| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 27 |
| Pages | 6 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ఏకవింశః సర్గః
విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై పలికిన పలుకులు విని వసిష్ఠుడు రాముని విశ్వామిత్రునితో పంపుటకై దశరథునకు నచ్చజెప్పుట.
మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్,
సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్. 1
ప్ర. అ. తస్య = ఆతనియొక్క, స్నేహపర్యాకులాక్షరమ్ = పుత్రస్నేహముచే తడబడుచున్న అక్షరములు గల, తత్ వచనమ్ = ఆ వచనమును శ్రుత్వా = విని, కౌశికః = విశ్వామిత్రుడు, సమన్యుః = క్రోధముతో కూడినవాడై, మహీపతిమ్ = రాజును గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. పుత్రస్నేహముచే తడబడుచున్న అక్షరములు గల దశరథుని మాటలు విని, విశ్వామిత్రుడు క్రుద్ధుడై ఆతనితో ఇట్లనెను.
మూ. పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి,
రాఘవాణామయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః. 2
ప్ర. అ. పూర్వమ్ = మొదట, అర్థమ్ = వస్తువును, ప్రతిశ్రుత్య = ప్రతిజ్ఞచేసి, ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను, హాతుమ్ = విడచుటకు, ఇచ్ఛసి = కోరుచున్నావు. అయమ్ = ఈ, విపర్యయః = ప్రతిజ్ఞాభంగము, రాఘవాణామ్ = రఘువంశరాజుల, అస్య = ఈ, కులస్య = కులమునకు, అయుక్తః = తగినది కాదు.
తా. అడిగినది ఇచ్చెద నని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞను విడువ వలె ననుకొనుచున్నావు. ఇది రఘువంశరాజులు చేయవలసినది కాదు.
మూ. యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతమ్,
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్థ్స సుఖీ భవ సబాన్ధవః. 3
ప్ర. అ. రాజన్ = ఓ రాజా! ఇదమ్ = ఇది, తే = నీకు, క్షమం యది = తగినట్లైతే, యథాగతమ్ = వచ్చినట్లే, గమిష్యామి = వెళ్లెదను. కాకుత్థ్స = ఓ కకుత్స్థవంశమునందు జనించినవాడా! మిథ్యాప్రతిజ్ఞః = అసత్య మైన ప్రతిజ్ఞకల నీవు, సబాన్ధవః = బంధుసమేతుడవై, సుఖీ = సుఖవంతుడవై, భవ = ఉండుము.
తా. ఓ రాజా! నీకు ఇదే యుక్త మని తోచినచో నేను వచ్చినట్లే తిరిగి వెళ్లెదను. ఓ కాకుత్థ్సా! చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనజాలని నీవు, బంధుసహితుడవై సుఖముగా నుండుము.
మూ. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః,
చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్. 4
ప్ర. అ.ధీమతః = ధీమంతు డై, తస్య = ఆ, విశ్వామిత్రస్య = విశ్వామిత్రుడు, రోషపరీతస్య = రోషముచే ఆవహింపబడి యుండగా, కృత్స్నా = సమస్త మైన, వసుధా భూమి, చచాల = చలించెను. సురాన్ = దేవతలను, భయమ్ = భయము, వివేశ = ప్రవేశించెను.
తా. ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు క్రోధావిష్టుడు కాగానే, భూమియంతయు కంపించెను. దేవతలు కూడ భయపడిరి.
మూ. త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః,
నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్. 5
ప్ర. అ. సువ్రతః = మంచివ్రతము కలవాడును, ధీరః = ధీరుడును, మహాన్ ఋషిః = మహర్షియు అయిన, వసిష్ఠః = వసిష్ఠుడు, సర్వమ్ = సమస్త మైన, జగత్ = జగత్తును, త్రస్తరూపమ్ = మిక్కిలి భయపడినదానినిగా, విజ్ఞాయ = తెలిసికొని, నృపతిమ్ = రాజును గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఉత్తమవ్రతుడును, ధీరుడును అగు వసిష్ఠమహర్షి జగత్తు అంతయు మిక్కిలి భయపడిన దను విషయమును గ్రహించి రాజుతో ఇట్లు పలికెను.
