Chapter_4

Back
Book Balakandamu
Chapter No 10
Pages 9
Read Time 13 Minutes

Chapter_4

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ చతుర్థః సర్గః

వాల్మీకి ఇరువదినాలుగువేల శ్లోకముల రామాయణము రచించి దానిని కుశలవులకు నేర్పుట. వారు రామాయణగానము చేయుచుండగా విని మునులు వారిని, రామాయణమును ప్రశంసించుట. శ్రీరాముడు కుశలవులను తన కొలువునకు రావించి, ఆదరించి, వారు గానము చేయగా రామాయణమును వినుట.

మూ. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవానృషిః,

చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్. 1

ప్ర. అ. భగవాన్ = మాహాత్మ్యము కలవాడును, ఆత్మవాన్ = బుద్ధిశాలియు, ఋషిః = కావ్యము చేయ సమర్థుడును అగు, వాల్మీకిః = వాల్మీకి, ప్రాప్తరాజ్యస్య = పొందబడిన రాజ్యము గల, రామస్య = రామునియొక్క, విచిత్రపదమ్ = ఆశ్చర్య జనకము లగు శబ్దములు గల, కృత్స్నమ్ = సమస్తమైన, చరితమ్ = చరిత్రమును, చకార = రచించెను.

తా. భగవంతుడు, ఋషి యగుటచే కావ్యము చేయ సమర్థుడును అగు వాల్మీకి, రాముడు రాజ్యమును పాలించుచుండగా, అతని చరిత్రము నంతను విచిత్రములైన శబ్దములతో రచించెను.

మూ. చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషిః,

తథా సర్గశతాన్ పఞ్చ షట్కాణ్డాని తథోత్తరమ్. 2

ప్ర. అ. ఋషిః = వాల్మీకిమహర్షి, శ్లోకానాం చతుర్వింశత్సహస్రాణి = ఇరువది నాలుగు వేల శ్లోకములను, తథా = మరియు, పఞ్చ = ఐదు, సర్గశతాన్ = వందలసర్గలను, షట్కాణ్డాని = ఆరుకాండలను, తథా = మరియు, ఉత్తరమ్ = ఉత్తరకాండను, ఉక్తవాన్ = చెప్పెను.

తా. వాల్మీకిమహర్షి రామాయణమును ఏడు కాండములలో, ఆరువందల సర్గలలో, ఇరువదినాలుగు వేల శ్లోకములలో రచించెను.

వి. "ప్రాప్తరాజ్యస్య రామస్య చరితం భగవాన్ ఋషిః చకార" అనుటచే రాముడు రాజ్యము చేయుచున్న కాలమునందే వాల్మీకి రామాయణమును రచించె నని సూచిత మగుచున్నది. (గోవిందరాజులు). "తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః" (నీ రాజ్యములో ఉన్న మమ్ములను నీచే రక్షించవలెను) అని ఋషులు చెప్పుటచే, వాల్మీకి రామరాజ్యమునందే నివసించి అతని పవిత్రచరిత్రమును రచించెను (మహేశ్వరతీర్థులు).

మూ. కృత్వాపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరమ్,

చిన్తయామాస కోన్వేతత్ప్రయుఞ్జీయాదితి ప్రభుః. 3

ప్ర. అ. మహాప్రాజ్ఞః = మహాబుద్ధిశాలియు, ప్రభుః = సమర్థుడును అగు వాల్మీకి, సహోత్తరమ్ = రామపట్టాభిషేకము తరువాత జరిగిన కథతో కూడినదియు, సభవిష్యమ్ = అశ్వమేధము తరువాత జరిగిన కథతో కూడినదియు అగు, తత్ = రామాయణమును, కృత్వా = రచించి, ఏతత్ = దీనిని, కః ను = ఎవడు, ప్రయుఞ్జీయాత్ = ప్రయోగించును, ఇతి = అని, చిన్తయామాస = ఆలోచించెను.

