| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 23 |
| Pages | 9 |
| Read Time | 12 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తదశః సర్గః
బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా దేవాదులు అనేక వానరవీరులను సృజించుట.
మూ. పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః,
ఉవాచ దేవతాః సర్వాః స్వయమ్భూర్భగవానిదమ్. 1
ప్ర. అ. విష్ణౌ = విష్ణువు, మహాత్మనః = మహాత్ముడైన, తస్య రాజ్ఞః = ఆ రాజుయొక్క (నకు), పుత్రత్వమ్ = పుత్రత్వమును, గతే సతి = పొందినవాడగు చుండగా, భగవాన్ = భగవంతు డైన, స్వయంభూః = బ్రహ్మదేవుడు, సర్వాః = సమస్త మైన, దేవతాః = దేవతలను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, ఉవాచ = పలికెను.
తా. విష్ణువు దశరథమహారాజునకు పుత్రుడగుటకు నిర్ణయించుకొనిన పిమ్మట బ్రహ్మదేవుడు దేవత లందరితో ఇట్లు చెప్పెను.
మూ. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః,
విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః. 2
ప్ర. అ. సత్యసంధస్య = సత్య మైన ప్రతిజ్ఞకలవాడును, వీరస్య = వీరుడును, నః సర్వేషామ్ = మన అందరియొక్క, హితైషిణః = హితమును కోరువాడును అగు, విష్ణోః = విష్ణువునకు, సహాయాన్ = సహాయభూతు లైన, బలినః = బలవంతు లైన, కామరూపిణః = కోరిన రూపములు ధరించ గలిగిన పుత్రులను, సృజధ్వమ్ = సృష్టించుడు.
తా. సత్యసంధుడును, మహావీరుడును, మన అందరి హితమును కోరువాడును అగు విష్ణువునకు సహాయులుగ ఉండుటకై, బలవంతులును, కామరూపులును అగు పుత్రులను సృజింపుడు.
మూ. మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాన్ జవే,
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్, 3
అసంహార్యానుపాయజ్ఞాన్ దివ్యసంహననాన్వితాన్,
సర్వాస్త్రగుణసంపన్నాన్ అమృతప్రాశనానివ. 4
అప్సరస్సు చ ముఖ్యాసు గన్ధర్వాణాం తనూషు చ,
సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్. 5
ప్ర. అ. మాయావిదః చ = మాయల నెరిగిన వారును, శూరాన్ చ = శూరులును, జవే = వేగమునందు, వాయువేగసమాన్ = వాయువేగముతో సమానులును, నయజ్ఞాన్ = నీతి తెలిసినవారును, బుద్ధిసంపన్నాన్ = బుద్ధితో కూడిన వారును, విష్ణుతుల్యపరాక్రమాన్ = విష్ణువుతో సమానమైన పరాక్రమము కల వారును, అసంహార్యాన్ = సంహరింప శక్యము కానివారును, ఉపాయజ్ఞాన్ = ఉపాయము తెలిసినవారును, దివ్యసంహననాన్వితాన్ = దివ్యమైన శరీరములతో కూడిన వారును, సర్వాస్త్రగుణసంపన్నాన్ = సమస్తమైన అస్త్రగుణములతో కూడిన వారును, అమృతప్రాశనానివ = అమృతమును భుజించిన వారితో సమానులును, తుల్యపరాక్రమాన్ = మీతో సమాన మైన పరాక్రమము కలవారును అగు, పుత్రాన్ = పుత్రులను, ముఖ్యాసు = ముఖ్యులైన, అప్సరస్సు చ = అప్సరసలయందును, గన్ధర్వీణామ్ = గంధర్వస్త్రీల, తనూషు చ = శరీరములందును, హరిరూపేణ = వానరరూపమున, సృజధ్వమ్ = సృష్టింపుడు.
