| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 8 |
| Pages | 17 |
| Read Time | 24 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ద్వితీయః సర్గః
రామాయణప్రారంభము తమసాతీరమున క్రౌంచపక్షిని వ్యాధుడు చంపగా చూచిన వాల్మీకి తన శోకమును శ్లోకరూపమున ప్రకటించుట. బ్రహ్మదేవుడు రామచరితవర్ణనాత్మక మగు కావ్యము రచింపు మని వాల్మీకిని ఆదేశించుట.
మూ. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః,
పూజాయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః. 1
ప్ర. అ. నారదస్య = నారదునియొక్క, తత్ = ఆ, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా తు = విననంతనే, వాక్యవిశారదః = వాక్యములయందు పండితుడును, ధర్మాత్మా = ధర్మమందు బుద్ధి గలవాడును అగు, మహామునిః = వాల్మీకి మహాముని, సహశిష్యః = శిష్యులతో కూడినవాడై, పూజయామాస = పూజించెను.
తా. వాల్మీకిమహాముని ధర్మబుద్ధి కలవాడు; వాక్యముల విశేషము తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేపరామాయణ రూప మగు వాక్యమును వినినంతనే దానిని శ్లాఘించెను. ఆయన శిష్యులు కూడ శ్లాఘించిరి.
విశేషార్థము - వాక్యవిశారదః = వాక్యరూపము లగు సమస్తశాస్త్రములందును పండితుడును, ధర్మాత్ముడును అగు వాల్మీకి, నారదస్య-‘‘నరతీతి నరఃప్రోక్తః పరమాత్మా సనాతనః’’ (సనాతను డగు పరమాత్మ ప్రపంచముయొక్క సృష్టిస్థితిలయములను నడిపించును గాన నరు డని చెప్పబడుచున్నాడు) అను ప్రమాణమును పట్టి ‘నరః’ అనగా పరమాత్మ. ‘‘నరసంబన్ధి నారమ్’’ - పరమాత్మకు సంబంధించిన జ్ఞానము నారము. ‘‘నారం దదాతీతి నారదః’’ - పరమాత్మకు సంబంధించిన జ్ఞానమును ఇచ్చువాడు నారదుడు. ఆశ్రితులకు బ్రహ్మోపదేశము చేయు అట్టి నారదుని యొక్క, తత్ = ఆ వేదాంత ప్రసిద్ధ మైన, వాక్యమును, వినినంతనే, మహామునిః = గొప్ప బ్రహ్మానుసంధానము చేయువాడై, శిష్యులతో కూడిన వాడై, పూజయామాస = శ్లాఘించెను (అని ప్రాచీనులు).
తా. సమస్త శాస్త్రార్థములు తెలిసికొని జ్ఞానమును కలిగించు కర్మల అనుష్ఠానము చేయుచున్న వాల్మీకి మహర్షి, బ్రహ్మోపదేశాచార్యు డైన నారద మహర్షి ఉపదేశించిన వేదాంతార్థములు వినినంతనే తాను బ్రహ్మానుభవమును పొందుటయే కాక శిష్యులకు కూడ ఆ అర్థమును ఉపదేశించి శిష్యులతో కూడిన వాడై యెల్లప్పుడును ఆ వేదాంతపరమార్థానందమునే అనుభవించుచుండెను.
మూ. యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా,
ఆపృష్ట్వెవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసమ్. 2
ప్ర. అ. దేవర్షిః = దేవతయును ఋషియును అయిన, సః = ఆ, నారదః = నారదుడు, తేన = ఆ వాల్మీకిచేత, తథా = అట్లు, యథావత్ = యథాయోగ్యముగ, పూజితః = పూజింపబడినవాడై, ఆపృష్ట్వైవ = ఆ వాల్మీకిని సంతోషపరచియే, అభ్యనుజ్ఞాతః = అనుజ్ఞను పొందినవాడై, విహాయసమ్ = ఆకాశమును, జగామ = పొందెను.
తా. దేవర్షి యైన నారదుడు వాల్మీకిచే యథోచితముగా పూజింపబడినవాడై, ఆ వాల్మీకిని ఆలింగనాదులచే సంతోషపరచి, వారి అనుజ్ఞ పొంది, ఆకాశమార్గమున దేవలోకమునకు వెళ్ళెను.
విశేషార్థము - దేవర్షిః = దేవతలలో జ్ఞానపారంగతు డైన, సః = ఆ(వాల్మీకికి జ్ఞానోపదేశము చేసిన), నారదః = జ్ఞానప్రదాత యగు నారదముని, తేన = శిష్యుడైన ఆ వాల్మీకమునిచేత, యథావత్ = గురువును పూజింపవలసినరీతిలో, పూజితః = పూజింపబడినవాడై, ఆపృష్ట్వా = సంశయముల నన్నింటిని తీర్చుటచే సంతోషపరచి, అభ్యనుజ్ఞాత ఏవ = అనుజ్ఞ పొందినవాడైయే, విహాయసమ్ = ఆకాశ మగుటను (భావప్రధాననిర్దేశము), జగామ = పొందెను.
తా. దేవతలలో జ్ఞానపారంగతుడును, ఆశ్రితులకు జ్ఞానము ఇచ్చువాడును అగు నారదమహాముని, వాల్మీకికి వేదాంత పరమార్థోపదేశము చేసి, ఆ వాల్మీకినుండి గురుపూజను పొంది, అతనికి గల సమస్త సంశయములను తీర్చి, సంతోషపరచెను. వాల్మీకికి పరమార్థోపదేశము చేయుటకు మాత్రమే నారదుడు గురుత్వాభిమానమును కల్పించుకున్నవాడు గాన ఆ యభిమానము కల్పితము. ఉపదేశానంతరము శాశ్వత మగు నిరభిమానత్వమే సిద్ధము. జ్ఞానోపదేశానంతరము వాల్మీకికి గల శిష్యత్వాభిమానము, నారదుని కున్న గురుత్వాభిమానము రెండును నశించుటవలన, మరల ఆకాశము వలె నిర్వికల్పమగు దన స్వరూపమును పొందెను.
మూ. స ము హూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా,
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః. 3
ప్ర. అ. తస్మిన్ = ఆ నారదుడు, ముహూర్తమ్ = అల్పకాలములో, దేవలోకమ్ = బ్రహ్మలోకమును, గతే = పొందగా, తదా = అప్పుడు, మునిః తు = వాల్మీకి మహాముని, జాహ్నవ్యాః = గంగానదికి, అవిదూరతః = సమీపమున నున్న, తమసాతీరమ్ = తమసానది గట్టును, జగామ = పొందెను.
విశేషార్థములు :- తస్మిన్ = తన గురు వైన నారద మహాముని, ముహూర్తమ్ = అల్పకాలమునందే, దేవలోకమ్ = పరబ్రహ్మయొక్క స్థానమును, అనగా పరబ్రహ్మ స్వరూపమును, గతే = పొందగా, తదా = అప్పుడు, మునిః = బ్రహ్మానుసంధానము చేయు జ్ఞాని యైన వాల్మీకి, జాహ్నవ్యాః.. (ఇది వ్యాఖ్యాత్రయసారము).
