Chapter_13

Back
Book Balakandamu
Chapter No 19
Pages 10
Read Time 14 Minutes

Chapter_13

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ త్రయోదశః సర్గః

దశరథుడు యాగము ప్రారంభింపచేయు మని వసిష్ఠుని కోరుట. అందులకై సేవకులను ఆజ్ఞాపించుట. వివిధదేశరాజుల నాహ్వానించుటకై వసిష్ఠుడు సుమంత్రుని ఆజ్ఞాపించుట. వచ్చిన రాజులకు ఆదర సత్కారములు చేయుట. పత్నీసమేతు డైన దశరథుడు యజ్ఞదీక్ష గ్రహించుట.

మూ. పునః ప్రాప్తే వసన్తే తు పూర్ణస్సంవత్సరోఽభవత్,

ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్. 1

ప్ర. అ. పునః = మరల, వసన్తే = వసంతర్తువు, ప్రాప్తే సతి = వచ్చినదగుచుండగా, సంవత్సరః = సంవత్సరము, పూర్ణః అభవత్ = నిండెను. వీర్యవాన్ = పరాక్రమవంతుడైన దశరథుడు, ప్రసవార్థమ్ = సంతానము కొరకు, హయమేధేన = అశ్వమేధముచే, యష్టుమ్ = దేవతల పూజ చేయుటకు, గతః = యజ్ఞశాలలో ప్రవేశించెను.

తా. సంవత్సరము పూర్తియై తిరిగి వసంతఋతువు వచ్చినది. దశరథుడు సంతానము కొరకై అశ్వమేధయాగము చేయు సంకల్పముతో యజ్ఞశాలలో ప్రవేశించెను.

వి.మొదటి వసంతఋతువునందు, చిత్రాపూర్ణిమయందు సాంగ్రహణేష్టి చేసి, ప్రతిపత్తునందు బ్రహ్మౌదన మేధ్యాశ్వబంధన స్నాపన ప్రోక్షణ విమోచనాదులు చేయవలెను. అట్లు చేసి నలుగురు ఋత్విక్కులు సిద్ధముగా ఉండవలెనుఅని శ్రౌతసూత్రములో చెప్పిన విధముగ ‘‘సావిత్రమష్టాకపాలం ప్రాతర్నిర్వపతి’’ అనునియమము ననుసరించి ప్రతిదినము సావిత్రాదికర్మములు చేయుచుండవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము పూర్తి యైన తరువాత మరల ప్రధానదీక్ష ప్రారంభ మగును.

మూ. అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రతిపూజ్య చ,

అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్. 2

ప్ర. అ. ద్విజోత్తమమ్ = బ్రాహ్మణశ్రేష్ఠుడైన, వసిష్ఠమ్ = వసిష్ఠుని, అభివాద్య = నమస్కరించి, న్యాయతః = శాస్త్రానుసారముగా, ప్రతిపూజ్య చ = పూజించి, ప్రసవార్థమ్ = సంతానముకొరకు, ప్రశ్రితమ్ = వినయముతో కూడిన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. దశరథుడు బ్రాహ్మణశ్రేష్ఠు డైన వసిష్ఠుని నమస్కరించి, యథాశాస్త్రముగ పూజించి, పుత్రార్థియై, వినయపూర్వకముగ ఇట్లు పలికెను.

మూ. యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుఙ్గవ,

యథా న విఘ్నః క్రియతే యజ్ఞాఙ్గేషు విధీయతామ్. 3

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడ వైన, బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా!, మే = నాయొక్క, యజ్ఞః = యజ్ఞము, యథోక్తమ్ = శాస్త్రోక్తరీతిగా, క్రియతామ్ = చేయబడుగాక. యజ్ఞాఙ్గేషు = యజ్ఞముయొక్క అంగములయందు, విఘ్నః = విఘ్నము, యథా = ఏ విధముగ, న క్రియతే = చేయబడదో, ఆ విధముగ, విధీయతామ్ = చేయబడుగాక.

తా. ఓ మునిసత్తమా! నా యజ్ఞము యథాశాస్త్రముగ జరుగునట్లును యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నములు కలుగ కుండునట్లును చూడుము.

