Chapter_1

Back
Book Balakandamu
Chapter No 7
Pages 47
Read Time 62 Minutes

Chapter_1

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

ప్రథమసర్గము

నారదుడు వాల్మీకికి సంక్షిప్తముగ రామాయణకథ చెప్పుట.

అవతరణిక: చతుర్ముఖాంశసంభూతుడును, సర్వజ్ఞుడును, అయిన వాల్మీకి మహాముని - యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః, స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’’ (మహాపురుషులు ఏది ఆచరింతురో ఇతరజనులు కూడ దానినే ఆచరింతురు. వారు దేనిని ప్రమాణముగ గ్రహింతురో దానినే లోకు లందరును ప్రమాణముగ గ్రహింతురు.) అను న్యాయమును అనుసరించి, లోకు లందరును గురువు నాశ్రయించి తాపత్రయవిముక్తి పొందెదరు గాక అను అభిప్రాయముతో, తాను పరమజ్ఞానియే యైనను నారదుని ఆశ్రయించి, తాపత్రయమును తొలగించునదియు, అత్యుత్తమలక్ష్యమును అగు బ్రహ్మస్వరూపమును తెలిసికొనెను. ఆ పరమరహస్యమును అందరికినీ తెలియునట్లు రామాయణ రూపమున ప్రచురింపదలచి అది నిర్విఘ్నముగ పరిసమాప్తి నొందుటకై మొదట మంగళాచరణము చేయుచున్నాడు. గురువు ఉపదేశించిన విషయమును స్మరించుచు గురుస్మరణము కూడ చేయుటయే ఇచట మంగళము.

మూ. తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్,

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్. 1

ప్ర. అ. తపస్వీ = తపస్సుగల, వాల్మీకిః = వాల్మీకిమహర్షి, తపః స్వాధ్యాయనిరతమ్ = తపస్సునందును వేదాధ్యయనమునందును ఆసక్తి కలవాడును, వాగ్విదాం = వాక్కు తెలిసినవారిలో, వరమ్ = శ్రేష్ఠుడును, ముని పుఙ్గవమ్ = మునులలో గొప్పవాడును అగు, నారదమ్ = నారదుని, పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను.

తాత్పర్యము: తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయనమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడును, మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను.

విశేషార్థములు: తపస్వీ. - కృచ్ఛ్రచాంద్రాయణాదివ్రతములను ఆచరించుచు నిత్యనైమిత్తిక కర్మలను అనుష్ఠించుటయే తపస్సు. అట్టి తపస్సు కలవాడు తపస్వి.

తపస్సు జ్ఞానసాధనమని వేదము చెప్పుచున్నది. అట్టి తపస్సే సాధనచతుష్టయసంపత్తి. అది కలవాడే వేదాంతశాస్త్రము చదువుటకు అధికారి. అందుచే తపస్వీ = అట్టి తపస్సుకలవారిలో ఉత్తముడని అర్థము.

తపఃస్వాధ్యాయనిరతమ్: ‘‘తపః’’ అనగా జ్ఞానము అని అర్థము. ‘‘స్వాధ్యాయః’’ అనగా వేదము. ఈ తపఃస్వాధ్యాయములందు మిక్కిలి ఆసక్తి కలవాడు. లేదా తపఃఅనగా బ్రహ్మమును ప్రతిపాదించునది. బ్రహ్మప్రతిపాదకములగు వేదములందు అనగా వేదాంతములందు ఆసక్తికలవాడు. లేదా తపఃఅనగా కృచ్ఛ్రచాంద్రాయణాదులను ఆచరించుచు నిత్యనైమిత్తికకర్మలను అనుష్ఠించుట. స్వాధ్యాయఃఅనగా అర్థజ్ఞానము కలుగువరకును వేదాధ్యయనము చేయుట. అట్టి తపః స్వాధ్యాయములందు ఆసక్తి కలవాడను అర్థము.

వాగ్విదామ్: వాక్ అనగా బ్రహ్మము. ‘‘బ్రహ్మను తెలిసికొనినవారిలో’’ లేదా, వాక్ అనగా శబ్దముల సాధుత్వమును బోధించు వ్యాకరణము. ఇది మిగిలిన ఐదు వేదాంగములకు ఉపలక్షణము. (ఉపలక్షణ మనగా చెప్పవలసిన వానిలో ఒక అంశమును మాత్రము చెప్పుట. దానిని బట్టి మిగిలిన వాటిని కూడ గ్రహించుకొనవలసి ఉండును). అందుచే వాగ్విదామ్అనగా ‘‘శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనెడి వేదాంగము లారును తెలిసినవారిలో’’ అని అర్థము. లేదా వాక్అనగా పద్దెనిమిది విద్యలు- (ఋగ్యజుస్సామాథర్వ వేదములు, శిక్షాదులైన ఆరు వేదాంగములు, మీమాంస, న్యాయవిస్తరము, ధర్మ శాస్త్రము, పురాణము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, అర్థశాస్త్రము అనునవి.) ఆ పద్దెనిమిది విద్యలు తెలిసినవారిలో.

మునిపుఙ్గవమ్: మునిఅనగా మననము చేయువాడు. అనగా బ్రహ్మానుసంధానము చేయువాడు. ‘‘మునులలో గొప్పవాడు.’’

వాల్మీకిః: వల్మీకమునుండి, అనగా పుట్టనుండి, పుట్టినవాడు. ‘‘అథాబ్రవీన్మహాతేజా బ్రహ్మా లోకపితామహః, వల్మీకప్రభవో యస్మాత్ తస్మాద్వాల్మీకి రిత్యసౌ’’ (‘‘ఈ ఋక్షుడు వల్మీకమునుండి పుట్టినాడు గాన వాల్మీకి’’ అని మహా తేజఃశాలియు, లోకము లన్నింటికి పితామహుడును అగు బ్రహ్మ చెప్పెను) అని బ్రహ్మ వైవర్తమునందు వాల్మీకిశబ్దార్థము చెప్పబడి యున్నది. ‘‘ఋక్షోఽభూద్భార్గవ స్తస్మా ద్వాల్మీకి ర్యోఽభిధీయతే’’ (అతనివలన, అనగా ప్రచేతసునివలన, వాల్మీకి అను ప్రసిద్ధుడైన భార్గవు డగు ఋక్షుడు పుట్టెను) అను విష్ణు పురాణవచనము వాల్మీకికే ఋక్షుడని మరియొక పేరు ఉన్నదనియు అతడు భృగువంశమునకు చెందిన ప్రచేతసుని కుమారుడనియు తెలుపుచున్నది. ‘‘చక్రే ప్రచేతసః పుత్రః’’ అను వచనము ఈవిషయమును బలపరుచు చున్నది. దీనివలన వాల్మీకి భృగువంశమునకు చెందిన ప్రచేతసుని కుమారుడనియు, ఇతని అసలు పేరు ఋక్షుడనియు, శిలవలె కదలక మెదలక తపస్సు చేయుచుండగా అతని చుట్టు వల్మీకము (పుట్ట) మొలవగా దాని మధ్య కూర్చుండి తపస్సు చేయుటచే వాల్మీకిఅను పౌరుషనామముతో ప్రసిద్ధుడయ్యెననియు తెలియుచున్నది. ఋక్షుడుమొదలగు పేర్లున్నను వాల్మీకిఅను పౌరుషనామధేయముతో నిర్దేశించుటచే ఈతనికి శమాదులును, మహాతపస్సును ఉన్నవని సూచింపబడుచున్నది. ‘‘తపస్వీ వాల్మీకిః’’ అను పదములచే ఈతనియందు వేదాంతశాస్త్రమునకు అధికారియగు వాని కుండవలసిన లక్షణము లున్నట్లు కూడ సూచింపబడినది.

‘‘తపఃస్వాధ్యాయనిరతం వాగ్విదాం వరం, మునిపుఙ్గవం నారదం’’ అనునవి నారదునిలో గురువున కుండవలసిన లక్షణము లున్నట్లు సూచించుచున్నవి. ‘‘సాధనచతుష్టయ సంపన్నుడు బ్రహ్మస్వరూపమును తెలిసికొనుటకు, సమిధలను చేత గ్రహించి, శ్రోత్రియుడును, బ్రహ్మనిష్ఠుడును అయిన గురువువద్దకు వెళ్ళవలెను’’ అను శ్రుతి చెప్పుచున్నది. గురువు అనగా శోత్రియత్వము, బ్రహ్మనిష్ఠత్వము కలవాడు. ‘‘శోత్రియ శ్ఛన్దోఽధీతే’’ అను పాణిని సూత్రము ననుసరించి శోత్రియుడనగా వేదవేదార్థములు తెలిసినవాడు. ఈ అర్థమునే ‘‘తపఃస్వాధ్యాయనిరతమ్’’ అనునది చెప్పుచున్నది. ‘‘వాగ్విదాం వరమ్, మునిపుఙ్గవమ్’’ అను పదములు బ్రహ్మనిష్ఠుడుఅను అర్థమును చెప్పుచున్నవి. ‘‘గుకార స్త్వన్ధకారః స్యా ద్రుకార స్తన్నిరోధకః, అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే’’ (‘గుఃఅనగా అంధకారము. రుఃఅనగా దానిని అడ్డు పెట్టువాడు. అంధకారమును పోగొట్టుటవలన గురుఃఅని చెప్పబడుచున్నాడు) అను నిర్వచనము ననుసరించి గురుఃఅనగా అజ్ఞానమును పోగొట్టువాడని అర్థము. ప్రకాశము కలుగచేసిననే కాని చీకటి తొలగించుట శక్యము కాదు. అట్లే జ్ఞానమును కలుగజేసిననే కాని అజ్ఞానమును తొలగించుట శక్యము కాదు. అందుచే అజ్ఞానమును తొలగించి జ్ఞానమునిచ్చువాడు (జ్ఞానము నిచ్చి అజ్ఞానమును తొలగించువాడు) అని గురుశబ్దమున కర్థము.

‘‘గాయ న్నారాయణకథాం సదా పాపభయాపహామ్, నారదో నాశయన్నేతి నృణామజ్ఞానజం తమః (పాపభయమును తొలగించు నారాయణకథను ఎల్లప్పుడును గానము చేయుచు, మానవుల అజ్ఞానజన్య మగు అంధకారమును నశింపచేయుచు నారదుడు వచ్చుచున్నాడు) అని నారదీయములో చెప్పినట్లుగా నారదుడుఅనగా అజ్ఞానమును నశింపచేయువాడు. ‘‘నరాణాం ఇదం నారమ్’’ = నరులకు సంబంధించిన అజ్ఞానము. నారం ద్యతి ఇతి = నారదఃఅను వ్యుత్పత్తిచే అజ్ఞానమును ఖండించువాడు, అనగా పోగొట్టువాడు నారదుడు. లేదా ‘‘నరతీతి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః’’ (ప్రపంచము నందు సృష్టిస్థితిలయములను నడిపించువాడు ‘‘నరుడు’’. ‘‘నరతీతి నరః’’ అట్టి నరుడే పరమాత్మ) అను వాక్యము ననుసరించి నారం’ = నరునకు సంబంధించినది, అనగా పరమాత్మకు సంబంధించిన (గూర్చిన) జ్ఞానము. ‘‘నారం దదాతీతి నారదః’’ అనగా పరమాత్మనుగూర్చిన జ్ఞానము నిచ్చువాడు అని యర్థము. అనగా అజ్ఞానమును పోగొట్టి జ్ఞానము నిచ్చువాడు అని నారదశబ్దార్థము ఏర్పడినది. కావున నారదమ్ అను పదముచే గురుశబ్దార్థము చెప్పబడినది.

‘‘పరిపప్రచ్ఛ’’ అనుటచే ‘‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’’ అని చెప్పినట్లు శాస్త్రోక్త విధానము ప్రకారమే ప్రశ్నించెనని తెలుపబడుచున్నది. ఈ విధముగ ఇచట శిష్య లక్షణము, గురులక్షణము, గురువును సమీపించు విధానము - ఈ మూడును సూచింపబడినవి.

‘‘శ్లోకేన ప్రతిసాహస్రం ప్రథమే క్రమాత్, గాయత్య్రక్షర మేకైకం స్థాపయామాస వై మునిః’’ (వాల్మీకి, ప్రతి శ్లోక సహస్రమునకును మొదటి శ్లోకమునందు, మొట్ట మొదటి ఒక్కొక్క గాయత్రీమంత్రాక్షరమును కూర్చెను) అని చెప్పిన విధముగ ఈ శ్లోకమునకు మొదటి అక్షరముగా గాయత్రీ మంత్ర ప్రథమాక్షర మగు కూర్చబడినది.

అర్థాంతరము: ‘‘తపస్వీ వాల్మీకిః, స్వాధ్యాయనిరతం, వాగ్విదాం వరం, మునిపుఙ్గవం నారదం తపః పరిపప్రచ్ఛ’’ అని అన్వయము. తపఃఅనగా బ్రహ్మము అని అర్థము. అనగా ‘‘వాల్మీకి బ్రహ్మస్వరూపమును చెప్పుమని నారదుని అడిగెను’’ అని అర్థము. ఇతరపదముల అర్థము వెనుక చెప్పినట్లే.

అవ. ఆ ప్రశ్నమునే వివరించుచున్నాడు ః-

మూ. కోన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్,

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. 2

ప్ర. అ. అస్మిన్ లోకే = ఈ భూలోకమునందు, సామ్ప్రతమ్ = ఇప్పుడు, గుణవాన్ = ప్రశస్త మైనగుణములు కలవాడు, కఃను = ఎవడు? వీర్యవాంశ్చ = పరాక్రమము కలవాడును, కః = ఎవడు? ధర్మజ్ఞః చ = ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞఃచ = ఇతరులు చేసిన స్వల్పమగు ఉపకారమును కూడ గుర్తు పెట్టుకొనువాడును, సత్యవాక్యః = సత్యమైన వాక్యములు కలవాడును, దృఢవ్రతః = ఫలము కలుగువరకును సంకల్పమును విడువనివాడును, (కః = ఎవడు?)

తా. ఇప్పుడు భూలోకమునందు మంచి గుణములు కలవాడును, గొప్ప పరాక్రమము కలవాడును, ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞుడును, సత్యమైన వాక్కులు కలవాడును, దృఢమైన సంకల్పము కలవాడును అగు మహాపురుషుడెవ్వడున్నాడు?

వి. విద్వాన్ = తెలిసికొనదగిన వాటి నన్నింటిని తెలిసికొనినవాడు, కః = ఎవడు? ధర్మజ్ఞశ్చ - ధర్మ మనగా అలౌకికమగు, అనగా ఈ లోకమునకు సంబంధించని, లేదా లౌకిక ప్రమాణములచే తెలియని, శ్రేయస్సాధనము. ఇక్కడ ఉన్న కారముచే అనుక్తమగు అధర్మమును కూడ గ్రహింపవలెను. అనగా ధర్మమును అధర్మమును కూడ తెలిసికొనినవాడు అని అర్థము. సత్యవాక్కు అనగా అతి కష్టసమయములలో కూడ సత్యమునే పలుకువాడని అర్థము.

వైకుంఠాది లోకాంతరములో ఇట్టి గుణములుగల నారాయణాదులుండుట ప్రసిద్ధమే కావున ఆ లోకములను గూర్చి ప్రశ్నింపవలసిన పనిలేదు. అందుచే ఈ భూలోకమందు అని చెప్పబడినది. ఈ భూలోకములో కూడ కాలాంతరములందు నరసింహాద్యవతారము లున్నట్లు ప్రసిద్ధము గాన వాటిని కూర్చి ప్రశ్నింప పనిలేదు. అందుచే ఇప్పుడుఅని చెప్పబడినది. చకారములు ప్రయోగించుటవలన గుణవత్త్వము మొదలగు విశేషణములన్నియు కలిసి ఒకనియందే ఉండవలెనన్నట్లు సూచింప బడుచున్నది. అట్టి అనేక గుణ (విశేషణ) సముచ్చయమును బోధించుటకు ఒక్క చకారమే చాలును. అయినను అనేక చకారముల ప్రయోగము ఆదరాతిశయమును సూచించుచున్నది.

గుణవాన్ఇత్యాదిలక్షణములు వేదోక్తమహాపురుషలక్షణములను చెప్పుచున్నవి.

మూ. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః,

విద్వాన్ కః కః సమర్థశ్చె కశ్చైక ప్రియదర్శనః. 3

ప్ర. అ. కః = ఎవడు, చారిత్రేణ = మంచినడవడికతో, యుక్తః = కూడినవాడు? కః = ఎవడు, సర్వభూతేషు = సమస్తప్రాణుల విషయమున, హితః = హితమును చేయువాడు? కః = ఎవడు, విద్వాన్ = తెలిసికొనదగిన వాటి నన్నింటిని తెలిసికొనినవాడు? కః = ఎవడు, సమర్థశ్చ = ఇతరులకు నిర్వహింపరాని కార్యములనుకూడ నిర్వహించుటకు సమర్థుడు? కః = ఎవ్వడు, ఏకప్రియదర్శనః = ఒకే విధమున సంతోషజనకుడుగా కనబడువాడు?

తా. మంచి నడవడి కలవాడును, సర్వప్రాణులకు హితము నాచరించువాడును, విద్వాంసుడును, అసాధ్యములైన కార్యములను కూడ సాధించు సామర్థ్యము కలవాడును, చూచువారికి ఎల్లప్పుడును ఒకే విధముగ ఆనందము కలుగు విధమున కనబడువాడును అగు మహాపురుషుడు ఎవడు?

వి. చరిత్రము అనగా కులక్రమాగత మగు ఆచారము. చరిత్రమే చారిత్రము.

సర్వభూతేషు అనగా సాపరాధుల విషయమున గాని నిరపరాధుల విషయమున గాని, అందరి విషయమునను అని అర్థము.

‘‘ఏకప్రియదర్శనః’’ ః- ‘‘క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవ రూపం రమణీయతాయాః’’ (క్షణ క్షణమునకును క్రొత్తగా కనబడుచుండుటయే సౌందర్య లక్షణము) అని చెప్పినట్లు ఎల్లప్పుడు చూచుచున్నను, ఎప్పటికప్పుడు అదే మొదటిసారి చూచినట్లు విస్మయమును కలుగచేయువాడు అని అర్థము. లేదా ‘‘ఏకశబ్దమునకు సాటిలేనిఅని అర్థము. సాటిలేని సంతోషజనక మగు దర్శనము కలవాడు అని అర్థము.

