Chapter_20

Back
Book Balakandamu
Chapter No 26
Pages 7
Read Time 11 Minutes

Chapter_20

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ వింశః సర్గః

దశరథుడు తన కోరికను మన్నింపక పోవుటచే విశ్వామిత్రుడు కోపించుట.

తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్,

ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్. 1

ప్ర. అ. రాజశార్దూలః = ఆ రాజశ్రేష్ఠుడు, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, తత్ భాషితమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, ముహూర్తమివ = క్షణకాలముపాటు, నిస్సంజ్ఞః = సంజ్ఞ కోల్పోయిన వాడై, సంజ్ఞావాన్ = మరల సంజ్ఞ పొంది, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. విశ్వామిత్రుని మాటలు వినగానే దశరథుడు క్షణకాలముపాటు నిశ్చేష్టు డయ్యెను. మరల సంజ్ఞ పొంది ఇట్లు పలికెను.

మూ. ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః,

న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః. 2

ప్ర. అ. రాజీవలోచనః = పద్మముల వంటి నేత్రములు గల, మే = నాయొక్క, రామః = రాముడు, ఊనషోడశవర్షః = పదహారు సంవత్సరములకంటె తక్కువ వయస్సుకలవాడు. అస్య = ఈతనికి, రాక్షసైః సహ = రాక్షసులతో కూడ, యుద్ధయోగ్యతామ్ = యుద్ధము చేయు యోగ్యతను, న పశ్యామి = చూడను.

తా. రాజీవలోచను డైన నా రామునకు పదహారు సంవత్సరములు కూడ నిండలేదు. ఈతనికి రాక్షసులతో యుద్ధము చేయు యోగ్యత ఉన్న దని నేను భావింపను.

వి. అరణ్యకాండములో మారీచుడు రాముని గూర్చి రావణునితో — ‘‘విశ్వామిత్రయాగ రక్షణకాలమునాటికి రామునకు పండ్రెండు ఏండ్ల వయస్సు’’ అని చెప్పుచున్నాడు--‘‘బాలో ద్వాదశవర్షోఽయమకృతాస్త్రశ్చ రాఘవః’’. దానిని బట్టి ఇచట ‘‘ఊనషోడశవర్షః’’ అనగా ‘‘పండ్రెండేండ్ల వయస్సువాడు’’ అని యర్థము. (గోవిందరాజులు).

మూ. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః,

అనయా సంవృతో గత్వా యోద్ధాహం తైర్నిశాచరైః. 3

ప్ర. అ. పూర్ణా = నిండిన, ఇయమ్ = ఈ, అక్షౌహిణీ = అక్షౌహిణి ఉన్నది. యస్యాః = దేనికి, అహమ్ = నేను, పతిః = అధిపతినో, ఈశ్వరః = నియమించువాడనో, అనయా = ఈ అక్షౌహిణితో, సంవృతః = కూడిన వాడనై, గత్వా = వెళ్లి, అహమ్ = నేను, తైః = ఆ, నిశాచరైః = రాక్షసులతో, యోద్ధా = యుద్ధము చేయగలను.

తా. ఇదిగో! ఈ అక్షౌహిణి పూర్ణముగ నున్నది. దీనికి నేను అధిపతిని; నియామకుడను. దీనితో వెళ్లి నేను రాక్షసులతో యుద్ధము చేయగలను.

మూ. ఇమే శూరాశ్చ విక్రాన్తా భృత్యా మేఽస్త్రవిశారదాః,

యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి. 4

ప్ర. అ. మే = నాయొక్క, భృత్యాః = భృత్యులైన, ఇమే = ఈ సైనికులు, శూరాశ్చ = శూరులు, విక్రాన్తాః = పరాక్రమము కలవారు; అస్త్రవిశారదాః = అస్త్రములందు నేర్పు గలవారు; రక్షోగణైః = రాక్షసగణములతో, యోద్ధుమ్ = యుద్ధము చేయుటకు, యోగ్యాః = తగినవారు, రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొనివెళ్లుటకు, నార్హసి = తగవు.