తా. మహాబుద్ధిశాలియు, సమర్థుడను అగు వాల్మీకి రామపట్టాభిషేకానంతరము జరిగిన కథతోడను, అశ్వమేధానంతరము జరిగిన కథతోడను రామాయణమును రచించి ‘‘దీనిని యుక్తరీతిలో పఠింపగలవారు ఎవరున్నారా?’’ అని ఆలోచించెను.

మూ. తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మనః,

అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ. 4

ప్ర. అ. తతః = అటుపిమ్మట, మునివేషౌ = మునుల వేషములను ధరించిన, కుశీలవౌ = గాయకులైన కుశలవులు, చిన్తయానస్య = ఆలోచించుచున్న, భావితాత్మనః = పరిశుద్ధ మైన హృదయముగల, తస్య మహర్షేః = ఆ వాల్మీకిమహర్షియొక్క, పాదౌ = పాదములను, అగృహ్ణీతామ్ = గ్రహించిరి.

తా. పవిత్రహృదయు డగు వాల్మీకిమహర్షి ఈ విధముగా ఆలోచించుచుండగా మునివేషధారులైన గాయకులగు కుశలవులు ఆయనకు పాదప్రణామము చేసిరి.

మూ. కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ,

భ్రాతరౌ స్వరసమ్పన్నౌ దదర్శాశ్రమవాసినౌ. 5

ప్ర. అ. ధర్మజ్ఞౌ = ధర్మముతెలిసినవారును, రాజపుత్రౌ = రాజకుమారులును, యశస్వినౌ = కీర్తికలవారును, భ్రాతరౌ = సోదరులును, స్వరసంపన్నౌ = మధురస్వరము కలవారును, ఆశ్రమవాసినౌ = ఆశ్రమములో నివసించువారును అగు, కుశీలవౌ = గాయకులు అగు (కుశలవులను) దదర్శ = చూచెను.

తా. వాల్మీకిమహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు, మధురస్వరవంతులు, ఆశ్రమనివాసులు, సోదరులు, గాయకులు అగు కుశలవులను చూచెను.

మూ. స తు మేధావినౌ దృష్ట్యా వేదేషు పరినిష్ఠితౌ,

వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. 6

ప్ర. అ. ప్రభుః = స్వతంత్రుడైన, సః = ఆ వాల్మీకి, మేధావినౌ = మేధావంతులును, వేదేషు = వేదములలో, పరినిష్ఠితౌ = దృఢమైన జ్ఞానము కలవారును అగు వారిని, దృష్ట్వా = చూచి, వేదోపబృంహణార్థాయ = వేదములను పరిపుష్టము చేయుటకై రచింపబడిన రామాయణమును, తౌ = వారిని, అగ్రాహయత = గ్రహింపచేసెను.

తా. స్వతంత్రుడైన వాల్మీకి, సాంగవేదాధ్యయనము చేసిన, మేధావంతులైన ఆ ఇరువురిని చూచి, వేదార్థమునకు పరిపుష్టి కూర్చుటకై తాను రచించిన రామాయణమును వారికి ఉపదేశించెను.

మూ. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్,

పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః. 7

ప్ర. అ. చరితవ్రతః = ఆచరింపబడిన ఉత్తమవ్రతములు గల వాల్మీకి, కృత్స్నమ్ = సమస్తమైన, కావ్యమ్ = ఆ కావ్యమును, రామాయణమ్ = రామాయణమనియు, సీతాయాః మహత్ చరితమ్ = సీతయొక్క గొప్ప చరిత్ర అనియు, పౌలస్త్యవధమ్ ఇత్యేవ = పౌలస్త్యవధ మనియు పేర్లతో, చకార = రచించెను.

తా. సకలవ్రతములను ఆచరించిన వాల్మీకి ఆ కావ్యమును ‘‘రామాయణము’’ ‘‘సీతాచరితము’’ ‘‘పౌలస్త్యవధము’’ అను పేర్లతో రచించి ఉండెను.

