| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 13 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తమః సర్గః
రాజామాత్యుల గుణనీత్యాదుల వర్ణనము.
మూ. తస్యామాత్యా గుణైరాసన్నిక్ష్వాకోస్తు మహాత్మనః,
మన్త్రజ్ఞాశ్చేఙ్గితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః. 1
ప్ర. అ. మహాత్మనః = గొప్పబుద్ధి గల, తస్య = ఆ, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకు వంశము నందు పుట్టిన దశరథునకు, గుణైః = మంత్రుల కుండవలసిన ప్రజ్ఞాది గుణములచేత, మన్త్రజ్ఞాశ్చ = ఆలోచన తెలిసినవారును, ఇఙ్గితజ్ఞాశ్చ = ఇతరుల అభిప్రాయములను వారి ముఖాదులనుపట్టి తెలుసుకొనువారును, నిత్యమ్ = ఎల్లప్పుడును, ప్రియహితే = రాజునకు ఇష్టము లాభకరము అయిన కార్యమునందు, రతాః = ఆసక్తికలవారును అగు, అమాత్యాః = మంత్రులు, ఆసన్ = ఉండిరి.
తా. మహాత్ముడైన దశరథునకు, ప్రజ్ఞాదిగుణములచే మంత్రణమునందు సమర్థులును, ఇతరుల ఆకారాదులను పట్టి వారి మనస్సులోని అభిప్రాయమును తెలిసికొనగలవారును, ఎల్లప్పుడును తమ ప్రభువునకు ఇష్టము, హితము అగు కార్యమును చేయుటయందు ఆసక్తి కలవారును అగు మంత్రులు ఉండిరి.
మూ. అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః,
శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః. 2
ప్ర. అ. వీరస్యః = వీరుడును, యశస్వినః = కీర్తిమంతుడును అగు, తస్య = ఆ దశరథునకు, శుచయః = వ్యవహారములందు పరిశుద్ధులును, నిత్యమ్ = ఎల్లప్పుడును, రాజకృత్యేషు = రాజకార్యములయందు, అనురక్తాశ్చ = ఆసక్తి కలవారును అగు, అష్టౌ = ఎనమండుగురు, అమాత్యాః = మంత్రులు, బభూవుః = ఉండిరి.
తా. మహావీరుడును, యశశ్శాలియు అగు ఆ దశరథునకు లంచములు తీసికొనుట మొదలగు దోషములు లేక వ్యవహారశుద్ధి కలవారును, ఎల్లప్పుడు రాజ కార్యవ్యాపృతులును అగు ఎనమండుగురు మంత్రులు ఉండిరి.
మూ. ధృష్టిర్జయన్తో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః,
అశోకో మన్త్రపాలశ్చ సుమన్త్రశ్చాష్టమోఽభవత్. 3
ప్ర. అ. ధృష్టిః = ధృష్టి, జయన్తః = జయంతుడు, విజయః = విజయుడు, సిద్ధార్థః = సిద్ధార్థుడు, అర్థసాధకః = అర్థసాధకుడు, అశోకః = అశోకుడు, మన్త్రపాలశ్చ = మంత్రపాలుడు, అను మంత్రు లుండిరి. సుమన్త్రః = సుమంత్రుడను, అష్టమః = ఎనిమిదవ మంత్రి, అభవత్ = ఉండెను.
తా. ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని ఈ ఎనమండుగురు మంత్రుల పేర్లు.
మూ. ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామృషిసత్తమౌ,
వసిష్ఠో వామదేవశ్చ మన్త్రిణశ్చ తథాపరే. 4
ప్ర. అ. తస్య = ఆ దశరథునకు, వసిష్ఠః = వసిష్ఠుడును, వామదేవశ్చ = వామదేవుడును అను, ద్వౌ = ఇద్దరు, ఋషిసత్తమౌ = ఋషిశ్రేష్ఠులు, అభిమతౌ = ఎక్కువగా ఇష్టులైన, ఋత్విజౌ = ఋత్విక్కులుగా, ఆస్తామ్ = ఉండిరి. తథా = మరియు, అపరే = మరికొందరు, మన్త్రిణశ్చ = మంత్రులును, ఉండిరి.
