| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 18 |
| Pages | 3 |
| Read Time | 5 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ద్వాదశః సర్గః
యాగము చేయింపు డని దశరథుడు ఋషులను కోరుట. తగు సంభారములను సమకూర్పు మని ఋషులు ఆతనితో చెప్పుట. దశరథుడు తన అమాత్యులను అందులకై ఆదేశించుట.
మూ. తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే,
వసన్తే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోఽభవత్. 1
ప్ర. అ. తతః = పిమ్మట, బహుతిథే కాలే = చాలాకాలము గడచినదగుచుండగా, సుమనోహరే = బాగుగా మనోహర మైన, కస్మింశ్చిత్ = ఒకానొక, వసన్తే = వసంతము, సమనుప్రాప్తే = వచ్చినదగుచుండగా, రాజ్ఞః = రాజునకు, యష్టుమ్ = యాగముచేయుటకు, మనః అభవత్ = కోరిక కలిగెను.
తా. ఈ విధముగ చాలకాలము గడచిన పిదప, ఒక మనోహర మగు వసంత ఋతువు వచ్చెను. అపుడు యజ్ఞము చేయవలె నని దశరథునకు అభిలాష కలిగెను.
మూ. తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్,
యజ్ఞాయ వరయామాస సన్తానార్థం కులస్య వై. 2
ప్ర. అ. తతః = పిమ్మట, దేవవర్ణినమ్ = దేవతుల్యు డైన, తం విప్రమ్ = ఆ బ్రాహ్మణుని, శిరసా = శిరస్సు వంచి నమస్కరించుటచే, ప్రసాద్య = అనుగ్రహింపచేసికొని, కులస్య = కులముయొక్క, సన్తానార్థమ్ = అవిచ్ఛిన్నత్వముకొరకు, అనగా పుత్రపౌత్రాదిపారంపర్యసిద్ధికొరకు, యజ్ఞాయ = యజ్ఞము చేయించుటకై, వరయామాస = వరించెను.
తా. అంతట దశరథుడు దేవతుల్యు డైన ఋష్యశృంగునికి నమస్కరించి, అనుగ్రహింపచేసుకొని, ‘‘నా వంశము పుత్రపౌత్రాద్యభివృద్ధితో అవిచ్ఛిన్నముగా ఉండునట్లు యజ్ఞము చేయింపుము’’ అని పలికి, అతనిని ఋత్విక్కుగా వరించెను.
మూ. తథేతి చ స రాజానమువాచ చ సుసత్కృతః,
సంభారాః సంభ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్. 3
ప్ర. అ. సుసత్కృతః = బాగుగా సత్కరింపబడిన, సః = ఋశ్యశృంగుడు, తథేతి = అటులనే చేయించెదను అని, రాజానమ్ = రాజును గూర్చి, ఉవాచ = పలికెను. సంభారాః = సంభారములు, సంభ్రియన్తామ్ = ఏర్పరుపబడుగాక, తే = నీయొక్క, తురగః = అశ్వము, విముచ్యతాం చ = విడువబడుగాక.
తా. బాగుగా ఆదరింపబడిన ఋష్యశృంగుడు ‘‘అటులనే చేయించెదను; యజ్ఞ సంభారము లన్నియు ప్రోగు చేయించుము. యజ్ఞాశ్వమును విడువుము’’ అని పలికెను.
