ్ముచున్న జ్యోతి యొకటి ఆకాశమున కానవచ్చెను. అది వారిరువురకు సమీపమునకు వచ్చినదై కన్పట్టెను.
తత్సుపర్ణార్కరచిత మాస్థితం వైష్ణవం పదమ్,
భాభి రప్రతిమం భాతి త్రైలోక్య మవభాసయత్. 13
ఆ విష్ణుసంబంధమగు పదము గరుడుని, సూర్యుని చిన్నెలతో అలరారు చుండెను. కాంతులతో సాటిదిలేనిదై, మూడులోకములను ప్రకాశింపజేయుచు మిరుమిట్లుగొలుపుచుండెను.
తత్రాభిరూపశోభాభి రప్సరోభిః పురస్కృతామ్,
బృహతీ మంశుమత్ప్రఖ్యాం బృహద్భానో రివార్చిషమ్. 14
అందు చక్కని రూపవతులగు అప్సరసలు ముందేగుదెంచుచుండగా అగ్నిజ్వాలవలె వెలుగొందుచు కిరణమాలికలతో విరాజిల్లు నొక పెద్ద జ్యోతి రాకృతి కానవచ్చెను.
నక్షత్ర కల్పాభరణాం తాం మౌక్తికసమస్రజమ్,
శ్రియం దదృశతుః పద్మాం సాక్షాత్పద్మదళస్థితామ్. 15
నక్షత్రముల వంటి ఆభరణములు, ముత్యాల హారములు తాల్చిన ఆ తేజస్సు సాక్షాత్తు పద్మదళమున నెలకొన్న పద్మ, లక్ష్మీదేవిగా వారికి కానవచ్చెను.
సా వరుహ్య విమానాగ్రా దఙ్గనానా మనుత్తమా,
అభ్యాగచ్ఛ త్త్రిలోకేశం దేవర్షిం చాపి నారదమ్. 16
అంగనలలో అత్యుత్తమ యగునామె విమానమునుండి దిగి త్రిలోకాధిపతి యగు నింద్రుని, దేవర్షియగు నారదుని సమీపించెను.
నారదానుగతః సాక్షాన్మఘవాం స్తా ముపాగమత్,
కృతాజ్ఞలిపుటో దేవీం నివేద్యాత్మాన మాత్మనా. 17
నారదుడు వెంటనంటిరాగా దేవేంద్రుడు అంజలిఘటించి తన్ను తానామెకు తెలియపరచుకొని భక్తితో దరికి చేరుకొనెను.
చక్రే చానుపమాం పూజాం తస్యా శ్చాపి స సర్వవిత్,
దేవరాజః శ్రియం రాజన్ వాక్యం చేద మువాచ హ. 18
సర్వము నెరిగినవాడగు దేవరాజు ఆమెకు సాటిలేని పూజ నొనర్చి ఆ లక్ష్మీదేవితో ఇట్లు పలికెను.
శక్ర ఉవాచ - శక్రు డిట్లనెను.
కా త్వం కేన చ కార్యేణ సంప్రాప్తో చారుహాసిని,
కుత శ్చాగమ్యతే సుభ్రు గన్తవ్యం క్వ చ తే శుభే, 19
అందములొలుకు చిరునవ్వుల తల్లీ, చక్కని కనుబొమలతో అలరారు మంగళస్వరూపిణీ! నీవెవరు? ఏకార్యముపై నరుగుదెంచితివి? ఎక్కడనుండి నీ రాక? ఎందుబోవుచుంటివి?
శ్రీ రువాచ - శ్రీదేవి యిట్లనెను.
పుణ్యేషు త్రిఘ లోకేషు సర్వే స్థావరజఙ్గమాః,
మమాత్మభావ మిచ్ఛన్తో యతన్తే పరమాత్మనా. 20
పుణ్యములగు మూడులోకములందును స్థావరజంగమ స్వరూపములన్నియు నాభావమునే పొందగోరుచు దొడ్డ బుద్ధితో ప్రయత్నించుచున్నవి.
సాఽహం వై పంకజే జాతా సూర్యరశ్మి విబోధితే,
భూత్యర్థం సర్వభూతానాం పద్మా శ్రీః పద్మమాలినీ. 21
సూర్యకిరణములు మేల్కొలుపగా వికసించిన పద్మమున సర్వప్రాణుల అభ్యుదయముకొరకు ఉద్భవించినదానను. పద్మ, శ్రీ, పద్మమాలిని అనియు నన్నందురు.
అహం లక్ష్మీ రహం భూతిః శ్రీ శ్చాహం బలసూదన,
అహం శ్రద్ధాచ మేధా చ సన్నతి ర్విజితిః స్థితిః. 22
నేను లక్ష్మిని, భూతిని, శ్రీని. శ్రద్ధ, మేధ, సన్నతి, విజితి, స్థితి - ఇవి అన్నియు నేనే.
అహం ధృతి రహం సిద్ధి రహం త్వద్భూతి రేవ చ,
ఆహం స్వాహా స్వధా చైవ సన్నతి ర్నియతిః స్మృతిః. 23
ధృతి, సిద్ధి, నీదయిన ఐశ్వర్యము, స్వాహ, స్వధ, సన్నతి, నియతి, స్మృతి - ఇవి అన్నియు నేనే.
రాజ్ఞాం విజయమానానాం సేనాగ్రేషు ధ్వజేషు చ,
నివాసే ధర్మశీలానాం విషయేషు పురేషు చ, 24
జితకాశిని శూరే చ సంగ్రామే ష్వనివర్తిని
నివసామి మనుష్యేన్ద్రే సదైవ బలసూదన. 25
ఓయీ బలసూదన! విజయము పొందుచున్న రాజుల సేనల మొనల యందును, ధ్వజములయందును, ధర్మశీలురగు వారి దేశములయందును, పురములయందును, యుద్ధములలో వెన్నుచూపని, జయముచే ప్రకాశించు శూరుడైన రాజునందును నే నెల్లవేళల నివసింతును.
ధర్మనిత్యే మహాబుద్ధౌ బ్రహ్మణ్యే సత్యవాదిని,
ప్రశ్రితే దానశీలే చ సదైవ నివసామ్యహమ్. 26
ధర్మమునెన్నటికిని వదలనివాడు, గొప్పమేధాబలము కలవాడు, బ్రహ్మ తత్త్వవేత్త, సత్యమునే పలుకువాడు, వినయవంతుడు, దానశీలుడు - అగువారియందు ఎల్లవేళల నేను నివసింతును.
అసురే ష్వవసం పూర్వం సత్యధర్మనిబంధనా,
విపరీతాం స్తు తాన్ బుద్ధ్వా త్వయి వాస మరోచయమ్. 27
సత్య ధర్మములకు కట్టువడినదాననై నేను మునుపు రాక్షసులకడ నుంటిని. వారు మార్పు పొందినవారని యెఱిగి నీకడ నుండుట కిష్ట పడితిని.
శక్ర ఉవాచ - ఇంద్రు డిట్లనెను.
కథం వృత్తేషు దైత్యేషు త్వమవాత్సీ ర్వరాననే,
దృష్ట్వా చ కి మిహాగా స్త్వం హిత్వా దైతేయదానవాన్. 28
వరాననా! దైత్యు లెట్టినడవడి కలిగి యుండగా నీవు వారి కడనుంటివి? ఇపుడు ఆ దితిదను పుత్రులను వదలి యేమి చూచి ఇచటికి వచ్చితివి?
శ్రీ రువాచ - శ్రీ యిట్లు పలికెను.
స్వధర్మ మమతిష్ఠత్సు ధైర్యా దచలితేషు చ,
స్వర్గమార్గాభిరామేషు సత్యేషు విరతా హ్యహమ్. 29
వారు స్వధర్మమును శ్రద్ధగా అనుష్ఠించెడివారు. ధైర్యమునుండి కదలకుండెడివారు. స్వర్గమార్గమున మిక్కిలి మక్కువ కలవారు. సత్త్వగుణముతో అలరారువారు. అట్టివారికడ నేను ప్రీతితో నుంటిని.
దానాధ్యయన యజ్ఞే జ్యా పితృ దైవత పూజనమ్,
గురూణా మతిథీనాం చ తేషాం సత్య మవర్తత. 30
దానము, ఆధ్యయనము, యజ్ఞము, దేవతాపూజ, పితృదేవతల ఆరాధనము, గురువులయెడ, అతిథులయెడ మన్నన వారలకు ఉండెడిది.