తా. వసిష్ఠుడు, వామదేవుడు అను ఇద్దరు ఋషిసత్తములు దశరథునకు ప్రధానులైన ఋత్విక్కులుగా ఉండిరి. మరి కొందరు మంత్రులు కూడ ఉండిరి.
మూ. విద్యావినీతా హ్రీమన్తః కుశలా నియతేన్ద్రియాః,
శ్రీమన్తశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః. 5
కీర్తిమన్తః ప్రణిహితా యథావచనకారిణః,
తేజఃక్షమాయశఃప్రాప్తాః స్మితపూర్వాభిభాషిణః. 6
ప్ర. అ. (వారు), విద్యావినీతాః = అన్ని విద్యలందును శిక్షితులు, హ్రీమంతః = అకార్యము చేయుటకు సిగ్గుపడువారు, కుశలాః = నేర్పరులు, నియతేన్ద్రియాః = నిగ్రహించుకొనబడిన ఇంద్రియములు కలవారు. శ్రీమన్తశ్చ = ఐశ్వర్యవంతులు, మహాత్మానః = గొప్ప బుద్ధిమంతులు, శాస్త్రజ్ఞాః = శాస్త్రములు తెలిసినవారు. దృఢవిక్రమాః = దృఢమైన పరాక్రమము కలవారు, కీర్తిమన్తః = కీర్తి కలవారు, ప్రణిహితాః = సావధానమైన చిత్తము కలవారు. యథావచనకారిణః = చెప్పిన విధముగా చేయువారు, తేజఃక్షమాయశఃప్రాప్తాః = తేజస్సును, ఓర్పును, కీర్తిని పొందినవారు, స్మితపూర్వాభిభాషిణః = చిరునవ్వు నవ్వుచు మాటలాడువారు.
తా. ఆ మంత్రులు సమస్తవిద్యలు నేర్చినవారు, అకార్యములను చేయుటకు సిగ్గుచెందువారు. నేర్పు కలవారు, ఇంద్రియనిగ్రహవంతులు, ఐశ్వర్యవంతులు, మహాబుద్ధిశాలులు, శాస్త్రజ్ఞానము కలవారు. దృఢమైన పరాక్రమము కలవారు, కీర్తిమంతులు. కార్యములు చేయునపుడు ఏకాగ్రచిత్తము కలవారు, చెప్పిన విధముగ చేయువారు, తేజస్సు, ఓర్పు, కీర్తి కలవారు, చిరునవ్వు నవ్వుచూ మాటలాడువారు.
మూ. క్రోధాత్కామార్థహేతోర్వా న బ్రూయురనృతం వచః,
తేషామవిదితం కించిత్స్వేషు నాస్తి పరేషు వా,
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్. 7
ప్ర. అ. క్రోధాత్ = కోపమువలన గాని, కామార్థహేతోర్వా = కామమువలనగాని, ధనముకొరకు గాని, అనృతమ్ = అసత్య మైన, వచః = వాక్కును, న బ్రూయుః = పలకరు. స్వేషు = తమవారిలో గాని, పరేషు వా = శత్రువులలో గాని, క్రియమాణమ్ = చేయబడుచున్నది గాని, కృతం వాపి = చేయబడినది గాని, చికీర్షితమ్ = చేయ తలపెట్టినది గాని, తేషామ్ = వారికి, చారేణ = గూఢచారుల ద్వారా, అవిదితమ్ = తెలియనిది, కించిత్ = ఏమియు, నాస్తి = లేదు.
తా. కోపమువలన గాని, కామముచేత గాని, ధనముకొరకు గాని వారెన్నడు అసత్య మాడెడివారు కాదు. స్వపరరాష్ట్రములలో చేయబడినది కాని, చేయబడుచున్నది కాని, చేయబడ నున్నది గాని, వారికి గూఢచారుల ద్వారా తెలియనిది ఏదియు లేకుండెను.