మూ. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః,

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 4

ప్ర. అ. ఆత్మవాన్ = ధైర్యము కలవాడు, కః = ఎవడు? జితక్రోధః = జయింపబడిన కోపము కలవాడును, ద్యుతిమాన్ = ప్రశస్తమైన కాంతి కలవాడును, అనసూయకః = అసూయలేనివాడును, కః = ఎవడు? జాతరోషస్య = పుట్టిన కోపము గల (కోపము వచ్చిన), కస్య = ఎవనికి, సంయుగే = యుద్ధమునందు, దేవాశ్చ = దేవతలు కూడ, బిభ్యతి = భయపడుదురు?

తా. ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, ప్రశస్తమైన కాంతి కలవాడును, అసూయ లేనివాడును ఎవడు? యుద్ధములో కోపమువచ్చిన ఎవనిని చూచి దేవతలు కూడ భయపడుదురు?

వి. ఆత్మశబ్దమున కిచట ధైర్యమని అర్థము. ‘‘ఆత్మా జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మనిఅని అమరము.

జితక్రోధఃఅను చోట క్రోధశబ్దము కామాదులకు ఉపలక్షణము. అందుచేత కామ - క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్యము లను అరిషడ్వర్గమును జయించిన వాడని అర్థము.

అసూయఅనగా గుణములను దోషములుగ చిత్రించు ప్రవృత్తి. అసూయ లేనివాడు అనసూయుడు.

దేవాశ్చఅనునపుడు చకారము అసురాదులను కూడ చేర్చుటకు ప్రయోగింపబడినది. అందుచే ‘‘దేవాసురాదులు’’ అని అర్థము. లేదా అనుదానికి కూడఅని అర్థము. అనగా ‘‘దేవాశ్చ’’ అనుదానికి మిత్రులైన దేవతలు కూడ అని యర్థము. మిత్రులకే భయము కలుగు ననగా శత్రువుల మాట చెప్పవలెనా అని తాత్పర్యము.

మూ. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే,

మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్. 5

ప్ర. అ. ఏతత్ = దీనిని, అహమ్ = నేను, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను, మే = నా యొక్క, కౌతూహలమ్ = వేడుక, పరం హి = అధికము కదా. మహర్షే = ఓ మహర్ష్ఙీ, త్వమ్ = నీవు, ఏవంవిధమ్ = ఇట్టి గుణములుగల, నరమ్ = మనుష్యుని, జ్ఞాతుమ్ = తెలిసికొనుటకు, సమర్థః = సమర్థుడవుగా, అసి = ఉన్నావు.

తా. నే నీ విషయమును విన గోరుచున్నాను. నాకు ఎక్కువ కుతూహలముగా ఉన్నది. ఓ మహర్ష్ఙీ ఇట్టి గుణములుగల మనుష్యుని గూర్చి నీకు తెలియుటకు అవకాశ మున్నది.

వి. జ్ఞానము యొక్క పారమును చెందినవాడు ఋషి.

దీనియందు నాకు చాల కుతూహల మున్నదను విషయమును నా యింగితాకారములచే తా మీ సరికి గ్రహించియే యుందురు అని సూచించుటకై హిఅను పదము ప్రయోగింపబడినది. మీరు జ్ఞానవంతులలో ఉత్తములు గావునను, ఇట్టి లోకోత్తరు డగు వ్యక్తిని గూర్చి తెలిసియుండుటకు మీకన్న సమర్థులు మరెవ్వరును ఉండరు కావునను, ఇంతవరకును మీ రాకకై నిరీక్షించి ఉంటిని అని ఉత్తరార్ధముచే సూచిత మగుచున్నది.

ఇచట వాల్మీకి ప్రశ్నించినది జనసామాన్యమునకు తెలిసిన రాముని గూర్చి కాదనియు, వేదాంతములును, నానావిధవిద్యలును ప్రతిపాదించిన సకల కల్యాణ గుణములతో కూడియున్న పరతత్త్వమును గూర్చి ప్రశ్నించె ననియు, తెలియవలెను. నారదమహాముని కూడ ఈ ప్రశ్నముల అభిప్రాయము తెలిసికొని, అట్టి మంగళకర గుణములతో కూడిన పరతత్త్వమే రాము డని నిర్ణయించి, ఉత్తరము చెప్పెను. (గోవిందరాజు)

మూ. శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః,

శ్రూయతామితి చామన్త్య్ర ప్రహృష్టో వాక్యమబ్రవీత్. 6

ప్ర. అ. త్రిలోకజ్ఞః = మూడు లోకములను ఎరిగిన, నారదః = నారదుడు, వాల్మీకేః = వాల్మీకియొక్క, ఏతత్ = ఈ, వచః = వాక్కును, శ్రుత్వాచ = విని(యు), ‘‘శ్రూయతామ్ = వినబడుగాక’’, ఇతి = అని, ఆమన్త్య్రచ = పిలిచి(యు), అనగా వాల్మీకిని అభిముఖునిగా చేసికొని, ప్రహృష్టః = సంతసించినవాడై, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మూడు లోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలను విని, సంతసంచినవాడై ‘‘చెప్పెదను వినుము’’ అని పలికి, ఇట్లు చెప్పెను.

వి. త్రిలోకజ్ఞః - మూడు లోకములను ఎరిగినవాడు. లేదా త్రిలోకమనగా భూః, భువః, సువః అనెడు మూడులోకములు గల బ్రహ్మాండము. దానిని ఎరిగినవాడు. లేదా త్రిలోకశబ్దమునకు బద్ధులు, ముక్తులు, నిత్యులు అను మూడు విధములగు జనులని అర్థము. ‘‘లోకస్తు భువనే జనే’’ అని అమరము.

ప్రహృష్టః - ఈ వాల్మీకి సమస్తగుణసంపన్ను డైన మనుష్యుని తెలిసికొన గోరెను. ఈ గుణములు సామాన్యసార్వభౌమునిలో లభింపవు. జగద్రక్షణార్థము మనుష్యరూపమున అవతరించిన సాక్షాన్నారాయణు డొక్కడే ఇట్టి గుణములు కలవాడు. కావున నా కిపుడు భగవద్గుణములను కీర్తించుటకు అవకాశము లభించినది అని సంతసించినవాడై.

మూ. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః,

మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. 7

ప్ర. అ. మునే = ఓ వాల్మీకిమునీ, బహవః = అనేకములును, లేదా అనంతములును, దుర్లభాః చ ఏవ = సాధారణుల కెంతమాత్రమును పొంద శక్యము కానివియు అగు, యే గుణాః = ఏ గుణములు, త్వయా = నీచేత, కీర్తితాః = వర్ణింపబడినవో, తైః = ఆ గుణములతో, యుక్తః = కూడిన, నరః = మనుష్యుడు, శ్రూయతామ్ = వినబడుగాక. అహమ్ = నేను, బుద్ధ్వా = తెలిసికొని, వక్ష్యామి = చెప్పెదను.

తా. ఓ వాల్మీకిమునీ నీవు అడిగిన గుణములు అనంతములు. సాధారణ మానవులలో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని నిశ్చయించి చెప్పెదను. సావధానముగా వినుము.

వి. నారదముని బ్రహ్మదేవునివలన రాముని చరిత్రమును సాంతముగా విని వచ్చినాడు. అట్టి గుణములను వినవలె నను కుతూహలముతో వాల్మీకి ప్రశ్నింపగా తాను ఉపదేశించుటకై వచ్చిన విషయమును గూర్చియే ఈతడు ప్రశ్నించినాడు కదా అను ఆనందముతో - ‘‘నేను తెలిసికొని ఉన్నాను గాన చెప్పెదను వినుము’’ అని పలికి చెప్ప మొదలిడెను అని వ్యాఖ్యానసారాంశము.

మూ. ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః,

నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. 8

ప్ర. అ. ఇక్ష్వాకువంశప్రభవః = ఇక్ష్వాకుమహారాజుయొక్క వంశమే ఉత్పత్తి స్థానముగా గల (ఇక్ష్వాకువంశమునందు పుట్టిన), రామః నామ = రాముడనెడు మహాపురుషుడు, జనైః = జనులచేత, శ్రుతః = వినబడినవాడు. (అతడు) నియతాత్మా = నిశ్చిత మగు స్వభావము కలవాడు అనగా నిర్వికారస్వరూపుడు. మహావీర్యః = అచింత్యమైన శక్తి కలవాడు, ద్యుతిమాన్ = ప్రశస్త మైన కాంతి కలవాడు, అనగా స్వయంప్రకాశస్వరూపుడు (పరాపేక్ష లేకుండ ప్రకాశించు చిత్స్వరూపుడు). ధృతిమాన్ = ప్రశస్త మైన ధైర్యము కలవాడు, లేదా ప్రశస్తమైన ఆనందము కలవాడు. అనగా నిరతిశయానందస్వరూపుడు. వశీ = ఇంద్రియ నిగ్రహము కలవాడు, లేదా సమస్త ప్రపంచమును తన వశములో నుంచుకొనిన సర్వేశ్వరుడు.

తా. ఇక్ష్వాకువంశమునందు పుట్టిన రామునిగూర్చి జను లెల్లరును వినియున్నారు. ఇతడు నిశ్చిత మైన స్వభావము కలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. మంచి కాంతి కలవాడు. ధైర్యము కలవాడు. ఇంద్రియనిగ్రహవంతుడు. లేదా ఇక్ష్వాకువంశము నందు పుట్టిన రాముడు సాక్షాన్నారాయణ స్వరూపు డని లోకులచేత నిశ్చయింప బడినవాడు. నిర్వికారుడు, అచింత్య మైన శక్తి కలవాడు, స్వయంప్రకాశ స్వరూపుడు, నిరతిశయానందస్వరూపుడు. సమస్త ప్రపంచమును తన వశములో నుంచుకొనిన సర్వేశ్వరుడు.

వి.‘‘రమయతీతి రామః’’ అను వ్యుత్పత్తిచే రామఃఅనగా రమింప చేయువాడని (ఆనందింపచేయువాడని) అర్థము. ‘‘రామో రమయతాం వరః’’ (రమింపచేయువారిలో రాముడు శ్రేష్ఠుడు) అని చెప్పబడినది. లేదా ‘‘రమన్తే యోగినోఽనన్తే సత్యానన్దే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే’’ (అనంతసచ్చిదానందాత్మకు డైన ఇతనియందు యోగులు రమింతురు. ఇట్లు రామశబ్దముచే పరబ్రహ్మము చెప్పబడుచున్నది) అను అగస్త్యసంహితావచనానుసారము ‘‘రమన్తే అస్మిన్ ఇతి రామః’’ — అనగా ‘‘వీనియందు యోగులు రమింతురు’’ అని రామశబ్దార్థము.

అనేక ప్రఖ్యాతవంశము లుండగా రాముడు ఇక్ష్వాకువంశమునందే అవతరించుటకు కారణ మేమనగా — పూర్వము ఇక్ష్వాకు వను మహారాజు చిరకాలము శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించి తత్ఫలముగా రంగనాథుని పొందెను. ఆ రంగనాథుని ఆరాధించు అధికారము ఆ వంశమునందు పుట్టినవారికి సదాచారమై ఉండెను. ఆ పక్షపాతముచే శ్రీమహావిష్ణువు ఇక్ష్వాకువంశమునందే అవతరించెను (గోవిందరాజు). ‘‘ధ్యాయేత్సదా సవితృమణ్డల మధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః’’ అను ప్రాచీనోక్తిని అనుసరించి సూర్యమండలాంతర్గత మగు తేజస్సే తన స్వరూపము గాన, శ్రీమహావిష్ణువు, సూర్యునిపై అభిమానముచే అతని వంశమునందే జనించె నని ఉపాసకుల భావము. ఇది సాంప్రదాయికార్థము.

మూ. బుద్ధిమా న్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః,

విపులాంసో మహాబాహుః కమ్బుగ్రీవో మహాహనుః. 9

ప్ర. అ. (ఆ రాముడు) బుద్ధిమాన్ = ప్రశస్తమైన బుద్ధికలవాడు, సర్వజ్ఞుడు, నీతిమాన్ = ప్రశస్త మైన నీతి కలవాడు, లేదా సృష్టిస్థితిలయరూప మర్యాదలు కలవాడు, వాగ్మీ = సమస్తవిద్యలు తెలిసినవాడు, శ్రీమాన్ = అఖండైశ్వర్యము కలవాడు, శత్రునిబర్హణః = శత్రువులను నశింపచేయువాడు, విపులాంసః = ఎత్తైన మూపు కలవాడు, మహాబాహుః = బలిసిన బాహువులు కలవాడు, కమ్బుగ్రీవః = శంఖమువంటి కంఠము కలవాడు, మహాహనుః = ఎత్తైన చెక్కిళ్ల మీదిభాగము కలవాడు.

తా. ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశించేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి; బాహువులు బలిసినవి; కంఠము శంఖము వలె ఉండును. చెక్కిళ్ళ పై భాగము ఉన్నతముగ ఉండును.

వి. విపులాంసః - ‘‘కక్షః కుక్షిశ్చ వక్షశ్చ ఘ్రాణం స్కన్ధో లలాటికా, సర్వభూతేషు నిర్దిష్టా ఉన్నతాస్తు సుఖప్రదాః’’ (ఏ ప్రాణుల కైనను, చంక, కడుపు, రొమ్ము, ముక్కు, మూపు, నొసలు - ఇవి ఉన్నతము లైనచో సుఖప్రదములు) అని సాముద్రికశాస్త్రములో చెప్పినట్లు ఉన్నతము లైన మూపులు కలవాడని అర్థము.

‘‘కమ్బుగ్రీవః’’ - ‘‘కమ్బుగ్రీవశ్చ నృపతి ర్లమ్బకర్ణోఽ తిభూషణః’’ (శంఖమువంటి కంఠము కలవాడు రాజగును. వ్రేలాడు చెవులు కలవానికి ఎక్కువ భూషణము లుండును) అని సాముద్రికశాస్త్రములో చెప్పినట్లు శంఖమువంటి కంఠము కలవాడు అని అర్థము.

‘‘మహాహనుః’’ - ‘‘మాంసలే తు హనూ యస్య భవత స్త్వీషదున్నతే, స నరో మృష్టమశ్నాతి యావదాయుః సుఖాన్వితః’’ (ఎవని చెక్కిళ్ల పైభాగములు బలిసి యుండుటచే కొంచెము ఎత్తుగా ఉండునో అతడు జీవితకాలమంతము సుఖ మనుభవించుచు, మృష్టాన్నమును భుజించుచుండును’’) అని చెప్పినట్లు ఉన్నతము లైన హనువులు కలవా డని అర్థము.

మూ. మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః,

ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. 10

ప్ర. అ. (ఆ రాముడు) మహోరస్కః = విశాలమైన వక్షఃస్థలము కలవాడు, మహేష్వాసః = గొప్ప ధనుస్సుకలవాడు, గూఢజత్రుః = పైకి కనబడని మూపుల సంధి యెముకలు కలవాడు, అరిందమః = కామక్రోధాది శత్రువులను లేదా పాపములను పోగొట్టువాడు, ఆజానుబాహుః = మోకాళ్ల వరకును పొడవైన బాహువులు కలవాడు, సుశిరాః = సులక్షణము లతో కూడిన శిరస్సు కలవాడు, సులలాటః = శుభలక్షణములు గల నుదురు కలవాడు, సువిక్రమః = అందమైన, పాదవిన్యాసము (నడక) కలవాడు.

తా. ఆ రాముని వక్షఃస్థలము చాల విశాలమైనది. ధనుస్సు చాల గొప్పది. అతని మూపుల సంధి ఎముకలు పైకి కనబడవు. అతడు కామక్రోధాది శత్రువులను, పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మోకాళ్లవరకును వ్రేలాడుచుండును. అతని శిరస్సు, లలాటము కూడ మంచిలక్షణములతో ఒప్పుచుండును. నడక ఎంతో అందముగా ఉండును.

వి. ‘‘మహోరస్కః’’ - ‘‘స్థిరం విశాలం కఠినమున్నతం మాంసలం సమమ్, వక్షో యస్య మహీపాలస్తత్సమో వా భవేన్నరః’’ (దృఢమై, విశాలమై, కఠినమై, ఉన్నతమై, బలిసి సమముగా ఉండు వక్షఃస్థలము కలవాడు రాజుకాని, రాజసముడు కాని అగును) అని శాస్త్రములో చెప్పిన లక్షణములు గల వక్షఃస్థలము కలవాడు.

‘‘మహేష్వాసః’’ - ఈ శబ్దముచే ‘‘గొప్ప ధనుస్సును ధరింపతగినంత దృఢ మైన శరీరము కలవాడు’’ అను అర్థము సూచింపబడుచున్నది. అందుచే ప్రక్రమభంగదోషము లేదు. - అనగా శరీరావయవములను వర్ణించు సందర్భమున ధనుస్సును గూర్చి వర్ణించుట ప్రారంభించినదానికి విరుద్ధముగా ఉన్నది గాన ఇది ప్రక్రమభంగదోషము కదా అను శంకకు అవకాశము లేదు.

‘‘గూఢజత్రుః’’ - ‘‘విషమైర్జత్రుభిర్నిస్స్వా అతిసూక్ష్మైశ్చ మానవాః, ఉన్నతైర్భోగినో నిమ్నైర్నిస్స్వాః పీనైర్నరాధిపాః’’ (మూపుల సంధి ఎముకలకు జత్రువులు అని పేరు. ఇవి ఎచ్చుతగ్గులుగ గాని, అతిసూక్ష్మములుగ గాని ఉన్నచో దరిద్రులగుదురు. ఉన్నతముగ ఉన్నచో భోగు లగుదురు. లోతుగా ఉన్నచో బీదవారగుదురు. బలిసి ఉన్నచో రాజు లగుదురు) అని చెప్పినట్లు మాంసాధిక్యముచే బలిసి యుండుటవలన పైకి కనబడని జత్రువులు కలవాడని అర్థము.

