Chapter_16

Back
Book Balakandamu
Chapter No 22
Pages 9
Read Time 14 Minutes

Chapter_16

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షోడశః సర్గః

నరరూపమున అవతరించి రావణవధ చేయవలె నని దేవతలు శ్రీమహా విష్ణువును అభ్యర్థించుట. దశరథుడు పుత్రేష్టి చేయుచుండగా అగ్నికుండమునుండి ఆవిర్భవించిన ప్రాజాపత్యపురుషుడు ఆతనికి పాయసము నిచ్చుట. దానిని భుజించి ఆతని భార్యలు గర్భవతు లగుట.

మూ. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః,

జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. 1

ప్ర. అ. తతః = పిమ్మట, సురసత్తమైః = దేవతాశ్రేష్ఠులచేత, నియుక్తః = ఈ విధముగా నియమింపబడిన, నారాయణః దేవః = విష్ణువు, జానన్నపి = తెలిసినవాడే అయినను, సురాన్ = దేవతలను గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, శ్లక్ష్ణమ్ = మృదువైన, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ఈ విధముగా దేవలతచే నియుక్తు డైన విష్ణువు, తెలిసినవాడే యైనను, తెలియనట్లు దేవతలతో, మధురముగా ఇట్లనెను.

మూ. ఉపాయః కో వధే తస్య రావణస్య దురాత్మనః,

యమహం తం సమాస్థాయ నిహన్యామృషికణ్టకమ్. 2

ప్ర. అ. దురాత్మనః = దురాత్ము డైన, తస్య రావణస్య = ఆ రావణుని యొక్క, వధే = వధవిషయమును, ఉపాయః = ఉపాయము, కః = ఏమి? యమ్ = ఏ ఉపాయమును, అస్థాయ = అవలంబించి, ఋషికణ్టకమ్ = ఋషులకు భాధను కలిగించుచున్న, తమ్ = నేను, నిహన్యామ్ = చంపుదునో

తా. ఋషులకు బాధలను కలిగించుచున్న, దురాత్ముడైన రావణుని వధించుటకు ఉపాయమేమి? ఆ ఉపాయముచే నేను రావణుని వధించెదను.

మూ. ఏవముక్తాస్సురాః సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్,

మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే. 3

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తాః = పలకబడిన, సురాః = దేవతలు, సర్వే = అందరును, అవ్యయమ్ = నాశరహితుడైన, విష్ణుమ్ = విష్ణువును గూర్చి, ప్రత్యూచుః = తిరిగి పలికిరి. మానుషీమ్ = మనుష్యసంబంధమైన, తనుమ్ = శరీరమును, ఆస్థాయ = అవలంబించి, సంయుగే = యుద్ధమునందు, రావణమ్ = రావణుని, జహి = సంహరించుము.

తా. ‘‘మనుష్యశరీరమును ధరించి, యుద్ధరంగమున రావణుని వధింపుము’’ అని దేవతలు ప్రత్యుత్తర మిచ్చిరి.

మూ. స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలమరిన్దమ,

యేన తుష్టోఽభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః. 4

ప్ర. అ. అరిందమ = ఓ శత్రువినాశకుడా! సః = అతడు, దీర్ఘకాలమ్ = చాలకాలము, తీవ్రమ్ = తీవ్రమైన, తపః = తపస్సును, తేపే = చేసెను (తపించెను). యేన = దేనిచేత, లోకకృత్ = లోకములను సృజించినవాడును, లోకపూర్వజః = లోకములకు ముందు పుట్టినవాడును అగు, బ్రహ్మా = బ్రహ్మదేవుడు, తుష్టః = సంతోషించినవాడై, అభవత్ = ఆయెనో.

తా. ‘‘ఓ! శత్రువినాశకా! ఆ రావణుడు చాలకాలము తీవ్రమైన తపస్సు చేయగా, సర్వలోకములకంటెను పూర్వము జనించినవాడును, సకలలోకస్రష్టయు అగు బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు సంతోషించెను.’’