మూ. కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః,
ప్రాప్తకాలం తు తే దణ్డం ధారయేయుః సుతేష్వపి. 8
ప్ర. అ. తే = ఆ మంత్రులు, వ్యవహారేషు = వ్యవహారములయందు, కుశలాః = సమర్థులు, సౌహృదేషు = స్నేహములవిషయమున, పరీక్షితాః = పరీక్షింపబడినవారు. సుతేష్వపి = కుమారుల విషయమునందు కూడ, ప్రాప్తకాలమ్ = సరియైన, దణ్డమ్ = దండమును, ధారయేయుః = విధించెడివారు.
తా. ఆ మంత్రులు వ్యవహారదక్షులు. వీరికి ఎట్టి స్నేహితు లున్నారో (రాజుచేత) పరీక్షించబడినవారు. కుమారులకు కూడ, ఆవశ్యక మైనపుడు సరియైన దండమును విధించెడివారు.
మూ. కోశసఙ్గ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే,
అహితం చాపి పురుషం న విహింస్యురదూషకమ్. 9
ప్ర. అ. కోశసంగ్రహణే = ధనాగారమును నింపుటయందును, బలస్య = సైన్యముయొక్క, పరిగ్రహే చ = సమకూర్చుటయందును, యుక్తాః = మిక్కిలి శ్రద్ధ చూపెడివారు. అదూషకమ్ = అపరాధముచేయని, అహితం పురుషమపి = శత్రువును కూడ, న విహింస్యుః = బాధించరు.
తా. ఆ మంత్రులు రాజ్యధనాగారమును నింపుట, సైన్యమును సమకూర్చుట మొదలైన రాజ్యకార్యములయందు సర్వదా ఆసక్తి చూపెడివారు. అపరాధము చేయనిచో శత్రువు నైనను హింసించరు.
మూ. వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనుష్ఠితాః,
శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినామ్. 10
ప్ర. అ. వీరాశ్చ = వీరులు, నియతోత్సాహాః = స్థిరమైన ఉత్సాహము కలవారు, రాజశాస్త్రమ్ = రాజశాస్త్రమును, అనుష్ఠితాః = అనుసరించి ప్రవర్తించువారు, విషయవాసినామ్ = దేశములో నివసించు, శుచీనామ్ = సత్పురుషులకు, నిత్యమ్ = ఎల్లప్పుడును, రక్షితారశ్చ = రక్షకులు.
తా. ఆ మంత్రులు వీరులు, చలించని ఉత్సాహము కలవారు, రాజశాస్త్ర ప్రకారము కార్యములను అనుష్ఠించువారు, దేశములో నున్న సత్పురుషులకు ఎట్టి ఉపద్రవములు కలుగకుండ ఎల్లప్పుడును కాపాడుచుండెడివారు.
మూ. బ్రహ్మ క్షత్రమహింసన్తస్తే కోశం సమపూరయన్,
సుతీక్ష్ణదణ్డాః సంప్రేక్ష్య పురుషన్య బలాబలమ్. 11
ప్ర. అ. బ్రహ్మ = బ్రాహ్మణజాతిని, క్షత్రమ్ = క్షత్రియజాతిని, అహింసన్తః = హింసించనివారై, తే = వారు, కోశమ్ = ధనాగారమును, సమపూరయన్ = నింపిరి. పురుషస్య = అపరాధి యైన పురుషునియొక్క, బలాబలమ్ = బలాబలములను, సంప్రేక్ష్య = చూచి, సుతీక్ష్ణదణ్డాః = చాలతీక్ష్ణ మైన దండము ఇచ్చెడివారు.
తా. ఆ మంత్రులు బ్రాహ్మణక్షత్రియులకు బాధ కలుగకుండ చూచుచు కోశమును నింపెడివారు. అపరాధియొక్క బలాబలములను పరీక్షించి, తగు విధముగ తీక్ష్ణమైన దండమును విధించెడివారు. (బలవంతుడైనచో అధిక దండము దుర్బలుడైనచో అల్పదండము ఇచ్చెడివారు. లేదా అపరాధముయొక్క బలాబలములను పరీక్షించి శిక్షించెడివారు).
