| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 14 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ అష్టమః సర్గః
సంతానోత్పత్తి నిమిత్తమై దశరథుడు అశ్వమేధయాగము చేయ సంకల్పించుట. మంత్రులును, బ్రాహ్మణులును దానిని ఆమోదించుట.
మూ. తస్య త్వేవంప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః,
సుతార్థం తప్యమానస్య నా సీద్వంశకరః సుతః. 1
ప్ర. అ. ఏవంప్రభావస్య = ఇట్టి ప్రభావము కలవాడును, ధర్మజ్ఞస్య = ధర్మము తెలిసినవాడును, మహాత్మనః = గొప్పబుద్ధికలవాడును, సుతార్థమ్ = కుమారులకొరకు, తప్యమానస్య = పరితపించుచున్నవాడును అగు, తస్య = ఆ దశరథునకు, వంశకరః = వంశమును నిలుపునట్టి, సుతః = కుమారుడు, నాసీత్ = కలుగలేదు.
తా. ఇట్టి ప్రభావము గల, ధర్మజ్ఞు డైన, మహానుభావు డైన ఆ దశరథునకు చాల కాలము వరకును, వంశమును నిలబెట్టు కుమారుడు కలుగలేదు.
మూ. చిన్తయానస్య తస్యైవం బుద్ధిరాసీన్మహాత్మనః,
సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహమ్. 2
ప్ర. అ. చిన్తయానస్య = పుత్రులకొరకై చింతించుచున్న, తస్య = ఆ, మహాత్మనః = మహాత్మునకు, ఏవమ్ = ఈ విధముగ, బుద్ధిః = బుద్ధి, ఆసీత్ = కలిగెను. ‘‘అహమ్ = నేను, సుతార్థమ్ = కుమారులకొరకై, హయమేధేన = అశ్వమేధయాగముచేత, కిమర్థమ్ = ఎందువలన, న యజామి = దేవతల నారాధింపకూడదు?’’
తా. పుత్రులు జనించలే దని చింతించుచున్న ఆ మహాత్ముని మనస్సులో ‘‘నేను సుతులను పొందుటకై అశ్వమేధయాగము చేయవచ్చును కదా?’’ అను అభిప్రాయము కలిగెను.
మూ. స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్,
మన్త్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః. 3
తతోఽబ్రవీదిదం రాజా సుమన్త్రం మన్త్రిసత్తమమ్,
శీఘ్రమానయ మే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్. 4
ప్ర. అ. బుద్ధిమాన్ = బుద్ధిమంతుడైన, ధర్మాత్మా = ధర్మాత్ముడైన, సఃరాజా = ఆ రాజు, కృతాత్మభిః = పరిశుద్ధమైన బుద్ధి గల, సర్వైరేవ = సమస్త మైన, మన్త్రిభిః = మంత్రులతో కూడ కలసి, యష్టవ్యమితి = యాగము చేయవలెను అని, నిశ్చితామ్ = నిశ్చిత మైన, మతిం కృత్వా = ఆలోచన చేసి, తతః = అటుపిమ్మట, మన్త్రిసత్తమమ్ = మంత్రి శ్రేష్ఠు డైన, సుమన్త్రమ్ = సుమంత్రుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. సపురోహితాన్ = పురోహితులతో గూడిన, తాన్ = ఆ, సర్వాన్ = సమస్త మైన, మే గురూన్ = నా గురువులను, ఆనయ = తీసికొని రమ్ము.
తా. బుద్ధిమంతుడును, ధర్మాత్ముడును అయిన ఆ రాజు, పరిశుద్ధమైన బుద్ధి గల మంత్రు లందరితో సంప్రదించి, యాగము చేయవలె నని గట్టిగా నిశ్చయించి - ‘‘పురోహితులతో కూడ, నా గురువుల నందరిని తీసికొని రమ్ము’’ అని మంత్రిసత్తము డైన సుమంత్రుని ఆదేశించెను.
