Chapter_19

Back
Book Balakandamu
Chapter No 25
Pages 5
Read Time 9 Minutes

Chapter_19

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకోనవింశః సర్గః

‘‘నేను చేయ తలపెట్టిన యాగమును రక్షించుటకై రాముని పంపుము’’ అని విశ్వామిత్రుడు కోరగా దశరథుడు మిగుల దుఃఖించుట.

మూ. తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్,

హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత 1

ప్ర. అ. రాజసింహస్య = రాజశ్రేష్ఠునియొక్క, తత్ = ఆ, అద్భుతవిస్తరమ్ = ఆశ్చర్యకరమును విస్తృతమును అగు, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, హృష్టరోమాః = గగుర్పొడిచిన రోమములు కలవాడై, అభ్యభాషత = పలికెను.

తా. ఆ రాజశ్రేష్ఠుని ఆశ్చర్యకరములును, విస్తృతములును అగుమాటలు విని, మహాతేజఃశాలియగు విశ్వామిత్రుడు ఆనందముచే గగుర్పాటు కలిగిన శరీరముకలవాడై, ఇట్లు పలికెను.

మూ. సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా,

మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః. 2

ప్ర. అ. రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! భువి = భూమియందు, మహావంశప్రసూతస్య = గొప్పవంశమునందు పుట్టినవాడును, వసిష్ఠవ్యపదేశినః = వసిష్ఠుని ఉపదేశములను పొందినవాడును అగు, తవ = నీకు, ఏతత్ = ఇదియే, సదృశమ్ = తగియున్నది. అన్యథా = మరి యొక విధముగా నైనచో, న = కాదు.

తా. ఓ రాజశ్రేష్ఠుడా! మహావంశమునందు పుట్టి వసిష్ఠుని ఉపదేశములను పొందుచున్న నీవు ఈ విధముగ మాటలాడుటయే యుక్తము. మరొక విధముగ మాటలాడుట అసంభావ్యము.

మూ. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్,

కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవాః. 3

ప్ర. అ. రాజశార్దూల = రాజశ్రేష్ఠుడా, మే = నాయొక్క, హృద్గతమ్ = మనస్సులో ఉన్న, యత్ = ఏ కార్యము, వాక్యమ్ = చెప్పదగియున్నదో, తస్య = ఆ, కార్యస్య = కార్యము యొక్క, నిశ్చయమ్ = నిశ్చయమును, కురుష్వ = చేయుము. సత్యప్రతిశ్రవాః = సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవు, భవ = అగుము.

తా. ఓ రాజశ్రేష్ఠా! నా మనస్సులో నున్న కార్యమును చెప్పెదను. దానిని తప్పక చేయుము. ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము.

మూ. అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ,

తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ. 4

ప్ర. అ. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! అహమ్ = నేను, సిద్ధ్యర్థమ్ = సిద్ధికొరకు, నియమమ్ = నియమమును, ఆతిష్ఠే = అవలంబించి ఉన్నాను. తు = కాని, కామరూపిణౌ = స్వేచ్ఛా రూపము గల, ద్వౌ = ఇద్దరు, రాక్షసౌ = రాక్షసులు, తస్య = దానికి, విఘ్నకరౌ = విఘ్నము చేయువారుగా ఉన్నారు.

తా. ఓ పురుషశ్రేష్ఠుడా! నేను ఒక సిద్ధికొరకై ఒక నియమమును అవలంబించి ఉన్నాను. కాని కామరూపవంతు లగు ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నము చేయుచున్నారు.

మూ. వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ,

మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ, 5

సమాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్.

ప్ర. అ. బహుశః = చాలవరకు, చీర్ణే = చేయబడిన, మే = నాయొక్క, వ్రతే = వ్రతమునందు, సమాప్త్యామ్ = సమాప్తిసమయమునందు, వీర్యవన్తౌ = పరాక్రమ వంతులును, సుశిక్షితౌ = బాగుగా అభ్యాసము చేసినవారును అగు, మారీచశ్చ = మారీచుడును, సుబాహుశ్చ = సుబాహువు, సమాంసరుధిరౌఘేణ = మాంసముతో కూడిన రక్త ప్రవాహముతో, తామ్ = ఆ, వేదిమ్ = వేదిని, అభ్యవర్షతామ్ = వర్షించిరి.

తా. నా వ్రతము సమాప్తి చెందు సమయమునకు, వీర్యవంతులును, సుశిక్షితు లును అగు మారీచసుబాహువులు వచ్చి, మాంసముతో కూడిన రక్తప్రవాహముతో యజ్ఞవేదికను వర్షించుచుండిరి.

