Chapter_22

Back
Book Balakandamu
Chapter No 28
Pages 6
Read Time 9 Minutes

Chapter_22

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ద్వావింశః సర్గః

దశరథుడు స్వస్త్యయనాదులు జరిపి రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట. మార్గమధ్యమున విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల’ ‘అతిబలఅను విద్య లుపదేశించుట.

మూ. తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథః స్వయమ్,

ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్. 1

ప్ర. అ. వసిష్ఠే = వసిష్ఠుడు, తథా = ఆ విధముగా, బ్రువతి = చెప్పగా, రాజా దశరథః = దశరథమహారాజు, ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై, స్వయమ్ = స్వయముగ, సలక్ష్మణమ్ = లక్ష్మణసమేతు డైన, రామమ్ = రాముని, ఆజుహావ = పిలిచెను.

తా. వసిష్ఠుడు అట్లు పలుకగా, దశరథుడు సంతసించి, లక్ష్మణసమేతుడైన శ్రీరాముని స్వయముగ పిలుచుకొనివచ్చెను.

మూ. కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ,

పురోధసా వసిష్ఠేన మఙ్గళైరభిమన్త్రితమ్. 2

స పుత్రం మూర్ధ్ను పాఘ్రాయ రాజా దశరథః ప్రియమ్,

దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాన్తరాత్మనా. 3

ప్ర. అ. సః = ఆ, దశరథః రాజా = దశరథమహారాజు, మాత్రా = తల్లిచేతను, పిత్రా = తండ్రి యైన, దశరథేన చ = దశరథునిచేతను (తనచేతను), కృతస్వస్త్యయనమ్ = చేయబడిన స్వస్త్యయనము కలిగినవాడును, పురోధసా = పురోహితు డైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, మఙ్గళైః = మంగళకరము లగు మంత్రములచే, అభిమన్త్రితమ్ = అభిమంత్రింప బడినవాడును, ప్రియమ్ = ప్రియుడును అగు, పుత్రమ్ = పుత్రుని, మూర్ధ్ని = శిరస్సుపై, ఉపాఘ్రాయ = వాసన చూచి, సుప్రీతేన = చాల సంతసించిన, అన్తరాత్మనా = హృదయముతో, కుశికపుత్రాయ = విశ్వామిత్రునకు, దదౌ = ఇచ్చెను.

తా. కౌసల్యయు దశరథుడును రామునకు స్వస్త్యయనము చేసిరి. వసిష్ఠుడు మంగళకరము లగు మంత్రోదకాదులతో రాముని అభిమంత్రించెను. దశరథుడు ఆ ప్రియపుత్రుని శిరస్సుపై వాసన చూచి, (ముద్దిడికొని), చాల సంతసించిన అంతరాత్మతో విశ్వామిత్రున కిచ్చెను.

మూ. తతో వాయుః సుఖస్పర్శో నీరజస్కో వవౌ తదా,

విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనమ్. 4

ప్ర. అ. తతః = పిమ్మట, రాజీవలోచనమ్ = పద్మముల వంటి నేత్రములు గల, రామమ్ = రాముని, విశ్వామిత్రగతమ్ = విశ్వామిత్రుని అనుసరించినవానినిగా, దృష్ట్వా = చూచి, తదా = అప్పుడు, వాయుః = వాయువు, సుఖస్పర్శః = సుఖకర మైన స్పర్శగలదై, నీరజస్కః = పరాగములేనిదై, వవౌ = వీచెను.

తా. కమలలోచను డగు రాముడు విశ్వామిత్రుని అనుసరింపగనే వాయువు పరాగము లేక, సుఖస్పర్శకరమై వీచెను.

మూ. పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదున్దుభినిస్వనైః,

శఙ్ఖదున్దుభినిర్ఘోషః ప్రయాతే తు మహాత్మని. 5

ప్ర. అ. మహాత్మని = మహాత్ము డైన విశ్వామిత్రుడు, ప్రయాతే తు = బయలుదేరగనే, మహతీ = గొప్ప, పుష్పవృష్టిః = పుష్పవృష్టియు, దేవదున్దుభినిస్స్వనైః = దేవదుందుభుల ధ్వనులతో కలిసిన, శఙ్ఖదున్ధుభినిర్ఘోషః = శంఖములయొక్కయు దుందుభుల యొక్కయు ధ్వని, ఆసీత్ = ఆయెను.