మూ. భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మతః,

వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. 4

ప్ర. అ. భవాన్ = నీవు, మహ్యమ్ = నాకు, స్నిగ్ధః = స్నేహము గల, సుహృత్ = మిత్రుడవు. పరమః = గొప్పవాడును, మహాన్ = పూజ్యుడును అగు, గురుః = పురోహితుడవు. యజ్ఞస్య = ఈ యజ్ఞముయొక్క, ఉద్యతః = ప్రారంభింపబడిన, భారః = భారము, భవతైవ = నీచేతనే, వోఢవ్యః = వహింపదగినది.

తా. నీవు నా విషయమున స్నేహము గల మిత్రుడవు; పూజ్యుడవైన ఉత్తమ పురోహితుడవు; ప్రారంభింపబడిన ఈ యజ్ఞకార్యభారమును నీవే వహింపవలెను.

మూ. తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః,

కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్. 5

ప్ర. అ. ద్విజసత్తమః = బ్రాహ్మణోత్తముడైన, సః = ఆ వసిష్ఠుడు, భవతా = నీచేత, యత్ = ఏది, సమర్థితమ్ = ప్రార్థింపబడినచో, లేదా నిర్ణయింపబడినచో, ఏతత్ = దీనిని, సర్వమ్ = సమస్తమును, తథా = ఆ విధముగనే, కరిష్యే = చేయగలను, ఇతి = అని, రాజానమ్ = రాజును గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. అంతయు నీవు కోరి నట్లే చేసెదను అని ఆ బ్రాహ్మణోత్తముడు దశరథునితో పలికెను.

మూ. తతోఽబ్రవీద్ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్,

స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్. 6

కర్మాన్తికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి,

గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. 7

తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్,

యజ్ఞకర్మ సమీహన్తాం భవన్తో రాజశాసనాత్. 8

ఇష్టకా బహుసాహస్రీ శీఘ్రమానీయతామితి,

ఔపకార్యాః క్రియన్తాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః. 9

ప్ర. అ. తతః = పిమ్మట, యజ్ఞకర్మసు = యజ్ఞమునకు సంబంధించిన పనులందు, నిష్ఠితాన్ = సమర్థులైన, వృద్ధాన్ = వృద్ధులైన, ద్విజాన్ = బ్రాహ్మణులను, వృద్ధాన్ = వృద్ధులును, పరమధార్మికాన్ = చాలధార్మికులును అయి, స్థాపత్యే = వాస్తుకర్మయందు, నిష్ఠితాంశ్చైవ = సమర్థులను, కర్మాన్తికాన్ = కార్యనిర్వాహకులను, శిల్పకరాన్ = ఇటికలు మొదలైనవి నిర్మించువారిని, వర్ధకీన్ = వడ్రంగులను, ఖనకానపి = త్రవ్వువారిని, గణకాన్ = లెక్కలు కట్టువారిని, శిల్పినశ్చైవ = చిత్రాదులను నిర్మించు శిల్పులను, తథైవ = మరియు, నటనర్తకాన్ = నటులను, నర్తకులను (రసము నభినయించువారు నటులు, భావము లభినయించువారు నర్తకులు), తథా = మరియు, శుచీన్ = పరిశుద్ధమైన చరిత్రగల, శాస్త్రవిదః = శాస్త్రవేత్తలను, సుబహుశ్రుతాన్ = చాల విషయములను విని తెలిసికొనిన, పురుషాన్ = పురుషులను గూర్చి, భవన్తః = మీరు, రాజశాసనాత్ = రాజాజ్ఞవలన, యజ్ఞకర్మ = యజ్ఞమునకు కర్మను, సమీహన్తామ్ = చేయుటకు నిర్ణయింతురుగాక. బహుసాహస్రీ = అనేకసహస్రముల సంఖ్యలో ఉన్న, ఇష్టకా = ఇటుక, శీఘ్రమ్ = శీఘ్రముగా, ఆనీయతామ్ = తీసికొని రాబడుగాక. రాజ్ఞామ్ = రాజులకు, బహుగుణాన్వితాః = అనేకగుణములతో కూడిన, ఔపకార్యాః = తాత్కాలికనివాసభవనములు, క్రియన్తామ్ = చేయబడుగాక, అని, అబ్రవీత్ = పలికెను.