తా. ఆ నారద మహాముని, వాల్మీకికి ఉపదేశించిన వెంటనే, వాల్మీకికి ఉపదేశము చేయుటకొరకు కల్పించుకొనిన గురుత్వము మొదలైన అభిమానమును వదలెను. తన యథార్థరూప మగు బ్రహ్మత్వమును పొందెను. పిదప, వాల్మీకి మహర్షి తాను బ్రహ్మవేత్త అగుటచే తనకు కర్మానుష్ఠానావశ్యకత లేకపోయినను - ‘‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరే జనాః, స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’’ (శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతర జనులును ఆచరింతురు. ఆ శ్రేష్ఠుడు దేనిని ప్రమాణముగా గ్రహించునో దానినే లోక మంతయు అనువర్తించును) అని గీతలో చెప్పినట్లు, ఉత్తమమగు భృగువంశమునందు పుట్టిన వాడును, బ్రహ్మపుత్రుడైన నారదుని శిష్యుడును, జితేంద్రియు డగుటచే ‘వాల్మీకి’ అను సార్థక మైన నామధేయముతో ప్రసిద్ధుడను అగు తానే కర్మానుష్ఠానము చేయకున్నచో, కర్మానుష్ఠానము తప్ప మరి యొక మార్గము లేని సామాన్యజనులు కూడ కర్మానుష్ఠానమును విడచి వేయుదురు. అట్టివారు ఇటు చేయవలసిన కర్మానుష్ఠానము లేక, జ్ఞానమార్గమును అనుసరింపజాలక ఉభయభ్రష్టు లగుదురు. అందుచే అట్టి వారికి మార్గము చూపుటకై తాను కర్మానుష్ఠానమును విడువక, మాధ్యాహ్నికస్నానము చేయుటకై తమసాతీరమునకు వెళ్లెను.
మూ. స తు తీరం సమాసాద్య తమసాయా మహామునిః,
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్. 4
ప్ర. అ. సః = ఆ, మహామునిః = వాల్మీకి, తమసాయః = తమసానది యొక్క, తీరమ్ = తీరమును, సమాసాద్య = చేరి, అకర్దమమ్ = బురదలేని, తీర్థమ్ = రేవును, దృష్ట్వా = చూచి, పార్శ్వే = ప్రక్కనే, శిష్యమ్ = శిష్యుని గూర్చి, ఆహ = పలికెను.
తా. వాల్మీకిమహర్షి తమసానదీతీరము చేరి, బురద లేని రేవును చూచి, ప్రక్క నున్న శిష్యునితో ఇట్లు అనెను.
మూ. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ,
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా. 5
ప్ర. అ. భరద్వాజ = భరద్వాజుడా సన్మనుష్యమనో యథా = సత్పురుషుని హృదయము వలె, అకర్దమమ్ = బురద లేనిదియు, (హృదయపక్షమున ‘‘పాపము లేనిది’’ అని అర్థము), ప్రసన్నామ్బు = నిర్మల మైన జలము కలదియు (‘‘జలము వలె నిర్మల మైనదియు’’ అని హృదయపక్షమున అర్థము), రమణీయమ్ = సుందరమైన, ఇదమ్ = ఈ, తీర్థమ్ = రేవును, నిశామయ = చూడుము.
తా. ఓ భరద్వాజుడా సత్పురుషుని హృదయము వలె నిష్పంకమై, నిర్మలజలమై, మనోహరమై ఉండు ఈ రేవును చూడుము.
విశేషార్థము - ఇచట ఉపమేయము తీర్థము. ఉపమానము సత్పురుషుని హృదయము. ఈ రెండింటికిని సాదృశ్యము అకర్దమత్వము, ప్రసన్నాంబుత్వము అను సమానధర్మములను పట్టి ఏర్పడినది. అయితే ఉపమేయపక్షమున ఈ పదములకు ‘‘బురద లేకుండుట’’ ‘‘నీరు నిర్మలముగ ఉండుట’’ అని అర్థములు. ఈ విధముగ అర్థములో సామ్యము లేకపోయినను శబ్దసామ్యమును పట్టి - అనగా తీర్థమును అకర్దమమే, సన్మనుష్యమనస్సును అకర్దమమే; తీర్థము విమలాంబువే, సన్మనుష్యమనస్సును విమలాంబువే, అను సామ్యమును బట్టి తీర్థమును సన్మనుష్య మనస్సుతో పోల్చుట జరిగినది.
‘‘అర్థతః శబ్దతో వాపి మనాక్కావ్యార్థసూచనమ్’’ (గ్రంథాదియందు అర్థమువలన గాని, శబ్దమువలన గాని కొంచెము కావ్యకథను సూచించవలెను) అను అలంకారికసరణిని అనుసరించి వాల్మీకిచే- ‘‘అకర్దమమిదం తీర్థమ్’’ అనుటచే పరిశుద్ధమగు సముద్రసేతు స్థలము జ్ఞాపిత మైనది. (ఇది వ్యాఖ్యాత్రయసారము).
మూ. న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ,
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్. 6
ప్ర. అ. తాత = నాయనా కలశః = జలపాత్రము, న్యస్యతామ్ = క్రింద ఉంచబడుగాక. మమ = నాకు, వల్కలమ్ = నారచీర, దీయతామ్ = ఇవ్వబడుగాక. ఉత్తమమ్ = శ్రేష్ఠమైన, ఇదమ్ = ఈ, తమసాతీర్థమేవ = తమసానది రేవునే, అవగాహిష్యే = ప్రవేశించెదను.
తా. నాయనా జలపాత్రను క్రింద నుంచుము. నాకు నారచీర ఇమ్ము. శ్రేష్ఠమైన ఈ తమసాతీర్థమునందే స్నానము చేసెదను.
మూ. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా,
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః. 7
ప్ర. అ. మహాత్మనా = పూజ్యమైన మనస్సు గల, వాల్మీకేన = వాల్మీకిచేత, ఏవమ్ = ఈవిధముగా, ఉక్తః = పలుకబడిన, గురోః = గురువునకు, నియతః = విధేయుడైన, భరద్వాజః = భరద్వాజుడు, తస్య = ఆ, మునేః = వాల్మీకి మహామునికి, వల్కలమ్ = నారచీరను, ప్రాయచ్ఛత = ఇచ్చెను.
తా. ఈ ప్రకారము, మహాత్ము డగు వాల్మీకి అడుగగా, గురువిధేయుడైన భరద్వాజుడు ఆ వాల్మీకికి నారచీర ఇచ్చెను.
మూ. స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేన్ద్రియః,
విచచార హ పశ్యం స్తత్సర్వతో విపులం వనమ్. 8
ప్ర. అ. నియతేన్ద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు గల, సః = ఆ వాల్మీకి, శిష్యహస్తాత్ = శిష్యుని చేతి నుండి, వల్కలమ్ = నారచీరను, ఆదాయ = తీసికొని, విపులమ్ = విశాలమైన, తత్ = ఆ, వనమ్ = వనమును, సర్వతః = అంతటను, పశ్యన్ = చూచుచు, విచచార హ = సంచరించెను.
తా. ఇంద్రియనిగ్రహము గల ఆ వాల్మీకి శిష్టుని చేతినుండి ఆ నారచీరను తీసికొని విశాల మైన ఆ వనమునంతను చూచుచు సంచరించెను.
మూ. తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్,
దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిస్వనమ్. 9
ప్ర. అ. భగవాన్ = మాహాత్మ్యము గల ఆ వాల్మీకి, తత్ర = ఆ వనమునందు, తస్య = ఆ రేవునకు, అభ్యాశే = సమీపమునందు, అనపాయినమ్ = ఎడబాటులేనిదై, చరన్తమ్ = తిరుగుచున్న, చారునిస్వనమ్ = మంచి ధ్వని గల, క్రౌఞ్చయోః = క్రౌంచపక్షులయొక్క, మిథునమ్ = జంటను, దదర్శ = చూచెను.