సుసంమృష్టగృహా శ్చాసన్ జితస్త్రీకా హుతాగ్నయః,
గురుశుశ్రూషకా దాన్తా బ్రహ్మణ్యాః సత్యవాదినః. 31
చక్కగా శుద్ధి చేసి అలంకరించిన గృహములు వారి కుండెడివి. స్త్రీల యెడ వ్యామోహము లేనివారు. అగ్నులను ఆర్చించెడివారు. గురువులకు శుశ్రూషచేసెడి వారు. ఇంద్రియనిగ్రహము కలవారు, బ్రహ్మమునందు నిష్ఠ కలవారు. సత్యమునే పలికెడివారు.
శ్రద్దధానా జితక్రోధా దానశీలాఽనసూయవః,
భృతపుత్రా భృతామాత్యా భృతదారా హ్యనీర్షవః. 32
శ్రద్ధ కలవారు, క్రోధమును గెలిచినవారు, దానశీలురు, అసూయలేనివారు. పుత్రులను, అమాత్యులను, భార్యలను చక్కగా భరించుశీలము కలవారు. ఈర్ష్య లేనివారు.
అమర్షేణ న చాన్యోన్యం స్పృహయన్తే కదాచన,
న చ జాతూపతప్యన్తి ధీరాః పరసమృద్ధిభిః. 33
ఎన్నడును ఒకరినొకరు మించవలయు ననుతలపు లేనివారు. ఇతరుల సంపదలను చూచి ఎన్నటికిని కుళ్లుకొనని ధీరులు.
దాతారః సంగృహీతారః ఆర్యాః కరుణవేదినః,
మహాప్రసాదా ఋజవో దృఢభక్తా జితేన్ద్రియాః. 34
దాతలు, పొదుపరితనము కలవారు, ఆర్యులు, జాలిగుణమును బాగుగా నెరిగినవారు. గొప్ప అనుగ్రహబుద్ధి కలవారు, కపటశీలములేనివారు, చెదరనిభక్తి కలవారు, ఇంద్రియములపై గట్టి అదుపు కలవారు.
సంతుష్ట భృత్యసచివాః కృతజ్ఞాః ప్రియవాదినః,
యథార్హమానార్థకరా హ్రీనిషేవా యతవ్రతాః. 35
సేవకులను మంత్రులను సంతృప్తిపరచువారు, కృతజ్ఞులు, ప్రియమునే పలుకువారు, యోగ్యత నెరిగి ధనము నొసగువారు, పాడుపనులకు సిగ్గుపడువారు, నిష్ఠతోకూడిన వ్రతములు కలవారు.
నిత్యం పర్వసు సుస్నాతాః స్వనులిస్తాః స్వలంకృతాః,
ఉపవాసతపః శీలాః ప్రతీతా బ్రహ్మవాదినః. 36
పర్వదినములయందు శుభమైన స్నానములు చేయువారు, చక్కనిమైపూతలు, అలంకారములు ధరించువారు, ఉపవాసములు తపస్సు శీలముగా గలవారు, నమ్మదగినవారు, వేదముల నధ్యయనము చేయువారు నైయుండిరి.
నైవా నభ్యుదియాత్సూర్యో న చాప్యాసన్ ప్రగేశయాః,
రాత్రౌ దధి చ సక్తూంశ్చ నిత్యమేవ వ్యవర్జయన్. 37
సూర్యుడు వీరి నెన్నడును మేల్కొలుపలేదు. వారెన్నడు ప్రాతఃకాలమున నిద్రించువారు కారు. రాత్రియందు పెరుగును, పేలపిండిని అన్ని దినములలో వదలివైచిరి.
కల్యం ఘృతం చాన్వవేక్షన్ ప్రయతా బ్రహ్మవాదినః,
మఙ్గల్యాన్యపి చాపశ్యన్ బ్రాహ్మణాంశ్చా ప్యపూజయన్. 38
ఉషః కాలమున ఘృతమును శ్రద్ధకలవారై చూచెడివారు. వేదముల నధ్యయనము చేసెడివారు. మంగళవస్తువులను దర్శించెడివారు. బ్రహ్మ జ్ఞానులను గౌరవించెడివారు.
సదా హి వదతాం ధర్మం సదా చాప్రతిగృహ్ణతామ్,
అర్ధం చ రాత్ర్యాః స్వపతాం దివా చాస్వపతాం తథా. 39
ఎల్లవేళల ధర్మమును పలికెడువారు. ఎల్లవేళల ప్రతిగ్రహము (పుచ్చు కొనుట) లేనివారు. రాత్రిలో సగభాగము మాత్రమే నిద్రించువారు. పగలు నిద్రింపని వారు.
కృపణానాథ వృద్ధానాం దుర్బలాతురయోషితామ్,
దయాం చ సంవిభాగం చ నిత్య మేవాన్వమోదతామ్. 40
దీనులు, దిక్కులేని వారు, ముదుసలులు, బలహీనులు, రోగులు, స్త్రీలు-వీరి యందు దయను, దానమును ఎల్లవేళల చేయుచు ఆనందమందువారు.
త్రస్తం విషణ్ణ ముద్విగ్నం భయార్తం వ్యాధితం కృశమ్,
హృతస్వం వ్యసనార్తం చ నిత్య మాశ్వాసయన్తి తే. 41
వెరచినవానిని, క్రుంగిపోయిన వానిని, మనసుచెదరిన వానిని, భయపీడితుని,
వ్యాధిగ్రస్తుని, బక్కచిక్కిన వానిని, సొమ్ముకోల్పోయిన వానిని, కష్టములలో నున్న వానిని వారు నిత్యము ఊరడించెడి వారు.
ధర్మ మేవాన్వవర్తన్త న హింసన్తి పరస్పరమ్,
అనుకూలాశ్చ కార్యేషు గురువృద్ధోపసేవినః. 42
వారు ధర్మమునే వదలక ఆచరించిరి. తమలో తాము హింసించుకొన కుండిరి. పనులయందు అనుకూలురై యుండెడివారు. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను చక్కగా సేవించుచుండెడివారు.
పితౄన్ దేవాతిథీం శ్చైవ యథావత్తేఽభ్యపూజయన్,
అవశేషాణి చాశ్నన్తి నిత్యం సత్యతపోధృతాః. 43
పితృదేవతలను, దేవతలను, అతిథులను విధి ననుసరించి ఆరాధించిరి. వారికి నివేదింపగా మిగిలిన అన్నమును భుజించెడివారు సత్యమును, తపస్సును నిష్ఠతో ఆచరించిరి.
నైకేఽశ్నన్తి సుసంపన్నం న గచ్ఛన్తి పరస్త్రియమ్,
సర్వభూతే ష్వవర్తన్త యథాత్మని దయాం ప్రతి. 44
మృష్టమైన భోజనమును ఒక్కరై తినకుండిరి. పరస్త్రీని పొందకుండిరి. తమయందు తమ కెంత దయయో సర్వభూతములయందును అట్టిదయతోడనే మెలగిరి.
నైవాకాశే న పశుషు వియోనౌ చ న పర్వసు
ఇన్ద్రియస్య విసర్గం తే రోచయన్తి కదాచన. 45
బయలున, పశువులయందు, అన్యయోనియందు, పర్వములయందును ఇంద్రియమును వదలుటను వారెన్నడును ఇష్టపడెడివారు కారు.
నిత్యం దానం తథా దాక్ష్య మార్జవం చైవ నిత్యదా,
ఉత్సాహోఽథానహంకారః పరమం సౌహృదం క్షమా. 46
సత్యం దానం తపః శౌచం కారుణ్యం వా గనిష్ఠురా,
మిత్రేషు చానభిద్రోహః సర్వం తే ష్వభవత్ ప్రభో. 47
దానము, దక్షత, ఋజుత్వము, ఉత్సాహము, అహంకారము లేకుండుట, పరమమైనచెలిమి, ఓర్పు, సత్యము, యజ్ఞములందు దక్షిణలను విరివిగా నొసగుట, తపస్సు, పరిశుద్ధత, జాలి, పరుషముగా పలుకకుండుట, మిత్రులయెడ ద్రోహచింతన లేకుండుట అనునవి యన్నియు వారిలో ఎల్లవేళల నుండెడివి.
