| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 11 |
| Pages | 7 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ పఞ్చమః సర్గః
దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము.
మూ. సర్వా పూర్వమియం యేషామాసీత్కత్స్నా వసుంధరా,
ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినామ్. 1
ప్ర. అ. సర్వా = సకలద్వీపాత్మక మైన, కృత్స్నా = సమస్త మైన, ఇయం వసుంధరా = ఈ భూమి, ప్రజాపతిమ్ ఉపాదాయ = మనుప్రజాపతి మొదలుకొని, జయశాలినామ్ = విజయవంతు లైన, యేషామ్ = ఏ, నృపాణామ్ = రాజులకు సంబంధించినదిగా, పూర్వమ్ = పూర్వము, ఆసీత్ = ఉండెనో.
తా. అష్టాదశద్వీప పరిమిత యైన ఈ భూమి యంతయు, పూర్వము, మనుచక్రవర్తి మొదలుకొని, విజయవంతు లైన ఏ రాజుల వశములో ఉండెడిదో.
ఈ శ్లోకమునకు మూడవ శ్లోకముతో అన్వయము.
‘సర్వా’ ‘కృత్స్నా’ శబ్దములకు అర్థములో భేదము లేదు. రెండు పదములను ప్రయోగించుటచే ‘సర్వా’ అనుదానికి ‘అన్ని ద్వీపభేదములు కలది’ అనియు, ‘కృత్స్నా’ అనుదానికి ‘‘సమస్త మైనది’’ అనియు అర్థము చెప్పబడినది.
రామాయణ భారత పురాణాదిప్రాచీన గ్రంథాలలో ఇలాంటి పునరుక్తులు, పాదపూరణానికి మాత్రమే ఉపయోగించే ‘‘చ, వా, తు, హ, వై,’’ మొదలైన పదాలు అత్యధికముగా ఉండును. వాటిని ఆ విధముగానే గ్రహించుట మంచిది. ఏదో అపూర్వార్థము కల్పించుట హృదయంగమముగా ఉండదు. ప్రకరణాదులను పట్టి భాషకు స్వభావసిద్ధముగా ఉన్న అర్థమును మాత్రమే గ్రహించుట యుక్తము.
మూ. యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః,
షష్టిః పుత్రసహస్రాణి యం యాన్తం పర్యవారయన్. 2
ప్ర. అ. యేన = ఎవనిచేత, సాగరః = సముద్రము, ఖానితః = త్రవ్వించబడినదో, యాన్తమ్ = యుద్ధమునకు వెళ్లుచున్న, యమ్ = ఎవనిని, షష్టిః పుత్రసహస్రాణి = అరువది వేలమంది కుమారులు, పర్యవారయన్ = చుట్టుకొని ఉండెడివారో, సః = అట్టి, సగరో నామ = సగరు డనే రాజు, యేషామ్ = ఏ రాజులలో ఉండెడివాడో.
తా. ఏ రాజులలో సగరు డనెడు చక్రవర్తి ఉండెడివాడో - ఆ నగర చక్రవర్తి ఈ సాగరమును త్రవ్వించగా అది వైశాల్యమును పొందినది. అతడు యుద్ధయాత్రకై బయలుదేరి నపుడు అతనితో కూడ అరువదివేలమంది కుమారులు వెళ్లెడివారు.
మూ. ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్,
మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతమ్. 3
ప్ర. అ. తేషామ్ = అట్టి, మహాత్మనామ్ = మహాత్ములైన, ఇక్ష్వాకూణాం రాజ్ఞామ్ = ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాజులయొక్క, వంశే = వంశమునందు, రామాయణమితి = రామాయణ మని, శ్రుతమ్ = ప్రసిద్ధి కాంచిన, మహత్ = పూజ్యమైన, ఇదమ్ = ఈ, ఆఖ్యానమ్ = ఆఖ్యానము, ఉత్పన్నమ్ = పుట్టినది.
తా. రామాయణ మని ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర మైన ఆఖ్యానము అట్టి మహాత్ము లైన ఇక్ష్వాకువంశరాజుల వంశములో పుట్టినది.
