| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 20 |
| Pages | 16 |
| Read Time | 23 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చతుర్దశః సర్గః
దశరథుడు సాంగోపాంగముగా సరయూతీరమున అశ్వమేధయాగము చేయుట.
మూ. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురఙ్గమే,
సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోఽభ్యవర్తత. 1
ప్ర. అ. అథ = అటు పిమ్మట, సంవత్సరే = సంవత్సరము, పూర్ణే సతి = నిండిన దగుచుండగా, తస్మిన్ = ఆ, తురఙ్గమే = అశ్వము, ప్రాప్తే సతి = వచ్చిన దగుచుండగా, సరయ్వాః = సరయూనది యొక్క, ఉత్తరే తీరే = ఉత్తరపు టొడ్డునందు, రాజ్ఞః = రాజుయొక్క, యజ్ఞశ్చ = యాగము, అభ్యవర్తత = ప్రారంభమైనది.
తా. సంవత్సరము పూర్తి యై అశ్వము తిరిగి వచ్చినది. అపుడు సరయూనది ఉత్తరతీరమునందు, దశరథుని యజ్ఞము ప్రారంభ మయ్యెను.
మూ. ఋశ్యశృఙ్గం పురస్కృత్య కర్మ చక్రుర్ద్విజర్షభాః,
అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోఽస్య సుమహాత్మనః. 2
ప్ర. అ. సుమహాత్మనః = మిక్కిలి పూజింపదగిన బుద్ధి గల, అస్య రాజ్ఞః = ఈ రాజుయొక్క, అశ్వమేధే మహాయజ్ఞే = అశ్వమేధయాగమునందు, ద్విజర్షభాః = బ్రాహ్మణ శ్రేష్ఠులు, ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని, పురస్కృత్య = ముందు ఉంచుకొని, కర్మ = కార్యమును, చక్రుః = చేసిరి.
తా. మహాత్ముడైన ఆ దశరథుని అశ్వమేధయాగమునందు, బ్రాహ్మణశ్రేష్ఠులు ఋశ్యశృంగుని ముందు ఉంచుకొని, కార్యములు చేసిరి.
మూ. కర్మ కుర్వన్తి విధివద్యాజకా వేదపారగాః,
యథావిధి యథాన్యాయం పరిక్రామన్తి శాస్త్రతః. 3
ప్ర. అ. వేదపారగాః = వేదములపారమును చూచిన, యాజకాః = ఋత్విక్కులు, విధివత్ = యథాశాస్త్రముగ, కర్మ = కార్యమును, కుర్వన్తి = చేసిరి. యథావిధి = వేదములతో ఉన్న విధివాక్యముల ననుసరించి, యథాన్యాయమ్ = న్యాయమును అనుసరించి, శాస్త్రతః = శాస్త్రములో చెప్పిన విధమున, పరిక్రామన్తి = సంచరించిరి.
తా. వేదములలో మహాపండితులైన ఋత్విక్కులు కర్మ లన్నియు యథాశాస్త్రముగ ఆచరించిరి. వారు వేదవిధుల ప్రకారము, న్యాయానుసారము సంచరించిరి.
మూ. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథై వోపసదం ద్విజాః,
చక్రుశ్చ విధివత్సర్వమధికం కర్మ శాస్త్రతః. 4
ప్ర. అ. ద్విజాః = బ్రాహ్మణులు, ప్రవర్గ్యం = ప్రవర్గ్యమును, శాస్త్రతః = శాస్త్రానుసారముగా, కృత్వా = చేసి, తథైవ = మరియు, ఉపసదమ్ = ఉపసదమును కూడ, విధివత్ = యథావిధిగా చేసి, అధికమ్ = ఇంకను ఇతర మైన, సర్వం కర్మ = కర్మ నంతను, శాస్త్రతః = శాస్త్రప్రకారముగా, చక్రుః = చేసిరి.
తా. బ్రాహ్మణులు అశ్వమేధాంగము లగు ప్రవర్గ్యమును, ఉపసదమును, తదితర కర్మలను శాస్త్రానుసారము నిర్వర్తించిరి.
మూ. అభిపూజ్య తతో హృష్టాః సర్వే చక్రుర్యథావిధి,
ప్రాతఃసవనపూర్వాణి కర్మాణి మునిపుఙ్గవాః. 5
ప్ర. అ. తతః = పిమ్మట, మునిపుఙ్గవాః = మునిశ్రేష్ఠులు, సర్వే = అందరును, హృష్టాః = సంతోషముకలవారై, అభిపూజ్య = ఆ యా దేవతలను పూజించి, ప్రాతఃసవనపూర్వాణి = ప్రాతఃసవనము మొదలైన, కర్మాణి = కర్మలను, యథావిధి = యథాశాస్త్రముగా, చక్రుః = చేసిరి.
తా. ఆ మునిశ్రేష్ఠు లందరును సంతుష్టాంతరంగులై, ఆహూతు లైన దేవతలను పూజించి, ప్రాతఃసవనాదికర్మలను యథావిధిగ చేసిరి.
మూ. ఐన్ద్రశ్చ విధివద్దత్తో రాజా చాభిషుతోఽనఘః,
మాధ్యన్దినం చ సవనం ప్రావర్తత యథాక్రమమ్. 6
ప్ర. అ. ఐన్ద్రశ్చ = ఇంద్రదేవతను ఉద్దేశించిన హవిస్సు, విధివత్ = యథాశాస్త్రముగా, దత్తః = ఇవ్వబడినది. అనఘః = దోషరహితమైన, రాజా చ = సోమలత కూడ, అభిషుతః = నలగగొట్టి రసము తీయబడినది. మాధ్యన్దినమ్ = మాధ్యందినమైన, (మధ్యాహ్నము చేయదగిన) సవనమ్ = సవనము, యథాక్రమమ్ = క్రమానుసారముగ, ప్రావర్తత = జరిగెను.
తా. ఇంద్రునకు హవిర్భాగములను సమర్పించి నిర్దుష్ట మైన సోమలతను నలగగొట్టి రసము తీసిరి. ఈ విధముగ మాధ్యందిన సవనము యథాశాస్త్రముగ చేయబడెను.
మూ. తృతీయసవనం చైవ రాజ్ఞోఽస్య సుమహాత్మనః,
చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణపుఙ్గవాః. 7
ప్ర. అ. తథా = అట్లే, తే బ్రాహ్మణపుఙ్గవాః = ఆ బ్రాహ్మణశ్రేష్ఠులు, శాస్త్రతః = శాస్త్రము నుండి, దృష్ట్వా = చూచి, సుమహాత్మనః = చాల పూజ్య మైన బుద్ధి గల, అస్య రాజ్ఞః = ఈ దశరథమహారాజుయొక్క, తృతీయసవనం చైవ = తృతీయ సవనమును కూడ, చక్రుః = చేసిరి.
తా. ఆ బ్రాహ్మణశ్రేష్ఠులు, బుద్ధిశాలి యగు ఆ దశరథుని తృతీయసవనమును కూడ యథాశాస్త్రముగ పూర్తిచేసిరి.
మూ. న చాహుతమభూత్తత్ర స్ఖలితం వా పి కించన,
దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. 8
ప్ర. అ. తత్ర = ఆ యజ్ఞమునందు, అహుతమ్ = దోషములతో కూడిన హోమము, నాభూత్ = జరుగలేదు. కించన = ఏదియు, స్ఖలితమ్ = పొరబాటుకూడ, నాభూత్ = జరుగలేదు. సర్వమ్ = అంతయు, బ్రహ్మవత్ = మంత్రయుక్తముగానే, దృశ్యతే = కనబడుచున్నది. క్షేమయుక్తమ్ = క్షేమముతో కూడిన విధముననే, చక్రిరే హి = చేసిరి కదా.