మూ. సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః,

నానావిధేభ్యోభూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్. 5

అవజ్ఞాతాః పురా తేన వరదానే హి మానవాః.

ప్ర. అ. సంతుష్టః = సంతోషించిన, ప్రభుః = ఆ సర్వసమర్థుడు, తస్మై = ఆ, రాక్షసాయ = రాక్షసునకు, మానుషాత్ అన్యత్ర = మనుష్యులు తప్ప, నానావిధేభ్యః = అనేకవిధములైన, భూతేభ్యః = ప్రాణులనుండి, భయమ్ = భయము, న = లేదు, అని, వరమ్ = వరమును, ప్రదదౌ = ఇచ్చెను. పురా = పూర్వము, వరదానే = వరదానసమయమునందు, తేన = వానిచేత, మానవాః = మానవులు, అవజ్ఞాతాః = అనాదరము చేయబడినారు.

తా. ‘‘సంతోషించిన ఆ బ్రహ్మదేవుడు - ‘‘మనుష్యులు తప్ప మరి ఏ ఇతర ప్రాణులనుండియు నీకు భయము లేకుండుగాక’’ అని ఆ రాక్షసునకు వరము నిచ్చెను. ఎందువల్ల ననగా, వరదానసమయమున అతడు (రావణుడు) మానవుల విషయమున అనాదరమును చూపెను.’’

మూ. ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః, 6

ఉత్సాదయతి లోకాంస్త్రీన్ స్త్రియశ్చాప్యపకర్షతి.

తస్మాత్తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప. 7

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, తస్మాత్ = ఆ, పితామహాత్ = బ్రహ్మదేవునినుండి, వరమ్ = వరమును, ప్రాప్య = పొంది, సః = అతడు, దర్పితః = గర్వించినవాడై, త్రీన్ = మూడు, లోకాన్ = లోకములను, ఉత్సాదయతి = పీడించుచున్నాడు, స్త్రియః = స్త్రీలను, అపకర్షతి చ = బలాత్కరించుచున్నాడు కూడా. తస్మాత్ = ఆ కారణమువలన, పరంతప = ఓ శత్రుసంహారకుడా!, తస్య = వానియొక్క, వధః = వధ, మానుషేభ్యః = మనుష్యులనుండి, దృష్టః = చూడబడినది.

తా. ‘‘ఈ విధముగ బ్రహ్మదేవునినుండి వరమును పొంది, అతడు దృప్తుడై మూడు లోకాలను పీడించుచున్నాడు. స్త్రీలను బలాత్కరించుచున్నాడు. వానిని సంహరింప గలవారు మనుష్యులు మాత్రమే.’’

మూ. ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్,

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్. 8

ప్ర. అ. ఇతి = ఈ విధముగా, సురాణామ్ = దేవతలయొక్క, ఏతత్ = ఈ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, ఆత్మవాన్ = బుద్ధిమంతుడైన, విష్ణుః = విష్ణువు, తదా = అప్పుడు, దశరథం నృపమ్ = దశరథమహారాజును, పితరమ్ = తండ్రినిగా, రోచయామాస = ఇష్టపడెను.

తా. బుద్ధిమంతుడైన విష్ణువు దేవతల ఈ వాక్యమును విని, అప్పుడు, దశరథుని తండ్రిగా చేసికొనవలెనని ఇచ్ఛయించెను.

మూ. స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్ కాలే మహాద్యుతిః,

అయజత్పుత్రియామిష్టిం పుత్రేప్సురరిసూదనః. 9

ప్ర. అ. తస్మిన్ కాలే = ఆ సమయమునందు, మహాద్యుతిః = గొప్పకాంతికలవాడును, అరిసూదనః = శత్రువులను నశింపచేయువాడును అగు, సః నృపతిః = ఆ రాజు, అపుత్రః = పుత్రులు లేనివాడై, పుత్రేప్సుః = పుత్రులను పొందదలచినవాడై, పుత్రియామ్ ఇష్టిమ్ = పుత్రులను కలిగించు ఇష్టిని, అయజత్ = యజించెను (చేసెను).