తా. పిమ్మట వసిష్ఠుడు యజ్ఞకర్మలయందు ఆరితేరిన వృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుకర్మయందు ప్రజ్ఞ గల పరమధార్మికు లైన వృద్ధులను, వివిధకర్మచారులను, ఇటికలు మొదలగువాటిని నిర్మించు శిల్పకారులను, వడ్రంగులను, త్రవ్వువారిని, లెక్కలు కట్టువారిని, చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను, నటులను, నర్తకులను, పరిశుద్ధ మైన చరిత్ర గల శాస్త్రవేత్తలను అనేకవిషయముల అనుభవము గల పురుషులను, పిలిపించి ఇట్లాజ్ఞాపించెను. ‘‘మీరందరును రాజాజ్ఞానుసారముగా యజ్ఞమునకు సంబంధించిన పనులు చేయుటకు పూనుకొనుడు. అనేక సహస్రముల ఇటికను తెప్పింపుడు. అతిథులుగా రాబోవు రాజుల నివాసమునకై వివిధవస్తుసామగ్రితో కూడిన తాత్కాలికభవనములను నిర్మింపుడు.’’

మూ. బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః,

భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః. 10

ప్ర. అ. శుభాః = మంగళకర మైనవియు, బహుభిః = అనేకమైన భక్ష్యాన్నపానైః = భక్ష్యములతోడను, పానీయములతోడను; సముపేతాః = కూడినవియు, సునిష్ఠితాః = చక్కగ నెలకొల్పబడినవియు అగు, బ్రాహ్మణావసథాః చైవః = బ్రాహ్మణుల కొర కైన గృహముల కూడ, శతశః = వందలకొలది, కర్తవ్యాః = నిర్మింపదగినవి.

తా. ‘‘బ్రాహ్మణుల నివాసముకొరకై వందలకొలది అందమైన గృహములను నిర్మించి, అనేకవిధముల భక్ష్య - అన్న - పానాదులను సమకూర్చుడు.’’

మూ. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః,

ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః. 11

ప్ర. అ. తథా = అట్లే, పౌరజనస్యాపి = పౌరజనులకొరకై, బహువిస్తరాః = చాల వైశాల్యము గలవియు, బహుభక్ష్యాః = అనేకము లైన భక్ష్యములు కలవియు, సర్వకామైః = సమస్త భోగ్యవస్తువులతో, ఉపస్థితాః = కూడిన, ఆవాసాః = నివాసగృహములు, కర్తవ్యాః = చేయదగినవి.

తా. ‘‘పౌరజనులకొరకు గూడ, అతివిశాలములును, వివిధభక్ష్యభోగాదులతో కూడినవియు అగు నివాస గృహములను నిర్మింపుడు.’’

మూ. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్,

దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా. 12

ప్ర. అ. తథా = అట్లే, జానపదస్య = గ్రామములకు సంబంధించిన, జనస్యాపి = జనులకు కూడ, బహుశోభనమ్ = చాల మంచిదైన, అన్నమ్ = అన్నము, విధివత్ = యథోచితముగ, సత్కృత్య = సత్కరించి, దాతవ్యమ్ = ఇవ్వదగినది. లీలయా తు = అనాదరముతో మాత్రము, న = కాదు.

తా. ‘‘అట్లే గ్రామములనుండి వచ్చిన జనులను యథోచితరీతిని సత్కరించి, వారికి మంచి ఆహారమును ఇవ్వవలెను. ఆనాదరముగా ఇవ్వకూడదు.’’

మూ. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతాః,

న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. 13

ప్ర. అ. సర్వే = అన్ని, వర్ణాః = వర్ణములవారును, సుసత్కృతాః = బాగుగా సత్కరింపబడినవారై, యథా = ఏ విధముగా, పూజామ్ = పూజను, ప్రాప్నువన్తి = పొందెదరో, అట్లు చేయవలెను. కామక్రోధవశాదపి = కామమువలన గాని క్రోధమువలన గాని, అవజ్ఞా = అనాదరము, న ప్రయోక్తవ్యా = చేయదగినది కాదు.

తా. ‘‘అన్ని వర్ణములవారును బాగుగా సత్కరింపబడినవారై పూజ లందుకొను నట్లు చూడవలెను. వారిలో ఎవరైన కామక్రోధాదులను చూపినను వారిని అవమానింపరాదు.’’

