| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 16 |
| Pages | 8 |
| Read Time | 13 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ దశమః సర్గః
ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట. అతడు శాంతను వివాహ మాడుట.
మూ. సుమన్త్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా,
యథర్శ్యశృఙ్గస్త్వానీతః శృణు మే మన్త్రిభిః సహ. 1
ప్ర. అ. రాజ్ఞా = రాజుచేత, చోదితః = ప్రేరితుడైన, సుమన్త్రః = సుమంత్రుడు, తదా = అప్పుడు, ఇదమ్ = ఈ వాక్యమును, ప్రోవాచ = పలికెను. నః = ఆ, ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు, మన్త్రిభిః = మంత్రులచేత, యథా = ఏ విధముగా, ఆనీతః = తీసికొని రాబడెనో, మే = నానుండి, శృణు = వినుము, (‘హ’ కు అర్థము లేదు).
తా. ఈ విధముగ దశరథుడు ప్రశ్నింపగా సుమంత్రుడు ఇట్లు పలికెను. మంత్రులు ఋశ్యశృంగుని ఎట్లు తీసికొని వచ్చిరో చెప్పెదను; వినుము.
మూ. రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః,
ఉపాయో నిరపాయోఽయమస్మాభిరభిచిన్తితః. 2
ప్ర. అ. సహామాత్యః = అమాత్యులతో కూడిన, పురోహితః = పురోహితుడు, రోమపాదమ్ = రోమపాదునిగూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, ఉవాచ = పలికెను. అస్మాభిః = మాచేత, నిరపాయః = అపాయము లేని, అయమ్ = ఈ, ఉపాయః = ఉపాయము, అభిచిన్తితః = ఆలోచించబడినది.
తా. అమాత్యులును పురోహితుడును, రోమపాదునితో ఇట్లు పలికిరి మేము అపాయము లేని ఒక ఉపాయము ఆలోచించినాము.
మూ. ఋశ్యశృఙ్గో వనచర స్తపఃస్వాధ్యాయసంయుతః,
అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ. 3
ప్ర. అ. ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు, వనచరః = వనమునందే తిరుగుచున్న వాడై, తపః స్వాధ్యాయ సంయుతః = తపస్సుతోడను స్వాధ్యాయాధ్యయనముతోడను కూడినవాడు. సః = అతడు, నారీణామ్ = స్త్రీలకును (ను), విషయాణామ్ = భోగములకును, సుఖస్య చ = సుఖమునకును, అనభిజ్ఞః = ఎరుగనివాడు.
తా. ఋశ్యశృంగుడు అడవులలోనే సంచరించుచు, తపః స్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు. అతడు స్త్రీ సుఖమును గాని, ఇతర విషయసుఖములను గాని అనుభవించి ఎరుగడు.
మూ. ఇన్ద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభిః,
పురమానాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతామ్. 4
ప్ర. అ. నరచిత్తప్రమాథిభిః = మానవుల చిత్తములను క్షోభపెట్టు, అభిమతైః = ఇష్టమైన, ఇన్ద్రియార్థైః = ఇంద్రియములచే అనుభవించ దగు భోగములచేత, పురమ్ = పట్టణమును గూర్చి, అనాయయిష్యామః = రప్పించెదము, క్షిప్రమ్ = శీఘ్రముగ నిశ్చయింపుము.
తా. మానవులకు అభిమతములును, వారి మనస్సులను క్షోభ పెట్టునవియు అగు ఇంద్రియార్థములచే అతనిని లోభపెట్టి పట్టణమునకు తీసికొని వచ్చెదము. శీఘ్రముగా నిశ్చయింపుము.
మూ. గణికాస్తత్ర గచ్ఛన్తు రూపవత్యః స్వలఙ్కృతాః,
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యన్తీహ సత్కృతాః. 5
ప్ర. అ. రూపవత్యః = సౌందర్యము కలవారును, స్వలఙ్కృతాః = బాగుగా అలంకరింప బడినవారును అయిన, గణికాః = వేశ్యలు, సత్కృతాః = నీచే సత్కరింపబడినవారై, తత్ర = అచటకు, గచ్ఛన్తు = వెళ్లెదరుగాక. వివిధోపాయైః = అనేక విధములైన ఉపాయములచేత, ప్రలోభ్య = లోభపెట్టి, ఇహ = ఇచటికి, అనేష్యన్తి = తీసికొనిరాగలరు.
