Chapter_15

Back
Book Balakandamu
Chapter No 21
Pages 9
Read Time 14 Minutes

Chapter_15

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ పఞ్చదశః సర్గః

ఋష్యశృంగుని యాధ్వర్యవమున దశరథుడు పుత్రేష్టి ప్రారంభించుట. దేవతలు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు రావణవధోపాయము చెప్పుట. శ్రీమహావిష్ణువు దేవతల నోదార్చుట.

మూ. మేధావీ తు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్,

లబ్ధసంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. 1

ప్ర. అ. తతః = పిమ్మట, మేధావీ = మేధావంతుడును, వేదజ్ఞః = వేదములు ఎరిగిన వాడును అగు, సః = అతడు, కించిత్ = కొంచెము, ధ్యాత్వా = ఆలోచించి, తతః = పిమ్మట, లబ్ధసంజ్ఞః = పొందబడిన స్మృతికలవాడై, తమ్ = ఆ, నృపమ్ = రాజును గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. మేధావంతుడును, సకలవేదనిష్ణాతుడును అగు ఋశ్యశృంగుడు కొంచెము ఆలోచించి, ఏ కర్మ చేసిన బాగుండునో గుర్తు చేసికొని దశరథునితో ఇట్లనెను.

మూ. ఇష్టిం తేఽహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్,

అథర్వశిరసి ప్రోక్తెర్శన్త్రైః సిద్ధాం విధానతః. 2

ప్ర. అ. అహమ్ = నేను, తే = నీకు, పుత్రకారణాత్ = పుత్రులు కలుగుటకై, అథర్వశిరసి = అథర్వశిరస్సు అను వేదభాగమునందు, ప్రోక్తైః = చెప్పబడిన, మన్రైః = మంత్రములచేత, సిద్ధామ్ = ఏర్పడునదియు (చేయబడునదియు), పుత్రీయామ్ = పుత్రులను ఇవ్వగలదియు అగు, ఇష్టిమ్ = యాగమును, విధానతః = శాస్త్రానుసారముగ, కరిష్యామి = చేయగలను.

తా. ‘‘నీకు పుత్రులు కలుగుటకై, పుత్రీయేష్టిని చేయించెదను. దీనిని అథర్వశిరస్సు అనెడు వేదభాగములో నున్న మంత్రములచే చేయించవలెను.’’

మూ. తతః పాక్రమ్య తామిష్టం పుత్రీయాం పుత్రకారణాత్,

జుహావ చాగ్నౌ తేజస్వీ మన్త్రదృష్టేన కర్మణా. 3

ప్ర. అ. తతః = పిమ్మట, పుత్రకారణాత్ = పుత్రులకొరకై, పుత్రీయామ్ = పుత్రులను కలిగించు, తామ్ ఇష్టిమ్ = ఆ ఇష్టిని, పాక్రమ్య = ప్రారంభించి, తేజస్వీ = బ్రహ్మతేజస్సు గల ఆ ఋశ్యశృంగుడు, మంత్రదృష్టేన = మంత్రోక్తమైన, కర్మణా = కర్మచేత, అగ్నౌ = అగ్నియందు, జుహావ చ = హోమము చేసెను.

తా. బ్రహ్మతేజోవంతు డగు ఋశ్యశృంగుడు, దశరథునకు పుత్రులు కలుగుటకై, పుత్రీయేష్టిని ప్రారంభించి, మంత్రోక్తవిధానముతో అగ్నిలో హోమము చేసెను.

మూ. తతో దేవాః సగన్ధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః,

భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. 4

ప్ర. అ. తతః = పిమ్మట, సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన, దేవాః = దేవతలును, సిద్ధాశ్చ = సిద్ధులును, పరమర్షయః = గొప్ప ఋషులును, యథావిధి = యథాశాస్త్రముగా, భాగప్రతిగ్రహార్థం = యజ్ఞభాగములను స్వీకరించుటకు, సమవేతాః వై = కలసిరి.