మూ. ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః,
ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి. 6
ప్ర. అ. ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశీయుల, కులే = వంశమునందు, జాతః = పుట్టినవాడవును, సాక్షాత్ = సాక్షాత్తుగా, అపరః = రెండవ, ధర్మః ఇవ = ధర్మదేవత వంటివాడవును, ధృతిమాన్ = ధైర్యవంతుడవును, సువ్రతః = ఉత్తమమైన వ్రతము కలవాడవును, శ్రీమాన్ = శ్రీమంతుడవును అగు నీవు, ధర్మమ్ = ధర్మమును, హాతుమ్ = విడుచుటకు, న అర్హసి = తగవు.
తా. రాజా! నీవు ఇక్ష్వాకువంశములో పుట్టినావు. సాక్షాత్తు అపర ధర్మదేవత వంటివాడవు. ధైర్యవంతుడను. ఉత్తమవ్రతము కలవాడవు. శ్రీమంతుడవు. నీ విట్లు ధర్మమును విడుచుట తగదు.
మూ. త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ,
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి. 7
ప్ర. అ. రాఘవ = ఓ దశరథా! ధర్మాత్మా ఇతి = ధర్మాత్ముడవు అని, త్రిషు లోకేషు = మూడులోకములందును, విఖ్యాతః = ప్రసిద్ధిపొందినావు. స్వధర్మమ్ = స్వధర్మమును, ప్రతిపద్యస్వ = పొందుము. అధర్మమ్ = అధర్మము, వోఢుమ్ = వహించుటకు, న అర్హసి = తగవు.
తా. దశరథా! ధర్మాత్ముడ వని మూడు లోకములందును ప్రసిద్ధి పొందియున్నావు. స్వధర్మమును ఆచరింపుము. అధర్మము చేయకుము.
మూ. సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ,
ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్జయ. 8
ప్ర. అ. రాఘవ = దశరథా!, ఏవం కరిష్యామి = ఇట్లు చేసెదను, ఇతి = అని, సంశ్రుత్య = ప్రతిజ్ఞ చేసి, అకుర్వాణస్య = చేయనివానికి, ఇష్టాపూర్తవధః = యజ్ఞాదులయొక్కయు, వాపీకూపతటాకాదులయొక్కయు వినాశము, భూయాత్ = అగును, తస్మాత్ = ఆ కారణమువలన, రామమ్ = రాముని, విసర్జయ = పంపుము.
తా. దశరథా! ఇట్లు చేసెదను అని మొదట చెప్పి, పిమ్మట అట్లు చేయనివానికి ఇష్టాపూర్తములు చేసిన వచ్చు పుణ్యము నశించును. కావున విశ్వామిత్రునితో రాముని పంపుము.
మూ. కృతాస్త్రమకృతాస్త్రం వా నైనం శక్ష్యన్తి రాక్షసాః,
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. 9
ప్ర. అ. కృతాస్త్రమ్ = అస్త్రములు నేర్చినవాడైనను, అకృతాస్త్రం వా = అస్త్రములు నేర్వనివాడైనను, కుశికపుత్రేణ = విశ్వామిత్రునిచే, గుప్తమ్ = రక్షింపబడిన, ఏనమ్ = ఈ రాముని, జ్వలనేన = అగ్నిచే రక్షింపబడిన, అమృతం యథా = అమృతమును వలె, రాక్షసాః = రాక్షసులు, న శక్ష్యన్తి = ఏమియు చేయజాలరు.
తా. రాముడు అస్త్రములు నేర్చినను, నేర్వకపోయినను, విశ్వామిత్రుని రక్షణములో నున్నంతవరకు, అగ్నిచే రక్షింపబడిన అమృతమును వలె రాక్షసులు ఇతనిని ఏమియు చేయజాలరు.