మూ. తతః సుమన్త్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః,
సమానయత్స తాన్ సర్వాన్ సమస్తాన్వేదపారగాన్. 5
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్,
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః. 6
ప్ర. అ. తతః = పిమ్మట, త్వరితవిక్రమః = శ్రేష్ఠమైన గమనము గల, సః సుమన్త్రః = ఆ సుమంత్రుడు, త్వరితమ్ = శీఘ్రముగా, గత్వా = వెళ్లి, సుయజ్ఞమ్ = సుయజ్ఞుని, వామదేవం చ = వామదేవుని, అథ = మరియు, జాబాలిమ్ = జాబాలిని, కాశ్యపమ్ = కాశ్యపుని, పురోహితమ్ = పురోహితు డైన, వసిష్ఠం చ = వసిష్ఠుని, అన్యే = ఇతరు లైన, యే ద్విజసత్తమాః = ఏ బ్రాహ్మణోత్తములు కలరో, వేదపారగాన్ = వేదముల అంతమును చూచిన, సమస్తాన్ = ఒకచోట చేర్పబడిన, తాన్ సర్వాన్ = వారి నందరిని, సమానయత్ = తీసికొనివచ్చెను.
తా. సుమంత్రుడు శీఘ్రముగా, వెళ్లి, సయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితు డైన వసిష్ఠుని, తదితరులైన బ్రాహ్మణోత్తములను, సర్వవేదములు తెలిసిన వీరందరిని ఒక్కసారిగ తీసికొని వచ్చెను.
మూ. తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా,
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. 7
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, దశరథః రాజా = దశరథమహారాజు, తదా = అప్పుడు, తాన్ = వారిని, పూజయిత్వా = పూజించి, ధర్మార్థసహితమ్ = ధర్మార్థములతో కూడిన, శ్లక్ష్ణమ్ = మృదు వైన, ఇదం వచనమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ధర్మాత్ము డైన ఆ దశరథమహారాజు వారిని ఆదరించి, ధర్మార్థములతో కూడిన, మధుర మైన వచనమును పలికెను.
మూ. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్,
తదహం హయమేధేన యక్ష్యావిూతి మతిర్మమ. 8
ప్ర. అ. పుత్రార్థమ్ = పుత్రులకొరకు, లాలప్యమానస్య = బాధపడుచున్న, మమ = నాకు, సుఖమ్ = సుఖము, నాస్తి వై = లేదు. తత్ = ఆ కారణమువలన, అహమ్ = నేను, హయమేధేన యక్ష్యామి = అశ్వమేధయాగము చేయుదును, ఇతి = అని, మమ = నాకు, మతిః = అభిప్రాయము.
తా. పుత్రులు లేరని బాధపడుచున్న నాకు సుఖ మనునది లేదు. అందుచే అశ్వమేధయాగము చేయ వలె నని నాకు అభిలాష కలిగినది.
మూ. తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా,
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతామ్. 9
ప్ర. అ. తత్ = ఆ కారణమువలన, అహమ్ = నేను, శాస్త్రదృష్టేన = శాస్త్రోక్తమైన, కర్మణా = కర్మచేత, యష్టుమ్ = అశ్వమేధయాగము చేయుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. కామమ్ = కోరికను, కథమ్ = ఎట్లు, అహమ్ = నేను, ప్రాప్స్యామి = పొందగలనో, అత్ర = ఈ విషయమున, బుద్ధిః = ఉపాయము, విచార్యతామ్ = ఆలోచింపబడుగాక.
తా. అందుచే నేను యథాశాస్త్రముగ యజ్ఞము చేయదలచుచున్నాను. నా కోరిక ఎట్లు తీరునో ఉపాయము ఆలోచింపుడు.
మూ. తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్,
వసిష్ఠప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్. 10
ప్ర. అ. తతః = అటు పిమ్మట, వసిష్ఠప్రముఖాః = వసిష్ఠుడు, మొదలైన, బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, సర్వే = అందరును, పార్థివస్య = రాజుయొక్క, ముఖాత్ = ముఖమునుండి, చ్యుతమ్ = వెలువడిన, తత్ వాక్యమ్ = ఆ వాక్యమును, సాధు ఇతి = చాల బాగున్న దని, ప్రత్యపూజయన్ = అభినందించిరి.
తా. వసిష్ఠుడు మొదలైన ఆ బ్రాహ్మణు లందరును దశరథుని నిర్ణయము చాల బాగున్న దని అభినందించిరి.
మూ. ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః,
సమ్భారాః సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్. 11
ప్ర. అ. సర్వే = వారందరును, పరమప్రీతాః = మిక్కిలి సంతసించినవారై, దశరథమ్ = దశరథుని గూర్చి, వచః = వాక్కును, ఊచుశ్చ = పలికిరి కూడ, సంభారాః = ఉపకరణములు, సంభ్రియన్తామ్ = కూర్చబడుగాక, తే = నీయొక్క, తురగశ్చ = గుఱ్ఱముకూడ, విముచ్యతామ్ = విడువబడుగాక.