తా. అన్ని మాయలు తెలిసినవారు, శూరులు, వాయువేగముతో సమాన మైన వేగము కలవారు, నీతిజ్ఞులు, బుద్ధిసంపన్నులు, విష్ణువుతో సమానమైన పరాక్రమము కలవారు, చంప శక్యము కానివారు, వివిధోపాయజ్ఞులు, దివ్యశరీరములు కలవారు, సర్వాస్త్రముల శక్తివంటి శక్తి కలవారు, అమృతమును భుజించినవారు వలె క్షుత్పిపాసాదులు లేనివారు, మీతో సమాన మైన పరాక్రమము కలవారు అగు పుత్రులను, ఉత్తమాప్సరస్త్రీలయందును, గంధర్వస్త్రీలయందును, వానరరూపమున సృజింపుడు.
వి. పార్వతి శపించుటచే దేవతలు తమ భార్యలయందు సంతానమును పొందజాలరు. అందుచే ‘‘అప్సరసలందును, గంధర్వస్త్రీలయందును’’ అని చెప్పబడినది. ‘‘నీకు వానరులవలన భయము కలుగు గాక’’ అని నందికేశ్వరుడు రావణుని శపించెను. అందుచే ‘‘వానరరూపులైన పుత్రులను కనుడు’’ అని చెప్పబడినది (గోవిందరాజ మహేశ్వరతీర్థులు).
మూ. పూర్వమేవ మయా సృష్టో జామ్బవానృక్షపుఙ్గవః,
జృమ్భమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. 6
ప్ర. అ. జామ్బవాన్ = జాంబవంతు డనెడు, ఋక్షపుఙ్గవః = ఋక్షశ్రేష్ఠుడు, పూర్వమేవ = పూర్వమునందే, మయా = నాచేత, సృష్టః = సృజింపబడినాడు. జృమ్భమాణస్య = ఆవులించుచున్న, మమ = నాయొక్క, వక్త్రాత్ = ముఖమునుండి, సహసా = హఠాత్తుగా, అజాయత = పుట్టెను.
తా. ఎలుగుబంటులలో శ్రేష్ఠు డైన జాంబవంతుని నేను చాలకాలము క్రితమే సృజించి ఉన్నాను. నేను ఆవులించినపుడు అతడు నా ముఖమునుండి హఠాత్తుగా ఆవిర్బవించినాడు.
మూ. తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్,
జనయామాసురేవం తే పుత్రాన్వానరరూపిణః. 7
ప్ర. అ. భగవతాః = బ్రహ్మదేవునిచేత, తథా = ఆవిధముగా, ఉక్తాః = పలకబడిన, తే = వారు, తత్ = ఆ, శాసనమ్ = ఆజ్ఞను, ప్రతిశ్రుత్య = అంగీకరించి, ఏవమ్ = ఈ విధముగా, వానరరూపిణః = వానరరూపములు గల, పుత్రాన్ = పుత్రులను, జనయామాసుః = పుట్టించిరి.
తా. బ్రహ్మదేవుని ఆజ్ఞప్రకారము ఆ దేవతలు వానరరూపములలో ఉన్న పుత్రులను సృజించిరి.
మూ. ఋషయశ్చ మహాత్మానః సిద్ధవిద్యాధరోరగాః,
చారణాశ్చ సుతాన్వీరాన్ ససృజుర్వనచారిణః. 8
ప్ర. అ. మహాత్మానః = మహాత్ములైన, ఋషయశ్చ = ఋషీశ్వరులును, సిద్ధ విద్యాధరోరగాః = సిద్ద-విద్యాధర-ఉరగులును, చారణాః చ = చారణులును, వీరాన్ = వీరులైన, వనచారిణః = వానరరూపులగు, సుతాన్ = కుమారులను, ససృజుః = సృజించిరి.
తా. మహావీర్యవంతు లగు ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారణులు కూడ వీరు లైన కుమారులను వానరరూపములలో సృజించిరి.