మూ. యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా,

తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్,

తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ. 14

ప్ర. అ. యే పురుషాః = ఏ పురుషులును, తథా = మరియు, శిల్పినః = శిల్పులును, యజ్ఞకర్మసు = యజ్ఞకర్మలయందు, వ్యగ్రాః = నిమగ్నులై యుందురో, తేషామపి = వారికి కూడ, విశేషేణ = ప్రధానముగ, యథాక్రమమ్ = క్రమానుసారముగ, అనగా యథోచితముగ, పూజా = పూజ, కార్యా = చేయదగినది, తే సర్వే = వారందరును, వసుభిః = ధనములచేతను, భోజనేన చ = భోజనముచేతను, సంభృతాః = నింపబడినవారు, స్యుః = అగుదురుగాక.

తా. ‘‘యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వహించుచున్న పురుషులను, శిల్పులను విశేషరీతిని, వారి వారి అర్హతల ననుసరించి సత్కరింపవలెను. వారికి వలసి నంత ధనము నిచ్చి భోజనము పెట్టవలెను.’’

మూ. యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే,

తథా భవన్తః కుర్వన్తు ప్రీతిస్నిగ్ధేన చేతసా. 15

ప్ర. అ. సర్వమ్ = అంతయు, యథా = ఎట్లు, సువిహితమ్ = చక్కగా నిర్వహింపబడినది అగునో, కించిత్ = ఏమియు, న పరిహీయతే = విడువబడదో, తథా = ఆ విధముగ, భవన్తః = మీరు, ప్రీతిస్నిగ్ధేన = ప్రేమతో ఆర్ద్ర మైన, చేతసా = చిత్తముతో, కుర్వన్తు = చేయుదురుగాక.

తా. అన్ని పనులును సరిగా జరుగు నట్లును, ఏమియు లోటు రానట్లును, మీరు, ప్రేమార్ద్ర మైన మనస్సుతో, ఏర్పరుపవలెను.

మూ. తతః సర్వే సమాగమ్య వసిష్ఠ మిదమబ్రువన్, 16

యథోక్తం తత్సువిహితం న కించి త్పరిహీయతే,

యథోక్తం తత్కరిష్యామో న కించిత్ పరిహాస్యతే. 17

ప్ర. అ. తతః = పిమ్మట, సర్వే = అందరును, సమాగమ్య = వచ్చి, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రువన్ = పలికిరి, యథా ఏ విధముగా, ఉక్తమ్ = చెప్పబడినదో, తత్ = అది, ఆ విధముగ, సువిహితమ్ = బాగుగా ఏర్పరుపబడినది. కించిత్ = ఏదియు, న పరిహీయతే = విడువబడుటలేదు, యథోక్తమ్ = ఏ విధముగా చెప్పబడినదో, తత్ = దానిని, ఆ విధముగ, కరిష్యామః = చేయగలము, కించిత్ = ఏమియు, న పరిహాస్యతే = విడువబడదు.

తా. పిమ్మట వారందరును వచ్చి వసిష్ఠునితో ఇట్లు చెప్పిరి. ‘‘తాము చెప్పిన విధమున గృహనిర్మాణాదికము జరుగుచున్నది. ఏ లోటును లేదు. తాము చెప్పిన విధమున అన్నదానాదికము కూడ ఏ లోటును లేకుండ, చేయగలము.’’

మూ. తతః సుమన్త్రమానీయ వసిష్ఠో వాక్యమబ్రవీత్,

నిమన్త్రయస్వ నృపతీన్ పృథివ్యాం యే చ ధార్మికాః. 18

ప్ర. అ. తతః = పిమ్మట, వసిష్ఠః = వసిష్ఠుడు, సుమన్త్రమ్ = సుమంత్రుని, ఆనీయ = పిలిపించి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను, పృథివ్యామ్ = భూమియందు, ధార్మికాః = ధార్మికు లైన, యే = ఏ రాజు లున్నారో, అట్టి, నృపతీన్ = రాజులను, నిమన్త్రయస్వ = ఆహ్వానించుము.

తా. పిదప వసిష్ఠుడు సుమంత్రుని పిలిపించి ఇట్లు చెప్పెను. ‘‘ఈ భూమండలములో నున్న ధార్మికు లైన రాజుల నందరిని ఆహ్వానింపుము.’’

