| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 9 |
| Pages | 10 |
| Read Time | 13 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ తృతీయః సర్గః
రామాయణమునందలి విషయముల సంక్షిప్తవర్ణనము.
మూ. శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మసంహితమ్,
వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. 1
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మస్వభావుడైన వాల్మీకి, ధర్మసంహితమ్ = ధర్మముతో కూడిన, సమగ్రమ్ = సమస్తమైన, తత్ = ఆ, వస్తు = రామకథను, శ్రుత్వా = విని, ధీమతః = బుద్ధిమంతుడైన, తస్య = ఆ రామునియొక్క, వృత్తమ్ = చరిత్రము, యత్ = ఏది కలదో, దానిని, వ్యక్తమ్ = స్పష్టమగునట్లు, భూయః = ఇంకను, అన్వేషతే = వెదకెను.
తా. ధర్మస్వభావు డైన వాల్మీకి, తనకు నారదుడు చెప్పిన ధర్మసహిత మగు ఆ రామకథకంటె అధికముగ ఇంకను ఏమైన రామచరిత మున్నదా అని పరిశీలించెను.
మూ. ఉపస్పృశ్యోదికం సమ్యఙ్మునిః స్థిత్వా కృతాఞ్జలిః,
ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్. 2
ప్ర. అ. మునిః = వాల్మీకి, ఉదకమ్ = ఉదకమును, ఉపస్పృశ్య = ఆచమనము చేసి, ప్రాచీనాగ్రేషు = తూర్పువైపునకు కొనలు గల, దర్భేషు = దర్భలపై, స్థిత్వా = కూర్చుండి, కృతాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, ధర్మేణ = తపోబలముచేత, గతిమ్ = రామచరిత్రముయొక్క రీతిని, సమ్యక్ బాగుగా, అన్వేషతే = అన్వేషించెను.
తా. వాల్మీకి ఆచమనము చేసి తూర్పుగ అగ్రభాగము లుండునట్లు పరచిన దర్భలపై కూర్చుండి, దోసిలి కట్టి, దివ్యదృష్టితో రామచరితమును గూర్చి చక్కగా ఆలోచించెను.
మూ. రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ,
సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్త్వతః. 3
హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్,
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సంప్రపశ్యతి. 4
ప్ర.అ. రామలక్ష్మణసీతాభిః = రామలక్ష్మణసీతలచేతను, రాజ్ఞా = రాజైన, దశరథేన చ = దశరథునిచేతను, సభార్యేణ = భార్యతో కూడిన రామునిచేతను, సరాష్ట్రేణ = రాష్ట్రముతో కూడిన రామునిచేతను, యత్ = ఏది, ప్రాప్తమ్ = పొందబడినదో, తత్ర = ఆ విషయము నందును, యా = ఏ, గతిః = గమనము కలదో దానిని, యత్ = ఏ, చేష్టితమ్ = చేష్టకలదో దానిని, హసితమ్ = వారి నవ్వును, భాషితం చైవ = వారి సంభాషణను, తత్సర్వమ్ = దాని నంతను, తత్త్వతః = యథార్థముగ, యథావత్ = నడిచినట్లుగ, ధర్మవీర్యేణ = తపోబలముచేత, లేదా బ్రహ్మానుగ్రహప్రభావముచేత, సంప్రపశ్యతి = చూచెను.
తా. వాల్మీకి తపఃప్రభావముచే, రామలక్ష్మణసీతలును, దశరథమహారాజును ఏమి చేసిరో, రాముడు భార్యాసహితుడై ఉన్నప్పుడును, రాజ్యముతో ఉన్నప్పుడును ఏమేమి పొందెనో ఆ విషయముల నన్నింటినీ యథార్థముగా తెలిసికొనెను. మరియు వారందరును ఎట్లు నవ్విరో, ఎట్లు మాటలాడిరో, ఎట్లు నడచిరో, ఇంకను ఏ యే పనులు చేసిరో ఆ విషయముల నన్నింటిని కూడ తెలుసుకొనెను.