తా. వారందరును చాల సంతసించి దశరథునితో ‘‘కావలసిన వస్తుసామాగ్రిని సమకూర్చి అశ్వమును విడువుము’’, అని పలికిరి.
మూ. సర్వథా ప్రాప్స్యసే పుత్రానభిప్రేతాంశ్చ పార్థివ,
యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా. 12
ప్ర. అ. పార్థివ = ఓ రాజా! యస్య = ఏ, తే = నీకు, పుత్రార్థమ్ః = పుత్రులకొరకై, ఇయమ్ = ఈ, ధార్మికీ = ధర్మసంమత మైన, బుద్ధిః = బుద్ధి, ఆగతా = కలిగినదో, అట్టి నీవు, అభిప్రేతాన్ = ఇష్టులైన, పుత్రాన్ = పుత్రులను, సర్వథా = తప్పక, ప్రాప్స్యసే = పొందగలవు.
తా. ‘‘ఓ రాజా! పుత్రులు కావలె నని నీకు కలిగిన ఈ బుద్ధి చాల ధర్మసంమత మైనది. నీకు తప్పక, ఇష్టు లైన పుత్రులు కలుగుదురు.
మూ. తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వా తద్ద్విజభాషితమ్,
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణః. 13
ప్ర. అ. తతః = అటుపిమ్మట, రాజా = రాజు,తత్ ద్విజభాషితమ్ = ఆ బ్రాహ్మణుల వాక్యమును, శ్రుత్వా = విని, ప్రీతః = సంతసించినవాడు, అభవత్ = ఆయెను. రాజా = రాజు, హర్షపర్యాకులేక్షణః = ఆనందముతో వ్యాకుల మైన చూపులు కలవాడై, అమాత్యాన్ = మంత్రులను గూర్చి, అబ్రవీత్ చ = పలికెను.
తా. రాజు బ్రాహ్మణుల మాటలకు సంతసించి, ఆనందము తొణికిసలాడుచున్న చూపులతో, మంత్రులతో ఇట్లు పలికెను.
మూ. సంభారాః సంభ్రియన్తాం మే గురూణాం వచనాదిహ,
సమర్థాధిష్ఠితశ్చాశ్వస్సోపాధ్యాయో విముచ్యతామ్. 14
ప్ర. అ. ఇహ = ఇచట, మే గురూణామ్ = నా గురువుల, వచనాత్ = మాటప్రకారము, సంభారాః = యజ్ఞమునకు కావలసిన వస్తుసామగ్రి, సంభ్రియన్తామ్ = సమకూర్చబడుగాక, సమర్థాధిష్ఠితః = సమర్థు లైన వీరులచే రక్షింపబడిన, సోపాధ్యాయః = ఉపాధ్యాయులతో కూడిన, అశ్వః = అశ్వము, విముచ్యతామ్ = విడువబడుగాక.
తా. నా గురువులు చెప్పిన విధముగ యజ్ఞసంభారములను సమకూర్చి, సమర్థు లైన వీరులచే రక్షింపబడుచున్న అశ్వమును విడిచి, దాని వెంట ఉపాధ్యాయులను కూడ పంపుడు.
మూ. సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్,
శాన్తయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి. 15
ప్ర. అ. సరయ్వాః = సరయూనదియొక్క, ఉత్తరే తీరే = ఉత్తరతీరమునందు, యజ్ఞభూమిః = యజ్ఞశాల, విధీయతామ్ = నిర్మించబడుగాక. యథాకల్పమ్ = పద్ధతిప్రకారముగా, యథావిధి = శాస్త్రప్రకారముగా, శాన్తయశ్చ = శాంతులు కూడ, అభివర్ధన్తామ్ = వృద్ధిపొందుగాక.
తా. సరయూనది ఉత్తరతీరమున యజ్ఞభూమిని ఏర్పాటు చేయుడు. శాస్త్రోక్త ప్రకారముగ, నియమబద్ధముగ శాంతికార్యములను జరిపించుడు.