మూ. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్,

జాతిభిః సప్తభిర్బద్ధం తన్త్రీలయసమన్వితమ్. 8

రసైః శృఙ్గారకారుణ్యహాస్యవీరభయానకైః,

రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్. 9

తౌ తు గాన్ధర్వతత్త్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ,

భ్రాతరౌ స్వరసమ్పన్నౌ గన్ధర్వావివ రూపిణౌ. 10

రూపలక్షణసంపన్నౌ మధురస్వరభాషిణౌ,

బిమ్బాదివోద్ధతౌ బిమ్బౌ రామదేహాత్తథాపరౌ. 11

ప్ర. అ. గాన్ధర్వతత్త్వజ్ఞౌ = సంగీతశాస్త్రముయొక్క యథార్థస్వరూపము తెలిసినవారును, మూర్ఛనాస్థానకోవిదౌ = స్వరమూర్ఛనల స్థానములు తెలిసినవారును, భ్రాతరౌ = సోదరులును, స్వరసమ్పన్నౌ = మంచికంఠస్వరము కలవారును, రూపిణౌ = మనుష్య రూపము దాల్చిన, గన్ధర్వావివ = గంధర్వుల వలె ఉన్నవారును, రూపలక్షణసంపన్నౌ = మంచి రూపముతో మంచి లక్షణములతో కూడినవారును, మధురస్వరభాషిణౌ = మధుర మైన స్వరముతో మాటలాడువారును, బిమ్బాత్ = మూలబింబ మైన, రామదేహాత్ = రాముని దేహమునుండి, ఉద్ధతౌ = తీయబడిన, అపరౌ బిమ్బౌ ఇవ = వేరైన ప్రతిబింబముల వలె ఉన్నవారును అగు, తౌ తు = ఆ కుశలవులు, పాఠ్యే = పఠింపదగిన అంశమునందును, గేయే చ = గానము చేయదగిన అంశమునందును, మధురమ్ = మధుర మైనదియు, త్రిభిః = ప్రమాణైః = ద్రుత-మధ్య-విలంబితము లనెడు మూడు ప్రమాణములతో, అన్వితమ్ = కూడినదియు, సప్తభిః = జాతిభిః = షడ్జ-మధ్యమ-గాంధార- నిషాద-ఋషభ-ధైవత-పంచమము లనెడు జాతులతో, బద్ధమ్ = కూర్చబడినదియు, తన్త్రీలయసమన్వితమ్ = వీణాతంత్రుల లయతో కూడినదియు, శృఙ్గారకారుణ్యహాస్య వీరభయానకైః = శృంగార-కరుణ-హాస్య-వీర-భయానకరసములతోడను, రౌద్రాదిభిశ్చ = రౌద్రము మొదలైన, రసైః = రసములతోడను, సంయుక్తమ్ = కూడిన, ఏతత్ = ఈ, కావ్యమ్ = కావ్యమును, అగాయతామ్ = గానము చేసిరి.

తా. కుశలవులు ఆ కావ్యము చక్కగా గానము చేసిరి. ఆ కావ్యము లోని చదువదగిన అంశము (సాహిత్యము), గానము చేయు అంశము (సంగీతము) కూడ మధురముగా ఉన్నవి. అనగా ఈ కావ్యములోని భాషార్థాది విషయములు మధురముగ నుండుటయే గాక, ఇది గానమునకు కూడ అనువుగా ఉండుటచే దీని గానము కూడ మధురముగనే ఉన్నది. ద్రుత-మధ్య-విలంబితము లను మూడు ప్రమాణములను, షడ్జాదిసప్తస్వరములను కూడ ఇందు చక్కగా నిర్వహించుటకు వీలున్నది. ఇది వీణాతంత్రులపై లయ కలిపి పాడుటకు అనువుగ ఉన్నది. ఆ యా స్థానములలో ప్రసంగానుగుణముగా శృంగార-హాస్య-కరుణ-రౌద్ర-వీర-భయానక- బీభత్స-అద్భుత-శాంతరసములు నిర్వహింపబడినవి. దీనిని పాడిన కుశలవు లను సోదరులు కూడ సంగీతశాస్త్రరహస్యములు తెలిసినవారు. మనుష్యరూపము ధరించిన గంధర్వుల వలె ఉన్నారు. అపూర్వసౌందర్యముతో, ఉత్తమలక్షణములతో అలరారుచున్న వారు మాటలాడు నపుడు కూడ వారి కంఠస్వరము ఎంతగానో ముచ్చట గొల్పుచు ఉండును. వారు రాముని శరీర మనెడు మూలబింబమునుండి వెలికి తీసిన రెండు ప్రతిబింబములా అన్నట్లు ఉండిరి.