మూ. స్త్రీతృతీయేన చ తదా యత్ప్రాప్తం చరతా వనే,
సత్యసన్ధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితమ్. 5
ప్ర. అ. స్త్రీతృతీయేన = భార్య మూడవదిగా గల, వనే చరతా = వనమునందు సంచరించుచున్న, సత్యసన్ధేన = సత్యమైన ప్రతిజ్ఞ గల, రామేణ = రామునిచేత, తదా = అప్పుడు, యత్ = ఏది, ప్రాప్తమ్ = పొందబడెనో, తత్సర్వమ్ = అది యంతయు, అన్వవేక్షితమ్ = చూడబడెను.
తా. సత్యసంధుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యములో సంచరించు నపుడు ఏమేమి జరిగెనో అవి యన్నియు తెలుసుకొనెను.
మూ. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః,
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. 6
ప్ర. అ. తతః = అటుపిమ్మట, ధర్మాత్మా = ధర్మాత్ముడైన వాల్మీకి, యోగమ్ = యోగమును, ఆస్థితః = పొందినవాడై, పురా = పూర్వము, తత్ర = అచట, యత్ = ఏది, నిర్వృత్తమ్ = జరిగినదో, తత్ సర్వమ్ = దానినంతను, పాణౌ = అరచేతియందు, ఆమలకం యథా = ఉసిరికాయను వలె, పశ్యతి = చూచెను.
తా. ధర్మాత్ముడైన వాల్మీకి, రామాదులకు సంబంధించిన వృత్తాంతము నంతను, యోగదృష్టిచే, అరచేతిలోని ఉసిరికాయను వలె స్పష్టముగా కనుగొనెను.
మూ. తత్సర్వం తత్త్వతో దృష్ట్యా ధర్మేణ స మహాద్యుతిః,
అభిరామస్య రామస్య చరితం కర్తు ముద్యతః. 7
కామార్థగుణసంయుక్తం ధర్మార్థగుణవిస్తరమ్,
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్. 8
ప్ర. అ. మహాద్యుతిః = గొప్పకాంతి గల, సః = వాల్మీకి, తత్ సర్వమ్ = ఆ చరిత్రమునంతను, తత్త్వతః = ఉన్నదున్నట్లుగా, ధర్మేణ = తపోబలముచేత, దృష్ట్వా = చూచి, కామార్థగుణ సంయుక్తమ్ = కామము అర్థము అనెడు గుణములతో కూడినదియు, ధర్మార్థగుణ విస్తరమ్ = ధర్మమే ప్రయోజనముగా గల గుణములతో విస్తృత మైనదియును, రత్మాఢ్యమ్ = రత్వములతో నిండిన, సముద్రమివ = సముద్రమువలె ఉన్నదియును, సర్వశ్రుతిమనోహరమ్ = అందరి చెవులను హృదయములను ఆకర్షించునదియు, లేదా సకలవేదముల హృదయమును సంగ్రహించునదియు అగు, అభిరామస్య = లోకాభిరాము డైన, రామస్య = రామునియొక్క, చరితమ్ = చరిత్రను, కర్తుమ్ = రచించుటకు, ఉద్యతః = ఉద్యుక్తు డయ్యెను.
తా. మహాతేజఃశాలి యైన వాల్మీకి తపఃప్రభావముచే విషయముల నన్నింటిని తెలిసికొని, కామార్థము లనెడు పురుషార్థములతో సంబంధించి, ధర్మప్రధానమైన గుణములు అధికముగా కలదియు, రత్నములతో సమృద్ధ మైన సముద్రము వలె నున్నదియు, అందరి చెవులను మనస్సులను ఆకర్షించునదియు, సకల వేదసారసంగ్రహ రూపమును అగు, లోకాభిరాముడైన రాముని చరిత్రమును రచించుటకు ఉపక్రమించెను.
మూ. స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా,
రఘువంశస్య చరితం చకార భగవానృషిః. 9
ప్ర. అ. భగవాన్ = మాహాత్మ్యముగల, సః ఋషిః = ఆ, వాల్మీకిమహర్షి, నారదేన మహర్షిణా = నారదమహర్షిచేత, పూర్వమ్ = పూర్వము, యథా = ఏ విధముగా, కథితమ్ = చెప్పబడినదో, ఆ విధముగ, రఘువంశస్య = రఘువంశమునందు పుట్టిన రామునియొక్క, చరితమ్ = చరిత్రను, చకార = నిర్మించెను.
తా. భగవంతు డైన వాల్మీకి పూర్వము నారదమహర్షి తనకు చెప్పిన విధముగ రాముని చరిత్రమును రచించెను.