మూ. శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్,
నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్. 12
ప్ర. అ. శుచీనామ్ = పరిశుద్ధమైన నడవడిక గలవారును, ఏకబుద్ధీనామ్ = ఐకమత్యముతో ప్రవర్తించువారును అగు, సర్వేషామ్ = ఆ అందరు మంత్రులును, సంప్రజానతామ్ = రాజ్యతంత్రమును విచారించుచుండగా, పురే వా = పట్టణమునందు గాని, రాజ్యే వా = రాజ్యమునందు గాని, క్వచిత్ = ఎక్కడను, మృషావాదీ = అసత్యమును పలికెడి, నరః = మనుష్యుడు, నాసీత్ = లేకుండెను.
తా. పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రు లందరును ఐకమత్యముతో రాజకార్యములను చక్కబెట్టుచుండగా, నగరములో గాని, రాజ్యములో గాని, ఎచ్చటను, అసత్యమాడువాడు ఒక్కడును ఉండెడివాడు కాదు.
మూ. కశ్చిన్న దుష్టస్తత్రాసీత్పరదారరతో నరః,
ప్రశాన్తం సర్వమేవాసీద్రాష్ట్రం పురవరం చ తత్. 13
ప్ర. అ. తత్ర = ఆ రాజ్యమునందు, దుష్టః = దుష్టుడు కాని, పరదార రతః = పరభార్యలయందు ఆసక్తి కలవాడు గాని అయిన, నరః = మనుష్యుడు, కశ్చిత్ = ఒక్కడును, నాసీత్ = లేకుండెను. సర్వమ్ = సమస్తమైన, రాష్ట్రమ్ = రాష్ట్రము, తత్ = ఆ, పురవరం చ = పట్టణ శ్రేష్ఠ మైన అయోధ్యయు, ప్రశాన్తమ్ = శాంతిపూర్ణమై, ఆసీత్ = ఉండెను.
తా. ఆ రాజ్యములో దుష్టుడు గాని, పరభార్యాసక్తుడు కాని లేకుండెను. ఆ రాష్టము నందంతటను, అయోధ్యయందును శాంతి నెలకొని ఉండెను.
మూ. సువాససస్సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః,
హితార్థం చ నరేన్ద్రస్య జాగ్రతో నయచక్షుషా. 14
ప్ర. అ. తే సర్వే = ఆ మంత్రులందరును, సువాససః = మంచి వస్త్రములను ధరించెడివారు. సువేషాశ్చ = మంచి వేషము కలవారు, సుశీలినః = మంచి శీలము కలవారు, నరేన్ద్రస్య = రాజుయొక్క, హితార్థమ్ = హితముకొరకు, నయచక్షుషా = నీతియనెడు నేత్రముతో, జాగ్రతః = మేల్కొని యుండెడివారు.
తా. ఆ మంత్రు లందరును మంచి వస్త్రములు, వేషములు ధరించెడివారు. మంచి శీలము కలవారు. నీతినేత్రములతో సర్వదా మేల్కొని యుండి రాజుయొక్క హితముకొరకు పాటుపడెడి వారు.
మూ. గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే,
విదేశేష్వపి విఖ్యాతాస్సర్వతో బుద్ధినిశ్చయాత్. 15
ప్ర. అ. గురౌ = మాతాపిత్రాది గురుజనమునందు, గుణగృహీతాః = గుణములను మాత్రమే గ్రహించువారు, పరాక్రమే = పరాక్రమము విషయమున, ప్రఖ్యాతాః = ప్రసిద్ధి పొందినవారు, సర్వతః = అన్ని విషయములందును, బుద్ధి నిశ్చయాత్ = బుద్ధియొక్క నిశ్చయమువలన, విదేశేష్వపి = విదేశములలో కూడ, విజ్ఞాతాః = ప్రసిద్ధులు.