తా. అంతట, దేవతలును, గంధర్వులును, సిద్ధులును, పరమర్షులును, శాస్త్రానుసారముగా తమ తమ యజ్ఞభాగములను స్వీకరించుటకై అచట కలిసిరి.

మూ. తాః సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవతాః,

అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్. 5

ప్ర. అ. తాః = ఆ, దేవతాః = దేవతలు, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, తస్మిన్ = ఆ, సదసి = సదస్సునందు, సమేత్య = కలిసి, లోకకర్తారమ్ = లోకములను సృజించు, బ్రహ్మాణమ్ = బ్రహ్మదేవుని గూర్చి, మహత్ = పూజ్యమైన, వచనమ్ = వచనమును, అబ్రువన్ = పలికిరి.

తా. ఆ దేవత లందరును శాస్త్రానుసారముగ ఆ సదస్సులో చేరి, సకల లోకస్రష్ట యగు బ్రహ్మదేవుని సమీపించి, పూజ్య మైన వాక్యములు పలికిరి.

మూ. భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః,

సర్వాన్నో బాధతే వీర్యా చ్ఛాసితుం తం న శక్నుమః. 6

ప్ర. అ. భగవన్ = ఓ భగవంతుడా!, రావణో నామ = రావణుడనెడు, రాక్షసః = రాక్షసుడు, త్వత్ప్రసాదేన = నీ అనుగ్రహముచేత, వీర్యాత్ = పరాక్రమమువలన, నః = మమ్ములను, సర్వాన్ = అందరిని, బాధతే = బాధించుచున్నాడు. తమ్ = వానిని, శాసితుమ్ = శిక్షించుటకు, న శక్నుమః = సమర్థులము కాజాలకున్నాము.

తా. ఓ! భగవంతుడా! రావణు డనెడు రాక్షసుడు, నీ వరప్రసాదమువలన కలిగిన పరాక్రమముతో మమ్ముల నందరిని బాధించుచున్నాడు. అతనిని శిక్షింపజాల కున్నాము.

మూ. త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా,

మానయన్తశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే. 7

ప్ర. అ. భగవన్ = భగవంతుడా! పురా = పూర్వము, ప్రీతేన = నంతోషించిన, త్వయా = నీచేత, తస్మై = వానికి, వరః = వరము, దత్తః = ఇవ్వబడినది. తమ్ = ఆ వరమును, మానయన్తః = గౌరవించుచు, తస్య = అతనియొక్క, సర్వమ్ = సమస్తమైన దుష్టత్వమును, నిత్యమ్ = ఎల్లప్పుడును, క్షమామహే = క్షమించుచున్నాము.

తా. భగవంతుడా! పూర్వ మాతని తపస్సుకు సంతసించిన నీవు అతనికి వర మిచ్చితివి. ఆ వరమును గౌరవించుచు మేము అతడు చేయు అపకారమును సర్వదా క్షమించుచున్నాము.

మూ. ఉద్వేజయతి లోకాం స్త్రీనుచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః,

శక్రం త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి. 8

ప్ర. అ. దుర్మతిః = ఆ దుర్మతి, త్రీన్ = మూడు, లోకాన్ = లోకములను, ఉద్వేజయతి = పీడించుచున్నాడు. ఉచ్ఛ్రితాన్ = ఉన్నతపదవులలో ఉన్నవారిని, ద్వేష్టి = ద్వేషించుచున్నాడు. త్రిదశరాజానమ్ = దేవరాజైన, శక్రమ్ = ఇంద్రుని, ప్రధర్షయితుమ్ = అవమానించుటకు, ఇచ్ఛతి = ఇచ్ఛయించుచున్నాడు.

తా. దుర్బుద్ధియైన ఆ రావణుడు మూడు లోకములను పీడించుచున్నాడు. లోకపాలులతో ద్వేషము వహించుచున్నాడు. దేవాధీశుడైన ఇంద్రుని కూడ అవమానింప చూచుచున్నాడు.