మూ. వానరేన్ద్రం మహేన్ద్రాభమిన్ద్రో వాలినమూర్జితమ్,
సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః. 9
ప్ర. అ. ఇన్ద్రః = ఇంద్రుడు, మహేన్ద్రాభమ్ = మహేంద్రపర్వతముతో సమానుడును, ఊర్జితమ్ = దృఢమైన దేహము కలవాడును అగు, వాలినమ్ = వాలియను పేరు గల, వానరేన్ద్రమ్ = వానరరాజును, జనయామాస = పుట్టించెను. తపతామ్ = వేడిమిని కలిగించువారిలో, వరః = శ్రేష్ఠు డైన, తపనః = సూర్యుడు, సుగ్రీవమ్ = సుగ్రీవుని (పుట్టించెను).
తా. దేవేంద్రుడు మహేంద్రపర్వతము వంటి శరీరము కలవాడును, మహా బలవంతుడును అగు వాలి యనెడు వానరేంద్రుని పుట్టించెను. తేజశ్శాలులలో గొప్పవా డైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించెను.
మూ. బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్,
సర్వవానరముఖ్యానాం బుద్ధిమన్తమనుత్తమమ్. 10
ప్ర. అ. బృహస్పతిస్తు = బృహస్పతి యైతే, సర్వవానరముఖ్యానామ్ = సమస్తమైన వానరశ్రేష్ఠులలో, అనుత్తమమ్ = తనను మించినవారు లేని, బుద్ధిమన్తమ్ = బుద్ధిమంతు డైన, తారం నామ = తారు డను పేరు గల, మహాహరిమ్ = గొప్ప వానరుని, అజనయత్ = పుట్టించెను.
తా. బృహస్పతి, వానరశ్రేష్ఠు లందరిలోను మహాబుద్ధిమంతు డైన తారుడనే గొప్ప వానరుని సృజించెను.
మూ. ధనదస్య సుతః శ్రీమాన్ వానరో గంధమాదనః,
విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్. 11
ప్ర. అ. శ్రీమాన్ = కాంతి గల, గన్ధమాదనః = గంధమాదను డనెడు, వానరః = వానరుడు, ధనదస్య = కుబేరునియొక్క, సుతః = కుమారుడు. విశ్వకర్మాతు = విశ్వకర్మయైతే, నలం నామ = నలు డనెడు, మహాహరిమ్ = గొప్పవానరుని, అజనయత్ = పుట్టించెను.
తా. కుబేరుడు శ్రీమంతు డగు గంధమాదను డనెడు కుమారుని సృజించెను. విశ్వకర్మ నలు డనెడు పేరు గల గొప్ప వానరుని పుట్టించెను.
మూ. పావకస్య సుతః శ్రీమాన్ నీలోఽగ్నిసదృశప్రభః,
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్. 12
ప్ర. అ. పావకస్య = అగ్నియొక్క, సుతః = కుమారుడును, శ్రీమాన్ = శ్రీమంతుడును, అగ్నిసదృశప్రభః = అగ్నితో సమానమైనకాంతికలవాడును అగు, నీలః = నీలుడు, తేజసా = తేజస్సుచేతను, యశసా = కీర్తిచేతను, వీర్యాత్ = పరాక్రమమువలనను, వానరాన్ = ఇతరవానరులను, అత్యరిచ్యత = అతిశయించి ఉండెను.
తా. శ్రీమంతుడును, అగ్నితో సమాన మైన తేజస్సు కలవాడును, అగ్ని కుమారుడును అగు నీలుడు తేజఃకీర్తివీర్యములచే ఇతరవానరుల నందరిని మించి ఉండెను.
మూ. రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ,
మైన్దం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్. 13
రూపద్రవిణసంపన్నౌ = రూపమనెడుధనముచే సమృద్ధు లైన, అశ్వినౌ = అశ్వినీదేవతలు, స్వయమ్ = తాము, రూపసంమతౌ = రూపముచే గౌరవింపబడిన, మైన్దం చ = మైందుని, ద్వివిదం చైవ = ద్వివిదుని, జనయామాసతుః = పుట్టించిరి.