తా. సౌందర్యవతు లైన, చక్కగా అలంకరించుకొనిన గణికలను సత్కరించి అచటికి పంపుము. వారు అనేకవిధములైన ఉపాయములచే అతనిని లోభపెట్టి తీసికొనిరాగలరు.
మూ. శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్,
పురోహితో మన్త్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా. 6
ప్ర. అ. రాజా చ = రాజు, శ్రుత్వా = విని, తథా = అటులనే చేయుడు, ఇతి = అని, పురోహితమ్ = పురోహితుని గూర్చి, ప్రత్యువాచ = పలికెను. తదా = అప్పుడు, పురోహితః = పురోహితుడును, తే = ఆ, మన్త్రిణశ్చ = మంత్రులును, తథా = అట్లు, చక్రుః = చేసిరి.
తా. రాజు ఆ మాటలు విని ‘‘అటులనే చేయుడు’’ అని అనుమతించగా పురోహితుడును, మంత్రులును ఆ విధముగ చేసిరి.
మూ. వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్,
ఆశ్రమస్యావిదూరేఽస్మిన్ యత్నం కుర్వన్తి దర్శనే,
ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః. 7
ప్ర. అ. తత్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, వారముఖ్యాః = సౌందర్యవతులైన వేశ్యలు, మహత్ = గొప్పదైన, వనమ్ = వనమును, ప్రవివిశుః = ప్రవేశించిరి. ఆశ్రమస్య = ఆశ్రమము యొక్క, అస్మిన్ = ఈ, అవిదూరే = సమీప ప్రదేశమునందు, ధీరస్య = ఇంద్రియనిగ్రహము కలవాడును, నిత్యమ్ = ఎల్లప్పుడును, ఆశ్రమవాసినః = ఆశ్రమమునందే నివసించు వాడును అగు, ఋషిపుత్రస్య = ఋషికుమారునియొక్క, దర్శనే = దర్శనమునందు, యత్నమ్ = ప్రయత్నమును, కుర్వన్తి = చేయుచుండిరి.
తా. ఆ వాక్యమును విని, ఉత్తమ సౌందర్యవతు లైన వేశ్యాస్త్రీలు ఆ అరణ్యమును ప్రవేశించి, ఆశ్రమమునకు సమీపమున నివాస మేర్పరచుకొని, ఎల్లప్పుడును ఆశ్రమము నందే నివసించు, ఇంద్రియనిగ్రహవంతు డైన ఆ ఋశ్యశృంగుని దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి.
మూ. పితుః స నిత్యసన్తుష్టో నాతిచక్రామ చాశ్రమాత్, 8
న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా,
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సర్వం నగరరాష్ట్రజమ్. 9
ప్ర. అ. నిత్యసంతుష్టః = నిత్యము సంతుష్టు డైన, సః = ఆ ఋశ్యశృంగుడు, పితుః = తండ్రియొక్క, ఆశ్రమాత్ = ఆశ్రమమునుండి, నాతిచక్రామ = బైటకు వెళ్లలేదు. తపస్వినా = తపశ్శాలి యైన, తేన = అతనిచేత, జన్మప్రభృతి = పుట్టినది మొదలు, స్త్రీ వా = స్త్రీకాని, పుమాన్వా = పురుషుడు కాని, నగరరాష్ట్రజమ్ = నగరము లందును, ఇతరరాష్ట్ర ప్రదేశములందును పుట్టిన, సర్వమ్ = సమస్తమైన, యత్ = ఏ, అన్యత్ = ఇతరవస్తువు గలదో అది గాని, న దృష్టపూర్వమ్ = పూర్వ మెన్నడును చూడబడలేదు.
తా. ఏ కోరికలును లేక నిత్యసంతుష్టుడుగా ఉన్న ఆ ఋశ్యశృంగుడు తన తండ్రి ఆశ్రమము దాటి ఎన్నడును బైటకు వెళ్లలేదు. పుట్టినది మొదలు అతడు, పురుషుని గాని, స్త్రీని గాని, నగరగ్రామాదులలోని ఏ ఇతర వస్తువును గాని చూచి ఉండలేదు.