మూ. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః,
ఏష బుద్ధ్యాఽధికో లోకే తపసశ్చ పరాయణమ్. 10
ప్ర. అ. ఏషః = ఇతడు, విగ్రహవాన్ = శరీరముదాల్చిన, ధర్మః = ధర్మము. ఏషః = ఇతడు, వీర్యవతామ్ = వీర్యవంతులలో, వరః = శ్రేష్ఠుడు. ఏషః = ఇతడు, బుద్ధ్యా = బుద్ధిచేత, లోకే = లోకమునందు, అధికః = అందరికంటెను గొప్పవాడు. తపసః = తపస్సుకు, పరాయణమ్ = అత్యుత్తమస్థానము.
తా. ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు. ఇతడు బుద్ధిచే అందరికంటె గొప్పవాడు. తపస్సుకు గొప్ప నిధి.
మూ. ఏషోఽస్త్రాన్ వివిధాన్వేత్తి త్రైలోక్యే సచరాచరే,
నైవమన్యః పుమాన్వేత్తి న చ వేత్స్యన్తి కేచన. 11
ప్ర. అ. ఏషః = ఇతడు, వివిధాన్ = అనేకవిధము లైన, అస్త్రాన్ = అస్త్రములను, వేత్తి = తెలిసికొనియున్నాడు. ఏవమ్ = ఈ విధముగ, సచరాచరే = చరాచరములతో కూడిన, త్రైలోక్యే = లోకత్రయమునందు, అన్యః పుమాన్ = ఇతర పురుషుడు, న వేత్తి = ఎరుగడు. కేచన = ఎవరును, న వేత్స్యన్తి చ = ఎరుగబోరు కూడ.
తా. ఈతడు అనేకవిధము లైన అస్త్రములు తెలిసినవాడు; చరాచరాత్మక మైన మూడు లోకములందును ఈతనికి తెలిసిన విధమున మరి ఎవ్వరికిని తెలియవు. భవిష్యత్తులో కూడ ఎవ్వరును తెలియజాలరు.
మూ. న దేవా నర్షయః కే చిన్నాసురా న చ రాక్షసాః,
గన్ధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః. 12
ప్ర. అ. దేవాః = దేవతలు, న(వేత్స్యన్తి) = తెలిసికొనజాలరు. ఋషయః = ఋషులు, కేచిత్ = ఎవరును, న = తెలియజాలరు. అసురాః = అసురులు, న = తెలియజాలరు. రాక్షసాః = రాక్షసులు, న = తెలియజాలరు. సకిన్నరమహోరగాః = కిన్నరులతోడను మహోరగులతోడను కూడిన, గన్ధర్వయక్షప్రవరాః = గంధర్వులును యక్షశ్రేష్ఠులును, (తెలియజాలరు).
తా. ఈ విశ్వామిత్రునకు తెలిసిన యస్త్రములు దేవతలకు గాని, ఋషులకు గాని, అసురులకు గాని, రాక్షసులకు గాని, గంధర్వయక్షకిన్నరమహోరగులకు గాని తెలియవు.
మూ. సర్వాస్త్రాణి భృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః,
కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి. 13
ప్ర. అ. భృశాశ్వస్య = భృశాశ్వునియొక్క, పరమధార్మికాః = పరమధార్మికులైన, పుత్రాః = పుత్రులైన, సర్వాస్త్రాణి = సకలాస్త్రములును, యదా = ఎప్పుడు, పురా = పూర్వము, రాజ్యమ్ = రాజ్యమును, ప్రశాసతి = శాసించుచుండెనో, అపుడు, కౌశికాయ = విశ్వామిత్రునకు, దత్తాః = ఇవ్వబడినవి.
తా. పరమధార్మికు లైన భృశాశ్వపుత్రు లగు అస్త్రము లన్నియు, విశ్వామిత్రుడు పూర్వము రాజ్యము చేయుచున్నపుడు, ఆతనికి ఈయబడినవి.