మూ. తతో రాజాబ్రవీద్వాక్యం సుమన్త్రం మన్త్రిసత్తమమ్,
సుమన్త్రావాహయ క్షిప్రం ఋత్విజో బ్రహ్మవాదినః. 4
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్,
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః. 5
ప్ర. అ. తతః = అటుపిమ్మట, రాజా = రాజు, మన్త్రిసత్తమమ్ = మంత్రిశ్రేష్ఠుడైన, సుమన్త్రమ్ = సుమంత్రుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. సుమన్త్ర = ఓ సుమంత్రుడా! క్షిప్రమ్ = శీఘ్రముగా, బ్రహ్మవాదినః = వేదవిదులైన, ఋత్విజః = ఋత్విక్కులను, సుయజ్ఞమ్ = సుయజ్ఞుని, వామదేవం చ = వామదేవుని, జాబాలిమ్ = జాబాలిని, అథ = మరియు, కాశ్యపమ్ = కాశ్యపుని, పురోహితమ్ = పురోహితుడైన, వసిష్ఠం చ = వసిష్ఠుని, యే = ఏ, అన్యే = ఇతరులైన, ద్విజోత్తమాః = బ్రాహ్మణోత్తములు గలరో వారిని, ఆవాహయ = రప్పింపుము.
తా. అంత దశరథుడు మంత్రిశ్రేష్ఠు డైన సుమంత్రునితో - ‘‘సుమంత్రా! బ్రహ్మవాదు లైన ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగువారిని, పురోహితుడైన వసిష్ఠుని, ఇతరు లైన బ్రాహ్మణోత్తములను శీఘ్రముగా రప్పింపుము’’ అని పలికెను.
మూ. తతః సుమన్త్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః,
సమానయత్స తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్. 6
చూ. శ్లో. 6. సర్గ 8. (సుమంత్రుడు వారి నందరిని తీసికొనివచ్చెను).
మూ. తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా,
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. 7
మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్,
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. 8
చూ. శ్లో. 7, 8. సర్గ 8. (దశరథుడు వారిని పూజించి ‘‘సంతానముకొరకై అశ్వమేధము చేయగోరు చున్నాను’’ అని పలికెను.)
మూ. తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా,
ఋషిపుత్రప్రభావేన కామాన్ ప్రాప్స్యామి చాప్యహమ్. 9
ప్ర. అ. తత్ = ఆ కారణమువలన, శాస్త్రదృష్టేన = శాస్త్రవిహిత మైన, కర్మణా = విధానముచే, యష్టుమ్ ఇచ్ఛామి = యాగము చేయవలె నని కోరుచున్నాను. ఋషిపుత్రప్రభావేన = ఋషికుమారుని ప్రభావముచే, అహమ్ = నేను, కామాన్ = కోరికలను, ప్రాప్స్యామి చ = పొందగలను కూడ.
తా. అందుచే యథావిధిగ యాగము చేయగోరుచున్నాను. ఋశ్యశృంగుని ప్రభావముచే నా కోరికలు తీరును.
మూ. తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్,
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్. 10
చూ. శ్లో. 10, సర్గ 8.
మూ. ఋష్యశృఙ్గపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా,
సంభారాః సంభ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్. 11
ప్ర. అ. ఋశ్యశృఙ్గపురోగాః = ఋష్యశృంగుడు మొదలైనవారు, తదా = అప్పుడు, నృపతిమ్ = రాజును గూర్చి, ప్రత్యూచుః = పలికిరి. సంభారాః = యజ్ఞసంభారములు, సంభ్రియన్తామ్ = సమకూర్చబడుగాక. తే = నీయొక్క, తురగః = అశ్వము, విముచ్యతాం చ = విడువబడుగాక.
తా. ఋశ్యశృంగాదులు రాజుతో ఇట్లనిరి - ‘‘యజ్ఞసంభారములను సమకూర్చుము. అశ్వమును విడువుము.’’
మూ. సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చత్వారోఽమితవిక్రమాన్,
యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా. 12
ప్ర. అ. యస్య తే = ఏ నీకు, పుత్రార్థమ్ = పుత్రులకొరకై, ఇయమ్ = ఈ, ధార్మికీ బుద్ధిః = ధర్మసంమత మైన బుద్ధి, ఆగతా = కలిగినదో, అట్టి నీవు సర్వథా = తప్పక, అమితవిక్రమాన్ = అనంతపరాక్రమవంతు లైన, చత్వారః = నలుగురు, పుత్రాన్ = పుత్రులను, ప్రాప్స్యసే = పొందగలవు.
