Chapter_11

Back
Book Balakandamu
Chapter No 17
Pages 7
Read Time 11 Minutes

Chapter_11

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకాదశః సర్గః

సుమంత్రుని ఉపదేశము ప్రకారము దశరథుడు అంగదేశమునకు వెళ్లి రోమపాదుని ఒప్పించి శాంతాఋష్యశృంగులను అయోధ్యకు తీసికొని వచ్చుట.

మూ. భూయ ఏవ హి రాజేన్ద్ర శృణు మే వచనం హితమ్,

యథా స దేవప్రవరః కథాయామేవమబ్రవీత్. 1

ప్ర. అ. రాజేన్ద్ర = ఓ మహారాజా! సః = ఆ, దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠు డైన సనత్కు మారుడు, యథా = ఏ విధముగా, కథాయామ్ = కథయందు, అబ్రవీత్ = చెప్పెనో, ఏవమ్ = ఈ విధముగ, మే = నాయొక్క, హితమ్ = హిత మైన, వచనమ్ = వచనమును, భూయః ఏవ = మరల, శృణు = వినుము.

తా. మహారాజా! సనత్కుమారుడు కథలో ఇంక ఏమని చెప్పినాడో చెప్పెదను. హితకర మగు ఆ విషయమును వినుము.

మూ. ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః,

నామ్నా దశరథో నామ శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. 2

ప్ర. అ. శ్రీమాన్ = కాంతి కలవాడును, సత్యప్రతిశ్రవః = సత్య మైన ప్రతిజ్ఞ కలవాడును, నామ్నా = పేరుచేత, దశరథో నామ = దశరథు డను ప్రసిద్ధి కలవాడును, సుధార్మికః = గొప్ప ధార్మికుడును అయిన రాజు, ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజుల, కులే = కులమునందు, జాతః భవిష్యతి = పుట్టగలడు.

తా. శ్రీమంతుడును, సత్యప్రతిజ్ఞుడును, పరమధార్మికుడును అగు దశరథు డను పేరు గల రాజు ఇక్ష్వాకువంశములో పుట్టగలడు.

మూ. అఙ్గరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి,

కన్యా చాస్య మహాభాగా శాన్తా నామ భవిష్యతి. 3

ప్ర. అ. తస్య రాజ్ఞః = ఆ రాజునకు, అఙ్గరాజేన = అంగరాజుతో, సఖ్యం చ = స్నేహము కూడ, భవిష్యతి = కాగలదు. అస్య = ఈ అంగరాజుయొక్క, మహాభాగా = పూజ్య మైన భాగ్యము గల, శాన్తా నామ = శాంత యనెడు, కన్యా = కుమార్తె, భవిష్యతి = పుట్టగలదు.

తా. ఆ దశరథునకు అంగరాజుతో స్నేహ మేర్పడును ఆ అంగరాజునకు శాంత యనెడు మహాభాగ్యవతి యగు కుమార్తె పుట్టగలదు.

మూ. పుత్రస్తు సోఽఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుతః,

తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. 4

ప్ర. అ. సః = ఆ, అఙ్గరాజస్య పుత్రస్తు = అంగరాజు పుత్రుడైతే, రోమపాద ఇతి = రోమపాదు డని, శ్రుతః = ప్రసిద్ధుడు (కాగలడు). మహాయశాః = గొప్ప కీర్తి గల, సః = ఆ, దశరథః రాజా = దశరథమహారాజు, తమ్ = ఆ రోమపాదుని గూర్చి, గమిష్యతి = వెళ్లగలడు.

తా. ఆ అంగరాజకుమారుని పేరు రోమపాదుడు. గొప్ప కీర్తి గల ఆ దశరథ మహారాజు అతనివద్దకు వెళ్లగలడు.

వి. పై శ్లోకములో అంగరా జనగా రోమపాదుడు. ఈ శ్లోకములో అంగరా జనగా రోమపాదుని తండ్రి.

మూ. అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాన్తాభర్తా మమ క్రతుమ్,

ఆహరేత త్వయాజ్ఞప్తస్సన్తానార్థం కులస్య చ. 5

ప్ర. అ. ధర్మాత్మన్ = ఓ ధర్మాత్ముడా! అనపత్యః = సంతానములేని వాడనై, అస్మి = ఉన్నాను. శాన్తాభర్తా = శాంతయొక్క భర్త, త్వయా = నీచేత, ఆజ్ఞప్తః = ఆజ్ఞాపింపబడినవాడై, మమ = నాయొక్క, కులస్య = కులముయొక్క, సంతానార్థమ్ = అవిచ్ఛిన్నత్వమునకై, క్రతుమ్ = యజ్ఞమును, ఆహరేత = నిర్వహించుగాక.

