Chapter_18

Back
Book Balakandamu
Chapter No 24
Pages 16
Read Time 23 Minutes

Chapter_18

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ అష్టాదశః సర్గః

రాజులను ఋష్యశృంగుని తమ దేశములకు పంపివేసి పత్నీసమేతుడైన దశరథుడు తన నగరమునకు తిరిగి వచ్చుట. శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నుల ఉత్పత్తి. వారికి జాతకర్మాది సంస్కారములు చేయుట. వారి శీలగుణాదుల వర్ణనము. విశ్వామిత్రుడు దశరథునివద్దకు వచ్చుట. అతనికి దశరథుడు సత్కారము చేయుట.

మూ. నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః,

ప్రతిగృహ్య సురా భాగాన్ ప్రతిజగ్ముర్యథాగతమ్. 1

ప్ర. అ. మహాత్మనః = మహాత్ముడైన దశరథునియొక్క, తస్మిన్ = ఆ, హయమేధే = అశ్వమేధ మనెడు, క్రతౌ = యాగము, నిర్వృత్తే సతి = పూర్తికాగా, సురాః = దేవతలు, భాగాన్ = భాగములను, ప్రతిగృహ్య = స్వీకరించి, యథాగతమ్ = వచ్చినట్లుగానే, ప్రతిజగ్ముః = తిరిగి వెళ్ళిరి.

తా. మహాత్ము డైన దశరథుడు ప్రారంభించిన అశ్వమేధపుత్రకామేష్టులు పూర్తి యైనవి. దేవతలు హవిర్భాగములను తీసికొని తమ తమ స్థానములకు వెడలిపోయిరి.

మూ. సమాప్తదీక్షానియమః పత్నీగణసమన్వితః,

ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః. 2

ప్ర. అ. పత్నీగణసమన్వితః = భార్యలసముదాయముతో కూడిన, రాజా = రాజు, సమాప్తదీక్షానియమః = సమాప్తమైన దీక్షానియమములు కలవాడై, సభృత్యబలవాహనః = భృత్యులతో, సేనలతో, వాహనములతో కూడినవాడై, పురీమ్ = పట్టణమును, ప్రవివేశ = ప్రవేశించెను.

తా. పత్నీసమేతుడైన దశరథుడు యాగదీక్షానియమములను పూర్తి చేసికొని, భృత్య-బల-వాహనాదులతో అయోధ్యానగరమును ప్రవేశించెను.

మూ. యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః,

ముదితాః ప్రయయుర్దేశాన్ ప్రణమ్య మునిపుఙ్గవమ్. 3

ప్ర. అ. పృథివీశ్వరాః = రాజులు, తేన రాజ్ఞా = ఆరాజుచేత, యథార్హమ్ = తగువిధముగా, పూజితాః = పూజింపబడినవారై, ముదితాః = సంతోషించినవారై, ముని పుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని, ప్రణమ్య = నమస్కరించి, దేశాన్ = తమ దేశములను గూర్చి, ప్రయయుః = వెళ్లిరి.

తా. యాగమునకు ఆహూతులై వచ్చిన రాజు లందరును, తగు విధముగ దశరథునిచేత పూజింపబడినవారై, వసిష్ఠునకు నమస్కారము చేసి, సంతోషముతో స్వదేశములకు వెళ్లిరి.

మూ. శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః,

బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే. 4

ప్ర. అ. తతః పురాత్ = ఆ పట్టణమునుండి, స్వపురాణి = తమ పురములను గూర్చి, గచ్ఛతామ్ = వెళ్లుచున్న, శ్రీమతామ్ = శ్రీమంతు లైన, తేషామ్ = ఆ, రాజ్ఞామ్ = రాజుల యొక్క, శుభ్రాణి = శుభ్రముగా నున్న, ప్రహృష్టాని = సంతసించిన, బలాని = సైన్యములు, చకాశిరే = ప్రకాశించినవి.

తా. అయోధ్యాపురినుండి తమ పురములకు బయలుదేరిన ఆ రాజుల సైన్యములు, శుభ్రములై ఆనందము కలవై ప్రకాశించినవి.

వి.శుభ్రాణిఅనుదానికి దశరథు డిచ్చిన వస్త్రాదులచే తెల్లగా నున్నవి అని కొందరివ్యాఖ్య. అంతకంటె - సైనికులు అందరును ఒక నియమిత మగు వేషమును (Uniform) ధరింతురు గాన వారు ప్రయాణముచేసి పోవుచున్నప్పుడు చాల అందముగా కనబడి రనియు, అదియే శుభ్రత్వ మనియు చెప్పుట యుక్తము.

మూ. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా,

ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కత్య ద్విజోత్తమాన్. 5

ప్ర. అ. పృథివీశేషు = రాజులు, గతేషు సత్సు = తిరిగి వెళ్లిపోయినవారగుచుండగా, తదా = అప్పుడు, శ్రీమాన్ = శోభాయుక్తుడైన, రాజా దశరథః = దశరథమహారాజు, ద్విజోత్తమాన్ = బ్రాహ్మణశ్రేష్ఠులను, పురస్కత్య = ఎదుట ఉంచుకొని, పురీమ్ = నగరమును, ప్రవివేశ ప్రవేశించెను.

తా. రాజులు వెడలిపోయినపిదప శ్రీమంతు డగు దశరథమహారాజు, సద్బ్రాహ్మణులను ముందిడుకొని నగరము ప్రవేశించెను.

మూ. శాన్తయా ప్రయయౌ సార్ధం ఋశ్యశృఙ్గః సుపూజితః,

అన్వీయమానో రాజ్ఞాథ సానుయాత్రేణ ధీమతా. 6

ప్ర. అ. అథ = పిమ్మట, ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు, సుపూజితః = బాగుగా పూజింపబడినవాడై, సానుయాత్రేణ = అనుచరులతో కూడిన, ధీమతా = ధీమంతుడైన, రాజ్ఞా = రోమపాదునిచేత, అన్వీయమానః = అనుసరింపబడుచున్నవాడై, శాన్తయా సార్ధమ్ = శాంతతోకూడ, ప్రయయౌ = వెళ్లెను.

తా. దశరథుని నుండి బాగుగా పూజల నందుకొని ఋశ్యశృంగుడు కూడ, పరివారసమేతు డైన రోమపాదుడు అనుసరింప, శాంతతో కూడ తిరిగి స్వస్థానమునకు వెళ్లెను.

మూ. ఏవం విసృజ్య తాన్సర్వా న్రాజా సంపూర్ణమానసః,

ఉవాస సుఖిత స్తత్ర పుత్రోత్పత్తిం విచిన్తయన్. 7

ప్ర. అ. రాజా = దశరథుడు, ఏవమ్ = ఈ విధముగా, తాన్ సర్వాన్ = వారినందరిని, విసృజ్య = పంపివేసి, సంపూర్ణమానసః = నిండిన మనస్సు కలవాడై, పుత్రోత్పత్తిమ్ = పుత్రుల ఉత్పత్తిని గూర్చి, విచిన్తయన్ = ఆలోచించుచు, తత్ర = అచట, సుఖితః = సుఖవంతుడై, ఉవాస = నివసించెను.