తా. మహాత్ము డైన విశ్వామిత్రుడు బయలుదేరగనే గొప్ప పుష్పవర్షము కురిసెను. దేవతలు దుందుభులు మ్రోయించిరి. దశరథుని ప్రాసాదములో కూడ శంఖదుందుభి ధ్వనులు మిన్ను ముట్టెను.

మూ. విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధరః,

కాకపక్షధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్. 6

ప్ర. అ. విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, అగ్రే = ముందు, యయౌ = నడచెను. తతః = అతనివెనుక, ధనుర్ధరః = ధనుస్సును ధరించిన, రామః = రాముడు(నడచెను). కాకపక్షధరః = జులపములను ధరించిన, ధన్వీ = ధనుస్సుగల, సౌమిత్రిః = లక్ష్మణుడు, తమ్ = ఆ రాముని, అన్వగాత్ = అనుసరించి నడచెను.

తా. విశ్వామిత్రుడు ముందు నడువగా, అతని వెనుక ధనుర్ధరు డైన రాముడును, అతని వెనుక కాకపక్షధారియు, ధనుర్ధరుడును అగు లక్ష్మణుడును వెళ్లిరి.

మూ. కలాపినౌ ధనుష్పాణీ శోభయానౌ దిశో దిశ,

విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ, 7

అనుజగ్మతురక్షుద్రౌ పితామహమివాశ్వినౌ.

ప్ర. అ. కలాపినౌ = అంబులపొదులను ధరించినవారును, ధనుష్పాణీ = ధనుస్సులు హస్తమునందు కలవారును, దశ = పది, దిశః = దిక్కులను, శోభయానౌ = ప్రకాశింప చేయుచున్నవారును, అక్షుద్రౌ = అనల్ప మైన రూపవీర్యాది ప్రభావము కలవారును, త్రిశీర్షౌ = మూడు శిరస్సులు గల, పన్నగౌ ఇవ = సర్పముల వలె ఉన్న రామలక్ష్మణులు, మహాత్మానమ్ = మహాత్ము డైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అశ్వినౌ = అశ్వినీదేవతలు, పితామహమివ = బ్రహ్మదేవుని వలె, అనుజగ్మతుః = అనుసరించి వెళ్లిరి.

తా. రెండేసి అమ్ములపొదులను, ధనుస్సును ధరించిన ఆ రామలక్ష్మణులు మూడేసి తలలు గల సర్పముల వలె ఉండిరి. వారు నడుచుచుండగా పది దిక్కులును ప్రకాశించినవి. అట్టి అనల్పరూపవీర్యాదిప్రభావు లగు రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరించి వెళ్లునపుడు ఇద్దరు అశ్వినీదేవతలు బ్రహ్మదేవుని వెనుక నడిచి పోవుచున్నట్లుండెను.

మూ. తదా కుశికపుత్రం తు ధనుష్పాణీ స్వలంకృతౌ, 8

బద్ధగోధాఙ్గులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ.

కుమరౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ, 9

అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామనిన్దితౌ,

స్థాణుం దేవమివాచిన్త్యం కుమారావివ పావకీ. 10

ప్ర. అ. తదా = అప్పుడు, ధనుష్పాణీ = ధనుస్సులు హస్తములందు కలవారును, స్వలఙ్కృతౌ = చక్కగా అలంకరించబడినవారును, బద్ధగోధాఙ్గులిత్రాణౌ = కట్టబడిన ఉడుముతోలుతో చేసిన వ్రేళ్లతొడుగులు కలవారును, ఖడ్గవన్తౌ = ఖడ్గములు కలవారును, మహాద్యుతీ = గొప్పకాంతి కలవారును, కుమారౌ = బాలురును, చారువపుషౌ = అందమైన శరీరములు కలవారును, శ్రియా = శోభతో, దీప్తౌ = ప్రకాశించుచున్నవారును, అనిన్దితౌ = దోషములు లేనివారును అగు, భ్రాతరౌ = సోదరులైన, రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు, అనుయాతౌ = అనుసరించి వెళ్ళుచున్న వారై, పావకీ = అగ్నివలన జనించిన, కుమారౌ = స్కంధవిశాఖులు, అచిన్త్యమ్ = ఊహింపరానిప్రభావము గల, దేవమ్ = దేవు డైన, స్థాణుమ్ ఇవ = ఈశ్వరుని వలె, కుశికపుత్రమ్ = విశ్వామిత్రుని, శోభయేతామ్ = ప్రకాశింపచేసిరి.