తా. సౌందర్య మనెడు ధనము గల అశ్వినీదేవతలు, ప్రశస్త సౌందర్యవంతు లగు మైందుడు, ద్వివిదుడు అను వానరులను పుట్టించిరి.
మూ. వరుణో జనయామాస సుషేణం వానరర్షభమ్,
శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్. 14
ప్ర. అ. వరుణః = వరుణుడు, సుషేణమ్ = సుషేణుడనెడు, వానరర్షభమ్ = వానరశ్రేష్ఠుని, జనయామాస = పుట్టించెను. పర్జన్యస్తు = పర్జన్యు డైతే, మహాబలమ్ = గొప్ప బలము గల, శరభమ్ = శరభుని, జనయామాస = పుట్టించెను.
తా. వరణుడు సుషేణు డనెడు వానరశ్రేష్ఠుని, పర్జన్యుడు మహాబలశాలి యగు శరభుని పుట్టించిరి.
మూ. మారుతస్యాత్మజః శ్రీమాన్ హనుమాన్నామ వీర్యవాన్,
వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే. 15
ప్ర. అ. శ్రీమాన్ = శ్రీమంతుడును, వీర్యవాన్ = పరాక్రమశాలియు, వజ్రసంహననోపేతః = వజ్రమువంటి దేహము కలవాడును, జవే = వేగమునందు, వైనతేయసమః = గరుత్మంతునితో సమానుడును అగు, హనుమాన్ నామ = హనుమంతు డను పేరు గల వానరుడు, మారుతస్య = వాయుదేవునియొక్క, ఆత్మజః = కుమారుడు.
తా. వాయుదేవునకు శ్రీమంతుడును, వీర్యవంతుడును, వజ్రము వంటి దేహము కలవాడును, వేగమునందు గరుత్మంతునితో సమానుడును అగు హనుమంతుడు కుమారుడుగ జనించెను.
మూ. తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః,
అప్రమేయబలా వీరా విక్రాన్తాః కామరూపిణః. 16
ప్ర. అ. దశగ్రీవవధే = రావణుని వధించుటయందు, రతాః = ఆసక్తికలవారును, అప్రమేయబలాః = కొలవ శక్యము కాని బలము కలవారును, విక్రాన్తాః = పరాక్రమ వంతులను, కామరూపిణః = స్వేచ్ఛానుసారముగా వివిధ రూపములను ధరించకలవారును, బహుసాహస్రాః = అనేకవేల సంఖ్య కలవారును అగు, తే వీరాః = ఆ వీరులు, సృష్టాః = సృజింపబడినారు.
తా. అమేయమైన బలపరాక్రమములు గలవారును, కామరూపులును అగు వేలకొలది వీరులు దశగ్రీవుని వధకొరకై సృష్టింపబడిరి.
మూ. మేరుమన్దరసంకాశా వపుష్మన్తో మహాబలాః,
ఋక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే. 17
ప్ర. అ. మేరుమన్దరసంకాశాః = మేరుమందరపర్వతములతో సమానులును, వపుష్మన్తః = మంచిదేహములు కలవారును, మహాబలాః = గొప్ప బలము గలవారును అగు, ఋక్షవానరగోపుచ్ఛాః = ఎలుగుబంటులు, వానరులు, కొండముచ్చులు, క్షిప్రమేవ = శీఘ్రముగనే, అభిజజ్ఞిరే = పుట్టిరి.
తా. మేరుమందరపర్వతముల వలె మహోన్నతము లైన దేహములు గల, మహాబలవంతు లగు ఋక్ష-వానర-గోపుచ్ఛులు శీఘ్రముగనే జనించిరి.
మూ. యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః,
అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్. 18
ప్ర. అ. యస్య = ఏ, దేవస్య = దేవునకు, యత్ = ఏ, రూపమ్ = రూపమో, వేషః = ఏ వేషమో, పరాక్రమశ్చ = పరాక్రమము కూడ, యః = ఏదియో, తస్య తస్య = ఆ యా దేవుని యొక్క, సుతః = కుమారుడు, పృథక్ = వేరుగా, తేన = ఆ దేవునితో, సమః = సమానుడై, అజాయత = పుట్టెను.