తా. దశరథుడు ఈ విధముగా వారి నందరిని పంపివేసి, ఆనందముతో నిండిన మనస్సు కలవాడై, కుమారుల ఉత్పత్తికై ఎదురు చూచుచు, సుఖముగా నుండెను.

మూ. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః,

తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమి కే తిథౌ, 8

నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పఞ్చసు,

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిన్దునా సహ, 9

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్,

కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసంయుతమ్, 10

విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనమ్.

ప్ర. అ. తతః = పిమ్మట, యజ్ఞే = యజ్ఞము, సమాప్తే = సమాప్తమైన తరువాత, ఋతూనామ్ = ఋతువులయొక్క, షట్ = ఆరు (ఆరు ఋతువులు), సమత్యయుః = గడిచినవి. తతః = పిమ్మట, ద్వాదశే మాసే = పండ్రెండవ మాసమునందు, చైత్రే = చైత్రము నందు, నావమికే తిథౌ = నవమితిథియందు, అదితిదైవత్యే = అదితి దేవతగా గల, నక్షత్రే = నక్షత్రమునందు, పఞ్చసు = ఐదు, గ్రహేషు = గ్రహములు, స్వోచ్చసంస్థేషు = తమ తమ ఉచ్చస్థానములందు ఉండగా, కర్కటే లగ్నే = కర్కటలగ్నమునందు, వాక్పతౌ = బృహస్పతి, ఇన్దునా సహ = చంద్రునితోకూడ, ప్రోద్యమానే = ఉదయించుచుండగా, కౌసల్యా = కౌసల్య, జగన్నాథమ్ = సకలజగత్తులకును ప్రభువైన వాడును, సర్వలోకనమస్కతమ్ = సర్వ లోకములచే నమస్కరింపబడినవాడును, సర్వలక్షణసంయుతమ్ = సకలలక్షణములతో కూడినవాడును, విష్ణోః = విష్ణువుయొక్క, అర్ధమ్ = అంశయైనవాడును, మహాభాగమ్ = గొప్పభాగ్యము కలవాడును, ఐక్ష్వాకవర్ధనమ్ = ఇక్ష్వాకువంశీయులను వృద్ధిపొందించు వాడును అగు, రామమ్ = రాముని, పుత్రమ్ = పుత్రునిగా, అజనయత్ = కనెను.

తా. యజ్ఞము పూర్తి యైన తరువాత ఆరు ఋతువులు గడచినవి. అనగా ఒక సంవత్సరము చాలవరకు పూర్తియైనది. తరువాత వచ్చిన పండ్రెండవ మాస మగు చైత్రమాసమునందు, పునర్వసునక్షత్రయుక్తనవమీతిథియందు, ఐదు గ్రహములు తమ తమ ఉచ్చస్థానములం దుండగా - అనగా సూర్య - కుజ - గురు - శుక్ర - శనులు తమ ఉచ్చస్థానము లగు మేష-మకర-కర్కటక-మీన-తులా-రాసులందుండగా-గురుడు చంద్రునితో కలసి యున్న కర్కటలగ్నమునందు, కౌసల్య, సకలజగన్నాథుడును, సర్వలోకనమస్కృతుడును, సర్వలక్షణసంపన్నుడును, విష్ణువుయొక్క అంశయైనవాడును, మహాభాగ్యవంతుడును, ఇక్ష్వాకువంశవర్ధనుడును అగు రాముని పుత్రునిగా కనెను.

వి.విష్ణువునకు అంశకల్పన వ్యావహారికము. విష్ణ్వర్ధాంశభూతుడు సకల జగన్నాథుడు కాజాలడు. సకలజగన్నాథుడైనచో అర్ధాంశత్వ మయుక్తము. శ్రీరాముడు మహావిష్ణువుయొక్క పూర్ణావతారము.

మూ. కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా,

యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా. 11

ప్ర. అ. కౌసల్యా = కౌసల్య, అమితతేజసా = అమిత మైన తేజస్సు గల, తేన పుత్రేణ = ఆ పుత్రునిచేత, దేవానామ్ = దేవతలలో, వరేణః = శ్రేష్ఠు డైన, వజ్రపాణినా = దేవేంద్రునిచేత, అదితిః యథా అదితి వలె, శుశుభే = ప్రకాశించెను.

తా. అమిత మైన తేజస్సు గల ఆ కుమారునితో కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన దేవేంద్రునితో అతని తల్లియైన అదితి వలె ప్రకాశించెను.

మూ. భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః,

సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వైః సముదితో గుణైః. 12

ప్ర. అ. సత్యపరాక్రమః = సత్యమైనపరాక్రమముకలవాడును, సాక్షాత్ = సాక్షాత్తు, విష్ణోః = విష్ణువుయొక్క, చతుర్భాగః = నాల్గవ భాగ మైన వాడును, సర్వైః = సమస్త మైన, గుణైః = గుణములతో, సముదితః = కూడిన వాడును అగు, భరతో నామ = భరతు డనెడు పుత్రుడు, కైకేయ్యామ్ = కైకేయియందు, జజ్ఞే = పుట్టెను.

తా. సత్యపరాక్రముడును, సాక్షాత్తు విష్ణువుయొక్క నాల్గవభాగమైన వాడును, సమస్త సద్గుణ సంపన్నుడును అగు భరతు డను పుత్రుడు కైకేయి యందు జనించెను.

మూ. అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ,

వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధసమన్వితౌ. 13

ప్ర. అ. అథ = పిమ్మట, సుమిత్రా = సుమిత్ర, వీరౌ = వీరులును, సర్వాస్త్రకుశలౌ = సకలాస్త్రములందును నేర్పు కలవారును, విష్ణోః = విష్ణువుయొక్క, అర్ధసమన్వితౌ = అంశములతో కూడినవారును అగు, లక్ష్మణశత్రుఘ్నౌ = లక్ష్మణశత్రుఘ్ను లనెడు, సుతౌ = కుమారులను, అజనయత్ = కనెను.

తా. పిమ్మట సుమిత్ర, సకలాస్త్రములందును నేర్పు కలవారును, విష్ణువు యొక్క అంశతో కూడినవారును, వీరులును అగు లక్ష్మణశత్రుఘ్నులను సుతులను కనెను.

మూ. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః,

సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరేఽభ్యుదితే రవౌ. 14

ప్ర. అ. ప్రసన్నధీః = ప్రసన్న మైన బుద్ధి గల, భరతః = భరతుడు, పుష్యే = పుష్యమీ నక్షత్రమునందు, మీనలగ్నే = మీనలగ్నమునందు, జాతః = పుట్టెను. సౌమిత్రీ = సుమిత్రాకుమారులు, సార్పే = ఆశ్రేషానక్షత్రమునందు, కుళీరే = కర్కటకలగ్నమునందు, రవౌ = సూర్యుడు, అభ్యుదితే = ఉదయించిన వాడగుచుండగా, అనగా మరునాడు అని అర్థము (కొందరు వ్రాసి నట్లు మధ్యాహ్న సమయమున అని కాదు) జాతౌ = పుట్టిరి.