తా. శాపానుగ్రహాది మాహాత్మ్యము గల వాల్మీకి మహర్షి, ఆ వనములో, తమసా తీర్థమునకు సమీపముననే ఎడబాటు లేకుండ తిరుగుచున్న, మనోహరముగ కూయుచున్న క్రౌంచపక్షుల జంటను చూచెను.
వి. ఇచట కావ్యకథ సూచింపబడినది :-
భగవాన్ = మాహాత్మ్యము గల, అనగా త్రికాలజ్ఞానము గల, వాల్మీకి మహర్షి, తస్య = ఆ సముద్రమునకు, అభ్యాశే = సమీపమునందు, తత్ర = ఆ లంకాపురియందు, చరన్తమ్ = భోగములను అనుభవించుచున్నదియు, (‘‘చర గతి భక్షణయోః’’ అను ధాతువునుండి నిష్పన్న మైనది), అనపాయినమ్ = బ్రహ్మవరమువలన చాలకాలమునుండి అపాయము లేనిదియు, చారునిస్వనమ్ = మనోహరమైన వీణానాదము కలదియు అగు, క్రౌఞ్చయోః = కుటిలు లగు రాక్షసుల (‘‘క్రుఞ్చ గతికౌటిల్యాల్పీభావయోః’’ అను ధాతువునుండి నిష్పన్న మైనది), మిథునమ్ = జంటను, దదర్శ = తెలిసికొనెను (గోవిందరాజులు).
తా. సముద్రతీరమునం దున్న లంకాపురిలో సమస్తభోగములను అనుభవించుచు, బ్రహ్మదేవుని వరముచేత దీర్ఘకాలమునుండి అపాయము లేక, మనోహరమగు వీణానాదము మొదలగు క్రీడారసములందు తేలుచున్న రాక్షసదంపతులను గూర్చి, భూతభవద్భవిష్యకాలముల జ్ఞానము గల ఆ వాల్మీకిమహర్షి తెలిసికొనెను.
మూ. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః,
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః. 10
ప్ర. అ. పాపనిశ్చయః = పాప మైన నిర్ణయము కలవాడును, వైర నిలయః = వైరమునకు స్థాన మైన వాడును అగు, నిషాదః = ఒక బోయవాడు, తస్మాత్ = ఆ, మిథునాత్ = మిథునమునుండి, ఏకమ్ = ఒక టైన, పుమాంసం తు = పురుషపక్షిని మాత్రము, తస్య పశ్యతః = ఆ వాల్మీకిమహర్షి చూచుచుండగనే ఏ మాత్రము సంకోచము లేక, జఘాన = చంపెను.
తా. క్రూర మైన నిర్ణయము కలవాడును, పశుపక్ష్యాదుల విషయమున నిష్కారణముగ ద్వేషముతో ప్రవర్తించువాడును అగు ఒక బోయవాడు, ఆ మహర్షి చూచుచున్నా డనెడు సంకోచ మైనను లేక, ఆ జంటలో ఒక టగు మగపక్షిని చంపెను.
వి. ఈ శ్లోకము కూడ కావ్యకథను సూచించుచున్నది :-
పాపనిశ్చయః = దుష్టు డను నిశ్చయము గల, అనగా రావణుడు దుష్టు డని నిశ్చయించిన, వైరనిలయః = దుష్టులతో వైరమునకు స్థాన మైన, నిషాదః = సమస్త జగములకును ఆధారభూతు డైన విష్ణువు (‘‘నిషీదన్తి అత్ర సర్వాణి జగన్తి ఇతి నిషాదః’’ - వీనియందు సమస్తజగత్తులును ఉండును గాన నిషాదుడు), తస్మాత్ మిథునాత్ = ఆ రాక్షసుల జంటనుండి, ఏకమ్ = ఒక డైన, పుమాంసమ్ = పురుషుడగు రావణుని, తస్య = ఆ జంటలో రెండవదియగు మందోదరి, పశ్యతః = చూచుచుండగా ఆమెను ఆదరింపక, అనగా ఆమెను చంపక, జఘాన = చంపెను. (గోవిందరాజులు).
తా. దుష్టుల విషయమున వైరము గల, సకల జగదాధారభూతు డగు శ్రీమహావిష్ణువు రావణుడు దుష్టు డని నిశ్చయించి, ఆ రాక్షసదంపతులలో ఒకడైన రావణుని మాత్రము చంపెను. మందోదరి దుష్టురాలు కాదు గాన ఆమెను చంపలేదు.
మూ. తం శోణితపరీతాఙ్గం వేష్టమానం మహీతలే,
భార్యా తు నిహతం దృష్ట్యా రురావ కరుణాం గిరమ్. 11
వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా,
తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. 12
ప్ర. అ. పతినా = భర్తయు, సహచారిణా = కూడ తిరుగు నదియు, తామ్రశీర్షేణ = ఎఱ్ఱని తల గలదియు, మత్తేన = మదించి నదియు, పత్రిణా = మంచి రెక్కలు గలదియు, సహితేన = మనస్సాంగత్యము కలదియు అగు, తేన = ఆ, ద్విజేన = మగపక్షితో, వియుక్తా = వియోగము పొందిన, భార్యా తు = భార్య యైన ఆడపక్షి యైతే, నిహతమ్ = కొట్టబడినదై, మహీతలే = భూమిపై, వేష్టమానమ్ = పొరలుచున్నదియు, శోణితపరీతాఙ్గమ్ = రక్తముచే కప్పబడిన శరీరము గలదియు అగు, తమ్ = ఆ మగపక్షిని, దృష్ట్వా = చూచి, కరుణామ్ = కనికరమును పుట్టించు, గిరమ్ = వాక్కును, రురావ = పలికెను.
తా. ఆ నిషాదునిచే కొట్టబడి నేలపై పొరలుచు, రక్తముతో నిండిన ఆ మగ పక్షిని భార్య యైన ఆడ క్రౌంచపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగి ఎల్లప్పుడును తనతో సంచరించు, అందమైన రెక్కలు, ఎఱ్ఱని తలయు గల, కామముచే మదించిన, భర్తతో వియోగము చెందిన ఆ క్రౌంచి అతిదీనముగా ఏడ్వ సాగినది.
వి. ఈ శ్లోకమునందు మందోదరీ విలాపము సూచిత మైనది. భార్యాతు = మందోదరి, ..., తామ్రశీర్షేణ = రత్నమయకిరీటముచే ఎర్రగా నుండు తలగలవాడును, పత్రిణా = వాహనాదులతో కూడినవాడును, మత్తేన = బ్రహ్మవరములచే మదించినవాడును, సహితేన = ఇంద్రజిత్కుంభకర్ణాదులతో కూడినవాడును అయిన, తేన = ఆ, ద్విజేన = బ్రాహ్మణు డగు రావణునితో, వియుక్తా, నిహతం, మహీతలే, వేష్టమానం, శోణితపరీతాఙ్గం, తం, దృష్ట్వా, కరుణాం, గిరం, రురావ (గోవిందరాజులు).