మూ. అవధూతే తథా భూతే తస్మిన్నియమనిశ్చయే, 6

కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే.

ప్ర. అ. తస్నిన్ = ఆ, నియమనిశ్చయే = దీక్షాసంకల్పము, అవధూతే = పాడుచేయబడినదై, తథా భూతే = ఆ విధముగా అయిపోగా, కృతశ్రమః = అంతశ్రమ చేసిన నేను, నిరుత్సాహః = భగ్నోత్సాహుడనై, తస్మాత్ = ఆ, దేశాత్ = దేశమునుండి, అపాక్రమే = తొలగివచ్చినాను.

తా. ఆ వ్రతసంకల్పమ విఘ్నితమై అట్లయిపోయినది. దానికై ఇంత శ్రమపడిన నేను భగ్నోత్సాహుడనై ఆ దేశమును వదలి వచ్చితిని.

మూ. న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ, 7

తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే.

ప్ర. అ. పార్థివ = ఓ రాజా!, క్రోధమ్ = కోపమును, ఉత్స్రష్టుమ్ = విడచుటకు (చూపుటకు), మే = నాకు, బుద్ధిః = బుద్ధి, న భవతి = కలుగుటలేదు. సా = ఆ, చర్యా = వ్రతచర్య, తథాభూతా హి = అట్టిదికదా. తత్ర = ఆ యాగ సమయమునందు, శాపః = శాపము, న ముచ్యతే = విడువబడదు.

తా. ఓ రాజా! ఆ సమయమున కోపము చూపుటకు బుద్ధి కలుగుటలేదు. ఆ యజ్ఞము అట్టిది. అట్టి యజ్ఞములలో శాపము ఇవ్వకూడదు.

మూ. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమమ్, 8

కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి.

ప్ర. అ. రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! సత్యపరాక్రమమ్ = సత్యమైన పరాక్రమము కలవాడును, కాకపక్షధరమ్ = జులపములను ధరించుచున్న వాడును, శూరమ్ = శూరుడును, స్వపుత్రమ్ = నీ కుమారుడైన, జ్యేష్ఠమ్ = పెద్దవాడైన, రామమ్ = రాముని, మే = నాకు, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగి యున్నావు.

తా. ఓ రాజశ్రేష్ఠుడా! శూరుడును, సత్య మైన పరాక్రమము కలవాడును, జులపములు ధరించు కౌమారవ యస్సులో నున్నవాడు అగు, నీ జ్యేష్ఠకుమారు డైన రాముని నా కిమ్ము.

మూ. శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా, 9

రాక్షసా యే వికర్తారస్తేషామపి వినాశనే.

ప్ర. అ. మయా = నాచేత, గుప్తః = రక్షింపబడిన, ఏషః = ఈతడు, దివ్యేన = దివ్యమైన, స్వేన = తనసంబంధ మైన, తేజసా = తేజస్సుచేత, యే = ఏ, వికర్తారః = విఘ్నముచేయు, రాక్షసాః = రాక్షసులు కలరో, తేషామపి = వారియొక్క కూడ, వినాశనే = నశింపచేయుట యందు, శక్తః హి = సమర్థుడు కదా.

తా. నాచే రక్షింపబడిన ఈ రాముడు, తన సహజదివ్యతేజస్సుచేత, విఘ్నకారు లగు రాక్షసులను సంహరింప సమర్థుడు.

మూ. శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః, 10

త్రయాణామపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి.

ప్ర. అ. అస్మై = ఈతనికి, బహురూపమ్ = అనేకవిధములైన, శ్రేయశ్చ = శ్రేయస్సును కూడ, ప్రదాస్యామి = ఇచ్చెదను. సంశయః = సంశయము, న = లేదు, యేన = దేనిచేత, త్రయాణామ్ = మూడు, లోకానామపి = లోకములలో, ఖ్యాతిమ్ = ప్రసిద్ధిని, గమిష్యతి = పొందగలడో.

తా. రామునకు అనేకవిధము లైన శ్రేయస్సును ఇవ్వగలను. దానిచే ఇతడు మూడు లోకములలో కీర్తిని పొందగలడు. సందేహము లేదు.

మూ. న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన. 11

న చ తౌ రాఘవాదన్యో హన్తుముత్సహతే పుమాన్.