మూ. శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా,
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే. 16
ప్ర. అ. అస్మిన్ = ఈ, క్రతుసత్తమే = శ్రేష్ఠ మైన యజ్ఞమునందు, కష్టః = కష్టమైన, అపరాధః = పొరబాటు, న భవేత్ యది = జరుగకపోయిన పక్షమున, అయం యజ్ఞః = ఈ యజ్ఞము, సర్వేణాపి మహీక్షితా = ప్రతిరాజుచేతను, ప్రాప్తుమ్ = పొందుటకు, శక్యః = శక్యమైనది.
తా. ఈ అశ్వమేధయాగములో అపాయకర మైన అపచార మేమియు కలుగని పక్షాన అందరు రాజులును దీనిని చేయ గలిగియుండెడివారు.
మూ. ఛిద్రం హి మృగయన్తేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః,
నిహతస్య చ యజ్ఞస్య. సద్యః కర్తా వినశ్యతి. 17
ప్ర. అ. అత్ర = ఈ అశ్వమేధయాగమునందు, విద్వాంసః = పండితు లైన, బ్రహ్మరక్షసాః = బ్రహ్మరాక్షసులు, ఛిద్రమ్ = అపచారమును, మృగయన్తే హి = వెదకుచుందురు కదా. నిహతస్య = కొట్టవడిన, యజ్ఞస్య = యాగముయొక్క, కర్తా చ = కర్త, సద్యః = వెంటనే, వినశ్యతి = నశించును.
తా. అశ్వమేధయాగములో ఏమైన ప్రమాదము కలుగునా యని పండితులైన బ్రహ్మరాక్షసులు చూచుచు వేచియుందురు. యజ్ఞమునకు భంగము వాటిల్లినచో యజమానుడు వెంటనే నశించును.
వి. యాగములు చేయు నపుడు ఏదైన అపచారము చేసిన బ్రాహ్మణులు మరణానంతరము బ్రహ్మరాక్షసు లగుదు రని సంప్రదాయజ్ఞులు చెప్పుదురు.
మూ. తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే,
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ. 18
ప్ర. అ. తత్ = ఆ కారణమువలన, మే = నాయొక్క, ఏషః క్రతుః = ఈ యజ్ఞము, విధిపూర్వమ్ = యథాశాస్త్రముగ, యథా = ఎట్లు, సమాప్యతే = సమాప్తి పొందింపబడునో, తథా = అట్లు, విధానమ్ = ఏర్పాటు, క్రియతామ్ = చేయబడుగాక. (మీరు), ఇహ = ఇచట, కరణేషు = కార్యములయందు, సమర్థాః = సమర్థులు.
తా. అందుచే, ఈ క్రతువు శాస్త్రప్రకారము పూర్తి యగునట్లు చూడుడు. మీరందరును కార్యములయందు ఆరితేరినవారే కదా.
మూ. తథేతి చాబ్రువన్ సర్వే మన్త్రిణః ప్రత్యపూజయన్,
పారివేన్ద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్య తే. 19
ప్ర. అ. తే మన్త్రిణః = ఆ మంత్రులు, సర్వే = అందరును, పార్థివేన్ద్రస్య = దశరథునియొక్క, తత్ వాక్యమ్ = ఆ వాక్యమును, నిశమ్య = విని, ప్రత్యపూజయన్ = అభినందించిరి. యథా = ఎట్లు, ఆజ్ఞప్తమ్ = ఆజ్ఞాపింపబడినదో, తథా ఇతి = అటులనే చేసెదము అని, అబ్రువన్ చ = పలికిరి కూడ.
తా. ఆ మంత్రు లందరును దశరథుని మాటలు విని, ఆయనను అభినందించి, ‘‘తాము ఆజ్ఞాపించిన విధముననే చేసెదము’’ అని పలికిరి.
మూ. తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్ధయన్తో నృపోత్తమమ్,
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతమ్. 20
ప్ర. అ. ధర్మజ్ఞాః = ధర్మములు తెలిసిన, తే ద్విజాః = ఆ బ్రాహ్మణులు, తథా = ఆ విధముగా, నృపోత్తమమ్ = దశరథుని, వర్ధయన్తః = వృద్ధిపొందించుచు, అనుజ్ఞాతాః = అనుజ్ఞ పొందినవారై, తతః = అటుపిమ్మట, సర్వే = అందరును, యథాగతమ్ = వచ్చినట్లు, పునః = తిరిగి, జగ్ముః = వెళ్లిరి.