తా. ఆ యజ్ఞములో హోమములను చేయుటలో కాని, మరి ఏ ఇతర కర్మలలో గాని, ఒక్క పొరబాటు కూడ జరుగలేదు. అంతయు మంత్రపూర్వకముగ జరిగెను. అన్నియు క్షేమకరములుగా ఉండునట్లు చేసిరి.
మూ. న తేష్వహస్సు శ్రాన్తో వా క్షుథితో వాపి దృశ్యతే,
నావిద్వాన్ బ్రాహ్మణస్తత్ర నాశతానుచర స్తథా. 9
ప్ర. అ. తేషు = ఆ, అహస్సు = దినములలో, శ్రాన్తః = అలసినవాడు, న దృశ్యతే = కనబడడు. క్షుధితో వాపి = లేదా ఆకలిగొన్నవాడు, న = కనబడడు. తత్ర = అచట, అవిద్వాన్ = విద్వాంసుడుకాని, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, న = కనబడడు. తథా = అట్లే, అశతానుచరః = నూర్గురు అనుచరులు లేనివాడు (అనగా కూడా నూర్గురు శిష్యులు లేని బ్రాహ్మణుడు), న = కనబడడు.
తా. ఆ దినములలో అలసినవాడు గాని, ఆకలిగొన్నవాడు గాని, విద్యావిహీను డైన బ్రాహ్మణుడు గాని, నూరుగురు శిష్యులు కూడ లేని బ్రాహ్మణుడు కాని, కనబడలేదు.
మూ. బ్రాహ్మణా భుఞ్జతే నిత్యం నాథవన్తశ్చ భుఞ్జతే,
తాపసా భుఞ్జతే చాపి శ్రమణా భుఞ్జతే తథా. 10
ప్ర. అ. నిత్యమ్ = నిత్యము, బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, భుఞ్జతే = భుజించుచుండిరి. నాథవన్తశ్చ = ప్రభువులు కలవారును, అనగా దాసులును, భుఞ్జతే = భుజించుచుండిరి. తాపసాశ్చాపి = మునులు కూడ, భుఞ్జతే = భుజించుచుండిరి. తథా = మరియు, శ్రమణాః = సంన్యాసులును, భుఞ్జతే = భుజించుచుండిరి.
తా. ఆ యాగము జరిగినన్నాళ్ళును బ్రాహ్మణులు, దాసులు, మునులు, సంన్యాసులు అందరును తృప్తిగా భుజించుచుండిరి.
వి. శ్రమణులనగా - ‘‘చతుర్థమాశ్రమం ప్రాప్తాః శ్రమణా నామ తే స్మృతాః’’ అను స్మతివాక్యము ననుసరించి సంన్యాసు లని అర్థము. అందుచే దీనికి బౌద్ధ సంన్యాసు లని అర్థము చెప్పి, రామాయణము బౌద్ధమతావిర్భావానంతరము వ్రాయబడినది అని చెప్పుట అయుక్త మని కొందరి అభిప్రాయము.
మూ. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ,
అనిశం భుఞ్జమానానాం న తృప్తిరుపలభ్యతే. 11
ప్ర. అ. వృద్ధాః = ముసిలివారును, వ్యాధితాశ్చెవ = రోగపీడితులును, స్త్రియ = స్త్రీలును, తథైవ చ = మరియు, బాలాః = బాలులును, (భుఞ్జతే = తినుచుండిరి). అనిశమ్ = ఎల్లప్పుడును, భుఞ్జమానానామ్ = తినుచున్న వీరికి, తృప్తిః = తృప్తి, న ఉపలభ్యతే = పొందబడుటలేదు.
తా. వృద్ధులును, రోగములతో బాధపడుచున్నవారును, స్త్రీలును, బాలురును తినుచుండిరి. ఈ విధముగ నిరంతరము భుజించుచున్నను వారికి తృప్తి కలుగుటలేదు. భోజనము అంత మధురముగా ఉన్నదని భావము. లేదా - ఇంతమంది ఈ విధముగ నిరంతరము భుజించుచున్నను వడ్డించువారికిని, దశరథునకును, తృప్తి కలుగుట లేదు అని భావము.
మూ. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ,
ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. 12
ప్ర. అ. అన్నమ్ = అన్నము, దీయతాం దీయతామ్ = ఇవ్వబడుగాక, ఇవ్వబడుగాక. వివిధాని = అనేకవిధము లైన, వాసాంసి చ = వస్త్రములును, ఇవ్వబడుగాక. ఇతి = ఈ విధముగా, తత్ర = ఆ యాగభూమియందు, సంచోదితాః = ప్రేరేపింపబడినవారై, అనేకశః = అనేకవిధములుగ, తథా = ఆ విధముగ, చక్రుః = చేసిరి.
తా. ‘‘అన్నము పెట్టండి పెట్టండి; అనేకవిధము లైన వస్త్రాలు కూడ పంచిపెట్టండి, పంచి పెట్టండి,’’ అని దశరథమంత్య్రాదులచే ప్రేరితులై, అచటివారు ఆ విధముగ చేసిరి.
మూ. అన్నకూటాశ్చ బహవో దృశ్యన్తే పర్వతోపమాః,
దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. 13
ప్ర. అ. తత్ర = అచట, తదా = అప్పుడు, విధివత్ = తగురీతిని, సిద్ధస్య = సిద్ధమైన, అన్నకూటాః = భోజ్యపదార్థముల రాసులు, బహవః = అనేకము, పర్వతోపమాః = పర్వతముల వలె, దివసే దివసే = ప్రతిదివసమునందు, దృశ్యన్తే = కనబడుచుండెను.
తా. అచట ప్రతిదినమునందు, శ్రద్ధగా వండిన భోజ్యపదార్థముల రాసులు అనేకములు పర్వతముల వలె కనబడు చుండెను.
మూ. నానాదేశాదనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా,
అన్నపానైః సువిహితాస్తస్మిన్యజ్ఞే మహాత్మనః. 14
ప్ర. అ. మహాత్మనః = ఆ మహాత్మునియొక్క, తస్మిన్ యజ్ఞే = ఆ యజ్ఞమునందు, నానాదేశాత్ = అనేకదేశములనుండి, అనుప్రాప్తాః = వచ్చిన, పురుషాః = పురుషులును, తథా = మరియు, స్త్రీగణాః = స్త్రీసముదాయములును, అన్నపానైః = అన్నపానములచే, సువిహితాః = బాగుగా తృప్తిపొందింపబడిరి.
తా. దశరథుని యజ్ఞమునందు నానాదేశములనుండి వచ్చిన స్త్రీపురుషులు, అన్నపానములచే తృప్తి పొందింపబడిరి.
మూ. అన్నం హి విధివత్స్వాదు ప్రశంసన్తి ద్విజర్షభాః,
అహో తృప్తాః స్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః. 15
ప్ర. అ. ద్విజర్షభాః = బ్రాహ్మణశ్రేష్ఠులు, విధివత్ = వండవలసిన పద్ధతిలో వండిన, స్వాదు = మధుర మైన, అన్నమ్ = అన్నమును, ప్రశంసన్తి = ప్రశంసించిరి. రాఘవః = దశరథుడు, - ‘‘అ హో = ఆహ! తృప్తాః స్మః = సంతృప్తుల మైనాము; తే = నీకు, భద్రమ్ = భద్ర మగుగాక,’’ ఇతి = ఈ విధమగు మాటలను, శుశ్రావ = వినెను.