తా. బాలు రైన ఆ రామలక్ష్మణులు, ధనుస్సులు ధరించి యుండిరి. చక్కగ అలంకరింపబడిరి. వ్రేళ్లకు ఉడుముతోలుతో చేసిన తొడుగులను ధరించిరి. ఖడ్గములు ధరించి యుండిరి. గొప్ప కాంతితో ప్రకాశించుచుండిరి. చక్కని ఆకారముతో, ఒప్పారు చుండిరి. ఎట్టి దోషములును లేక యుండిరి. వారు అనుసరించి వెళ్ళుచు, అపూర్వ సౌందర్యముతో అగ్నినుండి జనించిన స్కందవిశాఖులు అచింత్యప్రభావు డగు ఈశ్వరుని అనుసరించి ఆతనిని ప్రకాశింపచేసి నట్లు, విశ్వామిత్రుని ప్రకాశింపచేసిరి.

వి. ‘‘తతో భవచ్చతుర్మూర్తిః క్షణేన భగవాన్ ప్రభుః, స్కన్దో విశాఖః శాకశ్చ నైగమేషశ్చ పృష్ఠతః’’ (అంత భగవంతు డగు కుమారస్వామి స్కందుడు, విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను) అని భారతమున చెప్పబడినది. ఇచట రామలక్ష్మణులు స్కందవిశాఖులతో పోల్చబడినారు (గోవిందరాజులు).

మూ. అధ్యర్థయోజనం గత్వా సరయ్వా దక్షిణే తటే,

రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోఽభ్యభాషత. 11

ప్ర. అ. అధ్యర్ధయోజనమ్ = ఒకటిన్నర యోజనముల దూరము, గత్వా = వెళ్లి, సరయ్వాః = సరయూనదియొక్క, దక్షిణే తటే = దక్షిణమువైపున నున్న తీరమునందు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, రామ ఇతి = ఓ రామా!అని, మధురామ్ = మధురమైన, వాణీమ్ = వాక్కును, అభ్యభాషత = పలికెను.

తా. ఒకటిన్నర యోజనముల దూరము నడచి సరయూదక్షిణతీరము చేరిన పిమ్మట విశ్వామిత్రుడు - ‘‘ఓ రామా!’’ అని మధురముగ పిలిచి ఇట్లనెను.

మూ. గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః,

మన్త్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా. 12

ప్ర. అ. వత్స = ఓ వత్సా! సలిలమ్ = ఉదకమును, గృహాణ = గ్రహించుము. కాలస్య = కాలముయొక్క, పర్యయః = కడచిపోవుట, మాభూత్ = కాకుండు గాక. త్వమ్ = నీవు, మన్త్రగ్రామమ్ = మంత్రముల సముదాయమును, తథా = మరియు, బలామ్ = బలను, అతిబలామ్ = అతిబలను, గృహాణ = గ్రహింపుము.

తా. వత్సా! ఆచమనము చేయుము. మంత్రముల సముదాయమును, బల, అతిబల అనెడు విద్యలను ఇచ్చెదను, తీసికొనుము.

మూ. న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః,

న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యన్తి నైరృతాః. 13

ప్ర. అ. తే = నీకు, శ్రమః = శ్రమ, న = కలుగదు. జ్వరో వా = జ్వరముకూడ, న = కలుగదు. రూపస్య = రూపముయొక్క, విపర్యయః = మార్పు, న = కలుగదు. సుప్తమ్ = నిద్రపోవు చున్నవాడ వైనా, ప్రమత్తం వా = ఏమరుపాటుతో ఉన్నవాడవైనా నిన్ను, నైరృతాః = రాక్షసులు, న ధర్షయిష్యన్తి = బాధింపజాలరు.

తా. ఈ విద్యలు గ్రహించినచో, నీకు శ్రమ కాని, జ్వరము కాని, రూపములో మార్పు గాని కలుగదు. నీవు నిద్రపోవుచున్నను, ఏమరి యున్నను రాక్షసులు నిన్నేమియు చేయజాలరు.

మూ. న బాహ్వః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన,

త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ. 14

ప్ర. అ. రామ = ఓ రామా! బాహ్వః = బాహువులయొక్క, వీర్యే = వీర్యమునందు, సదృశః = నీతో సమాన మైనవాడు, కశ్చన = ఎవ్వడును, పృథివ్యామ్ = భూమియందు, నాస్తి = లేడు. త్రిషు = మూడు, లోకేషు = లోకములందు, తవ = నీకు, సదృశః = సమానుడు, న భవేత్ = ఉండడు.