‘‘అరిందమః’’ - కామక్రోధాది శత్రువర్గమును పోగొట్టువా డని అర్థము. కామక్రోధాదులు లేనిచో కర్మము చేయుట జరుగదు. కర్మము లేకపోయినచో శరీర పరిగ్రహము (జన్మ ఎత్తుట) జరుగదు. ఐతే ఇపుడు రాముడు గ్రహించిన మనుష్య శరీరము కర్మమూలకము కాదు; లోకానుగ్రహార్థమే అని ఈ పదము సూచించుచున్నది.

‘‘ఆజానుబాహుః’’ - ‘‘ఆజానులమ్బినౌ బాహూ వృత్తపీనౌ మహేశ్వరః’’ (గుండ్రముగా బలిసి మోకాళ్లవరకును వ్రేలాడు బాహువులు కలవాడు సార్వభౌముగడగును) అను సాముద్రికవచనానుసారము సార్వభౌమలక్షణ మగు దీర్ఘ బాహువులు కలవా డని అర్థము.

‘‘సుశిరాః’’ - ‘‘సమవృత్తశిరాశ్చెవ ఛత్రాకారశిరాస్తథా, ఏకఛత్రాం మహీం భుఙ్క్తే దీర్ఘమాయుశ్చ జీవతి’’ (సమముగా గుండ్రముగా ఉండు శిరస్సు కలవాడును, గొడుగు వంటి శిరస్సు కలవాడును ఏకచ్ఛత్రాధిపత్యము చేయుచు దీర్ఘకాలము జీవించును) అని చెప్పినట్లు శుభలక్షణములు గల శిరస్సు కలవాడని అర్థము.

‘‘సులలాటః’’ - ‘‘అర్ధచన్ద్రనిభం తుఙ్గం లలాటం యస్య స ప్రభుః’’ (అర్ధచంద్రాకారమై ఉన్నత మైన లలాటము కలవాడు రాజగును) అని చెప్పబడిన లక్షణములు గల లలాటము కలవా డని అర్థము.

‘‘సువిక్రమః’’ - ‘‘సింహర్షభగజవ్యాఘ్రగతయో మనుజా మునే, సర్వత్ర సుఖమేధన్తే సర్వత్ర జయినః సదా’’ (సింహము, వృషభము, గజము, పెద్దపులి, వీటి నడకవంటి నడక గలవారు అంతటను జయమును పొందుచు సుఖముగా వృద్ధి పొందుదురు) అని జగద్వల్లభలో చెప్పినట్లు అంద మైన నడక కలవాడని అర్థము.

మూ. సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్,

పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. 11

ప్ర. అ. (ఆ శ్రీరాముడు), సమః = అతిదీర్ఘము, లేదా అతిహ్రస్వము కానట్టి దేహముకలవాడు, సమవిభక్తాఙ్గః = హెచ్చుతగ్గులు లేకుండ విభజింపబడిన అవయవములు కలవాడు, స్నిగ్ధవర్ణః = మంచి రంగుగలవాడు, ప్రతాపవాన్ = ప్రశస్తమైన పరాక్రమము కలవాడు లేదా తేజస్సు కలవాడు, పీనవక్షాః = బలిసిన వక్షఃస్థలము కలవాడు, విశాలాక్షః = విశాలమైన నేత్రములు కలవాడు, లక్ష్మీవాన్ = ప్రశస్తమైన అవయవకాంతి కలవాడు, శుభలక్షణః = మంగళకరములైన సాముద్రికశాస్త్రోక్త లక్షణములు కలవాడు.

తా. ఆ శ్రీరాముని శరీరము చాల పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవము లన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ చాల చక్కనిది. తేజస్సు చాల ప్రశంసనీయ మైనది. వక్షఃస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలములు. అవయవముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణము లన్నియు అతని శరీరము నందున్నవి.

వి. సమః - ‘‘షణ్ణవత్యఙ్గులోత్సేధః సార్వభౌమో భవేన్నృపః’’ (తొంబది యారు అంగుళముల పొడవు గల రాజు సార్వభౌము డగును) అని జగద్వల్లభలో చెప్పినట్లు హెచ్చుతగ్గులు లేక తొంబదియారు అంగుళముల పొడవు ఉన్నవాడని అర్థము.

సమవిభక్తాఙ్గః - ‘‘భ్రువౌ నాసాపుటే నేత్రే కర్ణావోష్ఠే చ చూచుకే, కూర్పరౌ మణిబన్ధౌ చ జానునీ వృషణౌ కటీ, కరౌ పాదౌస్ఫిజౌ యస్య సమౌజ్ఞేయః స భూపతిః’’ (కనుబొమలు, నాసికారంధ్రములు, కన్నులు, చెవులు, పెదవులు, చనుమొనలు, మోచేతులు, మనికట్టు, మోకాళ్లు, వృషణములు, కటిప్రదేశములు, హస్తములు, పాదములు, పిరుదులు - ఇవి హెచ్చుతగ్గులు లేక సమములుగా ఉన్నవాడు రాజు అగును) అని సాముద్రిక శాస్త్రములో చెప్పిన ప్రకారము రాముని కనుబొమలు మొదలైన అవయవములు ఉన్న వని అర్థము.

స్నిగ్ధవర్ణః - ‘‘చక్షుః స్నేహేన సౌభాగ్యం దన్త స్నేహేన భోజనమ్, త్వచి స్నేహేన శయ్యా చ పాదస్నేహేన వాహనమ్’’ (స్నేహ మనగా మెరుగు. నేత్రములలో మెరు గున్నచో సౌభాగ్యము, దంతములపై మెరు గున్నచో మంచి భోజనము, శరీరమునందు మెరు గున్నచో సుఖశయ్య, పాదములందు మెరుగున్నచో వాహనసౌఖ్యము కలుగును) అని చెప్పినట్లు రాముని నేత్రాదులలో మెరుగు ఉన్న దని భావము.

మూ. ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ ప్రజానాం చ హితే రతః,

యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్. 12

ప్ర. అ. ధర్మజ్ఞః = శరణాగతరక్షణాది ధర్మములను ఎరిగినవాడు, సత్యసన్ధః = సత్య మైన ప్రతిజ్ఞ కలవాడు, ప్రజానామ్ = ప్రజలకు, హితే = హితము చేయుటయందు, రతః = ఆసక్తి కలవాడు, యశస్వీ = గొప్ప కీర్తి కలవాడు, జ్ఞానసంపన్నః = అన్ని విషయములకు సంబంధించిన జ్ఞానముతో సంపన్నుడు, శుచిః = పరిశుద్ధ మైనవాడు, వశ్యః = గురుజనులకు లొంగి ఉండువాడు, లేదా ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, సమాధిమాన్ = ఆశ్రితులను ఎట్లు రక్షించవలెనో ఆలోచించువాడు.

తా. శ్రీరాముడు శరణాగతరక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితమునకై ఎక్కువ ఆసక్తి చూపును. అన్ని విషయములును తెలిసినవాడు, పరిశుద్ధ మైనవాడు, అనగా నిజాయితీ కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, ఆశ్రితులను రక్షించుటకై దీక్ష వహించినవాడు.

వి. ‘‘సత్యసన్ధశ్చ’’ ఇత్యాది స్థలములలో ప్రయోగించిన అను దానికి విశేషార్థ మేమియు లేదు. కేవలము పాదపూరణమునకై ప్రయోగింపబడినది. ‘‘తు హి చ స్మ హ వై పాదపూరణే’’ అని అమరము.

మూ. ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః,

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా. 13

ప్ర. అ. (ఆ రాముడు) ప్రజాపతిసమః = బ్రహ్మతో సమాన మైనవాడు, శ్రీమాన్ = సమస్త లోకమును అతిశయించినవాడు, ధాతా = సమస్త ప్రపంచమును పోషించువాడు, రిపునిషూదనః = శత్రువులను జయించువాడు, జీవలోకస్య = ప్రాణి సముదాయమునకు(ను), రక్షితా = పాలించువాడు, ధర్మస్య = ధర్మమునకు(ను), పరిరక్షితా = బాగుగ రక్షించువాడు.

తా. శ్రీరాముడు బ్రహ్మతో సమానుడు. అందరిని మించినవాడు. సర్వలోకములను పోషించువాడు. శత్రువులను నశింపచేయువాడు. సమస్తప్రపంచమును రక్షించువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు.

వి. జీవలోకస్య రక్షితా - కేవలము సార్వభౌము డైనవాడు తనవారిని లేదా మనుష్యులను మాత్రమే రక్షించకలిగి ఉండును. శ్రీరాము డట్లు కాదు. పిపీలికాది బ్రహ్మపర్యంతము సకల ప్రాణులను రక్షింపగలిగినవాడు. ఐతే పాపాత్ములను కూడ రక్షించునా? అను ప్రశ్న ఉదయించును. దీనికి సమాధానము ‘‘ధర్మస్య పరిరక్షితా’’ అను మాటలో ఉన్నది. ధర్మమును రక్షించుటవలన పాపులను కూడ రక్షించువాడే అని సూచిత మగుచున్నది. అది ఎట్లనగా - చికిత్సకుడు శస్త్రచికిత్సాదులు చేయునపుడు తాత్కాలికముగ రోగికి చాల బాధ కలిగించువాడే అయినను, రోగమును పోగొట్టి చివరకు మహోపకారము చేసినవాడే అగుచున్నాడు. అట్లే పాపులను శిక్షించు సమయమున వారిపట్ల, ఆ సమయమున, క్రూరుడుగా కనబడినను, అధర్మమార్గములో పడి పాపములు చేయుచున్న ఆ పాపాత్ములను శిక్షించి ఉద్ధరించుటచే, వాస్తవమున, వారికే విశేషరక్షకు డగు చున్నా డని భావము.

‘‘రక్షితా జీవలోకస్య’’ అని ప్రారంభించి చెప్పిన ఈ విశేషణములు భగవంతుని అవతారలక్షణములను వర్ణించుచున్నవి (గోవిందరాజులు). ఇవన్నియు పరమేశ్వరున కుండదగిన లక్షణములే కాని ఇతరుల కెవ్వరికిని ఉండదగినవి కావు (మహేశ్వరతీర్థులు).

మూ. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా,

వేదవేదాఙ్గతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. 14

ప్ర. అ. (ఆ రాముడు) స్వస్య = తనయొక్క, ధర్మస్య = శరణాగత రక్షణరూపధర్మమునకు లేదా క్షత్రియధర్మమునకు, రక్షితా = రక్షకుడు, స్వజనస్య చ = ఆశ్రయించిన బంధువులు మొదలైన తనవారికిని, రక్షితా = రక్షకుడు, వేదవేదాఙ్గతత్త్వజ్ఞః = వేదముల తత్త్వమును వేదాంగముల తత్త్వమును తెలిసికొన్నవాడు, ధనుర్వేదే చ = ధనుర్వేదమునందు గూడ, నిష్ఠితః = పరిపూర్ణ మైన ప్రజ్ఞ కలవాడు.

తా. శ్రీరాముడు తన ధర్మమును చక్కగ పాటించుచు తనవారి నందరిని రక్షించుచుండును. వేదవేదాంగముల రహస్యము లన్నియు ఈతనికి తెలియును. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణ మైనది.

వి. ఋక్ - యజుస్ - సామ - అథర్వము లని వేదములు నాలుగు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని వేదాంగము లారు.

‘‘ధనుర్వేదే చ’’ అనునపుడు శబ్దముచే ఆయుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము అను మిగిలిన మూడు ఉపవేదములను కూడ గ్రహించవలెను.

రక్షితా స్వస్య ధర్మస్య’ -

ధర్మోపదేశసమయే జనాః సర్వేఽపి పణ్డితాః,

తదనుష్ఠానసమయే మునయోఽపి న పణ్డితాః’’.

(ఇతరులకు ధర్మము ఉపదేశించుటకు అందరును పండితులే. ఆ ధర్మమును ఆచరించు నపుడు మాత్రము మునులు కూడ అపండితుల వలె ప్రవర్తింతురు) అని చెప్పి నట్లు చాలమంది ధర్మోపదేశము చేయుచుందురు గాని తాము ఆచరించరు. శ్రీరాముడు మాత్రము అట్లు కాదని అర్థము.

లేదా ధర్మ మనగా ధనుస్సు. ‘‘స్వామ్య స్వభావసుకృతేష్వస్త్రీ ధర్మం తు కార్ముకే’’ అని బాణనిఘంటువు. అందుచే ‘‘రక్షితా స్వస్య ధర్మస్య’’ అనగా తన ధనుస్సును రక్షించుకొనువాడు అని అర్థము. ఇచట ధర్మ శబ్దము ఉపలక్షణచే రథాదులు అను అర్థమును కూడ బోధించును. యుద్ధరంగములో తన ధనుస్సును, రథములను, సారథిని, గుఱ్ఱములను, ఛత్రమును, కేతనమును రక్షించుకొన గలిగిన అతిరథశ్రేష్ఠు డని అర్థము.

లేదా శివధనుర్భంగము, పరశురామపరాభవము మొదలగు లోకోత్తరము లగు కార్యములు చేసి తన శ్రీనారాయణావతారత్వరూపధర్మమును రక్షించుకొనినవాడు అని అర్థము.

స్వజనస్య చ రక్షితా - ‘‘రక్షితా జీవలోకస్య’’ అని పూర్వశ్లోకములో చెప్పిన జీవలోకరక్షణములో స్వజనరక్షణము కూడ అంతర్గత మైనను, మరల ‘‘స్వజనస్య చ రక్షితా’’ అని చెప్పుట రామునకు స్వజనులపై ఉన్న కరుణాతిశయమును సూచించు చున్నది.

బాంధవాదులను తిరస్కరించుట ప్రభువునకు సహజము. రాముడు మాత్రము అట్లు కాదు. ‘‘అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు నిష్ఫలమ్’’ (చాల దగ్గరగా ఉన్న ఆశ్రితుని లేదా బంధువును కాదని మునీశ్వరునకు దానము చేసినను అది నిష్ఫలమే) అను శాస్త్రము ననుసరించి ఆశ్రితబాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థము.

మూ. సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృ తిమాన్ ప్రతిభానవాన్,

సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః. 15

ప్ర. అ. (ఆ రాముడు), సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః = సమస్తమైన శాస్త్రముల అర్థము, తత్త్వము తెలిసినవాడు, స్మృతిమాన్ = జ్ఞప్తి కలవాడు, అనగా తెలిసిన విషయమును మరువనివాడు, ప్రతిభానవాన్ = వ్యవహారమునందు ఉత్తరోత్తరయుక్తుల స్ఫూర్తి కలవాడు, సర్వలోక ప్రియః = సమస్తజనులకును ఇష్టుడు, లేదా అందరు జనులును ఇష్టులుగా కలవాడు (అందరియందును ప్రీతి కలవాడు). సాధుః = తనకపకారము చేసినవారికి కూడ ఉపకారము చేయువాడు, అదీనాత్మా = అతిదుఃఖకాలమునందు కూడ కలత చెందని మనస్సు కలవాడు, విచక్షణః = వినువారికి హృదయానందము కలుగు నట్లు అనేక విధములుగ మాటలాడువాడు. లేదా ఆ యా కాలములందు చేయదగిన పనులు చేయుటయందు చాతుర్యము కలవాడు.

తా. రాముడు వెనుక చెప్పిన వేదవేదాంగములే కాక మిగిలిన ధర్మశాస్త్ర - పురాణ - న్యాయ - మీమాంసా - సాంఖ్య - వైశేషిక - యోగశాస్త్రముల అభిప్రాయములను, సిద్ధాంతములను బాగుగా తెలిసికొనినవాడు. తెలిసికొన్న విషయములను ఎన్నడును మరువడు. లోకవ్యవహారములలో ఈతనికి గల ఉత్తరోత్తరయుక్తుల స్ఫురణము గొప్పది. సమస్తజనులయందును ఈతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడ రాము డనిన ప్రాణము. ఎట్టి కష్టకాలములం దైనను ఈతని మనస్సు కలత చెందదు. వినువారికి ఆనందము కలుగు నట్లు సంభాషణ చేయుటయందును, సమయోచితములగు కార్యములను నిర్వహించుటయందును గొప్పనేర్పు కలవాడు.

మూ. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః,

ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః. 16

ప్ర. అ. (ఆ రాముడు), సముద్రః = సముద్రము, సిన్ధుభిః ఇవ = నదులచేత వలె, సద్భిః = సత్పురుషులచేత, సర్వదా = ఎల్లప్పుడును, అభిగతః = పొందబడినవాడు, ఆర్యః = చేరదగినవాడు, లేదా పూజ్యుడు, సర్వసమః = అందరి విషయమునందును సమముగా ప్రవర్తించువాడు, సదైకప్రియదర్శనః = ఎల్లపుడును ఒకే విధముగ ప్రీతికర మగు దర్శనము కలవాడు.

తా. నదులు ఎల్లపుడును, అనగా మూడు కాలములందును, సముద్రమును చేరుచుండు నట్లు సత్పురుషులు ఎల్లవేళల రామునివద్దకు వచ్చుచుందురు. ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి విషయమునను సమముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లపుడును ఒకే విధముగ ఆనందజనకముగా ఉండును.

వి. సర్వసమః - జాతివర్ణాదితారతమ్యము లేక సమస్త భూతముల విషయమునను సమాన మగు ప్రేమతో వ్యవహరించువాడు. జాతిగుణవృత్త్యాది తారతమ్యములు లేక అందరును ఈతనిని ఆశ్రయింతురు. ఏవకారము ‘‘దీనిలో ఎన్నడును మార్పు లేదు’’ అని సూచించుచున్నది (గోవిందరాజులు).

సర్వదాఅనుటవలన - సముద్రుని సేవించుటకు నదులకు కాలనియమము ఏ విధముగ అక్కఱలేదో అట్లే రాముని సేవించుటయందు భక్తులకు కాలనియమము అక్కఱలే దని సూచించబడినది.

‘‘అభిగతః’’ అను శబ్దముచే ‘‘సత్పురుషులకు శ్రీరాముడే పరమప్రాప్య స్థానము’’ అని సూచితమగుచున్నది.