మూ. తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా,
విభణ్డకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాఙ్గనాః. 10
ప్ర. అ. తతః = అటుపిమ్మట, కదాచిత్ = ఒకరోజున, విభణ్డకసుతః = ఋశ్యశృంగుడు, యదృచ్ఛయా = దైవవశముచేత, తం దేశమ్ = ఆ ప్రదేశమును గూర్చి, ఆజగామ = వచ్చెను, తత్ర = అచట, తాః = ఆ, వరాఙ్గనాః = ఉత్తమవేశ్యాస్త్రీలను, అపశ్యత్ చ = చూచెను.
తా. ఒకనాడు ఋశ్యశృంగుడు దైవవశమున ఆ ప్రదేశమునకు వెళ్లి ఆ స్త్రీలను చూచెను.
మూ. తాశ్చిత్రవేషాః ప్రమదా గాయన్త్యో మధురస్వరాః,
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్. 11
ప్ర. అ. చిత్రవేషాః = చిత్రమైనవేషముకలవారును, మధురస్వరాః = మధురమైన కంఠస్వరము కలవారును, గాయన్త్యః = గానము చేయుచున్నవారును అగు, తాః = ఆ, ప్రమదాః = స్త్రీలు, సర్వాః = అందరును, ఋషిపుత్రమ్ = ఋషికుమారుని, ఉపాగమ్య = సమీపించి, అబ్రువన్ = పలికిరి.
తా. చిత్రవేషములు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధుర స్వరముతో గానము చేయుచుండిరి. ఋశ్యశృంగుని చూడగనే వారందరును అతనిని సమీపించి ఇట్లు పలికిరి.
మూ. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్,
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః. 12
ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా! త్వమ్ = నీవు, కః = ఎవ్వడవు? కిం వర్తసే = ఏ విధముగ ప్రవర్తించుచున్నావు? త్వమ్ = నీవు, ఏకః = ఒక్కడవే, విజనే = జనశూన్య మైన, ఘోరే = భయంకర మైన, వనే = వనము నందు, కిం చరసి = ఎందుకు సంచరించుచున్నావు. వయమ్ = మేము, జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు, ఇచ్ఛామహే = కోరుచున్నాము. నః = మాకు, శంస = చెప్పుము.
తా. ఓ బ్రాహ్మణుడా! నీ వెవ్వడవు? నీ జీవన విధాన మేమి? జనశూన్య మైన ఈ ఘోరవనములో ఏల సంచరించుచున్నావు? తెలిసికొనవలెనని కోరుచున్నాము, చెప్పుము.
మూ. అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః,
హార్దాత్తస్య మతిర్జాతా వ్యాఖ్యాతుం పితరం స్వకమ్. 13
ప్ర. అ. కామ్యరూపాః = కోరదగిన రూపములు గల, తాః స్త్రియః = ఆ స్త్రీలు, తేన = అతనిచేత, వనే = వనమునందు, అదృష్టరూపాః = పూర్వా మెన్నడును చూడబడని రూపములు కలవారు. హార్దాత్ = ఆ కారణముచే కలిగిన స్నేహమువలన, తస్య = అతనికి, స్వకం పితరమ్ = తన తండ్రిని గూర్చి, వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు, మతిః = అభిప్రాయము, జాతా = కలిగినది.
తా. ఆ స్త్రీల సౌందర్యము చాల మనోహరముగ నుండెను. అత డట్టి సౌందర్యవంతులను పూర్వ మెన్నడును ఆ వనములో చూడలేదు. అందుచే వారిపై స్నేహము కలిగి అతడు తన తండ్రిని గూర్చి చెప్పవలెనని నిశ్చయించుకొనెను.
మూ. పితా విభణ్డకోఽస్మాకం తస్యాహం సుత ఔరసః,
ఋశ్యశృఙ్గ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి. 14
ప్ర. అ. విభణ్డకః = విభండకుడు, అస్మాకమ్ = మాయొక్క, పితా = తండ్రి. అహం = నేను, తస్య = అతనియొక్క, ఔరసః సుతః = ఔరసు డైన కుమారుడను. మే = నాయొక్క, ఋశ్యశృఙ్గ ఇతి = ఋశ్యశృంగు డను, నామ = పేరు, కర్మ చ = పనియు, భువి = భూమియందు, ఖ్యాతమ్ = ప్రసిద్ధమైనది.
తా. నేను విభండకుని ఔరసపుత్రుడను. ఋష్యశృంగు డని నా పేరు, కర్మయు లోకమున ప్రసిద్ధములు.