మూ. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః,

సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్. 19

ప్ర. అ. సర్వదేశేషు = సమస్త దేశములందు ఉన్న, మానవాన్ = మానవులను, బ్రహ్మణాన్ = బ్రహ్మణులను, క్షత్రియాన్ = క్షత్రియులను,వైశ్యాన్ = వైశ్యులను, శూద్రాంశ్చెవ = శూద్రులను, సహస్రశః = వేలకొలది, సత్కృత్య = సత్కరించి, సమాసయస్వ = తీసికొనిరమ్ము.

తా. ‘‘మన రాజ్యములోనివారినే కాక, సమస్తదేశములలో ఉన్న వేలకొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కూడ గౌరవపూర్వకముగా తీసికొని రమ్ము.’’

మూ. మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్,

నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్. 20

తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్,

పూర్వసంబన్ధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే. 21

ప్ర. అ. మిథిలాధిపతిమ్ః = మిథిలకు ప్రభువును, శూరమ్ = శూరుడును, సత్యవిక్రమమ్ = యథార్థ మైన పరాక్రమము కలవాడును, సర్వశాస్త్రేషు = సకలశాస్త్రములందును, నిష్ఠితమ్ = సమర్థుడును, తథా = మరియు, వేదేషు = వేదములందు, నిష్ఠితమ్ = సమర్థుడును, మహాభాగమ్ = గొప్ప భాగ్యము కలవాడును అగు, తం జనకమ్ = ఆ జనకమహారాజును, పూర్వసంబన్ధినమ్ = పూర్వసంబంధము కలవానినిగా, జ్ఞాత్వా = తెలుసుకొని, సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన వానినిగా చేసి, స్వయమేవ = స్వయముగనే, ఆనయ = తీసుకొని రమ్ము. తతః = ఆ కారణమువలననే, పూర్వమ్ = ముందుగా, తే = నీకు, బ్రవీమి = చెప్పుచున్నాను.

తా. ‘‘శూరుడును, సత్యపరాక్రమవంతుడును, సర్వవేదశాస్త్రములలో నిష్ణాతుడును, మహాభాగ్యవంతుడును అగు, మిథిలాధిపతి యైన జనకుడు, మనకు పూర్వసంబంధి యను విషయమును గుర్తు ఉంచుకొని, తగు విధములగు సత్కారములతో, స్వయముగ తీసికొని రమ్ము. మనకు పూర్వసంబంధి యగుటచే ఆయన విషయమును నీకు ముందుగా చెప్పుచున్నాను.’’

మూ. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్,

వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ హ. 22

ప్ర. అ. తథా = మరియు, స్నిగ్ధమ్ = స్నేహశీలుడును, సతతమ్ = ఎల్లప్పుడు, ప్రియవాదినమ్ = ప్రియముగా మాటలాడువాడును, రాజసింహస్య = రాజశ్రేష్ఠుడైన దశరధునియొక్క, వయస్యమ్ = మిత్రుడును అగు, కాశీపతిమ్ = కాశీరాజును, స్వయమేవ = స్వయముగనే, ఆనయస్వ హ = తీసికొనిరమ్ము.

తా. ‘‘స్నేహశీలుడును, ఎల్లప్పుడును ప్రియముగ పలుకువాడును, మన మహారాజుకు మిత్రుడును అగు కాశీరాజును కూడ నీవు స్వయముగ వెళ్లి పిలిచి, తీసికొని రమ్ము.’’

మూ. తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్,

శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. 23

ప్ర. అ. తథా = మరియు, పరమధార్మికమ్ = చాల ధార్మికుడును, రాజసింహస్య = దశరథునియొక్క, శ్వశురమ్ = మామగారును అగు, వృద్ధమ్ = వృద్ధుడైన, కేకయరాజానం = కేకయరాజును, సపుత్రమ్ = పుత్రసమేతముగా, త్వమ్ = నీవే స్వయముగ, ఇహ = ఇచటకు, ఆనయ = తీసికొని రమ్ము.

తా. పరమధార్మికుడును, మన మహారాజుగారి మామగారును అగు వృద్ధుడైన కేకయదేశరాజును కూడ, పుత్రసమేతముగ తీసికొనిరమ్ము.