మూ. ఋషీన్యక్షాన్సగన్ధర్వానసురా న్బ్రాహ్మణాం స్తథా,

అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. 9

ప్ర. అ. దుర్ధర్షః = ఎదిరింప శక్యము కాని అతడు, వరదానేన = వరదానముచేత, మోహితః = గర్వితుడై, ఋషీన్ = ఋషులను, యక్షాన్ = యక్షులను, సగన్ధర్వాన్ = గంధర్వులతో కూడిన, అసురాన్ = అసురులను, తథా = మరియు, బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను, అతిక్రామతి = అవమానించుచున్నాడు.

తా. వరముచే కన్ను గానక, ఆ రావణుడు, ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానించుచున్నాడు. వాని నెవ్వరును, జయింపజాలకున్నారు.

మూ. నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః,

చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోఽపి న కమ్పతే. 10

ప్ర. అ. ఏనమ్ = వీనిని, సూర్యః = సూర్యుడు, న ప్రతపతి = తపింప చేయుటలేదు, మారుతః = గాలి, పార్శ్వే = దగ్గర, న వాతి = వీచుటలేదు, చలోర్మిమాలీ = చంచలము లైన తరంగపంక్తులు గల, సముద్రోఽపి = సముద్రుడు కూడ, తమ్ = అతనిని, దృష్ట్వా = చూచి, న కమ్పతే = కదలుటలేదు.

తా. సూర్యుడు ఈతనికి వేడి కలిగించడు. వాయువు ఇతని ప్రక్క మసలుటకు భయపడును. ఎల్లప్పుడును చలించు తరంగపంక్తులు గల సముద్రుడు కూడ ఈతనిని చూడగనే స్తంభించిపోవును.

మూ. తన్మహన్నో భయం తస్మాద్రాక్షసాద్ఘోరదర్శనాత్,

వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి. 11

ప్ర. అ. తత్ = ఆ కారణమువలన, ఘోరదర్శనాత్ = ఘోరమైన దర్శనము గల, తస్మాత్ = ఆ, రాక్షసాత్ = రాక్షసునినుండి, నః = మాకు, మహత్ = గొప్ప, భయమ్ = భయము, భగవన్ = భగవంతుడా! తస్య = వానియొక్క, వధార్థమ్ = వధకొరకై, ఉపాయమ్ = ఉపాయమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగుదువు.

తా. వాని దర్శనమే చాల ఘోరమైనది. అట్టి వానినుండి మాకు గొప్ప భయము వచ్చిపడినది. భగవంతుడా! వానిని చంపుటకై ఏదైన ఒక ఉపాయము చేయుము.

మూ. ఏవముక్తః సురైః సర్వైశ్చిన్తయిత్వా తతోఽబ్రవీత్,

హన్తాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః. 12

ప్ర. అ. సర్వైః = సమస్త మైన, సురైః = దేవతలచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన బ్రహ్మదేవుడు, చిన్తయిత్వా = ఆలోచించి, తతః = అటుపిమ్మట, అబ్రవీత్ = పలికెను. తస్య = ఆ, దురాత్మనః = దురాత్మునియొక్క, అయమ్ = ఈ, వధోపాయః = చంపుటకు ఉపాయము, విదితః = తెలిసినది. హన్త = ఆహా!

తా. దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇట్లు పలికెను. ‘‘ఆహా! ఈ దురాత్ముని చంపుటకు ఒక ఉపాయము తోచినది.’’

మూ. తేన గన్ధర్వయక్షాణాం దేవదానవరక్షసామ్,

అవధ్యోఽ స్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా. 13

ప్ర. అ. తేన = వానిచేత, గన్ధర్వయక్షాణామ్ = గంధర్వులకు యక్షులకు, దేవదానవరక్షసామ్ = దేవతలకు దానవులకు రాక్షసులకు, అవధ్యః = చంపశక్యము కానివాడను, అస్మి = అగుదును గాక, ఇతి = అని, వాక్ = వాక్కు, ఉక్తా = పలకబడినది. మయా చ = నా చేత కూడ, తత్ = అది, తథా = అట్లే అగుగాక అని, ఉక్తమ్ = చెప్పబడినది.