తా. ‘‘ఓ ధర్మాత్ముడా! నాకు పుత్రులు కలుగలేదు, అందుచేత ఋశ్యశృంగుని నీవు పంపి, నాకు పుత్రులు కలుగుట ద్వారా నా వంశము అవిచ్ఛిన్నముగ ఉండుటకై క్రతువును చేయుటలో సాహాయ్యము చేయుము.’’

మూ. శ్రుత్వా రాజ్ఞోఽథ తద్వాక్యం మనసా స విచిన్త్య చ,

ప్రదాస్యతే పుత్రవన్తం శాన్తాభర్తారమాత్మవాన్. 6

ప్ర. అ. ఆత్మవాన్ = బుద్ధిశాలి యగు ఆ రోమపాదుడు, రాజ్ఞః = ఆ రాజుయొక్క, తత్ వాక్యమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, అథ = అటుపిమ్మట, మనసా = మనస్సుతో, సంవిచిన్త్య చ = ఆలోచించి, పుత్రవన్తమ్ = పుత్రులు గల, శాన్తాభర్తారమ్ = శాంతయొక్క భర్తను, ప్రదాస్యతే = ఇవ్వగలడు.

తా. రోమపాదుడు దశరథుని మాటలు విని, బాగుగా ఆలోచించి, పుత్రులు గల - అనగా తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహింపగల, ఋష్యశృంగుని పంపగలడు.

మూ. ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వరః,

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాన్తరాత్మనా. 7

ప్ర. అ. సః రాజా = ఆ దశరథమహారాజు, తమ్ = ఆ, విప్రమ్ = బ్రాహ్మణుని, ప్రతిగృహ్య చ = స్వీకరించి (తన వెంటబెట్టుకొని), విగతజ్వరః = తొలగిపోయిన మనోవ్యథ కలవాడై, ప్రహృష్టేన = సంతోషించిన, అన్తరాత్మనా = హృదయముతో, తం యజ్ఞమ్ = ఆ యజ్ఞమును, ఆహరిష్యతి = అనుష్ఠింపగలడు.

తా. దశరథుడు ఋశ్యశృంగుని తోడ్కొని వచ్చి, మనోవ్యథ శాంతింపగా, సంతోషించిన మనస్సుతో యజ్ఞము చేయగలడు.

మూ. తం చ రాజా దశరథో యష్టుకామః కృతాఞ్జలిః,

ఋశ్యశృఙ్గం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్. 8

యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః,

లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాంపతిః. 9

ప్ర. అ. యష్టుకామః = యాగముచేయవలె నను కోరిక కలవాడును, ధర్మవిత్ = ధర్మముల నెరిగినవాడును, నరేశ్వరః = నరులకు ప్రభువును అయిన, దశరథః రాజా = దశరథమహారాజు, కృతాఞ్జలిః = కట్టబడినదోసిలి కలవాడై, ద్విజశ్రేష్ఠమ్ = ద్విజులలో శ్రేష్ఠు డైన, ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని, యజ్ఞార్థమ్ = యజ్ఞముకొరకును, ప్రసవార్థం చ = సంతానముకొరకును, స్వర్గార్థం చ = స్వర్గముకొరకును, వరయిష్యతి = కోరగలడు; సః విశాంపతిః = ఆ రాజు, ద్విజముఖ్యాత్ = ఆ బ్రాహ్మణశ్రేష్ఠునివలన, తం కామమ్ = ఆ కోరికను, లభతే చ = పొందునుకూడ.

తా. ధర్మవేత్త యైన ఆ దశరథుడు, దోసిలి ఒగ్గి ‘‘నాకు సంతానము, స్వర్గము కూడ కలుగు నట్లు యజ్ఞము చేయించు’’ మని ఆ ఋశ్యశృంగుని ప్రార్థించగలడు. ఆ బ్రాహ్మణోత్తమునివలన ఆ కోరికలను పొందగలడు.