తా. నీకు పుత్రులకొరకై ధర్మసంమత మైన బుద్ధి జనించినందులకు, నీకు తప్పక అనంతపరాక్రమవంతు లగు నలుగురు పుత్రులు జనింపగలరు.
మూ. తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వా తద్ద్విజభాషితమ్,
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్. 13
ప్ర. అ. చూ. శ్లో. 13, సర్గ 8. (హర్షేణ = సంతోషముతో, శుభాక్షరమ్ = మంచి అక్షరములు గల, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్), ఈ మాటలకు సంతసించిన దశరథుడు అమాత్యులతో ఇట్లు పలికెను.
మూ. గురూణాం వచనాచ్ఛీఘ్రం సంభారాః సంభ్రియన్తు మే,
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్. 14
చూ. శ్లో. 14, సర్గ 8.
మూ. సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్,
శాన్తయశ్చాభివర్ధన్తాం యథాకల్పం యథావిధి. 15
శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా,
నాపరోధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే. 16
ఛిద్రం హి మృగయన్తేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః,
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. 17
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే,
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ. 18
చూ. శ్లో. 15, 16, 17, 18. సర్గ 8.
మూ. తథేతి చ తతః సర్వే మన్త్రిణః ప్రత్యపూజయన్,
పార్థివేన్ద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత. 19
ప్ర. అ. తతః = పిమ్మట, మన్త్రిణః = మంత్రులు, సర్వే = అందరును, పార్థివేన్ద్రస్య = రాజశ్రేష్ఠునియొక్క, తత్ వాక్యమ్ = ఆ వాక్యమును, తథేతి = అటులనే చేయగలము అని, ప్రత్యపూజయన్ = అభినందించిరి. యథాజ్ఞప్తమ్ = ఆజ్ఞాపించిన ప్రకారము, అకుర్వత = చేసిరి.
తా. మంత్రు లందరును దశరథుని మాటలను అభినందించి, అతడు ఆజ్ఞాపించిన విధముగ చేసిరి.
మూ. తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్ పార్థివర్షభమ్,
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతమ్. 20
ప్ర. అ. తతః = పిమ్మట, తే ద్విజాః = ఆ బ్రాహ్మణులు, ధర్మజ్ఞమ్ = ధర్మము నెరిగిన, పార్థివర్షభమ్ = రాజశ్రేష్ఠుని, అస్తువన్ = స్తుతించిరి. అనుజ్ఞాతాః = ఆనుజ్ఞ ఈయబడినవారై, తతః = అచటనుండి, పునః = మరల, యథాగతమ్ = వచ్చిన విధముననే, జగ్ముః = వెళ్లిరి.
తా. పిమ్మట ఆ బ్రాహ్మణులు ధర్మజ్ఞు డైన దశరథుని కొనియాడి, ఆతని అనుజ్ఞ గైకొని స్వస్థానములకు తిరిగి వెళ్లిరి.
మూ. గతేష్వథ ద్విజాగ్య్రేషు మన్త్రిణస్తాన్నరాధిపః,
విసర్జయిత్వా వేశ్మ స్వం ప్రవివేశ మహాద్యుతిః. 21
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్వాదశః సర్గః.
ప్ర. అ. అథ = అటు పిమ్మట, ద్విజాగ్య్రేషు = బ్రాహ్మణశ్రేష్ఠులు, గతేషు సత్సు = వెళ్లినవా రగుచుండగా, మహాద్యుతిః = గొప్ప కాంతి గల, నరాధిపః = రాజు, తాన్ మన్త్రిణః = ఆ మంత్రులను, విసర్జయిత్వా = పంపివేసి, స్వం వేశ్మ = తన గృహమును, ప్రవివేశ = ప్రవేశించెను.
తా. బ్రాహ్మణులు వెడలిపోయిన పిమ్మట, తేజశ్శాలి యగు దశరథుడు మంత్రులను కూడ పంపివేసి తన గృహమును ప్రవేశించెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో పండ్రెండవసర్గ సమాప్తము.