తా. దేవదానవరాక్షసగంధర్వయక్షుల చేతిలో నాకు చావు లేకుండు గాక అని అతడు పలుకగా, అట్లే అగుగాక అని నే నంటిని.

మూ. నాకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాం స్తదా,

తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోఽస్య విద్యతే. 14

ప్ర. అ. తత్ రక్షః = ఆ రాక్షసుడు, అవజ్ఞానాత్ = అనాదరమువలన, తదా = అప్పుడు, మానుషాన్ = మనుష్యులను, న అకీర్తయత్ = చెప్పలేదు. తస్మాత్ = ఆ కారణమువలన, సః = అతడు, మానుషాత్ = మనుష్యునివలన, వధ్యః = చంపదగినవాడు. అస్య = వానికి, అన్యః = మరియొక, మృత్యుః = మరణ హేతువు, న విద్యతే = లేదు.

తా. అప్పు డా రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరముచే వారిని పేర్కొనలేదు. కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు అవకాశమున్నది. మరొక మరణోపాయము లేదు.

మూ. ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్,

దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తేఽభవం స్తదా. 15

ప్ర. అ. తదా = అప్పుడు, బ్రహ్మణా = బ్రహ్మచేత, సముదాహృతమ్ = చెప్పబడిన, ఏతత్ = ఈ, ప్రియమ్ = ప్రియమైన, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, తే దేవాః = ఆ దేవతలును, మహర్షయః = మహర్షులును, సర్వే = అందరును, ప్రహృష్టాః అభవన్ = సంతసించిరి.

తా. బ్రహ్మదేవుడు పల్కిన ఈ ప్రియవాక్యమును విని, దేవతలును, మహర్షులును, అందరును చాల సంతసించిరి.

మూ. ఏతస్మిన్నన్తరే విష్ణురుపయాతో మహాద్యుతిః,

శఙ్ఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః. 16

ప్ర. అ. ఏతస్మిన్ = ఈ, అన్తరే = అవకాశమునందు, మహాద్యుతిః = గొప్ప కాంతి కలవాడును, శఙ్ఖచక్రగదాపాణిః = శంఖచక్రగదలు హస్తములందు కలవాడును, పీతవాసాః = పచ్చని వస్త్రమును ధరించినవాడును, జగత్పతిః = జగత్తుకు ప్రభువును అయిన, విష్ణుః = విష్ణువు, ఉపయాతః = వచ్చెను.

తా. ఇంతలో, గొప్ప కాంతి కలవాడును జగత్తున కంతకును ప్రభువును అయిన విష్ణువు శంఖచక్రగదాహస్తుడై, పీతాంబరధారియై అచటికి వచ్చెను.

మూ. బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః,

తమబ్రువన్ సురాస్సర్యే సమభిష్టూయ సన్నతాః. 17

ప్ర. అ. బ్రహ్మణా = బ్రహ్మతో, సమాగమ్య = కలిసి, తత్ర = అచట, సమాహితః = ఏకాగ్రచిత్తుడై, తస్థౌ = ఉండెను. సురాః = దేవతలు, సర్వే = అందరును, సన్నతాః = నమస్కరించుచున్నవారై, తమ్ = అతనిని, సమభిష్టూయ = స్తుతించి, అబ్రువన్ = ఇట్లు పలికిరి.

తా. విష్ణువు బ్రహ్మను కలిసి, మౌనముగా నిలబడెను. అంతట దేవత లందరును నమస్కరించి స్తుతించుచు ఆ విష్ణువుతో ఇట్లనిరి.

మూ. త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా,

రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః ప్రభోః. 18

ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః,

తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ. 19

విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విధమ్.