మూ. జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతామ్,
లోకస్య ప్రియతాం క్షాన్తిం సౌమ్యతాం సత్యశీలతామ్. 10
ప్ర. అ. రామస్య = రామునియొక్క, జన్మ = అవతారమును, సుమహత్ = మిక్కిలి గొప్పదైన, వీర్యమ్ = పరాక్రమమును, సర్వానుకూలతామ్ = అందరికిని అనుకూలముగా ఉండుటను, లోకస్య = ప్రపంచమునకు, ప్రియతామ్ = ప్రేమపాత్రుడై ఉండుటను, క్షాన్తిమ్ = ఓర్పును, సౌమ్యతామ్ = సౌందర్యమును, సత్యశీలతామ్ = సత్యశీలమును (వర్ణించెను).
తా. రాముని అవతారమును, అతని మహాపరాక్రమమును, అందరికిని అనుకూలుడుగాను ఇష్టుడుగాను ఉండుటను, ఓర్పును, సౌందర్యమును, సత్యశీలమును వర్ణించెను.
మూ. నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే,
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్. 11
ప్ర. అ. విశ్వామిత్రసమాగమే = విశ్వామిత్రునితో చేరినపుడు, అన్యాః = ఇతరములైన, నానాచిత్రకథాః = అనేకవిధము లైన విచిత్రము లైన కథలను, జానక్యాః = జానకియొక్క, వివాహం చ = వివాహమును, ధనుషః = ధనుస్సుయొక్క, విభేదనం చ = భేదనమును (వర్ణించెను).
తా. విశ్వామిత్రుని కలిసి నప్పుడు జరిగిన విచిత్రము లైన అనేక కథలను, శివధనుర్భంగమును, జానకీపరిణయమును వర్ణించెను.
మూ. రామరామవివాదం చ గుణాన్దాశరథేస్తథా,
తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతామ్. 12
ప్ర. అ. రామరామవివాదం చ = పరశురామ దశరథరాముల వివాదమును, తథా = మరియు, దాశరథేః = రామునియొక్క, గుణాన్ = గుణములను, తథా = మరియు, రామస్య = రామునియొక్క, అభిషేకమ్ = అభిషేకమును, కైకేయ్యాః = కైకేయియొక్క, దుష్టభావతామ్ = దుష్టభావమును (వర్ణించెను).
తా. పరశురామునితో దశరథరాముని వివాదమును, రాముని సద్గుణములను, రాముని యౌవరాజ్యపట్టాభిషేకమునకై ప్రయత్నమును, కైకేయి యొక్క దుష్టచింతనమును వర్ణించెను.
మూ. విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనమ్,
రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్. 13
ప్ర. అ. అభిషేకస్య = రామాభిషేకమునకు, విఘాతం చ = విఘ్నమును, రామస్య = రామునియొక్క (ని), వివాసనమ్ = అరణ్యమునకు పంపుటను, రాజ్ఞః = దశరథునియొక్క, శోకవిలాపం చ = దుఃఖముతో విలపించుటను, పరలోకస్య = స్వర్గలోకముయొక్క, ఆశ్రయం చ = ఆశ్రయించుటను (వర్ణించెను).
తా. రాముని యౌవరాజ్యపట్టాభిషేకమునకు విఘ్నము కలుగుట, రాముని అరణ్యవాసమునకు పంపుట, దశరథుడు దుఃఖార్తుడై విలపించుట, అతడు స్వర్గస్థుడగుట - ఈ విషయములను వర్ణించెను.
మూ. ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్,
నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా. 14
ప్ర. అ. ప్రకృతీనామ్ = ప్రజల, విషాదమ్ = దుఃఖమును, ప్రకృతీనామ్ = ప్రజల(ను), విసర్జనమ్ = విడచుటను, నిషాదాధిపసంవాదమ్ = గుహునితో సంభాషణమును, తథా = మరియు, సూతోపావర్తనమ్ = సారథి తిరిగి వచ్చుటను (వర్ణించెను).
తా. ప్రజలు దుఃఖించుటను, రాముడు వారిని విడచిపెట్టుటను, గుహునితో సంభాషణమును, సారథి యైన సుమంత్రుడు రాముని అరణ్యప్రాంతములో విడచి తిరిగి వచ్చుటను వర్ణించెను.