తా. నిర్మల మైన బుద్ధి గల భరతుడు పుష్యమీనక్షత్రమునందు, మీనలగ్నమున పుట్టెను. మరునాడు లక్ష్మణశత్రుఘ్నులు, ఆశ్లేషానక్షత్రమునందు, కర్కటకలగ్నమున మధ్యాహ్నసమయమున పుట్టిరి.

మూ. రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్,

గుణవన్తోఽనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః. 15

ప్ర. అ. గుణవన్తః = గుణములు కలవారును, అనురూపాః = తగినవారును, రుచ్యా = కాంతిచేత, ప్రోష్ఠపదోపమాః = పూర్వాభాద్రోత్తరాభాద్రనక్షత్రములతో సమానులును, మహాత్మానః = గొప్ప బుద్ధి కలవారును అగు, రాజ్ఞః = రాజుయొక్క, చత్వారః = నలుగురు, పుత్రాః = పుత్రులు, పృథక్ = వేరు వేరుగా, జజ్ఞిరే = పుట్టిరి.

తా. ఈ విధముగ దశరథునకు గుణవంతులును, అనురూపులును, పూర్వా భాద్రోత్తరాభాద్రములు అను నాలుగు నక్షత్రముల వంటి కాంతి కలవారును, బుద్ధిమంతులును అగు నలుగురు పుత్రులు జనించిరి.

మూ. జగుః కలం చ గన్ధర్వా ననృతుశ్చాప్సరోగణాః, 16

దేవదున్దుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా,

ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః. 17

ప్ర. అ. గన్ధర్వాః = గంధర్వులు, కలమ్ = మధురముగా, జగుః = గానముచేసిరి. అప్సరోగణాః = అప్సరఃస్త్రీసమూహములు, ననృతుః = నాట్యము చేసినవి. దేవదున్దుభయః = దేవతల దుందుభులు, నేదుః = మ్రోగినవి, ఖాత్ = ఆకాశమునుండి, పుష్పవృష్టిశ్చ = పుష్పవర్షము కూడ, చ్యుతా = పడినది, అయోధ్యాయామ్ = అయోధ్యలో, జనాకులః = జనులచే వ్యాకుల మైన, మహాన్ = గొప్ప, ఉత్సవశ్చ = ఉత్సవము కూడ, ఆసీత్ = ఆయెను.

తా. ఆ సమయమున గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరసలు నాట్యము చేసిరి. దేవదుందుభులు మ్రోగినవి. ఆకాశమునుండి పుష్పవర్షము కురిసినది. అయోధ్యలో ఎందరో జనులు పాల్గొనిన గొప్ప ఉత్సవము జరిగినది.

మూ. రథ్యాశ్చ జనసంబాధా నటనర్తకసంకులాః,

గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః. 18

ప్ర. అ. రథ్యాః = వీథులు, జనసంబాధాః = జనులచేత ఇరుకైనవిగాను, నటనర్తకసంకులాః = నటులతోడను నర్తకులతోడను వ్యాప్తమైనవిగాను, గాయనైశ్చ = గానముచేయువారిచేతను, వాదనైః = వాద్యములు మ్రోగించువారిచేతను, తథా = మరియు, అపరైః = ఇతరులైన వందిమాగధాదులచేతను, విరావిణ్యః = బాగుగా ధ్వని చేయుచున్నవిగాను, అయినవి.

తా. జనులతో క్రిక్కిరిసి ఉన్న వీథు లన్నియు నటనర్తకాదులతో నిండిపోయినవి. గాయకుల ధ్వనులు, వాద్యధ్వనులు వందిమాగధాదులు చేయు ధ్వనులును మిన్ను ముట్టినవి.

మూ. ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవన్దినామ్,

బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. 19

ప్ర. అ. రాజా = రాజు, సూతమాగధవన్దినామ్ = పౌరాణికులకును, వంశావళిని కీర్తించువారికిని, స్తోత్రపాఠము చేయువారికిని, ప్రదేయాన్ చ = ఇవ్వదగిన పారితోషికములను, దదౌ = ఇచ్చెను. బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకొరకు, విత్తమ్ = ధనమును, సహస్రశః = వేలకొలది, గోధనాని = గోవు లనెడు ధనములను, దదౌ = ఇచ్చెను.

తా. దశరథుడు సూత-మాగధ-వందులకు పారితోషికములను పంచిపెట్టెను. బ్రాహ్మణులకు అధికసంఖ్యాకము లగు గోవులను, తదితరవస్తువులను దానము చేసెను.

మూ. అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాకరోత్,

జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్. 20

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా,

వసిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా. 21

ప్ర. అ. తథా = మరియు, ఏకాదశాహమ్ = పదకొండురోజులు, అతీత్య = దాటి, నామకర్మ = నామకరణమును, అకరోత్ = చేసెను. మహాత్మానమ్ = మహాత్ముడైన, జ్యేష్ఠమ్ = పెద్దకుమారుని, రామమ్ = రామునిగాను, కైకయీసుతమ్ = కైకయీపుత్రుని, భరతమ్ = భరతునిగాను, సౌమిత్రమ్ = ఒక సుమిత్రా కుమారుని, లక్ష్మణమితి = లక్ష్మణుని గాను, అపరమ్ = రెండవ సుమిత్రాకుమారుని, శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని గాను, పరమప్రీతః = మిక్కిలి సంతోషించిన, వసిష్ఠః = వసిష్ఠుడు, తదా = అప్పుడు, నామాని = పేర్లను, కురుతే = చేసెను.

తా. పదకొండు దినముల తరువాత నామకరణము జరిగెను. ఆనంద భరితహృదయు డైన వసిష్ఠుడు జ్యేష్ఠు డగు కౌసల్యాపుత్రునకు రాము డనియు, కైకేయీపుత్రునకు భరతు డనియు, సుమిత్రాపుత్రులకు లక్ష్మణశత్రుఘ్నులనియు నామధేయములు చేసెను.

వి.‘‘రమన్తే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః’’ అను వ్యుత్పత్తి చేత, ‘‘సర్వజనులును సద్గుణములను బట్టి ఎవని విషయమున ఆనందవంతులగుదురో అతడు రాముడు’’ అని ‘‘రామ’’ శబ్దార్థము. ‘‘లక్ష్మీః అస్య అస్తీతి లక్ష్మణః’’ - సంపద, శోభ కలవాడు లక్ష్మణుడు. ‘‘బిభర్తీతి భరతః’’ - రాజ్యమును భరించినవాడు కావున భరతుడు. ‘‘శత్రూన్ హన్తీతి శత్రుఘ్నః’’ - శత్రువులను చంపువాడు శత్రుఘ్నుడు.