మూ. తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః,
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా. 4
ప్ర. అ. తత్ = అట్టి, ఇదమ్ = ఈ రామాయణమును, సర్వమ్ = సమస్తమైనదానిని, వర్తయిష్యామి = లోకములో ప్రవర్తింపచేసెదను. ధర్మకామార్థ సహితమ్ = ధర్మార్థకామము లనెడు పురుషార్థములతో కూడిన, నిఖిలమ్ = ఈ రామాయణ మంతయును, ఆదితః = ప్రారంభము నుండియు, అనసూయయా = అసూయలేకుండగా, శ్రోతవ్యమ్ = వినదగినది.
తా. అట్టి ఈ రామాయణము నంతను లోకములో ప్రవర్తింపచేసెదను. ధర్మార్థకామము లనెడు పురుషార్థములను ప్రతిపాదించు ఈ రామాయణమును పూర్తిగ మొదటినుండియు అసూయాభావము లేనివారై వినుడు.
మూ. కోసలో నామ ముదితస్స్ఫీతో జనపదో మహాన్,
నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్. 5
ప్ర. అ. ప్రభూతధనధాన్యవాన్ = అధికమైన ధనధాన్యములు కలదియు, ముదితః = సంతోషముతో కూడినదియు, స్ఫీతః = విశాల మైనదియు అగు, కోసలో నామ = కోసల మనెడు, మహాన్ = గొప్పదైన, జనపదః = దేశము, సరయూ తీరే = సరయూనదీతీరమునందు, నివిష్టః = నెలకొని యున్నది.
తా. ధనధాన్యములతో తులతూగుచు నిత్యసంతుష్టులైన ప్రజలు గల, విశాల మైన కోసలమనెడు ఒక గొప్ప దేశము సరయూతీరమున నెలకొని యున్నది.
మూ. అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా,
మనునా మానవేన్ద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్. 6
ప్ర. అ. తత్ర = ఆ కోసలదేశమునందు, యా పురీ = ఏ పట్టణము, మానవేన్ద్రేణ = మానవులకు ప్రభు వైన, మనునా = మనుచక్రవర్తిచేత, స్వయమ్ = స్వయముగా, నిర్మితా = నిర్మింపబడినదో అట్టి, అయోధ్యా నామ = అయోధ్య యను పేరు గల, విశ్రుతా = ప్రసిద్ధ మైన, నగరీ = నగరి, ఆసీత్ = ఉండెను.
తా. ఆ కోసలదేశములో అయోధ్య యను ఒక ప్రసిద్ధ మైన పట్టణము ఉండెను; సకలమానవులకును ప్రభు వైన మనుచక్రవర్తి స్వయముగ దానిని సంకల్పబలముచే నిర్మించెను.
మూ. ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ,
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తమహాపథా. 7
ప్ర. అ. శ్రీమతీ = శోభాయుత మైనదియు, సువిభక్తమహాపథా = చక్కగా ఏర్పరుపబడిన విశాల మైన మార్గములు గల, మహాపురీ = మహానగర మైన ఆ అయోధ్య, దశ చ ద్వే చ = పండ్రెండు, యోజనాని = యోజనములను, ఆయతా = దీర్ఘమైనది. త్రీణి = మూడు యోజనములను, విస్తీర్ణా = వెడల్పైనది.
తా. చక్కగా ఏర్పరుపబడిన విశాలము లైన మార్గములతో శోభాయుతముగా ఉన్న ఆ అయోధ్యానగరము పండ్రెండు యోజనముల పొడవు, మూడు యోజనముల వెడల్పు కలదై ఉండెను.
మూ. రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా,
ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. 8
ప్ర. అ. సువిభక్తేన = చక్కగా ఏర్పరుపబడినదియు, ముక్తపుష్పావకీర్ణేన = చల్లబడిన పుష్పములతో వ్యాప్త మైనదియు, నిత్యశః = ఎల్లప్పుడును, జలసిక్తేన = నీటితో తడపబడిన, మహతా = విశాల మైన, రాజమార్గేణ = రాజమార్గముచే, శోభితా = ప్రకాశింపచేయబడినది.
తా. అయోధ్యానగరము, చక్కగా ఏర్పరచిన, విశాలమైన రాజమార్గముతో ఒప్పారుచుండెను. దానియందంతటను పుష్పములు చల్లుచుండెడివారు. నిత్యము నీరు చల్లి తడుపుచుండెడివారు.
