Chapter_9

Back
Book Balakandamu
Chapter No 15
Pages 5
Read Time 8 Minutes

Chapter_9

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ నవమః సర్గః

సుమంత్రుడు దశరథునకు ఋశ్యశృంగునిగూర్చి సంక్షిప్తముగ చెప్పుట.

మూ. ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్,

ఋత్విగ్భిరుపదిష్టోఽయం పురా వృత్తో మయా శ్రుతః. 1

ప్ర. అ. ఏతత్ = ఈ విషయమును, శ్రుత్వా = విని, సూతః = సారథి యైన సుమంత్రుడు, రాజానమ్ = రాజును గూర్చి, రహః = రహస్యమునందు, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. ఋత్విగ్భిః = ఋత్విక్కులచేత, ఉపదిష్టః = ఉపదేశింపబడిన, అయమ్ = ఈ ఉపాయము, పురా = పూర్వము, వృత్తః = జరిగినది, అనగా చర్చింపబడినది. మయా = నాచేత, శ్రుతః = వినబడినది.

తా. ఈ విషయమును విన్న సుమంత్రుడు రహస్యముగ దశరథునితో ఇట్లు పలికెను. ఋత్విక్కులు చెప్పిన ఈ ఉపాయము పూర్వము చర్చింపబడగా నేను వింటిని.

మూ. సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథామ్,

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. 2

ప్ర. అ. రాజన్ = రాజా! భగవాన్ = మాహాత్మ్యము గల, సనత్కుమారః = సనత్కుమారుడు, తవ = నీ యొక్క, పుత్రాగమం ప్రతి = పుతప్రాప్తిని గూర్చి, కథామ్ = కథను, ఋషీణామ్ = ఋషులయొక్క, సన్నిధౌ = సమీపమునందు, పూర్వమ్ = పూర్వమున, కథితవాన్ = చెప్పినాడు.

తా. ఓ రాజా! నీ పుతప్రాప్తిని గూర్చిన కథను, పూర్వ మొకప్పుడు, సనత్కుమారుడు, ఋషులతో చెప్పినాడు.

మూ. కాశ్యపస్య తు పుత్రోఽస్తి విభణ్డక ఇతి శ్రుతః,

ఋష్యశృఙ్గ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి. 3

ప్ర. అ. కాశ్యపస్య = కాశ్యపునకు, విభణ్డకః ఇతి = విభండకు డని, శ్రుతః = ప్రసిద్ధు డైన, పుత్రః = కుమారుడు, అస్తి = ఉన్నాడు. తస్య = అతనికి, ఋష్యశృఙ్గః ఇతి = ఋష్యశృంగు డని, ఖ్యాతః = ప్రసిద్ధుడైన, పుత్రః = పుత్రుడు, భవిష్యతి = పుట్టగలడు.

తా. ‘‘కాశ్యపునకు విభండకు డను కుమారుడు కలడు. అతనికి ఋష్యశృంగు డను పుత్రుడు కలుగును.

మూ. స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరః సదా,

నాన్యం జానాతి విప్రేన్ద్రో నిత్యం పిత్రనువర్తనాత్. 4

ప్ర. అ. వనే = వనమునందు, నిత్యసంవృద్ధః = నిత్యము పెరిగిన వాడై, సదా = ఎల్లప్పుడును, వనచరః = వనమునందే సంచరించు, విప్రేన్ద్రః = బ్రాహ్మణశ్రేష్ఠుడైన, సః మునిః = ఆ ఋష్యశృంగముని, నిత్యమ్ = ఎల్లప్పుడును, పిత్రనువర్తనాత్ = తండ్రినే అనుసరించి ఉండుట వలన, అన్యమ్ = ఇతరుల నెవ్వరిని, న జానాతి = ఎరుగడు.

తా. వనములోనే పెరిగి, నిత్యము వనములోనే సంచరించుచు, సర్వదా తండ్రితోడనే ఉండు ఆ ఋష్యశృంగుడు తండ్రిని తప్ప వేరే ఎవ్వరిని ఎరుగడు.

మూ. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః,

లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. 5

ప్ర. అ. రాజన్ = ఓ రాజా! మహాత్మనః = మహాత్ముడైన ఆ ఋశ్యశృంగునకు, లోకేషు = లోకములయందు, ప్రథితమ్ = ప్రసిద్ధ మైనదియు, సదా = ఎల్లప్పుడును, విప్రైః = బ్రాహ్మణులచేత, కథితమ్ = కొనియాడబడి నదియు అగు, బ్రహ్మచర్యస్య = బ్రహ్మ చర్యస్య = బ్రహ్మ చర్యముయొక్క, ద్వైవిధ్యమ్ = ద్వివిధత్వము, అనగా రెండు విధము లైన బ్రహ్మ చర్యము, భవిష్యతి = కాగలదు, లేదా, బ్రహ్మ చర్యమునకు, ద్వైవిధ్యమ్ = విఘాతము, రాగలదు.