ప్ర. అ. తౌ = ఆ మారీచసుబాహులు, రామమ్ = రాముని, ఆసాద్య = పొంది, కథంచన = ఏ విధముగను, స్థాతుమ్ = నిలుచుటకు, న శక్తౌ = సమర్థులు కారు. రాఘవాత్ = రామునికంటె, అన్యః = ఇతరు డైన, పుమాన్ = పురుషుడు, తౌ = వారిని, హన్తుమ్ = చంపుటకు, న ఉత్సహతే = సమర్థుడు కాడు.

తా. ఆ మారీచసుబాహులు రాముని ఎదుట ఏ విధముగను నిలువజాలరు. రాముడు తప్ప మరెవ్వరును వారిని చంపజాలరు.

మూ. వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ, 12

రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః.

ప్ర. అ. వీర్యోత్సిక్తౌ = వీర్యముచేత గర్వించిన, తౌ = ఆ, పాపౌ = పాపాత్ములు, కాలపాశవశం = యమపాశముయొక్క వశమును, గతౌ = పొందినారు. రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా!, మహాత్మనః = మహాత్ము డైన, రామస్య = రామునకు న పర్యాప్తౌ = సరిపడువారు కారు.

తా. ఓ రాజశ్రేష్ఠుడా! పరాక్రమముచే గర్వించిన ఆ మారీచసుబాహులు యముని పాశములకు వశులు కావలసి యున్నది. వారు మహాత్ములైన రామునకు యుద్ధమునందు చాలరు.

మూ. న చ పుత్రకృతస్నేహం కర్తుమర్హసి పార్థివ,

అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. 13

ప్ర. అ. పార్థివ = ఓ రాజా! పుత్రకృతమ్ = పుత్రునియందు చేయబడు, స్నేహమ్ = స్నేహమును, కర్తుమ్ = చేయుటకు, న అర్హసి = తగవు. తౌ = ఆ, రాక్షసౌ = రాక్షసులను, హతౌ = చంపబడినవారిగా, విద్ధి = తెలుసుకొనుము. అహమ్ = నేను, తే = నీకు, ప్రతిజానామి = ప్రతిజ్ఞ చేయుచున్నాను.

తా. ఓ రాజా! రామునియందున్న పుత్రస్నేహముచే వెనుదీయకుము. ఆ రాక్షసులు రామునిచే సంహరింపబడినా రనియే నిశ్చయించుకొనుము. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.

మూ. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్,

వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసి స్థితాః. 14

ప్ర. అ. మహాత్మానమ్ = మహాత్ముడును, సత్యపరాక్రమమ్ = సత్య మైన పరాక్రమము కలవాడును అగు, రామమ్ = రాముని గూర్చి, అహమ్ = నేను, వేద్మి = ఎరుగుదును. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, వసిష్ఠోఽపి = వసిష్ఠుడును, యే = ఏ, తపసి స్థితాః = తపస్సులో నున్న, ఇమే = ఈ మహర్షులు గలరో, వీరును (ఎరుగుదురు).

తా. మహాత్ముడును, సత్యపరాక్రముడును అగు రాము డెట్టివాడో నాకు తెలియును, వసిష్ఠునకు తెలియును. ఈ మహర్షులకు తెలియును. రాముడు నీ కుమారు డగుటచే నీ వాతనిని సామాన్యునిగ తలపవచ్చును. అతని యథార్థస్వరూపము మావంటి తపోధనులకు మాత్రమే తెలియును.

మూ. యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి,

స్థితమిచ్ఛసి రాజేన్ద్ర రామం మే దాతుమర్హసి. 15

ప్ర. అ. రాజేన్ద్ర = ఓ రాజశ్రేష్ఠుడా!, తే = నీకు, ధర్మలాభమ్ = ధర్మము యొక్క లాభమును, ఇచ్ఛసి యది = కోరినట్లైతే, పరమమ్ = గొప్ప దైన, యశశ్చ = కీర్తిని కూడ, భువి = భూమియందు, స్థితమ్ = ఉండుదానినిగా, (ఇచ్ఛసి యది = కోరినట్లైతే), రామమ్ = రాముని, మే = నాకు, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ రాజేంద్రా! నీవు ధర్మము కావలె నని కోరినట్లైతే, నీ గొప్ప కీర్తి భూలోకమున స్థిరముగా నుండ వలె నని నీకు అభిలాష ఉన్నట్లైతే, రాముని నా కిమ్ము.

మూ. యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మన్త్రిణః,

వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. 16

ప్ర. అ. కాకుత్థ్స = ఓ కకుత్థ్సవంశీయుడా! తవ = నీ యొక్క, మన్త్రిణః = మంత్రులును, వసిష్ఠ ప్రముఖాః = వసిష్ఠుడు మొదలుగా గల, సర్వే = అందరును, అనుజ్ఞామ్ = అనుజ్ఞను, దదతే యది = ఇచ్చినట్లైతే, తతః = అటు పిమ్మట, రామమ్ = రాముని, విసర్జయ = ఇమ్ము.