మూ. తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః,
పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. 9
ప్ర. అ. మహారాష్ట్రవివర్ధనః = గొప్ప రాజ్యమును వృద్ధి పొందించు, దశరథః = దశరథు డనెడు, రాజా = రాజు, దేవపతిః = దేవేంద్రుడు, దివం యథా = స్వర్గమును వలె, తాం పురీమ్ = ఆ అయోధ్యాపట్టణమును, ఆవాసయామాస = నివాసముగా చేసికొనెను.
తా. విశాల మైన రాజ్యమును పరిపాలించిన సమర్థు డైన దశరథు డను రాజు, దేవేంద్రుడు స్వర్గములో నివసించి నట్లు, ఆ పట్టణములో నివసించెను.
మూ. కవాటతోరణవతీం సువిభక్తాన్తరాపణామ్,
సర్వయన్త్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభిః. 10
ప్ర. అ. కవాటతోరణవతీమ్ = ప్రశస్తములైన నగరము వెలుపలి తలుపులును దారుబంధములును కలదియు, సువిభక్తాన్తరాపణామ్ = చక్కగా తీర్చి దిద్దిన మధ్య ప్రదేశములు గల అంగళ్లు కలదియు, సర్వయన్త్రాయుధవతీమ్ = సమస్తమైన యంత్రములు ఆయుధములు కలదియు, సర్వశిల్పిభిః = సమస్తశిల్పులతో, ఉపేతామ్ = కూడినదియు అగు, ‘‘పురీం దశరథః ఆవాసయామాస’’ అను 22వ శ్లోకములో ఉన్న వాక్యముతో ఈ శ్లోకము మొదలు అన్ని శ్లోకములకును అన్వయము.
తా. ఆ అయోధ్యానగరమునకు వెలుపల నున్న తలుపులును, దారుబంధములును, చాల దృఢ మైనవి. అంగడి వీథులన్నియు మధ్యలో చక్కగా తీర్చి దిద్దబడి యున్నవి. అచ్చటచ్చట అనేక విధములైన యంత్రములును, ఆయుధములును నెలకొల్పబడి ఉన్నవి. ఎందరో శిల్పులు ఈ నగరములో నివసించు చుండిరి.
మూ. సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్,
ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసఙ్కులామ్. 11
ప్ర. అ. సూతమాగధసంబాధామ్ = స్తోత్రములు చేయు సూతులచేతను, కులవంశములను పొగడు మాగధులచేతను ఇరుకుగా ఉన్నదియు, శ్రీమతీమ్ = సమృద్ధి కలదియు, అతులప్రభామ్ = సాటి లేని కాంతి కలదియు, ఉచ్చాట్టాల ధ్వజవతీమ్ = ఉన్నతము లైన కోటబురుజులును ధ్వజములును కలదియు, శతఘ్నీ శతసఙ్కులామ్ = వందలకొలది శతఘ్ను లనెడు ఆయుధములతో (నూరుగురిని ఒక్కమారుగా చంపు ఆయుధము) నిండినదియును...
తా. ఆ నగరమందు ఎందరో సూతులును, మాగధులును నివసించుచుండిరి. అది అత్యధికసమృద్ధితో, సాటిలేని శోభతో, ప్రకాశించుచుండెను. ఇందలి కోట బురుజులును, ధ్వజములును చాల ఉన్నతముగ ఉండెను. వందలాది శతఘ్నులు అచ్చటచ్చట అమర్చబడి ఉండెను.
మూ. వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతఃపురీమ్,
ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్. 12
ప్ర. అ. వధూనాటకసంఘైశ్చ = స్త్రీల (నాట్యకత్తెల) యొక్కయు నటులయొక్కయు సంఘములతో, సంయుక్తామ్ = కూడినదియు, సర్వతఃపురీమ్ = నలువైపుల శాఖానగరములు గలదియు, ఉద్యానామ్రవణోపేతామ్ = ఉద్యానవనములతోడను, మామిడి తోపులతోడను కూడినదియు, మహతీమ్ = విశాలమైనదియు, సాలమేఖలామ్ = ప్రాకారమే వడ్డాణముగా కలదియు....