క్షత్రియులకు జాతాశౌచము పండ్రెడు దినము లని శ్రుతులలో ఉన్నది. క్షత్రియులకు నామకరణము పదమూడవ దినమున చేయవలె నని స్మతులలోనున్నది. అందుచే ‘‘ఏకాదశాహమ్’’ అను పదమునకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టిన తరువాత పదకొండు రోజులు దాటిన తరువాత అని అర్థము చెప్పుకొనవలె నని గోవిందరాజుల వ్యాఖ్య. అట్లైనను రామభరతులు పుట్టిన పదమూడవ దివసమైనను సౌమిత్రులు పుట్టిన పండ్రెండవ దివసమే కదా ? వారి జన్మాశౌచమట్లే ఉన్నది కదా. స్మతికర్త యైన వసిష్ఠుడు ఏకాదశదివసానంతరము నామకరణము చేసినా డని చెప్పినపుడు మనకు ఈ వికల్పము లెందులకు ? రామభరతులకు ఒకనాడు, సౌమిత్రులకు మరొకనాడు నామకరణములు చేసి ఉండవచ్చును కదా ? జాతకర్మకు వలె నామకరణమునకు కూడ సూతక నిషేధము ఆనాడు లేదేమో ? మన భావాలు, సంప్రదాయాలు, ఆచారాలు ప్రాచీనగ్రంథాలలో చేర్చి వ్యాఖ్యానించుట యుక్తము కాదు. వాక్యార్థమును యథాతథముగా గ్రహించి ఇది ఆనాటి పరిస్థితి కదా అని అనుకొనుట యుక్తము.

మూ. బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి,

అదదాద్బ్రాహ్మణానాం చ రత్నౌఘమమితం బహు, 22

తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్.

ప్ర. అ. బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను, పౌరాన్ = నగరములలో ఉన్నవారిని, జానపదానపి = గ్రామీణులను, భోజయామాస = భుజింపచేసెను. బ్రాహ్మణానాం = బ్రాహ్మణులకు, అమితమ్ = అమిత మైన, బహు = అత్యధిక మైన, రత్నౌఘమ్ = రత్నసముదాయమును, అదదాత్ = ఇచ్చెను. తేషాం = ఆ పుత్రులకు, జన్మక్రియాదీని = జన్మక్రియమొదలైన, సర్వకర్మాణి = సమస్తకర్మలను, అకారయత్ = చేయించెను.

తా. దశరథుడు బ్రాహ్మణులకును, పౌరులకును, జానపదులకును సంతర్పణములు చేసి బ్రాహ్మణులకు అత్యధిక మగు రత్నసముదాయమును దానము చేసెను. ఈ విధముగ దశరథుడు కుమారులకు జాతకర్మ-నామకరణ-అన్నప్రాశన- చౌలోపనయనాదిసంస్కారము లన్నియు యథాకాలముగ చేయించెను.

మూ. తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః,

బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సంమతః. 23

ప్ర. అ. తేషామ్ = వారిలో, జ్యేష్ఠః = పెద్దవాడైన, రామః = రాముడు, కేతురివ = ధ్వజము వలె, పితుః = తండ్రికి, భూయః = మిక్కిలి, రతికరః = ప్రీతిజనకుడై, స్వయంభూరివ = బ్రహ్మదేవుడు వలె, భూతానామ్ = సకలప్రాణులకును, సంమతః = ఆదరపాత్రుడు, బభూవ = ఆయెను.

తా. వారిలో పెద్దవా డైన రాముడు ధ్వజము వలె సర్వోన్నతుడై, తండ్రికి చాల ప్రీతిని కలిగించెను. బ్రహ్మదేవుడు వలె సమస్తప్రాణుల ఆదరమును చూరకొనెను.

మూ. సర్వే వేదవిదః శూరాస్సర్వే లోకహితే రతాః, 24

సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః.

ప్ర. అ. సర్వే = అందరును, వేదవిదః = వేదవేత్తలే. శూరాః = శూరులే. సర్వే = అందరును, లోకహితే = లోకక్షేమమునందు, రతాః = ఆసక్తి కలవారే. సర్వే = అందరును, జ్ఞానోప సంపన్నాః = జ్ఞనముతో కూడినవారే. సర్వే = అందరును, గుణైః = సద్గుణములతో, సముదితాః = కూడినవారే.

తా. ఆ దశరథపుత్రులందరును వేదవేత్తలే, అందరును శూరులే, అందరును జ్ఞానసంపన్నులే. అందరును సద్గుణశోభితులే. అందరును లోకక్షేమమునందు ఆసక్తి కలవారే.

మూ. తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః, 25

ఇష్టః సర్వస్య లోకస్య శశాఙ్క ఇవ నిర్మలః.

ప్ర. అ. తేషామపి = వారందరిలోకిని, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, సత్యపరాక్రమః = వ్యర్థము కాని పరాక్రమము కలవాడును అగు, రామః = రాముడు, నిర్మలః = కలంకరహితు డగు, శశాఙ్కః ఇవ = చంద్రుడు వలె, సర్వస్య = సమస్త మైన, లోకస్య = లోకమునకు, ఇష్టః = ఇష్టమైనవాడు.

తా. వారందరిలో కూడ, మహాతేజఃశాలియు, సత్యపరాక్రముడును అగు రాముడు, నిర్మలు డైన చంద్రుడు వలె సకలలోకమునకు ఇష్టుడై ఉండెను.

మూ. గజస్కన్ధేశ్వపృష్ఠే చ రథచర్యాసు సమ్మతః, 26

ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః.

ప్ర. అ. గజస్కన్ధే = ఏనుగు మూపు నెక్కుటయందును, అశ్వపృష్ఠే చ = గుఱ్ఱము వీపుపై ఎక్కి ప్రయాణములు చేయుటయందును, రథచర్యాసు = రథము యొక్క నడకల యందును, సంమతః = సమర్థు డని అందరిచేతను అంగీకరింపబడినవాడు. ధనుర్వేదే చ = ధనుర్వేదమునందు కూడ, నిరతః = ఆసక్తి కలవాడు. పితృశుశ్రూషణే = తలిదండ్రుల సేవ చేయుటయందు, రతః = ఆసక్తి కలవాడు.

తా. రాముడు గజాశ్వరథములపై నెక్కి యుద్ధము చేయుటయందు సమర్థు డని పేరెన్నిక గనెను. అతడు ధనుర్వేదమునందు శ్రద్ధ కలవాడు. పితృసేవచేయుట యందు ఆసక్తి కలవాడు.

మూ. బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః,

రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః. 27

ప్ర. అ. లక్ష్మివర్ధనః = సంపదను వృద్ధిపొందించు, లక్ష్మణః = లక్ష్మణుడు, బాల్యాత్ ప్రభృతి = బాల్యమునుండియు, లోకరామస్య = లోకమునకు మనోహరుడును, జ్యేష్ఠస్య భ్రాతుః = జ్యేష్ఠసోదరుడును అగు, రామస్య = రాముని విషయమున, నిత్యశః = ఎల్లప్పుడును, సుస్నిగ్ధః = బాగుగా స్నేహము కలవాడై, ఉండెను.