తా. రాజా! ఆ ఋష్యశృంగుడు, లోకములలో ప్రసిద్ధ మైనదియు, బ్రాహ్మణులచే సర్వదా కొనియాడబడునదియు అగు వ్రతిత్వము, ప్రాజాపత్యము అని రెండు విధములైన బ్రహ్మచర్యమును అవలంబింపగలడు. లేదా అతని బ్రహ్మచర్యమునకు విఘాతము రాగలదు.

మూ. తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తత,

అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్. 6

ప్ర. అ. అగ్నిమ్ = అగ్నిని, యశస్వినమ్ = యశఃశాలి యగు, పితరం చ = తండ్రిని, శుశ్రూషమాణస్య = సేవించుచున్న, ఏవమ్ = ఈ విధముగ, వర్తమానస్య = ఉంటూన్న, తస్య = అతనికి, కాలః = కాలము, సమభివర్తత = గడవగలదు.

తా. అగ్నిని, యశఃశాలి యైన తన తండ్రిని సేవించుచు అతడు వ్రతిత్వ మను బ్రహ్మచర్యమును కొంత కాలము గడుపగలడు.

మూ. ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్,

అఙ్గేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః. 7

ప్ర. అ. ఏతస్మిన్నేవ కాలే = ఈ కాలమునందే, అఙ్గేషు = అంగదేశమునందు, ప్రతాపవాన్ = ప్రతాపము కలవాడును, మహాబలః = గొప్పబలము కలవాడును అగు, ప్రథితః = ప్రసిద్ధు డైన, రోమపాదః రాజా = రోమపాదు డనెడు రాజు, భవిష్యతి = ఉండగలడు.

తా. ఈ కాలమునందే, అంగదేశములో, ప్రతాపశాలియు, ప్రసిద్ధుడును, మహాబలుడును అగు రోమపాదు డను రాజు ఉండగలడు.

మూ. తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా,

అనావృష్టిః సుఘోరా వై సర్వభూతభయావహా. 8

ప్ర. అ. తస్య = ఆ, రాజ్ఞః = రాజుయొక్క, వ్యతిక్రమాత్ = ధర్మాతిక్రమము వలన, సుదారుణా = చాలా దారుణ మైనదియు, సుఘోరా = చాల ఘోరమైనదియు, సర్వభూతభయావహా = సమస్త ప్రాణులకును భయమును కలిగించు నదియు అగు, అనావృష్టిః = అనావృష్టి, భవిష్యతి = కాగలదు.

తా. ఆ రాజు ధర్మాతిక్రమము చేయుటచే అతని రాజ్యములో సర్వ ప్రాణులకును భయంకర మైన తీవ్ర మైన అనావృష్టి కలుగును.

మూ. అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్వితః,

బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి. 9

ప్ర. అ. అనావృష్ట్యామ్ = అనావృష్టి, వృత్తాయామ్ = ఏర్పడిన దగుచుండగా, రాజా = రాజు, దుఃఖసమన్వితః = దుఃఖముతో కూడినవాడై, శ్రుతవృద్ధాన్ = శాస్త్రాభ్యాసముచేత వృద్ధు లైన, బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను, సమానీయ = పిలిపించి, ప్రవక్ష్యతి = ఇట్లు పలుకును.

తా. అనావృష్టి కలిగినందులకు మిక్కిలి దుఃఖించుచు, ఆ రాజు, విద్యావృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు చెప్పును.

మూ. భవన్తః శ్రుతధర్మాణో లోకచారిత్రవేదినః,

సమాదిశన్తు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్. 10

ప్ర. అ. భవన్తః = మీరందరును, శ్రుతధర్మాణః = వినబడినధర్మములుకలవారు, లోకచారిత్రవేదినః = లోకముయొక్క చరిత్రను ఎరిగినవారు, యథా = ఏ విధముగ, ప్రాయశ్చిత్తమ్ = ప్రాయశ్చిత్తము, భవేత్ = అగునో, (ఆ విధముగ), నియమమ్ = నియమమును, సమాదిశత = ఉపదేశించండి.