‘‘సముద్రః సిన్ధుభిరివ’’ అను ఉపమానము, నదులకు సముద్రము తప్ప వేరు గతి లేనట్లు, సత్పురుషులకు రాముడు తప్ప గత్యంతరము లేదని సూచించుచున్నది.

మూ. స చ సర్వగుణోపేతః కౌసల్యానన్దవర్ధనః,

సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ. 17

ప్ర. అ. కౌసల్యానన్దవర్ధనః = కౌసల్యయొక్క ఆనందమును వృద్ధిపొందించు, సః చ = ఆ రాముడే, సర్వగుణోపేతః = అన్ని గుణములతో కూడినవాడు, గామ్భీర్యే = తన హృదయములో నున్నదానిని బైటికి తెలియకుండ చేయుటయందు, సముద్రః ఇవ = సముద్రము వంటివాడు, ధైర్యేణ = ధైర్యముచేత, హిమవానివ = హిమవత్పర్వతము వంటివాడు.

తా. కౌసల్యకు ఆనందమును వృద్ధిపొందించు ఆ రాముడే సకలగుణములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రము వంటివాడు. ధైర్యమునందు హిమవత్పర్వతము వంటివాడు.

వి. కౌసల్యానందవర్ధనః - దశరథుడు కోసలరాజపుత్రి యగు కౌసల్యయందే రాముని పుత్రునిగ పొందకలిగెను. అందుచే ‘‘కౌసల్యకు ఆనందమును పెంచువాడు’’ అని చెప్పబడినది (గోవిందరాజులు).

గాంభీర్య మనగా తన హృదయములో ఉన్నదానిని బైటికి తెలియనీయకుండుట. సముద్రుడు తనలో నున్న రత్నాదులను పైకి తెలియకుండ చేయుచుండునట్లు హృదయములో ఉన్నదానిని పైకి తెలియ నీయనివాడు అని అర్థము.

దుఖఃకారణ మున్నను దుఃఖమును పొంద కుండుట ధైర్యము. ఆ విషయమున రాముడు హిమవత్పర్వతము వంటివాడు. ‘‘గిరయో వర్షధారాభిర్హన్యమానా న వివ్యధుః, అభిభూయమానా వ్యసనైర్యథాధోక్షజచేతసః’’ (ఎన్నియో వ్యసనములు వచ్చినను విష్ణుభక్తులు ఏ విధముగా దుఃఖింపరో, అట్లే పర్వతములు వర్షధారలచే కొట్టబడుచున్నను దుఃఖింపలేదు) అని చెప్పి నట్లు, వర్షములు కురియుట, పిడుగులు పడుట, మొదలగు దుఃఖకారణము లున్నను పర్వతములకు వ్యథ కలుగదు. అట్టి పర్వతము లన్నిటికన్నను, పర్వతరా జగు హిమవంతుడు, మిక్కిలి ధైర్యశాలి. రాముడు ధైర్యముచే అట్టి హిమవంతునితో సమాను డని అర్థము.

మూ. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః,

కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః.

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. 18

ప్ర. అ. (ఆ రాముడు) వీర్యే = పరాక్రమమునందు, విష్ణునా = విష్ణువుతో, సదృశః = సమానమైనవాడు, సోమవత్ = చంద్రునివలె, ప్రియదర్శనః = ఆనందకరమైన దర్శనముకలవాడు, క్రోధే = కోపమునందు, కాలాగ్నిసదృశః = ప్రలయకాలాగ్నితో సమానుడు, క్షమయా = ఓర్పుచే, పృథినీసమః = భూమితో సమానుడు, త్యాగే = దానము చేయుటలో, ధనదేన = కుబేరునితో, సమః = సమానుడు, సత్యే = సత్యమునందు, అపరః = తనకంటె ఉత్కృష్ట మగు మరి ఎవరునూలేని, ధర్మః ఇవ = ధర్మదేవత వంటివాడు.

తా. రాముడు పరాక్రమమునందు విష్ణువుతో సమాన మైనవాడు. చంద్రదర్శనము వలె ఈతని దర్శనము ఆనందకరము. కోపము వచ్చినప్పుడు ప్రలయకాలాగ్ని వలె చాల భయంకర మైనవాడు. ఓర్పులో భూమివంటి వాడు. ఇతరులకు దానము చేయుటలో కుబేరుని వంటివాడు. సత్యమును సంరక్షించు విషయమున ధర్మదేవత వంటివాడు. ఈ విషయమున ఈతనిని మించినవారెవరును లేరు.

వి. వీర్యే - తనకు క్షతి లేకుండ చూచుకొనుచు ఇతరులను జయింపగలిగిన సామర్థ్యమునకు వీర్య మని పేరు. రాముడు విష్ణువే అయినను అవతార రూప మగు ఉపాధి (భేదమునకు కారణము) ని పట్టి విష్ణువుకంటె భిన్నుడు గాన విష్ణువుతో పోల్చుట జరిగినది. లేదా ‘‘వీర్యము విషయమున విష్ణువైన తనతో సమానుడు’’ అని అర్థము. అనగా తనకు తానే సాటి కాని వేరెవ్వరును సాటి కారని భావము. విష్ణువునందలి సగము భాగము మాత్రమే రామునియం దుండుటచే విష్ణుసాదృశ్యము చెప్పబడినది (గోవిందరాజులు). మరియొక ఉపమాన మేదియు లేనప్పుడు విష్ణువుతో సమాను డని చెప్పుటకన్న గత్యంతరము లేదు. (మహేశ్వరతీర్థులు).

క్షమయా పృథివీసమః - తనను జనులు తొక్కినను, తవ్వినను, మరి ఏమి చేసినను భూమి ఓర్పుతో సహించును. అట్లే తన కెంత అపకారము చేసినను అచేతన పదార్థము వలె మిన్నక ఉండువాడు అని అర్థము.

ధనదేన సమస్త్యాగే - ఇచట ‘‘ధనద’’ (ధనము నిచ్చువాడు) అను శబ్దమును ప్రయోగించుటచే కుబేరుని త్యాగవిశేషము సూచింపబడుచున్నది. ‘‘అట్టి కుబేరునితో సమానుడు’’.

సత్యే ధర్మ ఇవాపరః - అపరః = తనకంటె ఇతరమైన ఉత్కృష్టవస్తువులేని, ధర్మదేవత వంటివాడు (గోవిందరాజులు). అపరః = రెండవ, ధర్మదేవతయా, అన్నట్లు ఉన్నాడు (మహేశ్వరతీర్థులు).

అవ. నారదుడు, మొదట ‘‘ఇక్ష్వాకువంశప్రభవః’’ అను పదముచేత రామావతారమును చెప్పెను. ‘‘మహావీర్యః’ ‘‘శత్రునిబర్హణః’’ అను పదములచేత తాటకామారీచవధ పరశురామపరాభవములను సూచించెను. ‘‘లక్ష్మీవాన్’’ ‘‘శ్రీమాన్’’ అను పదములచేత సీతాపరిణయమును తెలియజేసెను. ‘‘ధనుర్వేదే చ నిష్ఠితః’’ అను వాక్యముచేత కౌశికునివలన రామునికి కలిగిన సమస్తాస్త్రప్రాప్తిని తెలిపెను. ఇట్లు బాలకాండకథను చెప్పి ఇపుడు అయోధ్యాకాండకథను చెప్పుచున్నాడు (మహేశ్వరతీర్థ గోవిందరాజులు).

మూ. తమేవంగుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్, 19

జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతమ్.

ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా, 20

యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ ప్రీత్యా మహీపతిః.

ప్ర. అ. మహీపతిః = భూమికి ప్రభువైన, దశరథః = దశరథుడు, ఏవం గుణసమ్పన్నమ్ = ఇట్టి గుణములతో గూడినవాడును, సత్యపరాక్రమమ్ = వ్యర్థము కాని పరాక్రమము కలవాడును, శ్రేష్ఠగుణైః = ఉత్తమములైన గుణములతో, యుక్తమ్ = కూడినవాడును, ప్రియమ్ = తనకు ప్రీతిపాత్రుడును, ప్రకృతీనామ్ = ప్రజలకు, హితైః = సౌఖ్యమును కలిగించు కార్యములతో, యుక్తమ్ = కూడినవాడును, జ్యేష్ఠం సుతమ్ = జ్యేష్ఠ కుమారుడును అగు,తమ్ = ఆ, రామమ్ = రాముని, ప్రకృతిప్రియకామ్యయా = ప్రజలకు ప్రియము చేయవలె ననెడు కోరికచేతను, ప్రీత్యా = ప్రేమచేతను, యౌవరాజ్యేన = యౌవ రాజ్యముతో, సంయోక్తుమ్ = కూర్చుటకు, ఐచ్ఛత్ = ఇచ్ఛయించెను.

తా. దశథమమహారాజు ప్రజలకు హితము చేయవలె నను కోరికతో, సమస్త సద్గుణసంపన్నుడును, అమోఘము లగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజలహితమునే కోరుచుండువాడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్ఠకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను.

మూ. తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ, 21

పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత,

వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్. 22

ప్ర. అ. అథ = పిమ్మట, తస్య = ఆ రామునియొక్క, అభిషేకసంభారాన్ = యౌవరాజ్యా భిషేకముకొరకై తీసికొని వచ్చిన వస్తుసామగ్రిని, దృష్ట్వా = చూచి, పూర్వమ్ = పూర్వము, దత్తవరా = ఇవ్వబడిన వరములు కలదియు, భార్యా = భార్యయు, దేవీ = రాణియు అయిన, కైకయీ = కైకయి, రామస్య = రాముని, వివాసనమ్ = ప్రవాసమునకు పంపివేయుట, భరతస్య = భరతుని, అభిషేచనమ్ = రాజ్యాభిషిక్తుని చేయుట అను, వరమ్ = వరమును, ఏనమ్ = ఈ దశరథమహారాజును, అయాచత = యాచించెను.

తా. దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామాగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు వరములిచ్చి యుండుటచే, వాటిలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలె ననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలె ననియు, దశరథుని కోరెను.

మూ. స సత్యవచనాచ్చైవ ధర్మపాశేన సంయతః,

వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్. 23

ప్ర. అ. సః = ఆ, దశరథః = దశరథుడు, సత్యవచనాత్ = సత్యవచనము అనెడు కారణమువలన, ధర్మపాశేన = ధర్మ మనెడు త్రాడుచేత, సంయతః = కట్టబడినవాడై, ప్రియం సుతమ్ = ప్రియసుతు డైన, రామమ్ = రాముని, వివాసయామాస = అరణ్యమునకు పంపెను.

తా. సత్యవాక్యమును పరిపాలించవలె నను కారణముచే, ఆ దశరథుడు, ధర్మపాశముచే బంధింపబడినవాడై, తన ప్రియపుత్రు డైన రాముని వనములకు పంపెను.

మూ. స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్,

పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. 24

ప్ర. అ. వీరః = వీరుడైన, సః = ఆ రాముడు, కైకేయ్యాః = కైకేయికి, ప్రియకారణాత్ = ప్రీతికి హేతువైన, పితుః = తండ్రియొక్క, వచననిర్దేశాత్ = మాట అనెడు ఆజ్ఞవలన, ప్రతిజ్ఞామ్ = తన ప్రతిజ్ఞను, అనుపాలయన్ = పాలించుకొనుచు, వనమ్ = అరణ్యమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. అతిపరాక్రమశాలి యైన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై, తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను.

వి.‘‘ప్రతిజ్ఞామనుపాలయన్’’ - రాముడు కైకేయితో - ‘‘తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితమ్, కరిష్యే ప్రతిజానే చ రామోద్విర్నాభిభాషతే’’ (తల్లీ రాజుగారికి ఏది ఇష్టమో, ఆ మాటను చెప్పుము. దానిని చేసెదను. ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాముడు రెండుమాటలు మాటలాడువాడు కాడు) అని పలికి ప్రతిజ్ఞ చేసెను. ఆ ప్రతిజ్ఞను రక్షించుచు అని అర్థము

మూ. తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ,

స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానన్దవర్ధనః,

భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్. 25

ప్ర. అ. వినయసంపన్నః = వినయముతో కూడినవాడును, భ్రాతుః = సోదరుడైన రామునకు, దయితః = ఇష్టుడును, ప్రియః భ్రాతా = సహజప్రీతి గల సోదరుడును అయిన, లక్ష్మణః = లక్ష్మణుడు, సుమిత్రానన్దవర్ధనః = సుమిత్రయొక్క ఆనందమును వృద్ధిపొందించుచున్నవాడై, సౌభ్రాత్రమ్ = సోదరస్నేహమును, అనుదర్శయన్ = చూపుచు, వ్రజన్తమ్ = అరణ్యమునకు వెళ్లుచున్న, తమ్ = ఆ, భ్రాతరమ్ = సోదరు డైన రాముని, స్నేహాత్ = స్నేహమువలన, అనుజగామ హ = అనుసరించి వెళ్లెను.

తా. లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుడైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృస్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్లెను. ఇట్లు ఉత్తమకార్యము చేయుటచే తల్లి యగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను.

మూ. రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా, 26

జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా,

సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః, 27

సీతా ప్యనుగతా రామం శశినం రోహిణీ యథా.

ప్ర. అ. రామస్య = రామునకు, దయితా = ఇష్టురాలును, భార్యా = భార్యయు, ప్రాణసమా = ప్రాణములతో సమానురాలును, నిత్యమ్ = నిత్యమును, హితా = హితమును చేయునదియు, జనకస్య = జనకమహారాజుయొక్క, కులే = కులమునందు, జాతా = పుట్టినదియు, నిర్మితా = సుందోపసుందులను మోహింప చేయుటకై నిర్మింపబడిన, దేవమాయేవ = దేవమాయ వలె, (తిలోత్తమ వలె) లేదా అమృతమథనానంతరము రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన విష్ణువుయొక్క మాయామోహినీ రూపము వలె ఉన్నదియు, సర్వలక్షణసంపన్నా సాముద్రికశాస్త్రములో చెప్పిన అన్ని శుభలక్షణములతో కూడినదియు, నారీణామ్ = స్త్రీలలో, ఉత్తమా = ఉత్తమురాలును, వధూః = దశరథుని కోడలు అగు, సీతాపి = సీత కూడ, రోహిణీ = రోహిణి, శశినం యథా = చంద్రుని వలె, రామమ్ = రాముని, అనుగతా = అనుసరించి వెళ్లినది.

తా. జనకుని వంశమునందు పుట్టి, రామునికి భార్యయై దశరథుని కోడలైన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయ వలె లోకోత్తర మైన సౌందర్యము కలది. సాముద్రికశాస్త్రములో చెప్పిన మంచి లక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్లెను.

మూ. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ, 28

శృఙ్గిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్,

గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్, 29

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా.

ప్ర. అ. (ఆ రాముడు) పౌరైః = అయోధ్యాపురమునందు నివసించువారిచేతను, పిత్రా = తండ్రియైన, దశరథేన చ = దశరథునిచేతను, దూరమ్ = చాల దూరమువరకును, అనుగతః = అనుసరింపబడెను. ధర్మాత్మా = ఆశ్రితరక్షణాది ధర్మములే స్వరూపముగా గల, రామః = రాముడు, గఙ్గాకూలే = గంగాతీరమునందు ఉన్న, శృఙ్గిబేరపురే = శృంగిబేరమనెడు పట్టణమునందు, నిషాదాధిపతిమ్ = బోయవారికి అధిపతియైన, ప్రియమ్ = తనయందు ప్రీతి గల, గుహమ్ = గుహుని, అసాద్య = చేరి, గుహేన = గుహునితోడను, లక్ష్మణేన = లక్ష్మణునితోడను, సీతయా చ = సీతాదేవితోడను, సహితః = కూడినవా డై, సూతమ్ = సారథియైన సుమంత్రుని, వ్యసర్జయత్ = వెనుకకు పంపివేసెను.

తా. పౌరులును, దశరథుడును చాల దూరమువరకు రాముని వెంబడించిరి. ధర్మాత్ముడైన ఆ రాముడు, గంగాతీరమునందు, శృంగిబేరమనెడు పట్టణములో, బోయల ప్రభువైన గుహుని కలిసికొనెను. సీతాలక్ష్మణ గుహులతో కూడిన ఆ రాముడు తన సారథియైన సూతుని వెనుకకు పంపివేసెను.

అర్థాంతరము - ‘‘గుహేన స హితో రామః’’ అనునపుడు ‘‘గుహేన, సః, హితః, రామః’’ అని పదచ్ఛేదము. సః రామః = ఆ రాముడు, గుహేన = గుహునిచేత, హితః = పంపబడెను, అనగా గంగను దాటింపబడెను.

తా. ధర్మాత్ము డైన రాముడు గంగాతీరమునందు శృంగిబేర పురములోనున్న నిషాదాధిపతి యైన గుహుని చేరి, సారథిని వెనుకకు పంపివేసెను. ఆ గుహుడు సీతాలక్ష్మణసమేతు డగు రాముని గంగానది దాటించెను.

వి. పౌరులు పరమభక్తి కలవా రగుటచే రాముని చాల దూరమువరకు అనుసరించి వెళ్లిరి. మరల ఎక్కడ వియోగము కలుగునో అను భయమునకు పరమభక్తి యని పేరు. ‘‘పునర్విశ్లేషభీరుత్వం పరమా భక్తి రుచ్యతే’’.