మూ. తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన ధర్మ్యమాఖ్యానముత్తమమ్,

వాచోవిధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిన్దితౌ. 12

ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే,

యథోపదేశం తత్త్వజ్ఞౌ జగతుః సుసమాహితౌ. 13

ప్ర. అ. తౌ = ఆ, రాజపుత్రౌ = రాజపుత్రులు, ధర్మ్యమ్ = ధర్మప్రతిపాదకమును, ఉత్తమమ్ = ఉత్తమ మైనదియు అగు, తత్ సర్వమ్ ఆఖ్యానమ్ = ఆ ఆఖ్యానమునంతను, కార్త్స్న్యేన = పూర్తిగా, వాచోవిధేయమ్ = కంఠస్థ మైన దానినిగా, కృత్వా = చేసి, అనిన్దితౌ = ఏ విధముగను తప్పు పట్టుటకు వీలులేనివారై, తత్త్వజ్ఞౌ = ఆ ఆఖ్యానమునకు సంబంధించిన తత్త్వమును బాగుగా తెలిసికొనినవారై, సుసమాహితౌ = బాగుగా సావధాన చిత్తులై, యథోపదేశమ్ = వాల్మీకిమహర్షి తమకు ఎట్లు ఉపదేశించెనో అదే విధమున, ఋషీణామ్ = ఋషులయొక్కయు, ద్విజాతీనామ్ = ద్విజులయొక్కయు, సాధూనాం చ = సత్పురుషులయొక్కయు, సమాగమే = సమావేశములయందు, జగతుః = గానముచేసిరి.

తా. ఆ రాజకుమారులు ధర్మప్రతిపాదక మైన ఆ ఉత్తమకావ్యమును పూర్తిగా కంఠస్థము చేసికొని, దాని నెట్లు గానము చేయవలెనో ఆ రహస్యమును బాగుగా తెలిసికొని, సావధానచిత్తులై, ఋషులు, ద్విజులు, సత్పురుషులు మొదలైన వారి సమావేశములలో, ఎవ్వరును తప్పు పట్టుటకు వీలు కాని విధమున గానము చేసిరి.

మూ. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ,

తౌ కదాచిత్సమేతానామృషీణాం భావితాత్మనామ్,

ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతామ్. 14

ప్ర. అ. మహాత్మానౌ = గొప్ప బుద్ధి కలవారును, మహాభాగౌ = గొప్ప భాగ్యము కలవారును, సర్వలక్షణలక్షితౌ = సమస్తమైన ఉత్తమలక్షణములతో కూడిన వారును అగు, తౌ = వారు, కదాచిత్ = ఒకనాడు, సమేతానామ్ = ఒక చోట కలిసి ఉన్న, భావితాత్మనామ్ = పవిత్ర మైన హృదయము గల, ఆసీనానామ్ = కూర్చున్న, ఋషీణామ్ = ఋషులయొక్క, సమీపస్థౌ = సమీపమునందున్నవారై, ఇదమ్ = ఈ, కావ్యమ్ = కావ్యమును, అగాయతామ్ = గానముచేసిరి.

తా. మహాబుద్ధిశాలులును, మహాభాగ్యవంతులును, సర్వలక్షణసంపన్నులును అగు ఆ కుశలవులు, ఒకనాడు, పవిత్రహృదయు లగు కొందరు ఋషీశ్వరులు కలిసి ఒక చోట కూర్చుని యుండగా, వారి ఎదుట ఈ కావ్యమును గానము చేసిరి.

మూ. తచ్ఛ్రుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః,

సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః. 15

ప్ర. అ. సర్వే = సమస్తమైన, మునయః = మునులు, తత్ = ఆ కావ్యమును, శ్రుత్వా = విని, పరమ్ = గొప్ప, విస్మయమ్ = ఆశ్చర్యమును, ఆగతాః = పొందినవారై, బాష్పపర్యాకులేక్షణాః = కన్నీటిచే వ్యాకుల మైన చూపు కలవారై, సాధు సాధు ఇతి = ‘‘బాగు బాగు’’ అని, తౌ = కుశలవులను గూర్చి, ఊచుః = పలికిరి.