తా. గొప్ప తేజస్సు కలవాడును, శత్రుసంహారకుడును అగు దశరథుడు, పుత్రులు లేకపోవుటచే, అదే సమయమున, పుత్రులను ఇచ్చు ఒక యాగమును చేయుచుండెను.

మూ. స కృత్వా నిశ్చయం విష్ణురామన్త్య్ర చ పితామహమ్,

అన్తర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః. 10

ప్ర. అ. సః = ఆ, విష్ణుః = విష్ణువు, నిశ్చయమ్ = నిశ్చయమును, కృత్వా = చేసి, పితామహమ్ = బ్రహ్మదేవుని, ఆమన్త్య్ర = వీడ్కొని, దేవైః = దేవతలచేతను, మహర్షిభిః = మహర్షులచేతను, పూజ్యమానః = పూజింపబడుచున్న వాడై, అన్తర్ధానం గతః = అంతర్ధానము పొందెను.

తా. విష్ణువు ఈ విధముగా నిశ్చయించుకొని, బ్రహ్మదేవుని వీడ్కొని, దేవతలచేతను, మహర్షులచేతను పూజింపబడుచున్న వాడై అంతర్ధానము పొందెను.

మూ. తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్,

ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్. 11

కృష్ణరక్తామ్బరధరం రక్తాస్యం దున్దుభిస్వనమ్,

స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రు ప్రవరమూర్ధజమ్. 12

శుభలక్షణసమ్పన్నం దివ్యాభరణభూషితమ్,

శైలశృంగసముత్సేధం దృప్తశార్ధూలవిక్రమమ్. 13

దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్,

తప్తజామ్బూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్. 14

దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్,

ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. 15

ప్ర. అ. తతః = అటుపిమ్మట, యజమానస్య = యాగము చేయుచున్న ఆ దశరథునియొక్క, పావకాత్ = అగ్నినుండి, అతులప్రభమ్ = సాటిలేని కాంతి కలదియు, మహావీర్యమ్ = గొప్ప వీర్యము కలదియు, మహాబలమ్ = గొప్ప బలము గలదియు, కృష్ణరక్తామ్బరధరమ్ = నల్లని ఎఱ్ఱని వస్త్రములను ధరించినదియు, రక్తాస్యమ్ = ఎఱ్ఱని ముఖము కలదియు, దున్దుభిస్వనమ్ = దుందుభిధ్వని వంటి ధ్వని కలదియు, స్నిగ్ధహర్యక్షతనుజశ్మ శ్శుప్రవరమూర్ధజమ్ = మెత్తగా నున్న సింహరోమసదృశము లైన మీసములును శ్రేష్ఠము లైన కేశములును కలదియు, శుభలక్షణసంపన్నమ్ = శుభలక్షణములతో కూడినదియు, దివ్యాభరణభూషితమ్ = దివ్యములైన ఆభరణములచే అలంకరింపబడినదియు, శైలశృఙ్గసముత్సేధమ్ = పర్వతశిఖరము వంటి ఔన్నత్యము కలదియు, దృప్తశార్దూల విక్రమమ్ = గర్వించిన పెద్దపులి వంటి నడక గలదియు, దివాకరసమాకారమ్ = సూర్యునితో సమానమైన ఆకారము కలదియు, దీప్తానలశిఖోపమమ్ = ప్రజ్వలించుచున్న అగ్నిశిఖతో సమాన మైనదియు అగు, మహత్ = గొప్ప, భూతమ్ = భూతము, తప్తజామ్బూనదమయీమ్ = కరిగిన బంగారముతో చేయబడిన, రాజతాన్తపరిచ్ఛదామ్ = వెండితో చేయబడిన మూత కల, దివ్యపాయససంపూర్ణామ్ = దివ్యపాయసముతో నిండిన, మాయామయీమివ = మాయానిర్మితమా అన్నట్లున్న, విపులామ్ = పెద్దదైన, పాత్రీమ్ = పాత్రను, ప్రియామ్ = ప్రియురాలైన, పత్నీమివ = భార్యను వలె, స్వయమ్ = స్వయముగ, దోర్భ్యామ్ = రెండుచేతులతో, ప్రగృహ్య = గ్రహించి, ప్రాదుర్భూతమ్ = ఆవిర్భవించెను.