ప్ర. అ. విష్ణో = ఓ విష్ణూ! లోకానామ్ = లోకములయొక్క, హితకామ్యయా = హితమునందు కోరికచేత, త్వామ్ = నిన్ను, నియోక్ష్యామహే = నియమించుచున్నాము. విష్ణ్ఙో = విష్ణూ! త్వమ్ = నీవు, అయోధ్యాధిపతేః = అయోధ్యకు అధిపతియు, ప్రభోః = ప్రభువును, ధర్మజ్ఞస్య = ధర్మముల నెరిగినవాడును, వదాన్యస్య = ఔదార్యవంతుడును, మహర్షి సమతేజసః = మహర్షితో సమాన మైన తేజస్సు కలవాడును అగు, తస్య దశరథస్య రాజ్ఞః = ఆ దశరథమహారాజుయొక్క, హ్రీశ్రీకీర్త్యుపమాసు = హ్రీ, శ్రీ, కీర్తి అను దక్షపుత్రికలతో సమానులైన, తిసృషు = ముగ్గురు, భార్యాసు = భార్యలయందు, ఆత్మానమ్ = తనను, చతుర్విధమ్ = నాలుగు విధము లైన వానినిగా, కృత్వా = చేసి, పుత్రత్వమ్ = పుత్రత్వమును, ఆగచ్ఛ = పొందుము.

తా. ఓ విష్ణూ! లోకముల హితముకొరకై నిన్ను ఒక కార్యము చేయుటకై వేడుచున్నాము. అయోధ్యాధిపతి యైన దశరథుడు ధర్మజ్ఞుడు, ఔదార్యవంతుడు, మహర్షి వంటి తేజస్సు కలవాడు, సత్ప్రభువు. నీవు నాలుగు విధములుగా ఏర్పడి హ్రీ -శ్రీ-కీర్తుల వంటి అతని ముగ్గురి భార్యలలో పుత్రులుగా ఆవిర్భవింపుము.

మూ. తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకణ్టకమ్,

అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణమ్. 20

ప్ర. అ. విష్ణో = ఓ విష్ణూ!, త్వమ్ = నీవు, తత్ర = దశరథభార్యలయందు, మానుషః = మనుష్యుడుగా, భూత్వా = జనించి, ప్రవృద్ధమ్ = పెచ్చు పెరిగి పోవుచున్నవాడును, లోకకణ్టకమ్ = లోకములకు కంటకము వంటి వాడును, దైవతైః = దేవతలచేత, అవధ్యమ్ = చంప శక్యము కానివాడును అగు, రావణమ్ = రావణుని, సమరే = యుద్ధమునందు, జహి = చంపుము.

తా. ఓ విష్ణూ! నీవు ఆ దశరథభార్యలయందు మనుష్యుడుగా జన్మించి, మితిమీరిపోవుచున్నవాడును, లోకములకు కంటకము వలె నున్నవాడును, దేవతలచే చంప శక్యము కానివాడును అగు రావణుని యుద్ధమునందు సంహరించుము.

మూ. స హి దేవాంశ్చ గన్ధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్,

రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే. 21

ప్ర. అ. సః = ఆ, మూర్ఖః = మూర్ఖు డైన, రాక్షసః = రాక్షసు డైన, రావణః = రావణుడు, దేవాంశ్చ = దేవతలను, గన్ధర్వాన్ = గంధర్వులను, సిద్ధాంశ్చ = సిద్ధులను, మునిసత్తమాన్ = మునిశ్రేష్ఠులను, వీర్యోత్సే కేన = వీర్యగర్వముచే, బాధతే హి = బాధించుచున్నాడు కదా.

తా. మూర్ఖుడైన రాక్షసుడు, ఆ రావణుడు, వీర్యమదముచే, దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠులను బాధించుచున్నాడు.

మూ. ఋషయశ్చ తతస్తేన గన్ధర్వాప్సరసస్తథా,

క్రీడన్తో నన్దనవనే క్రూరేణ కిల హింసితాః. 22

ప్ర. అ. తతః = ఆ పరాక్రమగర్వమువలన, తేన = ఆ, క్రూరేణ = క్రూరునిచేత, ఋషయశ్చ = ఋషులును, తథా = మరియు, నన్దనవనే = నందనవనమునందు క్రీడన్తః = క్రీడించుచున్న, గన్ధర్వాప్సరసః = గంధర్వులు, అప్సరసలును, హింసితాః కిల = హింసింపబడినారుకదా.