మూ. పుత్రాశ్చాస్య భవిష్యన్తి చత్వారోఽమితవిక్రమాః,

వంశ ప్రతిష్ఠానకరా స్సర్వలోకేషు విశ్రుతాః. 10

ప్ర. అ. అస్య = ఈతనికి, అమితవిక్రమాః = అమితమైన పరాక్రమము కలవారును, వంశప్రతిష్ఠానకరాః = వంశమునకు ప్రతిష్ఠ కలిగించువారును, సర్వలోకేషు = సమస్త లోకములందును, విశ్రుతాః = ప్రసిద్ధులును అగు, చత్వారః = నలుగురు, పుత్రాః = పుత్రులు, భవిష్యన్తి = పుట్టగలరు.

తా. ఆ దశరథునికి అమితపరాక్రమము కలవారును, వంశప్రతిష్ఠకు కారణ మైనవారును, సర్వలోకములందు ప్రసిద్ధులును అగు నలుగురు పుత్రులు జనింపగలరు.

మూ. ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్ కథామ్,

సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః. 11

ప్ర. అ. దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠుడును, భగవాన్ = మాహాత్మ్యము కలవాడును, ప్రభుః = సమర్థుడును అగు, సః = ఆ, సనత్కుమారః = సనత్కుమారుడు, పురా = పూర్వమునందు, దేవయుగే = కృతయుగమునందు, కథామ్ = కథను, ఏవమ్ = ఈ విధముగా, కథితవాన్ = చెప్పినాడు.

తా. పూర్వము కృతయుగములో దేవతాశ్రేష్ఠు డైన సనత్కుమారుడు కథను ఈ విధముగా చెప్పెను.

మూ. స త్వం పురుషశార్దూల తమానయ సుసత్కృతమ్,

స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః. 12

ప్ర. అ. పురుషశార్దూల = పురుషశ్రేష్ఠుడ వైన, మహారాజ = ఓ మహారాజా!, సః త్వమ్ = అట్టి నీవు, సబలవాహనః = సైన్యముతోడను వాహనములతోడను కూడినవాడ వై, స్వయమేవ = స్వయముగానే, గత్వా = వెళ్లి, సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన, తమ్ = ఆతనిని, ఆనయ = తీసికొనిరమ్ము.

తా. పురుషశ్రేష్ఠుడ వైన ఓ మహారాజా! నీవే స్వయముగ సైన్యవాహనాదులతో వెళ్లి ఆదరపూర్వకముగా ఋశ్యశృంగుని తీసికొని రమ్ము.

మూ. అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ,

సాన్తఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః. 13

ప్ర. అ. సూతవాక్యమ్ = సుమంత్రుని వాక్యమును, నిశమ్య = విని, వసిష్ఠం చ = వసిష్ఠుని కూడ, అనుమాన్య = అంగీకరింపచేసి, సాన్తఃపురః = అంతఃపురముతో కూడినవాడై, సహామాత్యః = అమాత్యులతో కూడినవాడై, సః ద్విజః = ఆ బ్రాహ్మణుడు, యత్ర = ఎచట నున్నాడో అచటికి, ప్రయయౌ = వెళ్లెను.

తా. దశరథుడు సుమంత్రుని మాటలు విని, వసిష్ఠుని అనుమతి కూడ గైకొని, అంతఃపురామాత్యాదులతో కలిసి ఆ ఋశ్యశృంగుడున్న దేశమునకు వెళ్లెను.

మూ. వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః,

అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుఙ్గవః. 14

ప్ర. అ. శనైః శనైః = మెల్లమెల్లగా, వనాని = వనములను, సరితశ్చైవ = నదులను, వ్యతిక్రమ్య = దాటి, మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు, యత్ర = ఎచట నుండెనో, తం దేశమ్ = ఆ దేశమును, అభిచక్రామ = ప్రవేశించెను.

తా. వనములను, నదులను, మెల్లమెల్లగ దాటుచు, ఆ ఋశ్యశృంగుడున్న దేశమును చేరెను.

మూ. ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్,

ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్. 15

ప్ర. అ. ఆసాద్య = సమీపించి, రోమపాదసమీపగమ్ = రోమపాదుని సమీపమునం దున్నవాడును, దీప్యమానమ్ = ప్రజ్వలించుచున్న, అనలమివ = అగ్ని వలె నున్నవాడును, ద్విజశ్రేష్ఠమ్ = బ్రాహ్మణశ్రేష్ఠుడును అగు, తం ఋషిపుత్రమ్ = ఆ ఋషికుమారుని, ఆదౌ = ముందుగనే, దదర్శ = చూచెను.