తా. ‘‘మీరు సమస్తధర్మములు, లోకాచారములు తెలిసినవారు. ఈ అనావృష్టికి కారణ మైన పాపము తొలగిపోవుటకై ఏదైన నియమమును ఉపదేశింపుడు.’’

మూ. వక్ష్యన్తి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః,

విభణ్డకసుతం రాజన్ సర్వోపాయైరిహానయ. 11

ప్ర. అ. వేదపారగాః = సకల వేదముల అధ్యయనము చేసిన, తే బ్రాహ్మణాః = ఆ బ్రాహ్మణులు, మహీపాలమ్ = రాజునుగూర్చి, వక్ష్యన్తి = ఇట్లు చెప్పగలరు, రాజన్ = ఓ రాజా! విభణ్డకసుతమ్ = విభండకునికుమారుడైన ఋశ్యశృంగుని, సర్వోపాయైః = అన్ని ఉపాయములచేతను, ఇహ = ఇచటికి, ఆనయ = తీసికొని రమ్ము.

తా. వేదములలో ప్రవీణు లైన ఆ బ్రాహ్మణులు ఆ రాజుతో ఇట్లు చెప్పగలరు - ‘‘రాజా! అన్ని ఉపాయములను ప్రయోగించి, ఋశ్యశృంగుని ఇచటకు రప్పింపుము.’’

మూ. ఆనాయ్య చ మహీపాల ఋశ్యశృఙ్గం సుసత్కృతమ్,

ప్రయచ్ఛ కన్యాం శాన్తాం వై విధినా సుసమాహితః. 12

ప్ర. అ. మహీపాల = ఓ రాజా! సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన, ఋశ్యశృఙ్గమ్ = ఋష్యశృంగుని, ఆనాయ్య = రప్పించి, సమాహితః = బాగుగా శ్రద్ధకలవాడవై, కన్యామ్ = నీ కన్య యైన, శాన్తామ్ = శాంతను, విధినా = యథాశాస్త్రముగా, ప్రయచ్ఛ = ఇమ్ము.

తా. ఓ రాజా! ఋశ్యశృంగుని రప్పించి, అతనిని బాగుగా సత్కరించి, శ్రద్ధాయుక్తుడ వై శాంతను అతని కిచ్చి, యథాశాస్త్రముగ వివాహము చేయుము.

మూ. తేషాం తు వచనం శ్రుత్వా రాజా చిన్తాం ప్రవత్స్యతే,

కేనోపాయేన వై శక్య ఇహానేతుం స వీర్యవాన్. 13

ప్ర. అ. తేషామ్ = వారియొక్క, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, రాజా = రాజు, వీర్యవాన్ = ఇంద్రియనిగ్రహము గల, సః = అతడు, ఇహ = ఇచటకు, ఆనేతుమ్ = తీసికొని వచ్చుటకు, కేన ఉపాయేన = ఏ ఉపాయముచే, శక్యః = శక్యమైనవాడు, అని, చిన్తామ్ = చింతను, ప్రవత్స్యతే = పొందగలడు.

తా. వారి మాటలను విని, రాజు, ‘‘జితేంద్రియు డైన ఆ ఋశ్యశృంగుని తీసికొని వచ్చుటకు ఉపాయమేమి?’’ అని ఆలోచింపగలడు.

మూ. తతో రాజా వినిశ్చిత్య సహ మన్త్రిభిరాత్మవాన్,

పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్. 14

ప్ర. అ. తతః = అటు పిమ్మట, ఆత్మవాన్ = బుద్ధిశాలి యగు, రాజా = రాజు, మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ కలిసి, వినిశ్చిత్య = నిశ్చయించి, తతః = అటు పిమ్మట, సత్కృతాన్ = సత్కరింపబడిన, పురోహితమ్ = పురోహితుని, అమాత్యాంశ్చ = మంత్రులను, ప్రేష్యతి = ప్రేరేపింపగలడు.

తా. అంత ధీమంతు డగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి, నిశ్చయము చేసి, ఋశ్యశృంగుని తీసికొని వచ్చుటకై పురోహితుని, అమాత్యులను ప్రేరేపించగలడు.

మూ. తే తు రాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః,

న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యన్తి తం నృపమ్. 15

ప్ర. అ. తే = వారు, రాజ్ఞః = రాజుయొక్క, వచః = మాటను, శ్రుత్వా = విని, ఋషేః = విభండక ఋషి నుండి, భీతాః = భయపడినవారై, వ్యథితాః = బాధపడుచున్నవారై, వినతాననాః = వంచబడిన ముఖములు కలవారై, న గచ్ఛేమ = వెళ్లము, అని, తమ్ = ఆ, నృపమ్ = రాజును, అనునేష్యన్తి = బ్రతిమాలుకొనగలరు.