తా. ఈ నగరములో ఎన్నియో నటీనటసంఘము లుండెడివి. నలువైపుల శాఖ నగరములు ఉండెను. అచ్చటచ్చట ఉద్యానవనములును, మామిడితోపులును ఉండెను. అతివిశాల మైన ఈ నగరము చుట్టును ఉన్న ఉన్నతమైన ప్రాకారము దీనికి వడ్డాణము వలె ఉండెను.
మూ. దుర్గగమ్భీరపరిఖాం దుర్గామన్యైర్దురాసదామ్,
వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా. 13
ప్ర. అ. దుర్గగమ్భీరపరిఖామ్ = ప్రవేశింప శక్యము కాని అగాధ మైన అగడ్త కలదియును, దుర్గామ్ = ప్రవేశింప శక్యము కానిదియు, అన్యైః = శత్రువులచేత, దురాసదామ్ = ఆక్రమింప శక్యము కానిదియు, వాజివారణసంపూర్ణామ్ = గుఱ్ఱములతోడను ఏనుగులతోడను నిండినదియు, తథా = మరియు, గోభిః = గోవులతోడను, ఉష్ట్రైః = ఒంటెలతోడను, ఖరైః = గాడిదలతోడను (నిండినదియు)....
తా. ఆ నగరము చుట్టును ప్రవేశింప శక్యము కాని, అగాధ మైన అగడ్త ఉండెను. ఎవ్వరును ఆ నగరములో ప్రవేశించి దానిని ఆక్రమింపజాలరు. అది గుఱ్ఱములు, ఏనుగులు, గోవులు, ఒంటెలు, గాడిదలు మొదలైన వాటితో నిండియుండెను.
మూ. సామన్తరాజసంఘైశ్చ బలికర్మభిరావృతామ్,
నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్. 14
ప్ర. అ. బలికర్మభిః = కప్పము కట్టునట్టి, సామన్తరాజసంఘైశ్చ = సామంతరాజుల సమూహములచే, ఆవృతామ్ = నిండి యున్నదియు, నానాదేశ నివాసైః = అనేక దేశములందు నివసించువా రైన, వణిగ్భిః చ = వర్తకులచే గూడ ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు.....
తా. ఆ నగరము కప్పము కట్టుటకై వచ్చిన సామంతరాజులచేతను, నానాదేశముల నుండి వచ్చిన వర్తకులచేతను వ్యాప్తమై యుండెడిది.
మూ. ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్,
కూటాగారైశ్చ సంపూర్ణామిన్ద్రస్యేవామరావతీమ్. 15
ప్ర. అ. రత్నవికృతైః = రత్నములతో విశేషరూపమున అలంకరింపబడిన, ప్రాసాదైః = మేడలతోడను, పర్వతైః = క్రీడాపర్వతములతోడను, ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు, కూటాగారైః చ = మేడలపై మేడలతోడను, సంపూర్ణామ్ = నిండినదియును, ఇన్ద్రస్య = ఇంద్రునియొక్క, అమరావతీమివ = అమరావతీ నగరము వలె నున్నదియు,...
తా. ఆ నగరము రత్నములతో అలంకరించిన రాజగృహములతోడను, క్రీడా పర్వతములతోడను ప్రకాశించుచుండెను. మేడల పై కట్టిన మేడలతో నిండి ఇంద్రుని రాజధాని యగు అమరావతివలె ఉండెను.
మూ. చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్,
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్. 16
ప్ర. అ. చిత్రామ్ = ఆశ్చర్యకరమైనదియు, లేదా, వివిధవర్ణములు కలదియు, అష్టాపదాకారామ్ = జూద మాడెడి పీటయొక్క ఆకారమువంటి ఆకారము కలదియు, వరనారీగణైః = సుందరు లైన స్త్రీల గణములతో, యుతామ్ = కూడినదియు, సర్వరత్నసమాకీర్ణామ్ = సమస్త మైన రత్నములతో వ్యాప్త మైనదియు, విమానగృహ శోభితామ్ = ఏడంతస్తుల భవనములతో ప్రకాశించునదియు....