తా. దశరథుడు యజ్ఞము చేయుచుండగా ఆ అగ్నికుండమునుండి సాటిలేని కాంతి గల ఒక మహాభూతము ఆవిర్భవించెను. దాని బలపరాక్రమములు అసాధారణములు. అది నలుపు-ఎరుపురంగులు గల వస్త్రమును ధరించెను. ముఖము ఎఱ్ఱగ నుండెను. దాని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరముగ నుండెను. మెత్తగా నున్న దాని రోమములును, మీసములును, వెంట్రుకలును సింహముజూలు రంగులో ఉండెను. పర్వతశిఖరము వంటి ఔన్నత్యము గల ఆ భూతముయొక్క నడక దర్పముతో కూడిన పెద్దపులి నడక వలె నుండెను. దాని ఆకారము సూర్యుని ఆకారము వలెను, అది ప్రజ్వలించుచున్న అగ్నిశిఖ వలెను ఉండెను. ఆ భూతము తన రెండు చేతులతో ఒక మేలిమి బంగారు పాత్రను, ప్రియురా లైన భార్యను వలె, ఆత్యాదరముతో తీసికొనివచ్చెను. దివ్యపాయసముతో నిండి యున్న ఆ బంగారుపాత్రపై వెండి మూత యుండెను. అది మాయచే నిర్మింపబడినదా అన్నట్లు అత్యద్భుతముగ నుండెను.

మూ. సమవేక్ష్యాబ్రవీద్వాక్యమిదం దశరథం నృపమ్,

ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప. 16

ప్ర. అ. దశరథం నృపమ్ = దశరథమహారాజును, సమవేక్ష్య = చూచి, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. నృప = ఓ రాజా! ఇహ = ఇచటికి, అభ్యాగతమ్ = వచ్చిన నన్ను, ప్రాజాపత్యం = ప్రజాపతి నుండి వచ్చిన, (ప్రజాపతికి సంబంధించిన), నరమ్ = పురుషునిగా, విద్ధి = తెలుసుకొనుము.

తా. ఆ భూతము దశరథమహారాజును చూచి ఇట్లు పలికెను. ‘‘ఓ రాజా! నేను ప్రజాపతి పంపగా ఇచటకు వచ్చినాను.’’

మూ. తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాఞ్జలిః,

భగవన్ స్వాగతం తేఽస్తు కిమహం కరవాణి తే. 17

ప్ర. అ. తతః పరమ్ = అటుపిమ్మట, తదా = అప్పుడు, రాజా = రాజు, కృతాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, ప్రత్యువాచ = తిరిగి పలికెను. భగవన్ = ఓ పూజ్యుడా! తే = నీకు, స్వాగతమ్ = స్వాగతము, అస్తు = అగుగాక. అహమ్ = నేను, తే = నీకు, కిమ్ = ఏమి, కరవాణి = చేయుదును.

తా. పిదప ఆ రాజు చేతులు జోడించి -- ‘‘పూజ్యుడా! నీకు స్వాగతము. నీ కొరకు నేనేమి చేయుదును?’’ అని పలికెను.

మూ. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోఽబ్రవీత్,

రాజన్నర్చయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా. 18

ప్ర. అ. అథో = అటుపిమ్మట, ప్రాజాపత్యః నరః = ప్రజాపతి పంపగా వచ్చిన ఆ పురుషుడు, పునః = మరల, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. రాజన్ = ఓ రాజా!, దేవాన్ = దేవతలను, అర్చయతా = పూజించుచున్న, త్వయా = నీచేత, అద్య = ఈ రోజున, ఇదమ్ = ఇది, ప్రాప్తమ్ = పొందబడినది.

తా. ఆ ప్రాజాపత్యపురుషుడు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. ‘‘రాజా! నీవు దేవతలను అర్చించుచున్నందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది.’’