నిద్రా తన్ద్రీ రసంప్రీతి రసూయా థానవేక్షితా,
అరతిశ్చ విషాదశ్చ స్పృహా చాప్యావిశ న్న తాన్. 48
నిద్ర, అలసత, అతృప్తి, అసూయ, ప్రమాదము, ఏడుపుగొట్టుతనము, క్రుంగిపోవుట, లౌల్యము అనునవి వారి నెన్నడును దరిజేరలేదు.
సాహ మేవం గుణేష్వేవ దానవే ష్వవపం పురా,
ప్రజాసర్గ ముపాదాయ నైకం యుగవిపర్యయమ్. 49
అట్టినేను ఇట్టి గుణములుగల దానవులయందు, సృష్టిమొదలైన నాటినుండియు పెక్కు యుగములు, కడచినకాలమున, వసించితిని.
తతః కాలవిపర్యాసే తేషాం గుణవిపర్యయాత్,
అపశ్యం నిర్గతం ధర్మం కామక్రోధవశాత్మనామ్. 50
అంత కాలము మారగా గుణములు తారుమారయి కామక్రోధములకు వశమైన బుద్ధిగల వారిలో ధర్మము జారిపోవుటను చూచితిని.
సభాసదానాం చ వృద్ధానాం సతాం కథయతాం కథాః,
ప్రాహస న్నభ్యసూయంశ్చ సర్వవృద్ధాన్ గుణావరాః. 51
హీనగుణములు కలవారు అన్నింటిలో తలపండిన పెద్దలను, సభలయందధి కారులై యుండగా, సత్పురుషుల కథలను చెప్పెడివారుకాగా, వెక్కిరింపదొడగిరి. అసూయపడజొచ్చిరి.
యువానశ్చ పమాసీనా వృద్ధానపిగతాన్ సతః,
నాభ్యుత్థానాభివాదాభ్యాం యథాపూర్వ మపూజయన్. 52
వృద్ధులు, సజ్జనులు అయినవారు రాగా యువకులు ఆసనములపై కూర్చుండి, ఎదురేగుట, గోత్రనామములు చెప్పి నమస్కరించుటలతో పూర్వమువలె మన్నింపకుండిరి.
వర్తయత్యేవ సతరి పుత్రః ప్రభవతే తథా,
అభృత్యా భృత్యతాం ప్రాప్య ఖ్యాపయన్త్యనపత్రపాః. 53
తండ్రి సమర్థుడైయున్నపుడే కొడుకు పెత్తనమును ప్రారంభించెను. మునుపెన్నడు సేవకవృత్తిలో లేనివారు సేవకులై సిగ్గులజ్జలు విడచి ప్రకటించు కొనజొచ్చిరి.
తథా ధర్మా దపేతేన కర్మణా గర్హితేన యే,
మహతః ప్రాప్నువన్త్యర్థాం స్తేషాం తత్రాభవత్ స్పృహా. 54
ధర్మమునుండి తొలగిన నింద్య కర్మము నాచరించి గొప్పధనములను పొందిన వారి విషయమున వీరికి ఆసక్తి కలిగెను.
ఉచ్చైశ్చాభ్యవదన్ రాత్రౌ నీచై స్తత్రాగ్ని రజ్వలత్,
పుత్రాః పితౄ వత్యచర న్నార్య శ్చాత్య చరన్ పతీన్. 55
రాత్రివేళలందు కారుకూతలు మెండయ్యెను. అగ్నిహోత్రము వెలుగుట తగ్గిపోయెను. తనయులు తండ్రులను, స్త్రీలు భర్తలను అతిక్రమింపదొడగిరి.
మాతరం పితరం వృద్ధ మాచార్య మతిథిం గురుమ్,
గురుత్వా న్నాభ్యనన్దన్త కుమారా న్నాన్వపాలయన్. 56
తల్లి, తండ్రి, పెద్దవాడు, ఆచార్యుడు, అతిథి, గురువు అనువారి పెద్దరికమును మన్నింపకుండిరి. పెద్దలు కుమారులను అదుపుచేయకుండిరి.
భిక్షాం బలి మదత్వా చ స్వయ మన్నాని భుఞ్జతే,
అనిష్ట్వాఽసంవిభజ్యాథ పితృదేవాతిథీన్ గురూవ్. 57
దేవపూజ చేయక, పితృదేవతలకు, దేవతలకు, అతిథులకు, గురువులకు పెట్టక బిచ్చము, బలి నొసగక ఎవరికి వారు అన్నములను తినదొడగిరి.
న శౌచ మనురుధ్యన్త తేషాం సూదజనా స్తథా,
మనసా కర్మణా వాచా భక్ష్య మాసీ దనావృతమ్. 58
వారి వంటవారు శౌచము నేమాత్రము పాటింపకుండిరి. మనసుతో, కర్మముతో, మాటతో కాపుదలలేని కూడు ఏర్పడెను.
విప్రకీర్ణాని ధాన్యాని కాకమూషికభోజనమ్,
అపావృతం పయోఽతిష్ఠ దుచ్ఛిష్టా శ్చాస్పృశన్ ఘృతమ్. 59
ధాన్యములు చెదరిపడియుండును. అది కాకులకు, ఎలుకలకు తిండి యయ్యెను. పాలపై మూతలుండవు. నేతిని ఎంగిలి మూతులతో తాకుచుందురు.
కుద్దాలం దాత్రపిటకం ప్రకీర్ణం కాంస్యభాజనమ్,
ద్రవ్యోపకరణం సర్వం నాన్వవైక్ష త్కుటుంబినీ. 60
ఇల్లాలు పలుగు, కత్తి, గంప, కంచుపాత్ర మొదలగు పనిముట్లు చెల్లా చెదరుకాగా వానిని గూర్చి పట్టించుకొనదు.
ప్రాకారాగార విధ్వంసా న్న స్మ తే ప్రతికుర్వతే,
నాద్రియన్తే పశూన్ బద్ధ్వా యవసే నోదకేన చ. 61
ప్రహరిగోడలు, ఇంటిగోడలు పగుళ్లు వారగా వానికి మరమ్మత్తులు చేయింపరు. గొడ్లను కట్టిపడవైచి గడ్డి, నీరు పెట్టి ఆదరింపరు.
బాలానాం ప్రేక్షమాణానాం స్వయం భక్ష్య మభక్షయన్,
తథా భృత్యజనం సర్వ మసంతర్ప్య చ దానవాః. 62
పసివారు చూచుచుండగా తమకూడు తాము తినుచుందురు. అట్లే తన పోషణ లోనివారందరు తినిరో లేదో అని దానిని పట్టించుకొనరు.
పాయసం కృసరం మాంస మపూపా వథ శష్కులీః,
అపాచయ న్నాత్మనోఽర్థే వృథామాంసా నభక్షయన్. 63
పాయసము, పులగము, మాంసము, గారెలు, జంతికలు మొదలగు వానిని తమకొరకే వండుకొందురు. ఊరక మాంసములు తినుచుందురు.
ఉత్సూర్యశాయిన శ్చాసన్ సర్వేచాసన్ ప్రగేనిశాః,
ఆవర్తన్ కలహా శ్చాత్ర దివారాత్రం గృహే గృహే. 64
అందరు సూర్యోదయమైన తరువాతను నిద్రించువారు, సంధ్యలలో పరుండువారు నయిరి. పగలనక రాత్రి యనక కొంపలందెల్ల కలహములు సాగుచుండెను.
అనార్యా శ్చార్య మాసీనం పర్యుపాప న్న తత్ర హ,
ఆశ్రమస్థాన్ విధర్మస్థాః ప్రాద్విషన్త పరస్పరమ్. 65
ఆర్యుడు కూర్చుండగా అనార్యులు అతనిని మన్నింపక విహరించిరి. ఆశ్రమములందు విష్ణకలవారిని ఇతరధర్మముల నవలంబించువారు పెద్దగా ద్వేషించిరి.
సంకరా శ్చాభ్యవర్తన్త న చ శౌచ మవర్తత,
యే చ వేదవిదో విప్రా విస్పృష్ట మనృచ శ్చ యే.