తా. యథావిధిగా వండిన, మధుర మైన అన్నమును భుజించిన బ్రాహ్మణశ్రేష్ఠులు, ‘‘ఆహ! తృప్తి చెందినాము. నీకు మంగళ మగుగాక’’ అని పలుకుచుండగా, దశరథుడు విని ఆనందించెను.
మూ. స్వలఙ్కృతాశ్చ పురుషా బ్రాహ్మణాన్ పర్యవేషయన్,
ఉపాసతే చ తానన్యే సుమృష్టమణికుణ్డలాః. 16
ప్ర. అ. స్వలఙ్కతాః = బాగుగా అలంకరించుకొనిన, పురుషాః = పురుషులు, బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులకు, పర్యవేషయన్ = వడ్డించిరి. సుమృష్టమణికుణ్డలాః = మంచి కాంతి గల మణులతో కూడిన కుండలములు గల, అన్యే చ = మరి కొందరు, తాన్ = వారిని, ఉపాసతే చ = సేవించిరి.
తా. చక్కగా అలంకరించుకొనిన పురుషులు బ్రాహ్మణులకు వడ్డించుచున్నప్పుడు, మంచి మణికుండలములు ధరించిన మరి కొందరు ఆ వడ్డించువారికి సాహాయ్యము చేసిరి.
మూ. కర్మాన్తరే తదా విప్రా హేతువాదాన్ బహూనపి,
ప్రాహుశ్చ వాగ్మినో ధీరాః పరస్పరజిగీషయా. 17
ప్ర. అ. తదా = అప్పుడు, వాగ్మినః = వాక్చాతుర్యము కల, ధీరాః = బుద్ధిశాలులైన, విప్రాః = బ్రాహ్మణులు, తదా = అప్పుడు, కర్మాన్తరే = కర్మల మధ్యయందు, పరస్పరజిగీషయా = పరస్పరము జయించవలె నను కోరికతో, బహూన్ = అనేక మైన, హేతువాదాన్ = యుక్తివాదములను, ప్రాహుః చ = పలికిరి కూడ.
తా. కర్మకును కర్మకును మధ్య అవకాశము లభించినపుడు, వాక్చాతుర్యము కలవారును, బుద్ధిశాలులును అగు బ్రాహ్మణులు, ఒండొరులను జయించవలె నను అభిలాషతో, అనేక శాస్త్రములకు సంబంధించిన వాగ్వాదములను చేసిరి.
మూ. దివసే దివసే తత్ర సంస్తరే కుశలా ద్విజాః,
సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః. 18
ప్ర. అ. సస్తరే = యజ్ఞమునందు, కుశలాః = నేర్పరులైన, ద్విజాః = బ్రాహ్మణులు, దివసే దివసే = ప్రతిదినమునందును, తత్ర = అచట, ప్రచోదితాః = వసిష్ఠాదులచే ప్రేరేపింప బడినవారై, సర్వకర్మాణి = స్వకర్మలను, యథాశాస్త్రమ్ = శాస్త్రానుసారముగ, చక్రుః = చేసిరి.
తా. అచట, యజ్ఞకర్మలలో నేర్పు గల బ్రాహ్మణులు, ప్రతిదినము నందును, సర్వకర్మలను, వసిష్ఠాదుల పర్యవేక్షణములో, యథాశాస్త్రముగ నిర్వర్తించిరి.
మూ. నాషడఙ్గవిదత్రాసీన్నావ్రతో నాబహుశ్రుతః,
సదస్యాస్తస్య వై రాజ్ఞో నావాదకుశలా ద్విజాః. 19
ప్ర. అ. అత్ర = ఈ యాగశాలలో, అషడఙ్గవిత్ = ఆరు వేదాంగములు తెలియని వాడు, నాసీత్ = లేకుండెను. అవ్రతః = వ్రతానుష్ఠానము చేయని వాడు, న = లేకుండెను. అబహుశ్రుతః = అధికశాస్త్రపరిచయము లేనివాడు, న = లేకుండెను. తస్య = ఆ, రాజ్ఞః = రాజుయొక్క, సదస్యాః = సదస్యులు, అవాదకుశలాః = శాస్త్రవాదములో కుశలులు కానివారు, న వై = లేకుండిరి.
తా. అచట షడంగవేత్త కానివాడు కాని, వ్రతానుష్ఠానము చేయనివాడు గాని, బహుశాస్త్రపరిచయము లేనివాడు గాని లేకుండెను. దశరథుని యజ్ఞ సదస్సులో శాస్త్రవాదకౌశలము లేని బ్రాహ్మణు లెవ్వరును సదస్యులుగా లేకుండిరి.
మూ. ప్రాప్తే యూపోచ్ఛ్రయే తస్మిన్ షడ్బైల్వాః ఖాదిరాస్తథా,
తావన్తో బిల్వసహితాః పర్ణినశ్చ తథాపరే. 20
శ్లేష్మాతకమయస్త్వేకో దేవదారుమయస్తథా,
ద్వావేవ విహితౌ తత్ర బాహువ్యస్తపరిగ్రహౌ. 21
ప్ర. అ. తస్మిన్ = ఆ యజ్ఞమునందు, యూపోచ్ఛ్రయే = యూపస్తంభములను ఎత్తవలసిన సమయము, ప్రాప్తే సతి = వచ్చిన దగుచుండగా, బైల్వాః = బిల్వదారువుతో చేసిన, షట్ = ఆరు యూపస్తంభములును, తథా = మరియు, బిల్వసహితాః = బిల్వస్తంభములకు దగ్గరగా ఉండు, తావన్తః = అంత సంఖ్యయే గల, ఖాదిరాః = చండ్రకఱ్ఱతో చేసిన స్తంభములును, తథా = మరియు, పర్ణినః చ = పలాశదండనిర్మితము లగు, అపరే = మరి కొన్ని స్తంభములును, ఏకః = ఒక, శ్లేషాత్మకమయః = శ్లేష్మాతకదారువుతో చేసిన స్తంభము, తథా = మరియు, దేవదారుమయః = దేవదారువు కఱ్ఱతో చేసిన రెండు స్తంభములును (శాస్త్రానుసారము దేవదారు స్తంభములు రెండు గాన ఏకవచన మున్నను ద్వివచనార్థము చెప్పబడినది), నిలుపబడినవి. తత్ర = అచట, ద్వౌ = రెండు స్తంభములు, బాహువ్యస్తపరిగ్రహావేవ = చాపిన రెండు బాహువులచే స్పశింపదగినవిగా, విహితౌ = నిర్మింపబడినవి.
తా. ఆ యజ్ఞములో యూపస్తంభములను నిలుపవలసిన సమయము వచ్చినది. ఆరు మారేడుకఱ్ఱతో చేసిన యూపములు, ఆరు చండ్రకఱ్ఱతో చేసిన యూపములును, మోదుగ కఱ్ఱతో చేసిన యూపములు ఆరును, శ్లేష్మాతకవృక్షము కఱ్ఱతో చేసిన ఒక యూపము, దేవదారుచెట్టు కఱ్ఱతో చేసిన యూపములు రెండును నిలుపబడినవి. యూపమునకును యూపమునకును మధ్య బారెడు దూరము ఉండు నట్లు నిలుపబడినవి.