వి. ‘‘నా కర్మ కూడ ప్రసిద్ధము’’ అనగా - ఋశ్యశృంగునకు ఆ పేరు తలపై ఒక కొమ్ము ఉండుటచే వచ్చినది గాన ‘కర్మ’ అనునది ‘‘అట్టి విశేషము’’ అను నర్థమున ప్రయోగింపబడినది.
మూ. ఇహాశ్రమపదోఽస్మాకం సమీపే శుభదర్శనాః,
కరిష్యే వోఽత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్. 15
ప్ర. అ. శుభదర్శనాః = మంగళప్రదమైన దర్శనము కలవారలారా! అస్మాకమ్ = మాయొక్క, ఆశ్రమపదః = ఆశ్రమము, ఇహ = ఇచట, సమీపే = సమీపముననే ఉన్నది. అత్ర = ఇచట, వః సర్వేషామ్ = మీ అందరియొక్క, పూజామ్ = పూజను, విధిపూర్వకమ్ = యథాశాస్త్రముగా, కరిష్యే = చేయగలను.
తా. ఓ శుభదర్శనులారా! మా ఆశ్రమము, ఇచట సమీపముననే ఉన్నది. మీ అందరికిని మా ఆశ్రమములో, యథాశాస్త్రముగా అతిథిసత్కారము చేసెదను.
వి. స్త్రీలతో మాటలాడు నపుడు ‘‘సర్వేషామ్’’ అని పుంలింగప్రయోగమును చేయుటచే ఋశ్యశృంగునకు స్త్రీపుంభేదము తెలియ దని సూచిత మగు చున్నది.
మూ. ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై,
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తాః. 16
ప్ర. అ. ఋషిపుత్రవచః = ఋషికుమారుని వాక్యమును, శ్రుత్వా = విని, సర్వాసామ్ = ఆ వేశ్యాస్త్రీల కందరికిని, తత్ ఆశ్రమపదమ్ = ఆ ఆశ్రమమును, ద్రష్టుమ్ = చూచుటకు, మతిః = కోరిక, ఆస వై = కలిగినది. సర్వాః = వారందరును, తేన = వానితో కూడ, జగ్ముః చ = వెళ్లిరి కూడ.
తా. ఋశ్యశృంగుని మాట విన్న పిదప ఆ వేశ్యలకు ఆ ఆశ్రమమును చూడ వలె నను కోరిక కలిగినది. వారందరును ఆతనితో కలిసి వెళ్ళిరి.
మూ. ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ,
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలం ఫలం చ నః. 17
ప్ర. అ. తతః = అటుపిమ్మట, ఋషిపుత్రః = ఋషికుమారుడు, ఇదమ్ = ఇది, నః = మాయొక్క (మేము సమర్పించు), అర్ఘ్యమ్ = అర్ఘ్యము, ఇదమ్ = ఇది, పాద్యమ్ = పాద్యము, ఇదమ్ = ఇది, మూలమ్ = మూలము, ఫలం చ = ఫలము, అని చెప్పుచు, ఆగతానామ్ = ఆశ్రమమునకు వచ్చిన ఆ స్త్రీల యొక్క, పూజామ్ = పూజను, చకార హ = చేసెను.
తా. పిదప ఆ ఋశ్యశృంగుడు ‘‘ఇది మేము సమర్పించు అర్ఘ్యము, ఇది పాద్యము, ఇవి కందమూలఫలములు’’ అని పలుకుచు వారి పూజ చేసెను.
మూ. ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః,
ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః. 18
ప్ర. అ. తాః సర్వాః = ఆ వేశ్యలందరును, సముత్సుకాః = ఉత్సాహము కలవారై, తాం పూజామ్ = ఆ పూజను, ప్రతిగృహ్య = స్వీకరించి, ఋషేః = విభండకమహర్షివలన, భీతాః = భయపడినవారై, శీఘ్రమ్ = శీఘ్రముగా, గమనాయ = తిరిగి వెళ్లుటకు, మతిమ్ = బుద్ధిని, దధుః = ధరించిరి (నిశ్చయించిరి).
తా. ఆ వేశ్యలు ఉత్సాహముతో ఆ పూజ నందికొని విభండక మహర్షి ఎక్కడ వచ్చునో అని భయపడుచు, శీఘ్రముగ మరలి పోవలె నని నిశ్చయించిరి.
