బాలకాండము

Back
Book Balakandamu
Chapter No 5
Pages 1
Read Time 1 Minutes

బాలకాండము

ముందుమాట

అర్హసంస్కృతికి మూలకందమైన గ్రంథరాశిని టీకాతాత్పర్యవిశేషసహితంగా ప్రకటించాలనే ప్రధానోద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, మాన్యులైన శ్రీ పమిడిఘంటం కోదండరామయ్యగారి అధ్యక్షతను ఆర్ష విజ్ఞాన ట్రస్టు అనే పేరుతో ఒక ధర్మసంస్థ నెలకొల్పబడింది. “

శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని ఆబాలగోపాలానికి అందుబాటులో ఉండే భాషలో ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృతశాఖాధ్యక్షులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు సంతరించిన బాలానందినీ వ్యాఖ్యాసహితంగా ఈ సంస్థ తొలిప్రచురణగా వెలువరించాలని కూడా నిర్ణయమైనది.

మా సంకల్పాన్ని విన్నవించడమే తడవుగా పరదేవతాస్వరూపులు, కంచి కామ కోటి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులు తమ ఆశీస్సులు అనుగ్రహించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించారు. శ్రీవారి ఆశీఃఫలితమే ఆంధ్రమహాజనుల కరకమలాలకు ఆనందోత్సాహాలతో నేడు మేము అందజేస్తున్న ఈ వాల్మీకిరామాయణ బాలకాండము.

మా సంస్థలో సభ్యులుగా నున్న ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు మొదటి నుండియు ఈ సంస్థకు సర్వవిధములుగా తోడ్పడిరి. వారు దివంగతులగుట ఈ సంస్థకు తీరని లోటుగా భావిస్తున్నాము.

ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారును ఈ సంస్థలో సభ్యులే. ఈ గ్రంథ మింత సుందరముగా వెలువడుటకు వారి పర్యవేక్షణయే కారణము.

రామాయణం ప్రాచీన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే సర్వోత్తమ జాతీయకావ్యం. దేశకాలాలకూ, కులమతాలకూ అతీతంగా మానవులకు ఉత్తమ జీవనాన్ని ప్రదర్శించే ఆదర్శగ్రంథం. ఈనాడు కులమతవిచక్షణ లేకుండా భారత దేశంలోనే కాదు విదేశాలలో కూడా రామాయణం ఆసక్తితో పఠింపబడుతున్నది. ఆస్తికు లనేకుల కిది నిత్యపారాయణగ్రంథంగా విల సిల్లుతున్నది.

ప్రపంచ విఖ్యాత మేధావులు ఈ గ్రంథాన్ని గూర్చి వెలువరించిన అభిప్రాయాలు తెలిసికొనుట మన కర్తవ్యం. అందులో కొన్ని ఆంద్రీకృత అభిప్రాయాలు శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు వారి రామాయణ సుధాలహరిలో సేకరించినవే వారి సౌజన్యంతో మే మిందులో పొందుపరచాము.

ఈ గ్రంథముద్రణను గూర్చి తెలియగానే కొందరు అజ్ఞాతంగానే ఉంటూ, తమ పేర్లు వెల్లడిచేయకుండా మా సంస్థ ఎక్కౌంటులో డబ్బు జమచేసి పుణ్యం కట్టుకొన్నారు. వారికి మా సంస్థపక్షాన ధన్యవాదాలు తెలుపుకొనటం మా కర్తవ్యంగా భావిస్తున్నాము.

అచిరకాలంలోనే క్రమంగా తక్కిన రామాయణసంపుటాలు వెలువడగలవని మనవి చేస్తున్నాము. ఈ రామాయణాన్ని చదివిన వారందరికీ నైతిక విలు వలు పెంపొందగలవనీ, ఆ అధ్యయనంవల్ల ఆర్షవిజ్ఞానవైభవం కొరతపడకుండా తరతరాలుగా ఆచంద్రార్కం సముద్ధరించబడగలదని ఆశిస్తున్నాము.

నీలంరాజు వెంకట శేషయ్య