తా. ఏ దేవునకు ఏ రూపము, ఏ వేషము, ఏ పరాక్రమము ఉండెనో ఆ దేవుని కుమారుడు కూడ అదే రూపము, అదే వేషము, అదే పరాక్రమము కలిగి ఉండెను.
మూ. గోలాఙ్గూలీషు చోత్పన్నాః కేచిత్సంమతవిక్రమాః,
ఋక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ. 19
ప్ర. అ. సంమతవిక్రమాః = బహుమానింపబడిన పరాక్రమము గల, కేచిత్ = కొందరు, వానరాః = వానరులు, గోలాఙ్గూలీషు = ఆడ కొండముచ్చుల యందు, ఉత్పన్నాః = పుట్టినారు. తథా = అట్లే, (మరికొందరు వానరులు), ఋక్షీషు = ఆడ ఎలుగుబంటుల యందును, కిన్నరీషు చ = కిన్నర స్త్రీలయందును, జాతాః = పుట్టినారు.
తా. కొనియాడదగిన పరాక్రమము గల కొందరు గోలాంగూలస్త్రీల యందును, కొందరు ఋక్షస్త్రీలయందును, కిన్నరస్త్రీలయందును జనించిరి.
మూ. దేవా మహర్షిగన్ధర్వాస్తార్క్ష్యా యక్షా యశస్వినః,
నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిద్యాధరోరగాః. 20
బహవో జనయామాసుర్హృష్టాస్తత్ర సహస్రశః,
వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్వై వనచారిణః. 21
అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ,
నాగకన్యాసు చ తథా గన్ధర్వీణాం తనూషు చ. 22
ప్ర. అ. దేవాః = దేవతలు, మహర్షిగన్ధర్వాః = మహర్షులు గంధర్వులు, తార్క్ష్యాః = గరుడులు, యక్షాః = యక్షులు, యశస్వినః = కీర్తిగల, నాగాః = నాగులు, కింపురుషాశ్చైవ = కింపురుషులును, సిద్ధవిద్యాధరోరగాః = సిద్ధులు, విద్యాధరులు ఉరగులు, బహవః = అనేకులు, హృష్టాః = సంతసించినవారై, తత్ర = ఆ సమయమున, ముఖ్యాసు = ప్రధాన లైన, అప్సరస్సు = అప్సరసలయందును, తథా = మరియు, విద్యాధరీషు చ = విద్యాధర స్త్రీలయందును, నాగకన్యాసు = నాగకన్యలయందు, తథా = మరియు, గన్ధర్వీణామ్ = గంధర్వస్త్రీల, తనూషు చ = శరీరములయందును, సుమహాకాయాన్ = గొప్పదేహములు కలవారును, వనచారిణః = వనములయందు సంచరించువారును అగు, సర్వాన్ = సమస్తమైన, వానరాన్ = వానరులను, సహస్రశః = వేలకొలది, జనయామాసుః = పుట్టించిరి.
తా. ఆ సమయమున దేవ-మహర్షి-గంధర్వ-తార్క్ష్య-యక్ష-నాగ-కింపురుష-సిద్ధ- విద్యాధర-ఉరగులు అనేకులు చాల సంతసించినవారై ప్రధాన లైన అప్సరసలందును, విద్యాధర-నాగ-గంధర్వస్త్రీలయందును, గొప్ప దేహములు కలవారును, వనములలో సంచరించువారును అగు వానరులను వేలకొలది సృజించిరి.
మూ. కామరూపబలోపేతా యథాకామం విచారిణః,
సింహశార్దూలసదృశా దర్పేణ చ బలేన చ. 23
ప్ర. అ. (ఆ వానరులు), కామరూపబలోపేతాః = స్వేచ్ఛానుసారము లభించు రూపము కలవారు. బలోపేతాః = బలవంతులు. యథాకామమ్ = స్వేచ్ఛగా, విచారిణః = సంచరించువారు. దర్పేణ చ = దర్పముచేతను, బలేన చ = బలముచేతను, సింహశార్దూల సదృశాః = సింహములతోడను, పులులతోడను సమానులు.
