Chapter_6

Back
Book Balakandamu
Chapter No 12
Pages 9
Read Time 12 Minutes

Chapter_6

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షష్ఠః సర్గః

దశరథుడు రాజ్యపాలనము చేయు కాలమున పౌరుల సుఖైశ్వర్యాదుల వర్ణనము.

మూ. తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసఙ్గ్రహః,

దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః. 1

ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ,

మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః. 2

బలవాన్నిహతామిత్రో మిత్రవాన్విజితేన్ద్రియః,

ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః. 3

యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా,

తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. 4

ప్ర. అ. వేదవిత్ = వేదములు తెలిసినవాడును, సర్వసంగ్రహః = శూరులు పండితులు మొదలైన సర్వజనులను దానాదులచే వశములో నుంచుకొనెడువాడును, దీర్ఘదర్శీ = చాలాకాలము తరువాత జరుగబోవు విషయములను ఇప్పుడే తెలుసుకొనెడు శక్తి కలవాడును, మహాతేజాః = గొప్ప పరాక్రమము కలవాడును, పౌరజానపదప్రియః = పట్టణాలలో నివసించు వారికిని గ్రామాలలో నివసించు వారికిని ఇష్టుడును, ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజులలో, అతిరథః = చాలమంది మహారథులతో ఒంటరిగా యుద్ధము చేయగల రథికశ్రేష్ఠుడును, యజ్వా = యజ్ఞములు చేసినవాడును, ధర్మరతః = ధర్మమునందు ఆసక్తి కలవాడును, వశీ = జనులను అదుపులో ఉంచగలిగినవాడును, మహర్షికల్పః = మహర్షితో సమానుడును, రాజర్షిః = రాజును ఋషియు ఐనవాడును, త్రిషు లోకేషు = భూలోకభువర్లోకసువర్లోకములయందు, విశ్రుతః = ప్రసిద్ధుడును, బలవాన్ = అధికమైన సైన్యము కలవాడును, నిహతామిత్రః = చంపబడిన శత్రువులు కలవాడును, మిత్రవాన్ = మంచి మిత్రులు కలవాడును, విజితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడును, ధనైశ్చ = ధనములచేతను, అన్యైః = ఇతరము లైన, సఙ్గ్రహైశ్చ = కూడబెట్టబడిన వస్తువులచేతను, శక్రవైశ్రవణోపమః = దేవేంద్రునితోడను కుబేరునితోడను సమానుడును అగు, రాజా దశరథః = దశరథమహారాజు, తస్యామ్ = ఆ, అయోధ్యాయాం పుర్యామ్ = అయోధ్యా పురియందు, వసన్ = నివసించుచు, లోకస్య = లోకమునకు, పరిరక్షితా = రక్షకుడును, మహాతేజాః = గొప్పపరాక్రమశాలియు అగు, మనుః = మనువు, యథా = ఎట్లో, తథా = అట్లు, జగత్ = జగత్తును, అపాలయత్ = పాలించెను.

తా. దశరథమహారాజు ఆ అయోధ్యాపురిలో నివసించుచు, సర్వలోకరక్షకుడును, మహాతేజఃశాలియు అగు మను వెట్లు పరిపాలించెనో, అట్లు జగత్తు నంతను పరిపాలించెను. ఆ దశరథుడు వేదవేత్త. శూరపండితాదులను దానాదులచే వశము చేసికొనెను. ఎప్పుడో జరుగ బోవు విషయములను గ్రహింపగలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. పౌరులకును జానపదులకును ఇష్టుడు. ఇక్ష్వాకువంశరాజులలో అతిరథుడు. ఎన్నో యాగములు చేసినవాడు. ధర్మమునం దాసక్తి కలవాడు. సర్వజనులను వశమునం దుంచుకొనువాడు. మహర్షితో సమానుడు; రాజుగా ఉండియు ఋషి యైనవాడు. మూడు లోకములందును ప్రసిద్ధుడు. గొప్ప సైన్యము కలవాడు. శత్రువుల నందరిని నశింపచేసినవాడు. మంచి మిత్రసంపద గలవాడు. ఇంద్రియములను జయించినవాడు. ధనములచేతను, ఇతరవస్తుసంగ్రహముచేతను ఇంద్రకుబేరతుల్యుడు