మూ. అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ,
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్. 19
ప్ర. అ. ద్విజ = ఓ బ్రాహ్మణుడా! అస్మాకమ్ = మాయొక్క, ముఖ్యాని = ప్రధానమైన, ఇమాని ఫలాన్యపి = ఈ ఫలములను కూడ, ప్రతి గృహాణ = తీసికొనుము, తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక, భక్షయస్వ = భక్షించుము, చిరమ్ = ఆలస్యము, మా = చేయవద్దు.
తా. ఓ బ్రాహ్మణా! ఇవి మేము భుజించు ఫలములలో శ్రేష్ఠ మైనవి. తీసికొనుము. నీకు క్షేమ మగును. శీఘ్రముగ భక్షించుము.
మూ. తతస్తాస్తం సమాలిఙ్గ్య సర్వా హర్షసమన్వితాః,
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్. 20
ప్ర. అ. తతః = పిమ్మట, తాః సర్వాః = వారందరును, తమ్ = వానిని, సమాలిఙ్గ్య = కౌగలించుకొని, హర్షసమన్వితాః = ఆనందముతో కూడినవారై, తస్శై = ఆతనికి, బహూన్ = అనేక మైన, మోదకాన్ = మధుర పదార్థములను, వివిధాన్ = అనేక విధము లైన, భక్ష్యాంశ్చ = ఇతర భక్ష్యములను, ప్రదదుః = ఇచ్చిరి.
తా. అంతట ఆ వేశ్యలందరును ఋశ్యశృంగుని ఆనందముతో కౌగిలించుకొని, అతనికి అనేక మైన మధురపదార్థములను, ఇతరము లైన వివిధ భక్ష్యములను ఇచ్చిరి.
మూ. తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే,
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్. 21
ప్ర. అ. తేజస్వీ = బ్రహ్మతేజము గల ఆ ఋశ్యశృంగుడు, వనే = వనము నందు, నిత్యనివాసినామ్ = నిత్యము నివసించువారికి (చే), అనాస్వాదిత పూర్వాణి = పూర్వ మెన్నడును రుచిచూడబడని, తాని = వాటిని, ఆసాద్య = తిని, ఫలాని ఇతి = ఫలములే అని, మన్యతే స్మ = తలచెను.
తా. బ్రహ్మతేజముతో ఒప్పు ఆ ఋశ్యశృంగుడు, సర్వదా వనమునందే నివసించువారు పూర్వ మెన్నడును రుచి చూచి ఎరుగని వాటిని తిని, అవి ఫలములే అని అనుకొనెను.
మూ. ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ,
గచ్ఛన్తి స్మాపదేశాత్తా భీతాస్తస్య పితుస్త్రియః. 22
ప్ర. అ. తదా = అప్పుడు, తాః స్త్రియః = ఆ స్త్రీలు, విప్రమ్ = ఋశ్యశృంగుని, ఆపృచ్ఛ్య = అడిగి, వ్రతచర్యామ్ = నిత్యకర్మానుష్ఠానమును, నివేద్య = తెలిపి, తస్య = అతని, పితుః = తండ్రివలన, భీతాః = భయపడిన వారై, అపదేశాత్ = కర్మానుష్ఠానమనే వంకతో, గచ్ఛన్తి స్మ = వెళ్లిపోయిరి.
తా. అతని తండ్రి వచ్చి ఏమి శపించునో అని భయపడిన ఆ స్త్రీలు, అతనివద్ద సెలవు గైకొని, కర్మానుష్ఠానము చేసికొనవలె నను నెపముతో వెళ్లిపోయిరి.
మూ. గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః,
అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్ స్మ పరివర్తతే. 23
ప్ర. అ. తాసు సర్వాసు = ఆ వేశ్య లందరును, గతాసు సతీషు = వెళ్లి పోయిన వారగుచుండగా, కాశ్యపస్య = కాశ్యపకుమారుడైన విభండకుని, ఆత్మజః = కుమారుడైన, ద్విజః = ఆ బ్రాహ్మణుడు, అస్వస్థహృదయః = అస్వస్థమైన మనస్సు కలవాడు, ఆసీత్ = ఆయెను. దుఃఖాత్ = దుఃఖమువలన, పరివర్తతే స్మ = తిరుగాడుచుండెను.