మూ. కారితాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్యజ్ఞకోవిదైః,
శోభార్థం తస్య యజ్ఞస్య కాఞ్చనాలఙ్కృతా భవన్. 22
ప్ర. అ. శాస్త్రజ్ఞైః = శాస్త్రము నెరిగిన, యజ్ఞకోవిదైః = యజ్ఞమును గూర్చి బాగుగా తెలిసిన వారిచేత, కారితాః = చేయించబడిన, తే సర్వే ఏవ = ఆ యూపస్తంభము లన్నియు, తస్య యజ్ఞస్య = ఆ యజ్ఞముయొక్క, శోభార్థమ్ = శోభకొరకు, కాఞ్చనాలఙ్కృతాః = బంగారముచే అలంకరింపబడినవి, అభవన్ = అయినవి.
తా. యజ్ఞప్రవీణులు యథాశాస్త్రముగ చేయించిన ఆ యూపస్తంభములను, యజ్ఞములో శోభగా ఉండుటకై బంగారముతో అలంకరించిరి.
మూ. ఏకవింశతియూపాస్తే ఏకవింశత్యరత్నయః,
వాసోభిరేకవింశద్భిరేకైకం సమలఙ్కృతాః. 23
ప్ర. అ. ఏకవింశత్యరత్నయః = ఇరువదియొక్కఅరత్నుల ఎత్తుగల, తే = ఆ, ఏకవింశతియూపాః = ఇరువదియొక్క యూపములు, ఏకవింశద్భిః = ఇరువదియొక్క, వాసోభిః = వస్త్రములచే, ఏకైకమ్ = ఒక యూపమునకు ఒక వస్త్రము చొప్పున, సమలఙ్కృతాః = అలంకరింపబడినవి.
తా. ఇరువదియొక్క అరత్నుల ఎత్తు ఉన్న ఆ ఇరువదియొక్క యూపస్తంభము లను ఇరువదియొక్క వస్త్రములు చుట్టి అలంకరించిరి.
వి. ‘అరత్ని’ అనగా మోచేయినుండి చిటికెన వ్రేలి చివరి వరకును ఉన్న హస్తభాగము; మూర.
మూ. విన్యస్తా విధివత్సర్వే శిల్పిభిః సుకృతా దృఢాః,
అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్ష్ణరూపసమన్వితాః. 24
ప్ర. అ. సర్వే = అవి అన్నియు, శిల్పిభిః = శిల్పులచేత, సుకృతాః = బాగుగా చేయబడినవి. దృఢాః = దృఢముగా నున్నవి. అష్టాశ్రయః = ఎనిమిది అంచులు కలవి, శ్లక్ష్ణరూపసమ న్వితాః = నున్నని రూపము కలవి, సర్వే ఏవ = ఆ స్తంభములన్నియు, విధివత్ = యథాశాస్త్రముగా, విన్యస్తాః = నిలుపబడినవి.
తా. ఆ స్తంభములు నున్నగా, దృఢముగా, ఎనిమిది అంచులు ఉండునట్లుగా శిల్పులచే చక్కగా నిర్మింపబడినవి. వాని నన్నింటిని యథాశాస్త్రముగా నిలిపిరి.
మూ. ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పెర్గన్ధైశ్చ భూషితాః,
సప్తర్షయో దీప్తిమన్తో విరాజన్తే యథా దివి. 25
ప్ర. అ. వాసోభిః = వస్త్రములచేత, ఆచ్ఛాదితాః = ఆచ్ఛాదింపబడినవియు, పుష్పైః = పుష్పములచేతను, గన్ధైశ్చ = గంధములచేతను, భూషితాః = అలంకరింపబడినవియు అగు, తే = ఆ యూపములు, దీప్తిమన్తః = కాంతిగలవై, దివి = ఆకాశమునందు, సప్తర్షయః యథా = సప్తర్షుల వలె, విరాజన్తే = ప్రకాశించుచున్నవి.
తా. వస్త్రములు కప్పి, పుష్పసుగంధాదులతో అలంకరించిన ఆ యూప స్తంభములు, ఆకాశమునందు సప్తర్షుల వలె, దీప్తిమంతములై ప్రకాశించినవి.
మూ. ఇష్టకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః,
చితోఽగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి. 26
ప్ర. అ. తత్ర = అచట, యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగా, ప్రమాణతః = కావలసిన కొలత ప్రకారము, ఇష్టకాః = ఇటికలు, కారితాః = చేయించబడినవి. తత్ర = అచట, శుల్బకర్మణి = ఒంటిపేట త్రాడుతో కొలతలు వేయుట అను పనియందు, కుశలైః = నేర్పరులైన, బ్రాహ్మణైః = బ్రాహ్మణులచేత, అగ్నిః = అగ్నివేదిక, చితః = ఇటుకలను పేర్చి కట్టబడినది.
తా. శాస్త్రములో చెప్పిన కొలత ప్రకారము నిర్మించిన ఇటికలు పేర్చి, శుల్బకర్మ యందు నిపుణు లైన బ్రాహ్మణులు అగ్నివేదికలు కట్టిరి.
వి. ఒంటిపేట త్రాడుకు శుల్బ మని పేరు. వేరువేరు యజ్ఞములలో వేరు వేరు కొలతలతో, వేరు వేరు ఆకారములలో వేదికలు కట్టవలెను. అందుచే ఈ శుల్బము సహాయముతో జ్యామితి (జ్యా = భూమి, మితి = కొలత) చేసి వేదికలు కట్టెడివారు.
మూ. సచిత్యో రాజసింహస్య సంచితః కుశలైర్ద్విజైః,
గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః. 27
ప్ర. అ. కుశలైః = నేర్పరులైన, ద్విజైః = బ్రాహ్మణులచేత, రుక్మపక్షః = బంగారు రెక్కలు కలదియు, త్రిగుణః = మూడు రెట్లు కలదియు, అష్టాదశాత్మకః = పదునెనిమిది అను సంఖ్యలో ఉన్నదియు అగు, గరుడః = గరుడాకారమైన వేదిక, రాజసింహస్య = రాజశ్రేష్ఠు డైన దశరథునియొక్క, సచిత్యః = నిత్యాగ్నితో కూడినది, సంచితః = పేర్చబడినది.
తా. దశరథుని చిత్యాగ్నిని ఉంచుటకు వీలుగా, నేర్పు గల బ్రాహ్మణులు గరుడాకార మైన వేదికను నిర్మించిరి. దీనిని ఇతరవేదికలకంటె మూడు రెట్లు ఇటికలు ఎక్కువగా ఉంచి కట్టుటచే మొత్తము పద్దెనిమిది వరుస లైనవి.
వి. అశ్వమేధములో అగ్నిని ఉంచవలసిన వేదికచుట్టూ ఇటుకలు పేర్చి గరుడాకారము నిర్మింతురు. ఆ గరుత్మంతుడు తూర్పుదిశకు అభిముఖముగా ఉండి, రెక్కలను, పుచ్ఛమును విస్తృతము చేసి క్రిందికి తలవంచి చూచుచున్నటు ఉండును. ఇటికలను పేర్చుటకు ‘చయనము’ అనిపేరు. వాజసనేయశాఖ (శుక్లయజుర్వేదశాఖ)కు చెందినవారు చేయు ఇతర యజ్ఞములలో ఈ వేదిక కట్టు నపుడు ఆరువరసలు (ప్రస్తారములు) వేయుదురు. అశ్వమేధములో దానికి మూడు రెట్లు (6 × 3 = 18) వేయుదురు. అందుచే ‘‘అష్టాదశాత్మకః’’ అని చెప్పబడినది. కృష్ణయజుశ్శాఖకు చెందినవారు ఇతర యజ్ఞములలో ఐదు ప్రస్తారములను, అశ్వమేధములో (5 × 3 = 15) పదిహేను ప్రస్తారములను వేయుదురు. దశరథుడు శుక్లయజుశ్శాఖకు చెందినవా డని దీనిని పట్టి తెలియుచున్నది. ‘చిత్యః’ అనగా ఈ విధముగా చయనము చేసిన వేదికపై నెలకొల్పబడిన అగ్ని అని యర్థము.