మూ. గఙ్గాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనమ్,
భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శనమ్. 15
ప్ర. అ. గఙ్గాయాః = గంగానదియొక్క (నదిని), సన్తారం చాపి = దాటుటను, భరద్వాజస్య = భరద్వాజుని, దర్శనమ్ = దర్శనమును, భరద్వాజాభ్యనుజ్ఞానాత్ = భరద్వాజుని ఆజ్ఞవలన, చిత్రకూటస్య = చిత్రకూటపర్వతముయొక్క, దర్శనమ్ = చూచుటను (వర్ణించెను).
తా. సీతారామలక్ష్మణులు గంగానదిని దాటుటను, భరద్వాజుని చూచుటను, భరద్వాజుని ఆజ్ఞ ప్రకారము వారు చిత్రకూటమునకు వెళ్లుటను వర్ణించెను.
మూ. వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా,
ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియామ్. 16
ప్ర. అ. వాస్తుకర్మ = గృహనిర్మాణమును, నివేశం చ = ఆ గృహములో నివసించుటను, భరతాగమనమ్ = భరతుని ఆగమనమును, రామస్య = రామునియొక్క, ప్రసాదనం చ = అనుగ్రహింపచేసుకొనుటను, తథా = మరియు, పితుః = తండ్రికి, సలిలక్రియామ్ = తర్పణము లిచ్చుటను (వర్ణించెను).
తా. రామాదులు చిత్రకూటమున గృహము నిర్మించుకొని దానిలో నివసించుటను, భరతుడు వచ్చి రాముని బ్రతిమాలుటను, రాముడు తండ్రికి ఔర్ధ్వదేహికక్రియలు చేయుటను వర్ణించెను.
మూ. పాదుకాగ్య్రాభిషేకం చ నన్దిగ్రామనివాసనమ్,
దణ్డకారణ్యగమనం విరాధస్య వధం తథా. 17
ప్ర. అ. పాదుకాగ్య్రాభిషేకం చ = శ్రేష్ఠములైన పాదుకలకు రాజ్యాభిషేకమును, నన్దిగ్రామనివాసనమ్ = నందిగ్రామములో నివాసమును, దణ్డకారణ్యగమనమ్ = దండకారణ్యములోనికి వెళ్లుటను, తథా = మరియు, విరాధస్య = విరాధునియొక్క, వధమ్ = వధను (వర్ణించెను).
తా. భరతుడు రామపాదుకలకు పట్టాభిషేకము చేసి నందిగ్రామములో నివసించుటను, రాముడు దండకారణ్యములోనికి ప్రవేశించుటను, అచట విరాధుని చంపుటను వర్ణించెను.
మూ. దర్శనం శరభఙ్గస్య సుతీక్ష్ణే న సమాగమమ్,
అనసూయాసహాస్యామప్యఙ్గరాగస్య చార్పణమ్. 18
ప్ర. అ. శరభఙ్గస్య = శరభంగమహర్షియొక్క, దర్శనమ్ = దర్శనమును, సుతీక్ష్ణేన = సుతీక్ష్ణమహర్షితో, సమాగమమ్ = సమాగమమును, అనసూయాసహాస్యామ్ అపి = అనసూయతో కలిసి కూర్చుండుటను, అఙ్గరాగస్య = అంగరాగముయొక్క, అర్పణం చ = ఇచ్చుటను (వర్ణించెను).
తా. రాముడు శరభంగసుతీక్ష్ణమహర్షుల దర్శనము చేయుటను, సీత అనసూయ దగ్గర కూర్చుండి, సంభాషణాదికము చేయుటను, అనసూయ సీతకు శరీరమునకు పూసికొనెడు అంగరాగమును ఇచ్చుటను వర్ణించెను.
మూ. అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసఙ్గమమ్,
పఞ్చవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనమ్. 19
ప్ర. అ. అగస్త్యదర్శనం చైవ = అగస్త్యమహామునిని చూచుటను, జటాయోః = జటాయువు యొక్క అభిసంగమమ్ = సమాగమమును, పఞ్చవట్యాః గమనమ్ = పంచవటికి వెళ్లుటను, శూర్పణఖ్యాః = శూర్పణఖయొక్క, దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).
తా. రాముడు అగస్త్యుని దర్శనము చేయుటను, జటాయువును కలియుటను, పంచవటికి వెళ్లుటను, అచట శూర్పణఖను చూచుటను వర్ణించెను.