మూ. అఙ్గేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతమ్,

వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్. 24

ప్ర. అ. అఙ్గేశ్వరమ్ = అంగదేశమునకు ప్రభువైనవాడును, మహాభాగమ్ = మహా భాగ్యవంతుడును, రాజసింహస్య = రాజశ్రేష్ఠుడైన దశరథునియొక్క, వయస్యమ్ = మిత్రుడును, యశస్వినమ్ = యశఃశాలియు అగు, రోమపాదమ్ = రోమపాదుని, సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడినవానినిగా చేసి, సమానయ = తీసికొనిరమ్ము.

తా. అంగదేశాధిపతియు, మహాభాగ్యవంతుడును అయిన రోమపాదుడు, మన మహారాజునకు మిత్రుడు. ఆ యశఃశాలిని గూడ బాగుగా సత్కరించి తీసికొనిరమ్ము.

మూ. ప్రాచీనాన్ సిన్ధుసౌవీరాన్ సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్,

దాక్షిణాత్యాన్నరేన్ద్రాంశ్చ సమస్తానానయస్వ హ. 25

ప్ర. అ. ప్రాచీనాన్ = తూర్పుదిక్కున ఉన్న దేశాల రాజులను, సిన్ధుసౌవీరాన్ = సింధు సౌవీరదేశరాజులను, సౌరాష్ట్రేయాన్ = సురాష్ట్రదేశమునకు సంబంధించిన, పార్థివాన్ = రాజులను, దాక్షిణాత్యాన్ = దక్షిణదేశమునకు సంబంధించిన, నరేన్ద్రాంశ్చ = రాజులను, సమస్తాన్ = అందరిని, ఆనయస్వ హ = తీసికొనిరమ్ము (ఆహ్వానింపుము).

తా. తూర్పుదేశాల రాజులను, సింధుసౌవీరసౌరాష్ట్ర దేశాల రాజులను, దక్షిణ దేశరాజులను, అందరిని తీసికొనిరమ్ము.

మూ. సన్తి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే,

తానానయ యథాక్షిప్రం సానుగాన్ సహబాన్ధవాన్. 26

ప్ర. అ. పృథివీతలే = భూమండలమునందు, స్నిగ్ధాః = మిత్రులైన, యే చ = ఏ, అన్యే = ఇతరు లైన రాజానః = రాజులు గలరో, తాన్ = వారిని, సానుగాన్ = అనుచరసహితముగా, సహబాన్ధవాన్ = బంధుసమేతముగా, యథాక్షిప్రమ్ = వీలగునంత తొందరగా, ఆనయ = తీసికొనిరమ్ము.

తా. మన రాజ్యముతో స్నేహబంధము గల భూతలమునందలి ఇతర రాజుల నందరిని గూడ, వారి పరివారబంధువులతో సహ, వీలైనంత త్వరగా తీసికొనిరమ్ము (ఆహ్వానింపుము).

మూ. వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమన్త్రస్త్వరితస్తదా,

వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్. 27

ప్ర. అ. తత్ = ఆ, వసిష్ఠవాక్యమ్ = వసిష్ఠుని వాక్యమును, శ్రుత్వా = విని, సుమన్త్రః = సుమంత్రుడు, తదా = అప్పుడు, త్వరితః = తొందరపడుచున్నవాడై, తత్ర = అచటికి, రాజ్ఞామ్ = రాజులయొక్క, ఆనయనే = తీసికొనివచ్చుటయందు (కొరకు), శుభాన్ = సద్గుణవంతులైన, పురుషాన్ = పురుషులను, వ్యాదిశత్ = ఆజ్ఞాపించెను.

తా. వసిష్ఠుని ఆజ్ఞప్రకారము, సుమంత్రుడు రాజులను తీసికొని వచ్చుటకై సద్గుణవంతు లగు పురుషులను వెంటనే పంపెను.

మూ. స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్,

సుమన్త్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః. 28

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ముడగు, సుమన్త్రః = సుమంత్రుడు, మునిశాసనాత్ = మునియొక్క శాసనమువలన, త్వరితః భూత్వా = తొందరకలవాడై, మహీక్షితః = రాజులను, సమానేతుమ్ = తీసికొనివచ్చుటకు, స్వయమేవ = స్వయముగానే, ప్రయయౌ = వెళ్లెను.

తా. వసిష్ఠుని ఆజ్ఞ ప్రకారము, ధర్మాత్ము డైన సుమంత్రుడు జనక కేకయ రాజాదులను స్వయముగ తీసికొనివచ్చుటకై శీఘ్రముగా వెళ్లెను.