మూ. నియుక్తా స్తత్ర పశవస్తత్తదుద్దిశ్య దైవతమ్, 28
ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః.
ప్ర. అ. తత్ర = అచట, యథాశాస్త్రమ్ = శాస్త్రానుసారముగా, ప్రచోదితాః = విహితములైన, పశవః = పశువులును, ఉరగాః = సర్పములును, పక్షిణశ్చైవ = పక్షులును, తత్తత్ = ఆ యా, దైవతమ్ ఉద్దిశ్య = దేవతను ఉద్దేశించి, నియుక్తాః = కట్టబడినవి.
తా. శాస్త్రములో చెప్పిన విధానము ననుసరించి, ఆ యా దేవతలకొరకై, పశువులును, సర్పములును, పక్షులును కట్టబడినవి.
మూ. శామిత్రే తు హయస్తత్ర తథా జలచరాశ్చ యే,
ఋత్విగ్భిః సర్వమేవైతన్నియుక్తం శాస్త్రతస్తదా. 29
ప్ర. అ. శామిత్రే తు = పశువిశసనకర్మయందు (పశువులను చంపి చేయు కర్మయందు) మాత్రము, తత్ర = అచట, హయః = అశ్వము, తథా = మరియు, యే = ఏ, జలచరాః = కూర్మాదిజలచరము లున్నవో అవియు, ఏతత్సర్వమ్ = ఇదియంతయు (ఇవి అన్నియు), ఋత్విగ్భిః = ఋత్విక్కులచేత, శాస్త్రతః = శాస్త్రానుసారముగా, నియుక్తమ్ = కట్టబడెను.
తా. ఇంతలో పశువిశసనము చేయు సమయము వచ్చి నపుడు, అశ్వమును, కొన్ని జలచరములను, ఋత్విక్కులు శాస్త్రానుసారముగా యూపములకు బంధించిరి.
వి. అశ్వమేధమున అనేకము లైన అరణ్యమృగములను, గ్రామ్యమృగములను బలియిచ్చెదరు. వాటిలో అరణ్యమృగాదులను కొన్నింటిని అగ్నికి ప్రదక్షిణము చేయించి విడిచివేయుదురు. గ్రామ్యమృగములను మాత్రమే చంపుదురు.
మూ. పశూనాం త్రిశతం తత్ర యూపేషు నియతం తదా,
అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్య చ. 30
ప్ర. అ. తదా = అప్పుడు, తత్ర = అచట, పశూనామ్ = పశువులయొక్క, త్రిశతమ్ = మూడు శతములును, తస్య = ఆ, దశరథస్య రాజ్ఞః = దశరథమహారాజు యొక్క, అశ్వరత్నోత్తమమ్ = రత్నముల వంటి అశ్వములలో శ్రేష్ఠ మైన అశ్వము, యూపేషు = యూపస్తంభములయందు, నియతమ్ = కట్టబడెను.
తా. మూడువందల పశువులను, దశరథుని ఉత్తమాశ్వమును యూప స్తంభములకు కట్టిరి.
మూ. కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమన్తతః,
కృపాణైర్విశశాసైనం త్రిభిః పరమయా ముదా. 31
ప్ర. అ. తత్ర = అచట, కౌసల్యా = కౌసల్య, తమ్ = ఆ, హయమ్ = అశ్వమును, సమన్తతః = అంతటను, పరిచర్య = ప్రదక్షిణము చేసి, పరమయా = గొప్పదైన, ముదా = సంతోషముతో, త్రిభిః = మూడు, కృపాణైః = కత్తులచేత, ఏనమ్ = దీనిని, విశశాస = చంపెను.
తా. కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి, దానిని మూడు కత్తులతో చంపెను.
వి. ‘యజమానుని భార్యలు బంగారు సూదులతో అశ్వమును గ్రుచ్చవలెను’’ అని శాస్త్ర ముండుటచే కౌసల్యయే కాక సుమిత్రా కైకేయిలు కూడ బంగారు సూదులతో (కృపాణైః) అంతకు పూర్వమే చంపబడిన అశ్వమును గ్రుచ్చిరి, అని గోవిందరాజులు.
మూ. పతత్రిణా తదా సార్ధం సుస్థితేన చ చేతసా,
అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. 32
ప్ర. అ. తదా = అప్పుడు, కౌసల్యా = కౌసల్య, సుస్థితేన = స్థిరమైన, చేతసా = చిత్తముతో, ధర్మకామ్యయా = ధర్మాచరణ శ్రద్ధతో, పతిత్రణా సార్ధమ్ = గుఱ్ఱముతో కూడ, ఏకామ్ = ఒక, రజనీమ్ = రాత్రి, అవసత్ = నివసించెను.
తా. ధర్మశ్రద్ధావతి యగు కౌసల్య స్థిర మైన చిత్తముతో, ఒక రాత్రి ఆ అశ్వ సమీపమున శాస్త్రోక్తరీతిని నివసించెను.
మూ. హోతాధ్వర్యుస్తథోద్గాతా హస్తేన సమయోజయన్,
మహిష్యా పరివృత్త్యా చ వావాతాం చ తథాపరామ్. 33
ప్ర. అ. హోతా = హోతయు, అధ్వర్యుః = అధ్వర్యుడు, తథా = మరియు, ఉద్గాతా = ఉద్గాతయు, మహిష్యా = పట్టమహిషితోను, పరివృత్త్యా చ = పరివృత్తితోను, వావాతామ్ = వావాత అనెడు, అపరామ్ = మరియొకతెను, హస్తేన = హస్తముతో, సమయోజయన్ = కూర్చిరి, అనగా గ్రహించిరి.
తా. హోత, అధ్వర్యువు, ఉద్గాత అను ఋత్విక్కులు, రాజమహిషిని, పరివృత్తిని, వావాతను, గ్రహించిరి.
వి. రాజుతోపాటు రాజ్యాభిషేకమును పొందిన భార్య మహిషి. ఉపేక్షిత భార్య పరివృత్తి. భోగిని స్త్రీ (ఉంపుడుకత్తె) వావాత. రాజుకు పాత్ర అందించునది పాలాకలి. ‘‘కృతాభిషేకా మహిషీ పరివృత్తిరుపేక్షితా, వావాతా భోగినీ పాతప్రదా పాలాకలీ మతా’’ (వైజయంతి). అశ్వమేధములో యజమానుడు ఈ నలుగురు స్త్రీలను నలుగురు ఋత్విక్కులకును దక్షిణగా ఇవ్వవలె నట. వారు వాళ్ళను పరిగ్రహించి, వారికి బదులుగా మరొక వస్తువు నేదైన తీసికొని, వారిని తిరిగి యజమానునకు ఇచ్చివేయుదురు. ఈ శ్లోకములో బ్రహ్మ అనే ఋత్విక్కునూ పాలాకలిని చెప్పకపోయినను వారిని గూడ చెప్పినట్లు గ్రహించవలెనని గోవిందరాజులు వ్రాసిరి.