మూ. తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్ఠతా,

పాలితా సా పురీ శ్రేష్ఠా ఇన్ద్రేణేవామరావతీ. 5

ప్ర. అ. సత్యాభిసంధేన = సత్యమునందు పట్టుదల కలవాడును, త్రివర్గమ్ = ధర్మార్థ కామము లనెడు మూడు పురుషార్థములను, అనుతిష్ఠతా = అనుసరించువాడును అగు, తేన = ఆ దశరథునిచేత, శ్రేష్ఠా = శ్రేష్ఠ మైన, సా పురీ = ఆ అయోధ్య, ఇన్ద్రేణ = ఇంద్రునిచేత, అమరావతీవ = అమరావతిని వలె, పాలితా = పాలింపబడెను.

తా. సత్యమునందు పట్టుదల కలిగి ధర్మార్థకామము లనెడు మూడు పురుషార్థములకును సమప్రాధాన్య మిచ్చి వాటి ననుసరించుచున్న ఆ దశరథుడు, ఇంద్రుడు అమరావతిని వలె, అయోధ్యను పాలించెను.

మూ. తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః,

నరాస్తుష్టా ధనైః స్వైః స్వైరలుబ్ధాః సత్యవాదినః. 6

ప్ర. అ. తస్మిన్ = ఆ, పురవరే = అయోధ్యాపురమునందు (నివసించు), నరాః = మనుష్యులు, హృష్టాః = సంతోషముకలవారు, ధర్మాత్మానః = ధర్మస్వభావులు, బహుశ్రుతాః = అధికముగ శాస్త్రాధ్యయనము చేసినవారు, స్వైః స్వైః = తమ తమ, ధనైః = ధనములతో, తుష్టాః = సంతృప్తి చెందినవారు, అలుబ్ధాః = దురాశ లేనివారు, సత్యవాదినః = సత్యమునే మాటలాడువారు.

తా. అయోధ్యాపురములో నివసించు నరు లందరును సంతోషవంతులు, ధర్మాత్ములు, చక్కగ శాస్త్రాభ్యాసము చేసినవారు, తమ కున్నదానితో తృప్తి చెందినవారు. ఆశ లేనివారు. సత్యమునే పలుకువారు.

మూ. నాల్పసన్నిచయః కశ్చిదాసీత్తస్మిన్ పురోత్తమే,

కుటుమ్బీ యో హ్యసిద్ధార్థోఽగవాశ్వధనధాన్యవాన్. 7

ప్ర. అ. తస్మిన్ = ఆ, పురోత్తమే = శ్రేష్ఠనగర మైన అయోధ్యయందు, యః = ఎవడు, అల్పసన్నిచయః = అల్ప మైన కూడబెట్టిన ధనము కలవాడో, అసిద్ధార్థః = ధర్మార్థకామము లనెడు మూడు పురుషార్థములు సిద్ధించనివాడో, అగవాశ్వధనధాన్యవాన్ = గోవులు, అశ్వములు, ధనధాన్యములు లేనివాడో, అట్టి, కుటుమ్బీ = కుటుంబవంతుడు, కశ్చిత్ = ఒక్కడును, నాసీత్ = లేకుండెను.

తా. ఆ నగరములో తక్కువ ధనమును మాత్రమే సంపాదించినవాడు గాని, ధర్మార్థకామము లనెడు పురుషార్థములను సాధించనివాడు గాని, గవాశ్వ ధన ధాన్యములు లేనివాడు గాని అయిన కుటుంబి ఒక్కడును లేకుండెను.

వి. కుటుంబి అనగా - తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు, కుమార్తె, భార్య, అతిథి, తాను కలిసి మొత్తము పదిమంది పోష్యవర్గము కలవాడు.