మూ. తే చ కర్మాన్తికాస్సర్వే వసిష్ఠాయ చ ధీమతే,

సర్వం నివేదయన్తి స్మ యజ్ఞే యదుపకల్పితమ్. 29

ప్ర. అ. తే = ఆ, కర్మాన్తికాః = కర్మకారులు, సర్వే = అందరును, యజ్ఞే = యజ్ఞముకొరకై, యత్ = ఏది, ఉపకల్పితమ్ = చేయబడినదో, సర్వమ్ = దానినంతను, ధీమతే = బుద్ధిమంతుడైన, వసిష్ఠాయ = వసిష్ఠునకు, నివేదయన్తి స్మ = తెలిపిరి.

తా. ఆ యా కార్యములందు నియుక్తు లైన కర్మకారు లందరును తాము యజ్ఞము విషయమున చేసిన పనుల నన్నింటిని వసిష్ఠునకు విన్నవించిరి.

మూ. తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్ సర్వానిదమబ్రవీత్,

అవజ్ఞయా న దాతవ్యం కస్య చిల్లీలయాపి వా.

అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః. 30

ప్ర. అ. తతః = పిమ్మట, ప్రీతః = సంతోషించిన, ద్విజశ్రేష్ఠః = బ్రాహ్మణ శ్రేష్ఠుడు, తాన్ సర్వాన్ = వారి నందరిని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. కస్యచిత్ = ఎవనికిని, అవజ్ఞయా = అనాదరముతో గాని, లీల యాపి వా = అశ్రద్ధతో గాని, న దాతవ్యమ్ = ఇవ్వకూడదు. అవజ్ఞయా = అనాదరముతో, కృతమ్ = చేయబడిన దానము, దాతారమ్ = దాతను, హన్యాత్ = చంపును. అత్ర = ఈ విషయమున, సంశయః = సంశయము, న = లేదు.

తా. అది విని సంతోషించిన వసిష్ఠుడు వారితో ఇట్లనెను. ‘‘ఎవ్వరి కైన ఏదైన ఇచ్చునపుడు, అనాదరముగ గాని, అశ్రద్ధగ గాని ఇవ్వకూడదు. అనాదరముతో చేసిన దానమునకు ఫలితముగ దాత నశించును.’’

మూ. తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః,

బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. 31

ప్ర. అ. తతః = పిమ్మట, మహీక్షితః = రాజులు, రాజ్ఞః దశరథస్య = దశరథ మహారాజునకు, బహూని = అనేక మైన, రత్నాని = రత్నములను, ఆదాయ = తీసికొని, కైశ్చిత్ = కొన్ని, అహోరాత్రైః = దినములలో, ఉపయాతాః = వచ్చిరి.

తా. అంతట కొన్ని దివసములలో, నానాదేశములకు చెందిన రాజులు దశరథ మహారాజునకు ఉపాయనముగా అనేకరత్నములను తీసికొని అయోధ్యా నగరము చేసిరి.

మూ. తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్. 32

ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్,

మయాపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః. 33

ప్ర. అ. తతః = పిమ్మట, సుప్రీతః = మిక్కిలి సంతసించిన, వసిష్ఠః = వసిష్ఠుడు, రాజానమ్ = దశరథుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను, నరవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠుడా! తవ = నీ యొక్క, శాసనాత్ = శాసనమువలన, రాజానః = రాజులు, ఉపయాతాః = వచ్చినారు. రాజసత్తమాః = రాజశ్రేష్ఠులైన, సర్వే = వారందరును, యథార్హమ్ = యోగ్యతానుసారముగా, మయా = నాచేత, సత్కృతాః అపి = సత్కరింపబడినవారు కూడ.

తా. అపుడు వసిష్ఠుడు సంతోషించి దశరథునితో ఇట్లనెను: ‘‘ఓ నరశ్రేష్ఠుడా! నీ ఆజ్ఞ ప్రకారము రాజు లందరును వచ్చినారు. నేను వారి నందరిని తగు రీతిని సత్కరించినాను.’’