తా. సంపదలను వృద్ధిపొందించు లక్ష్మణుడు, చిన్నతనమునుండియు, లోకములకు మనోహరుడును, జ్యేష్ఠసోదరుడును అగు రాముని విషయమున సర్వదా అత్యధిక స్నేహము కలవాడై ఉండెను.

మూ. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః, 28

లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిఃప్రాణ ఇవాపరః.

ప్ర. అ. లక్ష్మిసంపన్నః = శోభాసంపన్ను డైన, లక్ష్మణః = లక్ష్మణుడు, శరీరతః అపి = శరీరమును కూడ అర్పించి, సర్వప్రియకరః = సమస్తవిధము లగు ప్రియములను చేయుచు, తస్య = ఆ, రామస్య = రామునకు, అపరః = రెండవ, బహిఃప్రాణ ఇవ = బైట సంచరించు ప్రాణము వలె ఉండెను.

తా. రామునకు సకల ప్రియములను చేకూర్చుటకై శరీరమును కూడ అర్పించుటకు వెనుతీయని లక్ష్మిసంపన్ను డైన లక్ష్మణుడు రామునకు, బైట సంచరించు చున్న మరియొక ప్రాణమా అన్నట్లు అపారస్నేహాస్పదుడయ్యెను.

మూ. న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః,

మృష్టమన్న ముపానీతమశ్నాతి న చ తం వినా. 29

ప్ర. అ. పురుషోత్తమః = పురుషశ్రేష్ఠు డైన రాముడు, తేన వినా = ఆ లక్ష్మణుడు లేకుండ, నిద్రామ్ = నిద్రను, న లభతే = పొందడు. ఉపానీతమ్ = తీసికొనిరాబడిన, మృష్టమ్ = శ్రేష్ఠ మైన, అన్నం చ = అన్నమును కూడ, తం వినా = అతడు లేకుండ, న అశ్నాతి = భుజింపడు.

తా. లక్ష్మణుడు ప్రక్కన లేకున్నచో శ్రీరాముడు నిద్రపోయెడివాడు కాదు. అతడు లేనిచో మధుర మైన ఆహారమును కూడ భుజించెడివాడు కాదు.

మూ. యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః, 30

తదైనం పృష్ఠితోఽన్వేతి స ధనుః పరిపాలయన్.

ప్ర. అ. రాఘవః = రాముడు, హయమ్ = అశ్వమును, ఆరుహ్య = ఎక్కి, యదా = ఎప్పుడు, మృగయా = వేటనుగూర్చి, యాతి = వెళ్లెనో, తదా = అప్పుడు, సః = ఆ లక్ష్మణుడు, ధనుః = ధనుస్సును, పరిపాలయన్ = ధరించిన వాడై, ఏనమ్ = ఈ రాముని, పృష్ఠతః = వెనుకనే, అన్వేతి = అనుసరించి వెళ్లును.

తా. రాముడు అశ్వము నెక్కి వేటకై బయల్వెడలినపుడు లక్ష్మణుడు ధనుస్సుచేత బూని అతని వెనుకనే వెళ్లెడివాడు.

మూ. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః,

ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః. 31

ప్ర. అ. లక్ష్మణావరజః = లక్ష్మణుని తమ్ముడైన, సః = ఆ, శత్రుఘ్నః = శత్రుఘ్నుడు, భరతస్యాపి = భరతునకు, నిత్యమ్ = ఎల్లప్పుడును, ప్రాణైః = ప్రాణములచేత, ప్రియతరః = ఎక్కువ ఇష్టు డయ్యెను, (భరతుడు), తస్య చ = ఆ శత్రుఘ్నునకు కూడ, తథా = ఆ విధముగనే, ప్రియః = ఇష్టుడు, (అసీత్ = ఆయెను).

తా. అట్లే లక్ష్మణుని తమ్ము డైన శత్రుఘ్నుడు భరతునకు ప్రాణముల కంటె ఎక్కువ ప్రియు డయ్యెను. శత్రుఘ్నునకు భరతుడును అట్లే ప్రియుడయ్యెను.

మూ. స చతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథః ప్రియైః,

బభూవ పరమప్రీతో దేవైరివ పితామహః. 32

ప్ర. అ. సః = ఆ, దశరథః = దశరథుడు, మహాభాగైః = మహాభాగ్యవంతులైన, చతుర్భిః = నలుగురు, పుత్రైః = పుత్రులతో, పితామహః = బ్రహ్మదేవుడు, దేవైః ఇవ = దేవతలతో వలె, పరమప్రీతః = చాల సంతసించినవాడు, బభూవ = ఆయెను.

తా. భాగ్యశాలులును, ప్రియులును అగు ఆ నలుగురు కుమారులతో దశరథుడు, దేవతలతో బ్రహ్మదేవుడు వలె చాల సంతోషించెను.

మూ. తే యదా జ్ఞానసంపన్నాః సర్వైః సముదితా గుణైః, 33

హ్రీమన్తః కీర్తిమన్తశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః.

తేషామేవంప్రభావానాం సర్వేషాం దీప్తతేజసామ్, 34

పితా దశరథో హృష్టో బ్రహ్మా లోకాధిపో యథా.

ప్ర. అ. తే = వారు, యదా = ఎప్పుడు, జ్ఞానసంపన్నాః = జ్ఞానముతో కూడినవారుగాను, సర్వైః = సమస్త మైన, గుణైః = గుణములతో, సముదితాః = కూడినవారుగాను, హ్రీమన్తః = లజ్జ కలవారుగను, కీర్తిమన్తశ్చ = కీర్తి కలవారుగాను, సర్వజ్ఞాః = అన్నియు తెలిసిన వారుగాను, దీర్ఘదర్శినః = దూరముగా ఆలోచించగలవారుగాను, (అయిరో, అప్పుడు), ఏవంప్రభావానామ్ = ఇట్టి ప్రభావము గల, దీప్తతేజసామ్ = ప్రకాశించుచున్న తేజస్సు గల, తేషాం సర్వేషామ్ = వారు అందరి విషయమునను, పితా = తండ్రి యైన, దశరథః = దశరథుడు, లోకాధిపః = లోకాధిపతియైన, బ్రహ్మా యథా = బ్రహ్మదేవుడు వలె, హృష్టః = సంతోషించెను.

తా. ఆ కుమారు లందరును జ్ఞానసంపన్నులు, సర్వగుణభూషితులు, తప్పుపనులు చేయుటకు సిగ్గుపడెడువారు, కీర్తిని సంపాదించినవారు, అన్ని విషయములందును జ్ఞానము సంపాదించినవారు, దీర్ఘాలోచన చేయ సమర్థులు అయియుండిరి. ఇట్టి ప్రభావము గల తేజశ్శాలు లగు ఆ పుత్రులను చూచుకొని దశరథమహారాజు సకలలోక ప్రభు వగు ప్రజాపతి వలె సంతుష్టాంతరంగు డయ్యెను.