తా. ఆ నగరము చేరగనే దశరథుడు, రోమపాదుని సమీపమున ఉన్న ద్విజశ్రేష్ఠు డైన ఋశ్యశృంగుని చూచెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్ని వలె ప్రకాశించుచుండెను.

మూ. తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః,

సఖిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాస్తరాత్మనా. 16

ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రోమపాదుడు, ప్రహృష్టేన = సంతసించిన, అన్తరాత్మనా = హృదయముతో, యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగ, సఖిత్వాత్ = స్నేహితుడగుటవలన, విశేషతః = అధికముగను, తస్య = ఆ, రాజ్ఞః = దశరథునియొక్క, పూజామ్ = పూజను, చక్రే = చేసెను.

తా. దశరథుని రాకచే సంతోషించిన రోమపాదుడు, యథాశాస్త్రముగను, మిత్రు డగుటచే విశేషముగను, దశరథునికి ఆదరసత్కారములు చేసెను.

మూ. రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే,

సఖ్యం సంబన్ధకం చైవ తదా తం ప్రత్యపూజయత్. 17

ప్ర. అ. రోమపాదేన = రోమపాదునిచేత, సఖ్యమ్ = స్నేహము, సంబన్ధకం చైవ = సంబంధము, ధీమతే = బుద్ధిమంతుడైన, ఋషిపుత్రాయ = ఋషికుమారునకు, ఆఖ్యాతమ్ = చెప్పబడినది. తదా = అప్పుడు, తమ్ = ఆ దశరథుని, ప్రత్యపూజయత్ = పూజించెను.

తా. రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహబాంధవ్యములను గూర్చి ఋశ్యశృంగునకు చెప్పగా అతడు దశరథుని పూజించెను.

మూ. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః,

సప్తాష్ట దివసాన్ రాజా రాజానమిదమబ్రవీత్. 18

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, సుసత్కృతః = సత్కరింపబడిన, నరర్షభః = నరశ్రేష్ఠు డైన, రాజా = దశరథుడు, తేన సహ = అతనితో కూడ, సప్తాష్ట = ఏడెనిమిది, దివసాన్ = దినములపాటు, ఉషిత్వా = ఉండి, రాజానమ్ = రోమపాదుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ఈ విధముగ నరశ్రేష్ఠు డగు దశరథుడు రోమపాదుడు చేసిన సత్కారముల నందికొని, ఏడెనిమిది దివసములు అతని అతిథిగా ఉండి, అతనితో ఇట్లనెను.

మూ. శాన్తా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాంపతే,

మదీయనగరం యాతు కార్యం హి మహదుద్యతమ్. 19

ప్ర. అ. విశాంపతే = ప్రజలకు ప్రభు వైన, రాజన్ = రాజా! తవ సుతా = నీ కుమార్తె యైన, శాన్తా = శాంత, సహభర్త్రా = భర్తతో కూడ, మదీయనగరమ్ = నా పట్టణమును గూర్చి, యాతు = వెళ్లుగాక. మహత్ = గొప్ప, కార్యమ్ = పని, ఉద్యతమ్ = ప్రారంభింప నిశ్చయింపబడినది.

తా. ఓ రాజా! నే నొక గొప్ప కార్యము తలపెట్టితిని. నీ కుమార్తె యైన శాంతను, భర్తతో కూడ, నా నగరమునకు పంపుము.

మూ. తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః,

ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా. 20

ప్ర. అ. రాజా = రోమపాదుడు, తథా ఇతి = అటులనే అని, ధీమతః = బుద్ధిశాలియైన, తస్య = ఆ ఋష్యశృంగునియొక్క, గమనమ్ = గమనమును, సంశ్రుత్య = అంగీకరించి, త్వమ్ = నీవు, భార్యయా సహ = భార్యతో కలిసి, గచ్ఛ = వెళ్లుము, అని, విప్రమ్ = బ్రాహ్మణుని గూర్చి, వచనమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. రోమపాదుడు, ధీమంతు డైన ఋశ్యశృంగుని అయోధ్యాగమనమునకు అంగీకరించి ‘‘నీవు భార్యతో అయోధ్యకు వెళ్లుము’’ అని ఋశ్యశృంగునితో పలికెను.