తా. ఆ వానరు లందరును ఇచ్చవచ్చిన రూపము ధరింపగలరు. బలాఢ్యులు; స్వేచ్ఛగా సంచరించువారు; దర్పబలముచే సింహశార్దూలములతో సమానులు.
మూ. శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః,
నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః. 24
ప్ర. అ. సర్వే = అందరును, శిలాప్రహరణాః = శిలలే ఆయుధములుగా కలవారు. సర్వే = అందరును, పాదపయోధినః = వృక్షములతో యుద్ధము చేయువారు. సర్వే = అందరును, నఖదంష్ట్రాయుధాః = గోళ్ళు, కోరలు ఆయుధములుగా కలవారు. సర్వే = అందరును, సర్వాస్త్రకోవిదాః = అన్ని అస్త్రములను గూర్చి తెలిసినవారు.
తా. ఆ వానరులందరును యుద్ధములలో శిలలు, వృక్షములు, గోళ్ళు, కోరలు - వీటిని ఆయుధములుగా ఉపయోగించెడివారు. వారికి అన్ని అస్త్రములను గూర్చియు తెలియును.
మూ. విచాలయేయుః శైలేన్ద్రాన్ భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్,
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్. 25
ప్ర. అ. శైలేన్ద్రాన్ = పర్వతశ్రేష్ఠములను, విచాలయేయుః = కదల్చివేయగలరు. స్థిరాన్ = స్థిరముగా నున్న, ద్రుమాన్ = వృక్షములను, భేదయేయుః = బ్రద్ధలుకొట్టగలరు. వేగేన = వేగముచేత, సరితాం పతిమ్ = నదుల పతి యైన, సముద్రమ్ = సముద్రమును, క్షోభయేయుః = క్షోభింపచేయగలరు.
తా. ఆ వానరు లందరును మహాపర్వతములను ఊపివేయగలరు. స్థిరములైన మహావృక్షములను పెకిలించగలరు. వేగముచే, సకలనదులకును గమ్యస్థాన మైన సముద్రమును కూడ కలతపెట్టగలరు.
మూ. దారయేయుః క్షితిం పద్భ్యామాప్లవేయుర్మహార్ణవమ్,
నభస్థ్సలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్. 26
ప్ర. అ. పద్భ్యామ్ = పాదములచేత, క్షితిమ్ = భూమిని, దారయేయుః = చీల్చి వేయగలరు. మహార్ణవమ్ = మహాసముద్రమును, ఆప్లవేయుః = దుమికి దాటగలరు. నభస్థ్సలమ్ = ఆకాశమును, విశేయుశ్చ = ప్రవేశింపగలరు. తోయదానపి = మేఘములను కూడ, గృహ్ణీయుః = గ్రహింపగలరు.
తా. వారు పాదములచేత భూమిని చీల్చివేయగలరు. సముద్రమును దాటగలరు. ఆకాశములో ప్రవేశించి మేఘాలను కూడ గ్రహింపగలరు.
మూ. గృహ్ణీయు రపి మాతఙ్గాన్మత్తాన్ ప్రవ్రజతో వనే,
నర్దమానాశ్చ నాదేన పాతయేయుర్విహఙ్గమాన్. 27
ప్ర. అ. వనే = అరణ్యమునందు, ప్రవ్రజతః = సంచరించుచున్న, మత్తాన్ = మదించిన, మాతఙ్గాన్ అపి = ఏనుగులను కూడ, గృహ్ణీయుః = పట్టుకొనగలరు. నర్దమానాః = ధ్వనిచేయుచున్నవారై, నాదేన = ధ్వనిచేత, విహఙ్గమాన్ = పక్షులను, పాతయేయుః = పడిపోవునట్లు చేయగలరు.