తా. నా పోషణలో నున్న ఈ సైనికులు శూరులు; విక్రమవంతులు; అస్త్రముల యందు సమర్థులు. వీరు రాక్షసులతో యుద్ధము చేయుటకు యోగ్యులు. నీవు రాముని తీసికొని వెళ్లవలదు.

మూ. అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని,

యావత్ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః. 5

ప్ర. అ. అహమేవ = నేనే, ధనుష్పాణిః = ధనుస్సు హస్తమునందు కలవాడనై, గోప్తా = రక్షించుగలవాడను. యావత్ = ఎంతవరకు, ప్రాణాన్ = ప్రాణములను, ధరిష్యామి = ధరింతునో, తావత్ = అంతవరకు, సమరమూర్ధని = యుద్ధముయొక్క అగ్రభూమియందు, నిశాచరైః = రాక్షసులతో, యోత్స్యే = యుద్ధము చేయగలను.

తా. ధనుర్ధారినై నేనే యాగమును రక్షించెదను. నా ప్రాణము లున్నంతవరకును యుద్ధాగ్రమునందు రాక్షసులతో యుద్ధము చేసెదను.

మూ. నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా,

అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి. 6

ప్ర. అ. అహమ్ = నేను, తత్ర = అచటికి, ఆగమిష్యామి = వచ్చెదను. సా = ఆ, వ్రతచర్యా = వ్రతానుష్ఠానము, సురక్షితా = బాగుగా రక్షింపబడినదై, నిర్విఘ్నా = విఘ్నములు లేనిది, భవిష్యతి = కాగలదు. రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొని వెళ్లుటకు, నార్హసి = తగవు.

తా. నేనే అచటికి వచ్చి, యాగమును రక్షించి అది నిర్విఘ్నముగ కొనసాగునట్లు చేసెదను. రాముని తీసికొనివెళ్లవలదు.

మూ. బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్,

న చాస్త్రబలసంయుక్తో న చ యుద్ధవిశారదః. 7

న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధా హి తే ధ్రువమ్.

ప్ర. అ. హి = ఏలననగా, (రాముడు), బాలః = బాలుడు; అకృతవిద్యశ్చ = బాగుగా నేర్వబడని విద్యలు కలవాడు; బలాబలమ్ = బలాబలములను, న వేత్తి = ఎరుగడు; అస్త్రబలసంయుక్తః చ = అస్త్రబలముతో కూడినవాడు కూడ, న = కాడు; యుద్ధవిశారదః చ = యుద్ధమునందు నేర్పు కలవాడు కూడ, న = కాడు. అసౌ = ఇతడు, రక్షసామ్ = రాక్షసులకు, యోగ్యః = తగినవాడు, = కాడు; తే = వారు, ధ్రువమ్ = నిశ్చయముగా, కూటయుద్ధాః హి = కపటయుద్ధము కలవారు కదా!

తా. నా రాముడు చిన్నవాడు; పూర్తిగ విద్యలను నేర్వలేదు; శత్రువుల బలాబలము లను గుర్తింపజాలడు; ఇంకను అస్త్రబలమును సంపాదింపలేదు. యుద్ధమునందు నేర్పు లేని వాడు. రాక్షసులు తప్పక కపటయుద్ధము చేయుదురు. అందుచే వారితో యుద్ధముచేయుటకు రాముడు తగినవాడు కాడు.

మూ. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే, 8

జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి.

ప్ర. అ. రామేణ = రామునితో, విప్రయుక్తః = వియోగము పొందినవాడనై, ముహూర్తమపి = క్షణకాల మైనను, జీవితుమ్ = జీవించుటకు, నోత్సహే = సమర్థుడను కాను. మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా! రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొని వెళ్లుటకు, నార్హసి = తగవు.

తా. ఓ మునిశ్రేష్ఠా! రాముడు లేనిచో క్షణకాల మైనను జీవింపజాలను. రాముని తీసికొనివెళ్లవలదు.

మూ. యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్ఛసి సువ్రత, 9

చతురఙ్గసమాయుక్తం మయా చ సహితం నయ.