మూ. శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా,
వధం ఖరత్రిశిరసోరుత్థానం రావణస్య చ. 20
ప్ర. అ. శూర్పణఖ్యాః = శూర్పణఖయొక్క, సంవాదమ్ = సంభాషణను, తథా = మరియు, విరూపకరణమ్ = ఆమెను విరూపముకలదానినిగా చేయుటను, ఖరత్రిశిరసోః = ఖరత్రి శిరస్కుల, వధమ్ = వధను, రావణస్య = రావణునియొక్క, ఉత్థానం చ = ప్రయత్న ప్రారంభమును (వర్ణించెను).
తా. శూర్పణఖతో జరిగిన సంభాషణమును, ఆమెకు రూపవికారము కలిగించుటను, ఖరుడు, త్రిశిరస్కుడు అను రాక్షసులను రాముడు సంహరింపగా రావణుడు రామునకు అపకారము చేయుటకై ప్రయత్నము ప్రారంభించుటను వర్ణించెను.
మూ. మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా,
రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణమ్. 21
ప్ర. అ. మారీచస్య = మారీచునియొక్క, వధం చైవ = వధను, తథా = మరియు, వైదేహ్యాః = సీతయొక్క, హరణమ్ = హరణమును, రాఘవస్య = రామునియొక్క, విలాపం చ = విలాపమును, గృధ్రరాజనిబర్హణమ్ = జటాయువును చంపుటను (వర్ణించెను).
తా. రాముడు మారీచుని చంపుటను, రావణుడు సీతను హరించుటను, జటాయువును చంపుటను, రాముడు సీతకై విలపించుటను వర్ణించెను.
మూ. కబన్ధదర్శనం చైవ పమ్పాయాశ్చాపి దర్శనమ్,
శబర్యా దర్శనం చైవ హనూమద్దర్శనం తథా. 22
ప్ర. అ. కబన్ధదర్శనం చైవ = కబంధుని దర్శనమును, పమ్పాయాశ్చాపి = పంపానది యొక్క కూడ, దర్శనమ్ = దర్శనమును, శబర్యాః = శబరియొక్క, దర్శనం చైవ = దర్శనమును, తథా = మరియు, హనూమద్దర్శనమ్ = హనుమంతునియొక్క దర్శనమును (వర్ణించెను).
తా. రాముడు కబంధుని, పంపాసరస్సును, శబరిని, హనుమంతుని చూచుటను వర్ణించెను.
మూ. ఋశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్,
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్. 23
ప్ర. అ. ఋశ్యమూకస్య = ఋశ్యమూకపర్వతమునకు, గమనమ్ = వెళ్లుటను, సుగ్రీవేణ = సుగ్రీవునితో, సమాగమమ్ = సమాగమమును, ప్రత్యయోత్పాదనమ్ = నమ్మకమును పుట్టించుటను, సఖ్యమ్ = స్నేహమును, వాలిసుగ్రీవవిగ్రహమ్ = వాలి సుగ్రీవుల యుద్ధమును (వర్ణించెను).
తా. రాముడు ఋశ్యమూకపర్వతమునకు వెళ్లి, సుగ్రీవుని కలిసికొని అతనితో స్నేహము చేసికొనుటను, అతనికి నమ్మకము కలగించుటను, వాలి సుగ్రీవుల యుద్ధమును వర్ణించెను.
మూ. వాలిప్రమథనం చైవ సుగ్రీవప్రతిపాదనమ్,
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్. 24
ప్ర. అ. వాలిప్రమథనం చైవ = వాలిని సంహరించుటను, సుగ్రీవ ప్రతిపాదనమ్ = సుగ్రీవునకు రాజ్యము నిచ్చుటను, తారావిలాపమ్ = తారయొక్క విలాపమును, సమయమ్ = రామసుగ్రీవులు ఏర్పరచుకొనిన ఒడంబడికను, వర్షరాత్ర నివాసనం = వర్షర్తురాత్రులందు నివసించుటను (వర్ణించెను).
తా. రాముడు వాలిని సంహరించుటను, తార విలపించుటను, రాముడు సుగ్రీవునకు రాజ్యము నిచ్చుటను, రామసుగ్రీవుల మధ్య సీతాన్వేషణమును గూర్చి జరిగిన ఒప్పందమును, రాముడు వర్షర్తురాత్రులందు, యుద్ధమునకై తగు కాలము వచ్చువరకును వేచి యుండుటను వర్ణించెను.