తా. వారు రాజు మాటలు విని, విభండకమునికి భయపడి, బాధతో తలలు వంచి, ‘‘మేము అచటికి వెళ్లజాలము’’ అని ఆ రాజును బ్రతిమాలెదరు.

మూ. వక్ష్యన్తి చిన్తయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్,

ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి. 16

ప్ర. అ. తే = వారు, చిన్తయిత్వా = ఆలోచించి, తత్క్షమాన్ = అతనిని తీసికొని వచ్చుటకు ఉపయోగించు, ఉపాయాన్ = ఉపాయములను, తస్య = ఆ రాజునకు, వక్ష్యన్తి = చెప్పగలరు. వయమ్ = మేము, విప్రమ్ = ఆ ఋశ్యశృంగుని, ఆనేష్యామః = తీసికొని వచ్చెదము, దోషః = దోషమేమియు, న భవిష్యతి చ = ఉండదు కూడ.

తా. పిమ్మట వారు ఆలోచించి, అందుకు తగిన ఉపాయములను కనుగొని ‘‘మేము దోష మేమియు కలుగకుండ ఆ ఋషిని తీసికొని వచ్చెదము’’ అని ఆ రాజుతో చెప్పెదరు.

మూ. ఏవమఙ్గాధిపేనైవ గణికాభిః ఋషేః సుతః,

ఆనీతోఽవర్షయద్దేవశ్శాన్తా చాస్మై ప్రదీయతే. 17

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగ, అఙ్గాధిపేన = అంగదేశరాజైన రోమపాదుని చేత, గణికాభిః = వేశ్యల సాహాయ్యముతో, ఋషేః సుతః = ఋషికుమారుడు, ఆనీతః = తీసికొని రాబడును. దేవః = దేవుడు, అవర్షయత్ = వర్షింపగలడు, అస్మై = ఋశ్యశృంగునకు, శాన్తా = శాంత, ప్రదీయతే చ = ఇవ్వబడును.

తా. రోమపాదుడు గణికల సాహాయ్యముతో ఋశ్యశృంగుని తీసికొని రాగలడు. వర్షములు కురియును. శాంతను అతని కిత్తురు.

మూ. ఋశ్యశృఙ్గస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి,

సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా. 18

ప్ర. అ. జామాతా = అల్లుడైన, ఋశ్యశృఙ్గస్తు = ఋశ్యశృంగుడు, తవ = నీకు, పుత్రాన్ = పుత్రులను, విధాస్యతి = కలుగునట్లు చేయును. ఏతావత్ = ఇంతవరకును, సనత్కుమారకథితమ్ః = సనత్కుమారునిచే చెప్పబడినది, మయా = నాచేత, వ్యాహృతమ్ = నీకు చెప్పబడినది.

తా. జామాత యైన ఋష్యశృంగుడు నీకు పుత్రులు కలుగు విధానము చేయగలడు. ఈ విషయమును సనత్కుమారుడు చెప్పగా విని నేను నీకు చెప్పుచున్నాను.

మూ. అథ హృష్టో దశరథః సుమన్త్రం ప్రత్యభాషత,

యథర్శ్యశృఙ్గస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్. 19

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే, బాలకాణ్డే నవమః సర్గః.

ప్ర. అ. అథ = అటుపిమ్మట, హృష్టః = సంతసించిన, దశరథః = దశరథుడు, సుమన్త్రం ప్రతి = సుమంత్రుని గూర్చి, అభాషత = పలికెను. ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు, యథా = ఏ విధముగా, ఆనీతః = తీసికొని రాబడెనో, ఆ విషయమంతయు, త్వయా = నీచేత, విస్తరేణ = సవిస్తరముగ, ఉచ్యతామ్ = చెప్పబడుగాక.

తా. దశరథుడు సంతోషించి, ఆ ఋశ్యశృంగుని ఎట్లు తీసికొని వచ్చిరో సవిస్తరముగ చెప్పు మని సుమంత్రునితో పలికెను.

(ఇచట సర్గసమాప్తి యుక్తముగ లేదు. ఇది లేఖకుల దోషమై ఉండును అని గోవిందరాజుల అభిప్రాయము).

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నవమసర్గ సమాప్తము.

© 2026 Ebook Library