తా. వేశ్యలు వెళ్లిపోయిన పిదప, ఋశ్యశృంగుడు మనస్సునందు స్వాస్థ్యము చెడి, దుఃఖముతో తిరుగాడుచుండెను.
మూ. తతోఽపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్,
మనోజ్ఞా యత్ర తా దృష్టా రూపవత్యస్స్వలఙ్కృతాః. 24
ప్ర. అ. తతః = పిమ్మట, వీర్యవాన్ = తపఃశక్తి గల, సః = ఆతడు, అపరేద్యుః = మరునాడు, మనోజ్ఞాః = మనస్సుకు ఇంపైనవారును, రూపవత్యః = సౌందర్యవతులును, స్వలఙ్కృతాః = చక్కగా అలంకరించుకొన్నవారును అగు, తాః = ఆ వేశ్యలు, యత్ర = ఎచట, దృష్టాః = చూడబడిరో, తం దేశమ్ = ఆ ప్రదేశమును గూర్చి, ఆజగామ = వచ్చెను.
తా. తపశ్శాలి యగు ఆ ఋశ్యశృంగుడు మరునాడు బయలుదేరి, మనోహర రూపవతులును, సర్వాలంకారభూషితలును అగు ఆ వేశ్యలను తాను పూర్వము చూచిన ప్రదేశమునకు వచ్చెను.
మూ. దృష్ట్వైవ తాస్తదా విప్రమాయాన్తం హృష్టమానసాః,
ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః. 25
ప్ర. అ. తదా = అప్పుడు, తాః = ఆ స్త్రీలు, ఆయాన్తమ్ = వచ్చుచున్న, తమ్ = ఆ, విప్రమ్ = బ్రాహ్మణుని, దృష్ట్వా ఏవ = చూడగనే, హృష్టమానసాః = సంతోషించిన మనస్సు కలవారైరి. తాః సర్వాః = వారందరును, తతః = పిమ్మట, ఉపసృత్య = సమీపించి, తమ్ = ఆతనిని గూర్చి, ఇదం వచః = ఈ వాక్కును, ఊచుః = పలికిరి.
తా. అతడు తమ వద్దకు వచ్చుచున్నట్లు చూడగనే సంతసించి, ఆ వేశ్య లందరును అతని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికిరి.
మూ. ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్,
తత్రాప్యేష విధిః శ్రీమాన్ విశేషేణ భవిష్యతి. 26
ప్ర. అ. హే సౌమ్య = ఓ సౌమ్యుడా! అస్మాకమ్ = మాయొక్క, ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి, ఏహి = రమ్ము. తత్ర = అచట, శ్రీమాన్ = శోభాయుక్త మైన, ఏషః విధిః = ఈ అతిథిసత్కారము, విశేషేణ = విశేష రూపమున, భవిష్యతి = జరుగగలదు, ఇతి చ = అనియు, అబ్రువన్ = పలికిరి.
తా. ‘‘ఓ సౌమ్యుడా! మా ఆశ్రమమునకు రమ్ము, అచట నీకు విశేష రూపమున చక్కని అతిథిసత్కారము చేయగలము’’ అని పలికిరి.
మూ. శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయఙ్గమమ్,
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియః. 27
ప్ర. అ. తాసాం సర్వాసామ్ = వారందరియొక్క, హృదయఙ్గమమ్ = మనోహరమైన, వచనం = వాక్యమును, శ్రుత్వా = విని, గమనాయ = వెళ్లుటకు, మతిమ్ = బుద్ధిని, చక్రే = చేసెను. తదా = అప్పుడు, స్త్రియః = ఆ వేశ్యలు, తమ్ = అతనిని, నిన్యుః = తీసికొని వెళ్లిరి.
తా. వాళ్లు పలికిన మనోహర మైన మాటలు విని అతడు వారితో వెళ్లుటకు ఇచ్చగించెను. వారు అతనిని తీసికొని వెళ్లిరి.
మూ. తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని,
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా. 28
ప్ర. అ. మహాత్మని = మహాత్ముడైన, తస్మిన్ = ఆ, విప్రే = బ్రాహ్మణుడు, ఆనీయమానే = తీసికొని రాబడుచుండగా, తదా = అప్పుడు, దేవః = వర్షాధిష్ఠాన దేవత యైన పర్జన్యుడు, జగత్ = జగత్తును, ప్రహ్లాదయన్ = సంతోషింపచేయుచు, సహసా = వెంటనే, తత్ర = ఆ అంగదేశమునందు, వవర్ష = వర్షించెను.