మూ. తేఽపి పుత్రా భృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః,
నైకరూపా మహావీర్యా దీప్తిమన్తో జయావహాః. 14
ప్ర. అ. ప్రజాపతిసుతాసుతాః = దక్షప్రజాపతి కుమార్తెల సుతు లైన, భృశాశ్వస్య = భృశాశ్వుని, పుత్రాః = పుత్రు లైన, తేఽపి = ఆ అస్త్రములు కూడ, నైకరూపాః = అనేక మైన రూపములు కలవి. మహావీర్యాః = గొప్ప వీర్యము కలవి. దీప్తిమన్తః = కాంతిగలవి. జయావహాః = జయమును ఇచ్చునవి.
తా. భృశాశ్వునకును, దక్షప్రజాపతియొక్క కుమార్తెలకును పుత్రులుగా ఉదయించిన ఆ అస్త్రములు, అనేకరూపములు కలవి; గొప్ప పరాక్రమము గలవి. కాంతి గలవి, జయమును చేకూర్చునవి.
మూ. జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే,
తే సువాతేఽస్త్రశస్త్రాణి(ణాం)శతం పరమభాస్వరమ్. 15
ప్ర. అ. జయా చ = జయయు, సుప్రభా చ = సుప్రభయు అనెడు, సుమధ్యమే = (మంచినడుములు గల) స్త్రీలు, దక్షకన్యే = దక్షుని కన్యలు. తే = వారు, అస్త్రశస్త్రాణామ్ = అస్త్రశస్త్రములయొక్క, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న, శతమ్ = శతమును, సువాతే = కనిరి.
తా. జయ, సుప్రభ అనెడు ఇరువురు దక్షప్రజాపతియొక్క కుమార్తెలు. వారు చాల ప్రకాశించు నూరు అస్త్రములను కనిరి.
వి. శస్త్రమనగా హింసించునది. అస్త్ర మనగా ఇతరులపై విసరునది. అస్త్రశస్త్రము లనగా ఇచట శత్రువులను హింసించుటకై ఉపయుక్తము లగు ఆయుధము లని అర్థము.
మూ. పంచాశతం సుతాన్ లేభే జయా నామ వరాన్ పురా,
వధాయాసురసైన్యానామమేయాన్ కామరూపిణః. 16
ప్ర. అ. పురా = పూర్వము, జయా నామ = జయ అను నామె, అసుర సైన్యానామ్ = అసుర సైన్యములయొక్క, వధాయ = వధకొరకు, అమేయాన్ = ఇంత అని చెప్పశక్యము కాని పరాక్రమము కల, కామరూపిణః = స్వేచ్ఛారూపము గల, వరాన్ = శ్రేష్ఠులైన, పఞ్చాశతమ్ = ఏబదిమంది, సుతాన్ = పుత్రులను, లేభే = పొందెను.
తా. పూర్వము, జయ, అసురసైన్యములను సంహరించుటకై, ఏబది మంది పుత్రులను కనెను. వారు అప్రమేయ మైన పరాక్రమము కలవారు. శ్రేష్ఠులు. స్వేచ్ఛా ప్రకారము రూపములను ధరింప సమర్థులు.
మూ. సుప్రభాజనయచ్చాపి పుత్రాన్ పఞ్చాశతం పునః,
సంహారాన్నాను దుర్ధర్షాన్ దురాక్రామాన్ బలీయసః. 17
ప్ర. అ. సుప్రభాపి = సుప్రభ కూడ, దుర్ధర్షాన్ = ఎదిరింపశక్యము కాని వారును, దురాక్రామాన్ = ఆక్రమింప శక్యము కాని వారును, బలీయసః = ఎక్కువ బలము కలవారును అగు, పునః = ఇంకను, పఞ్చాశతమ్ = ఏబదిమంది, పుత్రాన్ = పుత్రులను, అజనయత్ = కనెను.
తా. సుప్రభకూడ, సంహారు లను పేరు గల మరి యేబదిమంది పుత్రులను కనెను. వారు చాల బలవంతులు. ఎదిరించి జయింప శక్యము కానివారు.