తా. పులస్త్యవంశమునందు పుట్టి, బ్రహ్మదేవునివలన వరములు పొంది, ఎదురు లేక గర్వించి, కుంభకర్ణాదులతో కూడి, మణిమయకిరీటాలంకృత శిరస్కుడై వెలిగిన తన ప్రియుడైన పెనిమిటిచే మందోదరి విడువబడెను. విష్ణువుచే చంపబడి నేలపై పొరలుచు నెత్తురుతో తడిసి పడి యున్న భర్త యగు రావణుని చూచి ఆమె కనికరము పుట్టు నట్లు ఏడ్చెను.
మూ. తదా తు తం ద్విజం దృష్ట్యా నిషాదేన నిపాతితమ్,
ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. 13
ప్ర. అ. తదా = అప్పుడు, నిషాదేన = బోయవానిచేత, నిపాతితమ్ = పడగొట్టబడిన, ద్విజమ్ = పక్షిని, దృష్ట్వా = చూచి, ధర్మాత్మనః = ధర్మస్వభావు డైన, తస్య = ఆ, ఋషేః = ఋషికి, కారుణ్యమ్ = జాలి, సమపద్యత = కలిగెను.
తా. అపుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగనే ధర్మాత్ముడైన ఆ వాల్మీకిమహర్షికి జాలి కలిగెను.
వి. కావ్యార్థసూచనము ఈ శ్లోకములో కూడ ఉన్నది. తదా, నిషాదేన = విష్ణువుచేత, నిపాతితం, తం, ద్విజమ్ = బ్రాహ్మణుడైన రావణుని, దృష్ట్వా, ధర్మాత్మనః, తస్య, ఋషేః, కారుణ్యమ్ = జుగుప్స, సమపద్యత (గోవిందరాజులు).
తా. ఆ రావణుని విష్ణురూపు డగు రాముడు చంపగా చూచుచున్న ధర్మస్వభావు డైన ఆ వాల్మీకిమహర్షికి - ‘‘అధర్మాత్ముని స్మరణము కూడ అమంగళకరము’’ అని జుగుప్స కలిగినది.
మూ. తతః కరుణవేదిత్వాదధర్మోఽయమితి ద్విజః,
నిశామ్య రుదతీం క్రౌఞ్చీమిదం వచనమబ్రవీత్. 14
ప్ర. అ. తతః = పిమ్మట, ద్విజః = వాల్మీకిమహర్షి, రుదతీమ్ = ఏడ్చుచున్న, క్రౌఞ్చీమ్ = ఆడుక్రౌంచపక్షిని, నిశామ్య = చూచి, కరుణవేదిత్వాత్ = కరుణ కలవాడగుటవలన, అయమ్ = ఈ రతికాలవధము, అధర్మః ఇతి = ధర్మము కాదు అని (తలచి), ఇదం వాక్యమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఆ వాల్మీకిమహర్షి ఏడ్చుచున్న క్రౌంచిని చూచి, దయ గలవాడై, ‘రతి కాలమందు చంపుట ధర్మము కాదు’ అని తలచుచు ఇట్లని చెప్పెను.
వి.తతః, ..., క్రౌఞ్చీమ్ = రాక్షసస్త్రీ యగు మందోదరిని, నిశామ్య, ..., అయమ్ = ఈ పరభార్యాపహారము, అధర్మ ఇతి.... కరుణవేదిత్వాత్ = జుగుప్సపొందినవా డగుటవలన, ఇదం, .... (గోవిందరాజులు).
తా. అటు పిమ్మట వాల్మీకిమహర్షి ఏడ్చుచున్న మందోదరిని చూచి ‘పరభార్య నపహరించిన ఈ రావణు డిప్పుడు ఇట్టి స్థితిని పొందినాడు కాబట్టి పరభార్య నపహరించుట ఎంతమాత్రము ధర్మము కాదు’ అని తలచి జుగుప్స పొందినవాడై యిట్లని చెప్పెను.
మూ. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః,
యత్ క్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్. 15
ప్ర. అ. అమ = నిర్భాగ్యుడ వైన, నిషాద = బోయవాడా త్వమ్ = నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఞ్చమిథునాత్ = క్రౌంచపక్షుల జంటనుండి, కామమోహితమ్ = కామముచే మోహము చెందియున్న, ఏకమ్ = ఒకదానిని, అవధీః = చంపితివో, (తత్ = ఆ కారణమువలన), శాశ్వతీః = స్థిరములైన, సమాః = సంవత్సరములపాటు, ప్రతిష్ఠాం తు = ఉండుటను, మా గమః = పొందకపోవుదువుగాక.
తా. నిర్భాగ్యుడ వైన ఓ బోయవాడా నీవు క్రౌంచపక్షిదంపతులనుండి మన్మథపరవశ మైన ఒక దానిని చంపితివి. అందుచే నీవు చాలకాలము జీవించకుందువు గాక.
వి. ‘త్వమగమః’ అను నపుడు ‘తు, అమ, గమః’ అని పదచ్ఛేదము చేయబడినది.
‘ఇది బ్రహ్మానుగ్రహముచే, శ్రీమద్వాల్మీకిమహర్షి ముఖమునుండి మొట్టమొదట నిర్గమించిన శ్లోకము గాన ఇది కేవల శాపరూపము కాకూడదు. ఇది ఈ గ్రంథమునకు మంగళము’ అని పూర్వాచార్యులు చెప్పిరి.
మా నిషాద = లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా త్వమ్ = నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఞ్చమిథునాత్ = రాక్షసదంపతు లైన రావణమందోదరులనుండి, కామమోహితమ్ = కామపరవశ మగు, ఏకమ్ = ఒక డైన రావణుని, అవధీః.... శాశ్వతీః = స్థిరము లైన, సమాః = సంవత్సరములయందు, ప్రతిష్ఠామ్ = మాహాత్మ్యమును, అగమః = పొందితివి.
తా. ఓ శ్రీనివాసుడా రావణమందోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై సీతాదేవి నపహరించి వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.
‘‘కావ్యార్థసూచనం కైశ్చిన్నాన్ద్యామేవ నిరూప్యతే’’ (మంగళశ్లోకమునందే కొందరు కావ్యార్థసూచనము చేయుదురు) అను ఆలంకారికవచనమును అనుసరించి ఇచట రామాయణకథ అంతయు సంక్షేపముగా సూచింపబడినది. ‘‘మా నిషాద’’ అను శబ్దముచే సీతావివాహపర్యంత మైన బాలకాండకథ సంగ్రహింపబడినది. ‘‘ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః’’ అనుటచే పితృవచన పరిపాలన మనెడు మాహాత్మ్యమును పొందుటను తెలుపు అయోధ్యాకాండకథ అంతయు సూచింపబడినది. ఈ వాక్యముచేతనే అరణ్యకాండకథ కూడ చూపబడినది. ‘‘క్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్’’ - ఈ వాక్యముచే కుటిలు లగు వానరదంపతులైన తారావాలులలో ఒకరును, సుగ్రీవభార్య నపహరించిన వాడును అగు వాలిని చంపితివి అను అర్థముచే కిష్కింధా కాండకథ కూడ సూచితమైనది. క్రౌఞ్చౌ = అల్పీభూతులు; అనగా కృశించినవారు. ఈ వాక్యముచేతనే కృశించిన సీతారాములలో ఒకతె యగు సీతాదేవి నపహరించి మిక్కిలి పీడించితివి అని సీతాదేవి విరహదుఃఖమును వర్ణించెడు సుందరకాండకథయును తెల్పబడినది. దీనిచేతనే రాక్షసదంపతు లగు రావణమందోదరులలో ఒక డైన రావణుని చంపితివి అని యుద్ధకాండకథయు గ్రథిత మైనది. మా నిషాద = ఓ శ్రీనివాసుడా అనగా ఓ దైవమా అని యర్థము. ఓ దైవమా పూర్వ మరణ్యవాసమునందు వియోగదుఃఖమును అనుభవించుటచే అత్యంతకృశు లైన సీతారాములలో ఒకతె యైన సీతాదేవిని మరల అరణ్యములో చేర్చి మిక్కిలి పీడించితివి అను ఉత్తరకాండ కథయును చెప్పబడినది. (అందరు వ్యాఖ్యాతల మతము).