మూ. ఇదం తు నృపశార్దూల పాయసం దేవనిర్మితమ్,

ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్. 19

ప్ర. అ. నృపశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! దేవనిర్మితమ్ = దేవతలచేత నిర్మింపబడినదియు, ప్రజాకరమ్ = సంతానమును ఇచ్చునదియు, ధన్యమ్ = ధనము నిచ్చునదియు, ఆరోగ్యవర్ధనమ్ = ఆరోగ్యమును వృద్ధి పొందించునదియు అగు, ఇదమ్ = ఈ, పాయసమ్ = పాయసమును, త్వమ్ = నీవు, గృహాణ = గ్రహించుము.

తా. ‘‘ఓ రాజశ్రేష్ఠుడా! ఈ పాయసము దేవతలు నిర్మించినది. సంతానము నిచ్చును; ధనమును ఇచ్చును; ఆరోగ్యమును పెంచును; దీనిని తీసికొనుము.’’

మూ. భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై,

తాసు త్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప. 20

ప్ర. అ. నృప = ఓ రాజా! అశ్నీత = భుజింపుడు, ఇతి = అని చెప్పి, అనురూపాణామ్ = తగిన, భార్యాణామ్ = భార్యలకు, ప్రయచ్ఛ వై = ఇమ్ము. యదర్థమ్ = ఏ పుత్రులకొరకై, యజసే = యాగము చేయుచున్నావో, పుత్రాన్ = అట్టి పుత్రులను, తాసు = వారియందు, త్వమ్ = నీవు, ప్రాప్స్యసే = పొందగలవు.

తా. ‘‘రాజా! తినుడుఅని చెప్పి ఈ పాయసమును తగిన భార్యల కిమ్ము. నీవు పుత్రులకొరకై యాగము చేయుచున్నావు కదా. ఆ భార్యలయందు నీకు పుత్రులు జనించగలరు.’’

మూ. తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్,

పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్. 21

ప్ర. అ. నృపతిః = రాజు, తథేతి = అటులనే చేసెదను అని పలికి, తామ్ = ఆ, దేవాన్నసంపూర్ణామ్ = దేవతలచే వండబడిన అన్నముతో నిండినదియు, దేవదత్తామ్ = దేవతలచేత ఇవ్వబడినదియు, హిరణ్మయీమ్ = బంగారు వికారమైనదియు అగు, పాత్రీమ్ = పాత్రను, శిరసా = శిరస్సుతో, ప్రతిగృహ్య = స్వీకరించి, ప్రీతః = సంతోషించెను.

తా. దశరథుడు, దేవతలు వండిన అన్నముతో నిండిన, దేవతలు పంపిన, ఆ బంగారు పాత్రను శిరస్సు వంచి, సవినయముగ అందికొని సంతోషించెను.

మూ. అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనమ్,

ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణమ్. 22

ప్ర. అ. పరమయా = గొప్పదైన, ముదా = సంతోషముతో, యుక్తః = కూడినవాడై, అద్భుతమ్ = ఆశ్చర్యకర మైనదియు, ప్రియదర్శనమ్ = సంతోషజనకమైన దర్శనము కలదియు అగు, తత్ భూతమ్ = ఆ భూతమును, అభివాద్య = నమస్కరించి, అభిప్రదక్షిణమ్ = ప్రదక్షిణమును, చకార = చేసెను.

తా. మిక్కిలి సంతోషించిన దశరథుడు, చూచెడివారికి సంతోషము కలిగించు, ఆ అద్భుతమైన భూతమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను.

మూ. తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్,

బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః. 23

ప్ర. అ. తతః = పిమ్మట, దశరథః = దశరథుడు, దేవనిర్మితమ్ = దేవతలచే నిర్మింపబడిన, పాయసమ్ = పాయసమును, ప్రాప్య = పొంది, విత్తమ్ = ధనమును, ప్రాప్య = పొంది, అధనః ఇవ = దరిద్రుడు వలె, పరమప్రీతః = మిక్కిలి సంతసించినవాడు, బభూవ = అయెను.