తా. అరణ్యములలో సంచరించు మత్తగజములను కూడ పట్టుకొనగలరు. ఆ వానరుల అరపులు విని పక్షులు క్రిందకు పడిపోవును కూడ.
మూ. ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణామ్,
శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్. 28
ప్ర. అ. కామరూపిణామ్ = ఇష్ట మైన రూపములను ధరింపగలిగినవారును, యూథపానామ్ = సేనానాయకులును, మహాత్మనామ్ = అధికధైర్యవంతులును, అగు, ఈదృశానామ్ = ఇట్టి, = పుట్టింపబడినవి.
తా. కామరూపులును, సేనానాయకులును, మహాత్ములును, అగు ఇట్టి వానరులు నూరులక్షలు (కోటిమంది) సృజింపబడిరి.
మూ. తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః,
బభూవుర్యూథపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్ హరీన్. 29
ప్ర. అ. తే = ఆ, హరియూథపాః = వానర సేనానాయకులు, హరీణామ్ = వానరులయొక్క, ప్రదానేషు = ప్రధానములైన, యూథేషు = సేనలయందు, యూథపశ్రేష్ఠాః = సేనానాయకులలో ముఖ్యులుగా, బభూవుః = అయిరి. వీరాన్ = వీరులైన, హరీన్ = వానరులను, అజనయన్ చ = పుట్టించిరి.
తా. ఆ వానరసేనానాయకులు వానరుల ముఖ్యసేనలకు నాయకులై, వీరులగు వానరులను పుట్టించిరి.
మూ. అన్యే ఋక్షవతః ప్రస్థానవతస్థుస్సహస్రశః,
అన్యే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననాని చ. 30
ప్ర. అ. అన్యే = కొందరు వానరులు, సహస్రశః = వేలకొలది, ఋక్షవతః = ఋక్షవత్పర్వతము యొక్క, ప్రస్థాన్ = చరియలను, అవతస్థుః = ఆశ్రయించి యుండిరి. అన్యే = మరి కొందరు, నానావిధాన్ = అనేకవిధములైన, శైలాన్ = పర్వతములను, కాననాని చ = అడవులను, భేజిరే = పొందిరి.
తా. వేలకొలది వానరులు కొందరు ఋక్షవత్పర్వతము పైన నివసించిరి. మరి కొందరు అనేక పర్వతముల పైనను, అడవులందును నివసించిరి.
మూ. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినమ్,
భ్రాతరావుపతస్థుస్తే సర్వ ఏవ హరీశ్వరాః, 31
నలం నీలం హనూమన్తమన్యాంశ్చ హరియూథపాన్.
ప్ర. అ. తే = ఆ, హరీశ్వరాః = వానరులు, సర్వే = అందరును, భ్రాతరౌ = సోదరులైన, సూర్యపుత్రమ్ = సూర్యుని కుమారు డైన, సుగ్రీవమ్ = సుగ్రీవుని, శక్రపుత్రమ్ = ఇంద్రుని పుత్రుడైన, వాలినం చ = వాలిని, నలమ్ = నలుని, నీలమ్ = నీలుని, హనూమన్తమ్ = హనుమంతుని, అన్యాన్ = ఇతరులైన, హరియూథపాంశ్చ = వానరసేనానాయకులను, ఉపతస్థుః = సేవించిరి.
తా. ఆ వానరశ్రేష్ఠులందరు, ఇంద్రసూర్యుల కుమారులును సోదరులును అగు వాలిసుగ్రీవులను, నలుని, నీలుని, హనుమంతుని, తదితరవానరసేనా నాయకులను సేవించుచుండిరి.