మూ. కోపం రాఘవసింహస్య బలానాముపసఙ్గ్రహమ్,
దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్. 25
ప్ర. అ. రాఘవసింహస్య = రఘువంశమునందు జనించినవారిలో శ్రేష్ఠుడైన రామునియొక్క, కోపమ్ = కోపమును, బలానామ్ = వానర సైన్యములయొక్క, ఉపసఙ్గ్రహమ్ = చేర్చుటను, దిశః = దిక్కులనుగూర్చి, ప్రస్థాపనం చైవ = పంపుటను, పృథివ్యాః = భూమియొక్క, నివేదనమ్ = వర్ణించి చెప్పుటను (వర్ణించెను).
తా. సుగ్రీవుడు ఆలస్యము చేయుటచే రామునకు కోపము కలుగుటను, సుగ్రీవుడు వానరసేనలను పిలిపించుటను, వారిని నాల్గు దిక్కులకు పంపుటను, సుగ్రీవుడు వారికి పృథివి పై నున్న వివిధ ప్రదేశములను గూర్చి వర్ణించి చెప్పుటను (వర్ణించెను).
మూ. అఙ్గులీయకదానం చ ఋక్షస్య బిలదర్శనమ్,
ప్రాయోపవేశనం చాపి సమ్పాతేశ్చాపి దర్శనమ్. 26
ప్ర. అ. అఙ్గులీయకదానం చ = హనుమంతునకు రాముడు తన ఉంగరమును ఇచ్చుటను, ఋక్షస్య బిలదర్శనమ్ = వానరులు ఋక్షుని బిలమును చూచుటను, ప్రాయోపవేశనం చాపి = ప్రాయోపవేశనమును, సమ్పాతేః = సంపాతియొక్క, దర్శనం చాపి = దర్శనమును (వర్ణించెను).
తా. రాముడు హనుమంతుని చేతికి తన ఉంగరమును ఇచ్చుటను, వానరులు ఋక్షబిలములో ప్రవేశించుటను, వారు సీతను కానక నిరాశులై ప్రాయోపవేశము చేయుటను, వారు సంపాతిని చూచుటను (వర్ణించెను).
మూ. పర్వతారోహణం చాపి సాగరస్య చ లఙ్ఘనమ్,
సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనమ్. 27
ప్ర. అ. పర్వతారోహణం చాపి = హనుమంతుడు మహేంద్రపర్వతమును ఎక్కుటను, సాగరస్య = సముద్రముయొక్క, లఙ్ఘనమ్ = దాటుటను, సముద్రవచనాత్ = సముద్రుని మాటవలన, మైనాకస్య = మైనాకపర్వతముయొక్క, దర్శనమ్ = దర్శనమును (వర్ణించెను).
తా. హనుమంతుడు మహేంద్రపర్వతము నెక్కి దానినుండి ఎగిరి సముద్రమును దాటుటను, సముద్రుడు ప్రేరేపింపగా వచ్చిన మైనాకపర్వతము యొక్క దర్శనమును వర్ణించెను.
మూ. సింహికాయాశ్చ నిధనం లఙ్కామలయదర్శనమ్,
రాత్రౌ లఙ్కాప్రవేశం చ ఏకస్యాథ విచిన్తనమ్. 28
ప్ర. అ. సింహికాయాః = సింహికయొక్క, నిధనమ్ = మరణమును, లఙ్కా మలయ దర్శనమ్ = లంకలో నున్న పర్వతముయొక్క ఒక భాగమును చూచుటను, రాత్రౌ = రాత్రియందు, లఙ్కాప్రవేశం చ = లంకలో ప్రవేశించుటను, అథ = అటుపిమ్మట, ఏకస్య = ఒకడైన హనుమంతునియొక్క, విచిన్తనమ్ = ఆలోచించుటను వర్ణించెను. (‘‘మలయః పర్వతాన్తరే, పర్వతాఙ్కే ప్రియోద్యానే’’ అని రత్నమాల).
తా. సింహికయొక్క మరణమును, హనుమంతుడు లంకలో ఉన్న పర్వతము యొక్క ఒక భాగమును చూచుటను (చేరుటను), రాత్రియందు లంకలో ప్రవేశించుటను, ఒంటరిగా ఉన్న అతడు ఆలోచన చేయుటను వర్ణించెను.