మూ. పతత్త్రిణస్తస్య వపాముద్ధృత్య నియతేన్ద్రియః,
ఋత్విక్పరమసంపన్నః శ్రపయామాస శాస్త్రతః. 34
ప్ర. అ. నియతేన్ద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడును, పరమసంపన్నః = మిక్కిలి శాస్త్రజ్ఞానసంపన్నుడును అగు, ఋత్విక్ = ఋత్విక్కు, తస్య = ఆ, పతత్త్రిణః = అశ్వముయొక్క, వపామ్ = వపను, ఉద్ధృత్య = తీసి, శాస్త్రతః = శాస్త్రానుసారముగా, శ్రపయామాస = పక్వముచేసెను.
తా. ఇంద్రియనిగ్రహవంతుడును, ఉత్తమజ్ఞానసంపన్నుడును అగు ఋత్విక్కు, ఆ అశ్వముయొక్క వపను తీసి యథాశాస్త్రముగ పక్వము చేసెను.
మూ. ధూమగన్ధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిపః,
యథాకాలం యథాన్యాయం నిర్ణుదన్ పాపమాత్మనః. 35
ప్ర. అ. నరాధిపః = రాజు, యథాకాలమ్ = కాలానుసారముగా, యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగా, ఆత్మనః = తనయొక్క, పాపమ్ = పాపమును, నిర్ణుదన్ = తొలగించుకొనుచు, వపాయాః = వపయొక్క, ధూమగన్ధమ్ = ధూమముయొక్క గంధమును, జిఘ్రతి స్మ = వాసన చూచెను.
తా. దశరథుడు, తగిన సమయమున, శాస్త్రానుసారముగ, తన పాపమును తొలగించుకొనుటకై వపాధూమగంధమును వాసన చూచెను.
మూ. హయస్య యాని చాఙ్గాని తాని సర్వాణి బ్రాహ్మణాః,
అగ్నౌ ప్రాస్యంతి విధివత్సమన్త్రాః షోడశర్త్విజః. 36
ప్ర. అ. హయస్య = అశ్వముయొక్క, యాని = ఏ, అఙ్గాని = వివిధములైన అవయవములు గలవో, తాని సర్వాణి = వాటిని అన్నింటిని, సమన్త్రాః = మంత్రములతో కూడిన, ఋత్విజః = ఋత్విక్కు లైన, షోడశ = పదహారుగురు, బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, అగ్నౌ = అగ్నియందు, ప్రాస్యన్తి = హోమము చేసిరి.
తా. పదహారుగురు ఋత్విక్కులు, అశ్వముయొక్క వివిధాంగములను, సమంత్రకముగ అగ్నిలో హోమము చేసిరి.
మూ. ప్లక్షశాఖాసు యజ్ఞానామన్యేషాం క్రియతే హవిః,
అశ్వమేధస్య యజ్ఞస్య వైతసో భాగ ఇష్యతే. 37
ప్ర. అ. అన్యేషామ్ = ఇతరములైన, యజ్ఞానామ్ = యజ్ఞములయొక్క, హవిః = హవిస్సు, ప్లక్షశాఖాసు = జువ్వికొమ్మలయందు, క్రియతే = ఉంచబడును. అశ్వమేధస్య యజ్ఞస్య = అశ్వమేధ యజ్ఞముయొక్క, భాగః = హవిర్భాగము, వైతసః = ప్రబ్బలితీగ యందు సంస్కరింపబడునదిగ, ఇష్యతే = విధింపబడుచున్నది.
తా. ఇతరయజ్ఞములలో హవిస్సును జువ్వికొమ్మలపై ఉంచి సంస్కరింపవలెను. అశ్వమేధమునందు మాత్రము ప్రబ్బలితీగపై ఉంచి సంస్కరించవలెను.
మూ. త్య్రహోఽశ్వమేధః సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః,
చతుష్టోమమహస్తస్య ప్రథమం పరికల్పితమ్. 38
ప్ర. అ. బ్రాహ్మణైః = బ్రాహ్మణులచేత, కల్పసూత్రేణ = కల్పసూత్రముప్రకారము, అశ్వమేధః = అశ్వమేధము, త్య్రహః = మూడురోజుల పాటు చేయవలసినదిగా, సంఖ్యాతః = చెప్పబడినది. తస్య = దానియొక్క, ప్రథమమ్ = మొదటిదైన, అహః = దివసము, చతుష్టోమః = చతుష్టోమ మని, పరికల్పితమ్ = ఏర్పరుపబడినది.
తా. కల్పసూత్రానుసారముగా అశ్వమేధము మూడు దినములలో చేయవలసిన యజ్ఞము. మొదటి దివసమునకు చతుష్టోమ మని పేరు.
మూ. ఉక్థ్యం ద్వితీయం సంఖ్యాతమతిరాత్రం తథోత్తరమ్,
కారితాస్తత్ర బహవో విహితాః శాస్త్రదర్శనాత్. 39
ప్ర. అ. ద్వితీయమ్ = రెండవది, ఉక్థ్యమ్ = ఉక్థ్యమనియు, తథా = మరియు, ఉత్తరమ్ = తరువాతిది, అతిరాత్రమ్ = అతిరాత్ర మనియు, సంఖ్యాతమ్ = చెప్పబడినది. తత్ర = ఆ అశ్వమేధమునందు, శాస్త్రదర్శనాత్ = శాస్త్రముయొక్క దర్శనమువలన, విహితాః = విధింపబడిన, బహవః = అనేకక్రతువులు, కారితాః = చేయింపబడినవి.
తా. రెండవ దివసమునకు ఉక్థ్య మనియు, మూడవదానికి అతిరాత్రమనియు పేర్లు. శాస్త్రానుసారముగా విహితము లగు అనేకము లైన ఇతర క్రతువులను కూడ దశరథుడు ఆ సమయమున చేయించెను.
మూ. జ్యోతిష్టోమాయుషీ చైవమతిరాత్రౌ వినిర్మితౌ,
అభిజిద్విశ్వజిచ్చైవమప్తోర్యామో మహాక్రతుః. 40
ప్ర. అ. జ్యోతిష్టోమాయుషీ = జ్యోతిష్టోమాయుర్యాగములు, ఏవమ్ = మరియు, అతిరాత్రౌ = అతిరాత్రయాగములును, నిర్మితౌ = వినిర్మింపబడినవి. అభిజిత్ = అభిజిద్యాగము, విశ్వజిత్ = విశ్వజిద్యాగము, ఏవమ్ = మరియు, అప్తోర్యామః = అప్తోర్యామమను పేరు గల, మహాక్రతుః = మహాక్రతువు, చేయబడినవి.
తా. జ్యోతిష్టోమ ఆయుర్యాగములు, రెండు అతిరాత్రములు, అభిజిద్యాగ విశ్వజిద్యాగములు, అప్తోర్యామ మను మహాక్రతువు చేయబడినవి.