మూ. తస్యైవం బ్రువతశ్చిన్తా బభూవ హృది వీక్షతః,
శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. 16
ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, బ్రువతః = పలికిన, వీక్షతః = పరిశీలించుచున్న, తస్య = ఆ వాల్మీకిమహర్షియొక్క, హృది = హృదయమునందు, శకునేః = పక్షియొక్క, శోకార్తేన = శోకము చేత ఆర్తుడ నైన, మయా = నాచేత, వ్యాహృతమ్ = పలుకబడిన, ఇదమ్ = ఈ వాక్యము, కిమ్ = ఏమి? అని, చిన్తా = ఆలోచన, బభూవ = కలిగెను.
తా. ఈ విధముగ పలికి పరిశీలించుకొనిన, ఆ వాల్మీకిమహర్షి మనస్సులో - ‘‘ఈ పక్షి యొక్క శోకముచేత దుఃఖితుడ నైన నా నోటినుండి ఏమి యిది ఈ విధముగా వెలువడినది?’’ అను ఆలోచన కలిగెను.
మూ. చిన్తయన్ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్ మతిమ్,
శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం స మునిపుఙ్గవః. 17
ప్ర. అ. మహాప్రాజ్ఞః = గొప్ప పండితుడును, మతిమాన్ = బుద్ధిమంతుడును అయిన, సః = ఆ వాల్మీకి, మతిం చకార = (ఇట్లు) నిశ్చయించెను. సః మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు, శిష్యమ్ = శిష్యునిగూర్చి, ఇదం వాక్యమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ చ = పలికెను కూడ.
తా. మహాపండితుడును, బుద్ధిమంతుడును అయిన ఆ మునిపుంగవుడు ఒక నిశ్చయము చేసికొని శిష్యునితో ఇట్లు పలికెను.
మూ. పాదబద్ధోఽక్షరసమస్తన్త్రీలయసమన్వితః,
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. 18
ప్ర. అ. మే శోకార్తస్య = నేను శోకపీడితుడనై యుండగా, ప్రవృత్తః = అప్రయత్నముగా బయలు వెడలినదియు, పాదబద్ధః = నాలుగు పాదములతో కూర్చబడినదియు, అక్షరసమః = ప్రతిపాదమునందును సమానమైన అక్షరములు కలదియు, తన్త్రీలయ సమన్వితః = వీణాతంత్రుల పై కూర్చుటకు తగిన లయతో కూడినదియు అగు ఈ వాక్యము, శ్లోకః = శ్లోకముగా, భవతు = అగుగాక; అన్యథా = మరొక విధముగా, న = కాదు.
తా. నేను శోకార్తుడ నై ఉండగా నా నోటినుండి బయలుదేరిన ఈ వాక్యము సమాన మైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది. వీణ పై కూర్చి నృత్తగీతవాద్యములతో పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున దీనికి శ్లోక మను పేరుతో ప్రసిద్ధి రావలెను. మరొక పేరుతో కాదు.
మూ. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్,
ప్రతిజగ్రాహ సన్తుష్ట స్తస్య తుష్టోఽభవద్గురుః. 19
ప్ర. అ. శిష్యస్తు = శిష్యుడును, బ్రువతః = ఈ విధముగా పలుకుచున్న, తస్య = ఆ, మునేః = వాల్మీకిమునియొక్క, అనుత్తమమ్ = అత్యుత్తమ మైన, వాక్యమ్ = ‘మా నిషాద’ ఇత్యాది వాక్యమును, ప్రతిజగ్రాహ = స్వీకరించెను. గురుః = గురువు, తస్య = అతని విషయమున, తుష్టః అభవత్ = సంతోషించెను.
తా. వాల్మీకి మాటలను విని శిష్యుడు అత్యుత్తమ మైన ‘‘మా నిషాద’’ ఇత్యాది వాక్యమును స్వీకరించెను, అనగా దానిని కంఠస్థము చేసికొనెను. వాల్మీకి అందులకు సంతసించెను.
మూ. సోఽభిషేకం తతః కృత్యా తీర్థే తస్మిన్ యథావిధి,
తమేవ చిన్తయన్నర్థముపావర్తత వై మునిః. 20
ప్ర. అ. తతః = అటు పిమ్మట, సః మునిః = ఆ వాల్మీకి మహర్షి, తస్మిన్ తీర్థే = ఆ తీర్థమునందు, యథావిధి = యథాశాస్త్రముగా, అభిషేకమ్ = స్నానమును, కృత్వా = చేసి, తమ్ = ఆ, అర్థమేవ = విషయమునే, చిన్తయన్ = ఆలోచించుచు, ఉపావర్తత వై = ఆశ్రమము వైపు మరలెను.
తా. పిమ్మట వాల్మీకిమహాముని ఆ తీర్థమునందు యథావిధిగా స్నానము చేసి, అక్కడ జరిగిన సంఘటనను గూర్చియే ఆలోచించుచు ఆశ్రమము వైపు మరలెను.
మూ. భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ మునిః,
కలశం పూర్ణమాదాయ పృష్ఠతోఽనుజగామ హ. 21
ప్ర. అ. తతః = అటు పిమ్మట, శిష్యః = శిష్యుడును, వినీతః = వినయవంతుడును, శ్రుతవాన్ = శాస్త్రములు తెలిసినవాడును, మునిః = బ్రహ్మానుసంధానము చేయువాడును అగు, భరద్వాజః = భరద్వాజుడు, పూర్ణమ్ = నిండిన, కలశమ్ = కలశమును, ఆదాయ = గ్రహించి, పృష్ఠతః = వెనుక, అనుజగామ = వాల్మీకిని అనుసరించి వెళ్లెను.
తా. అప్పుడు, శాస్త్రపారంగతుడును, మననశీలుడును, వినయవంతుడును అగు శిష్యుడైన భరద్వాజుడు, జలపూర్ణమైన కలశమును తీసికొని వాల్మీకిని వెంబడించెను.
మూ. స ప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్,
ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః. 22
ప్ర. అ. ధర్మవిత్ = ధర్మములు తెలిసిన, సః = ఆ వాల్మీకి, శిష్యేణ సహ = శిష్యునితో కూడ, ఆశ్రమపదమ్ = ఆశ్రమమును, ప్రవిశ్య = ప్రవేశించి, ధ్యానమ్ = ఆలోచనను, అనగా, అంతకు ముందు జరిగిన సంఘటనలను గూర్చి ఆలోచనను, ఆస్థితః = పొందిన వాడై, ఉపవిష్టః = కూర్చున్న వాడై, అన్యాః = ఇతరము లైన, కథాశ్చ = కథలను కూడ, చకార = చేసెను.
తా. ధర్మవేత్తయైన ఆ వాల్మీకి మహర్షి, శిష్యునితో గూడ ఆశ్రమము ప్రవేశించి, కూర్చున్నవాడై, అంతకు ముందు జరిగిన పక్షివృత్తాంతాదులనే స్మరించుచు, ఆ యా విషయములను గూర్చి ముచ్చటించెను.