తా. మహాత్ము డైన ఆ ఋశ్యశృంగుడు అంగదేశములో ప్రవేశించెనో లేదో, వెంటనే, పర్జన్యుడు, జగత్తుకు ఆహ్లాదము కలుగునట్లు వర్షించెను.
మూ. వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః,
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః శిరసా చ మహీం గతః. 29
ప్ర. అ. నరాధిపః = రాజు, వర్షేణైవ = వర్షముతో కూడ, స్వమ్ = తన, విషయం = దేశమును, ఆగతమ్ = చేరిన, మునిమ్ = ముని యైన, విప్రమ్ = బ్రాహ్మణుని, ప్రత్యుద్గమ్య = ఎదురు వెళ్లి, ప్రహ్వః = వంగినవాడై, శిరసా = శిరస్సుతో, మహీమ్ = భూమిని, గతః = పొందెను.
తా. తన వెంట వర్షమును కూడ తీసికొని వచ్చిన ఆ ఋశ్యశృంగునికి ఎదురేగి, నమ్రుడై, రోమపాదుడు సాష్టాంగప్రణామ మాచరించెను.
మూ. అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతః సుసమాహితః,
వవ్రే ప్రసాదం విప్రేన్ద్రాన్మా విప్రం మన్యురావిశత్. 30
ప్ర. అ. సుసమాహితః = ఏకాగ్రచిత్తుడై, తస్మె = ఆతనికి, అర్ఘ్యం చ = అర్ఘ్యమును, న్యాయతః = శాస్త్రప్రకారము, ప్రదదౌ = ఇచ్చెను. విపేన్ద్రాత్ = ఆ ఋశ్యశృంగునివలన, ప్రసాదమ్ = అనుగ్రహమును, వవ్రే = కోరెను, విప్రమ్ = ఆ ఋశ్యశృంగుని, మన్యుః = కోపము, మా ఆవిశత్ = ప్రవేశించలేదు, లేదా విప్రమ్ = విభండకమహర్షిని, మన్యుః = కోపము, మావిశత్ = ప్రవేశించకుండుగాక, అని, విపేన్ద్రమ్ = ఋశ్యశృంగుని, ప్రసాదమ్ = అనుగ్రహమును, వవ్రే = కోరెను.
తా. రోమపాదుడు శ్రద్ధాపూర్వకముగ అతనిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను. అతని అనుగ్రహమును కోరెను. ఋశ్యశృంగునకు కోపమేమియు కలుగలేదు. లేదా నిన్ను ఇచటికి తీసికొని వచ్చినందులకు నీ తండ్రికి కోపము రాకుండు నట్లు అనుగ్రహింపు మని వేడెను.
మూ. అన్తఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి,
శాన్తాం శాన్తేన మనసా రాజా హర్షమవాప సః. 31
ప్ర. అ. సః రాజా = ఆ రాజు, అన్తఃపురమ్ = అంతఃపురమును, ప్రవిశ్య = ప్రవేశించి, లేదా పురములోనికి ప్రవేశించి, కన్యామ్ = కన్య యైన, శాన్తామ్ = శాంతను, అస్శై = ఈతనికి, యథావిధి = యథాశాస్త్రముగ, దత్త్వా = ఇచ్చి, శాన్తేన = శాంతమైన, మనసా = మనస్సుతో, హర్షమ్ = ఆనందమును, అవాప = పొందెను.
తా. ఆ రాజు ఋశ్యశృంగునితో పురములో ప్రవేశించి, అతనికి శాంత నిచ్చి యథావిధిగ వివాహము చేసి, మనస్సు కుదుటపడి ఆనందించెను.
మూ. ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే దశమః సర్గః.
ప్ర. అ. సః = ఋశ్యశృంగుడు, ఏవమ్ = ఈ విధముగ, సర్వకామైః = సమస్తభోగములచే, సుపూజితః = బాగుగా పూజింపబడిన వాడై, తత్ర = అచటనే, న్యవసత్ = నివసించెను.
తా. ఈ విధముగ సమస్తభోగములును సమకూర్చి పూజింపబడిన ఋశ్యశృంగుడు ఆ అంగరాజ్యమునందే నివసించెను
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో దశమ సర్గ సమాప్తము.