మూ. కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్,

ద్రష్టుం శక్యమయోధ్యాయాం నావిద్వాన్న చ నాస్తికః. 8

ప్ర. అ. కామీ వా = కాముకుడు గాని, కదర్యో వా = లోభముచేత ధర్మకార్యాలను, కొడుకులను, భార్యను, తల్లిదండ్రులను, తోడబుట్టువులను పీడించువాడు గాని, నృశంసః = క్రూరుడు కాని అయిన, పురుషః = పురుషుడు, అయోధ్యాయామ్ = అయోధ్యలో, క్వచిత్ = ఎక్కడను, ద్రష్టుమ్ = చూచుటకు, న శక్యమ్ = శక్యముకాదు. అవిద్వాన్ = విద్వాంసుడు కానివాడు, న = చూచుటకు శక్యముకాదు. నాస్తికః = నాస్తికుడును, న = చూచుటకు శక్యముకాదు.

తా. కాముకుడు గాని, లోభి కాని, క్రూరుడు కాని, విద్యావిహీనుడు కాని, నాస్తికుడు కాని, ఆ అయోధ్యలో వెదకినను కానరాడు.

మూ. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః,

ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః. 9

ప్ర. అ. సర్వే = సమస్తమైన, నరాశ్చ = నరులును, నార్యశ్చ = స్త్రీలును, ధర్మశీలాః = ధర్మస్వభావము కలవారు. సుసంయతాః = మంచి ఇంద్రియనిగ్రహము కలవారు. శీలవృత్తాభ్యామ్ = మంచి స్వభావముతోడను, మంచి నడవడికతోడను, ఉదితాః = అభివృద్ధి పొందువారు. మహర్షయః ఇవ = మహర్షులు వలె, అమలాః = నిర్మలమైనవారు.

తా. ఆ నగరములోని స్త్రీలు, పురుషులు కూడ, ధర్మశీలులు. మంచి ఇంద్రియ నిగ్రహము కలవారు. మంచి స్వభావముతో, మంచి నడవడికతో ఒప్పుచున్నవారు. మహర్షుల వలె పరిశుద్ధ మైనవారు.

మూ. నాకుణ్డలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్,

నామృష్టో నానులిప్తాఙ్గో నాసుగన్ధశ్చ విద్యతే. 10

ప్ర. అ. అకుణ్డలీ = కర్ణభూషణములు లేనివాడు, న విద్యతే = లేడు, అమకుటీ = శిరోభూషణము లేనివాడు, న = లేడు, అస్రగ్వీ = పుష్పమాలలు ధరించనివాడు, న = లేడు, అల్పభోగవాన్ = అల్ప మైన భోగములు కలవాడు, న = లేడు, అమృష్టః = అభ్యంగస్నానము చేయనివాడు, న = లేడు, నానులిప్తాఙ్గః = పైపూత లేని శరీరము కలవాడు (న = లేడు), అసుగన్ధశ్చ = సుగంధము లేనివాడును, న = లేడు.

తా. ఆ నగరములో కర్ణభూషణములు లేనివాడు గాని, శిరోభూషణము లేనివాడు గాని, పుష్పమాలలు ధరించనివాడు గాని, భోగములలో కొరత ఉన్నవాడు గాని, అభ్యంగస్నానము చేయనివాడు గాని, శరీరమునకు అంగరాగమును పూసికొననివాడు గాని, మంచి సుగంధద్రవ్యములను సేవించనివాడు గాని లేడు.

మూ. నామృష్టభోజీ నాదాతా నాప్యనఙ్గదనిష్కధృక్,

నాహస్తాభరణో వాపి దృశ్యకే నాప్యనాత్మవాన్. 11

ప్ర. అ. అమృష్టభోజీ = కడుపునిండ భోజనము చేయనివాడు, న దృశ్యతే = కనబడడు. అదాతా = దానగుణము లేనివాడు, న = కనబడడు, నఙ్గద నిష్కధృక్ అపి = బాహుపురులను కంఠాభరణములను ధరించనివాడు కూడ, న = కనబడడు, అహస్తాభరణో వాపి = కడియములు లేనివాడును, న = కనబడడు, అనాత్మవానపి = జితేంద్రియుడు కానివాడు కాని, న = కనబడడు.