తా. వారి కావ్యగానమును విన్న మును లందరును మిక్కిలి ఆశ్చర్యము చెంది, ఆనందబాష్పము కార్చుచు, ‘‘బాగు బాగు’’ అని వారిని మెచ్చుకొనిరి.

మూ. తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః,

ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. 16

ప్ర. అ. ధర్మవత్సలాః = ధర్మమునందు ఆసక్తి గల, తే = ఆ, సర్వే = సమస్తమైన, మునయః = మునులు, ప్రీతమనసః = సంతసించిన మనస్సులు కలవారై, ప్రశస్తవ్యౌ = ప్రశంసార్హులైన, గాయమానౌ = గానము చేయుచున్న, కుశీలవౌ = గాయకులను (కుశలవులను), ప్రశశంసుః = ప్రశంసించిరి.

తా. ధర్మమునందు ఆసక్తి గల ఆ మును లందరును సంతోషించిన హృదయము కలవారై ప్రశంసార్హులైన, గానము చేయుచున్న ఆ కుశలవులను ప్రశంసించిరి.

మూ. అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః,

చిరనిర్వృత్తమప్యేతత్ప్రత్యక్షమివ దర్శితమ్. 17

ప్ర. అ. గీతస్య = గానముయొక్క, మాధుర్యమ్ = మాధుర్యము, అహో = ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది! విశేషతః = ప్రధానముగా, శ్లోకానాం తు = శ్లోకముల (మాధుర్యము, ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది!) ఏతత్ = ఈ చరిత్రము, చిరనిర్వృత్తమపి = చాలకాలము క్రితము జరిగిన దైనను, ప్రత్యక్షమివ = ప్రత్యక్షముగ జరుగుచున్నట్లు, దర్శితమ్ = చూపబడినది.

తా. గీతము చాల మధురముగా ఉన్నది. శ్లోకములు ఇంకను మధురములుగా ఉన్నవి. పూర్వ మేనాడో జరిగిన కథ ఇపుడు కన్నులకు కట్టినట్లు వర్ణింపబడినది.

మూ. ప్రవిశ్య తావుభౌ సుష్ఠు భావం సమ్యగగాయతామ్,

సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసమ్పదా. 18

ప్ర. అ. తౌ ఉభౌ = వారిరువురును, సహితౌ = కలిసినవారై, అనగా లయ తప్పనివారై గొంతుకలు కలిపి, భావమ్ = అభిప్రాయమును, సుష్ఠు = బాగుగా, ప్రవిశ్య = ప్రవేశించి, మధురమ్ = మధురముగాను, రక్తమ్ = మనోహరముగాను, స్వరసమ్పదా = షడ్జాదిస్వర సంపదతో, సంపన్నమ్ = కూడునట్లుగాను, సమ్యక్ = బాగుగా, అగాయతామ్ = గానము చేసిరి.

తా. వారిద్దరును కంఠములు చక్కగా కలిపి, భావావేశముతో, మధురముగాను, మనోహరముగాను, షడ్జాది స్వరములు చెడకుండగను, పాడిరి.

మూ. ఏవం ప్రశస్యమానౌ తౌ తపఃశ్లాఘ్యైర్మహాత్మభిః,

సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతామ్. 19

ప్ర. అ. తపఃశ్లాఘ్యైః = తపస్సుచే కొనియాడదగిన, మహాత్మభిః = మహాత్ములచేత, ఏవమ్ = ఈ విధముగా, ప్రశస్యమానౌ = ప్రశంసించబడుచున్న, తౌ = వారు, సంరక్తతరమ్ = మిక్కిలి మనోహరముగా ఉండునట్లును, అత్యర్థమ్ = మిక్కిలి, మధురమ్ = మధురముగా, అగాయతామ్ = గానముచేసిరి.