తా. దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే, ధనము లభించిన నిరుపేద వలె చాల సంతసించెను.

మూ. తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్,

సంవర్తయిత్వా తత్ కర్మ తత్రైవాన్తరధీయత. 24

ప్ర. అ. తతః = పిమ్మట, అద్భుతప్రఖ్యమ్ = అద్భుత మైన ఆకారము కలదియు, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించునది అగు, తత్ భూతమ్ = ఆ భూతము, తత్ = ఆ, కర్మ = పనిని, సంవర్తయిత్వా = చేసి, తత్రైవ = అచటనే, అంతరధీయత = అంతర్ధానము చెందెను.

తా. అద్భుత మైన ఆకారముతో పరమతేజోవంత మగు ఆ భూతము, ఆ పని చేసి అచటనే అంతర్ధానము చెందెను.

మూ. హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాన్తఃపురమాబభౌ,

శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః. 25

ప్ర. అ. హర్షరశ్మిభిః = ఆనందకిరణములచేత, ఉద్ద్యోతమ్ = వెలుగొందుచున్న, తస్య = అతనియొక్క, అన్తఃపురమ్ = అంతఃపురము, అభిరామస్య = మనోహరుడైన, శారదస్య = శరత్కాలమునకు సంబంధించిన, చన్ద్రస్య = చంద్రునియొక్క, అంశుభిః = కిరణములచేత, నభః ఇవ = ఆకాశము వలె, ఆబభౌ = ప్రకాశించెను.

తా. సంతోషకాంతులతో వెలుగొందుచున్న దశరథాంతఃపురము, మనోహరుడైన శరచ్చంద్రుని కిరణములచే ఆకాశము వలె ప్రకాశించెను.

మూ. సోఽన్తఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్,

పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రియం త్విదమాత్మనః. 26

ప్ర. అ. సః = అతడు, అన్తఃపురమ్ = అంతఃపురమును, ప్రవిశ్యైవ = ప్రవేశించగనే, కౌసల్యామ్ = కౌసల్యను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. ఆత్మనః = నీకు, పుత్రియమ్ = పుత్రులను కలుగజేయు, ఇదమ్ = ఈ, పాయసమ్ = పాయసమును, ప్రతిగృహ్ణీష్వ = స్వీకరించుము.

తా. అతడు అంతఃపురములో ప్రవేశించి - ‘‘నీకు పుత్రులను కలిగించు ఈ పాయసమును తీసికొనుము’’ అని కౌసల్యతో పలికెను.

మూ. కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా,

అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. 27

కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్,

ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్. 28

అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ మహీపతిః,

ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్. 29

ప్ర. అ. తదా = అప్పుడు, నరపతిః = రాజు, కౌసల్యాయై = కౌసల్యకు, పాయసార్ధమ్ = పాయసములో సగమును, దదౌ = ఇచ్చెను. నరాధిపః = రాజు, అర్ధాత్ = మిగిలిన సగమునుండి, అర్ధమ్ = సగభాగమును, సుమిత్రాయై అపి = సుమిత్రకు కూడ, దదౌ = ఇచ్చెను. అవశిష్టార్ధమ్ = మిగిలిన దానిలో సగమును, పుత్రార్థకారణాత్ = పుతప్రయోజనమనే కారణమువలన, కైకేయ్యై = కైకేయికి, దదౌ = ఇచ్చెను. మహీపతిః = రాజు, అనుచిన్త్య = ఆలోచించి, పాయసస్య = పాయసము యొక్క, అమృతోపమమ్ = అమృతముతో సమాన మైన, అవశిష్టార్ధమ్ = మిగిలిన సగమును, పునరేవ = మరల, సుమిత్రాయై = సుమిత్రకు, ప్రదదౌ = ఇచ్చెను. ఏవమ్ = ఈ విధముగా, రాజా = రాజు, తాసాం భార్యాణామ్ = ఆ భార్యలకు, పృథక్ = వేరు వేరుగా, పాయసమ్ = పాయసమును, దదౌ = ఇచ్చెను.