తా. ఆ నగరములో, కడుపునిండ తిండి లేనివాడు గాని, దానము చేయని వాడు గాని, బాహుపురులను, కంఠాభరణములను ధరింపనివాడు గాని, ముంజేతికి అలంకారము లేనివాడు గాని, ఇంద్రియనిగ్రహము లేనివాడు గాని ఒక్కడును కనబడడు.

మూ. నానాహితాగ్నిర్నాయజ్వా న క్షుద్రో వా న తస్కరః,

కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తసంకరః. 12

ప్ర. అ. అయోధ్యాయామ్ = అయోధ్యాపట్టణమునందు, అనాహితాగ్నిః = ఆహితాగ్నికానివాడు, న ఆసీత్ = లేకుండెను, అయజ్వా = యాగము చేయనివాడు, న = లేకుండెను, క్షుద్రః = నీచుడు, న = లేకుండెను, తస్కరః = దొంగ, న = లేకుండెను, నిర్వృత్తసంకరః = వర్ణసంకరము చేసినవాడు, కశ్చిత్ = ఒక్కడును, న = లేకుండెను.

తా. అయోధ్యలో ఆహితాగ్ని కానివాడు కాని, యాగము చేయనివాడు కాని, నీచుడు కాని, దొంగ గాని, వర్ణసంకరము చేసినవాడు గాని ఒక్కడును లేకుండెను.

మూ. స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేన్ద్రియాః,

దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ పరిగ్రహే. 13

ప్ర. అ. బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, నిత్యమ్ = ఎల్లప్పుడును, స్వకర్మనిరతాః = తమ కర్మలయందు ఆసక్తికలవారై, విజితేన్ద్రియాః = జయింపబడిన ఇంద్రియములు కలవారై, దానాధ్యయనశీలాః చ = దానముచేయుట అధ్యయనము చేయుట స్వభావముగా కలవారై, పరిగ్రహే = దానముపట్టుటయందు, సంయతాశ్చ = సంకోచము కలవారై, (గోవిందరాజులు) పరిగ్రహే = భార్యయందు, సంయతాశ్చ = నియమములు కలవారై (మహేశ్వరతీర్థులు) (ఉండిరి).

తా. బ్రాహ్మణు లెల్లప్పుడును తన కర్మలయం దాసక్తులై, ఇంద్రియ నిగ్రహవంతులై, దానము చేయుట, వేదాధ్యయనము చేయుట అను స్వాభావిక గుణములతో ఒప్పుచు, తప్పనిసరియైనపుడు మాత్రమే దానము పట్టుచు, స్వభార్యామాత్రగాములై, పరభార్యావిముఖులై ఉండెడివారు.

మూ. న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః,

నాసూయకో న చాశక్తో నావిద్వాన్ విద్యతే తదా. 14

ప్ర. అ. తదా = దశరథుడు రాజ్యముచేయు కాలమున, కశ్చిత్ = ఒక్కడును, నాస్తికః = నాస్తికుడు, న = లేడు, అనృతకః = అసత్యమాడువాడు, న = లేడు, అబహుశ్రుతః = ఎక్కువ శాస్త్రాభ్యాసము చేయనివాడు, న = లేడు, అసూయకః = గుణములందు దోషములను ఆరోపించువాడు, న = లేడు, అశక్తః = అసమర్థుడు, న = లేడు, అవిద్వాన్ = జ్ఞానము లేనివాడు, న = లేడు.