మూ. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః,
అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశమ్. 41
ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మితా,
అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవిహితే పురా. 42
ప్ర. అ. స్వకులవర్ధనః = తన వంశమును వృద్ధి పొందించు, రాజా = దశరథ మహారాజు, హోత్రే = హోతకు, ప్రాచీం దిశమ్ = తూర్పు దిక్కును, దదౌ = ఇచ్చెను. అధ్వర్యవే = అధ్వర్యువునకు, ప్రతీచీమ్ = పశ్చిమదిక్కును, బ్రహ్మణే = బ్రహ్మకు, దక్షిణాం దిశమ్ = దక్షిణ దిక్కును, తథా = మరియు, ఉద్గాత్రే = ఉద్గాతకు, ఉదీచీమ్ = ఉత్తరదిక్కును, ఇచ్చెను. పురా = పూర్వము, స్వయంభూవిహితే = బ్రహ్మచేత విధింపబడిన, అశ్వమేధే మహాయజ్ఞే = అశ్వమేధ యజ్ఞమునందు, ఏషా = ఈ, దక్షిణా = దక్షిణ, వినిర్మితా = నిర్మింపబడినది.
తా. తన వంశమునకు అభివృద్ధి చేకూర్చు దశరథమహారాజు తూర్పుదిక్కునందున్న దేశమును హోతకును, పశ్చిమదిక్కునందున్న దేశమును అధ్వర్యువునకును, దక్షిణదిక్కు నందున్న దేశమును బ్రహ్మకును, ఉత్తరదిక్కునందున్న దేశమును ఉద్గాతకును ఇచ్చి వేసెను. పూర్వము బ్రహ్మ విధించిన అశ్వమేధ యాగములో ఈ విధముగ దక్షిణ ఈయవలె నని నిర్ణయింపబడినది.
మూ. క్రతుం సమాప్య తు తదా న్యాయతః పురుషర్షభః,
ఋత్విగ్భ్యో హి దదౌ రాజా తాం ధరాం క్రతువర్ధనః. 43
ప్ర. అ. పురుషర్షభః = పురుషశ్రేష్ఠు డైన, రాజా = రాజు, క్రతువర్ధనః = క్రతువును వృద్ధి పొందించుచు, క్రతుమ్ = క్రతువును, సమాప్య = పూర్తిచేసి, తదా = అప్పుడు, న్యాయతః = శాస్త్రానుసారముగా, తాం ధరామ్ = ఆ భూమిని, ఋత్విగ్భ్యః = ఋత్విక్కులకు, దదౌ = ఇచ్చెను.
తా. పురుషశ్రేష్ఠు డైన దశరథుడు ఆ క్రతువును పూర్తిచేసి, దాని ఫలము పరిపూర్ణముగ లభించుటకై, ఈ భూమి నంతను ఋత్విక్కులకు దానము చేసెను.
మూ. ఋత్విజస్త్వబ్రువన్ సర్వే రాజానం గతకల్మషమ్,
భవానేవ మహీం కృత్స్నా మేకో రక్షితుమర్హతి. 44
ప్ర. అ. సర్వేః = సమస్త మైన, ఋత్విజస్తు = ఋత్విక్కు లైతే, గతకల్మషమ్ = పాపరహితు డైన, రాజానమ్ = రాజునుగూర్చి, అబ్రువన్ = పలికిరి. భవాన్ = నీవు, ఏకః ఏవ = ఒక్కడవే, కృత్స్నామ్ = సమస్త మైన, మహీమ్ = భూమిని, రక్షితుమ్ = రక్షించుటకు, అర్హసి = తగియున్నావు.
తా. కాని, ఆ ఋత్విక్కు లందరును, పాపరహితు డైన ఆ దశరథునితో ఇట్లనిరి - ‘‘ఈ భూమి నంతను రక్షింప గలవాడవు నీవొక్కడవే.’’
మూ. న భూమ్యా కార్యమస్మాకం న హి శక్తాః స్మ పాలనే,
రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప. 45
నిష్క్రయం కించిదేవేహ ప్రయచ్ఛతు భవానితి.
ప్ర. అ. భూమిప = ఓ రాజా! , భూమ్యా = భూమిచేత, అస్మాకమ్ = మాకు, కార్యమ్ = పని, న = లేదు. పాలనే = పాలించుటయందు, శక్తాః = సమర్థులము, న హి = కాము. వయమ్ = మేము, నిత్యమ్ = ఎల్లప్పుడును, స్వాధ్యాయకరణే = స్వాధ్యాయాధ్యయనమునందు, రతాః హి = ఆసక్తులము కదా! భవాన్ = నీవు, ఇహ = ఈ భూమి విషయమున, కించిత్ = ఏదైన, నిష్క్రయమ్ = మూల్యమును, ప్రయచ్ఛతు = ఇచ్చెదవుగాక.
తా. ‘‘భూమిని పరిపాలించు ఓ దశరథమహారాజా! ఎల్లప్పుడు స్వాధ్యాయాధ్య యనము చేసికొనుచుండు మాకు భూమితో పని లేదు. ఈ భూమికి బదులుగ, స్వల్పముగ, ఏదైన ధనము నిమ్ము.’’
వి. నిష్క్రయమ్ = ఏదైన ఒకదానికి బదులు ఇచ్చు ధనము మొ.
మూ. మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముద్యతమ్,
తత్ప్రయచ్ఛ నరశ్రేష్ఠ ధరణ్యా న ప్రయోజనమ్. 46
ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా్ఙ మణిరత్నమ్ = శ్రేష్ఠమైన మాణిక్యము గాని, సువర్ణం వా = బంగారము గాని, గావః = గోవులు గాని, యద్వా = ఏది, సముద్యతమ్ = సిద్ధముగా నున్నదో, తత్ = అది గాని, ప్రయచ్ఛ = ఇమ్ము. ధరణ్యా = భూమితో, ప్రయోజనమ్ = ప్రయోజనము, న = లేదు.
తా. ‘‘శ్రేష్ఠ మైన మాణిక్యము గాని, బంగారము గాని, గోవులు గాని, ఏ వస్తువు లభ్యమో అది గాని ఇమ్ము. మాకు భూమితో ప్రయోజనము లేదు.’’
మూ. ఏవముక్తో నరపతిర్బ్రాహ్మణైర్వేదపారగైః, 47
గవాం శతసహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః,
శతకోటీః సువర్ణస్య రజతస్య చతుర్గుణమ్. 48
ప్ర. అ. నరపతిః = నరులకు ప్రభువైన, సృపః = రాజు, వేదపారగైః = వేదముల పారమును చూచిన, బ్రాహ్మణైః = బ్రాహ్మణులచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడినవాడై, తేభ్యః = వారికి, గవామ్ = గోవులయొక్క, దశ శతసహస్రాణి = పది లక్షలను, సువర్ణస్య = బంగారముయొక్క, శతకోటీః = నూరు కోట్లను, రజతస్య = వెండియొక్క, చతుర్గుణమ్ = నాలుగు రెట్లను, దదౌ = ఇచ్చెను.
తా. వేదములలో నిష్ణాతు లైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా, దశరథుడు వారికి పది లక్షల గోవులను, వంద కోట్ల బంగారునాణెములను, నాలుగు వందల కోట్ల బంగారునాణెములను, నాలుగు వందల కోట్ల వెండినాణెములను ఇచ్చెను.
మూ. ఋత్విజశ్చ తతః సర్వే ప్రదదుః సహితా వసు,
ఋశ్యశృఙ్గాయ మునయే వసిష్ఠాయ చ ధీమతే. 49
ప్ర. అ. తతః = అటు పిమ్మట, ఋత్విజః = ఋత్విక్కులు, సర్వే = అందరును, సహితాః = కలిసినవారై, వసు = ఆ ధనమును, ఋశ్యశృఙ్గాయ మునయే = ఋశ్యశృంగమునికిని, ధీమతే = బుద్ధిమంతుడైన, వసిష్ఠాయ చ = వసిష్ఠునకును, ప్రదదుః = ఇచ్చిరి.