తా. ఆ బ్రాహ్మణు లందరును ఈ విధముగ దశరథుని ఉత్సాహమును వృద్ధిపొందించి, అనుజ్ఞ తీసికొని, తిరిగి వెళ్లిరి.
మూ. విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివానిదమబ్రవీత్,
ఋత్విగ్భిరుపదిష్టోఽయం యథావత్క్రతురాప్యతామ్. 21
ప్ర. అ. (దశరథుడు), తాన్ విప్రాన్ = ఆ బ్రాహ్మణులను, విసర్జయిత్వా = పంపివేసి, సచివాన్ = మంత్రులనుగూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. ఋత్విగ్భిః = ఋత్విక్కులచేత, ఉపదిష్టః = ఉపదేశించబడిన, అయమ్ = ఈ, క్రతుః = యాగము, యథావత్ = యథాశాస్త్రముగ, ఆప్యతామ్ = పొందబడుగాక.
తా. దశరథుడు ఆ బ్రాహ్మణులు వెడలిపోయిన తరువాత, మంత్రులతో, ‘‘ఋత్విక్కులు చెప్పిన ఈ యాగము యథాశాస్త్రముగ జరుగునట్లు చూడుడు’’ అని పలికెను.
మూ. ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్,
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః. 22
ప్ర. అ. మహాద్యుతిః = గొప్ప కాంతి గల, నృపశార్దూలః = ఆ రాజశ్రేష్ఠుడు, సముపస్థితాన్ = దగ్గర ఉన్న, సచివాన్ = మంత్రులను గూర్చి, ఇతి = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, విసర్జయిత్వా = వారినందరిని పంపివేసి, స్వమ్ = తన సంబంధ మైన, వేశ్మ = గృహమును, ప్రవివేశ = ప్రవేశించెను.
తా. గొప్ప కాంతి గల ఆ రాజశ్రేష్ఠుడు సమీపమున నున్న సచివులను ఈ విధముగ ఆజ్ఞాపించి, వారిని పంపివేసి, ఇంటిలోనికి ప్రవేశించెను.
మూ. తతః స గత్వా తాః పత్నీర్నరేన్ద్రో హృదయప్రియాః,
ఉవాచ దీక్షాం విశత యక్ష్యేఽహం సుతకారణాత్. 23
ప్ర. అ. తతః = అటుపిమ్మట, సః నరేన్ద్రః = ఆ నరేంద్రుడు, హృదయప్రియాః = తన హృదయమునకు ప్రియ లైన, తాః పత్నీః = ఆ భార్యలను గత్వా = సమీపించి, అహమ్ = నేను, సుతకారణాత్ = పుత్రులకొరకై, యక్ష్యే = యాగము చేయగలను. దీక్షామ్ = దీక్షను, విశత = ప్రవేశించండి, అని, ఉవాచ = పలికెను.
తా. దశరథుడు తన మనస్సునకు చాల ఇష్టలైన పత్నుల దగ్గరకు వెళ్లి, ‘‘నేను యాగము చేయనున్నాను; అందుచే మీరు కూడ దీక్ష వహింపుడు’’ అని పలికెను.
వి. భర్తతో కలిసి యజ్ఞయాగాదులు చేయు అర్హత గల భార్య ‘‘పత్ని’’.
మూ. తాసాం తేనాతికాన్తేన వచనేన సువర్చసామ్,
ముఖపద్మాన్యశోభన్త పద్మానీవ హిమాత్యయే. 24
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే, బాలకాణ్డే అష్టమః సర్గః.
ప్ర. అ. అతికాన్తేన = మిక్కిలి మనోహరమైన, తేన వచనేన = ఆ వాక్కుచేత, సువర్చసామ్ = మంచి కాంతి గల, తాసామ్ = ఆ దశరథపత్నులయొక్క, ముఖపద్మాని = ముఖపద్మములు, హిమాత్యయే = హేమంతఋతువుయొక్క అంతమునందు, పద్మానీవ = పద్మముల వలె, అశోభన్త = ప్రకాశించినవి.
తా. అతిమనోహర మైన ఆ మాట వినగానే మంచి తేజస్సు గల ఆ దశరథపత్నుల ముఖపద్మములు, మంచు తొలగినపుడు పద్మములు ప్రకాశించినట్లు ప్రకాశించినవి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు, బాలకాండలో అష్టమసర్గ సమాప్తము.