తా. దశరథుడు అప్పుడు పాయసములో సగముభాగమును కౌసల్య కిచ్చెను. మిగిలిన సగము భాగములోని సగము భాగమును (అనగా నాల్గవ భాగమును) సుమిత్ర కిచ్చెను. మిగిలిన దానిలో సగము భాగమును అనగా ఎనిమిదవ భాగమును కైకేయికి ఇచ్చెను. మిగిలిన ఎనిమిదవ భాగమును మరల ఆలోచించి, సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా రాజు భార్యలు ముగ్గురికిని వేరు వేరుగా పాయసము నిచ్చెను.

ఈ శ్లోకాలకు ఈ అర్థమే పదానుసారి యైన అర్థము. కొందరు వ్యాఖ్యాతలు ఈ అర్థాలను ఇటు లాగి అటు లాగి వేరువేరుగా చెప్పి ఉన్నారు. అధ్యాత్మ రామాయణాదులలో ఉన్న విషయాలను సమన్వయించుకొనుట కొరకు, అట్లే విష్ణువు నాలుగు భాగాలు అయి దశరథుని నలుగురు కుమారులుగా జనింప నిశ్చయించెను అని వెనుక చెప్పిన దానిని పట్టి పాయసము కూడా ఏ భార్యకు ఎంత భాగము వచ్చినది, నాల్గవభాగమా, ఎనిమిదవభాగమా- ఇలాంటి ప్రశ్నలు వేసుకొని వేరువేరు విధాల వ్యాఖ్యానాలు చేసినారు. స్పష్టముగ ఉన్న శ్లోకాల అర్థాలను మన ఇచ్చ వచ్చి నట్లు మార్పుచేయుట సమంజసము కాదు. ఇట్టి వ్యాఖ్యానాలు కేవలము అల్పజ్ఞులకు దిగ్భ్రాంతి కలిగించుటకు మాత్రమే ఉపయోగించును.

‘‘విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విధమ్’’ ‘‘తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్’’ ఇత్యాదివాక్యాలకు - విష్ణువు నాలుగు ముక్కలుగా అయిపోయి రామాదిరూపాలలో జనించినా డని కాదు. అనంతస్వరూపానికి భాగము లనగా ఏమి? విష్ణువు రామాద్యవతారము లెత్తినపుడు వైకుంఠము కాళీగా ఉండెనా ? రాముని రూపములో విష్ణువు వచ్చెను కదా; పరశురాముని విషయమేమైనట్లు. అతడు కూడ విష్ణ్వవతారమే అని చెప్పుట కూడ ఉన్నది కదా ? రూపరహితుడు, దేశకాలాది పరిచ్ఛేదాతీతుడు అయిన పరమాత్మ నామరూపాలతో దేశకాలపరిచ్ఛిన్నుడుగా కనబడుటయే అవతారము. అనంత స్వరూపునకు, అప్రమేయునకు భాగ కల్పనయే అసంగతము. ఆ పారమేశ్వరశక్తియే వివిధరూపములలో అవతరించినది అని చెప్పుట యుక్తము. రాముడు విష్ణువులో అర్ధభాగ మనీ, లక్ష్మణుడు చతుర్థభాగ మనీ, భరతుడు అష్టమభాగ మనీ, శత్రుఘ్నుడు కూడ అష్టమభాగ మనీ ముందుగా నిర్ణయించుకొని, పాయసము కూడ ఆ విధముగా పంచిననే కుదురు నని అనుకొని ఇష్టము వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యాతలు ఎంతటి ప్రాచీను లైనను, అమోదకరములు కావు. లక్ష్మణుడు ఆదిశేషావతారమని కూడ సంప్రదాయ మున్నది కదా. దాని సమన్వయము చేయుట ఎట్లు ? శ్రీరాముడు అర్ధావతార మని చెప్పుట ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే’’ అని విశ్వసించినవారికి అంతగా అంగీకారయోగ్యము కాదు. వారికి శ్రీరాముడు పూర్ణావతారము.