తా. ఆ ఋత్విక్కు లందరును కలిసి ఆ ధనమును ఋశ్యశృంగునకును, ధీమంతుడైన వసిష్ఠునకును ఇచ్చిరి.
మూ. తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః,
సుప్రీతమనసః సర్వే ప్రత్యూచుర్ముదితా భృశమ్. 50
ప్ర. అ. తతః = అటుపిమ్మట, సుప్రీతమనసః = బాగుగా సంతోషించిన మనస్సులు గల, తే = ఆ, ద్విజోత్తమాః = బ్రాహ్మణోత్తములు, సర్వే = అందరును, న్యాయతః = న్యాయముగా, ప్రవిభాగమ్ = పంపకమును, కృత్వా = చేసి, భృశమ్ = మిక్కిలి, ముదితాః = సంతోషించినాము అని, ప్రత్యూచుః = తిరిగి పలికిరి.
తా. అంతట సంతోషించిన మనస్సులు గల ఆ బ్రాహ్మణోత్తము లందరును న్యాయానుసారముగ ఆ ధనమును పంచుకొని, ‘‘చాల ఆనందించితిమి’’ అని రాజుతో పలికిరి.
మూ. తతః వ్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః,
జామ్బూనదం కోటిసంఖ్యం బ్రాహ్మణోభ్యో దదౌ తదా. 51
ప్ర. అ. తతః = అటు పిమ్మట, తదా = అప్పుడు, సుసమాహితః = చాలా శ్రద్ధకలవాడై, ప్రసర్పకేభ్యః = యాగము చూచుటకై వచ్చిన, బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు, కోటిసంఖ్యమ్ = కోటి సంఖ్య గల, జామ్బూనదమ్ = బంగారమును, దదౌ = ఇచ్చెను.
తా. పిమ్మట, దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు, కోటి బంగారు నాణెము లిచ్చెను.
మూ. దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణముత్తమమ్,
కస్మై చిద్యాచమానాయ దదౌ రాఘవనన్దనః. 52
ప్ర. అ. అథ = అటు పిమ్మట, రాఘవనన్దనః = దశరథుడు, యాచమానాయ = యాచించుచున్న, కస్మైచిత్ = ఒకానొక, దరిద్రాయ = దరిద్రుడైన, బ్రాహ్మణాయ = బ్రాహ్మణునకు, ఉత్తమమ్ = ఉత్తమమైన, హస్తాభరణమ్ = హస్తాభరణమును, దదౌ = ఇచ్చివేసెను.
తా. ఇంతలో ఒక దరిద్రబ్రాహ్మణుడు వచ్చి యాచింపగా, దశరథుడాతనికి తన చేత నున్న అభరణమును ఇచ్చివేసెను.
మూ. తతః ప్రీతేషు నృపతిః ద్విజేషు ద్విజవత్సలః,
ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః. 53
ప్ర. అ. తతః = పిమ్మట, ద్విజవత్సలః = బ్రాహ్మణులయందు ప్రేమ గల, నృపతిః = రాజు, ద్విజేషు = బ్రాహ్మణులు, ప్రీతేషు సత్సు = సంతసించినవారగుచుండగా, హర్షపర్యాకులేక్షణః = ఆనందముతో వ్యాకులమైన చూపులుకలవాడై, తేషామ్ = వారియొక్క (వారికి), ప్రణామమ్ = నమస్కారమును, అకరోత్ = చేసెను.
తా. బ్రాహ్మణులయందు అధికప్రేమ గల దశరథుడు, వారందరును సంతృప్తి పొంది నట్లు చూచి, ఆనందముచే వ్యాకులము లైన చూపులతో, వారికి నమస్కరించెను.
మూ. తస్యాశిషోఽథ విధివద్బ్రాహ్మణైః సముదీరితాః,
ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ. 54
ప్ర. అ. అథ = అనంతరము, ఉదారస్య = దానశీలుడును, నృవీరస్య = మానవులలో గొప్ప వీరుడును, ధరణ్యామ్ = భూమిపై, ప్రణతస్య = వంగి నమస్కరించుచున్నవాడును అగు, తస్య = అతనికి, బ్రాహ్మణైః = బ్రాహ్మణులచేత, విధివత్ = యథాశాస్త్రముగా, ఆశిషః = ఆశీర్వచనములు, సముదీరితాః = పలకబడినవి.
తా. సాష్టాంగప్రణామము చేయుచున్న, ఆ మహాదాత యైన దశరథుని బ్రాహ్మణులు యథాశాస్త్రముగ ఆశీర్వదించిరి.
మూ. తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమమ్,
పాపాపహం స్వర్నయనం దుష్కరం పార్థివర్షభైః. 55
ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రాజు, పాపాపహమ్ = పాపములను తొలగించునదియు, స్వర్నయనమ్ = స్వర్గమును చేర్చునదియు, పార్థివర్షభైః = శ్రేష్ఠులైన రాజులచేత కూడ, దుష్కరమ్ = చేయ శక్యము కానిదియు, అనుత్తమమ్ = అత్యుత్తమ మైనదియు అగు, యజ్ఞమ్ = యజ్ఞమును, ప్రాప్య = పొంది, ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడయ్యెను.
తా. అశ్వమేధయాగము సర్వపాపములను తొలగించును. స్వర్గమునకు తీసికొని వెళ్లును. గొప్ప రాజులు కూడ దీనిని చేయజాలరు. అట్టి అత్యుత్తమమైన అశ్వమేధ యాగము పూర్తిచేసికొని దశరథుడు చాల సంతసించెను.
మూ. తతోఽబ్రవీదృశ్యశృఙ్గం రాజా దశరథస్తదా,
కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత. 56
ప్ర. అ. తతః = పిమ్మట, దశరథః రాజా = దశరథమహారాజు, తదా = అప్పుడు, ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని గూర్చి, అబ్రవీత్ = పలికెను. సువ్రత = మంచి వ్రతము కలవాడా! కులస్య = కులమునకు, వర్ధనమ్ = వృద్ధి కలిగించు కర్మను, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగిఉన్నావు.
తా. పిమ్మట దశరథుడు ‘‘ఓ! మహామునీ! నా వంశము యొక్క వృద్ధికి హేతువగు కర్మను చేయుము’’ అని ఋశ్యశృంగుని ప్రార్థించెను.
మూ. తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః,
భవిష్యన్తి సుతా రాజం శ్చత్వారస్తే కులోద్వహాః. 57
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుర్దశః సర్గః.
ప్ర. అ. ద్విజసత్తమః = ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు, తథేతి = అటులనే చేయించెదను అని, రాజానమ్ = రాజును గూర్చి, ఉవాచ = పలికెను. రాజన్ = ఓ రాజా! తే = నీకు, కులోద్వహాః = కులము నుద్ధరించు, చత్వారః = నలుగురు, సుతాః = కుమారులు, భవిష్యన్తి = పుట్టగలరు.
తా. ‘‘ఓ రాజా! అటులనే చేయించెదను. నీకు వంశోద్ధారకులైన నలుగురు కుమారులు పుట్టగలరు’’ అని ఋశ్యశృంగుడు పలికెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,
బాలకాండలో చతుర్దశసర్గ సమాప్తము.