తా. ఆ క్రూరుడు, ఎందరో ఋషులను, నందనవనములో విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించినాడు కదా!

మూ. వధార్థం వయమాయాతాస్తన్య వై మునిభిః సహ,

సిద్ధగన్ధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. 23

ప్ర. అ. వయమ్ = మేము, సిద్ధగన్ధర్వయక్షాశ్చ = సిద్ధులు, గంధర్వులు, యక్షులును, మునిభిః సహ = మునులతో, తస్య = వానియొక్క, వధార్థమ్ = వధకొరకై, ఆయాతాః = వచ్చిఉన్నాము. తతః = ఆ కారణమువలన, (మేమందరమును), త్వామ్ = నిన్ను, శరణం గతాః = శరణు పొందినాము.

తా. కావున, సిద్ధగంధర్వయక్షులును, మేమును, మునులతో కలిసి నిన్ను వేడుకొనుటకై ఇచటికి వచ్చినాము. మేమందరము నిన్ను శరణు పొందుచున్నాము.

మూ. త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప,

వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు. 24

ప్ర. అ. పరంతప = శత్రువులను బాధించు, దేవ = ఓ విష్ణుదేవుడా! త్వమ్ = నీవే, నః సర్వేషామ్ = మాకందరికిని, పరమా = శ్రేష్ఠమైన, గతిః = గతియైనవాడవు. దేవశత్రూణామ్ = రాక్షసులయొక్క, వధాయ = సంహారముకొరకు, నృణాం లోకే = మనుష్యలోకమునందు, మనః = మనస్సును, కురు = చేయుము.

తా. ఓ! శత్రువినాశకా! నీవే మాకు అందరికిని అత్యుత్తమమైన గతివి. రాక్షస సంహారము చేయుటకై నరలోకమున జనింప నిశ్చయము చేయుము.

మూ. ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశపుఙ్గవః, 25

పితామహపురోగాంస్తాన్ సర్వలోకనమస్కృతః,

అబ్రవీత్త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్. 26

ప్ర. అ. త్రిదశపుఙ్గవః = దేవతలలో శ్రేష్ఠుడును, సర్వలోకనమస్కృతః = సర్వలోకములచే నమస్కరింపబడినవాడును, దేవేశః = దేవతల ప్రభువును అగు, విష్ణుః = విష్ణువు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడినవాడై, సమేతాన్ = అచట కలిసినవారును, ధర్మసంహితాన్ = ధర్మముతో కూడినవారును, పితామహపురోగాన్ = బ్రహ్మ మొదలైన, తాన్ = ఆ, సర్వాన్ = సమస్త మైన, త్రిదశాన్ = దేవతలను గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. దేవతల ప్రభువును, దేవతాశ్రేష్ఠుడును, సర్వలోకములచే నమస్కరింప బడినవాడును, అగు విష్ణువు, ఈ విధముగ ప్రార్థింపబడినవాడై, ధర్మమును అనుసరించువారగు అచటికి చేరిన బ్రహ్మాది దేవతల నందరిని ఉద్దేశించి ఇట్లు పలికెను.