తా. ఆ మంత్రులు మాతాపిత్రాదు లగు పెద్దలలో ఉన్న గుణములను మాత్రమే గ్రహించెడివారు. పరాక్రమముచే ప్రసిద్ధులు, అన్ని విషయములను గ్రహింప గలిగిన బుద్ధిబలమును బట్టి విదేశములలో కూడ ప్రఖ్యాతి గడించినవారు.
మూ. సన్ధివిగ్రహతత్త్వజ్ఞాః ప్రకృత్యా సమ్పదాన్వితాః, 16
మన్త్రసంవరణే శక్తాః శక్తాః సూక్ష్మాసు బుద్ధిషు,
నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం ప్రియవాదినః. 17
ప్ర. అ. సన్ధివిగ్రహతత్త్వజ్ఞాః = సంధివిగ్రహముల తత్త్వము నెరిగినవారు. ప్రకృత్యా = స్వభావముచేత, సమ్పదా = సంపదతో, అన్వితాః = కూడినవారు, మన్త్రసంవరణే = మంత్రమును దాచుటయందు, శక్తాః = సమర్థులు, సూక్ష్మాసు = సూక్ష్మములైన, బుద్ధిషు = బుద్ధులయందు, శక్తాః = సమర్థులు, నీతిశాస్త్రవిశేషజ్ఞాః = నీతిశాస్త్రములోని విశేషములు తెలిసినవారు, సతతమ్ = ఎల్పప్పుడును, ప్రియవాదినః = ప్రియ మైన మాటలు పలుకువారు.
తా. ఆ మంత్రులందరును శత్రువులతో ఎప్పుడు ఎట్లు సంధిచేసికొనవలెనో, ఎప్పుడు వారితో యుద్ధము చేయవలెనో బాగుగ తెలిసినవారు. సహజముగ ఐశ్వర్యవంతులు. ఆలోచనలను రహస్యముగ ఉంచుటయందును, సూక్ష్మ విషయములను గ్రహించి నిర్ణయములు చేయుటయందును సమర్థులు. నీతి శాస్త్రములోని విశేషము లన్నియు తెలిసినవారు. ఇతరుల మనస్సును నొప్పింపని విధమున మాటలాడువారు.
మూ. ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథోఽనఘః,
ఉపపన్నో గుణోపేతైరన్వశాసద్వసున్ధరామ్. 18
ప్ర. అ. అనఘః = ఎట్టిదోషములును లేని, దశరథః రాజా = దశరథ మహారాజు, గుణోపేతైః = సద్గుణములు గల, ఈదృశైః = ఇట్టి, అమాత్యైః = మంత్రులతో, ఉపేతః = కూడినవాడై, వసున్ధరామ్ = భూమిని, అన్వశాసత్ = పరిపాలించెను.
తా. ఎట్టిదోషములును లేని దశరథమహారాజు, ఇట్టి సద్గుణోపేతు లైన మంత్రుల సాహాయ్యముతో భూమిని పరిపాలించెను.
మూ. అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రఞ్జయన్,
వ్రజానాం పాలనం కుర్వన్ అధర్మాన్ పరివర్జయన్. 19
విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసఙ్గరః,
స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమామ్. 20
ప్ర. అ. పురుషవ్యాఘ్రః = పురుషులలో శ్రేష్ఠుడైన, నః = ఆ దశరథమహారాజు, చారేణ = గూఢచారిచేత, అవేక్షమాణః = చూచుచు, ప్రజాః = ప్రజలను, రఞ్జయన్ = సంతోషపెట్టుచు, ప్రజానామ్ = ప్రజలయొక్క, పాలనమ్ = రక్షణను, కుర్వన్ = చేయుచు, అధర్మాన్ = అధర్మములను, పరివర్జయన్ = విసర్జించుచు, వదాన్యః = ఉదారు డనియు, సత్యసఙ్గరః = సత్య మైన ప్రతిజ్ఞ కలవాడనియు, త్రిషు లోకేషు = మూడు లోకములలో, విశ్రుతః = ప్రసిద్ధుడై, ఇమామ్ = ఈ, పృథివీమ్ = భూమిని, ధర్మేణ = ధర్మముచేత, శశాస = పరిపాలించెను.