మూ. తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః,

పితృశుశ్రూషణ రతా ధనుర్వేదే చ నిష్ఠితాః. 35

ప్ర. అ. తే = ఆ, మనుజవ్యాఘ్రాః అపి = మనుష్యశ్రేష్ఠులు కూడ, వైదికాధ్యయనే = వేదాధ్యయనమునందు, రతాః = శ్రద్ధావంతులుగను, పితృశుశ్రూషణ రతాః = తలిదండ్రులకు శుశ్రూష చేయుటయందు ఆసక్తి కలవారుగాను, ధనుర్వేదే = ధనుర్వేదమునందు, నిష్ఠితాశ్చ = నిష్ణాతులుగను ఉండిరి.

తా. ఆ రామలక్ష్మణభరతశత్రుఘ్నులు వేదాధ్యయనమందు శ్రద్ధావంతులై, తలిదండ్రులను సేవించుటయందు ఆసక్తి కలవారై, ధనుర్వేదమునందు కూడ నైపుణ్యమును సంపాదించిరి.

మూ. అథ రాజా ధశరథస్తేషాం దారక్రియాం ప్రతి, 36

చిన్తయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాన్ధవః.

ప్ర. అ. అథ = పిమ్మట, ధర్మాత్మాః = ధర్మాత్ముడైన, రాజా దశరథః = దశరథ మహారాజు, సోపాధ్యాయః = పురోహితునితో కూడిన వాడై, సబాన్ధవః = బంధువులతో కూడినవాడై, తేషాం = ఆ కుమారులయొక్క, దారక్రియాం ప్రతి = వివాహమును గూర్చి, చిన్తయామాస = ఆలోచించెను.

తా. ఒకనాడు, దశరథమహారాజు, పురోహితునితోడను, బంధువులతోడను కలిసి ఆ కుమారుల వివాహమును గూర్చి ఆలోచించుచుండెను.

మూ. తస్య చిన్తయమానస్య మన్త్రిమధ్యే మహాత్మనః,

అభ్యగచ్ఛన్మహాతేజా విశ్వామిత్ర మహామునిః. 37

ప్ర. అ. మహాత్మనః = పూజ్యమైన బుద్ధి గల, తస్య = ఆ దశరథుడు, మన్త్రిమధ్యే = మంత్రుల మధ్యయందు, చిన్తయమానస్య = ఆలోచించుచుండగా, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః మహామునిః = మహాముని యైన విశ్వామిత్రుడు, అభ్యగచ్ఛత్ = వచ్చెను.

తా. బుద్ధిశాలి యగు దశరథుడు మంత్రులతో ఆలోచించుచుండగా, మహా తేజశ్శాలి యగు విశ్వామిత్రమహాముని అచటకు వచ్చెను.

మూ. స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ. 38

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్.

ప్ర. అ. సః = అతడు, రాజ్ఞః = రాజుయొక్క, దర్శనాకాంక్షీ = దర్శనమును కోరుచున్నవాడై, ద్వారాధ్యక్షాన్ = ద్వారపాలకులను గూర్చి, ఉవాచ హ = పలికెను. ‘‘గాధినః = గాధియొక్క, సుతమ్ = కుమారుడును, కౌశికమ్ = కుశికవంశమునందు పుట్టినవాడును అగు, మామ్ = నన్ను, ప్రాప్తమ్ = వచ్చిన వానినిగా, శీఘ్రమ్ = శీఘ్రముగా, ఆఖ్యాత = చెప్పుడు.’’

తా. రాజదర్శనమును కోరుచున్న అతడు, ద్వారపాలకులతో ‘‘కుశికవంశీయుడును, గాధికుమారుడును అగు విశ్వామిత్రుడు వచ్చినాడు అని శీఘ్రముగ చెప్పుడు’’ అని పలికెను.

మూ. తచ్ఛ్రుత్వా వచనం త్రాసాద్రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః, 39

సంభ్రాన్తమనసః సర్వే తేన వాక్యేన చోదితాః.

ప్ర. అ. తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, సర్వే = వారందరును, సంభ్రాన్తమనసః = కలతపడినమనస్సుకలవారై, తేన = ఆ, వాక్యేన = వాక్యముచేత, చోదితాః = ప్రేరేపింపబడినవారై, రాజ్ఞః = రాజుయొక్క, వేశ్మ = గృహమునుగూర్చి, ప్రదుద్రువుః = పరుగెత్తిరి.

తా. ఆ మాట వినగనే ద్వారపాలకు లందరును, ఆ వాక్యముచే ప్రేరేపింపబడిన వారై, భయపడిన చిత్తముతో, రాజగృహమునకు పరుగెత్తి వెళ్లిరి.

మూ. తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా,

ప్రాప్తమావేదయామాసుర్నృపాయైక్ష్వాకవే తదా. 40

ప్ర. అ. తదా = అప్పుడు, తే = వారు, రాజభవనమ్ = రాజగృహమును గూర్చి, గత్వా = వెళ్లి, తదా = అప్పుడు, విశ్వామిత్రమ్ ఋషిమ్ = విశ్వామిత్ర మహర్షిని, ప్రాప్తమ్ = వచ్చినవానినిగా, ఐక్ష్వాకవే = ఇక్ష్వాకువంశీయుడైన, నృపాయ = దశరథునకు, ఆవేదయామాసుః = తెలిపిరి.

తా. వారు రాజప్రాసాదము చేరి విశ్వామిత్రమహర్షి వచ్చినా డని దశరథునకు తెలిపిరి.

మూ. తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః, 41

ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మాణమివ వాసవః.

ప్ర. అ. తేషామ్ = ఆ ద్వారపాలకులయొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, హృష్టః = సంతసించిన ఆ దశరథుడు, సపురోధాః = పురోహితులతో కూడినవాడై, సమాహితః = సావధానచిత్తుడై, తమ్ = ఆతనిని, వాసవః = దేవేంద్రుడు, బ్రహ్మాణమివ = బ్రహ్మను వలె, ప్రత్యుజ్జగామ = ఎదుర్కొనెను.

తా. వారి మాటలు విన్న దశరథుడు, సంతసించి, పురోహితసమేతుడై, సావధానచిత్తుడై, దేవేంద్రుడు బ్రహ్మకు వలె, అతనికి ఎదురేగెను.

మూ. తం దృష్ట్వా జ్వలితం దీప్తతపసం సంశితవ్రతమ్,

ప్రహృష్టవదనో రాజా తతోఽర్ఘ్యమపహారయత్. 42

ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రాజు, జ్వలితమ్ = ప్రకాశించుచున్నవాడును, దీప్తతపసమ్ = ప్రకాశించుచున్న తపస్సు కలవాడును, సంశితవ్రతమ్ = తీవ్రములైన నియమములు కలవాడును అగు, తమ్ = ఆతనిని, దృష్ట్వా = చూచి, ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై, అర్ఘ్యమ్ = అర్ఘ్యమును, ఉపహారయత్ = ఇచ్చెను.

తా. గొప్పతపఃశక్తితో ప్రజ్వలించుచున్నవాడును, కఠినవ్రతములను ఆచరించు వాడును అగు ఆ విశ్వామిత్రుని చూచి దశరథుడు ఆనందముచే వికసించిన ముఖము కలవాడై, అర్ఘ్యము సమర్పించెను.