తా. మహాతపఃశాలులగు ఆ మహాత్ము లీ విధముగా కొనియాడగా కుశలవులు అతిమధురముగాను, మనోహరముగాను గానము చేసిరి.

మూ. ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ,

ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయశాః. 20

ప్ర. అ. కశ్చిత్ = ఒకనొక, మునిః = ముని, ప్రీతః = సంతసించినవాడై, సంస్థితః = లేచినవాడై, తాభ్యామ్ = ఆ కుశలవులకు, కలశమ్ = కలశమును, దదౌ = ఇచ్చెను. మహాయశాః = గొప్పకీర్తి గల, కశ్చిత్ = ఒకానొక ముని, ప్రసన్నః = సంతసించినవాడై, వల్కలమ్ = నారచీరను, దదౌ = ఇచ్చెను.

తా. ఒకనొక మహర్షి సంతోషించినవాడై లేచి వారికి ఒక కలశమును బహూకరించెను. మరి యొక మహర్షి సంతసించి నారచీరను బహూకరించెను.

మూ. ఆశ్చర్యమిద మాఖ్యానం మునినా సంప్రకీర్తితమ్,

పరం కవీనా మాధారం సమాప్తం చ యథాక్రమమ్. 21

ప్ర. అ. మునినా = వాల్మీకిమునిచేత, సంప్రకీర్తితమ్ = చెప్పబడిన, ఇదమ్ = ఈ, ఆఖ్యానమ్ = ఆఖ్యానము, ఆశ్చర్యమ్ = ఆశ్చర్యకర మైనది. కవీనామ్ = కవులకు, పరమ్ = అత్యంతము, ఆధారమ్ = ఆధార మైనది. యథాక్రమమ్ = క్రమము ననుసరించి, సమాప్తం చ = సమాప్తము చేయబడినది.

తా. వాల్మీకి రచించిన ఈ రామాయణము చాల ఆశ్చర్యకర మైనది. రాబోవు కవు లందరికిని ఆధార మైనది. క్రమము ప్రకారము పూర్తి చేయబడినది.

మూ. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ,

ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరమ్. 22

ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ,

రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః. 23

ప్ర. అ. ఆయుష్యమ్ = ఆయుస్సును పెంచునదియు, పుష్టిజనకమ్ = పుష్టిని కలిగించునదియు, సర్వశ్రుతిమనోహరమ్ = అందరి చెవులకును ఇంపుగా నుండునదియు, అభిగీతమ్ = చక్కగా పాడబడినదియు అగు, ఇదమ్ = ఈ, గీతమ్ = గీతమును గూర్చి, ప్రశస్యమానౌ = ప్రశంసించబడుచున్నవారును, రథ్యాసు = వీథులందును, రాజమార్గేషు = రాజమార్గములందును, సర్వత్ర = అంతటను, గాయకౌ = గానముచేయుచున్నవారును, సర్వగీతేషు = సమస్తవిధములగు గానములందును, కోవిదౌ = సమర్థులును అగు ఆ కుశలవులను, కదాచిత్ = ఒకానొకప్పుడు, భరతాగ్రజః = రాముడు, తత్ర = అచట, దదర్శ = చూచెను.

తా. ఆయుస్సును వృద్ధిపొందించునదియు, పుష్టిని కలిగించునదియు, అందరి చెవులకును ఇంపుగా నుండునదియు అగు ఆ గీతమును చక్కగా పాడుటచే అందరును ఆ కుశలవులను ప్రశంసించుచుండిరి. వారు వీథులందును, రాజమార్గములందును, ఇతరప్రదేశములందును గానము చేయుచుండగా ఒకనాడు రాముడు వారిని చూచుట సంభవించెను.

మూ. స్వవేశ్మ చానీయ తతో భ్రాతరౌ స కుశీలవౌ,

పూజయామాస పూజార్హౌ రామః శత్రునిబర్హణః. 24

ప్ర. అ. తతః = అటుపిమ్మట, శత్రునిబర్హణః = శత్రువులను సంహరించు, సః = ఆ, రామః = రాముడు, పూజార్హౌ = గౌరవమునకు తగిన, భ్రాతరౌ = సోదరులైన, కుశీలవౌ = గాయకులను (కుశలవులను), స్వవేశ్మ = తన గృహమును గూర్చి, ఆనీయ = తీసుకొనివచ్చి, పూజయామాస = గౌరవించెను.