తా. జూదమాడు పీటవంటి ఆకారము గల ఆ నగరము చాల ఆశ్చర్యజనకమై సుందరు లగు స్త్రీలతో నిండి యుండెను. అన్ని విధము లైన రత్నములను ఇచట ఉండెను. ఏడంతస్తుల విశాలభవనములతో ప్రకాశించుచుండెను.
మూ. గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితామ్,
శాలితణ్డులసంపూర్ణామిక్షుకాణ్డరసోదకామ్. 17
ప్ర. అ. గృహగాఢామ్ = ఇండ్లతో దట్ట మైనదియు, అవిచ్ఛిద్రామ్ = ఏదో ఒక విధముగ ఉపయోగింపక విడచిన చోటు లేనిదియు, సమభూమౌ = మిట్టపల్లములు లేని భూమిపై, నివేశితామ్ = నిర్మింపబడినదియు, శాలితణ్డులసంపూర్ణామ్ = వరిబియ్యముతో నిండినదియు, ఇక్షుకాణ్డరసోదకామ్ = చెఱకుకఱ్ఱరసము వంటి ఉదకము కలదియు...
తా. ఆ నగరములో దట్టముగ ఇండ్లు కట్టబడెను. అనుపయుక్త మైన స్థల మేదియు లేకుండెను. అది మిట్ట పల్లములు లేని భూమి పై నిర్మింపబడెను. వరిబియ్యము సమృద్ధిగ లభించుచుండెడివి. ఉదకము చెఱకురసము వలె మధురముగ నుండెను.
మూ. దున్దుభీభిర్శృదఙ్గైశ్చ వీణాభిః పణవైస్తథా,
నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్. 18
ప్ర. అ. దున్దుభీభిః = దుందుభులచేతను, మృదఙ్గైశ్చ = మృదంగములచేతను, వీణాభిః = వీణలచేతను, తథా = మరియు, పణవైః = తమ్మటములచేతను, భృశమ్ = మిక్కిలి, నాదితామ్ = ధ్వనింపచేయబడినదియు, పృథివ్యామ్ = భూమియందు, అత్యర్థమ్ = మిక్కిలి, అనుత్తమామ్ = శ్రేష్ఠమైనదియు, తామ్ = ప్రసిద్ధ మైనదియు....
తా. ఆ నగరమునందు దుందుభి మృదంగ వీణా పణవాది మంగళ వాద్యముల ధ్వనులు ఎల్లప్పుడును మిన్ను ముట్టుచుండెడివి. భూమిలో దీనికంటె ఉత్తమమైన పట్టణము మరొకటి లేదు.
మూ. విమానమిన సిద్ధానాం తపసాధిగతం దివి,
సునివేశితవేశ్మాన్తాం నరోత్తమసమావృతామ్. 19
ప్ర. అ. దివి = స్వర్గమునందు, తపసా = తపస్సుచేత, అధిగతమ్ = పొందబడిన, సిద్ధానామ్ = సిద్ధులయొక్క, విమానమివ = విమానము వలె నున్నదియు, సునివేశిత వేశ్మాన్తామ్ = చక్కగా ఏర్పరుపబడిన గృహప్రదేశములు కలదియు, నరోత్తమసమావృతామ్ = ఉత్తములగుమనుష్యులతో నిండినదియు....
తా. సిద్ధులు తపఃశక్తిచే స్వర్గమునందు నిర్మించుకొనిన విమానము వలె ఉన్న ఆ అయోధ్యలో గృహములు బారులు దీర్చి చక్కగ నిర్మింపబడినవి. ఉత్తములైన మనుష్యులు అచట నివసించెడివారు.