తా. దశరథుడు రాజ్యము పాలించు కాలమున రాజధాని యైన అయోధ్యలోనే కాక, రాజ్యమునం దెచ్చటను (గోవిందరాజులు), నాస్తికుడు గాని, అసత్యవాది కాని, శాస్త్రాభ్యాసము చేయనివాడు గాని, అసూయ కలవాడు గాని, అసమర్థుడు కాని, వివిధ విషయజ్ఞానము లేనివాడు గాని లేకుండెను.

మూ. నాషడఙ్గవిదత్రాసీన్నావ్రతో నాసహస్రదః,

న దీనః క్షిప్తచిత్తో వా వ్యథితో నాపి కశ్చన. 15

ప్ర. అ. అత్ర = ఈ అయోధ్యయందు, అషడఙ్గవిత్ = శిక్షా-వ్యాకరణచ్ఛందో-నిరుక్త- జ్యోతిష-కల్పము లనెడు ఆరు వేదాంగములు తెలియనివాడు, నాసీత్ = లేకుండెను. అవ్రతః = చాంద్రాయణాదివ్రతముల నాచరించనివాడు, న = లేకుండెను, అసహస్రదః = వేలకొలది దానము చేయనివాడు, న = లేకుండెను, దీనః = దీనుడు, న = లేకుండెను, క్షిప్తచిత్తో వా = కలతచెందిన చిత్తముకలవాడు, న = లేకుండెను, వ్యథితః = బాధలకు గురి యైనవాడును, కశ్చన = ఒక్కడును, న = లేకుండెను.

తా. అయోధ్యలో ఏ ఒక్కడును, షడంగవేత్త కానివాడు కాని, వ్రతానుష్ఠానము లేనివాడు కాని, వేలకొలది ద్రవ్యము దానము చేయనివాడు కాని, దీనుడు కాని, కలతచెందిన మనస్సు కలవాడు కాని, బాధలకు గురియైనవాడు గాని లేకుండెను.

మూ. కశ్చిన్నరో వా నారీ వా నాశ్రీమాన్ నాప్యరూపవాన్,

ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్. 16

ప్ర. అ. అయోధ్యాయామ్ = అయోధ్యలో, నరో వా = పురుషుడు గాని, నారీ వా = స్త్రీ కాని, కశ్చిత్ = ఒక్కరును, అశ్రీమాన్ = ఐశ్వర్యము లేనివాడు, ద్రష్టుమ్ = చూచుటకు, న శక్యమ్ = శక్యము కాదు. అరూపవాన్ అపి = సౌందర్యము లేనివాడు, న = చూడ శక్యము కాదు. రాజని = రాజునందు, అభక్తిమాన్ = భక్తి లేనివాడును, న = చూడ శక్యము కాదు.

తా. అయోధ్యానగరిలో ఐశ్వర్యము, సౌందర్యము, రాజభక్తి లేని పురుషుడు కాని స్త్రీ కాని మచ్చున కైనను కానరారు.

మూ. వర్ణేష్వగ్య్రచతుర్థేషు దేవతాతిథిపూజకాః,

కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః. 17

దీర్ఘాయుషో నరాస్సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః,

సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే. 18

ప్ర. అ. పురోత్తమే = ఆ అయోధ్యలో, అగ్య్రచతుర్థేషు = మొదటి దైన బ్రాహ్మణవర్ణము నాల్గవదిగా గల, వర్ణేషు = క్షత్రియ-వైశ్య-శూద్రవర్ణములయందు, సర్వే = సమస్త మైన, నరాః = పురుషులు, దేవతాతిథిపూజకాః = దేవతలను అతిథులను పూజించువారు. కృతజ్ఞాః చ = చేసిన మేలును మరువని వారు, వదాన్యాశ్చ = దాతృత్వము కలవారు, శూరాః = శూరులు, విక్రమసంయుతాః = పరాక్రమముతో కూడినవారు, దీర్ఘాయుషః = దీర్ఘాయుర్దాయము కలవారు, నిత్యమ్ = ఎల్లప్పుడును, పుత్రపౌత్రైః = పుత్రపౌత్రులతోడను, స్త్రీభిశ్చ = స్త్రీలతోడను, సహితాః = కూడి యుండువారు. ధర్మమ్ = ధర్మమును, సత్యం చ = సత్యమును, సంశ్రితాః = ఆశ్రయించినవారు.