నిరన్తర విశేషాస్తే బహుమానావమానయోః. 66
సంకరములే పెల్లుగా సాగెను. పరిశుద్ధత ఏమాత్రము లేదు. సర్వవేదములను సాధించిన విప్రులు, చదువు సంధ్యలు లేనివారును బహుమాన, అవమానముల యందు ఏభేదము లేనివారైరి.
హార మాభరణం వేషం గతం స్థిత మవేక్షితమ్,
అసేవన్త భుజిష్యా వై దుర్జనాచరితం విధిమ్. 67
ఇండ్లలో పనిచేసికొని పోట్టపోసికొను స్త్రీలు హారములు, ఆభరణములు, వేషము, నడవడి, ఉనికి మొదలగువానిలో గృహిణులతో భేదమే లేనివారైరి. నీచ కృత్యములకు పాల్పడుచుండిరి.
స్త్రియః పురుషవేషేణ పుంపః స్త్రీవేషధారిణః,
క్రీడారతి విహారేషు పరాం ముద మవాప్నువన్. 68
స్త్రీలు మగవేషముతో, మగవారు స్త్రీవేషములతో ఆటపాటలయందును, మిథునకర్మములందును వ్యవహరించుచు పరమానందము నందుచుండిరి.
ప్రభవద్భిః పురా దాయా నర్హేభ్యః ప్రతిపాదితాన్,
నాభ్యవర్తన్త నాస్తిక్యా ద్వర్తన్తః సంభవేష్వపి. 69
యోగ్యులకు తమ పూర్వులు దానము చేసిన వానియందు తాము స్వాములై నాస్తికభావముతో వాని ననుభవించుచు వారికి తిరిగి యీయకుండిరి.
మిత్రేణాభ్యర్థితం మిత్ర మర్థసంశయితే క్వచిత్,
బాలకోట్యగ్రమాత్రేణ స్వార్థేనాఘ్నత తద్వసు. 70
వెంట్రుకముక్కకొన అంత స్వార్థము ఉన్నను ధనవిషయమున వివాదము కలిగినపుడు మిత్రుడు ప్రార్థింపగా చేయుదునని చెప్పి మిత్రుని ఆధనమును మ్రింగివైచును.
పరస్వాదానరుచయో విపణవ్యవహారిణః. 71
జనులందరు పరులపొమ్మునందు రుచికలవారైరి. వ్యాపారమే సర్వవ్యవహారముగా మారెను.
అదృశ్య న్తార్యవర్ణేషు శూద్రా శ్చాపి తపోధనాః
అధీయన్తేఽవ్రతాః కేచిద్వృథా వ్రత మథాపరే. 72
ఆర్యవర్ణములయందు శూద్రులు తపోధనులై కన్పట్టిరి. కొందరు ఏ నిష్ఠయు లేక అధ్యయనము చేయుదురు. ఇతరులు వ్యర్థముగా వ్రతము లాచరింతురు.
అశుశ్రూషు ర్గురోః శిష్యః కశ్చి చ్ఛిష్యసఖో గురుః,
పితా చైవ జనిత్రీ చ శ్రాన్తౌ వృత్తోత్సవా వివ.
అప్రభుత్వే స్థితౌ వృద్ధా వన్నం ప్రార్థయతః సుతావ్. 73
శిష్యుడు గురువునకు శుశ్రూష చేయుశీలము లేనివాడయ్యెను. ఒక గురువునకు శిష్యుడే పఖుడు. తల్లియు తండ్రియు పండుగలు పబ్బములు లేని వారివలె అలసతతో అలమటించిరి. కొడుకులను అన్నముకొరకు దేబెరించుచు వృద్ధులు సమర్థత లేనివారైరి.
తత్ర వేదవిదః ప్రాజ్ఞా గాంభీర్యే సాగరోపమాః,
కృష్యాది ష్వభవన్ సక్తా మూర్ఖాః శ్రాద్ధా న్యభుఞ్జత. 74
అందు వేదవేత్తలు, ప్రజ్ఞాధురంధరులు, గాంభీర్యమున సాగరముతో పోలిన వారు నగు విద్వాంసులు మూర్ఖులై పొలము దున్నుకొనుట మొదలగువానియందు తగులము కలవారును, శ్రాద్ధపుకూడు తినువారునై యుండిరి.
ప్రాతః ప్రాతశ్చ సుప్రశ్నం కల్పనం ప్రేషణక్రియాః,
శిష్యా న ప్రహితా స్తేషా మకుర్వన్ గురవః స్వయమ్. 75
ఉదయకాలములందెల్ల చక్కని ప్రశ్నమును, ఊహను చెప్పిన పనులను చేయని శిష్యులను తీర్చిదిద్దక గురువులు తమంతతామే వారి పనులను కూడ చేయుచుండిరి.
శ్వశ్రూశ్వశురయో రగ్రే వధూః ప్రేష్య నశాసత,
అన్వశాసచ్చ భర్తారం సమాహ్వా యాభిజల్పతి. 76
అత్తమామల యెదుట కోడలు పనివాండ్రపై పెత్తనము చేయుచుండెను. పెనిమిటిని పిలిచి పెద్దగా వాగుచు పెండ్లము శాసింపదొడగెను.
ప్రయత్నే నాపి చారక్ష చ్చిత్తం పుత్రస్య వై పితా,
వ్యభజచ్చాపి సంరంభా దుఃఖవాసం తథాఽవసత్. 77
తండ్రి ఎంత ప్రయత్నించియు కొడుకు మనస్సు నదుపు చేయలేకుండెను. ఆతని పొగరుబోతుతనమువలన ఆస్తులను పంపకము చేసి తాను దుఃఖవాసము చేయుచుండెను.
అగ్నిదాహేన చోరై ర్వా రాజభి ర్వా హృతం ధనమ్,
దృష్ట్వా ద్వేషా త్ప్రాహసన్త సుహృత్సంభావితా హ్యపి. 78
కొంపలంటుకొనుటచేతనో, దొంగలచేతనో, రాజులచేతనో ధనము నాశన మగుచుండెను. మిత్రములు, మునుపు తనవలన మన్నన పొందినవారును అది చూచి ద్వేషమువలన పకపక నవ్వ దొడగిరి.
కృతఘ్నా నాస్తికాః పాపా గురుదారాభిమర్శినః,
అభక్ష్యభక్షణ రతా నిర్మర్యాదా హతత్విషః. 79
వారందరు కృతఘ్నులు, నాస్తికులు, పాపులు, గురువుల భార్యలను చెఱచు వారు, తినరానివానిని తినుటయందు వేడుక కలవారు, మర్యాదలేనివారు, మొగమున కళయు కాంతియు లేనివారు నైరి.
తేష్వేవ మాదీ నాచారా నాచరత్సు విపర్యయే,
నాహం దేవేన్ద్ర వత్స్యామి దానవేష్వితి మే మతిః. 80
తన్మాం స్వయ మనుప్రాప్తా మభినన్ద శచీపతే. 81
ఇట్లు పాడుకాలము దాపురింపగా వారందరు ఇట్టి ఆచారములను చేయు చుండగా, దేవేంద్రా! నేను ఆ దానవుల కడనుండరాదను బుద్ధి పొడమినది. ఇట్లు స్వయముగా వచ్చిన నన్ను నీవు ఆదరింపుము.
త్వయార్చితాం మాం దేవేశ పురోధాస్యన్తి దేవతాః,
యత్రాహం తత్ర మత్కాన్తా మద్విశిష్టా మదర్పణాః. 82
సప్తదేవ్యో జయాష్టమ్యో వాస మేష్యన్తి తేఽష్టధా.
నీవు నన్నర్చింపగా దేవేశా! దేవతలందరు నన్ను గౌరవింతురు. నాకు ప్రియమైనవారు, నాతో కూడియుండువారు, నాకు సర్వము నర్పించినవారు నగు ఏడుగురు దేవులు జయ ఎనిమిదవదిగా కలవారు ఎనిమిది విధములుగా నే నెందుందునో అందే యుండువారై నీకడ వాసము చేసెదరు.
ఆశా శ్రద్ధా ధృతిః క్షాన్తి ర్విజితి స్సన్నతిః క్షమా.
అష్టమీ వృత్తి రేతాసాం పురోగా పాకశాసన! 83
ఆశ, శ్రద్ధ, ధృతి, క్షాన్తి, విజితి, సన్నతి, క్షమ, మరియు ఈఆన్నింటికి ముందుండునదియగు వృత్తి ఎనిమిదవది.