మూ. ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా,

స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా. 21

ప్ర. అ. తదా = అప్పుడు, ఋషిపుత్రః = ఋషికుమారుడు, ప్రతిశ్రుత్య = అంగీకరించి, నృపమ్ = రాజును గూర్చి, తథా ఇతి = ‘‘అటులనే చేసెదను’’ అని, ఆహ = పలికెను. నృపేణ = రాజుచేత, అభ్యనుజ్ఞాతః = ఇవ్వబడిన అనుజ్ఞకలవాడై, భార్యయా సహ = భార్యతో కూడ, ప్రయయౌ = వెళ్లెను.

తా. ఋశ్యశృంగుడు అందులకు అంగీకరించి, అటులనే చేసెద నని పలికి, రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్యాసమేతుడై వెళ్లెను.

మూ. తావన్యోన్యాఞ్జలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా,

ననన్దతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. 22

ప్ర. అ. తౌ = ఆ, దశరథః = దశరథుడును, వీర్యవాన్ = పరాక్రమశాలి యగు, రోమపాదశ్చ = రోమపాదుడును, అన్యోన్యాఞ్జలిమ్ = పరస్పరము దోసిలిని, కృత్వా = చేసి, స్నేహాత్ = స్నేహమువలన, ఉరసా = వక్షస్థలముచే, సంశ్లిష్య = కౌగిలించుకొని, ననన్దతుః = సంతోషించిరి.

తా. దశరథరోమపాదు లిద్దరును ఒకరి కొకరు దోసిలి ఒగ్గి నమస్కారము చేసికొని, వక్షస్థలములు కలియు నట్లు కౌగిలించుకొని, సంతోషించిరి.

మూ. తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునన్దనః,

పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః. 23

ప్ర. అ. తతః = పిమ్మట, రఘునన్దనః = దశరథుడు, సుహృదమ్ = మిత్రుని, ఆపృచ్ఛ్య = వీడ్కొని, ప్రస్థితః = ప్రయాణమైన వాడై, శీఘ్రగామినః = శీఘ్రముగా వెళ్లగలిగిన, దూతాన్ = దూతలను, పౌరేభ్యః = పౌరులకు, ప్రేషయామాస = పంపెను.

తా. మిత్రునివద్ద సెలవు గైకొని బయలుదేరిన దశరథుడు, శీఘ్రముగా వెళ్లగలిగిన దూతలను అయోధ్యాపౌరులకు తమ రాక తెలుపుటకై పంపెను.

మూ. క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలఙ్కృతమ్,

ధూపితం సిక్తసంమృష్టం పతాకాభిరలఙ్కృతమ్. 24

ప్ర. అ. సర్వమ్ = సమస్త మైన, నగరమ్ = నగరము, క్షిప్రమేవ = శీఘ్రముగ, స్వలఙ్కృతమ్ = బాగుగా అలంకరింపబడినదిగాను, ధూపితమ్ = ధూపము వేయబడినదిగాను, సిక్తసంమృష్టమ్ = తడిపి తుడవబడినదిగాను, పతాకాభిః = జెండాలచేత, అలఙ్కృతమ్ = అలంకరింపబడినదిగాను, క్రియతామ్ = చేయబడుగాక.

తా. దశరథుడు అయోధ్యాపౌరుల కీ విధముగ కబురు పంపెను. ‘‘నగరము నంతను వెంటనే చక్కగా అలంకరింపుడు. ధూపసుగంధములను వ్యాపింపచేయుడు. మార్గములు తుడిచి నీళ్లు చల్లుడు. పతాకలు ఎగురవేయుడు.’’

మూ. తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్,

తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం యథా. 25

ప్ర. అ. తతః = పిమ్మట, తే పౌరాః = ఆ పౌరులు, రాజానమ్ = రాజును, ఆగతమ్ = వచ్చిన వానినిగా, శ్రుత్వా = విని, ప్రహృష్టాః = సంతసించినవారై, రాజ్ఞా = రాజుచేత, యత్ = ఏది, యథా = ఎట్లు, ప్రేషితమ్ = పంపబడెనో, తత్ = దానిని, సర్వమ్ = అంతను, తథా = అట్లు, ప్రచక్రుః = చేసిరి.

తా. రాజు వచ్చుచున్నట్లు వినిన పౌరులు చాల సంతసించి, ఆయన ఆజ్ఞాపించిన విధమున నగరాలంకారములు చేసిరి.