మూ. తే తార్ క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః,
విచరన్తోఽర్దయన్ దర్పాత్సింహవ్యాఘ్రమహోరగాన్. 32
ప్ర. అ. తార్క్ష్యబలసంపన్నాః = గరుత్మంతుని వంటి బలము కలవారును, యుద్ధవిశారదాః = యుద్ధమునందు సమర్థులును అగు, తే సర్వే = వారందరును, విచరన్తః = సంచరించుచు, దర్పాత్ = గర్వము వలన, సింహవ్యాఘ్రమహోరగాన్ = సింహములను, వ్యాఘ్రములను, మహాసర్పములను, అర్దయన్ = పీడించిరి.
తా. గరుత్మంతుని వంటి బలము కలవారును, యుద్ధసమర్థులును అగు ఆ వానరు లందరును సంచరించుచు, దర్పముచేత, సింహవ్యాఘ్రమహోరగములను పీడించిరి. అనగా వాటికి కూడ భయము కలుగు నట్లు సంచరించిరి.
మూ. తాంశ్చ సర్వాన్ మహాబాహుర్వాలీ విపులవిక్రమః,
జుగోప భుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్. 33
ప్ర. అ. మహాబాహుః = గొప్ప బాహువులు కలవాడును, విపులవిక్రమః = గొప్ప పరాక్రమము కలవాడును అయిన, వాలీ = వాలి, తాన్ = ఆ, సర్వాన్ = సమస్తమైన, ఋక్షగోపుచ్ఛవానరాన్ = ఋక్షగోపుచ్ఛ (కొండముచ్చు) వానరులను, భుజవీర్యేణ = భుజపరాక్రమముచేత, జుగోప = రక్షించెను.
తా. గొప్ప బాహువులు గల, అధికపరాక్రమవంతు డైన వాలి తన భుజబలముచేత ఆ ఋక్షగోపుచ్ఛవానరులను రక్షించెను.
మూ. తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా,
కీర్ణా వివిధసంస్థానైర్నానావ్యఞ్జనలక్షణైః. 34
ప్ర. అ. శూరైః = శూరులును, వివిధసంస్థానైః = అనేకవిధములైన శరీరములు కలవారును, నానావ్యఞ్జనలక్షణైః = నానావిధము లైన దేహములకు సంబంధించిన గుర్తులును, జాతికి సంబంధించిన గుర్తులును కలవారును అగు, తైః = వారిచేత, సపర్వతవనార్ణవా = పర్వత - వన - సముద్రములతో కూడిన, ఇయమ్ = ఈ, పృథివీ = భూమి, కీర్ణా = వ్యాప్తమైనది.
తా. అనేకవిధములైన శరీరనిర్మాణములును, అనేక విధములైన దేహ జాత్యాదిచిహ్నములును గల ఆ శూరు లైన వానరులు, పర్వత-వన-సముద్ర సహిత మగు ఈ భూమిని ఆవరించి ఉండిరి.
మూ. తైర్మేఘబృన్దాచలకూటకల్పై
ర్మహాబలైర్వానరయూథపాలైః,
బభూవ భూర్భీమశరీరరూపై
స్సమావృతా రామసహాయ హేతోః. 35
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తదశః సర్గః.
ప్ర. అ. మేఘబృన్దాచలకూటకల్పైః = మేఘసముదాయములతోడను పర్వతశిఖరములతోడను సమానులైన, మహాబలైః = గొప్ప బలము గల, భీమశరీరరూపైః = భయంకర మైన శరీరములు ఆకారములు గల, తైః = ఆ, వానరయూథపాలైః = వానర సేనానాయకులచేత, భూః = భూమి, రామసహాయ హేతోః = రామునకు సహాయము చేయుటకై, సమావృతా = ఆవరింపబడినది, బభూవ = ఆయెను.
తా. మేఘముల గుంపులతోడను పర్వతశిఖరములతోడను సమానులును, మహాబలవంతులును, భయంకరము లైన శరీరములు కలవారును, రామునికి సాహాయ్యము చేయుటకై ఆవిర్భవించినవారును అగు ఆ వానర సేనానాయకులచే ఈ భూమి యంతయు ఆవరింపబడి యుండెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండలో సప్తదశసర్గ సమాప్తము.