‘‘శృఙ్గిబేరమ్’’ అనగా జింకలు మొదలగు కొమ్ములు గల జంతువుల శరీరములు, అనగా ఆ ఆకారముగల బొమ్మలు ఉండెడు పట్టణము అని అర్థము. ‘‘శృఙ్గిణాం బేరాణి యస్మిన్ తత్ శృఙ్గిబేరమ్’’ అని విగ్రహవాక్యము. బేరమ్ అనగా శరీరము. ఆ పట్టణమునందు జింకలు మొదలగు మృగముల బొమ్మలు నిర్మించి అచ్చటచ్చట ఉంచెడివారు. వాటిని చూచి జింకలు మొదలైన మృగములు తమ సజాతీయమృగములను భ్రాంతిచే వాటి దగ్గరకు రాగా వాటిని పట్టుకొనెడి వారు. దీనిని పట్టి ఆ పట్టణములో నివసించువారి సాధారణవృత్తి జీవహింస యని సూచిత మగుచున్నది. ‘‘గుహతీతి గుహః’’ ‘‘పరద్రవ్యాదులను దాచువాడు’’ అని అర్థము. పరులను హింసించి, వారి ధనాదులను లాగికొని దాచువాడు గుహుడు. ఈ విధముగ గుహుడు కులవృత్తిచేతను స్వవృత్తిచేతను కూడ అతినీచు డైనను, తనయందు ప్రేమ కలిగి వర్తించినంతమాత్రముచేతనే రాముడు వానియందు కూడ సీతాలక్ష్మణులపై నున్నంత స్నేహము నుంచెను. దీనిని పట్టి ఆశ్రితుడెట్టివా డైనను అతనిని రాముడు రక్షించు నని సూచిత మగుచున్నది (గోవిందరాజులు).

మూ. తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః, 30

చిత్రకూట మనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్,

రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః, 31

దేవగన్ధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్.

ప్ర. అ. తే = ఆ సీతారామలక్ష్మణులు, వనేన = ఒక వనమునుండి, వనమ్ = మరియొక వనమును, గత్వా = పొంది (చేరుచు), బహూదకాః = అధికమైన జలము గల, నదీః = నదులను, తీర్త్వా = దాటి, అను = అటుతరువాత, భరద్వాజస్య = భరద్వాజమహర్షియొక్క, శాసనాత్ = ఆజ్ఞవలన, చిత్రకూటమ్ = చిత్రకూటపర్వతమును, ప్రాప్య = పొంది, రమ్యమ్ = సుందరమైన, ఆవసథమ్ = గృహమును, కృత్వా = నిర్మించుకొని, తే = అట్టి, అనగా అయోధ్యలో సమస్త సుఖములు అనుభవించిన, త్రయః = ముగ్గురును, తత్ర = ఆ చిత్రకూటపర్వతమునం దున్న, వనే = వనమునందు, రమమాణాః = క్రీడించుచు, దేవగన్ధర్వసఙ్కాశాః = దేవతలతోను గంధర్వులతోను సమానులై, సుఖమ్ = సుఖముగా, న్యవసన్ = నివసించిరి.

తా. ఆ సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె సుఖముగా ఉండిరో అట్లే సుఖముగా నివసించిరి.

అర్థాంతరములు - తే + అవనేనఅని పదచ్ఛేదము. వారు, అవనేన = పరస్పర రక్షణముచేత - ఒకరి నొకరు రక్షించుకొనుచు, వనం గత్వా.... వనే = వనమునందు, తే = ఆ అయోధ్యలో ఉండువారుగానే, అయోధ్యలో ఉన్నట్లే, రమమాణాః = క్రీడారసము ననుభవించుచు, సీతారాములు వనవిహారాదిక్రీడారసము ననుభవించిరి. లక్ష్మణుడు తత్సేవారసము ననుభవించెను. దేవగన్ధర్వసఙ్కాశాః - దేవ = లక్ష్మీనారాయణులతోను (దేవీ చ దేవశ్చ దేవౌ), గన్ధర్వ = జీవన్ముక్తునితోను (గానం ధారయతీతి గన్ధర్వః, గానమును ధరించుచుండును. అనగా పాడుచుండును అని అర్థము) సంకాశాః = సమానులై, సీతారాములు లక్ష్మీనారాయణులతోను, లక్ష్మణుడు సామగానపరుడగు జీవన్ముక్తునితోను సమానులు అని అర్థము.

తా. ఆ సీతారామలక్ష్మణులు ముగ్గురును పరస్పరము రక్షించుకొనుచు, అరణ్యములో ప్రవేశించి, నదులు దాటుచు, భరద్వాజాజ్ఞవలన చిత్రకూటపర్వతమునకు వెళ్ళిరి. అచట ఒక పర్ణశాల నిర్మించుకొని అయోధ్యలో ఎట్లు సుఖముగా ఉండిరో అట్లే సుఖముగా నుండిరి. సీతారాములు లక్ష్మీనారాయణుల వలెను, సాక్షాల్లక్ష్మీ నారాయణస్వరూప లైన ఆ సీతారాములను సేవించు లక్ష్మణుడు సామగాన పరాయణుడగు జీవన్ముక్తుని వలెను ఆనందముతో ఉండిరి.

మరి యొక అర్థము - వారు మువ్వురును, అవనేన సహ = స్థలప్రదేశముతో గూడ, వనం గత్వా = అరణ్యమును పొంది, స్థలప్రదేశమును అరణ్యమును కూడ పొంది అని అర్థము. బహూదకాః, నదీః, అను, తీర్త్వా, భరద్వాజస్య శాసనాత్ చిత్రకూటం ప్రాప్య రమ్యమ్ ఆవసథం కృత్వా, తే = వనవాసులుగానే, అనగా నాగరికులుగా నుండి నూతనముగా వనవాసు లైనవారి కుండెడు వైలక్షణ్యమేమియు లేక యెప్పటికిని వనములోనే వాసముచేయుచుండు వారుగానే అని అర్థము. ‘‘తత్ర వనే రమమాణాః దేవగన్ధర్వసఙ్కాశాః సుఖం న్యవసన్.’’

తా. ఆ సీతారామలక్ష్మణులు ముగ్గురును స్థల ప్రదేశములలోను, వన ప్రదేశములలోను సంచరించుచు, భరద్వాజాజ్ఞవలన చిత్రకూటపర్వతము చేరి, అచట పర్ణశాల నిర్మించుకొని, నగరములో సుఖ మనుభవించినవారము అనెడు భేద మెంతమాత్రము లేక, మొదటినుండియు వనములోనే ఉండువారు ఎట్లు సంతోషముతో ఉందురో అట్లే సంతోషముతో నున్నవారై, ఆ చిత్రకూటవనములో విహరించుచు, దేవగంధర్వుల వలె సుఖముగా నుండిరి.

మరి యొక అర్థము :- తే త్రయః, తేవనేన = క్రీడచేత, మిగిలినది పైన చెప్పినట్లే.

తా. ఆ సీతారామలక్ష్మణులు క్రీడించుచున్నట్లు సుఖముగా అరణ్యము

ప్రవేశించి.... మొ.

మరి యొక అర్థము :- తే త్రయః, తేవనేన = కాలినడకచేత.... శేషము పై విధముగానే.

తా. ఆ సీతారామలక్ష్మణులు కాలినడకచేత అరణ్యమును ప్రవేశించి......... మొ.

భరద్వాజః :- బిభ్రత్ వాజః = భరద్వాజః, ‘వాజఃఅనగా ప్రజఅని వేదములో చెప్పబడినది. ‘‘ప్రజలను భరించువాడు’’ అని అర్థము. లేదా - వాజఃఅనగా ‘‘రేతస్సు’’ అని వేదమునందు చెప్పబడినది. రేతస్సును ధరించినవాడు, అనగా నిత్యబ్రహ్మచారి అని అర్థము (ఇవి తనిశ్లోకిలో చెప్పిన అర్థములు).

మూ. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా,

రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్. 32

ప్ర. అ. రామే = రాముడు, తథా (ఇది గోవిందరాజపాఠము) = అట్లు, చిత్రకూటం గతే = చిత్రకూటమునకు వెళ్లగా, పుత్రశోకాతురః = కుమారుని గూర్చిన దుఃఖముచేత పీడింపబడిన, రాజా దశరథః = దశరథమహారాజు, సుతమ్ = కుమారుని గూర్చి, విలపన్ = ఏడ్చుచు, స్వర్గమ్ = స్వర్గమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచేత పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థు డయ్యెను.

వి.‘‘తథా’’కు బదులు తదాఅని మహేశ్వరతీర్థపాఠము. తదా = అప్పుడు.

మూ. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః,

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. 33

ప్ర. అ. తస్మిన్ = దశరథుడు, మృతే = మరణింపగా, మహాబలః = గొప్పశక్తిగల, భరతః తు = భరతుడు కూడ, వసిష్ఠప్రముఖైః = వసిష్ఠుడు మొదలైన, ద్విజైః = బ్రాహ్మణులచేత, రాజ్యాయ = రాజ్యము చేయుటకు, నియుజ్యమానః = జ్ఞాపింపబడిన వాడైనను, రాజ్యమ్ = రాజ్యమును, నైచ్ఛత్ = అంగీకరించలేదు.

తా. దశరథుడు మరణించిన పిదప వసిష్ఠాదులు రాజ్యము చేయు మని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను, తనకు రాజ్యము చేయు సామర్థ్యమున్నను, భరతుడు రామునిపై తన కున్న గౌరవముచే, రాజ్యమునకు ఒప్పుకొనలేదు.

మూ. స జగామ వనం వీరో రామపాదప్రసాదకః. 34

ప్ర. అ. వీరః = రాగద్వేషాదులను జయించిన, సః = ఆ భరతుడు, రామపాదప్రసాదకః = పూజ్యుడైన రాముని ప్రసన్నునిగా చేసికొనువాడై, లేదా, రాముని పాదములను ప్రసన్నములుగా చేసికొనువాడై, వనమ్ = అరణ్యమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింప చేసికొనుటకై అరణ్యమునకు వెళ్లెను.

మూ. గత్వా తు సమహాత్మానం రామం సత్యపరాక్రమమ్,

అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః 35

ప్ర. అ. ఆర్యభావపురస్కృతః = వినయముచే పూజింపబడిన, లేదా పూజింపబడిన వినయము గల ఆ భరతుడు, సమహాత్మానమ్ = మిక్కిలి పూజ్యమైన హృదయము కలవాడును, సత్యపరాక్రమమ్ = సత్యమునందు దృఢవ్రతము కలవాడును అగు, రామమ్ = రాముని, గత్వా = చేరి, భ్రాతరమ్ = సోదరుడైన, రామమ్ = ఆ రాముని, అయాచత్ = ప్రార్థించెను.

తా. భరతుడు వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు, రాముని చేరి ప్రార్థించెను.

వి. ఒక రామమ్అను పదమునకు ‘‘సంతోషమును కలిగించువాడు’’ అని అర్థము చెప్పవచ్చును. రామం రామమ్ = సంతోషముకలిగించు రాముని. తుఅనునది పాదపూరణార్థము.

మూ. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్.

ప్ర. అ. ధర్మజ్ఞః = ధర్మముల నెరిగిన, త్వమేవ = నీవే, రాజా = రాజువు; ఇతి = అని, రామమ్ = రాముని గూర్చి, వచః = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ‘‘నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అన్నగా రుండగా తమ్ముడు రాజ్యము చేయరాదు అను ధర్మము నీకు తెలియనిది కాదు. అందుచేత నీవే రాజు కావలెను’’ అని భరతుడు రామునితో చెప్పెను.

మూ. రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః, 36

న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః.

ప్ర. అ. రామోఽపి = సమస్తజనులను ఆనందింపచేయువా డైనను, పరమోదారోఽపి = స్వసాయుజ్యము మొదలైన అన్ని కోరికలను తీర్చువాడైనను, సుముఖోఽపి = యాచకులు లభించుటచే ప్రసన్న మైన ముఖము కలవా డైనను, సుమహాయశాః = దానాతిశయముచే కలిగిన గొప్ప కీర్తి కలవా డైనను, మహాబలః = ఒక బాణముచేత సమస్తరాక్షసులను సంహరించు నంత బలము కలవా డైనను, లేదా ఆశ్రితుల కోరికలను తీర్చు సామర్థ్యము కలవాడైనను, రామః = రాముడు, పితుః = తండ్రియొక్క, ఆదేశాత్ = ఆజ్ఞవలన, రాజ్యమ్ = రాజ్యమును, నైచ్ఛత్ = కోరలేదు.

తా. రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుజ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. ఎవరైన యాచించినంత మాత్రముననే ‘‘యాచకుల మనోరథమును తీర్చు భాగ్యము నా కబ్బినది కదా’’ అని సంతోషించును. ‘‘న హ్యర్థినః కార్యవశాదుపేతాః కకుత్స్థవంశే విముఖాః ప్రయాన్తి’’ (ఏదైన కార్యమును కోరి కకుత్స్థ వంశము వారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు) అని విష్ణుపురాణములో చెప్పి నట్లు ప్రసిద్ధమైన దానజనితకీర్తి కలవాడు. ఆశ్రయించిన వారి అభీష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదుస్వభావు డైనను రాముడు, తండ్రి యాజ్ఞను అనుసరింపవలెనను దీక్షచే, భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు.

వి.‘‘న చ ఐచ్ఛత్’’ అని కారమును ప్రయోగించుటచే తండ్రి చెప్పిన గడువు తరువాత రాజ్యమును గ్రహించుటకు అంగీకరించెను అని సూచితము.

మూ. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః,

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. 37

ప్ర. అ. భరతాగ్రజః = రాముడు, రాజ్యాయ = రాజ్యముచేయుటకు, అస్య = ఈ భరతునకు, పాదుకే = (తన) పాదుకలను, న్యాసమ్ = న్యాసమునుగా (ఇల్లడగా), దత్వా = ఇచ్చి, తతః = అటుపిమ్మట, పునః పునః = మాటిమాటికిని, భరతమ్ = భరతుని, నివర్తయామాస = మరలించెను.

తా. ‘‘నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకొనుము’’ అని చెప్పి, తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేక విధముల బోధించి అయోధ్యకు పంపెను.

మూ. స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్,

నన్దిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా. 38

ప్ర. అ. సః = ఆ భరతుడు, కామమ్ = కోరికను, అనవాప్యైవ = పొందకయే, రామపాదౌ = రాముని పాదుకలను, ఉపస్పశన్ = సేవించుచు, రామాగమన కాంక్షయా = రాముడు తిరిగి రాగల డను కోరికతో, నన్దిగ్రామే = నందిగ్రామము నందు, రాజ్యమ్ అకరోత్ = రాజ్యము చేసెను.

తా. రాముని తిరిగి తీసికొనివెళ్లవలె నన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నందిగ్రామ మనెడు గ్రామములో నివసించి, రాజ్యము చేసెను.

మూ. గతే తు భరతే శ్రీమాన్ సత్యసన్ధో జితేన్ద్రియః, 39

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ,

తత్రాగమనమేకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ. 40

ప్ర. అ. భరతే = భరతుడు, గతే తు = వెళ్లినవాడగుచుండగా, శ్రీమాన్ = భరతాగమనముచే కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే ప్రశస్తమైన కాంతి కలవాడును, సత్యసన్ధః = భరతుడు నిర్బంధించినను ఎంతమాత్రము చలింపని ప్రతిజ్ఞ కలవాడును, జితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడును, అనగా భరతాదుల ప్రార్థనలు వ్యాజముగా గొని తాను తిరిగి పోయి భోగములను అనుభవింపవచ్చును. ఐనను అట్టి భోగచాపలము లేనివాడు అని అర్థము. రామః తు = రాముడు, నాగరస్య జనస్య చ = నగర జనముయొక్కయు, (చకారముచే భరతునియొక్కయు అని సూచన), పునః = మరల, తత్ర = ఆ చిత్రకూట పర్వతమునందు, ఆగమనమ్ = రాకను, ఆలక్ష్య = ఊహించి, ఏకాగ్రః = (తండ్రియాజ్ఞను నిర్వర్తించుటకు) ఏకాగ్రచిత్తుడై, లేదా (విరోధులైనరాక్షసు లుండుటచే) సావధానుడై, దణ్డకాన్ = దండకారణ్యమును, ప్రవివేశ హ = ప్రవేశించెను.

తా. భరతుడు వెళ్లగానే రాముడు, అతడు వచ్చుటచే తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే సర్వాతిశాయి యగు కాంతి కలవాడై, భరతు డెంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞనుండి చలింపక, కౌసల్యాభరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజముగా తీసికొని తాను మరల రాజ్యము నంగీకరించుటకు అవకాశమున్నను, రాజ్యభోగములపై ఎంతమాత్రము చాపలము చూపక, అయోధ్యాపౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకావనమును ప్రవేశించెను.

అవ :- ఇపుడు అరణ్యకాండకథను చెప్పుచున్నాడు -

మూ. ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః,

విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ.

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా. 41

ప్ర. అ. రాజీవలోచనః = పద్మములవంటి నేత్రములు గల, రామః = రాముడు, మహారణ్యమ్ = దండకారణ్యమును, ప్రవిశ్య తు = ప్రవేశించగనే, విరాధమ్ = విరాధుడను, రాక్షసమ్ = రాక్షసుని, హత్వా = చంపి, శరభఙ్గమ్ = శరభంగ మహర్షిని, సుతీక్ష్ణం చ = సుతీక్ష్ణ మహర్షిని, అగస్త్యం చ = అగస్త్యుని, తథా = మరియు, అగస్త్యభ్రాతరం చ = అగస్త్యుని సోదరుని, దదర్శ హ = చూచెను.

తా. పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధు డను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష్ణ - అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను.

మూ. అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైన్ద్రం శరాసనమ్,

ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ. 42

ప్ర. అ. అగస్త్యవచనాత్ చ ఏవ = అగస్త్యుని మాట ప్రకారమే, ఐన్ద్రమ్ = ఇంద్రునిచే ఇవ్వబడిన, శరాసనమ్ = ధనుస్సును, ఖడ్గం చ = కత్తిని, అక్షయసాయకౌ = అక్షయము లైన బాణములు గల, తూణీ చ = అమ్ముల పొదులను, పరమప్రీతః = చాల సంతసించినవాడై, జగ్రాహ = స్వీకరించెను.

తా. అగస్త్యుడు తన కింద్రు డిచ్చిన ధనుస్సును, కత్తిని, తరగని బాణములు గల అమ్ములపొదులను తీసికొను మని రామున కీయగా అతడు తనకు తగిన ఆయుధములు దొరికినందులకు చాల సంతసించి, వానిని గ్రహించెను.

మూ. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ,

ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్. 43

ప్ర. అ. తస్య రామస్య = ఆ రాముడు, వనే = శరభంగమహర్షి ఆశ్రమమునందు, వసతః = నివసించుచుండగా, సర్వే = అందరు, ఋషయః = ఋషులును, వనచరైః = సహ = వానప్రస్థులైన మునులతో గూడ, అసురరక్షసాం వధాయ = అసురులను, రాక్షసులను చంపు మని కోరుటకు, అభ్యాగమన్ = వచ్చిరి.