తా. శత్రునాశకు డగు రాముడు గౌరవార్హులైన ఆ కుశలవులను తన ఇంటికి రప్పించి గౌరవించెను.

మూ. ఆసీనః కాఞ్చనే దివ్యే స చ సింహాసనే ప్రభుః,

ఉపోపవిష్టః సచివైర్భ్రాతృభిశ్చ పరన్తపః. 25

ప్ర. అ. పరన్తపః = శత్రువులను పీడించు, సః ప్రభుః = ఆ రాముడు, సచివైః = మంత్రులచేతను, భ్రాతృభిశ్చ = సోదరులచేతను, ఉపోపవిష్టః = చుట్టబడినవాడై, దివ్యే = దివ్యమైన, కాఞ్చనే = బంగారువికారమైన, సింహాసనే = సింహాసనమునందు, ఆసీనః = కూర్చుండెను.

తా. (శత్రుభయంకరు డగు ఆ) రాముడు మంత్రులును, సోదరులును సమీపమున కూర్చొని యుండగా, దివ్య మైన కనకసింహాసనమును అలంకరించి ఉండెను.

మూ. దృష్ట్యా తు రూపసమ్పన్నౌ తావుభౌ నియతస్తదా,

ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా. 26

ప్ర. అ. నియతః = నియమవంతుడైన, రామః = రాముడు, తదా = అప్పుడు, రూపసమ్పన్నౌ = మంచిరూపముతో కూడిన, తౌ = ఆ, ఉభౌ = ఇద్దరిని, దృష్ట్వా = చూచి, లక్ష్మణమ్ = లక్ష్మణుని, శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని, తథా = మరియు, భరతమ్ = భరతుని గూర్చి, ఉవాచ = పలికెను.

తా. అప్పుడా రాముడు, మంచి రూపముతో ప్రకాశించుచున్న వారిరువురిని చూచి భరత లక్ష్మణ శత్రుఘ్నులతో ఇట్లనెను.

మూ. శ్రూయతామిద మాఖ్యానమనయోర్దేవవర్చసోః,

విచిత్రార్థపదం సమ్యగ్గాయకౌ తావచోదయత్. 27

ప్ర. అ. దేవవర్చసోః = దేవతలవంటి కాంతి గల, అనయోః = వీరిద్దరియొక్క, విచిత్రార్థపదమ్ = విచిత్ర మైన అర్థములును పదములును గల, ఇదమ్ = ఈ, ఆఖ్యానమ్ = ఆఖ్యానము, సమ్యక్ = బాగుగా, శ్రూయతామ్ = వినబడుగాక, (ఇట్లు పలికి) తౌ గాయకౌ = ఆ గాయకులను, ఆచోదయత్ = ప్రేరేపించెను.

తా. ‘‘దేవతల వంటి తేజస్సు గల వీరిద్దరు పాడ నున్న, విచిత్రమైన పదములును, అర్థములును గల ఈ ఆఖ్యానమును శ్రద్ధగా వినుడు’’ అని వారితో పలికి, కుశలవులను పాడు డని నియోగించెను.

మూ. తౌ చా పి మధురం రక్తం స్వంచితాయతనిస్వనమ్,

తన్త్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతామ్. 28

ప్ర. అ. తౌ చ = వారిరువురు, మధురమ్ = మధురముగాను, రక్తమ్ = రాగయుక్తము గాను, స్వంచితాయతనిస్వనమ్ = బాగుగా ఒప్పుచున్న దీర్ఘ మైన ధ్వని కలుగునట్లుగాను, తన్త్రీలయవత్ = వీణాతంత్రుల లయకు సరిపడు నట్లు గాను, అత్యర్థమ్ = మిక్కిలి, విశ్రుతార్థమ్ = స్పష్ట మైన అర్థము కలుగు నట్లుగాను, అగాయతామ్ = గానము చేసిరి.