తా. అయోధ్యానగరములో నాలుగువర్ణములకును చెందిన పురుషులందరును దేవతాతిథిపూజ చేయువారు, కృతజ్ఞులు, ఉదారులు, శూరులు, పరాక్రమవంతులు. దీర్ఘాయుర్దాయవంతులై, సత్యధర్మపరులై, ఎల్లప్పుడును దారపుత్రపౌత్రాదులతో కలసి ఆనందించెడివారు.

మూ. క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యాః క్షత్రమనువ్రతాః,

శూద్రాః స్వధర్మనిరతాస్త్రీన్ వర్ణానుపచారిణః. 19

ప్ర. అ. క్షత్రమ్ = క్షత్రియజాతి, బ్రహ్మముఖమ్ = బ్రాహ్మణులను అనుసరించునదై, ఆసీత్ = ఉండెను, వైశ్యాః = వైశ్యులు, క్షత్రమ్ = క్షత్రియజాతిని, అనువ్రతాః = అనుసరించి యుండెడివారు, శూద్రాః = శూద్రులు, త్రీన్ వర్ణాన్ = మూడు వర్ణములను, ఉపచారిణః = ఉపచారము చేయువారై, స్వధర్మనిరతాః = తమ ధర్మమునందు ఆసక్తులై యుండిరి.

తా. క్షత్రియులు బ్రాహ్మణులను, వైశ్యులు క్షత్రియులను అనుసరించి ఉండెడివారు. శూద్రులు మూడు వర్ణములవారికిని ఉపచారము చేయుచు స్వధర్మనిరతులై యుండెడి వారు.

మూ. సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా,

యథా పురస్తాన్మనునా మానవేన్ద్రేణ ధీమతా. 20

ప్ర. అ. సా పురీ = ఆ అయోధ్య, పురస్తాత్ = పూర్వమునందు, మానవేన్ద్రేణ = మానవులందరికి ప్రభువును, ధీమతా = బుద్ధిమంతుడును అగు, మనునా = మనుచక్రవర్తిచే, యథా = ఎట్లు పాలింపబడెనో అట్లే, తేన = ఆ, ఇక్ష్వాకునాథేన = దశరథునిచేత, సుపరిరక్షితా = బాగుగా రక్షింపబడినది.

తా. మానవేంద్రుడును, బుద్ధిశాలియు అగు మనుచక్రవర్తి పూర్వ మెట్లు పాలించెనో అట్లే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగ పరిరక్షించెను.

మూ. యోధానామగ్నికల్పానాం పేశలానామమర్షిణామ్,

సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ. 21

ప్ర. అ. అగ్నికల్పానామ్ = అగ్నితో సమానులును, పేశలానామ్ = నేర్పు కలవారును, అమర్షిణామ్ = పౌరుషము కలవారును, కృతవిద్యానామ్ = అభ్యసింపబడిన విద్యలు కలవారును అగు, యోధానామ్ = యోధుల సమూహములతో, కేసరిణామ్ = సింహముల సమూహముతో, గుహా ఇవ = గుహ వలె, సంపూర్ణా = నిండియున్నది.

తా. ఆ అయోధ్య, అగ్నితుల్యులు, నేర్పుకలవారు, పౌరుషవంతులు, శస్త్ర విద్యానిపుణులు అగు యోధులతో పర్వతగుహ వలె నిండి యుండెను.

మూ. కామ్భోజవిషయే జాతైర్బాహ్లికైశ్చ హయోత్తమైః,

వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః. 22

ప్ర. అ. కామ్భోజవిషయే = కాంభోజదేశమునందు, జాతైః = పుట్టినవియు, బాహ్లికైః = బాహ్లికదేశమునందు పుట్టినవియు, వనాయుజైః = వనాయుదేశమునందు పుట్టినవియు, నదీజైశ్చ = సింధుదేశమునందు పుట్టినవియు, హరిహయోత్తమైః = ఇంద్రుని అశ్వ మైన ఉచ్చెఃశ్రవము వలె ఉత్తమ మైనవియు అగు, హయోత్తమైః = ఉత్తమములైన అశ్వములతో, పూర్ణా = నిండినది.