తా శ్చాహం చాసురాం స్త్యక్త్వా యుష్మద్విషయ మాగతాః,
త్రిదశేషు నివత్స్యామో ధర్మనిష్ఠాన్తరాత్మసు. 84
వారును నేనును ఆ అసురులను వదలివైచి మీదేశమునకు వచ్చితిమి. ధర్మమున నిష్ఠగల అంతరాత్మ కలవారగు దేవతలయందు నివసించెదము.
ఇత్యుక్తవచనాం దేవీం ప్రీత్యర్థం చ ననన్దతుః,
నారదశ్చాత్ర దేవర్షి ర్వృత్రహన్తా చ వాసవః. 85
ఇట్లు పలికిన ఆదేవిని దేవర్షియగు నారదుడును, వృత్రుని చంపిన వాసవుడును ప్రీతిపూర్వకముగా అభినందించిరి.
తతోఽనలసఖో వాయుః ప్రవవౌ దేవవర్త్మసు,
ఇష్టగన్ధః సుఖస్పర్శః సర్వేంద్రియ సుఖావహః. 86
అంత అగ్నిసఖుడగు వాయువు కమ్మనివాసనలతో, సుఖమైన స్పర్శతో సర్వేంద్రియములకును సుఖము కలిగించునదియై దేవతల వీధులందు వీవదొడగెను.
శుచౌ వాభ్యర్థితే దేశే త్రిదశాః ప్రాయశః స్థితాః.87
లక్ష్మీసహిత మాసీనం మఘవన్తం దిదృక్షవః.88
లక్ష్మితోపాటు కూర్చున్న దేవేంద్రుని చూచుకోరిక కలవారై దేవతలందరు పవిత్రము, కోరదగినది యగు తావున నుండిరి.
తతో దివం ప్రాప్య సహస్రలోచనః,
స్త్రియోపపన్నః సుహృదా మహర్షిణా,
రథేన హర్యశ్వయుజా సురర్షభః
సదఃసురాణా మభిసత్కృతో యయౌ. 89
అంత వేయికనులదేవర ఆ కాంతతోపాటు మహర్షియగు నారదునితో కూడినవాడై పచ్చని గుఱ్ఱములు పూన్చిన రథముతో, మన్ననల నందుకొనుచు దేవసభకు చేరుకొనెను.
అథేఙ్గితం వజ్రధరస్య నారదః
శ్రియశ్చ దేవ్యా మనసా విచారయన్
శ్రియై శశంసామరదృష్ట పౌరుషః
శివేన తత్రాగమనం మహర్షిభిః 90
అంత దేవతలు కనుగొనుచున్న పౌరుషముగల ఇంద్రుని ఇంగితమును లక్ష్మీదేవి అభిప్రాయమును మనస్సుతో చక్కగా భావించువాడై నారదుడు శుభమగు పలుకుతో లక్ష్మీదేవి అచటిరాకను మహర్షులతోపాటుగా అందరకు తెలియజేసెను.
తతోఽమృతం ద్యౌః ప్రవవర్ష భాస్వతీ
పితామహ స్యాయతనే స్వయంభువః,
అనాహతా దుందుభయోఽథ నేదిరే
తథా ప్రసన్నాశ్చ దిశ శ్చకాశిరే. 91
అంత గొప్పగా వెలిగి పోవుచున్న ఆకాశము పితామహుడు, స్వయంభువు నగు బ్రహ్మలోకమున అమృతమును కురిసెను. దుందుభులు తమంతతామే మ్రోగినవి. అట్లే దిక్కులును ప్రసన్నములై ప్రకాశించెను.
యథర్తు సస్యేషు వవర్ష వాసవో
న ధర్మమార్గా ద్విచచాల కశ్చన,
అనేకరత్నాకరభూషణా చ భూః
సుఘోషఘోషా భువనౌకసాం జయే. 92
ఇంద్రుడు ఋతువుల ననుసరించి పంటలు పండుటకై వర్షమును ప్రసాదించెను. ఒక్కడును ధర్మమార్గమునుండి కదలకుండెను. భూమియు పెక్కు సముద్రములే భూషణములుగా కలదియై భూలోకవాసుల జయమునందు చెవికింన ఘోషలు కలది యాయెను.
క్రియాభిరామా మనుజా మనస్వినో
బభుః శుభే పుణ్యకృతాం పథి స్థితాః,
నరామరాః కిన్నర యక్షరాక్షసాః
సమృద్ధిమన్తః సుమనస్వినోఽభవన్. 93
మనుజులందరు పనిపాటలలో ఆనందమందువారు, బుద్ధిమంతులునై పుణ్యము నాచరించువారి శుభమార్గమున నిలిచి ప్రకాశించిరి. నరులు, అమరులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు సర్వసంపదలతో, చక్కని బుద్ధివిశేషములతో ఆలరారిరి.
న జాత్వకాలే కుసుమం కుతః ఫలం
పపాత వృక్షా త్పవనేరితా దపి,
రసప్రదాః కామదుఘాశ్చ ధేనవో
న దారుణా వాగ్విచచార కస్యచిత్. 94
గాలి ఎంతగా వీచినను చెట్టునుండి అకాలమున పూవు కూడ రాలేదు. ఇక పండుమాట చెప్పనేల? ఆవులు కోరిన వానినెల్ల నొసగుచు సమృద్ధిగా పాల నొసగిన వాయెను. ఒక్కని నోటినుండియు దారుణమగుమాట వెలువడలేదు.
ఇమాం సపర్యం సహ సర్వకామదైః
శ్రియాశ్చ శక్ర ప్రముఖైశ్చ దైవతైః,
పఠన్తి యే విప్రసదః సమాగతః
సమృద్ధకామాః శ్రియ మాప్నువన్తి తే. 95
సర్వకామములను ప్రసాదించు దేవేంద్రుడు మొదలగు దేవతలతో లక్ష్మీదేవి కైన యీ కలయికను విప్రుల సభలలో పఠించువారు సమృద్ధకాములై సంపదలను పొందుదురు.
త్వయా కురూణాం వర యత్ప్రచోదితం
భవాభవస్యేహ పరం నిదర్శనమ్,
తదద్య సర్వం పరికీర్తితం మయా
పరీక్ష్య తత్త్వం పరిగన్తు మర్హసి. 96
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
శ్రీవాసవసంవాదో నామ అష్టావింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
కురువరా! నీవు కలిమి, లేమి అనువానిని గూర్చి నన్నడిగినదాని సర్వమును నీకు ఇపుడు నిరూపించి చెప్పితిని. దానిని చక్కగా పరీక్షించి తత్త్వమును హృదయమునకు పట్టించుకొనుము.
ఇది శ్రీమహా భారతము శాంతిపర్వమున మోక్ష ధర్మ పర్వమున
శ్రీవాసవ సంవాదమను రెండువందల యిరువది యెనిమిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.
కిం శీలః కిం సమాచారః కిం విద్యః కిం పరాక్రమః,
ప్రాప్నోతి బ్రహ్మణః స్థానం యత్పరం ప్రకృతే ర్ధ్రువమ్. 1
ఎట్టిశీలము కలవాడు, ఎట్టి చక్కని ఆచారము కలవాడు, ఏ విద్యలార్జించిన వాడు, ఎట్టి పరాక్రమము కలవాడు ప్రకృతి కతీతము, ధ్రువమునగు బ్రహ్మము స్థానమును పొందును?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః,
ప్రాప్నోతి బ్రహ్మణః స్థానం తత్పరం ప్రకృతే ర్ధ్రువమ్. 2
మోక్షధర్మములయందు కట్టుబడి యున్నవాడు, తక్కువగా భుజించువాడు, ఇంద్రియముల పై అదుపు కలవాడు నగు నరుడు ప్రకృతికి పరము, ధ్రువమునయిన బ్రహ్మము పదవిని పొందును.
అత్రా ప్యుదాహర న్తీమ మితిహాసం పురాతనమ్,
జైగీషవ్యస్య సంవాద మసితస్య చ భారత. 3
ఈవిషయమునందును అసితజైగీషవ్యుల సంవాదమైన ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుకొనుచుందురు.