మూ. తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేన్ద్రస్యోత్తమాః స్త్రియః,

సంమానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః. 30

ప్ర. అ. నరేన్ద్రస్య = రాజుయొక్క, ఉత్తమాః = ఉత్తమలైన, తాః = ఆ, స్త్రియః = భార్యలు, సర్వాః = అందరును, ఏతత్ = ఈ, పాయసమ్ = పాయసమును, ప్రాప్య = పొంది, ప్రహర్షోదితచేతసః = పుట్టిన సంతోషము గల మనస్సులు కలవారై, సంమానమ్ = బహుమానమునుగా, మేనిరే = భావించిరి.

తా. ఉత్తమగుణవతు లగు ఆ రాజభార్య లందరును ఆ పాయసము లభించినందులకు చాల సంతోషించిన మనస్సులతో దానిని గొప్ప బహుమానముగా భావించిరి.

మూ. తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో

మహీపతేరుత్తమపాయసం పృథక్,

హుతాశనాదిత్యసమానతేజస

శ్చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా. 31

ప్ర. అ. తదా = పిమ్మట, మహీపతేః = రాజుయొక్క, తాః ఉత్తమ స్త్రియః = ఆ ఉత్తమ భార్యలు, తత్ = ఆ, ఉత్తమపాయసమ్ = ఉత్తమమైనపాయసమును, పృథక్ = వేరుగా, ప్రాశ్య = భుజించి, హుతాశనాదిత్యసమానతేజసః = అగ్ని తోడను సూర్యనితోడను సమానమైన తేజస్సుక లవారై, చిరేణ = చాల కాలమునకు, తదా = అప్పుడు, గర్భాన్ = గర్భములను, ప్రతిపేదిరే = పొందిరి.

తా. ఉత్తమగుణవతు లగు ఆ దశరథుని భార్యలు ఆ ఉత్తమ మైన పాయసము భుజించి, అగ్న్యాదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు, చాలకాలము తరువాత, అప్పుడు గర్భములను ధరించిరి.

వి.చిరేణఅనగా ఎప్పుడో పుత్రవతులు కావలసిన వారు, ఇంతకాలమునకు ఇపుడు గర్భవతు లైరి అని భావము.

మూ. తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః

ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః,

బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః

సురేన్ద్రసిద్ధర్షిగణాభిపూజితః. 32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షోడశః సర్గః.

ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రాజు, ప్రరూఢగర్భాః = ఆవిర్భవించిన గర్భములు గల, తాః స్త్రియః = ఆ భార్యలను, ప్రసమీక్ష్య = చూచి, ప్రతిలబ్ధమానసః = మరల పొందబడిన మనస్సు కలవాడై, త్రిదివే = స్వర్గమునందు, సురేన్ద్ర సిద్ధర్షిగణాభిపూజితః = దేవేంద్రునిచేతను, సిద్ధులచేతను, ఋషిగణములచేతను పూజింపబడిన, హరిః యథా = విష్ణువు వలె, హృష్టః = సంతసించినవాడు, బభూవ = ఆయెను.

తా. దశరథుడు గర్భవతు లైన భార్యలను చూచి స్వస్థచిత్తుడై, స్వర్గమునందు దేవేంద్ర సిద్ధఋష్యాదులచే పూజింపబడిన విష్ణువు వలె సంతసించెను.

వి. కొందరు వ్యాఖ్యాతలు హరిఃఅనగా ఇంద్రు డనియు, ‘‘సురేన్ద్ర’’ అనగా దేవతాశ్రేష్ఠులనియు అర్థము వ్రాసిరి. విష్ణువు వైకుంఠములో నుండును గాని స్వర్గములో ఎట్లుండు నని వారి ఆశయము. వాల్మీకి ఎచ్చటను వైకుంఠమును పేర్కొనలేదు. హరిబ్రహ్మాదులందరును స్వర్గనివాసులే.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో పదియారవసర్గ సమాప్తము.

© 2026 Ebook Library