తా. ఆ కుశలవులు మధురముగాను, రాగయుక్తముగాను గానము చేసిరి. వారి కంఠధ్వని చాల చక్కగ దీర్ఘముగ ఉండెను. వారి పాట వీణాతంత్రుల లయమునకు సరిపడి ఉండెను. అర్థము స్పష్టముగ తెలియుచుండెను.

మూ. హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ,

శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది. 29

ప్ర. అ. శ్రోత్రాశ్రయసుఖమ్ = శ్రవణేంద్రియమునకు సుఖకరముగా ఉన్న, తత్ = ఆ, గేయమ్ = పాట, జనసంసది = జనసమూహమునందు, సర్వగాత్రాణి = అన్ని అవయవములను, మనాంసి = మనస్సులను, హృదయాని చ = మనస్సులకు స్థానములైన హృదయములను, హ్లాదయత్ = సంతోషింపచేయుచున్నదై, బభౌ = ప్రకాశించెను.

తా. జనసమూహములో ఆ కుశలవుల గానము వీనులకు విందుగా నుండి, వినువారి సర్వేంద్రియములను, మనస్సులను, హృదయములను ఆనందింపచేసెను.

మూ. ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ

కుశీలవౌ చైవ మహాతప స్వినౌ,

మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే

మహానుభావం చరితం నిబోధత. 30

ప్ర. అ. ఇమౌ = ఈ, మునీ = మునులు, పార్థివలక్షణాన్వితౌ = రాజలక్షణములతో కూడి యున్నారు. కుశీలవౌ చైవ = గాయకు లైనను, మహాతపస్వినౌ = గొప్ప తపఃశాలులు. మమాపి = నాకు కూడ, భూతికరమ్ = శ్రేయస్కరమగు, మహానుభావమ్ = గొప్ప శక్తి గల, తత్ చరితమ్ = ఆ సీతచరిత్రము, ప్రవక్ష్యతే = చెప్పబడును. నిబోధత = సావధానచిత్తులై వినండి.

తా. ఓ జనులారా! వీరిరువురు మునులే అయినను రాజలక్షణములతో ప్రకాశించుచున్నారు. గాయకులే అయినను గొప్ప తపస్సు కలవారు. వీరు గానము చేయనున్న సీతాచరితము నాకు కూడ ఊరట కలిగించున దగుటచే శ్రేయస్కరము. సావధానచిత్తులై వినుడు (అని శ్రీరాముడు అక్కడ నున్న వారితో పలికెను).

మూ. తతస్తు తౌ రామవచఃప్రచోదితా

వగాయతాం మార్గవిధానసమృదా,

స చాపి రామః పరిషద్గతః శనై

ర్బుభూషయా సక్తమనా బభూవ హ. 31

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుర్థః సర్గః.

ప్ర. అ. తతః = అటు పిమ్మట, తౌ = ఆ కుశలవులు, రామవచఃప్రచోదితౌ = రాముని వాక్కుచే ప్రేరేపింపబడిన వారై, మార్గవిధానసమ్పదా = మార్గమనెడి గానవిధానసంపదతో, అగాయతామ్ = గానము చేసిరి. పరిషద్గతః = పరిషత్తులో ఉన్న, సః = ఆ, రామః అపి = రాముడు కూడ, శనైర్బుభూషయా = శాంతచిత్తుడు కావలెనను ఇచ్ఛతో, సక్తమనాః = ఆ గానమునందు ఆసక్త మైన మనస్సు కలవాడు, బభూవ = అయ్యెను.

తా. రాముడు ప్రేరేపించగా, ఆ కుశలవులు, మార్గదేశీపద్ధతు లనెడు రెండు గానపద్ధతులలో మార్గపద్ధతినే చక్కగా అవలంబించి గానము చేసిరి. పరిషత్తులో నున్న రాముడు కూడ మనఃశాంతి పొంద వలె ననెడు అభిలాషచే ఆ గానమునందు ఆసక్తచిత్తు డయ్యెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో చతుర్థసర్గ సమాప్తము.

© 2026 Ebook Library