మూ. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః,
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుఙ్గవమ్. 23
ప్ర. అ. తతః = పిమ్మట, లోకకర్తా = లోకములను సృజించువాడును, ప్రభుః = లోకములకు అధిపతియు, చతుర్ముఖః = నాలుగు ముఖములు కలవాడును, మహాతేజాః = గొప్పతేజస్సు కలవాడును అగు, బ్రహ్మా = బ్రహ్మదేవుడు, మునిపుఙ్గవమ్ = మునులలో శ్రేష్ఠుడైన, తమ్ = ఆ వాల్మీకిని, ద్రష్టుమ్ = చూచుటకు, స్వయమ్ = స్వయముగ, ఆజగామ = వచ్చెను.
తా. అప్పుడు, లోకములను సృజించిన వాడును, లోకముల కధిపతియు, నాలుగు ముఖములు కలవాడును, గొప్ప తేజస్సు కలవాడును అగు బ్రహ్మదేవుడు ఆ మునిపుంగవుని చూచుటకై స్వయముగ వచ్చెను.
మూ. వాల్మీకిరథ తం దృష్ట్యా సహసోత్థాయ వాగ్యతః,
ప్రాఞ్జలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః. 24
ప్ర. అ. అథః = పిమ్మట, ప్రయతః = పరిశుద్ధుడైన, వాల్మీకిః = వాల్మీకి, తమ్ = ఆ బ్రహ్మదేవుని, దృష్ట్వా = చూచి, పరమవిస్మితః = మిక్కిలి ఆశ్చర్యము చెందినవాడై, సహసా = వెంటనే, ఉత్థాయ = లేచి, వాగ్యతః = మౌనము వహించిన వాడై, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడు, భూత్వా = అయి, తస్థౌ = నిలబడెను.
తా. పరిశుద్ధు డైన ఆ వాల్మీకి బ్రహ్మను చూడగనే ఆశ్చర్యచకితుడై, వెంటనే లేచి, దోసిలి కట్టి మౌనముగా నిలబడెను.
వి. ‘‘ఊర్ధ్వం ప్రాణా హ్యుత్క్రామన్తి యూనః స్థవిర ఆగతే, ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే’’
(పెద్దవారు సమీపమునకు వచ్చుచుండగనే యువకుని ప్రాణములు పైకి లేచిపోవ జూచును. ఎదురుగా వెళ్లి, వంగి నమస్కారము చేయుటచే ఆ ప్రాణములను మరల పొందును) అని ధర్మశాస్త్రములో చెప్పిన రీతిని బ్రహ్మదేవుని చూడగనే సవినయముగ లేచి నిలబడెనని అర్థము.
మూ. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవన్దనైః,
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వానామయ మవ్యయమ్. 25
ప్ర. అ. తమ్ ఏనం దేవమ్ = అట్టి ఈ బ్రహ్మదేవుని, విధివత్ = యథాశాస్త్రముగా, ప్రణమ్య = నమస్కరించి, అవ్యయమ్ = అవిచ్ఛిన్నమైన, అనామయంచ = కుశలమును, పృష్ట్వా = అడిగి, పాద్యార్ఘ్యాసనవన్దనైః = పాద్యము, అర్ఘ్యము, ఆసనము, నమస్కారము- వీటిచే, పూజయామాస = పూజించెను.
తా. వాల్మీకి బ్రహ్మదేవుని యథాశాస్త్రముగా నమస్కరించి, అవిచ్ఛిన్నమగు కుశలమును ప్రశ్నించి, పాద్యము, అర్ఘ్యము, ఆసనము, వందనము సమర్పించి పూజించెను.
మూ. అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే,
వాల్మీకయే మహర్షయే సన్దిదేశాసనం తతః. 26
ప్ర. అ. అథ = అటు పిమ్మట, భగవాన్ = మాహాత్మ్యములు గల బ్రహ్మదేవుడు, పరమార్చితే = మిక్కిలి పూజింపబడిన, ఆసనే = ఆసనమునందు ఉపవిశ్య = కూర్చుండి, మహర్షయే = మహర్షియైన, వాల్మీకయే = వాల్మీకికొరకు, ఆసనమ్ = ఆసనమును, సందిదేశ = చూపెను.
తా. భగవంతు డైన బ్రహ్మదేవుడు పరమపూజిత మగు ఉత్తమాసనము పై కూర్చుండి ‘‘నీవు కూడ ఆసనము పై కూర్చుండుము’’ అని వాల్మీకితో చెప్పెను.
మూ. బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఽప్యుపావిశదాసనే, ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే,
తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః. 27
ప్ర. అ. సోఽపి = ఆ వాల్మీకికూడ, బ్రహ్మణా = బ్రహ్మచేత, సమనుజ్ఞాతః = అనుజ్ఞ ఇవ్వబడినవాడై, ఆసనే = ఆసనమునందు, ఉపావిశత్ = కూర్చుండెను. తదా = అప్పుడు, లోకపితామహే = లోకములకు పితామహుడైన, తస్మిన్ = ఆ బ్రహ్మదేవుడు, సాక్షాత్ = ప్రత్యక్షముగా, ఉపవిష్టే = కూర్చున్నవా డగుచుండగా, వాల్మీకిః = వాల్మీకి, తద్గతేనైవ = ఆ క్రౌంచపక్షినే పొందిన, మనసా = మనస్సుతో, ధ్యానమ్ = చింతను, ఆస్థితః = అవలంబించెను.
తా. వాల్మీకి బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది ఆసనము పై కూర్చుండెను. లోకములకు పితామహు డైనఆ బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చొనియుండగా, వాల్మీకి, మనస్సులో ఆ క్రౌంచపక్షినిగూర్చి మాత్రమే ఆలోచించుచుండెను.
మూ. పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణబుద్ధినా,
యస్తాదృశం చారురవం క్రౌఞ్చం హన్యాదకారణాత్. 28
ప్ర. అ. యః = ఏ బోయవాడు, తాదృశమ్ = అట్టి, చారురవమ్ = మధురమైన ధ్వని గల, క్రౌఞ్చమ్ = క్రౌంచపక్షిని, అకారణాత్ = కారణము లేకుండగా, హన్యాత్ = చంపునో (చంపెనో), వైరగ్రహణబుద్ధినా = వైరముచే ఆ పక్షిని పట్టుకొనవలె నను బుద్ధి గల, పాపాత్మనా = ఆ పాపాత్మునిచే, కష్టమ్ = భయంకర మగు కార్యము, కృతమ్ = చేయబడినది.
తా. ‘‘అట్టి మధురధ్వని గల క్రౌంచపక్షిని నిష్కారణముగా, ఆ బోయవాడు చంపినాడు కదా ఆ పాపాత్ముడు వైరముచే దానిని పట్టుకొనవలెనను బుద్ధితో ఎంతటి ఘోరకార్యము చేసినాడు ’’ అని ఆలోచించుచుండెను.
మూ. శోచన్నేవ ముహుః క్రౌఞ్చీముపశ్లోకమిమం పునః,
జగావన్తర్గతమనా భూత్వా శోకపరాయణః. 29
ప్ర. అ. శోకపరాయణః = దుఃఖపరవశుడై, అన్తర్గతమనాః భూత్వా = లోలోపలనే ఏదియో ఆలోచించుకొనుచున్న మనస్సు కలవాడై, ముహుః = మాటిమాటికి, క్రౌఞ్చీమేవ = ఆడుక్రౌంచపక్షిని గూర్చియే, శోచన్ = దుఃఖించుచు, పునః = మరల, ఇమం శ్లోకమ్ = ఈ శ్లోకమును, ఉపజగౌ = గానము చేసెను.