తా. రాముడు శరభంగమహర్షి తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టు ప్రక్కల నున్న ఋషులందరును, ‘‘అసురులను, రాక్షసులను సంహరింపుము’’ అని ప్రార్థించుటకై రామునివద్దకు వచ్చిరి.

అర్థాంతరము: వనచరైః సహ వసతః తస్య రామస్య = మునులతో కలిసి నివసించుచున్న ఆ రామునకు, ఋషులందరును, అసురరక్షసామ్ = (అసు+ర = ప్రాణములను గ్రహించువారు) తమను హింసించుచున్న రాక్షసుల యొక్క, వధకొరకై, అభ్యాగమన్ = శరణాగతులైరి.

తా. శరభంగతపోవనమునందు మునులతో కూడి నివసించుచున్న ఆ రామునకు, దండకావనములో నివసించు ఋషు లందరును, తమను హింసించుచున్న రాక్షసులను చంపించుటకై, శరణాగతులైరి (గోవిందరాజులు).

మూ. స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే,

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్, 44

ఋషీణామగ్నికల్పానాం దణ్డకారణ్యవాసినామ్. 45

ప్ర. అ. సః = రాముడు, రాక్షసానామ్ = రాక్షసుల (నివాసమైన), వనే = వనమునందు, తేషామ్ = ఆ ఋషుల, తథా = ఆ ప్రార్థనను, ప్రతిశుశ్రావ = అంగీకరించెను. రామేణ = రామునిచేత, అగ్నికల్పానామ్ = అగ్నితో సమానులైన, దణ్డకారణ్యవాసినామ్ = దండకారణ్య మునందు నివసించుచున్న, ఋషీణామ్ = ఋషులకు, సంయతి = యుద్ధమునందు, రక్షసామ్ = రాక్షసులయొక్క, వధశ్చ = చంపుటయు, ప్రతిజ్ఞాతః = ప్రతిజ్ఞచేయబడినది.

తా. రాక్షసనివాస మైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. ‘‘యుద్ధములో రాక్షసులను సంహరించెదను’’ అని అగ్నితుల్యతేజస్కు లగు ఆ దండకారణ్యవాసిమునులకు మాట ఇచ్చెను.

మూ. తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ,

విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ. 46

ప్ర. అ. తత్రైవ = ఆ దండకారణ్యమునందు, వసతా = నివసించుచున్న, తేన = ఆ రామునిచేత, కామరూపిణీ = ఇష్టమువచ్చిన రూపము ధరించు సమర్థురాలును, జనస్థాననివాసినీ = జనస్థాన మను పేరుగల దండకారణ్యమునకు సంబంధించిన ఒక ప్రదేశమునందు వాసము చేయుచుండునదియు అగు, శూర్పణఖా = శూర్పణఖ యనెడు, రాక్షసీ = రాక్షసస్త్రీ, విరూపితా = వికృత మైన రూపము కలదిగా చేయబడెను.

తా. రాముడా దండకారణ్యములోనే నివసించుచు, ఆ దండకారణ్యమునందు, రావణుని సేనానివేశస్థాన మగు జనస్థానమునందు వాసము చేయు, కామరూపిణి యగు శూర్పణఖ యను రక్కసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను.

వి.‘‘శూర్పతుల్యాః నఖాః యస్యాః సా శూర్పణఖా’’ - చేటలవంటి గోళ్లు గల స్త్రీ. శూర్పణఖను విరూపిణిగా చేసినది లక్ష్మణుడు కాని రాముడు కాదు. అయినను - ‘‘రామస్య దక్షిణో బాహుః’’ అని లక్ష్మణుడు రాముని కుడిచెయ్యి వంటి వాడని చెప్పబడుటచేతను, లక్ష్మణుడు రామాజ్ఞచేతనే అట్లు చేసినందువలనను రాముడే శూర్పణఖను విరూపిణిగా చేసినట్లు చెప్పబడినది (గోవిందరాజులు).

మూ. తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్,

ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్, 47

నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్.

ప్ర. అ. తతః = అటుపిమ్మట, శూర్పణఖావాక్యాత్ = శూర్పణఖయొక్క మాటవలన, ఉద్యుక్తాన్ = యుద్ధముచేయుటకు సన్నద్ధులైన, సర్వరాక్షసాన్ = అందరు రాక్షసులను, ఖరమ్ = ఖరుని, త్రిశిరసం చైవ = త్రిశిరసుని, దూషణమ్ = దూషణు డను, రాక్షసం చైవ = రాక్షసుని, తేషామ్ = వారియొక్క, పదానుగాన్ చ ఏవ = అనుచరులను, రామః = రాముడు, రణే = యుద్ధమునందు, నిజఘాన = చంపెను.

తా. శూర్పణఖ విరూపిత యైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను.

మూ. వనే తస్మిన్నివసతా జనస్థాన నివాసినామ్,

రక్షసాం నిహతాన్యాసన్ సహప్రాణి చతుర్దశ. 48

ప్ర. అ. తస్మిన్ = ఆ, వనే = వనమునందు, నివసతా = నివసించుచున్న ఆ రామునిచేత, జనస్థాననివాసినామ్ = జనస్థానమునందు నివసించుచున్న, రక్షసామ్ = రాక్షసులయొక్క, చతుర్దశ = పదునాలుగు, సహస్రాణి = వేలు, నిహతాని = చంపబడినవి, సన్ = అయినవి.

తా. దండకారణ్యమునందు నివసించు నపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగు వేలమందిని సంహరించెను.

మూ. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః,

సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్. 49

ప్ర. అ. తతః = అటుపిమ్మట, రావణః = రావణుడు, జ్ఞాతివధమ్ = జ్ఞాతులవధను, శ్రుత్వా = విని, క్రోధమూర్ఛితః = కోపముతో నిండినవాడై, మారీచం నామ = మారీచు డనెడు, రాక్షసమ్ = రాక్షసుని, సహాయమ్ = సహాయునిగా, వరయామాస = కోరెను.

తా. పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని, మిక్కిలి కోపించినవాడై, తనకు సాహాయ్యముచేయు మని మారీచు డను రాక్షసుని కోరెను.

వి.‘‘రావయతీతి రావణః’’ - ‘‘లోకముచే రోదనధ్వని చేయించువాడు’’ అని అర్థము. ‘‘రు శబ్దే’’ అను ధాతువునుండి నిష్పన్నమైనది. ‘‘విశ్రవసో విశ్రవణ రవణౌ’’ అను ప్రమాణమును పట్టి ‘‘విశ్రవసః అపత్యం పుమాన్ రావణః’’ అను విగ్రహముచే రావణఃఅనగా విశ్రవసుని కుమారుడని అర్థము (గోవిందరాజులు).

మూ. వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః,

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే. 50

ప్ర. అ. సః = ఆ, రావణః = రావణుడు, ‘‘రావణ = ఓ రావణా బలవతా = ఖరాది రాక్షసులను చంపుటచే ప్రసిద్ధ మైన బలము గల, తేన = ఆ రామునితో, విరోధః = విరోధము, తే = నీకు, న క్షమః = తగినది కాదు, అని, సుబహుశః = అనేకపర్యాయములు, వార్యమాణః = అడ్డగింపబడినవాడు, (అభూత్ = ఆయెను).

తా. ‘‘ఓ రావణా మహాబలవంతులైన ఖరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షసులను చంపి నట్టి బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనుకుము’’ అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను.

మూ. అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః,

జగామ సహమారీచ స్తస్యాశ్రమపదం తదా. 51

ప్ర. అ. రావణః = రావణుడు, కాలచోదితః = మృత్యువుచే ప్రేరితుడై, తద్వాక్యమ్ = ఆ వాక్యమును, అనాదృత్య తు = ఆదరింపకయే, సహమారీచః = మారీచునితో కూడినవాడై, తదా = అప్పుడు, తస్య = ఆ రామునియొక్క, ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను.

మూ. తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ,

జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్. 52

ప్ర. అ. మాయావినా = మాయావియైన, తేన = ఆ మారీచునిచేత, నృపాత్మజౌ = రాజకుమారు లైన ఆ రామలక్ష్మణులను, దూరమ్ = దూరముగా, అపవాహ్య = తొలగిపోవునట్లు చేయించి, జటాయుషమ్ = జటాయు వను, గృధ్రమ్ = గ్రద్దను, హత్వా = చంపి, రామస్య = రామునియొక్క, భార్యామ్ = భార్య యైన సీతను, జహార = అపహరించెను.

తా. మాయావి యైన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాలనుండి చాల దూరము వెళ్లిపోవునట్లు చేసి, రాముని భార్య యగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును చంపెను.

మూ. గృధ్రం చ నిహతం దృష్ట్యా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్,

రాఘవః శోకసన్తప్తో విలలాపాకులేన్ద్రియః. 53

ప్ర. అ. రాఘవః = రాముడు, నిహతమ్ = పడగొట్టబడిన, గృధ్రమ్ = జటాయువును, దృష్ట్వా = చూచి, మైథిలీమ్ = సీతను, హృతామ్ = హరింపబడిన దానినిగా, శ్రుత్వా చ = విని, శోకసన్తప్తః = దుఃఖముచే మిక్కిలి తపింపబడినవాడై, ఆకులేన్ద్రియః = వ్యాకుల మైన ఇంద్రియములు కలవాడై, విలలాప = విలపించెను.

తా. రాముడు, చచ్చుటకు సిద్ధమై పడియున్న జటాయువును చూచి, ఆ జటాయువు వలన సీతాదేవిని రావణు డపహరించినట్లు విని, మిక్కిలి దుఃఖితుడై, ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను.

మూ. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్,

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ, 54

కబన్ధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్. 55

ప్ర. అ. తేన = ఆ, శోకేనైవ = దుఃఖముచేతనే, తతః = వ్యాపింపబడిన ఆ రాముడు, గృధ్రమ్ = గ్రద్దయైన, జటాయుషమ్ = జటాయువును, దగ్ధ్వా = దహించి, వనే = అరణ్యమందు, సీతామ్ = సీతాదేవిని, మార్గమాణః = వెదకుచు, రూపేణ = అకారముచే, వికృతమ్ = వికారముగానున్న, ఘోరదర్శనమ్ = భయంకరమైన దర్శనము గల, కబన్ధం నామ = కబంధుడనెడు, రాక్షసమ్ = రాక్షసుని, సందదర్శ హ = చూచెను.

తా. అత్యధిక మైన దుఃఖముతో రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసి, సీతకై వెదకుచు, ఆ వనములో వికృత మైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధు డనెడి రాక్షసుని చూచెను.

మూ. తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః

స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్, 56

శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవ.

ప్ర. అ. మహాబాహుః = గొప్ప బాహువులు గల, ఆ రాముడు, తమ్ = ఆ కబంధుని, నిహత్య = చంపి, దదాహ = కాల్చివేసెను. సః = అతడు, స్వర్గతశ్చ = స్వర్గమును పొందెను, స చ = స్వర్గమునకు వెళ్లుచున్న ఆ కబంధుడు, రాఘవ = ఓ రామా ధర్మచారిణీమ్ = ధర్మములను ఆచరించున్నదియు, ధర్మనిపుణామ్ = ధర్మములయందు సమర్థురాలును, శ్రమణీమ్ = సన్న్యాసాశ్రమమును స్వీకరించి ఉన్నదియు అగు, శబరీమ్ = శబరజాతి స్త్రీని గూర్చి, అభిగచ్ఛ = వెళ్లుము, ఇతి = అని, అస్య = ఈ రామునకు, కథయామాస = చెప్పెను.

తా. బలిష్ఠము లైన బాహువులు గల ఆ రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా, అతడు స్వర్గమునకు వెళ్లెను. అతడు స్వర్గమునకు పోవుటకు ముందు ‘‘ఓ రామా ధర్మమును ఆచరించుటయందు నేర్పు కలదియు, ధర్మమును ఆచరించునదియు, అగు ఒక శబరస్త్రీ సన్న్యాసాశ్రమమును స్వీకరించుయున్నది. ఆమె వద్దకు వెళ్లుము’’ అని చెప్పెను.

విశేషార్థము: ‘‘చతుర్థమాశ్రమం ప్రాప్తాః శ్రమణా నామ తే స్మృతాః’’ (నాల్గవ ఆశ్రమమును స్వీకరించినవారు శ్రమణులు) అని చెప్పుటచే శ్రమణులనగా సన్న్యాసులు. కావున ‘‘శ్రమణీ’’ అని చెప్పబడినది.

జితేంద్రియురాలై మోక్షోపయుక్తాచారనిష్ఠ యగు స్త్రీ శ్రమణి; (మహేశ్వరతీర్థులు).

‘‘నృపాయాం వైశ్యతో జాతః శబరః పరికీర్తితః, మధూని వృక్షాదానీయ విక్రీణీతే స్వవృత్తయే’’ (క్షత్రియస్త్రీకి వైశ్యునివలన పుట్టినవాడు శబరుడు. వృక్షముల నుండి తేనెను తీసి, విక్రయించుట అతని జీవిక) అను నారదీయవచనానుసారముగా క్షత్రియస్త్రీయందు వైశ్యునకును పుట్టినది శబరి (గోవిందరాజులు).

బౌద్ధసన్న్యాసులకు శ్రమణు లను నామము కలదు. ఇచట శ్రమణీశబ్దమున్నది గాన రామాయణము బుద్ధుని తరువాత వ్రాయబడిన దని కొందరు చెప్పుచుందురు. కాని, నాస్తికులకు బౌద్ధు లను పేరు ప్రాచీనకాలముననే ఉన్నది. శ్రమణశబ్దము స్మృతులలో ప్రయుక్త మైయున్నది. అందుచే పై వాదము యుక్తము కాదని మరికొందరు సమాధానము చెప్పుదురు.

మూ. సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః,

శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః. 57

ప్ర. అ. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడును, శత్రుసూదనః = శత్రుసంహారకుడును అయిన, సః = ఆ రాముడు, శబరీమ్ = శబరిని గూర్చి, అభ్యగచ్ఛత్ = వెళ్లెను. దశరథాత్మజః రామః = దశరథుని కుమారు డైన రాముడు, శబర్యా = శబరిచేత, సమ్యక్ = బాగుగా, పూజితః = పూజింపబడెను.

తా. మహాతేజశ్శాలియు, శత్రుసంహారకుడును అయిన రాముడు భక్త పరాధీనుడు గాన తానే స్వయముగ శబరి దగ్గరకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగ పూజించెను.

వి.‘‘దశరథాత్మజః’’ అను విశేషణము - అరువదివేల సంవత్సరములు, సంతానములేకయుండి తరువాత మహాప్రయత్నము చేసి సంతానము పొందిన దశరథుడు, తన ప్రియపుత్రుడగు రామునకిచ్చు భోజనముకంటెను ఆ శబరస్త్రీ ఇపుడిచ్చిన వన్యాహారముతో కూడిన ఆతిథ్యము రామునకు హెచ్చుగా ప్రీతి కలిగించినదని సూచించుచున్నది (గోవిందరాజులు).

అవ. ఇపుడు కిష్కింధాకాండ కథ చెప్పబడుతున్నది -

మూ. పమ్పాతీరే హనుమతా సఙ్గతో వానరేణ హ,

హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. 58

ప్ర. అ. పమ్పాతీరే = పంపాసరస్తీరమునందు, హనుమతా = హనుమంతుడనెడు, వానరేణ = వానరునితో, సఙ్గతః హ = చేరెను. హనుమద్వచనాత్ = హనుమంతుని మాటవలన, సుగ్రీవేణ చైవ = సుగ్రీవునితోగూడ, సమాగతః = చేరెను.

తా. రాముడు పంపాసరస్తీరమునహనుమంతునితో పరిచయ మేర్పరచుకొని పిదప అతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను.

వి. హనుమాన్ = ప్రశస్తమైన చెక్కిళ్ల మీది భాగము కలవాడు. పూర్వము హనుమంతుడు పుట్టుచునే సూర్యుని చూచి ‘‘ఇది ఒక ఫలము; దీనిని భక్షించెదను’’ అని తలచి అతనిపై కెగిరెను. ఇట్లు సూర్యుని వేడిని ఎంతమాత్రము లెక్కింపక మూడువందల యోజనముల వరకు పైకి లంఘింపగా, ఇంద్రుడు చూచి, కోపించి, హనుమంతునిపై వజ్రాయుధమును వేసెను. వజ్రము దెబ్బ తగిలి హనుమంతుడు ఒక కొండపై పడిపోగా అతని వామహనువు భగ్నమయ్యెను. అందుచే అతనికి హనుమంతు డను పేరు వచ్చెను. ఈ శబ్దముచే మహాపరాక్రమశాలి యని సూచింపబడుచున్నది.

‘‘సీతను పోగొట్టుకొని దుఃఖితుడై అరణ్యములో సంచరించుచున్న రామునకు, మహాపరాక్రమశాలియైన హనుమంతుని స్నేహము ఘటిల్లెను. సంతోషము’’ అని ఈ శ్లోకమునందు కవితాత్పర్యము (గోవిందరాజులు).

మూ. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః,

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. 59

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము గల, రామః = రాముడు, ఆదితః = మొదటి నుండియు, తత్ = ఆ, సర్వమ్ = సమస్త మైన, (వృత్తమ్ = వృత్తాంతమును), విశేషతః = ప్రధానముగా, సీతాయాశ్చ = సీతయొక్క వృత్తాంతమును, యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా, సుగ్రీవాయ చ = సుగ్రీవునకును, హనుమంతునకును కూడ, శంసత్ = చెప్పెను.

తా. మహాబలు డగు రాముడు తనవృత్తాంతము నంతను, మొదటినుండియు సుగ్రీవహనుమంతులకు చెప్పి, విశేషించి సీతావృత్తాంతమును వారికి తెలిపెను.