రామా! బాహువీర్యములో నీతో సమానుడు ఈ పృథివిలో ఎవ్వడును లేడు. నీతో సమానుడు మూడు లోకములలో కూడ ఉండబోడు.

మూ. న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే,

నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. 15

ప్ర. అ. అనఘ = ఓ దోషరహితుడా! సౌభాగ్యే = సౌందర్యమునందు, తవ = నీకు, సమః = సమానుడు, లోకే = లోకమునందు, న = ఉండడు. దాక్షిణ్యే = సామర్థ్యమునందు, న = ఉండడు. జ్ఞానే = జ్ఞానమునందు గాని, బుద్ధినిశ్చయే = బుద్ధిచేత నిశ్చయింప వలసినపుడు గాని, న = ఉండడు. ఉత్తరే = ప్రత్యుత్తరము, ప్రతివక్తవ్యే = చెప్పవలసి వచ్చినపుడు, న = ఉండడు.

తా. దోషరహితుడ వగు ఓ రామా! సౌందర్యమునందు గాని, సామర్థ్యమునందు గాని, జ్ఞానమునందు గాని, బుద్ధిచే నిశ్చయింపవలసినపుడు గాని, సమాధానము చెప్పవలసినప్పుడు గాని, నీకు సరివచ్చువాడు ఈ లోకములో ఉండడు.

మూ. ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః,

బలా త్వతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ. 16

ప్ర. అ. ఏతద్విద్యాద్వయే = ఈ విద్యాద్వయము, లబ్ధే సతి = పొందబడగా, తే = నీకు, సమః = సమానుడు, నాస్తి = లేడు. న భవితా = ఉండబోడు. బలా = బలయు, అతిబలా చైవ = అతిబలయు, సర్వజ్ఞానస్య = సమస్త జ్ఞానమునకును, మాతరౌ = తల్లులు. పఠతః = జపించుచున్న, తే = నీకు, క్షుత్పిపాసే = ఆకలిదప్పులు, న భవిష్యేతే = కలుగవు.

తా. ఈ విద్యాద్వయము లభించిన పిమ్మట నీకు సముడు ఇపుడు లేడు. భవిష్యత్తులో కూడ ఉండడు. ఈ బలాతిబలలు సకలజ్ఞానమును కలుగజేయును.

మూ. క్షుత్పిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ,

బలామతిబలాం చైవ పఠతః పథి రాఘవ. 17

ప్ర. అ. నరోత్తమ = నరులలో ఉత్తముడా! రాఘవ = రఘువంశోద్భవుడా! రామ = ఓ రామా! పథి = మార్గమునందు, బలామ్ = బలను, అతిబలాంచైవ = అతిబలను, పఠతః = జపించుచున్న, తే = నీకు, క్షుత్పిపాసే = ఆకలిదప్పులు, న భవిష్యేతే = కలుగవు.

తా. ఓ నరోత్తమా! రాఘవా! నీవు మార్గమునందు ఈ బలాతిబలలను జపించినచో నీకు ఆకలిదప్పికలు కలుగవు.

మూ. విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి,

పితామహసుతే హ్యేతే విద్యే తేజస్సమన్వితే. 18

ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధార్మిక.

ప్ర. అ. విద్యద్వయమ్ = విద్యాద్వయమును, అధీయానే = జపించిన (అభ్యసించిన) త్వయి = నీయందు, అతులమ్ = సాటిలేని, యశశ్చ = కీర్తికూడ, (కలుగును). కాకుత్థ్స = కకుత్థ్సవంశమునందు పుట్టిన, ధార్మిక = ధార్మికుడ వైన ఓ రామా! తేజస్సమన్వితే = తేజస్సుతోకూడిన, పితామహసుతే = పితామహుని కుమార్తె లైన, ఏతే విద్యే = ఈ విద్యలను, తవ = నీకు, ప్రదాతుమ్ = ఇచ్చుటకు, త్వమ్ = నీవే, సదృశః = తగినవాడవు.

తా. ఈ విద్యాద్వయమును జపించినచో నీకు సాటి లేని కీర్తి కూడ లభించును. ధార్మికుడ వైన ఓ రామా! తేజోవంతము లైన ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు. వీటిని ఇచ్చుటకు నీవే తగినవాడవు.