తా. వాల్మీకి దుఃఖపరవశుడై, బాహ్యవిషయములపై ప్రవర్తించని మనస్సుతో, ఆ క్రౌంచిని గూర్చియే విచారించుచు, మానిషాదేత్యాది శ్లోకమును మరల మరల చదివెను.
మూ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుఙ్గవమ్,
శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా. 30
ప్ర. అ. తతః = పిమ్మట, బ్రహ్మా = బ్రహ్మ, ప్రహసన్ = నవ్వుచు, తం మునిపుఙ్గవమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి, ఉవాచ = పలికెను. త్వయా = నీచేత, బద్ధః = కూర్చబడినది, శ్లోకః ఏవ = శ్లోకమే. అత్ర = ఈ విషయమునందు, విచారణా = ఆలోచన, న కార్యా = చేయదగినది కాదు.
తా. బ్రహ్మదేవుడు నవ్వుచు వాల్మీకితో ఇట్లనెను - ‘‘నీవు కూర్చినది శ్లోకమే. ఈ విషయమున సందేహము లేదు.’’
మూ. మచ్ఛన్దాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ,
రామస్య చరితం సర్వం కురు త్వమృషిసత్తమ. 31
ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ, తే = నీ యొక్క, ఇయమ్ = ఈ, సరస్వతీ = వాక్కు, మచ్ఛన్దాదేవ = నాయొక్క ఇచ్ఛ ప్రకారమే, ప్రవృత్తా = పుట్టినది. ఋషిసత్తమ = ఓ ఋషిశ్రేష్ఠుడా రామస్య = రామునియొక్క, సర్వమ్ = సమస్తమైన, చరితమ్ = చరితమును, త్వమ్ = నీవు, కురు = రచించుము.
తా. ఓ బ్రహ్మర్షీ నా ఇచ్ఛనే అనుసరించి ఈ వాక్కు నీయందు ఆవిర్భవించినది. ఓ ఋషిశ్రేష్ఠుడా నీవు రాముని చరితము నంతను కావ్యరూపమున రచింపుము.
వి.‘‘బ్రహ్మన్’’ అని సంబోధించుటచే ‘‘నీవును బ్రహ్మ యగు నా అంశమున పుట్టినవాడ వగుటచే నీ ముఖమునుండి నా ఇచ్ఛ ప్రకారము సరస్వతి వెడలినది’’ అని సూచిత మగుచున్నది. ‘‘ఋషిసత్తమ’’ అనుటచే ‘‘నానృషిః కురుతే కావ్యమ్’’ (ఋషి కానివాడు కావ్యము వ్రాయజాలడు) అను న్యాయము ననుసరించి ‘‘నీవు కావ్యము చేయ శక్తి కలవారిలో శ్రేష్ఠుడవు కాబట్టి నీవు రచించిన కావ్యము అన్నింటి కన్నను శ్రేష్ఠ మగును’’ అని తెలుపబడుచున్నది. (గోవిందరాజులు).
మూ. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః,
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్. 32
ప్ర. అ. ధర్మాత్మనః = ధర్మస్వభావుడును, లోకే = లోకమందు, గుణవతః = ప్రశస్త గుణములు కలవాడును, ధీమతః = బుద్ధిమంతుడును, ధీరస్య = ధైర్యశాలియు అగు, రామస్య = రామునియొక్క, వృత్తమ్ = చరిత్రమును, తే = నీచేత, నారదాత్ = నారదునివలన, యథా = ఏ విధముగా, శ్రుతమ్ = వినబడెనో, (ఆ విధముగా) కథయ = చెప్పుము.
తా. రాముడు ధర్మస్వభావుడు. లోకములో ప్రశస్తము లైన గుణములు కలవాడు. పండితుడు. అట్టి రాముని చరిత్రమును నారదునినుండి నీవు వినినది వినినట్లుగ చెప్పుము.
మూ. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః,
రామస్య సహసౌమిత్రే రాక్షసానాం చ సర్వశః, 33
వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యది వా రహః,
తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. 34
ప్ర. అ. ధీమతః = బుద్ధిమంతుడైన, సహసౌమిత్రేః = లక్ష్మణునితో కూడిన, తస్య రామస్య = ఆ రామునియొక్కయు, రాక్షసానాం చ = రాక్షసులయొక్కయు, రహస్యం చ = రహస్యమైనదియు, ప్రకాశం చ = అందరికిని తెలిసినదియు, సర్వశః = సర్వప్రకారమునైన, యత్ = ఏ, వృత్తమ్ = చరిత్రము కలదో, వైదేహ్యాశ్చాపి = సీతాదేవియొక్కయు (అపి శబ్దముచే భరతాదులయొక్కయు అని గ్రహింపవలెను) ప్రకాశం యది వా = అందరకును తెలిసినది గాని, రహో వా = రహస్యము గాని, యత్ వృత్తమ్ = ఏ చరిత్ర కలదో, తచ్చ = అదియు, అవిదితమపి = తెలియని దైనను, తే = నీకు, విదితమ్ = తెలిసినదిగా, భవిష్యతి = కాగలదు.
తా. లక్ష్మణసహితు డైన రాముడు, సీత, భరతాదులు, రాక్షసులు - వీరందరి చరిత్రము, రహస్య మైన దైనను, ప్రకాశమైన దైనను, నీకింత వరకును తెలియనిది కూడ ఇపుడు స్పష్టముగ తెలియగలదు.
మూ. న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి,
కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్. 35
ప్ర. అ. అత్ర = ఈ, కావ్యే = కావ్యమునందు, తే = నీయొక్క, వాక్ = వాక్కు, కాచిత్ = ఒక్కటియు, అనృతా = అసత్యమైనది, న భవిష్యతి = కానేరదు, పుణ్యామ్ = పుణ్యమైనదియు, మనోరమామ్ = మనోహరమైనదియు అగు, రామకథామ్ = రాముని కథను, శ్లోకబద్ధామ్ = శ్లోకబద్ధ మైనదానినిగా, కురు = చేయుము.
తా. ఈ కావ్యములో నీవు చెప్పిన ఒక్క మాట యైనను అసత్యము కానేరదు. పుణ్యము, మనోహరము అయిన రామకథను శ్లోకబద్ధము చేయుము.
మూ. యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే,
తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి. 36
ప్ర. అ. గిరయః = పర్వతములును, సరితః చ = నదులును, మహీతలే = భూతలమునందు, యావత్ = ఎంతవరకును, స్థాస్యన్తి = ఉండగలవో, తావత్ = అంతవరకును, రామాయణకథా = రామాయణకథ, లోకేషు = లోకములయందు, ప్రచరిష్యతి = ప్రవర్తింపగలదు.
తా. పర్వతములును, నదులును భూతలమునం దున్నంతవరకును రామాయణ కథ లోకములలో వ్యాపించి ఉండును.