మూ. భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్,

సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాన్ధవమ్, 27

హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్,

దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ,

వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమామ్. 28

ప్ర. అ. భయమ్ = భయమును, త్యజత = విడవండి, భద్రమ్ = క్షేమమగుగాక. వః = మీయొక్క, హితార్థమ్ = హితముకొరకు, సపుత్రపౌత్రమ్ = పుత్రపౌత్రాదులతో కూడినవాడును, సామాత్యమ్ = అమాత్యులతో కూడినవాడును, నమిత్రజ్ఞాతిబాన్ధవమ్ = మిత్రులతో జ్ఞాతులతో బంధువులతో కూడినవాడును, క్రూరమ్ = క్రూరుడును, దురాత్మానమ్ = దుష్టస్వభావము కలవాడును, దేవర్షీణామ్ = దేవతలకును ఋషులకును, భయావహమ్ = భయము కలిగించువాడును అగు, రావణమ్ = రావణుని, యుధి = యుద్ధమునందు, హత్వా = చంపి, ఇమామ్ = ఈ, పృథివీమ్ = భూమిని, పాలయన్ = పాలించుచు, దశవర్షసహస్రాణి = పదివేల సంవత్సరములును, దశవర్షశతాని చ = పది వందల సంవత్సరములును, మానుషే లోకే = మనుష్యలోకమునందు, వత్స్యామి = నివసింపగలను.

తా. ‘‘భయము విడిచిపెట్టుడు. మీకు క్షేమ మగును. మీ హితము కొరకై, నేను, క్రూరుడును, దురాత్ముడును, దేవతలకు (మీకును) ఋషులకు భయము కలిగించువాడును, అగు రావణుని, వాని పుత్ర-పౌత్ర-అమాత్య-మిత్ర-జ్ఞాతి- బాంధవులను, యుద్ధమునందు సంహరించి, పదకొండువేల సంవత్సరములు మర్త్యలోకములో నివసించి, ఈ భూమిని పాలింపగలను.’’

మూ. ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్,

మానుషే చిన్తయామాస జన్మభూమిమథాత్మనః. 29

ప్ర. అ. ఆత్మవాన్ = ఉత్తమబుద్ధికలవాడగు, విష్ణు దేవః = విష్ణుదేవుడు, దేవానామ్ = దేవతలకు, ఏవమ్ = ఈవిధముగా, వరమ్ = వరమును, దత్వా = ఇచ్చి, అథ = పిమ్మట, ఆత్మనః = తనకు, మానుషే = మనుష్యలోకమునందు, జన్మభూమిమ్ = అవతరించుటకు తగిన స్థానమును గూర్చి, చిన్తయామాస = ఆలోచించెను.

తా. బుద్ధిమంతు డగు విష్ణుదేవుడు దేవతలకు ఈ విధముగా వరము నిచ్చి, తాను మనుష్యలోకములో అవతరించుటకు తగిన స్థానమును గూర్చి ఆలోచించెను.

మూ. తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్,

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్. 30

ప్ర. అ. తతః = పిమ్మట, పద్మపలాశాక్షః = పద్మపు రేకుల వంటి కన్నులు గల విష్ణువు, తదా = అప్పుడు, ఆత్మానమ్ = తనను, చతుర్విధమ్ = నాలుగు విధములుగా, కృత్వా = చేసి, దశరథం నృపమ్ = దశరథమహారాజును, పితరమ్ = తండ్రినిగా, రోచయామాస = ఇష్టపడెను.

తా. అంత, పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ విష్ణువు, అప్పుడు, తనను నాలుగు విధములుగా చేసి, దశరథుని తన తండ్రిగా చేసికొనుటకు ఇష్టపడెను.

మూ. తతో దేవాః సగన్ధర్వాస్సరుద్రాః సాప్సరోగణాః,

స్తుతిభిర్దివ్యరూపాభిస్తుష్టువుర్మధుసూదనమ్. 31

ప్ర. అ. తతః = పిమ్మట, సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన, సరుద్రాః = రుద్రులతో కూడిన, సాప్సరోగణాః = అప్సరస్త్రీల సముదాయముతో కూడిన, దేవాః = దేవతలు, దివ్యరూపాభిః = దివ్యమైన రూపము గల, స్తుతిభిః = స్తోత్రముల చేత, మధుసూదనమ్ = మధువు అను రాక్షసుని చంపిన విష్ణువును, తుష్టువుః = స్తుతించిరి.

తా. అంతట దేవతలును, గంధర్వులును, రుద్రులును, అప్సర స్త్రీ గణములును దివ్యము లగు స్తోత్రములతో ఆ విష్ణువును స్తుతించిరి.