మూ. కామం బహుగుణాస్సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః,

తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః. 19

ప్ర. అ. ఏతే = ఈ, బహుగుణాః = అనేకగుణములు, సర్వే = అన్నియు, కామమ్ = అధికముగా, త్వయి = నీయందున్నవి. అత్ర = ఈ విషయమున, సంశయః = సంశయము, న = లేదు. తపసా = తపస్సుచే, సంభృతే = పోషింపబడినవై, ఏతే = ఈ విద్యలు, బహురూపే = అనేకరూపములుకలవి, భవిష్యతః = కాగలవు.

తా. ఉత్తమగుణము లన్నియు నీయందు అధికముగా నున్నవి. సందేహము లేదు. ఈ విద్యలను తపస్సుచే పోషించినచో వివిధఫలములను ఇవ్వగలవు.

మూ. తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః,

ప్రతిజగ్రాహ తే విద్యే మహర్షేర్భావితాత్మనః. 20

ప్ర. అ. తతః = పిమ్మట, రామః = రాముడు, జలమ్ = ఉదకమును, స్పష్ట్వా = స్పశించి, శుచిః = పవిత్రుడై, ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై, భావితాత్మనః = పరిశుద్ధమైన మనస్సు గల, మహర్షేః = మహర్షినుండి, తే = ఆ, విద్యే = విద్యలను, ప్రతిజగ్రాహ = స్వీకరించెను.

తా. రాముడు ఆచమనము చేసి, శుచియై, ఆనందముచే వికసించిన ముఖము కలవాడై, పరిశుద్ధమనస్కు డైన ఆ మహర్షినుండి ఆ రెండు విద్యలను స్వీకరించెను.

మూ. విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః,

సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః. 21

గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే,

ఊషుస్తాం రజనీం తత్ర సరయ్వాం సుసుఖం త్రయః. 22

ప్ర. అ. భూరివిక్రమః = గొప్ప పరాక్రమము గల, రామః = రాముడు, విద్యాసముదితః = విద్యలతో కూడినవాడై, కుశికాత్మజే = విశ్వామిత్రుని విషయమున, సర్వాణి = సమస్తమైన, గురుకార్యాణి = గురువు విషయమున చేయవలసిన కార్యములను, నియుజ్య = చేసి, శరది = శరత్కాలమునందు, సహస్రరశ్మిః = వేయికిరణములు గల, భగవాన్ = భగవంతు డైన, దివాకరః ఇవ = సూర్యుడు వలె, శుశుభే = ప్రకాశించెను. త్రయః = వారు ముగ్గురును, తత్ర = అచట, సరయ్వామ్ = సరయూతీరమునందు, సుసుఖమ్ = చాల సుఖముగా, తాం రజనీమ్ = ఆ రాత్రి, ఊషుః = ఉండిరి.

తా. అధికపరాక్రమశాలి యగు రాముడు, విద్యలను గ్రహించిన పిమ్మట, విశ్వామిత్రుని విషయమున మంత్రాచార్యుని విషయమున ప్రవర్తించవలసిన విధముగ ప్రవర్తించుచు, శరత్కాలమునందు సూర్యుడు వలె ప్రకాశించెను. వారు ఆ రాత్రి సరయూతీరమున సుఖముగా నివాసము చేసిరి.

మూ. దశరథనృపసూనుసత్తమాభ్యాం

తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్,

కుశికసుతవచోఽనులాలితాభ్యాం

సుఖమివ సా విబభౌ విభావరీ చ. 23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సంక్షేపో నామ ద్వావింశః సర్గః

ప్ర. అ. అనుచితే = అలవాటు లేని, తృణశయనే = గడ్డిపక్క పైన, సహోషితాభ్యామ్ = కలిసి శయనించిన, కుశికసుతవచోనులాలితాభ్యామ్ = విశ్వామిత్రుని వాక్కులచే లాలనచేయబడిన, దశరథసూనుసత్తమాభ్యామ్ = దశరథ పుతశ్రేష్ఠు లైన ఆ రామలక్ష్మణులకు, సా = ఆ, విభావరీ చ = రాత్రి కూడ, సుఖమివ = సుఖముగానే, విబభౌ = తోచినది.

తా. రామలక్ష్మణులు పూర్వ మెన్నడును అలవాటు లేని తృణశయనము పై కలిసి శయనించిరి. విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలచే వారికి ఆ రాత్రి కూడ సుఖముగానే ఉండెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువది రెండవ సర్గ సమాప్తము.