మూ. యే చ బాణైర్న విధ్యన్తి వివిక్తమపరాపరమ్,
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః. 20
సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే,
హన్తారో నిశితైః శస్త్రైర్బలాద్బాహుబలైరపి. 21
తాదృశానాం సహస్రైస్తామభిపూర్ణాం మహారథైః,
పురీమావాసయామాస రాజా దశరథస్తదా. 22
ప్ర. అ. లఘుహస్తాః = చేతచురుకగల, విశారదాః = నేర్పరులైన, యే = ఎవరు, వివిక్తమ్ = ఒంటరిగా ఉన్నవానిని, అపరాపరమ్ = ముందు వెనుక లేనివానిని, అనగా తండ్రి గాని కుమారుడుగాని లేనివానిని, శబ్దవేధ్యమ్ = శబ్దమును పట్టి కొట్టుటకు అనువుగా ఉన్నవానిని, వితతం చ = పారిపోవుచున్న వానిని, బాణైః = బాణములచే న విధ్యన్తి = కొట్టరో, వనే = వనమునందు, నర్దతామ్ = గర్జించుచున్న, మత్తానామ్ = మదించిన, సింహవ్యాఘ్రవరాహాణామ్ = సింహవ్యాఘ్రవరాహములకు (ను), నిశితైః = వాడియైన, శస్త్రైః = ఆయుధములచే, బలాత్ = ఆయుధబలమువలనను, బాహుబలైరపి = బాహుబలములచేతను, హన్తారః = చంపువారో, తాదృశానామ్ = అట్టి వారియొక్క, మహారథైః = మహారథులైన, సహాస్రైః = సహస్రములతో, అభిపూర్ణామ్ = నిండిన, తామ్ = ఆ, పురీమ్ = అయోధ్యానగరమును, తదా = అప్పుడు, రాజా దశరథః = దశరథమహారాజు, ఆవాసయామాస = నివాసముగా చేసికొనెను.
తా. ఈ నగరములో వేలకొలది మహారథు లైన వీరు లుండిరి. వారు బాణ ప్రయోగమునందు హస్తలాఘవము గలవారు. ఒంటరిగా ఉన్న వానిని, తండ్రి గాని కుమారుడు గాని (వెనుక ముందు) లేనివానిని, శబ్దమును పట్టి కొట్టుటకు వీలుగా ఉన్నవానిని, పారిపోవుచున్న వానిని ఎన్నడును బాణములచే కొట్టెడివారు కారు. మదించి వనములలో గర్జించు చున్న సింహవ్యాఘ్రవరాహాది క్రూరమృగములను తీక్ష్ణములైన ఆయుధములచేత గాని, ఆయుధములు లేకుండ కేవల బాహుబలముచేత గాని చంపెడివారు. అట్టి అయోధ్యానగరమును దశరథ మహారాజు నివాసముగా చేసికొని రాజ్యము పాలించెను.
మూ. తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం
ద్విజోత్తమైర్వేదషడఙ్గపారగైః,
సహస్రదైః సత్యరతైర్మహాత్మభి
ర్మహర్షికల్పెరృషిభిశ్చ కేవలైః. 23
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చమః సర్గః.
ప్ర. అ. అగ్నిమద్భిః = ఆహితాగ్నులును, గుణవద్భిః = గుణవంతులును, వేదషడఙ్గపారగైః = ఋగ్యజుస్సామాథర్వవేదములందును శిక్షావ్యాకరణచ్ఛందోనిరుక్త జ్యోతిషకల్పము లనెడు ఆరు వేదాంగములందును పూర్ణ మైన పాండిత్యము కలవారును, సహస్రదైః = వేలకొలదిగా దానము చేయువారును, సత్యరతైః = సత్య నిరతులును, మహాత్మభిః = గొప్ప బుద్ధి కలవారును, మహర్షికల్పెః = మహర్షులతో సమానులును, కేవలైః ఋషిభిః చ = కేవలఋషులును అగు, ద్విజోత్తమైః = ఉత్తము లైన బ్రాహ్మణక్షత్రియవైశ్యులచేత, ఆవృతామ్ = నిండి యున్న, తామ్ = ఆ అయోధ్యను, (దశరథుడు వాసముగ చేసికొనెను).
తా. ఈ అయోధ్యానగరములోని ద్విజు లందరును, అనగా బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులు ఆహితాగ్నులు, సద్గుణవంతులు, వేదవేదాంగనిష్ణాతులు, అనంత దానము చేయువారు, సత్యనిరతులు, మహాబుద్ధిశాలులు. వీరిలో కొందరు మహర్షులవంటి వారై ఉండగా మరి కొందరు సాక్షాత్తు ఋషులే.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో పంచమసర్గ సమాప్తము.