తా. దశరథమహారాజా! నీ మంత్రులును వసిష్ఠాదులును అనుజ్ఞ ఇచ్చిననే రాముని పంపుము.

మూ. అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి,

దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్. 17

ప్ర. అ. అభిప్రేతమ్ = ఇష్టుడైన, ఆత్మజమ్ = కుమారుడును, రాజీవలోచనమ్ = పద్మములవంటి నేత్రములు కలవాడును అగు, రామమ్ = రాముని, అసంసక్తమ్ = ఆలస్యము లేకుండగా, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, దశరాత్రమ్ = పదిదినములు, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగి ఉన్నావు.

తా. పద్మపత్రవిశాలాక్షు డైన, నీ ప్రియపుత్రు డైన రాముని పది దినములు జరుగు యాగమును రక్షించుటకై, ఆలస్యము చేయక నా కిమ్ము.

మూ. నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ,

తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః. 18

ప్ర. అ. రాఘవ = ఓ దశరథమహారాజా! మమ = నాయొక్క, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, అయం కాలః = ఈ సమయము, యథా = ఎట్లు, నాత్యేతి = దాటిపోకుండ ఉండునో, తథా = ఆ విధముగా, కురుష్వ = చేయుము. శోకే = దుఃఖమునందు, మనః = మనస్సును, మా కృథాః = చేయకుము.

తా. దశరథమహారాజా! నా యజ్ఞసమయము దాటిపోకుండునట్లు చూడుము. నీకు క్షేమ మగును. దుఃఖింపకుము.

మూ. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః,

విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 19

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ముడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహామునిః = మహామునియు అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఇత్యేవమ్ = ఈ విధముగా, ధర్మార్థసహితమ్ = ధర్మార్థములతో కూడిన, వచః = వాక్కును, ఉక్త్వా = పలికి, విరరామ = విరమించెను.

తా. ధర్మాత్ముడును, మహాతేజఃశాలియు అగు విశ్వామిత్ర మహాముని, ఈ విధముగ ధర్మార్థసహిత మగు వాక్యము పలికి ఊరకుండెను.

మూ. స తన్నిశమ్య రాజేన్ద్రో విశ్వామిత్రవచః శుభమ్,

శోకమభ్యగమత్తీవ్రం వ్యషీదత భయాన్వితః. 20

ప్ర. అ. సః = ఆ, రాజేన్ద్రః = రాజశ్రేష్ఠుడు, శుభమ్ = శుభకర మైన, తత్ = ఆ, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, నిశమ్య = విని, తీవ్రమ్ = తీవ్రమైన, శోకమ్ = శోకమును, అభ్యగమత్ = పొందెను. భయాన్వితః = భయముతో కూడినవాడై, వ్యషీదత = క్రుంగిపోయెను.

తా. దశరథుడు విశ్వామిత్రుడు పలికిన ఆ శుభకర మగు వాక్కును విని, తీవ్ర మైన శోకమును పొంది భయముతో క్రుంగిపోయెను.

మూ. ఇతి హృదయమనోవిదారణం

మునివచనం తదతీవ శుశ్రువాన్,

నరపతిరభవన్మహాంస్తదా

వ్యథితమనాః ప్రచచాల చాసనాత్. 21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సంక్షేపో నామ ఏకోనవింశః సర్గః

ప్ర. అ. ఇతి = ఈ విధముగా, హృదయమనోవిదారణమ్ = హృదయమును మనస్సును చీల్చివేయు, తత్ = ఆ, మునివచనమ్ = మునివాక్యమును, శుశ్రువాన్ = వినిన, మహాన్ = పూజ్యుడైన, నరపతిః = రాజు, తదా = అప్పుడు, వ్యథితమనాః = వ్యథ చెందిన మనస్సు కలవాడు, అభవత్ = అయెను. ఆసనాత్ = ఆసనమునుండి, చచాల చ = చలించిపోయెను కూడ.

తా. విశ్వామిత్రుడు పలికిన ఆ మాటలు దశరథుని హృదయమును మనస్సును చీల్చివేసినవి. ఆ మాటలు విన్న ఆ రాజు మనస్సులో వ్యథ చెందెను. ఆసనమునుండి చలించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు, బాలకాండలో పందొమ్మిదవసర్గ సమాప్తము.

© 2026 Ebook Library