మూ. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః,

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్. 60

ప్ర. అ. వానరః = వానరుడైన, సుగ్రీవః = సుగ్రీవుడు, రామస్య = రామునియొక్క, తత్ సర్వమ్ = ఆ వృత్తాంతము నంతను, శ్రుత్వా = విని, ప్రీతః = సంతోషించినవాడై, అగ్నిసాక్షికం చైవ = అగ్ని సాక్షిగా ఉండగా, రామేణ = రామునితో, సఖ్యమ్ = స్నేహమును, చకార = చేసెను.

తా. సుగ్రీవుడు రాముని వృత్తాంత మంతయు విని, తనవలెనే దుఃఖితుడైన మహాబలునితో పరిచయము కలిగినందుకు సంతోషించి, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసికొనెను.

మూ. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి,

రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. 61

ప్ర. అ. తతః = అటుపిమ్మట, దుఃఖితేన = దుఃఖితుడైన, వానరరాజేన = సుగ్రీవునిచేత, వైరానుకథనం ప్రతి = వాలితో కలిగిన వైరమును గూర్చిన ప్రశ్నకు సమాధానముగా, రామాయ = రామునకు, సర్వమ్ = అంతయు, ప్రణయాత్ = స్నేహమువలన, ఆవేదితమ్ = తెలుపబడెను.

తా. ‘‘నీకును వాలికిని విరోధ మెట్లు ఏర్పడినది?’’ అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతము అంతయు తెలిపెను.

మూ. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి,

వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. 62

ప్ర. అ. తదా = అప్పుడు, రామేణ = రామునిచేత, వాలివధం ప్రతి = వాలిని చంపుటను గూర్చి, ప్రతిజ్ఞాతమ్ = ప్రతిజ్ఞ చేయబడినది, తత్ర = అచట, వానరః = సుగ్రీవుడు, వాలినః = వాలియొక్క, బలమ్ = బలమును, కథయామాస = వర్ణించి చెప్పెను.

తా. వాలిని చంపెద నని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడ రామునకు - (అరుణోదయము మొదలు సూర్యోదయము లోపల నాలుగు సముద్రములందును అర్ఘ్యములు విడుచుట మొదలగు) వాలియొక్క బలవిశేషములను గూర్చి చెప్పెను.

మూ. సుగ్రీవః శఙ్కితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే, 63

రాఘవప్రత్యయార్థం తు దున్దుభేః కాయముత్తమమ్,

దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్. 64

ప్ర. అ. సుగ్రీవశ్చ = సుగ్రీవుడు, రాఘవే = రామునివిషయమున, వీర్యేణ = పరాక్రమముచేత, నిత్యమ్ = ఎల్లప్పుడును, శఙ్కితః = సందేహము కలవాడై, ఆసీత్ = ఉండెను. సుగ్రీవః = సుగ్రీవుడు, రాఘవప్రత్యయార్థమ్ = రామునియందు తనకు నమ్మకము ఏర్పడుటకై, దున్దుభేః = దుందుభి యను రాక్షసునియొక్క, ఉత్తమమ్ = శ్రేష్ఠమైన, మహాపర్వతసన్నిభమ్ = గొప్ప పర్వతముతో సమానమైన, కాయమ్ = కళేబరమును, దర్శయామాస = చూపెను.

తా. సుగ్రీవుడు రాముని చూచినది మొదలు ‘‘ఇతడు వాలిని చంప సమర్థుడో, కాడో’’ అని సందేహించుచుండెను. అతడు రామునివిషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలె నున్న, దుందుభి యను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను. (పూర్వ మొకప్పుడు దానిని వాలి చాలదూరముగ విసరివేసెను).

మూ. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః,

పాదాఙ్గుష్ఠేన చిక్షేప సమ్పూర్ణం దశయోజనమ్. 65

ప్ర. అ. మహాబాహుః = గొప్ప బాహువులు కలవాడును, మహాబలః = గొప్ప బలము కలవాడును అగు రాముడు, అస్థి = ఎముకను, ప్రేక్ష్య = చూచి, ఉత్ స్మయిత్వా = గంభీరముగా కొంచెము నవ్వి, పాదాఙ్గుష్ఠేన = కాలి బొటనవ్రేలితో, సంపూర్ణం దశయోజనమ్ = పూర్తి పదియోజనముల దూరము, చిక్షేప = చిమ్మెను.

తా. అంగుళ్యగ్రమాత్రముచే రాక్షసాది సమస్తలోకవిరోధులను వధించుటకు సమర్థములైన బాహువులును, లెక్కింపరాని వీర్యమును గల రాముడు - ‘‘నా విషయమై జ్ఞానులు కూడ మోహము పొందుచుందురు. అరణ్యములోని ఈ వానరుడు మోహము నొందుటలో ఏమి ఆశ్చర్యము’’ అని గంభీరముగా చిరునవ్వు నవ్వి, అస్థిమయమై పడి యున్న ఆ దుందుభి కళేబరమును చూచి, కొంచె మైనను తక్కువ కాకుండ పది యోజనముల దూరములో పడు నట్లు, దానిని దన పాదాంగుష్ఠముతో చిమ్మెను (మహేశ్వరతీర్థుల వ్యాఖ్యానము)

‘‘ఉత్స్మయిత్వా’’ అను పదములో ఉన్న ‘‘ఉత్’’ అను ఉపసర్గను, ‘చిక్షేపఅను క్రియాపదముతో కలిపి - ‘‘ఉచ్చిక్షేప = ఎత్తి విసరెను’’ అని గోవిందరాజులు అర్థము చెప్పిరి.

తా. ఊహింపరాని బలము కలవాడును, ఆ బలమునకు తగినట్లు కార్యము చేయు సమర్థము లైన బాహువులు కలవాడును అగు రాముడు అస్థిమయ మైన ఆ దుందుభికళేబరమును చూచి, ‘‘ఇది ఎంత?’’ అని నవ్వి, కొంచె మైనను తక్కువ లేకుండ పది యోజనముల దూరములో పడునట్లు, దానిని తన పాదాంగుష్ఠముతో ఎత్తి విసరెను.

మూ. బిభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషుణా,

గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. 66

ప్ర. అ. తదా = అప్పుడు, పునశ్చ = మరల, ప్రత్యయమ్ = నమ్మకమును, జనయన్ = పుట్టించుచు, ఏకేన = ఒక, మహేషుణా = గొప్ప బాణముచేత, సప్త = ఏడు, సాలాన్ = మద్దిచెట్లను, గిరిమ్ = పర్వతమును, రసాతలం చైవ = పాతాళమును, బిభేద = భేదించెను.

తా. అప్పు డా రాముడు, సుగ్రీవున కింకను నమ్మకము కలుగుటకై ఒక్క బాణముచే ఏడు మద్దిచెట్లను, పర్వతమును, పాతాళమును భేదించెను.

మూ. తతః ప్రీతమనాశ్చైవ విశ్వస్తశ్చ మహాకపిః,

కిష్కిన్ధాం రామసహితో జగామ చ గుహాం తదా. 67

ప్ర. అ. తః = అటుపిమ్మట, తేన = దానిచేత, ప్రీతమనాః = సంతసించిన మనస్సు గల, సః = ఆ, మహాకపిః = సుగ్రీవుడు, విశ్వస్తశ్చ = నమ్మకము కూడ కుదిరినవాడై, తదా = అప్పుడు, రామసహితః = రామునితో కూడినవాడై, గుహామ్ = గుహవలె నున్న, కిష్కిన్ధామ్ = కిష్కింధానగరమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. రాముడు ఆ సప్తసాలాది భేదనము చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించు నని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహ వలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళ్లెను.

మూ. తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపిఙ్గళః,

తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. 68

ప్ర. అ. తతః = అటుపిమ్మట, హరివరః = వానరశ్రేష్ఠుడును, హేమపిఙ్గలః = బంగారము వలె పచ్చని రంగు గలవాడును అగు, సుగ్రీవః = సుగ్రీవుడు, అగర్జత్ = గర్జించెను. తేన = ఆ, మహతా = గొప్పదైన, నాదేన = ధ్వనిచేత, హరీశ్వరః = వానరరాజైన వాలి, నిర్జగామ = బైటకు వచ్చెను.

తా. కిష్కింధ ప్రవేశించి, బంగారువంటి వన్నె గల వానరశ్రేష్ఠు డైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదమును విని వాలి గృహమునుండి బైటకువచ్చెను.

మూ. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః,

నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః. 69

ప్ర. అ. తదా = అప్పుడు, తారామ్ = భార్యయైనతారను, అనుమాన్య = ఒప్పించి, సుగ్రీవేణ = సుగ్రీవునితో, సమాగమః = చేరెను. రాఘవః చ = రాముడు, తత్ర = అచట, ఏనమ్ = ఈ వాలిని, ఏకేన = ఒక, శరేణ = బాణముచేత, నిజఘాన = చంపెను.

తా. వాలి, యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను.

మూ. తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలిన మాహవే,

సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. 70

ప్ర. అ. రాఘవః = రాముడు, సుగ్రీవవచనాత్ = సుగ్రీవుని మాటప్రకారము, ఆహవే = యుద్ధమునందు, వాలినమ్ = వాలిని, హత్వా = చంపి, తతః = అటుపిమ్మట, తద్రాజ్యే = ఆ వాలియొక్క రాజ్యమునందు, సుగ్రీవమేవ = సుగ్రీవునే, ప్రత్యపాదయత్ = ప్రతిష్ఠించెను.

తా. రాముడు సుగ్రీవుని ప్రార్థనప్రకారము వాలిని సంహరించి, అతని రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తుని చేసెను.

మూ. స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః,

దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్. 71

ప్ర. అ. సః = ఆ, వానరర్షభశ్చ = సుగ్రీవుడును, జనకాత్మజామ్ = సీతాదేవిని, దిదృక్షుః = చూడ ఇచ్ఛ కలవాడై, సర్వాన్ = సమస్తమైన, వానరాన్ = వానరులను, సమానీయ = రప్పించి, దిశః = దిక్కులను గూర్చి, ప్రస్థాపయామాస = పంపెను.

తా. వానరశ్రేష్ఠు డగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను.

అవ. ఇపుడు సుందరకాండకథను చెప్పుచున్నాడు -

మూ. తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్ బలీ,

శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్. 72

ప్ర. అ. తతః = అటుపిమ్మట, బలీ = బలశాలి యైన, హనుమాన్ = హనుమంతుడు, సంపాతేః = సంపాతి యను పేరు గల, గృధ్రస్య = గ్రద్దయొక్క, వచనాత్ = మాటవలన, శతయోజనవిస్తీర్ణమ్ = నూరుయోజనముల వెడల్పు గల, లవణార్ణవమ్ = లవణ సముద్రమును, పుప్లువే = దాటెను.

తా. మహాబలిశాలి యగు హనుమంతుడు సంపాతి యనెడు గ్రద్దచెప్పిన ప్రకారము నూరు యోజనముల వెడల్పు గల లవణసముద్రమును దాటెను.

మూ. తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్,

దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్. 73

ప్ర. అ. రావణపాలితామ్ = రావణునిచే పాలింపబడిన, లఙ్కామ్ = లంక అనెడు, పురీమ్ = పట్టణమును, సమాసాద్య = చేరి, తత్ర = ఆ లంకాపురియందు, అశోకవనికాం గతామ్ = అశోకవనములో నున్న, ధ్యాయన్తీమ్ = (రామునే) ధ్యానము చేయుచున్న, సీతామ్ = సీతను, దదర్శ = చూచెను.

తా. హనుమంతుడు రావణుడు పాలించుచున్న లంకాపురము చేరి, అచట అశోకవనములో రామునే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని చూచెను.

మూ. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ,

సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్. 74

ప్ర. అ. అభిజ్ఞానమ్ = గుర్తును, నివేదయిత్వా = సమర్పించి, ప్రవృత్తించ = వృత్తాంతమును, నివేద్య చ = విన్నవించి, వైదేహీమ్ = సీతాదేవిని, సమాశ్వాస్య = ఓదార్చి, తోరణమ్ = బహిర్ద్వారమును, మర్దయామాస = చూర్ణము చేసెను.

తా. హనుమంతుడు, తన చేతికి రాముడిచ్చిన అంగుళీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును విన్నవించి, ఆమెను ఊరడించి, అశోకవనబహిర్ద్వారమును చూర్ణము చేసెను.

మూ. పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రిసుతానపి,

శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. 75

ప్ర. అ. పఞ్చ = ఐదుగురు, సేనాగ్రగాన్ = సేనానాయకులను, సప్త = ఏడుగురు, మన్త్రిసుతానపి = మంత్రికుమారులను, హత్వా = చంపి, శూరమ్ = శూరుడైన, అక్షం చ = అక్షుని, నిష్పిష్య = ముద్దచేసి, గ్రహణమ్ = బంధనమును, సముపాగమత్ = పొందెను.

తా. హనుమంతుడు సేనాపతుల నైదుగురిని, మంత్రిపుత్రులను ఏడుగురిని చంపి, శూరు డైన అక్షకుమారుని వధించి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టువడెను.

మూ. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్,

మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా, 76

తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్,

రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః. 77

ప్ర. అ. వీరః = వీరుడైన, మహాకపిః = హనుమంతుడు, పైతామహాత్ = బ్రహ్మ ఇచ్చిన, వరాత్ = వరమువలన, ఆత్మానమ్ = తనను, అస్త్రేణ = బ్రహ్మాస్త్రముచే, ఉన్ముక్తమ్ = విడువబడినవానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, యదృచ్ఛయా = మరి యొక కార్యమునందలి అపేక్షచేత, యన్త్రిణః = తనను త్రాటిచే కట్టిన, తాన్ = ఆ, రాక్షసాన్ = రాక్షసులను, మర్షయన్ = సహించుచు, తతః = ఆ కార్య మైన తరువాత, మైథిలీమ్ సీతామ్ ఋతే = సీత తప్ప మిగిలిన, లఙ్కాం పురీమ్ = లంకా పట్టణమును, దగ్ధ్వా = కాల్చి, రామాయ = రామునకు, ప్రియం = సంతోషవార్తను, ఆఖ్యాతుమ్ = చెప్పుటకు, పునః = మరల, ఆయాత్ = వచ్చెను.

తా. పరాక్రమశాలి యగు హనుమంతుడు, పూర్వము బ్రహ్మదేవుడు తన కిచ్చిన వరముల ప్రభావమువలన, తనను బ్రహ్మస్త్రబంధము వదిలిపోయినట్లు తెలిసినను, తనను త్రాళ్లచే కట్టి ఈడ్చుకొని పోవుచున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను, రావణుని చూడ గోరి, ఆ రాక్షసుల బాధలను సహించెను. రావణునితో మాట లాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప లంకా పురి నంతయు కాల్చి, రామునకీ సంతోషవార్త చెప్పుటకై మరల రాముని సమీపమునకు వెళ్లెను.

మూ. సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్,

న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః. 78

ప్ర. అ. అమేయాత్మా = ఇంతటి దని చెప్ప శక్యముకాని బుద్ధి గల, సః = ఆ హనుమంతుడు, మహాత్మానమ్ = గొప్ప ధైర్యము గల, రామమ్ = రాముని, అభిగమ్య = పొంది, ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము, కృత్వా = చేసి, సీతా = సీతాదేవి, దృష్టా = చూడబడినది, ఇతి = ఇట్లని, తత్త్వతః = యథార్థముగా, న్యవేదయత్ = తెలిపెను.

తా. అతిబుద్ధిశాలి యగు హనుమంతుడు, సీతావియోగము కలిగినను ఎంతమాత్రము ధైర్యము తగ్గని రామునివద్దకు వెళ్లి, అతనికి ప్రదక్షిణ నమస్కారము చేసి ‘‘చూచితిని సీతను’’ అని యథార్థముగా విన్నవించెను.

వి.‘‘సీతా దృష్టా’’ (సీతాదేవి చూడబడినది) అని చెప్పదగి ఉన్నను అట్లు చెప్పక ‘‘దృష్టా సీతా’’ (చూడబడినది సీత) అని చెప్పెను. సీతాఅని ఉచ్చరించినంత మాత్రముననే, పై పదము నుచ్చరించుటకు ముందు ‘‘సీత బ్రతికి యున్నదో లేదో; చూడబడినదో లేదో’’ అను అమంగళకర మగు శంక రామునకు కలుగకుండవలె నని అట్లు చెప్పెను.

అవ. యుద్ధకాండకథ చెప్పబడుచున్నది -

మూ. తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః,

సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః. 79

ప్ర. అ. తతః = అటుపిమ్మట, సుగ్రీవసహితః = సుగ్రీవునితో కూడినవాడై, మహోదధేః = మహాసముద్రముయొక్క, తీరమ్ = తీరమును, గత్వా = చేరి, ఆదిత్యసన్నిభైః = సూర్యునితో సమానమైన, శరైః = బాణములచే, సముద్రమ్ = సముద్రుని, క్షోభయామాస = క్షోభింపచేసెను.

తా. సుగ్రీవునితో కలిసి రాముడు సముద్రతీరము చేరి, సముద్రుడు తనకు వశము కానందులకు కోపించి, సూర్యుని వలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను.

మూ. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః,

సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. 80

ప్ర. అ. సరితాం పతిః = నదులకు ప్రభు వైన, సముద్రః = సముద్రుడు, ఆత్మానమ్ = తనరూపమును, దర్శయామాస = చూపించెను. (రాముడు), సముద్రవచనాచ్చైవ = సముద్రుని మాటప్రకారమే, నలమ్ = నలుని (చేత), సేతుమ్ = సేతువును, అకారయత్ = చేయించెను.

తా. నదులకు పతి యైన సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా, అతని మాటలప్రకారము రాముడు నలునిచే సేతువు కట్టించెను.

మూ. తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే,

రామః సీతా మనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. 81

ప్ర. అ. రామః = రాముడు, తేన = ఆ సేతువుచే, లఙ్కాం పురీమ్ = లంకాపట్టణమును, గత్వా = పొంది, ఆహవే = యుద్ధమునందు, రావణమ్ = రావణుని, హత్వా = చంపి, సీతామ్ = సీతను, ప్రాప్య = పొంది, అను = అటుపిమ్మట, పరామ్ = అధికమైన, వ్రీడామ్ = సిగ్గును, ఉపాగమత్ = పొందెను.