మూ. తముద్ధతం రావణముగ్రతేజసం

ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్,

విరావణం సాధు తపస్వికణ్టకం

తపస్వినాముద్ధర తం భయావహమ్. 32

ప్ర. అ. ఉద్ధతమ్ = విజృంభించినవాడును, ఉగ్రతేజసమ్ = భయంకరమైన పరాక్రమము కలవాడును, ప్రవృద్ధదర్పమ్ = వృద్ధిపొందిన దర్పము కలవాడును, త్రిదశేశ్వరద్విషమ్ = దేవేంద్రుని ద్వేషించుచున్నవాడును, తపస్వికణ్టకమ్ = మహర్షులకు కంటకము వంటివాడును, తపస్వినామ్ = మహర్షులకు, భయావహమ్ = భయము కలిగించువాడును, అగు, తమ్ = ప్రసిద్ధు డైన, తమ్ = ఆ, రావణమ్ = రావణుని, సాధు = చక్కగా, ఉద్ధర = ఉన్మూలించుము.

తా. భయంకర మైన పరాక్రమము గల ఆ రావణుడు వృద్ధిపొందిన గర్వముతో విజృంభించుచున్నాడు. ఇంద్రుని ద్వేషించుచున్నాడు. లోకములను ఏడ్పించుచున్నాడు. మునులను బాధించుచు సర్వదా వారికి భయహేతు వగు చున్నాడు. అట్టి వానిని పూర్తిగా ఉన్మూలించుము.

మూ. తమేవ హత్వా సబలం సబాన్ధవం

విరావణం రావణమగ్య్రపౌరుషమ్.

స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం

సురేన్ద్రగుప్తం గతదోషకల్మషమ్. 33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచదశః సర్గః.

ప్ర. అ. సబలమ్ = సైన్యముతో కూడినవాడును, సబాన్ధవమ్ = బంధువులతో కూడినవాడును, విరావణమ్ = లోకములను ఏడ్పించువాడును, అగ్య్రపౌరుషమ్ = శ్రేష్ఠమైన పౌరుషము కలవాడును అగు, తమ్ ఏవ = ఆ, రావణమ్ = రావణుని, హత్వా = చంపి, చిరమ్ = చిరకాలము, గతజ్వరః = పోయిన వ్యథ కలవాడవై, సురేన్ద్రగుప్తమ్ = దేవేంద్రునిచే రక్షింపబడినదియు, గతదోషకల్మషమ్ = పోయిన దోషములును కల్మషములును గల, స్వర్లోకమ్ = స్వర్గలోకమును గూర్చి, ఆగచ్ఛ = రమ్ము.

తా. గొప్ప పౌరుషము కలవాడును, లోకములను ఏడ్పించువాడును అగు ఆ రావణుని, సైన్యబాంధవాదిసహితముగ చంపి, చాలకాలము పాటు ఏ చింతలు లేనివాడవై, దేవేంద్రునిచే రక్షింపబడినదియు, దోషములు కాని పాపములు కాని లేనిదియు అగు స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.

వి.‘‘సురేన్ద్రగుప్తమ్’’ అనుదానిని సురేన్ద్ర + గుప్తమ్ అని విడదీసి, సురేంద్ర = ఓ సురశ్రేష్ఠుడా!, గుప్తమ్ = రహస్యమైనదియు, చిరమ్ = పురాతన మైనదియు అగు, స్వర్లోకమ్ = వైకుంఠమును, ఆగచ్ఛ = చేరుము - అని కొందరి వ్యాఖ్య. విష్ణువు వైకుంఠనివాసి అని ఈ ఘట్టములో రామాయణములో ఎక్కడను లేదు. ఈ అర్థము లన్నియు అర్వాచీనములైన సంప్రదాయములను పట్టి చెప్పునవి.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు, బాలకాండలో పదునైదవసర్గ సమాప్తము.

6

7

8

9

10

11

12

13

14

15

© 2026 Ebook Library