తా. కాంభోజ-బాహ్లిక-వనాయు-సింధుదేశములలో పుట్టిన, ఉచ్చెశ్శ్ర వస్తుల్యము లగు ఉత్తమాశ్వములతో ఆ అయోధ్య నిండి యుండెను.

మూ. విన్ధ్యపర్వతజైర్మత్తైః పూర్ణా హైమవతైరపి,

మదాన్వితైరతిబలైర్మాతఙ్గైః పర్వతోపమైః. 23

ఐరావతకులీనైశ్చ మహాపద్మకులై స్తథా,

అఞ్జనాదపి నిష్పన్నై ర్వామనాదపి చ ద్విపైః. 24

ప్ర. అ. మత్తైః = మదించిన, విన్ధ్యపర్వతజైః = వింధ్యపర్వతమునందు పుట్టిన, మాతఙ్గైః = ఏనుగులచేతను, మదాన్వితైః = మదముతో కూడిన, అతిబలైః = గొప్ప బలము గల, పర్వతోపమైః = పర్వతముతో సమానమైన, హైమవతైరపి = హిమవత్పర్వతమునందు పుట్టిన ఏనుగులచేతను, ఐరావతకులీనైశ్చ = ఇంద్రుని ఏనుగైన ఐరావతముయొక్క కులమునందు పుట్టిన, ద్విపైశ్చ = ఏనుగులచేతను, తథా = మరియు, మహాపద్మకులైః = పుండరీక మనెడు దిగ్గజము యొక్క కులమునందు పుట్టిన ఏనుగులచేతను, అఞ్జనాత్ = వరుణ దిగ్గజ మైన అంజన మను ఏనుగునుండి (వంశమందు), నిష్పన్నైః = పుట్టిన ఏనుగులచేతను, వామనాదపి = యమదిగ్గజమైన వామనమువలన బుట్టిన ఏనుగులచేతను, పూర్ణా = నిండినది.

తా. వింధ్యపర్వతమునందు పుట్టిన మత్తగజములతోను, గొప్ప బలము గలవియు, పర్వతముతో సమాన మైనవియు, మదముతో కూడినవియు అగు హిమవత్పర్వతజన్యము లైన ఏనుగులతోను, ఐరావతకులమునందును, మహాపద్మకులమునందు, అంజనకులమునందు, వామనకులమునందు పుట్టిన ఏనుగులతోను అయోధ్య నిండియుండెను.

మూ. భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా,

భద్రమంద్రైర్భద్రమృగైర్మగమంద్రైశ్చ సా పురీ,

నిత్యమత్తైస్సదా పూర్ణా నాగైరచలసన్నిభైః. 25

ప్ర. అ. సా పురీ = ఆ అయోధ్యాపట్టణము, భద్రైః = భద్రజాతీయములును, మంద్రైః = మంద్రజాతీయములును, మృగైశ్చైవ = మృగజాతీయములును, భద్రమంద్రమృగైః = భద్రమంద్రమృగము లనెడు మూడు జాతుల సంకీర్ణ లక్షణములు కలవియు, భద్రమంద్రైః = భద్రమంద్రము లనెడు రెండు జాతుల సంకీర్ణలక్షణములు కలవియు, భద్రమృగైః = భద్రమృగము లనెడు రెండు జాతుల సంకీర్ణ లక్షణములు కలవియు, మృగమంద్రైశ్చ = మృగమంద్రము లనెడు రెండు జాతుల సంకీర్ణలక్షణములు కలవియు, నిత్యమత్తైః = నిత్యము మదించియున్న, అచలసన్నిభైః = పర్వతములతో సమానము లైన, నాగైః = ఏనుగులతో, సదా = ఎల్లప్పుడును, పూర్ణా = నిండియుండెను.