జైగీషవ్యం మహాప్రాజ్ఞం ధర్మాణా మాగతాగమమ్,
అక్రుధ్యన్త మహృష్యన్త మసితో దేవలోఽబ్రవీత్, 4
గొప్ప ప్రజ్ఞకలవాడు ధర్మముల జ్ఞానమును చక్కగా పొందినవాడు, క్రోధము నెఱుగనివాడు, దేనికిని పొంగిపోవనివాడు నగు జైగీషవ్యునితో అసితుడైన దేవలు డిట్లు పలికెను.
దేవల ఉవాచ - దేవలు డిట్లు పలికెను.
న ప్రీయసే వన్ద్యమానో నిన్ద్యమానో న కుప్యసే,
కా తే ప్రజ్ఞా కుత శ్చైషా కింతే తస్యాః పరాయణమ్. 5
వందనము చేయగా ప్రీతినొందవు. నిందింపగా కోపింపవు. ఇట్టి నీ ప్రజ్ఞ ఎట్టిది? ఎందుండి ఏర్పడినది? దాని పరమగతి ఎట్టిది?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.
ఇతి తేనానుయుక్తః స తమువాచ మహాతపాః,
మహ ద్వాక్య మసందిగ్ధం పుష్కలార్థపదం శుచి, 6
ఇట్లాతడు మన్ననతో నడుగగా మహాతపస్సు గల ఆత డాతనితో సందేహములు లేనిది, నిండైన గొప్ప అర్థములు గలపదములు కలది, పవిత్రమైనది, గొప్పదియగు వాక్యము నిట్లు పలికెను.
జైగీషవ్య ఉవాచ - జైగీషవ్యు డిట్లనెను.
యా గతి ర్యా పరా కాష్ఠా యా శాన్తిః పుణ్యకర్మణామ్,
తాం తేఽహం సంప్రవక్ష్యామి మహతీ మృషిసత్తమ. 7
ఓ మునిసత్తమా! ఏదిగతియో, ఏది చిట్టచివరి గమ్యమో, పుణ్యకర్మములకు ఏది శాంతియో, అట్టి గొప్ప ప్రజ్ఞను గూర్చి నీకు చక్కగా తెలియబలుకుదును.
నిన్దత్సు చ సమా నిత్యం ప్రశంసత్సు చ దేవల,
నిహ్నవన్తి చ యే తేషాం సమయం సుకృతం చ యత్. 8
ఇతరులు నిందించుచుండగాను, కొనియాడుచుండగాను ఒకేతీరున నుండు వారు, తమసమయమును సుకార్యమును అన్నింటిని వెలుపలికి తెలియ రాకుండ దాచియుంచువారును మహాత్ములు.
ఉక్తాశ్చ న వదిష్యన్తి వక్తార మహితే హితమ్,
ప్రతిహన్తుం న చేచ్ఛన్తి హన్తారం వై మనీషిణః. 9
ఇతరు లేమి పలికినను మరల నిందింపరు. అహితుని యందును హితమునే
చేయుదురు. దెబ్బతీసిన వానిని తిరిగి దెబ్బకొట్టుటకు ఇష్టపడరు.
నా ప్రాప్త మనుశోచన్తి ప్రాప్తకాలాని కుర్వతే,
న చాతీతాని శోచన్తి న చైవ ప్రతిజానతే. 10
లభించనిదానినిగూర్చి దుఃఖింపరు. కాలమునకు లభించినవానిని మాత్రమే చేయుదురు. కడచిపోయిన వానినిగూర్చి బాధపడరు. వానిని మనసునందును తలపకుందురు.
సంప్రాప్తాయాం చ పూజాయాం కామా దర్థేషు దేవల,
యథోపపత్తిం కుర్వన్తి శక్తిమన్తః కృతవ్రతాః. 11
ఆయాపనులయందు ప్రయత్నము లేకయే ఏదైన మన్నన కలిగినచో శక్తియున్నంతవరకు, మిక్కిలి నిష్ఠకలవారై దాని కనుగుణముగా ప్రవర్తింతురు.
పక్వవిద్యా మహాప్రాజ్ఞా జితక్రోధా జితేన్ద్రియాః,
మనసా కర్మణా వాచా నాపరాధ్యన్తి కర్హిచిత్. 12
విద్యల పాకమును సాధించువారు, గొప్పప్రజ్ఞ కలవారు, క్రోధమును గెలిచినవారు, ఇంద్రియములపై పట్టుగలవారు నై మనసుతో, చేష్టతో, మాటతో ఎన్నడును ఎవ్వరికిని అపరాధము చేయకుందురు.
అనీర్షవో న చాన్యోన్యం విహింసన్తి కదాచన,
న చ జాతూపతప్యన్తే ధీరాః పరసమృద్ధిభిః. 13
ఈర్ష్యపడకుందురు. ఎన్నటికిని ఒకరినొకరు హింసించుకొనరు. ధీరులు కనుక ఇతరుల సంపదలను చూచి మనస్సులలో ఎన్నటికిని కుళ్లుకొనరు.
నిన్దాప్రశంసే చాత్యర్థం న వదన్తి పరస్య యే,
న చ నిన్దాప్రశంసాభ్యాం విక్రియన్తే కదాచన. 14
పరుని నిందాప్రశంసలను గూర్చి పెద్దగా చెప్పుకొనరు. ఆనిందాప్రశంసలకు ఎన్నడును వికారము పొందరు.
సర్వతశ్చ ప్రశాన్తా యే సర్వభూతహితే రతాః,
న క్రుధ్యన్తి న హృష్యన్తి నా పరాధ్యన్తి కర్హిచిత్. 15
అన్ని పరిస్థితులయందును ప్రశాంతులై యుందురు. సర్వభూతములకు మేలుచేయుటయే వారికి ప్రీతికరమైన విషయము. కోపమును దరికి రానీయరు. పొంగిపోరు. ఎన్నడును ఇతరులకు ద్రోహము చేయరు.
విముచ్య హృదయగ్రన్థిం చంక్రమన్తి యథాసుఖమ్,
న యేషాం బాన్ధవాః సన్తి యే చాన్యేషాం న బాన్ధవాః. 16
హృదయమునందలి సందేహపు ముడిని వదలించి వైచికొని సుఖముగా బ్రహ్మపదార్థము వైపు గంతులిడుచు ప్రవర్తింతురు. వారెవరికి బంధువులు కారు. వారి కెవరును బంధువులు కారు.
అమిత్రాశ్చ న సన్త్యేషాం యే చామిత్రా న కస్యచిత్,
య ఏవం కుర్వతే మర్త్యాః సుఖం జీవన్తి సర్వదా. 17
వారికి పగవారు లేరు. వారెవ్వరికిని పగవారు కారు. ఈవిధముగా మెలగునరులు సర్వకాలములలో సుఖముగా జీవింతురు.
యే ధర్మం చానురుధ్యన్తే ధర్మజ్ఞా ద్విజసత్తమ,
యే హ్యతో విచ్యుతా మార్గా త్తే హృష్య న్త్యుద్విజన్తి చ. 18
ధర్మమార్గము నెవ్వరు అనుసరింతురో, ద్విజోత్తమా! వారు ధర్మజ్ఞులు. ఆ మార్గమునుండి భ్రష్టులైనవారు పొంగిపోవుదురు. కలవరపడుచుందురు.
ఆస్థిత స్తమహం మార్గ మసూయిష్యామి కం కథమ్,
నిన్ద్యమానః ప్రశస్తో వా హృష్యేఽహం కేన హేతునా?. 19
అట్టిమార్గమున గట్టిగా నిలిచియున్న నేను ఎవ్వరేని నిందించినచో ఎట్లు అసూయ పొందుదును? నన్నితరులు ప్రశంసించినచో ఏ కారణముచే హర్షము పొందెదను?
యద్య దిచ్ఛన్తి తత్తస్మా దపి గచ్ఛన్తు మానవాః,
న మే విన్దా ప్రశంసాభ్యాం హ్రాసవృద్ధీ భవిష్యతః. 20
మానవులు దేనిని దేనివలన కోరుదురో దానివలననే పొందుదురుగాక! నిందాప్రశంసలతో నాకు మాత్రము ఎన్నడు తరుగుదలయు, పెరుగుదలయు కలుగవు.