మూ. స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా, 43

కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్.

ప్ర. అ. సః = ఆతడు, శాస్త్రదృష్టేన = శాస్త్రమునందు చూడబడిన, కర్మణా = విధానముచేత, రాజ్ఞః = రాజునుండి, అర్ఘ్యమ్ = అర్ఘ్యమును, ప్రతిగృహ్య = స్వీకరించి, నరాధిపమ్ = రాజును, కుశలం చ = కుశలమును, అవ్యయం చైవ = ఎట్టి లోటు లేకపోవుటను గూర్చి, పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను.

తా. విశ్వామిత్రుడు శాస్త్రోక్తరీతిని దశరథమహారాజు సమర్పించిన అర్ఘ్యము స్వీకరించి, ‘‘ఎట్టి ఆపదలును లేక కుశలముగా నున్నావా?’’ అని అతనిని ప్రశ్నించెను.

మూ. పురే కోశే జనపదే బాన్ధవేషు సుహృత్సు చ, 44

కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్ఛత్సుధార్మికః.

ప్ర. అ. సుధార్మికః = మంచి ధార్మికుడైన, కౌశికః = విశ్వామిత్రుడు, రాజ్ఞః = రాజుయొక్క, పురే = పట్టణమునందును, కోశే = ధనాగారమునందును, జనపదే = గ్రామమునందును, బాన్ధవేషు = బంధువులందును, సుహృత్సు చ = మిత్రులందును, కుశలమ్ = కుశలమును, పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను.

తా. మిక్కిలి ధార్మికు డైన విశ్వామిత్రుడు - ‘‘నీ రాజ్యములోని నగరములందును, గ్రామములందును, అందరును క్షేమముగా ఉన్నారా ? ధనాగారము సమృద్ధముగా ఉన్నదా ? నీ సుహృద్బాంధవు లందరును క్షేమమే కదా!’’ అని దశరథుని ప్రశ్నించెను.

మూ. అపి తే సన్నతాః సర్వే సామన్తా రిపవో జితాః, 45

దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్ఠితమ్.

ప్ర. అ. సామన్తాః = సామంతరాజులు, సర్వే = అందరును, తే = నీకు, అపి సన్నతాః = వంగి ఉన్నారా ? రిపవః = శత్రువులు, జితాః = జయింపబడినారా ? తే = నీయొక్క, దైవతం = దేవతానుగ్రహముకొరకు చేయు, కర్మ = కర్మయు, మానుషం చాపి = మనుష్యప్రయత్నసాధ్య మగు కర్మయు, సాధు = చక్కగా, అనుష్ఠితమ్ = చేయబడినదా ?

తా. నీకు సామంతరాజు లందరును లొంగి ఉన్నారా ? శత్రువుల నందరిని జయించినావా ? దేవతాప్రీతికర మైన యజ్ఞయాగాదులను, మానవప్రయత్న సాధ్యమైన సామదానభేదదండాద్యుపాయములను చక్కగ అనుష్ఠించుచున్నావా?

మూ. వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుఙ్గవః, 46

ఋషీంశ్చ తాన్ యథాన్యాయం మహాభాగానువాచ హ.

ప్ర. అ. మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు, వసిష్ఠం చ = వసిష్ఠుని, తాన్ = ఆ, మహాభాగాన్ = మహానుభావు లైన, ఋషీంశ్చ = ఋషులను, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, సమాగమ్య = సమీపించి, కుశలమ్ = క్షేమమును, ఉవాచ = పలికెను. (ప్రశ్నించెను).

తా. ఆ మునిపుంగవుడు, వసిష్ఠుని, అచట నున్న మహానుభావు లగు ఇతర ఋషులను సమీపించి, న్యాయానుసారముగా వారి కుశల మడిగెను.

మూ. తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనమ్, 47

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః.

ప్ర. అ. తే సర్వే = వారందరును, హృష్టమనసః = సంతోషించినమనస్సుకలవారై, తస్య = ఆ, రాజ్ఞః = రాజుయొక్క, నివేశనమ్ = గృహమును, వివిశుః = ప్రవేశించిరి. తత్ర = అచట, యథార్హతః = యోగ్యతానుసారముగ, పూజితాః = పూజింపబడిన వారై, నిషేదుశ్చ = కూర్చుండిరి.

తా. ఆ ఋషులందరును సంతసించి దశరథుని గృహమును ప్రవేశించిరి. అచట యోగ్యతానుసారముగా పూజింపబడిన వారై కూర్చుండిరి.

మూ. అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్, 48

ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్.

ప్ర. అ. అథ = అటు పిమ్మట, పరమోదారః = మిక్కిలి ఔదార్యవంతుడైన, రాజా = రాజు, హృష్టమనాః = సంతోషించిన మనస్సు కలవాడై, తమ్ = ఆ, మహామునిమ్ = మహాముని యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అభిపూజయన్ = పూజించుచున్న వాడై, హృష్టః = సంతసించిన వాడై, ఉవాచ = పలికెను.

తా. గొప్పదాత యైన దశరథుడు విశ్వామిత్రుని రాకచే సంతోషించిన మనస్సు కలవాడై, ఆ విశ్వామిత్రమహామునిని పూజించి, సంతోషముతో ఇట్లనెను.

మూ. యథాఽమృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనూదకే

యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య చ, 49

ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే,

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే. 50

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ! అమృతస్య = అమృతముయొక్క, సంప్రాప్తిః = ప్రాప్తి, యథా = ఎట్లో, అనూదకే = నీళ్లులేని ప్రదేశమునందు, వర్షమ్ = వర్షము, యథా = ఎట్లో, అప్రజస్య = సంతానములేనివానికి, సదృశదారేషు = తగిన భార్యయందు, పుత్రజన్మ = పుత్రోత్పత్తి, యథా = ఎట్లో, ప్రణష్టస్య = పొగొట్టుగొనిన వస్తువుయొక్క, లాభః = లాభము, యథా ఎట్లో, మహోదయే = గొప్ప అభివృద్ధి కలిగినపుడు, హర్షః = సంతోషము, యథా = ఎట్లో, తే = నీయొక్క, ఆగమనమ్ = రాక, తథా ఏవ = అట్లే అని, మన్యే = తలచుచున్నాను. స్వాగతమ్ = నీకు స్వాగత మగుగాక.

తా. ఓ మహామునీ! నీ రాక అమృతప్రాప్తి వంటిది. నీళ్లు లేనిచోట వానలు కురియుట వంటిది. సంతానము లేనివానికి అనుకూలయగు భార్యయందు పుత్రుడు జనించుటవంటిది. పోగొట్టుకొనిన వస్తువు మరల దొరుకుట వంటిది. గొప్ప అభివృద్ధి లభించినపుడు కలుగు హర్షము వంటిది. నీకు స్వాగతము అగు గాక.