తా. రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధమునందు రావణుని సంహరించెను. సీతను పొంది, ‘‘పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?’’ అని చాల సిగ్గుపడెను.

మూ. తామువాచ తతో రామః పరుషం జనసంసది,

అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ. 82

ప్ర. అ. తతః = ఆ కారణమువలన, రామః = రాముడు, జనసంపది = జనుల సమూహములో, తామ్ = ఆ సీతనుగూర్చి (తో), పరుషమ్ = పరుషముగా, ఉవాచ = పలికెను, సతీ = పతివ్రతయైన, సా సీతా = ఆ సీతాదేవి, అమృష్యమాణా = సహింపజాలనిదై, జ్వలనమ్ = అగ్నిని, వివేశ = ప్రవేశించెను.

తా. ఆ కారణమువలన రాముడు జను లందరిలోను, సీతతో పరుషముగా మాటలాడెను. మహాపతివ్రత యగు ఆ సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను.

మూ. తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్,

బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. 83

ప్ర. అ. తతః = పిమ్మట, రామః = రాముడు, అగ్నివచనాత్ = అగ్ని మాటవలన, సీతామ్ = సీతను, విగతకల్మషామ్ = పాపములు లేనిదానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, సంప్రహృష్టః = సంతసించినవాడై, సర్వదైవతైః = సమస్తదేవతలచేతను, పూజితః = పూజింపబడినవాడై, బభౌ = ప్రకాశించెను.

తా. ‘‘సీత ఎట్టిపాపమును లేనిది’’ అని అగ్ని చెప్పగా రాముడు చాల సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను.

మూ. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్,

సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. 84

ప్ర. అ. మహాత్మనః = గొప్ప ధైర్యము గల, రాఘవస్య = రాముని యొక్క, మహతా = గొప్పదైన, తేన కర్మణా = ఆ పనిచేత, సచరాచరమ్ = జంగమస్థావరములతో కూడిన, సదేవర్షిగణమ్ = దేవగణములతోడను మహర్షిగణములతోడను కూడిన, త్రైలోక్యమ్ = లోకత్రయము, తుష్టమ్ = సంతసించినది.

తా. మహాత్ము డైన రాముడు లోకకంటకు డైన రావణుని చంపుటచే స్థావరజంగమాత్మకము లైన మూడు లోకములను, దేవతాఋషిగణ సహితముగా సంతోషించినవి.

వి.‘‘అన్తఃసంజ్ఞా భవన్త్యేతే’’ (స్థావరము లైన ఈ వృక్షాదులకు కూడ సూక్ష్మమైన సంజ్ఞ ఉండును) అని విష్ణుపురాణమునందు చెప్పి నట్లు వృక్షాదిస్థావరములు కూడ తమ సంతోషమును చిగురించుట మొదలగు వానిచే సూచించును. (తిలకవ్యాఖ్య).

మూ. అభిషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్,

కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రముమోద హ. 85

ప్ర. అ. రామః = రాముడు, విభీషణమ్ = విభీషణుని, రాక్షసేన్ద్రమ్ = రాక్షసరాజునుగా, లఙ్కాయామ్ = లంకయందు, అభిషిచ్య = అభిషేకముచేసి, తదా = అప్పుడు, కృతకృత్యః = ప్రతిజ్ఞారూపకార్యమును నిర్వర్తించినవాడై, విగతజ్వరః = పోయిన సంతాపముగలవాడై, ప్రముమోద = సంతోషించెను, హ = ఆశ్చర్యము.

తా. రాముడు పూర్వము విభీషణుని సముద్రతీరమున అభిషిక్తుని చేసెను. ఇపుడు లంకాపురిలో కూడ విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి, కృతకృత్యు డయ్యెను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత తొలగిపోయెను. రాముని సత్యవ్రత మత్యాశ్చర్యకరము కదా!

అర్థాంతరము - విజ్వరః = పక్షి యైన జటాయువు విషయమునందు మాత్రమే సంతాపముకలవాడై, సంతోషించెను.

రాముడు తన ప్రతిజ్ఞ ప్రకారము విభీషణుని లంకాపురిలో అభిషిక్తుని చేసెను. కాని ఒక కొడుకు చనిపోయిన తండ్రి మరి యొక కొడుకునకు జరుగు ఉత్సవకాలమునందు సంతోషముతో నిండియున్నను చనిపోయిన కొడుకును తలచుకొని దుఃఖించు నట్లు రాజ్యాభిషేకము పొందకుండగనే చనిపోయిన జటాయువును తలచుకొని దుఃఖించుచు, ప్రతిజ్ఞ నెరవేరినందులకు సంతసించెను.

మూ. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్,

అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. 86

ప్ర. అ. రామః = రాముడు, దేవతాభ్యః = దేవతలనుండి, వరమ్ = వరమును, ప్రాప్య = పొంది, వానరాన్ = వానరులను, సముత్థాప్య చ = లేపి, సుహృద్వృతః = మిత్రులతో కూడినవాడై, పుష్పకేణ = పుష్పక మను విమానముచే, అయోధ్యామ్ = అయోధ్యను గూర్చి, ప్రస్థితః = ప్రయాణ మాయెను.

తా. రాముడు తనను చూడ వచ్చిన దేవతలనుండి వరమును పొందెను. దాని ప్రకారము మృతులైన వానరుల నందరిని బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి, పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను.

మూ. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః,

భరతస్యాన్తికం రామో హనూమన్తం వ్యసర్జయత్. 87

ప్ర. అ. సత్యపరాక్రమః = సత్యమునందు స్థిరత్వము గల, రామః = సకలజనమనోహరుడైన, రామః = రాముడు, భరద్వాజాశ్రమమ్ = భరద్వాజుని ఆశ్రమమును గూర్చి, గత్వా = వెళ్లి, హనూమన్తమ్ = హనుమంతుని, భరతస్యాన్తికమ్ = భరతుని దగ్గరకు, వ్యసర్జయత్ = పంపెను.

తా. సత్యమునందు స్థిరముగ నిలచువాడును, లోకాభిరాముడును అగు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్లెను. హనుమంతుని భరతుని వద్దకు పంపెను.

మూ. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః,

పుష్పకం తత్సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా. 88

ప్ర. అ. పునః = మరల, సుగ్రీవసహితః = సుగ్రీవునితో కూడిన, సః = ఆ రాముడు, ఆఖ్యాయికామ్ = పూర్వవృత్తాంతమును, జల్పన్ = చెప్పుచు, తదా = అప్పుడు, నన్దిగ్రామమ్ = నందిగ్రామమును, యయౌ = పొందెను.

తా. ఆ రాముడు సుగ్రీవవిభీషణాదులతో కూడి, పూర్వవృత్తాంతములను చెప్పుకొనుచు నందిగ్రామమునకు వెళ్లెను.

మూ. నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః,

రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. 89

ప్ర. అ. అనఘః = పాపరహితుడైన, రామః = రాముడు, నన్దిగ్రామే = నందిగ్రామమునందు, భ్రాతృభిః = సోదరులతో, సహితః = కూడినవాడై, జటామ్ = జడను, హిత్వా = విడచి, సీతామ్ = సీతాదేవిని, అనుప్రాప్య = పొంది, పునః = తిరిగి, రాజ్యమ్ = రాజ్యమును, అవాప్త వాన్ = పొందెను.

తా. ఎట్టిపాపములును లేని ఆ రాముడు నందిగ్రామమున సోదరుల నందరిని కలసెను. వారందరును జడలను విడచిరి. మునివేషమును విడచుటచే సీతతో గార్హస్థ్యమును అవలంబించెను. మరల రాజ్యమును పొందెను.

మూ. ప్రహ్నష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః,

నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః. 90

ప్ర. అ. లోకః = లోకము, ప్రహృష్టముదితః = గగుర్పాటు కలిగి సంతసించినది. తుష్టః = కోరిక తీరుటచే ప్రీతి చెందినది. పుష్టః = సంతోషముచే వృద్ధిపొందిన శరీరము కలదైనది. సుధార్మికః = ధర్మతత్పరమై ఉన్నది. నిరామయః = పీడలులేని దైనది. అరోగః = వ్యాధులులేని దైనది. దుర్భిక్షభయవర్జితః = క్షామము వలన కలుగు భయము లేనిదిగా అయినది.

తా. రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా, లోక మంతయు సంతోషాతిశయముచే గగుర్పాటు చెందెను. రాముడు రాజు కావలె ననెడు తమ కోరిక తీరుటచే ప్రజ లెల్లరు ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమాత్మకమగు లోకము యొక్క శరీరము వృద్ధి చెందినది. ప్రజలందరును చక్కగా ధర్మము నాచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షముల భయము తొలగిపోయెను.

మూ. న పుత్రమరణం కించిద్ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్,

నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః. 91

ప్ర. అ. పురుషాః = పురుషులు, క్వచిత్ = ఎక్కడను, కించిత్ = కొంచెమైనను, పుత్ర మరణమ్ = పుత్రమరణమును, న ద్రక్ష్యన్తి = చూడరు. నార్యశ్చ = స్త్రీలు కూడ, అవిధవాః = వైధవ్యము లేనివారై, నిత్యమ్ = నిత్యము, పతివ్రతాః = పతివ్రతలు, భవిష్యన్తి = కాగలరు.

తా. రాముడు రాజ్యము చేయుచున్నపుడు తండ్రి యుండగా పుత్రుడు మరణించడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు.

మూ. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జన్తి జన్తవః,

న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా, 92

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా.

ప్ర. అ. తత్ర = ఆ రామరాజ్యమందు, అగ్నిజమ్ = అగ్నివలన కలిగిన, భయమ్ = భయము, కించిత్ = కొంచమైనను, న = లేదు. జన్తవః = ప్రాణులు, అప్సు = నీటిలో, న మజ్జన్తి = మునిగి మరణించవు. వాతజమ్ = వాయువువలన కలుగు, భయమ్ = భయము, కించిత్ = కొంచెమైనను, న = లేదు. తథా = మరియు, జ్వరకృతమ్ అపి = జ్వరమువలన కలుగు భయము కూడ, న = లేదు. క్షుద్భయమ్ అపి = ఆకలివలన భయము కూడ, న = లేదు. తథా = మరియు, తస్కరభయమ్ = దొంగల భయము, న = లేదు.

తా. రాముని రాజ్యములో అగ్ని భయము కాని, జల భయము కాని, వాత భయము కాని, జ్వర భయము కాని, క్షుద్బాధ కాని, చోరభయము కాని లేదు.

మూ. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ,

నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. 93

ప్ర. అ. నగరాణి చ = నగరములును, రాష్ట్రాణి చ = రాష్ట్రములును, ధనధాన్యయుతాని = ధన ధాన్యములతో నిండినవి. సర్వే = అందరును, కృతయుగే = కృతయుగమునందు, యథా = ఎట్లో, తథా = అట్లే, నిత్యమ్ = ఎల్లప్పుడును, ప్రముదితాః = సంతోషముతో నున్నారు.

తా. నగరములు, దేశములు కూడ, ధనధాన్యసమృద్ధములై ఉన్నవి. కృత యుగములో వలెనే ప్రజ లందరును సంతోషవంతులై యున్నారు

మూ. అశ్వమేధశతైరిష్ట్యా తథా బహుసువర్ణకైః, 94

గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి,

అసంఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. 95

ప్ర. అ. మహాయశాః = గొప్ప కీర్తి గల రాముడు, అశ్వమేధశతైః = వందలాది అశ్వమేధయాగలములచేతను, తథా = మరియు, బహుసువర్ణకైః = బహుసువర్ణకము లనెడు యాగములచేతను, ఇష్ట్వా = దేవతలను తృప్తి పొందించి, గవామ్ = గోవులయొక్క, కోట్యయుతమ్ = పదివేల కోట్లను, అసంఖ్యేయమ్ = లెక్కింపరాని, ధనమ్ = ధనమును, బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు, దత్త్వా = ఇచ్చి, బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకమును గూర్చి (బ్రహ్మయగు తన స్థానమునకు), ప్రయాస్యతి = వెళ్లగలడు.

తా. గొప్ప కీర్తి గల రాముడు వందల కొలది అశ్వమేధయాగముల చేతను, అనేక బహుసువర్ణకయాగములచేతను దేవతలను పూజించి, పదివేల కోట్లగోవులను, లెక్కింప రానంత ధనమును బ్రాహ్మణుల కిచ్చి, శాశ్వత మగు తన స్థానమును పొందగలడు.

వి. ‘‘సుబాహూని సువర్ణాని యత్రోపకరణత్వతః, విన్దన్తే స క్రతుః సద్భిః స్మృతో బహుసువర్ణకః’’. (ఏ యాగమునందు మిక్కిలి అధికమైన సువర్ణము ఉపకరణముగా అనగా సాధనముగా ఉండునో దానికి బహుసువర్ణక మని పేరు) అను ప్రమాణమును బట్టి బహుసువర్ణక మనగా అధికముగా బంగారము దానము చేయు యాగ మని అర్థము.

‘‘మహాయశాః’’ అను పదముచే - స్వల్ప మగు అపవాదమునకై సీతాదేవిని విడిచి పెట్టుట సూచిత మగుచున్నది (గోవిందరాజులు).

మూ. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః,

చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. 96

ప్ర. అ. రాఘవః = రాముడు, అస్మిన్ లోకే = ఈ లోకమునందు, శతగుణాన్ = వందరెట్లు, రాజవంశాన్ = రాజవంశములను, స్థాపయిష్యతి = స్థాపింపగలడు, చాతుర్వర్ణ్యమ్ = నాలుగు వర్ణములను, స్వే స్వే ధర్మే = తమ తమ ధర్మమునందు, నియోక్ష్యతి = ప్రవర్తింప చేయగలడు.

తా. రాముడు క్షత్రియులకు రాజ్యము లిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్ణములవారిని వారి వారి ధర్మము లాచరించు నట్లు నియమించగలడు.

మూ. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ,

రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. 97

ప్ర. అ. రామః = రాముడు, దశవర్షసహస్రాణి = పదివేల సంవత్సరములు, దశవర్షశతాని చ = పదివందల సంవత్సరములు, రాజ్యమ్ = రాజ్యమును, ఉపాసిత్వా = సేవించి, బ్రహ్మలోకమ్ = బ్రహ్మయైన విష్ణువుయొక్క లోకమును, గమిష్యతి = పొందగలడు.

తా. రాముడు పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖము కలుగు నట్లు పాలించి, బ్రహ్మలోకమును చేరగలడు.

మూ. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్,

యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. 98

ప్ర. అ. పవిత్రమ్ = పరిశుద్ధిని కలిగించు నదియు, పాపఘ్నమ్ = పాపములను నశింప చేయునదియు, పుణ్యమ్ = పుణ్యమును చేయునదియు, వేదైః = వేదములతో, సమ్మితం చ = సమానమైనదియు, అగు, రామచరితమ్ = రామచరితమును, యః = ఎవడు, పఠేత్ = చదువునో, అతడు, సర్వపాపైః = సమస్తపాపములచే, ప్రముచ్యతే = విముక్తుడగును.

తా. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును. పాపములను నశింపచేయును. పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువాని సర్వపాపములును తొలగిపోవును.

మూ. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః,

సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. 99

ప్ర. అ. ఆయుష్యమ్ = ఆయుర్దాయమును వృద్ధి పొందించు నదియు, ఆఖ్యానమ్ = వాస్తవార్థము కలదియు అగు, ఏతత్ = ఈ, రామాయణమ్ = రామచరిత్రమును, పఠన్ = చదువుచున్న, నరః = మనుష్యుడు, సపుత్రపౌత్రః = పుత్రపౌత్రులతో కూడినవాడై, సగణః = భృత్యబంధుసమూహముతో కూడినవాడై, భోగములను అనుభవించి, ప్రేత్య = మరణించి (మరణానంతరము), స్వర్గే = స్వర్గమునందు, మహీయతే = పూజింపబడును.

తా. రామాయణ మనెడు ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతోను, భృత్యబంధుగణములతోను కూడి సర్వసౌఖ్యములను అనుభవించి, మరణానంతరము స్వర్గమునందు దేవతలచేత పూజింపబడును.

వి. "రామాయణమ్" రామస్య అయనమ్ = రాముని చరత్రము.

మూ. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్,

స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్,

వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్

జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్. 100

ప్ర. అ. పఠన్ = ఈ రామాయణము చదువు, జనః = మనుష్యుడు, ద్విజఃస్యాత్ = బ్రాహ్మణు డైనట్లైతే, వాగృషభత్వమ్ = అష్టాదశ విద్యలచే శ్రేష్ఠత్వమును, ఈయాత్ = పొందును. క్షత్రియః = క్షత్రియు డైనట్లైతే, భూమిపతిత్వమ్ = భూమండలమునకు ఆధిపత్యమును, ఈయాత్ = పొందును. వణిగ్జనః = వైశ్యు డైనట్లైతే, పణ్యఫలత్వమ్ = అమ్మెడి వస్తువుల నుండి లాభమును, ఈయాత్ = పొందును. శూద్రోఽపి చ = శూద్రు డైనట్లైతే, మహత్త్వమ్ = గొప్పతనమును, ఈయాత్ = పొందును.

తా. ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశవిద్యలందును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండలాధిపతి యగును. వైశ్యుడు పఠించినచో వ్యాపారమునందు లాభమును పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవా డగును.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డేసంక్షేపో నామ ప్రథమః సర్గః

ప్ర. అ. ఇట్లు, ఆర్షే = ఋషిప్రోక్తమైన, రామాయణే = రామాయణమనెడు, ఆదికావ్యే = ఆదికావ్యమునందలి, బాలకాణ్డే = బాలకాండమునందు, సంక్షేపో నామ = సంక్షేప మని ప్రసిద్ధిగల, ప్రథమః = మొదటి, సర్గః = సర్గ, (సమాప్తః = సమాప్తము).

తా. ఇట్లు ఋషిప్రోక్త మైన, రామాయణ మను ఆదికావ్యమునందలి బాలకాండమునందు, రామాయణ కథాసంక్షేపరూపమైన ప్రథమసర్గము ముగిసినది.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ప్రథమసర్గ సమాప్తము.

© 2026 Ebook Library