మూ. తాని చాస్త్రాణి వేత్త్యేష యథావత్ కుశికాత్మజః,
అపూర్వాణాం చ జననే శక్తో భూయః స ధర్మవిత్. 18
ప్ర. అ. ఏషః = ఈ, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, తాని = ఆ, అస్త్రాణి = అస్త్రములను, యథావత్ = చక్కగా, వేత్తి = ఎరుగును. ధర్మవిత్ = ధర్మవేత్త యైన, సః = ఆతడు, భూయః = ఇంకను, అపూర్వాణామ్ = క్రొత్త అస్త్రముల యొక్క, జననే చ = పుట్టించుటయందు గూడ, శక్తః = సమర్థుడు.
తా. ఆ అస్త్రము లన్నియు ఈ కుశికనందనునకు చక్కగ తెలియును. ధర్మవేత్త యగు ఈతడు క్రొత్త అస్త్రములను పుట్టించుటకు కూడ సమర్థుడు.
మూ. ఏవంవీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాయశాః,
న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి. 19
ప్ర. అ. మహాతేజాః = గొప్పతేజస్సుకలవాడును, మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఏవంవీర్యః = ఇట్టి వీర్యము కలవాడు. రాజన్ = ఓ రాజా!, రామగమనే = రాముని గమనము విషయమున, సంశయమ్ = సంశయమును, కర్తుమ్ = చేయుటకు, నార్హసి = తగవు.
తా. ఓ దశరథమహారాజా! గొప్పతేజస్సు, కీర్తియు గల విశ్వామిత్రుడింతటి ప్రభావశాలి. కావున రాముని పంపుట విషయమున సందేహింపకుము.
మూ. తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః,
తవ పుత్రహితార్థాయ త్వాము పేత్యాభియాచతే. 20
ప్ర. అ. కుశికాత్మజః = విశ్వామిత్రుడు, స్వయం చ = స్వయముగనే, తేషామ్ = వారియొక్క, నిగ్రహణే = నిగ్రహించుటయందు, శక్తః = సమర్థుడు. తవ = నీయొక్క, పుత్రహితార్థాయ = పుత్రుని హితముకొరకై, త్వామ్ = నిన్ను, ఉపేత్య = పొంది, యాచతే = యాచించుచున్నాడు.
తా. విశ్వామిత్రుడు ఆ రాక్షసులను స్వయముగనే నిగ్రహింపగల్గినను, నీ కుమారునకు మేలు చేయుటకై నీ వద్దకు వచ్చి యాచించుచున్నాడు.
మూ. ఇతి మునివచనాత్ప్రసన్నచిత్తో
రఘువృషభస్తు ముమోద భాస్వరాఙ్గః,
గమనమభిరురోచ రాఘవస్య
ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా. 21
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సంక్షేపో నామ ఏకవింశః సర్గః
ప్ర. అ. రఘుపుఙ్గవః = దశరథుడు, ఇతి = ఈ విధముగా, మునివచనాత్ = మునివాక్యమువలన, ప్రసన్నచిత్తః = ప్రసన్న మైన చిత్తము కలవాడై, భాస్వరాఙ్గః = ప్రకాశించుచున్న శరీరము కలవాడై, ముమోద = సంతోషించెను. ప్రథితయశాః = ప్రసిద్ధ మైన కీర్తి గల ఆ దశరథుడు, కుశికాత్మజాయ = విశ్వామిత్రునికొరకై, రాఘవస్య = రామునియొక్క, గమనమ్ = గమనమును, బుద్ధ్యా = బుద్ధిచేత, అభిరురోచ = అంగీకరించెను.
తా. ప్రసిద్ధ మైన కీర్తి గల దశరథుడు వసిష్ఠుని మాటలచే ప్రసన్నమైన చిత్తము కలవా డయ్యెను. సంతోషముతో అతని శరీరముప్పొంగెను. రాముని విశ్వామిత్రునితో పంపుటకు అంగీకరించెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండములో ఇరువదియొకటవ సర్గ సమాప్తము.