ప్ర. అ. సువ్రత = మంచి వ్రతము కలవాడా! బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా! వా = లేక, రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొనివెళ్లుటకు, ఇచ్ఛసి యది = ఇచ్ఛయించుచున్నట్లైతే, చతురఙ్గసమాయుక్తమ్ = చతురంగబలముతో కూడిన వానిని, మయా చ = నాతో కూడ, సహితమ్ = కూడినవానిని, నయ = తీసికొని వెళ్లుము.

తా. ఉత్తమవ్రతవంతు డైన ఓ విశ్వామిత్రా! రామునే తీసికొని వెళ్లవలెనని నీకు ఇచ్ఛ ఉన్నచో, అతనితో పాటు చతురంగబలమును, నన్ను కూడ తీసికొనివెళ్లుము.

మూ. షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక,

దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి. 10

ప్ర. అ. కౌశిక = ఓ విశ్వామిత్రుడా! జాతస్య = పుట్టిన, మమ = నాకు, షష్టిః = అరువది, వర్షసహస్రాణి = సంవత్సరముల సహస్రములు, గడచినవి. అయమ్ = ఈతడు, దుఃఖేన = అతిశ్రమచేత, ఉత్పాదితః = కనబడినాడు. రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొని వెళ్లుటకు, న అర్హసి = తగవు.

తా. విశ్వామిత్రా! అరవైవేల సంవత్సరముల వయస్సునందు, ఎంతో శ్రమపడి ఈతనిని కన్నాను. రాముని తీసికొని వెళ్లవలదు.

మూ. చతుర్ణామాత్మజానాం హి ప్రీతిః పరమికా మమ, 11

జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి.

ప్ర. అ. చతుర్ణామ్ = నలుగురు, ఆత్మజానామ్ = కుమారులవిషయమున, మమ = నాకు, పరమికా = గొప్ప, ప్రీతిః హి = ప్రేమ ఉన్నది కదా. జ్యేష్ఠమ్ = పెద్దవాడును, ధర్మప్రధానం చ = ధర్మవిషయమున ప్రధానుడును అగు, రామమ్ = రాముని, నేతుమ్ = తీసికొని వెళ్లుటకు, నార్హసి = తగవు.

తా. నలుగురు కుమారుల విషయమునందును నాకు గొప్ప ప్రేమ ఉన్నది. కాని జ్యేష్ఠుడును, అందుచే ధర్మవిషయమున ప్రధానుడును అగు రాముని తీసికొని వెళ్లవలదు.

మూ. కింవీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కే చ తే, 12

కథంప్రమాణాః కే చైతాన్ రక్షన్తి మునిపుఙ్గవ.

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! తే రాక్షసాః = ఆ రాక్షసులు, కింవీర్యాః = ఎట్టి వీర్యము కలవారు ? కస్య = ఎవనియొక్క, పుత్రాః = పుత్రులు? తే = వారు, కే = ఎవరు? కథంప్రమాణాః = ఎంతటిప్రమాణము కలవారు? ఏతాన్ = వీరిని, కే = ఎవరు, రక్షన్తి = రక్షించుచున్నారు?

తా. ఓ మునిశ్రేష్ఠుడా! ఆ రాక్షసుల పరాక్రమ మెట్టిది ? వారు ఎవరు ? ఎవరి కుమారులు? వారి ప్రమాణము ఎంత ? వారిని ఎవరు రక్షించుచున్నారు ?

మూ. కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్, 13

మామకైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినామ్.

ప్ర. అ. బ్రహ్మన్ = బ్రాహ్మణుడా! కూటయోధినామ్ = కపటయుద్ధము చేయు, తేషాం రక్షసామ్ = ఆ రాక్షసుల విషయమున, రామేణ = రామునిచేత కాని, మామకైః = నా సంబంధ మైన, బలైః వా = సైన్యములచేత గాని, మయా వా = నాచేత కాని, కథమ్ = ఎట్లు, ప్రతికర్తవ్యమ్ = ప్రతిక్రియ చేయదగినది ?

తా. ఓ విశ్వామిత్రా! కపటయుద్ధము చేయు రాక్షసుల విషయమున రాముడు కాని, నా సైన్యములు కాని, నేను కాని ఎట్లు ప్రతిక్రియ చేయవలసి యుండును ?