తా. భద్రజాతీయములు, మంద్రజాతీయములు, మృగజాతీయములు, భద్రమంద్ర మృగజాతీయములు, భద్రమంద్రజాతీయములు, భద్రమృగజాతీయములు, మృగమంద్రజాతీయములు, ఎల్లప్పుడును మదించి యున్నవియు, పర్వతములతో సమానములును అగు ఏనుగులతో ఆ నగరము ఎల్లప్పుడును నిండియుండెను.

మూ. సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే,

యస్యాం దశరథో రాజా వసన్ రాజ్యమపాలయత్. 26

ప్ర. అ. దశరథః రాజా = దశరథమహారాజు, యస్యామ్ = ఏ అయోధ్యయందు, వసన్ = నివసించుచు, జగత్ = జగత్తును, అపాలయత్ = పాలించెనో, సా = ఆ అయోధ్య, భూయః = ఇంకను, బైటకూడ, ద్వే యోజనే = రెండు యోజనముల దూరమున గూడ, సత్యనామా = యథార్థమైన పేరు కలదై, ప్రకాశతే = ప్రకాశించుచున్నది.

తా. ప్రపంచము నంతను పాలించుచున్న దశరథమహారాజునకు నివాసస్థానమైన అయోధ్య బైట కూడ రెండు యోజనములవరకును శత్రువులచే ఎదిరింప శక్యము కానిదై, అయోధ్య యను తన నామధేయమును సార్థకము చేసికొని ప్రకాశించుచుండెను.

మూ. తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్,

శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చన్ద్రమాః. 27

ప్ర. అ. మహాతేజాః = గొప్పపరాక్రమము గలవాడును, మహాన్ = పూజింపదగినవాడును అగు, దశరథః = దశరథమహారాజు, శమితామిత్రః = శాంతింపచేయబడిన శత్రువులు కలవాడై, తామ్ = ఆ, పురీమ్ = అయోధ్యా పట్టణమును, చన్ద్రమాః = చంద్రుడు, నక్షత్రాణీవ = నక్షత్రములను వలె, శశాస = పరిపాలించెను.

తా. మహాతేజఃశాలియు, పూజ్యుడును అయిన దశరథమహారాజు శత్రువుల నందరిని అణచి, అయోధ్యానగరమును, చంద్రుడు నక్షత్రములను పాలించినట్లు పాలించెను.

మూ. తాం సత్యనామాం దృఢతోరణార్గలాం

గృహైర్విచిత్రైరుపశోభితాం శివామ్,

పురీమయోధ్యాం నృసహస్రసంకులాం

శశాస వై శక్రసమో మహీపతిః. 28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షష్ఠః సర్గః.

ప్ర. అ. దృఢతోరణార్గలామ్ = దృఢమైన తోరణములును (ముఖద్వారములును) గడియలును కలదియు, విచిత్రైః = విచిత్రము లైన, గృహైః = గృహములచేత, ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు, శివామ్ = మంగళకరమైనదియు, నృసహస్ర సంకులామ్ = వేలకొలది మనుష్యులతో నిండినదియు, సత్యనామామ్ = యథార్థ మైన పేరుగలదియు అగు, అయోధ్యాం పురీమ్ = అయోధ్యానగరమును, శక్రసమః = దేవేంద్రునితో సమానుడైన, మహీపతిః = దశరథమహారాజు, శశాస వై = పరిపాలించెను.

తా. ఇంద్రునితో సమాను డైన ఆ దశరథుడు దృఢ మైన తోరణములును, గడియలును కలదియు, విచిత్రము లైన గృహములతో ప్రకాశించునదియు, మంగళకర మైనదియు, వేలకొలది జనులతో నిండినదియు, యథార్థ మైన పేరు గలదియు, అగు ఆ అయోధ్యను పరిపాలించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో షష్ఠసర్గ సమాప్తము.

© 2026 Ebook Library