అమృతస్యేవ సంతృప్యే దవమానస్య తత్త్వవిత్,
విషస్యే వోద్విజ న్నిత్యం సంమానస్య విచక్షణః. 21
తత్త్వమెరిగినవాడు అవమానమువలన - అమృతము వలనవలె - సంతృప్తి నందవలయును. వివేకము కలవాడు సంమానమువలన - విషము వలనవలె - ఉద్వేగము పొందవలయును.
అవజ్ఞాతః సుఖం శేతే ఇహ చాముత్ర చాభయమ్,
విముక్తః సర్వదోషేభ్యో యోఽవమన్తా స బుధ్యతే. 22
అవమానము పొందినవాడు అన్ని దోషములనుండియు విడుదల పొందినవాడై ఈ లోకమునందును, పరలోకమునందును ఎట్టి భయము లేక సుఖముగా నిద్రించును, అవమానము చేయువానికి నిద్ర పట్టదు.
పరాం గతిం చ యే కేచిత్ ప్రార్థయన్తి మనీషిణః,
ఏతద్ర్వతం సమాహృత్య సుఖ మేధన్తి తే జనాః. 23
వివేకబుద్ధికలవారై పరమగతిని కోరుకొనెడి జనులు ఈ వ్రతమును చక్కగా ఆచరించి సుఖమును పెంచుకొందురు.
సర్వతశ్చ సమాహృత్య క్రతూన్ సర్వాన్ జితేన్ద్రియః,
ప్రాప్నోతి బ్రహ్మణః స్థానం యత్పరం ప్రకృతే ర్ద్రువమ్. 24
ఇంద్రియములను నిండుగా గెలిచినవాడు, అన్నిక్రతువులను చక్కగా సాధించి, ప్రకృతి కావలనుండునది, ధ్రువమైనది అగు బ్రహ్మముపదమును అందుకొనును.
నాస్యదే వా న గన్ధర్వా న పిశాచా న రాక్షసాః,
పద మన్వవరోహన్తి ప్రాప్తస్య పరమాం గతిమ్. 25
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
జైగీషవ్యాసితసంవాదే ఊనత్రింశదధికద్విశతతమోఽధ్యాయః
ఇట్టి పరమగతిని పొందినవాని మార్గమును, దేవతలు గాని, గంధర్వులు గాని, పిశాచులుగాని, రాక్షసులుగాని చేరుకొనజాలరు.
ఇది శ్రీమహాభారతము, శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమున
జైగీషవ్యాసిత సంవాదము గల రెండువందల యిరువది తొమ్మిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.
ప్రియః సర్వస్య లోకస్య సర్వసత్త్వాభివన్దితా,
గుణైః సర్వై రుపేతశ్చ కోన్వస్తి భువి మానవః. 1
సర్వలోకమునకు ప్రియుడు, సర్వప్రాణుల అభినందనలను పొందువాడు, అన్ని సద్గుణములతో కూడినవాడును అగు నరుడు. ఈ భువియం దెవ్వడైన గలడా?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
అత్ర తే వర్తయిష్యామి పృచ్ఛతో భరతర్షభ,
ఉగ్రసేనస్య సంవాదం నారదే కేశవస్య చ. 2
నాయనా! భరతశ్రేష్ఠా! అడిగెడు నీకు ఈ విషయమున నొక ఇతిహాసమును చెప్పెదను. అది నారదవిషయమున ఉగ్రసేనునకు కేశవునకు అయిన సంవాదము.
ఉగ్రసేన ఉవాచ - ఉగ్రసేను డిట్లు పలికెను.
యస్య సంకల్పతే లోకో నారదస్య ప్రకీర్తనే,
మన్యే స గుణసంపన్నో బ్రూహి తన్మమ పృచ్ఛతః. 3
లోకమంతయు నారదుని కొనియాడుటయందు సంకల్పము కలది యగును. కావున ఆతడు గుణసంపన్నుడని నేను తలంతును. దానిని గూర్చి నాకు తెలియజెప్పుము.
వాసుదేవ ఉవాచ - వాసుదేవు డిట్లు చెప్పెను.
కుకురాధిప యా న్మన్యే శృణు తాన్మే వివక్షతః,
నారదస్య గుణాన్ సాధూన్ సంక్షేపేణ నరాధిప. 4
కుకురాధిపా! రాజా! నేను చెప్పుచున్నాను. వినుము. నేను భావించెడు నారదుని మంచి గుణముల నన్నింటిని సంక్షేపముగా చెప్పెదను.
న చారిత్రనిమిత్తోఽస్యా హంకారో దేహతాపనః,
అభిన్నశ్రుతచారిత్ర స్తస్మా త్సర్వత్ర పూజితః. 5
నడవడి నిమిత్తముగా గల, దేహమును మంటబెట్టెడు అహంకార మతనిలో ఏ మాత్రమును లేదు. పాండిత్యమునందు గాని నడవడియందుగాని హెచ్చుతగ్గు లతనిలో కానరావు. అందువలన నతడు అన్నియెడలను మన్నన పొందిన వాడాయెను.
అరతిక్రోధచాపల్యే భయం నైతాని నారదే,
అదీర్ఘసూత్రః శూరశ్చ తస్మాత్సర్వత్ర పూజితః. 6
దీనత, క్రోధము, చపలత, భయము అనునవి నారదునియందు మందునకైనను లేవు. ఆతడు దీర్ఘసూత్రుడు కాడు. శూరుడు. అందువలన నతని నందరు, అన్ని యెడల పూజింతురు. (దీర్ఘసూత్రత - ఎంతకు తెగని ఆలోచన; శూరః - బుద్ధితో కార్యములవైపునకు చొచ్చుకొని పోవులక్షణము)
ఉపాస్యో నారదో బాఢం వాచి నాస్య వ్యతిక్రమః,
కామతో యది వా లోభా త్తస్మా త్సర్వత్ర పూజితః. 7
నారదుడు అందరికి ఉపాసింపదగినవాడు. కామమువలనగాని, లోభము వలనగాని అతనిమాటయందు వ్యతిక్రమము ఉండదు (వ్యతిక్రమము - మార్పు). అందువలన అన్నియెడల నతడు పూజ్యుడు.
అధ్యాత్మవిధి తత్త్వజ్ఞః క్షాన్తః శక్తో జితేన్ద్రియః,
ఋజుశ్చ సత్యవాదీ చ తస్మా త్సర్వత్ర పూజితః. 8
అధ్యాత్మ విధుల తత్త్వమును చక్కగా ఎరిగినవాడు, క్షమకలవాడు. సమర్థుడు, ఇంద్రియములను గెలిచినవాడు, ఋజుస్వభావము కలవాడు, సత్యమునే పలుకువాడు. అందువలన అన్ని యెడల మన్నన కలవాడాయెను.
తేజసా యశసా బుద్ధ్యా జ్ఞానేన వినయేన చ,
జన్మనా తపసా వృద్ధ స్తస్మాత్సర్వత్ర పూజితః. 9
తేజస్సు, యశస్సు, బుద్ధి, జ్ఞానము, వినయము, పుట్టుక, తపస్సు - ఈ అన్నింటిచేతను అతడు వృద్ధుడు. అందువలన అన్ని యెడలను పూజితుడు.
సుశీలః సుఖసంవేశః సుభోజః స్వాదరః శుచిః,
సువాక్య శ్చాప్యనీర్ష్యశ్చ తస్మాత్సర్వత్ర పూజితః. 10
మంచిశీలము, సుఖమైన నివాసము, చక్కనిభోజనము, మంచి ఆదరము, పవిత్రత, మేలైనపలుకు, ఈర్ష్య లేకుండుట అను గుణములు కలవాడు. అందువలన అన్ని యెడల అర్చనల నందుకొన్నవాడాయెను.
కల్యాణం కురుతే బాఢం పాప మస్మి న్న విద్యతే,
న ప్రీయతే పరానర్థై స్తస్మా త్సర్వత్ర పూజితః. 11
ఎల్లప్పుడు మంగళమగు పనినే చేయును. అతనిలో పాపమనునది ఏమాత్రమును లేదు. పరులకు అనర్థములు కలిగినచో ప్రీతి నందడు. అందువలన అన్ని యెడల పూజ్యుడు.