మూ. దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్,
ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్. 29
ప్ర. అ. రావణస్య = రావణునియొక్క, దర్శనమపి = దర్శనమును, పుష్పకస్య = పుష్పకముయొక్క, దర్శనమ్ = దర్శనమును, ఆపానభూమిగమనమ్ = మద్యపానము చేయు ప్రదేశమునకు వెళ్లుటను, అవరోధస్య = అంతఃపురముయొక్క, దర్శనమ్ = దర్శనమును (వర్ణించెను).
తా. హనుమంతుడు రావణుని, అతని పుష్పకమును చూచుటను, మద్యపాన భూమికి వెళ్లి అచట రావణాంతఃపురస్త్రీలను చూచుటను వర్ణించెను.
మూ. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనమ్, 30
అభిజ్ఞానప్రదానం చ రావణస్య చ దర్శనమ్.
ప్ర. అ. అశోకవనికాయానమ్ = అశోకవనములోనికి వెళ్లుటను, సీతాయాః = సీతయొక్క, దర్శనం చాపి = దర్శనమును, అభిజ్ఞానప్రదానం చ = సీతకు ఆనవాలును ఇచ్చుటను, రావణస్య = రావణునియొక్క, దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).
తా. హనుమంతుడు అశోకవనములో ప్రవేశించి అచట సీతను చూచుటను, ఆమెకు రాముని ఉంగరమును ఆనవాలుగా ఇచ్చుటను, పిమ్మట రావణుని చూచుటను (వర్ణించెను).
మూ. రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనమ్,
మణిప్రదానం సీతాయా వృక్షభఙ్గం తథైవ చ. 31
ప్ర. అ. రాక్షసీతర్జనం చైవ = రాక్షసస్త్రీలయొక్క తర్జనమును, త్రిజటాస్వప్నదర్శనమ్ = త్రిజటయొక్క స్వప్నదర్శనమును, సీతాయాః = సీతయొక్క, మణి ప్రదానమ్ = మణిని ఇచ్చుటను, తథైవ చ = మరియు, వృక్షభఙ్గమ్ = వృక్షములను విరచుటను (వర్ణించెను).
తా. రాక్షసస్త్రీలు సీతను భయపెట్టుటను, త్రిజటాస్వప్నమును, సీత హనుమంతునకు చూడామణి ఇచ్చుటను, హనుమంతుడు అశోకవనములోని వృక్షములను విరచుటను వర్ణించెను.
మూ. రాక్షసీవిద్రవం చైవ కింకరాణాం నిబర్హణమ్,
గ్రహణం వాయుసూనోశ్చ లఙ్కాదాహాభిగర్జనమ్. 32
ప్ర. అ. రాక్షసీవిద్రవం చైవ = రాక్షసస్త్రీలు పారిపోవుటను, కిఙ్కరాణామ్ = రావణుని భటులయొక్క, నిబర్హణమ్ = వధను, వాయుసూనోః = హనుమంతునియొక్క, గ్రహణమ్ = గ్రహణమును, లఙ్కాదాహాభిగర్జనమ్ = లంకయొక్క దహనమును గర్జనమును (వర్ణించెను).
తా. రాక్షసస్త్రీలు పారిపోవుటను, హనుమంతుడు రావణుని భటులను చంపుటను, వాయునందనుడు ఇంద్రజిత్తుచేత పట్టువడుటను, అతడు లంకను దహించుచు గర్జించుటను వర్ణించెను.
మూ. ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా,
రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. 33
ప్ర. అ. అథ = అటుపిమ్మట, ప్రతిప్లవనమ్ = మరల సముద్రమును దాటుటను, తథా = మరియు, మధూనామ్ = తేనెలయొక్క, హరణమ్ = హరించుటను, రాఘవాశ్వాసనం చాపి = రాముని ఓదార్చుటను, తథా = మరియు, మణినిర్యాతనమ్ = మాణిక్యమును ఇచ్చుటను (వర్ణించెను).
తా. హనుమంతుడు మరల సముద్రము దాటి వెనుకకు వచ్చుటను, వానరులు మధువనములో మధువును త్రాగుటను, హనుమంతుడు సీత వార్త తెలిపి, రాముని ఓదార్చి, అతనికి సీత ఇచ్చిన చూడామణిని సమర్పించుటను వర్ణించెను.