మూ. సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయా రణే, 14

స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః.

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోఽభ్యభాషత. 15

ప్ర. అ. భగవన్ = ఓ పూజ్యుడా! దుష్టభావానామ్ = దుష్టస్వభావులైన, తేషామ్ = వారియెదుట, మయా = నాచేత, రణే = యుద్ధమునందు, కథమ్ = ఎట్లు, స్థాతవ్యమ్ = ఉండదగినది ? సర్వమ్ = ఈ విషయమునంతను, మే = నాకు, శంస = చెప్పుము. రాక్షసాః = రాక్షసులు, వీర్యోత్సిక్తాః హి = వీర్యముచేత గర్వితులు కదా. తస్య = ఆతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, అభ్యభాషత = పలికెను.

తా. దుష్టస్వభావు లైన ఆ రాక్షసులతో యుద్ధమునందు నే నెట్లు మెలగ వలెను? ఈ విషయము లన్నియు చెప్పుము. రాక్షసులు పరాక్రమముచే గర్వించు చుందురు కదా! దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

మూ. పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః,

స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశమ్, 16

మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః.

ప్ర. అ. పౌలస్త్యవంశప్రభవః = పౌలస్త్యుని వంశమునందు పుట్టుక గల, రావణో నామ = రావణుడను పేరు గల, రాక్షసః = రాక్షసుడు (ఉన్నాడు). మహాబలః = గొప్ప బలము కలవాడును, మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడును అగు, సః = అతడు, బ్రహ్మణా = బ్రహ్మచేత, దత్తవరః = ఇవ్వబడిన వరముగలవాడై, బహుభిః = అనేకులైన, రాక్షసైః = రాక్షసులతో, వృతః = కూడినవాడై, త్రైలోక్యమ్ = మూడులోకములను, భృశమ్ = మిక్కిలి, బాధతే = బాధించుచున్నాడు.

తా. పౌలస్త్యవంశమునందు జనించిన రావణు డను రాక్షసుడున్నాడు. మహా బలవంతుడును, మహావీర్యవంతుడును అగు అతడు బ్రహ్మనుండి వరమును పొంది, చాలమంది రాక్షసులతో కలిసి, మూడు లోకములను మిక్కిలి పీడించుచున్నాడు.

మూ. శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః,

సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః. 17

ప్ర. అ. సాక్షాత్ = సాక్షాత్తు, వైశ్రవణభ్రాతా = కుబేరుని సోదరుడును, విశ్రవసః = విశ్రవసు డనే, మునేః = మునియొక్క, పుత్రః = పుత్రుడును, రాక్షసాధిపః = రాక్షసుల ప్రభువును ఐన, రావణః = రావణుడు, మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడుగా, శ్రూయతే = వినబడుచున్నాడు.

తా. రాక్షసరా జైన ఆ రావణుడు విశ్రవసు డను మునియొక్క పుత్రుడు. సాక్షాత్తు కుబేరుని సోదరుడు. అతడు గొప్ప పరాక్రమము కలవాడని వినుచున్నాము.

మూ. యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః, 18

తేన సంచోదితౌ ద్వౌ తు రాక్షసౌ సమహాబలౌ,

మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః. 19

ప్ర. అ. మహాబలః = గొప్పబలము గల ఆ రావణుడు, యదా = ఎప్పుడు, స్వయమ్ = స్వయముగా, యజ్ఞస్య = యజ్ఞమునకు, విఘ్నకర్తా = విఘ్నముచేయువాడు, న = కాడో, తేన = వానిచేత, సంచోదితౌ = ప్రేరేపించబడిన, మారీచశ్చ = మారీచుడును, సుబాహుశ్చ = సుబాహువు అనెడు, ద్వౌ = ఇద్దరు, రాక్షసౌ = రాక్షసులు, విఘ్నమ్ = విఘ్నమును, కరిష్యతః = చేయగలరు.