మూ. యావద్రామాయణకథా త్వత్కృతా ప్రచరిష్యతి,
తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి. 37
ప్ర. అ. త్వత్కృతా = నీచేత రచింపబడిన, రామాయణకథా = రామాయణకథ, యావత్ = ఎంతవరకు, ప్రచరిష్యతి = ప్రచారణలో నుండునో, తావత్ = అంతవరకును, త్వమ్ = నీవు, ఊర్ధ్వమ్ = పైన, అధశ్చ = క్రిందను, మల్లోకేషు = నా లోకములలో, నివత్స్యసి = నివసించగలవు.
తా. నీవు రచించిన రామాయణకథ ప్రచారములో నున్నంత కాలము, నీవు నేను సృజించిన ఊర్ధ్వలోకములలోను, అధోలోకములలోను స్వేచ్ఛగ సంచరించుచు ఉండగలవు.
మూ. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాన్తరధీయత,
తతః సశిష్యో భగవాన్మునిర్విస్మయమాయయౌ. 38
ప్ర. అ. భగవాన్ = మాహాత్మ్యము గల, బ్రహ్మా = బ్రహ్మదేవుడు, ఇతి = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, తత్రైవ = అచటనే, అన్తరధీయత = అంతర్ధానము పొందెను. తతః = అటు పిమ్మట, సశిష్యః = శిష్యులతో కూడిన, భగవాన్ = మాహాత్మ్యము గల, మునిః = వాల్మీకి మహాముని, విస్మయమ్ = ఆశ్చర్యమును, ఆయయౌ = పొందెను.
తా. భగవంతు డైన బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి అచటనే అంతర్ధానము పొందెను. వాల్మీకి మహామునియు, శిష్యులును చాల ఆశ్చర్యము చెందిరి.
మూ. తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః,
ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశవిస్మితాః. 39
ప్ర. అ. తతః = పిమ్మట, తస్య = అతని, శిష్యాః = శిష్యులు, సర్వే = అందరును, ముహుర్ముహుః = మాటిమాటికిని, ప్రీయమాణాః = సంతోషించుచున్నవారై, పునః = మరల, ఇమం శ్లోకమ్ = ఈ శ్లోకమును, జగుః = గానము చేసిరి. భృశవిస్మితాః = మిక్కిలి ఆశ్చర్యపడినవారై, ప్రాహుశ్చ = పరస్పరము చెప్పుకొనిరి.
తా. పిమ్మట వాల్మీకిశిష్యు లందరును మాటి మాటికి సంతోషించుచు మరల ఈ శ్లోకమును పఠించి ఒకరి కొకరు చెప్పుకొనిరి.
మూ. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా,
సోనువ్యాహరణాద్భూయః శ్లోకః శ్లోకత్వమాగతః. 40
ప్ర. అ. యః = ఏది, సమాక్షరైః = సమానమైన సంఖ్య గల అక్షరములతో కూడిన, చతుర్బిః = నాలుగు, పాదైః = పాదములతో, మహర్షిణా = మహర్షిచే, గీతః = చెప్పబడినదో, సః = ఆ, శ్లోకః = శ్లోకము, అనువ్యాహరణాత్ = మాటిమాటికి పఠించుటవలన, భూయః = మరల, అనగా ఇంకను, శ్లోకత్వమ్ = శ్లోకత్వమును, ఆగతః = పొందినది.
తా. సమసంఖ్యాకము లగు అక్షరములతో, నాలుగు పాదములతో, కూడినదై, మహర్షి గానము చేసిన ఈ శ్లోకము, మాటి మాటికి గానము చేయుటచే ఇంకను శ్లోకత్వమును పొందినది.
వి. శ్లోక శబ్దమునకు యశస్సు అని కూడ అర్థము. వాల్మీకి ముఖము నుండి వెలువడిన ఈ శ్లోకము, శిష్యు లందరును అత్యానందముతో మరల మరల పఠించుటచే అతనికి కీర్తిపతాక మైన దని భావము.
మూ. తస్య బుద్ధిరియం జాతా మహర్షేర్భావితాత్మనః,
కృత్స్నం రామాయణం కావ్యమీదృ శైః కరవాణ్యహమ్. 41
ప్ర. అ. అహమ్ = నేను, కృత్స్నమ్ = సమస్తమైన, రామాయణమ్ = రామాయణమనెడు, కావ్యమ్ = కావ్యమును, ఈదృశైః = ఇట్టి శ్లోకములతో, కరవాణి = చేసెదను అని, ఇయమ్ = ఈ, బుద్ధిః = బుద్ధి, భావితాత్మనః = ధ్యానింపబడిన పరమాత్మగల, తస్య = ఆ, మహర్షేః = వాల్మీకిమహర్షికి, జాతా = కలిగెను.
తా. ‘‘రామాయణము నంతను ఈ శ్లోకవృత్తములో రచించెదను’’ అని పరమాత్మ ధ్యానపరాయణు డగు వాల్మీకి నిశ్చయించుకొనెను.
మూ. ఉదారవృత్తార్థపదైర్మనోరమై
స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్,
సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్యముదారధీర్మునిః. 42
ప్ర. అ. కీర్తిమాన్ = కీర్తి కలవాడును, ఉదారధీః = గొప్ప బుద్ధి కలవాడును, మునిః = మననశీలుడును అగు వాల్మీకి, తదా = అప్పుడు, యశస్వినః = కీర్తిమంతుడైన, అస్య రామస్య = ఈ రామునియొక్క, యశస్కరమ్ = కీర్తిని కలిగించు, కావ్యమ్ = కావ్యమును, ఉదారవృత్తార్థపదైః = ఉత్తమ మైన పద్యములును, అర్థములును, శబ్దములును గల, మనోరమైః = మనోహరములైన, సమాక్షరైః = సమములైన అక్షరములు గల, శ్లోకశతైః = వందలకొలది శ్లోకములచేత, చకార = రచించెను.
తా. కీర్తిమంతుడును, మహాబుద్ధిమంతుడును అగు వాల్మీకి యశశ్శాలి యగు ఆ రాముని మాహాత్మ్యమును తెలుపునట్టి కావ్యమును, మనోహరము లైనవియు,ఉత్తమము లైన వృత్తములతోడను, శబ్ధార్థములతోడను ప్రకాశించునవియు, సమాక్షరములు కలిగినవియు అగు శ్లోకశతములతో నిర్మించెను.
మూ. తదుపగత సమాససన్ధియోగం
సమమధురోపనతార్థవాక్యబద్ధమ్,
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్. 43
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే, బాలకాణ్డే ద్వితీయః సర్గః.
ప్ర. అ. ఉపగతసమాససన్ధియోగం = సమాససంధివ్యుత్పత్తులతో కూడినదియు, సమమధురోపనతార్థ వాక్యబద్ధమ్ = సమానములును, మధురములును, అర్థవంతములును అగు వాక్యములతో కూర్చబడినదియు, మునిప్రణీతమ్ = వాల్మీకిచే రచింపబడినదియు అగు, తత్ = ఆ, రఘువరచరితమ్ = రామచరితమును, దశశిరసః = రావణుని, వధం చ = వధను, నిశామయధ్వమ్ = చూడండి (వినండి).
తా. వాల్మీకిముని రచించిన ఈ ‘‘రామచరితము’’లో, ‘‘రావణవధ’’లో సమాసములు నాతిదీర్ఘములు. సంధులు శ్రావ్యములు. శబ్దవ్యుత్పత్తి శాస్త్రసంమతమైనది. ఇందలి వాక్యములై, సమములై, మధురములై, అర్థభరితములై ఉన్నవి. అట్టి ఈ కావ్యమును వినండి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో ద్వితీయసర్గ సమాప్తము.