మూ. సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బన్ధనమ్,
ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లఙ్కావరోధనమ్. 34
ప్ర. అ. సముద్రేణ = సముద్రముతో, సంగమమ్ = కలియుటను, నల సేతోః బన్ధనం చ = నలునిచే సేతువుయొక్క బంధనమును, సముద్రస్య = సముద్రునియొక్క, ప్రతారం చ = దాటుటను, రాత్రౌ = రాత్రియందు, లఙ్కావరోధనమ్ = లంకను ముట్టడించుటను (వర్ణించెను).
తా. రాముడు సైన్యముతో సముద్రము చేరుటను, నలుడు సేతువు బంధించుటను, రాత్రి లంకను ముట్టడించుటను వర్ణించెను.
మూ. విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్,
కుమ్భకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణమ్. 35
ప్ర. అ. విభీషణేన = విభీషణునితో, సంసర్గమ్ = సంబంధమును, వధోపాయనివేదనమ్ = అతడు రావణవధోపాయమును చెప్పుటను, కుమ్భకర్ణస్య = కుంభకర్ణునియొక్క, నిధనమ్ = వధను, మేఘనాదనిబర్హణమ్ = మేఘనాదుని సంహారమును (వర్ణించెను).
తా. విభీషణునితో సంబంధమును, అతడు రామునకు రావణవధోపాయమును చెప్పుటను, కుమ్భకర్ణమేఘనాదుల సంహారమును వర్ణించెను.
మూ. రావణస్య వినాశం చ సీతావాప్తిమరేః పురే,
విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనమ్. 36
ప్ర. అ. రావణస్య = రావణునియొక్క, వినాశం చ = వినాశమును, సీతావాప్తిమ్ = సీతాప్రాప్తిని, అరేః పురే = శత్రువుయొక్క పుర మైన లంకలో, విభీషణాభిషేకం చ = విభీషణుని అభిషేకమును, పుష్పకస్య = పుష్పకముయొక్క, దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).
తా. రావణవధను, సీతాప్రాప్తిని, లంకలో విభీషణరాజ్యాభిషేకమును, పుష్పకదర్శనమును వర్ణించెను.
మూ. అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్,
రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్,
స్వరాష్ట్రరఞ్జనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్. 37
ప్ర. అ. అయోధ్యాయాః గమనమ్ = అయోధ్యాపట్టణమునకు వెళ్లుటను, భరతేన = భరతునితో, సమాగమమ్ = సమాగమమును, రామాభిషేకాభ్యుదయమ్ = రామరాజ్యాభిషేకోత్సవమును, సర్వసైన్యవిసర్జనమ్ = సకల సైన్యమును వెనుకకు పంపివేయుటను, స్వరాష్ట్రరఞ్జనం చైవ = తన రాష్ట్రమును ఆనందింప చేయుటను, వైదేహ్యాః విసర్జనం చ = సీతను విడచుటను (వర్ణించెను).
తా. రాముడు అయోధ్య చేరి భరతుని కలియుటను, రాముని పట్టాభిషేకోత్సవమును, రాముడు వానరసైన్యము నంతను వెనుకను పంపివేయుటను, దేశములోని ప్రజలందరును సంతోషించువిధమున రాముడు రాజ్యపాలనము చేయుటను, సీతను త్యజించుటను వర్ణించెను.
మూ. అనాగతం చ యత్కించిద్రామస్య వసుధాతలే,
తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానృషిః. 38
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే తృతీయః సర్గః.
ప్ర. అ. భగవాన్ = మహాత్మ్యము కల, వాల్మీకిః ఋషిః = వాల్మీకిమహర్షి, రామస్య = రామునకు సంబంధించిన, యత్కిఞ్చిత్ = ఏ ఏ విషయము, వసుధాతలే = ఈ భూతలమునందు, అనాగతం చ = మున్ముందు జరుగవలసి ఉన్నదో, తత్ = దానిని, ఉత్తరే = ఉత్తరకథాప్రతిపాదక మగు, కావ్యే = కావ్యమునందు, చకార = రచించెను.
తా. భగవంతు డైన వాల్మీకి మున్ముందు జరుగ నున్న రాముని చరిత్రము నంతను ఉత్తరకాండలో రచించెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,