తా. మహాబలు డైన అతడు స్వయముగ యజ్ఞమునకు విఘ్నము చేయడు కాని, అతనిచే ప్రేరేపింపబడిన మారీచసుబాహువు లనెడు ఇద్దరు రాక్షసులు యజ్ఞవిఘ్నము చేయుచుందురు.

మూ. ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునిం తదా,

న హి శక్తోఽస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. 20

ప్ర. అ. ఇతి = ఈ విధముగా, తేన మునినా = ఆ మునిచేత, ఉక్తః = పలకబడిన, రాజా = రాజు, తదా = అప్పుడు, మునిమ్ = మునిని గూర్చి, ఉవాచ = పలికెను. సంగ్రామే = యుద్ధమునందు, తస్య = ఆ, దురాత్మనః = దురాత్ముని ఎదుట, స్థాతుమ్ = నిలుచుటకు, శక్తః న అస్మి = సమర్థుడను కాను.

తా. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా విని దశరథుడు అతనితో ఇట్లనెను. నేను యుద్ధమునందు ఆ దురాత్ముని ఎదుట నిలువజాలను.

మూ. స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే,

మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః. 21

ప్ర. అ. ధర్మజ్ఞ = ధర్మములు తెలిసినవాడా! సః త్వమ్ = అట్టి, నీవు, మమ = నాయొక్క, పుత్రకే = చిన్ని కుమారునియందును, అల్పభాగ్యస్య = అల్పమైన భాగ్యము గల, మమ చ = నా విషయమునందును, ప్రసాదమ్ = అనుగ్రహమును, కురుష్వ = చేయుము. గురుః = గురు వైన, భవాన్ = నీవు, దైవతం హి = దైవతము కదా ?

తా. సర్వధర్మములను తెలిసిన ఓ విశ్వామిత్రా! నీవు నా చిన్ని కొమరునియందును, అల్పభాగ్యుడ నైన నాయందును అనుగ్రహము చూపుము. గురు వైన నీవు దైవము కదా.

మూ. దేవదానవగన్ధర్వా యక్షాః పతగపన్నగాః,

న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి. 22

ప్ర. అ. దేవదానవగన్ధర్వాః = దేవదానవగంధర్వులు కాని, యక్షాః = యక్షులు కాని, పతగపన్నగాః = పక్షులును సర్పములును గాని, యుధి = యుద్ధము నందు, రావణమ్ = రావణుని, సోఢుమ్ = సహించుటకు, న శక్తాః = సమర్థులు కారు. మానవాః = మానవులు, కిం పునః = చెప్పనేల?

తా. దేవదానవగంధర్వయక్షపతగపన్నగులు కూడ ఎదుట నిలిచి రావణునితో యుద్ధము చేయజాలరు. మానవుల మాట చెప్పవలెనా ?

మూ. స హి వీర్యవతాం వీర్యమాదత్తే యుధి రాక్షసః,

తేన చాహం న శక్తో ఽ స్మి సంయోద్ధుం తస్య వా బలైః. 23

సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః.

ప్ర. అ. సః రాక్షసః = ఆ రాక్షసుడు, యుధి = యుద్ధమునందు, వీర్యవతామ్ = వీర్యవంతులయొక్క, వీర్యమ్ = వీర్యమును, ఆదత్తే హి = గ్రహించి వేయును కదా? మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! సబలో వా = సైన్యముతో కూడిన వాడనైనను, మమ = నాయొక్క, ఆత్మజైః = కుమారులతో, సహితో వా = కూడిన వాడనైనను, అహమ్ = నేను, తేన = వానితో గాని, తస్య = అతనియొక్క, బలైః వా = సైన్యముతో గాని, సంయోద్ధుమ్ = యుద్ధముచేయుటకు, శక్తః = సమర్థుడను, నాస్మి = కాను.

తా. ఆ రాక్షసుడు యుద్ధములో వీర్యవంతుల వీర్యమును గ్రహించి వేయును. ఓ మునిశ్రేష్ఠా! సైన్యముతో కూడినవాడనై గాని, నా కుమారులతో కలిసి గాని, నేను, అతనితో గాని, అతని సైన్యముతో గాని యుద్ధము చేయజాలను.