తా. ఔదార్యవంతు డనియు, ప్రజ్ఞను నిలుపుకొనువా డనియు మూడు లోకములలో ప్రసిద్ధి గాంచిన, పురుష శ్రేష్ఠుడైన ఆ దశరథుడు, రాజ్యములోని విషయముల నన్నింటిని గూఢచారుల ద్వారా తెలిసికొనుచు, ప్రజలను ఆనందింప చేసి, వారిని రక్షించుచు, అధర్మములను తొలగించుచు, ఈ భూమి నంతను ధర్మముతో పరిపాలించెను.
మూ. నాధ్యగచ్ఛద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః,
మిత్రవాన్నతసామన్తః ప్రతాపహతకణ్టకః,
స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా. 21
ప్ర. అ. మిత్రవాన్ = స్నేహితులు కలవాడును, నతసామన్తః = లొంగి ఉన్న సామంతులు కలవాడును, ప్రతాపహతకణ్టకః = ప్రతాపముచేత చంపబడిన శత్రువులు గలవాడును అగు, ఆ దశరథుడు, ఆత్మనః = తనకంటె, విశిష్టం వా = గొప్పవా డైన, లేదా, తుల్యం వా = సమాను డైన, శత్రుమ్ = శత్రువును, నాధ్యగచ్ఛత్ = పొందలేదు. సః రాజా = ఆ రాజు, దేవపతిః = దేవేంద్రుడు, దివం యథా = స్వర్గమును వలె, జగత్ = జగత్తును, శశాస = పరిపాలించెను.
తా. ఆ దశరథునకు ఎందరో మిత్రు లుండిరి. సామంతరాజు లందరును లొంగి ఉండిరి. అతడు తనకు బాధ కలిగించువారి నందరిని ప్రతాపముచేత సంహరించెను. అందుచే అతనిని మించినవాడు గాని, అతనితో సమానుడు గాని అయిన శత్రు వొక్కడును లేకుండెను. అతడు, దేవేంద్రుడు స్వర్గమును పాలించి నట్లు ఈ జగత్తు నంతను పాలించెను.
మూ. తైర్మన్త్రిభిర్మన్త్రహితే నివిష్టైః
వృతోఽనురక్తైః కుశలైః సమర్థెః,
స పార్థివో దీప్తిమవాప యుక్త
స్తేజోమయై ర్గోభిరివోదితోఽర్కః. 22
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే, బాలకాణ్డే సప్తమః సర్గః.
ప్ర. అ. మన్త్రహితే = ఆలోచనయందును తన హితమునందును, నివిష్టైః = ఆసక్తి కలవారును, అనురక్తైః = అనురాగము కలవారును, కుశలైః = నేర్పరులును, సమర్థైః = సమర్థులును అయిన, తైః మన్త్రిభిః = ఆ మంత్రులతో, వృతః = కూడిన, సః పార్థివః = ఆ రాజు, తేజోమయైః = తేజోరూపము లైన, గోభిః = కిరణములతో, యుక్తః = కూడిన, ఉదితః = ఉదయించిన, అర్కః ఇవ = సూర్యుడు వలె, దీప్తిమ్ = కాంతిని, అవాప = పొందెను.
తా. ఆలోచనలయందును, తనకు మేలు చేయుటయందును ఆసక్తిగలవారును, అనురక్తులును, సమర్థులును, నేర్పు కలవారును అగు ఆ మంత్రులతో, దశరథ మహారాజు, తేజోరూపము లైన కిరణములతో కూడిన ఉదయించుచున్న సూర్యుడు వలె ప్రకాశించెను.
వి.‘‘మన్త్రహితే నియుక్తైః’’ అని గోవిందరాజసంమతపాఠము. ‘‘మంత్రహితము లందు నియమింపబడిన వారు’’ అని అర్థము.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో సప్తమసర్గ సమాప్తము.