మూ. కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః, 51

పాత్రభూతోఽసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోఽసి కౌశిక,

అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్. 52

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! హర్షితః = సంతోషించిన నేను, తే = నీకు, పరమమ్ = ఉత్తమ మైన, కం కామమ్ = ఏ కోరికను, కిము = ఏ విధముగా, కరోమి = చేయుదును ? మే = నాకు, పాత్రభూతః = సత్పాత్రగా, అసి = అయి ఉన్నావు. కౌశిక = ఓ విశ్వామిత్రుడా, దిష్ట్యా = దైవవశముచేత, ప్రాప్తః అసి = వచ్చినావు. అద్య = ఈనాడు, మే = నాయొక్క, జన్మ = జన్మ, సఫలమ్ = సఫలమైనది. జీవితం చ = జీవితము కూడ, సుజీవితమ్ = మంచి జీవితము.

తా. ఓ విశ్వామిత్రుడా! సంతోషించిన నేను నీకు ఏ కోరికను, ఎట్లు తీర్చవలెనో చెప్పుము. నీవు సత్పాత్రమవు, నా అదృష్టముచే వచ్చినావు, ఈనాడు నా జన్మ సఫల మైనది. జీవితము సుజీవిత మైనది.

మూ. పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః,

బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోసి బహుధా మయా. 53

ప్ర. అ. పూర్వమ్ = పూర్వము, రాజర్షిశబ్దేన = రాజర్షి అనే శబ్దముచే, ద్యోతిత ప్రభః = సూచింపబడిన శక్తి గల నీవు, అను = అనంతరమునందు, తపసా = తపస్సుచేత, బ్రహ్మర్షిత్వమ్ = బ్రహ్మర్షిత్వమును, ప్రాప్తః = పొందినావు. మయా = నాచేత, బహుధా = అనేకవిధములుగా, పూజ్యః = పూజింపదగినవాడవు, అసి = అయి ఉన్నావు.

తా. మొదట నీకు రాజర్షి అను బిరుదము ఉండెడిది. అది నీ శక్తిని సూచించునది. పిదప తపస్సుచేత బ్రహ్మర్షిత్వమును పొందినావు. నీవు నాకు సర్వథా పూజ్యుడవు.

మూ. తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ,

శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ప్రభో. 54

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! తత్ = ఆ కారణము వలన, ఇదమ్ = ఈ నీ ఆగమనము, అద్భుతమ్ = చాల ఆశ్చర్యజనక మైనది. మమ = నాకు, పరమమ్ = గొప్ప, పవిత్రమ్ = పవిత్ర మైనది. ప్రభో = ఓ ప్రభూ! తవ = నీ యొక్క, సందర్శనాత్ = దర్శనము వలన, అహమ్ = నేను, శుభక్షేత్రగతశ్చ = పుణ్యక్షేత్రములో నున్నవాడను.

తా. నీవు వచ్చుట చాల ఆశ్చర్యజనకము. నాకు చాల పవిత్రత్వమును చేకూర్చుచున్నది. నీ దర్శనమువలన నేను పుణ్యక్షేత్రములో నివసించినట్లున్నది.

మూ. బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి,

ఇచ్ఛామ్యనుగృహీతోఽహం త్వదర్థపరివృద్ధియే. 55

ప్ర. అ. ఆగమనం ప్రతి = ఇచటికి వచ్చుటను గూర్చి, తుభ్యమ్ = నీకు, ప్రార్థితమ్ = కోరబడిన, యత్ = ఏ, కార్యమ్ = కార్యమున్నదో, దానిని, బ్రూహి = చెప్పుము. అహమ్ = నేను, అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడనై, త్వదర్థ పరివృద్ధయే = నీ కార్యము యొక్క వృద్ధికొరకు, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. నీవు ఏ కార్యమును కోరి ఇచటకు వచ్చితివో చెప్పుము. ఆజ్ఞారూపమగు అనుగ్రహము చేయుము. నీ కార్యమును సాధించుటకు సిద్ధముగా నున్నాను.

మూ. కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక,

కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ. 56

ప్ర. అ. కౌశిక = విశ్వామిత్రుడా! కార్యస్య = కార్యము విషయమున, విమర్శమ్ = ఆలోచనను, గన్తుమ్ = పొందుటకు, న అర్హసి = తగవు. అహమ్ = నేను, విశేషేణ = పూర్తిగా, కర్తా చ = ఆ కార్యము చేయగలవాడను. భవాన్ = నీవు, మమ = నాకు, దైవతం హి = దేవతవు కదా.

తా. విశ్వామిత్రా! నీవు వచ్చిన కార్యము చాల గొప్పది కావచ్చును. అయినను సందేహింపకుము. నేను దానిని పూర్చిగా నెరవేర్చెదను. నీవు నాకు దైవతము వంటి వాడవు.

మూ. మమ చాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ,

తవాగమనజః కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ. 57

ప్ర. అ. ద్విజ = ఓ బ్రాహ్మణోత్తమా!, మమ = నాకు, అయమ్ = ఈ, మహాన్ = గొప్ప, అభ్యుదయః = అభివృద్ధి, అనుప్రాప్తః = లభించినది. మమ = నాకు, తవ ఆగమనజః = నీ రాకవల్ల కలిగిన, కృత్స్నః = సమస్తమైన, ధర్మః = ధర్మము, అనుత్తమః = చాల గొప్పది.

తా. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఈనాడు నాకు గొప్ప అభ్యుదయము లభించినది. నీ రాకవలన నాకు కలిగిన ఈ ధర్మము చాల గొప్పది.

మూ. ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం

శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్,

ప్రథితగుణయశా గుణైర్విశిష్టః

పరమఋషిః పరమం జగామ హర్షమ్. 58

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టాదశః సర్గః

ప్ర. అ. ఆత్మవతా = బుద్ధిమంతుడగుదశరథునిచేత, ఇతి = ఈ విధముగా, వినీతమ్ = వినయపూర్వకముగా, ఉక్తమ్ = పలకబడిన, హృదయసుఖమ్ = హృదయమునకు సుఖకర మైన, శ్రుతిసుఖమ్ = చెవులకు సుఖకర మైన, వాక్యమ్ = వాక్యమును, నిశమ్య = విని, ప్రథితగుణయశాః = ప్రసిద్ధ మైన గుణములును కీర్తియు కలవాడును, గుణైః = సద్గుణములచే, విశిష్టః = శ్రేష్ఠుడును అయిన, పరమఋషిః = గొప్పవాడైన ఋషి, పరమమ్ = గొప్ప, హర్షమ్ = సంతోషమును, జగామ = పొందెను.

తా. బుద్ధిమంతు డగు దశరథుడు వినయపూర్వకముగా పలికిన, శోత్రములకును, హృదయమునకును సుఖమును కలిగించు వాక్యములను విని, ప్రసిద్ధములైన గుణములు కీర్తి కలవాడును, సద్గుణములచే శ్రేష్ఠుడును అగి విశ్వామిత్రుడు చాల ఆనందించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో పదునెనిమిదవసర్గ సమాప్తము.

© 2026 Ebook Library