వేదశ్రుతిభి రాఖ్యానై రర్థా నభిజిగీషతి,
తితిక్షు రనవజ్ఞాత స్త స్మా త్సర్వత్ర పూజితః. 12
వేదములందలి చక్కని విషయములతో, కథలతో సర్వప్రయోజనములను సాధింపగోరును. ( విషయములను మొత్తముగా గెలువగోరును). తితిక్ష కలవాడు. ఎవ్వరిని అవమానింపడు. అందువలన అన్నియెడల పూజ లందుకొనును.
సమత్వాచ్ఛ ప్రియో నాస్తి నాప్రియశ్చ కథఞ్చన,
మనోఽనుకూలవాదీ చ తస్మాత్సర్వత్ర పూజితః. 13
అందరియెడల సమభావము కలవాడగుటవలన అతనికి ప్రియుడుగాని, ఆప్రియుడు గాని ఎన్నడు కలుగడు. ఆవలివారి మనస్సునకు అనుకూలముగా మాటాడుచుండును. అందువలన అత డన్ని సమయములలో గౌరవమందువాడు.
బహుశ్రుత శ్చిత్రకథః పణ్డితోఽలాలసోఽశఠః,
అదీనోఽక్రోధనోఽలుబ్ధ స్తస్మాత్సర్వత్ర పూజితః. 14
పెక్కుశాస్త్రములు ఎరిగినవాడు, ఆకర్షణగల పలుకులు కలవాడు, పండితుడు, దేనియందును దేబెరింపుతనము లేనివాడు, వంచన యెందును లేనివాడు. దీనుడు కాడు, క్రోధములేనివాడు, పిసినిగొట్టుతనము లేనివాడు. అందువలన అంతట ఆరాధ్యుడు.
నార్థే ధనే వా కామే వా భూతపూర్వోఽస్య విగ్రహః,
దోషా శ్చాస్య సముచ్ఛిన్నా స్తస్మా త్సర్వత్ర పూజితః. 15
ప్రయోజనము, ధనము, కామము అనునవి నిమిత్తముగా అతనికి ఎవ్వరితోడను విరోధము కలుగలేదు. దోషములన్నియు అతనియందు ఆదృశ్యములు. అందువలన అన్నియెడల పూజితుడు.
దృఢభక్తి రనిన్ద్యాత్మా శ్రుతవా ననృశంసవాన్,
వీతసంమోహదోషశ్చ తస్మాత్సర్వత్ర పూజితః. 16
దృఢమైన భక్తి కలవాడు, నిందింపరాని బుద్ధి కలవాడు, చక్కని పాండిత్యము, హృదయమార్దవము కలవాడు. సంమోహమనెడు దోషము తొలగిపోయినవాడు. అందువలన అన్నియెడల మాన్యుడు.
అసక్తః సర్వసంగేషు సక్తాత్మేవ చ లక్ష్యతే,
అదీర్ఘసంశయో వాగ్మీ తస్మాత్సర్వత్ర పూజితః. 17
అన్ని తగులములయందును అంటు సొంటులు లేనివాడయ్యు కలవానివలె కన్పట్టును. దీర్ఘమగు సంశయ మెన్నడు కలుగనివాడు. చెవుల కింపుగా మాటాడుశక్తి కలవాడు. అందువలన అన్ని యెడల పూజితుడు.
సమాధి ర్నాస్య కామార్థే నాత్మానం స్తౌతి కర్హిచిత్,
అనీర్షు ర్మృదుసంవాద స్తస్మాత్సర్వత్ర పూజితః. 18
కామవిషయమున చింతనలేనివాడు. ఎన్నడును తన్నుదాను పొగడుకొననివాడు. ఈర్ష్యలేనివాడు. మెత్తని పలుకులు కలవాడు. అందువలన అందరి మన్నన లందు కొన్నవాడు.
లోకస్య వివిధం చిత్తం ప్రేక్షతే చాప్యకుత్సయన్,
సంసర్గవిద్యాకుశల స్తస్మాత్సర్వత్ర పూజితః. 19
లోకమునందలి భిన్నభిన్నములగు మనఃప్రవృత్తులను ఏవగింపక చూచుచుండును. సృష్టివిద్య నెరుగుటలో నేర్పుకలవాడు. అందువలన అన్నియెడల మాన్యుడు.
నాసూయత్యాగమం కఞ్చి త్స్వనయే నోపజీవతి,
అవన్ధ్యకాలో వశ్యాత్మా తస్మాత్సర్వత్ర పూజితః. 20
ఏశాస్త్రమును తప్పుపట్టడు. తననీతితో తాను బ్రదుకుచుండును. కాలము నెన్నడు వృథ చేయడు. అందువలన అందరకు పూజ్యుడు.
కృతశ్రమః కృతప్రజ్ఞో న చ తృప్తః సమాధితః,
నిత్యయుక్తోఽప్రమత్తశ్చ తస్మాత్సర్వత్ర పూజితః. 21
కార్యసాధనకై పరిశ్రమించును. ప్రజ్ఞను పండించుకొనెను. బుద్ధి నిశ్చలత విషయమున ఇంక చాలు ననుకొనడు. ఎల్లప్పుడు మెలకువతో నుండును. పొరపాటు పడడు. అందువలన అన్నియెడల మన్నన నందెను.
నాపత్రపశ్చ యుక్తశ్చ నియుక్తః శ్రేయసే పరైః,
అభేత్తా పరగుహ్యానాం తస్మాత్సర్వత్ర పూజితః. 22
ఎన్నడు సిగ్గుపడవలసిన స్థితి లేనివాడు. మనసుపెట్టి పనులు చేయును. ఇతరుల శ్రేయస్సునకై ఏర్పడినవాడు. పరులగుట్టులను రట్టుచేయనివాడు. అందువలన అన్నియెడల పూజితుడు.
న హృష్య త్యర్థలాభేషు నాలాభే తు వ్యథత్యపి,
స్థిరబుద్ధి రసక్తాత్మా తస్మాత్సర్వత్ర పూజితః. 23
అర్థములు లభింపగా పొంగిపోవడు. కలుగనియపుడు వ్యథచెందడు. స్థిరమైనబుద్ధియు, తగులములేని ఆత్మయు కలవాడు. అందువలన అన్నియెడల పూజలందుకొనువాడాయెను.
తం సర్వగుణ సంపన్నం దక్షం శుచి మనామయమ్,
కాలజ్ఞం చ ప్రియజ్ఞం చ కః ప్రియం న కరిష్యతి. 24
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి
వాసుదేవోగ్రసేనసంవాదే త్రింశాధికద్విశతతమోఽధ్యాయః
అట్టి సర్వగుణముల సంపదకలవాడు, సమర్థుడు, శుచి, ఏరోగమును లేనివాడు, కాలతత్త్వము నెరిగినవాడు, ప్రియము నెరిగినవాడు నగు ఆ మహానుభావుని ప్రియునిగా చేసికొనని వాడెవడుండును?
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మ పర్వమున
వాసుదేవ ఉగ్రసేన సంవాదము గల రెండువందల ముప్పదియవ అధ్యాయము.
221
అమృత ప్రాశ్నికము
(అమృత ముభుజించు తత్త్వము)
221
ద్వావింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
“న నిరోధో న చోత్పత్తి ర్న బద్ధో న చ సాధకః,
న ముముక్షు ర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా”
“విద్యాఽ విద్యేమమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్,
మోక్షబద్ధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే”
222
ఇంద్రప్రహ్లాదుల సంవాదము
222
త్రయోవింశత్యధిక శతతమోఽ ధ్యాయః
223
బలివాసవ సంవాదము
223
చతుర్వింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
224
బలివాసవ సంవాదము
224
225
“యత్రాహం త్వం జగత్తత్ర పూర్వమాగత్య తిష్ఠతి,
త్రసరేణూదరే పీన్ద్రః పశ్యతి స్మ జగత్త్రయమ్”
పఞ్చవింశత్యధిక ద్విశతతమోఽ ధ్యాయః
225
శ్రీసన్నిధానము*
షడ్వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
226
శక్ర నముచి సంవాదము
226
సప్తవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
227
బలి వాసవ సంవాదము
227
అష్టావింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః
228
శ్రీ వాసవ సంవాదము
228
ఊనత్రింశ దధిక ద్విశతతమోఽధ్యాయః
229
జైగీషవ్య, అసితసంవాదము
229
త్రింశదధిక ద్విశతతమోఽధ్యాయః
230
వాసుదేవ, ఉగ్రసేనుల
సంవాదము
230