మూ. యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైః సుసమాహితైః,

నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమన్తికాత్. 34

ప్ర. అ. రాజన్ = ఓ రాజా! సుసమాహితైః = మిక్కిలి సావధానచిత్తులైన, పురుషైః = పురుషులచే, యజ్ఞీయమ్ = యజ్ఞమునకై కావలసిన కార్యమంతయు, కృతమ్ = చేయబడినది. భవాన్ = నీవు, యష్టుమ్ = యాగము చేయుటకై, అన్తికాత్ = సమీపమందున్న, యజ్ఞాయతనమ్ = యజ్ఞశాలను గూర్చి, నిర్యాతు = బయలువెడలెదవుగాక.

తా. రాజా! కర్మచారులు సావధానచిత్తులై యజ్ఞమునకై కావలసిన సాధన సామగ్రిని సమకూర్చినారు. ఇంక నీవు యజ్ఞము ప్రారంభించుటకై, సమీపముననే ఉన్న యాగశాల కు బయలుదేరుము.

మూ. సర్వకామైరుపహృతైరుపేతం వై సమన్తతః,

ద్రష్టుమర్హసి రాజేన్ద్ర మనసేవ వినిర్మితమ్. 35

ప్ర. అ. రాజేన్ద్ర = ఓ రాజశ్రేష్ఠుడా! ఉపహృతైః = చేర్చబడిన, సర్వకామైః = సమస్తభోగ్య వస్తువులతోడను, సమన్తతః = అంతటను, ఉపేతమ్ = కూడినదియు, మనసా = మనస్సుచే, వినిర్మితమ్ ఇవ = నిర్మించబడినట్లున్న ఈ యాగశాలను, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ రాజేంద్రా! సమకూర్చిన సమస్తభోగ్యవస్తువులతో అంతటను నిండి, మనస్సుచే నిర్మించబడినదా అన్నట్లు ఆశ్చర్యకర మగు ఈ యాగశాలను చూడుము.’’

మూ. తథా వసిష్ఠవచనాదృశ్యశృఙ్గస్య చోభయోః,

శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః. 36

ప్ర. అ. తథా = అట్లు, వసిష్ఠవచనాత్ = వసిష్ఠుని వాక్యమువలనను, ఋశ్యశృఙ్గస్య చ = ఋశ్యశృంగుని వాక్యములవలనను, ఉభయోః = వారిద్దరియొక్క వచనమువలన, జగతీపతిః = భూభర్త, శుభే = శుభ మైన, దివసనక్షత్రే = దివసమునందు నక్షత్రమునందు, నిర్యాతః = బయలువెడలెను.

తా. (ఋశ్యశృంగుడు కూడ వసిష్ఠుడు చెప్పినవిధముననే చెప్పెను). ఆ వసిష్ఠ ఋశ్యశృంగుల వచనము ననుసరించి, దశరథుడు శుభనక్షత్రముతో కూడిన శుభ దివసమునందు యాగశాలలో ప్రవేశించుటకై బయలుదేరెను.

వి. రామాయణకాలమువారికి వారములు తెలియవు. అందుచే శుభవారము చేర్చుట అసంగతము.

మూ. తతో వసిష్ఠప్రముఖాస్సర్వ ఏవ ద్విజోత్తమాః,

ఋశ్యశృఙ్గం పురస్కత్య యజ్ఞకర్మారభంస్తదా.

యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రయోదశః సర్గః.

ప్ర. అ. తతః = పిమ్మట, వసిష్ఠప్రముఖాః = వసిష్ఠుడు మొదలైన, సర్వే ఏవ = సమస్తమైన ఋత్విక్కులును, సర్వే = సమస్తమైన, ద్విజోత్తమాః = బ్రాహ్మణశ్రేష్ఠులును, యజ్ఞవాటగతాః = యజ్ఞవాటమును చేరినవారై, యథాశాస్త్రమ్ = శాస్త్రానుసారముగాను, యథావిధి = విధిప్రకారముగాను, తదా = అప్పుడు, ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని, పురస్కత్య = ముందు ఉంచుకొని, యజ్ఞకర్మ = యజ్ఞకర్మను, ఆరభన్ = ప్రారంభించిరి.

తా. పిమ్మట వసిష్ఠుడు మొదలైన వారందరును యాగశాలలో ప్రవేశించి, ఋశ్యశృంగుని ముందు ఉంచుకొని, యథాశాస్త్రముగ, కల్పోక్తప్రకారమున యాగము చేయ ప్రారంభించిరి.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో పదమూడవసర్గ సమాప్తము.

© 2026 Ebook Library