మూ. కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణామకోవిదమ్,

బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకమ్. 24

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! అమరప్రఖ్యమ్ = దేవతలతో సమానుడు, సంగ్రామాణామ్ = యుద్ధములకు, అకోవిదమ్ = ఎరుగనివాడును, బాలమ్ = బాలుడును, పుత్రకమ్ = పుంనామనరకమునుండి రక్షించువాడును అగు, మే = నాయొక్క, తనయమ్ = కుమారుని, కథమపి = ఏ విధముగాను, నైవ దాస్యామి = ఇవ్వనే ఇవ్వను.

తా. విశ్వామిత్రా! బాలు డైన నా కుమారుడు దేవతలతో సమానుడు. యుద్ధ పరిచయము లేనివాడు. పున్నామనరకమునుండి నన్ను ఉద్ధరించువాడు. వీనిని ఏమైనను నీ కీయజాలను.

మూ. అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సున్దోపసున్దయోః,

యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకమ్. 25

ప్ర. అ. అథ = మరియు, తే = నీయొక్క, యజ్ఞవిఘ్నకరౌ = యజ్ఞమునకు విఘ్నము చేయు, సున్దోపసున్దయోః సుతౌ = సుందోపసుందుల కుమారులు, యుద్ధే = యుద్ధమునందు, కాలోపమౌ = యమునితో సమానులు, పుత్రకమ్ = నా కుమారుని, నైవ దాస్యామి = ఇవ్వను.

తా. నీకు యజ్ఞవిఘ్నము చేయు ఆ సుందోపసుందకుమారులైన మారీచ సుబాహువులు యుద్ధమునందు యమునివంటివారు. అందుచే నా కుమారుని నీకు ఇవ్వజాలను.

మూ. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవన్తౌ సుశిక్షితౌ,

తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః. 26

ప్ర. అ. మారీచశ్చ = మారీచుడును, సుబాహుశ్చ = సుబాహువును, వీర్యవన్తౌ = పరాక్రమవంతులు. సుశిక్షితౌ = బాగుగా అభ్యాసము చేసినవారు. అహమ్ = నేను, ససుహృద్గణః = మిత్రగణముతో కూడినవాడనై, తయోః = వారిలో, అన్యతరేణ = ఒకనితో, యోద్ధా = యుద్ధముచేయువాడను, స్యామ్ = అగుదును.

తా. మారీచసుబాహువులు పరాక్రమవంతులు మాత్రమే కాదు; మంచి నేర్పుకలవారు కూడ. స్నేహితులతో సహితుడ నైన నేను వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను.

మూ. ఇతి నరపతిజల్పనాద్ద్విజేన్ద్రం

కుశికసుతం సుమహాన్ వివేశ మన్యుః,

సుహుత ఇవ మఖేఽగ్నిరాజ్యసిక్తః

సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః. 27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సంక్షేపో నామ వింశః సర్గః

ప్ర. అ. ఇతి = ఈ విధముగా, నరపతిజల్పనాత్ = దశరథుని అసంబద్ధ ప్రలాపమువలన, ద్విజేన్ద్రమ్ = ద్విజశ్రేష్ఠు డైన, కుశికసుతమ్ = విశ్వామిత్రుని, సుమహాన్ = చాల గొప్ప దైన, మన్యుః = కోపము, వివేశ = ఆవహించెను, మహర్షి వహ్నిః = మహర్షి యనెడు అగ్ని, మఖే = యజ్ఞమునందు, సుహుతః = బాగుగా హోమము చేయబడిన, ఆజ్యసిక్తః = నేతిచే తడుపబడిన, అగ్నిరివ = అగ్ని వలె, ఉజ్జ్వలితః = ప్రజ్వలించినది, సమభవత్ = ఆయెను.

తా. దశరథుని అసంబద్ధప్రలాపములు వినగనే ద్విజశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు మిక్కిలి క్రోధావిష్టు డయ్యెను. యజ్ఞమునందు బాగుగా హోమము చేసి, నేతిచే తడుపబడిన అగ్ని వలె, విశ్వామిత్రాగ్ని ప్రజ్వలించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువదవసర్గ సమాప్తము.

© 2026 Ebook Library