మూ. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ,

శఙ్ఖదున్దుభినిర్ఘోషైః పురస్కత్య ద్విజర్షభమ్. 26

ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = దశరథుడు, ద్విజర్షభమ్ = ఆ బ్రాహ్మణశ్రేష్ఠుని, పురస్కత్య = ఎదుట ఉంచుకొని, స్వలంకృతమ్ = బాగుగా అలంకరింపబడిన, తత్ = ఆ, నగరమ్ = నగరమును, శఙ్ఖదున్దుభినిర్ఘోషైః = శంఖదుందుభుల ధ్వనులతో, ప్రవివేశ హ = ప్రవేశించెను.

తా. దశరథుడు ఆ ఋష్యశృంగుని ఎదుట ఉంచుకొని, చక్కగ అలంకరింపబడిన అయోధ్యానగరమును శంఖదుందుభిమంగళధ్వనులతో ప్రవేశించెను.

మూ. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్,

ప్రవేశ్యమానం సత్కృత్య నరేన్ద్రేణేన్ద్రకర్మణా. 27

ప్ర. అ. తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, నాగరాః = పౌరులు, ఇన్ద్రకర్మణా = ఇంద్రుని వంటి కర్మ గల, నరేన్ద్రేణ = రాజుచేత, సత్కృత్య = సత్కరించి, ప్రవేశ్యమానమ్ = ప్రవేశ పెట్టబడుచున్న, తమ్ = ఆ, ద్విజమ్ = బ్రాహ్మణుని, దృష్ట్వా = చూచి, ప్రముదితాః = సంతోషించిరి.

తా. దేవేంద్రునితో సమాను డైన ఆ నరేంద్రునిచే సత్కృతుడై అయోధ్యలో ప్రవేశించుచున్న ఋష్యశృంగుని చూచి పౌరు లెల్లరు సంతోషించిరి.

మూ. అన్తఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః,

కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. 28

ప్ర. అ. ఏనమ్ = ఋశ్యశృంగుని, అన్తఃపురం ప్రవేశ్య = అంతఃపురములో ప్రవేశపెట్టి, శాస్త్రతః = శాస్త్రానుసారముగా, పూజాం చ = పూజను, కృత్వా = చేసి, తదా = అప్పుడు, తస్య = అతనియొక్క (ని), ఉపవాహనాత్ = తీసికొని వచ్చుటవలన, ఆత్మానమ్ = తనను, కృతకృత్యమ్ = కృతకృత్యునిగా, మేనే = తలచెను.

తా. దశరథు డా ఋశ్యశృంగుని అంతఃపురములోనికి తీసికొని వెళ్లి, యథాశాస్త్రముగ పూజించెను. ఆతనిని తీసికొనివచ్చుటచే, తన కర్తవ్యము పూర్తి యైనట్లు సంతసించెను.

మూ. అన్తఃపురస్త్రియః సర్వాః శాన్తాం దృష్ట్వా తథాగతామ్,

సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానన్దముపాగమన్. 29

ప్ర. అ. అన్తఃపురస్త్రియః = అంతఃపురములోని స్త్రీలు, సర్వాః = అందరును, తథా = ఆ విధముగా, భర్త్రా సహ = భర్తతో కూడ, ఆగతామ్ = వచ్చిన, విశాలాక్షీమ్ = విశాలమైన నేత్రములు గల, శాన్తామ్ = శాంతను, దృష్ట్వా = చూచి, ప్రీత్యా = ప్రేమతో, ఆనన్దమ్ = ఆనందమును, ఉపాగమన్ = పొందిరి.

తా. భర్తతో కలిసి వచ్చిన, విశాలాక్షి యైన శాంతను చూచి, అంతఃపుర స్త్రీ లందరును ప్రేమతో ఆనందభరిత లైరి.

మూ. పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః,

ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా. 30

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకాదశః సర్గః.

ప్ర. అ. సా = ఆమె, తాభిః = వారిచేతను, విశేషతః = విశేషముగా, రాజ్ఞా చైవ = రాజుచేతను, పూజ్యమానా = పూజింపబడుచున్నదై, సుఖితా = సుఖవంతురాలై, ఋత్విజా సహ = ఋత్విక్కుతో కూడ, కంచిత్కాలమ్ = కొంతకాలము, తత్ర = అచట, ఉవాస = నివసించెను.

తా. అంతఃపురస్త్రీలును, విశేషముగ దశరథుడును, ఆదరింపగా, ఆ శాంత ఋశ్యశృంగునితో, సుఖముగ కొంతకాలము అయోధ్యలో ఉండెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో ఏకాదశసర్గ సమాప్తము.

© 2026 Ebook Library